Jump to content

సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/జాషువా

వికీసోర్స్ నుండి

కవికోకిల

జాషువా

కులం - మతం అనే సంకుచిత భావాలు పాముల్లా బూసగొట్టుతున్న కాలమది.

అంటరానితనం కరకరలాడుతున్న పాడుకాలమది.

వినుకొండ వీధిలో ఒక బాలుడు నడుస్తున్నాడు. అగ్రవర్ణానికి చెందిన మరో బాలుడు ఆ వీధిన పోతూ, 'నన్ను తాకకు దూరంగా పో' అని ఈసడించుకున్నాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆ బాలుడు తన ఆవేదనను తల్లి ముందు తోడుకున్నాడు. తల్లి బాలుని కన్నీటిని తుడిచింది. తన కళ్లల్లో నీళ్లుబుకుతున్నా తమాయించుకొంది. అంటరానివారిగా పరిగణింపబడిన ఆ బాలుడే పెరిగి పెద్దవాడై నవయుగ కవిచక్రవర్తి అని కీర్తింపబడినాడు. అతడే కవికోకిల గుర్రం జాషువా.

జాషువా కవి 1895 అక్టోబర్ 28 న వినుకొండలో జన్నించారు. తండ్రి వీరయ్య క్రైస్తవ మతమును స్వీకరించిన యాదవుడు. తల్లి లింగమ్మ ఆది ఆంధ్ర కులమునకు చెందిన మహిళ, వారిది బీద కుటుంబము.

ఉన్నత పాఠశాల చదువు ముగించి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. 1915-16లో రాజమండ్రిలో, మూకీ చిత్రాల కథావాచకుడుగా పనిచేశారు. కొంతకాలం సత్యవోలు గున్నేశ్వరరావుగారి ' చింతామణి నాటక మండలి ' లో నాటకకర్తగా పనిచేశారు. 1919 నుండి 1929 వరకు గుంటూరులోని లూథరన్ చర్చి వారి ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో అధ్యాపకులుగా పనిచేశారు. ' ఉభయ భాషా ప్రవీణ ' పట్టం పుచ్చుకొన్న జాషువా గారు 1928-42 మధ్య గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగు పండిత పదవి సాగించారు. 1942-45 మధ్య బ్రిటీష్ ప్రభుత్వ యాజమన్యంలో భారత ప్రభుత్వం నెలకొల్పిన జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా పనిచేశారు. 1957-59 మధ్య మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ' ప్రొడ్యూసర్ ' గా ఉద్యోగం నిర్వహించారు. 1964 లో ఆంధ్ర ప్రభుత్వం జాషువా గారిని శాసనమండలికి నామినేట్ చేసింది.

ఏ ఉద్యోగం చేసినా అది జీవికకు మాత్రమేసాధనం. ఆయన జన్మతః కవి. కాని కవిగా బ్రతుకు సాగించడం అసాధ్యమని ' బడిపంతులు ' అయ్యారు.

చిన్నప్పుడు వినుకొండలో కొప్పరపు సుబ్బారావుగారి అవధానం విన్నాడు. అవధానం ముగిసిన తర్వాత కొందరు కవులు అవధానిని ప్రశంసిస్తూ పద్యాలు చదివారు. బాలజాషువా కూడా పద్యాలు వ్రాసుకొని, చదవటానికి వేదిక నెక్కాడు. ' అంటరాని వారు వేదిక ఎక్కడమా? పద్యాలు వ్రాయడమా? ' అని తరిమి వేయటం బాలజాషువా ను ఎంతగానో కృంగదీసింది.

జాషువాగారు అకుంఠిత దీక్షతో కావ్యరచన కుపక్రమించారు.

' విశ్వమానవ సౌభ్రాతృత్వం, నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు. అవి కవిత్వాలే కావు. అలాంటివి వీలునామా కవిత్వాలు అంటాను. నా భావం సామాన్యులకు అందివ్వడానికే ప్రయత్నించాను. గహన సంచారం లేని కవిత్వం నాలక్ష్యం ' అన్నారాయన.

' నవ్యయుగోచింతంబులై ఆకటి చిచ్చు లార్చు హృదయ విదారి దయా కథాంశాలు ' ఆయన కవితకు వస్తువులు. మానవత్వం హేతువాదం జాషువా గారి కవితలకు మూలాధారాలు.

కరుణరసం ఆయన కవితల్లో తొణికిసలాడుతుంది.

' కరుణ రసమొకండె కఠిన రాక్షసముల్
హృదయములను గలచిముదము గూర్చు
వేడికంటి నీటి విలువ సహజమైన
చలువలీను అశ్రువులకు లేదు '

అన్నారు ' ముసాఫిర్ ' అనే కావ్యంలో

' కఠిన చిత్తుల దురాగతములు ఖండించి
కనికారమొలగించుకలమునాది '

అని ఎలుగెత్తి చాటారు

" నిమ్మజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చివేయునని " హెచ్చరించారు

అస్పృశ్యులు పండించే ధాన్యం ఆలయాలలో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కాని ఆ ధాన్యం పండించే కృషికులకు ఆలయ ప్రవేశం కూడా లేదు అంటూ:

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని
దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకువిదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్లదే
వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులార్తురే '

అంటూ ధనవంతుల అపవ్యయాన్ని ఎండగట్టారు.

దీనుల పట్ల, సంఘం అణచివేసిన వారి పట్ల అపారమైన సానుభూతితో కలం కదలించిన కవి జాషువా గారు సంఘ సంస్కరణ ఆయన కావ్య లక్ష్యం; ఆకలిని శోకాన్ని నిర్మూలించాలన్నదే ఆయన ధ్యేయం. అంధ విశ్వాసాలను, మత విద్వేషాలను తీవ్రంగా నిరసించారు. చిత్తశుద్దిలేని పెత్తందార్లను, గుత్తస్వాములను నిలదీసి ప్రశ్నించాలంటూ

" ముసుగులో గుద్దులాటలు పొసగవింక హక్కు గలదయ్య ప్రశ్న సేయంగ నిన్ను " అంటూ దేవుణ్ణే నిలదీసి ప్రశ్నించాడాయన.

జాషువాగారు అభ్యుదయ వాది. వర్గ సంఘర్షణ, ఆర్ధిక వ్యత్యాసాల నిర్మూలన దోపిడీ వర్గాలపై తిరుగుబాటు జాషువాగారి కావ్యాలలో నిండుగా వున్నాయి. రేడియోలో వస్తున్న కవితలను విమర్శిస్తూ, అన్నార్తుల ఆక్రందనను తనకవితలో యిలా వినిపించారు.

' రేయిబవలు భారతీయ సంస్కృతీ పేర
గండశిలలు చూపి కథలు చెప్పి
కటిక పేదవాని కడుపులోగల చిచ్చు
గడపగలవే నీవు గగనవాణి '

ఆస్తి అందరిదీ కావాలని కొందరికే పరిమితం కారాదనీ ఆయన అభిమతం

స్వరాజ్యం సంపాందించి మూడేళ్లు గడిచినా ప్రజల బ్రతుకులు మారలేదేమి? అంటూ,

' మారు పల్కవేమి మంతిరన్నా ' అని నిలదీసి అడిగారు.

జాషువాగారు సంకుచిత తత్వాలను ఖండిస్తూ, ' నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను ' విశ్వజనీనమైన దృక్పథం గల వాడాయన

గబ్బిలం పట్ల జాలిని చూపుతూ,

" నరుని కష్టపెట్టి నారాయణుని గొల్చు
ధర్మశీలురున్న ధరణి మీద
కాలుమోపలేక గబ్బిలమొక్క టే
చరణ యుగళిదివికి సాచి నడుచు. "

' స్మశాన వాటిక ' లోని ప్రతి పద్యం మన గుండెలను పిండుతుంది.

ఇచ్చోట; నే సత్కవీంద్రుని కమ్మని

కలము, నిప్పులతో గఱిగిపోయె
యిచ్చోట ; నేభూములేలు రాజన్యుని
యధికార ముద్రికలంతరించె
యిచ్చోట ; నేలేత ఇల్లాలి నల్లపూసల
సౌరు, గంగగలసిపోయె
యిచ్చోట ; నెట్టి పేరెన్నికంగొన్న
చిత్రలేఖకుని కుంచియనశించె
ఇది పిశాచులలో నిటలేక్షణుండు
గజ్జెగదలించి యాడురంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణ దృష్టులొలయ
నవని పాలించు భస్మ సింహాసనంబు

జాషువా గారి రచనలన్నీ ఖండకావ్యాలు, వాటిలో పిరదౌశి, గబ్బిలము, కాందిశీకుడు, ముంతాజమహల్, స్వప్నకథ నేతాజీ, క్రీస్తు చరిత్ర, కొత్తలోకము ప్రసిద్ధములైనవి. ఆత్మకథను మూడు సంపుటాలుగా ' నా కథ ' అను శీర్షికన వ్రాశారు.

జాషువా కవి కర్ణుని తలపింపజేస్తారు. ' కర్ణుండేమాయె కులపరీక్షకుల నడుమ? ' అని ప్రశ్నిస్తారు.

కురుకుమారుల సభలో, కర్ణునికి జరిగిన అవమానమే కవితా సదస్సులో తనకు జరిగిందన్నారు. సూర్యారావు బహదూర్ గారి దర్శనం తర్వాత కవి కులాన్ని గూర్చిన ప్రశ్న రావటం జాషువాగారి నెంతగానో బాధించింది.

' నా కవితా వధూటి వదనంబు నెగాదిగాజూచి, రూప రే
ఖా కమనీయ వైఖరుల గాంచి, ' భళీ భళీ ' యన్నవాడే ' మీ
రేకుల ' మన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో
బాకున క్రుమ్మినట్లుగును పార్థివ చంద్ర; వచింప సిగ్గగున్ '

అని ఆవేదన చెందారు.

ప్రతిభను కులమతాలతో కొలవటం తీవ్రంగా ఖండించారు.

జాషువాకవి జంతువుల పట్ల, పక్షుల పట్ల ఎంతో దయగలవారు.

ఒకమారు ఆయన వార్ధాకు గాంధీజి దర్శనం కోసం వెళ్లారు. అక్కడున్న ఒక రాజకీయ నాయకుడు జాషువాగారిని, ఒక జర్మన్ పండితునికి పరిచయం చేస్తూ ' ఈయన క్రైస్తవ కవి ' అన్నాడట. ఆ విదేశీ పండితుడు ఆశ్చర్యంతో ఆ నాయకునివైపు చూశాడట. కవితకు కులమతాల ముద్రలు వద్దంటారాయన. జాషువాగారు, గోపరాజు రామచంద్రరావు (గోరా) గారితో వియ్యమందుకొన్నారు.

గుంటూరులోని భూస్వామి ఏకా ఆంజనేయులుగారు జాషువాగారికి ఒక ఎకరా సుక్షేత్రమైన పంటభూమిని దానంగా ఇచ్చారు. మిత్రులు వారికొక ఇల్లు కట్టించి ఇచ్చారు. కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు మున్నగు సత్కారాలెన్నో అందుకున్నారు. భారత ప్రభుత్వం ' పద్మ భూషణ ' తో గౌరవించింది. 1970 లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ' కళాప్రపూర్ణ ' ప్రశస్తినిచ్చింది. కవికోకిల కవితావిశారద, నవయుగ కవి చక్రవర్తి మున్నగు బిరుదములనిచ్చి సత్కరించారు రసజ్ఞులు.

ఆనాటి ఆస్థానకవి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి కవిగారు స్వయంగా గండపెండరము తొడగటంతో జాషువాగారెంతో సంతోషించారు.

సమకాలీన కవితాలోకంలో అందరి మన్ననలందుకొన్న జాషువా మహాకవి 24-7-1971న కన్నుమూశారు.