సుప్రసిద్ధుల జీవిత విశేషాలు/గాడిచర్ల హరిసర్వోత్తమరావు

వికీసోర్స్ నుండి

తొలి తెలుగు రాజకీయ ఖైదీ

గాడిచర్ల హరిసర్వోత్తమరావు

"వందేమాతరమనగనే వచ్చితీరు ఎవనిపేరు?
వయోజన విద్య అనగనే వచ్చి తీరు ఎ‌వరిపేరు?
గ్రామగ్రామమున వెలసెడి గ్రంథాలయ మెవనికి గుడి?
అరగని తరగని వొడవని అక్షర దానం బెవనిది?
అరువదేండ్లు ప్రజలకొరకు అరిగిన కాయంబెవనిది?
తన బరువును మోయలేని తనువును చాలించెనెవడు?
తరతరాలు ఎవనిమేలు తరలుచు పొరలుచు నుండును?
అందరికెవనితో పొత్తు - అఖిలాంద్రంబెవని సొత్తు
ఏస్థాన కవిని నేనో, ఆస్థానాధీశుడెవడు?
వయోవృద్ధుడగు యువకుడు వాస్తవ జీవిత మతనిది
హరిసర్వోత్తముడాతడు ఆంధ్రులపాలిటి దేవుడు"

--కాళోజి నారాయణరావు

ఆంధ్ర దేశంలో స్వాతంత్రోద్యమ వైతాళికులుగా, ప్రప్రథమ ఆంధ్ర రాజకీయ ఖైదీగా నిస్వార్ధ నిరాడంబర ప్రజాసేవకులుగా విద్యావేత్తగా, త్యాగమూర్తిగా విఖ్యాతులైన దేశభక్తులు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు.

లోకమాన్య బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ గార్లచే ప్రభావితులైన శ్రీ గాడిచెర్ల విద్యార్థిదశలోనే , స్వరాజ్యోద్యమంలో సమరోత్సాహంతో పాల్గొని యువతనుత్తేజ పరచిన దేశభక్తులు.

ఆయన జననం 14-9-1883. వారి పూర్వీకులు కడపజిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందినవారు. శ్రీ రావుగారు పుట్టింది కర్నూలులో. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసి, మద్రాసు క్రైస్తవ కళాశాలలో విద్యార్ధి వేతనం పొంది 1906లో ఎం.ఏ. డిగ్రీ సంపాదించారు. ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం 1907 లో రాజమండ్రిలోని టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో ఎల్.టి. చదువుతుండగా స్వరాజ్యోద్యమంలో దూకారు.

ప్రభుత్వ ఆంక్ష

భారత స్వాతంత్ర్యోద్యమ త్రిమూర్తుల (లాల్, బాల్, పాల్) లో ఒకరైన బిపిన్ చంద్రపాల్, రాజమండ్రి వచ్చి అక్కడ చేసిన ఉపన్యాసప్రభావం కాలేజి విద్యార్థులపై పడింది. విద్యార్ధులు 'వందేమాతరం' బ్యాడ్జిలతో క్లాసుకు వెళ్లారు. ప్రిన్సిపల్ మార్క్ హంటర్ బిళ్ళలు తీసివేస్తే కాని క్లాసులకు రానివ్వనని విద్యార్థులకు ఆదేశాలు పంపారు. అందుకు విద్యార్థులు తిరస్కరించారు. విద్యార్థి నాయకుడైన శ్రీ సర్వోత్తమరావును కాలేజీ నుండి డిస్మిస్ చేశాడు ప్రిన్సిపల్. ఆయన కెక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. రావుగారి జీవితంలో ఇదో పెద్ద మలుపు.

స్వరాజ్య పత్రిక

జాతీయోద్యమ ప్రచారానికి పత్రికలు ప్రధాన సాధనాలని విశ్వసించి శ్రీరావు 1908లో శ్రీ బోడి నారాయణరావు (ప్రచురణ కర్త) సహకారంతో "స్వరాజ్య" తెలుగు వారపత్రికను ప్రారంభించారు. తెల్లదొరల అక్రమ, అన్యాయ చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ రావుగారు వ్యాసాలు వ్రాసేవారు.

కారాగార శిక్ష

1908లో తిరునల్వేలిలో ఆష్ అనే ఆంగ్లేయ అధికారిని విప్లవ కారులు కాల్చి చంపారు. ప్రజోద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. రావుగారు 'విపరీతబుద్ధి' అన్న శీర్షికతో సంపాదకీయం వ్రాస్తూ అధికారుల దమన కాండను తీవ్రంగా ఖండించారు. రావుగారికి, రాజద్రోహ నేరంపై మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ప్రభుత్వం. నాటి జైలు జీవితానుభవాలను శ్రీ దర్శి చెంచయ్య "నేనూ - నా దేశం"అన్న గ్రంథంలో ఇలా చిత్రించారు.

"ఎం.ఏ పట్టభద్రులైన శ్రీ సర్వోత్తమరావును వెల్లూరు సెంట్రల్ జైలులో బంధిపోటు దొంగలు, హంతకులున్న గదిలో వేశారు. మానరక్షణకు రెండు గోచిలిచ్చారు. మూరెడు చదరంగల రెండు తువ్వాళ్లు, పడుకునేందుకు చిన్న ఈత చాప, అన్నం తినడానికి మట్టి చట్టి, నీళ్లు త్రాగడానికి మట్టిముంత, మల మూత్ర విసర్జనకు మరొక మట్టి చట్టి ఇచ్చారు. కాలికి లావాటి కడియం, మెడకు మరో కడియం వేసి ఒక కొయ్యముక్కను వీటిలో దూర్చారు. మొలత్రాడు, జందెం తీసివేశారు. తల బోడి చేయించారు... రాగి సంకటి ముద్ద, దానిలో రాళ్లు, పుల్లలు, పురుగులు తేలుతుండేవి. ఈ తిండిలో మూడేళ్లు జీవించారు. గవర్నర్ జైలుని చూచుటకు వచ్చినప్పుడు, తనను మానవమాత్రునిగా చూడమని కోరగా, ఆ దుర్మార్గుడు రావుగారిని దుర్భాషలాడి వెళ్లిపోయాడు." ఈ విధంగా అష్టకష్టాలను స్థిర చిత్తంతో ఎదుర్కొన్న స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ గాడిచర్ల.

1914లో తిలక్, అనీబిసెంట్ గార్లు స్థాపించిన 'హోమ్ రూల్ లీగ్' ఆంధ్ర శాఖకు కార్యదర్శిగా వుండి, రాష్ట్రమంతటా పర్యటించి తమ అనర్గళ ప్రసంగాలతో ప్రజలను వుత్తేజితుల గావించారు.

స్వరాజ్య పార్టీలో చేరిక

1923లో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ గార్లు నెలకొల్పిన స్వరాజ్య పార్టీలో చేరారు రావుగారు. 1924 జనవరి 1, 2తేదీలలో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో, స్వయం సేవకుల సంస్థ "హిందూస్థానీ సేవాదళ్" స్థాపనలో శ్రీరావు ప్రముఖ పాత్ర వహించారు.

1927లో రావుగారు, ఆంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధిగా నంద్యాల నియోజకవర్గం నుండి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‍కు జరిగిన ఎన్నికలో జస్టిస్ పార్టీ అభ్యర్థిని ఓడించి ఎన్నుకోబడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా పనిచేశారు.

కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రారంభించిన విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కార్యదర్శిగా, ఆ సంస్థ నుండి వెలువడిన మొదటి గ్రంథం, 'అబ్రహాం లింకన్' జీవిత చరిత్ర వ్రాశారు. గ్రీస్ దేశ చరిత్ర, విస్మత కవిసార్వభౌముడు మున్నగు గ్రంథాల నెన్నింటినో వ్రాశారు. 'శ్రీ రామ చరిత్ర'కు వ్యాఖ్య వ్రాశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ వందలాది వ్యాసాలు రచించారు. విద్యార్ది దశలోనే రాజమండ్రిలో 100 మందితో వయోజన విద్యాకేంద్రం నడిపారు. రైతు సంక్షేమానికి పాటు పడ్డారు. పంచాయితీ మహాసభ, సహకార సభ, హిందీ మహాసభ, ఉపాధ్యాయ మహాసభ వంటి ఎన్నో సభలకు అధ్యక్షత వహించారు. మద్రాసులో పాకీ పని వార్ల సంఘానికీ, ప్రెస్ వర్కర్ల సంఘానికి అధ్యక్షులుగా వుండేవారు. 1930 లో రాజకీయ రంగం నుండి క్రమముగా వైదొలగి, గ్రంధాలయోద్యమం, వయోజనవిద్యా రంగాల్లో జీవితమంతా గడిపారు. 1934 నుండి జీవితాంతం దాక ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ అధ్యక్షులుగా ఉండేవారు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా బోధకులకు ఉపయుక్తమగు రచనలెన్నో చేశారు. ఎన్నో శిక్షణా శిబిరాలను నిర్వహించారు. భారత వయోజన విద్యాసంఘంలోను, అంతర్జాతీయ వయోజన విద్యా మహాసభలోను ప్రముఖ పాత్ర వహించారు.

ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అవిశ్రాంతంగా కృషి చేసి, ఆంధ్ర ప్రజలందరినీ సమైక్య పరచి ఆంధ్రప్రదేశ్ అవతరణను చూచారు.

1950లో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం రావుగారిని, ఆంధ్ర ప్రాంత వయోజన విద్యా గౌరవ డైరెక్టర్‍గా నియమించింది. 1952లో గాడిచర్లవారు బళ్ళారి జిల్లాలోని (అవిభక్త మద్రాసు రాష్ట్రం) కన్నడ తాలూకాలలో పర్యటించినప్పుడు, వారి తెలుగు ప్రసంగాలను కన్నడం చేసే అదృష్టం నాకు కల్గింది. పగటి పూట గ్రామ పంచాయితీలను, గ్రంథాలయాలను దర్శించేవారు. రాత్రివేళల్లో వయోజన విద్యా కేంద్రాలను దర్శించేవారు. వారి అవిశ్రాంత కృషి ఆదర్శ వంతం.

కళలకు ప్రోత్సాహం

సామాన్య ప్రజలలో కళల పట్ల, సాహిత్యం పట్ల అభిరుచి పెంచేందుకు నాటకోత్సవాలను జరిపారు. కృష్ణదేవరాయ జయంత్యుత్సవాలను జరిపారు. 1928లో నంద్యాలలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో, దత్తమండలాన్ని 'రాయలసీమ' గా నామకరణం చేసినవారు శ్రీ గాడిచర్ల వారే! శ్రీరావు ఆంధ్ర పత్రిక సంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. తాడిపత్రిలో "మాతృసేవ" పత్రిక స్థాపనకు సంకటి కొండారెడ్డిగారిని ప్రోత్సహించారు. కైవ సుబ్రహ్మణ్య శర్మ (నంద్యాల) గారితో పాటు "కౌమోదకి" పత్రిక స్థాపించారు. ఆయర్వేద వైద్య ప్రచారం చేశారు.

బీద కుటుంబంలో పుట్టిన రావుగారు ఏనాడూ, ఏ పదవికీ ప్రాకులాడలేదు. 'హిందూ' పత్రికకు సమీక్షలెన్నో వ్రాశారు. ఆ విధంగా తమకు కావలసిన పైకాన్ని సమ కూర్చుకునేవారు. ఎవరినీ యాచించని ఆత్మ ధనులాయన.

గాంధీజీ ప్రశంస

తాము నమ్మిన సిద్ధాంతాల పట్ల అచంచల విశ్వాసం గలవారు, గాంధీజీనే విమర్శించి నపుడు, 'ద బ్రేవ్ హరిసర్వోత్తమరావు' అన్నారు గాంధీజి.

వృద్దాప్యం పైబడినా, తమ పనులను తామే చేసుకొనేవారు. అనంతపురంలోని వయోజన విద్యాకేంద్రాన్ని దర్శించేందుకు వచ్చినప్పుడు (1956లో) వారు వేకువనే లేచి వాహ్యాళి వెళ్లారు. అదివరకే వారితో నాకున్న పరిచయంతో, వారి పడకను దులిపి చుట్టి పెట్టాను. వచ్చిన వెంటనే నన్ను పిలిచి "నా పడక ఎందుకు చుట్టావ్. నా పని నేనే చేసుకోవాలి. నన్ను త్వరగా చావమంటారా?"అన్నారు. క్షమించమన్నాను.

నిరంతర శ్రమవల్ల వారి ఆరోగ్యం దెబ్బతినింది. మద్రాస్‍లోని గోపాలపురంలో వున్న కూతురు, శ్రీమతి ద్వారకాబాయి, అల్లుడు పార్ధసారథి గార్లతో వుండిపోయారు. రావు గారి వైద్య సేవల కోసం చివరి దశలో శ్రీగోవింద వల్లభపంత్ 2 వేల రూపాయలు పంపారు. అంతే వారందుకున్న ప్రతిఫలం.

గాడిచర్ల వారి సేవలకు చిహ్నంగా విజయవాడలో (పటమట) సర్వోత్తమ భవనం నిర్మింపబడినది. కీ||శే|| పాతూరి నాగభూషణం గారు ఈ స్మారక భవన నిర్మాణాని కెంతో కృషి చేశారు.

త్యాగం, సేవ, దీక్ష మున్నగు గుణాలకు మూర్తిగా వెలిగిన 'ఆంధ్ర తిలక్' శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1960 ఫిభ్రవరి 29న మద్రాస్‍లో కన్ను మూశారు.

"నిజానికి ఆనాడు ఆంధ్రలో హరిసర్వోత్తమరావు జన్మించి వుండని యెడల రాజకీయోద్యమానికి పునాదియేలేకపోయివుండేది. ఆంధ్రలో రాజకీయాలకు ఆదిపురుషుడు శ్రీ హరిసర్వోత్తమరావు" అన్న యర్ర మిల్లి జగ్గన్న శాస్త్రి గారి పలుకులు అక్షరాలా నిజమైనవి.