సుగాత్రీశాలీనులు
కలభాషిణి ఆశ్చర్యానికి అంతులేకుండా పోతోంది!
“అదెలా జరిగింది? నేనీ మణిస్తంభుడితో సింహాన్నెక్కి వస్తున్నప్పుడు దార్లోనే ఎదురై రంభ చెలికత్తెలు ఆమె నలకూబరుడితో ఉందని చెప్పారే!”
“నిజమే! ఐతే, అప్పుడు రంభతో ఉన్న ఆ నలకూబరుణ్ణి నేనే!
అది నా తపస్సు చెడగొట్టి నాతో ఉన్నప్పుడు నలకూబరుణ్ణి తలుచు కోవటంతో నాకు తిక్కరేగి అక్కడినుంచి వెళ్తూ మళ్ళీ దార్లో మనసు మార్చుకున్నా. దాంతో అనుభవించిన సుఖాల్తో తృప్తి కలలేదప్పటికీ!
అందుకని నా తపశ్శక్తితో నలకూబరుడి రూపం పొందాను.
అలా తనతో ఉండగా మధ్యలో నువ్వు రంభగా రావటంతో నీతో కలిసి, చివరికి శాపం తెచ్చుకుని అప్పటికి బుద్ధి తెచ్చుకుని నా వీణనీ, రత్నమాలికనీ తీసుకుని ఇలా వచ్చేశా. ఇదివరకే ఇక్కడి దేవి మహిమల గురించి నాకు తెలుసు!” అని అదంతా చెప్పి, చిలిపిగా చూస్తూ
“నేను రంభ కోసం అన్ని పాట్లు పడితే చివరికి నువ్వు దక్కటం, నువ్వు నలకూబరుడి కోసం ఎంతో కష్టపడితే నీకు నేను దక్కటం వింతగా లేవూ!
ఐతే ఒక్కటి చెప్పాలి. నారదుడు శాపం ఇస్తాడేమో అని భయంతో బయటపెట్టలేదు గాని నాకు ఎప్పట్నుంచో నీమీద కోరికుంది! ఈ విధంగా అది తీరటం నిజంగా నా అదృష్టం!” అన్నాడతను.
కలభాషిణి కూడ, “ఇంకెవడో దుర్మార్గుడు నన్ను మోసం చేశాడనుకున్నా. నాకూ ఎప్పట్నుంచో నీమీద కోరికే! ఐతే నీ అందం, సంగీతం, గుణగణాల ముందు నేను తగననుకుని ఊరుకున్నా.
అదీగాక ఒకసారి నీ పేరు తలుచుకుంటే అలాటిదే మణిగ్రీవుడి పేరు గుర్తొచ్చింది. దాన్తో పాటు అతన్నీ అతని అన్ననీ నారదుడు మద్ది చెట్లుగా కమ్మని శపించటం కూడ గుర్తొచ్చింది! దాంతో భయం వేసి మనసుని నలకూబరుడి మీదికి తిప్పుకున్నాను తప్ప నీమీద మనసు లేక కాదు.
ఏమైనా అతననుకుని నీతో కలవటం కాలుజారి పూలపానుపు మీద పడటం లాగా ఐంది.
ఒక గొప్ప మణిని కోరుకుని, నానా పాట్లు పడి దాని పోలికలున్న గాజుపూసని సంపాయించి, చివరికి అది గాజుపూస కాదు ఎప్పట్నుంచో కోరుకున్న మణేనని తెలుసుకున్నట్టుంది నా పరిస్థితి” అని నిట్టూర్పు విడుస్తూ, “ఐనా ఎవరు నమ్ముతార్లే ఇప్పుడు నా మాటలు?” అని లజ్జతో తల వంచుకుంది కలభాషిణి.
“అలా అనకు కలభాషిణీ! నిజానికి నువ్వు మొదట్నుంచీ నన్నే కోరుకున్నావనటానికి ఒక నిదర్శనం ఉంది. గుర్తుందా ద్వారకలో మనం విడిపోయేటప్పుడు నారదుడు నిన్ను, “అమ్మాయీ! నువ్విదివరకు కోరుకున్నవాణ్ణి, నలకూబరుడి రూపంలో ఉన్నవాణ్ణి కలుస్తావు పో!” అని దీవించాడు కదా! ఆయన కావాలనే అలా అన్నాడని నా ఉద్దేశ్యం! లేకుంటే, “నలకూబరుణ్ణి కలుస్తావు” అని నేరుగానే అనొచ్చుగా! నలకూబరుడి రూపంలో ఉన్న నన్ను నువ్వు కలిశావు గనక ఆయన మాట ప్రకారం అంతకుముందు నువ్వు కోరుకున్నది నన్నేనని తేలిపోతోంది కదా!
శాపభయం వల్ల మనిద్దరం మన మనసులు చెప్పుకోకపోవటం వింత కాదు. లోకంలో ఇలాటివి జరుగుతూ ఉంటాయి.
రంభ పక్కన నిగనిగ లాడుతున్న నలకూబరుణ్ణి చూడటంతో నీ మనసు అతని మీద నిలబడిపోయి మిగిలిన రూపాలేవీ నచ్చక పోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మగవాళ్ళకి ఇలాటి స్వభావం ఉంటుందనటానికి నీకో పుణ్యకథ చెప్తా” అంటూ సుగాత్రీ శాలీనుల కథ మొదలెట్టాడు మణికంధరుడు!
“ఇదివరకు ఒకసారి నేను అనంతదేవవ్రతం ఉద్యాపన కోసం అనంతపద్మనాభ స్వామి దర్శనానికి వచ్చాను. అక్కడ అద్భుతమైన కవిత్వం చెప్తున్న కవీంద్రుల్ని చూసి నాక్కూడా అలాటి కవిత్వం ఎలా వస్తుందా అని తిరుగుతూ ఈ దేవి గురించిన కథలు విని పెద్ద దూరం కాకపోవటంతో ఇక్కడికి వచ్చి ఆ శిలాక్షరాల్లో రాసినట్టుగా చేసి సాహిత్య విద్య సంపాయించాను. తిరిగి వెళ్ళి అక్కడి వైష్ణవ స్వాముల సముఖంలో నా కవిత్వం వినిపించి వాళ్ళ ఆశీస్సులు పొందాను.
కానీ కాశ్మీరంలోని శారదాపీఠం వాళ్ళు మెచ్చుకుంటేనే కదా ఏ కవిత్వానికైనా అసలైన గుర్తింపు? అందుకని అక్కడికి వెళ్ళాను.
ఇక ఇప్పుడు మొదలౌతుంది అసలు కథ
అక్కడ వేదఘోషలు మిన్ను ముడుతున్నాయి. గృహ్యసూత్రాలు, శబ్దతంత్రాలు, జ్యోతిష చర్చలు, ధర్మోపన్యాసాలు, ఉభయ మీమాంసల ప్రసంగాలు, యుక్తి కథలు, యోగగోష్టులు, కావ్య గానాలు హోరుమని సాగుతున్నాయి.
ఒకచోట బ్రహ్మచారులకి విద్య నేర్పుతున్న ఒక గురువుని బ్రహ్మ తేజస్సుతో ఉన్నతన్ని చూసి దగ్గరికి వెళ్ళా. ఆయన నన్ను పిలిచి కులగోత్రాలు విని “పూజ్యులు వచ్చారు గనక ఈ రోజు మీకు సెలవు” అని విద్యార్థుల్ని పంపేసి నాతో అదీ ఇదీ మాట్లాడుతూ ఉండగా ఒక బ్రహ్మచారి ఓ పుస్తకం పట్టుకుని హడావుడిగా వచ్చాడక్కడికి. “ఏమిరా ఇంత ఆలస్యం ఐంది?” అని గురువు అతన్ని అడిగితే,
“చాలా పెద్ద కారణమే ఉంది. మీరు ఇంకా విన్నట్టు లేదు.
మీరు పంపితే నేను వెళ్ళేసరికి శాలీనుడు వాళ్ళ పూలతోటలో ఒక లతాగృహంలో ఉన్నాడు. సుగాత్రి అతని పాదాలు ఒత్తుతోంది. అతను నన్ను చూసి “మీ గురువు గారు పుస్తకం కోసం పంపారా? అదుగో ఆ కొమ్మ మీద పెట్టాను. తీసుకెళ్దువులే కొంచెం సేపు కూర్చో” అని ఒక మావిడి చెట్టు నీడన కూర్చోబెట్టాడు. అప్పుడతను ఆ సుగాత్రి వీపున చెయ్యేసి, “అమృతం తాగావో లేక ఏదైనా సిద్ధరసం దొరికిందో గాని రోజురోజుకీ నీ వయసు తగ్గుతున్నట్టుందే! ఏమిటి విశేషం?” అనడిగాడు.
ఆమె దానికి చిరునవ్వు నవ్వుతూ, “అలాటిదేమో నాకు తెలీదు. మీ తరగని ప్రేమ వల్లనేమో!” అన్నది. దానికతను కూడా నవ్వుతూ, “అసలు విషయం నే చెప్తా, విను” అంటూ ఆమె చెవులో ఏదో చెప్తే, దానికామె విచిత్రంగా అతని వైపు చూసి “మరి నేను ఇంకొకటి కోరితే తీరుస్తానన్నదే ఆ దేవి! ఆ విషయం ఏం చేస్తుందో!” అని అతని చెవులో తనూ ఏదో చెప్పింది.
అదెలాటి విషయమో గాని, అతను హఠాత్తుగా ఎక్కడ లేని కోపంతో పరిగెత్తుకెళ్ళి దగ్గర్లో ఉన్న శతతాళదఘ్నం అనే కొలన్లోకి దూకేశాడు!
ఆమె కూడ, “అతను నన్ను వదిల్తే నేనతన్ని వదుల్తానా!” అని అతని వెనకే పరిగెత్తి అక్కడే తనూ దూకేసింది!
దూరం గనక మీకు వినపడ లేదేమో గాని ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళి కొలనంతా వలల్తో గాలించి ఉపయోగం కనపడక బాధతో తిరిగొచ్చారు. నేను కూడ తిరిగి వెళ్ళి శాలీనుడు చూపించిన చోటు నుంచి ఈ పుస్తకాన్ని తీసుకుని వస్తున్నా!” అని తను చూసింది వివరించాడా విద్యార్థి.
దానికా గురువు “అయ్యయ్యో ఎంత పని జరిగింది! శతతాళదఘ్నం అంటే మాటలా ! నూరు తాటి చెట్ల లోతైంది! దాన్లో పడ్డ వాళ్ళు ఇంక తిరిగిరావటం కూడానా? ఎవరికైనా పురాకృతం తప్పదు” అని బాధ పడ్డాడు.
అప్పుడు నేను, “అయ్యా! ఈ సుగాత్రీ శాలీనులు చాలా మంచివాళ్ళని పొగుడుతున్నారు కదా! దయచేసి వాళ్ళ గురించి చెప్తారా?” అనడిగాను ఆయన్ని.
“ఈ పుస్తకంలో ఉన్నది వాళ్ళ కథే! ఇంక ఎలాగూ వాళ్ళని ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు గనక ఒకసారి ఈ కథైనా విందాం” అని గురువా పుస్తకాన్ని కళ్ళకద్దుకుని శిష్యుడికిచ్చి చదవమన్నాడు. అతనిలా చదివాడు
కాశ్మీర భూమికి ప్రథానమైన శారదాపీఠాన సరస్వతీ దేవిని పూజించే పూజారికి సుగాత్రి అనే కూతురు. ఆమె భర్త శాలీనుడు అత్తగారింట్లోనే ఉంటాడు.
వాళ్ళ తొలిరాత్రికి ఆమెని అందంగా అలంకరించి మరీ పంపితే అతనామెని పట్టించుకోనే లేదు. ఆమె కూడ చూసి చూసి తిరిగివెళ్ళిపోయింది. ఇది చూసిన ఆమె చెలులు ఆమె తల్లితో ఈ విషయం చెప్పి రేపు చూద్దాంలే అని అనుకున్నారు. ఐతే ఆ తర్వాత రెండు, మూడు రాత్రులు కూడా అలాగే గడిచాయి. అప్పుడామె తల్లి అనుమతితో చెలికత్తెలు ఆమెతో అన్నారు కదా “మీ వాలకం చూస్తుంటే ఆలుమగల విషయాలేం జరిగినట్టు కనపట్టం లేదు! భర్త సరిగా ప్రవర్తిస్తే భార్య సిగ్గుపడొచ్చు గాని యిలా యిద్దరూ సిగ్గు పడితే ఇక కాపురం ఎలాగ? కర్పూర తాంబూలమో తమలపాకులో ఇవ్వొచ్చుకదా నువ్వైనా? బంగారం వంటి వయసుని ఒట్టి మంచానికి అప్పగిస్తారా ఎవరైనా?” అని.
దానికామె సిగ్గుతో “ఇట్లాటి మాటలు నా చెవుల పడకూడదు పొండిక్కడ్నుంచ”ని వాళ్ళని తరిమేసి ఆ రాత్రికి మాత్రం వాళ్ళు చెప్పినట్టే చేసి చూసింది!
ఐనా ఏమీ ఉపయోగం కన్పించలేదు!
సుగాత్రి, “పోనీలే, ఆయన ఇష్టం ఎలాగో అలాగే జరగనీ!” అని అతనికి పూర్ణాయుష్షు కలగాలని ఎప్పుడూ రకరకాల అలంకారాలు వేసుకుంటూ గడుపుతోంది. అతన్నేమీ అనవద్దని తల్లిని కోరుకుంది. ఆమె తల్లి కూడ కొంతకాలం చూసి “ఇది వట్టిగొడ్డు తాకట్టే!” అని నిర్ణయించుకుని కనీసం పూలతోటనైనా పెంచమని అతనికి పురమాయించింది.
అతను కూడా, “శారదా దేవి పూజకి పనికొచ్చే పని గనక ఇంతకన్నా కావాల్సిందేమిట”ని ఒళ్ళు వంచి పనిచేసి కంటికి రెప్పలా ఆ తోటని పెంచి కాపాడాడు. అతని పనితనం వల్ల ఎండ జొరబడకుండా పెరిగిందా తోట! అతను రోజూ పొద్దున్నే లేచి వింత వింత రకాలుగా పూల మాలలు తయారుచేసి సరస్వతీ దేవికి సమర్పిస్తున్నాడు. సుగాత్రి ఇదంతా చూస్తూ ఎలాగైనా అతనికి పన్లో సహాయ పడుదామనుకుంటుంది గాని సిగ్గు వల్ల సాహసించలేకపోతోంది!
ఇలా ఉండగా ఒక నాడు
విపరీతమైన వర్షం పట్టుకుంది! కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి!
ఏనుగు తొండాల్లాంటి ధారల్తో ఆకాశానికి చిల్లుపడ్డట్టు వాన!
గుండెలవిసిపోయే ఉరుములు!
గుడ్డితనం తెచ్చే మెరుపులు!
శాలీనుడు మాత్రం తోటలోనే ఉండిపోయాడు!
సుగాత్రి మనసు అల్లకల్లోలమైంది. ఎలాగైనా తన భర్తకి కీడు కలక్కుండా చూడమని సరస్వతీ దేవిని ప్రార్థించింది. అంతటితో ఆక్కుండా ఎవరికీ చెప్పకుండా ఒక్కతే తోటకి బయల్దేరింది, ఆ కుంభ వృష్టిలో! ఆమె పాతివ్రత్య మహిమ వల్ల ఆమె మీద చినుకు పడలేదు! దార్లో వాగులు కూడా తప్పుకుని దారిచ్చాయి!
తోటకి వెళ్ళి అతనికి కనపడకుండా దాక్కుని చూస్తే అతను గాని, ఆ తోట గాని ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నారు! ఆనందంగా ఆ శారదా దేవి మహిమ వల్లే ఇలా జరిగిందని ఆమెని కీర్తిస్తూ మళ్ళీ ఎవరికీ తెలీకుండా ఇంటికి తిరిగొచ్చి ఎప్పట్లానే ఉన్నది సుగాత్రి. ఊళ్ళో వాళ్ళు మాత్రం అంత పెద్ద గాలివానా ఆ తోటలోని చిన్న మొక్కని కూడ కదల్చలేదని వింతగా చెప్పుకున్నారు.
ఇంకొన్నాళ్ళు గడిచింది. సుగాత్రి ఇంక సిగ్గుని పక్కకి పెట్టి భర్తకి సహాయం చేద్దామని ఎప్పట్లాగే అలంకరించుకుని తోటకెళ్ళింది. వెళ్ళి, నగలన్నీ మూటకట్టి పక్కన పెట్టి అతనికి ఇష్టం లేకపోయినా పన్లు చెయ్యటం సాగించింది. పాదులు తవ్వింది, మళ్ళకి మడవలు మార్చింది, మోపులు మోసింది, అటూ ఇటూ చకచక నడిచింది, అన్ని రకాల తోటపన్లూ చేసింది!
అలా ఆమె పన్లు చేస్తుంటే అతని మీద పూలబాణాలు గుప్పించాడు మన్మథుడు!
“ఎంత చెప్పినా వినవు కదా! నువ్వెక్కడ, ఈ తోటపన్లెక్కడ?” అంటూ ఆమె చెంపల మీది చెమటని తన ఉత్తరీయంతో తుడుస్తుంటే
ఎంత తుడిచినా అలా వస్తూనే ఉంటుందే! అది మన్మథుడి మహిమ మరి!
ఇంక ఆగలేక ఆమెని కౌగిలించుకున్నాడతను.
దట్టమైన చిగుళ్ళ పొదరింట్లో ఇద్దరూ ఒకటయ్యారు!
తర్వాత మళ్ళీ అలంకారాలన్నీ పెట్టుకుని ఇంటికి వెళ్ళింది సుగాత్రి.
ఆమె ముఖం వంక చూసిన చెలికత్తెలకి విషయం అర్థమైంది. ఆ రాత్రి ఆమెని మళ్ళీ బాగా అలంకరించి భర్త దగ్గరికి పంపారు.
ఐతే అతని కళ్ళలో మెదుల్తున్నది పూలతోటలో పన్లు చేస్తూ కనిపించిన ఆమె రూపం!
ఇలా అలంకరించుకున్న సుగాత్రి ఏం మాట్లాడుతున్నా అతని చెవులకే ఎక్కలేదు ఒక్క ముక్కైనా! ఆమె ఆ రాత్రంతా అక్కడే అతని పాదాలు పడుతూ గడిపింది.
మర్నాడు మళ్ళీ తోటకి వెళ్ళి పన్లు చేస్తుంటే ఆమెని చూసిన అతని ప్రవర్తన మారిపోయింది! అప్పుడర్థమైందామెకి అతని మనసుకి నచ్చేది సొంపులే గాని సొమ్ములు కావని!
అలా రోజూ తోట పన్లు చేస్తూ భర్తతో హాయిగా కాలం గడుపుతోంది. మెల్లగా ఆమె తల్లిక్కూడా ఈ విషయం తెలిసింది.
ఆమె కూతురితో, “అమ్మా! నువ్వు సరస్వతీ దేవి వరాన పుట్టిన దానివి. నీ మూలాన మన వంశం పవిత్రమౌతుందని ఆ దేవి స్వయంగా చెప్పింది. అందువల్లనే నీ తండ్రి దేశాంతరాలు పట్టిపోయినా నీకు పుట్టే బిడ్డల కోసం ఎదురుచూస్తూ ఇంకా బతికున్నాను. అందుకే నీ భర్తని ఇంతవరకు కొంత చిన్న చూపు చూశాను కూడ. ఇక అతను తోటలో పనిచెయ్యటం ఎందుకు దానికి జీతగాళ్ళున్నారు. అదీగాక అకాలసురతం వల్ల గుణవంతులైన పిల్లలు పుట్టరంటారు. నువ్వే ఆలోచించుకో” అని సున్నితంగా మందలించింది.
దానికి సుగాత్రి, “అమ్మా, నా భర్తకి ఏది ఇష్టమో అది నేను చేస్తాను. మరెవరి మాటా వినను నేను” అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.
అప్పుడు శారదా దేవి ప్రత్యక్షమై సుగాత్రి తల్లితో, “ఆమె ఇష్టమైన విధంగా నడుచుకోనీ! ఆమె మీ రెండువంశాల పాపాల్నీ పోగొడుతుంది. ఆమె కథ నాకు ఇష్టమైందిగా పవిత్రమైందిగా నిలుస్తుంది. అలా అయ్యేట్లు నేను చేస్తాను” అని వివరించింది.
అని ఆ విధంగా సుగాత్రీ శాలీనుల కథ చదివి వినిపించాడా విద్యార్థి. అప్పుడతని గురువు, “ఇదయ్యా వాళ్ళ పుణ్య కథ. వాళ్ళంటే ఆ శారదాదేవికి ఎంత ఇష్టమో! నాకూ, ఈ ఊళ్ళో చదవనూ రాయనూ వచ్చిన వాళ్ళందరికీ ఆ దేవి కల్లో కనపడి ఈ పుస్తకం రోజూ ఉదయాన్నే చదువుకోమని ఇచ్చింది.
ఒకళ్ళకొకళ్ళం చెప్పుకుని ఆశ్చర్యపోయాం. నిన్న నేను ఆ దంపతుల్ని చూడబోయి అక్కడే ఈ పుస్తకం మర్చిపోయివచ్చాను. అది తెప్పించటానికి పంపితే ఇలాటి ఘోరమైన వార్త వినాల్సొచ్చింది” అంటూ చాలా బాధ పడ్డాడతను!”
అలా ఆ కథంతా కలభాషిణికి చెప్పాడు మణికంధరుడు.
చెప్పి అన్నాడూ “అలాటి పరిస్థితుల్లో అక్కడ నా విద్య చూపించ బోవటం బాగుండదని ఇక అక్కడ్నించి నాగలోకం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సంగీతం మీద కోరిక కలిగి నారదముని దగ్గర శిష్యుడిగా చేరాను. … సరే, మొత్తం మీద ఇదంతా ఎందుకు చెప్పానంటే నా విషయంలో నీ ప్రవర్తన కూడా ఒక విధంగా సుగాత్రి విషయంలో శాలీనుడి ప్రవర్తన లాటిదే నని చెప్పటానికి!”.
అంతలో అతనికి మరో విషయం గుర్తొచ్చింది. సుముఖాసత్తి వంక చూసి, “అమ్మా, మీది కూడ శారదా పీఠమేనని చెప్పినట్టు గుర్తు. ఈ సుగాత్రీ శాలీనుల కథ నీకు తెలిసే ఉండాలి” అన్నాడతను. దానికామె అన్నది “తెలియక పోవటమేం? నేనే ఆ సుగాత్రిని!” అని!
అందరూ విభ్రాంతులై నిలబడిపోయారు!
ఈ వింతలకి అంతు లేదా ఏమిటి?
“అదెలా సాధ్యం? అంత పెద్ద మడుగులోంచి ఎలా బయటికొచ్చావు? నీకీ కొత్త పేరెందుకొచ్చింది?” అంటూ ప్రశ్నలు గుప్పించారు వాళ్ళు.
“అలా నేను శతతాళదఘ్నంలో పడగానే నన్నో పెద్ద మొసలి మింగి అరిగించుకోలేక మర్నాడు కొలని ఒడ్డున పడి పొర్లుతూ నన్ను వెళ్ళగక్కిందట అక్కడ చూసిన వాళ్ళు తర్వాత చెప్పారు నాకు! అందరూ ఆశ్చర్యపడి చూస్తూండగా అలా బతికి బయటపడి నేను ఇంటికెళ్ళా. శారదా దేవిని పూజిస్తూ, వేదాంత, యోగ సాధనల్లో పొద్దుపుచ్చుతూ గడపటం సాగించాను. శాస్త్ర పండితుల్ని సుముఖులు అంటారు కదా!
నేను ఎప్పుడూ అలాటి వాళ్ళ సాన్నిహిత్యంలో ఉన్నందు వల్ల నాకు సుముఖాసత్తి అనే పేరొచ్చింది. తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ చనిపోగా తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాను.
అక్కడి నుంచి కథ మీకు తెలిసిందే!
ఐతే ఆ కొలన్లో పడ్డ నా భర్త ఏమయ్యాడో మాత్రం నాకు ఇంతవరకు తెలీనేలేదు” అని వివరించింది సుముఖాసత్తి.