సింహాసనద్వాత్రింశిక/పీఠిక
సింహాసన ద్వాత్రింశిక
పీఠిక
"సింహాసన ద్వాత్రింశిక" అను ఈ కథాకావ్యమును కొరవి గోపరాజు రచించెను. ఇందు విక్రమార్కుని దివ్యసింహాసన సోపానములపై ఉన్న 32 సాలభంజికలు భోజరాజునకు చెప్పిన కథలున్నవి. ఈ కావ్యమును ఆంధ్ర సాహిత్య పరిషత్తు (కాకినాడ) వారు మొదట ద్వితీయ భాగమును 1933 లోను, ప్రథమభాగమును 1936 లోను ప్రకటించినారు. ప్రత్యంతరములు లభింపనందున అపపాఠములు చాల దొరలినవి. ముద్రిత గ్రంథములందు అధస్సూచికలలో కొన్ని పాఠము లీబడినవి. అన్నిటిని పరిశీలించి ఉన్నపాఠములలో సమంజసములని తోచిన పాఠములను గ్రహించి విపుల పీఠికతో ఈ ప్రతి ప్రకటింపబడినది. తెలుగులోని కథాకావ్యములలో నిది గణింపదగినది.
కథాకావ్యములు :- తెలుగులో కేతనకవి చంపూరూపమున 'దశకుమార చరిత్ర'ను రచించి కథాకావ్యములకు శ్రీకారము చుట్టెను. అది దండి మహాకవి సంస్కృతమున రచించిన గద్యకావ్యమున కనువాదము. తరువాత మంచన కేయూరబాహు చరిత్రను వ్రాసెను. అది రాజశేఖరుడు ప్రాకృతభాషలో రచించిన 'విద్ధ సాలభంజిక' అను 'సట్టకము' నందలి కథను గ్రహించి కొన్నిమార్పులు చేసి, మధ్య మధ్య కొన్నినీతికథలను చేర్చి వ్రాసినట్టిది. ఆ పిమ్మట జక్కన 'విక్రమార్క చరిత్రము' ఈ కోవలో మూడవది. ఇది కథాసరిత్సాగరము, బేతాళ పంచవింశతి, సంస్కృత విక్రమార్క చరిత్రముల నుండి కథలను తీసికొని వ్రాసినట్టిది. తరువాత అనంతామాత్యుడు 'భోజరాజీయము'ను రచించెను. పిదప కొరవి గోపరాజు ఈ సింహాసన ద్వాత్రింశికను వ్రాసెను. ఇది సంస్కృత విక్రమార్క చరిత్రకు పూర్తిగ అనువాదమైనను గోపరాజు సందర్భానుసారముగ అందందు అనేక విషయములను మఱికొన్ని కథలను చేర్చినాడు . ఆ తరువాత పుత్తేటి రామభద్ర కవి 'సకలకథా సారసంగ్రహము' ను, వెన్నెలకంటి అన్నయ్య 'షోడశకుమార చరిత్ర'ను, కూచిరాజు ఎర్రన్న 'బేతాళ పంచవింశతి'ని, పాలవేకరి కదిరీపతి 'శుక సప్తతి'ని, అయ్యలరాజు నారాయణామాత్యుడు 'హంసవింశతి'ని, ఎర్రన 'సకల కథా నిధానము'ను రచించిరి. ఇవన్నియు కథాకావ్యములే. ఇవి అనల్పకల్పనా సామర్థ్యముతో ప్రబంధ ఫక్కిలో వ్రాయబడిన మనోహర కావ్యములు.
కవి వంశము- కావ్యావతారికలో గోపరాజు తన వంశక్రమమును ఇట్లు తెలిపెను.
'గోపరాజు నియోగి బ్రాహ్మణుడు, హరితస గోత్రుడు. 'కొరవి' అను గ్రామమునుబట్టి ఆ యింటిపేరు వంశనామమైనది. తెలుగువారి ఇంటిపేర్లు గ్రామములను బట్టి, వారు చేయుచుండిన వృత్తులను బట్టి, వంశప్రముఖులను బట్టి ఏర్పడుచుండును. కొరవి వంశమునకు మూలపురుషుడు వెన్నామాత్యుడు. ఆయన చందవోలు రాజధానిగా తెలుగు దేశమును పాలించిన వెలనాటి పృథ్వీశ్వర రాజునకు ప్రధాన మంత్రిగా ఉండెను. దాక్షారామ శాసనములలో వెన్నామాత్యు డిట్లు ప్రశంసింపబడినాడు: “మంత్రి శిఖామణిః బుధనిధిః శ్రీ వెన్ననామాసుధీః" ఆ చందవోలు నేడు గుంటూరు మండలములో ఉన్నది వేంగీచాళుక్యులకు సామంతులైన వెలనాటిచోడవంశీయు లీప్రాంతమును పాలించిరి. గోపరాజు తన వంశమూలపురుషు నిట్లు వర్ణించెను.
“కలుష మాండలిక భేక ఫణీంద్రు డన, రాయ
గజ గంధవారణ ఖ్యాతి మెఱసి,
వీరఘోట్ట విభాళు డారూఢ బిరుద వి
రోధి కళింగనిరోధి యనఁగ,
వెలసి నానాఁటికి వెలనాఁటి పృథ్వీశ్వ
రుని రాజ్యభార ధుర్యుండనంగ,
ఆరెలు కన్నడీ లఱవలు తెలుఁగులు
దనబిరు దందియఁ దగిలి కొలువ,
నెగడి సనదప్రోలు నెలవుగా భూసుర
వంశసాగరామృతాంశమూర్తి
చక్రవర్తిమాన్య సౌజన్యధన్యుండు
విక్రమార్కనిభుడు వెన్నవిభుడు”. (1-42)
ఆ వెన్నయ పౌత్రుడు 'అమరేశ్వరుడు'. కొడుకును చెప్పక మనుమని చెప్పినందున అమరేశ్వరుడు సాక్షాత్ పౌత్రుడు కాడనియు ఆ వంశమున పుట్టిన వాడనియు గ్రహింపవలెను. అమరేశ్వరునకు గంగాంబిక యందు “అన్నయ-సింగయ' అను పుత్రులు పుట్టిరి. అన్నయను గూర్చి గోపరాజేమియు చెప్పలేదు. కాని 'ముప్పది యిద్దరు మంత్రుల చరిత్ర'లో అన్నయు దానకర్ణుడని చెప్పబడినది.
“ఘనదాన కర్ణుడై గండ పెండెముఁ దాల్చెఁ
గొరవి అన్నామాత్యకుంజరుండు"
ఈ ఆన్నయ కొడుకు పెద్దిరాజు, పల్లికొండరాజు మల్లదేవరాజుచే ఆందోళికాచ్ఛత్రచామరములు బహూకృతులుగా పొందెను (1-46). ఈ పల్లి కొండరాజ్యమెటనున్నదో తెలియదు. అన్నయతమ్ముడు సింగయకు అబ్బయ, గోపయ, సత్తెనారన అను ముగ్గురు కొడుకులు పుట్టిరి. అబ్బయకు రామరాజు, కేశరాజు, బాచిరాజు, సింగరాజు అను నలువురు పుత్రులు. వీరిలో బాచన-సింగనలు రాచకొండ నేలిన అనపోత కుమార సింగయకు మంత్రులై యుండిరి,
"ఘనులగ్రజులకు నీడై
వనములుఁ గ్రతువులును గృతులు వడి నిల్బిరి బా
చనయును సింగనయును దగి
రనపోతకుమార సింగయకు మంత్రులన౯!! (1-48)
గోపరాజు చిన్నతాత సత్తైనారన 'ఆంధ్ర కవితా పితామహు' డని భీమన అని పేరు పొంది రామాయణ కావ్యమును వ్రాసెనట (1-49). ఇతడు వ్రాసిన రామాయణము లభింప లేదు. సింగయ కుమారులలో రెండవ వాడైన గోపయకు గంగాంబ యందు కసవరాజు పుట్టెను. అతనికి వేముగల్లు రాజధానిగా నేలిన రాణా మల్లనరేంద్రునకు పరమ గురుండై శైవాచార ప్రథమ సింహాసనాధీశ్వరుడైన బ్రహ్మదేవ వడియల కూతురు కామాంబిక యందు ఈ కృతికర్త గోపరాజు పుట్టెను. తండ్రి కసవరాజు
"తంత్రముచేఁ గార్యము పర
తంత్రము గాకుండఁ బతిహితమె చేయు మహా
మంత్రులలోపలఁ గసవయ
మంత్రి విచారమున దివిజమంత్రియుఁబోలె౯. (1-54)
మంత్రియై యుండిన రాణా మల్లనరేంద్రుని గూర్చి కూడ యేమియు తెలియుటలేదు. ఆయన కొడుకు గోపరాజు,
స్థలము- గోపరాజు తండ్రి కసవరాజు వేముగల్లు పాలకుడగు రాడా మల్ల నరేంద్రునకు మంత్రియై ఉండినట్లును, తాను ఆయూరనే పుట్టినట్లును తెలిపినాడు. అవతారికలోని (1.56) పద్యమునుబట్టి వేముగల్లు రాణామల్ల నరేంద్రునకు రాజధాని అని, కొండల నడుమ ఉన్న వనదుర్గమని, అందు శ్రీ విష్ణు మందిరమున్నదని తెలియుచున్నది. ఇది ఇప్పుడెచటనున్నదో గుర్తించుట కష్టము. మహబూబ్ నగరంజిల్లా కొల్లాపురం తాలూకాలో ఒక వేముగల్లున్నది కాని అది కాదు. కరీంనగరం వరంగల్లు జిల్లాలలో వేముగలు లున్న చో వానిలో నొకటి కావచ్చును. వంశనామమునకు మూలమైన 'కొరవి' గ్రామము వరంగల్లు జిల్లాలో ఉన్నది. గోపరాజు పెదతాత కొడుకులు రాచకొండ నేలిన అనపోత కుమార సింగయకు మంత్రులుగా ఉండిరి. రాచకొండ నల్లగొండజిల్లాలోనిది. కవిస్తుతిలో వేములవాడ భీమకవికి ప్రత్యేకముగా ఒక పద్యమును వ్రాసెను. వేములవాడ కరీంనగరం జిల్లాలో ఉన్నది. ..
ఇందలి ఇరువది యొకటవ బొమ్మ కథలో మూలమున లేని భువనగిరిని (నల్లగొండ), ఓరుగంటిని(వరంగల్లు), గోదావరి నదిని, కాళేశ్వరమును (ఆదిలాబాదు), ధర్మపురిని (కరీంనగరం) వర్ణించెను. వీనినిబట్టి గోపరాజు కరీంనగరము వరంగల్లు జిల్లా ప్రాంతమువాడై యుండునని భావింపవచ్చును.
కవికాలము - ఇతని కాలమును గూర్చి పలుపురు పండితులు విశేష చర్చలు చేసి విభిన్నాభిప్రాయములను ప్రకటించినారు. శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు 1480 సం|| ప్రాంతమువాడని[1] శ్రీ కందుకూరు వీరేశలింగం పంతులుగారు 17 శతాబ్దివాడని,[2] శ్రీ చాగంటి శేషయ్యగారు 1430-90 మధ్య ఆని[3], శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు గారు 1350-1410 మధ్య అని[4], శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు శకవర్షముల 14 శతాబ్ది మధ్య గాని, చివరగాని ఉండవచ్చునని,[5] డా॥ నేలటూరి వేంకట రమణయ్య గారు 15 శతాబ్దివాడని[6], శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు 15 శతాబ్ది చివరివాడని[7], శ్రీ ఆరుద్రగారు 1500-1530 అని[8], చెప్పినారు.
ఇందరు ఇన్ని విధములుగ చెప్పుటకు ప్రధాన కారణము కొరవి వంశ మూల పురుషుడగు. వెన్నా మాత్యునకు గోపరాజు ఏడవ పురుషుడుగా చెప్ప బడుటయే. దాని సామంజస్యమును గమనింతము. కవి వంశావతారికలో వేన్నామాత్యునకు పౌత్రుడు అమరేశ్వరుడని చెప్పినట్లే, ఆశ్వాసాంత్యగద్యలలో "శ్రీ కొరవి వెన్నామాత్యపౌత్ర కసవరాజ తనూజ గోపరాజ విరచితంబైన సింహాసన ద్వాత్రింశిక" అని తనను గూడ పౌత్రునిగా చెప్పెను. దీనిని బట్టి గోపరాజునకు అయిదవ పురుఘడగు అమరేశ్వరుడు వెన్నయకు సాక్షాత్ పౌత్రుడు గాడని ఆ వంశములో కొన్నితరములు గడచిన తరువాత పుట్టినవాడని గట్టిగా చెప్పవచ్చును. ఇందువలన వెన్నామాత్యుని కాలము నుండి తరమున కన్ని వత్సరములని గుణించు బాధ తప్పినది,
గోపరాజు కాలమును తెలిసికొనుటకు రెండు ఆధారములున్నవి. ఒకటి గోపరాజు పెదతాత కుమారులు బాచన సింగయలు రాచకొండ రాజగు అనపోత కుమార సింగయ కడ మంత్రులుగా ఉండుట. ఈ సింగభూపాలురు మువ్వురున్నారు. వీరిలో అనపోత నాయకుని కుమారుడు కుమార సింగ భూపాలుడు క్రీ.శ 1430..1475 వరకు పాలించినవాడు. ఇతని కడనే బాచన సింగనలు మంత్రులుగా ఉండినట్లు తలచవచ్చును. ఇతని కోరిక పైననే బమ్మెర పోతన 'భోగినీదండకము'ను రచించెను. గోపరాజు ఈ కాలమునకు ఒక తరము తరువాత ఉండవలెను. రెండవ ఆధారము గోపరాజు పూర్వక ఏ స్తుతిలో పిల్లలమఱ్ఱి వీరరాజును పేర్కొనుట. ఆ వీరరాజు పిల్లలమఱ్ఱి పిన వీరభద్రుడనియే పలువురు పండితులు అభిప్రాయపడినారు . జైమిని భారతమును రచించి పినవీరభద్రుడు 1485-1490 సంవత్సరములలో విజయనగర సామ్రాజ్యమును పాలించిన సాళువ నరసింహ రాయలకు అంకిత మిచ్చెను. దానినిబట్టి గోపరాజు పిన వీరభద్రునకు తరువాత కొద్ది కాలముననే ఉండునని శ్రీ ఆరుద్రగారి అభిప్రొయము. శ్రీ లక్ష్మీకాంతము గారు పిన వీరభద్ర, గోపరాజులు సమవయస్కులు కాకున్నను సమకాలికులై యుందురని చెప్పిరి.
డా|| నేలటూరి వెంకటరమణయ్య గారు గోపరాజు పేర్కొన్నవాడు పినవీరభద్రుడు కాడనియు, అతని అన్న పిల్లలమఱ్ఱి పెదవీరరాజు కాదగు ననియు, అతడు శ్రీనాథునకు గురు వనియు వ్రాసిరి.[9] శ్రీనాథుడు హరవిలాస పీఠికలో కృతిభర్త అవచితిప్పయసెట్టి గురువైన “పిల్లలమఱ్ఱి మహా ప్రధాని పెద్దన్న గురూత్తముడని, శైవమార్గ సంపన్ను"డని చెప్పెను. ఆ పెద్దన్నయే పెదవీరరాజని, కవియైయుండెనని, పినవీరభద్రుని అన్నయని చెప్పుటకు ఆధారములేదు. గోపరాజు పిల్లలమఱ్ఱి వీరరాజాదులను 'దలఁతు మత్కులచంద్రుల సత్కవీంద్రుల౯' అన్నాడు. బహుశః ఆ పెద్దన్న పినవీరభద్రునకు పితామహుడేమో!
ఈ సందర్భమున మరొక విషయము గమనింపదగియున్నది. ఈ కావ్యమునందలి అయిదవ ఆశ్వాసమున పదవ బొమ్మకథలో ఒక అవధూత విక్రమార్కునకు యోగరహస్యములు తెలుపు ఘట్టమున ఒక ఆటవెలది పద్యమును వ్రాసెను.
“దుఃఖసాధ్యమయ్యుఁ దొడరి యభ్యాసంబుఁ
జేయఁ జేయ యోగసిద్ధి పెంపు
దినఁగఁదినఁగ వేము తియ్యనౌ కైవడిఁ
బిదప పరమ హర్ష పదము సుమ్ము . (5-15)
ఈ పద్యము చదువగనే వేమన పద్యము .
“అనఁగ ననఁగ రాగమతిశయిల్లుచు నుండు” అనునది వెంటనే స్ఫురణకు వచ్చును. గోపరాజు తనకావ్యమున ఆటవెలది పద్యములను విశేషముగా వ్రాసినాడు. దీనినిబట్టి గోపరాజు వేమనకు తరువాత ఉండి అతని ప్రభావమునకు లోనై యుండెనా అని తలచుటకు అవకాశమున్నది.
1500-1530 ప్రాంతము కృష్ణరాయలు అష్ట దిగ్గజముల కాలము. గోపరాజు ఆకాలమున నుండినట్లు అతని కావ్యములో ఎట్టి సూచనయు లేదు. సింహాసన ద్వాత్రింశికలో దక్షిణదేశము నందలి ఎన్నో పుణ్య క్షేత్రముల ప్రస్తావన ఉన్నది. కాని పంపా విరూపాక్షము ప్రస్తావించబడలేదు. ఏమి కారణమో తెలియదు. ఇంతవరకు తెలిసిన దానిని బట్టి గోపరాజు పిల్లలమఱ్ఱి పినవీరభద్రునకు ఈవలి వాడని మాత్రము చెప్పవచ్చును.
గోపరాజు వైద్యుష్యము : గోపరాజు తన్ను గూర్చి తన కవితానైపుణ్యమును గూర్చి కావ్యావతారికలో నిట్లు వ్రాసికొన్నాడు.
“కం. పూజితులగు కవుల కృప౯
భ్రాజిష్ణుఁడఁ గొంత అష్టభాషావిదుఁడ౯" (1-58)
వ. అని యిట్లు సకల వరప్రదాన కారణదేవతలను, జతుర హృద్యానపద్య గద్య పద్య విద్యా విద్యోతితులయిన కవీశ్వరులనుం బ్రశంసించి తత్ప్రసాదా సాదిత సహజ సాహిత్య తరంగితాంతరంగుండనై సకలజన సాధారణంబగునట్లు విన్నవించెద. (1-13)
కం. అప్పరమేశ్వరు కరుణం
గుప్పలుగొను విక్రమార్కు గుణముల కొఱకై
చెప్పెద రసభావంబులు
ముప్పిరి గొనునట్లు కథలు ముప్పడి రెండు౯. (1-31)
ఆ.వె. తన వచోవిశేష మెనయక పూర్వక
థామితోక్తిఁ జెప్పుటేమి కడిది
యొకఁడు గోలవట్టి యొయ్యనఁ గొనిపోవ
నంధుఁడెచటికైన నరుగుటరుదె. (1-34)
ఈ విధముగ గోపరాజు తన రచనా విధానమును చెప్పెను కాని ఆనుకున్నట్లు ప్రతిభను ప్రదర్శింపలేక పోయినాడు. మూలమును యథాతథముగ చెప్పనని తన వచోవిశేషమును చూపెదనని చెప్పినట్లే చేసినాడు. 'అష్ట భాషా విదుడ' నుటలో గొంత సత్యము లేకపోలేదు. సంస్కృతము, షట్‌ప్రాకృతములు తెలుగు కలిసి అష్టభాషలగును. సంస్కృతాంధ్రములలో చక్కని పాండిత్యము గలవాడనుటలో సందేహము లేదు. నాలుగవ ఆశ్వాసములోని ముక్తపదగ్రస్త నిరోష్ఠ్య దండకము, ఆశ్వాసాంతపద్యాలు అతని సంస్కృత పాండిత్యమును చాటుచున్నవి.
ప్రాకృత భాషాజ్ఞానము గలవాడనుటకు అతడొక పద్యములో ప్రాకృత భాషా పదములను వాడినాడు.
“దందశూకాధిపోద్దండ భుజాదండ
భూరి విశ్వంభరాభారధుర్య
జంభారి పరికీర్తితాంభోజినీ మిత్ర
సూణు సమాహియదాణరాయ
అక్కిణ హృదయదండొక్క కేశఃక్కేళి
పతివఃకణీవళఃపక్క డక్క
అంకక్కరిక్క మహాలద సాందన
లవలవప్పహిత తులఃకధీర
ధీరసంపదుస్తు దేవబంధకహిమ
దఃకసొక్కుమోరి దర్శనిచయ
యనుచు నాల్గుభాషలను రాజు దీవించి
నయన సంజ్ఞ నాసనమున నుండి". (2-41)
ఇందు నాల్గు భాషలనుట చతుర్విధ ప్రాకృతములనుటకు కావచ్చును . తన ప్రాకృత భాషా పరిచయము నిట్లు తెలిపినాడు. ఈ ప్రాకృత భాషా వాక్యముల కర్థమేమో ఆ భాషావేత్తలు చెప్పవలెను.
గోపరాజునకు సాహిత్య వ్యాకరణములేకాక అనేక శాస్త్రములలో తగిన పరిజ్ఞానమున్నట్లు కావ్యము నందక్కడక్కడ బహు విషయములను వివరించుటను బట్టి తెలిసికొన వచ్చును. ప్రాసంగికముగ స్త్రీజాతులు, కుశనములు, చేపల జాతులు, అశ్వజాతులు, వృక్షజాతులు, వస్త్ర విశేషములు , ఆభరణవిశేషములు, రాజనీతి, ఆంధ్రచ్చందో విశేషములు, ఛందోభేదములు , యోగశాస్త్రవిషయములు, మల్లయుద్ధ పద్దతులు, సర్పజాతులు, స్వప్న శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, గణకరీతులు, 64 కళలు, ద్యూతక్రీడా విశేషములు, వేట పద్దతులు మొదలయిన విషయములను తెలిపెను, వీనిలో కొన్ని మూలములో సూత్రప్రాయముగ ఉన్నవి. ఈ అన్నిటిలో గోపరాజునకు మంచి ప్రవేశమున్నట్లు తెలియుచున్నది
ఇతడు చతుర్విధ కవితా విశారదుడు, తనకుగల బంధకవితా చాతుర్యమును రెండు చోట్ల ప్రదర్శించెను. సంస్కృత పద ప్రయోగ నైపుణ్య మెంత కలదో అచ్చ తెలుగులలో గూడ అంతే నైపుణ్యమున్నట్లు నిరూపించు కొన్నాడు.
సంస్కృత మూలము- 'సింహాసన ద్వాత్రింశిక'స్వతంత్ర కావ్యము కాదు. ఇది సంస్కృత గ్రంథమునకు తెలుగుసేత అని కవియే చెప్పినాడు.
"ఈ సరసోక్తి కావ్యమొకఁ డిమ్ముల సంస్కృత భాషనచ్చుగాఁ
జేసిన నట్ల వీఁడు మఱి చేయుట యేటిది యంచుఁ జెప్పఁగా
జేసి యనాదరం బురక చేయకుఁడీ విలుకాఁడు తూఁటుగా
నేసిన నందే పాఱ మఱి యేసినవానిద సూటిగావున౯.” (1-35)
ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి ప్రథమ ముద్రణమును పరిష్కరించి పీఠిక వ్రాసిన శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు “దీనికి మూలము కథా .సరిత్సాగరము. ఆ సాగరము నుండి ఈ రత్నము నెత్తి చక్కగా సానబట్టి ఆంధ్ర సరస్వతికిఁ బూజ యొనర్చిన మహాకవి గోపరాజు అని వ్రాసినారు. అదే సుదర్భమున అధస్సూచికలో “అచ్చు పడిన సంస్కృత . మూలమొక్కటి విక్రమార్క చరిత్రము (గద్యపద్యాత్మికము) కలదు. కాని యందుగల కథల వరుస యిందు వానరాదు. విషయములును భేదముగా ఉన్నవి" అని చెప్పిరి.
కాని శ్రీ శాస్త్రి /గారు కథా సరిత్సాగరమును గాని, సంస్కృత విక్రమార్క చరిత్రమును గాని సరిగా పరిశీలింపలేదు. సింహాసన ద్వాత్రింశికతో పోల్చిచూడలేదు. కథా సరిత్సాగరమున విక్రమార్కుని కథలు, బేతాళ పంచవింశతి కథలు ఉన్నవి. కాని గోపరాజు వానిని గ్రహింపలేదు. ఆ కథలకును తెలుగు కావ్యమునందలి కథలకును పోలికలే లేవు. అవి భిన్నముగా ఉన్నవి.
గద్యపద్యాత్మకమైన ఒక సంస్కృత విక్రమార్క చరిత్రమును వావిళ్ళవారు. 1936లో ప్రకటించిరి. అదియే గోపరాజు అనువదించిన మూలగ్రంథము. ఆ సంస్కృత మూలమును పూర్తిగా గ్రహించి గోపరాజు మఱి కొన్ని కథలను సమకాలిక జనజీవన విశేషములను చేర్చి “సింహాసన ద్వాత్రింశిక" అనుపేర ఈ కథాకావ్యమును రచించెను.
కీ.శే. మల్లంపల్లి సోమశేఖర శర్మగారు గోపరాజు అనువదించిన మూలమేదో తెలియదనిరి'. డా|| నేలటూరి వేంకటరమణయ్య గారు 'దీని మాతృక యెద్దియో తెలియదు. ఆ సంస్కృత మూలము కాకతీయ యుగమున క్రీ. శ. 1200-1323ల మధ్య రచింపబడి యుండును[10] అని చెప్పిరి[11], అందుకు ఆధారాలు చూపలేదు, కేవలము వారి ఊహయే ఆధారము.
పాల్కురికి సోమనాథుని శిష్యుడు ఏకామ్రనాథుడు (1330 ప్రాంతము) "సింహాసన ద్వాత్రింశిక" అను వచన గ్రంథమును వ్రాసినట్లును, అదే పేరుతో ఒక ద్విపద రచన గూడ ఉన్నట్లును శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు గారు వ్రాసినారు[12] . గోపరాజు సంస్కృత మూలమును ఈ వచన ద్విపద గ్రంథములను చూచియే ఈ కావ్యమును రచించినాడని తలప వచ్చును. 1520 ప్రాంతమున నుండిన యాదవామాత్యుడు వచనములో విక్రమార్కుని చరిత్రను వ్రాసినట్లును, అందు విక్రమార్కుని సింహాసనము మీది 32 బొమ్మలు చెప్పిన కథలున్నట్లును, ప్రతి కథముందు ఒక పద్యము వ్రాయబడినట్లును శ్రీ ఆరుద్రగారు చెప్పిరి[13]. సంస్కృత విక్రమార్క, చరిత్రనే గోపరాజు పూర్తిగా అనువదించి అక్కడక్కడ పెంచెనని శ్రీపింగళి లక్ష్మీకాంతము గారు వ్రాసిరి[14].
గోపరాజు ఆనుసరించిన సంస్కృత విక్రమార్క చరిత్ర యొక సంకలన గ్రంథము. ఇది గద్య పద్యాత్మికము. గద్యము సరళముగ సుందరముగ ఉండి సాధారణ జ్ఞానము గలవారికిని సులభముగ అర్థమగునట్లున్నది. శ్లోకములు స్మృతుల నుండి, సుభాషిత గ్రంథములనుండి, నీతి శాస్త్రముల నుండి, కావ్యముల నుండి, పంచతంత్రము నుండి గ్రహింపబడి, సందర్భోచితముగ కూర్చబడినవి. ఈ గ్రంథ సంగ్రథనకారుడెవరో తన పేరు తెలుపుకొనలేదు. ఇందు ద్వాత్రింశోపాఖ్యానములు విడివిడిగా ఉన్నవి. ప్రతి ఉపాఖ్యానము కథాసంగ్రహము గల ఒక శ్లోకముతో ప్రారంభమగును , మూలము
"శ్రీ పురాణపురుషం పురాంతకం
పద్మసంభవముమాసుతం మయా
సంప్రణమ్యచ సురా౯ సరస్వతీం
విక్రమార్క చరితం విరచ్యతే"
ఆను స్తోత్రముతో ప్రారంభమై
“శ్రీమతో విక్రమార్కస్యచరితం మహిమోత్తరం
ద్వాత్రింశత్ప్రతిమాప్రోక్తం సమాప్తి మగమత్తరాం"
సంస్కృత మూలకథలు :
ప్రథమోపాఖ్యానము- ఉజ్జయిని రాజధానిగా మాళవ దేశమును భర్తృహరి పాలించుచుండెను. అతడు భార్య అనంగసేన దుష్ప్రవర్తన వలన విరక్తుడై , తమ్ముడగు విక్రమార్కునకు పట్టము గట్టి అడవులకు పోవును. విక్రముడు రాజై తన సాహస కృత్యములచే బేతాళుని వశము చేసికొని ప్రజారంజకముగ రాజ్యమేలెను. స్వర్గమునకు బోయి రంభా ఊర్వశుల వివాదము తీర్చి, ఇంద్రునిచే దివ్య సింహాసనమును పొందెను. చిరకాలము రాజ్యమేలి ప్రతిష్ఠాన పురములోని 2 సం| 6 నెలల కన్యకకు పుట్టిన శాలివాహనునిచే మరణించెను. దివ్యవాణి ఆదేశముచే మంత్రులు విక్రమార్కుని సింహాసనమును భూస్థాపితము చేసి ఆ భూమినొక బ్రాహ్మణునకు దాన మిచ్చిరి.
ఆ బ్రాహ్మణ వంశీయుడొకడు ఆ భూమిలో జొన్నలు సెనగలు పైరు వేసి సింహాసనమున్న దిబ్బపై మంచవేసికొని చేనుకావలి కాయుచుండెను. భోజరాజు సైన్యములతో అచటికి వచ్చును. విప్రుడు మంచెపై నుండి సైనికుల నాహ్వానించి దిగినతోడనే దూషించును. దీనిని గమనించి భోజరాజు ఆ భూమిని కొని మంచె ఉన్నచోట త్రవ్వించగా సింహాసనము కనబడును. ఎంత ప్రయత్నంచినను సింహాసనము పైకిరాలేదు. మంత్రి ఆలోచనతో శాంతులు జరిపిన అనంతరము సులువుగా అది పైకి వచ్చెను. ఇచట నంద భూపాలుడు బహుశ్రుతుడను మంత్రి వలన బ్రహ్మహత్యా పాతకమునుండి తప్పించుకొన్న కథ చెప్పబడినది. (ససేమిరా కథ).
ఒక సుముహూర్తమున భోజరాజు సింహాసన మెక్కుటకురాగా మొదటి సోపానము మీద ఉన్న సాలభంజిక ఆపి, విక్రమార్కుని వంటి ఔదార్యముగలవారే ఈ సింహాసన మెక్కవలెనని పల్కి ఆ మహారాజు దాతృత్వమును వర్ణించును.
ద్వితీయోపాఖ్యానము - మరల భోజరాజు సింహాసన మెక్కబోగా, రెండవ మెట్టుమీది బొమ్మ భోజుని ఆపి ఒక కథ చెప్పును. చిత్రకూట పర్వతము దగ్గర ఒక బ్రాహ్మణుడు కామితార్థమునకై ఎన్నో యేండ్లు హోమము చేయుచున్నను సిద్ధి కలుగనందున, విక్రమార్కుడు వెళ్ళి తన తల ఆహుతి ఈబోగా, దేవత ప్రత్యక్షమై రాజుకోరిక మేరకు బ్రాహ్మణుని కామితము దీర్చును.
తృతీయోపాఖ్యానము - మూడవ సాలభంజిక విక్రమార్కునకు అశ్వమేధ యాగ సందర్భములో సముద్రుడు పంపిన నాలుగు దివ్యరత్నములను ఒక బ్రాహ్మణునకు దానము చేసిన కథ చెప్పును.
చతుర్డోపాఖ్యానము- నాలుగవ బోమ్మ విక్రమార్కునకు ఒక విప్రుడు కొద్దిపాటి సహాయముచేసి బహుమతి పొందియు, అతని కృతజ్ఞతను పరీక్షింప గోరి. రాజపుత్రుని దాచి చంపినట్లు నటించినను. రాజతనిని క్షమించిన కథ చెప్పును.
పంచమోపాఖ్యానము అయిదవ టొమ్మ విక్రమార్కుడు విదేశీయునిచే 10 అమూల్య రత్నములను కోని. వాటిని తెచ్చుటకై ఒక భృత్యుని పంపును. వాడు గడువులోగా తీసికొని వచ్చుచు దారిలో నదిదాటించిన పడవవానికి 6 రత్నము లిచ్చినట్లు చెప్పగా మిగిలిన 5 రత్నములను గూడ భృత్యున కిచ్చిన కథ చెప్పును.
షష్ణోపాఖ్యానము. ఆరవ బొమ్మ విక్రమార్కు డొకనాడు భార్యలతో క్రీడావనమున విహరించుచుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి జగదంబ నన్ను గృహస్థుడవు కమ్మని నిన్ను ఆశ్రయింపుమని చెప్పగా వచ్చితిననును. వెంటనే విక్రమార్కుడా విప్రునకు ఉత్తమ వధువులను సంవదలను ఇచ్చిన కథ చెప్పును.
సప్తమోపాఖ్యానము- ఏడవ బొమ్మ సముద్ర మధ్యమునందలి పర్వతమున భువనేశ్వరి ఆలయముతో తలలు తెగి పడియున్న దంపతులకై , తన తల ఈబోగా, దేవి ప్రత్యక్షమై దంపతులను బ్రతికించిన కథ చెప్పును,
అష్టమోపాఖ్యానము- ఎనిమిదవ సాలభంజిక కాశ్మీరదేశమున వర్తకుడు త్రవ్వించిన తటాకమును నింపుటకై విక్రమార్కుడు తన కంఠరక్తము నీబోగా దేవి ప్రసన్నమై తటాకమును జలపూర్ణము చేసిన కథ చెప్పును.
నవమోపాఖ్యానము- తొమ్మిదవ బొమ్మ కాంచీనగరము నందలి వేశ్యనాశ్రయించికొని ఉన్న రాక్షసుడు విటులను చంపుచున్న వార్తవిని, విక్రమార్కుడు వెళ్ళి రాక్షసుని చంపివచ్చిన కథ చెప్పును,
దశమోపాఖ్యానము. పదవసాలభంజిక సిద్ధయోగీంద్రుని ఉపదేశముచే యజ్ఞపురుషుని మెప్పించి, ఆయన ప్రసాదించిన దివ్యఫలమును విక్రమార్కుడు కుష్ఠు రోగికి సమర్పించిన కథ చెప్పును.
ఏకాదశోపాఖ్యానము. పదునొకండవ సాలభంజిక రాక్షసుని వంతునకు వచ్చిన బ్రాహ్మణ బాలకుని రక్షించుటకై విక్రమార్కుడు వెళ్ళి, రాక్షసుని మెప్పించి, అప్పటి నుండి మనుష్యభక్షణము మాన్పించిన కథ చెప్పును.
ద్వాదశోపాఖ్యానము. పండ్రెండవ సాలభంజిక విక్రమార్కుడు వేణువనములో ప్రతి రాత్రి ఒక స్త్రీని బాధించుచున్న రాక్షసునిచంపి, ఆమె వలన లభించిన సువర్ల ఘటములను, సర్వస్వము కోల్పోయిన వైశ్యున కిచ్చిన కథను చెప్పును.
త్రయోదశోపాఖ్యానము. పదమూడవ సాలభంజీక ఒక నదిలో కొట్టుకొని పోవుచున్న వృద్ధ బ్రాహ్మణ దంపతులను విక్రమార్కుడు రక్షించి ఆ బ్రాహ్మణుడు ధారపోసిన చ్వాదశవర్ష మంత్రజప ఫలమును బ్రహ్మరాక్షసునకు సమర్పించిన కథ చెప్పును.
చతుర్దశోపాఖ్యానము - పదునాల్గవ సాలభంజిక విక్రమార్కుడు తనకు సిద్ధయోగి ప్రసాదించిన సర్వకామద మయిన మహాలింగమును ఒక బ్రాహ్మణునకు ధారపోసిన కథ చెప్పును.
పంచదశోపాఖ్యానము - పదునైదవ సాలభంజిక విక్రమార్కుడు తన పురోహిత పుత్రునితో వెళ్ళి ఒక నగరములో దేవాలయ గోపురమునగల తప్తతైలకటాహమున దూకి మన్మథ సంజీవిని ఆను అప్పరసచే బ్రతికించబడి ఆ అప్సరసను పురోహితపుత్రునకు సమర్పించిన కథ చెప్పును.
షోడశోపాఖ్యానము - పదునాఱవ సాలభంజిక విక్రమార్కుడు దిగ్విజయ యాత్ర చేసివచ్చి, పురబాహ్యోద్యానమున విశ్రమించి యుండగా, ఒక బ్రాహ్మణ కన్యకు ఆమెబరువు బంగారము నిచ్చి పెండ్లి చేసిన కథ చెప్పును.
సప్తదశోపాఖ్యానము - పదునేడవ సాలభంజిక ఒక రాజు విక్రమార్కునితో సాటి అగుటకు ప్రతినిత్యము తనను హోమము చేసికొనుచున్నట్లు విని, విక్రమార్కుడు వెళ్ళి, ఆచటి దేవతను మెప్పించి, ఆ రాజునకు నిత్యబలి తప్పించిన కథ చెప్పును. . అష్టాదశోపాఖ్యానము- పదునెనిమిదవ సొలభంజిక ఉదయాద్రి దగ్గర గంగానదిలో ఒక స్తంభము సూర్యోదయముతో పైకి లేచి, మధ్యాహ్నమునకు సూర్యుని సమీపించి, అస్తమయమునకు నదిలో మునిగిపోవుచుండుట విని విక్రమార్కుడు వెళ్ళి ఆ స్తంభముపై కూర్చుండి సూర్యుని కడకు వెళ్ళి మెప్పించును. సూర్యుడిచ్చిన దివ్య కుండలములను ఒక దరిద్ర బ్రాహ్మణునకు సమర్పించిన కథ చెప్పును.
ఏకోనవింశోపాఖ్యానము - పందొమ్మిదవ సాలభంజిక విక్రమార్కుడు వేటలో వరాహమును తరుముచు వెళ్ళి, పాతాళము చేరి, బలి చక్రవర్తిని దర్శించును. ఆయన ప్రసాదించిన కస రసాయనములను ఒక బ్రాహ్మణ కుటుంబమునకు ధారపోసిన కథ చెప్పును.
వింశోపాఖ్యానము - ఇరువదవ సాలభంజిక , విక్రమార్కుడు ఒక మహా సిద్దునిచే మహిమగల ఘుటికను, బొంతను, యోగదండమును సంపాదించి దారిలో రాజ్యభ్రష్టుడగు ఒక రాజకుమారునకు సమర్పించిన కథ చెప్పును.
ఏకవింశోపాఖ్యానము - ఇరువది యొకటవ సాలభంజిక విక్రమార్కుడు మంత్రిపుత్రుడైన అనర్గళుని వలన వివి ఒక పుష్కరిణిలో సలసల క్రాగుచున్న నీళ్ళలో నుండి రాత్రిపూట బయటికి వచ్చిన 8 మంది స్త్రీలననుసరించి పాతాళమునకు పోయి, వారిచే 8 దివ్యరత్నములను పొందివచ్చి దరిద్ర బ్రాహ్మణునకు ధారపోసిన కథ చెప్పును.
ద్వావింశోపాఖ్యానము- ఇరువది రెండవ సాలభంజిక, నీలపర్వత బిలములోని కామాక్షీదేవిని మెప్పించి విక్రమార్కుడు అందున్న రసకుంభమును దెచ్చి బ్రాహ్మణునకు ధారపోసిన కథ చెప్పును.
త్రయోవింశోపాఖ్యానము - ఇరువదిమూడవ సాలభంజిక, విక్రమార్కుడు దుస్వప్న శాంతికై హవనము చేసి 3 దినములు తన భాండాగారమును తెరచి యుంచి యథేచ్చగా దానములు చేసిన కథ చెప్పును.
చతుర్వింశోపాఖ్యానము - ఇరువదినాలుగవ సాలభంజిక, ఒక వర్తకుని పుత్రులకు తండ్రి చేసిన భాగ పరిష్కారము అర్థముకాక అన్ని దేశములు తిరిగి ప్రతిష్ఠానపురములోని శాలివాహను డనుబాలునిచే ఆ వివరము తెలిసికొందురు. విక్రమార్కుడీ వార్తవిని శాలివాహనుని పిలువ బంపగా, వాడు తిరస్కరించును. దానిని సహింపక శాలివాహనునిపై దండెత్తి వానిచే సైన్యములు చావగా వాసుకిని ప్రార్థించి అమృతకలశమును సంపాదించును. దానిని శాలివాహనుడు పంపిన బ్రాహ్మణులకు దానమిచ్చిన కథ చెప్పును. పంచవింశోపాఖ్యానము - ఇరువది అయిదవ సాలభంజిక, ఒకసారి ద్వాదశ వర్ష క్షామము వచ్చెను. విక్రమార్కుడు తన కంఠము నరకుకొన నెంచగా దేవి ప్రత్యక్షమై క్షామబాధ పోగొట్టిన కథ చెప్పును.
షడ్వింశోపాఖ్యానము - ఇరువది ఆఱవ సాలభంజిక, విక్రమార్కుని గుణములను పరీక్షింప వచ్చిన కామధేనువు అతని సాహసమును మెచ్చి స్వాధీనము కాగా, దానినొక దరిద్రునకు దానమిచ్చిన కథ చెప్పును.
సప్తవింశోపాఖ్యానము - ఇరువది యేడవ సాలభంజిక, విక్రమార్కుడు భైరవుని మెప్పించి మటత్రయ ధనమును జూదరికి ధారపోసిన కథ చెప్పును.
అష్టావింశోపాఖ్యానము - ఇరువది యెనిమిదవ సాలభంజిక విక్రమార్కుడు బేతాళపురిలోని శోణితప్రియ అను దేవతను మెప్పించి నరబలి మాన్పించిన కథ చెప్పును.
ఏకోనత్రింశోపాఖ్యానము - ఇరువది తొమ్మిదవ సాలభంజిక , విక్రమార్కుడు ఒక భట్టునకు తన రత్నభాండాగారము నుండి కోరిన ధనరాసులు కొనిపోవననుజ్ఞ ఇచ్చిన కథ చెప్పును.
త్రింశోపాఖ్యానము - ముప్పదవ సాలభంజిక, విక్రమార్కుడు ఒక ఐంద్రజాలికుని విద్యామహిమకు మెచ్చి తనకు పాండ్యరాజు పంపిన కప్పమును కానుకలను ధారపోసిన కథ చెప్పును.
ఏకత్రింశోపాఖ్యానము - ముప్పదియొకటవ సాలభంజిక, విక్రమార్కుడు దిగంబరుని కోరికపై బేతాళుని పట్టి తెచ్చుచుండగా కాలక్షేపమునకై బేతాళు డొక కథ చెప్పి దానిని గూర్చి ప్రశ్నించును. రాజు సమాధానము చెప్పగా మౌనభంగము కలిగి బేతాళుడు పారిపోవును. ఈ విధముగా 25 కథలు చెప్పి తప్పించుకొని చివరకు బేతాళుడు దిగంబరుని చంపించి విక్రమార్కునకు వశుడగును. వాసిని బ్రతికించి అష్టసిద్ధులను సమర్పించిన కథ చెప్పును. ద్వాత్రింశోపాఖ్యానము- ముప్పది రెండవ సాలభంజిక, విక్రమార్కుని విశేషముగ ప్రశంసించి, భోజరాజా! నీవును అంతటివాడవు, నీ వలన మాకు శాపమోచనమైనదని చెప్పి తమకు పార్వతీదేవి శాపము, ఆమె పరిచారకలైన తమ పేర్లు, శాపమోక్ష విధీ తెలిపి నీవలన ముక్తి పొందితిమి అని వరము లొసగి 32 సాలభంజికలు దివ్యాంగనలుగా మారి వెళ్ళిపోవుదురు. భోజుడు ఆ దివ్య సింహాసనముపై దేవుని నిలిపి పూజించును.
ఈ మూలకథల నన్నిటిని గ్రహించి గోపరాజు తన కావ్యమున సందర్భానుసారముగ పెంచి మార్చి రచించినాడు.
సింహాసన ద్వాత్రింశికలోని కథలు, :
కైలాసమునందు గౌరిదేవి శంకరుని కథ చెప్పుమనును; శివుడు భోజరాజునకు సింహాసన సాలభంజికలు 32 చెప్పిన కథలు చెప్పెదను వినుమని చెప్పదొడగేను.
ఉజ్జయినీ పురమును చంద్రగుప్తుని పుత్రుడు భర్తృహరి పాలించుచుండెను. అతని భార్య అనంగసేన. ఆమె చెడు వర్తనము వలన విరక్తుడై విక్రమార్కునకు రాజ్యము కట్టి వెళ్ళెను. విక్రమార్కుడు మహాకాళుని గూర్చి తపమొనర్చి మెప్పించి ఒక సంవత్సరము మీద ఒక దినము వయసుగల కన్యకు బుట్టిన వానితో మాత్రమే చావు కలుగునట్లు వరము పొందెను. భట్టి చాతుర్యము వలన 2 వేల యేండ్లు బ్రతుకును; బేతాళుని వశము చేసికొనును, స్వర్గమునకు పోయి రంభా ఊర్వశుల నృత్య విశేషములు వివరించి ఇంద్రునిచే దివ్య సింహాసనము సంపాదించెను. చివరకు ప్రతిష్టానపురము నందలి శాలివాహనుడను బాలునిచే మరణించును. . అశరీరవాణి చెప్పినట్లు ఆ సింహాసనమును విక్రమార్కుని మంత్రులు భూమిలో పాతిపెట్టి ఆ భూమీ నొక బ్రాహ్మణునకు దానమిచ్చెదరు. ఆ భూమిలో ఆ బ్రాహ్మణవంశీయుడు మంచె వేసికొని చేనులో పైరుపెట్టి కావలి యుండును. భోజరాజు సైన్యములతో నచటికి రాగా మంచెపై ఉండి ఆహ్వానించును. మంచె దిగి దూషించును. భోజరాజు ఆ భూమిని కొని, మంచె ఉన్నచోట త్రవ్వింపగా సింహాసనము కనబడును, ఎంత ప్రయత్నించినను ఆది వెలికిరాదు. మంత్రి సలహా మేరకు శాంతులు చేయగా వెలికి వచ్చును. మంత్రి ఆవశ్యకతను తెలుపు బహుశ్రుత్రుని (ససేమిరా) కథ, ఏకలునికథ, వులిపులుగు కథ చెప్పబడినవి. భోజరాజు శుభదినమున సింహాసన మెక్కబోగా మొదటిమెట్టుపై ఉండిన బొమ్మ భోజుని ఆపి విక్రమార్కుని వంటి సాహసౌదార్యములు కలవాడే ఈ సింహాసమెక్కుటకు అర్హుడని చెప్పును. ఇట్లే తక్కిన 31 బొమ్మలును ఒక్కొక్క కథ చెప్పును.
మొదటి బొమ్మ కథ- మూలమునందలి కథతోబాటు అదనముగ సుదర్శనుని కథ. చతురంగ తజ్ఞుని కథ చేర్చబడినవి.
రెండవ బొమ్మ కథ- మూలములోని కథనే చెప్పును.
మూడవ బొమ్మ కథ- మూలమందలి కథతోబాటు గౌశికుని కథ చేర్చబడినది.
నాలుగవ బొమ్మ కథ- మూలకథనే చెప్పును.
అయిదవ బొమ్మ కథ- మూలకథనే చెప్పెను.
ఆఱవ బొమ్మ కథ- మూలకథనే చెప్పెను
ఏడవ బొమ్మ కథ. మూలకథయే.
ఎనిమిదవ బొమ్మ కథ- మూలకథతో బాటు శంఖపాలుని కథ అదనముగా చెప్పబడినది.
తొమ్మిదవ బొమ్మ కథ- మూలకథయే.
పదవ బొమ్మ కథ- మూల - కథయే. .
పదునొకండవ బొమ్మ కథ. మూలకథతో బాటు జీమూతవాహనుని కథ చెప్పబడినది. పండ్రెండవ బొమ్మ కథ - మూలమందలి కథయే.
పదమూడవ బొమ్మ కథ - మూలమందలి కథయే.
పదునాల్గవ బొమ్మ కథ - మూలకథతోబాటు రాజశేఖరుని కథ చేర్చబడినది.
పదునైదవ బొమ్మ కథ- మూలకథయే.
పదునాఱవ బొమ్మ కథ- మూలకథతోబాటు కలహకంటక ఏకాంగ వీరుల ద్వంద్వయుద్ధ కథ చెప్పబడినది.
పదునేడవ బొమ్మ కథ- మూలమందలి కథయే.
పదునెనిమిదవ బొమ్మ కథ- మూలకథయే.
పందొమ్మిదవ బొమ్మ కథ- మూలకథయే.
ఇరువదవ బొమ్మ కథ- మూలకథయే.
ఇరువదియొకటవ బొమ్మ కథ. మూలకథయే.
ఇరువదిరెండవ బొమ్మ కథ. మూలకథయే.
ఇరువదిమూడవ బొమ్మ కథ- మూలకథయే.
ఇరువదినాలుగవ బొమ్మ కథ- మూలకథయే.
ఇరువదిఅయిదవ బొమ్మ కథ- మూలకథయే.
ఇరువదిఆఱవ బొమ్మ కథ- మూలకథయే.
ఇరువదియేడవ బొమ్మ కథ- మూలకథతో బాటు మతిమంతుని కథ చేర్చబడినది.
ఇరువదియెనిమిదవ బొమ్మ కథ- మూలకథయే.
ఇరువదితొమ్మిదవ బొమ్మ కథ- మూలకథయే.
ముప్పదియవ బొమ్మ కథ- మూలకథయే.
ముప్పదియొకటవ బొమ్మ కథ- మూలకథలో బేతాళుడు చెప్పిన కథను వదలి క్రొత్తగా వజ్రముకుటుని కథ చెప్పబడినది.
ముప్పది రెండవ బొమ్మ కథ - మూలకథతో కావ్యసమాప్తి చేయబడినది. గోపరాజు మూలగ్రంథమందలి 32 కథలతోబాటు అందు లేని 10 కథలను అదనముగా చేర్చెను. మూలకథలన్నియు యథేచ్చగా పెంచబడినవి.
అనువాద విధానము :
గోపరాజు మూలము నెట్లు ఆనువదించెనో ఉదాహరణకు ఒక చిన్న కథను పరిశీలించిన తెలియగలదు.
పంచవింశోపాఖ్యానము
"ద్వాదశ వార్షిక మధికావగ్రహం భావినం సమాకర్ణ్య।
ఆశాపూరణ్యై నిజశిరోబలిం దత్తవానితి బ్రూతే॥
పునరపి రాజా యావత్ సింహాసనే ఉపవేష్టుం ఉపాక్రమత తావ ధన్యా సాలభంజికా అబ్రవీత్, శ్రూయతాం, రాజన్ - విక్రమాదిత్యే రాజ్యం కుర్వతి ఏకదా కశ్చిత్ జ్యోతిషికః ఆగత్య-
శ్లో॥ సూర్యః శౌర్య మథేందురింద్ర పదవీం సన్మంగళం మంగళః
సద్బుద్ధించ బుధో గురుశ్చగురుతాం శుక్రఃశుభం శంశనిః
రాహుర్బాహుబలం కరోతు సతతం కేతుః కులస్యోన్నతిం
నిత్యం భూతికరా భవంతు భవతః సర్వేనుకూలా గ్రహాః॥
ఇతి ఆశిషం ఉక్తా పంచాంగమ్ అకథయత్. రాజా పంచాంగం శ్రుత్వా జ్యౌతిషికం అపృచ్ఛత్, భో! దైవజ్ఞ! కీదృశం ఏతత్ సంవత్సరఫలంః దైవజ్ఞః - అస్మిన్ సంవత్సరే రాజా రవిః, మంత్రీ మంగళః, ధాన్యాధిపతిః శనిః, అన్యచ్చ శనైశ్చరో భౌమశ్చ రోహిణిశకటం భిత్వా యాస్యతః, తస్మాత్ సర్వథా అనావృష్టి భవిష్యతి ఉక్తంచ వరాహమిహిరేణ-
"అర్కసుతేన హి భగ్నేభౌమః శుక్రశ్చ రోహిణీశకటే
ద్వాదశ చాబ్దాన్ నహి నహి వర్షతి వర్షాణి వారిదో నియతం॥
"రోహిణీశకట మర్కసూనునా భిద్యతే రుధిరవాహినీ సరిత్
కిం బ్రవీమి? నహి వారిసాగరే సర్వలోక ఉపయాత సంక్షయం॥
మతాంతరే - "యదా భినత్తి మందోయం, రోహిణ్యాః శకటం తదా
వర్షాణి ద్వాదశాత్యంతం, వారివాహో న వర్షతి॥
ఇదం దైవజ్ఞ వచనం శ్రుత్వా రాజా అబ్రవీత్ - ఏతత్ అవగ్రహ నివారణే కమపి ఉపాయం నివేదయ. దైవజ్ఞః - నవగ్రహ హోమాద్యనుష్ఠానం కర్తవ్యమ్ తతః వృష్టిః భవిష్యతి.
తతో విక్రమార్కః శ్రోత్రియాన్ బ్రాహ్మణాన్ ఆహూయ తేభ్యః పూర్వవృత్తాంతం ఉక్త్వా తైః హోమం కారయితుం ఉపక్రాంతవాన్. తతః సర్వ హోమసామగ్రీ సంపాదితా. బ్రాహ్మణైః కల్పోక్త ప్రకారేణ నవగ్రహ హవనమపి కృతమ్. హోమ సాద్గుణ్యార్థం పూర్ణాహుతిరపి నిర్వర్తితా, రాజా దివ్య వస్త్రాదినా బ్రాహ్మణాన్ ఆతోషయత్. తతః భూరిదానేన దీన అంధ బధిర పంగు కుబ్జాదయోపి సంతోషితాః, తథాపి వృష్టిః న అభూత్. తదనంతరమ్ అనావృష్ట్యా సర్వోపి లోకః పరంక్లేశం ఆగమత్. రాజాపి తేషాం దుఃఖేన స్వయం దుఃఖితః సన్ ఏకదా యజ్ఞశాలాయాం ఉపవిష్టః వ్యచింతయత్ . తావత్ అశరీరవాణీ వాక్ ఆసీత్. భో రాజన్! తవ పరోపకారోయది పురః స్థిత దేవాలయ వాసిన్యా అశావూరణ్యా దేవతాయాః పురః ద్వాత్రింశత్ లక్షణయుక్తస్య పురుషస్య కంఠరక్తేన బలిం దేహి, తతః వృష్టిః భవిష్యతి. అవగ్రహః అపి నశ్యతి. ఇతి శ్రుత్వా రాజా దేవాలయం గత్వా దేవతాం నమస్కృత్య కంఠే ఖడ్గం న్యధాత్. తానద్దేవతా- రాజన్! తవ ధైర్యేణ ప్రసన్నాస్మి. వరం వృణీష్వ! రాజా అభణత్ - దేవి! అనావృష్టిం నివారయ, దేవతా - తథా కరిష్యామి ఇత్యుక్త్వా సద్యశ్చకార తతః రాజా నిజభవనమ్ అగమత్॥ ఇమాం కథాం కథయిత్వా సాలభంజికా భోజరాజం అబ్రవీత్. భో రాజన్! ఏవం విధం సాహసం త్వయి విద్యతేచేత్ అస్మిన్ సింహాసనే ఉపవిశ, తత్ శ్రుత్వా రాజా తూష్ణీం బభూవ
ఇతి పంచవింశోపాఖ్యానమ్
ఇరువది యైదవ బొమ్మకథ :
కం॥ శ్రీ దయితా వదనచ్ఛా
యాదర్శీభూత కౌస్తుభారుణతేజో
మేదుర వక్షఃస్థలు దా
మోదరుఁ గాకోదరేంద్ర యోజిత తల్పున్॥
క. నెమ్మనమునఁ దలఁపుచు మో
హమ్మున సింహాసనమున కరుదెంచినఁ జో
ద్యమ్ముగ నిరువది యేనవ
బొమ్మవలికె నడ్డపెట్టి భోజనృపాలున్.
క. ఏమని చెప్పుదు నుజ్జయి
నీమనుజాధిపుని భంగి నియతంబుగ నో
భూమీశ్వర దివ్యంబగు
సామర్థ్యము లేక యెక్కఁజన దెవ్వరికిన్.
మ. అది యెట్లన్న నెఱుంగఁ జెప్పెద నరివ్యాపాద నాసాదనో
న్మదబాహాయుగళుం డనంత ధనదాన ప్రీణితక్ష్మాతల
త్రిదశస్తోమ నిరంతరస్తుతి లసత్కీర్తిప్రియుం డంగనా
మదనాకారుఁ డవంతినాయకుఁడు సామ్రాజ్యంబుతో నొప్పుచున్
శా. ప్రాతఃకాలమునందుఁ గొల్వున నయప్రఖ్యాతులౌ రాజులున్
నీతిన్యస్తమనస్కులౌ సచివులున్ విద్వాంసులుం గొల్వఁగా
జ్యోతిర్మధ్యమునన్ వెలింగెడు హిమాంశుంబోలి సొంపొందుచో
జ్యోతిశ్శాస్త్రవిదుండొకండు ధరణీశుంగాంచి దీవించుచున్.
క. సర్వశుభంబులు నీకడ
నిర్వాహము కలిగియుండు నీకేమని యా
శీర్వాదం బొసఁగుదు నా
యుర్వృద్ధి దలంప నవియ యునికికిఁ గోరున్.
సీ. ఐదింటఁ దానొప్పఁడట నెన్మిదింటఁ దొ
మ్మిదియింటఁ బండ్రెంట మేలు శుక్రుఁ
డిందుఁ డాఱింటను నేడింట మూఁటను
బదిటఁ జేకొన్న శుభప్రదుండు
శని రాహు కేతు భూతనయ సూర్యులు మూఁట
నాఱింట మే లర్కుఁ డట్ల పదిట
రెంట నైదింట నేడింటఁ దొమ్మిదిటను
గురుఁ డున్ననెల్ల కోర్కులు ఫలించు
బుధుడు బేసిగాని పొందుల నిష్ఠుఁడౌ
వీనికెల్ల దుష్టవేధ లేమి
ఫలము లొప్పు జనన భవనంబు మొదలుగాఁ
పదునొకంట నున్నఁ బరమ సుఖము.
గీ. అందు రవితనుజాది మహాగ్రహంబు
లిప్పు డాఱింటనునికి నీ యిష్టమొనరు
గురుఁడు బుధుఁడును బైపయికొనుట మేలు
శుక్రచంద్రులు మూఁట నిల్చుట శుభంబు.
వ. అనుచు శుభస్థానంబులు నతని గ్రహంబులునుం జెప్పి,
క. “ధర్మేతిష్ఠతి తే బు
ద్ధిర్మనుజాధీశ" యనుచు దీవించినఁ ద
న్మర్మంబెఱింగి నృపుఁడా
ధర్మము చొప్పెట్టి దనిన దైవజ్ఞుండున్.
క. నీవది యెఱుఁగవె ధర్మము
త్రోవంజనువాఁడు భక్తితోఁ దన శక్తిన్
దేవబ్రాహ్మణ పూజలు
గావింపఁగవలయు విగతకల్మషుఁ డగుచున్.
క. గురువును దేవరగా స
త్పురుషుని గురువుగ నిజాశ్రితునిఁ బ్రాణముగాఁ
బరవనితఁ గన్నతల్లిగఁ
బరధనము విషంబుగాఁగ భావింపఁదగున్.
గీ. అన్నదానము దుర్భిక్షమైనయప్పు
డంబుదానంబు నిర్జలంబైనచోట
నభయదానంబు శరణార్థియైనవేళఁ
జేయుటుచితంబు ఘన దయాశీల మలర.
క. కృత్యాకృత్యవిచారము
నిత్వోచితదాన మాత్మనియమము బుధసాం
గత్యము పరోపకారము
సత్యము వినయంబు నయము జరుపఁగ వలయున్.
ఉ. ఈ కొలదిం దదంగము లనేకవిధంబుల నుండు నన్నియున్
నీకడ నొప్పుచున్న వవనీవర నావుడు విద్యలందుఁ బ్ర
త్యేకసమర్థుఁడైన నృపుఁడిప్పటి యేఁటి ఫలంబుఁ జెప్పు మా
నాకని యానతిచ్చిన మనంబున నాద్విజుఁ డుత్సహించుచున్.
మ. మహిమాఖండలుఁడంచు భూజనులు సంభావింప నీ వింపుతో
మహిఁ బాలించుచుఁ బుణ్యకృత్యముల ధర్మద్రవ్య మార్జింపఁగా
గ్రహదోషంబులు పుట్ట వట్లయిన నో రాజేంద్ర యీయేఁట దు
స్సహపాపగ్రహసంభవంబగు నతిక్షామంబు వర్తిల్లెడిన్.
ఉ. అక్రమ మాచరించి విను మర్కతనూజుఁడు తొల్లియున్న యా
శుక్రుని రాశిఁ దా విడుచుచున్ శకటాకృతి నున్న రోహిణీ
చక్రము దూఱి మంగళుని సద్మముఁ జేరఁగడంగి యేఁటిలో
వక్రగతిం జరింపగ నవర్షణమై చనుఁ గొన్ని వర్షముల్.
క. పఱి పఱి నిల పఱియలుగా
నెఱిసిన వనపంక్తులెండ నిరుపమ మగు నా
వఱపునఁ బండ్రెం డేడులు
కఱవిక నతిదుస్తరంబు గాఁగల దధిపా.
చ. అనవుడు దీని కడ్డుపడునట్టి యుపాయము గల్గెనేని నా
యనువెఱిఁగింపు మన్న వసుధామర తృప్తియె కారణంబుగా
నొనరిన దేవతార్చనల హోమములన్ గ్రహపూజ మున్నుగా
జనవర! శక్తికిం దగిన శాంతి యొనర్పుము వర్షణంబగున్.
క. ఇనుమున నాశనిరూపం
బొనరించి వినీల వస్త్ర యుక్తంబుగ న
ర్చనము రచియించి ఖదిరేం
ధనమున హోమంబు సేయఁ దత్ప్రీతి యగున్.
చ. అనిన ద్రివిక్రముండు మొదలైన పురోహితులన్ గ్రహాది పూ
జనములు సేయఁబంచి మృదుశాలిమయాన్నముఁ బాయసంబులున్
మునుముగఁ బిండివంటలు సమూహముగా నొనగూర్చి యిష్టభో
జనముల భూసురుల్ దనియ శాంతి దలంబుగఁ జేసి శక్తితోన్.
క. దేశాధీశ్వరుఁ దర్థుల
కాశాపరిపూర్తిసేయ నారాధితయౌ
నాశాపూరణి దేవి ని
వేశాంగణ సీమ హోమవిధి గావించెన్.
ఉ. ఈగతిఁ బెక్కుహోమములు నీగులుఁ బూజలుఁ జేసి చేసి వ
ర్షాగమ మేమియుం గనక యక్కట యాగము మీఱు నాశుభో
ద్యోగము వ్యర్థమయ్యె శివయోగినియుం గరుణింప దంచుఁ జిం
తాగతుఁడైన వేళ గగనస్థలి నయ్యశరీరి యిట్లనున్.
ఉ. భూపకులేంద్ర యింతఁ దలపోయఁగ నేటికి యోగమాత యా
శాపురి సంతసిల్ల యతిసత్త్వము నీ కొసఁగెం బ్రభావ సం
దీపిత దివ్యశస్త్రనిహతిన్ దిననాథ తనూజ వక్రమా
ర్గాప ఘనోపరోధ మభయంబునఁ జేయుము వృష్టి గల్గెడున్.
ఉ. పంటలు పెక్కు గల్గునని పల్కిన నానృపుఁ డాత్మలోన ము
క్కంటి రఘూద్వహున్ విజయుఁగైకొని మ్రొక్కుచు దివ్యబాణముల్
వింట నమర్చి పంక్తిరథులీలఁ గడంగి ప్రతాపశక్తి మి
న్నంటి గ్రహంబులెల్ల విరియంగ శనైశ్చరు నడ్డుకట్టినన్.
ఉ. ఆ శని నిల్చి నీ బలమహత్వము మెచ్చితిఁ దొల్లి నీవు గౌ
రీశునిచేఁ దపంబున నభీష్టములందితి నేఁడు శక్తి నా
కాశము గట్టి నాదగు ప్రకాశము ద్రుంచితి నేఁటి నుండి నీ
దేశములోపలం గఱవుదీఱఁ బ్రజల్ సుఖియింపఁ జేసెదన్.
శా. హర్షంబయ్యెభవత్ కృతంబున నృపాలాగ్రేసరా కోరినన్
వర్షంబు ల్గురియింతు నెప్పు డయినన్ వర్దిల్లు పొమ్మన్న ను
త్కర్షంబంటిన శౌర్యమొప్పఁగ సుభిక్షం బుర్విఁ దోపంగ దు
ర్ధర్షుండై చనుదెంచి భక్తిఁ గొలిచెన్ ధాత్రీశుఁ డాశాపురిన్.
క. ఈసామర్థ్యము నీకడ
వీసంబునులేదు మగిడి వెసఁ జనుమనినన్
వేసరిన భంగి భోజుం
డా సింహాసనము డిగి గృహంబున కరిగెన్.
మూలగ్రంథములో 11 గద్యపద్యములలో ఉన్న కథను 28 గద్యపద్యములకు పెంచెను. మూలములో దైవజ్ఞుని అర్థవంతమైన ఆశీర్వాదమును వదలి విక్రమార్కుని జాతక చక్ర గ్రహస్థితి ఫలములను చెప్పెను. పంచాంగశ్రవణము సంవత్సర ఫలములకు బదులుగా సాధారణమైన గ్రహస్థానములు ఫలములు చెప్పబడినవి. ఇవి అనవసరములు. దైవజ్ఞుడు క్షామారిష్టమునకు చెప్పిన శాంతులు చేసినను వర్షము కురియనందున అశరీరవాణి దేవాలయమందలి 'ఆశాపూరణి' ఆను దేవికి 32 లక్షణములు గలవాని కంఠరక్తము నొసగిన అరిష్టము తొలగునని మూలము నందు కలదు. గోపరాజు దీనినెందుకో మార్చెను. “దైవజ్ఞుడు చెప్పిన శాంతి హోమములు ఆశాపురి దేవిగుడి ముందు చేసినను వర్షము కురియలేదు. అశరీరవాణి రాజా! ఆశాపురి దేవత సీకు దివ్యశరశక్తి ననుగ్రహించినది. కావున దానిచే శనైశ్చరుని గతిని అడ్డుకొన్న వర్షము కురియునని చెప్పును. రాజట్లే శరసంధానము చేయగా శని ప్రసన్నుడై క్షామము పోగొట్టును" గోపరాజు ఈ మార్పు నెందుకు చేసెనో తెలియదు. ఇందువలన మూలమందలి సారస్యము చెడినది. ఇట్లే గోపరాజు ప్రతి కథలోను తన ఇష్టమువచ్చినట్లు మార్పులు చేసినాడు. ఆ మార్పులు సరసములుగ ఉండవు విక్రమార్కుడు ధర్మము ఎట్టిదని అడుగుట దైవజ్ఞుడు ధర్మమనగా ఏమో తెలుపుట. పూర్తిగా అధిక ప్రసంగము. మరొక మార్పును చూడుడు.
మొదటి కథలో విక్రమార్కునకు ఇంద్రుడు సింహాసనము ఇచ్చిన ఘట్టమున్నది. మూలమున ఇంద్రునకు రంభా ఊర్వశుల నర్తనములలో తార తమ్యము తెలియక విక్రమార్కుని పిలిపించి తెలిసికొని దివ్య సింహాసనము ననుగ్రహించినట్లున్నది. గోపరాజు దానిని మార్చెను. విశ్వామిత్రుని తపోభంగము చేయించుటకై రంభా ఊర్వశులలో నెవరిని పంపవలెనో ఎవరి యోగ్యతలెట్టివో తెలియక ఇంద్రుడు విక్రమార్కుని పిలిపించుచినట్లు వ్రాసెను. విశ్వామిత్రుని కాలమేదో విక్రమార్కుని కాలమేదో సామాన్యునకు తెలియును కాని గోపరాజునకు తెలియలేదు. అతడు చేసిన మార్పులను తెలిసికొనుటకిది చాలును. మూలమునందు రసవత్తరములైన నీతిశ్లోకములుండగా గోపరాజు వానినివదలి వేసెను. అక్కడక్కడ సూచనాప్రాయముగ చెప్పెను. మూలములోని
“నవిషం విషమిత్యాహుః బ్రహ్మాస్వం విషముచ్యతే
విషమేకాకినం హంతి బ్రహ్మస్వం పుత్రపౌత్రకం"
అన్నదానికి
క. గతిగానక యిది యొక సం
గతి బ్రదికెదమంచు నుండఁగా ధర్మముఁద
ప్పితి “బ్రహ్మస్వం విషము
చ్యతే" యనుచుఁ బెద్దలెల్లఁ జదువుట వినవే. (1- 176)
అని వ్రాసెను. ఈ పద్యము క్రిందనే
క. బలవంతులమని విప్రుల
ఫలభోగంబులకు నాసపడుదురె మును వి
ప్రులకిచ్చిన భూములు దమ
చెలియండ్రని తలఁపవలదె క్షితిపాలురకున్. (1-178)
అను పద్యమును వ్రాసెను. ఇది మూలములో లేదు. వ్యాసగీతాశ్లోకము
“ఏకైవ భగినీ లోకే సర్వేషామేవ భూభుజాం
నభోగ్యా నకరగ్రాహ్యా విప్రదత్తా వనుంధరా"
గోపరాజు మూలమునందలి శ్లోకములనుగాక అక్కడక్కడ తనకు తెలిసిన సంస్కృత గ్రంథములందలి శ్లోకములను సందర్భానుసారముగ అనువదించి వాడుకొనెను. ఇవి మూలమున లేవు. సుప్రసిద్ధ శ్లోకమగు
“అయోధ్యా, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతికా
పురీ, ద్వారవతీచైవ సప్తైతే మోక్షదాయకాః॥
అనుదానికి
“మధుర, కంచి, కాశి, మాయాపురము, ద్వార
వతి, యయోధ్య, యీ యవంతిపురము
నాఁగ నెగడు ముక్తినగరంబులం దున్న
నరులు పుణ్యభాజనములు గారె" (1-73)
అని అనువదించెను, ఇట్లే మయూరుని సూర్యశతకము నుండి, జయదేవుని ప్రసన్నరాఘవము నుండి. అన్నపూర్ణాష్టకము నుండి అనువదించి ఇందు వేసికొనెను.
జక్కన - గోపరాజు :
గోపరాజునకు ముందున్న జక్కనకవి, 'విక్రమార్క చరిత్రము'ను ప్రబంధ ఫక్కిలో రచించెను. అతడు విజయనగర సామ్రాజ్యమును 1423-1447 సం॥ మధ్య పరిపాలించిన ప్రౌఢ దేవరాయల కాలమువాడు. శ్రీనాథ కవిసార్వభౌమునకు సమకాలికుడు. జక్కన తాను ప్రబంధ శయ్యగా తెలుగున విక్రమార్క చరిత్రమును చెప్పెదననెను. కాని సంస్కృత గ్రంథమున కనువాదము చేసితిననలేదు. శ్రీ పింగళి లక్ష్మీకాంతముగారు“సంస్కృతమున విక్రమార్కచరిత్ర అను పేరుతో గ్రంథము కలదు. దానిలోగల కొన్ని కథలతో ఇందలి కధలకు వస్తుసామ్యము కలదు. అంతమాత్రమున అది ఈగ్రంథమునకు మాతృకయని చెప్పజాలము. మరి జక్కన ఇది అనువాదము అనిగాని, స్వతంత్ర రచన అనిగాని చెప్పలేదు. అందువలన ఇందు చాల భాగము అతని స్వతంత్ర రచనయే అని ఊహింప వచ్చును" అనివ్రాసిరి. [15]
జక్కనకవి గోపరాజు అనుసరించిన సంస్కృత విక్రమార్క చరిత్రమును చూచి అందుండి కొన్ని కథలను తీసికొని వాటిక్రమమును మార్చి తన పద్దతిలో వ్రాసెను, అతడు గ్రహించిన కథలు.
ద్వితీయాశ్వాసము- 1. విక్రమార్కుడు స్వర్గమునకుపోయి రంభా ఊర్వశుల నాట్యముల తారతమ్యమును నిర్ణయించి ఇంద్రునిచే దివ్య సింహాసనము పొందివచ్చిన కథ.
2. విక్రమార్కుడు కనకస్తంభ పీఠముపై నెక్కిపోయి సూర్యుని చేరి ఆయన అనుగ్రహించిన దివ్యకుండలములను ఒక బ్రాహ్మణునకు దాన మిచ్చిన కథ.
3. విక్రమార్కుడు వేటకు బోయి వరాహమును తరుముచు రసాతలమును చేరి బలిచక్రవర్తిని ఆయన ప్రసాదించిన రస రసాయనములను కొనివచ్చి దరిద్రబ్రాహ్మణునకు ధారపోసిన కథ.
4. మధురానగరము దగ్గర ప్రతిరాత్రి ఒక స్త్రీని కశాఖాతములచే బాధించుచున్న రాక్షసుని చంపి విక్రమార్కుడు ఆమె ఇచ్చిన మణిని వైశ్యపుత్రుడు పురందరునకు ఇచ్చిన కథ. తృతీయాశ్వాసము- 5. భర్తృహరి భార్య చెడువర్తనము వలన విరక్తుడై వనములకు పోయినకథ.
6. బహుశ్రుతుడను మంత్రి కథ (ససేమిరా)
పంచమాశ్వాసము- 7. చిత్రకూటము దగ్గర ఒక ముని ఎన్నో యేండ్ల నుండి హోమము చేయుచున్నను ఫలము కానకున్నందుకు వికమార్కుడు వెళ్ళి కాళికను మెప్పించి అతని కామితము తీర్చిన కథ.
8. విక్రమార్కుడు అశ్వమేధము చేయు సందర్భములో సముద్రుడు పంపిన దివ్యరత్నములను బ్రాహ్మణునకు సమర్పించిన కథ.
9. దేవదత్తుడను బ్రాహ్మణుడు విక్రమార్కునకు కొద్ది సహాయము చేసి ఆతని కృతజ్ఞతా గుణమును పరీక్షించుటకై రాజపుత్రుని దాచి, వానిని చంపినట్లు నటించినను రాజు బ్రాహ్మణుని క్షమించిన కథ.
10. విక్రమార్కుడు కాంచీనగరములో వేశ్యనాశ్రయించిన రాక్షసుని చంపి వేశ్యనుద్దరించి తన పురోహితపుత్రుడు కమలాకరునకు సమర్పించిన కథ.
11. రాక్షసునకు వంతుగా పోవలసిన బ్రాహ్మణ బాలకునకు బదులుగా విక్రమార్కుడు వెళ్ళి రాక్షసుని మెప్పించి, నరభక్షణము మాన్పించిన కథ.
ఈ 11 కథలును సంస్కృత విక్రమార్క చరిత్రము నుండి తీసికొని పెంచినవి. తరువాతి వాడైన గోపరాజు జక్కన విక్రమార్క చరిత్రమును చదివి యుండెను. మూలమును జక్కన - గోపరాజులు ఎట్లు అనుసరించిరో పరిశీలించిన తెలియగలదు. మూలము నందలి 'ససేమిరా ' కథను చూడుడు. సంస్కృతమున 55 గద్యపద్యములలో ఉన్న బహుశ్రుతుని కథను జక్కన 100 గద్యపద్యములకు పెంచగా, గోపరాజు 103 గద్యపద్యములలో చెప్పెను. మూలమున ఈ కథలోని నందరాజు స్త్రీ వ్యామోహము ఇట్లు చెప్పబడినది. "విశాలాయాం నందోనామ రాజా మహా శౌర్యసంపన్నో అభూత్ , తస్యచ భానుమతీ నామ మహిషీ. తస్యచ రాజ్ఞః తస్యాం అతిప్రీతిరాసీత్. సింహాసనేపి సహైవ తయా సముపవిశేత్, నిమేషమపి తయా వినా నతిష్ఠేత్"
(విశాలా నగరమున నందుడనురాజు, గొప్పపరాక్రమము గలవాడు. అతని భార్య భానుమతి. ఆ రాజునకు భార్యయందు విశేషప్రీతికలదు. సింహాసనమునందు ఆమెతో కలసియే కూర్చుండును, ఒక నిముషమైన ఆమెను విడిచి ఉండడు.) ఈ అయిదు వాక్యములకు జక్కన 10 పద్యములను వ్రాసెను.
క. ఆ నందమహివల్లభుఁ
డానంద రసార్ద్ర హృదయుఁడై యేప్రొద్దుం
దా నగరు వెడలకుండును
భానుమతీ మోహపాశ బద్ధుండగుటన్.
క. జక్కవ కవ పెక్కువయగు
మక్కువతో రేయిఁబగలు మనుజాధీశుం
డక్కాంత దక్కనోర్వక
దక్కటి కార్యంబు లెల్లఁ దక్కిచరించున్.
శా. ఆ రామామణితోడఁ గూరిమి నతండత్యాస్థఁ గ్రీడించు సం
సారస్ఫార సుఖైక సార సురతేచ్ఛాపూర నిర్మగ్నుఁడై
యారామాంతర కేళి పర్వత గుహా హర్మ్యాంతరాళంబులం
గీరాలాప మదాలిగీత విలసత్క్రీడా నివాసంబులన్.
సీ. ఆత్మావనీమండలాసక్తిఁ బెడఁబాసి
లతనా నితంబ మండలముఁబొదువు.
వ. అంత బహుశ్రుతుండు
చ. అని తన యిచ్చలో వగచి యన్నరపాలునితో వినీతి గో
పనమతి మంత్రి యిట్లనియె ... .... ...... ......
ఉ. నావుడు మంత్రివర్యునకు నందమహీపతి ప్రీతినిట్లనున్
* * *
క. ఒక్క రే యొక్కమహాయుగ ... .... ....... ......
సీ. కైసేసి చెలువ నాకడ నల్ల నిలిచిన
నంగజశ్రీ జూఱలాడఁ జూతు
ఉ. కన్నులు గండుమీలు ... ... .....
క. ఏనొక నిముషంబైనను
భానుమతీ దేవిఁబాసి ప్రాణముఁ బట్టం
గా నోప నీ విచారము
మానుమనిన మంత్రి యనియె మనుజేశ్వరుతోన్.
ఇందు నంద భూపాలుని లాలసత్వము పరాకాష్ఠ నందుకొన్నది. రాబోవు ప్రబంధ యుగమునకు ఒరవడిగా జక్కన రచన సాగినది. గోపరాజు ఈ ఘట్టమును
క. ఆ నందభూపతికి సతి
యానందము రూపమయ్యె ననఁ గలిగెఁ ద్రిలో
కీనయనచకోరములకు
భానుమతీదేవి యమృతభానుద్యుతియై.
సీ. దీపిత కనక సందేహంబు దేహంబు
పచ్చకర్పూరంబు పలుకు పలుకు
పల్లవ సంపదాస్పదములు పదములు
శోభితావర్తసనాభి నాభి
* * * *
అట్టి సతిని ̃ఱెప్ప వెట్టక చూచుచు
నిద్ర యాఁకలియును నీరువట్టు
నడఁచి యధరరేఖ నమృతంబు గ్రోలుచు
దేవుఁ డనఁగ మనుజదేవుఁ డొప్పె.
క. వనితలకు నురము నోరును
దను వర్ధము నిచ్చి రచ్యుత బ్రహ్మ శివుల్
ఘనుఁడా మువ్వుర మీఱుచు
జనపతి దన సతికి నిచ్చె సర్వాంగములున్.
సీ. అవనీశు డీక్రియ నంతఃపురంబున
విహరించుచును మంత్రివిన్నపమున
* * *
ఈ విధముగ పచ్చిశృంగారమునగాక సాధారణధోరణిలో 5 పద్యములలో సరిపెట్టినాడు. ఈ కథయందే నందరాజు కొడుకు జయపాలుడు భల్లూకముచే శపింప బడి 'ససేమిరా' అని ఆరచుచుండును. ఎవరైన జరిగిన విషయమును వెల్లడించిన వెంటనే ముక్తి పొందును. మూలమున 'ససేమిరా'కు నాలుగు శ్లోకములు చెప్పబడినవి.
“స” అను అక్షరమునకు
“సద్భావంప్రతిపన్నానాం వంచనే కా విదగ్ధతా
అంకమారుహ్య సుప్తానాం హననే కిం ను పౌరుషమ్.
దీనికి జక్కన
“సకల లోకోపకార సంచారులైన
సాధు జనుల వంచించుట జాణతనమె?
తొడలపై నమ్మి నిద్రపోయెడు వయస్యుఁ
బగతు పాలనుఁద్రోయఁ బాపంబు గాదె.
గోపరాజు. "సజ్జన భావము గలుగు సు
హృజ్జనముల మోసపుచ్చుటిది నేరుపె నీ
పజ్జ తొడమీఁదఁ గూర్కిన
యజ్ఞంతువుఁ జంపఁ జూచుటది పౌరుషమే"
జక్కన మూలపూర్వార్ధమును చక్కగా అనువదించెను. ఉత్తరార్ధములోని 'హననే కింను పౌరుషమ్' (చంపుటలో మగతన మేమున్నది) అను వ్యంగ్యమును వాచ్యము చేసినాడు. గోపరాజు ద్విత్వజకార ప్రాసము గ్రహించి కొంత తికమక పడినను మూలమును సరిగా అనువదించెను.
రెండవ అక్షరము "సే" మూలమునందు
"సేతుం దృష్ట్వా సముద్రస్య,గంగాసాగర సంగమమ్
బ్రహ్మ హత్యాత్ర ప్రముచ్యేత, మిత్రదోహో నత్రముచ్యతే”
జక్కన "సేతువు దర్శింప మహా
పాతకములుఁ బాసిపోవుఁ బ్రాణసఖునకున్
ఘాతుకమతి నొనరించిన
పాతక మే తీర్థసేవఁ బాయునె నరునిన్.
గోపరాజు "సేతువుఁగని, జలనిధి సం
జాతధనుష్కోటిఁ బడిన సద్ద్విజహతికిం
బాతకము వాయు మిత్రవి
ఘాతికిఁ బాతకమె కాని గతి కలుగదనా".
జక్కన పద్యములో మూలమందలి 'బ్రహ్మహత్యాప్రముచ్యేత'కు బదులు 'మహాపాతకములు బాసిపోవు' అని, వ్రాయ బడినది. గంగా సాగర సంగమ దర్శనమునకు బదులు 'ఏతీర్థ సేవచేనైన' అని చేర్చబడినది. గోపరాజు గంగా సాగర సంగమమునకు బదులు, జలనిధి సంజాత ధనుష్కోటి బడిన, అన్నాడు. అతని ఉద్దేశమేమో తెలియదు. మూలమందలి భావమును ఉభయులును చక్కగా అనువదింపలేదు.
మూడవ అక్కరము "మి"కి మూలమునందు
"మిత్రద్రోహి కృతఘ్నశ్చ
యశ్చ విశ్వాసఘాతుకః
త్రయస్తే నరకం యాంతి
యావచ్చంద్ర దివాకరమ్."
జక్కన "మిత్రద్రోహి, కృతఘ్నుఁడు
ధాత్రీసురహంత, హేమతస్కరుఁడు, సురా
పాత్రీభూతుఁడు, నిందా
పాత్రులు వీరెల్ల నరక భవనావాసుల్".
గోపరాజు “మిత్రద్రోహి, కృతఘ్ను ప
విత్రగురుద్రోహి చౌర్యవిద్యాపరులున్
మిత్ర శశి స్థితి మేరగఁ
బుత్రులు గలిగియును నరకమునఁ బడుదురనా".
జక్కన మూలములోని ముఖ్యమైన విశ్వాసఘాతుకుని దీసివేసి ధాత్రీసురహంతను, హేమతస్కరుని, సురాపాత్రీభూతుని గ్రహించి వీరు నిందాపాత్రులని వ్రాసెను. కథయందలి రాజకుమారుడు, మిత్రద్రోహి, కృతఘ్నుడు, విశ్వాసఘాతుకుడు. ఆ విషయమును దెలుపుటకే ఆ ముగ్గురును ఆచంద్రార్కము నరకములో ఉందురని మూలకారుడు వ్రాసెను. జక్కన ఆ సారస్యమును గ్రహింపలేదు. ఇక గోపరాజు ప్రాసకక్కుర్తికి లోనై 'పవిత్రగురుద్రోహి', 'పుత్రులు కలిగియు' అను నిరర్థకములను వాడెను. మూలము నితడును అవగాహన చేసికొనలేదు.
నాలుగవ అక్షరము "రా"కు మూలము
"రాజన్! భోస్తవ పుత్రస్య
యది కల్యాణ మిచ్ఛసి
దానం దేహి ద్విజాతిభ్యో
వర్ణానాం బ్రాహ్మణోగురుః."
ఈ శ్లోకమున కథానాయకుడగు నంద భూపాలుడు తన గురువైన శారదానందుని చంపనెంచిన పాపమునకు ప్రతిక్రియ సూచింపబడినది. దీనికి జక్కన
“రాజేంద్ర విజయపాలుని
రాజిత శుభమూర్తి జేయు రతి గలదేనిన్
ఓజఁగొని విప్రకోటిం
బూజింపు మనూనదాన భోజనవిధులన్"
అని మూడు చరణముల భావమును చక్కగా అనువదించి నాల్గవ చరణమును వదలి వేసెను.
గోపరాజు “రాజ భవదీయుఁడైన త
నూజునకున్ శుభము నోజ నూల్కొను విద్వ
ద్రాజికి ధనదానము ని
ర్వ్యాజమునంజేయు మిహపరంబులు గలుగున్"
అని మూడు చరణములనే అనువదించి నాలుగవ చరణమును వదలి మూలమున లేని 'ఇహపరంబులు గలుగున్' అని చేర్చినాడు. దీనిని బట్టి గోపరాజు మూలమునే ప్రధానము అనుసరించెను. కాని జక్కనను అనుసరింప లేదని చెప్పవచ్చును.
కావ్యమందలి విశేషవిషయములు :
గోపరాజు తన కావ్యమునందు అనేక విషయములను ప్రాసంగికముగ అక్కడక్కడ చెప్పినాడు. మూలమునందు కొన్ని విషయములు సూచింప బడినవి. ఆతడు వానిని విస్తరించి తన సమకాలిక విశేషములనే తెలుపుటకు ప్రయత్నించెను.
1. స్త్రీ స్వరూప స్వభావములు :
భర్తృహరి భార్యావంచితుడై స్త్రీల మనశ్చాంచల్యమును అసహ్యించికొను ఘట్టమున మూలశ్లోకములను వదలి స్వతంత్రముగ నిట్లు వ్రాసినాడు.
ఆ.వె. కప్పురంపుఁ గుదుటఁ గస్తూరి యెరువుతో
నుల్లినాటి చందనోదకముల
బెంపిరేని దాని కంపుమాయని భంగి
నెంతయైన నిలువ దింతి మనము. (1-98)
క. వనిత యొరుఁజూచి లోనగు
నన నిక్కము పతియుఁ దోడి యతివలుఁ బరుఱం
గని విని యెగ్గొనరించెద
రని మానిన మానుగాక యడ్డము గలదే.
సీ. మదమెక్కు చన్నులు మాంసపు ముద్దలు
హేమకుంభములకు నెక్కుడనుచు
దూషిత మూత్ర పురీష దుర్గంధమౌ
జఘనంబు కరిశిరస్సదృశమనుచు
జిలిబికిం బుసులకుఁ జీమిడికిన్ బుట్టి
యైన మొగంబు సుధాంశుఁ డనుచుఁ
గండలుఁ దోలు బొక్కలు గూడఁ బొదవిన
యాకృతి పసిడి సళాక యనుచుఁ
దేగదైన పెదవి త్రేగ డమృతమని
కవులు వొగడఁ బేరు గలిగెఁ గాక
తత్త్వమెఱిఁగి యిట్లు తలపోసి చూచిన
నింతి రోఁత కెల్ల నిల్లు గాదె. (1-100)
2. స్త్రీ జాతులు { 1-214)
మూలమునందు బహుశ్రుతుడను మంత్రి తనరాజు భార్యారూపమును చిత్రపటముగా వ్రాయించెను చిత్రకారుడు “స తు తస్యారూపం సాక్షాదాలోక్య పద్మినీ లక్షణయుక్తాం తాం విలిలేఖ" అని ఉన్న వాక్యమును పురస్కరించికొని గోపరాజు కొక్కోకము నందు చెప్పబడిన స్త్రీల నాలుగుజాతులు 'పద్మినీ, చిత్తినీ, శంఖినీ, హస్తినీ' లక్షణములను గూర్చి వివరించెను.
3. శకునములు- మూలములో "అకాలవృష్ట్యాదీని దుర్నిమిత్తాని బభూవుః,
"అకాలవృష్టిః తు అథ భూమికంపో, నిర్ఘాత ఉల్కా పతనం తదైవ"
అని మాత్రమే కలదు, గోపరాజు వీనిని వదలి సామాన్యముగా తెలుగువారు పాటించు దుశ్శకునములను చెప్పినాడు.
“పిల్లులు పోరాడుట, బల్లిపలుకుట, తంబళివాడు కనబడుట, ఎదుట తుమ్ముట, దూడను పోగొట్టుకొన్న ఆవు అరచుట, కంపమీది కాకి అరచుట, కుష్ఠురోగి తలకు నూనె రాచుకొని వచ్చుట, మైలబట్టలతో చాకలి ఎదురగుట, కాకి గోరువంక భరద్వాజపక్షి ఎడమ వైపునకు పోవుట, పాలపిట్ట, భరద్వాజపక్షి, పైడికంటి, గుడ్లగూబ కూయుట, పాము ఎదురగుట" ఇవి దుశ్శకునములు. (1-230)
4. డేగవేట- మూలమున లేదు.
5. చేపలవేట- మూలమున లేదు.
ఆకాలమున ఏయే పక్షులను వేటాడుచుండిరో, చేపలలో ముఖ్యజాతు లేవో చెప్పెను. (1-238)
6. వృక్షజాతులు - విక్రమార్కుని ఉద్యానవనము నందున్న మామిడి, అశోక, వకుళ, పున్నాగ, జంబూ, వృక్షములను ఒక్కొక పద్యమున ప్రత్యే కముగ చెప్పి చింతచెట్లను గూర్చి 8 పద్యములు చమత్కారముగ వ్రాసెను. (3-145)
7. వస్త్రవిశేషములు- విక్రమార్కుని అంతఃపురస్త్రీలు నానావిధములైన వస్త్రములు ధరించుచుండిరని వాని పేరులు తెలిపినాడు. 49 విధములైన పట్టు-నూలు చీరల రకములను చెప్పెను. పాల్కురికి సోమనాధుడు బసవపురాణములో 56 విధములైన పట్టు-నూలు చీరలను పేర్కొన్నాడు. వానిలో కొన్నిటిని గోపరాజు పేర్కొనెను. ఉభయులును చెప్పినందున ఆనాడు కాకతిరాజ్యములో చేనేత పరిశ్రమ ఉచ్చస్థితిలో ఉండెనని తలప వచ్చును. (3-183)
8. ఆభరణ విశేషములు - రాణులు పాదమునుండి శిరస్సువరకు ధరించు 14 విధములైన అంగాభరణములను చెప్పెను. (3-188 వచనం.)
9. రాజకర్తవ్యములు. మూలమునందు రాజకర్తవ్యములు పంచ యజ్ఞములుగా చెప్పబడినవి.
"దుష్టస్యదండః, సుజనస్యపూజా,
న్యాయేన కోశస్యచ సంప్రవృద్ధిః
సుపక్షపాతోర్థిషు, రాజ్యరక్షా
పంబైవయజ్ఞాః కథితాః నృపాణాం.”
దీనిని గోపరాజు విపులీకరించెను.
సీ. దుర్గరక్షణమును, దుష్టశిక్షణమును
శిష్టపాలనమును సేయవలయు
వర్ణధర్మములను వనములు గుళ్ళును
జలజాకరంబులు నిలుపవలయుఁ
గృషియు వాణిజ్యంబు గృహజీవధనములు
నాయుర్ వ్యయంబులు నరయవలయు
అనదల అర్థుల ఆర్తులఁ బాత్రులఁ
బూజ్యుల విప్రులఁ బ్రోవవలయు
బలముఁ దెంపుఁ గలిగి అలుకయుఁ గరుణయుఁ
జలము నిలుకడయును జరుపవలయు
నయముఁ బ్రియము వైరిజయముఁ గార్యముఁ గొల్వు
నితర రాజగతుల నెఱుఁగవలయు. (4-83)
9. విటభేదములు- అమూలకము (4-241)
10. వేశ్యమాత చర్యలు- అమూలకము. (4-243,55)
11. మధుపానగోష్ఠి- అమూలకము. (4-256)
12. యోగశాస్త్రము- మూలమున లేకున్నను యోగ విశేషములు 8 పద్యములలో చెప్పబడినవి. (5-12,17)
13. మల్లయుద్ద విశేషములు- మూలమునలేని, తనకాలమున వాడుకలో ఉన్న మల్లయుద్ధమును గూర్చి విపులముగ వ్రాసినాడు. కలహకంటక ఏకాంగవీరులను ఇద్దరు భటులు పంతముతో తలపడుదురు. ఆ సందర్భమున దంద్వయుద్ధపద్ధతులు, దాని నియమములు, మల్లుల వస్త్రధారణ, తొమ్మిది విధములైన పట్లు మొదలైన వానిని చెప్పెను. (7-45,64)
14. స్వప్నశాస్త్రము- మూలమున ఇరువది మూడవ సాలభంజిక కథలో స్వప్నములను గూర్చి ఇట్లున్నది:
“స్వప్నాస్తు ద్వివిధాః, కేచన శుభాః శుభఫల ప్రయచ్ఛంతి, కేచన అశుభాః అశుభఫలం ప్రయచ్ఛంతి తత్రశుభాః :
శ్లో॥ ఆరోహణం గోవృషకుంజరాణాం, ప్రాసాదశైలాగ్రవనస్పతీనాం
విష్టానులేపో రుదితం నితాంతం, శుభాన్యగమ్యాగమనం తథైవ॥
“ఖరోష్ట్ర మహిషవ్యాఘ్రాన్ స్వప్నే యస్త్వధిరోహతి
షణ్మాసాభ్యంతరే తస్య మృత్యుర్భవతి నిశ్చయాత్॥
"ఆరోహణం కంటక వృక్షవాహవైర్యుష్ట్రకాణా మథ దర్శనాని
కార్పాస తీవ్రోరగ పోత్రి శాఖామృగాదిమానా మశుభాని లోకే"
ఫలకాలశ్చ-
“స్వప్నస్తు ప్రథమే యామే, వత్సరేణ విపాకభాక్
ద్వితీయే చాష్టభిర్మాసైః, త్రిభిర్మాసైః తృతీయకే.
అరుణోదయ వేళాయం, సద్యః స్వప్నఫలం భవేత్."
అని చెప్పబడినది. వీనినే గోపరాజు గ్రహించెను ,
స్వప్నఫలకాలములను మాత్రము యథాతథముగ ఆనువదించినాడు. శుభాశభ స్వప్నఫలములు చెప్పుటలో మూలమున లేని వానిని చాల చెప్పెను. ఇవి నాటి జనవ్యవహారములోనివి కావచ్చును.
శుభ స్వప్నములు- ఏనుగు, గుఱ్ఱము, పచ్చనిమ్రాను, మేడ, పోతుపసరమును ఎక్కినట్లు వచ్చిన కలలు శుభములు. పాములు తేళ్ళు జలగలు కరచినట్లు వచ్చిన చావును చెప్పును. శరీరమునకు మలము పూసుకున్నట్లు, స్త్రీలతో రమించినట్లు వచ్చిన శుభములు. తలను పేనుకొరుకుట, ప్రేవులు చుట్టుకున్నట్లుండుట, నెత్తురు, కండలు, పాలు, పెరుగు, కల్లు, నేయి త్రాగుట శుభములు. నీటిని, రక్తమును చూచిన దీర్ఘాయువు, మంట, గంట, పచ్చని పంట, తెలుపురంగు కనబడిన మంచిది. బూడిద, ఎముక, ధాన్యపుపొట్టు, ప్రత్తి, ఉప్పు కనబడిన చెడ్డది. మొద్దును, గాడిదను, దున్నపోతును, ఒంటెను ఎక్కిన, అన్నమును, పిండిని, నువ్వులను తినిన కీడు కలుగును. ఏనుగు, దేవత, కస్తూరి, గోపురము, నీలమణులు, మేఘములు, భూమి, యమునానది, కుండలు తప్ప కలలో ఇతరములైన నల్లవస్తువులు చెడ్డవి. నూనె, కలినీళ్ళు, క్రొవ్వు, తేనె త్రాగిన చెడ్డది. కోతి, పొగ, కాకి కనబడిన చెడ్డది. ఈ శుభాశుభములను విడిగాకాక కలిపి కలగావులగము చేసినాడు. ఇది శాస్త్రీయ పద్ధతి కాదు. (9-71)
15. జ్యోతిషము- ఇరువదియైదవ సాలభంజిక కథలో మూలమున దీర్ఘక్షామము ఏర్పడు గ్రహగతులు చెప్పబడగా గోపరాజు వానితోబాటు సామాన్యములైన గ్రహస్థానములు - ఫలములు మాత్రము చెప్పెను. ఆతనికి ఈ శాస్త్రమున విశేష పరిచయముండినచో విశేషముగ వ్రాసి యుండును
16. జూదము, ఆటలు- ఇరువది యేడవ సాలభంజిక కథలో ఒక జూదగాని ప్రస్తావన ఉన్నది. వాడు తన్నుగూర్చి “దురోదర విషయే అహమేవ విచక్షణః, నాన్యః, అన్యచ్చ వారిక్రీడాం వరాట ముష్టించ జానామి” అని మాత్రమే చెప్పెను. ఇందలి వారిక్రీడ, వరాట ముష్టి అను ఆట లెట్టివో తెలియదు. గోపరాజు వానిని వదలి తెలుగువారికి ప్రియమైన ఆటలు చతురంగము- పాచికల ఆట, పులిజూదములను పేర్కొన్నాడు. (10-87)
17. చోరకళ - మూలమునలేని చోరవిద్యను గోపరాజు అదనముగా చెప్పెను. ఇందు చోరులు ఎట్టి వేషముతో ఉందురో, వెంట ఏయే వస్తువులు గొనిపోదురో, ఎట్లు మెలగెదరో, ఏమేమి చేయుదురో విపులముగా తెలిపినాడు. (10-117)
18. గణక పద్దతులు - మూలమున లేకున్నను గణకుని విధులు, ఆయ వ్యయముల లెక్కలు వ్రాయు పద్దతులు, వ్రాయకూడని విధానములు విపులముగా చెప్పబడినవి. రాజకోశముల దగ్గర ఉండు గణకులు వ్రాసిన లెక్కలను, వ్రాతలను ప్రభువు స్వయముగా పరిశీలించవలెనట. ఈగణకులే కరణములట.
క. కరణము తన యేలిక కుప
కరణము, నిర్ణయ గుణాధికరణము, ప్రజకున్
శరణము పగవారలకును
మరణము నాఁజెల్లు నీతిమంతుండైనన్. (11 - 95, 101)
19. సేవకుని విధులు- మూలమునలేని సేవకవిధులు, ఉత్తమభృత్య లక్షణములు, దుష్టసేవక లక్షణములు వివరింపబడినవి. ఇందు లేఖక, లెంక శబ్దములు పర్యాయ పదములుగా వాడబడినవి. లేఖక పదము నుండియే లెంక వచ్చియుండును.(11-106)
20. చతుష్షష్టికళలు- మూలమున లేకున్నను చతుర్దశ విద్యలను, చతుష్షష్టి కళలను ఒక దీర్ఘ వచనమున చెప్పేను. (11-168)
21. ఛందోవిశేషములు - మూలమున లేని ఛందో విశేషములను గోపరాజు చెప్పెను. దండకారణ్యమును వర్ణించు సందర్భమున 13 ఛందములు మాత్రము చెప్పబడినవి (5-54). అందును అనుష్టుప్, త్రిష్టుప్, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి ఛందములలో బుట్టినవని కవిజనాశ్రయకారుడు చెప్పిన వృత్తములను వదలి క్రొత్త వృత్తములను గోపరాజు చెప్పెను. హరిణీవృత్తము అష్టిఛందములోనిదిగా మార్చెను. ఆ తరువాత ధృతి, కృతి, ప్రకృతి, సంకృతి, ఉత్కృతి ఛందములలోని వృత్తములను కవిజనాశ్రయము నుండియే గ్రహించెను. అందు 26 ఛందములు పేర్కొన బడినవి.
తొమ్మిదవ బొమ్మ కథలో ఆంధ్రచ్ఛందో విశేషములను, అందును యతిప్రాసలను, ప్రసక్తి కలిగించుకొని చెప్పినాడు. తెలుగు కవితకు యతులు ప్రాసలు ముఖ్యములని తెలిపి, పదమూడు విధములైన వళ్ళు చెప్పినాడు. యతిని వడి ఆందురు. గోపరాజు కవిజనాశ్రయచ్ఛందస్సును అనుసరించెను. అందు స్వరయతి, వర్గయతి, అఖండయతి, ప్రాదియతి, బిందుయతి, ప్లుతయతి, సంయుక్తాక్షరయతి, ఎక్కటియతి, పోలికయతి, సరసయతి అను 10 విధములు చెప్పబడగా, గోపరాజు వాటికి వ్యంజనయతి, గూఢస్వరవ్యంజన యతి, వృద్ధియతి అను మూటిని చేర్చి 13 వళ్ళను చెప్పినాడు. అఖండయతి బిందుయతులను నిత్యసమాసయతి, అనుస్వారయతి అని మార్చెను. ప్రథమ పరిష్కర్తలు గోపరాజు అఖండయతిని చెప్పలేదను ని ఒక పద్యము నందలి ఆప్రయోగమును మార్చిరి.
"... ... దేవేంద్రువీడ్కొని తేరిమీద
నిడికొని యుజ్జయినికి దెచ్చి వేడ్కసిం
హాసనంబెక్కి యాయవనివిభుఁడు” (1-137)
అని యున్నదానిని “నిడికొని యుజ్జేని కేతెంచి వేడ్క "అని సవరించిరి. 'ఇడికొనికి' 'నిడికొని' రూపాంతరమున్నట్లు భారత ప్రయోగమును బట్టి సమర్థింపవచ్చును (ఆదిపర్వము). కాని గోపరాజునకు అఖండయతి సమ్మతమే అగునని క్రిందిపద్యము వలన చెప్పవచ్చును,
"డాయఁగ సమసింపఁగఁ బా
రాయణ నారాయణాంతరంగా నేకా
నాయాసాదులఁ గర్ణర
సాయనముగ రెండువళ్ళు జరుగుచునుండున్" (4-207)
అట్లే బిందుయతిని గూడ వాడినాడు.
“గం, డక శార్దూల వరాహ సింహ కరిగణ్యంబౌ నరణ్యానికిన్ (3-12)
గోపరాజునకు తరువాత 17 శతాబ్దివాడైన కూచిమంచి తిమ్మకవి తన “సర్వ లక్షణ సారసంగ్రహము"లో 22 వళ్ళను చెప్పి ప్రాదియతులకు గోపరాజు పద్యమునే ఉదాహరించెను. అప్పకవి అనవసరముగ విభజించి 41 యతిభేదములను చెప్పినాడు.
కవిజనాశ్రయమున 6 విధములైన ప్రాసలు చెప్పబడినవి. గోపరాజు వానినే గ్రహించి అందలి సుకరప్రాసమును వదలి చతుఃప్రాసమును చెప్పెను. అన్నిటికిని ఉదాహరణములను చెప్పి తన సామర్థ్యమును చూపుటకై సర్వప్రాస కందమును చెప్పినాడు.
క. కుండలి బాలకులకు నధి
కుండగు భుజగేంద్రనాయకుండటు మెచ్చం
గుండ యమృతంబు నేఁడీ
కుండఁగఁ దగదనుచుఁ దప్పకుండఁగ నిచ్చెన్.” (9-139)
గోపరాజు వలపలగిలక ప్రాసమున గూడ పద్యము చెప్పినాడు.
శా. కాశ్యపిలోఁబ్రసిద్ధమగు కంచిని నుండుదు విష్ణుశర్ముడం
గశ్యపగోత్రజాతుఁ డ, వికార విదూరమనస్కుఁడన్ జగ
ద్వశ్యకళావిశారదుఁడ, దైవము చెయ్ది దరిద్రభావనా
కార్శ్యమునొంది ఖార్య గడుఁ గష్టపుఁ బల్కులు వల్కనోర్చితిన్. (8-206)
ఇట్టిది 'సంయుక్త విశేషప్రాస' కాదగునని శ్రీ రావూరి దొరస్వామి శర్మగారు చెప్పిరి. [16] గోపరాజు, ప్రమాదమున గావచ్చును ప్రాసభంగమును చేసినాడు.
"నీ కే వాంఛయు లేకయున్న వినుమా నిన్నెవ్వఁడీక్షించినన్
మాకిష్టంబు సరస్వతీవిభవ మామర్త్యుండు వే పొందు వా
క్ప్రౌఢుండై విలసిల్లఁ జేసెదము భూపాలాగ్రణీ నీయశం
బాకల్పంబుగ నొప్పుఁగాత జనలోకానందమై సాంద్రమై." (12-106)
ఇందలి మూడవపాదమును “వాక్ఛ్రీకుండైవిలసిల్లఁ జేసెదము ధాత్రీనాయకా"అని సవరింప వచ్చును; కాని స్వతంత్రించుట న్యాయముకాదు. వ్యాకరణ విశేషములు :
గోపరాజు చక్కని పాండిత్యము గలవాడని అతని ప్రయోగములు చెప్పుచున్నవి. సుప్రసిద్ధవ్యాకర్త పరవస్తు చిన్నయసూరి ఈ కావ్యము నుండి ఉదాహరణములను తన బాలవ్యాకరణమున చెప్పినాడు.
'ససేమిరా' కథలో "సేతువుఁగని జలనిధి సం, జాతధనుష్కోటిఁ బడిన సద్ద్విజహతికిం, బాతకము వాయు" అని వ్రాసెను. సామాన్యముగా దీనిని చదివినప్పుడు అర్థము సరిగా స్పురింపదు. మూలము నందలి 'సేతుం దృష్ట్వా '- అనుదానికి 'సేతువుఁగని' అని గోపరాజు అనువదించెను, 'క్త్వా'ర్థమునకు హేత్వర్థమున్నట్లు ప్రౌఢవ్యాకరణ కర్త చెప్పినాడు. కొన్ని ప్రసిద్ధ ప్రయోగములు గూడ కలవు. కాళిదాసుని కుమారసంభవము నందలి రతివిలాపమున “స్మర సంస్మృత్య న శాంతి రస్తి మే"అనుప్రయోగమున్నది. ఇందలి క్త్వార్థమునకు హేత్వర్థమునే చెప్పవలెను. అట్లే స్కాందపురాణము నందలి శ్రీ శైలఖండములో "శ్రీ శైలేశిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" అనుచోటను హేత్వర్థమునే చెప్పవలెను. అట్లే గోపరాజు ప్రయోగమగు 'సేతువుఁగని' అను దానికిని 'సేతువును చూచిన' అని హేత్వర్థమునే చెప్పవలెను.
ఈ కావ్యమందొకచోట గుఱ్ఱముల పేర్లుగల ఒక పద్యమున్నది.
క. ఒనరించిన నీలని నడ
గని బొల్లనిఁగత్తలానిఁ గైరని సారం
గని జారని జన్నని నిమ
వని మొదలుగఁ దెచ్చినిలిపె వాహకుఁ డెదురన్. (3-141)
ఈ పద్యమును చూచియే చిన్నయసూరి తన బాలవ్యాకరణమున ఆచ్చిక పరిచ్చేదమునందు “మహత్తులగు మగాదులకుం గయిరాదులకును డుఙ్ఙగు నుత్వంబుగాదు" (4) అను సూత్రమును చెప్పినట్లు తోచుచున్నది. ఉదా:- మగఁడు, మనుమఁడు, కయిరఁడు, కత్తళఁడు. మగ, మనుమ, రాయ, పాప, వ్రే, ఱే, ఈ, కా ప్రత్యయాంతంబులు - ఇత్యాదులు, మగాదులు. కయిర, కత్తళ, జన్న, నీల, ఇత్యాదులు కయిరాదులు."
కయిరాదులు తిర్యగ్వాచకములగుటచే అమహత్తులు గావున వానికి 'డుఙ్ఙ' రాదు. అందుకై ఈ సూత్రము చెప్పవలసి వచ్చినది. దీనినిబట్టి పై పద్యమునందలి పదములకు 'డు' ప్రత్యయము వచ్చి సీలఁడు, నడగఁడు, బొల్లఁడు, కత్తలఁడు, కైరఁడు, సారంగఁడు, జారఁడు, జన్నఁడు, నిమవడు అను రూపము లేర్పడును. వాని ద్వితీయావిభక్తి రూపములే పై పద్యమున కానవచ్చునవి. కత్తలఁడు, కత్తలాడు అను రెండు రూపములున్నవి. మహా కవియగు శ్రీనాథుడు తన నైషధములో "కర్తలాణి తేజీహయమున్" అని ప్రయోగించెను. గోపరాజు ఆ ప్రయోగమును చూచి 'కత్తలాని' అని వాడి యున్నాడు.
మరొక పద్యమున
“తేగడైన పెదవి త్రేగుడమృతమని
కవులు వొగడఁ బేరు గలిగెఁగాక " {1-100)
అని త్రేగుడు ప్రయోగింపబడినది. బాలవ్యాకరణ కృదంత పరిచ్ఛేదమున “గడ చేర్వాదులకగు" అను 15 సూత్రమున త్రేగడ చెప్పబడినది. ఇట్లే ఎన్నియైన జూపవచ్చును.
ఈ కావ్యమున అక్కడక్కడ క్త్వార్థకేకారసంధి వంటి వ్యాకరణ విరుద్ధ ప్రయోగములును కొన్ని కానవచ్చుచున్నవి.
“ఉండిరుదకంబులో మునిగున్న పగిది” (4-102)
“యేకోనవింశతిమద్వారము పొంత బొమ్మపలికెన్"వంటివి ప్రమాద పతితములు కావచ్చును.
అపూర్వపద ప్రయోగములు:
గోపరాజు తన కావ్యమున ఇతరులు వాడని, నిఘంటువులలో సాధారణముగ కనబడని కొన్ని అపూర్వ పదములను వాడినాడు. అవి అతడున్న ప్రాంతమున వ్యవహారము నందుండినవి కావచ్చును, శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు ప్రథమ ముద్రణ పీఠికలో కొన్నిటిని చూపి ఆర్థములను వ్రాసినారు. అవి గమనింపదగియున్నవి. భానగిలు = బలాత్కృతమగు, కాసించు = కాసెవోయు, వెంచ = మడువు, పాగు = రహస్యము, పరిణయించి = పెండ్లాడి, వెలగ = ధనము, వెట్టము = విరోధి, పరిమాళించుట= మల్లయుద్ధము చేయుట, వయ్యంది= కొలిమి, ఇవికాక మరికొన్ని కలవు. ఉద్దాలు = చెప్పులు, సన్నాలు = పిల్లల మొలనూలు , చక్కదము = మంచిది, పుల్లతి = మల్లయుద్ధ పద్ధతి, ఉబ్బసము = మిక్కిలి సంతోషము.
లోకోక్తులు - సామెతలు :
గోపరాజు సందర్భోచితముగ పలు సామెతలను, లోకోక్తులను వాడెను.
“బాణోచ్చిష్టం జగత్రయం" 1-26
"బ్రహ్మస్వం విషముచ్యతే" 1-176
“కామాంధోపి న పశ్యతి" 1-225
“రాజ్ఞాం ప్రజాపాలనం పరమో ధర్మః" 1-197
“న భూతో న భవిష్యతి" 2-65
“ధనమూల మిదం జగత్" 2-178
"భూయాత్తే సంపద్దీర్ఘాయుర్భవతే" 3-198
"పరోపకారార్థ మిదం శరీరం" 4-34
“మూలం వైరతరోః స్త్రీ" 4-48
"కలౌ మైలారు భైరవా" 4-73
"అనిత్యాని శరీరాణి" 4-141
“ధర్మస్య త్వరితా గతిః" 4-143
“ధర్మే తిష్ఠతి తే బుద్ధిః" 10-11
“బుద్ధిః కర్మానుసారిణీ" 10-148
"నా విష్ణుః పృథివీపతిః" 12-91 సామెతలు
“కడుపిటు గాలంగ కంట కాటుక యేలా" 1-86
“హనుమంతుని యెదుట కుప్పిగంతు లెగయుట" 2-49
“కప్పకాటు-బాపనపోటు" 4-130
“ముంజేతి కంకణమున కద్దంబేటికి" 7-84
"మూర్ఖు భారతపర్వంబు పఠింపబూనుట" 8-2
“ఆందనిమ్రాని పండులకు అర్రులు సాచుట" 8-86
“యేనుఁగు చిక్కెనేని మఱి యెంపలి చెట్టునఁ గట్టవచ్చునే" 11-27
"ఈశ్వరనిరాకరణం బది రిత్తవోవునే" 11-60
“ఇల్లు గాలంగ నుయిఁద్రవ్వ నేగుటండ్రు” 11-120
కవితా విశేషములు:
గోపరాజు కవితా కౌశల్యమును కావ్యమున ప్రతి కథ యందును చూడవచ్చును. ఆవతారికలోనె ఆతడు తన సామర్థ్యమును చెప్పినాడు.
చ. తెనుఁగునఁ దేటగాఁ గథలు దెల్పినఁ గావ్యము పొందులేదు మె
త్తన పసచాలదంద్రు విశదంబుగ సంస్కృత శబ్దమూఁదఁ జె
ప్పిన నవి దర్భముండ్లనుచుఁ బెట్టరు వీనులఁ గావునన్ రుచుల్
దనరఁ దెనుంగు దేశియును దద్భవముం గలయంగఁ జెప్పెదన్.(1-32)
ఇందలి 'తెనుంగు' పదమునకు 'తత్సమ' మని గ్రహింపవలెను. సాంస్కృతికములు, అచ్చతెలుగులు సమానముగా ఉపయోగింప గల ప్రజ్ఞ గోపరాజునకున్నది.
సంస్కృతపద భూయిష్ట రచన :
క. ఉల్లోల దుగ్ధసాగర
కల్లోల కరాగ్ర మంద కంపిత ఫణభృ
ద్వల్లభమణిమయ దోలా
వేల్లన సుఖలోలుఁడైన వేల్పుం దలఁతున్. (2-164)
మ. చని యచ్చోట విభుండు చేరె సుమనోజాల ప్రవాళావళీ
జనితానేక సకామపంచశర చంచచ్చాపవల్లీ గుణ
ధ్వని శంకావహ ఝంకృతి ప్రవిలసత్సంగీత భృంగాంగనా
ఘన సంతోష విశేష కల్పలతికా కందంబు మాకందమున్. (3-145)
అచ్చ తెలుగులు :
క. మొలఁ బులితోలును మేనం
బలుచని వెలిపూఁత యఱుతఁ బాములపేరుం
దల మిన్నేఱును జడలను
జలివెలుఁగుం గలుగు మేటి జంగముఁ గొలుతున్. {2-59)
సీ. పొదలిన కూటమి పిదప మెల్పునఁ గల
గనయంబు డాకేలఁ గొని తెమల్చి
పోఁడిమిగల పాపఱేఁడను సెజ్జపై
నూఁతగా వల కేల నొయ్యహత్తి
క్రొమ్ముడిఁ జెరివిన కమ్మని క్రొవ్విరు
లెడలి వెన్నున జాఱి కడలుకొనఁగ
లేచి వేంచేయుచోఁ జూచి వెన్నుఁడు సొంపు
రెట్టింపఁ గ్రమ్మఱఁ బట్టి యెడఁదఁ
దమక మినుమడిగాఁ గౌను దక్కఁదొడిగి
బిగువుఁ గౌఁగిటఁ గదియంగఁ దిగిచి తివుట
మోవి గదియంగఁ గోర్కులు మూరి బుచ్చు
కలిమి యాబిడ చూడ్కులు గాచుఁ గాత. (4-219)
మిశ్రమము :
శా. కాయజొచ్చెంరసాలముల్ విరహులాకంపింపఁగాఁ గోయిలల్
గూయంజొచ్చె మనోజదిగ్విజయ మాఘోషించుచుం దుమ్మెదల్
మ్రోయంజొచ్చె నవీన పుష్పశరముల్ మొత్తంబుగాఁ జిత్తజుం
డేయంజొచ్చె సతు ల్మదిం గలఁగగా నెచ్చోటులం దానయై. (7-12)
క. కలకల బలికెడు పక్షుల
కలకలములు సకలదిశలఁ గలయఁగఁ బొలయం
దళదళికులముగ దశశత
దళదళములు విరియఁ బ్రొద్దు దళతళఁ బొడిచెన్. (1-28)
కృతులలో అష్టాదశవర్ణనలుండవలెనని లాక్షణికులు చెప్పిరి. గోపరాజుకూడ చెప్పెను.
క. కావునఁ బదునెనిమిది యగు
నీ వర్ణన లచట నచట నించుక బెరయం
గావించెద నిటఁ బనికిని
రావనకుఁడు లక్షణాభిరామములగుటన్. (1-38)
ఈ కావ్యమునందలి అష్టాదశవర్ణనలను విస్తరభీతిచే ఉదాహరింపక విడుచుచున్నాను. సహృదయులు పరిశీలింప గోరెదను. గోపరాజునకు సంయమము తక్కువ. వర్ణనాలోలుడగుట అతని స్వభావము. పలుచోట్ల ఈ వర్ణనలు కథాగమనమునకు అడ్డు తగులుచుండును. ఆనేక వర్ణనలలో ప్రాచీన కావ్యచ్ఛాయలు, అనుకరణములు గోచరించును.
“పల్లవ వైభవాస్పదములు పదములు" (భాగవతము)
“పల్లవ సంపదాస్పదములు పదములు" (1-204)
క. సరి దావచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళసలిలము భంగిన్ (సుమతిశతకము)
క. మును దనకుం గానున్నది
పని వడియగు నారికేళ ఫలరసముక్రియం
జన నున్నది చనుఁ గరి గ్ర
క్కున మ్రింగిన వెలగపండు గుంజును బోలెన్. (5-286)
“ప్రాచీదిశాంగనా ఫాలతలంబున
దీపించు సిందూరతిలక మనఁగ" {భాగవతము)
"ప్రాచీవధూటికా ఫాలభాగంబున
బెట్టిన కెంపుల బొట్టనంగ" (5-85)
తరువాతి వారిలో ఇతని ఛాయలు కన్పించును. మచ్చునకొక పద్యము
“కాకులలోఁ గోకిలములు
కాకులఁ బడలేక కులము గలయఁగఁ బవనుం
డాకుల పాటొనరింపఁగ
నాకుల పాటయ్యె విరహులగు లోకులకున్" (7-9. సిం. ద్వా)
“ఆకులపాటుజూచి యిపుడాకులపాటొనరించె నెంతయున్" {తారాశశాంకము)
గోపరాజునకు బంధకవిత్వము మీద ప్రీతి కలదని క్రింది పద్యముల వలన తెలియుచున్నది.
సీ. రాజేంద్ర యారక్షరముల పేరిటివాఁడ
నాద్యక్షరము మాన నశ్వవేది
రెండక్షరములఁ బరిత్యజించిన నాట్య
కర్త, మూడుడిపిన గతవిదుండ
నాలుగు నుడిగింపఁ జాలనేర్పరి, నైదు
విడిచిన బుధుఁడ నీ విధముగాత
సర్వాక్షరంబులుఁ జదివి చూచిన బుద్ది
బలముఁగాఁగలయట్టి ప్రౌఢుఁడనఁగ
నేతిబీఱకాయ నీతి గాకుండఁగ
నిన్నివిద్యలందు నెన్నఁబడ్డ
సార్థనాముఁడైన యర్థిగా నెఱుఁగుము
విబుధ పంకజార్క; విక్రమార్క. (2-47)
ఈ పద్యము నందలి చమత్కారము ఆశ్చర్యము కలిగించును. ఒక కవి పేరు ఆరక్షరములు గలది. అందులో మొదటి అక్షరము తీసివేసిన ఆశ్వవేది అగునట. రెండక్షరములు తీసిన నాట్వకర్త అగునట. మూడక్షరములు తీసిన గతమెరిగిన వాడట. నాలుగక్షరములు తీసిన చాలనేర్పరి అట. అయిదక్షరములు విడిచిన పండితుడట. అన్ని అక్షరములు కలిపిచూచిన మహాబుద్ధిశాలి యగునట. అతని పేరేది? 'చతురంగతజ్ఞ' అన్నది అతని పేరు. పైన చెప్పినట్లు ఒక్కొక్క అక్షరము తీసిచూడుడు. ఇట్టిదే మరొకటి,
సీ. రాజ్యంబు వదలక రసికత్వమెడలక
జయశీల ముడుగక నయము చెడక
దీనులఁ జంపక దేశంబు నొంపక
నిజ ముజ్జగింపక నేర్పు గలిగి
విప్రులఁ జుట్టాల వెన్నుసొచ్చినయట్టి
వారిని గొల్చినవారిఁ బ్రజల
హర్షంబుతోఁ గాచి యన్యాయ ముడుపుచు
మున్ను జెప్పిన రీతిఁ జెన్నుమీఱి
చేత లొండులేక ప్రాఁతల విడువక
యశము కలిమి దమకు వశము గాఁగ
వసుధ యేలు రాజవర్గంబులోన న
య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను. (7-75)
కృతి సమర్పణము :
గోపరాజు హరిహరాభేదమును పాటించు అద్వైతి. తన కావ్యమును హరునకు, హరికి సమర్పించెను. ఇతనికి పూర్వము తిక్కనాదులును తమ కృతులను హరిహరనాథునకు సమర్పించిరి. ఇతడు హరిహరులను వేరుగా, ఏకరూపునిగ స్తుతించెను. కావ్యారంభమున శివుని, ఆ తరువాత కేశవుని నుతించెను. అవతారికలో “సింహాసన ద్వాత్రింశతి కథా కథనమూలకారణం బైన అంబికారమణుండును, మత్కవితాసంపత్తి సంధాయకుండగు లక్ష్మీనాయకుండును గావ్యనాయకులుగా నియమించుటం జేసి,
సీ. పాపపెండెము గాక పసిఁడి యందియయును
నడుగుఁదామరపైన నమరువాఁడు
పెద్దమెకముతోలు నిద్దంపుఁ బట్టును
మొలదిండుగాఁ గట్టి మురియువాఁడు
ఎముకపూసలును ముత్యములు జేరులు గాఁగ
నక్కునఁ దాల్చి పెంపెక్కువాఁడు
పునుకయుం బెనుగుల్లయును గేలు దమ్ముల
నంచల మాడ్కిఁ బాటించువాఁడు
సగము పొడవునఁదెల్పు నా సగము నల్పు
నయ్యు మెడ నొక్క వన్నియ యగుచు మేను
లెనయ ముక్కంటియును వెన్నుఁడును ననంగఁ
బొల్చు నా వేల్పు కబ్బంబుఁ బ్రోచుఁగాత. (1-40)
అని హరిహరనాథునకు సమర్పించెను. ప్రాచీన కవులందరును తమకృతి భర్తలను, కావ్యారంభమునను, షష్ఠ్యంతములలోను, ఆశ్వాస ఆద్యంత ములలోను స్తుతించినారు. గోపరాజు ప్రత్యేక పద్దతి ననుసరించెను. ఇష్టదైవము కలలో వచ్చి కృతినిమ్మని కోరు స్వప్నవృత్తాంతమును, షష్ఠ్యంతములను విడిచి పెట్టెను. కావ్యారంభమున శివుని, కేశవుని వేరువేరుగను, అవతారికలో ఏకరూపునిగ, ఆశ్వాసారంభములలోను, ప్రతిబొమ్మకథ మొదటను హరినో హరునో వేరుగను, ఆశ్వాసాంతములలో ఒక పద్యము హరికి, ఒకటి హరునకు, ఒకటి ఏకరూపునకును, కావ్యాంతమున ఫలశ్రుతిలో ఏకరూపునిగను స్తుతించినాడు.
గోపరాజునకు తిక్కనాదులపైగల గౌరవముతోడనే గాక మూలము ననుసరించి గూడ హరిహరులను స్తుతించినట్లు కనబడుచున్నది. మూలము నందలి ప్రథమోపాఖ్యానమున భర్తృహరికి దివ్యఫలమియ్యవచ్చిన బ్రాహ్మణుడు హరిహరస్తవముతో ఆశీర్వదించును.
"అహీనమాలికాం భిభ్రత్ తథా పీతాంబరం వపుః
హరో హరిశ్చ భూపాల కరోతు తవ మంగళం॥
హరుని పరముగ - అహి ఇనమాలికాం= పాములకు ప్రభువైన ఆదిశేషుడు అను దండను, తథాపి = అయినను, ఇతాంబరం=వస్త్రము లేని (దిగంబరమైన) వపు = శరీరమును, బిభ్రత్ = వహించునట్టిహరః = శివుడు.
హరి పరముగ - అహీన = వాడని, మాలికాం= దండను (వనమాలను) తథా - అట్లే పీతాంబరం = పచ్చనివస్త్రముగల, వపుః = శరీరమును , బిభ్రత్ = వహించునట్టి, హరిశ్చ = కేశవుడును, నీకు మంగళములు ఇత్తురుగాక.
ఈ శ్లోకమునే గోపరాజు అవతారికలోని సీసపద్యముగా విపులీకరించెను. ఇదే ఉపాఖ్యానములో ఒక దిగంబరుడు విక్రమార్కునిట్లు దీవించును
"లీలయా మండలీకృత్య, భుజంగాన్ ధారయన్ హరః
దద్యాద్దేవో వరాహశ్చ, తుభ్య మభ్యధికాం శ్రియం"
శివపరమైన అర్థము - లీలయా = వేడుకతో, భుజంగాన్ = పాములను, మండలీకృత్య = చుట్టచేసుకొని, ధారయన్ = ధరించినట్టి, హరః = శివుడు.
కేశవపరమైన అర్థము - లీలయా = విలాసముతో, భుజం= భుజమును, మండలీకృత్య = వంచి, గాం= భూమిని, ధారయన్ = ధరించినట్టి. వరాహశ్చ = వరాహమూర్తియు నీకు అధిక సంపత్తులు ఇచ్చుగాక. మూలమునందలి ఈ హరిహర స్తుతి గోపరాజునకు స్ఫూర్తి నిచ్చియుండును.
పాఠ పరిష్కరణము:
ఈ కావ్యమునకు కాకినాడలో ఉండిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు పుస్తక భాండాగారమునందు రెండు ప్రతులుండినవి. ఒకటి తాళపత్రప్రతి, రెండవది మదరాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునందున్న ప్రతుల నుండి పాఠములు గ్రహించి వ్రాయించిన కాగితపుప్రతి. ఇవికాక శ్రీ పోతాప్రెగడ బ్రహ్మానంద రావు పంతులుగారి కడ లభించిన వ్రాతప్రతిని, పరవస్తు చిన్నయ సూరిగారు సూచించిన పాఠములు గల ప్రతిని పరిశీలించి పరిషత్తువారు 1933లో ద్వితీయ భాగమును, 1936లో ప్రథమ భాగమును ప్రచురించిరి. ఆతరువాత మరల 1960లో ప్రథమభాగము ద్వితీయ ముద్రణకు నోచుకొనెను. ప్రత్యంతరములు లభింపలేదు. ఇప్పుడు మరల పరిష్కృతపాఠములతో ఈ ప్రతి ప్రకటింప బడుచున్నది.
ఈ పరిష్కరణములో నేను కావ్యమందును, అధస్సూచికలోను ఉన్న పాఠములలో సమంజసములని తోచిన వానిని గ్రహించి తక్కిన వానిని అధస్సూచికలో ఉంచితిని రెండు చోట్ల మాత్రము సందర్భమును బట్టి సవరణలు చేసితిని. నాలుగవ ఆశ్వాసమున సతుల పేళ్ళు తెలుగులో చెప్పు సందర్భమునందు “చెలువయుఁ గలకంఠి చేడియ నెలతుక" (4-221) అని ఉన్నది. 'కలకంఠి' పదము తత్సమముగాని అచ్చతెలుగు కాదు. అందుకై నేను “చెలువ కలువకంటి చేడియ నెలతుక " అని సవరణ చేసితిని. అట్లే పదవ ఆశ్వాసములోని
క. దేశాధీశ్వరుఁ డర్థుల
కాశాపరిపూర్తి సేయ నారాధితయౌ
నాశాపురమున దేవి ని
వేశాంగణసీమ హోమవిధి గావించెన్. (10–23)
అను పద్యమున తృతీయ చరణము నందలి “ఆశాపురమున" అను పాఠమునకు సందర్భము కుదురదు. మూలమునం దీచోట “ఆశాపూరణి” దేవత ప్రస్తావన గలదు. దానినిబట్టి ఆపాఠమును "ఆశాపూరణి దేవి" అని సవరించితిని. అక్కడక్కడ ఉండిన ముద్రణ స్ఖాలిత్యములను దిద్దితిని. ఆటవెలదులకు బదులుగ గీతమని ఉన్నచోట్ల సవరించితిని. ఇందేవైన దొసగులున్నచో విజ్ఞులు తెలిపిన కృతజ్ఞతతో సవరించికొనెదనని సవినయముగ విన్నవించుచున్నాను.
కృతజ్ఞత
ఈ ప్రాచీనకావ్యము శ్రీవెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారన్నట్లు “సహజమైన శైలితో, లలితములగు జాతీయములతో, మనోహరములగు వర్ణనలతో ప్రశస్తి గాంచినది" అనుటలో అభిప్రాయభేదము లేదు. ఇందు సమకాలిక జనజీవనవిశేషములను గోపరాజు ప్రత్యేకముగ వివరించియున్నందున శ్రీమల్లంపల్లి సోమశేఖర శర్మ గారును, శ్రీసురవరం ప్రతాప రెడ్డి గారును బహుధా ప్రశంసించినారు.
నాకీ పరిష్కరణ పీఠికా రచనలలో అనేక గ్రంథములు తోడ్పడినవి. ఆ గ్రంథకర్తలకును, సంస్కృతమూలగ్రంథము నొసగిన మిత్రులు శ్రీ పి. తిరుమలరావు గారికిని ఋణపడియున్నాను. దీనిని పరిష్కరించు నవకాశమును కల్పించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గము వారికిని, కార్యదర్శి శ్రీ ఇరివెంటి కృష్ణమూర్తిగారికిని కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.
గడియారం రామకృష్ణ శర్మ
అలంపూరు
దుర్మతి జ్యేష్ఠముj
- ↑ ప్రథమ ముద్రణ పీఠిక
- ↑ ఆంధ్ర కవుల చరిత్ర
- ↑ ఆంధ్ర కవి తరంగిణి
- ↑ ఆం.సా. పరిషత్ పత్రిక
- ↑ History of the Reddy Kingdoms
- ↑ వాజ్మయ వ్యాసమంజరి
- ↑ ఆంధ్ర సాహిత్య చరిత్ర
- ↑ సమగ్రాంధ్ర సాహిత్యము
- ↑ వాఙ్మయ వ్యాస మంజరి.
- ↑ History of the Reddy Kingdoms.
- ↑ వాఙ్మయవ్యాసమంజరి.
- ↑ ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక 56 సంపుటి, 6 సంచిక.
- ↑ సమగ్రాంధ్ర సాహిత్యము, 7వ సంపుటము.
- ↑ ఆంధ్ర సాహిత్య చరిత్ర.
- ↑ ఆంధ్ర సాహిత్య చరిత్ర
- ↑ అప్పకవీయ భావప్రకాశిక.