అలఘువ్రతుడు

వికీసోర్స్ నుండి


“మొసలి నోట్లోంచి నిన్ను సురక్షితంగా బయటపడేసిన నీ పాతివ్రత్యం నీ భర్తను కాపాడదా? నేనే ఆ శాలీనుణ్ణి!” అన్నాడు మణిస్తంభుడు!

అసలే మోసకారి సిద్ధుడు! అతని మాటలు నమ్మొచ్చునా?

తన పాత కథ ఇలా చెప్పుకొచ్చాడు మణిస్తంభుడు “అలా ఏదో పూనినట్టు వెళ్ళి నేను మడుగులో దూకేశాను కదా! కొంతసేపటికి చూస్తే నేను జలస్థంభన విద్యలో ఉన్న ఒక సిద్ధుడి ముందున్నాను. అక్కడతనికో చిన్న ఆశ్రమం! అతను కళ్ళు తెరిచి నా విషయం అడిగి తెలుసుకుని, “మరీ అంత కోపమా!” అని నవ్వి ఆ రోజంతా తన్తో ఉంచుకుని ఎందువల్లనో నా మీద దయతో వయసు పెరగనివ్వని ఒక గొప్ప మణిని, తనెక్కే సింహాన్ని, దాన్ని వశీకరణం చేసుకునే మంత్రాన్ని, ఈ కత్తిని నాకిచ్చి, నాకు వాద విద్యని కూడా అప్పటికప్పుడే నేర్పి పంపాడు. అప్పుడే ఆయన నాతో చెప్పింది ఈ కత్తిని ఎవరి మీదికి ఎత్తితే ఇది వాళ్ళని ఎప్పటికైనా తప్పక చంపుతుందని! .. నేనా సింహాన్ని ఎక్కి అదిలించటంతోటే అది ఎగిరి మడుగులోంచి బయటికొచ్చి ఆకాశంలో ప్రయాణించటం మొదలెట్టింది. దాని మీద ప్రపంచంలో వింతలన్నీ చూస్తూ తిరుగుతున్నాను ఇంతకాలమూ! మణి చేత నా వయస్సు స్తంభించి పోయింది గనక నాకు మణిస్తంభుడని పేరొచ్చింది. మా గురువు గారి మీద గౌరవంతో అప్పట్నుంచీ ఇలా సిద్ధుడి వేషంలో తిరుగుతున్నా”.

అతన్లో శాలీనుడి పోలికలు కొంత కనపడుతున్నాయని సుముఖాసత్తికి అంతకు ముందే అనుమానం ఉంది. కనక ఆమె అతని మాటల్ని పూర్తిగా కొట్టెయ్యలేక పోయింది. ఐతే అతను నిజంగా శాలీనుడౌనో కాదో తెలియాలంటే అది చాలదు కదా!

“అలా ఐతే ఆ రోజు నేను నీ చెవులో ఏం చెప్తే దానిక్కోపం వచ్చి నువ్వెళ్ళి కొలన్లో దూకావో చెప్పాలి” అన్నదామె.

దానిగ్గాను ముందు కలభాషిణ్ణి పక్కకి పిలిచి “ముందు నేను నీకా రహస్యం చెప్తా. ఆ తర్వాత అతన్ని చెప్పమందాం” అని ఆమె చెవిలో చెప్పబోతూ, అంతలోనే, “ఇది కాదు పద్ధతి. నేను ముందు నీకు చెప్తే దూరశ్రవణం ద్వారా అతను వింటాడు. పోనీ రాద్దామా అంటే దూరదృష్టితో చూడగలడు గనక అదీ పనిచెయ్యదు” అని ఒక్క క్షణం ఆలోచించింది.

ముందు తను చెప్పకూడదు, అతని చేతనే చెప్పించాలి!

మణికంధరుణ్ణి ముందుగా మణిస్తంభుడి దగ్గర ఆ రహస్యం కనుక్కోమంది.

మణికంధరుడు మణిస్తంభుణ్ణి దూరంగా తీసుకెళ్ళి అతను చెప్పిందంతా విన్నాడు. తర్వాత సుముఖాసత్తి దగ్గరికి వచ్చి ఆమెని చెప్పమన్నాడు.

ఇలా చెప్పిందామె “శాలీనుడు మడుగున దూకేముందు నా అందం రోజురోజుకీ పెరుగుతుందనీ, దానిక్కారణం ఏమిటంటే తను నాకు గర్భం రాకుండా ఉండాలని శారదాదేవిని వరం అడిగాడనీ దానికి ఆమె సరేనన్నదనీ నా చెవిలో చెప్పాడు. దానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, అంతకుముందే ఆ దేవి నా వల్ల అతనికి ఒక కొడుకు పుడతాడని వరం ఇచ్చింది. నేనా విషయం అతన్తో చెప్పి, “దేవి మన ఇద్దరికీ ఇలాటి వరాలిచ్చిందే మరి ఈ రెండూ ఎలా జరుగుతాయి?” అన్నాను. దానికతను, “ఇలా నా ఇష్టానికి వ్యతిరేకంగా వరం కోరుతావా!” అని మహా కోపంతో వెళ్ళి మడుగులో దూకేశాడు”.

ఇద్దరికీ అలాటి వరాలిచ్చిన ఆ దేవి మాటలు ఎలా నిజం ఔతాయో కదా!

ఇద్దరి దగ్గరా విన్నాడు గనక ఇప్పుడు మణికంధరుడు తన తీర్పుని ప్రకటించాడు

“మీరిద్దరూ ఒకే విధంగా చెప్పారు. మీరు సుగాత్రీ శాలీనులే!”

అందరూ ఆనందంలో తేలిపోయారు!

“ఇన్నాళ్ళకి ఈ అన్న మూలాన నా భర్తను కలవగలిగాను” అని మణికంధరుణ్ణి పొగిడింది సుముఖాసత్తి. “జాతికి గంధర్వుడివి; రూపంలో మన్మథుడివి; సంగీత సాహిత్యాల్లో దిట్టవి; గొప్ప తపస్వివి; విష్ణుభక్తుడివి; ఆ ఒక్క శాపం కూడా లేకుంటే ఎంత బాగుండేదో!” అంది విచారంగా.

కలభాషిణి కూడా అతని శాపానికి బాధ పడుతూ, “ద్వారకలో నారదుడూ, నువ్వూ పూలతోటలో దిగినప్పుడు కళాపూర్ణుడి విషయం వచ్చింది కదా! మరి రంభ అడిగినప్పుడు ఎందుకు చెప్ప లేక పోయావ్‌?” అనడిగింది.

“లేదే! నేనా విషయం ఎప్పుడూ వినలేదే!” అన్నాడు మణికంధరుడు ఆశ్చర్యంగా!

అప్పుడు కలభాషిణికి గుర్తొచ్చింది “ఔనౌను. అప్పుడు నువ్వు నేనేదో రహస్యం మాట్లాడబోతున్నానని పక్కకెళ్ళావ్‌! ఇప్పుడు గుర్తొచ్చింది” అంటూ అప్పుడు తనకీ నారదుడికీ జరిగిన సంభాషణంతా వినిపించింది వాళ్ళకి.

ఆ సందర్భంలోనే కళాపూర్ణుడి కథ వినటం వల్ల కలిగే తరతరాల భోగభాగ్యాల గురించి కూడ వాళ్ళకి చెప్పింది.

సరిగ్గా ఆమె అలా చెప్తున్నప్పుడే అలఘువ్రతుడనే మళయాళపు బ్రాహ్మణుడొకడు తనకి సిరిసంపదలు కావాలని ఆ దేవిని ప్రార్థించటానికి వచ్చి కళాపూర్ణుడి గురించి ఆమె చెప్పిందంతా విన్నాడు!

“ఇంకేం! నాకు తరతరాలకూ సంపదలు కలిగే మార్గం దొరికింది! అలాగే ఒక అద్భుతమైన కథ కూడ వినొచ్చు. కనక ఆ కళాపూర్ణుడి కథ వినిపించమని కోరుకుని దేవీ జపం చేస్తాను” అని నిశ్చయించుకుని అప్పటికప్పుడే భువనేశ్వరీ మంత్ర జపం ప్రారంభించాడు అక్కడి శిలాక్షరాల్లో రాసిన ప్రకారంగా!

శాపాల విషయం వచ్చింది గనక కలభాషిణి తన శాపం విషయం కూడ తల్చుకుని సిద్ధుణ్ణి చూసి, “ఇంకా ఆలస్యం ఎందుకు? నీ కత్తి మహిమకీ, ఆ రంభ శాపానికీ సరిపోయేట్టుగా చేసి రాజ్యం సంపాయించి నీ కోరిక తీర్చుకో!” అని ప్రోత్సహించింది. మణిస్తంభుడు మాత్రం ఒప్పుకోలేదందుకు.

“ఈ సుముఖాసత్తి దేవి మీద ఒట్టేసింది కదా! దాని వల్ల ఇప్పటి దాకా పడ్డ పాట్లు చాలు” అంటూ అంతలోనే ఇంకో ఆలోచన వచ్చి మణికంధరుణ్ణి చూసి, “నా కత్తి నీకిస్తాను. దాంతో ఆమె చెప్పినట్టు చేసి నువ్వు రాజ్యం సంపాదించుకో!” అని సలహా ఇచ్చాడు. సుముఖాసత్తి కూడ “ఈ స్థితిలో అదే మంచి పని” అని సమర్థించింది.

ఐతే మణికంధరుడు ససేమిరా అందుకు ఒప్పుకోలేదు. అందరూ రకరకాలుగా చెప్పి అతికష్టం మీద ఎలాగైతేనేం చివరికి అతన్ని ఒప్పించ గలిగారు.

కలభాషిణి అందరికీ నమస్కారాలు చేసి సుముఖాసత్తితో “నాకెందుకూ బాధ లేదు గాని మీలాటి పూజ్యుల్ని పూజించుకుంటూ కాలం గడిపే అవకాశం లేకుండా పోతోందని మాత్రం బాధ పడుతున్నాను” అనటంతో ఆమె “మన బంధం ఇంతటితో పోతుందా? ముందు ముందు నువ్వూ నీ భర్తా మమ్మల్ని గురు భావంతోనే చూస్తారులే! అప్పుడు నువ్వు పరమ పతివ్రతవై రాజ్యభోగాలు అనుభవిద్దువు గాని” అని దీవించింది కలభాషిణ్ణి.

అప్పుడు కలభాషిణి మణిస్తంభుడి దగ్గర కత్తి తీసుకుని మణికంధరుడి చేతికిచ్చి దేవి కెదురుగా పద్మాసనం వేసుక్కూర్చుని “ఇంకా ఆలోచనెందుకు? నీ చేతుల బలాన్ని చూపించు” అని రకరకాలుగా ఉత్సాహం కలిగిస్తుంటే వెనకాడుతూ వెనకాడుతూ చివరికామెని దేవికి బలిచ్చాడు మణికంధరుడు.

అప్పుడు కాళికాదేవి మణికంధరుడితో “నువ్వు బలి ఇవ్వటంలో ఇంత ఆలస్యం చేశావ్‌గనక నీకు ఈ జన్మలో రాజ్యం రాదు. వచ్చే జన్మలో నువ్వు సద్యోయవ్వనంతో పుట్టి మహారాజ్య భోగాలు అనుభవిస్తావు. ఇక ఈ కలభాషిణి ఎంతో ధైర్యంగా బలయ్యింది గనక ఆమెని బతికించి ద్వారకలో ఆమె బంధు మిత్రుల దగ్గరికి చేరుస్తున్నా!” అని ప్రకటించింది.

అలా ద్వారకలో తన ఇంట్లోనే మళ్ళీ బతికి కళ్ళు తెరిచింది కలభాషిణి!

తర్వాత రెండేళ్ళ పాటు ఆనందంగా గడిపి తన బంధుమిత్రుల మధ్య సహజమరణం పొందింది!

ఇంక ఇక్కడ, కాళికాలయం దగ్గర నలకూబరుడి శాపం మణికంధరుణ్ణి ఆత్మ హత్యకి పురిగొల్పుతోంది! శ్రీశైల పర్వతం మీంచి దూకిన వారికి ఆత్మ హత్యా పాపం ఉండదనీ, పైగా పుణ్యం కూడ వస్తుందని, అక్కడికి బయల్దేరాడతను. తన దగ్గరున్న వస్తువుల్ని చూసుకున్నాడు వీణని ఆ ఆలయంలోనే ఒక గుహలో జాగ్రత్తగా భద్రపరిచాడు; తన కవిత్వానికి మెచ్చి శ్రీకృష్ణుడిచ్చిన రత్న మాలికని అక్కడే కూర్చుని భువనేశ్వరీ మంత్ర జపం చేస్తున్న అలఘువ్రతుడికిచ్చాడు. శ్రీశైలానికి ప్రయాణం సాగించాడు.

అతను వెళ్ళిపోయాక కొంత కాలం పాటు ఆ గుడిలోనే పూజలు చేస్తూ గడిపారు సుముఖాసత్తీ మణిస్తంభులు. అంతలో మళ్ళీ దేశాంతరాలు తిరిగి చూడాలనే కోరిక్కలిగింది మణిస్తంభుడికి. తన సింహవాహనాన్ని ఆకర్షించాడు. ఆలుమగలిద్దరూ దాని మీద ప్రపంచ పర్యటనకి బయల్దేరారు.

ఎదురుగా సముద్రం! తీరాన దిగారు. ఆ దృశ్యం చూసి మణిస్తంభుడికి కవిత్వం తన్నుకొచ్చింది!

దాంతో పాటే మదనవాంఛ కూడ!

రతిక్రీడల్లో తేల్తూ కొంత కాలం గడిపారు వాళ్ళు.

ఇంతలో ఇక్కడ కాళికాలయంలో అలఘువ్రతుడి రెండేళ్ళ దీక్ష పూర్తయింది!

దేవి “నీ కోరిక ఇంకోచోట నెరవేరబోతోంది” అనటం, ఆ మాటలు చెవిని పడేలోగానే అతను గాల్లో ఎగిరి ఒక గొప్ప పట్టణం మధ్య ఒక రాజు గారి కొలువులో వెళ్ళి పడటం జరిగిపోయాయి!

అలఘువ్రతుడు తేరుకుని చూసేసరికి ఎదురుగా రెండో దేవేంద్రుడిలా వెలుగు తున్న రాజు!

అతని పక్కన బంగారు తొట్టెలో పొత్తుల్లో ఉన్న ఒక చక్కటి పాపాయి!

అలఘువ్రతుడు లేచి వెళ్ళి ఆ రాజుని ఆశీర్వదించి తన దగ్గరున్న రత్న మాలికని అతనికి కానుగ్గా ఇచ్చాడు. ఆ రాజు కూడా అతన్ని కూర్చోబెట్టి కులనామాలు కనుక్కుని “నువ్విలా రావటం అద్భుతంగా ఉంది. నీ కథంతా మాకు చెబుదువు గాని” అంటూ “ఇవేళ నాకు వచ్చిన కానుకలన్నీ ఈ పాపవే!” అని ఆ రత్నమాలికని ఆ పాప మెళ్ళో వేయించేసరికి ఆశ్చర్యంతో అందరూ దిగ్భ్రమ చెంది బొమ్మల్లా నిలబడిపోయేట్టుగా ఆనందంగా నవ్వి ఆ పాప అన్నది “ఆహా! రెండేళ్ళక్కదా ఈ హారాన్ని మళ్ళీ చూశాను!” అని!

ఆ రాజు కూడా “ఈ పాప ఏ దేవతాకాంతో, కారణజన్మురాలో! ఇంకా మాట్లాడించి చూద్దాం!” అనుకుని “పాపా! నీకు సరిగ్గా రెండు నెలలైనా నిండాయో లేదో, ఈ హారాన్ని రెండేళ్ళ కిందట చూశానని ఎలా అంటున్నావ్‌?” అనడిగాడు.

“నా క్రితం జన్మలో నాకు దీన్తో చాలా పరిచయం ఉంది. అందువల్ల”

“నువ్వేదో కారణజన్మురాలివి గాని మామూలు బిడ్డవి కావు. నీ పూర్వ జన్మ కథ, ఇక్కడ పుట్టటానికి కారణం వివరంగా వినాలనుంది నాకు” అని ఆ పాపని అడిగాడా రాజు కుతూహలంగా.

సభలో అందరూ మంత్రం వేసినట్టు నిశ్శబ్దంగా వింటున్నారు!

కనీ వినీ ఎరగని కథ చెప్పటం మొదలెట్టిందా పసిపాప!

“ఇంతకు ముందుది కాక ఆ ముందు జన్మలో నేను సాక్షాత్తూ సరస్వతీదేవికి పెంపుడు చిలకని. అప్పుడు నాకో శాపం తగిలినందు వల్ల ఇంకో రూపం ఎత్తాల్సొచ్చింది. ఆ శాపం ఎందుకొచ్చిందో ఇప్పుడు చెప్తా. ఈ కథ చాలా రసవంతమైంది, సంపదల్నీ ఆయుష్షునీ పెంచేది, పవిత్రమైందీను. ఇది చెప్పగలగటం నిజంగా నా అదృష్టం!”

అంటూ అద్భుతమైన కళాపూర్ణోదయ కథకి అసలు కీలకం ఏమిటో చెప్పటం మొదలుపెట్టిందా చిన్నారి పాప.