సింహాసనద్వాత్రింశిక/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సింహాసనద్వాత్రింశిక

చతుర్థాశ్వాసము

ఏడవబొమ్మ కథ

క. శ్రీస్తనకుంకుమసదృశగ
భ్సతిసమూహప్రశస్తిపరిదీపితవ
క్షస్థలపటుతేజోమయ
కౌస్తుభకమనీయవేషిఁ గంసద్వేషిన్. 1

క. తలఁపున నిల్పి పెద్దల హితజ్ఞులఁ దద్జ్ఞులఁ గూర్చి భోజమం
డలవిభుఁ డిష్టలగ్నమున డాసి మహాసన మెక్కఁ బూనఁగాఁ
బలికెఁ దదీయపుత్రిక నృపాలక నిల్వుము విక్రమార్కభూ
తలపతిఁ బోలు తెంపు బలదర్పము లే కిట నెక్కవచ్చునే. 2

క. అనవుఁడు నాతనిసాహస
మును సత్వము నెట్టిచందమునఁ బెం పొదవె
న్వినిపింపు మనిన నుల్లస
మున నేడవబొమ్మ పలికే భోజునితోడన్. 3

శా. సత్యాలంకృతభాషణాభరణుఁ డుత్సాహ ప్రశస్తోదయుం
డత్యాసన్నహితోపభోగ్యవిభవాయత్తాధికప్రాభవ
ప్రత్యాదిష్టసురేశ్వరుండు సయసంపన్నిత్యుఁడా విక్రమా
దిత్యుం డుజ్జయినీపురిం బరఁగె నాదిత్యప్రభావుం డనన్. 4

వ. ఇట్టి విధంబున నతండు వ్యసనరాద్వేషకామక్రోధలోభమోహమదమత్సరవిరహితసుజనప్రాజ్యం బగురాజ్యంబు సేయ న్విద్యయందు వ్యసనంబును, కీర్తిసంపాదనంబునందు రాగంబును, బాపంబునెడ ద్వేషంబును, సంతతిసమృద్ధులయెడం గామంబును, ధర్మవిరోధులయెడఁ గ్రోధంబును, దుర్విషయంబులకడ లోభంబును, శిశువులకడ మోహంబును, బరోపకారంబులయెడ మదంబును, దానంబులయెడఁ బరస్పరమత్సరంబును బ్రవర్తిల్లఁ బ్రజలెల్ల నుల్లంబుల నుల్లసిల్లుచు భూవల్లభుగుణంబులం బెల్లు గొనియాడుచుండ. 5

ఉ. అన్నరనాథువీట ధనదాఖ్యుఁడు సద్గుణుఁ డర్థసంపదం
గిన్నరనాథసన్నిభుఁడు కీర్తివిశాలుఁడు దానధర్మసం
పన్నుఁడు నీతిమంతుఁడు కృపాపరిపూర్ణుఁ డుదారబుద్ధి వి
ద్వన్నుతశాలి వైశ్యకులవర్ధనుఁ డుండుఁ బ్రజానుకూలుఁడై. 6

ఆ. అతఁ డనుదినంబు నవనిసురులఁ గూడి
ధర్మశాస్త్రగోష్ఠి దగిలియుండి
యైహికంలు దక్కదని పరం బెఱుఁగుచు
విహితసకలదానమహిమ నెగడె. 7

క. హింసాతరంగితం బగు
సంసారపయోధిలోన జనులకు నెల్లం
గంసారిపాదపంకజ
సంసేవయ నావ యని ప్రశంసింపంగన్. 8

క. ఈక్రమమును విని ధనదుం
డక్రూరప్రియుని ద్వారకాధీశ్వరునిం
జక్రధరుని దర్శింప ను
పక్రమమునఁ బతికిఁ జెప్పి పయనం బయ్యెన్. 9

ఆ. ఆప్తవర్గసహితుఁ డై యేగి దుర్గంబు
లూళ్ళు నదులుఁ గడచి యొక్కనాఁడు
వృక్షరమ్య మగుచు వెలయు నుపద్వీప
మందు[1] విడిసి విశ్రమార్థ మరిగి. 10

క. స్ఫాటికసోపానంబుల
హాటకమయభైరవాలయముముందట మి
న్నేటిగతి శుద్ధజలరుచిఁ
బాటిల్లఁగఁ గనియె నొక్కపద్మాకరమున్. 11

వ. అందుఁ గృతస్నానుండై యొంటిఁ బసిండిగుడెం బ్రవేశించి. 12

శా. ఆలోనం గనియె న్భుజాష్టకవిభూషాకీర్ణరత్నప్రభా
జాలోన్మిశ్రితరక్తచందనపయస్సంధ్యాభ్రసంకాశదే
హాలంకారు మహోరగప్రకరజిహ్వాసన్నిభోగ్రానల
జ్వాలాకారకరాళకేశముఖదంష్ట్రాభైరవున్ భైరవున్. 13

క. అట్టిమహాభైరవునకు
దట్టం బగు భక్తితోడ దండాకృతిగాఁ
గట్టెదుర మ్రొక్కి లేచుచుఁ
బట్టికపైనున్న యొక్కపద్యముఁ గనియెన్. 14

ఆ. ఎవ్వఁడైన నిచటి కేతెంచి తనతలఁ
దానె త్రెంచికొనినఁ దత్క్షణంబ
మొండెములును దలలు రెండు నంటికొనంగఁ
బతియుఁ బడఁతుకయును బ్రదుకఁగలరు. 15

వ. అనునట్టి పద్యార్థంబునకుఁ గలంగి తత్త్వార్థం బవలోకించుచు. 15

క. చంపుడుగుడి[2] యిది యనియా
దంపతులకళేబరములుఁ దలలుం గని త
త్సంపాదితభయరౌద్రా
కంపితుఁడై సెట్టి బెగడి కన్నులు మూసెన్. 17

క. తదనంతరంబ చెదరిన
హృదయముఁ దనలోన నెట్టకేలకు[3] నిలువం
బొదపెట్టి వెడలి యొకబా
రి దొలఁగెనని విడిడలకుఁ దిరిగి చనుదెంచెన్. 18

క. ఆరే యచటం బుచ్చి వి
కారవిహీనాత్ముఁ డగుచుఁ గలమునఁ బారా
వారము నడిమికిఁ జని యా
ద్వారావతిపురము సొచ్చి తత్సౌధములోన్. 19

మహాస్రగ్ధర. కనియె న్భూపుత్రజిష్ణున్ ఘనదురీతమహాఖండనావిర్భవిష్ణున్
వనమాలాలంకరిష్ణున్ ప్రజవనవిహరద్వల్లనీకేలితృష్ణున్
దనుజేంద్రైకాసహిష్ణుం దరళమణిమయద్వారకాబద్దధృష్ణున్
డినకృత్కన్యావరిష్ణున్ ద్విజపతిగతివర్ధిష్ణు గోపాలకృష్ణున్. 20

క. కనుఁగొని యాదేవునకుం
గనకంబులు మణులుఁ బూజ గావించి ప్రియం
బెనయఁ బ్రణమిల్లి నిటలం
బునఁ జేతులు మొగిచి వినయమున వినుతించెన్. 21

సీ. ఇరుజోడుమొగముల యెఱ్ఱని కొమరుండు
నేర్పునఁ బనులెల్లఁ దీర్పుచుండఁ

దప్పనియోజతోఁ దనపిన్నపాపల
నాడింపఁ దెల్లని కోడ లుండఁ
గలిమియౌ నిల్లాలు కలిమినీనెడుచూడ్కిఁ
బెంపుడుబిడ్డలఁ బెంచుచుండఁ
గమ్మని యమ్ములు గల్గు ముద్దులపట్టి
చిల్లంగి చేతలు చేయుచుండఁ
ఆ. గాలివ్రేలఁ గన్నగారాబుఁగూఁతురు
మొదలివేల్పుఁ గూడి మురియుచుండ
నల్లపాలవెల్లి యిల్లుగాఁ గాఁపుర
మెఱిఁగి చేయు మేటి దొరవు నీవ. 22

సీ. పాదతీర్థం బతిపావనం బగుటకు
శిరమున నిడుకొన్న శివుఁడు సాక్షి
కలఁడన్న నెందైనఁ గలుగుట కుర్విలోఁ
బంబిన యుక్కుఁగంబంబు సాక్షి
తలఁచిన యంతనె తలఁగక యర్థుల
రక్షించుటకుఁ గరిరాజు సాక్షి
యాచంద్రతారార్కమగు దానశక్తికి
ధ్రువపదంబున నుండు ధ్రువుఁడు సాక్షి
తే. తాలిమికిఁ గాలఁ దన్నిన తపసి సాక్షి
భాగ్యమున కాదిలక్ష్మి చేపట్టు సాక్షి
త్రిభువనగురుండ వగుట విరించి సాక్షి
నిన్ను వర్ణింప నలవియె నీరజాక్ష. 23

నిరోష్ట్యదండకము :- జయకృష్ణ! జయకృష్ణ; కృష్ణ! స్థిరాస్యందనస్థాన నానాదినధ్యాన నానాసితానేక సేనారజోనీక రథ్యాతిరథ్యాళి సన్నాహస ద్ధరాజన్య జన్యాగతానన్యసాడృశ్యదృశ్యాంగ హృష్యజ్జరాసంధసంధానయంత్రాదియత్న క్షయాదాయి నీతిశ్రితాసార! సారాంతరజ్ఞానదాసాహితధ్యాన సన్నద్ధతేజ! కళాసంచితానంద! నందాంతరంగాంతరంగన్నిజానందినీరాకరాకారరాకానిశాధీశ! ధీశస్తసంచారసంచేయ సత్కీర్తినారీలసన్నారదారాధితాచార ధీరాంగనానాయకాద్యంతరాజాతశాస్త్రార్థసారాశయాగణ్య! గణ్యాకృతిచ్చాయ రాధానిరంతస్తనాద్రిస్థలక్రీడనాయత్తచిత్తస్థిరాసక్తిలీలానటీరంగ రంగస్థలీసాధనాహృష్టదుష్టాహితాభేదనాకాలసంజాతరాగాఢ్యనేత్రాంతకంసారి హింసాకళాదక్ష! దక్షక్రియానాశనాకారారకాశాకరేశాదిగర్జద్గణాధీశస్త్రీసహస్త్రీజయశ్రీరణాసార నిస్సారితాకారి నీరంధ్ర తేజోలసచ్చక్ర! చక్రాకృతి శ్లాఘనీయాంతశార్గ్ఙాతతజ్యాలతానిర్గతాఖండకాండాగ్ర ఖండీకృతారాతి సంఘాత! ఘాతస్థలత్కాళియాహీంద్ర శీర్షాళిరంగక్షితిక్రీడనాహర్షణాళ్చర్య కార్యాంగహారాయతిజ్ఞాన సత్యక్షణాసక్తచిత్తాదితేయాదిసిద్ధాంగనాకిన్నరీయక్షసంకీర్తితానంతకీర్తిస్రగాధార! ధారాళధారాధరాకాశనీలాంజనేందిందిరానీల సచ్ఛీకర గ్రాహకాళింది హేలాకరాళాగ్రహస్తాది విశ్రాంతి సాంగత్యశాంతాది సంతత్యహంకార! కారాగతారాతినారీకనక్తంచరాధ్యక్షనిశ్శేషణీశాతనాకేళిఖేలజ్జగజ్జాల! జాలాంతగాఢాంధకారచ్చిదానంద కృత్యాకరాదిత్య నిత్యాహితస్నేహసంరక్షితాశేష రక్షస్సతీసంఘదృక్కజ్జలక్షాళనాశీలధారా జలాధారఖడ్గాగ్ర లగ్నాహితానీకరక్తాధరస్మస్తనాళాంతరాసంగి సంగీతసంతుష్టసారంగరంగత్తరంగాదిగంగానదీకారణాంఘ్రి స్థిరానంద సంక్రందనాగ్న్యర్క జాతాదితేయారినీరాధినాథానిలార్థేశ గంగాధరాద్యష్టదిగ్రక్షకశ్రేణికా శేఖరానర్ఘ్యరత్నాళినీరాజనారాజితాకార కాంతిచ్ఛటాకాంత సంధానితాలీల! లీలాలసచ్చారిణీగీతనీరేజసంచారిణీ రాజరాజాగ్రణీ. 24

మ. అనుచుం బెక్కువిధంబులం బొగడి సాష్టాంగంబుగా మ్రొక్కి ధ
న్యునిఁగాఁ దన్నుఁ దలంచి కొంచు జనమన్యుం డౌచు నుజ్జేని క

ల్లన నేతెంచి మహితలేంద్రు నధికాహ్లాదంబుతోఁ గానుక
ల్గొని దర్శించిన నావణిక్ప్రవరు సద్గోష్ఠిం బ్రియం బందుచున్. 25

ఆ. వైశ్యచంద్ర నీవు ద్వారకానాయకు
చరణసేవ కేగి తెరువు నందుఁ
గ్రొత్త యేమి గంటి వత్తెఱం గెఱిఁగింపు
మనిన ధనదుఁ డిట్టు లనియెఁ బతికి. 26

క. ద్వారవతి కేగు తెరువునఁ
బారావారంబులో నుపద్వీపమునన్
భైరవుగుడిలోపల నతి
భైరవభావార్థమైన పద్యముఁ గంటిన్. 27

వ. అది యెట్టిదనిన. 28

ఆ. ఎవ్వడైన నిచటి కేతెంచి తనతలం
దానె త్రెంచుకొనినఁ దత్క్షణంబ
[4]మొండెములును దలలు రెండు నంటుకొనంగఁ
బతియుఁ బడఁతుకయును బ్రదుకఁగలరు. 29

క. కథ గాదిది ముందట నా
మిథునము మొండెములు దలలు మేదినిఁ బడవే
ప్రథహేతుపులైనవి త
త్కథనంబున నామనంబు తలఁకెడు నిపుడున్. 30

ఉ. నావుడు విక్రమార్కుఁడు మనంబున నుత్సుకుఁడై వణిక్పతీ
నీ వటు రమ్ము పోద మని నిర్మలఖడ్గసహాయుఁ డౌచు నా

త్రోవన యేగి యచ్చటి సరోవరతీర్థము లాడి రక్తపూ
జావృతుఁడైన భైరవుని సద్మము డగ్గఱి సెట్టి మాన్పఁగన్. 31

శా. తద్వారంబున సెట్టినుంచి చని యంతర్వేదిపై భుక్తిము
క్తిద్వారం బగు కాళినాథునకు భక్తిన్ మ్రొక్కి సంతుష్టుఁడై
యుద్వేగస్థితినుండి ధైర్యమతితో నుర్వీశుఁ డచ్చో మను
ష్యద్వంద్వద్విశిరఃకబంధములుఁ బద్యంబు న్నిరీక్షించుచున్. 32

క. తద్యోగవ్యంజక మగు
పద్యార్థం బెఱిఁగి దాని భావంబునకున్
సద్యోనిర్ణయముగ నృపుఁ
డుద్యోగము చేసె సాహసోద్యోతితుఁడై. 33

ఆ. భూపశేఖరుఁడు “పరోపకారార్థ మి
దం శరీర" మనుచుఁ దలఁపుకొలఁది
మృత్యుజిహ్వవోలె మెఱుఁగులీనెడునట్టి
కడిఁదియడిద మెత్త మెడకుఁ బూనె. 34

క. ఆలోన నతని సాహస
మాలోకించుచుఁ బ్రసన్నుఁడై పార్థివ నీ
పాలం గల్గితి నని భూ
పాలునిఖడ్గంబు క్షేత్రపాలుఁడు పట్టెన్. 35

ఉ. అప్పుడు మొండెముల్ దలలు నంటుకొనంగ వధూవరుల్ ప్రియం
బొప్పఁగ లేచి మొక్కిన సముత్సుకమానసుఁ డౌచు భైరవుం
డిప్పటిసాహసంబునకు నే నిదె మెచ్చితి నిష్ట మేర్పడం
జెప్పుము నీకు నిత్తు నిటఁ జేకుఱు నన్న నతండు మ్రొక్కుచున్. 36

ఆ. దేవదేవ వీరి కీవిధంబున శిర
శ్ఛేద[5] కృత్య మేల సిద్ధ మయ్యె

నానతిమ్ము నాకు నని విన్నవించిన
భైరవేశ్వరుండు పలికె నిట్లు. 37

క. రత్నోద్భవుఁ డనఁగా నొక
రత్నవ్యవహారిసుతుఁడు రత్నంబుల కీ
రత్ననిధిలోనఁ దిరుగుచు
యత్నంబున నిచట విడిసె నాప్తులుఁ దానున్. 38

క. తద్వేశ మఱియు నొకఁడు స
రిద్వల్లభసలిల ముత్తరింపఁగ నొకచో
నుద్వాహమునకు నేగుచు
నీద్వీపముఁ జేరె నిజసుహృద్వర్గముతోన్. 39

వ. ఇక్కడ నయ్యిద్దఱు ని ట్లొండోరువుల మహిమలు మెఱయింపుచుఁ గలసి మాటలాడునెడ రత్నోద్భవుండు నీనామం బెద్ది యేదేశంబునుండి యెచటి కేఁగుచున్నాఁడ వనిన నతండు నేఁ జంద్రకేతుం డనువాఁడ మగధదేశంబునుండి రత్నద్వీపంబున కేఁగుచున్నవాఁడ నందొక విశేషంబు గలదు. 40

క. పద్మాకృతి రేఖలు కర
పద్మంబుల నొప్పుచుండఁ బద్మకు నెనయై
పద్మావతి యనుకన్యక
పద్మాసన గలదు జాతి పద్మిని యనఁగన్. 41

క. ప్రస్తుతలావణ్యగుణని
రస్తప్రసవాస్త్రమోహనాకారిణి సం
త్రస్తకురంగేక్షణ తా
లస్తని యది మదనరాజ్యలక్ష్మియుఁ బోలెన్. 42

చ . కలువలుఁ జక్రవాకములుఁ గంజములు న్బిసకాండము ల్మనం
బలరఁగ దీని లోచనకుచాననబాహుసమానలక్ష్మి గా

వలయు నటంచుఁ గోరి యుదవాసమునందుఁ దపంబు సేయుచు
న్నిలుచుటఁగాక యెప్పుడును నీటఁ జలిం బడనేల వానికిన్. 43

ఆ. ఇట్టికన్య నాకు నిచ్చెద రమ్మని
దానితండ్రి తొల్లి తగినవారిఁ
బనిచినాఁడు గానఁ జనియెద ననుడు ర
త్నోద్భవుండుఁ దాను నుత్సహించి. 44

క. ఆతరుణి యెవ్వరికి నౌ
నాతనిబ్రదు కొప్పు ననుచు ననుర క్తి మనో
జాతునిజేతలఁ బడల న
తీతము మును విన్నభంగి దిట్టతనమునన్. 45

క. ఆకన్నియఁ దజ్జనకుఁడు
నా కిచ్చెద నంచు మొన్న నయముం బ్రియముం
గైకొనఁగఁ జెప్పి పుచ్చిన
నాకడ కే నేఁగుచంద మది యెఱుఁగవొకో. 46

వ. అనుడు మత్సరసముత్సేకంబున. 47

క. అతని పలుకులకు నాతం
డతికుపితుండైన వాఁడు నధికక్రోధా
న్వితుఁ డయ్యెను "మూలం వై
రతరోః స్త్రీ" యనినమాట ప్రకటంబయ్యన్. 48

శా. అన్యోన్యం బిటు దూలుచు న్మనమునం దందేఁగుచో[6] నెవ్వనిం
గన్యారత్నము గోర దాతఁడు కులోత్కర్షంబు వాణిజ్యమున్

సన్న్యాసంబును జేఁత పంత మని మాత్సర్యంబుతో నాత్మసౌ
జశ్యం బెల్ల దొఱంగి[7] లేచి చనుచో సంకల్పసంసిద్ధికై .49

క. సద్భావము గైకొని ర
త్నోద్భవుఁ డిఁక దైవబలమ యుచితం బని తా
నద్భుతముగ మ్రొక్కుచు నిట
మద్భవనముఁ జొచ్చె దురభిమానము పేర్మిన్. 50

క . గుడిసొచ్చి నాకు సాఁగిలఁ
బడి మ్రొక్కుచుఁ బలికె నెన్నిభంగులనైనం
బడఁతుక యిది నా కబ్బిన
మిడిదల యొప్పించి నిన్ను మెప్పింతుఁజుమీ. 51

చ. అని యొడఁబాటు చేసి వినయంబున మ్రొక్కుచు నేఁగి చంద్రకే
తునిపని కేతు వుట్టఁ దనదొడ్డతనంబు నటించి రత్నకాం
చనమయ మైన దీవి రభసంబునఁ జేరి కడంకఁ గన్యకా
జనకుని గాంచి చెప్పె నిజసంవరణోద్యమ మప్పు డేర్పడన్. 52

సీ. ఆతఱి నాచంద్రకేతుండు చనుదెంచి
తనరాక చెప్పినఁ దద్గురుండు
నిద్దఱ కర్చన లిచ్చినఁ దాఁబూల
గంధపుష్పాక్షతల్ గైకొనంగఁ
దొడవులకెల్లను దొడవైన కన్నియఁ
దొడమీఁద నిడుకొన్న యెడ నొకండు
తెల్లసంపెంగలు దివ్యంబు లివి యని
సమముగా నిచ్చినఁ జంద్రకేతుఁ

తే. డిదియ మేలని తనతల గదియఁ దుఱిమెఁ
దొలుత దేవయోగ్యములనఁ దోడి యాతఁ
డిష్టదేవత కర్పించి యెలమిఁ బిదప
వీని ముడిచెద నని యొడిలోన దాఁచె. 53

చ. ఇరువురచేష్టలం గని మృగేక్షణ యల్లన లేచి హంససుం
దరగతి లోనికిం జనినఁ దండ్రియు నిద్దఱుపేళ్ళు జాడలుం
జరితములుం దగం దెలిసి సామ్యము గల్గిన వీరిలోన నె
వ్వరి నవుఁగా దనం జను వివాదము బాలికచేతఁ దీఱెడున్. 54

క. ఆతరుణి మెచ్చి కైకొను
నాతఁడె మాయల్లుఁ డనుచు నచటికిఁ జని క
న్యాతిలకముఁ జంకిట నిడి
వాతెఱ ముద్దిడుచు బుజ్జవంబునఁ బలికెన్. 55

గీ. ఒడిఁ బ్రసూనముల్ దాఁచె రత్నోద్భవుండు
తుఱిమికొని యుండెఁ జంద్రకేతుండు దొల్త
నీకొలది యిద్దఱంచను నీకుఁ జూడ
నొప్పుగా రసికుఁ డెవఁడొ చెప్పు మనిన. 56

క. పువ్వులు గొను మని యిచ్చిన
యువ్వేళన తుఱుముకొన్న యతఁ డెవ్వఁడొ వాఁ
డివ్వసుమతి నస్థిరుఁ డగు
నవ్వంబడు నొరులచేత నాకుం జూడన్. 57

వ. అనినఁ దండ్రి విని యితండె జాణ యని నాకు నీతివాక్యంబు దోఁచుచున్న యది యెట్లనిన. 58

క. వనితాభోగము లంచము
ధనము సుభాషితము విరులుఁ దాంబూలముఁ బం

డినపండ్లును సిద్ధాన్నం
బును దడయక కొన్నవాఁడె భువి జాణ యగున్. 59

వ. అనినం బద్మావతి యీనీతివాక్యంబు దప్ప దిప్పటి కుసుమంబులు దివ్యంబులని యిచ్చుటం జేసి తోడియాతండు దేవతార్పణంబు చేసి మఱిముడిచికొనం దలంచె నెయ్యి పాలలో నొలుకు టయ్యె దేవతాపరాయణుం డగుట సకలమంగళహేతువు మానుషబలంబుకంటె దైవబలంబు ప్రబలంబు మఱి యింతియకాదు. 60

క. ఆకుసుమంబులు దేవత
కై కోరికి డాఁచీకొనినయది చూడఁగా
నీకడకు వచ్చునెడ ననుఁ
గైకొనుటకు మ్రొక్కు టొకటి గలుగఁగఁబోలున్. 61

మ. అనినం గూఁతు నలంకరించి మది నెయ్యం బెచ్చటం బుట్టె నా
తనిపై వైవుము వాఁడె భర్త యని నూత్నంబైన పుష్పస్రజం
బెనయం జేతికి నిచ్చి బంధులు నిజాభీష్టార్థముల్[8] వచ్చుక్రం
దున వాద్యంబులు మ్రోయఁగా నెలమితోఁ దోడ్కొంచు నేతెంచినన్. 62

క. రత్నద్వీపంబునఁ గల
రత్నంబులలోని దివ్యరత్నము[9] కన్యా
రత్నము దా వనమాలిక
రత్నోద్భవుమీఁద వైచె రాగం బడరన్. 63

వ. అవ్వేళం బద్మినీరాగకరణంబగు గగనరత్నంబుపగిదిం బద్మావతీకృతానురాగుం డగురత్నోద్భవు శుభోదయంబునం జంద్రకేతుండు ప్రభాతచంద్రుక్రియం బ్రభాహీనుండై లోను గుందుచు జలధిఁబడందలంచిన నది తెలిసి యాసెట్టి తనతమ్ముని కూతుఁ గుముద్వతి నిచ్చెదనని యతనిరాక సఫలంబుగా ననునయించి తెచ్చి. 64

ఉ. సంపద సొంపుమీఱఁగఁ బ్రసన్నమనస్కుఁడు సెట్టి వేడ్కతోఁ
బెంపడరంగ నల్లునకుఁ బెండిలిచేసి తదీయసత్క్రియా
లంపటుఁడై సువర్ణదశలక్షధనం బరణంబు నిచ్చి యా
దంపతు లుల్లసిల్లఁగఁ బదంపడి వారల నంపె నింపునన్. 65

క. రత్నోద్భవుండు నిట కతి
యత్నంబున వచ్చి వంచితాప్తజనుండై
నూత్నవివాహశ్రీ యగు
పత్నిం జేపట్టి నాదుభవనము సొచ్చెన్. 66

వ. చొచ్చి ప్రణమిల్లి. 67

శా. దేవా మ్రొక్కిదె వచ్చె నంచు శితశస్త్రిం గంఠనాళంబు స
ద్భావాధిక్యము దోఁపఁ ద్రెంచుకొనినం బద్మావతీకన్య ప్రే
మావేశంబును భక్తియు న్నిగుడఁగా నాభంగి నిచ్చో నిజ
గ్రీవాచ్ఛేదము చేసి వ్రాలెఁ బతిపైఁ గీర్ణోచ్చలద్రక్తయై. 68

చ. అటఁ దమమూకలోన హితు లాతనిఁ గానక జాడ వట్టి యి
చ్చటి కరుదెంచి తున్కలయి చచ్చినవీరలఁ జూచి మద్గృహం
బిటనట నాదటం బోరలి యేడ్చుచు నెత్తులు మొత్తుకొంచు ను
త్కట మగుదుఃఖవహ్నిఁ గడుఁ గ్రాఁగిరి వేఁగిరి దోఁగి రశ్రులన్. 69

సీ. తదనంతరంబ యిద్దఱ నెత్తికొని వెలి
కరుగఁ జూచిన నేను గరుణ కల్మి
మీలోన నొక్కఁడు మిడిదల యిచ్చిన
దంపతుల్ బ్రదుకుట తథ్య మనిన

నామాట కుల్కి మిన్నక కాలభైరవుం
డీలోన నిద్దఱ నిట్లు ద్రుంచె
నింక నెందఱఁ జంప నెంచినాఁడో యని
విడిచి కన్కని గుడివెడలి పాఱి
తే. రేను నామాట పర్యంబుగా నొనర్చి
వ్రాసి నిలిపితి నంత నెవ్వారలైన
మ్రొక్క జనుదెంచి కాంచి విదిక్కుపడుచు
వెడలి మఱి చూడ రిట వెరవేఁకిపట్టి. 70

క. వీరాగ్రణి యగు నీచే
వీరిద్దఱు బ్రదికి రింక వేఁడుము దగ నీ
కోరిన కోరిక లిచ్చెద
భూరమణీరమణ సర్వభూతదయాత్మా. 71

వ. అనుడు నతండు మఱియుం ప్రణమిల్లి. 72

క. సకలార్థసిద్ధికైదే
వ! "కలౌ మైలారు భైరవా” యనుపలుకుల్
ప్రకటంబుగ రాజ్యముతో
వికలత్వము లేనిబ్రదుకు వీరల కిమ్మా. 74

మ. అనుచు న్వేఁడిన వానిసాహసము నత్యౌదార్యమున్ భైరవుం
డనురక్తిం గొనియాడి వారలకుఁ బ్రాజ్యం బైనరాజ్యంబుఁ జం
దనశైలస్థలిఁ గల్గనిచ్చి తనలోఁ దా సన్నిధిం బొందినన్
ధనదుం గూడి కడంకతో మగిడె నాధాత్రీశుఁ డుజ్జేనికిన్. 74

క. ఆభూపతి గుణములు నీ
కేభంగులనైనఁ గలుగ విఁక మగుడుమనం

బ్రాభవముఁ గలిమ జాఱఁగ
నాభోజుఁడు తిరిగి చనియె నంతఃపురికిన్. 75

వ. అంత గొంతకాలంబు చనఁగ. 76

ఎనిమిదవబొమ్మ కథ



క. కాశాబ్జమల్లికాకలి
కాశారదనీరదేందుకైరవహంసా
కాశాపగాంబుహిమసం
కాశాంగవికాసితప్రకాశు గిరీశున్. 77

చ. తలఁపుచు మ్రొక్కి భోజవసుధావరుఁ డిష్టులు దృష్టశాస్త్రవే
త్తలు శకునజ్ఞులు స్సముచితం బగులగ్నము చెప్పఁగా సము
జ్జ్వలకరవాలహస్తుఁ డయి వచ్చి మహాసన మెక్కఁబూనఁగా
నిలునిలు మంచుఁ బల్కెఁ గడునేర్పున నచ్చటి బొమ్మ యిమ్ములన్. 78

క. మోహమున భద్రపీఠా
రోహణ మగు ననుట గుణవిరోధము గాదే
సాహసభూషణుసరిగా
సాహసగుణగణము లేక చనునే యెక్కన్. 79

క. ఇవ్విధమునఁ బలికిన నృపుఁ
డవ్వీరుని బలిమి తెంపు లవి యెట్టి వన
న్నవ్వుచు నప్పాంచాలిక
నివ్వెఱఁగందంగఁ జెప్పె నిర్వచనముగన్. 80

శా. ఆకర్ణింపుము భోజభూవర నిలింపాధీశసంపాదితా
స్తోకస్నేహవివేకనాకయువతీస్తోత్రైకపాత్రుండు ధా

త్రీకాంతాపరిభోగ్యభాగ్యనిధి కీర్తిన్ విక్రమాదిత్యుఁ డి
ట్లేకచ్ఛత్రముగాఁ దనర్చుచు జగం బేలెం గృపాలోలుఁడై. 62

క. ద్వాత్రింశద్భాగములను
ద్వాత్రింశద్ద్వారమైన వజ్రాసనమున్
ద్వాత్రింశదాయుధములున్
ద్వాత్రింశల్లక్షణములుఁ దగు నాతనికిన్. 82

సీ. దుర్గరక్షణమును దుష్టశిక్షణమును
శిష్టపాలనమును జేయవలయు
వర్ణధర్మములును వనములు గుళ్ళును
జలజాకరంబులు నిలుపవలయుఁ
గృషియు వాణిజ్యంబు గృహజీవధనములు
నాయవ్యయంబులు నరయవలయు
ననదల నర్థుల నార్తులఁ బాత్రులఁ
బూజ్యుల విప్రులఁ బ్రోవవలయు
తే. బలముఁ దెంపుఁ గలిగి యలుకయుఁ గరుణయుఁ
జలము నిలుకడయును జరుపవలయు
నయముఁ బ్రియము వైరిజయముఁ గార్యముఁ గొల్వు
నితరరాజగతుల నెఱుఁగవలయు. 83

క. అన నున్ననీతివిధమున
ననువుగ భూపతులవలన నయ్యైయుపవ
రనముల జరిగెడు నృపవ
ర్తనములుఁ దెలియుచు నతండు ధర యేలంగన్. 84

క. చారులు చనుదెంచినఁ బతి
వారలచే నన్యదేశవార్తలు వినుచు

న్మీరు చరించిన యాకా
శ్మీరంబున నేమి గలవు చిత్రము లనినన్. 85

సీ. వసుధేశ యచ్చట వైశ్యుండు ధనపతి
యోజనాయతమైన యొక్కచెఱువు
గట్టించి లోతుగాఁ గావింప నందులోఁ
బుడిసెఁడునీళ్ళును బొడమకున్న
వగచి యింటికిఁ జని మగిడి నిచ్చలు నట్ల
వచ్చి యాకట్టపై వెచ్చనూర్చు
చుండగా ముప్పదిరెండులక్షణములు
గలవానికంఠరక్తంబు లిమ్ము
ఆ. చెఱువు నిండు ననుచుఁ జెప్పె నంబరవాణి
దాని కాతఁ డట్టివానిఁ గూర్పఁ
బూని యేడుకోటు లైన బంగారునఁ
బ్రతిమ లేడు నిలిపెఁ, బద్య మొకటి. 86

ఆ. “అవనిఁ ద్రిదశలక్షణాన్వితుఁ డగుధీరుఁ
డిచటఁ గంఠరక్త మిచ్చెనేని
సప్తకోటిమూల్యతప్తకాంచనముల
ప్రతిమ లేడు నతని పాలు సుమ్ము.” 87

మ. అని యిట్టున్నది విస్మయం బిది నృపాలాగ్రేసరా నావుడు
న్విని యుత్సాహముతోడఁ దత్సహితుఁడై విశ్వంభరాధీశుఁడుం
జని యచ్చోటఁ దటాకమధ్యమున గర్జన్మర్దళధ్వానసం
జనితశ్రీరమణీప్రసాదవిలసత్సౌధంబు వీక్షించుచున్[10]. 88

ఆ. అష్టదిక్కులందు నష్టభైరవులను
దాండవమున నొప్పుతాండవేశు
నెదుర శ్రీవరాహు నేఁబదిచేతుల
రాతికంబముతుదిఁ బ్రీతిఁ గనియె. 89

క. ఉర్వీకుఁడు సేతువునఁ జ
తుర్వింశతిమూర్తు లెదురఁ దోఁపఁగఁ ద్రిజగ
న్నిర్వాహకుఁ డన నిలిచిన
సర్వేశ్వరుఁ జూచి మొక్కి సద్భావమునన్. 90

ఉ. అచ్చటిపద్యముం బ్రతిమ లన్నిటి నేర్పడఁ జూచి యాత్మలో
నచ్చెరువంది భూమివరుఁ డచ్చెఱు వప్పుడె నిండఁ జేయఁగా
నిచ్చఁ దలంచి వేళకొఱ కించుకసేపు సహించి యుండఁగా
నిచ్చయెఱుంగుసంగతి దినేశుఁడు డగ్గఱెఁ బశ్చిమాంబుధిన్. 91

ఉ. అంబరరత్నబింబ మపరాంబుధిఁ జేరఁగ నెండ శైలశృం
గంబుల ధాతురాగముల కైవడిఁ గెంపు వహించెఁ జక్రవా
కంబులు తల్లడిల్లె విహగంబులు గూండ్లకు నేఁగఁజొచ్చెఁ ఓ
ద్మంబులు వాడఁబాఱెఁ గుముదంబులు సొంపున కెక్కె నిక్కుచున్. 92

ఆ. పండుటెండఁ దరులు పల్లవద్యుతులతో
మెండుకొనఁగ వరుణుమేడమీఁద
నుండి వెలుఁగు పసిఁడికుండ చందంబున
నెండఱేఁడు గ్రుంకుగొండ నొప్పె. 93

సీ. అపరాబ్ధిఁ గ్రీడించు నంబరస్త్రీ యొద్ద
నిద్దమౌ కుంకుమముద్ద యనఁగ
నచట సంధ్యాదేవి కర్ఘ్యంబు లెత్తు ది
క్సతిచేతిమణిమయకలశ మనఁగ

వరుణుని ముందఱఁ బరిచారకులు నిల్వఁ
బట్టిన రత్నదర్పణ మనంగ
నస్తాచలం బను హస్తిమస్తకమునఁ
దిరమైన రక్తచామర మనంగ
తే. నిఖిలదిగ్వలయాంతమాణిక్య మనఁగ
నిట్ట ప్రాఁకిన పవడంపుఁజుట్ట యనఁగ
గట్టుతుద నున్న జేగుఱుగ ల్లనంగ
నరుణమండల మొప్పె దినాంతమందు. 94

క. అయ్యెడ నర్కునిమండల
మయ్యచలము డిగ్గి పశ్చిమాంబుధి సొచ్చెం
వయ్యందిఁగాఁచి కమ్మరి
చయ్యనఁ బదనిచ్చు నుక్కుచక్రము మాడ్కిన్. 95

తే. ఏ విధమున మలక లైన దైవగతిని
సొమ్ము వానిన మఱి చేరు సొమ్ము నాఁగఁ
ద్రిభువనము లెల్లఁ గలయంగఁ దిరిగి గగన
రత్న మప్పుడు రత్నాకరమునఁ గలసె. 96

క. నెఱసంజఁ గ్రుంకు గుబ్బలి
చఱి జఱజఱ నినుఁడు డిగ్గజాఱుచుఁ జనునా
తఱి నఱిముఱి నెగసిన [11]జే
గుఱుధూళి యనంగఁ గెంపు గుఱికొని పర్వెన్. 97

క. మిన్నందెడుతేజంబున
నెన్నంగల యినుఁడు దీఱె నిదె యెడ రనుచు

న్విన్నంతనె పఱతెంచెడు
మన్నీలన నపుడ యిరులుమన్నీ లెసఁగెన్. 98

[12]*క. లోకమున విగతదృష్టి వి
వేకంబునఁ జక్రవాకవిరహానలధూ
మాకారంబున జనములు
చీకాకుపడంగ దెసల జీకటి గప్పెన్. 99

గీ. అర్కుఁ డేఁగిన గాలాభ్రలీలఁ
దమము గప్పిన యెడ వియత్పథము దోఁచె
వరుస దప్పక దావపావకము సోఁకి
చనినపిమ్మట ఘనతృణస్థలము కరణి. 10

క. నేలయు నింగియు నిండగ
వాలుచు దళమైన చీఁకువాలేచినఁ ద
త్కాలంబున జన మొప్పెను
నీలసలిలమునను గడవ నించినమాడ్కిన్. 101

సీ. యమునాజలానీల మౌ చిమ్మచీకటి
పెల్లున జగమెల్ల నల్లనైన
దిగినఁ దప్పెద మని యగజతోడను శూలి
తనవెండికొండపైఁ దలఁకుచుండ
నీదెస మఱి గానరా దని హరి లక్ష్మి
దోయిగా నమృతాబ్దిఁ బాయకుండ
దీనఁ బాసినఁ గానలే నని వాణి తో
డ్పడ బ్రహ్మ వెలిదమ్మి వెడలకుండఁ

తే. దెలుపు నలుపును ననియెడి తెలివి తలఁగి
పల్లమును మిఱ్ఱు నెఱుఁగక యెల్లజనులుఁ
బుట్టుచీఁకులగతి నంటి పోక దక్కి
యుండి రుదకంబులో మునిఁగున్నపగిది. 102

క. రాజిల్లెడు తారాగ్రహ
రాజిం గ్రిక్కిఱిసి యంబరము గడు నొప్పెన్
రాజు చనుదెంచు నని యు
ద్భ్రాజితమైయున్న విరులపందిరిభంగిన్. 103

శా. దిగ్భామామృగనాభిలేపనము భాతి న్విశ్రుతం బౌ తమః
ప్రాగ్భారంబు నిశావధూచికురభారస్ఫూర్తి వర్తిల్లఁగాఁ
బ్రాగ్భాగంబునఁ దచ్చిఖావినిహతప్రవ్య క్తరక్తోత్పల
స్రగ్భావంబునఁ గెంపు దోఁచె రజనీరాజద్యుతివ్యాజమై. 104

క. తరుణారుణకిరణోత్కర
పరిహృత ఘనతిమీర మైనప్రాగ్భాగమునం
బురుహూతునెదురనెత్తిన
కరదీపికకరణి శీతకరుఁ డుదయించెన్. 105

క. తనయుదయమె మదిఁ గోరెడు
నను విడిచె నినుండు కల్ల నాయెడ లేకుం
టనెఱుఁగఁ డని పూర్వాశాం
గన జగమున మడ్డు వట్టు గతి శశి మెఱసెన్. 106

సీ. ఉదయాచలము చఱి నున్న బంధూకంబు
కొమ్మను బొడమిన కుసుమ మనఁగఁ
దత్ప్రదేశంబునఁ చలకొని పొడ తెంచు
నలినీలతాపక్వఫల మనంగ

విరహిమృగంబుల వేఁటాడుమదనుండు
తివిరి పెట్టించిన దివియ యనఁగ
నమరంగ నింద్రాణి యాఖండలుని నివా
ళించెడు పసిఁడిపళ్ళెర మనంగ
తే. దోడుతోడన తనకెంపు వీడుచుండఁ
దిమిరపటలంబు కొంత మీఁదికిఁ జలింపఁ
దెలివిపడ లేతవెన్నెల మొలకలెత్తి
నిండుకొనియుండె నమృతాంశుమండలంబు. 107

ఉ. కోకములు న్సరోజములుఁ గుందుచుఁ గందుచునుండఁ గైరవా
నీకములుం జకోరములు నిక్కుచు సొక్కఁగ మానినీసము
త్సేకము నంధకారమును దిగ్గఁగ దిగ్గన లోకము న్నిజా
లోకము నుల్లసిల్లఁ గవిలోకము మెచ్చులు పిచ్చలింపఁగన్. 108

క. నడుమం గృష్ణుఁడు గలపా
ల్కడలిన జనియించి తండ్రికైవడి మూర్తిన్
బెడఁ గడరెడువాఁ డనఁగా
నుడుపతి తెలుపై కళంకయుతుఁడై మెఱసెన్. 109

క. తిమిరసముదాయమున న
ర్ధము నలుపై పూర్ణతుహినధామద్యుతి న
ర్ధము తెలుపై యాకాశము
యమునాగంగాంబుసంగమాకృతిఁ దాల్చెన్. 110

తే. మిత్రుఁ డేగిన యెడరున మేర దప్పి
వాలి చేకొన్న యిరులమన్నీలు పఱవ
యశముగతిఁ గ్రొత్తవెన్నెల దిశలఁ బర్వ
రాజు చనుదెంచె గగనదుర్గమున కంత.** 111

క. ఇటునటుఁ జనకుండగఁ జెం
గటఁ జంద్రుం డాఁక నిడిన గతిఁ దప్పినచీఁ
కటి చెలికాండ్రన నంబుజ
పుటములలోఁ జంచరీకములు తగులొందెన్. 112

క. భాగీరథియుదకంబు న
భోగంగయు వేఱుసేయఁ బోల దనుచు న
వ్వాగీశుఁడు గూర్చెనొ యన
వేగన భూగగనములను వెన్నెల నిండెన్. 113

సీ. తొలితొలి లేఁతవెన్నెల నారమ్రింగుచుఁ
దనియఁ బిల్లలనోళ్ళఁ జొనిపి చొనిపి
ముదురువెన్నెలఁ బట్టి చదియంగ నమలుచు
మెచ్చుచుఁ బిల్లల కిచ్చి యిచ్చి
పండువెన్నెల దొడఁ బలుమాఱు నొక్కుచు
గమిగూడి యందంద కమిచి కమిచి
వెలినార సాఁగెడు వెన్నెలకాఁడలఁ
ద్రొక్కి ముక్కునఁ ద్రెంచి బొక్కి బొక్కి,
తే. చొక్కి తత్ప్రవాహములోన సోలిసోలి
యడ్డమీఁదుచు గడ్డపై నాఁగియాఁగి
యెనసి బలఁగముతోఁగూడ[13] మునిఁగిమునిగి
కోరికలు మూరిబుచ్చెఁ[14] జకోరచయము. 114

చ. కలువలవిందు జక్కవలకందువ వెన్నెలతీవదుంప ము[15]
చ్చులమెడకోణ మంగజునిచూపరి చూపులయింపు జారకాం

తలవెఱగొంగ రాత్రికులదైవము చల్లనిరాజు పంకజం
బుల ముకుగొయ్య[16] యచ్యుతుని ముద్దుమఱంది వెలింగె నయ్యెడన్. 115

క. కొడుకుసిరిఁ జూడ నుబ్బునఁ
గడఁగి వడి న్వెడలి వచ్చి కడు మీఱినపా
ల్కడలి యన నిండువెన్నెల
గడలుకొనుచు నెల్లకడలఁ గడు బెడఁ గడరెన్. 116

సీ. దిక్కులు గలయంగఁ బిక్కటిల్లిన పండు
వెన్నెల యాపాలవెల్లి యనఁగ
ముత్తియంబులభాతి మొత్తమౌ తారకా
గణములు లహరికాగణము లనఁగ
నుజ్జ్వలాకారమౌ నుడురాజబింబంబు
సెజ్జయై మెలఁగిన శేషుఁ డనఁగ
నందమై మృగనాభిబిందుసుందర మైన
యందులకందు ముకుందుఁ డనఁగ
ఆ. నట్టివేళఁ గువలయానందకందమై
పుణ్యములకుఁ గలితభోగములకు[17]
గారణంబునాఁగఁ గందర్పజనని యై
రజనిలక్ష్మి మిగుల భజనకెక్కె. 117

ఉ. ఆతటిఁ బార్థివుండు సమయం బిదె నిర్జన మంచు నిల్చి త
త్సేతువుమీఁద రక్తబలిదేవత[18] నిష్ఠఁ దలంచి ధర్మవి
ఖ్యాతముగాఁ బరోపకృతికై తల యిచ్చెద నంచు నుబ్బుచుం
జేతికృపాణమల్ల మేడఁ జేర్చె మెఱుంగులు తొంగలింపఁగన్[19]. 119

ఉ. అప్పుడు రక్తభోజిని తధస్త్రము వట్టి ప్రసన్నచిత్తయై
కప్పు తనూలత న్మెఱయఁగా నృపుముందట నిల్చి వేఁడు మే
నిప్పుడు మెచ్చితి న్వరము లిచ్చెద నావుడు మ్రొక్కి యాత్మలోఁ
దప్పనిభ క్తితోడ వసుధాపతి పల్కె నుదారవృత్తియై. 119

క. ఇచ్చటఁ గోరినకోరిక
లిచ్చెదనని యానతిచ్చి తే నడిగెద నో
కచ్చెరువుగ నీతలఁపున
నిచ్చెఱు విదె నిండఁజేయు మిప్పుడు తల్లీ. 120

ఆ. అనుడు దేవిపల్కె నవనీశ నీధర్మ
బుద్ధిఁ జెఱువు దానె పూర్ణమయ్యె
ధార్మికులకు సిద్ధితడయునే కప్పలఁ
గాచి యెలుక పాము గతికిఁ బుచ్చె. 121

శంఖపాలుని కథ



క. అనవుడు జనవిభుఁ డది యె
ట్లని యడిగిన దేవి చెప్పె నాకథ యిదిగో
వినుము హిమాద్రిసమీపం
బునఁ గడు లోఁతైన మడుఁగు పొలుపై యుండున్. 122

క. ముదమున నందుల కప్పలు
వెదవెట్టిరె వెట్టికోరు వెట్టిరె యెదురే
కదకడ దక్కుము పొదపొద
యదె వరవర వాఁగురూఁగు రనుచుం జెలఁగున్. 123

క. అట కంతటను ఫణత్రయ
పటుతరుఁడై యొక్కశంఖపాలుం డను పే

రిటి నాగేంద్రుఁడు చని దా
పటికప్పల[20] మ్రింగఁ జొచ్చి పద్యము చదివెన్. 124

క. “గుండియ చెదరక భువి నె
వ్వం డైన నిజాంగ మిచ్చువాఁడు గలిగినన్
గండూపదీయుతం బగు
మండూకౌఘంబుతిండి మానుదుఁ జుండీ." 125

క. అని ముమ్మాటు ముఖత్రయ
మునఁ జదువుచు మడుఁగుచుట్టు ముమ్మాఱు వివ
ర్తనచేసి మూఁటి మ్రింగును
ననుదినమును వ్రతముపోలె నచటం దిరుగున్. 126

శా. ఈమర్యాదల నున్నదాని చరితం బేపారఁగాఁ జూచి వి
శ్రామార్థంబుగ నొక్కకాకి చని వృక్షశ్రేణిపై బాంధవ
స్తోమంబు న్వినిపించి నిల్వక మహాచోద్యంబుగా నుత్తమ
ప్రేమాఢ్యం బగు మూషకంబునకుఁ జెప్పెం దత్క్రమం బేర్పడన్. 127

క. ఆమూషక మిది చూడఁగ
నీమహిఁ గడుఁ జిత్ర మనుచు నిచ్చఁ గుతుక ము
ద్దామముగఁ గాకితోడుగ
నామడువున కేఁగి యచటి యవనిజ మెక్కెన్. 128

క. ఆతరువుమీఁద నుండుచు
నత్తఱి నుదకంబులోన నహిభీతిఁ గడుం
గుత్తుక తుకతుక యనఁగాఁ
దత్తఱపడుచున్న భేకతతిఁ బొడఁగాంచెన్. 129

ఆ. బ్రహ్మ “కప్పకాటు బాఁపనపోటును"
లేకయుండఁ జేసెఁ గాక నేడు
గలిగెనేని వైరిఁగని యిన్ని దునుమవె
దైవలిఖిత మేల తప్పు ననియె. 180

క. ఆలోనను వెడలి మహా
వ్యాళము చదువుచును మడుచు వలగొనఁగాఁ ద
త్కాలంబున మూషక మిటు
చాలం గృపువుట్టి వాయసంబున కనియెన్. 131

చ. అలిగి వధించినప్పు డొరు లడ్డము వచ్చిరయేని నాఁడుఁగ
ప్పల మగకప్పల న్విడువఁ బంతముచేసె వడిన్ భుజంగ మీ
మ్ముల మన మడ్డమై నిలిచి ముక్తుల మౌదము రమ్ము నావుడుం
గలఁగి ఖగంబు బుద్ధి యిదిగాఁ దనుచుం దలయూఁచి యిట్లనున్. 132

ఉ. అన్నలొ తమ్ములో చెలులొ యాత్మజులో చనువారు వీరికై
మిన్నక చావనేల యిది మేలె భువిన్ బలిభోజి నయ్యు నా
యున్నెడ విశ్వసింప నొరునొద్దకుఁ జేరఁ బ్రమాద మైనఁ గ
న్సన్న నెఱింగి యొండెడకుఁ జాఁగుదుఁ బ్రాణముతీపి చూచితే. 133

క. వలవనిపని యిది ఫల మని
చలమునఁ దాఁ జచ్చి పడయుసంపద లేలా
యిలఁ బ్రాణము గలిగిన [21]బి
బ్బిలియా కేఱి తినవచ్చుఁ బెక్కుదినంబుల్. 134

ఆ. మనుజుఁ డ్కొఁ డేటమునిఁగెడు దిగి నిల్వఁ
బట్టు మనిన భంగి నిట్టు నీవు[22]

కొంత దెలియలేవు క్రొవ్విన గొఱియ దాఁ
జింతకట్టె మేయఁ జేరుటయ్యె. 135

ఆ. ప్రాణమైన సుతులుఁ బత్నులుఁ జావఁగాఁ
జావలేరు వీనిచావు కింత
తన్నుమాలినట్టి ధర్మంబు గలుగునే
చెడుగుబుద్ధు లింక విడువు నీవు. 136

క. అనవుడు నది యిట్లనియెను
విను మొకప్రాణమునఁ బెక్కువిధముల ప్రాణుల్
మనఁగం జేసినపుణ్యం
బెనయున్ భువిలోనఁ గ్రతువు లెన్నియుఁ గూడన్. 137

క. ధనధాన్యములును సుతులును
వనితలుఁ దనతోడఁ గూడి వచ్చుట గలదే
జనహిత మగునడవడినిఁ జ
నిన ధర్మము దనకుఁ దోడునీడను బోలున్. 138

క. ధనము గలిగి పెట్టక యీ
జననంబున నెలుక నైతి జనులకు నిడువ
ర్తన సమకూరక యూరక
చనియెను దినము లొగి ధర్మసంచయ మేదీ. 139

క. పాపంబు పుట్టునెడఁ దా
నోపియు నుడుపంగలేక యూరక యున్నం
గాపురుషుం డాతం డగు
నాపాపము వానిఁ బొందు నండ్రు వివేకుల్. 140

క. క్షోణి “ననిత్యాని శరీ
రాణి” యనుచుఁ బెద్ద లెఱుక ప్రచురింపంగాఁ

బ్రాణిపరిపాలనమునకుఁ
బ్రాణము వంచింపనేల పరహితమతికిన్. 141

క. తనతనయులుఁ దనసతులును
దనవారలుఁ దనగృహంబుఁ దనసొమ్మనుచుం
దనుపున దనరెడికప్పలఁ
దన దగు తను విచ్చి కాచి తనిపెదఁ బ్రీతిన్. 142

క. ఈగతి “ధర్మస్య త్వరి
తాగతి" యనుపలుకుకొలఁది దడయక నే నా
నాగేంద్రుని కెదిరించెద
నాగాంతకుఁ జేరుఖచరనందను మాడ్కిన్. 143

క. అని పలికి శంఖపాలుని
పని విఘ్నముఁ బొందఁజేయఁ బనిపూని గజా
ననుఁడు దనవాజిఁ బుత్తెం
చెనొ యనఁగా మూషకంబు క్షితిపై నుఱికెన్. 144

సీ. ధవళాంశు మ్రింగి సుధాశక్తిఁ దెల్లని
దేహంబు వడసిన రాహు వనఁగ
భువనత్రయం బొకబుట్టఁ[23] బెట్టఁగఁ జాలు
వేఁడిమిపడగలు మూఁడు మెఱయ
భీషణం బై యున్న రోషాగ్నిఁ బొడమెడు
శిఖలకైవడిఁ గ్రాలు జిహ్వ లడర
దనలోని కీడు ముందటఁ దెల్పుమాడ్కి ని
శ్వాసంబుతో విషజ్వాల లొలుక

తే. [24]మ్రోయు జేగంటచాడ్పున మ్రోగి మ్రోగి,
చదివి తిరిగెడునాగేంద్రునెదురనుండి
నీకు నాహార మిప్పుడు నేన యైతి
నిలిచి కైకొను మనుచు నియ్యెలుక పలికె. 145

క. ఆపలుకున భుజగము తన
రూపంబు పరిత్యజించి రుచిరాకృతి వి
ద్యాపారంగతమతి యన
దీపించెడు విప్రుఁడై నుతించుచుఁ బలికెన్. 146

క. మూషకకులతిలక దయా
భూషణ నీనుఁ బోలునట్టి పుణ్యులు గలరే
భాషణమాత్రంబున ని
ర్దోషుఁడ నై బ్రదుకఁ గంటిఁ దొల్లిటిభంగిన్. 147

సీ. తాపసుం డగుదీర్ఘతముఁ గొల్చి సాంగయు
క్తంబుగా వేదత్రయంబు చదివి
యతనిచే దేవకార్యమునకు నామం
త్రితుండనై యుండఁగా దొర యొకండు
తనయింటి పితృకార్యమునకు రమ్మనవుడుఁ
దగ్గృహంబునఁ బదార్థములు పెక్కు
గలుగ నూహించి యక్కడి కేఁగి కుడిచిన
విని ఋషి చనుదెంచి నను నదల్చి
ఆ. మునుపు మాకు నీయకొని యట చని కూడు
కుడిచి తీవు కుడువఁ గూడ దనక

శ్రుతి యుతుండు నయ్యు శ్రుతిహీనజీవమై
పెనఁచి మ్రింగుచుండు భేకములను. 148

క. అని శపియించిన నే నా
తనికిన్ ధరఁ జాఁగి మ్రొక్కి తప్పు గలదు శి
ష్యునిఁ గరుణింపుము మునుచది
వినచదువుల దురిత మెడలి విరతియుఁ గలుగన్. 149

తే. అనుడు నామాట దప్పదు వినుము నీకు
వేదము ల్మూఁడు పడగలై వెలయుఁగాన
శంఖపాలుండవై జలాశయముఁజేరి
మూఁటిఁదినుమని పద్యంబు మొదలఁజెప్పె. 150

క. “గుండియ చెదరక భువి నె
వ్వండైన నిజాంగ మిచ్చువాఁడు గలిగినన్
గండూపదీయుతం బగు
మండూకౌఘంబుతిండి మానుదుఁ జుండీ." 151

క. ఈకరణిం జరుపుచు[25] నీ
వాకడ ముమ్మాటు దిరుగునవసరమునఁ ద
ద్భేకములఁ గావ ధైర్యము
గైకొని యొకఁ డడ్డమైన గతిఁ గను మనియెన్. 152

క. కావున నిట నురగాకృతి
నీవిధమునఁ దిరిగి చదివి యిన్నిటిఁ గలయం
గా వధియించితిఁ గడపట
నీవెరవున దురిత మెల్ల నీఁగితి ననఘా. 153

క. దీర్ఘతముని శాపం బను
నిర్ఘాతము సోఁకి వచ్చి నీవచనసుధా
నిర్ఘర్షణమున మంటిని
దుర్ఘట మిది యనఁగ వింటిఁదుది గతిఁ గంటిన్. 154

మ. అని చెప్ప న్విని మూషకంబు గడుఁ జోద్యం బంది యవ్విప్రుఁ దో
డ్కొని తా నుండు బిలంబుఁ జేరి యిదె కైకొమ్మంచు నం దున్న కాం
చన మెల్లం గొనివచ్చి యిచ్చి యుచితస్నానప్రదానస్పృహం
జనియెం గాశికి ధర్మరాశికిని మోక్షశ్రీప్రయోరాశికిన్. 155

మ. ధరణీదేవకుమారుఁడు న్మగిడి యుత్సాహంబుతోఁ దత్సరో
వరతీరంబున మూషకేశ్వరము నా వర్తిల్లు తీర్థంబు నీ
శ్వరగేహంబును గల్గఁ జేసి చని యాచార్యుం దగం గాంచి సు
స్థిరమౌ భక్తిఁ జతుర్థవేదముఁ బఠించెన్ ధర్మనిర్మాతయై[26]. 156

సీ. ఈవిధంబున నొక్క యెలుక ధర్మము సేయఁ
జింతించునంతలో సిద్ధి యయ్యె
సర్వలక్షణముల సంపూర్ణుఁ డవు నీవు
నీతలంపున నీది నిండు టరుదె
యదిగాన నొండెద్ది యైన న న్నడుగుము
నావుడు వసుమతీనాయకుండు
చెఱువు గట్టించిన సెట్టిధర్మం బెల్ల
సుడివడకుండఁగ నడపు తల్లి!
తే. యే నొనర్చునట్టి యీచేఁత మానవు
లెఁఱుగకుండఁ జేయు మిదియ చాలు
ననుచు మ్రొక్కి వీడుకొని గూఢచారియై
యిచ్చమెచ్చి మగిడి వచ్చెఁ బురికి. 157

క. ఓరాజ యతని సరిగా
నీరీతిగుణంబు లేక యెక్కకు మనుడున్
ధారానాయకుఁ డతి వి
స్మేరకుఁడై మగిడె మోము సిగ్గున వ్రాలన్. 158

తొమ్మిదవబొమ్మకథ

వ. అంత నొక్కనాఁడు నవమద్వారంబునం బ్రవేశింపఁ గడంగి. 159

క. నలువకు నెల వగుతమ్మియు
వలిపం బగుపచ్చపట్టు వలయపుటలుగున్
వెలిగుల్లయు వనమాలయుఁ
గలిమియు మానికము మేనఁ గలిగిన వేల్పున్. 160

మ. భక్తిఁ దలంచి భోజుఁడు శుభం బగులగ్నమునందు మౌళిపై
మౌక్తికశేష లొప్ప హితమాగధవందివనీపకద్విజా
ముక్తజయానులాపములు మున్ను గడంగెడు నంతనంత నా
సక్తసువర్ణపుత్రిక వెసం బలికెన్ నృపు నడ్డపెట్టుచున్. 161

ఆ. వినుము భోజరాజ విక్రమార్కుని బోలి
సత్త్వధైర్యములను జాలకునికి
దివ్యపీఠ మెక్కఁ దివురుట పిచ్చుక
కుంటు శైల మెక్కఁ గోరుటయ్యె. 162

మ. అనుడు న్నిల్చి యతండు వాని బలధైర్యంబుల్ దగం జెప్పుమా
యనం బాంచాలిక వల్కె నాతఁడు రణవ్యాపారపారంగతుం
డినతేజోంశభవుండు సాహసఘనుం డింద్రాదిమిత్రుండు స
జ్జనరక్షామణి యౌచు నుజ్జయిని రాజ్యప్రాజ్యుఁడై యేలగన్. 163

ఆ. భట్టిమంత్రి సైన్యపాలి గోవింగచం
ద్రుఁడు త్రివిక్రముండు పురోహితుండు;

నప్పురోహితునకు నాత్మజుం డగు కమ
లాకరుం డన నవివేకి గలఁడు. 165

క. ఆకమలాకరుఁ డాకమ
లాకరసాదృశ్యముగ జడాశయుఁ డైనన్
శోకము మదిఁ బొదలంగ వి
వేకము పుట్టింపఁ దండ్రి వెరవున దూఱెన్[27].165

క. చుట్టములకుఁ దలిదండ్రుల
కెట్టియెడం బ్రియము నెఱపనెడపని చదువుల్
గట్టిగ నెఱుఁగనిపుత్రుఁడు
పుట్టుట కులమునకుఁ దెవులు పుట్టుట చుమ్మీ. 166

క. విను ముత్తమ మగుపుట్టువు
గనుపట్టెడు నట్టిరూపు గలమోదుగుఁబూ
వును మూర్ఖుండును బ్రబలెడు
వనమున భవనమునఁ దగినవాసన గలదే. 167

క. కులసతికి సిగ్గు క్షత్రియ
కులజునకున్ జయము వర్తకున కోపికయుం
గలిమికి వితరణమును వి
ప్రులకు న్విద్యయును దగినభూషణము లగున్. 168

క. పరులకు సోదరులకు భూ
వరులకుఁ గొనరాదు సర్వవశ్యము తా నె
వ్వరి కిచ్చినఁ గోటిగుణో
తరవృద్ధి భజించు విద్య తనధన మెపుడున్. 169

క. పరభూమికిఁ జనుచోఁ ద
స్కరులకు నగపడదు వ్రేఁగుగా దెచ్చట నె
వ్వరి నైన హితులఁ జేయును
ధరలో మఱి విద్యఁబోల ధనములు గలవే. 170

ఉ. గద్యముఁ బద్యముం బెనుపఁ గైకొను టొండె, ధ్రువాప్రబంధసం
పద్యుతుఁ డౌట మొండె, మృదు భాషలఁ బ్రొద్ధులు పుచ్చుటొండె, లో
కోద్యమలక్షణం బెఱుఁగు టొండె, గడు సృజియించుఁగాక యే
విద్యలు నేరఁ డేనిఁ పశువే యగుఁగాదె గణించి చూచినన్[28]. 171

శా. సంగీతంబుఁ గవిత్వతత్త్వమును సౌజన్యంబు భావంబు స
త్సాంగత్యంబు నెఱుంగఁ డేని భువి నాశ్చర్యంబుగా వాలమున్
శృంగద్వంద్వము లేని యె ద్దతఁ డనం జెల్లుం దృణం బాతఁ డ
య్యాంగీకంబున మేయఁ డాపసులభాగ్యం బిచ్చటం గల్గుటన్. 172

సీ. అనుచు నెగ్గించిన నాకమలాకరుం
డభిమానియై తనయాత్మలోన
విద్యలు నేర్చి వివేకినై కాని యీ
జనకువక్త్రము చూడననుచు వెడలి
కాశ్మీరదేశంబుకడ కేఁగి యొకయోరఁ
జంద్రకేతుం డనుసంజ్ఞఁ బరఁగు
నుత్తమద్విజుఁ గొల్చియుండగా నాతండు
క్రమమున సిద్ధసారస్వతంబు
తే. కరుణ నొసఁగిన నతఁడు సాంగంబు గాఁగ
నాల్గువేదములును గావ్యనాటకములు
దర్శనంబులు నీతిశాస్త్రములు దివిరి
కలయ సంగీతసాహిత్యకళలు నేర్చి. 173

వ. అభిజ్ఞుండై గురునానతిపడసి తిరిగి దేశవిశేషంబుల జూడం జరియించుచు నొక్కనాడు. 174

క. కాంచనమణిమయరుచికలి[29]
కాంచితనిజసాలవలయ మై భూమిసతీ
కాంచీగుణ మన మించిన
కాంచీపట్టణము నతఁడు గాంచెం గడఁకన్. 175

క. ఆనగరమునకుఁ జని జయ
సేనుం డనురాజుచేతఁ జిత్రంబగు వి
ద్యానిపుణతఁ బూజ్యుండై
యానెపమునఁ గొన్నిదినము లచ్చట నిలిచెన్. 176

వ. అంత నొక్కనాఁ డతనియెదుట విటలోకమోహిని యను వారకామిని లలిత విలాసినియై పొలసె నది యెట్టి దనిన. 177

సీ. శృంగారరసములోఁ జేవశోధించి వి
రించి యీసతి నొనరించె నొక్కొ
మెఱపులన్నియుఁ గూర్చి మెదపి రూపుగఁ జేర్చి
యీసరోజాననఁ జేసెనొక్కో
కాక బంగారులోఁ గాంతిసాధించి యీ
చంచలనేత్రఁ గావించెనొక్కో
యుడురాజుఁ జేపట్టి పిడిచి సారంబున
నీపడంతుక రచియించెనొక్కొ
ఆ. చక్కఁదనమునెల్ల నొక్కచోటనుగూడఁ
గూర్చి యీనెలఁత నొనర్చెనొక్కొ

యనఁగ రత్నపుత్రికాకృతి రసికుల
చూపుగములకెల్లఁ దీపు లొసగు. 178

క. ఆకామినిఁ గనుగొని కమ
లాకరుఁడు ప్రమత్తచిత్తుఁడై కందర్పో
ద్రేకమునఁ జేరునెడ నా
లోకించి యొకఁడు వింతలుగ నిట్లనియెన్. 179

క. ఈనరమోహినిఁ బొందం
గానేఁగినరాత్రి వచ్చి ఘనదంష్ట్రుం డన్
దానవుఁడు చంపుఁగావున
హానింబడనేల లిరిగి యరుదె మ్మిటకున్. 180

ఉ. నావుడు నుల్కి భూమిసురనందనుఁడు న్నరమోహినీరతే
చ్ఛావికతాత్ముఁడై నిలిచి సత్యముగా జనులెల్లఁ జెప్పగాఁ
దా విని చోద్యమంది వసుధావరు వీడ్కొని యొయ్య నొయ్య వి
ద్యావినయాధ్యుఁడై తిరిగి తండ్రిఁ గనుంగొన వచ్చె నూరికిన్. 181

మ. అచటం దల్లికిఁ దండ్రికి న్వరుస సాష్టాంగంబుగా మ్రొక్కినం
బ్రచురప్రేమరసాకృతిం బ్రమదబాష్పస్యంధమండంబుగా
రచితాలింగనులై , కుమారక! సుధీరత్నంబవై వచ్చితే
సుచరిత్రా! యిది భాగ్య మంచు మదిలో సొంపొంది రాదంపతుల్. 182

శా. తద్యోగంబునఁ దండ్రి మిక్కిలియు నాత్మంబొంగి సద్వృత్తికిం
జోద్యం బంది యనంతరంబ ధరణీశుం గానఁగా నేఁగి నా
యుద్యోగంబున జాణ యయ్యె నని యేనూహించెదన్ వీనికిన్
విద్యాచాతురి గల్గు టీవు కరుణ న్వీక్షింపుమా నావుడున్. 183

మ. క్షితినాథుండు నిజాదరంబునఁ గృతాశీర్వాదుఁడౌ నప్పురో
హితపుత్రుండు సభాస్థలి న్బుధగణం బింపొందఁగాఁ దా నకం

పితుఁడై శాస్త్రపురాణకావ్యనిగమస్మృతర్థసంగీతసం
గతి మర్మజ్ఞతతోఁ బ్రసంగ మెలమిం గావింపఁగా నిట్లనున్. 134

క. యత్నమునఁ దెలియు నన్ని యు
రత్నాకరుభాతి దుస్తరం బగు విద్వా
రత్నము గవితాతత్త్వము
నూత్నముగా నందుఁ గలుగు నును పెఱిఁగితివే. 185

క. నావుడు కమలాకరుఁ డను
దేవా నీ వానతిచ్చితివి నిజ మది వి
ద్యావారిధి కడ గానఁగ
నావారిజభవునకైన నలవియె తలఁపన్. 186

ఆ. అట్ల యయ్యు సంస్కృతాదిభాషలు నేర్చి
కవిత యెఱిఁగి యెల్లకడలఁ దిరిగి
తెలిసినాఁడ నిచటఁ గల లక్షణముకంటె
నూతనంబు లేదు భూతలేంద్ర. 187

క. గణములు గణవర్ణంబులు
గణతారలు గణరసములు గణదేవతలున్
గణజాతులు గణఫలములు
గణుతింపఁగ నొక్కవిధమ కవితల కెల్లన్. 188

వ. ఇట్టి విధం బయ్యను నంధ్రమండలంబునం [30]గోనదేశంబునం దెలుఁగుంగవితకు వ్రాలు[31] - వళ్ళు నను నియమంబులు చూచినాఁడ నవి యియ్యెడం డఱచు గాకుంట నపూర్వం బవధరింపుము. 189

శా. పుణ్యస్త్రీకి గణింప[32] మంగళగుణంబు ల్సొమ్ములై యొప్పుఁగాఁ
బణ్యస్త్రీకి సువర్ణమౌక్తికసురూపవ్యక్తిభూషాకృతుల్
గణ్యంబౌగతి సంస్కృతంబునకు వాగ్భావంబు శబ్దంబు లా
పద్యాకారములౌఁ దెనుంగునకుఁ బ్రా ల్వళ్ళుం గడు న్వన్నియల్. 190

ఆ. పలుదెఱంగులైన పలుకులు గలిగియుఁ
బ్రాలు వళ్ళు లేని బేలుగవిత
వన్నెలెల్లఁ గూర్చి వ్రాయుచోఁ గాటుక
వన్నె లేని ప్రతిమవ్రాఁతఁబోలు. 191

క. తప్పక వళ్ళును బ్రాలును
ముప్పిరిగొనఁ దగినశబ్దములు మెఱుఁగెక్కం
జెప్పిన కవితాచాతురి
యొప్పము వెట్టిన పసిండియొఱపున మెఱయున్. 192

క. పాదముల వళ్ళుఁ బ్రాసము
లాదిమము ద్వితీయ మైసయక్షరములు త
త్పాదంబుల యతు లవి సం
పాదముగాకుండఁ దగిన వళ్ళిడవలయున్. 193

వ. ఆందు వళ్లన్నవి—స్వరవళ్ళు, వ్యంజనస్వరవళ్ళు, గూఢస్వరవ్యంజనవళ్ళు, వర్గవళ్ళు, సరసవళ్ళు, నెక్కటివళ్ళు, సంయుక్తవళ్ళు, ననుస్వారవళ్ళు, బోలికవళ్ళు, వృద్ధివళ్ళుఁ, బ్లుతవళ్ళు, నిత్యసమాసవళ్ళుఁ, బ్రాదివళ్ళుఁ నాఁ ద్రయోదశవిధంబులయ్యె నందు స్వరవ ళ్ళెట్టి వనిన. 194

క. అద్వయ మైఔలకు నౌ
నిద్వయము ఋౠలు గూడ నేఏలకు నౌ
నుద్వయ మౌ నోఓలకు
విద్వన్నుత వళ్ళు సెల్లు వీడ్వడఁ దమలోన్. 195

ఇంక వ్యంజనస్వరవళ్ళు—
క. ఈకొలదిఁ గాక కాదులు
గైకొని చెప్పుదురు వళ్ళకడ నీస్వరముల్
పైకొనఁగఁ దత్స్వరంబులు
నాకడ వళ్ళౌ నృపాలకాన్వయతిలకా. 196

ఇంక గూఢస్వరవ్యంజనవళ్ళు—
క. ఆన్యోన్యపరీక్షాదిప
దన్యాసములందు సంస్కృతస్వరములు[33] పూ
ర్వన్యాయంబుగ నగు న
న్యోన్యము వడి హల్లు సెల్లు నూతనకర్ణా. 197

ఇంక వర్గవళ్ళు—
క. రమణీజన్మమన్మథ భూ
రమణా నిజపంచమాక్షరము వర్జ్యముగాఁ
దమనాలుగక్షరమ్ములు
దమలోఁ వళ్ళయ్యెఁ గచటతపవర్గములన్. 198

ఇంక సరసవళ్ళు—
క. వయముగ చఛజఝుశషసలు
నియహలు నణలును జెలంగు[34] యతి మీఁద నసం
శయగతిఁ దమలో వీడ్వడు
జయలక్ష్మీయువతిభోగసౌభాగ్యనిధీ[35]. 199

ఇంక నెక్కటివళ్ళు—
క. నరవరవంశవిభూషణ
మరవఱలను వళ్ళొగిం దమకుఁ దామె యగున్

ధరజ్ఞణలు మొదలవిన మం
తరపదములఁ గలుగునేని దగునట్టులగున్. 200

ఇంక సంయుక్తవళ్ళు—
క. బుధసమ్మతి మిశ్రితబహు
విధవర్ణములందు వళ్ళు వివరింపంగా
నగరీకృతఫల్గునశా
ర్ఙధరనిభా యెల్లయక్షరమ్ములుఁ జెల్లున్. 201

ఇంక ననుస్వారవళ్ళు -
క. అమరంగ వర్గస్థితవ
ర్ణములపిఱుంద బిందులూఁదినం బంచమవ
ర్ణములును వళ్ళగు జయసం
భ్రమపరిచితపరనృపాల మానితకీర్తీ. 202

ఇంకఁ బోలికవళ్ళు—
క. పోలును[36] బుపుబుభులకు మూ
పోలికవడి యనఁగ నంత్యమున యతి మీఁదం
దేలి బుకారముపట్లను
భూకోకసురేంద్ర యోగ్యముగఁ జనుదెంచున్. 203

క. తెలుగుననదికెడి శబ్దం
బులమీఁదిమకార మందముగ స్వత్త్వమునన్
నిలుచు నట పావడికినై
పలుకుటకంటెను భజించుఁ బావడియైనన్. 204

ఇంక వృద్ధివళ్ళు—
క. సుగుణైధిత నగరౌషధి
నగౌఘనైకాది యోజనలసంధులఁ బెం
పుగ వృద్ధు లండ్రు వానికి
నగు నయహలు వళ్ళు నరవరౌఘశరణ్యా. 205

ఇంకఁ బ్లుతవళ్ళు—
క. గానప్రశ్నవిధానా
హ్వానములఁ ద్రిమాత్రమైన యత్వము నుభయా
ధీనమునై వళ్ళకుఁ జన
నౌ[37] నిది నీవేమి యెఱుఁగవా సర్వజ్ఞా. 206

ఇంక నిత్యసమాసవళ్ళు—
క. డాయఁగ సమసింపఁగఁ బా
రాయణ నారాయణాంతరంగానేకా
నాయాసాదులఁ గర్ణర
సాయనముగ రెండువళ్ళు జరుగుచునుండున్. 207

క. ఇది చేతిది పోచక పి
న్నది కట్టెఁడు దానికంటె నల్లల ననునీ
పదముల నుభయముగొన ను
న్నదివళ్ళకు ననుమతంబు నరలోకేంద్రా. 208

ఇంకఁ బ్రాదివళ్ళు—
క. మేదినఁ బ్రపరిప్రతినిప
రాదురుపాపాత్యవవినిరాఙన్వభిసం

సూదప్యధులన నిరువది
ప్రాదులు యతి తత్స్వరములు హల్లులుఁ జెల్లున్. 209

సీ. ప్రమదజనేక్షణప్రార్థితసౌందర్య
యాచకసంతతిప్రార్థనీయ
పృథ్వీసురప్రజాభీష్టసంధాయక
యిభముఖ్యసైనికాభీష్టయాత్ర
పరమధర్మక్రియోపాయసంచితకీ ర్తి
యరిదుర్గసాధనోపాయవేది
వివిధశాస్త్రాగమవీక్షణతాత్పర్య
యిందిరాసత్కృపావీక్షణీయ
ఆ. రాజనీతి గుణనిరంతర వైభవ
యష్టసిద్ధిబలనిరంతరాయ
ప్రాదివళ్ళ కది యుదాహరణం బయ్యె
విద్వదంబుజార్క విక్రమార్క. 210

వ. మఱియుం బ్రాసంబు లన్నవి దుష్కరప్రాసంబు, ద్విప్రాసంబు, త్రిప్రాసంబు, చతుష్ప్రాసం, బంత్యప్రాసం, బనుప్రాసంబు నన నాఱుదెఱంగులయ్యె నందు దుష్కరప్రాసం బన్నది. 211

క. దృఙ్మంజులవిలసన్మృగ
దృఙ్మన్మథరూప వసుమతీవరతిలకా
దిఙ్మండలభరితయశ
స్స్రఙ్మండన యిట్లు దుష్కరప్రాస మగున్. 212

ద్విప్రాసము:-
క. నవరసములు నమరం బద
వివరణభరణీయమైన వెరవునఁ గావ్య

ప్రవరమతులైన కవులీ
వివరంబునఁ జెప్పిరేని ద్విప్రాస మగున్. 213

త్రిప్రాసము:—
క. సరములు గూర్చిన క్రియ న
క్షరములు పాదములఁ గలయఁ గవిరాజమనో
హరము లన సముచితార్థ
స్థిరములుగాఁ జెప్ప నిట్లు త్రిప్రాస మగున్. 214

చతుష్ప్రాసము:—
క. భూషణముగఁ గైకొని రస
పోషణముగఁ గ్రాలు నర్థపోషణమున ని
ర్దూషణముగఁ జెప్పిన కవి
తోషణముగఁ గృతుల నివి చతుష్ప్రాస మగున్. 215

అంత్యప్రాసము:—
క. అనుపమపుణ్యవిశేషా
ఘనబలవిద్వేషినికరఖండనరోషా
వినయనయవినుతవేషా
విను మంత్యప్రాస మయ్యె విక్రమభూషా. 216

అనుప్రాసము:—
క. ఈప్రాసప్రకరంబు శ్రు
తిప్రసవదళప్రభాప్రదీప్తం బై లో
కప్రకటార్థప్రసృతి న
నుప్రహితంబైనచో ననుప్రాస మగున్. 217

క. అని లక్షణయుక్తముగా
వినిపించిన సంతసించి విభుఁ డద్దేశం

బునఁ బరఁగెడు నుడుగులఁ గల
నునుపునఁ పద్యంబుఁ జెప్పుమనుడు నిట్లనియెన్. 218

సీ. పొదలినకూటమి పిదప మెల్పునఁ గల
గనయంబు డాకేలఁ గొని తెమల్చి
పోఁడిమి గలపాఁపఱేఁ డను సెజ్జపై
నూఁతగా వలకేల నొయ్య హత్తి
క్రొమ్ముడిఁ జెరివిన కమ్మని క్రొవ్విరు
లెడలి వెన్నున జాఱి కడలుకొనఁగ
లేచి వేంచేయుచోఁ జూచి వెన్నుఁడు సొంపు
రెట్టింపఁ గ్రమ్మఱఁ బట్టి యేడఁదఁ
తే. దమక మినుమడిగాఁ గౌను దక్కఁదొడిగి
బిగువుఁగౌఁగిటఁ గదియంగఁ దిగిచి తివుట
మోవి గదియంగఁ గోర్కులు మూరిఁబుచ్చు
కలిమి యాబిడ చూడ్కులుగాచుఁగాత. 219

వ. అని చదివినం జెవులకుం జవులు చిలుకు నచటి పలుకు సరసభావంబులకుం బులకించి నృపతితిలకుం డిచటి యాబిడ యనుశబ్దం బది స్త్రీవాచకంబుగదా యనవుడు విద్యాకరుం డగుకమలాకరుం డిట్లనియె. 220

సి. ఎలనాఁగ తొయ్యలి యింతి ముద్దియ నాతి
ప్రోయాలు పొలఁతుక పువ్వుఁబోణి
చెలువ కలువకంటి చేడియ నెలఁతుక
మగువ మెఱుఁగుబోఁడి మచ్చెకంటి
యుగ్మలి యాబిడ యువిద వాలుంగంటి
యన్ను చిగురుఁబోణి యతివ పడతి
లేమ క్రాల్గంటియుఁ జామ పొలఁతి కొమ్మ
తీఁగఁబోఁడి మడఁతి తెఱవ బోటి

ఆ. వెలఁది ముదిత గొంతి మెలఁతుక పడఁతుక
నెలఁత యిగురుఁబోఁడి తలిరుఁబోఁడి
యనఁగ సతులపేళ్ళు తెనుఁగున నలువది
వెలయుచుండు నిట్లు విక్రమార్క. 221

వ. అనిన నచ్చాతురికిం బరిణమించి ధరణీరమణుం డారీతి రత్నమాలిక యతని యఱుత నిడి కర్ణానందంబుగా నాకర్ణించితి విలోకానందంబుగా విలోకించితి నిట్టి దెద్దియేనియు వింత గలిగినఁ జెప్పు మనవుడు నాకమలాకరుండు. 222

క. అవనీశ నీగుణంబులు
చెవులకుఁ జవు లొసఁగి విందు సేయుచునుండున్
నవలావణ్యమయం బగు
భవదాకృతి చూపు గనులపండువ గాదే. 223

మ. జగతీనాయక! సర్వవిస్మయనివాసం బైన నీ విప్పు డిం
పుగ న న్నచ్చెరు వేమి గంటి వని సంబోధించి తేఁ జెప్పఁగాఁ
దగ ద ట్లయ్యును విన్నవింతు నిజవిద్యాకాంక్ష నాఁ డేఁగి యొ
క్కగతిన్ సస్యఫలప్రశస్యతలమౌ కాశ్మీరదేశంబునన్. 224

తే. అగ్రహారములోన బుధాగ్రగణ్యుఁ
జంద్రచూడుని గురునిఁ బ్రసన్నుఁ జేసి
సిద్ధసారస్వతమున వాక్సిద్ది వడసి
వీడుకొని తిరిగితిని నావిద్య మెఱసి. 225

మ. భవదాజ్ఞావశవర్తులౌ నృపులతో భాషించుచు న్వచ్చి వ
చ్చి వియత్సంచరరమ్యహర్మ్యగణమై చెల్వారు కాంచీపురం
బవలోకించి యటేఁగి యందు జయసేనాఖ్యున్ విభుం గాంచి యు
త్సవలీల న్నెలనాళ్ళు నిల్చితి మనస్సంభావ్యసంభావనన్. 226

క. ఆవీటను నరమోహిని
నావెలయుచు నిఖిలమోహనం బైన మహా
లావణ్యంబున మరుసం
జీవనిక్రియ నున్న యొక్కచెలువం గంటిన్. 227

సీ. క్రాలుగన్నుల నెమ్మొగమ్మున గళమున
నబ్జవిజృంభణ మాలిసేయు
జఘనస్థలంబునఁ జనుఁగవ నతనాభిఁ
జక్రవైభవము నతిక్రమించు
స్వరమునఁ దనుమార్దవమున బింబాధర
ద్యుతిఁ బ్రవాళగుణంబు నోటుపఱుచుఁ
బదతలంబుల మురిపంబులఁ బయ్యెదఁ
బల్లవరాగంబు ప్రజలఁ బొలయుఁ
తే. గన్నయంతన కన్నులకఱవు దీర్చు
నట్టిరూపంబు వర్ణింప నలవి గాదు
చెప్పవచ్చునె పడియచ్చు సేయఁ దరమె
రక్షణోపేంద్ర విక్రమార్కక్షితీంద్ర. 228

తే. ఆనెలఁత రాక్షసాశ్రిత యౌటఁ జేసి
పాముతల నున్నరత్నంబుఖాతి నుండు
గోరి యెవఁడైన దానిని జేరెనేని
దానవుఁడు రేయి పఱతెంచి వానిఁజంపు. 229

మ. ఇది చిత్రం బని చెప్పిన న్విని ధరిత్రీశుండు కౌతూహలం
బు దలిర్పం గమలాకరా యచటియంభోజాననం జూడనే
గుదమే రమ్మని వానిఁ దోడుకొనుచుం గ్రూరాసి చేఁదోడుగాఁ
గదలెం గాంచికిఁ గాంచనాంచితనిజక్ష్మాకామినీకాంచికిన్. 280

వ. ఇట్లు కతిపయదివసంబుల కాపురి సొచ్చి గూడవేషంబునం దిరుగుచు రాజమార్గంబున నున్న నరమోహినిం జూచి తదీయలావణ్యపయోధిలో మునిఁగిన దృష్టిం దివియంజాలక తనుఁ దాన సవరించుకొని. 231

క. సురకిన్నరపన్నగఖే
చరకన్మలఁ జూచినాఁడ సరిపోల్పఁగ నే
తరుణులు లే రీతరుణికి
నరమోహిని యనఁగ నున్ననామంబ తగున్. 232

క. చూపులు మర్మము గాఁడెడు
తూపులు మురిపముల వలపుఁదూపులసరికిం[38]
బ్రాపులు సతినిలు వంతయుఁ
దీపులు నగు మన్మథాస్త్రదేవతచుమ్మీ. 233

క. ఈపొలఁతి రాక్షసాశ్రిత
యై పన్నగసహితచందనాకృతి మెఱయున్
దీపితయై వెఱపించెడి
వ్యాపారముకొలఁదిఁ జూడవలయును మనకున్. 234

క. కావున నీ వింటికిఁ జని
నే వచ్చెద ననుచుఁ జెప్పు నెలఁతుకతోడన్
నావుడుఁ గమలాకరుఁడును
నా వెలఁదికిఁ జెప్పి వచ్చి నరపతి కనియెన్. 235

తే. దేవ యీ మాటఁజెప్పినఁ దెఱవనవ్వి
యొయ్యఁబలుకుచు నిదురకు నియ్యకొనుచుఁ
గర్భురుం డనునొక్కరక్కసుఁడు గలఁడు
వాని మఱవక రమ్మని చెప్పె[39] వనిత.

క. నావుఁడు నావీరవరుం
డావిప్రునిచేతఁ బోఁకలాకులు విరులున్
రోవెలయుం దగఁ బంపిన
నావెలఁదియు నందుకొనియె నతివిస్మితయై. 237

సీ. అయ్యెడ దశరథునాజ్ఞపోలిక బ్రహ్మ
కట్టడి గాలంబు గడవరాక
జనకజ కెనయైన దినలక్ష్మి తనతోడు
నీడకైవడిఁ దోడఁ గూడినడువ
సౌమిత్రిగతి [40]మునిసవనంబునకు మున్ను
దోడైనయరుణుండు తోడుగాఁగ
సాకేతపురిలోన జనులవక్త్రంబుల
నడువున జలజము ల్వాడువాఱఁ
తే. గైకవంకవారిపగిదిఁ గలువ లుబ్బ
జిత్రకూటముక్రియ నస్తశిఖరి దాఁటి
రాక్షసులభంగి నటఁ దిమిరంబునడువ
వనముసొచ్చె రఘువరునివరుస వినుఁడు. 238

ఆ. గడియకుడుకభంగి గ్రహరాజు జలధిలో
వ్రాలఁ జుక్కలు దలఁబ్రాలుగాఁగఁ
గెంపు హోమవహ్నిక్రియ నొప్పఁగా ద్విజ
రాజు పెండ్లియాడె రాత్రిసతిని. 239

క. నలఁగినవిరులును గుఱుమా
పులయిన చీరలును నుదుటి బొట్టులు నెడగా
జులుఁ గమ్మటాకులును సొ
మ్ములుగాఁ దమక్రంతలందు మురిసిరి జంతల్. 240

సీ. తిలకంబుఁ గొప్పుపువ్వులుఁ బూఁతలును గను
పట్టఁగా మెలఁగెడుదిట్టవిటులు
నిఱుకిండ్లఁ బాతిక పరక ముడ్చి
గొని ముసుంగిడి చొచ్చుగూఢవిటులు
బోఁటికత్తియలు పల్మాటును బిలువఁగా
మెరవడిఁ దాయేఁగు మేటివిటులుఁ
గనియుఁ గానకయుండఁగా నోరముసుఁగుల
నగపడ్డచో నిల్వఁ దగినవిటులుఁ
ఆ. బెట్టలేమి వెడలఁగొట్టిన చోటికి
బొంచి పడపు చెఱచు క్రించువిటులుఁ[41]
గ్రందుకొనఁగ వారకాంతలవాడలఁ
బచ్చవింటివాఁడు పెచ్చు పెరిగె. 241

వ. అట్టియెడఁ గొందఱు విటులు లంజియలతల్లుల బిఱుసులకు వెఱచి యందఱు నొక్కెడఁ గూడి తమలో నిట్లని విత్కరించిరి. 242

క. మునుమున్నుగ గొఱియలుఁ గూ
డును మొదలుగ నిడక చనువిటునిఁబణ్యస్త్రీ
జనని మెడ విఱిచి కొను నది
ధనముపయిం గాచియున్న దయ్యము చుమ్మీ. 243

వ. అనుడు మఱియు నొకరుం డిట్లనియె. 244

క. వారాంగన మధురసవి
స్తారాకృతి యనఁగఁ జెల్లు దజ్జనని విటుం
జేరఁగనీ దచ్చట సహ
కారఫలము పొంతనున్న కడుఁదురు చుమ్మీ. 245

వ. అనిన మఱియు నొక్కరుండు. 246

క. వెలయాలితల్లి కూఁతుం
గలఁచి విటుఁడు వచ్చెనేనిఁ గలుషించినఁ దాఁ
దలతోన మింగునది ని
ర్మలజల మగు మడుగులోని మకరము చుమ్మీ. 247

వ. నావుడు నితరుండు. 248

క. పరికింప లంజతల్లికి
దొరయైనను దుచ్ఛుఁడైన దొరకినఁ జాలుం
బొరిగొను నది యీపురిలో
నరమోహిని నంటియున్న నరభోజిసుమీ. 249

వ. నా విని యపరుండు. 250

క. పుడమి నిఁక లంజతల్లిం
గడుమీఱిన యట్టికీడు గలదే యది యె
య్యెడఁ జూచినఁ గూతునకు
న్మెడకోణము దొడ్డగుదియ[42] మిండలకెల్లన్. 251

వ. అనవుడుఁ దోడివాఁడు. 252

క. ఆకూఁతుఁ గన్నయప్పుడ
చేకొని తజ్జననియాకుఁ జింపక వెడఁగై
లోకేశుఁడు పామునకుం
గాకికిఁ గలయాయు వేల కలుగఁగఁజేసెన్. 253

వ. అనినం దత్సఖుండు. 254

ఉ. ప్రేమరసంబు తేటలనఁ బెక్కుగుణంబులు గూర్చి వారకాం
తామణుల సృజించి పరతంత్రతఁ ద్రోయఁగనున్న దిగ్గనం[43]

దామరచూలి లంజియలతల్లులఁ జంపఁడు లంజకాఁడు గా
కేమనవచ్చు నాతని నటేని విటావలి నిస్తరింపదే. 225

వ. అని పెక్కువిధంబుల వితర్కించుచున్న మఱియు నొక్కెడం గొందఱు సుందరులు పానగోష్ఠికిం గడంగి కాదంబంబును , మాధవంబును, నైక్షవంబు, క్షీరంబు, నాసవంబు, వార్షంబు, రతఫలంబు లనఁ బాకభేదంబుల మూలస్కంధకుసుమఫలసంభవంబుల బహువిధంబుల మధురంబులైన మధువిశేషంబు లెల్లం బరిమళద్రవ్యపరిమిళితంబుగాఁ గూర్చి పాత్రంబుల నించిన. 256

క. అతి మధురంబైన నిజా
మృతరసములకంటె నిదియ మే లని తారా
పతి చేరెనొక్కొయనఁ ద
ద్ప్రతిబింబము లలరె దివ్యపాత్రంబులలో. 257

వ. అప్పుడు. 258

సీ. కామాక్షికిని మహాకాళికిఁ జండికి
నక్కజియ్యకుఁ[44] గాళి కంబికకును
వింధ్యవాసిని కేకవీరకు మున్నుగా
నెల్లవేల్పులకు బిందించి మ్రొక్కి
త్రావుచు నెడనెడఁ దాల్పుగా వండిన
నంజుటిపొరకలు నంజుకొనుచు
గ్రుక్కెడు చవిచూడు మక్క యీమధువని
తీపులు దమలోనఁ జూపుకొనుచు
తే. నెట్టివస్తువు ల్గడియించె నీతఁ డనుచు
బ్రహ్మఁ గొనియాడి యిదెసాఁకఁ బట్టుమనుచుఁ

బొట్టకొలఁదిగఁ బోంట్లకుఁ బోసిపోసి
పరిణమించిరి యొండొండఁ దరుణులెల్ల. 259

సీ. ఈవారుణీరసం బీశుండు దన కది
సమకూరకునికి విషంబు ద్రావె
మధువైరి యగుట నీమధువున కెడరయ్యు
హరి మాధవాఖ్యను శరణుసొచ్చె
నీసుర లేక గంగాసార మున్న యా
తలఁజేరెఁ జంద్రుండు బలుపుదక్కి
యీమదిరాస్వాద మెడలి విఘ్నేశుండు
పొగులఁగా లోలోనఁబొట్టయుబ్బె
ఆ. నిట్టిమద్యము గని పట్టి త్రావఁగలేక
శక్తిసేవ సేసె షణ్ముఖుండు
అనుచుఁ జతురయైన యతివ మైరేయంబుఁ
బొగడుచుండ నొక్క పొలఁతి వలికె. 260

క. పరిమళముఁ గొన్నయంతనె
పరవశమై మేను హర్షభరితం బగు నీ
సుర గలుగ నమృతమునకున్
సుర లంబుధిద్రచ్చి రిట్టిచోద్యము గలదే. 261

వ. అనవుడు నొక్కరు. 262

క. సుఖములతల్లి మనోభవు
సఖి యీసుర దొల్లి శుక్రుశాపంబున స
న్ముఖులకు నెడగాకుండిన
నఖిలజనులచేత దక్కునా మన కనినన్[45]. 263

వ. మఱియొక్కర్తు. 264

క. ఎక్కడ శుక్రునిశాపం
బిక్కడఁ గొందఱకు భాగ్య మించుక యైనన్
లెక్కకు నెక్కనికతమున
డక్కెఁజు మీ మధువు లేర్పడ న్మనకెల్లన్[46]. 265

వ. అని తమనేర్పులం గొనియాడుచు నానందంబున మాటలు తొట్రువడఁ బలుకుచుం బయ్యెదలు సవరించుటలు మఱచి లజ్జలు దొలంగ బహుప్రకారంబుల నున్మత్తభావంబులు దోఁపంబ్రవర్తిల్లి. 266

ఉ. ఇంవు మనంబులోన నటియింపఁగఁ జెక్కులమీఁదఁ గన్నులం
గెంపువహింప మోవిఁగల కెంపు చలింపఁగ ఘర్మబిందువుల్
పొంపిరివోవ ముద్దుమొగముల్ మెఱుపెక్క రతాంతసంగతిన్
సొంపువహించి రంగనలు సోలుచు నమ్మదిరామదంబునన్. 267

సీ. అక్క మీతల్లి మాయత్త[47] యౌ నెఱిఁగితిఁ
గోడలితల్లి నాకూఁతు రగుట
మాతల్లిమఱఁది మామామ సభ్యులక్రియ
నుయ్యిఁ[48] జంకిటనిడి యొయ్యనరిగె
మాబావకొడుకు నామఱఁది గాలపువేఁటఁ
గొమ్ములకుందేలుఁ గొట్టితెచ్చె
నిది సెప్పఁ గొఱఁతని యిది కల్లసేయక
చెవులారఁ జూడు నేఁ జెప్పినట్టు
తే. లనుచు లోకవిరోధోక్తు లాడుకొనుచు
సొలపులూరఁగ నోరచూపులు నటింప

వట్టినగవులఁ జప్పట్లు వెట్టికొనుచు
నాడఁజొచ్చిరి చేడెలు పాడిపాడి. 268

వ. ఇట్టివినోదంబులు సూచుచు విక్రమాదిత్యుండు త్రివిక్రమాపత్యంబు తోడరా నరమోహిని గేహంబున కేఁగి తదాళీపరిచరితసముచితోపచారంబులు గైకొని హంసతూలికాపర్యంకంబుపై సుఖాసీనుండై సరసవాక్యంబులం బ్రొద్దుపుచ్చి. 269

క. నరమోహిని మీరక్కసుఁ
డరుదెంచి తలంగకుండ నాలోపల ని
న్నరయుచు నుండెద నని భూ
సురయుతుఁడై యధిపుఁ డఱ్ఱసొచ్చెన్ బుద్ధిన్. 270

క. ఆలోన నొదిఁగి యున్నెడ
నీలాలక శయ్యమీఁద నిద్రింపఁగ నా
భీలనయనాంతదంత
జ్వాలలు నిగుడంగ నసుర వచ్చెం బెలుచన్. 271

ఉ. అచ్చట నొంటినున్న సతి నార్చుచు వేసి యదల్చి నీవిటుం
డెచ్చట డాఁగెఁ జూపు మని యీడ్చి గృహాంగణసీమ కేఁగఁగాఁ
జెచ్చెర విక్రమార్కుఁ డొకసింహము చాడ్పున నేన వీఁడుగో[49]
వచ్చితినంచు నార్పుఁగొని[50] వచ్చెఁ గరాళకృపాణపాణియై. 272

క. అటు వచ్చిన దనుజుఁడు గిట
కిటఁ బండులు గీఁటుకొనుచుఁ గినుకవొడమి యు
ద్భటవృత్తి నెగసినం గని
భటధర్మము దప్పి తోడి పాఱితి వనుచున్. 278

క. దుర్బలుఁడ వోరి నీదగు
దోర్బల మిది యెంత నన్ను దొరసెదు విను నేఁ
గర్బురుఁడఁ దొల్లి నాచే
నర్బుదసంఖ్యలుగ మనుజు లణఁగిరిచుమ్మీ. 274

శా. వారిం గూడఁగ నేఁగుమంచు గద వైవంజేరినన్ భీముఁడా
కౌరవ్యేంద్రుని నేలఁ గూల్చుగతి నాక్ష్మానాయకుండుం దదీ
యోరుద్వంద్వము నొంచి కూల్చి భువి దైత్యున్ ఖండతుండంబుగా
ఘోరాస్త్రాహతిఁ బ్రోవుచేసె, సుర లుత్క్రోశించి[51] వర్ణింపఁగన్. 275

క. రక్కసుఁడనియెడు చీకఁటి
నుక్కడఁపి శుభోదయమున నొప్పుచుఁ దమకున్
దిక్కైన విక్రమార్కుని
నక్కమలాకరుఁడు చూచి హర్షం బందన్. 276

క. తత్సాహసబలధైర్యస
ముత్సేకంబులకుఁ జోద్య మొందుచుఁ బ్రియసం
విత్సమ్మతి నరమోహిని
యుత్సుకయై మ్రొక్కి పలికె నోభూనాథా. 277

క. నామంబున నరమోహిని
నామెఱయఁగ వీనిచేత నరఘాతినినా
నామీఁద నున్నకీ డిదె
నీమాహాత్మ్యమునఁ బాసె నిమిషములోనన్. 278

క. కావున నా కేవిధమునఁ
గావం బ్రోవంగ నీవ కర్తవు పను లౌఁ

గావనక యెద్దిపంచినఁ
గావించెద నుడిగమునకుఁ గైకొను నన్నున్. 279

గీ. అనుడు వసుమతివల్లభుం డల్ల నవ్వి
యెద్దిపంచినఁ గావింపనియ్యకొంటి
వనజలోచన జాతిఁ బద్మినివి నీవు
సరసగంధరుని గమలాకరు భజింపు. 280

క. ఓకమలాకర మును నీ
వీకమలాసన భజింప నింపొందితి నేఁ
డీకాంతామణిఁ గైకొని
యేకాంతక్రీడ నిలువు మిచ్చట సుఖివై. 281

వ. అని పరస్పరకరగ్రహణంబు చేయించి. 283

ఆ. లంకలోని రాజ్యలక్ష్మి విభీషణు
కిచ్చి వచ్చు రాఘవేంద్రు పగిది
దితిజుఁ జంపి వారసతి నాశ్రితున కిచ్చి
విజయలక్ష్మిఁ గూడి విభుఁడు గదలి. 284

క. వాలుంగంటి నిలువు మని
వాలాయింపంగ నేఁగవలయు ననుచు న
వ్వాలుమగఁడు మెఱుఁగారెడు
వాలు సహాయముగ మగిడి వచ్చెం బురికిన్. 284

క. కావున నీకీగుణములు
లేవైనను గద్దె నెక్క లే విట మగుడం
బోవుట మే లనవుడు భో"
జావనిపతి సిగ్గుపడుచు నల్లనఁ దిరిగెన్. 285

శా. జీమూతాళికురంగనాభిశశభృచ్చిహ్నామరేంద్రోపల[52]
వ్యోదీవమేంఠసామజాతయమునాహోమాగ్నిధూమాంజన
శ్యామాకారుసమస్తకల్మషతమస్సందోహమార్తాండు ను
ద్ధామానంతయశోభిరాముని రమాధామున్ గుణస్తోమునిన్. 286

జా. సర్పాధీశ్వరకుందచందనపయశ్చంద్రాబ్జమందాకినీ
కర్పూరామృతహారహీరతుహనాకారానుకారాకృతిన్
దర్ఫారూఢపికద్విరేఫశుకబృందారోహకోత్సాహకం
దర్పాటోపవనాంతదావదహనుం ద్రైలోక్యరక్షామణిన్. 287

మాలిని. వివిధసురవరేణ్యా వేదవేదాంతగణ్యా
భవతిమిరదినేంద్రా భక్తకారుణ్యసాంద్రా
సవినయజయలోలా సర్వలోకానుపాలా[53]
భవమధురిపురూపా భవ్యదివ్యస్వరూపా[54]. 288

గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాది బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధ్వీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొఱవీ
వెన్నయామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజవిరచితంబైన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు
రత్నోద్భవుకథయును మూషకోపాఖ్యానంబును విక్రమార్కుని సాహసికత్వమహౌ దార్యత్వంబులును గమలాకరుకథయునన్నది చతుర్థాశ్వాసము.

  1. అఖిలవృక్షరమ్యమగు నుపద్వీపమునందు
  2. చంపెడుగుడి
  3. నెట్టకేనియు
  4. రుండములకుఁ దలలు రెండునంటుకొనంగ? - తుండములకుఁ దలలు రెండు- చిన్నయ్యసూరి
  5. దేవ వీరికిట్టి తెఱఁగున నీశిరశ్ఛేద
  6. న్మనమె నేఁడం దేగుచో
  7. దొలంచి
  8. భీష్టౌఘముల్
  9. మొదలిరత్నము
  10. శ్రీరమణీకటాక్ష విలసత్స్థానంబు వీక్షించుచున్
    ప్రసాదమగు నాసౌధంబు వీక్షించుచున్
  11. తఱివడితో నెగసినజేగుఱు
  12. ఈ పద్యము మొదలు **వఱకు నొకప్రతిలోనే కలవు.
  13. యెనసి బుడుగుల యట్టులు మునిఁగి - బుడిగి= బుంగముంత చి. సూ.
  14. మూగిముంచె
  15. రాజుల మెడకోణ
  16. పంకజంబుల కెదురెక్క
  17. యానందమై పుణ్యభాగులకును వారిభోగములకు
  18. రక్తజలదేవత
  19. కృపాణ మెత్తి మెడఁ జేర్చె మెఱుంగు త్రురంగలింపఁగన్
  20. యప్పటికప్పల
  21. బ్రబ్బిలియా కేఱి
  22. డొక్కఁడు (మనగు) గునుకుదియె (యే)డుగోదానఁ బెట్టు మనినభంగి నిద్దనీవు-చిఱుత కట్టి.. చిన్నయసూరిగారు
  23. బుస్సఁ
  24. మోసియున్నట్టి ఘోరమౌముఖము లడర
  25. వ. అనుచున్
    క. ఈకందముఁ జదువుచు
  26. నిర్ణేతయై
  27. వెరచుచు దూఱెన్
  28. విద్యలు నేరఁడేని బృధివిం బశు వాతఁడెగా గణింపఁగన్
  29. కాంచనమయతటరుచికలి, కాంచిత - కాంచనమణిమయ తటరుచి కాంచిత-
  30. గోణదేశంబున
  31. వ్రాలు-ప్రాలునని రెండురూపములు గలవు.
  32. గుణంబు
  33. సంభృతస్వరములు
  34. బెనంగి
  35. సౌందర్యనిధీ
  36. పోలఁగ
  37. జనఁగా
  38. మరుకున్
  39. నొక్కచిక్కునుగలడొక్కరక్షసుండుఁ చేరిచనుదెంచు నీవింతఁ జేరుమనియె
  40. సాహసమునకు మున్నుగా
  41. చొచ్చివెరవు చెరచిపుచ్చువిటులు
  42. త్రాపుగుదియ
  43. తో దనయున్న దెగ్గునన్
  44. గన్నజియ్యకు
  45. నిఖిలజనులచేతఁ దక్కనేర్చునె మాకున్
  46. దక్కెంబో మధువు నేఁడు దగమనకెల్లన్
  47. మాయక్క
  48. నొయ్య-నయ్య
  49. వీఁడకో
  50. నార్చుకొని
  51. సురలుత్కోచించి
  52. శీతిభృచ్ఛ్రీశ్యామలేంద్రోపల
  53. సర్వలోకానుకూలా
  54. భవతు దివిజరక్షా పద్మపత్రాయతేక్షా