సింహాసనద్వాత్రింశిక/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సింహాసన ద్వాత్రింశిక[1]

ప్రథమాశ్వాసము

___కృత్యాది, దేవతాస్తోత్రాదికము___

శా. శ్రీమత్పర్వతనందనీ[2] తనులతాశ్లింష్టాంగ మై బాహుశా
    ఖామధ్యంబున నున్న పన్నగఫణౌఘం బాకు లై యొప్ప ను
    ద్ధామం బౌ శశికాంతి పుష్పరుచి నొందంగా జటాపల్లవ
    స్తోమం బౌ హరపారిజాతము భజింతు[3] న్వాక్ఫలావాప్తికిన్.

చ. పులుఁగులపెద్ద వారువము, పోటరి బిడ్డఁడు, ఱాఁగరౌతు,[4] పా
    ములగమికాఁడు సెజ్జ, నలుమోములవాఁ డిలుతీర్చుపట్టి, వే
    ల్పులు బలుబంటు, లాకలిమి[5]పొల్తుక, తెల్లనితల్లి పెద్దకో
    డ లనుచు నెల్లవారుఁ బొగడం దగు నల్లనివేల్పుఁ గొల్చెదన్. 2

ఉ. దక్షిణనేత్రకాంతి నుచితంబుగ నర్థవికాస మొంది వా
    మాక్షిరుచిప్రసారమున నర్థము విప్పకయున్న పుండరీ
    కాక్షుని నాభిపద్మనిలయంబునఁ దుమ్మెదభంగి లోలుఁడై
    యక్షయవేదనాదమయుఁడైన విరించిఁ దలంచి మ్రొక్కెదన్. 3

ఉ. కట్టినపట్టపుం దనువు గద్దియతమ్మియ నక్షమాలయుం
   బట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁ
   బుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవా
   కట్టొనరించిన తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్. 4


ఉ. నిద్దములైన భూషణమణిప్రకరద్యుతు లన్నిదిక్కులన్
    దొద్దలువుచ్చి తల్లిచనుదోయిసరిం[6] దలకట్టు మించఁగా
    ముద్దులు సూపుచుం బసిఁడిముద్దగతిం దొడమీఁదనాడు నా
    ముద్దుగణేశునిం దలఁచి మ్రొక్కెద నీకృతికార్యసిద్ధికిన్. 5

క. రుణ్మదపరివృదసురగణ
    తృణ్మోచను సురశరణ్యు ధృతశక్తి ఫణి
    ద్విణ్మయవాహను, హరినిభు[7]
    షణ్ముఖు నభిముఖినిగాఁ[8] బ్రశంసింతు మదిన్. 6

క. ప్రవిమలుఁడని గ్రహరా జని
    కవితాప్రియుఁడని జగత్ప్రకాశకుఁ డనియున్
    భువి విక్రమార్కనృపసం
    భవకారణుఁడనియు[9] లోకబాంధవుఁ దలఁతున్. 7

క. పులుఁగునకై యెవ్వనిమది
    నొలికిన శోకము లకారయుతమై కవితా
    కలనకుఁ దెరు వయ్యెఁ దలం
    పుల నాతనిఁ గొల్తుఁ బుట్టఁ బుట్టిన సుకవిన్. 8

ఉ. శ్రీనిలయంబునాఁగ మురజిద్గుణరత్ననివాసమై యుపా
    ఖ్యానతరంగిణీభరితమై కడగానఁగరాని భారతా
    ఖ్యానపయోధిలోనఁ గల మై నిజయుక్తి భజింపఁ గర్ణధా
    రానుకృతిం గృతార్థత మహాఘనుఁడౌ మునిఁ బ్రస్తుతించెదన్. 9

క. ఆ భారతపర్వత్రయ
     మీ భారతవర్ష మెల్ల నెఱుఁగఁ దెనుఁగునన్

   శ్రీభారతిగతిఁ జెప్పిన
   నాభావురమును[10] దలంతు నన్నయభట్టున్. 10

క. లేముల వాడక శుచియై
    [11]లేములవాడం జరించు లేములవాడం
    దా మెఱసిన భీముని నుత
    భీముని బలభీము విమతభీమునిఁ దలఁతున్. 11

చ. అనఘు హుళక్కి భాస్కరు, మహామతిఁ బిల్లలమఱ్ఱి వీరరా
    జును, ఘను నాగరాజుఁ, గవిసోమునిఁ, దిక్కనసోమయాజిఁ, గే
    తనకవి, రంగనాథు, నుచితజ్ఞుని నెఱ్ఱన, నాచిరాజుసో
    మన, నమరేశ్వరుం, దలఁతు మత్కులచంద్రుల సత్కవీంద్రులన్. 12

వ. అని యిట్లు సకలవరప్రదానకారణదేవతలను జతురహృద్యానవద్యగద్యపద్యవిద్యావిద్యోతితు లయిన
    కవీశ్వరుల నుం బ్రశంసించి తత్ప్రసాదాసాదితసహజసాహిత్యతరంగితాంతరంగుండ నై సకలజనసాధారణం
    బగునట్లిట్లని విన్నవించెద [12]. 13

ఉ. ఆదరణంబు లేక చెడనాడిన బాణమయూరకాళిదా
    సాదులకైనఁ దప్పు గల దన్యుల కే మని చెప్ప వీనితో
    నేదియుఁ గాదు పొ మ్మనక యిందులచంద మెఱింగి తప్పినం
    గా దని తీర్చి యొప్పు గని కైకొని మెత్తురు గాక సత్కవుల్. 14

ఉ. [13]మానుగఁ దప్పులున్న ననుమానము సేయక మోదమానస
      న్మానను లైనవారు పలుమాఱు పరీక్ష [14]లొనర్చి తీర్చినన్.

హీనకవిత్వ మైన మెఱుఁ గెక్కదె [15]నేర్పరులైనవారిచే

సానలఁబట్టి తీర్చినను సన్నపురత్నము వన్నెకెక్కదే. 15

ఉ. భావరసానుకూల మృదుపాక పదార్ధ సమృద్ధి లోక సం
భావన నొప్పు కావ్యముల మర్మము[16] గానగ లేక దుర్మతుల్
కా వన గాని యెట్టి కడగట్టిడి జెప్పగ నేర; రెల్లెడం
ద్రోవనగాక కుక్కలకు దొంతులు వేర్వగ నేర్పు గల్గునే.

16 చ. చులుకని పద్య మైనఁ గడుఁజోద్యము చేయుచుఁ జిన్నవానిఁ బె
ద్దలు గొనియాడఁగాను విని తప్పులు పట్టఁదలంతు రక్షముల్
బిలిబిలి మాట లాడఁ దనుఁ బెంచినవానికి ముద్దుగాక యా
పలికెడు చిల్కపిల్లఁగని బావురుఁబిల్లులు[17] సంతసిల్లునే. 17

ఉ. భీమనపద్య మన్నఁ గడుఁబ్రీతి వహించుచు మేలుమేలు నా
నే మిది చెప్పినార మన నిక్కమె ప్రాసము గూర్చినాఁడ వౌ
నే మిది కాదు దీనివడి కిక్కడి కర్థ మిదెట్టి దీగణం
బే మని పెట్టినాఁడ వని యెగ్గులుపట్టుఁ గుబుద్ధి పెద్దలన్. 18

క. వివరికి వివరించిన కృతి
చవిసాలం బంచదార సరి గూర్చుట యా[18]
యవివేకికి వినిపించిన
కవిత వఱుతఁ జింతపండు గలుపుట చుమ్మీ. 19

ఉ. పూనినరీతి వానితలఁపు ల్వడిఁ బ్రాసములుం జలంబునం
బానగిలంగ నీడ్చి యొకపద్యముఁ గూర్పఁగవచ్చుఁగాక యా
ఖ్యానకథానుకూలముగఁ గావ్యముఁ జెప్ప వశంబె సన్నమై
కానఁగ జల్లి నేయునది కట్టెడుపుట్టము నేయనేర్చునే. 20

క.

ఉర్విఁ గల శబ్దజాలము
నిర్వచనస్థితుల నెఱిఁగి నేర్పున విద్యా
నిర్వాహకుఁ డనఁజెల్లెడు
సర్వజ్ఞుఁడు గానివాఁడు సత్కవి యగునే.

21


క.

ఎప్పటి కేయది ప్రస్తుత
మప్పటి కావిద్య మర్మ[19]మచ్చుపడంగాఁ
జెప్పక సర్వజ్ఞత్వము
చొప్పడునే కావ్య మంత సులభమె ధాత్రిన్.

22


క.

దుర్వాదము గాకుండ న
పూర్వపుఁగృతిఁ జెప్పుసుకవిపుంగవునకుఁ దా
సర్వజ్ఞుఁడ నని మాటల
గర్వింపఁగనేల తొడవు గానంబడఁగన్.

23


క.

చనుఁ “గవివైభవవిద్యా”
యని చదువుటఁ గావ్య మధిక మదియును నల్లి
ల్లును గుడియుఁ జెఱువు నిధియును
వనము సుతుఁడు సంతతులు భవస్థితిగతికిన్.

24


క.

ఎవ్వరు కృతు లొనరింపుదు
రెవ్వరు కృతిలోన వినుతి కెక్కుదు రొరుచే
నవ్విమల[20]కీర్తిసంతతు
లివ్వసుమతిఁ జెడక నిలుచు నినకల్పముగన్.

25


క.

సుగుణులు “బాణోచ్ఛిష్టం
జగత్రయ” మ్మనఁగఁ గొంత చదువఁగఁ బ్రియమే

తగఁ దోడంటినపా[21] లిం
    పుగఁ బెరుఁ గయియున్న నది యభోజ్యంబగునే. 26

క. సంబంధము లగురసభా
   వంబులు మునుకంటె నభినవంబులు గలవే
   యంబుధినె కాక బహు ర
   త్నంబులు వర్తకుల కేమి తాఁ బండినవే. 27

క. తల్లి యగు వాణికరుణం
    దొల్లిటికవు లధికు లనఁగఁ దోఁచిరి పిదపన్
    బల్లిదు లిప్పటి సుకవులు
    తల్లికిఁ గడగొట్టు[22] కొడుకు దాఁ బ్రియమగుటన్. 28

క. ఏజనుల కైన సద్గుణ
   యోజితులై భావ మెఱిఁగి యుచితార్థకళా
   రాజితు లగు కవిరాజుల
   రాజులు చేపట్టిరేని రాజ్యము గాదే. 29

క. సరసులు చేపట్టినచో
   విరసం బగుకావ్య మైన వినిపించిన నా
   దరణీయం బయి వెలయదె
   ధరఁ బువ్వులఁ దాల్చి తుంగ[23]తల కెక్కు గతిన్. 30

క. అప్పరమేశ్వరు కరుణం
    గుప్పలు గౌను విక్రమార్కు గుణముల కొఱకై
    చెప్పెద రసభావంబులు
    ముప్పిరిగొనునట్లు కథలు ముప్పది రెండున్. 31

చ. తెనుఁగున దేటగాఁ గథలు దెల్పినఁ గావ్యము పొందు లేదు మె
    త్తన పస చాల దండ్రు విశదంబుగ సంసృతశబ్ద మూఁదఁ జె
    ప్పిన నవి దర్భముండ్లనుచుఁ బెట్టరు వీనులఁ గావునన్ రుచుల్
    దనరఁ దెనుంగుదేశియును దద్భవముం గలయంగఁ జెప్పెదన్. 32

క. పదిలముగ మృదులవచనా
   స్పదపదసంపదల రసము పదనిడక మహా
   పదముల నైనను జల్లులఁ
   బొదుపెట్టిన దుడుకుఁగవిత[24] పొదలునెసభలన్. 33

ఆ. తనవచోనిశేష మెనయక పూర్వక
   థామితోక్తిఁ జెప్పు టేమికడిఁది
   యొకఁడు గోలవట్టి యొయ్యనఁ గొనిపోవ
   నంధుఁ డెచటికైన నరుగు టరుదె. 34

ఉ. ఈసరసోక్తికావ్య మొకఁ డిమ్ముల సంస్కృతభాష నచ్చుగాఁ
    జేసిన నట్ల వీఁడు మఱి చేయుట యేటిది యంచుఁ జెప్పఁగాఁ
    జేసి యనాదరం బురక చేయకుఁడీ విలుకాఁడు తూఁటుగా
    నేసిన నందె పాఱ మఱి యేసినవానిద సూటిగావునన్. 35

చ. తెలుఁగున కెల్లఁ దల్లి యగుఁ దెల్లము సంస్కృతభాష యందులోఁ
    బలుకు లెఱుంగుచోఁ బదవిభాగము నన్వయ మర్థమంచు నీ
    మలకలకంటె నందుల సమర్మము దేటతెనుంగ యొప్పు నా
    కొలఁది ప్రియంబు గాదె చెఱకు ల్దినుకంటె రసంబు గ్రోలినన్. 36

క. పురమధుజలలీలాంబుధి
   పరిణయనయవిప్రలంభ పతిగుణసుత భా



   
    స్కరచంద్రోదయ రణగతి
    గిరి వన దూతర్తురతులఁ గృతి చెప్పఁదగున్. 37

క. కావునఁ బదునెనిమిది యగు
   నీవర్ణన లచటనచట నించుక బెరయం
   గావించెద నిటఁ బని కివి
   రావనకుఁడు లక్షణాభిరామము లగుటన్[25]. 38

వ. అని విన్నవించి కృతకృత్యుండ నై సింహాసనద్వాత్రింశతి కథాకథనమూలకారణం బైన యంబికారమణుండును మత్కవితాసంపత్తి సంధాయకుండగు [26] లక్ష్మీనాయకుండును గావ్యనాయకులుగా నియమించుటఁజేసి. 39

సీ. పాఁపపెండెముగాక పసిఁడియందియయును
        నడుగుఁదామరలపై నమరువాఁడు
   పెద్ద మెకముతోలు నిద్దంపుఁబట్టును
        మొలదిండుగాఁ గట్టి మురియువాఁడు
   ఎముకపూసలును ముత్యములుఁజేరులు గాఁగ
        నక్కునఁదాల్చి పెం పెక్కువాఁడు
   పునుకయుం బెనుగుల్లయును గేలుదమ్ముల
        సంచలమాడ్కిఁ బాటించువాఁడు
గీ. సగముపొడవునఁ దెల్పు నాసగము నల్పు
   నయ్యు మెడ నొక్కవన్నియ యగుచు మేను
   లెనయ ముక్కంటియును వెన్నుఁడును ననంగఁ
   బొల్చు నావేల్పు కబ్బంబుఁ బ్రోచుఁ గాత. 40

కవివంశావతారవర్ణనము

క. తత్పదపద్మారాధన
   తత్పరులను రాజమంత్రిధర్మజ్ఞుల మా
   సత్పురుషుల వినిపించెద
   మత్పారంపర్య మొకక్రమంబునఁ దెలియన్. 41

సి. కలుషమండలికభేకఫణీంద్రుఁ డన
             రాయగజగంధవారణఖ్యాతి మెఱసి
    వీరఘోట్టవిభాళుఁ డారూఢబిరుదవి
            రోధి కళింగనిరోధి యనఁగ
    వెలసి నానాఁటికి వెలనాటి పృథివీశ్వ
            రుని రాజ్యభారధుర్యుం డనంగ
    నారెలు గన్నడీ లఱవలుఁ దెలుఁగులు
            దనబిరుదందియఁ దగిలికొలువ
ఆ.వె. నెగడి సనదప్రోలు[27] నెలవుగా భూసుర
    వంశ సాగరామృతాంశుమూర్తి
    చక్రవర్తిమాన్య సౌజనధన్యుండు
     విక్రమార్కనిభుఁడు వెన్నవిభుఁడు. 42

ఉ. సాంద్రజవంబున,[28] న్మతి,నిజస్థితి,నేర్పునఁ,బేర్మి,సత్యవృ
    త్తిం, ద్రుతబాణ[29]పాతనిరతిం, గళల, న్సరివత్తు రెట్లు ప
    క్షీంద్రుఁడుఁబన్నగేంద్రుఁడు నగేంద్రుఁడుపేంద్రుఁడు నింద్రుఁడున్ హరి
    శ్చంద్రుఁడు రామచంద్రుఁడును జంద్రుడు వెన్నయమంత్రిచంద్రుతోన్[30]. 43
 
క. అమరఁగ వెన్నయమంత్రికి
    నమితకళాకీర్తిపాత్రుఁ డగుపౌత్రుం డై

    యమరేశ్వరమంత్రినిభుం
    డమరేశ్వరమంత్రి వెలసె నార్యులు వొగడన్. 44

క. [31]సంగతినమరేశ్వరునకు
    గంగాంబకుఁ బుట్టి రట్టి ఘను లన్నయయున్
    సింగయమంత్రియుఁ దమలో
    నంగీకృత రామలక్ష్మణాకారములన్. 45

ఉ. అన్నయనామధేయసచివాగ్రణి పుత్రుఁడు పెద్దిరాజు సం
   పన్నిధి [32]పల్లికొండజనపాటఁడు మల్లనదేవరాజుచే
   నెన్నఁగఁగుంచె లందలము నెల్లియుఁ గైకొని మంత్రియై ప్రతా
  పోన్నతి కెక్కె ధర్మముల నొప్పెడు బ్రహ్మవనప్రతిష్ఠలన్. 46

చ. అనఘులు సింగనార్యునకు నబ్బయ గోపయమంత్రి సత్తెనా
    రన యనఁ గల్గి రాత్మజులు రాములు మువ్వురు దోఁచినట్లు పెం
    పున వెలయంగ నబ్బయకుఁ బుత్రులు పుట్టిరి రామరాజుఁ గే
    సనయును బాచిరాజు గుణసాంద్రుఁడు సింగనయుం గ్రమంబునన్. 47

క. ఘను లగ్రజులకు నీడై,
   వనములు, గ్రతువులును గృతులు వడి నిల్పిరి బా
   చనయును సింగనయును దగి
   కనపోతకుమారసింగయకు మంత్రులనన్. 48

క. [33]రామాయణకృతి కృతియై
    తామెఱయుచు నంధ్రకవిపితామహుఁ డనఁగా

    భూమిని మించిన భీమన
    నామంబునఁ బరంగె సత్యనారన ఘనుఁడై[34]. 49

ఉ. నారన కగ్రజుండు సుగుణజ్ఞుఁడు గంగమసింగమంత్రికిం
    గూరిమిపట్టి నాఁ బరఁగు గోపయమంత్రి నిజానువృత్తిఁ బెం
    పారెడు నెల్లమాంబిక కులాంగనగా నుతి కెక్కిఁ దారతా
    రారుచికీర్తి యాకసవరాజు తనూజుఁడు దాఁ బ్రసిద్ధుఁడై. 50

వ. ఇట్లు గోపరాజతనూజుండైన కసవరాజు దానగుణ రాధేయుం డగు రాణామల్లనరేంద్రునకుఁ బరమగురుండై
    శైవాచారప్రథమసింహాసనాధీశ్వరులైన [35]బ్రహ్మదేవవడియల
    కూఁతు కామాంబిక యను కామినీరత్నంబుఁ బరిగ్రహించి సుగుణగణగణ్యుం డై నెగడె. 51

ఉ. స్థేయుఁడు మంత్రిలక్షణవిధేయుఁడు లాలితదానకేళి రా
    ధేయుఁడు సర్వసజ్జనవిధేయుఁడు. సంతతసత్యవాక్యకౌం
    తేయుఁడు నిత్యకీర్తి సుదతీపరిణేయుఁడు భావశుద్ది గాం
    గేయుఁడు గాయకప్రకర గేయుఁ డమేయుఁ డజేయుఁ డున్నతిన్. 52

సీ. ప్రకటిత సరసవాక్పతి యనఁగాఁ జెల్లి
          చతురాస్యుఁడై పద్మజన్ముఁడనఁగ
    నార్యానుకూలమౌ కార్యంబు దీర్చుచు
          సర్వజ్ఞుఁడై మహేశ్వరుఁ డనంగ
    గామాంబఁ దనపత్నిగా గారవించుచు
         బురుషోత్తముండయి హరియనంగ
    గోపకుమారుండు కొడుకుగా నక్రూర
         దృఢమిత్రుఁడై వాసుదేవుఁ డనఁగ


ఆ.వె. వేముగల్లు జన్మభూమిగాఁ బెరిఁగియు
[36]దీపులెల్ల మాటఁ దేటపఱిచి
    హరిపదైకబుద్ది హరితగోత్రాంబుధి
    రాజనంగఁ గసవరాజు మించె. 53

క. తంత్రముచేఁ గార్యము పర
   తంత్రము గాకుండఁ బతిహితమె చేయు మహా
   మంత్రులలోపలఁ గసవయ
   మంత్రి విచారమున దివిజమంత్రియుఁ బోలెన్. 54

వ. ఇట్టి మంత్రిశిరోమణికి నునికిపట్టగునట్టి పట్టనం బెట్టిదనిన. 55

శా. రాణామల్లన కీర్తిచంద్రికలు పర్వం బొంగి మధ్యాశ్రిత
    క్షోణీభృద్వనదుర్గమై గుణమణిస్తోమంబుల న్నిండియ [37]
    క్షీణశ్రీపురుషోత్తమాశ్రయమునై చెల్వారి దానామృత
    శ్రేణిం ద్యాగసముద్రనామము వహించె న్వేముగ ల్లీమహిన్. 56

వ. ఇట్టి పురంబునందు. 57

క. పూజితు లగుకవులకృపన్
    భ్రాజిష్ణుఁడఁ గొంత [38]అష్టభాషావిదుఁడన్
    రాజనుతుఁ డైన కసవయ
    రాజతనూభవుఁడ గోపరా జనువాఁడన్. 58

శా. చిత్రఖ్యాతి [39]వితీర్ణివిక్రమనిధి శ్రీవిక్రమాదిత్య చా
    రిత్రఖ్యాపనశాసనంబులకు భూరి స్తంభసంభారమై
    ధాత్రీపాలురుఁ గావ్యవేదులును మోదం బంద సింహాసన
    ద్వాత్రింశత్కథల న్గుణంబులుగఁ గావ్యం బొప్పుగాఁ జెప్పెదన్. 59

వ. ఆది యెట్టిదనిన. 60

-: కథా ప్రారంభము  :-


ఉ. సారబలప్రసార పరిశంసితవింశతిబాహు బాహుకే
    యూర చిరత్నరత్ననికషోపలమౌ రజతాద్రిపై మనో
    హారవిహారము ల్సలిపి యచ్చట నచ్చట విశ్రమించుచుం
    జారువిచారుఁ గింకరవశంకరు శంకరు గౌరి యిట్లనున్. 61

క. చిత్తజహర మీవలనం
    గ్రొత్తకథ ల్గలిగెనేని గోరి వినంగాఁ
    జిత్తం బుత్తలపడియెడి
    నిత్తఱినిం బ్రొద్దువుత్త మెఱిఁగింపఁగదే. 62

క. నావుడు దేవుం డిట్లను
   దేవీ కల వెల్ల నీకుఁ దెలిపితి మొదలన్
   దేవాసుర మానుషముల
   నీవెఱుఁగనియట్టి కథలు నేఁ డిఁక నేవీ! 63

క. ఇప్పటికి భోజునకుఁ గడు
   నొప్పిద మగు మణిమయాసనోపాంతములన్
   ముప్పదియు రెండు బొమ్మలు
   చెప్పిన యాకథలు గలవు చెప్పెద వినుమా. 64

క. అనవుడు నామణి సింహా
    సన మెవ్పరిసొమ్ము భోజజనపతి కేలా
    గునఁ జేరె నేమికారణ
     మున నతనికి నిన్నికథలు బొమ్మలు సెప్పెన్. 65

క. నాకుం జెప్పుఁడు నావుడు
    నా కైలాసంబుపై సుఖాసీనుండై


    యేకతమునఁ గథ లన్నియు
    శ్రీకంఠుఁడు గౌరి కిట్లు చెప్పందొడఁగెన్. 66

సీ. కాంచనకుంభసంగతశృంగములు గల
            మేడలు గడకట్టు మేరు వనఁగ
రామణీయకగుణారామంబులైన మం
           దిరములు తిరములౌ పురము లనఁగఁ
గట్టాయితం బైన కట్టడ గలకోట
           పుట్ట యాచెలియలికట్ట యనఁగఁ
గడ గానరాక భీకరమకరాలయం
           బైన యగడ్త మహాబ్ధి యనఁగఁ

గీ. మించి భూమండలంబు నిర్మించువేళఁ
    దెలివిపడ బ్రహ్మ పడియచ్చు దెచ్చుకొన్న
    ద్వీప మనఁ జెల్లు బహురత్నదీప్యమాన
    గోపురంబుల నుజ్జయినీపురంబు. 67

క. ఏకడఁ జూచిన రత్న
    వ్యాకీర్ణములై వెలుంగు నవ్వీటి గృహ
    ప్రాకారంబుల మహిమను
    జీఁకటియును జోరకులముఁ జేరఁగనోడున్. 68

క. కోట నొకచోట మరకత
    కూటముఁ దృణమనుచు నిలిచి కోమటియిండ్లం
    గోటికి నెత్తినపడగల
    యాటునకై యళికి పాఱు నర్కుని హయముల్. 69

ఉ. పంబినగాలిచేరుల నభఃస్థలి తక్కెడదండెసేసి నా
    కంబు మహీతలంబుఁ గుడుక ల్రచియించి విరించి తొల్లి తు




    ల్యంబుగ నెత్తుచోఁ జులుకనై యమరావతి మీఁది కేగె స
    త్త్వంబున నెక్కుడై యట నవంతిపురం బదివ్రాలెఁ గ్రిందికిన్. 70

క. క్రిందయ్యును నమరావతిఁ
   గ్రిందుపఱుచు ననుచుఁ గవులు కీర్తింప మహీ
   బృందారకవరులకు నా
   నందంబుగ నయ్యవంతినగరం బొప్పున్. 71

ఉ. జాగులు లేక యిచ్చునెఱచాగులు, నంచితకీర్తి సంచయో
    ద్యోగులుఁ, బాపవర్తనవియోగులుఁ, గల్పితయాగులుఁ, న్గుణా
    రాగులు, వీతరాగులు, నిరస్తవిరోధి కృతానురాగులున్
    భోగులు, నిర్విభాగులును, బుణ్యనియోగులుఁ దత్పురీజనుల్. 72

ఆ.వె. మథుర కంచి కాశి మాయాపురము ద్వార
    వతి యయోధ్య యీ యవంతిపురము
    నాఁగ నెగడు ముక్తినగరంబులం దున్న
    నరులు పుణ్యభాజనములు గారె. 73
  
శా. ఏణిలోచనలుం గవీశ్వరులుఁ బ్రత్యేకాఢ్యులున్ జాణలు
    న్వీణావేణుకళాప్రవీణమతులు న్విద్వాంసులు న్వీరులున్
    క్షోణీదేవతలు న్మహోత్సవముల న్శోభిల్లఁగా నిత్యక
    ళ్యాణం బై చెలువొందు నాపురము దివ్యం బైన సంపత్తితోన్. 74

సీ. దానప్రశస్తహస్తప్రభావము గల్గు
         భూవల్లభులును దంతావళములు
    వివిధపదక్రమవిహితవర్తన గల్గు
         కుంభినీసురులును ఘోటకములు
బహుళసంఖ్యాతనిర్వహణచాతురి గల్గు
         నుత్తమగణకులు యోధవరులు



నక్షపాటవసంభృతార్థభావముగల్గు
నాదిజూదరులును నరదములును

ఆ.వె. బదడు పసిఁడిగాఁగ భాండసంపద గల్గు
గ్రొత్తవర్తకులును గుమ్మరులును
జొప్పుదప్పకునికి నెప్పుడు నొప్పుల
కుప్పయనఁగఁబరఁగు నప్పురంబు. 75

ఆ.వె. అందుఁ జంద్రగుప్తు నాత్మజుండగు భర్తృ
హరియ రాజు విక్రమార్కుఁ డతని
సవతితల్లికొడుకు యువరాజు తన్మంత్రి
భట్టి నాఁగ నీతిపరుఁడు గలఁడు. 76

చ. అలక లలివ్రజంబు, వదనాబ్జము చంద్రుఁడు, సుస్వరంబు కో
కిలములు, మంజువాక్యములు కీరగణంబుల సొంపు, చల్లనూ
ర్పులు మలయానిలం, బయిన రూపము దాల్చి యనంగసేననాఁ
జెలఁగె ననంగసేన యను చేడియ భర్తృహరీష్టభార్య యై. 77

క. తరుణులలో మిక్కిలి నీ
తరుణికడం జిక్కి వీతధరణీవరుఁడై
యొరపునఁ దదీయచేతో
హరుఁడై హరివోలె భర్తృహరి విహరించెన్. 78

ఉ. అత్యనురక్తి భర్తృహరి యంతిపురంబునఁ గేలిలోలుఁడై
నిత్యరతిప్రసంగముల నిల్వఁగ నాతనిదర్శనంబు సాం
గత్యము లేకయుం బ్రజలు కార్యముపట్లను భట్టి విక్రమా
దిత్యులనేర్పునం దగవు దీఱఁగ నుండిరి నైజవృత్తులన్. 79

క. ఆదినముల నప్పురిలో
వేదవిదుండైన యొక్కవిప్రుఁడు మిగులం

బేదఱిమి నొగిలి ధనసం
పాదనమతి భద్రకాళిపాలికిఁ జనియెన్. 80

క. చని యాగుడిముందట ను
గ్రనియతిఁ దప మాచరింపఁగా నాదిమయో
గిని మెచ్చి దివ్యరూపం
బున నిలిచె న్విప్రుతలఁపుపొం దొనగూర్పన్. 81

ఉ. అత్తఱిఁ జాగి మ్రొక్కుచు ధనాఢ్యత వేఁడుట దప్పి యాత్మలోఁ
దత్తఱ మంది బ్రాహ్మణుఁడు తా నమరత్వము వేఁడినం గృపా
యత్తమనస్కయైన జగదంబిక యేకజనోపభోగ్యమౌ
క్రొత్తఫలంబు దెచ్చి యిది గొమ్మని యిచ్చిన వచ్చె నాతఁడున్. 82

క. వచ్చుట విని తన కెదురుగ
వచ్చినసతిఁ జూచి పిన్నవారలసేమం
బచ్చుపడ నడిగి యాపం
డిచ్చి యమర్త్యత్వ మిచ్చు నిది యని చెప్పెన్. 83

క. అనవుడు విని యతనికుటుం
బినియును దారిద్య్రదుఃఖపీడిత యగుటం
దనపతిఁ గడు దూఱుచు ని
ట్లనియె మనస్తాపమున నిరాకరణముగాన్. 84

ఉ. అచ్చట మెచ్చుగాంచి యిట కర్ణము దెచ్చెద వంచు నమ్మి ము
చ్చిచ్చున వెచ్చి పొట్ట కొక చేరెఁడు గంజియు లేక యాఁకటం
జచ్చియుఁ జావ మించుక విషంబయినం గొనిరాక దేవిచే
దెచ్చితి విట్టిపండు విధి ద్రిప్పఁగ ఛాందసబుద్ధి దప్పునే. 85

క. కడుపునకుఁ గూడు గానక
పడి మిడిమిడి మిడుకునట్టి బడుగున కియ్యా

    ఱడి యమరత్వం బేటికి
    గడు పిటఁ గాలంగఁ గంటఁ గాటుక యేలా. 86

క. గతి దప్పిన పని కేమని
   పతి దూఱఁగవచ్చు నిట్టి ఫలమున నొక సం
   గతి ధనము పడయవచ్చును,
   మతిలో స్త్రీబుద్ధియనక మన్నింపఁదగున్. 87

మ. ధరణీకాంతునకైన నొప్పు నమరత్వం బింక నీవేగి యా
    నరనాథుం గని దీని నిచ్చి బహురత్నస్వర్ణనిష్కోజ్జ్వలాం
    బరభూషాది సువస్తువు ల్వడసి రమ్మా యంచుఁ బొమ్మన్న భూ
    సురుఁ డేగెన్ ఫలహస్తుఁ డయ్యును [40]విహస్తుం డై నృపాస్థానికిన్. 88

శా. ఆవేళన్ రమణీమణు ల్గొలువఁగా నాస్థానభూమి న్ముఖ
    శ్రీ వెంపారఁగ నున్న భర్తృహరిధాత్రీనాయకుం గాంచి భూ
    దేవుం డుత్సవ మంది యాదరముతో దీవించి యాపండు స
    ద్భావం బొప్పఁగ నిచ్చి చెప్పె వరుసం దత్ప్రాప్తిసత్వంబులన్. 89

చ. బహుజనరక్షకుండ వగుపార్థివ నీక తగు న్ఫలం బను
    గ్రహమునఁ బుచ్చుకొ మ్మనినఁ గైకొని భూపతి వేడ్కతో యశో
    మహిమకుఁ బేరుగాఁ బసిఁడిమాడలుఁ బేర్చినపట్టుచీరలు
    న్మహితములైన రత్నములు మన్నన నాతని కిచ్చి పుచ్చి తాన్. 90

క. నే నుండఁగ నిది సచ్చిన
    నే నుండుట గడిఁది యిట్టినెలఁతుక గలుగ
    న్నే నున్న నొప్పు నని తన
    చేనున్న ఫలం బనంగసేనకు నిచ్చెన్. 91

సీ. ఆపొలఁతియు దాఁచి యాపండుఁ డనతోడ
నూని కూడెడు మందఁడిని కిచ్చె
వాఁడును దనుఁ గోరి వచ్చి యాసాలలోఁ
గస వూడ్చునట్టి బానిసకు నిచ్చె
నదియును దనకోర్కి పదిలంబుగా మున్ను
తనకూర్చు పనులగోపునకు నిచ్చె
వాఁడును దనకుఁ దావలచి కొట్టములోని
పెండ యెత్తెడునట్టి ముండ కిచ్చె
ఆ. నదియు దానిరాక మొద లెఱుంగమిఁ జేసి
పెండ బుట్టిలోనఁ బండు వెట్టి
కొంచు నింటి కేగుదెంచుచోఁ దెరువున
నరుగుచుండి భూమివరుఁడు గనియె. 92

క. కని దానిఁ బిలిచి యిదియే
యనువున నినుఁ జేరెఁ జెప్పు మనవుఁడు నాత
మ్ముని మఱఁది పసులఁ గావం
జని యడవిం దెచ్చె ననఁగ జనవిభుఁ డలుకన్. 93

గీ. తొంటివిప్రుని పిలిపించి ధూర్త నీవు
తెచ్చియిచ్చిన ఫలమని తెల్పి ధనము
గొంచు నేగితి విది యెట్ల క్రొత్తయోరి
దీని కబ్బిన దనుడు నాద్విజవరుండు. 94

క. నే నిచ్చినదియె యిది మఱి
కానేరదు నన్నుఁ గల్లగాఁ జేయరుమీ
యేనెపమున నిటుచేరెనొ
దీనిని శోధింపు వసుమతీవర యనినన్. 95

క. ఉల్లమునఁ గనలి ధరణీ
వల్లభుఁడుం దానిఁ బిల్చి వనితా యిది నీ
యి ల్లేవెరవునఁ జేరెను
గల్లాడక చెప్పు [41]తప్పుఁ గాచితి ననియెన్. 96

మ. అనినం జెప్పక తీర దంచు నది నెయ్యం బొప్ప నాగోపుఁ జె
ప్పినఁ దన్మూలమునం గ్రమక్రమమునం బృథ్వీశ్వరుం డంతయు
న్విని దండింపక యాత్మ రోసి పలికె న్వేయింపుల న్సొంపులం
దనియంజేసిన నిల్చునే వనితచిత్తం బంచు నిందించుచున్. 97

ఆ. కప్పురంపుఁగుదుటఁ గస్తూరి యెరువుతో
నుల్లి నాటి చందనోదకములఁ
బెంపిరేని దాని కంపుమాయని భంగి
నెంతయైన నిలువ దింతిమనము. 98

క. వనిత యొరుఁ జూచి లోనగు
నన నిక్కము పతియు దోడియతివలుఁ బరులుం
గని విని యెగ్గొనరించెద
రని మానిన మానుఁగాక యద్దము గలదే. 99

సీ. మద మెక్కుచన్నులు మాంసపుముద్దలు
హేమకుంభములకు నెక్కు డనుచు
దూషితమూత్రపురీషదుర్గంధ మౌ
జఘనంబు కరిశిరస్సదృశ మనుచు
జిలిబికిం బుసులకుఁ జీమిడికిని బుట్ట
యైన మొగంబు సుధాంశుఁ డనుచు

గండలుఁదోలు [42]బొక్కలుగూడఁ బొదివిన
యాకృతి పసిఁడిసళాక యనుచుఁ
ఆ. [43]దెగడైన పెదవి త్రేగు డమృతమని
కవులు వొగడఁ బేరు గలిగెఁ గాక
తత్త్వ మెఱిఁగి యిట్లు తలపోసి చూచిన
నింతి రోఁత కెల్ల నిల్లుగాదె. 100

చ. అనుచు బహుప్రకారముల నంగనల న్మది రోసి యాత్మకా
మినులఁ బరిత్యజించి యిఁక మీమతి కింపగువారిఁ జేసికొం
డని సెలవిచ్చి రాజ్యసుఖమంతయు మాని విరక్తచిత్తుఁ డై
యనుజుని విక్రమార్కునిఁ బ్రియంబుగఁ బిల్వఁగఁ బంచి యిట్లనున్. 101

క. మనతండ్రి సౌరమంత్రం
బునఁ దపమొనరింప మెచ్చి మున్నర్కుఁడు దాఁ
దనయుఁడ నై పుట్టెదఁ బొ
మ్మని నీవై పుట్టె విక్రమార్కుం డనఁగన్. 102

ఆ. సర్వలక్షణముల సంపూర్ణుఁడవు నీవు
భట్టి మంత్రి గాఁగఁ బ్రజలనెల్ల
నేలు మంచు ముద్ర యిచ్చి దేశాంతరం
బరిగెఁ బరమయోగిచరితమునను. 103

క. అన్నరనాథుఁడు విడిచిన
యన్నులు మున్నూఱు నతని యనుమతి గలుగన్
మున్నూఱుఁ జేసికొని ధర
మున్నూఱుకులం బనంగ మొనసిరి [44]సిరులన్. 104

విక్రమార్కుని చరిత్రము


శా. రాజ్యం బేలుచు విక్రమార్కుఁడిట సంరంభోచితోజ్జృంభణ
ప్రాజ్యప్రాభవభసంభృతద్విపహయప్రారంభసైన్యంబుతో
సజ్యం బైనధనుర్బలంబు కలిమిన్ సామంతులన్ గెల్చి త
త్పూజ్యుండై ధనధాన్యలక్ష్మిఁ బరఁగెం బుణ్యం బగణ్యంబుగన్. 105

క. ఆతఁడు మహాకాళున కా
తత మగుతప మాచరించి తన కమరత్వ
స్థితివేఁడిన నరులకు [45]నిది
గతిపడ దొండడుగు మనినఁ గడిఁదిగ మఱియున్. 106

క. ఒకదివసం బెక్కుడుగా
నొకయేఁ డగు పిన్నపాప కుదయించిన బా
లకుచేతఁ గాని తాఁ జా
వకయుండను వేఁడికొనిన వర మతఁ డిచ్చెన్. 107

వ. ఇట్లిచ్చి. 108

క. వెయ్యేఁడులు రాజ్యసుఖం
బయ్యెడుఁ బొమ్మనిన దేవునానతి నారా
జియ్యకొని వచ్చి భట్టికి
నయ్యానతి క్రమముఁ జెప్ప నతఁడును మఱియున్. 109

క. నే మఱియును నొక వేయేం
డ్లీమహి యేలంగ నీకు నిచ్చెద నని భి
క్షామార్గి వగుచు రాజ్య
[46]వ్యామోహం బర్ధవర్ష మడఁచుము చాలున్. 110

ఆ. ఆఱునెలలు నగరియందు నిల్వుము మీఁది
యాఱునెలలు యోగివై చరింపు
పురి సహస్రవర్షములు చెల్లుఁ బొన్నూళ్ళ
నున్న వేయుఁ జెల్లుచుండు ననియె. 111

క. తద్వచనము నిజహితముగ
హృద్వనజములోఁ దలంచి యిల యెల్ల నుపా
యద్వయమున నరయుచు భూ
భృద్వల్లభుఁ డేలెఁ బ్రజలు ప్రియ మందంగన్. 112

వ. అంతనొక్కనాఁడు. 113

సీ. ఒక జోగి యతనిఁ గాటికిఁ దోడుకొని చని
బేతాళు రప్పించి ప్రీతి నునిచి
వేలిమిచేసి తా విపరీతగతిఁ బొందె
బేతాళుఁ డారాజు పెంపు మెచ్చి
యెడరైనఁ దలఁపుమీ యే వచ్చి పనులెల్ల
జేసేద మఱి యష్టసిద్ధు లొందు
ననిపోయె బ్రహ్మాదులును మీఁద విద్యాధ
రాధిపత్యం బగు ననుచుఁ జనిరి
ఆ. భూవిభుండు మగుడఁ బురముస కేతెంచి
సప్తసంతతులను సత్రములను
సంతతాధ్వరములఁ గౌంతేయుగతి శక
కర్తయై ధరిత్రిఁ గీర్తి నెఱపె[47]. 114

ఉ. సంతతదానధర్మగుణచారువిచారుఁడు వైరిచారదృ
క్కజ్జిలమార్జనప్రథమకారణచారుకృపాణపాణి వి

ద్వజ్జనబృందవందిజనతాజలజార్కుఁడు విక్రమార్కుఁ డా
యుజ్జయినీపురంబున నయోన్నతి రాజ్యము సేయుచుండఁగఁన్. 115

వ. తొల్లింటి కాలంబున. 116

క. విశ్వామిత్రుఁడు తప మతి
శాశ్వతముగఁ జేయు టెఱిఁగి శంకించి యమ
ర్త్యేశ్వరుఁడు కొలువులోఁ దన
విశ్వాసము[48] గలుగునట్టి వెలఁదుల కనియెన్. 117

క. ఓయూర్వశి యోరంభా
మీయిద్దఱలోన నొక్క మెలఁతుక నటనో
పాయంబునఁ జిక్కిడి ముని
సేయుతపంబునకుఁ గీడు సేయఁగవలయున్. 118

చ. అన విని పాత్ర నీయెదుర వాడిన నిద్దఱలోన దీనిచేఁ
బని యగు నంచు నీ వెఱిఁగి పంపుము నావుడు నట్లకాక లెం
డనవుడు నాఁడు రంభ తగ నాడినఁ జూచి ప్రహృష్టచిత్తుఁడై
యొనర ననుక్రమంబునను నూర్వశి యాడిన నట్ల మెచ్చుచున్. 119

క. వారల యెక్కువతక్కువ
లేరీతుల నెఱుఁగ లేక యింద్రుం డిఁక నె
వ్వా రెఱుఁగుదురో యని బృం
దారకమునివరుల నడుగఁ దత్సభలోనన్. 120

క. సారదయామృతమతి యగు
శారదకృప వడసి యతివిశారదుఁ డగునా[49]
నారదుఁ డుపమితశారద
నీరదుఁ డావిక్రమార్కనృపతిం జెప్పెన్. 121

ఉ. అర్కునిమూర్తి సర్వకళలందుఁ బ్రవీణుఁడు సంగరస్థలిం
గర్కశరాజలోకలయకాలుఁడు దానవినోది పాపసం
పర్కవిదూరుఁ డార్తపరిపాలనశీలనశాలి విక్రమో
దర్కుఁడు విక్రమార్కుఁ డిట కాతనిఁ బిల్వఁగఁ బంపు నావుడున్. 122

మ. మునివాక్యంబున నింద్రుఁ డిట్టిగుణధాము న్విక్రమాదిత్యుఁ దో
డ్కొని రమ్మా యని పంపె మాతలి నతండుం దేరునం [50]వేగప
చ్చనిగుఱ్ఱంబులఁ బూన్చికొంచు నధికోత్సాహంబుతో మింటిపైఁ
జని యుజ్జేనికి డిగ్గి యచ్చట నృపాస్థానంబు వీక్షించుచున్. 123

మహాస్రగ్ధర—
సభలోనం గాంచె వర్ణాశ్రమజనపరిరక్షాసమారంభలీలా
శుభనిత్యాచారు లోకశ్రుతవిశదనిజస్ఫూర్తిసత్కీర్తిలక్ష్మీ
విభవాకృష్టార్థిజాతాభినుతవితరణాన్వీతహస్తప్రభావ
ప్రభవశ్రీరమ్యు ఖడ్గప్రకటితజయసంపర్కు నవ్విక్రమార్కున్. 124

మ. కని యింద్రుం డిదె నిన్నుఁ బిల్వఁబనిచెన్ క్ష్మాపాల విచ్చేయుమా
యనిన న్గొబ్బున లేచి మాతలికి నాహ్లాదంబుగా నాదరం
బొనరం జేసి మహోత్సుకత్వమున నాయుర్వీశుఁడుం గాముఁడో
యన వచ్చెన్ హరితాశ్వరత్నయుతదివ్యస్యందనారూఢుఁడై. 125

స. వచ్చి కామధేను కల్పతరు చింతామణీ సంతతనివాసంబై యమరు నమరావతీపురంబు సొచ్చి తేరు డిగ్గి మాతలియునుం దోడరా నమరకిన్నరవిద్యాధరయక్షోరక్షనికరపరివారుండును దిక్పాలముకుటతటఘటితమణిగణకిరణారుణితచరణకమలుండును నప్పరోహస్తచామికరదండచారుచామరవ్యజనవీజ్యమానుండును నై సుధర్మాసభామధ్యంబునం దారకితతారాపథమధ్యభాగంబునఁ దారాగణపరివృతుండై వెలుంగు చంద్రునిచందంబు

న నందం బగు బృందారకేంద్రునిం గని ప్రణమిల్లిన నతనిం గౌఁగిలించుకొని గారవించి దీవించి యాసన్నమణిమయసింహాసనంబుపై సుఖాసీనుం జేసి కుశలం బడిగి సురపతి నరపతి కిట్లనియె. 126

ఆ. ఊర్వశియును రంభయును నాడఁగా మాకుఁ
దారతమ్య మెఱుఁగఁ దరముగాదు
సర్వకళలయందు జాణవు నీ వండ్రు
దీని నిర్ణయింపు మానవేంద్ర. 127

ఆ. అనుచుఁ బలికి మఱియు సాంగసంగీతవా
చ్యాదికృత్యములకు ననువు మెఱయఁ
గడఁగి నిలువుఁ డనుచు గంధర్వులకుఁ జెప్పి
మున్ను రంభ నాడుమన్న నంత. 128

శా. గంధర్వు ల్పదునాల్గు దోషములు దక్కం దాళమానంబులన్
గాంధర్వంబు ధ్రువాప్రబంధసరణిం[51]గా వింపఁగా వాద్యముల్
ధింధింధిక్కధిమిక్కతక్క ధికతోంధిక్కత్తకోఝింకిణిం
ధింధాంఝంకకుఝెక్కుధిగ్ధిగుడధాధీయంచు మ్రోసె న్వెసన్. 129

క. జంభారియెదుట నాట్యా
రంభమ్మున నూర్వశీపరాజయకృతసం
రంభయు నూరుద్వయజిత
రంభయునై రంభ నిలిచె రంగస్థలిపై. 130

క. సురపతిపంపునఁ గూడిన
మురజధ్వను లభ్రశబ్దములుగా శృంగా
రరసము గురియగ నాడెను
దిరుపుల మురిపముల మెఱపుఁదీగయుఁబోలెన్. 131

వ. ఇట్లు రంభ యాడినం జూచి యానాకలోక భూలోకనాయకులు మఱునాఁ డూర్వశి కవసరం బిచ్చిన నదియును సంగీతశాస్త్రానుసారంబుగా[52] నిలిచి
విలక్షించుచు— 132

క. తనువున గీతాలంబన
మును జేతుల నర్థవ్యుషితమును నేత్రయుగం
బున భావముఁ బదములఁ దా
శనిర్ణయమ్మును మెఱయఁగ లాస్యము నెఱపెన్. 133

క. సురకామిని తన నయనము
లరుదుగఁ దలచుట్టివచ్చు ననుట నిజముగాఁ
దిరుగుచుఁ బరిమండలితాం
బరపల్లవయై నటించె మరుగొడుగుక్రియన్. 134

క. ఈక్రియ నూర్వశి యాడిన
విక్రమఘనుఁ డిదియె మఱియు వెరవరి యనినన్
శక్రుడు మర్మము దెలుపుమ
యేక్రమమున దీని నిర్ణయించితి వనినన్. 135

ఉ. నావుడు నాతఁ డిద్దఱును నాట్యమున న్సరివత్తు రిందు శా
స్త్రావగతప్రసంగముల సాంగముగా నిది యాడె గాన ని
ట్లే వివరించి యూర్వశియ యెక్కడుగాఁ గయికొంటి నన్న న
ద్దేవుఁడు మెచ్చి యాతనికి దివ్యవిభూషణ మిచ్చి వెండియున్. 136

సీ. ప్రభల నుప్పొంగు ముప్పది రెండు బొ
మ్మలు నన్ని వాకిళ్ళుఁ బెంపడరుచున్న
నవరత్నఖచితమై వివిధసోపానమై
భాసురంబైన సింహాసనంబు

మెచ్చుగా నిచ్చిన మెయికొని ప్రణమిల్లి
దేవేంద్రు వీడ్కొని తేరిమీఁద
నిడికొని యుజ్జెని కేతెంచి వేడ్క సిం
హాసనం బెక్కి యా యవనివిభుఁడు[53]
ఆ. సిద్ధు లెనిమిదియును జేకూరఁ బగతుర
పే రడంచి యాజ్ఞ పెంపుమీఱ
నేకవీరుఁడై యనేకవర్షంబులు
ధరణి యేలెఁ బుణ్యచరితుఁ డగుచు. 137

శా. సత్పాత్రప్రతిపాదితార్థుఁ డయి రాజ్యం బుర్విలో సర్వసం
పత్పూర్ణంబుగఁ జేయుచుం బ్రజల భూపాలుండు పాలింపఁగాఁ
దత్పూర్వార్జితపుణ్యభోగముల కుత్సార్యత్వసంపాదులై
యుత్పాతంబులు వుట్టె నుజ్జయినిలో నుల్కాదిలక్ష్యంబులై. 138

క. అట్టివి గని జనపాలుడు
భట్టిం బిలిపించి నీవు భావజ్ఞుఁడ వీ
పట్టున నేతెఱఁ గగునో
యట్టి తెఱం గెఱుంగు మనిన నతఁ డిట్లనియెన్. 140

ఆ. పడగ నేలఁ గూలెఁ బట్టపేనుఁగు వ్రాలె
మేడఁ గాకికదుపు గూడి యఱచె
నిన్న వారువముల కన్నుల నీరోల్కె
దీన నీకుఁ గీడు తెల్ల మింక. 140

క. ఇది నిజ మనవుడు నతఁ డే
కదినాధికవర్షయైన కన్యకు సుతుఁడై

ట్లుదయించు నాకుఁ గీడె
ట్లొదవు న్మదిలోన బెగడకుండుము[54] భట్టీ. 141

క. జమునికి నెరగోసెద[55] నా
క్రమ మెఱుఁగవె యముడు నతఁడు కమలజఘటనా
సమయం బైన నసంభా
వ్యము లైనను సంభవించు నది యెట్లనినన్. 142

క. ఇది మానిసి యిది సింగం
బిది దేవత యను వివేక మెడలఁగ బలసం
పద నుక్కుఁగంబమున హరి
యుదయింపఁడె దైత్యవరుని నుక్కడఁగింపన్. 143

క. ఏకద్విత్రిచతుఃపం
చాకృతికృతసంఖ్యముఖుల కవిజేయుండై
కైకొనిన తారకాసురుఁ
బోకార్పఁగ షణ్ముఖుండు పుట్టుట వినవే. 144

మ. వరపుత్రుం డమరేంద్రవైరి పరిఖ ల్వారాశి యాలంక దా
గిరిదుర్గం బసురు ల్బలంబులు దశగ్రీవుండు రా జిట్లు బం
ధురమౌ రాజ్యము ఱాలు దేలగిల మిత్రు ల్శత్రులం గూడఁగా
నరులు న్వానరులుం గొనం దలఁచి చన్నం జేటు వాటిల్లదే. 145

ఉ. కావున నిట్టి బాలకుఁడు గల్గుట తథ్యము నీకు నిష్టులౌ
వేవులవారిచేతఁ బృథివీస్థలిలో నరయింపుమన్నఁ దా
నావచనంబు లియ్యకొని యాత్మహితుం దలపోసి విక్రమా
ర్కావనివల్లభుండు నెడ రంచుఁ దలంచెఁ బిశాచముఖ్యునిన్. 145

క. ఆతలఁపున వచ్చిన నతఁ
డాతెఱఁ గెఱిగించి యరయ ననిపిన పిదపన్
బేతాళుఁడు పాతాళము
భూతలమును నరసి వచ్చి భూపతితోడన్. 147

సీ. జననాథ! నీవు పంచిన నెల్లచోటులుఁ
దిరిగి ప్రతిష్టానపురములోనఁ
గుమ్మరి యింట లేఁగొమ్మముందట మంటి
బలములతో నాడెడుబాలుఁజూచి
యెవ్వరివాఁ డనునెడ నొక్కవిప్రుండు
తనకూఁతుకొడుకు తజ్జనని యిద్ది
యేఁటిపై నొకదినం బేగుచో[56] నాగేంద్రుఁ
డీపాపఁ గూడిన[57] నితఁడు పుట్టె
ఆ. దీనికారణంబు దేవర గాక యొం
దెవ్వఁ డెఱుగు ననుచు నిట్లు పలికె
నింక రాజ్యభోక మింకకుండఁగ నీవు
సాహసంబు సేయు సాహసాంక. 148

మ. అని చెప్పన్ విని యావలం దెలిసి సువ్యక్తంబుగా నాత్మనా
శనమూలం బని నిశ్చయించుకొని యాశ్చర్యంబుగాఁ దొల్లి చే
సిన కార్యంబులఁ దోడు వేఁడక మదిం జేట్పాటులం దోడువేఁ
డినఁ గష్టం బగునంచు దాఁగనియె భట్టిన్నిల్పి తానొక్కఁడున్. 149

ఉ. ఆ నరనాథుఁ డిట్లు చని యాయుధ మొక్కటి తోడుగాఁ బ్రతి
ష్ఠానపురంబు డగ్గఱునెడం జతురంగబలంబు లన్నియున్

వాని పిఱుంద నేగి నలువంకల నిల్వఁగ నందుఁ గొందఱా
లోనికిఁ జొచ్చి యావిజయలోలుని బాలునిఁ బోరఁ బిల్చినన్. 150

క. నాగేంద్రుఁడు జీవనవి
ద్యాగుణ మగు మంత్రశక్తిఁ దత్కృతములునౌ
నాగాశ్వరథ భటాదుల
కాగతిఁ బ్రాణంబు లిచ్చి యాత్మజుఁ బంపెన్. 151

గీ. ఆకుమారుఁడు శాలివాహనుఁ డనంగ
నెగడి నగరంబు వెలువడి నిలుచునంత
శేషు పంపున వచ్చి యాశీవిషములు
విక్రమార్కుని మూఁకల నాక్రమించె. 152

ఉ. సర్పము లీక్రియన్ భటులఁ జంపిన నాఁతడు వారిప్రాణముల్
గూర్పఁదలంచి వాసుకికి ఘోరతపం బొనరించి యయ్యెడన్
నేర్పొకయింతలేక యది నిష్ఫలమైనఁ గలంగియున్ భుజా
దర్పము తోడుగాఁగ నిది దైవవశంబని వచ్చెఁ బోరికిన్. 153

క. అతఁ డిటు వచ్చినఁ దక్కిన
హితులును సైన్యములు గూడ నేతెంచినఁ ద
చ్చతురంగబలము పైఁబడఁ
గుతలము పదహతుల నతలకుతలం బయ్యెన్. 154

వ. ఇట్లు తేజోవిక్రమార్కుం డగు విక్రమార్కుని సేనలు శేషప్రసాదవిశేషశాలివాహనుం[58]డగు శాలివాహను బలంబులుం దలపడి పోరు నవసరంబున. 155

సీ. కాలుబలంబులు గ్రాహసంగతిఁ గ్రాలఁ
దురగముల్ తరఁగల కరణిఁ జెలఁగఁ

దేరులు కలముల తెఱఁగున దిరుగంగఁ
గరులు మైనాకాదిగిరులఁ బోల
నరిగ బిళ్ళలు కమఠాకృతి మెఱయంగ
నడిదంబులును మీల ననుకరింపఁ
జామరంబులె సితచ్ఛత్రంబులును శంఖ
ఫేనసాదృశ్యంబు పేర్మి మెఱయఁ
గీ. బడగ లుత్పతత్ ఫణికుల భాతి వెలయ
రుధిరధారలు విద్రుమరుచిఁ దనర్ప
బటహరవములు జలఘోష భంగిఁ బొంగ
ముద్రమీఱిన రౌద్రసముద్ర మొప్పె. 156

ఉ. అత్తఱి వీరు లేర్చుక్రియ నార్చుచు వత్తురు వచ్చి మూఁకలోఁ
జొత్తురు చొచ్చి శత్రువులచొప్పు లడంతురు వారి బీరముల్
మెత్తురు మెచ్చిమార్కొనుచు మెల్పున గెల్చున భిన్నభిన్నమై
చత్తురు చచ్చి యచ్చరల సన్నిధి నిల్తురు గెల్తు రుద్ధతిన్[59]. 157

క. అయ్యెడఁ దెగియెడి వీరుల
నెయ్యమున వరించు వేల్పు నెలఁతలు దమలోఁ
గయ్యం బడువఁగ శూరుల
కయ్యము దివిఁజూడ నాఁడుఁ గయ్యం బయ్యెన్. 158

సీ. మ్రొగ్గెడు గజఘటంబుల నుబ్బి తేఱెడు
రక్తంబు మద్యపూరంబు గాఁగ
వారక తెగినట్టి వీరుల పునుకలు
కొమరారు పానపాత్రములు గాఁగ



నందందు వాచవికందువ లగు గుండె
కాయలన్నియు నూరుఁగాయలు గను
గండలు తక్కిన కజ్జాలుగాఁ గూర్చి
ఢాకినీగుణము లనేకరుచులఁ
గీ. బొట్ట కొలఁదిగఁ ద్రావుచు భూతములకుఁ
జవులు సూపుచు నేఁటి యుత్సవముఁ బోల
నొండు లేదని పొగడుచు నుల్లసిల్లి
సోలి యాడంగఁ జొచ్చె నచ్చోటఁ గలయ. 159

క. ఆ వేళఁ జిత్తముల వీ
రావేశము పొదలఁ బోటు లాడఁగఁ దమకున్
దైవసహాయము లేమిని
భూవల్లభుసేన లెల్లఁ బొలియఁగఁ జొచ్చెన్. 160

ఆ. రథము లంత వితథరథికసారథులయ్యె
గుఱ్ఱములును బాఱి గొఱ్ఱెలయ్యెఁ
గాలుబలము లపుడు కాలుబలములయ్యె
గజము లెల్లఁ బోర నజములయ్యె. 161

క. కాలము చేరిన వానికి
నేలయుఁ బగ యనఁగ మింట నిలిపిన బలముల్
బాలునిఁ గూడుక యా భూ
పాలుని సైన్యముల నేలపాలుగఁ జేసెన్. 162

శా. శుండాలాది బలంబు లిట్లరిగినన్ క్షోణీశ్వరుం డొక్కఁడుం
జండీశుండును గాలకర్మము నిజేచ్ఛం ద్రోవలేఁ డంచు ను
ద్దండాస్త్రుండయి శాలివాహనునిచేతన్ దండకాష్ఠాహతిన్
ఖండీభూతశిరస్కుఁడై యెగసి మ్రగ్గంజెల్లె నుజ్జేనిలోన్. 163



క. ఆతని దేహము వెలువడి
యాతత మగుదీప్తి నంబరాంతంబున ను
ద్యోతించుచు నెగసి మహా
జ్యోతీరూపంబు వోయి సూర్యునిఁ గలసెన్. 164

ఆ.వె. ఇట్లు విక్రమార్కుఁ డీల్గిన విజయుఁ డై
శాలివాహనుండు లీలతోడఁ
బౌరు బెల్లఁ బొగడఁ బైఠాణమున మహా
రాజనంగఁ జేసె రాజ్య మచట. 165

సీ. అట నుజ్జయినిలోన నందఱు పౌరులు
నడలఁగా భూపాలు నగ్రమహిషి
యేడువకున్న కన్నెఱిఁగి మంత్రులు వచ్చి
నీవు గర్భిణి వౌటఁ జావఁ దగదు
వలదన్న నా ప్రభావతి మంత్రివరుల సం
బోధించి యీ రాజ్యమును భుజించు
నీ తగవును జెల్లె నిత్తఱిఁ గడుపులో
పాపని బుచ్చి మీపాల నిడుదుఁ
గీ. గొనుఁ డనుచు వీరపత్ని గావునఁ గడంకఁ
బొట్ట వ్రచ్చియు శిశువును బుచ్చి యిచ్చి
యగ్ని నివసించి దివి కేగి యమరసతులు
గొలువ నలరెడు నిజనాథుఁ గూడుకొనియె. 166

క. ఆ పట్టనమున మంత్రులు
నా పాపను బెంచుకొనుచు నాతని రాజ్య
శ్రీపతిఁగా నొనరించిరి
భూపాలన మాత్మబుద్ధిఁ బురికొనుచుండన్. 167



క. ఇలలోఁ దండ్రి బలంబును
జలమును మెఱయించుకొని ప్రశాంతుఁ డనంగా
వెలయుచు నతఁడొక కొలఁదిని
జెలువందెను మడుఁగు పట్టు చెలమయుఁ బోలెన్. 168

చ. అనువుగ మంత్రు లాతని మహాసనసంస్థితుఁ జేయఁబూనినం
గని యశరీరి యీపడుచుఁ గార్యము లేటికి వీఁడు దీని నె
క్కిన నగుబాటు గాదె తలఁగించి మహీస్థలిఁ బాఁతి పుచ్చుఁ డా
యనిన నమాత్యులెల్ల వెఱఁగందుచు నమ్మణిభద్రపీఠమున్. 169

ఆ. పుణ్యభూమిఁ బాఁతి పుట్టగాఁ గట్టించి
కొంతకాల మున్న యంతలోన
దైవవశము కొలఁదిఁ దద్దేశ మెల్లను
హానిఁ బొందుచుఖిల మయ్యె[60] మిగుల. 170

సీ. అచ్చోట నొకవిప్రుఁ డగిసెలు లంకలు
గోధుమల్ జొన్నలుఁ గోరి విత్తి[61]
పిట్టలఁ ద్రోల[62] నాపుట్ట పట్టున మంచె
గావించి యది యెక్కి త్రోవవారి
నాచేనుఁ జొచ్చి తిన్నన్ని జొన్నలు గోదు
మలు పిసికిళ్ళుగ నలఁచి తినుఁడు
అని పిల్వ నమ్మి వచ్చిన వారి కవి వెట్టఁ
దా దిగి వచ్చి యందఱ నదల్చి
గీ. పరుల సొమ్ముల కిట్లాస పడఁగఁ దగునె
యనుచు వారల వెడలంగ నడిచి తిరుగ

మంచె యెక్కి రాజసమున మరలఁ బిలుచు
వచ్చిరేనియు దిగివచ్చి వారిఁ ద్రోలు. 171

క. ఇవ్విధమునఁ జని మగుడుచు
నవ్విప్రుని వెఱ్ఱీ యనుచు నందఱుఁ దమలో
నవ్వుచుఁ గనుకనిఁ బోవఁగ
నవ్వార్త యెఱింగి భోజుఁ డట కరుదెంచెన్. 172

క. వచ్చిన నృపు భటులం గని
యచ్చటఁ దనమంచె నున్న యాతఁడు చేలో
మెచ్చయినవి భక్షింపుఁడు
విచ్చలవిడి విడియుఁ డనిన విడిసిరి వారల్. 173

ఉ. తొల్లిఁటి యట్లతండు డిగి దూఱుచు భోజునిఁ జేరి యక్కటా
యిల్లొక సర్పమై తినిన నిష్ఠుఁడు వైరికి సత్తు విచ్చినం
దల్లి విషంబు వెట్టినను దండ్రి తనూజుల నమ్మినన్ మహీ
వల్లభుఁ డొల్చుకొన్న మఱి వారల కెవ్వరు దిక్కు భూవరా! 174

క. బలహీనులకును నృపతియ
బలమనఁగాఁ బేదఁ జెఱుపఁ బాడియె యిది నీ
బలములచేఁ బొలియించితి
వెలుఁగే తనచేను మేయు విధ మిటనయ్యెన్. 175

క. గతి గానక యిది యొక సం
గతి బ్రదికెద మంచు నుండఁగా ధర్మముఁ ద
ప్పితి "బ్రహ్మస్వం విషము
చ్యతే" యనుచుఁ బెద్ద లెల్లఁ జదువుట వినవే. 176

క. బలవంతుల మని విప్రుల[63]
ఫలభోగంబులకు నాసపడుదురె మును వి
ప్రులకిచ్చిన భూములు దము
చెలియండ్రని తలఁపవలదె క్షితిపాలురకున్. 177

ఆ. అనుడు విభుఁడు చోద్య మంది తా నమ్మంచె
యెక్కి తుష్టపుష్టిఁ జొక్కి తలఁచె
దాన ధర్మగతులు దప్పక రాజునై
దీనజనుల సిరులఁ దేల్పఁ దగదె. 178

క. వెడఁగు లగుజనుల వృద్ధుల
బడుగులనుం బ్రోవలేని బ్రదుకొక బ్రదుకే
యడిగెడు వారలు గలిగినఁ
బుడమంతయు నిచ్చి వారిఁ బుచ్చెద వేడ్కన్. 179

చ. అనుచు ముదంబునం బలికి యంతటఁ దానె యెఱింగి పల్లటి
ల్లిన హృదయంబు నిల్పికొని లెస్సనిధానము గల్గఁబోలు వి
ప్రుని గుణ మిట్లు గా దిచట భూమిగుణంబని నిశ్చయించి యొ
య్యన దిగివచ్చి యెంత కొలు చయ్యెడు బ్రాహ్మఁడ! చెప్పు నావుడున్. 180

శా. నాకుం జూడఁగ నూఱు పుట్లగు నరేంద్రా! విష్ణురూపంబవౌ
నీకుంజూడఁగ నెన్ని పుట్టులగునో నీవే కటాక్షింవ న
స్తోకంబౌ సిరి గల్గదే యనిన సంతోషించి వేయిచ్చి మం
చాకీర్ణంబగు పుట్టఁగూల్చి యొక నిల్వాక్రిందఁ ద్రవ్వించినన్. 181

-:

భోజరాజు సింహాసనమును త్రవ్వితీయించుట


క. భోజదృగంభోజగ్రహ
రాజాకృతి నురగరాజ రాజితచూడా

రాజిత రత్నప్రభలను
దేజఃపుంజంబు దోఁచి దిక్కులు వెలుఁగన్. 182

ఆ. రత్నగర్భపేరు ప్రకటించునది యొక్కొ
రత్నసానుమూల రత్నచయమొ
గంటిలేని మానికంబుల గని యొక్కొ
నాఁగ నవ్వెలుంగు వీఁగఁ బాఱె. 183

సీ. అందు నానారత్న సుందరప్రాంతమౌ
చంద్రకాంతాంచిత స్థలము కలిమి
జెరయు ముప్పదిరెండు పిల్లగద్దియల కా
భరణంబులౌ హేమపాత్రములను
రత్నదీపమ్ములు రమణఁ జేతులనున్న
పసిఁడి బొమ్మలును ముప్పదియురెండు
నింపైన నృపు నివాళింపు సొంపొందంగఁ
దత్సంఖ్య మణిమయద్వారములను
ఆ.వె. గలిగి నలుదిక్కు లన్నిచేతుల వెడల్పు[64]
చాపమాత్ర సమున్నతి నేపుమిగుల
విక్రమాదిత్యు లక్ష్మీనివేశకాంతి
నంతఁ గనుపట్టె దివ్యసింహాసనంబు. 184

క. తద్రూపముఁ గని నృపుఁడు ద
రిద్రుఁడు ధనరాశిఁగన్న రీతిం బ్రమదో
న్నిద్రితుఁడై తివిపింపఁగ
భద్రాసన మద్రిభంగి బరువై తోఁచెన్. 185

వ. తత్కారణం బెఱింగి మంత్రి యిట్లనియె. 186

క. అరుగరె యయాతి పృథు గయ
భరత సుహోత్రాంబరీష భార్గవ శిబి సా
గర రంత్యనంగ రాఘవ
మరుద్దిలీప శశిబిందు మాంధాత లిలన్. 187

ఆ.వె. వారిలోన నెట్టివారి సొమ్మోయిది
పెద్దగాలమయ్యెఁ బృథివినణఁగి
దీని వెడలఁ దివియఁ బూనిన యప్పుడు
భూతతృప్తి వలయు భూతలేంద్ర! 188

క. అనవుడు విభుఁడది చేయుద
మని గొఱియల జెర[65]పువెట్టి యనువగు బలిభో
జనముల నసురులు సురలును
దనియంగా భూతతృప్తి తగనొనరించెన్. 189

ఆ.వె. దీనఁబొంగి భటులు దివ్యసింహాసనం
బెగయ నీడ్వఁ దాన యెగసి వచ్చె
మంత్రిఁ జూచి రాజు మంత్రీంద్ర! నీ బుద్ధి
లావుకలిమి నిట్టిలాభమయ్యె. 190

ఉ. మంత్రము లేని సంధ్యయును మౌనము లేని తపంబు వేదవి
త్తంత్రము లేని యాగముఁ బదజ్ఞత[66] లేని కవిత్వము న్సదా
తంత్రులు లేని వీణయును దానకరాగము లేని గీతముల్
మంత్రులు లేని రాజ్యము సమానము లిన్నియు వ్యర్థకార్యముల్. 191

వ. అని కొనియాడిన నిది మంత్రిప్రశంసావసరంబని యమ్మంత్రివరుండు స్వార్థంబును యథార్థంబునుగా నిట్లనియె. 192

సీ. జూదరి సత్యంబుఁ జోరుని ధర్మంబు
సరసుని కోపంబు సవతిపొత్తు
బాషండు మతమును బ్రాహ్మణు కలహంబుఁ
దులువ సంగడమును ఖలుని తపముఁ[67]
గులటల భక్తియుఁ గోమటి నిజమును
బణ్యాాంగనల ప్రేమ పంద బిరుదు
బగతుర సైరణ యెగచు వైరాగ్యంబుఁ
బేద పెద్దఱికము వాది ధనము
ఆ.వె. నధమ సంశ్రయంబు నైంద్రజాలికమును
బొమ్మ సొమ్ము[68] మునుఁగ కొమ్మపట్టు
మంత్రి లేని రాజ్యమహిమయు నా వేళ
సుస్థిరములు పిదప నస్థిరములు. 193

ఆ.వె. మంత్రశక్తి నాత్మ మఱి పెట్టెగా నుగ్ర
దండవిష మడంచి దండి గలిగి
యర్థ మొదవ భూపుఁ డను పాముఁ బట్టి యా
డించు మంత్రి గారడీని కరణి. 194

కం. కనియుం గానక యిచ్చల
జనఁ జూచినఁ బోవనీక జనపతిఁ గరి చా
డ్పునఁ బట్టి యంకుశముగా
ననువగు పనిఁ చెప్పు మంత్రి యాధోరణుఁడై. 195

ఆ.వె. కావఁబోవఁ గర్త గావునఁ దనమాట
త్రోవ నలవికాదు త్రోవ యెఱిఁగి

యాడు మంత్రిమాట లాదరించెడివాఁడె
మేదినీశుఁడండ్రు వేదవిదులు. 196

మ. నరనాథుండు సమస్తమైన జనులన్ “రాజ్ఞాం ప్రజాపాలనం
పరమో ధర్మ" యనంగ నీ పలుకుల న్భావజ్ఞుఁడై యేలఁగా
నరులందెవ్వరు నాజ్ఞ మీఱఁ జన దన్యాయప్రవృత్తిక్రియా
పరుఁడై ధర్మముఁ దప్పఁజేయుపనిఁ ద్రిప్పంజెల్లుఁ దన్మంత్రికిన్. 197

కం. జననాథుఁ డనపరాధిం
దునుమఁగ సెలవిచ్చి హితుల దొరల మనవులన్[69]
వినకుండినఁ దన్మంత్రికిఁ
దననేర్పున నతనికీడుఁ దప్పింపఁ దగున్. 198

కం. ఈచందంబున మంత్రి మ
హాచతురుం డొకఁడు విభునియానతి మొదలం
ద్రోచియుఁ ద్రోవక విప్రునిఁ
గాచె ననఁగ దొల్లి యొక్కకథ గల దధిపా. 199

కం. అనవుఁడు నాకథ నాకు
న్వినవలయును మంత్రివరుఁడు విప్రుని నేలా
గునఁ గాచెఁ బతిహితంబగు
పనిఁజేసెం జెప్పు మనినఁ బతికిట్లనియెన్. 200

బహుశ్రుతుని కథ


క. శాలిమయాన్న సదంబర
శాలి సత్యసంగ శాలీన వధూ
శాలావిశాల శీల వి
శాలాపుర మేలు నందజనపతి కడఁకన్. 201

క. అతనికి నతిహితుఁడు బహు
శ్రుతుఁ డనఁగా గలఁడు మంత్రిసముం
డతఁడు ఘననీతిఁ బరఁగెను
బతికార్యధురంధరుండు ప్రజలకు హితుఁడై. 202

క. ఆ నందభూపతికి సతి
యానందము రూపమయ్యె ననఁ గలిగెఁ ద్రిలో
కినయనచకోరములకు
భానుమతీదేవి యమృతభానుద్యుతియై. 203

సీ. దీపితకనకసందేహంబు దేహంబు
పచ్చకర్పూరంబు పలుకు పలుకు
పల్లవసంపదాస్పదములు పదములు
శోభితావర్తననాభి నాభి
కుంచితకలకంఠకంఠంబు కంఠంబు
ముకురవిడండాభిముఖము ముఖము
సరసిజవైభవాకరములు కరములు
విజితనీలోరగవేణి వేణి
ఆ.వె. నడుము లేమికి నెప్పుడు నట్టనడుము
రోచనములు కర్ణాంతరాలోచనములు
ఇంతి పాలిండ్లు కంతు పాలిండ్లు సూడ
నట్టి రూపంబు రూపింప నరుదుగాదె. 204

ఆ.వె. అట్టి సతిని ఱెప్ప వెట్టక చూచుచు
నిద్ర యాఁకలియును నీరుపట్టు
నడఁచి యధరరేఖ నమృతంబు గ్రోలుచు
దేవుఁ డనఁగ మనుజదేవుఁ డొప్పె. 205

క. వనితలకు నురము నోరును
దను వర్ధము నిచ్చి రచ్యుత బ్రహ్మ శివుల్
ఘనుఁడా మువ్వుర మీఱుచు
జనపతి దన సతికి నిచ్చె సర్వాంగములన్. 206

సీ. అవనీశుఁ డీక్రియ నంతఃపురంబున
విహరించుచును మంత్రివిన్నపమున
బలిమిమై నొకనాఁడు కొలువున కేతెంచి
యా సతి తొడమీద నభిముఖముగ
నిడుకొని తన్ముఖం బీక్షించుచుండఁగా
దొరలును భటులును బరులు హితులు
లజ్జాభయములఁ దల ల్వంచికొని యుండ
గొంత తడవున కయ్యింతి చెయ్యి
ఆ.వె. పూని పట్టుకొనుచు లోనికిఁ బోయిన
మంత్రి కలఁగి యిట్టి మమత నేఁడు
మానిపింపకున్న హాని యౌనంచు మో
మోట మాని తోడ నొయ్యనేగి. 207

ఆ.వె. దేవ! యిచట నెట్టి తెఱఁగైన నొప్పు నీ
యతివ నటకుఁ దెచ్చు టనుచితంబు
అనుడు నృపుఁడు నవ్వి యచ్చటి కే వచ్చి
యున్న నేమి రాకయున్న నేమి? 208

క. విశ్రుత నీతి వివేక బ
హుశ్రుత నీయట్టి మంత్రి[70] యుండఁగఁ బ్రమదో

న్మిశ్రముగ విశ్రమించెద
నాశ్రితసంరక్ష నీనయంబున జరుగన్. 209

క. ఏణేక్షణ యీసతి నా
ప్రాణేశ్వరి నిమిషమైనఁ బాసిన విగత
ప్రాణమయి మేను నిల్వదు
ప్రాణము వెడఁబాయునట్టి రాజ్యంబేలా? 210

చ. అనిన బహుశ్రుతుండు హృదయంబున నవ్వుచు నింతప్రేమ గ
లైనఁ బటమధ్యమంబున లిఖించిన యీ సతిరూపు నీమహా
సనము సమీపభాగమునఁ జక్కటి నిల్పిన నందు నీదు దృ
ష్టి నిలుపుకొంచుఁ గొల్వున వసింపుము నావుడు నియ్యకోలునన్. 211

క. జనవరుఁ డొక చిత్రకుచే
వనితారత్నంబు రూపు వ్రాయించి పటం
బనువందఁ జూపఁ బంపెను
తన కులగురుఁడైన శారదానందునకున్. 212

ఆ.వె. అతఁడు చూచి మెచ్చి యచ్చిత్రకారుని
జేరఁబిలిచి తొల్లి చెప్పినట్లు
సతులలోన నాల్గు జాతులు గల విందు
జాతి కొలఁది వ్రాత సహజమయ్యె. 213

చ. తొడలును జన్ను లోష్ఠములు దొడ్డలు కన్నులుఁ గాళ్ళుఁ జేతులున్
వెడఁదలు మోముఁ గంఠమును వెండ్రుకలుం గుఱుచ ల్లలాటముం
బొడవు నొడ ల్వెడల్పు కడుపుం గుడుపు న్నడపున్ ఘనం బగుం
జిడిముడిపాటులుం దొగరుఁ జీరలు హస్తిని కొప్పు నెప్పుడున్. 214

చ. నడుము కృశంబు పిన్న జఘనంబు కుచంబులు గట్టి వెండ్రుకల్
నిడుపులు గన్నులా మెఱుఁగునిగ్గులు కాంతకు వింతభోజనం



బడరు బ్రియంబుఁ గోపము నయంబు సమంబులు దానఁగొండె మే
ర్పడ విను రక్తపుష్పపటరాగిణి శంఖనిఁగా నెఱుంగుమీ. 215

ఉ. అన్నువ యైన కౌనుఁ గుటిలాలక పంక్తియుఁ జెన్ను మీఱఁగా
వన్నెలు గట్టుఁ బచ్చమరువంబులునుం దుఱుమంగ నేర్చు మా
ఱున్నెడఁ గన్నులార్చు సురతోద్ధతి నేర్పరి యల్పభుక్తితోఁ
దిన్నని మాటలాడుఁ గడుఁద్రిమ్మరి చిత్తిని చిత్రవిక్రియన్. 216

ఉ. తెల్లనిచీరలు న్విరులుఁ దియ్యఁదనంబును మెచ్చు వెండ్రుకల్
నల్లన మోవి యెఱ్ఱన కనత్కనకద్యుతి మేను గన్ను లు
త్ఫుల్లసరోజరోచులు మృదుధ్వని కంఠము పాణిపాదముల్
పల్లవకాంతు లాననము పద్మము పద్మిని జాతి కిమ్మహిన్! 217

క. కలియుగమునఁ బద్మిని స
త్కులమున లేదిది తదీయగుణములు గల కో
మలిగాన నెడమ లోఁదొడఁ
దిల ప్రమాణంబు మచ్చ దిరమై యుండున్. 218

ఆ. అనుఁడు వెఱఁగు పడుచు నచ్చిత్రకుఁడు భీతి
తోడ నేగి పువ్వుఁదోఁటలోనఁ
జెలఁగు నప్పున కిట్లె చెప్పిన నతఁడు గో
ప్యస్థలంబు గనుట కాత్మఁ గలఁగి. 219

ఉ. నందనరమ్యమౌ గృహవనమ్మున మన్మథకేళివేళ నా
నందుఁడు భామవామజఘనంబున సన్నపుమచ్చఁ గాంచి యా
నందము డింది కందు మది నాటుకొనం దలయూఁచి శారదా
నందుని సద్గుణం బవగుణంబుగఁ గైకొని వచ్చి మంత్రితోన్. 220

ఆ. ధర్మమూర్తి యనుచు నిర్మలాత్మకుఁడని
నమ్మినార మిట్టి నాటకములఁ

జాల ద్రోహి యైన శారదానందుని
జంపు మనిన మంత్రి సంచలించి. 221

క. దేవా! యిది మదిఁ దప్పుగ
భావింపకు భువి మహానుభావులు మదిలో
దైవిక మానుషములయం
దేవియుఁ బొలివోవకుండ నెఱుఁగుట వినవే. 222

క. జాడచెడి రాచలోగిలి
నోడుగఁ గన్నంటు వెట్టి బలుమ్రుచ్చులతోఁ
గూడిన నొరుఁ జంపిన ఱం
కాడిన మఱి విప్రుఁ జంప నర్హంబగునే. 223

వ. ఇంతియ కాదు. 224

క. భూపాల గురునిఁ జంపెడు
పాపము వల దనుచు మొక్కి పలికినఁ “గామాం
ధోపి నపశ్యతి" యనియెడు
నా పలుకు నిజంబు చేసి యతఁ డుగ్రుండై. 225

ఆ. చెడుగుబుద్దు లింకఁ జెప్పక నామాట
ద్రోవవైతివేని ద్రోహిఁ జంపు
మనుడు మాఱుమాట లాడక శారదా
నందుఁ దెచ్చి బంధనం బొనర్చె. 226

మ. ఇటు విప్రోత్తముఁ గట్టికొంచుఁ జని మంత్రీంద్రుండు చింతించి య
క్కట చంపించిన బ్రహ్మహత్య నను మ్రగ్గంజేయు నారాజు ని
చ్చటఁ బాపంబున బ్రుంగుఁ గావునఁ దదాజ్ఞాలంఘనం బైన నొ
క్కటఁ గావించి జగత్రయంబు హితముం గావింతు నంచు న్వెసన్. 227

ఉ. ఆతనికట్టు లూడిచి గృహంబున కంపి యమాత్యుఁ డేగి నే
నా తెఱఁ గట్ల చేసితిఁ బ్రియం బగునే యని చెప్పి వచ్చి త
ద్భీతియు నీతియుం గలుగ భీరునిఁ బాఱుని నేలమాలెలోఁ
బ్రీతి వహించి దాఁచి తనపెంపునఁ బ్రోవఁగఁ గొన్ని యేండ్లకున్. 228

క. పాలసుఁడు కితవ కేలీ
లాలసుఁ డస్థిరుఁడు దురభిలాషుఁడు మృగయా
లోలుఁడయి నందధరణీ
పాలతనూభవుఁడు విజయపాలుఁడు గదలెన్. 229

వ. తదనంతరంబ. 230

సీ. పిల్లులు పోరాడె బల్లి యూరక త్రుళ్ళె
దమ్మళి పొడసూపెఁ దుమ్మి రెదురఁ
దొఱఁగువోయినలేఁగ కొఱలుచు నొక కుఱ్ఱి
పఱతెంచెఁ గ్రంపపై నఱచెఁ గాకి
యులుమఁ డొక్కఁడు నూనె తలతోడ నేతెంచె
మైలచీరలచాకి మ్రోలనెదిరెఁ
[71]గాకియును గొరవంకయును ఱెక్కలపోతు
నేటిరింతయు దాఁటె నెడమదిశకు
ఆ. [72]బైట వెరవుదప్పఁ బాలగుమ్మయుఁ బాఱె
నొంటిపాటఁ బైఁడికంటి వీచె
నెలుఁగుచేసెఁ బెద్దపులుఁగు పామటు దోఁచె
దబ్బి బొబ్బలిడియె నుబ్బులడర. 291

ఆ. వానిఁ గనుఁగొని పరివారమ్ము గలగుచు
శకునబలము లేదు చనకు మనిన
విజయపాలుఁ డివియు నిజములో కల్లలో
తెలిసికొంద మనుచుఁ దిరుగఁడయ్యె. 232

క. దుర్మతికి ధర్మబుద్దియు
నిర్మలునకు దుర్గతియు గణికలకు దృఢ మౌ
కూర్మియుఁ గలిమికి నిలుపును
గర్మములకుఁ దప్పుటయును గలుగవు జగతిన్. 238

శా. ఈ రీతిం జను లెల్ల నుల్లముల నూహింపంగ శంపారుచి
స్ఫారజ్యా[73]లలితోరుచాపధరుఁడై సన్నద్ధసైన్యంబుతో
భేరీభైరవభాంకృతు ల్దిశల నిర్భేదింపగా నేగె ని
[74]ష్కారుణ్యుండు సమస్తదుర్గుణగణాణ్యుం డరణ్యానికిన్. 284

ఆ. అచటఁ జెమటకోక యమరించి కుడిచేతఁ
గడిఁదిడేగఁ బట్టి యెడమచేత
నెఱక లొయ్యఁ జక్కఁ జెరివి మోమీక్షించి
కౌఁజుకొక్కెరలను గదియవైచె. 235

వ. ఇట్లొండొంటఁ బులుఁగుల నీల్గించి[75] యొక్క పెట్ట సాళువంబు నెగయించిన. 236

క. తత్ఫక్షపాతరవము వి
యత్పథమున జలచనినద మన విహగము ల
త్యుత్పాతవృష్టిసమయప
తత్పాషాణములు వోలె ధరపైఁ గూలెన్. 287

సీ. కేరిజంబులఁ గోరి కేరుట దీరించి
పూరేండ్లఁ బుడకల బూడ్దెఁ గలిపి
పాలగుమ్మల నేలపాలుగా నొనరించి
వెలిచెల మెలకువ వెలితిచేసి
బెగ్గురుకదుపుల బెగ్గిల మగ్గించి
కొంగలపొగరెల్లఁ ద్రుంగఁ[76] ద్రొక్కి
కక్కెర నెత్తురు గ్రక్కించి కొక్కెర
పిండు గుండియలెల్ల బెండుపఱిచి
ఆ. కారుకోళ్ల నెండఁ గారించి గొరవంక
బింక మింక వానిపొంక మణఁచి
చెమరుఁబోతుగములఁ జమరి కౌఁజులఁ జించి
సాళువంబు విజయపాలుఁ జేరె. 238

ఉ. అట్టి ఖగంబువేఁటకు నరాధిపనందనుఁ డిచ్చ మెచ్చుచుం
బిట్టల నెల్ల లోఁబఱిచి భృత్యుల కిచ్చుచుఁ బెక్కువేడుకల్
పుట్టఁగ నొక్కచో మడుఁగు పొంతకుఁ బోయి జలంబు ద్రావి యా
[77]పట్టున మీలఁ గాంచి యొక బారువలం దివియించి యేపుగన్. 239

సీ. కొట్టమీలను దండ్రికొలువులెంకల కిచ్చె
వాలుగలను సంగడీల కిచ్చెఁ
[78]బాఁపమీనుల బిన్నపడవాళ్ళకును నిచ్చె
మారువులఁ జనవువారి కిచ్చె
బేడసంబుల నిచ్చె వేడుకకాండ్రకు
గెండెల బలుదుండగీల కిచ్చె



వెలిమొట్టలను దండువుల దలారుల కిచ్చెఁ
గొడిసెలఁ బరిహాసకులకు నిచ్చెఁ
ఆ. బక్కెమొట్ట రొయ్య పరిగ యింగిలికము
చీరచింపుజెల్ల నారజెల్ల
కుంటముక్కు మొదలుకొని కలవన్నియు
బంటువారికెల్ల నొంటియిచ్చె. 240

వ. ఇచ్చి యచ్చోటు వాసి బాణాసనబాణపాణియై వాగురికవాగురా కరాళంబగు వనాంతరాళంబు సొచ్చి. 241

క. బాలుఁడు మెలఁగెను మృగకుల
కాలాకృతిఁ బవనజవన ఘనశునకాళీ
కోలాహలాకాలాహిత
కోలాహల కాహళానుకూల క్రీడన్. 242

క. తొలిఁదొలిఁ జింకల మనుఁబో
తులఁ గడఁజుల లేళ్ల నిర్ల దుప్పుల మఱి యే
కలముల నెలుఁగులఁ బులులను
బలువిడిగాఁ దునిమెఁ జలము బలము న్మెఱయన్. 243

క. అయ్యెడఁ గోఱలు దీటుచు
దయ్యముక్రియ నొక్కపంది తాఁకుచుఁ దనువుల్
వ్రయ్యలుగఁ బొడిచెఁ దొలఁగం
జయ్యన నలుదెసలఁ బఱచె సైన్యములెల్లన్. 244

వ. అప్పుడు కుమారుండు కృతవాహనారోహణుండై యావరాహంబునుం దోలి వెనునంట నొంటిం జనిచని కాఱడవి నీరంబులలో జాడదప్పి దప్పిఁగొని యొక్కమడుఁగు చేరి యచ్చోటఁ దురంగంబు డిగ్గి చెట్టునం గట్టి సరసిలో జలంబులు గ్రోలి యభయుండై యచట విశ్రాంతికై నిలుచునంత. 245



శా. శీఘ్రాపాతనితాంతతాంత[79]తురగస్వేదంబుఁ దీర్పంగ హృ
ష్టాఘ్రాణంబున మోరయెత్తి తనమీస ల్నిక్కఁ దత్సౌరభం
బాఘ్రాణించి చరించి పొంచి కృతముఖ్యాయామభీమాకృతిన్
వ్యాఘ్రం బొక్కటి వచ్చి యచ్చట నృపవ్యాఘ్రాత్మజుం జూచుడున్. 246

ఆ. హయము దాని రాక కదరి కట్టినవాఁగెఁ[80]
దెంచుకొనుచుఁ బాఱె దిక్కులద్రువఁ
బొరిగొనం దలంచు పులిఁజూచి బెగ్గిలి
విజయపాలుఁ డొక్కవృక్ష మెక్కె. 247

ఉ. అమ్మెయి నెక్కఁ గోపమున నాపులియుం బఱతెంచి తత్ప్రదే
శమ్మున నిల్చిన న్బెగడి శాఖలమీఁదికి డాఁగ నేగియుం
గొమ్మను నొక్క బొల్లియెలుఁగుం గని తల్లడమంది దుర్నిమి
త్తమ్ముగ నాఫలంబు లిటఁ దప్పక వచ్చెనె దైవమా యనున్. 248

క. క్రిందఁ బులి మీఁద నెలుఁగును
నందప్రియనందనుండు నడుమం గలుగ
న్ముందట నొకనుయ్యియు వెను
కందగ నొక గొయ్యిభంగిఁ గానఁగనయ్యెన్. 249

వ. అప్పుడు. 250

గీ. రెండునిలువు లేగయుఁ బుండరీకం బిది
నీకు నచట నుండ నేర్పుగాదు
నమ్మి[81] వేగ మిటకు రమ్ము బాలక యని
యెలుఁగు పిలిచెఁ గాఱు టెలుఁగు సెలఁగ. 251



ఉ. అక్కొమరుండు దాఁప? హృదయంబు యథావిధి నిల్పి రెంటిలో
నిక్కడఁ గొంత యాస గల దిప్పటి కేగెద నంచు మీఁదికిన్
స్రుక్కుచుఁ జోయెఁ గ్రిందఁ బులి చూచి చలంబున మీర లిద్దఱుం
జిక్కితి రంచు సోఁగి నిలిచెం దనకన్నుల నిప్పు లొల్కఁగన్. 257

ఆ. పుండరీక మిట్టు లొండొండఁ జూపుల
మండఁ గోపవహ్ని మెండుకొనఁగ
నుండు టెఱిగి మాఱుమండుట మానె నా
నెండఱేఁడు గ్రుంకుఁగొండ నడఁగె. 253

క. పులి యాఁగిన జిక్కిన తమ
యెలుఁగును వెదకంగ వచ్చి యెల్లెడఁ గలయం
బొలయు నెలుఁగులో యన గుం
తల మిట్టలఁ జీఁకువాలు దళమై పర్వెన్. 254

క. గగనమణి సాళువముక్రియ
నెగసినఁ దలసూపకుండి యింతట నతఁ డ
స్తగిరిచఱిన్ వ్రాలిన పె
ల్లగు ఖగముల కరణిఁ జుక్క లయ్యెడ నిక్కెన్.[82] 255

శా. ఆవేళన్ భువిఁ బీఁట వెట్టిన మహావ్యాఘ్రంబు నీక్షించుచున్
దైవంబు న్మది దూఱుచుం దలఁకుచుం దద్రాత్రియర్ధంబుఁ జిం
తావేశంబునఁ బుచ్చి కూర్కఁ దలపోయంగా నెలుం గంతయుం
దా వీక్షించి నిజాంకసీమఁ జెలువౌ తల్పంబుగాఁ జూపుచున్. 256

క. నిద్ర చనుదెంచెనేనియు
నిద్రింపుము వెఱవ నేల నీకిట ననినన్



నిద్ర సుఖ మెఱుఁగ దనఁగా
నిద్రించెఁ దదంకశయ్య నృపసుతుఁ డంతన్. 257

సీ. శార్దూల మటు చూచి నిర్దయత్వముతోడ
భల్లూక! పగపట్టి బ్రదుకఁగలవె
వాఁడు నీ కేలెస్సవాఁడయ్యెఁ బరజాతి
నృపతిపుత్రుండు నిష్కృపుఁడు వీడు
మనకులం బాదిగా వనగోచరంబుల
వేఁటచాటున నొక్క నూటిఁ జంపె
నిల నొక్కగూఁటిపిల్లల మిద్దఱము దుష్ట
బాలునకై పోరనేల మనము
ఆ. వీనిఁ గ్రింద వైవు విడిచిపెట్టెద నిన్ను
సగము నీకు నిత్తు నగవు గాదు
నరుని నమ్మవలదు నమ్మి మున్నొకపాము
చిచ్చులోనఁ గాలి చచ్చెఁ గాదె. 258

క. ఆ కథ విను వింధ్యాటవి
నేకలుఁ డనుజోయ తోఁటయీరమున మహా
శాకోటముఁ[83] దెగనఱకఁగ
నాకోటరసీమ నొక్కయహిపతి వెడలెన్. 259

ఆ. వెడలి యేను నిలిచి విహరించు తా విది
వలచు దీన నేమి గలదు నీకు
నన్నుఁ గలసి బ్రతుకు[84] మెన్నఁడుఁ జేటులే
దనిన వెరఁగుపడుచు నట్ల తలఁగె. 260



క. తలఁగిన వానికి నది తన
తలరత్నం బిచ్చి పుచ్చి తా నేగిన ని
మ్ముల వాఁడు నేగి పురిలో
పల నొక వర్తకున కమ్మె పదిగద్దెలకున్. 261

చ. అట మఱునాఁడు వచ్చిన మహాభుజగేంద్రుఁడు గారవించి ని
న్నఁటిమణి యెంత కమ్మితి వనా యన మూల్య మెఱుంగఁ దెల్ప న
క్కట[85] పదివేల కమ్మక వికల్పము చేసితి వింతనుండి మి
క్కుటముగ నమ్ముకొమ్మనుచుఁ గ్రొత్త ఫణామణి యిచ్చే వానికిన్. 262

క. తనయిల్లుఁ గాచినాఁడని
మనమునఁ బ్రియమంది యిచ్చు మణు లనుదినముం
గొనిపోయి యమ్ముకొనుచును
ధనికుండై వాఁడు చెల్మి దప్పినబుద్ధిన్. 263

ఆ. దీని కెచటఁ గలుగు దివ్యరత్నంబులు
దీని మొదలితావుఁ దెలియవలయు
ననుచుఁ గోరిపోయి యాపాముచనుజాడ
వట్టి యేగి యొక్క పుట్టఁ గనియె. 264

క. కని తిరిగి పోయి మఱునాఁ
డనలంబును గసవుమోపు హస్తంబులఁ గై
కొనివచ్చి తొఱ్ఱలోపల
జొనిపి భుజంగంబు మిడుకుచు న్మడియంగన్. 265

క. జాల్ముం డిటు గాలిచి
వల్మీకముఁ ద్రవ్వఁ జనిన వడి విషములచే

గుల్మాదులు దరికొనఁగా
నుల్ముకములభంగి కొన్ని[86] యురగము లెగసెన్. 286

ఆ. ఉరగకులము బోయఁ బొరిగొని శమియించె
నట్లు గాన వీని కడలనేల
పాము క్రూరమండ్రు ప్రాణులలో నెల్లఁ
బాముకంటె నరుఁడు పాతకుండు. 267

క. నామాట నమ్మి డిగ్గన
నీ మనుజునిఁ ద్రోవు మింక నేగెద ననినన్
మోమోటలేక నవ్వుచు
నేమీ సభ్యుఁడవె యనుచు నెలుఁ గిట్లనియెన్. 268

క. ఇలఁ గలపశువుల నెల్లను .
బొలియించుచుఁ బాపములకుఁ బొడవయ్యెడు బె
బ్బులితోడి పొత్తు గలదే
పులి నమ్మియకాదె తొల్లిపులుఁ గొక టిలిగెన్. 269

మ. వినుమా చెప్పెదఁ దొల్లి యొక్క పులి కావేరీతటిం బ్రాణులం
దనయిచ్చ న్వధియించుచుం దినుచు నుత్సాహంబుతో నుండి కా
రెనుబోతుం దినునాఁడు మాంసకబళాన్వీతంబుగా నొక్కబొ[87]
క్క నిజాస్యంబున నొక్కదౌడయెడ వీఁకం జొచ్చిన న్నొచ్చుచున్. 270

క. వదనము విదురుచుకొను చది
తుదినాలుకయెత్తుచేత దూపొడుచుక్రియం
గదలించుఁ దాలువొరఁగ
న్మెదలించుం దగ్గు మ్రొగ్గు మేదినిఁ బొరలున్. 271

మ. ఇటు దుర్వేదనఁ జిక్కి మాన్పుకొనఁగా నెం దేగినం బ్రాణసం
కటమై ప్రాణులు మారి వచ్చె నని డాఁగంబాఱగా నొప్పి యే



చ్చటనుం బాపెడు దిక్కులేక చనుచున్ శైలస్థలిం జేరి ముం
దట సూచీముఖపక్షిఁ గాంచి తనఖేదం బంతయుం జెప్పినన్. 272

క. సూచీముఖంబు డగ్గఱి
నీ చెడుగుందనము మాని నిలువవు నీనో
రోచెల్ల చొరఁగవలె హిం
సాచారివి కాలుఁడైన నలుగఁడె నీకున్. 273

చ. అనవుడు నోరు సొచ్చి వ్యథ[88] యార్పఁగదే మును చచ్చినట్లు ప
ల్లును మెదలింపకుండెద నలోలత నంచు మొగంబు వంటి వ్రా
లిన నది నోరు సొచ్చి కదలించి క్రమంబున దౌడబొక్క[89] ము
క్కునఁ గొనివచ్చె నాపులికిఁ గుత్తుకనాటినకొయ్య నొయ్యనన్. 274

ఆ. అట్లు పుచ్చిన ముద మంది సూచీముఖుఁ
బొగడి యేగి క్రూరమృగము మఱియుఁ
బసులఁ జంపి తినఁగఁ జలలంబుతో దౌడ
నాఁటిజాడ నెముక నాటినంత.[90] 275

ఉ. క్రమ్మఱ వచ్చి పుచ్చు మని కై కొని వేఁడినఁ బుచ్చివైచి స
ఖ్యమ్మొనరించి నిచ్చలు సుఖస్థితి నుండఁగ నొక్కనాఁడు మాం
సమ్మొకయింత గానకయుఁ జయ్యన నాపులి వచ్చి వక్త్రము
న్నమ్మిక దోఁపఁగాఁ దెఱచిన న్విహగంబును జొచ్చె నాక్రియన్. 276

క. చొచ్చినయంతన కాటునఁ
జచ్చె న్విహగంబు పులులసంగడ మిదిగో



నిచ్చకములాడె దీతని
నిచ్చుటకై యంత యేమి యే నజ్జుఁడనే. 277

క. జాతివిభేదం బేటికిఁ
బాతకునకు నైన నెడరుఁ బాపి[91] మహావి
ఖ్యాతిఁ గొననొప్పుఁ దిర్య
గ్జాతికపోతంబు చెంచుఁ గాచుట వినవే. 278

క. గోదానము ధనదానము
భూదానము నన్నదానమును బథికహితాం
భోదానము నుత్తమవి
ద్యాదానము గూడ నభయదానము సరియే. 279

ఆ. వెన్ను సొచ్చువానిఁ దన్ను నమ్మినవానిఁ
జంపితేని శిశువు జంపుటండ్రు
పంత మెఱుఁగు జాంబవంతునివారము
బాస తప్ప మిట్టియాస విడువు. 280

చ. అనుచు నిరుత్తరంబుగ దయామతిఁ బల్కెడు నంత రాజనం
దనుఁడును లేచినన్ క్షణము దానిఁకఁ గూర్కెద నిద్రవోకుమీ
యని తొడమీఁడ నూఁదికొని యాయెలుఁగించుక కన్నుమూయఁగాఁ
గని పులి వల్కె వాని మెయిఁ గంపము పుట్టఁగ బీతు వెట్టుచున్. 281

ఆ. కోఱలు గలవాని గోళులు గలవానిఁ
గొమ్ములు గలవాని నమ్మవలదు
బమ్మరించెనేని బ్రతుకంగవచ్చునే
యెలుఁగుతొడి చెలిమి యేల[92] నీకు. 282

క. మొన్న నొకనిఁ దోలితి వాఁ
డిన్నగ మిట్లెక్కె వాని నిది కరుణాసం
పన్నుని క్రియ లోనిడుకొని
నిన్న విఱిచి పెట్టి నేఁడు నిజమరివోలెన్. 283

క. కూరిమి గల దని నమ్మకు
క్రూరమృగంబులకుఁ గరుణ గూడునె యిది నీ
చేరువ నుండుట నేఁటికి
నీరీతుల బుజ్జగించె నెల్లిటి కొఱవై. 284

ఆ. దానిఁ జెప్పనేల యేనిదె యొకయేఁడు
పట్టు నాఱునెలలు పట్టుఁ గాక
మిమ్ముఁ జంపి తిందు నమ్ము మీయెడ నాకు
దీనిఁ ద్రోచి బ్రదుకు తెరువు గనుము. 285

చ. అనవుడు వాఁడు నిక్కముగ నాత్మఁ దలంచి యెలుంగుఁ గూలఁద్రో
చిన నది జాఱుచుం దెలిసి చేతికి లోనగు కొమ్మ వట్టి యొ
య్యనఁ బఱతెంచి బెగ్గిలునృపాత్మజుఁ గని యల్పబుద్ది వే
మన నను నమ్ముమంటి భయమందకుమీ యని పల్కుచుండఁగన్. 286

క. కలకలఁ బలికెడు పక్షుల
కలకలములు సకలదిశలఁ గలయఁగఁ బొలయం
దళ దళికులముగ దశశత
దళదళములు విరియఁ బొద్దు తళతళఁ బొడిచెన్. 287

ఆ. తమముతోడఁ గూడఁ దరలి శార్దూలంబు
శైలగుహల కేగెఁ జాలడస్సి
తరణికిరణపంక్తి సరసఁ జెట్టుననుండి
యెలుఁగుఁగూడి బాలుఁ డిలకు డిగ్గె. 288

క. ఆయెలుఁ గతనిఁ బిలిచి య
న్యాయివి పరలోకపీడనం[93] బగుదురితం
బీయెడన పాయఁ జేసెద
రాయిట వినుమిఁక “ససేమిరా" యను మెపుడున్. 289

క. ఈ నాలు గక్షరంబుల
నీనేరమి నొరుఁడు చెప్పేనేని వికారం
బూనక తొల్లిటిక్రియ స
న్మానము గైకొనుము మంచిమాటలతోడన్. 290

క. అని వీడ్కొలిపినతఱి న
ట్లనె యాతఁడును 'న్ససేమిరా' యనుచు వనం
బున భూతావిష్టుని చా
డ్పునఁ దిరుగఁగ వానిహయము పురిఁ జేరుటయున్. 291

సీ. అశ్వరత్నం బొంటి నరుదెంచె నిన్నఁటి
శకునము ల్పాపనిఁ జంపె నొక్కొ
యని తలంచుచు నందజనపాలుఁ డాజాడఁ
బఱతెంచి యడవిలో బాలుఁ జూచి
యన్న యిదేమి రా నన్న “ససేమిరా"
యనుడుఁ గలఁగి యొత్తి యడుగుటయును
నాలుగక్షరముల నోలిఁబల్కెడువాని
దోడ్కొనిపోయి మందుల నొనర్చి
ఆ. వీనిభూతశంక విడిపించువారికి
నర్ధరాజ్య మిత్తు ననుచుఁ జాటి
వేలుపులకుఁ బెట్టి వేఁడికొన్నను నాలు
గక్షరములు విడువఁడయ్యె వాఁడు. 292



ఉ. నందనృపాలుఁ డిట్లను మనంబునఁ గ్రుళ్ళుచు నెల్లవేల్పులున్
మందులు మ్రాఁకులు న్మణులు మంత్రములున్ వృథయయ్య శారదా
నందుఁడ యిప్పుడున్నఁ బ్రియనందనుఁ దెల్పఁగ నోపు నట్టి పె
ద్దం దునిమించినాఁడ వలదా హితు లెవ్వరు నడ్డపెట్టఁగన్. 293

ఉ. నావుడు మంత్రి చిత్తమున నవ్వుచు నావిధ మయ్యె నాఁడు, నేఁ
డీవిధ మయ్యెఁ, బేరుకొననేటికి నిందఱపాల దృష్టమౌ
దైవము గల్లెనేని భువిఁ దత్సముఁ డొక్కఁడు గల్గనేరఁడే
కావున బమ్మరింపఁ బని గా దని యూఱడఁ బల్కె భూపతిన్. 294

ఉ. ఆవిభు నూఱడించి నిలయంబున కేగి బిలంబు విప్రుతో
నీవిధ మెల్లఁ జెప్పిన మహీసురుఁడు ‘న్సచివాగ్రణీ భవ
ద్బూవరుఁ జేరి నాఁటిగురుపుత్రిక యేడవయేఁటి పాప నీ
జీవము చిక్కుదీర్చు నని[94] చెప్పుము నీ’ వని పంచె నాతనిన్. 295

వ. అటకుం జని. 296

ఉ. ఆతఁడు విన్నవించినఁ బ్రియాన్వితుఁడై సుతుఁ దోడుకొంచు ధా
త్రీతలనాథుఁ డింటి కరుదెంచుడు నాధరణీసురుండు క
న్యాతిలకంబు నాజవనికాంతరికాకృతి నిల్పి పద్యవి
ద్యోతితరీతి దోఁప వినుచుండెఁ గుమారు ‘ససేమిరా’ ధ్వనిన్. 297

వ. ఇట్టి నాలుగక్షరంబుల నాలించి విని ‘యందఱు నూరకుండుం’ డని కుమారు నుద్దేశించి పద్య మి ట్లని చదివె. 298

క. “స”జ్జనభావము గలుగు సు
హృజ్జనముల మోసపుచ్చు టిది నేరుపె నీ
యజ్జతొడమీఁదఁగూర్కిన
యజ్జంతువుఁ జంపఁజూచు టది పౌరుషమే. 299



వ. [95]అని చదివిన బాలుఁడు దా విని ప్రథమాక్షరము విడిచి పెట్టి "సేమిరా" “సేమిరా"యనుచున్నంత నందఱు నానందనరేంద్రుతో నానందంబు నొంది మేలు మే లనుచు నుండఁ దత్కలకలంబు మాన్పి జవనికలో గురుండు. 300

క. “సే”తువుఁ గని జలనిధిసం
జాతధనుష్కోటిఁ బడిన సద్ద్విజహతికిం
బాతకము వాయు మిత్రవి
ఘాతికిఁ బాతకమె కాని గతి గలుగ దనా. 301

వ. అని రెండవపద్యంబుఁ జదువఁ గుమారుండు రెండవయక్షరంబు విడిచి “మిరా మిరా" యనుచుండ నిట నయ్యాచార్యుండును. 302

క. “మి”త్రద్రోహి కృతఘ్న ప
విత్రగురుద్రోహి చౌర్యవిద్యాపరులున్
మిత్రశశిస్థితి మేరగఁ
బుత్రులు గలిగియును నరకమునఁ బడుదు రనా. 303

వ. అని తృతీయపద్యంబు పఠించినఁ దృతీయాక్షరంబు విడిచి “రా, రా" యను నందనుం జూచి యమందానందుం డగు నందు నుద్దేశించి శారదానందుండు. 304

క. “రా"జ! భవదీయుఁడైన త
నూజునకు న్శుభము నోజ నూల్కొను విద్వ
ద్రాజికి ధనదానము ని
ర్వ్యాజమునం జేయు మిహపరంబులు గలుగున్. 305

వ. అని యిట్లు చతుర్థపద్యంబుఁ జదివినఁ జతుర్దం బగు రకారంబుతో నవ్వికారంబునుం బాసి బాలుండు తండ్రికి మ్రొక్కి మిత్రద్రోహలక్షితంబగు ఋక్షవ్యాఘ్రవృత్తాంతం బంతయుం జెప్పిన నచ్చెరువు మెచ్చునుం బిచ్చలింప నవనీపతి జవనిక వంకఁ జూచి.



ఆ. పిన్నదాన విచట నున్నదానవు తల్లి
యింటివాకిలియును నెఱుఁగ వీవు
కానలోనఁ బులియు మానిసియు నెలుంగుఁ
దొడరు చేఁత లెట్లు తోఁచె నీకు. 307

వ. అనుడు నతం డింకఁ దాఁపం బని లేదని తలంచి. 308

క. భూనాయక! భూసురకృప
నానాలుక నొప్పు వాణి నానాదృఢవి
జ్ఞానమునఁ దెలియు నన్నియు[96]
భానుమతీదేవిమచ్చభంగి న్మదిలోన్. 309

మ. అనినన్ దిగ్గన లేచి చూచి తెరలో నాచార్యుఁగా నిశ్చయిం
చి నరేంద్రుం డతిహృష్టుఁ డౌచు సచిపుం జేపట్టి నీ యట్టి బరి
ధునిధానం బిఁక నొండు గల్గునె గురుద్రోహంబుఁ దప్పించి యెం
దును బాపంబును బొందకుండ నను ధన్యుంజేసి తీ నేర్పునన్. 310

క. ప్రణయము దప్పక యా బ్రా
హ్మణహత్య దొలంగ రాజ్య మలరఁగ సుతుదు
ర్గుణములు విడిపించితి నీ
గుణములచే నన్ను జట్టిగొంటివి చుమ్మీ. 311

వ. అని గ్రుచ్చి కౌగిలించుకొని తనపట్టిచెట్ట పట్టుకొని పుణ్యసులభానుమతి యగు భానుమతియుం దానును గురు డగ్గఱి. 312

క. ఎల్లవిధంబులఁ జూచిన
దల్లియుఁ దండ్రియును నీవె దయసేయుము మా
కల్లలు లోఁగొని మము నీ
నల్లిల్లుగఁ జూడు మనుచు నరపతి మొక్కెన్. 313



శా. ఈచందంబున మ్రొక్కి యందలముఁ దా నెక్కించి భూమీవరుం
డాచార్యుం గొని వచ్చి గద్దియపయిన్ హర్షంబుతో నుంచి శి
ష్టాచారంబునఁ బూజచేసి తనరాజ్యశ్రీ సమర్పించి త
ద్వాచాదత్తముగాఁగఁ గైకొని ప్రసాదం బంచు నేలె న్భువిన్. 314

మ. అని మంత్రీంద్రుఁడు చెప్పిన న్విని కథాహ్లాదప్రసన్నాత్ముఁడై
జననాథుండును మంత్రిలేనిపని మోసం బంచుఁ జేపట్టి యొ
య్యన సత్త్వాఢ్యులచేతఁ బుష్పకనిభంబౌ దివ్యసింహాసనం
బనువొందం గొనిపోయి నిల్పె నిజహర్మ్యంబైన ధారాపురిన్. 315

ఉ. శంభుముఖాంబుజార్కు దృఢసారవరాహశరీరవశ్యవి
శ్వంభరు శాంభవీవరదు సంభృతరక్షణు సర్వలోకకు
క్షింభరు సిద్ధసాధ్యసురకిన్నరపన్నగగీతకీర్తివి
శ్వంభరు జంభవైరిసహసంభవు దృష్టవపుర్విజృంభణున్. 316

ఉ. శంకితకింకరవ్రజవశంకరుఁ బంకజనేత్రమిత్రు న
భ్రంకషకాంతిసంకులకపర్దవిభూషితభవ్యదివ్యకూ
లంకషు నిష్కళంకితవిలాసకలాపధురీణు శౌర్యస
ర్వంకషవైభవాంకితవశంకరు శంకరు లోకశంకరున్. 317

మాలిని. పరమకరుణలీలా భక్తలోకానుకూలా
పరిచితసురరక్షా భగ్నదైతేయవక్షా
సరసిజహితనేత్రా సచ్చిదానందగాత్రా
హరిహరమయరూపా యాగయోగస్వరూపా. 318

గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాది బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామత్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాల రూపనూపురసుందరచరణారవింద సనదప్రోలి పురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్య సముద్దరణ శ్రీకొఱవివెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజ విరచితం బైన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందుఁ బార్వతీపరమేశ్వరాన్యోన్యప్రశ్నోత్తరంబులును భర్తృహరి వైరాగ్యంబును విక్రమార్కుని రాజ్యసాయుజ్యంబులును శాలివాహనవిజయంబును భోజునికి సింహాసనప్రాప్తియు మంత్రిగుణప్రశంసయు నందోపాఖ్యానంబును నన్నది కథావతారిక ప్రథమాశ్వాసము.

  1. సింహాసనద్వాత్రింశతి యనియుం గలదు.
  2. నందనా
  3. నుతింతున్.
  4. రాగెరౌతు,రాగకౌతు
  5. లాల్కమలపొల్తుక
  6. నడిం
  7. హరిక్రియు, హరిప్రియ, హరిశిఖుఁడు.
  8. నతిసుముఖుఁగా
  9. కారణమనియు.
  10. నా భరతుండని, నాభావకుఁడని
  11. వే, లే, యని రెండుప్రతుల రెండురీతులు (వేములవాడ, లేములవాడ)
  12. 3 వితర్కించెద, వినిపించెద
  13. 4 మానము దప్పనీక
  14. 5 లొనర్చిరేనియున్
  15. 1 నేర్పరులైనవోజులై
  16. 2 పద్ధతి
  17. 3 బాగురుఁబిల్లులు
  18. 4 గూర్చునునా
  19. మహిమమచ్చు...జెప్పెడు
  20. నవ్విభుల
  21. తోడంటునఁ బా
  22. గడపుట్టు
  23. వంకఁ దుంగ
  24. దుండుకవిత
  25. మొరయన్ , మెరయన్
  26. ముక్తవితానసమ్పద్విధాయకుండు
  27. సందప్రోలు
  28. సాంద్రబలంబున
  29. ధృఢబాణ
  30. చంద్రుకున్
  31. గంగాంబకుఁ బుట్టిరి భువి, నంగజసన్నిభులు ఘనులు అన్నయయు సింగయ మంత్రియు
  32. పల్లకొండ గుణసంగుఁడు సింగనయుం బ్రియంబునన్
  33. రామాయణ కృతిపతియై
  34. కవియై
  35. బ్రహ్మదేవయొడయల
  36. మేటినృపులమాట గీటుపఱచి
  37. యీక్షోణిన్ శ్రీపురు...శోభిల్లి
  38. ఆంధ్రభాషా విదుఁడన్
  39. వికీర్ణవిక్రమ
  40. *విహస్తుఁడు = చేయి లేనివాఁడు,
        వ్యాకులుఁడు
  41. నిన్ను గొడితే
  42. డొక్కలు
  43. ఉమియు పెదవిత్రేగుడమృతంబటంచును --- నెగడైన పెదవి--
  44. మిగులన్
  45. నీగతిపడదు
  46. వ్యామోహం బదియ నర్ధవర్షము చాలున్
  47. గీర్తి నిలిపె
  48. విశ్వసనము
  49. డయ్యున్
  50. వేయుపచ్చని
  51. ధ్రువాదిబంధసరణిం
  52. సంగీతప్రసంగానుసారంబుగా
  53. నిడికొని యుజ్జయినికిఁ దెచ్చి యొకవేళ నమ్మహాసన మెక్కి యవనివిభుఁడు
  54. బెదరకుండుము
  55. నొరగోసెద
  56. బేగిరి
  57. గోరిన
  58. శాలిభానుండగు
  59. కల్తు రందఱన్
  60. హానిఁ బొందుచు లయమయ్యె. (మయిలమయ్యె -చిన్నయసూరిపాఠము)
  61. పెట్టి
  62. నార్ప
  63. పైబడి
  64. కలిగి నల్గడ నాల్గుచేతుల వెడల్పు
  65. చెరువు
  66. బుధజ్ఞత
  67. తగవు
  68. గొడ్డుసొంపు
  69. తగవులన్
  70. సచివుఁ డుండఁగ
  71. కాకియునొకగొరంకయును. అని చిన్నయసూరిగారు
    కాకియు నొక పెరకయు నెరుకల పోతు
  72. పైటవెరవుదప్పబారె చెమరుపోతు
  73. జ్యాయుతచాపరోపధరుఁడై
  74. ష్కారురుణ్యుం డతఁ డుగ్రపాపజనతాగణ్య
  75. ఇట్లు దొడ్డపులుఁగుల నీక్షించి
  76. గ్రుంగ
  77. చట్లునమీలఁగాంచి యొక జాలిక్రియందివి పెంచి
  78. పాపేరలను బస్తుపడుచులకును నిచ్చె. పాఁపరలను.
  79. నితాంతవేగ
  80. యప్పుడవాఁగె— (యెంతయువాఁగె) చిన్నయసూరి
  81. నెమ్మి
  82. స్తగిరిన్ వ్రాలిన పెల్లగు
    ఖగములక్రియఁ జుక్కలంతఁ గానఁగ నయ్యెన్.
  83. తొంటియిర వెఱిఁగి మహానోకహముం
  84. ఇదిగొ గొమ్ము మణియు నెన్నఁడు
  85. వనాయని మూల్యము నెట్టెఱింగి యక్కటఁ
  86. మఱియు నురగ
  87. బొక్క - ఎముక
  88. నమ్మి చొచ్చి వెతయార్ప
  89. డడొమ్కి ముక్కున గొనివచ్చె నాపులికిఁ గుత్తుక నాటిన కొఱ్ఱు
  90. పుచ్చినను ముదమందుచుఁ బులఁగుఁజాలఁ
    బొగడియును నేగి యా క్రూరమృగము మఱియు
    బసులజంపి తినంగ జాపలముతోడ
    నాఁటిదౌడనె యెముకయు నాటె మగుడ.
  91. ఘాతుకునకునైన నెడరుగల్గినఁ దనలో నాతుకనవచ్చు
  92. పొందు లేల
  93. యన్యాయపరత జేయు పీడనం
  94. జీవము వేదదీర్చునని
  95. ఈవచనము మొదలు కంద పద్యమువలె నడచున్నది. ఇది వృత్తగంధి.
  96. జ్ఞానముఖంబున వెలయున్