సింహాసనద్వాత్రింశిక/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక

షష్ఠాశ్వాసము

పదుమూఁడవ బొమ్మకథ

క.

శ్రీకరుణారసమయ విభ
వాకరనయనద్వయప్రభామితు ఘననా
భీకమలస్థితనుతు విను
తాకారు వికారదూరు నఖిలాధారున్.

1


క.

మనమునఁ దలఁచుచు భోజుం
డనువగు లగ్నమున నెక్క నరుదేరఁగ నా
సనపాంచాలిక నిలునిలు
మని జనులకు నెల్ల విస్మయంబుగఁ బలికెన్.

2


క.

సత్వము సాహసమును దా
తృత్వమ్మును విక్రమార్కు తెఱఁగునఁ గనకే
సత్వరగతి నరుదేరఁ బ్ర
భుత్వము ఘన మౌనె యతని బురుడించెదవే.

3


క.

మదిఁ దలఁచి చూడు నావుడు
విదితంబుగఁ దద్గుణములు వినిపింపుము స
మ్మద మొదవ నిచట ననినం
బదుమూఁడవబొమ్మ భోజపతి కి ట్లనియెన్.

4

ఉ.

ఖండితవైరిమండలుఁ డఖండపరాక్రమదర్పశాలి యా
ఖండలవైభవుండు త్రిజగద్భరితామలకీర్తిచంద్రికా
మండితమండలాగ్రుఁడు సమగ్రజయాస్పదబాహుయుగ్ముఁడై
చండతరప్రతాపుఁ డగుసాహసభూషణుఁ డుర్వి యేలుచున్.

5


ఆ.

ఆఱునెలలు గడపి యంత దేశాంతర
మరిగి వనము లూళ్ళుఁ దిరుగుచుండి
కనియె గంగపొంత జనమేజయుం డను
ధర్మశాలి దైన ధర్మపురము.

6


క.

ఆయగ్రహార మొయ్యన
డాయఁగ మాపైన నొక్కటన్ ద్విజునింటన్
రేయుండి రేపకడ నది
తోయంబులఁ గ్రుంకఁ జనుచు ధూర్జటిఁ దలఁచెన్.

7


ఊ.

కామునిఁ గాల్చి బూడిదను గంధముగాఁ గొని యెద్దు నెక్కుచుం
బాములుఁ దోలు నెమ్ములుఁ గపాలములుం దనమేనిసొమ్ముగా
గాములఁ గూడి యాడుచును గాడు గృహంబుగ నున్నవాఁడు గం
గామృత మౌదలం జిలికి నంత సదాశివుఁ డయ్యె నెల్లెడన్.

8


క.

అనుచుం గనుఁగొనెఁ గృతముని
జనసంగన్ ద్విజసురంగఁ జపలతరంగన్
ఘనకంకణలసదంగన్
జనితామితదురితభంగ జాహ్నవి గంగన్.

9


వ.

కని మ్రొక్కి శుచియై సచేలస్నానంబు సేయుచు.

10


క.

మలినుఁడు మై గడఁగిన ని
ర్మలుఁ డౌ టది చెల్లు లోకమాతా! నీలో

దలఁ దడిపినఁ జలి లే దని
వెలయుట యాహరునినుదుటివేఁడిమిఁజుమ్మీ.

11


ఆ.

ఒకనియడుగుఁ జేరి యొకనియౌఁదల యెక్కి
యొకనివెంట వచ్చి యొకనిఁ గలసి
వెడలి పాఱి తనుచు విందు మట్లయ్యు నీ
జీవనంబు లోకపావనంబు.

12


చ.

అని కొనియాడుచున్ జలకమాడి శివార్చన దీర్చి సూర్యు నిం
పునఁ బ్రణుతించి యూరిదెసఁ బోవగ వీనుల కెల్లఁ దేనియల్
చినుకఁ బురాణవాక్యములు చెప్పెడివిప్రుని జూచి యమ్మహా
జనసభఁ జేరి మ్రొక్కి సరసస్థితితో వినుచుండ నయ్యెడన్.

13


ఆ.

దానధర్మములకుఁ బూనక తనపొట్ట
నినుపుకొనఁ దలంచు జనుఁడె పశువు
పసరమైన మెఱుఁగు బండి యీడుచు దున్ను
నంతకంటెఁ గష్టుఁ డండ్రు బుధులు.

14


క.

వదనము ప్రసాదసదనము
హృదయము సదయంబు మాట లింపుల తేటల్
మెదలుట మేలునఁ బొదలుట
సదమలవర్తనుల కివియ సహజగుణంబుల్.

15


క.

సురలకు ధరణీసురులకు
హరిహరులకుఁ బ్రియ మొనర్చుయాగము లెల్లన్
సరిగూర్చి యెత్తుచోటను
శరణాగతరక్షణంబు సరిగా వెందున్.

16


చ.

అని చదువం బురాణవచనార్థము సత్యముగా నెఱింగి స
జ్ఞానులు మనంబులోనఁ గడు సంతమందుచు నుండఁగా భయం

బున మదిఁ దల్లడిల్లుచును బొబ్బలు వెట్టుచు నొక్కవృద్ధకా
మిని పఱతెంచి వారల సమీపమున న్మొరచేసి యేడ్చుచున్.

17


ఆ.

పొలములోన జింకఁ బులి వట్టు కైవడి
వడి నెదిర్చి సంధ్యవార్చువేళ
గంగలోన మొసలి మ్రింగెను నాపతి
ననదఁ గావరయ్య యయ్యలార!

18


వ.

అనుచుం బెదవులు దడుపుచు దీనవదనయై మ్రొక్కిన నక్కజంబుగా నక్కామిని యక్కఱఁ జక్కఁబెట్టలేమి నక్కటా యనుచు నొక్కటియు ననలేక విప్రజాతి గావున నొండొరులమొగంబులు చూచుచు నున్నెడ నిగుఱు గప్పిన నిప్పు చొప్పున యప్పురుషరత్నం బప్పుడ దిగ్గున లేచి.

19


క.

తల్లీ!యిఁక నుల్లంబునఁ
దల్లడ మందకుము మొసలితలఁ ద్రెంపుదు నీ
వల్లభు విడిపింతును నే
కల్లోలిని గలఁతు హల్లకల్లోలముగన్.

20


ఆ.

అనుచు నభయమిచ్చి యటఖడ్గసహితుఁడై
గంగఁ జొచ్చి రాజపుంగవుండు
కొంకులేక యీఁది ఱంకెలు వేయుచుఁ
గడిఁది మొసలిఁ దృణముగా దలంచె.

21


ఆ.

పిడుగుకంటె మిగుల బెడిదమౌ నడిదంబు
పూని డాసి వ్రేసి దానిఁ ద్రుంచి
యంటఁగోఱ లెడపి గంటి మంత్రించుచు
బడుగుబాఁపనయ్య వెడలనడిపె.

22


క.

నిజనామము దలఁచిన నం
బుజనాభుఁడు వచ్చి మొసలిఁ బొరిగొని కరుణన్

గజపుంగవుఁ గాచిన క్రియ
ద్విజపుంగవుఁ గాచి మనుజదేవుఁడు వెడలెన్.

23


శా.

ఆవేళన్ జను లెల్ల నుల్లములఁ జోద్యం బందుచు న్మేలు మే
లీవీరాగ్రణి సాటిచెప్పఁ గలరే యేవీరు లైన న్భువిన్
దైవం బీతనిపాలఁ గల్లె నని వింత ల్గాఁ ప్రశంసింపఁగా
నావిప్రుండు నిజప్రియాసహితుఁడై హర్షించి దీవించుచున్.

24


ఉ.

సాహసికాగ్రగణ్య! రభసంబున నీ వరుదెంచి యమ్మహా
గ్రాహముఁ ద్రుంచి నన్నుఁ గృపఁ గాచితి దీనికి మాఱు మేలుగా
నీహిత మే నొనర్చెదను నీ వతిదుర్లభ మంచు దీని సం
దేహము లేక కైకొనుము దేవసమానుఁడ వీవు గావునన్.

25


క.

ఓపురుషవర్య నేనొక
తాపసు దయఁ దొల్లి నర్మదాతీరమునన్
గోపాలమంత్రజపమున
నోపినక్రియఁ దపము సేయుచుండఁగ నాకున్.

26


వ.

ఒక్కనాఁటి రాతి సుఖస్వప్నావసరమున.

27


సీ.

మేఘంబు కడఁబొల్చు మెఱపుకైవడినున్న
        పీతాంబరముదిండు బిగియఁగట్టి
తరుణాతపద్యుతి హరిచందనం బొప్ప
        రవిభంగి నురమున రత్న మలర
యమునాజలమ్ముపై నమరునెత్తమ్ముల
        తమ్ములౌ తెలిగన్నుఁదమ్ము లమరఁ
గరిరాజుశిరమున ఘనరత్నఖచితమౌ
        దండచాడ్పునఁ బీలిదండ యమర

ఆ.

వన్నెలన్నియుఁ దనలోనివన్నె లనఁగఁ
గరుణఁ బొడవైనరూపశృంగార మనఁగ
గోపికల మరులుకొల్పిన దీపులాఁడు
రమణఁ గనుపట్టె గోపాలరత్న మెదుర.

28


వ.

ఇట్లు సన్నిహితుండై.

29


శా.

ఆ దేవుండు మహాప్రసన్నవదనుండై యాత్మలోనం గృపా
శ్రీదై వాఱఁగ నన్నుఁ జూచి తలఁపు ల్సిద్ధించు నీ కిప్పుడో
భూదేవోత్తమ నీజపంబును దపంబు న్నాత్మఁ గైకొంటి నే
నీదైవంబు ఫలంబు దీనికిఁ దగన్ నిర్మించి నీ కిచ్చెదన్.

30


వ.

వినుము. స్ఫటికసౌపానంబులును గనకఘంటికలును నింద్రనీలస్తంభంబులును మహారజతకుడ్యంబులును రమ్యహర్మ్యంబులును చీనాంశుకధ్వజంబును గుసుమితపర్యంతవనంబును విద్యాధరీగణంబును గామగమనంబును గలుగు దివ్యవిమానంబు దేహావసానసమయంబునఁ బ్రాపించు నని యాన తిచ్చి చనియె. నట్టిఫలంబు నీ కిచ్చి కృతార్థుండ నయ్యెదఁ గైకొను మనిన నమ్మనుజేంద్రుండు.

31


క.

అత్యాతురుఁ డని నిను నా
నిత్యకృపావృత్తిఁ గాచి నిలిపితి గాకేఁ
బ్రత్యుపకారంబున కీ
కృత్యము సేయుదునె దీనికిం బ్రియ మేలా.

32


గీ.

అనదఁ గాచుట కులవిద్య యండ్రు మాకు
రాజపుత్రుండ నిదియ ధర్మంబు గాదె
నీకుఁజేసినమేలుగాఁ గైకొనకుము
క్షత్రియకులంబు భువి దానపాత్రమగునె.

33

ఉ.

నావుడు వివ్రుఁ డిట్టివచనంబుల నాతని విక్రమార్కుగా
భావములోపలం దెలిసి పార్థివశేఖర! నేఁడు నీ వవం
తీవిభుఁ డౌట నే నెఱిఁగితి న్మఱి యన్యుల కిట్టిచిత్తము
న్లావును సాహసంబు శుభలక్షణము ల్వినయంబుఁ గల్లునే.

34


చ.

ఇది కడుమేలు చేకుఱె నరేశ్వర! ని న్గనుఁగొంటి బ్రహ్మకున్
వదనభుజోరుపాదముల వర్ణము లుద్భవమందె నాల్గు చ
క్కదనమునందు విప్రులకు క్షత్రియజాతికి నొక్కవేళ మే
లొదవఁగఁ బెట్టుడుం గొనుటయుం దమలోపలఁ జెల్లు వీడ్వడన్.

35


ఉ.

ఈదురవస్థ కడ్డువడి హీనుని విప్రునిఁ గాచె నంచు నీ
మేదినిలోనఁ గీర్తియును మేలుఁ దలిర్పదె విన్నవించుచో
నాదరణంబు సేయఁ దగదా సుకృతం బిది దుష్టదానమే
కా దననేల కొమ్మనుచుఁ గైకొనఁ బ్రార్థనచేసి యిచ్చినన్.

36


ఉ.

కైకొని విప్రు వీడుకొని గంగకు భక్తి నమస్కరించి కం
థాకరవాలయోగవిధిదండసమన్వితుఁడై నృపాలుఁ డ
స్తోకమనఃప్రసాదమున జోగివిధంబున నంతనంత ను
త్సేకము లేక యేగి బహుదేశములుం గలయం జరించుచున్.

37


బ్రహ్మరాక్షసుని కథ

సీ.

రుచిరసరోలంబరోలంబకలకంఠ
        కలకంఠకులవృతకలకలంబు
బంధూకబంధుసౌగంథకగంధి ని
        కేతన కేతకీకేతనంబు
పరిభూతభూత ప్రపంచాస్యనాగేంద్ర
        నాగేంద్ర నాగేంద్ర భోగభూమి

సేక సముత్సేక భీకరసూకర
        కాసార కాసార భాసురంబు


గీ.

చలపలాశపలాశరసాలసాల
తాలహింతాలశీతలోత్తాలతలము
మృగమృగాధనమృగనాభిమృగమయంబు
వింధ్యవనము సొత్తెంచె నవంధ్యబలుఁడు.

38


క.

అక్కడఁ గడుదూరము చని
యొక్కెడ నిలుచుండి దాహ మొలయఁగ జల మే
దిక్కునఁ గానక చీకటి
నక్కజముగ నిండి శూన్యమగుగుడిఁ గనియెన్.

39


క.

శాశ్వతముగ నాముందఱ
నీశ్వరలక్ష్మీశభారతీశ్వరమయమై
విశ్వజనాశ్రయముగ నొక
యశ్వత్థముఁ జూచి చేర నరుగఁగఁ గ్రిందన్.

40


క.

వెడఁదమొగంబును గోఱలు
మిడిగ్రుడ్లును గుఱచచెవులు మిడిమీసమ్ముల్
సుడిగొన్న వెండ్రుకలతో
సుడియఁగ నొకబ్రహ్మరాక్షసుం గనుఁగొనియెన్.

41


మ.

కని నిశ్శంకుఁడు సాహసాంకుఁడు మహాకౌతూహలుండై రయం
బున డాయం జని యిట్టి కాఱడవిలో భూతంబవై యున్కి యె
వ్వనిమూలంబున నయ్యె నెవ్వఁడవు సర్వంబుం దగం జెప్పుమా
యనిన న్నివ్వెఱఁగంది వాఁడు నిజవృత్తాంతస్మృతి న్నమ్రుఁడై.

42


క.

ధరఁ గలపురాణముని వ్యా
కరణంబుల శాస్త్రముల నిగమములఁ గవితం

బరిణతుఁడ మాళవేంద్రుని
పురోహితుఁడ జన్మసంజ్ఞఁ బురుహూతుండన్.

43


గీ.

అధిపుకొలువున నేఁ బరీక్షాధికారి
నగుటఁజేసియు నొకవిప్రుఁ దెగడి పుచ్చి
యట్టికీడున నిర్జనం బైనయడవిఁ
జచ్చి గతి లేక బ్రహ్మరాక్షసుఁడ నైతి.

44


క.

ఈయెడ నే నుండఁగ నిదె
వేయేఁడులు చనియెఁ గీడు విడువదు బలిమిన్
నీయట్టిపురుషరత్నం
బీయలజడి వాపనోపు నీశ్వరుకరుణన్.

45


ఉ.

నావుడు వానిదీనవచనంబులకుం గరుణార్ద్రచిత్తుఁడై
భూవరుఁ డాత్మలోన దలపోసి వినిశ్చయబుద్ధి నీయస
ద్భావముఁ బాపనోపెడు నెవంబుగఁ జిత్తమునం దలంచి నా
జీవము వేఁడినం గొఱఁత సేయక యిచ్చెద వేఁడు మియ్యెడన్.

46


చ.

అనవుడు వాఁడు సంతసము నచ్చెరువుం గడుఁ బిచ్చలింపఁగా
మనమునఁ బొంగి పాపము క్రమంబునఁ బాయఁగ గంగలోన వి
ప్రునిఁ దగ గాచి కైకొనిన పుణ్యము నీకడఁ గల్గఁబోలు నిం
పెనయఁగ ముక్తిమార్గమున నేగెద నాఫల మిమ్ము నావుడున్.

47


ఆ.

బ్రహ్మరక్షణమునఁ బడసిన సుకృతంబు
బ్రహ్మరక్షకుండు భక్తి నొసఁగ
బ్రహ్మరాక్షసుండు బ్రహ్మమీఱినపర
బ్రహ్మపదముఁ జేరి భవ్యుఁ డయ్యె.

48


క.

నిష్పాపదేహుఁ డై గతి
నిష్పన్నం బైన నెగసి నెలఁతలు గొలువం

బుష్ఫాయుధసముఁ డై మణి
పుష్పకమున నుండి మ్రొక్కి పోయెన్ దివికిన్.

49


వ.

ఇ ట్లతం డరిగిన తదనంతరంబ.

50


శా.

ధాత్రీపాలకశేఖరుండు నటఁ దత్కార్యంబు సంధిల్లఁగాఁ
జిత్రం బంది విదేశపర్యటన మిక్షింపంగ నాకున్ జగ
న్మైత్రీకారణ మయ్యె సంచు మది నానందించుచు న్గూఢచా
రిత్రుండై మగిడె న్యశంబు దిశలన్ రెట్టింప నుజ్జేనికిన్.

51


క.

కావున నీకీగుణములు
లే వీజన్మమున నెక్కలే వీ వనినన్
భావం బెడలఁగ ధారా
భూవల్లభుఁ డంత నంతిపురమున కరిగెన్.

52


పదునాల్గవబొమ్మ కథ

వ.

మఱియును గతిపయదినంబులు చనిన.

53


క.

కదలనివిల్లును గాలిం
బొదలెడు నారియును నిద్రవోయెడుశరముం
బదనుఁడు జడముడియుంగల
ముదిజోదు న్మొదలివేల్పు ముదమునఁ దలఁతున్.

54


క.

అని భోజుఁ డొక్కవేళం
గనకాంబరభూషణములు గడుబెడఁ గడరం
జని సింహాసన మెక్కఁగఁ
గని పదునాలుగవబొమ్మ కలకలఁ బలికెన్.

55


క.

ఓనరనాయక! చెల్లని
పూనిక లవి నెఱపనేల భువి నుజ్జయినీ

మానవనాథుని కెనయగు
దానగుణము లేక యెక్కఁ దరమే నీకున్.

56


క.

నావుడు నాతని వితరణ
మే వెరవున నెచట నొదవె నెఱిఁగింపు మనన్
భావజ్ఞులు మనమున సం
భావింపఁగ నిట్లు సాలభంజిక పలికెన్.

57


క.

ఆయవనీపతి కీర్తి
స్థేయుఁడు పరనృపకులావిధేయుఁడు ధృతిగాం
గేయుఁడు వితరణగుణరా
ధేయుఁడు జవసత్వవైనతేయుఁడు చుమ్మీ.

58


ఉ.

పార్థివుఁ డొక్కనాఁ డవనిభారము మంత్రికి నప్పగించి ధ
ర్మార్థము మేన నించుక ప్రయాసము దోఁపఁ జరింపకుండినన్
వ్యర్థము జీవనం బని నయంబున వెల్వడి యోగివేషి యై
తీర్థములుం బురంబులు విదేశములుం దగ సంచరించుచున్.

59


క.

అగణితసౌధోజ్జ్వలరుచి
గగనస్థలి యభ్రగంగగతి నమరంగా
నగపక్షవైరినగరము
నగియెడుగతి నున్న యొక్కనగరముఁ గనియెన్.

60


క.

ఆనగరముచేరువ ను
ద్యానవనాంతరమునందు నలరెడునదిలో
స్నానంబుచేసి సిద్ధ
స్థానం బగు నచటిగుడికిఁ జని సంప్రీతిన్.

61


క.

అంబురుహంబులు దనహ
స్తాంబురుహంబులఁ దెమల్చి యతిధీరుండై

త్ర్యంబకునిదేవి యగు జగ
దంబకు నంబికకు భక్తి నర్చన లిచ్చెన్.

62


ఉ.

ఆకడ మున్న చండికకు నర్చన లిచ్చుచుఁ గొల్చియున్న య
స్తోకతపఃప్రసిద్ధుఁ డవధూతుఁడు చూచి యుదారమూర్తి నీ
వీకడ కేల వచ్చి తను డేను విదేశిఁ బరిభ్రమించుచున్
మీకృపఁ గోరి తీర్థములు మెట్టుచు నిక్కడ కేగుదెంచితిన్.

63


క.

అనవుడు నాతఁడు నవ్వుచు,
ననుమానములేదు విక్రమార్కుఁడ వగుటం
గని యెఱుఁగుదుఁ బూర్వంబున
నను మూడుని జేసి మొఱఁగ నాయం బగునే.

64


వ.

అనిన నతం డే నియ్యడం బరదేశి నగుట దప్పదు సకలరాజ్యభారంబున నీతిధురంధరుం డగు మంత్రిశిరోమణి భట్టిం బురంబున నిల్పి భవాదృశు లగు పురుషరత్నంబులం జూచుట కారణంబుగాఁ దీర్థంబులం దిరుగుచున్నవాఁడ ననిన నజ్జనవల్లభునకు బుద్ధి సెప్పుచు సిద్ధవల్లభుం డిట్లనియె.

65


క.

పూజ్యుఁడవు సకలతిమిరహ
రజ్యోతిరూప మైనరవిమూర్తివి నీ
రాజ్యంబు నిఖిలధర్మ
ప్రాజ్యం బది విడిచి యిటకు రాఁదగ వగునే.

66


క.

ధనముం గృషియును విద్యయు
వనితయు నృపసేవనంబు వాణిజ్యంబుం
దనధర్మంబుఁ జికిత్సయు
ననుదినమును గట్టిగాఁగ నరయఁగ వలయున్.

67


ఆ.

ధరణిఁ దిరుగ నన్యధరణిపతులచేత
నచట నొండు కార్య మయ్యెనేని

దిక్కు గలదె బేల! త్రిమ్మరు టది యేల
చాలు నింక మగిడి చనుము పురికి.

68


ఉ.

నావుడు భూవరుండు మునినాథ!ననుం గృపఁ జూచి పల్కుచో
నీవచనంబు దప్ప దది నీతియుతం బగు వస్తురక్షకున్
దైవికమానుషంబు లనఁ దద్గుణముల్ ద్వివిధంబు లందులో
వేవురు దైవ మెక్కు డన వేవురు నుద్యమ మెక్కుడం డ్రిలన్.

69


ఉ.

ఈయెడఁ గర్మభూమియగు డెవ్వరికైనను బుద్ధి నేర్పునం
జేయఁగ లేదు కాల మెడచేసిన నేతము లెత్తి కాల్వలుం
బాయలుఁ గోళ్ళు నూతులును బావులు రాట్నములున్ జలార్థమై
చేయఁగనాయెఁ గాక మఱి చేయనినాఁ డవి తామె పుట్టునే.

70


క.

ధాత మును నోరుఁ గన్నులుఁ
జేతులు దగ నిచ్చి కుడువఁ జేకూర్చినచోఁ
జేతఁ గడి యందుకొనఁడే
నాతఱిఁ గడి యేగి వచ్చి యంగిటఁ బడునే.

71


క.

ఉత్తముఁ డుద్యోగఫలా
యత్తుఁడు భాగ్యాభిలాషి యధముఁడు రెంటం
జిత్తంబు గొల్పు మధ్యముఁ -
డుత్తముకడ నుండ లక్ష్మి యొడఁబడు నెపుడున్.

72


వ.

అట్లయ్యును మానుషకృత్యంబున కుపహతి గలదు గాని దైవకృతంబునకుఁ జేటు లే దని మున్ను నాకుఁ బ్రసన్నుండైన పరమేశ్వరునిమీఁద భారం బిడి నిశ్చింతుండ నై చరియింపుదు.

73


ఆ.

లావు లేని వేళ దైవంబు గలిగిన
నెచట నైన లక్ష్మి యేగుదెంచు

నడవిఁ జొచ్చినంత యక్షులకృపఁ జేసి
రాజశేఖరునకు రాజ్యమయ్యె.

74


రాజశేఖరునికథ

ఉ.

నావుడు రాజశేఖరుఁడు నా నతఁ డెవ్వఁడు యక్షదైవసం
భావన యెట్లు గల్గె జనపాలక! యాకథఁ జెప్పు మన్న నా
భూవరుఁ డిట్లనున్ ద్రవిళభూమివరుం డతఁ డాజి శత్రులం
బ్రోవులుగా నొనర్చి సిరి వొందఁగ రాజ్యము సేయుచుండగన్.

75


ఉ.

నొచ్చినవారి సూను లగునూర్వురు రాజులు దండుగూడి పై
వచ్చినఁ గోటలోనఁ బరివారము గొంచెము గావున న్వడి
న్విచ్చి చనంగ నానృపతి వేగమ పత్నియుఁ దానుఁ గానలోఁ
జొచ్చి నిగూఢమార్గమున సుక్కుచుఁ గందుచు లోనఁ గుందుచున్.

76


ఉ.

అక్కడఁ బ్రొద్దు గ్రుంకఁగ మహావటవృక్షముఁ జేరి విన్ననై
చెక్కిటఁ జేయిఁ జేర్చి తనచేడియ చింత మునుంగ నాత్మలోఁ
బొక్కుచు నిద్రలేక తలపోయఁగ నానడురేయి వింతగా
నెక్కటి మఱ్ఱిమీఁద గల యేవురు యక్షులు కార్యదక్షులై.

77


చ.

మనకు విహారదుర్గ మగు మద్రపురంబున కీశుఁ డైన యా
జనపతి నిన్నఁ జచ్చె మఱి సంతతి లేదు తదీయరక్ష కె
వ్వని నిఁక నిల్పి రాజ్యసుఖవైభవ మిత్తము చెప్పుఁ డంచు నే
ర్పునఁ దమలోనఁ గూడి తలపోయుచునుండఁగ నొక్కఁ డిట్లనున్.

78


ఉ.

ఇంతవిచార మేల మన కీవటవృక్షముక్రింద నున్న భూ
కాంతుని నప్పురంబునకు గర్తగఁ జేయుద మెల్లి నావుడున్
సంతసమంది యందఱును సమ్మత మౌ నిది యంచుఁ బల్కినం
జింత దొఱంగి యానృపతి చెల్వయుఁ దానును నుల్లసిల్లగన్.

79

ఉ.

ఆకమలాప్తసూతుఁ డుదయాద్రికిఁ జేరుచుఁ దూర్పుదిక్కునం
జేకొని కెంపుగుంపు గొనఁ జేయుచుఁ దారల పెంపు డింపఁగా
జీకటి రాజశేఖరుని చీకటితోడన కూడి పాయఁగా
నాకడ యక్షు లాతనికి నప్పురమార్గముఁ జెప్పి యంపఁగన్.

80


ఉ.

భాస్కరుఁ డంతలో నుదయపర్వత మెక్కఁగ భూవిభుండు శ్రే
యస్కరి యైనలక్ష్మిక్రియ యంగనతోడుగ నేగి కానలోఁ
దస్కరమార్గము ల్గడచి దవ్యులఁ [1]గాంచెఁ దటాంతకీలితా
హస్కరరత్నజాలవలయం బగుయక్షవిహారదుర్గమున్.

81


ఉ.

ఆనగరంబుచేరువ వనాంతముఁ జొచ్చి సరోవరంబులో
స్నానము చేసి భాస్కరుని సౌరజపంబునఁ గొల్చుచుండఁగా
మానవు లెల్ల నెవ్వనికి మద్రపురాధిపతిత్వ మిత్తమం
చూనినచర్చనున్నయెడ నొయ్యన యక్షులు బుద్ధి గొల్పినన్.

82


క.

మదకరిణిచేతి కొకచ
క్కదనపు వనమాల[2] యిచ్చి కదలించినచో
నది యెవ్వని మెడ నిడియెను
విదితంబుగ నతఁడె మనకు విభుఁడౌ ననుచున్.

83


క.

అందఱు నొకమదహస్తిని
నందముగ నలంకరించి హస్తాగ్రమునం
జెందొవలదండ యిడి వే
డ్కం దూర్యధ్వనులు[3] చెలఁగఁ గదలించినచోన్.

84


క.

జంభారి నెదురుకొనఁ జను
కుంభీంద్రునితోడి పిడియొకో యిది యనఁగాఁ

గుంభిని పురి వెల్వడి యా
కుంభినిపతియఱుత దండ కొమరుగ వైచెన్.

85


వ.

ఇట్లేనుఁగు పువ్వులదండ మెడ వైచిన.

86


ఉ.

ఆద్రవిళేశుఁ డాత్మసతి యప్పురలక్ష్మియఁ బోలె మున్నుగా
భద్రగజంబు నెక్కి కవిపాఠకగాయకకీర్తనీయుడై
మద్రపురంబు సొచ్చెఁ దను మంత్రులు గొల్వ మహాసనస్థుఁడై
రుద్రసఖుండువోలె నతిరూఢికి నెక్కె నుదారసంపదన్.

87


మ.

రమణీచందనగీతవాద్యకుసుమస్రగ్వస్త్రభూషాదిభో
గములం గోరికి మూరిఁబోవ నతిసౌఖ్యం బందుచు న్మంత్రివ
ర్గము కార్యంబులు దీర్పఁ పౌరు లనురాగం బంది నందింప రా
జ్యము సేయంగ సహింపలేక బలిమి న్సామంతభూమీపతుల్.

88


ఉ.

ఎక్కడివాఁడొ వీఁడు మన మిందఱ ముండఁగఁ దేరకాఁడు దా
నిక్కడఁ జేరి మద్రపుర మేలెడి వీనికి రాజ్యమిం కిటం
డక్కిన హాని యౌ నని కడంగి తదుద్ధరణాభిలాషులై
యొక్కెడ దండు గూడుకొని యుక్కునఁ గోటకుఁ జుట్టుముట్టినన్.

89


ఆ.

అపుడు సంధిమాట లైన నాడింపక
దొరల నైనఁ బోరి కరుగుఁ డనక
ధరణివల్లభుండు తానైనఁ గదలక
యతివతోడ నెత్త మాడుచుండె.

90


వ.

అయ్యవసరంబున మంత్రులును దొరలును బరివారంబును వైరు లెత్తివచ్చి కోటమీఁద విడిసినప్పుడు నీ వూరకునికి రాజధర్మం బగునే మాకునైన సెల వాన తిమ్మనిన వినియు విననిభంగి నున్నఁ దత్కాంతారత్నంబు పాచికలు చేతంబట్టుకొని.

91

ఆ.

తఱిమి సామదానదండభేదములలో
నొకట నైన వైర ముడుపవలయుఁ
బగతు రెల్లఁ గూడి పై నెత్తివచ్చిన
నెత్త మాడుచుండ నీతి యౌనె[4].

92


క.

అనవుడు జనవల్లభుఁ డిది
మనచేతల నౌనె [5]దైవమాయాగతమై
చననున్నవి చను నెచటను
మననున్నవి మను జలాగ్నిమధ్యములందున్.

93


క.

వృక్షముననున్న యేగురు
యక్షులు మనరాజ్య మొసఁగ హరియింపఁగ న
ధ్యక్షులు మన కిది పనియే
యక్షంబులు వైవు చాలు నాడుద మబలా.

94


వ.

అని యనంతరంబ తత్కృతస్మరణంబుగాఁ బలికిన మనంబున నెఱింగికొని యయ్యక్షు లక్షణంబ మన మిచ్చిన రాజ్యంబున కుపద్రవంబు పుట్టుచున్నయది యొకయుపాయంబు తర్కింపవలయు నని వచ్చి యాకూడిన రాజులలోఁ బరస్పరవైరంబును మనోవైకల్యంబును బుట్టించిన నాదండు రెండట్టలై.

95


మ.

తమలోఁ బోరుచు నస్త్రఘట్టనసముద్యద్బూరివహ్నిస్ఫులిం
గము లాశాంతములం బిశంగములుగా గావింపగా బాహువి
క్రమముల్ చూపి గజాదిసైన్యములు మ్రగ్గం దోరమై రక్తపూ
రము కెంధూళి నణంపఁగాఁ గడఁగి రారాజన్యు లాజి న్వడిన్.

96

ఉ.

అక్కలహంబు చూచి చని యానృపశేఖరుఁ డాజి భూమిలోఁ
జిక్కిన యశ్వరత్నములు సింధురబృందములు న్రథంబులుం
బెక్కుధనంబు లస్త్రములు భేరులు జోళ్ళును గోటలోనికిం
గ్రక్కునఁ గొంచు నేగి యధికం బగుసంపద నేలె నప్పురిన్.

97


వ.

అనిన విని యయ్యవధూతకుం డిది భాగ్యం బంటి వేని పూర్వకృతసుకృతివిశేషంబున నిది లభించెం గాక కానినాఁ డిటు గా నేర్చునే తొల్లి నేఁడునుం జేయవేని నింతియ కాదు యక్షసహాయంబు గలిగియు నుద్యోగి యయ్యరణ్యంబు గడచి మద్రపురంబుఁ జేరిన కతంబున రాజ్యంబు గలిగెం గావున దైవంబున కుద్యోగంబు ఫలసాధకం బగు నది కారణంబుగ నీవును రాజ్యం బేమఱక పాలింపు పొమ్మని వీడ్కొలుపుచు.

98


క.

నీమహిమకుఁ గడు నెలవగు
భూమీశ్వర! భూమి నిది యపూర్వం బనుచుం
గామితఫలదాయకమై
లేమి యుడుపు చంద్రకాంతలింగము నిచ్చెన్.

99


క.

ఇచ్చినఁ గైకొని పురికి
న్వచ్చునెడ న్విప్రుఁ డొకఁడు వదనము వాడ
న్వెచ్చని యూర్పుల నాఁకట
వచ్చుచుఁ జనుదెంచి మనుజవిధు దీవించెన్.

100


ఆ.

మూఁడు దినము లయ్యె వేఁడంగ నెచ్చట.
గమికెఁడన్న మైనఁ గలుగదయ్యె
గ్రాసమాత్రమేమి గలిగిన నా కిచ్చి
నన్నుఁ గరుణ బ్రోవుమన్నఁ జూచి.

101


క.

ఇక్కడ నన్నము దొరకదు
ది క్కితనికి నెద్ది పసిఁడి దినరా దిఁ

యక్కఱకు నడ్డ మగు నని
లెక్కింపక చేతి సిద్ధలింగము నిచ్చెన్.

102


వ.

ఇచ్చిన.

103


శా.

ఆవిప్రుండు మణిప్రభావమున దివ్యాకారుఁడై క్షుత్పిపా
సావైకల్యము లెల్ల బాసి చనియెన్ క్ష్మాపాలు దీవించుచున్
దేవేంద్రప్రతిమానుఁ డౌనతఁడు నాదేశాంతరవ్యాప్తి నా
కీవెంటన్ హిత మయ్యె నంచుఁ గళతో నేతెంచె నుజ్జేనికిన్.

104


ఆ.

నీకు నట్టిగుణము లేక యీగద్దియ
నెక్కరాదు చలము దక్కు మనిన
నచ్చెరువు బ్రియంబు నొచ్చెముఁ బెనఁగొనఁ
దిరిగి భోజుఁ డంతిపురము సొచ్చె.

105


వ.

అంతటఁ గొన్ని దినంబు లరిగిన.

106


పదునైదవకథ

క.

కమలారిఁ గమలహితదృ
క్కమలుని గమలాంకనాభికమలాకరునిం
గమలాంకరమణిరమణుం
గమలాసనహృదయకమల కమలప్రియునిన్.

107


క.

మదిఁ దలఁచుచు భోజుం డొక
సుదినంబున నెక్కఁ గోరుచుం జనుదేరన్
మొదలనె వారించుచు నా
పదియేనవబొమ్మ యిట్లు పలికెం బెలుచన్.

108


క.

మర్యాద యెఱుఁగ విది తగు
కార్యమె యీవిక్రమార్కుకరణిని నీకున్

ధైర్యము సాహసమును నౌ
దార్యమ్మును లేక యెక్కఁదగవే దీనిన్.

109


వ.

అనవుడు నతని సాహసాదికోదారభావంబు లెట్టి వనిన నప్పాంచాలిక సప్రపంచంబుగా ని ట్లని చెప్పం దొడంగె.

110


ఉ.

ఏ మని చెప్పఁ దక్కిన నరేశ్వరు లెవ్వరుఁ గారు గాని నేఁ
డీమహి విక్రమార్కవిభు నీడున కౌదు రమోఘబాణసం
గ్రామమున న్రతి న్విమతఖండన మై బలిమి న్ముఖప్రభన్
రాముఁడుఁ గాముడుం బరశురాముఁడు భీముఁడు సోముఁడుం గదా.

111


ఆ.

అట్టి మనుజవిభుఁడు భట్టి ప్రధానిగా
నయ్యవంతి నేలు నాదినములఁ
గలఁడు వేదవేది ఘనుఁడు ధర్మజ్ఞుఁడు
సుశ్రుతుండు నాఁగ నాశ్రితుండు.

112


ఉ.

సుశ్రుతుఁ డెల్లతీర్థములుఁ జూచెద నంచు దృఢవ్రతస్థుఁడై
యాశ్రితకల్పవృక్ష మగు నాపతిపంపున నేగి ధర్మస
మ్మిశ్రముగా సుదేశములు ముట్టుచుఁ బుణ్యముఁ గూడఁబెట్టుచు
న్విశ్రుత మైనతన్మహిమ నించు వెసం జనియం బ్రయాగకున్.

113


మ.

తరగ ల్చేతులు పక్షిజాతములకూఁత ల్కంకణక్వాణముల్
[6]నురువు ల్తెల్లని చామరంబు లన నన్యోన్యంబు నుప్పొంగుచు
న్సరి గంగాయమునల్ తగం గొలువఁగా ఛాయావటచ్ఛత్రసం
స్ఫురణం జెల్వగు తీర్థరాజ మచటం జొచ్చెం బ్రశంసించుచున్.

114


క.

నీలము ముత్యముఁ గూర్చిన
పోలిక హరిహరులు గూడుపొందున నొకచోఁ

గ్రాలెడి గంగాయమునల
నోలాడె నినుండు మకరయుతుఁ డౌ వేళన్.

115


మత్తకోకిల.

అందు భక్తులు ముక్తిత్రోవకు నందుకోలగు నందమౌ
బిందుమాధవదేవునిం గని ప్రీతిఁ గొల్చి వినీతుఁడై
యిందుశేఖరు విశ్వనాథు ననేకభంగులఁ గొల్చునా
పొందుచేకుఱ నేగె విప్రుఁడు పుణ్యరాశికిఁ గాశికిన్.

116


వ.

అచ్చటం గదలి య ట్లేగి యష్టభైరవేశ్వరంబును, భూతభైరవేశ్వరంబును, గాలభైరవేశ్వరంబును, గపాలేశ్వరంబును, బాతాళభైరవేశ్వరంబును, మతంగేశ్వరంబును, జంబుకేశ్వరంబును, మణికర్ణికేశ్వరంబును, సాంబాదిత్యంబును, గరుడాదిత్యంబును, లోలార్కంబును, బిందుమాధవంబును మున్నుగాఁగల బహుకోటితీర్థంబులచేత నలంకృతంబైన పంచక్రోశంబుఁ బ్రవేశించుచుఁ దద్గుణప్రశంసోన్ముఖుండై.

117


క.

శివుఁ డిందుఁ బడ్డవానికి
జెవి మంత్రముఁ జెప్పఁ బూని శిర మటు వంపన్
శవముపయిఁ బడినసురనది
శివపదరాజ్యోచితాభిషేకము సుమ్మీ.

118


క.

ఉడుమైనఁ దొండయైనను
గడఁజైనను దుప్పియైనఁ గడువెస వీటం
బడునప్పుడె పురుషుండును
బడఁతియు నగురూపు వడసి పడనేరదటే.

119


వ.

అని కొనియాడుచు.

120


శా.

ప్రాలేయాచలచందనద్రవసుధాప్రాచుర్యవీచీలస
త్కేలీడోలవిశాలశీలసుమనఃస్త్రీజాలఫాలస్థలా

వ్యాలోలాలకమాలికానుకలనావ్యాలంబరోలంబలీ
లాలోలాంబుజచిహ్నితం గనియె మధ్యాహ్నంబునన్ జాహ్నవిన్.

121


వ.

కని యందు నిమజ్జనం బొనర్చి భస్మత్రిపుండ్రాదిశైవలక్షణలక్షితుండై సకలదేవతారాధ్యు విశ్వేశ్వర శీమన్మహాదేవుని సందర్శించి సాష్టాంగదండప్రణామంబు లాచరించి నిటలతటకరకమలపుటుండై నుతియించుచు.

122


శా.

వింటి న్సర్వపురాణము ల్దివిజు లేవెంట న్నినుం బోలలే
రంటం దీర్ఘవిలోకనాజపతపోయజ్ఞాదిపుణ్యంబు లొం
డొంటి న్మీఱఁగ భాగ్యవైభవము నేఁ డుప్పొంగ ముక్కంటి ని
న్గంటిన్ జన్మఫలంబు గంటి నిచటం గాశీశ విశ్వేశ్వరా!

123


మ.

నిను జూడం జనుదెంచు నప్పుట నెద న్నెక్కొన్న మార్గశ్రమం
బున విచ్ఛాయములైన భక్తుల పదాంభోజంబు లత్యంత న
మ్రనిలింపావళిమౌళిరత్నములచే రక్తాతిరక్తప్రభం
గనుపట్టున్ శివరాజ్యపట్ట మగుచుం గాశీపురాధీశ్వరా.

124


వ.

అని కొనియాడి కృతకృత్యుండై యందు మాసత్రయంబు గడపి పదంపడి ఫల్గునవర్థనంబును, జిహ్వాలోలంబును, దక్షిణమానసంబును, నుత్తరమానసంబును, బ్రహ్మసరోవరంబును మున్నుగాఁ గల స్థలంబులఁ బితృపిండప్రదానతర్పణపరుండై, పితృముక్తికారణంబు లగునీశానవిష్ణుకమలాసనకార్తికేయవహ్నిత్రయార్కరజనీగణేశ్వరాది దేవతాచతుర్దశపాదంబులను, నక్షయవటచ్ఛాయయు, జనార్దనహస్తంబును మొదలగు స్థలంబుల గల్పితపితృతర్పణుండై గదాధరునకుం ప్రణమిల్లి, యుగళగౌరికి మ్రొక్కి మగిడివచ్చుచో నొకమహావనంబున.

125


సీ.

కన్యకాధీనమై ఘనవైభవంబుతో
        మణిమయప్రాకారమహిమ గలిగి

పురుషవర్జిత మైన పురము గనుంగొని
        యట నొక్కదేవాలయంబుఁ జేరి
దానిచేరువ నుక్కునూనెకొప్పెరపొంత
        విపులమౌ కనకమండపముక్రింద
మోహనం బైన వివాహవేదికమీఁది
        [7]రత్నపట్టికలోని వ్రాఁత చూచి


ఆ.

నరుఁడు తైలకటాహంబు నడుమఁబడిన
నెఱయఁ గందర్పసంజీవినీసమాఖ్య
నమరుకన్యయు రాజ్యంబు నతనిసొమ్ము
లనుచు నేర్పడియున్న పద్యంబు చదివి.

126


వ.

దానికి విస్మయభయసంశయాన్వితుండై.

127


క.

ఈయుడుకునూనె డగ్గఱఁ
బోయినఁ దాఁ జచ్చుఁబో యీవిభవం
బేయనుభవమున కగు నని
డాయక మది నులుకు మిక్కుటంబై మగిడెన్.

128


క.

ఉజ్జయిని కరుగుదెంచి సు
హృజ్జనములఁ గూడి వార లెల్లం బ్రీతిం
బజ్జం జనుదేరంజని
యజ్ఞనవల్లభుని నుతుల నభినందించెన్.

129


క.

ఆవిక్రమార్కుఁ డతిసం
భావనమైఁ గుళల మడిగి పరభూముల నీ

వేవెంటఁ దిరిగి చోద్యము
లేవేఁ జూచితివొ చెప్పు మేర్పడ నన్నన్.

130


సీ.

ధరణీశ యెల్లతీర్థంబులు చూచుచు
        వెలసిన త్రిస్థానములకు నేగి
మగిడియేతెంచుచో మాణిక్యమయమైన
        పురములో గుడియొద్దఁ బొంగిక్రాఁగు
నూనెకొప్పెరఁ గంటి నానూనెలోపలఁ
        బడ్డవారికి నట్టిపట్టణంబు
నందులకన్యయు నగపడు నని యున్న
        పద్యంబుఁ జూచితిఁ జోద్యమదియు


ఆ.

ననిన సాహసాంకు డచ్చెరువందుచు
నాపురంబు చూత మనుచుఁ గదలి
చనియె నతనిఁ గూడి శస్త్రసహాయుఁడై
దుర్గమంబు లైనమార్గములను.

131


వ.

చని చని యచట దేదీప్యమానం బైనపురంబు సొచ్చి తద్విభవంబు వర్ణించుచు ముందఱ నతిసుందరంబైన పందిరిక్రింద సువర్ణమయజలపూర్ణకలశంబులను మృగనాభిలేపనంబులను, ముక్తాఫలరంగవల్లికలను, గనకరంభాస్తంభంబులను, రత్నతోరణంబులను నలంకృతంబైన వివాహవేదికపై పలకలోని పద్యంబు చూచి సముత్సుకుండై.

132


క.

చేరువగుండములోపలఁ
గోరికతో జలకమాడి గుడిలో లక్ష్మీ
నారాయణులం గాంచియు
ఘోరం బగు నుడుకునూనెకొప్పెరఁ జేరెన్.

133


వ.

ఇట్లు చేరి.

134

క.

సలసలఁ గ్రాఁగెడు తైలము
కొలఁది యెఱుఁగఁ దలఁచు భంగి గుణరత్నసము
జ్జ్వలుఁడు గుబేలున నుఱికెను
జలనిధిలో నస్తమించు జలజాప్తుక్రియన్.

135


వ.

అంత సంధ్యాంగనయుం బోలె హరిచందనారుణపయోధరభారయు నారక్తాంబరయు వికసదిందీవరాక్షియు రాగవతియు నైన కందర్పసంజీవనీనాగకన్య చనుదెంచి నిజవిద్యాప్రభావంబున నారాజుం బునరుజ్జీవితుం జేసిన.

136


ఆ.

జలజకాంతి మెఱయ జలధి వెల్వడి తూర్పు
గొండ యెక్కునట్టి యెండఱేని
చొప్పు దోఁప నూనెకొప్పెర వెల్వడి
నిలిచె విప్రుమోము తెలివి కెక్క.

137


ఉ.

ఆతనిఁ జూచి కన్య వినయంబున మ్రొక్కి యమేయసాహస
ఖ్యాతచరిత్ర! నాదువ్రతకల్పత నేఁడు ఫలించె నే నిఁక
న్నీతగుదాసి నైతిఁ గరుణింపుము రాజ్య మనుగ్రహింపు సం
ప్రీతి యొనర్చుదానఁ దగురీతి ననుం బని పంపు మిత్తఱిన్.

138


ఉ.

నావుడు దాసివేని విను నావచనం బిఁకఁ ద్రోపుసేయ కీ
దేవసమానునిన్ ధరణిదేవుని సుశ్రుతు నాశ్రయింపు త
ద్భావము వల్లవింప నని పార్థివుఁ డానతి యిచ్చె నంత ల
జ్జావనతాస్య యౌచు నెదురాడక లేమ వరించె విప్రునిన్.

139


మ.

ధరణీనాయకుఁ డిట్లు చేకుఱినకాంతారత్నమున్ రాజ్యమున్
ధరణీదేవున కిచ్చ నిల్పి తనయత్నం బీగతిన్ ధర్మసం
చరణాసక్తి ఫలించె నంచు మదిలో సంతోష ముప్పొంగఁగా
నరుదెంచె న్నిజదానధర్మగుణగణ్యం బైన యుజ్జేనికిన్.

140

క.

విను మదికారణముగ నో
జననాయక యెక్కఁ దగదు చను మనవుడు నె
మ్మనమున నచ్చెరు వందుచు
మనుజేంద్రుఁడు సదనమునకు మగుడంజనియెన్.

141


శా.

ఉష్ణాంశుద్విజరాజలోచను నపాయోపేతతావచ్ఛిదా
నిష్ణాతస్థిరతత్త్వబోధమయమౌనస్వాంత పంకేజవ
ర్తిష్ణుఁ న్విష్ణు నగణ్యపుణ్యధనవర్దిష్ణు గదాధృష్ణు భ్రా
జిష్ణు న్సంతతకృష్ణకాంతిచయరోచిష్ణుం దమోజిష్ణునిన్.

142


ఉ.

నిర్జరసిద్ధసాధ్యభజనీయపదాంబుజయుగ్ముఁ దిగ్మపా
దార్జునరశ్మిమారుతహితాక్షుని రక్షితయక్షరక్షకున్
గర్జితభాసురప్రళయకాలసమంచితపంచవక్త్రు న
త్యూర్జితతర్జనాచరణదుర్జయు దుర్జనదూరు ధూర్జటిన్.

143


మాలిని.

ప్రవిమలతరచిత్తా బ్రహ్మసంస్తుత్యవృత్తా
భువనభరితకీర్తీ పుణ్యలావణ్యమూర్తీ
దివిజభరణలోలా దీనరక్షానుకూలా
భవమురరిపురూపా భాగ్యభోగ్యస్వరూపా.

144


గద్యము.

ఇది రాయగజగంధవారణ వైరిమండలీకభేకఫణింద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణావింద సనదప్రోలిపురవరాధీశ్వర వెలనాఁటి పృథివీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొరవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతం బైనసింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కుని ధైర్యసాహసౌదార్యప్రశంస యన్నది షష్ఠాశ్వాసము.

  1. గాంచెను రత్నకారితాహస్కరరత్నరాజినిలయంబగు
  2. చక్కద మగువనమాల
  3. వెనుకం దూర్యధ్వనులు
  4. పైవచ్చి విడిసిన యపుడు నెత్తమాడ నర్హమగునె
  5. దైవమతమేగతి యోచన నున్నవి వేగమచను
  6. అరుదౌ ఫేనము వెల్లచామరలనన్
  7. పసిండిఘంటికలోని