సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/ప్రకాశం పంతులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రులకు గర్వకారణమైన

'ఆంధ్రకేసరి' ప్రకాశం పంతులు

'దేశనాయకశిఖామణియై
తెలుగుజాతి ప్రకాశమ్మె
అవతరించిన ఆంధ్రకేసరి
అమరుడైన పురారి అతడు'

ఆంధ్ర ప్రజల ఆవేశానికి, అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమానత్యాగనిరతికి ప్రతినిధి ప్రకాశం పంతులు.అన్యాయాన్ని అక్రమాన్ని ఎదుర్కొనుటలో అతనికతడే సాటి. అతనివల్ల సహాయమందుకున్న వారే అతనికి ద్రోహం చేశారు. జాతీయ నాయకులు అతనిని సరిగాగౌరవించలేకపోయారు. ఎవరెన్ని విధాల వంచించినా ప్రజలను నమ్మి తన సర్వస్వాన్ని ధారపోసిన త్యాగమూర్తి ప్రకాశం. ప్రజలే ప్రకాశం ప్రకాశమే ప్రజలు అన్నమాటలో అతిశయోక్తి లేదు. ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మ. వీరి సంతానంగా 23.8.1872న ప్రకాశం గారి జననం. వల్లూరులో ప్రకాశం గారి ప్రాథమిక విద్య సాగింది. అ, ఆలు దిద్దుకుంటున్న వయసులోనే అల్లరితనానికి పేరు పొందాడు. గుండ్లకమ్మ ఈత,సాముగరిడీలు, రౌడీల సహవాసం తాలింఖానాలో వ్యాయామం మున్నగువాటిలో దిట్ట అయ్యాడు. బ్రతుకు తెరువు కోసం గోపాలకృష్ణయ్య కుటుంబంతో నాయుడుపేట చేరాడు. ప్రకాశం గారి పదకొండేళ్ల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి సుబ్బమ్మ ఆరుగురు పిల్లలతో కొంతకాలం వినోదరాయుడు పాలెంలో అన్నగారింట వుండి, తన పిల్లలను విద్యావంతులుగ పెంచాలని చదివింపసాగింది. పూటకూటిల్లు పెట్టడం సాటివారిలో తలవంపులు, ఆత్మగౌరవానికి భంగం. అయినా తన పిల్లల పురోభివృద్ధికై, సాహసించి ముందంజ వేసిన సాహస మాతృమూర్తి సుబ్బమ్మ.

1885లో ధార్వాడ నాటక కంపెనీ వారు ఒంగోలులో నాటకాలను ప్రదర్శించారు. నాటకాలంటే అమితమైన మోజుగల ప్రకాశం, రోజూ ఆ నాటకాలకు వెళ్లేవాడు. మిషన్ హైస్కూల్ ఉపాధ్యాయులైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు, ఉర్దూ భాషలో నాటకాలు వ్రాస్తున్న వుండవల్లి సాహెబ్ గారికి ప్రకాశం అంటే ఎంతో ప్రేమ. నాయుడుగారు ప్రకాశంను కన్నబిడ్డలా చూచుకొనే వారు. ప్రకాశం స్త్రీ పాత్రధారణలో మంచిపేరు సంపాదించారు.

తల్లి సంపాదన చాలినంతగా వుండేది కాదు. ప్రకాశం ధనవంతుల ఇళ్లలో వారాలు చేసుకుని చదువుకునేవాడు. మిడిల్ స్కూల్ పబ్లిక్ పరీక్ష ఫీజు కట్టేందుకు మూడు రూపాయలు కూడా పుట్టని కాలమది. బావగారిని నమ్ముకుని పాతికమైళ్ల దూరంలోని అద్దంకికి, పాదచారిగా వెళ్లి ఒట్టిచేతులతో తిరిగి వచ్చాడు. తల్లితో తన బాధను చెప్పుకున్నాడు. దొడ్డతల్లి సుబ్బమ్మ తన పట్టుచీర తాకట్టుపెట్టి, పైకం యిచ్చింది. ఆసారి పరీక్షలో ప్రకాశం అందరికంటే మిన్నగా పాసైయ్యాడు.

హనుమంతరావు నాయుడుగారు ప్రకాశంకు జీతంలేకుండా చేయించాడు. మిషన్ హైస్కూల్ లో ప్రి మెట్రిక్ లో చేరాడు ప్రకాశం. నాయుడుగారి చలువవల్ల చదువు సాగింది. గొప్ప న్యాయవాది కావాలన్న పట్టుదల ప్రకాశంలో పెరిగింది. నాయుడుగారు ఒంగోలులో వచ్చు వేతనం చాలదని రాజమండ్రి వెళ్లారు. అల్లరి ప్రకాశమును ఆంధ్రప్రకాశంగా రూపొందించిన మహనీయుడు నాయుడుగారు. రాజమండ్రిలో, ఎఫ్.ఎ. క్లాసులో చేర్పించారు. న్యాయశాస్త్రం చదవాలన్న కోరికను వెల్లడించాడు ప్రకాశం. తండ్రివంటి నాయుడుగారు, అప్పుచేసి ప్రకాశంను మద్రాసుకు పంపారు. మద్రాసు లా కాలేజీలో సెకండ్ గ్రేడ్ వకీలు పరీక్ష పాసై ఒంగోలులో ప్రాక్టీస్ ప్రారంభించాడు. మరల నాయుడుగారిపై ప్రేమకొద్దీ రాజమండ్రి చేరాడు. కొద్దికాలంలోనే రాజమండ్రిలోని న్యాయవాదులకు పక్కలో బల్లెమయినాడు ప్రకాశం.

ఆంధ్రప్రాంతంలో ఏర్పాటైన మొదటి పురపాలక సంఘం రాజమండ్రి, ఆ సంఘంలోని సభ్యులందరూ భూస్వాములు, ధనవంతులు ప్రసిద్ధ న్యాయవాదులు. ప్రకాశం ప్రతిభాపాటవాలు వారికి బాధ కల్గించాయి. పలుకుబడి గల ప్రముఖులందరినీ చిత్తుచేసి ప్రకాశం రాజమండ్రి నగరపాలక సంఘం అధ్యక్షుడయ్యాడు. అప్పటికాతని వయస్సు ముప్పది అయిదేళ్ళు. నగరపాలనాన్ని న్యాయంగా, నిర్భయంగా సాగించి ప్రజల మన్ననలందుకున్నాడు. మిత్రుల ప్రోత్సాహంతో, బారిష్టర్ పట్టా సంపాదించాలన్న దీక్షతో లండన్ బయలుదేరాడు. మద్యం, మాంసం, మగువ - ముట్టుకోనని తల్లి యెదుట ప్రతిజ్ఞ చేశాడు. అక్కడ స్వయంగా వంటచేసుకుని, శాకాహారిగా వుండి విద్యాభ్యాసం పూర్తి చేశాడు. లండన్ లోని ఇండియా సొసైటీలో సభ్యుడుగా చేరాడు. దాదాబాయ్ నౌరోజి బ్రిటీష్ పార్లమెంట్ ఎన్నికలకు పోటీచేసినపుడు ప్రకాశం చాలా చురుకుగా నౌరోజి విజయానికి కృషి చేశాడు. న్యాయవిద్యార్ధిగా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ తో పాటు 50 పౌండ్ల బహుమతిని సంపాదించాడు.

బారిష్టరు పట్టా పుచ్చుకొన్న ప్రకాశం మద్రాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసు హైకోర్టులో తమిళ లాయర్లుగా భాష్యం అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్ ప్రసిద్ధులు. ఆంగ్లేయులైన నార్టన్, గ్రాంట్ అను లాయర్లు బాగా పేరుగాంచినవారు.

తన చదువుకోసం 20వేల అప్పుచేసిన ప్రకాశం చక్కని గ్రంథాలయం ఏర్పరచుకుని, కొన్ని నెలల్లోనే హైకోర్టు వకీలుగా మంచిపేరుతో పాటు, సంపాదన కూడా సాధించాడు. దినసరి ఆదాయం వందలనుండి వేలకు పెరిగింది. ఆత్మవిశ్వాసం, నిరంతర పరిశ్రమ, నిర్భీకత ఆయనకు పెట్టనికోటలు. మద్రాసునుండి వెలువడుతూ వుండిన 'లా టైమ్స్' పత్రికలో వ్యాసం వ్రాస్తూ, న్యాయమూర్తి బౌద్ధికంగా అవినీతిపరుడు అని విమర్శించాడు. పదునాలుగేళ్ల బారిస్టర్ గా వుండి దాదాపు 15 లక్షలు సంపాదించాడు. బంధుమిత్రుల నెందరినో ఆదరించాడు. తనను బిడ్డలా పెంచిన నాయుడు గారి కుటుంబానికెన్నో విధాలుగా సహాయం చేశాడు. ఉదక మండలంలో రెండు బంగళాలు, మద్రాసులోని మాదాకోవెల వీథిలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంగల బంగళా, రాజమండ్రిలో, ఒంగోలులో పెద్దభవనాలు, గోదావరి డెల్టా క్రింద సుక్షేత్రాలైన భూములు సంపాదించాడు. తమ్ముళ్లు శ్రీరాములు, జానకీరామయ్యగార్లను బాగా చదివించాడు. శ్రీరాములుగారి కూతురే సినీనటి టంగుటూరి సూర్యకుమారి. భోగపురుషుడుగా ప్రసిద్ధుడయ్యాడు.

ప్రకాశం గారు జాతీయోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. అప్పటికి ఇంకా భారత రాజకీయ రంగంలో గాంధీజీ ప్రవేశింపలేదు.

1908లో ప్రముఖ జాతీయ నాయకుడు బిపిన్ చంద్రపాల్ మద్రాసుకు వచ్చాడు. అతని సభకు అధ్యక్షత వహించుటకు ప్రముఖులు భయపడినారు. పిడుగులు కురిసినట్లు, వడగండ్ల వానలా చేసిన, బిపిన్ పాల్ గంభీరోపన్యాసం మద్రాసు ప్రజల్లో నూతన చైతన్యం కల్గించింది. ఆనాటి నుండి ప్రకాశం తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేయసాగాడు.

జాతీయ భావాలను ప్రచారం చేయటానికి మద్రాసులో 'స్వరాజ్య' పత్రికను 1921 అక్టోబర్ 29న దినపత్రికగా ప్రారంభించారు. శ్రీయుతులు ఖాసా సుబ్బారావు, కోటంరాజు పున్నయ్య, జి.వి. కృపానిధి మున్నగు గొప్ప పాత్రికేయులు 'స్వరాజ్య' లో పనిచేశారు. తమిళులు స్థాపించిన 'హిందూ' పత్రిక 'స్వరాజ్య' ను తొక్కివేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. "స్వరాజ్య" పన్నేండేళ్ళు నడిచింది. లక్షల్లో అప్పులు చేశారు ప్రకాశంగారు. తనబంగళాలను అమ్మి అప్పులు తీర్చారు. ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించేవారాయన. "గాలితో నైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం"అన్నారు అయ్యదేవర కాళేశ్వరరావుగారు.

1929లో సైమన్ కమీషన్ మద్రాసుకు వచ్చింది. మద్రాసులో అతనిని బహిష్కరించటం వద్దన్నాడు గాంధీజీ. గాంధీగారి ఆదేశం ప్రకాశంగారికి నచ్చలేదు. రాజాజీ చల్లగా తప్పుకున్నాడు. ప్రకాశంపంతులు, దుర్గాబాయ్, రంగయ్యనాయుడు గార్లు, వేలాది ప్రజలతో వూరేగింపువెళ్తూ 'సైమన్ గోబ్యాక్' అని గర్జించారు. బ్రిటీష్ తొత్తులైన సైనికులు తుపాకులతో కాలుస్తాం అని కేకలు వేశారు. ఒక అజ్ఞాత దేశభక్తుడు తుపాకి గుళ్లకు బలిఅయ్యాడను వార్త దావానలంలా వ్యాపించింది. ప్రకాశం సింహంలా ముందుకురికాడు. చొక్కా గుండీలు విప్పి"రండిరా యిదె కాల్చుకొండిరా"అని గుండెలిచ్చి గండడైనిల్చాడు. తుపాకులు తలలువంచాయి. అంతటితో ప్రకాశం పేరు దేశమంతటా మార్మోగింది. 'ప్రమాదములున్న చోటనే ప్రకాశంగారుంటారు'అన్న పట్టాభిగారి మాటలు సత్యపూర్ణమైనవి.

ప్రకాశంగారు సత్యాగ్రహోద్యమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. పలుమార్లు జైలుకు వెళ్లారు. గాంధీజీని సైతం లెక్కచేయని ఆంధ్రనాయకులలో మొదటివారు ప్రకాశం. రెండవవారు గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు.

1937లో ఎన్నికలొచ్చాయి. సర్దార్ పటేల్ గారి ఒత్తిడిపై మద్రాసునుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన ప్రకాశంగారు ఎన్నుకోబడ్డారు. రాజాజీ మంత్రిగా చేసిన ఘనకార్యాలు ముఖ్యంగా:

రాయలసీమ కరువు కాలంలో స్వయంగా పర్యటించి కరువు పనులు ముమ్మరంగా ప్రారంభింపజేశారు.

పంటలు పాడైనప్పుడు ధారాళంగా శిస్తు రెమిషన్ యిప్పించారు.

శిస్తుభారంతో బాధపడ్తున్న రైతులకు 75లక్షల శిస్తు ముజరా యిప్పించారు. రెండవ ప్రపంచ యుద్ధం రావటంతో కాంగ్రెస్ మంత్రివర్గం రాజీనామా చేసింది.

'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలులో వుంచారు.

1945లో జైలు నుండి విడుదలైన తర్వాత రాష్ట్రమంతటా పర్యటించారు. ప్రజలాయనను ఎంతగానో ప్రేమించారు. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ప్రకాశంగారు ఫిర్కా డెవలప్ మెంట్ స్కీమ్ ఉత్పత్తిదారుల వినియోగదారుల సహకార సంఘాలు నెలకొల్పారు. గాంధీజీ, రాజాజీ వంటి నాయకులు ప్రకాశంగారికి వ్యతిరేకంగా కుట్రచేశారు. ప్రకాశం ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెసును వదలి ప్రజాపార్టి స్థాపించారు.

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం అవతరించింది. ఆంధ్రనాయకుడైన ప్రకాశం ముఖ్యమంత్రిగా కర్నూలు రాజధానిగ ఆంధ్ర ప్రజల కోర్కె ఫలించింది. ప్రకాశంగారు గుంటూరులో హైకోర్టు, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నెలకొల్పారు. కేంద్రప్రభుత్వం మంజూరు కోసం వేచివుండక కృష్ణాబ్యారేజీ నిర్మింపచేశారు. కాని ఏడాదిలోపే ఆయనపై అవిశ్వాసతీర్మానం పెట్టారు. పదవి పోయినా ప్రజలాయనను మహారాజుగా గౌరవించారు.

ప్రకాశం మహాసాహసి. రోమన్ సేనాపతిలా అచంచలమైన పట్టుదలగల మొనగాడు. కష్టసుఖాలను సమభావంతో చూచిన స్థితప్రజ్ఞుడు. కృషియే పరమాత్ముని పూజగా భావించినవాడు.

ప్రకాశం లక్షలార్జించినా, చివరికో చిల్లిగవ్వను సైతం దాచుకోలేదు. చరమదశలో రాష్ట్ర ప్రభుత్వంవారు ప్రకాశంగారికి నెలకు రు.750/- గౌరవభృతి సొంతవుపయోగానికి ఒక కారు యిచ్చారు.

ఆంధ్రజాతికి తిరుగులేని నాయకుడుగా వెలిగిన ప్రకాశం వీరుడైన భీష్మునిలా మరణించారు. 1957 మే నెల 20వతేదీన ఆయన దివంగతులయ్యారు.

"భవ్య గుణముల దివ్యఖనియై
భారతాంబకు ముద్దుబిడ్డయి
గాఢమైన స్వరాజ్యకాంక్షల
గండుమీరిన శూరుడాతడు
సరిసములులేనట్టి యాతడు
ప్రజలకున్ దేశాభిమానము
పంచిపెట్టిన నేతయాతడు"