Jump to content

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/థామస్ మన్రో

వికీసోర్స్ నుండి

చిరస్మరణీయుడు

సర్ థామస్ మన్రో
(1761-1827)

"ప్రజల పట్ల నిజాయితీతో కూడిన సానుభూతిగల సునిశిత మేధావి" అని కార్ల్ మార్క్స్ చే ప్రశంసలందుకొన్న పరిపాలకుడు సర్ థామస్ మన్రో.

వ్యాపారులుగా వచ్చి మన దేశంలో స్థిరపడి దేశాన్ని దోచుకున్నారు ఆంగ్లేయులు. వారిలో అధిక సంఖ్యాకులు అవినీతిపరులు, అక్రమార్జనాపరులు, అహంకారులు. ప్రజల పట్ల ఏ మాత్రం అభిమానం లేనివారు.

కారుచీకట్లలో వెలుగురేఖలవలె కొందరు నిజంగా మన దేశాన్ని ప్రజలను ప్రేమించారు. మన సంస్కృతి పట్ల గౌరవంతో వ్యవహరించారు.

ప్రధానంగా తెలుగు ప్రజలు మరువరాని తెల్లదొరలలో అగ్రగణ్యుడు సర్ థామస్ మన్రో. రాయలసీమ వాసులకు ఆపద్భాంధవుడు మన్రో.

రాయలసీమ తరతరాలుగా అనావృష్టికి గురియైన ప్రాంతం. ప్రకృతి వైపరీత్యానికి తోడుగా, పిండారీల దోపిడులు, పాళెగాండ్ర దురాగతాలు సీమ ప్రజలను నానా యాతనలకు గురిచేసేవి. అశాంతితో పరితపిస్తున్న ప్రజానీకాన్ని ఆదుకొని, సీమలో శాంతిభద్రతలను నెలకొల్పిన మహనీయుడు మన్రో.

1792లో జరిగిన శ్రీరంగపట్నం సంధి ప్రకారం కడప, అనంతపురం, కర్నూలు, బళ్ళారి నిజాం పాలనలోనికి వచ్చాయి. నిజాం పాలనలో అరాచకం మరింత పెరిగింది. పాలెగాళ్ళ అక్రమాలకు అంతులేకపోయింది. కడపజిల్లాలోని వేముల పాళెగాడు తనను తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. కొరవలు, యానాదులు, బేడర్లు, ఎరుకలు గ్రామాలపై బడి దోచుకొసాగారు. అట్టి పరిస్థితులలో 12-10-1800న దత్త మండలాల ప్రధాన కలెక్టరుగా మన్రో నియమింపబడినాడు. అతని క్రింద నలుగురు సబ్ కలెక్టర్లు వుండేవారు. ఆదవాని, హల్పనహళ్ళి, కడప, కంబంలలో వీరి కార్యాలయాలూ వుండేవి. మన్రోకు సహాయంగా మేజర్ జనరల్ డుగాల్డ్ క్యాంబెల్ నాయకత్వంలో ప్రధాన కేంద్రాలలో సైనిక దళాలుండేవి. అనంతపురం డివిజన్ మాత్రం మన్రో అధీనంలో వుండేది.

సిద్ధవటంలో వున్న కడప జిల్లా కార్యాలయం 1812లో కడపకు మార్చబడింది. 1828లో కంబం, దూపాడు, కోయిల కుంట్ల ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి కర్నూలు జిల్లాగా ఏర్పాటు చేశారు. 1911లో మదనపల్లి, వాయిల్పాడు ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి చిత్తూరు జిల్లాగా ఏర్పాటు చేశారు. సర్ థామస్ మన్రో ఈస్టిండియా కంపెనీ వారి మద్రాసు సైన్యంలో ఒక సైనికుడు. కుటుంబ పరిస్థితుల వల్ల ఉన్నత విద్య పూర్తి చేయలేక, కంపెనీ కొలువులో చేరాడు. జీతం తక్కువైనా సర్దుకొనేవాడు. ఎర్స్ కీన్ అనే మిత్రునికి వ్రాసిన జాబులో యిలా అన్నాడు.

భారతదేశానికి వచ్చేదాక నాకు, ఆకలి దప్పులు, అలసట, బీదరికం అంటే ఏమిటో తెలియదు. ఇక్కడ మొదటి రెండూ నాకు అప్పుడపుడు అనుభవంలోకి వస్తుండగా మూడవది మాత్రం నన్ను వెంటాడుతూ వుండేది.

మొదతి మూడు సంవత్సరాల కాలంలో రాత్రిపూట తన పుస్తకాలను తలగడగాను, నాలుగు కర్రలపై పరచిన కాన్వాస్ గుడ్ద పరుపుగాను, వేసుకొనే కోటు దుప్పటిగాను ఉపయోగించినట్లు, మిత్రునికి 23-7-1789లో వ్రాసిన జాబులో పేర్కొన్నాడు. పదేళ్ళ పాటు సైనికుడుగా మంచిపేరు సంపాదించాడు. రెవిన్యూ విధానాన్ని రూపొందిచుటలో శిక్షణ పొందాడు. 18వ శతాబ్ది చివర ల్యాండ్ సెటిల్‌మెంట్ నిర్వహణకు దక్షిణ కన్నడ ప్రాంతానికి పంపబడినాడు.

మన్రో నిజాయితీపరుడు. ప్రజల నుండి, రైతుల నుండి ఎట్టి కానుకలు స్వీకరించే వాడు కాదు. మన్రోకు స్వాగతమివ్వటానికి ఒక గ్రామాధికారి తన గ్రామంలో పెద్ద పందిరి వేయించాడు. అందుకు కూలీలకు పైసా ఇవ్వలేదని తెలుసుకున్న మన్రో, పందిరి వద్దకైనా వెళ్ళక, చెట్టునీడన చిన్న డేరాలో మకాం చేశాడు. రైతుల నుండి పాలు, పళ్ళు కూడా ఉచితంగా తీసుకొనే వాడు కాదు. తన క్రింది అధికారులను కూడా అలాగే వుండనిచ్చేవాడు.

రైతుల నుండి ఎక్కువ శిస్తులు వసూలు చేయటం న్యాయం కాదన్నాడు. భూసంబంధమైన చట్టాల ముందు, బీదలు, ధనికులు అన్న తేడా వుండరాదన్నాడు. ఎవరైనా సరే తనకున్న భూమినంతటినీ తనకున్న వనరులతో సాగు చేసుకోవచ్చు నన్నాడు. అంత వరకు గ్రామ ప్రాంతాలలో భూముల మీద వున్న అగ్రవర్ణాల వారి పెత్తనంపై చావు దెబ్బతీశాడు. భూమి ప్రభుత్వ ఆస్తి, నిర్ణీత శిస్తుపై రైతులకు కౌలుకు యివ్వాలని ఆదేశించాడు. రాయలసీమ ప్రాంతంలో తానున్న ఏడేళ్ళకాలంలో మన్రో 2,06,819 పట్టాలను రైతులకు అందజేశాడు. రైతులకు భూమిపై సర్వహక్కులు వుంటాయని ప్రకటించాడు. ఇందువల్ల భూమిసాగు గణనీయంగా పెరిగింది. ప్రభుత్వాదాయం పెరిగింది.

ఉదారమైన భూమిశిస్తును ప్రకటించడం మన్రో గొప్పదనానికి నిదర్శనం. రైతు తన ఫలసాయం నుండి 2/3 వంతు మిగుల్చుకొన్నపుడే భూమి విలువైన ఆస్తి కాగలదన్నాడు మన్రో. 1807 లో అన్నిరకాల భూముల మీద 25 శాతం పన్ను తగ్గించాడు. రైతులు తవ్వుకొన్న బావులు, చెరువుల మీద అదనంగా 8 1/3 శాతం పన్ను తగ్గింపుకు సిఫారసు చేశాడు. ఈ విధానాన్ని 1820లో మద్రాసు గవర్నర్ గా చేరిన తర్వాత అమలు చేశాడు. 1807లో మన్రో కలెక్టర్ పదవికి రాజీనామా చేసి లండన్ చేరాడు. మద్రాసు ప్రభుత్వం రైత్వారి విధానాన్ని రద్దు చేసి గ్రామీణ శిస్తు విధానాన్ని అమలుపరచింది. శిస్తు ఒక సంవత్సరం నుండి మూడేళ్ళపాటు వసూలు చేసే హక్కు గ్రామపెద్దకు లభించింది. మరల అగ్రవర్ణాల ఆధిపత్యం మొదలైంది. 1820లో మద్రాసు గవర్నర్ గా వచ్చిన మన్రో పాత విధానాన్ని అమలు చేశాడు.

ఆ కాలంలో రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళుండేవారు. వారిలో కడప జిల్లాలోని వేముల, చిట్వేలి, పోరుమామిళ్ళు, నరసాపురం, అప్పిరెడ్దిపల్లి, ఉప్పులూరు, కమలాపురం పాలెగాళ్ళు ముఖ్యులు. వీరు నిరంకుశులు. గ్రామాలను దోచుకునేవారు. బందిపోట్లుగా వారి అనుచరులుండేవారు. హైదరాలి, నిజాం, గోల్కొండ నవాబులు కూడా వారిని అరికట్టలేకపోయారు. మన్రో తీవ్ర చర్యలతో వీరి ఆట కట్టించాడు. పాలెగాళ్ళను, కావలి వాళ్ళను కఠినంగా శిక్షించాడు.

అరాచకంగా వున్న రాయలసీమ జిల్లాల్లో జిల్లా కోర్టులు, పోలీసు యంత్రాంగాలు ఏర్పాటు చేశాడు. మన్రో కఠినచర్యల వల్ల సుస్థిరమైన పాలన ఏర్పడింది. పాలనాపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

1813 లో ఛార్టర్ చట్టానికి సంబంధించిన పార్లమెంటు కమిటీ ముందు సాక్ష్యమిస్తూ, భారతదేశ సంస్కృతిని అనుసరించటం వల్ల ఇంగ్లండు లాభపడుతుందన్నాడు. భారతీయులు తయారుచేయు వస్తువుల నాణ్యత, యూరప్ తో సమానమైనదన్నాడు. భారతీయ ప్రజల పట్ల, మేధావుల పట్ల, చేతి వృత్తుల వారిపట్ల ఎంతో గౌరవముండేది.

భారతీయులు తెలుగు, ఇంగ్లీషు భాషలు నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందటానికి వీలుగా జిల్లా తాలూకా స్థాయిలో పాఠశాలలు నెలకొల్పారు. 1805 నాటికే మన్రో తెలుగు వ్రాయను, చదవనూ నేర్చుకొన్నాడు. రాయలసీమ రైతులతో ఆయన తెలుగులో మాట్లాడేవారు. తన క్రింది అధికారులు కూడా విధిగా తెలుగులోనే వ్యవహరించాలని ఆదేశించాడు. సి.పి.బ్రౌన్ ఆయన మాటలనెంతగానో గౌరవించేవాడు.

భూస్వాములు రైతులకు అన్యాయం చేస్తున్నట్లు వార్త వచ్చిన వెంటనే వారి వద్దకు వెళ్ళి వారి కష్టసుఖాలను విచారించేవాడు. మైళ్ళ తరబడి కాలినడకన గ్రామాలను చూచేవాడు. పూడిపోయిన చెరువులు కనబడిన వెంటనే పూడిక తీయించే ఏర్పాటు చేసేవారు.

మన్రో భారతీయులను పెద్ద పదవులలో నియమించాడు. ధర్మవరం ప్రాంతం వాడైన, దేశాయి నారాయణప్పను 800 రూపాయల నెలవేతనంపై మద్రాసు రెవిన్యూ బోర్డు దివానుగా నియమించాడు. మైసూరు దివాన్ పూర్ణయ్య వద్ద శిక్షణ పొందిన బచ్చేరావు కార్యదక్షతను గుర్తించి కడప తాలూకాలోని పుట్టంపల్లె, పులివెందుల తాలూకాలోని ఇడుపులపాయ గ్రామాలను జాగీరుగా యిచ్చాడు. గండి క్షేత్రంలోని ఆలయం దర్శించాడు. కొండలోయ మధ్య అతనికి బంగారు తోరణం కన్పించిందట. అది పరమభక్తులకే కనిపిస్తుందని నమ్మకం. చూచినవారు ఆరుమాసాలకు మించి బ్రతకరన్న నమ్మకం వుండేది. ఏదెట్లున్నా సర్ థామస్ మన్రో, ఆరునెలల్లోనే కలరా సోకి 7-7-1827న మరణించాడు. ఆయన శరీరాన్ని గుత్తి పట్టణంలో ఖననం చేశారు. ఆయనపేర నేటికీ గుత్తిలో సత్రం ఉంది.

రాయలసీమ రైతుల పాలిట పెన్నిధిగా ప్రశంసింపబడిన మన్రో శిలా విగ్రహాన్ని పత్తికొండ తాలూకా కార్యాలయం ఎదుట స్థాపించారు.

తాడిపత్రిలోని చింతల రాయస్వామి ఆలయ ఆస్థాన మంటపాన్ని, కళ్యాణ మంటపాన్ని మరమ్మత్తు చేయించాడు. ఆలయంలో సక్రమంగా పూజలు జరిపే ఏర్పాటు చేశాడు. రాయదుర్గంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించాడు. ఆలయానికి మాన్యాలిచ్చాడు.

1807లో బళ్ళారి-మైసూరు సరిహద్దు తగాదా వచ్చింది. సరిహద్దు గ్రామాల ప్రజలు కొట్టుకున్నారు. వారిలో దెబ్బతిన్న వాడొకడు "అనంతపురం వెళ్ళి అయ్యకు చెబుతాను" అన్నాడు. ఆ అయ్య సర్ థామస్ మన్రోయే. ప్రజలు ఆయనను "మండ్రోలప్ప" "మండ్రోలయ్య" అని పిలిచేవారు. మాండవ్య ఋషి అంశం కలవాడంటారు.

ప్రజల మన్ననలందుకుని, రైతు జనబాంధవుడిగా నివాళులందుకొన్న సర్ థామస్ మన్రో చిరస్మరణీయుడు.