సర్వలక్షణసారసంగ్రహము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీమార్కండేయస్వామినేనమః

సర్వలక్షణసారసంగ్రహము

ద్వితీయాశ్వాసము




కలితాచలకన్యా
ప్రాకటహృదయాజ్ఞభృంగపాణికురంగా
భీకరదనుజవిభంగా
గోకర్ణవిభూషితాంగ కుక్కుటలింగా.

1


వ.

అవధరింపు మింక సమాసప్రకరణం బెఱింగించెద.

2

1 లక్షణము

గీ.

పరిమితంబగు నాంధ్రశబ్దంబు గృతుల
సంస్కృతపదంబుతోడఁ బొసంగి కర్మ
ధారయంబగుఁ బ్రోడ గంధర్వకాంత
లలరి రన శైలజాధీశ హర మహేశ.

3

ఉ.

వాడిమయూఖము ల్గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువుల్
నేడిట వచ్చె నేకతమనిష్టమెయి న్భవదగ్నిహోత్రముల్
పోడిగ వేల్వఁగాఁబడియెఁ బ్రొద్దును బోయెఁగచుండునేనియున్
రాడువనంబులోన మృగరాక్షసపన్నగబాధ బొందెనో.

4

ఆదిపర్వము

ఉ.

మేలిమదావళంబులును మేటిహయంబులు దమ్ముపిండునా
భీలతఁ జుట్టురాగ రథబృందముతోఁ గురురాజు కర్ణుదో
ర్లీలగుదోడ్పడంగ రథరేణువు దీర్ణముగా నతండు పాం
చాలబలంబుపై నడరె శౌర్యసముద్భటబాహువీర్యుఁడై

5

కర్ణపర్వము

సీ.

జిలుగుసంధ్యారాగచీనాంబరముఁ గట్టి
                  కుసుమగర్భఁపుకీలు కొప్పుదురిమి

6

కాశీఖండము

గీ.

నవతికౌరవరథికులు గవిసి కడిమిఁ
బొదువుటయు నన్నిశరముల భూరిరయము
మెరయ నందందఁ దెగటార్చి తరమ నతనిఁ
దాకె వేయుమున్నూరుదంతావళములు.

7

కర్ణపర్వము

ఉ.

నన్నును గౌఁగలించుకొని నావదనంబునకు న్నిజాస్య మా
సన్నము జేసి యెుక్కమృదుశబ్దము నించె మనోహరంబుగా
నెన్నఁడు నట్టిశబ్దము మునీశ్వర ము న్విని యే నెఱుంగ న
య్యన్నువబ్రహ్మచారిముఖ మంబురుహంబుసమంబు చూడఁగన్.

8

ఆరణ్యపర్వము

2 లక్షణము

.
గీ.

అరయఁ గర్పూరగంధియు హంసయాన
యను సమాసపదంబులు తెనుఁగు సేయ
నలరఁ గప్పురగంధియు నంచయాన
యనఁగ నొకకొన్నిపదముల ధనదమిత్ర.

9

కప్పురగంధి యనుటకు

ఉ.

అప్పుడు శౌరిఁ జూచి ప్రమదాతిశయంబు హృదంతరంబులం
జిప్పిలి సంభ్రమించి కయిసేయుతెరం గలరం దిరంబుగా
గుప్పున గూరి యొండొరులఁ గూడఁగనీక కడంగి వేలుపుం
గప్పురగంధు లెక్కిరి ధగద్ధితోన్నతహర్మ్యరేఖలన్.

10

14 పారిజాతాపహరణము

అంచయాన యనుటకు

మత్తకోకిల.

పంచసాయకసాయకంబులబారి కోర్వఁగఁజాల కే
నంచయాన వరించునప్పు డొకప్పుడు న్జముఁగూడి వ
ర్తించరాదని......................................................

11

ప్రౌఢకవిమల్లన రుక్మాంగదచరిత్ర

3 లక్షణము

ఆ.

తెనుఁగుపదముమీఁద దేవతాభాషయు
సంస్కృతంబుమీఁద సరవిఁ దెనుఁగు
రూఢి మీఱఁ దత్పురుష లయి వర్తిల్లు
నిభవిభంగ కుక్కుటేశలింగ.

12

తెనుఁగుమీఁద సంస్కృతమునకు

సీ.

కస్తూరితోఁ గూర్చి గంధసార మలఁది
                  ముత్యాలతాటంకములు ధరించి

13

కాశీఖండము

గీ.

చెలువనేత్రవిలాసంబు చెవుల సోక

14

విజయవిలాసము

సంస్కృతంబుమీఁద తెనుఁగునకు

సీ.

ధర యేయ పాంసులఁ దలచూపరాకుండఁ
                  దనకూర్మిరేని యప్పుననె ముంచె

15

వసుచరిత్ర

4 లక్షణము

గీ.

తెలుగుసంస్కృతపదమును గలియఁగూర్చి
సరవిఁ జెప్పిన నది కవివరులు గృతుల
యందు మిశ్రసమాసం బటంచు నండ్రు
కలిదవృషవాహదురితాభ్రగంధవాహ.

16


సీ.

కటికచీఁకటిదిండికరముల గిలిగింత
                  నెవ్వాఁడు తొగకన్నె నవ్వఁ జెనకు

17

మనుచరిత్ర

5 లక్షణము

క.

తన నా నీ యనుపదములు
కొన సంస్కృతశబ్దవితతిఁ గూర్చి సమాసం
బొనరింపఁ జెల్లుఁ గృతులన్
ధనపతిసన్మిత్ర కరటిదానవజైత్రా.

18

సీ.

తనయశోవిశదముకితాసౌధపాళికి
                  నంబుధాయనము వాతాయనముగ

19

వసుచరిత్ర

6 లక్షణము

క.

దినవెచ్చము గరకంఠుఁడు
నను గ్రామ్యపదములు గొన్ని యలరుంగృతులన్
ఘను లైనకవులరచనలు
వనజాతభవాదిదివిజవందిత శర్వా!

20

దినవెచ్చ మనుటకు

సీ.

కైలాసమునఁ బంట మైలారవిభుఁ డుండె
                  దినవెచ్చ మెవ్వఁడు దీర్పఁగలఁడు ....

21

కాశీఖండము

కరకంఠుఁ డనుటకు

క.

ఎరుకని యెఱుఁగక నీకున్
మరుకువ నెదిరించినాడ మరువుము దీనిం
[1]గరకంఠా క్షమియింపుము
నెరి నెవ్వఁడు నెఱుఁగఁగలఁడు నీచరితంబున్.

22

అరణ్యపర్వము

7 లక్షణము

గీ.

సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు
నపుడు క్రారనుగూడిన యక్కరంబు

లూదియుండు నొకొక్కచో నూదకుండుఁ
దెనుఁగుఁగృతులందు సామజాజిననిచోళ.

23


ఉ.

కావునఁ గామక్రోధముల గ్రాచుచు నాశ్రితకోటిఁ గాచుచున్
భూవలయప్రజ న్సమత బ్రోచుచు రాజ్యముసేఁత మేలు భి
క్షావిధిలోనుగాఁ గలుగు సారఁపుధర్మములన్ ఘటించు మే
ల్వావిరిన ప్రయత్నమున వానికి వచ్చు నృపాల యమ్మెయిన్.

24

శాంతిపర్వము

సీ.

సంధ్యాభివందనశ్రద్ధ యుజ్జనసేయు
                  గీతవాద్యవినోదక్రియలఁ దగులు

25

కాశీఖండము

చ.

అనవుడు నిట్లనున్ విదురుఁ డక్కట ధర్మసుతుండు బాంధవుం
డును జెలికాఁడునుం దగుభటుండును బ్రెగ్గడయున్ గురుండు గా
డె నరవరేణ్య ధర్మప్రకటీకృతచిత్తుఁడు శాంతమూర్తి స
ద్వినయవివేకశీలముల విశ్రుతుఁ డాతఁడు గీడుఁబల్కునే.

26

ఉద్యోగపర్వము

చ.

కృపకృతవర్మలం గడిమి గిట్టి శిఖండిప్రభద్రకుల్ మహో
గ్రఁపువడిఁ దోడ్సడంగ భుజగర్వము జూపిన నాబలాఢ్యులుం
గుపితమనస్కు లయ్యు బలుగోలలఁ బేర్చినలావుచేవ గ
య్యపువెరవేల్పు దాల్మి సరి నచ్చెరుపాటున ముంచెఁ జూపర౯.

27

శల్యపర్వము

శ్లో॥

సంయుక్తే సంస్కృతాద్యస్యా త్సర్వమాంధ్రపదం లఘుః
భవేదాద్యసమాసేపి రేఫయోగాత్పదంతధా

పదేపిచతధాత్వంస్యాత్ క్వచిన్నైవసరేఫకే
సర్వాస్వపిచభాషాసురహయుక్తేక్షరేపరే
పూర్వవర్ణస్యలఘుతాచేష్టామల్పాదికేపిచ


వ.

అని యథర్వణసూత్ర మున్నది గనుక గీర్వాణమందును నీలాగునఁ
గలదు.


శ్లో.

ప్రాప్తనాభిహ్రదమజ్జనమితి

28

మాఘకావ్యము

శ్లో.

... కస్మాజ్జీవసి హేసఖే విషక్రిమిన్యాయేన జీవామ్యహం॥

29

చాటుధార

8 లక్షణము

గీ.

సంస్కృతపదంబు లొగి సమాసములు గూర్చు
కడల స్త్రీలింగములకు దీర్ఘములు కురుచ
లగుచునుండు నొకొక్కచో నాంధ్రకృతుల
రమ్యధవళాంగ కలశనీరధినిషంగ.

30


క.

పదిదినము లైదుప్రొద్దులు
పదఁపడి రెణ్నాళ్ళు నొక్కపగలున్ రేయిన్
గదనంబుఁ జేసి మడిసిరి
నదిసుతగురుకర్ణశల్యనాగపురీశుల్.

31

అథర్వణభారతము

గీ.

.....అన జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె
ధరణిధవదత్తవివిధోపధావిధాస
మార్జిత శ్రీవినిర్జితనిర్జరాల
యేశ్వరుఁడు తిమ్మభూపతి యీశ్వరుండు.

32

ఆముక్తమాల్యద

చ.

[2]అపుడు పురంధ్రివర్గవృతయై చరణాంకకృతార్ధమైన క
ప్రఁపునునుమ్రుగ్గుపై మకరపద్మము లేర్పడ వీక్షణప్రభా
స్నపనవిచిత్రకుట్టిమమునన్ వరనీరనిధుల్ జనింప న
న్నృపమణి భాగ్యలక్ష్మికరణిం దరుణీమణి వచ్చె నొయ్యనన్.

33

వసుచరిత్ర

మ.

కనకక్షోణిధరంబు కార్ముకముగా కద్రూతనూజుండు సిం
జినిగా మాధవుఁ డమ్ముగాఁ బురముల క్షీణైకదోశ్శక్తిఁ గె
ల్చినజోదీశ్వరుఁ డిచ్చుగాత జయలక్ష్మీసుస్థిరైశ్వర్యశో
భనముల్ పెద్దయసింగమంత్రికి జగతఖ్యా తసత్కీర్తికిన్.

34

నైషధము

ఇది సమాసప్రకరణం బింక క్రియలు విశేషణం బెఱింగించెద.

క్రియావిశేషణప్రకరణము

1 లక్షణము

గీ.

పృథివి స్థావరతిర్యక్ప్రభృతులకెల్ల
క్రియలఁ దగు నేకవచనముల్ కీర్తిదముగ
దేవమనుజాదికక్రియల్ దెలుప నేక
వచనబహువచనంబులై వరలు నీశ.

1

స్థావరతిర్యక్పదములకు క్రియ యేకవచన మగుటకు

శా.

ఆకంపించె జగత్రయంబు దిశ లల్లాడెన్ సముద్రంబు లు
ద్రేకించె న్భయమందె భూతములు భేదిల్లెన్ గులక్ష్మాధ్రముల్ ....

2

కాశీఖండము

చ.

ఒరగె వసుంధరాస్థలి మహోరగనాథుఁడు వంగెఁ గూర్మమున్
దరలె నభంబు మ్రోసె సురదంతులు మ్రొగ్గె దిగంతరంబు ల
త్తరి నదిరెన్ మరుత్సుతుఁడు దర్ప మెలర్ప నహార్య ముద్ధతిం
బెరుకఁగ గోత్రశైలములు పెల్లదరెన్ గలగెం బయోధులున్.

3

భాస్కరరామాయణము

గీ.

కరులు ధాత్రీతలంబు గ్రక్కదలనడచె.

4

శల్యపర్వము

క.

ఉద్భిజ్జములు జరాయు
ప్రోద్భూతము లండజాతములు స్వేదజముల్

తద్భూమండలిఁ జచ్చి మ
హాద్భుతముగఁ బుట్టె హాలహలకంథరులై.

5

కాశీఖండము

2 లక్షణము

గీ.

తెలుఁగుగృతులందు స్త్రీలింగములకు స్త్రీన
పుంసకంబులచేతనంబుల విశేష
ణంబులగు గౌరి శుభదృష్టి నవశుభప్ర
దాయిని శుభప్రదం బన ధనదమిత్ర.

6

స్త్రీలింగమునకు స్త్రీలింగవిశేషణ మగుటకు

భారతార్థమందు౼

ఆ.

వెలయు నఖిలభువనములలోన వారణ
నగరిపురమతల్లి నా దనర్చి
రాజ్యలక్ష్మి మిగులఁ బ్రబల నయోధ్య నా
రాజవినుతిఁ గన్న రాజధాని.

7

రాఘవపాండవీయము

స్త్రీలింగమునకు సపుంసకలింగము విశేషణమగుటకు

క.

వరుణపురి సర్వలోకో
త్తర ముజ్వలమణిమయము సితప్రభ మతిసుం
దర మందుండున్ వరుణుఁడు
వరుణానీసహితుఁడై ధ్రువంబుగ నెమ్మిన్.

8

సభాపర్వము

మ.

దివిజాధీశుసుధర్మయన్ సభ సముద్వీక్షింపు భూదేవ రెం
డవకైలాసమువోలె నున్నయది బ్రహ్మాండంబుతో రాయుచున్
ధవళాశీష్వధరాట్టహాసవిమలద్రాఘిష్టశృంగాటమై
యవదాతధ్వజశాటికాంచలచపేటాధూతజీమూతమై.

9


సీ.

ఆవేశచూర్ణంబు లఖిలేంద్రియములకు
                  శృంగారరససముజ్జీవనములు
శంబరాంతకభుజాజయకీర్తిమహిమలు
                  కోకదంపతికి దృక్కూలశిఖలు
బ్రహ్మాండపురవీథిరత్నతోరణములు
                  యామినీకర్పూరహారలతలు
నీరదాధ్వాంభోజినీబిసాంకురములు
                  కుముదకాననముల కూర్మిచెలులు


గీ.

గరళకంఠాట్టహాసంబు గర్వరేఖ
కైటభారాతీనతనాభికమలశోభ
చంద్రికలు గాయుచున్నవి సాంద్రలీల
భువన మిది యెద్ది పరమభాగవతులార.

10

కాశీఖండము

3 లక్షణము

క.

తెలుఁగునఁ బ్రాణిపదంబులు
వెలిగా బహువచనమునకు విస్పష్టముగా
నిలుచును విశేషణంబై
పొలుపొందఁగ నేకవచనము మఖధ్వంసీ.

11


మాలిని.

సురపతిఁ సభఁ జూడంజూడ నంగారవృష్టుల్

గురిసెఁ గులిశధారల్ గుంఠితంబయ్యె దిక్కుం
జరమదము లడంగెన్ సర్వదిక్పాలకాంతః
కరణములు భయోద్వేగంబున న్సంచలించెన్.

12

ఆదిపర్వము

వ.

ఇందులోఁ గులిశధారలు కుంఠితంబులయ్యె ననుటకుఁ గుంఠితంబయ్యెనని బహువచనమునకు, ఏకవచనమువిశేషణము బెట్టినాడు.

4 లక్షణము

గీ.

కలిగి యనునట్టియర్థంబు దెలుపుచోట
నిలుపఁదగు నైయను పదంబు దెలుఁగునందు
గొడుగు లరిగెలుఁ బడగలు ఘోటకములు
నై విభుం డొప్పె ననఁగఁ గాయజవిభంగ.

13


మ.

హిమవంతంబున కేఁగి యొక్కయెడ నందేకాంత మొక్కర్తు నీ
రముఁ గృష్ణాజినముం గమండలువునై రాగంబు వంచించి సం
యమముం గైకొనియున్నఁ జేరఁజని పుణ్యాకారమున్ యౌవనో
ద్యమముం గాంతియుఁ జూచి రావణుఁడు కామాయత్తుఁడై యిట్లనున్.

14

ఉత్తరరామాయణము

క.

అరుణాశ్వంబులు బూచిన
యరదముపై వీడె నిడుపు లగుచేతులు బం
ధురకంధరంబు వెడలుపు
టురమునునై ద్రోణుఁ డొప్పె నుత్తర కంటే.

15

విరాటపర్వము

సీ.

తెల్లనిగొడుగును వెల్లసిడమునునై
                  యల్లవాఁడే పాండవాగ్రజుండు ...

16

ద్రోణపర్వము

5 లక్షణము

క.

కలవాఁ డనుచోఁ గలఁ డనఁ
గలవారె యటన్నచోటఁ గలరె యటంచుం
బలుకంగఁ జనును గృతుల
న్నలినభవాదికనిలింపనాయక భర్గా.

17

కలవాఁ డనుచోటఁ గలఁ డనుటకు

క.

సమరథుఁడు బిరుదులక్ష్మణ
కుమారుఁడు గదిసి మొనలు గోల్తలజేయన్
మిము నెల్ల మిగులుభుజగ
ర్వము మదమును గలఁడు గొనఁ డరాతుల నధిపా.

18

ఉద్యోగపర్వము

ఆ.

చనునె నీకు నిట్టిసాహసక్రియ సేయ
నెల్లవారికంటె నెఱుక గలవు
గురుభుజుండ నాకుఁ గూర్తేనిసేయకు
మయ్య యిట్టిచెయ్వు లనఘ యింక.

19

అరణ్యపర్వము

కలవారె యనుచోట కలరె యనుటకు

ఆ.

చట్టబన్నిదంబు చరచితి మట్లుగా
ననిన బాము లెల్ల వనయ మిదియుఁ

దల్లి బంచెనే నధర్మంబు సేయంగఁ
దగునె యెఱుకగలరె మగువ లెందు.

20

ఆదిపర్వము

క.

ఆమితంబగు నీతపముమ
హిమ యెఱుఁగక యిట్లు చేసె నిది దీని సహిం
పుము మత్సైన్యంబు నిరో
ధము వాపుమ యెఱుకగలరె తరుణులు ధరణిన్.

21


ఇది క్రియావిశేషణప్రకరణం బింక ప్రాసప్రకరణం బెఱింగించెద.

ప్రాసప్రకరణము

1 లక్షణము

గీ.

ఋత్వరషలపయి న్వచ్చు నత్వమునకు
ణత్వ మాదేశ మొదవు నా నణల కెపుడున్
ప్రాసమైత్రి దనర్చు గోపతితురంగ
ధృతనభోగంగ కుక్కుటాధీశలింగ.

1


క.

త్రిణయ మని రాణివాసము
నణిమాద్యైశ్వర్యవితరణామరతరువున్
మణికర్ణికముక్తివధూ
మణికర్ణికఁ దలఁచుఁ దపసి మానసవీథిన్.

2

కాశీఖండము

క.

అనుటయుఁ గృష్ణ ద్వైపా
యనతనయుం డిట్టు లనియె నవహితమతివై
విను మతిగుహ్యము నారా
యణకవచము భక్తవాంఛితార్థప్రదమున్.

3

శృంగారషష్టం

క.

పో నుద్యోగము జేసిన
ప్రాణంబా యింక నీకు పాథేయంబా
మానిని మందస్మితమధు
రాననచంద్రికలు గ్రోలి యరుగుము పిదపన్.

4

మధుసేనము

క.

ప్రాణాపానవ్యానో
దానసమానములు దృప్తి దలకొనజేయం
గా నోపెడునది యన్నమ
ప్రాణం బన నన్న మనగఁ బర్యాయంబుల్.

5

కాశీఖండము

2 లక్షణము

క.

స్వరగణమయ్యు ఋకారము
బరికింపఁగ రేఫతోడఁ బ్రాసంబగుచుం
గర మొప్పు వట్రసుడి యు
బ్బరముగఁ బెరహల్లుతోడఁ బ్రాస మగు శివా.

6

ఋకారరేఫలకు

క.

ఆఋషికుమారు గట్టిన
చీరలు మృదులములు కడువిచిత్రములు మనో
హారము లతనిబృహత్కటి
భారమునం దొక్కకనకపట్టము వ్రేలున్.

7

ఆరణ్యపర్వము

వట్రసుడికి

క.

[3]చావరు నొవ్వరు పాండవు
లేవురు నని నీవు చెప్ప నిప్పలుకులు దుః
ఖావేశకరములై చో
తోవృత్తి దహింపఁజొచ్చె దుర్భరభంగిన్.

8

కర్ణపర్వము

క.

[4]ఈకృష్ణునిసారథ్యము
నాకృష్ణుని గాండివంబునై దోపక ము
న్నీకొలఁదిఁ జక్కఁబడి నీ
వీకురువంశంబు గావు మిభపురనాథా.

9

ఉద్యోగపర్వము

3 లక్షణము

గీ.

ఆంధ్రగీర్వాణముల నొకయక్షరమున
కంటి వచ్చిన క్రారల కరయ మైత్రి
జెల్లు ప్రాసంబులను గూర్పఁ దెల్లమిగను
బన్నగాధీశకేయూరభయవిదూర.

10


క.

యేప్రొద్దు శూద్రముని విగ|
తప్రాణుం జేసి తీవు ధర్మనిరతి నా
విప్రశిశువు చైతన్యం
బాప్రొద్ద యనూనముగ సమాహితమయ్యెన్.

11

ఉత్తరరామాయణము

4 లక్షణము

గీ.

[5]కబ్బముల కౢప్తియనుస్వర ల్కార మితర
హల్లుతో ప్రాసముల గూర్పఁ జెల్లు మును మ
హాకవీంద్రులు గడఁగి పద్యముల నిలుపు
టల నుమాధీశ పీఠపట్టణనివేశ.

12

శా.

లోకత్రాణరతిన్ దదాగమమహాలోకప్రవేశోత్కభా
షాకౢప్తప్రథమద్వితీయపదగుంజన్ మంజుమంజీరగ
ర్జాకల్పామరరామభారతకథాసర్గంబులన్ మించువా
ల్మీకివ్యాసులఁ గొల్చెదం దదుభయశ్లేషార్ధసంసిద్ధికిన్.

13

రాఘవపాండవీయము

5 లక్షణము

ఆ.

అందముగ గకారహల్లుపై నితరాను
నాసికప్రసక్తి చేసినపుడు
దిఙ్నగం బనంగ దిగ్నగం బనఁగను
ప్రాస మిరుదెరఁగులఁ బరఁగు శర్వ.

14


క.

అగ్నిహతి జేసి మానవ
భుగ్నివహము మరణబాధ బొందింపుచు మూఁ
డగ్నులయొద్దను నాలవ
యగ్ని యనన్ వెలుఁగుచున్న యమ్మునినాథున్.

15

ఆదిపర్వము

6 లక్షణము

ఆ.

బమలు బిందుపూర్వకముగ బ్రాసంబుల
నిలుపఁ జెల్లు లళల కిల నభేద
మొదవుఁ గృతులయందు నుడురాజకోటీర
దురితదూర పీఠపురవిహార.

16

బమలకు

.
ఉ.

యిమ్ముగ సర్వలోకజను లెవ్వనియేని ముఖామృతాంశుబిం
బమ్మున నుద్భవంబయిన భారతవాగమృతంబుఁ గర్ణరం

ధ్రమ్మనునంజలిం దవిలి త్రావుదు రట్టిమునీంద్రలోకవం
ద్యుంబరముం బరాశరసుతుం బ్రణమిల్లి కరంబు భక్తితోన్.

17

ఆదిపర్వము

ఉ.

అమ్మఖవాజి బాండుతనయాధ్వరవాహ మెదిర్చి మోము మో
వం బసివెట్టి హేషితరవంబున............................

18

జైమినిభారతము

లళలకు

ఉ.

ప్రల్లదమేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాద్రితుల్యుఁడై
త్రెళ్ళుఁడు వానిదైన పృథుదేహము వెల్వడి తేజ మంబరం
బెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరుదేహముఁ జొచ్చె విస్మయో
త్ఫుల్లవిశాలనేత్రులయి భూపతులందఱుఁ జూచుచుండఁగన్.

19

సభాపర్వము

7 లక్షణము

క.

లడలకు నభేద మనుచున్
వెడగులు గడుబ్రాసములను విశ్రమముల ను
బ్బడరఁగఁ గలుపుదు రది యె
య్యెడ లనుభవ్యంబు గాదు హిమకరమకుటా.

20


ఆ.

మొసలి మొసడి వ్యాళమును వ్యాడమును వ్రీళ
వ్రీడ వెలుడుటయును వెడలుటయును
దళము దడము నాగ దనరు పదంబుల
లడలు రెండుఁ జెల్లు నుడుపభూష.

21


ఆ.

వెలుడెన న్పదంబు వెడలుటయంచు ల
క్ష్యంబు నైషధమున నరసి లడల

కిల నభేద మనుచు నల ముద్దరాజు రా
మన వచించెఁ దలఁప నది హుళిక్కి.

22


క.

కలవు వివరింపఁగా నా
ఖ్యలు వరుస నిర్గమించె ననుటకు ధరలో
వెలువడియె వెళ్ళె వెడలెను
వెలు డెననం జిత్ప్రకాశ విశ్వాధీశా.

23

ఆంధ్రనామసంగ్రహము

వ.

అని పైడిపాటి లక్ష్మణకవి చెప్పినాడు గనుక వెలుడెన నిన్నికద్దు.


చ.

చిలుకలుఁ గూయునో చెవులు చిందరవోవగనంచు నెన్నడున్
వెలుడడు నందనోపవనవీథులకై యటు మౌళిభాగని
ర్మలశశిరేఖ సేయునపరాధమునన్ గజదైత్యశాసనుం
గొలువఁడు పాకశాసనుఁడు కోమలి నీదెస కూర్మిపెంపునన్.

24

నైషధము

క.

వెలుడి చనుదెంచె నపు డ
ప్పలభుక్కుల కన్యవన్యఫలభుక్కులకుం
గలనయ్యె నందుఁ జేకొని
గెలుపునఁ గపివీరు లొడ్డగిలదొరకొనినన్.

25

రామాభ్యుదయము

దడ మనుటకు

క.

కొడుకులుఁ దానును గుఱ్ఱపు
దడములు పెక్కైనబలవితానము దగుమై
నడిపింపుచు మేలపుసం
గడములతో నపుడు శౌరి కడునొప్పారెన్.

26

భీష్మపర్వము

మొసడి యనుటకు

తరల.

ఇది సొరంగ నయోగ్య మెవ్వరి కిందువంశవరేణ్య వి
న్మిదియ కా దివి యేను తీర్థము లీసముద్రతటంబునన్
విదితముల్ దురితాపహంబులు వీని నెవ్వరు మున్గనో
డుదురు సన్మును లిందు కార్మొసడుల్ వడిం గొను జొచ్చినన్.

27

ఆదిపర్వము

వ్రీళ యనుటకు

క.

బాలోన్మత్తపిశాచద
శాలంబనమున జరించు నంగడివీథిన్
వ్రీళాశూన్యత గంఠే
కాలునిపాదములమీఁదఁ గల్గువిరాళిన్.

28

భీమఖండము

వ.

ఈశబ్దములు వినాగాను మిగిలినశబ్దములు ప్రయోగములు లేవు గనుక లడలకు మైత్రి లేదు.

8 లక్షణము

గీ.

అర్ధబిందువు నిర్బిందు వగు పదముల
ప్రాసములు దీర్ఘములమీఁదఁ బలుకఁ జెల్లుఁ
ననుచుఁ దగ ముద్దరాజు రామన వచించె
హ్రస్వములమీఁద నటువలె నలరు రుద్ర.

29


గీ.

అర్ధబిందువై తేలిన యట్టిటపల
కరయ ప్రాసంబు నిర్బిందువైన నమరు

వీఁపు మూఁపును మరి తలమోపు నయ్యె
మాటలేటికి ధాత్రి దాఁబేటి కనఁగ.

30


వ.

అని అనంతుఁడు ట ప లకు మాత్రమె చెప్పినాడు గాని అన్నిటికిఁ గద్దు.


క.

నాకొఱఁత దీర్చి వచ్చి ఆ
నీకొఱఁతయ యింక సూతునిం దెగ జూడన్
లోకము వంచింపఁగఁ దగు
చీఁకటి యొదవె నిఁక నేమి సేయుదుఁ జెపుమా.

31

విరాటపర్వము

క.

వీఁక బరతెంచి నలుగడ
దాఁకి నకులుఁ డరిగె ఘోరతరశరహతి నా
మూకలు విరియఁగ నర్జునుఁ
డాకరముగఁ దాఁకె నుగ్రుఁడై రణభూమిన్.

32

ఆదిపర్వము

ద్విపద.

మూఁగి చరించు నమ్మొకరితుమ్మెదల
బా గొప్పుకొప్పునఁ బ్రబలినదాని

33

రంగనాథుని రామాయణము

క.

ఆచింతామణి ముని దన
పీచ మణఁచుదాఁక నీక పృథులోభముచే
దాఁచుకొనుఁగాక నాచే
నీచే నిఁక మోసపోవునే నరనాథా.

34

వరాహపురాణము

క.

మీటుఁగలరథికులను నొక
నాటను వేవుర వధింతు నరుశరములునో
నాటిపడవైచునంతకు
వేఁటాడెదఁ బ్రతిబలంబు వీరుల నెల్లన్.

35

ఉద్యోగపర్వము

క.

ఓడితిమె యేము రణమునఁ
గ్రీడికి గేడించి రాక గెలుపే యతఁడున్
వేఁడీ డాఁగెనొ కోమా
తోడిబవరమట్లుఁ దాను దొలఁగంజనునే.

36

ద్రోణపర్వము

క.

ఆతఁడును బుష్కరిణియను
నాతికి వైరిణిసమాఖ్యు నందనుఁ గనియెం
బ్రీతి యెసఁగ నుత్పలయను
గోఁతి యతనివలనఁ గాంచెఁ గొడుకుల వరుసన్

37

ఎఱ్ఱాప్రగడ హరివంశము

క.

ఆపన్నగముఖ్యులఁ దన
వీఁపునఁ బెట్టుకొని పఱచి విపినముల మహా
ద్వీపములు నదులు నిఖిలది
శాపాలపురములు జూపి చని వారలకున్.

38

ఆదిపర్వము

క.

ఆ పార్థుఁడు కోపానల
దీపితుఁడై విశిఖిశిఖలఁ దీవ్రనిహతి న

త్తూఁపులగమి యేర్చి జముని
కోపు గుడువఁబనిచె వారిఁ గురువంశనిధీ!

39

ద్రోణపర్వము

కురుచలమీఁది అర్ధబిందువులకు

చ.

తగవులఁబోక రాజు బెడిదమ్ములు పల్కినయేని సైఁచి యొ
ప్పఁగనిలు మీగురుత్వ ముడుపంగలవారికిఁ బెద్దవారిమా
టఁ గొనమి యాసుయోధనుకడ న్నిలుచున్ మనమెల్ల గౌరవం
బుగఁ గులవృద్ధుపల్కుఁ దలపుం జననిచ్చిన మెచ్చరే జనుల్.

40

ఉద్యోగపర్వము

క.

తగ నక్కురువృద్ధునకు నొ
సఁగె నాటికి నెల్లదృష్టి సాత్యవతేయుం
డగణితతపఃప్రభావం
బు గని యధికవిస్మయంబుఁ బొంద జనంబుల్.

41

ఆశ్రమవాసపర్వము

9 లక్షణము

గీ.

అక్కజంబుగ నేర్తను నట్టిపదము
లోని రేఫం బొక్కచో లోపమొందు
నేర్తు రన నేతు రనఁగను నేర్చి నేచి
యనఁగ బ్రాసంబులను గూర్ప మనసిజారి.

42


ద్విపద.

నీతల లందంద నేలపైఁ గూల్ప
నేతునే వీక్షింప నిర్జరవైరి

43

రంగనాథుని రామాయణము

క.

ద్యూతక్రీడకుఁ గొండొక
నేతుం గపటమున నొప్పనిజనంబులు నా
చేతిధనమెల్లఁ గొని పరి
భూతి యొనర్చిన విరక్తిఁ బొడమి వెడలితిన్.

44

విరాటపర్వము

క.

కాచికొని వచ్చితగ నా
నేచినయ ట్లచటనచట నిల్పితి మునినా
థా చేటును భంగంబును
నై చిత్తము శోకమునకు నగ్గంబయ్యెన్.

45

ఇది ప్రాసప్రకరణం బింక యతిప్రకరణం బెఱింగించెద.


విశ్రమప్రకరణము

1 లక్షణము

క.

స్వరవర్గాఖండప్లుత
సరసప్రాదులును బిందుసంయుక్తములు
బొరి నెక్కటిపోలికలును
విరతులు పదికబ్బములను వెలయు మహేశా.

1


వ.

మఱియు వృద్ధివికల్పాభేదప్రభునామవిభాగానునాసికకాకు
నిత్యాదివిరమణంబులు చక్కటివళ్ళును నసమాసనం ఞసమాస ని
త్యసమాసాది విశ్రమంబులుననం గొన్నిభేదంబులు గలవు వానితె
ఱం గెఱింగించెద.

స్వరవడికి

2 లక్షణము

గీ.

ఓలిన ఆలు నైఔలు నొక్కటగును
లీల నీ ఈల్ ఋకార మేఏలు నొకటి
తలప నూఊలు నోఓలు గలయ నొకటి
స్వరవిరామంబు లివి కరివదనజనక.

2

అఆలకు

సీ.

అవనిభారదురీణతాధరీకృతమహా
                  క్రోడప్రధానుఁ డల్లాడరెడ్డి....

3

కాశీఖండము

ఇఈలకు ఋకారము వచ్చుటకు

గీ.

ఈశ్వరద్రోహి గర్వాంధఋషివరేణ్య
బంధునాశైకకారణ పాపకర్మ
చావుమని యొక్కపెట్టునఁ జక్రధార
దక్షుతల ద్రెళ్ళవైచె ఫాలాక్షసుతుఁడు.

4

కాశీఖండము

వ.

కడమ యీలాగే తెలుసుకొనునది.

వర్గవడికి

3 లక్షణము

క.

అడరఁగఁ గచటతపంబుల
కడ నొక్కకవర్ణ ముడుప కడమవి నాల్గుం
దొడరి తమతమకె వళ్ళగు
మృడ పీఠపురీనివేశ మృత్యువినాశా.|

5


సీ.

కమనీయరాజశిఖామణికవిరాజ
                  గర్వమహీధ్రనిర్ఘాతమునకు
చతురకీర్తికి హితచ్ఛవికి నాయోధన
                  జయశీలునకు గుణఝంపునకును
టంకితరాయకఠారిసాళువునకు
                  డంబలాంఛనలోలఢాలునకును
తత్వపురాణకథారసవేదికి
                  దానదయాధర్మధామమతికి

గీ.

పశుపతిప్రాప్తిసామ్రాజ్యఫలున కబ్జ
బంధుబంధురతేజోవిభాసురునకు
విశ్వవిభునకు సరిలేరు విశ్వజగతి
ననిన నివి వర్గవళులనఁ దనరుఁ గృతుల.

6

పెద్దరాజు కావ్యాలంకారచూడామణి

అఖండవడికి

4 లక్షణము

గీ.

హల్లునకు హల్లు వడి యిడు నడుపు దాని
తుదిని స్వరము ఘటిల్లిన నది యఖండ
వడి యనఁగఁ బొల్చుఁ గృతుల దేవాదిదేవ
యనుచుఁ జెప్పిన శైలకన్యాధినాథ.

7


ఉ.

అన్నవు తండ్రియట్ల విను నంతియ గా దటమీఁద రాజ వే
మన్న గొఱంత లేదు మణిమండనముఖ్యము లైన కానుక
ల్మున్నుగ సీత నిచ్చి జనలోకపతిన్ శరణంబు వేఁడుమీ
సన్నఁపుఁగార్యము ల్వలదు నందియ మే లటుగాక తక్కినన్.

8

భాస్కరరామాయణము

ఉ.

ఆ కులవృత్తి రాఘవుశరాగ్రమునందుఁ దృణాగ్రలగ్న నీ
రాకృతి వార్ధి నిల్చుట దశాననుఁ డీల్గుట మిథ్య గాదె వా
ల్మీకులు జెప్పకున్నఁ గృతి లేని నరేశ్వరువర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్.

9

భైరవుని శ్రీరంగమహాత్మ్యము

ఉ.

తారక జిచ్ఛిఖండి శివతాండవ మాడ గతండు మర్దలో
దారరవంబు మేఘనినదంబని చేరినఁ జూచి నాశికా
ద్వారబిలంబు జన్నిదఁపువ్యాళముఁ జొచ్చినఁ దొండ మెత్తి ఘీం
కారముఁ జేసి నవ్వు వెనకయ్య కృతీశ్వరు మంచుఁ గావుతన్.

10

అరుణాచలపురాణము

చ.

అలరులబంతిజృంభికకు నడ్డము సేయుచుఁ గర్ణపాళి లే
తలుకులు ద్రోయుమేనఁ బ్రమదాస్యులు నొయ్యన గోర మీటుచున్.

11

మనుచరిత్ర

వ.

ఇట్టి ప్రయోగములు కలవు గాని త్రికవుల ప్రయోగములు లేవు గనుక ఇది సుప్రయోగము కాదు.

5 లక్షణము

క.

అక్కఱ తెమ్మెరరూపఱ
గ్రక్కదలఁగ నోలమాసక్రచ్చఱయనునీ
పెక్కుపదము లిరుదెఱఁగుల
నిక్కముగ నఖండవడి గణించిరి సుకవుల్.

12


వ.

ఈశబ్దములమీఁద వచ్చినవి అఖండయతులని కొందఱన్నారు.

అక్క ఱనుటకు

సీ.

మునిమాపు బలుగంబమునఁ బుట్టి బంటు న
                  క్కఱఁ దీరిచిన నృసింహంబ వీవ ... ...

13

పారిజాతాపహరణము

హల్లునకు

,
మ.

నెఱయం బున్నమచందురుం జెనయు నీనెమ్మోమునున్ జెక్కులుం
జిఱున వ్వొప్పఁగఁ జూడనీక పుటకల్ చెల్వొందనిం గ్రుచ్చి య
క్కఱతోడం బొరినక్కు నంగరమువీకం జేర్పనీ కెమ్మెయిన్
వరఁతం ద్రోవఁగఁ జేసెనే యకట దైవం బెందుఁజొత్తు న్సుతా.

14

ఆరణ్యపర్వము

గీ.

కరులు ధాత్రీతలమ్ము గ్రక్కదల నడచె

15

ఓలమాస యనుటకు

.
గీ.

అని విచారించుచుండె నయ్యవనినాథుఁ
డంతకయ మున్న నలునిఁగా నతని నెఱిఁగి
యెదురుగద్దియ డిగ్గి పృథ్వీశతనయ
యవనికాంతరమున నోలమాస గొనియె.

16

నైషధము

వ.

అరుయనుట తరుగుట యర్థముగనుక క్రచ్చఱ, రూపఱ, ఉక్కఱ యను పదములు అచ్చు హల్లులు రెంటియందును యతులౌను.

అచ్చునకు

చ.

తఱియగునంతకున్ రిపు నుదగ్రత సైచుట నీతి నీవు నా
కఱపినయట్లు సేయుము తగంజని యాతనిఁ గాంచి నన్ను నే
తెఱఁగుననైనఁ బొందఁగ మదిం దలపోతయ కల్గెనేనిఁ గ్ర
చ్చఱ మునివర్గవాహనుఁడవై జనుదెమ్మనుమంతఁ దీరెడున్.

17

ఉద్యోగపర్వము

హల్లునకు

చ.

చిఱునగ వొప్ప గాండివముఁ జెచ్చెర సజ్యముఁ జేసి సేన లు
క్కఱ రభసంబు మైనడరఁ గవ్వడి ద్రౌణియు నీడవోక య
త్తఱిఁ దరుమంగ నస్త్రములు దందడి మార్కొని మండుచుండెఁ జి
చ్చఱపిడుగు ల్వడిందొరుగుచాడ్పున నంబరవీథి నుగ్రమై.

18

విరాటపర్వము

ప్లుతవడికి

6 లక్షణము

క.

క్రమ మొప్పఁగ దూరాహ్వా
నములన్ గానముల రోదనంబుల సందే
హములఁ బ్లుత మొదవు నదియున్
రమణత్రినేతాన్వితంబు రాజకిరీటా.

19

దూరాహ్వానమునకు

ఉ.

ఓవసుధమహేంద్రకరుణోదధి యీదడ వేల బ్రోవరా
వే వసుభూపయంచు నెలుగెత్తె వెస న్మొరవెట్టుచాడ్పునన్.

20

వసుచరిత్ర

గానప్లుతమునకు

శా.

కాండావిర్భవభాండభూపరివృఢగ్రైవేయశైలేయసూ
కాండాటాధిపకేతుమాతులబలాకాశస్రవంతీమరు
త్కాండాఖండలతుండిపాండురయశఃకర్పూరపేటీభవ
త్కాండారాయని మంత్రిభాస్కరుని కొండాదండనాథాగ్రణీ.

21

వ.

గానప్లుత మనఁగా స్తుతి చేయుటయందు వచ్చునది.

రోదనప్లుతమునకు

ఉ.

ఏజనకాత్మజన్ దశరథేశ్వరుకోడల రాముభార్య జుం
డో జనులార యడ్డపడరో సురలార సురారి కంచు నం
భోజదళాక్షి శైలవనభూములు దాఁటుచు భీతి నేగుచో
నీజలరాశిఁ జూచి మది నెంత దలంకెనొ యేమి సేయుదున్.

22

భాస్కరరామాయణము

సంశయప్లుతమునకు

చ.

హరిహయుఁ డేమి యయ్యె నొకదామదనానలతాపవేదన
న్వరుణుఁడు విప్రయోగమున వాడఁడె యింతకు దండపాణి దా
విరహభరంబున న్మిగులవేగఁడె నొవ్వఁడె వీతిహోత్రుఁడున్
స్మరశరకేళికాననసమాగతమందసమీరణంబునన్.

23

నైషధము

ఉ.

యేగతి యోగరూపము వహించెదొ యేగతి ప్రౌఢి మించెదో
యేగతి వేళఁ గాంచెదవొ యేకతమున్న వధూజనంబు నీ
వేగతిఁ బల్కరించెదవొ యిష్టసఖా భవదీయనీతికా
ర్యాగతి నేడు చూతముగదా యని యెంచిన నాక్షణంబునన్.

24

వసుచరిత్ర

సరసవడికి

7 లక్షణము

క.

పరగు న్నణ లొండొంటికి
సరవిన్ శషసలు దనర్చుఁ చఛజఝములకుం

బరికింప నయహ లేకము
సరసవిరామంబు లివి నిశాకరమకుటా.

25


చ.

అమరపతి న్వరించెదవొ హవ్యవహుంజరణంబుఁ ద్రొక్కెదో
శమనునిఁ జెట్టవట్టెదవొ సాగరవల్లభుఁ బెండ్లియాడెదో . . .

26

నైషధము

ప్రాదివళ్ళకు

3 లక్షణము

క.

ఉపసర్గలు ప్రపరాపస
మపిసుప్రత్యభ్యుదాఙ్గ్వ్యవాధ్యత్యనుష
ర్యుపనిర్దుర్నిప్రభృతు ల
హిపధరనిం దొడవు విరతు లిలఁ బ్రాదియతుల్.

27


టీక.

ప్ర।పర।అప।సమ్।అపి।సు।ప్రతి।అభి।ఉత్।అఙ్।వి।అవ।అధి।అతి।అను।పరి।ఉప।నిర్।దుర్।ని॥ ఇవి 20 ప్రాదులు.


సీ.

ప్రమదాజనేక్షణప్రార్థితసౌందర్య
                  యాచకసంతతప్రార్ధనియ్య
పృథివీసురప్రజాభీష్టసందాయక
                  యిభముఖ్యసైన్యకాభీష్టయాత్ర
పరమధర్మక్రియోపాయసంచితకీర్తి
                  యరిదుర్గసాధనోపాయవేది
వినిధశాస్త్రాగమవీక్షణతాత్పర్య
                  యిందిరాసత్కృపావీక్షణియ్య


ఆ.

ప్రబలతరగుణీనిరంతరవైభవ
యష్టసిద్ధిబలనిరంతరాయ

పరగుచుండు నివియ ప్రాదులు యతు లన
విద్వదంబుజార్క విక్రమార్క.

28

విక్రమార్కచరిత్ర

వ.

మఱియు నచ్చుహల్లులకుఁ జెప్పుచున్నాను.

హల్లునకు

గీ.

ప్రాణబంధువుఁ డైనయప్పక్షివిభుఁడు
అభ్రమార్గంబునం దొయ్య ననుసరించి . . . . . .

29

నైషధము

అచ్చునకు

గీ.

రజకితో డనుదక్యతో శ్రమణితోడ
విధవతో నాథుతో రాయువెలఁదితోడఁ
జెడిపితోడుతఁ బోరామి సేయఁదగదు
ప్రాణసంకటమైన పుణ్యాంగనలకు.

30

కాశీఖండము

ఉ.

అత్తకు భక్తి గల్గి తగ నాయమ జెప్పినమాట్కి జీవికా
వృత్తము లావహింతు గురువిప్రసురాతిథిపూజనంబు ల
త్యుత్తమభక్తి నేన తగనోపి యొనర్తుఁ బ్రియంబుఁ దాల్మియున్
మెత్తదనంబు సంతతము మేలుగఁ దాల్తు సమస్తభంగులన్.

31

ఆదిపర్వము

ఉ.

అంత సుయోధనుండు హృదయంబున విస్మయ మంది యంత వృ
త్తాంతము స్వప్నవృత్తము క్రియం దలపోసి నిజంబ కాఁగ న |

త్యంతము నిశ్చయించుచుఁ బృథాసుతులన్ సమరంబులోన ని
ర్జింతునకాక యంచు వికసిల్లె దురాసదభగ్నబుద్ధియై.

32

భారతము

బిందువళ్ళకు

9 లక్షణము

ఆ.

వరుస టతపవర్గవర్ణచతుష్కముల్
పిరుద సున్నలూని నెరియ నంత్య
వర్ణములకుఁ గృతుల వళులగు నవి బిందు
యతు లటండ్రు సుకవు లభ్రకేశ.

33


సీ.

నందనోద్యానమందారకచ్ఛాయల
                  విశ్రమింపఁగ నీకు వేడ్కగాదె. . . . . .

34

నైషధము

మణిమయస్తంభశుంభద్వీపకళికలు
                  వేనవే లిరువంక వెలుఁగుచుండ......

35

రామాభ్యుదయము

వర్గవర్ణములు మొదట నుండగా నంత్యవర్ణములు తుది నుండుటకు

సీ.

సనకాదిదివిజమస్కరిబాలగోపిచం
                  దనపుండ్రపాళికల్ నాకి నాకి. . . . . .

36

ఆముక్తమాల్యద

ఉ.

ఆకరివేల్పుసామిచరణాబ్జములం జనియించినారు మం
దాకినితోడునీడలయినారు నిజమ్ముగఁ గమ్మకట్టు దా
మై కమనీయకీర్తి మహిమాతిశయంబుల మించినారు భ
ద్రాకృతు లద్రిధీరులు ప్రభాద్రులు మాద్రులు శూద్రు లప్పురిన్.

37

తెనాలి రామలింగయ హరివిలాసము

క.

కడుదడవు నిద్రపోతిం
బడతీ నను దెలుపవలదె మఱియొక్కరుఁ డె
క్కుడుజవమునఁ బట్టి బలం
బెడలఁగ ననుఁ దిగిచె నాతఁ డెవ్వఁడు చెపుమా.

38

అరణ్యపర్వము

సంయుక్తవళ్ళకు

10 లక్షణము

ఆ.

వళులపట్ల ద్విత్వవర్ణంబు నిలిచిన
నిరుదెఱంగు యతికిఁ బరగుచుండు
క్ష్మావిభుండు భువనమహితయశుం డన
క్ష్మాశతాంగ దక్షసవనభంగ.

39


సీ.

నందీశ్వరక్షిప్తనారంగఫలపాక
                  తరలవిద్యాధరీస్తనభరములు.........

40

శ్రీనాథుని హరవిలాసము

[6]స్త్నానశబ్దము స త న కారములకు సంయుక్తయతికిఁ జెల్లును.

ఉ.

స్త్నానముఁ జేసి ధౌతపరిధానముఁ గట్టి...........

41

హరవిలాసము

గీ.

స్త్నానమును సంధ్యయును బితృతర్పణంబు......

42

విష్ణుభజనానందము

సీ.

స్త్నానంబు దీర్చి ధౌతములైన వస్త్రముల్
                  ధరియించి సాంధ్యకృత్యములు నడిపి......

43

మత్స్యపురాణము

ఎక్కటివళ్ళకు

11 లక్షణము

క.

అక్కజముగ మరవఱలా
టొక్కొక్కటి తమకుఁ దమరె యొనరఁగ వళులై
చక్కంబడి కబ్బంబుల
నెక్కటివళు లనఁగఁ దనరు నిభదైత్యహరా.

44

మకారమునకు

చ.

మదనుఁడు రెండుచేతులను మార్పడ నేసెడుతూఁపులో యనన్...

45

నైషధము

రేఫకు

గీ.

రాజబింబమునందు సారము హరించి
చేసినాడు విధాత యీచెలువమోము.....

46


వ.

కడమ యీలాగే తెలిసికొనునది.

పోలికవళ్ళకు

12 లక్షణము

క.

తగిలి ముకారము కడునిం
పుగఁ బోలికవడి యనంగఁ బుఫుబుభుల కగుం

దగమూల్ బూలగు నెడనొ
ప్పుగ సుకవులసత్ప్రబంధములఁ బరమేశా.

47


క.

ఎట్టివిశిష్టకులంబునఁ
బుట్టిన సదసద్వివేకములు గల్గినఁ దాఁ
గట్టినకర్మఫలంబులు
నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్.

48

వృద్ధివళ్ళకు

13 లక్షణము

క.

పూని యకారాంతంబుల
పై నే ఓ లదుక నదియె పన్నుగ నై ఔ
లై నిలచి వృద్ధివళు లనఁ
గా నిరుదెఱఁగులఁ బొసంగు గౌరీరమణా.

49

ఏకారమునకు

మ.

అనురాగాకృతి కందకందళము భోగైకాంతసారంబు యౌ
వనసర్వస్వ మశేషవిభ్రమకళాస్వాంతంబు విశ్వైకమో
హనశృంగారరహస్య మంగజువిజృంభావాహనాగ్రక్షణం
బు నరేశాత్మజచూట్కి గ్రోలె నపు డాభూపాలసౌందర్యమున్.

50

కవికర్ణరసాయనము

ఉ.

ఆకమలాక్షి రూపమహిమాతిశయంబు మనోహరంబు భో
గైకపరాయణుల్ పురుషు లంగజుఁ డప్రతికారచేష్టిత
స్వీకృతలోకుఁ డట్లగుటఁ జేటు పురంబున వారి కెప్పుడుం
గా కెటులుండు నట్టియవగాఢపుపొత్తు మనంగవచ్చునే.

51

విరాటపర్వము

సీ.

ఎవ్వాని సత్యదానైకవిలాసంబు
                  లారూఢతరతులాపూరుషంబు . . . . .

52

పారిజాతాపహరణము

శా.

శ్రీకాశీనగరాధిరాజ్యపదవీసింహాసనాభ్యాసిలో
కైకగ్రామణి విశ్వనాథుఁడు విశాలాక్షీమనోభర్త......

53

కాశీఖండము

ఓకారమునకు

శా.

నీకంఠార్పితకాలపాశము శిరోనిర్ఘాతపాతంబులం
కౌకస్సంచరకాళరాత్రిగళబద్ధోదగ్రకాళాహిక
న్యాకారాగతమృత్యువుం జనకకన్యం వేగ మొప్పించి లో
కైకత్రాణుని రామునిన్ గనుము నీ కా బుద్ధి గాకుండినన్.

54

భాస్కరుని రామాయణము

గీ.

వీటిపెద్దతలారి నిశ్శాటికలికి!
దిస్సమొలవేల్పు పార్వతీదేవిపట్టి
కైలభైరవు ఘుర్ఘురగణపరీతు
నుసరించిరి మునులు నాకౌకసులును

55

కాశీఖండము

వికల్పయతులకు

14 లక్షణము

ఆ.

నలి గకారహల్లు నమలతోఁ బొదలి ది
ఙ్నగము దిగ్నగంబు నాగ వాఙ్మ
నములు వాగ్మనములు నాగ గబ్బముల వి
కల్పయతులు రెంటఁ గలుగు నభవ.

56

క.

జ్ఞానంబు వడయుటకు వా
ఙ్మానసములు సునిహతములు గావింతురు స
న్మానితశాంతికొఱకు వి
జ్ఞానంబున కాత్మనియతి సలుపుదురు బుధుల్

57

శాంతిపర్వము

వ.

కడమ యీలాగే తెలిసికొనునది. ఇందుకు.

15 లక్షణము

గీ.

అమర నుద్ధతపదము పద్యములు నిలుపు
నపుడు వళు లిరుదెరఁగుల నగుచునుండు
హరిమహోగ్రాహవాంగణోద్ధతుఁడు శౌరి
దనుజసంపద్ధరణగుణోద్ధతుఁ డన శివ.

58


వ.

ఇవయు వికల్పయతు లన్నారు.

అచ్చునకు

సీ.

అరివీరభటమహోద్ధతి నబ్ధి గంపింప
                  దురమున నిల్చి తద్రోహిఁ దునిమి

59

వసుచరిత్రము

హల్లునకు

ద్విపద.

అలఘుబలోదీర్ణు నాకుంభకర్ణు
తల ద్రెవ్వనేసి యుద్ధతి మించియున్న

60

రంగనాథరామాయణము

సీ.

తరుణార్కకబళనోద్ధతిఁ జూపె నెవ్వాఁడు
                  రుచులచే ఫలమోహరుచులచేత

61

వసుచరిత్రము

అభేదవళ్ళకు

16 లక్షణము

క.

కృతుల పఫబభలు వాకున్
యతి నిలుప నభేదవిరతి యనఁగాఁ బరగున్
శతమఖముఖనిఖిలమరు
త్ప్రతతిస్తుతచారుచరణ వనజాతశివా.

62


క.

ఉరగకళేబర మంసాం
తరమునఁ బడి వ్రేలుచునికిఁ దలఁపక యచల
స్థిరుఁడై పరమధ్యానా
పరతేంద్రియవృత్తినున్నవాని శమీకున్.

63

ఆదిపర్వము

ఉ.

వారలు వారిభూరిపరివారముతోన విమాన మెక్కి రా
గా రఘునందనుండు గిరికాంచనతోరణచిత్రకేతన
ద్వారనికా మైన నిజపట్టణ ముత్సుకవృత్తిఁ జొచ్చి నిం
డారుముదంబునన్ భరతునాకృతి వ్రాలినలీలఁ గ్రాలఁగన్.

64

ఉత్తరరామాయణము

క.

కోరి యనేకయుగంబుల
పారతపోయుక్తులయినవారికిఁ బడయన్
దూరమునీసభ మఱి నీ
కారుణ్యం బంతకంటెఁ గడుదవ్వెందున్.

65

అరణ్యపర్వము

వబయో రభేదమునకు

మత్త.

ధీరు లీధృతరాష్ట్రపాండు లతిప్రశస్తగుణుల్ ప్రసి
ద్ధోరుకీర్తులు నాకు నిద్దఱు నొక్కరూప తలంపఁగా

వీరు వా రనునట్టిబుద్ధివిభేద మెన్నఁడు లేదు గాం
ధారిపుత్రశతంబునందుఁ బృథాతనూజులయందున్.

66

ఆదిపర్వము

ఉ.

నేఁటికిఁ జెల్లెఁగాక రజనీచరకోటికి నెల్లినింకఁ బో
దాఁటి కవాటముల్ విరుగదాఁచుట చేతులతీఁట వోక మై
తీఁటలు వోవ రక్కసులఁ దీర్చుట రాముఁ డొనర్పకున్నె పెన్
వేఁటకు రావణాదిమృగబృందముఁ దార్చుటలంచుఁ దార్చినన్.

67

భాస్కరునిరామాయణము

క.

పరిజనములకున్ నీకున్
ధరలోన సగంబె చాలు తక్కినసగముం
గర ముచితంబుగఁ బాండవ
వరునకు ధర్మజుని కిచ్చి బ్రతుకుము పుత్రా.

68

ఉద్యోగపర్వము

ఉ.

వాలికెచూపు మత్తవనబర్హికిశోరపులాస్యలీలపై
వ్రాలిచి పచ్చకప్పురపువాసనతోడి ముఖారవిందతాం
బూలము మోవిమోవిపయి మోపుచు రాధిక కిచ్చు ధూర్తగో
పాలుఁడు బ్రోచుఁగావుత నపారకృపామతి మంత్రియన్ననిన్.

69

భీమఖండము

17 లక్షణము

క.

రలల కభేదం బని యి
మ్ములఁ గొందఱు వసుచరిత్రమున లక్ష్యము ని
శ్చలగతి నారసి కలుఁగం
బలుకుదు రది యెల్ల కల్ల పర్వతనిలయా.

70

శా.

ఓలోలంబకయోలయోలలనయోలోలంచు మేలంబునన్
లోలంబాలక యోర్తు గ్రుంకి బిసవల్లుల్ దున్మి తూఁటాడి కెం
గేలం బూని తటాలున న్నెగసె నక్షీణాంబునాదాంబుజా
క్షీలోకంబు జయించి వారలయశశ్శ్రీఁ దెచ్చుచందంబునన్.

71

వసుచరిత్ర

వ.

లోలంబాలక యోర్తు గ్రుంకి యనఁగా = లో = నీళ్లలోను, లంబాలక యనంగా = విస్తారమైన అలకములు గలది యోర్తు గ్రుంకి యిక్కడనే రోలంబాలక = తుమ్మెదలవంటి అలకములుగలదని రేఫలకారములకు అభేదముఁ జెప్పుచున్నారు. ఇటువంటి ప్రయోగములు మఱి యెక్కడను లేవు గనుక రోలంబాలకయను పాఠము కాదు. లోలంబాలక యనియే చెప్పుకొనునది. కనుక రేఫలకారములకు మైత్రి లేదు. నిఘంటువు। సమో రోలంబ లోలంబౌ రేఖా లేఖాచ కధ్య తే। తథా మార్జార మార్జాలౌ తరుణీ తలునీతిచ॥ అనియు॥ క. కేళాదిరాయ యభినవ। లీలామకరాంకచంద్ర లేఖాంకుర . . . . . అన్నచోట రేఖాంకురమని నైషధమం దున్నదనుకొనిరి. "రేఖా లేఖాచ కథ్య తే” అని ద్విరూపకోశమందుఁ జెప్పినాడు గనుక "లేఖాంకుర" యని మూడోపాఠమే సిద్ధము.

72

ప్రభునామయతికి

18 లక్షణము

ఆ.

అమ్మ యక్క యప్ప యయ్య యన్నయు నని
పలుకుచోట నూదఁబడక రెండు
చందములను వళులు జెందును ప్రభునామ
విరమణము లనంగ వృషతురంగ.

73

అచ్చుకు

మ.

జయధాటీసమయంబులన్ విలయజంఝామారుతాడంబరా
క్షయరంహఃప్రవిజృంభమాణఘననిస్సాణోగ్రభేరీస్వనం
బయి యొడ్డాదిభయంకరోడ్డమరశౌర్యంబైన శ్రీరెడ్డిదొ
డ్డయ యల్లాడనృపాలరాహునకు బిట్టల్లాడు దిక్చక్రముల్.

74

కాశీఖండము

ద్విపద.

శ్రీకరరుచిసాంద్ర చిరయశోరుండ్ర
ఆకారచంద్ర రామయభాస్కరేంద్ర

75

రుక్మాంగదచరిత్ర

మ.

అమలోదాత్తమనీషమై నుభయకావ్యప్రౌఢి భావించు శి
ల్పమునం బారఁగుఁ డంగళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ స
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాఖ్యుండ సన్మాన్యుఁడన్.

76

ఉత్తరరామాయణము

హల్లునకు

సీ.

కూరిమితమ్ముఁడు గుంటూరివిభుఁడు కొ
                  మ్మనదండనాథుండు మహితకీర్తి

77

విరాటపర్వము

మ.

అనతారాతివసుంధరారమణసప్తాంగాపహారక్రియా
ఘనసంరంభవిజృంభమాణపటుదోఃఖడ్గద్వితీయార్జునుం
డనవేమాధిపరాజ్యభారభరణవ్యాపారదక్షుండు పె
ద్దనమంత్రీశుఁడు మామిడన్నసుతుఁ డేతన్మాత్రుఁడే చూడఁగన్.

78

నైషధము

విభాగవడికి

19 లక్షణము

ఆ.

ఇచ్చె నృపుఁడు దోసిడేసిహొన్నులు నేఁబ
దేసిమణులు నెలమి ద్విజుల కనఁగ
సరవితోఁ బ్రమాణసంఖ్యాపదముల పై
నగు విభాగయతులు నగనివేశ.

79


గీ.

నీవు చేసినదోషంబు నీకె యుండె
దీర్ఘదోషంబు మాకు నింతేసి యేల
మొగమునం దున్న నీదైన్యముద్రఁ జూచి
కరుణ జనియింపఁ గాచితి ధరణినాథ.

80

హరిశ్చంద్రోపాఖ్యానము

గీ.

అప్పటికి నియ్యకొంటిగా కబ్జవదన
ఋషులపాళంబులే యింతలేసిపనులు
కొసర కాఁబోతు నాఁబోతుఁ గ్రుమ్ములాడ
నడిమి లేఁబెయ్యదెస వచ్చె నాకు నిపుడు.

81

కాశీఖండము

గీ.

కొదమసంపెంగపూవులగుత్తి పుష్ప
లావియొక్కతె శ్రీవత్సలాంఛనునకు
దర్శనం బిచ్చెమత్పయోధరము లింత
లేసి గలవని తెలిపెడులీలతోడ.

82

రాధామాధవసంవాదము

అనునాసికవళ్ళకు

20 లక్షణము

క.

కవిసమ్మతులం గృతులన్
టవర్గచతురక్షరములు డాపలిసున్నం
గవసినయెడ నణలకు వళు
లవు నవి యనునాసికాఖ్యయతులు మహేశా.

84


క.

బలవంతుఁడైన వాలికిఁ
దలఁకుచుఁ గిష్కింధ వెడలి త్వరలో నలుది
క్కులకుం బారి మహీమం
డలమెల్లను జూచినాడ నాడు నరేంద్రా.

85

మల్లిఖార్జునభట్లకిష్కింధాకాండ

సీ.

నిగమచోరకుని ఖండించిన యలతయో
                  యబ్ధిలో గిరి వేచినట్టి యలతొ

86

సూరన్న పరమయోగివిలాసము

ఉ.

హస్తగృహీతపుస్తకమునందు లిఖించినయట్టి నీలకం
ఠస్తవముం బఠింపుచు ఘనస్థిరధీగుణవైభవోన్నతుల్
విస్తరిలంగఁ బాలకుల వేవురలో శిరియాలుఁ డొప్పె న
ధ్యస్తలిపిప్రపంచుఁడు గ్రహంబులలో నుడురాజుకైవడిన్.

87

శ్రీనాథునిహరవిలాసము

శా.

శ్రీరంగేశ్వరనాభిపంకజరజశ్రీకంటెఁ జోళేంద్రత
న్వీరాజత్కుచపాళిమంజరులకంటెన్ సహ్యభూభృత్తటీ
నీరంధ్రోజ్వలగైరికద్రవముకటెన్ వన్నెఁ గావించెఁ గా
వేరీతోయము కృష్ణరాయఁహితోర్వీనాథరక్తప్రభన్.

88

పారిజాతాపహరణము

కాకుస్వరవడికి

21 లక్షణము

క.

శోకభయసంశయాదులఁ
బ్రాకటముగఁ బ్రశ్నలందుఁ బ్రభవించుస్వరం
బేకాకునందుఁ బొడముం
గాకుస్వరయతు లనంగ గర్వవిభంగా.

88


మ.

అనుమానింపక తోడఁబుట్టువుల కాదా తున్మి తూఁటాడ నెం
దును గ్రొన్నెత్తురుటేరులై పరప నింద్రుఁ డుగ్రతం దైత్యులన్
మును లవ్వీరు భజింపరో క్రతువు లామోదంబుతో నమ్మహా
త్మునిఁ జేయింపరొ యూర్థ్వలోక మది గాదో యేలడో నాకమున్.

89

శాంతిపర్వము

ద్విపద.

అట్టినామీద నీవా యెదిర్చెదవు
పట్టిచట్టలు వాడి పారవైచెదను

90

రంగనాథుని రామాయణము

ఉ.

అక్కట గంధవాహ తగవా హరిణాంకునిఁ గూడి......

91

మనుచరిత్ర

ఉ.

అప్పుడు భీష్ములేమి హృదయంబున నుమ్మలికంబు గూరఁగా
నెప్పటిచందము ల్విడిచి యేడ్తెర దక్కినచూపు లొండొరున్
రెప్పలమాటునన్ బొలయ నీసుతుపాలికి వచ్చు రాజులం
దిప్పు డితండు రావలువదేయని కర్ణుఁ దలంచి రందఱున్.

92

ద్రోణపర్వము

శా.

ఏణీశాబకలోలనేత్ర కనుఁగొంటే వీరు విద్యాధరుల్
మాణిక్యోజ్వలకర్ణకుండలులు సంబంధాసిధేనుల్ రణ

ద్వీణాపాణులు చంద్రికామలశిరోవేష్టుల్ త్రిపుండ్రాంకితుల్
న్యాణియ్యస్తరతారహారులు శివధ్యానైకనిష్టాపరుల్.

93

పారిజాతాపహరణము

నిత్యవడికి

22 లక్షణము

క.

విదితముగ నేని యనియెడు
పద మన్యపదంబుతోడ పద్యంబులలో
నదుకునెడ నిరుదెరంగులఁ
బొదవున్ నిత్యయతి యనఁగ భుజగవిభూషా.

94


గీ.

రాజవరుఁ డైనపార్థివరాజు గాని
యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని
నెల్లవారలు జూడంగ నీక్షణంబ
రాజుఁ జేయుదు నే నంగరాజ్య మిచ్చి.

95

ఆదిపర్వము

గీ.

ఎట్టియపరాధ మొనరించెనేని తల్లి
కొడుకు శపియింప దిభ్భంగిఁ గ్రూరబుద్ధి
నతివ సత్యంబుఁ జెప్పు మెవ్వతెవు నీవు
నావుఁడును శాపభీతి నన్నలిననేత్ర.

96

కాశీఖండము

రెండోవిధమునకు

మత్తకోకిల.

మానితంబగు నాతపోమహిమం ద్రిలోకపరాభవం
బేను జేయఁగఁబూని చేసితి నిట్టిదొక్కప్రతిజ్ఞమున్

దీని నెట్టులు గ్రమ్మరింతు మదీయభాషిత మెన్నడు
న్నేని మోఘము గాదు దిగ్ధరణీరవిందు లెఱుంగఁగాన్.

97

ఆదిపర్వము

శా.

వానప్రస్థునిఁ జంపి యొక్కవడితో స్వర్నాధుఁడుం ద్రుంగు ధా
త్రీనాథుండన నెంతవాఁడట విచారింపంగ నీ కెంత నే
ర్పే నింపొప్ప శిరంబు వ్రక్కలయి తప్పెం దప్పె నీకృత్య మ
జ్ఞానంబుం గడునోడి చెప్పితివి పశ్చాత్తాపతప్తుండవై.

98

రామాయణము

వడికి

23 లక్షణము

క.

భావింప ఋకారమునకు
రీవిశ్రమ మిడఁగఁ జెల్లుఁ గృతులఁ గవీంద్రుల్
ధీవైఖరి విలసిల్లఁగ
భావజదుర్గర్వహరణ పర్వతశరణా.

99


సీ.

ప్రతిఘటించుచిగుళ్ళు పై నెఱ్ఱబారిన
                  రీతి నున్నవి వీని మృదుపదములు....

100

మనుచరిత్ర

సీ.

ఋత్విజుండని విచారించి పూజించితే
                  ద్వైపాయనుం డుండ ధర్మయుక్తి....

101

సభాపర్వము

శా.

తృష్ణాతంతునిబద్ధబద్ధులగు రాధేయదుల న్నచ్చి శ్రీ
కృష్ణుం గేవలమర్త్యుఁగాఁ దలఁచి మర్దింపంగ నుత్సాహవ

ర్ధిష్ణుండయ్యె సుయోధనుం డకట ధాత్రీనాథ యూహింపుమా
యుష్ణీషంబునఁ గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాలమున్.

102

అథర్వణభారతము

సీ.గీ.

రాయవేశ్యాభుజంగ వీరప్రతాప
భాసి యల్లాడనృపువీరభద్రనృపతి
సర్వసర్వంసహామహాచక్రభరము
పృథుభుజాపీఠమున సంభరించుటయును.

103

భీమఖండము

చక్కటివడులకు

24 లక్షణము

క.

అభినవగతిఁ గృతులం బుఫు
బుభులకుఁ జక్కటి యనంగ మూయతి చెల్లున్
ఋభువిభునుతచరణాంబుజ
యిభదనుజవిభంగ కుక్కుటేశ్వరలింగా.

104


సీ.

ఉరగవల్లీగాఢపరిరంభణంబులఁ
                  బోకమ్రాఁకులసొంపు మురువుకొనఁగ. . .

105

కాశీఖండము

సీ.గీ.

భువనబీజంబు కైవల్యమోక్షదాయి
యఖలకల్యాణకారి విశ్వాద్భుతంబు!
పూజకొనియెను మురభిదంబుజభవాది
దేవతాకోటిచే సంప్రతిష్ఠఁ బొంది.

106

భీమఖండము

గీ.

పెక్కుమారులు వడి వీచి ద్రెక్కొనంగ
వరలి వారిధిలోపల వైవ నతఁడు

ముక్తకేశాంబరోజ్వలభూషుఁ డగుచుఁ
బడి రసాతలగతుఁడయ్యె బలము దక్కి.

107

భాస్కరుని రామాయణము

గీ.

అగరువేవిలివిరవాదియాకుఁదీగె
మల్లియలుగొజ్జగలుదాకమొల్లమొగలి
మొదలుగా నివి యెప్పుడుఁ బూచి కాచి
యుండుతోటల మీనుఖానుండు నిలిపె.

108

యయాతి చరిత్ర

క.

అని యతని భ్రమయ నడచుచు
మును దత్సతి నిలిపి చనిన భూజముకడకుం
గొనిపోవ నచట నది లే
కునికిఁ బునశ్శోకవహ్ని నుల్ల మెరియఁగాన్.

109

అనంతుని భోజరాజీయము

క.

అత్తరి విటనాగరికలు
చిత్తములు వసంతకేలి చివురొత్తంగా
మొత్తములు గట్టి తరిచిరి
ముత్తెపుజల్లులకుఁ దోడి బూరటగొమ్మల్.

110

నాచనసోముని వసంతవిలాసము

చ.

పరిచయుగాగ నేలె నిరపాయచరిత్రుని శత్రుకానన
స్ఫురదురువీతిహోత్రుని సముజ్వలమేరుసమానగాత్రునిం
బరమపవిత్రునిన్ మునిసుపర్వవరస్తుతిపాత్రుని న్మనో
హరఫలశేముషీకబళితాంబుజమిత్రుని వాయుపుత్రునిన్.

111

శ్రీరంగపురాణము

నసమాస నఞ్ సమాసయతులకు

25 లక్షణము

తే.

సరవిన సమాసనఞ్ సమాసములు కృతుల
నచ్చుహల్లులు రెంటికి నగును వళులు
నాకలోకాధిపప్రణుతాంఘ్రియుగళ
నాగకేయూరసంభృతానంతభువన.

112

నఞ్ సమాసమునకు

హల్లునకు

క.

మును వెరతు నేయ మీరలు
నను నేసినఁ గాని యనుఁడు నాకేశసుతున్
ధనురాచార్యుఁడు డెబ్బది
సునిసితబాణంబు లేసెఁ జూపఱు బెగడన్.

113

విరాటపర్వము

."
గీ.

ఎన్నకకు రోమకూపంబు లెన్ని గలవు
దివ్యవర్షంబు లన్ని మోదించు సాధ్వి
నాకభువనంబునం దాత్మనాథుఁ గూడి
వెర పొకింతయు లేక చిచ్చురికెనేని.

114

కాశీఖండము

అచ్చునకు

ఉ.

ప్రాకటదర్పులై సకలరాయని లక్కనృపాలు నాజిలో
దాకు విరోధిసైన్యము ముదంబొదవన్ వరియింపవచ్చుచో

నాకసమెల్లఁ గ్రందుకొను నంచితదివ్యవిమానసంచర
న్నాకవిలాసినీచరణహంసకు భూరిఝణంఝణధ్వనుల్.

115

గవర్రాజు

సీ.గీ.

రాజసము తేజరిల్ల నీరాజుఁ గూడి
యింపుసొంపులు వెలయింపఁ గ్రీడింపవలదె
నాకలోకంబువారలకైన లేని
యలఘుతరభోగభాగ్యముల్ గలఫలంబు.

116

విజయవిలాసము

నాస్తికశబ్దమునకు

హల్లునకు

శా.

ఆనిష్ఠానిధి గేహసిమనడు రే యాలించినం జాలు నెం
తే నాగేంద్రశయానుపుణ్యకథలున్ దివ్యప్రబంధానుసం
ధానధ్వానము నాస్తి శాకబహుతా నాస్త్యుష్ణతా నాస్త్యపూ
పో నాస్త్యోదనసౌష్ఠవంచ కృపయా భోక్తవ్య మన్మాటలున్.

117

ఆముక్తమాల్యద

అచ్చునకు

సీ.గీ.

తల్లిదండ్రియు దైవంబుఁ దలఁప గురుఁడ
కాడె యతఁ డేమి చేసినఁ గనలఁదగునె
నాస్తికాధమ యోరి యన్యాయవృత్తి
నాస్తి తత్వం గురోః పరం బనఁగ వినవె.

118

శృంగారషష్టము

నఞ్ సమాసమునకు

హల్లునకు

ఉ.

మ్రొగ్గెడువాహనంబులును మోములు ద్రెళ్లఁగఁ బారు వాజులుం
డిగ్గితొలంగు సైనికు లనేకులు కష్ట పుపాటు చొప్పడన్
మ్రగ్గుసిడంబులుం గులము మాటికి నెంచి యెదిర్చి యొంటి మై
మ్రగైడువారునై కురుధరావరు సైన్యము రూపుమాయఁగన్.

119

విరాటపర్వము

చ.

మలచి పయోజకోశములమాడ్కి నొనర్చిన పద్మరాగపుం
గలశపుటెఱ్ఱడాల్ బొమిడికంబులతో నపరంజియోడుబి
ళ్ల లనలవైజయంతము జలంబున గెల్వఁగ దంసితంబులై
నిలచినమాడ్కి మాడువు లనేకము లుల్లసిలుం బురంబునన్.

120

ఆముక్తమాల్యద

అచ్చునకు

గీ.

ఇవ్విధంబున మఱియు ననేకగతుల
లలితశృంగారచేష్టల లాచిలాచి
చూచుచున్నట్టి ప్రమ్లోచిఁ జూచి మునికి
మనసు గురగురమనియె ఝమ్మనియె నొడలు.

121

కవులషష్ఠము

గీ.

చిత్తగింపు మనాదిసంసిద్ధమైన
యొక్కపుణ్యేతిహాసము సూనచరిత
శిశిరగిరిరాజసంప్రతిష్ఠితవిశుద్ధ
రత్నలింగేశమహిమ విభ్రాజితంబు.

122

కాశీఖండము

ఉ.

ఆశ్రితపోషణంబున ననంతవిలాసమున న్మనీషివి
ద్యాశ్రమతత్వవిత్త్వమున దానగుణాభిరతిన్ సమస్తవి
ద్యాశ్రమధర్మరక్షణమహామహిమన్ మహి నొప్పు సర్వలో
కాశ్రయుఁ డాదిరాజునిభుఁ డత్యకలంకచరిత్రసంపదన్.

123

ఆదిపర్వము

నిత్యసమాసవళులకు

26 లక్షణము

క.

పదము విభజించి చెప్పఁగఁ
బొదవ నిదియు నన్యశబ్దమున విగ్రహముం
గదియించు నదియు భుజగాం
గద నిత్యసమాస మండ్రు ఘనులగు నార్యుల్.

124


గీ.

బాదరాయణ నారాయణాదులు నుప
రాయణ రసాయన జనార్దనాదిశబ్ద
ములును వాతాయనపదంబు మొదలుగాఁగ
నలరు నిత్యసమాసంబు లగుచు నభవ.

125


వ.

వీలిమీద వచ్చిన యతులు నిత్యసమాసయతులు. అచ్చు హల్లులు రెంటను వచ్చును.

నారాణశబ్దమునకు

ఉ.

పాయక పాకశాసనికి భారతభారరణంబునాటి నా
రాయణు నట్లు దానును ధరామరవంశవిభూషణుండు నా
రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడుం దనకిష్టుఁడున్ సహా
ధ్యాయుఁడు నైనవాఁ డభిమతస్థితిఁ దోడయి నిర్వహింపఁగన్.

126

ఆదిపర్వము

వ.

ఈ పద్యములో అచ్చు హల్లులు రెంటికిని యున్నది.

రసాయనశబ్దమునకు

గీ.

మఱ్ఱిమాత్రంబె పిల్లలమఱ్ఱి పేరు
పేరువలె గాదు శారదాపీఠకంబు
వారిలోపల పినవీరు వాక్యసరణి
సరసులకు నెల్ల కర్ణరసాయనంబు.

127

జైమినీభారతము

అచ్చునకు

క.

రాయంచలగుండెబెదరు
మాయామంత్రము విముక్తమానచ్యుతి క
త్యాయతమయూరకర్ణర
సాయన మనఁ ప్రథమజలధరారవ మెసఁగెన్.

128

ఎఱ్ఱాప్రగడ హరివంశము

జనార్దనశబ్దహల్లునకు

చ.

నగినగి యేనియున్ విను జనార్దన యెన్నడు బొంకువల్క ద
త్యగణితవిక్రమోరుబలధైర్యసమగ్రుల మెల్లభంగి గా
లగతి దలంగఁ ద్రోవగు బలంబగునే యగుగాక నీకు మె
చ్చుగ నిలఁ బ్రాణమిచ్చెదము స్రుక్కము చావున కాత్మ నేమియున్.

129

ఎఱ్ఱాప్రగడ అరణ్యపర్వము

అచ్చునకు

చ.

అపుడు విరించిసూనుఁడు జనార్దనునెయ్యపువాలుగంటిఁ జూ
చి పడతి నీమనోరమణుఁ జేకొను మిప్పుడు నీకు నిత్తునా

నపరిమితప్రమోదభరితాననయై వెసనిచ్చె వేలుపుం
దపసికి రత్నభూషణవితానము లన్నియు నిష్క్రయంబుగన్.

130

పారిజాతాపహరణము

వాతాయనశబ్దహల్లునకు

సీ.

తరుణులుఁ బతులు వాతాయనంబుల నుల్ల
                  మలర వేఁబోకల మలయుపవన...

131

విరాటపర్వము

అచ్చునకు

సీ.

తనయశోవిశదముక్తాసౌధపాళికి
                  నంబుదాయనము వాతాయనముగ...

132

వసుచరిత్ర

27 లక్షణము

గీ.

స్వాంతవేదండమార్తాండసాంగములు గ
వాక్షకర్ణాటపదము లేకాంతశబ్ద
మరయ నాపోశనపదంబు నటులె రెండు
తెరగుల విరామములకగు త్రిపురమధన.

133


వ.

విశ్వామిత్రశబ్దము నిటువలెనే నడుచును.

స్వాంతశబ్దహల్లునకు

ఉ.

స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధముఁ గాఁగ శంక యా
వంతయు లేక కీచకుఁ డహంకృతి ముంగిలి నాగమంటపా
భ్యంతరసీమఁ జొచ్చి దరియంజని యారసి సజ్జ గాంచి య

త్యంతమదావహంబగుడు నందు రయంబున గేలు సాపఁగన్.

134

విరాటపర్వము

అచ్చునకు

గీ.

అధికరోషకషాయితస్వాంతుఁడైన
నరపతికి విన్నవించకు నాయవస్థ
పైత్యదోషోదయంబునఁ బరుసనైన
జిహ్వకును బంచదారయుఁ జేఁదు గాదె.

135

నైషధము

ఉ.

సంతతభక్తియుక్తిఁ గొనసాగకయుండిన నుండనిమ్ము దై
త్యాంతకపాడపద్మములయందు నొకానొకయప్పు డే నిజ
స్వాంతము దద్గుణాభిరతుఁడై నరుఁ డెవ్వఁడు గీలుకొల్పువాఁ
డంతకు దద్భటాలిఁ గలనైననుఁ జూడఁడు భూవరోత్తమా.

136

శృంగారషష్ఠము

వేదండశబ్దహల్లునకు

ఉ.

పాండునృపాలనందనులు పావని మున్నుగఁ జేసి యట్లు భీ
ష్ముండుఁ గడంక మైనడుచుచోటికిఁ జక్కటి గాఁగ ద్రోచి యొం
డొండ కడంగి సేన తనయుబ్బున కుబ్బఁగ నన్యసైన్యవే
దండముఖాంగముల్ తృణవితానముగాఁ గొని నిర్వికారుఁడై.

137

భీష్మపర్వము

అచ్చునకు

మత్తకోకిల.

దండితాహితవీరసూరి నిధానదానవిధాన కో
దండపార్ధ పరాక్రమప్రియధామ దిక్పరిపూరితా
ఖండపాండుయశోనిధీ పరగండభైరవవైరి వే

దండతండవిదారిఘోరతరాసిభాసిభుజార్గళా.

138

ఆదిపర్వము

మార్తాండశబ్ద హల్లునకు

మ.

ధరణీచక్రము దిర్దిరం దిరిగె మార్తాండుం డకుంఠీభవ
త్కిరణుం డయ్యె దిశావితానము వడంకెన్ మిన్నదర్చెన్ మహీ
ధరసంతానము లోలి గ్రక్కదలె నుద్ర్భాంతంబులై యంబుధుల్
పొరలెన్ గట్టులమీఁద బిట్టుపిడుగుల్ మ్రోసెన్ మహోగ్రాగ్రతన్.

139

ఆదిపర్వము

అచ్చునకు

సీ.గీ.

వలువదు భయంబు వారెంతవారలైన
నట్టివారలు మనకగ్గమైనవారు
వారు నిరయంబునకుఁ గాఁపువచ్చువార
లనుచు బుద్ధిగఁ జెప్పె మార్తాండసుతుఁడు.

140

శృంగారషష్ఠము

సాంగశబ్దహల్లునకు

సీ.

సాంగంబు లగుచున్న సకలవేదంబులు
                  జదివె వశిష్ఠుతో సకలధర్మ

141

ఆదిపర్వము

ఉ.

హంససమానగామినికి నట్టివినూతనగర్భశుద్ధికిం
బుంసవనాదికృత్యములు భూపశిఖామణియార్యసంసదా
శంసితకర్మకర్మఠత సాంగముగా నొనరింప నన్వయో
త్తంసుఁ గుమారునిం గనియె దర్పకు నిందిరగన్నకైవడిన్.

142

శృంగారషష్ఠము

అచ్చునకు

ఆ.

సకలకురుకుమారచాపశిక్షాచార్యుఁ
డాజి దుస్సహుండు సాంగవేద
వేది నీతిశాస్త్రవిదుఁడు............

143

విరాటపర్వము

ఆ.

సాంగవేదవేది యగుపురోహితుఁ డెప్డు
నగర మేలవలయుఁ దగవుఁ గృపయు
జక్కటియును గల్గు సముచిదప్పనములు
నరులు నరయఁబనుచునది విభుండు.

144

శాంతిపర్వము

వ.

సాదర సాంబశబ్దములును నీలాగే నడచును.


క.

ఇది బ్రహ్మ వశిష్ఠునకున్
సదయుండై చెప్పె నతఁడు సాదరమున నా
రదునకు విదితము చేసిన
మదాత్మకుం దేటపరచె మహనీయకృపన్.

145

శాంతిపర్వము

క.

ఈదృశసుగుణాకల్పున
కాదిమభాగవతిహితసమంచితచర్యా
హ్లాదితఫణితల్పునకున్
సాదరజల్పునకు సత్యసంకల్పునకున్.

146

వరాహపురాణము

ఆ.

సాంబుఁ బాయుమనుచుఁ జారుధేష్ణుఁ డేఁగి
వేగవంతుఁ దాకి వీఁకతోడ.......

147

ఆరణ్యపర్వము

గవాక్షశబ్దహల్లునకు

.
చ.

వనితయొకర్తు మున్గొని గవాక్షతలంబుల నింతు లుండుటం
గనుఁగొనజోటిలేమి నొకకార్యముపేరిట బాలనోర్తు వం
చన దొలఁగంగ నిల్చి రభసంబునఁ దత్సతిజాలకంబు చే
కొని హరిఁ జూచె గేకిసలు గొట్టుచు బోటులు దాని నవ్వఁగన్.

186

పారిజాతాపహరణము

అచ్చునకు

చ.

అపుడు సమీరచోరుఁడు గవాక్షపుగన్నపుగండి దూరి ర
త్యపరిమితాతిభేదపరితార్పితకోమలమంచకస్వప
చ్చపలవిలోచనావదనసౌరభవిత్తము దోఁచుబల్మి నీ
విపినము చేర వెంటఁ గుయివెళ్ళ మదాళిభటప్రతాపముల్.

187

కట్టవరపు చిట్టిరాజు ద్వాదశరాజచరిత్ర

కర్ణాటశబ్దహల్లునకు

మ.

కుసునుం బద్దిన చీరకొంగు వొలయం గ్రొవ్వారుపాలిండ్లపై
ద్రిసరంబు ల్పొలుపార వేణి యవటూదేశంబుపై రాయఁగా
పస నెవ్వాడొ యొకండు రాత్రి సురతప్రౌఢిం దనుం దన్పిన
న్వసివాళ్వాడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనం గంటిరే.

188

శ్రీనాథుని వీథినాటకము

అచ్చునకు

శా.

లాటీచందనచర్చ చోళమహిళాలావణ్యసామగ్రి క
ర్ణాటీగీతకళాసరస్వతి కళింగాంతఃపురీమల్లికా
వాటీమంజరి గౌళవామనయనావక్షోజహారాళియై
పాటింపందగు నీయశంబు ధరణీ పాలాగ్రణీ సాహిణీ.

189

భాస్కరరామాయణము

శా.

ధాటీఘోటకరత్నఘట్టన మిళద్రాఘిష్టకల్యాణఘం
టాటంకారవిలుంఠలుంఠితమహోన్మత్తాహితక్షోణి భృ
త్కోటీఢాకితకుంభినీధరమహాకూటాటవీఝాట క
ర్ణాటాంధ్రాధిప సాంబరాయనితెనుంగా నీకు బ్రహ్మాయువౌ.

152

శ్రీనాథునిహరవిలాసము

ఏకాంతశబ్దహల్లునకు

గీ.

కామభోగములకును నేకాంతగృహము
పొలిచి పొలిచియు ధర్మార్ధములకు నిదియె
యాస్పదంబు సవర్గత్రయానిరుద్ధు
లైనఁ జనుటంతయును నొప్పు నప్పురంబు.

153

ఆదిపర్వము

సీ.

ఊర్థ్వలాంగూల మత్యున్నతధ్వజలీలఁ
                  గ్రాలుచుండంగ నేకాంతయోగ
నిద్రనున్న ధర్మనిర్మలు హనుమంతు...........

154

ఆరణ్యపర్వము

శా.

కాంతల్శుక్తిమతీనగేంద్రభవముక్తారత్నరాజిం దదే
కాంతస్వచ్ఛశరీరయుక్తి నగజాకల్యాణవేళార్హస
త్కాంతుల్ నించిరి గాక కానియెడ లోకశ్లాఘ్యసౌభాగ్యవ
త్కాంతాలోకమణిన్ మణీశతముచేఁ గైసేయఁగా ముగ్దలే.

155

వసుచరిత్ర

అచ్చునకు

ఉ.

ఎంతయు వృద్ధులై తమకు నీ వొకరుండవె తేఁపగాఁగ న
త్యంతముదంబునన్ బ్రతుకు తల్లిని దండ్రిని నుజ్జగించి ని

శ్చింతుఁడవై సదాధ్యయనశీలత వారియనుజ్ఞ లేక యే
కాంతమ యిమ్ముల న్వెడలి తక్కటి నీవు గరంబుఁ గ్రూరతన్.

156

అరణ్యపర్వము

ఉ.

యింతలు కన్ను లుండ దెరు వెవ్వరి వేడెదు భూసురేంద్ర యే
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతియ కాక...

157

మనుచరిత్ర

ఉ.

అంతట పారిజాతకుసుమాగతనూతనదివ్యవాసనల్
వింతలు సేయఁ దావి యిది విస్మయమంచు ముసుంగుద్రోచి యే
కాంతగృహంబునల్గడల నారసి . . .

158

పారిజాతాపహరణము

ఆపోశనశబ్దమునకు

సీ.గీ.

ఎసఁగ బాత్రిక నోగిరం బిడకమున్నె
యతిరయంబునఁ బరిషేచ మాచరించు
దత్తరమున నాపోశన మెత్తఁబోయి
భూసురుం డెత్తు నుత్తరాపోశనంబు.

159

కవులషష్ఠము

గీ.

పోసిరా యెల్లవారి కాపోశనంబు
నారగింపుఁడు రెండుమీ కమృతమస్తు
ప్రొద్దువోయింది సుండని బుజ్జగించి
మ్రొక్కె నంజలి యెత్తి యమ్ముదుకపడతి.

160

భీమఖండము

వ.

అచ్చునకు సులభము.

విశ్వామిత్రశబ్దహల్లునకు

మ.

హరకోదండవిఖండనుండు జనకక్ష్మాధీశుజామాత భా
స్కరవంశాగ్రణి జానకీప్రియుఁడు విశ్వామిత్రయాగాహితా
సురసంహారి......

161

భాస్కరరామాయణము

ద్విపద.

చని మహాతేజు విశ్వామిత్రు గనిన
గనుగొని పలికె నాగాధినందనుడు

162

రంగనాథరామాయణము

సీ.

సన్మునీశ్వరుఁడు విశ్వామిత్రుఁ డతిఘోర
                  తపము సేయంగ దత్తపము పేర్మి

163

ఆది పర్వము

సీ.

క్ష్మాచక్రమెల్ల విశ్వామిత్రమునిశిఖా
                  మణికి నర్పించిన మంచిదాత

164

హరిశ్చందోపాఖ్యానము

ద్విపద.

అని చెప్పి వీడ్కొల్ప నచ్చోటు వాసి
జననాథు డరుఁగ విశ్వామిత్రు డెరిఁగి

165

హరిశ్చంద్రకథ

అచ్చునకు

ద్విపద.

ఎక్కఁ డాగురుఁడని యెరుఁగని నీకు
నక్కరగురుఁడు విశ్వామిత్రుఁ డయ్యె.

రంగనాథరామాయణము

వ.

మరియును.

ద్విపద.

అవధారు దేవ విశ్వామిత్రమౌని
తివిరి వాకిట నేఁగుదెంచియున్నాడు

167

రంగనాథరామాయణము

మ.

తన సాంమ్రాజ్యము బాసినం గులవధూత్తంసంబు వర్జించినం
దనయుం డీల్గిన హీనకృత్యములచేతన్ దుర్దశ ల్బొందినన్
వనటం గుందిన నానరేంద్రుఁడు మనోవాక్కాయకర్మంబులన్
దనృతం బాడిన నాప్రతిజ్ఞ విను విశ్వామిత్ర చిత్రంబుగన్.

168

హరిశ్చంద్రోపాఖ్యానము

ద్విపద.

పటురయంబునఁ గూడబరచి యారాజు
నటు చననీక విశ్వామిత్రుఁ డనియె

169

హరిశ్చంద్రకథ

23 లక్షణము

క.

అక్షౌహిణి యనఁగా మరి
యక్షోహిణి యనఁగ గృతుల నౌత్వోత్వంబుల్
లాక్షణికులు యతు లిడుదురు
దక్షాధ్వరభంగ పాణితలసారంగా.

170

అక్షౌహిణి యనుటకు

సీ.

సందడింపుచు దశాక్షౌహిణిసైన్యంబు
                  లనిశంబు గొలగొలమనుచునుండ

171

జైమినీభారతము

అక్షోహిణి యనుటకు

క.

బాహుబలగర్వభీముఁడు
సాహసరసికాత్ముఁడైన సాత్యకియు మహో

గ్రాహవభూమి సహస్రా
క్షోహిణు లట్లగుట మీరు చూడరె యెందున్.

181

ఉద్యోగపర్వము

19 లక్షణము

క.

జ్ఞాకు నకారము విరమణ
మై కొందరికృతులయందు నలరుచునుండున్
లోకావనవిలసత్ప్ర
జ్ఞాకౌశల నిఖిలదివిజనాయక శర్వా.

182

ఉదాహరణము

ఉ.

సూనుల నల్వురం బడసె సూరిజనస్తుత సత్యభారతి
జ్ఞానుల పద్మగర్భవదనంబులు నాలుగు బోలువారిలోన్.

183

పావులూరి మల్లన గణితము

క.

శ్వానమునకుఁ జండాలున
కైనను నాకొన్న నిడగ నగు నన్నము దు
ర్మానసుఁడై పెట్టక య
జ్ఞానంబునఁ గడపెనేని నరకమున బడున్.

184

రుక్మాంగదచరిత్రము

ఇది యతిప్రకరణం బింక శబ్దప్రకరణం బెరింగించెద.

శబ్దప్రకరణము

1 లక్షణము

క.

పూవు పువు పువ్వు పూ యన
మావిడి మామిడి యనంగ మావి యనంగా
దౌవు దవు దవ్వు దౌ యన
గా వెలయుం గృతులయందు గౌరీరమణా.

1

పూవు అనుటకు

,
శా.

ఆవామాక్షి మనోహరాకృతి యమోఘాస్త్రంబుగా భూవరున్
లావణ్యాధికు నిచ్చలంబుమెయి గెల్వంబూని యిందిందిర
జ్యావల్లీకిణకర్కశంబయినహస్తం బుద్ధతిం జూచి వే
పూవుందూపులజోదు పుచ్చుకొనియెం బుండ్రేక్షుకోదండమున్.

2

నైషధము

పువు అనుటకు

క.

శ్రవణావతంస మయ్యెను
ధవళాయతనేత్రగుణము ధరణీపతికిన్
శ్రవణావతంస మయ్యెను
పువువింటిగుణంబు నపుడు పుష్పాస్త్రునకున్.

3

పువ్వు అనుటకు

క.

యివ్విధమున దానము గొని

చివ్వలయోగిరపుదపసిచెట్టెనఁగూడం
బువ్వులసరులం జుట్టిన
యవ్విభునిచెరంగు విడిచి యల్లన నగుచున్.

4

పారిజాతాపహరణము

పూ అనుటకు

సీ.

పసపుగొమ్ములతోడి కుసుమపూవన్నియ
                  నిద్దంపుజుట్టంబు నెరికెగట్టి

5

కాశీఖండము

మావిడి యనుటకు

ఉ.

మావిడిమ్రోకకింద నిగమత్రితయార్థసమృద్ధిఁ బార్వతీ
దేవికుచంబులం బదను దీర్పనికస్తురిముద్రికాజగ
జ్జీవనకారణం బయిన శ్రీనిధికంచిపురీశ్వరుండు మా
దేవయసెట్టినందసుని తిప్పు గృతార్ధుని జేయుగావుతన్.

6

శ్రీనాథునిహరవిలాసము

మామి డనుటకు

సీ.

మినుములు పెసలు మామిడితాండ్ర టెంకాయ
                  లల్లంబు తమలపుటాకుకట్లు

7

రుక్మాంగదచరిత్రము

మావి యనుటకు

చ.

ఒక యెలమావిక్రింద మరుఁడో యనఁగా నరుఁ డుండె నయ్యెడన్ ...

8

విజయవిలాసము

దౌవు అనుటకు

ఉ.

నావుఁడు వాయునందనుఁడు నందన పొమ్ము చమూవధూటినీ

కైవశమైన లెస్స యటుగాక నినుం దలమీరెనేని దౌ
దౌవున నిల్చి మద్ఘనగదాహతిజేవ యడంతు.....

9

జైమినీభారతము

దవుదవ్వు అనుటకు

క.

శివనింద సేయుపాతకు
దవుదవ్వులఁ జూచి తొలఁగఁ దగు శైవులకున్
శివనిందాపరుపలుకులు
చెవియొగ్గి వినంగవలదు శివభక్తులకున్.

10

కాశీఖండము

ఉ.

సందడి యధ్వరక్రియ కసంగతి మేనిబలంబుతోడ బెన్
గ్రందడియేల మేన తగ కార్ముకహస్తుఁడనై కడంగి మీ
ముందర నిల్చెదన్ గ్రతువు ముట్టక యుండఁ బ్రచండదైత్యరా
జిం దెగదవ్వుదౌల వెసఁ జించెదఁ బెంచెద మీకు మోదమున్.

11

యెఱ్ఱాప్రగడ రామాయణము

2 లక్షణము

క.

కేళాకూళి యనంగా
కేళాకుళి కేళకుళియుఁ గీర్తింప కెళా
కూళియు ననఁదగు దీర్ఘిక
నాళీకభవాదిదివిజసాయక భర్గా.

12

కేళాకూళి యనుటకు

మ.

బలుకప్రంపుటనంటికప్పురపుదిప్పల్లయుప్పొంగుజా
ల్గలగొజ్జంగులనీరు సజ్జికపుకేళాకూళికిన్ డిగ్గి

13

వసుచరిత్రము

కేళాకుళి యనుటకు

సీ.

కేళాకుళఁలలోని కెందమ్మితూఁడులు
                  వింతగా నజు నెక్కిరింత నమర

14

భైరవుని శ్రీరంగమహాత్మ్యము

సీ.

సారమై హిమజలాసారమై పూదేనె
                  నెరయ గేళాకుళుల్ నింపవలదు

15

వసుచరిత్రము

కేళకుళు లనుటకు

గీ.

అంబుధులు కేళకుళులు కులాచలములు
మేడ లాచక్రగిరి చుట్టుగోడ గాఁగ
నవనిఁ బాలించె శుద్ధాంతభవన మట్ల
కీర్తిలక్ష్మీకళత్రుఁ డాక్షితివరుండు.

16

కవికర్ణరసాయనము

కేళకూళి యనుటకు

సీ.

కుక్కుటేశ్వరు కేళకూళి నుద్భవమయిన
                  మణికర్ణిక నొనర్చు మజ్జనములు

17

కాశీఖండము

3 లక్షణము

క.

మోసల యన మొగసా లన
మోసల యనంగ గావ్యముల బలుకఁదగున్
వాసిగ దలసావిడికిన్
వాసవముఖ సిఖలదివిజవంద్య మహేశా.

18

ఉదాహరణము

మోసలకు

చ.

ముద్దుమరంది కుఱ్ఱహరి మోసలగార్యభరంబు దీర్పగా
గద్దియమీద నుండి త్రిజగంబులు నేలుకొసంగ నెల్ల వే

19

నైషధము

మొగసాల యనుటకు

సీ.

మొగసాల నున్నారు జగతీసుపర్వులు
                  గ్రాసార్థు లగుచుఁ బెక్కండ్రతిథులు

20

కాశీఖండము

మోసాలకు

సీ.

లోలార్కునగరి మోసాల వెదకి...

21

4 లక్షణము

క.

వాలెము కృతులం జెల్లును
వేళము వైళం బనంగ వేఁడీ యేఁడీ
మీ లన మీను లనంగా
జాలంధరముల నిశాటసంహరణ శివా.

22

వేళ మనుటకు

ఉ.

వ్రేసిన వ్రేటునం బడక వేళను దాటి పిరిందికంటి బా
హాసముదాయమధ్యమున కర్కతనూభవునిం దగుల్పడన్..

23

రామాభ్యుదయము

వైళ మనుటకు

ఉ.

ఆంగము తొడఁగట్టి మిక యజ్ఞవిఘాతకచోరు నెందు వో

వంగలవాఁడ వింక నిటు వైళమ తాపసవేషధారివై....

24

యఱ్ఱాప్రగడ రామాయణము

వేడీ అనుటకు

క.

ఓడితిమె యేము రణమున
గ్రీడికి గేడించి రాక గెలుపే యతడున్
వేడీ డాగెనొకో మా
తోడి బవర మిట్లు దానుఁ దొలఁగంజనునే.

25

ద్రోణపర్వము

శా.

యీక్షోణిన్ నినుఁ బోలు సత్కవులు వేరీ నేటికాలంబునన్

26

కాశీఖండము

మీ లనుటకు

సీ.

మగమీ లనఁగజాలు తెగ గీలుకొనువాలు
                  కనుఁగవ కొకవింతకాంతి యొదవె......

27

పారిజాతాపహరణము

మీను లనుటకు

చ.

కొలకులు చేరవచ్చి యనుకూలతటంబుల నిల్చిముగ్ధ ల
య్యలికులవేణు లయ్యెడ నిజావయవప్రతిబింబశోభగాఁ
దలపుచు నుల్లము ల్వొదలఁ దప్పక చూడఁదొడంగి రందులో
జలజములన్ మృణాలముల జక్రయుగంబుల గండుమీనులన్.

28

కవికర్ణరసాయనము

5 లక్షణము

క.

కొమ యఁనగ గొమ్మ యనఁగా
బొమ యన బొమ్మ యన మరియు బొరపరయనఁ గా

వ్యముల బ్రయోగింపందగుఁ
గుముదహితార్యమరధాంగ కుక్కుటలింగా.

29

కొమ యనుటకు

సీ.

ఎల్లెడఁ జదలేటియిసుముచే నచ్చర
                  కొమ లిడు వెన్నెలకుప్ప లనగ........ .

30

పారిజాతాపహరణము

క.

కమలముల నుజ్జగించుం
గుముదంబుల బుజ్జగించు కొమచూపులు పు
న్నమచందమామ వెన్నెల
కొమరంతయు బుడికిబుచ్చుకొనఁజాలు సుమీ.

31

విజయవిలాసము

కొమ్మ సులభము.

బొమ యనుటకు

సీ.

జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన
                  రతిమన్మథులవిండు లతివబొమలు. . . . . . .

32

నైషధము

బొమ్మకు

చ.

బలబల వేగ రేపకడ బంకజదీర్ఘిక దీర్థమాడ నె
చ్చెలులును దాను నిందుముఖి శేషవిభూషణుఁ బూజ సేయుని
చ్చలు దెలిగన్నులున్ మొలకచన్నులు బొమ్మలు మీద వ్రాలుకుం
తలములు జూచి పౌరులు మనంబున నువ్విళులూరుచుండగన్.

33

కాశీఖండము

పర యనుటకు

సీ.

బొమలు కన్నులమీద బొదలి వాలకమున్న
                  పరనేత్రముల కడ్డపడకమున్న ..........

34

కాశీఖండము

పొర సులభము.

6 లక్షణము

ఆ.

ఇం పెసంగ గృతుల సంపంగి సంపెంగ
సంపెగయు నటంచు జను వచింప
కొమరు మీర మరియు గొజ్జెంగ గొజ్జెంగి
గొజ్జెగయు ననంగ గూడు నభవ.

35

సంపంగి యనుటకు

ఆ.

నాతిచన్నులు వ్రేగున నడుము వఁడఁక
నధిపువాతెర తెల్లనా కందుకొనుచు
పసిడిగిన్నెయలోని సంపంగినూనె
వనిత దలయంటె దనప్రాణవల్లభునకు.

36

చిత్రభారతము

సంపెఁగ యనుటకు

ఉ.

కంపనలీలమై నసదుగౌ నసియాడఁ గుచద్వయంబు న
ర్తింప లలాటరేఖ చమరింపగ హారలతాగుళుచ్ఛముల్
తుంపెసలాడఁ గంకణమృదుధ్వని తాళగతిం జెలంగఁగా
సంపెఁగనూనె యంటె నొకచంద్రనిభానన కంసవైరికిన్.

37

పారిజాతాపహరణము

గొజ్జెంగ యనుటకు

గీ.

బహుళకస్తూరికామేఘపటలమునకు
శీకరాసార మయ్యె గొజ్జెంగనీరు
వలుద వడగండులయ్యె నవ్వర్షమునకు
దామినులు చల్లుకర్పూరఖండవితతి.

38

భీమఖండము

గొజ్జంగి యనుటకు

దేవకి యొసంగగా వసుదేవుఁ డపుడు
చంద్రకాంతపుగిండి గొజ్జంగినీట
పసిడిపళ్ళెంబులో పదాబ్జములు గడిగి
తనదు మేనల్లునికి కన్య ధారబోసె.

39

విజయవిలాసము

గొజ్జెగకు

ఉ.

గొజ్జెగనీరు చల్లె నొకకోమలి యొక్కలతాంగి ద్రిప్పె లా
మజ్జకతాలవృంత మొకమానిని ........

40

నైషధము

సీ.

మలయబోదరతజంభలఫలత్వగ్నత
                  శ్రీమించు జెవులగొజ్జెగలు మెరయ ...

41

ఆముక్తమాల్యద

7 లక్షణము

ఆ.

ఈల్గుటయును బోర నీల్గుట యిలుగుట
నెగయుటయును మింటి కెగయుటయును

నంటినంటి నాగ నమ్మిక నమ్మిగ
బదుకుబతు కనంగ బరగు శర్వ.

42

ఈల్గు టనుటకు

గీ.

ఎడమక్రిందుగఁ గాశిలో నీల్గునట్టి
మశకశిశువున కోంకారమంత్రరాజ
మభవుఁ డుపదేశ మొనరింప నమరగోటి
సిగ్గువడుచుండు దమవృధాజీవములకు.

43

కాశీఖండము

నీల్గుటకు

క.

పడిన వుడుగ రసి వలకెన్
నిడుచన గొనయమునఁ బెనఁచి నీల్గి బలం బే
ర్పడ విల్లు వంచనోపక
యుడిగిరి నృపసుతులు గొంద రొయ్యన లజ్జన్.

44

ఆదిపర్వము

ఇలుగు టనుటకు

క.

బలవిక్రమఘనులగుదొర
లిలిగిన మనసేన మేదినీశ్వర విను క
న్నులు చెడినట్లున్నది యీ
కొలదిం బొరిగొనుట నరునకున్ సుకరమగున్.

45

శల్యపర్వము

నెగయుటకు

గీ.

కాద్రవేయులు భూమియుఁ గైకొనంగ
నురగలోకంబు వెడలి తత్పరిఘనీట

46

నెగసి తోడన గ్రుంకుదు ర్నిలువలేక
తత్తటీబద్ధగారుత్మతములకలిమి.

46

ఆముక్తమాల్యద

ఆ.

కర్మబంధనములు గ్రక్కున బాయుడు
పుణ్యగతికి నెగయు పురుషునట్లు
బంధనంబులెల్ల బాయుడు భీముండు|
నీటిలోననుండి నెగయుదెంచె.

47

ఆదిపర్వము

క.

నరకలు విచ్చుచు దుండము
దెరచుచు వ్రేగడరి సొగసి త్రెల్లి వివశుఁడై
యరచిన నోడకుమని హరి
నెరి చక్కగ ద్రోచి యెత్తె నెగయఁగఁ గృపతోన్.

48

ఉద్యోగపర్వము

నంటనుటకు

క.

ఇంటికి జనుటయు మానెన్
నంటొనరింపగ జాగె నాగరికలతో
కుంటెనకాడులఁ గూడెన్
గొంటరియై యతఁ డసాధుగోష్ఠీపరతన్.

49

కవులషష్ఠము

గీ.

తొలుదొలత కృష్మవర్త్మకు గళయొసంగి
నంటు గావించు తెల్ల ననాథయువతి
జనతనూదాహసాహాయ్యమునకు గాక
కానవావారి నెవ్వారి గమలవైరి.

50

వసుచరిత్ర

నమ్మిగ యనుటకు

క.

తగుమాట లాంబికేయుం
డగునని కైకొనునె యెన్నడైనను గొడుకుల్
మగటమి గల రనియెడు న
మ్మిగఁ జూచుచునుండు విషము మ్రింగినయేనిన్.

51

ఉద్యోగపర్వము

క.

మగ డింక నన్ను సైఁచునె
తెగవిడుచుం జంపుగాక తెల్లము మది న
మ్మిగ బుట్టునె యిది చెప్పిన
మొగమోటన మనవు మండి మూసితి జపలా.

52

యఱ్ఱాప్రగడ హరివంశము

బదు కనుటకు

గీ.

మునులు నజుడు మున్నుగ మహామూర్తి విష్ణు
నుదురుదేశంబు సొత్తురు బదుకు గోరి......

53

హరివంశము

సీ.

వదనచంద్రుని జొచ్చి బదికెడుచీకట్ల
                  గతి నవశ్మశ్రురేఖలు జనించె......

54

కవికర్ణరసాయనము

బతు కనుటకు

చ.

రతికిన్ భారతికిన్ వినోదకథలన్ ప్రాగల్భ్యము ల్చూపి త
త్పతులం గూరిచి మాటవాసి గను పెద్ద ల్గారె మీవార లా
చతురత్వం బిటు నేడు గానబడ నీచంద్రాననం గూర్చినం
బతికింపంగదె ముద్దుకీరమ సుధాబంధూభవద్గీరమా.

55

విజయవిలాసము

8 లక్షణము

క.

అలకము లలక లనంగా
పులకలు పులకము లనంగ బొసగగ గృతులన్
బలుకదగు సుకవివరులకు
జలజాతభవార్చితాంఘ్రిజలజ మహేశా.

56

అలకము లనుటకు

క.

వరమకుటరత్నకిరణ
స్ఫురణ ప్రతిఘట్టనమున భుగ్నాగ్రములై
మరలు తనుద్యుతు లనుమతి
నెరపె సుపర్వులకు విభుని నిటలాలకముల్.

57

కవిక ర్ణరసాయనము

సీ.

నిటలాలకము లంటి నివురు జుంఝుమ్మని
                  ముఖసరోజమునకు ముసరుదేంట్లు ...

58

పోతరాజు అష్టమస్కంధము

అలక లనుటకు

ఉ.

కామినుల న్నగాత్మజకుఁ గల్పకభూరుహదత్తకోమల
క్షామము గట్టనిచ్చి యలకల్ దడియార్చి విరుల్ ఘటించి........

59

వసుచరిత్ర

సీ.

వదనంబు కొమరుభావనఁ జేసి వేరుగ
                  నుదుటిపెం పలకలఁ బొదవమడఁగ......

60

విరాటపర్వము

పులక లనుటకు

సీ.

తనువుమైదీగెకు తావలంబుగఁ జేసి
                  పులకలజిత్తంబు నెలవెఱింగి.....

61

ఉత్తరరామాయణము

గీ.

తనువు పులకలప్రోవుగ మనము గాఢ
సంభృతానందముగ శరాచార్యసుతుఁడు
వితతసంభ్రముఁడై వేది వెడలి చాగి
మ్రొక్కి లేచి ఫాలమున మోడ్చెఁ గేలు.

62

సౌప్తికపర్వము

పులకము లనుటకు

ఉ.

చిప్పిలుచెక్కులపై చెమటచిత్తరులన్ గరపల్లవంబునం
గప్పుచుఁ జన్నుగ్రేవ పులకంబులు పయ్యెద నొత్తి యోరగాఁ
ద్రిప్పినమోము వంచి జగతీవరుచిత్త మపాంగదృష్టిచేఁ
దప్పకఁ జూచి రాజసుతు దానునుఁ జిత్తరువయ్యె నత్తరిన్.

63

కవికర్ణరసాయనము

9 లక్షణము

క.

చొటు చోటనఁ బొద పద యొ
క్కటి యొక్కొటి పొలఁతి పొల్తి గణుతింపఁగ జె
న్నఁటి జెనఁటి యనఁగ నొప్పుం
గుటిలాహితమదవిభంగ కుక్కుటలింగా.

64

చొటు అనుటకు

క.

కటకట పేరిన పెన్నె
త్తుట జొత్తిలియున్న మోముతోడం గొడు కె
చ్చటఁ బడియున్నాడో య!

చ్చొటుఁ జూపెడువారు లేరె చూచెద వానిన్.

65

ద్రోణపర్వము

స్ఫుటభూయోహృతిశంక వార్ధినినదశ్ముల్ మిన్ను చేర్పం దటి
చ్చటు లౌర్వంబుగ గారుకొంచు ఘనమై క్ష్మాలీల వర్షింప న
చ్చొటునం దోచి గ్రసింపఁబోలు కలశీసూనుండు గాకున్న నొ
క్కొట తారాగ్రహభాస్కరేందుమణి శుక్తుల్ వ్యక్తమై తోచునే.

66

ఆముక్తమాల్యద

."
వ.

ఇందులో చొటనిన్ని యొక్కొటనిన్ని రెండులక్ష్యము
లున్నవి.

67

చోటనుట సులభము

పొద మనుటకు

సీ.

సుతతపస్వాధ్యాయరతులకుఁ గర్తవ్య
                  మచ్చోటు నాకేల యనుఁడు వరుణు
పురి గుంభి గైకొను పొదమన్న మునిఁ జూచి...

68

ఆనుశాసనికము

క.

రదనింగొను మచ్చోటుం
బొద ప్రాజాపత్యలోకమున కనవుఁడు నా
కదియేల యశ్వమేధుల
పదమనియెం బతిదపస్వి పతి యాతనితోన్.

69

కడమ సులభము.

ఒక్కొటి యనుటకు

గీ.

కొడుకు తమ్ములు దోడ్పడ గడఁగి శత్రు
కోటి గెల్చెదనంటి యొక్కొరుఁడుఁ దక్క
కుండ నీతమ్ముకుఱ్ఱల నూచముట్టు

కొనియె నేవిధి యేగతి నొనరఁ జెపుము.

70

శల్యపర్వము

క.

పాండవులవలనఁ గీ డొ
క్కొండును లే దధిప నీదుకొడుకులు ధరణీ
మండల మంతయు మ్రింగిరి
పాండునృపతిభాగమునకుఁ బాపిరి వారిన్.

71

స్త్రీపర్వము

మ.

అనుమానం బదియేల నీమది మదీయస్ఫారబాహాబలం
బు నిరూపింపఁదలంచితేని విను మేపుం జేవయుం జూపఁ గృ
ష్ణునితోడ్పాటునఁ బేర్చి యేగడఁగినం జూర్ణంబుఁ గావింతు నొ
క్కొ నిమేషంబున దేవదానవులతోఁగూడం ద్రిలోకంబులున్.

72

ఉద్యోగపర్వము

పొల్తికి

చ.

చెలువుగ నాళనాబ్జముల చేరువఁ గుంతలభృంగమాలికల్
మెలఁగ వళీతరంగములమీఁద ఘనస్తనచక్రయుగ్మకం
బులు విలసిల్లఁ గూడుకొని పొల్తులు పద్మినివారిపొంత పొం
పొలయఁగ వేడ్కమై నరిగి రొండొకపద్మినిఁ బోల లీలతోన్.

73

ఉత్తరరామాయణము

చ.

తడయక కౌరవానుజుఁడు దానిపిరుందన పారి యింక నె
క్కడి కరుగంగవచ్చుఁ జులుకం జనుదె మ్మిట సౌబలుండు ని
న్నొడిచె దురోదరంబున గురూద్వహునర్థమ వైతి నిన్నునుం
బుడమియుఁ దమ్ము గోల్పడిరి పొల్తి భవత్పతు లైనపాండవుల్.

74

సభాపర్వము

చెన్నటి యనుటకు

ఉ.

ప్రోడవు గాన నీపలుకు పోలదు కాదనరాదు గాని యా

వీడని తాపవేదనల వేఁగెడు చెన్నటిమేనఁ బ్రాణముల్
గూడి వసింపనోర్వ విదిగో చనుచున్నవి యేల వ్రీడయుం
గ్రీడయు నాకు హారమును గీరము చూతము గీతముం జెలీ.

75

కవికర్లరసాయనము

క.

నిను దాఁచి కుటిలభావం
బున దుష్టచరిత్ర వైతి ముక్తుల తెరగే
వనితా యిదియే బలువర
చిననైనను మానవలదె చెన్నటిచూపుల్.

76

శాంతిపర్వము

10 లక్షణము

గీ.

దక్కె డక్కె ననఁగ దబ్బర డబ్బర
దాసి డాసి యనగ దప్పి డప్పి
దిగ్గి డిగ్గి యురుగ తిని దాగి డాగి దా
పలను డాప లనఁగఁ బరగు నీశ.

77


గీ.

డక్కెనని కాని చెల్లదుఁ దక్కినను ప్ర
యోగ మంచు వచించె నింపొనర ముద్ద
రాజు రామన్న యది యథార్ధంబు గాదు
రెండు గల వెన్నఁ గృతుల గౌరీకళత్ర.

78

దక్కె ననుటకు

మత్తకోకిల.

దేవమూర్తులు పాండుపుత్రులు ధీరచిత్తులు వారిపెం
పీ వెఱుంగనివాఁడవే ధరణీశ వాయుసుతుండు గాం
డీవియున్ భుజవిక్రమప్రకటీకృతుల్ వివిధాస్త్రవి!
ద్యావిశేషులు వైరివీరుల దక్కనిత్తురె పోరులన్.

79

అరణ్యపర్వము

ఉ.

ఎక్కటివోలె రుద్రునికి నేమిట దక్కువ ఫల్గునుండువాఁ
డొక్కఁడ యయ్యెనే జగము లొక్కట మ్రింగఁగఁజాలుఁ గేశవుం
డెక్కినవాఁడు వానినొగ నేల బలం బని యెంత జెప్పినన్
దక్కెడు రాజ్యలోభము మదంబున నాకొడు కేమి సేయుదున్.

80

ద్రోణపర్వము

డక్కె ననుటకు

ఉ.

డక్కెను రాజ్య మంచు నకటా యిట సోదరరాజ్యభాగ మీ
వెక్కటి మ్రింగఁజూచె దిది యేటికి డక్కును మీనులోలతం
గ్రక్కున నామిషంబు చవిగాలము మ్రింగినచాడ్పు సువ్వె యి
ట్లుక్కివుడైననీకొడుకు నుల్లమునం దిటులోర యుండినన్.

81

ఉద్యోగపర్వము

ఉ.

అక్కట మందభాగ్యునకు నట్టితనూభవరత్న మేటికిన్
డక్కు విధాత నిర్దయుఁ డొడంబడునే కడుమేలివస్తువుల్
పెక్కుదినంబు లున్కి నరిబృందము పిల్చిన వోటుబంటనై
యక్కడి కేలపోయితి మహాగుణభూషణు గోలిపోయితిన్.

82

ఉద్యోగపర్వము

దబ్బ రనుటకు

ఉ.

గాళకు లాపురీభటశిఖామణు లెక్కడ యుక్కుతున్క లా
భీలతరాశనుల్ చిదిమిపెట్టిన బంటులు వైరికల్లభే
తాలుఁడు వచ్చిడగ్గరిన దబ్బరగా దొకదెబ్బ దియ్యఁగాఁ
జాలుదు రేమి చెప్ప మరి సాధన మేలును సాహసంబులున్.

83

విజయవిలాసము

డబ్బ రనుటకు

గీ.

తల్లిబడికొల్ది చెట్టంచు నుల్లసంబు
లాడుదురు నన్ను గూర్చి ని న్నహరహంబు

దుర్నయం బెల్ల నామీఁద ద్రోచి జనులు
డబ్బరలు వల్కువారి కడ్డంబుఁగలదె.

84

కాశీఖండము

దాయుటకు

ఆ.

వలను చూడకొండు వగవక యెప్పటి
యట్లఁ గుడుచుచున్న నలిగి బకుఁడు
వీనిబాసఁ జూడ వేఱంచు డాసిన
తరువు వెరికికొంచు దాయవచ్చె.

85

ఆదిపర్వము

చేయుటకు

చ.

అని యతి యుగ్గడించు ధృతి యల్లల నాడఁగఁ దల్లడిల్లు పై
కొనఁ దలయోరగించు మదిఁ గోర్కులు వేర్చిన నప్పళించు నె
ట్టన తగ వచ్చటన్ జనులు డాయగ రాఁబరికించి బుద్ధిమా
లినవెస నెంతయుం గళవళించు మనోజవికారమగ్నుఁడై.

86

విరాటపర్వము

డప్పి యనుటకు

గీ.

ఆభవుఁ డీరీతిఁ దాండవం బాడి డస్సి
డప్పి గొని యారగింప కాండంబు వెదకి
కావడయ్యెను సప్తలోకంబులందుఁ
దియ్యనై జిహ్వకిం పైన తేటనీరు.

87

కాశీఖండము

ఉ.

డప్పి జనించె నంగుళిపుటంబులు పొక్కఁదొడంగె గోళ్ళనుం
జిప్పిలఁజొచ్చె నెత్తురులు...

88

విరాటపర్వము

దిగి యనుటకు

క.

జగముల నెల్లను మ్రింగెడు
జగదంతరమౌళి నామచరణంబిడి పె
ల్లగు రోగజరాభరములు
దిగవిడువం జెల్లె నీకు త్రిభువనదీపా.

89

అరణ్యపర్వము

డిగి యనుటకు

చ.

డిగకుఁడు వాహనంబులు కడిందిమగంటిమి గోలుపోవ మీ
రు గడకడక్కి పెట్టకుఁడు రూపర నాయుధముల్ .. ..

90

ద్రోణపర్వము

దాగి యనుటకు

క.

వేమారు గ్రుచ్చిగ్రు చ్చిపు
డేమో యడిగెదవు నీ కొకించుకమనసా
భూమీశుమీఁదఁ గలదో
తామరసదళాక్షి నాకు దాచక చెపుమా.

91

విజయవిలాసము

డాగుటకు

సీ.

జనని యూరుప్రదేశంబు ననతి నిగూ
                  ఢంబుగా నొర్వుండు డాగుటయును......

92

విరాటపర్వము

క.

పవనజుఁ డొక్కడె పెరపాం
డవులును సాత్యకియు హరియు డాతురె యుగ్రా
హవమునఁ బ్రాణము లావును
నవిజేయులు వారిఁ దొడరనగునే తనకున్.

93

ద్రోణపర్వము

డాప లనుటకు

సీ.

డాకాలిగండపెండారంబుదాపున
                  బొమ్మలై వైరిభూభుజులు వ్రేల.......

94

కాశీఖండము

వ.

దొప్ప డొప్ప అనిన్ని కద్దు.

95


గీ.

కోరమీసలు మిడుగుడ్ కురుచపొడవు
దొప్పచెవులును గొగ్గిపండులును గలిగి.....

96

నైషధము

11 లక్షణము

క.

అక్షత లక్షతము లనన్
లక్షింపఁగ లాజ లనఁగ లాజము లనఁగా
నీక్షితిఁ గృతులం జెల్లును
శిక్షితరిపుదానవేశ శ్రీగౌరీశా.

97

అక్షత లనుటకు

ద్విపద.

బంధురదక్షిణప్రవరవేదికకు
గంధపుష్పాక్షతల్ కర మొప్ప నునిచి...

98

రంగనాథుని రామాయణము

అక్షతము లనుటకు

గీ.

గురుజనోక్తవిధానానుకూల బాల
నిజవివాహవిలాసంబు నిర్వహించె
భోజుఁ డప్పుడు వేడ్కతో బుధసతీవి
తానములతోడ నార్ద్రాక్షతములు జల్లె.

99

ఇందుమతీకళ్యాణము

గీ.

అహిమభానుఁడు చనుదేర నస్తశిఖరి
సరవి నర్చించు కుంకుమాక్షతము లయ్యె

పరిసరాతపసంధానభాసమాన
శిఖరపానుఝరోద్ధూతశీకరములు.

100

కవికర్ణరసాయనము

లాజ లనుటకు

చ.

దనుజవిరోధిమీఁద నొకతన్వి కరంబున లాజ లెత్తి చ
ల్లిన నెరివేణి యీసునఁ బలెన్ విరిపువ్వులు చల్లె....

101

పారిజాతాపహరణము

ఉ.

కంకణనిక్వణంబు మొగకట్టగ గౌ నసియాడ రత్నతా
టంకవిభూషణంబులు వడంకఁ గుచంబులు రాయిడింపఁగాఁ
బంకజనేత్ర గౌతమునిపంపున లాజులు దోయిలించి భూ
మాంకునియందు వ్రేల్చె దరహాసము రెప్పలలోన డాపుచున్.

102

నైషధము

లాజము లనుటకు

ఉ.

పౌరపురంధ్రు లిట్లు వసుపార్థివుఁ గన్గొనవచ్చి మంగళా
చారమనోజ్ఞలాజములు చల్లిరి....

103

వసుచరిత్ర

ఆ.

రక్తమాంససహితభక్తపిండములను
లసితలోహితార్కలాజములను
సురను బలి యొనర్ప నురగయక్షాసుర
ప్రముఖభూతములు శుభంబు లొసఁగు.

104

ఆనుశాసనికము

12 లక్షణము

క.

అబ్బుర మబుబర మబ్రం
బబ్బరము నటంచుఁ గవులయునుమతివలనన్

నిబ్బరముగఁ బలుకందగుఁ
గబ్బంబులయందు నచలకన్యారమణా.

105

అబ్బుర మనుటకు

గీ.

రాజవీథుల నొసగు నీరాజనములు
కటికవా రెచ్చరింప నక్కటికభూమి
వందిజనములు వొగడఁ జెల్వొంది మిగులఁ
బురము సొత్తెంచె విజయుఁ డబ్బురముగాను.

106

విజయవిలాసము

అబుబర మనుటకు

చ.

తబిసివిగానఁ జావునకుఁ దప్పితిఁ గా కిది వేఁటపంతమా
యబుబరపుందెరంగున బరాటవికాయతచాపవల్లరీ
నిబిడశరాహతంబగు వనేచరజంతువు నొక్కఁ డీగతిన్
శబముపయి న్నిగుడ్చునె నిశాతశిలీముఖ మెట్టి వెఱ్ఱివో.

107

హరవిలాసము

అబ్ర మనుటకు

ఉ.

విన్నున నేగుతామరల విందుకిలాతపునీడ లెప్పుడున్
వెన్నెలరాచరాలఁ గని వెళ్ళనినీళ్ళ మునింగియున్న వీ
మన్ను లటంచుఁ జెంచెతలు మాటికిఁ దూపుల నేసి నాటమిన్
మిన్నక చూచి యబ్రపడి మెల్లన పోవుదు రిళ్ళపట్లకున్.

108

యయాతిచరిత్ర

అబ్బర మనుటకు

గీ.

తప్పకుండఁగఁ బక్షపాతంబు లేక
పంచిపెట్టెడువార లబ్బరము గాన
యన్నదమ్ములమై యుండి యకట మేము

మిమ్ము మము మీరు వంచింప మేరయగునె.

109

హరవిలాసము

13 లక్షణము

ఆ.

మొనసి నీచ వృద్ధ మూర్ఖ శబ్దంబులు
నీచు వృద్ధు మూర్ఖు నెరయ నీచు
డనఁగ వృద్ధుఁ డనఁగ ననువొప్ప మూర్ఖుఁడు
నాగఁ దనరుఁ గృతుల నాగహార.

110

నీచశబ్దమునకు

క.

అని పలికిన పలుకులకుం
గన కోపముఁ గదిరి నీచుఁ గావున ఝంకిం
చినఁగాని మెత్తబడి పొం
డని మనమునఁ దలఁచి యిట్టు లనియెం బెలుచన్.

111

విరాటపర్వము

ఆ.

విదురుఁ డిట్టు లనియె నీది యొక్కకార్యంబుఁ
గాగఁ బూని యిందు రాఁగఁదగునె
దుష్టబుద్ధి నీచు దుర్యోధనుండు నీ
మాట వినఁడు దురభిమానధనుఁడు.

112

ఉద్యోగపర్వము

మూర్ఖ శబ్దమునకు

చ.

అవినయబుద్ధివై హరికి నర్ఘ్య మయోగ్యమ యంటి నీవు మూ
ర్ఖపుశిశుపాల యింకఁ బలుకన్ వలసెన్ సభలోనునున్నయీ
యవనిపులెల్ల నాతనిదయం బ్రవిముక్తులు వానిచేత సా
హసజితులుం దదీయశరణార్థులుఁ గా కొరులయ్య చెప్పుమా.

113

సభాపర్వము

14 లక్షణము

క.

వేయి వెయి వెయ్యి వేయనఁ
గోయిల కోవెల యనంగఁ గొమరొప్పంగా
నేయి నెయి నెయ్యి నేయనఁ
బాయక కబ్బముల నిల్చు పర్వతనిలయా.

114

వేయి యనుటకు

ఉ.

వేయిగజంబు లుండఁ బదివేలుతురంగము లుండ నాజిలో
రాయలఁ గూర్చి సజ్జనగరంబునఁ బట్టముఁగట్టినట్టి యా
రాయకళింగగంగు నరిరాయభయంకరుఁ జూడఁ వేడ్కనేఁ
బోయెద మీనమాసమున పున్నమఁబోయిన షష్ఠినాటికిన్.

115

భీమకవి చాటుధార

వెయి యనుటకు

క.

లెక్కలు వెట్టఁగ వచ్చుం
జుక్కలుఁ దద్భక్ష్యభోజ్యచోష్యాదుల క
మ్మక్క మఱి లెక్క యెక్కడి
దక్కడి యొక్కొక్కకడి వెయారులు సేయున్.

116

బహులాశ్వచరిత్ర

వెయ్యి యనుటకు

క.

అయ్యారే చెలు లక్కడ
నయ్యారే గెలువఁజాలు నంగజునారిన్
వెయ్యారులలో సరిలే
రయ్యా రుచిరాంగరుచుల నయ్యంగనకున్.

117

విజయవిలాసము

వే యనుటకు

గీ.

ఇంతి వేగన్నులనుఁ గాన డింద్రుఁ డిపుడు
దీవిలాసంబు పెంపు వర్ణింపఁదరమె

118

నైషధము

కోయిల యనుటకు

ఉ.

ఆయలనాగవేణి మెరుఁగారుకటారికి మాసటీడ గుం
బోయన వచ్చు నయ్యలరుబోఁడిపిరుందు సమస్తభూమికిన్
రాయలనంగ వచ్చు నలరాజనిభాస్యయెలుంగుఁ గట్టురా
కోయిలకంచుకుత్తుకులకుం బయకా డనవచ్చు నెచ్చెలీ

119

విజయవిలాసము

కోవెల యనుటకు

సీ.

యెలమావికొన యెక్కి తెల తెల నార్చి కో
                  వెలపోటుఁ గూకలు వెట్టెనేని.......

120

రాజశేఖరచరిత్ర

నేయి యనుటకు

ద్విపద.

నేయి కల్లును తేనె నెత్తురు పెరుగు
పాయసాన్నమును దర్భలు ప్రవాళములు

121

రంగనాథుని రామాయణము

నే యనుటకు

క.

నావుఁడు సంజయుఁ డిట్లను
దేవా పాండవులయలుక దృష్టద్యుమ్నుం
డేవెరవుమాటనైనన్
నే వోసిననగ్నివోలె నిగుడం జేయున్.

122

ఉద్యోగపర్వము

వ.

కడమ సులభము.

15 లక్షణము

ఆ.

ఎగ్గు నెగ్గు నాగ నేలిద మేలిదం
బనఁగఁ జామరములు నట్టు చామ
రలు ననంగఁ గృతుల నలరొందు ననిశంబు
భవభయప్రణాశ పార్వతీశ.

123

ఎగ్గనుటకు

గీ.

పుష్పఫలపత్రజలమాత్రముల శరీర
యాత్ర నడుపుచు సన్మార్గమధిగమించి
యెసఁగు నివియెల్ల నీ కేల యెగ్గుఁదలఁచు
వనిత యావంత యావంత వలువదమ్మ.

124

వసుచరిత్ర

నెగ్గనుటకు

గీ.

చెప్పకుండినఁ గోపించి చిషిక యెత్తి
చూలు కరుగంగ వేయంగఁ జూచె గురుఁడు
వేల్పు లాయిందుముఖిఁ జేరి వెరకఁ జెప్పు
నిజముఁ జెప్పిన మరి నీకు నెగ్గు లేదు.

125

కాశీఖండము

యేలిద మనుటకు

క.

బాలుఁడని నమ్మి రిపుతో
నేలిదముగఁ గలసి యునికి యిది కార్య మేయు
త్కీలానలకణ మించుక
చాలదె కాల్పంగ నుగ్రశైలాటవులన్.

126

ఆరణ్యపర్వము

యెల్లిద మనుటకు

క.

తొల్లిటివలె సేవకుఁ బోఁ
జెల్లునె మావారె పెండ్లిఁ జేసెద రిదిగో
యెల్లి దమరంచుఁ బల్కితి
నెల్లిద మగుఁగాదె తరిగి యేఁ బైకొన్నన్.

127

విజయవిలాసము

చామరములకు

ద్విపద.

కొమరొప్ప నొరపుచే కొని యిరుగడల
రమణులు వింజామరంబులు వీవ...

128

రంగనాథుని రామాయణము

చామర లనుటకు

క.

ఎడపక కూలు గొడుగులుం
బడగలుఁ జామరలు గలయఁబడి మూర్ఛితులై
పడియెడు దొరలకు మునుము
న్నొడఁగూడెడు మెత్తబరఫు నెరపు వహించెన్.

129

కవికర్ణరసాయనము

శా.

సారథ్యంబు వహింప భీముఁడు సితచ్ఛత్రంబు గాండీవి చె
ల్వారం బట్టఁగఁ జామర ల్కవవిడన్...

130

శాంతిపర్వము

16 లక్షణము

గీ.

రమణతో నాంధ్రనామసంగ్రహమునందు
చెయివులకు చైవులంచు వచించె పైడి
పాటిలక్ష్మణకవి యది పాటి సేయఁ
దగదుగద కబ్బముల మహీధరశతాంగ.

131

చెయివు లనుటకు

శా.

ధారాస్ఫారకఘోరవృష్టికమలధ్వసంబు వాటిల్లినం
జేరంజోటొక టెందుఁ గానక భ్రమం జెయ్వేదిభృంగావలిం
గారామారఁగ నుద్ధరించెఁ బొగడంగా నొప్పదే నాఁగ నిం
పారం బ్రస్ఫుటకందలీకకఫనీపామోదికాంతారముల్.

132
(

ఎఱ్ఱాప్రగడ హరివంశము

సీ.

మరువక పూనె మైమరువు వరూధిని
                  చెయ్వులన్నియుఁ దక్కె జిత్రరేఖ ...

133

వసుచరిత్రము

ఉ.

సింగంబు ల్మునిబాలిక ల్దిరుగుచుం జెయ్వేది మోదించు సా
రంగంబు ల్దిరుగందపో వనసుతు ల్రాజీవముయుట ల్గోయుటల్......

134

ఉత్తరరామాయణము

17 లక్షణము

ఆ.

తొడిగి తొడి యనంగఁ దోడ్కొని తొడుకొని
యొప్పుటయును మఱియు నొవ్వుటయును
ననఁ గృతులఁ జెల్లు నహిరాజకేయూర
దురితదూర పీఠపురివిహార.

135

తొడి యనుటకు

ఉ.

వీఁక నెదిర్చియిట్లు కురువీరులకుం బ్రమదం బొనర్చుచుం
దాఁకిన క్రోధవేగసముదగ్రత నెఱ్ఱనిచూడ్కిఁ జూచి పే
రాఁకలితోడ నున్నజమునాకృతి భీషణరేఖ యొప్పఁగా
వ్రేఁకని నారసంబుఁ దొడి క్రీడి కడున్ దృఢముష్టి నేసినన్.

136

విరాట పర్వము

గీ.

వేడ్క దొడి పూసికట్టి యవ్విరటు డుత్త
రుండుదో జనుదేర గొల్వుండు బుద్ధి......

137


క.

ఆయుధము విడిచియుండం
సాయకగురు మీరు చూడఁ జంపిన కష్టో
పాయుని దృష్టద్యుమ్ముని
మాయించియకాని తొడిన మరు వే నూడ్వన్.

138

కర్ణపర్వము

సీ.

ఉనికిఁ గృష్ణునిచేత వినిపూసి తొడిగట్టి
                  కొలువిచ్చి మణిహేమకుంజరాశ్వ.

139

శాంతిపర్వము

తొడుకొని యనుటకు

చ.

ముడిగి ముసుంగుతో వెనుకముందును జూడక వచ్చి లోనికిం
దొడుకొనిపోయి వ్రేల్మిడిన ద్రొబ్బిన బెంపునకుం బసిండికిం
జెడితము దార దిట్టుకొని చీయని కేలువిదిల్చి రోయుచుం
గుడినొలుదూరి వెల్వడిరి క్రొత్తగు సిగ్గరిమిండ లయ్యెడన్.

140

కవికర్లరసాయనము

ఒవ్వడమునకు

ఉ.

ఒవ్వనివారు నవ్వ మహిమోద్ధతి ధర్మసుతుండు వీథికై
నెవ్వగబొంద భూజనులు నింద యొనర్సఁగనేఁ బొనర్చు నీ
చివ్వకు నీవు నల్కమెయిఁ జేసిన యీపనిగూడ నీతికిన్
దవ్వగునేని నాయభిమతం బొడగూడియు నిష్ఫలంబగున్.

141

ఆదిపర్వము

క.

ఒవ్వనివారలయెదురన
నివ్విధమున భంగపడితి నేనింక జనుల్
నవ్వంగ నేటి బ్రతుకుగ

నివ్వసుమతి యేలువాఁడ నెట్లు చరింతున్.

142

అరణ్యపర్వము

18 లక్షణము

క.

బంగారన బంగరునా
బంగారము బంగరంబు బంగరు వనగా
రంగుగ గృతులం జెల్లును
గంగాధరవిబుధ సస్యకలితాంబుధరా.

143

బంగా రనుటకు

సీ.

చదలేటిబంగారుజలరుహంబులతూండ్లు
                  భోజనంబులు మాకుఁ బువ్వుబోఁడి....

144

నైషధము

బంగ రనుటకు

చ.

పసిడికురుంజుల న్మెలఁగుబంగరుబొమ్మలఁ జూచుదేవతా
ప్రసవసుంధులన్ ధ్వజపరంపరఁ బిల్చి వివాహవీటికా.....

145

వసుచరిత్రము

బంగార మనుటకు

గీ.

కలిగెఁ బదియారువన్నెబంగారమునకు
పద్మరాగంబుతోడ సంపర్కలబ్ధి......

146

కాశీఖండము

బంగరు వనుటకు

గీ.

గురుతనూభవ నాకు బంగరువుతోడ
వజ్రభూషలు వేయు తాల్పంగవలయు

147

కాశీఖండము

ఇది శబ్దప్రకరణము.

మ.

ఘనకారుణ్యకటాక్షరాక్షసచమూగంధేభహర్యక్షస
జ్జనసంరక్షణదీక్షపాలితసరోజాతాక్షశక్రాంబుజా
సనముఖ్యామరపక్షదక్షసవనాంచత్క్రోధతామ్రాక్షయా
చనకప్రాంగణకల్పవృక్షరిపుశిక్షాదక్షమోక్షప్రదా.

148

గద్య.
ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురం
ధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి
గంగనామాత్యపుత్ర బుధజనవిధేయ తిమ్మయనామధే
యప్రణీతం బయిన సర్వలక్షణసారసంగ్రహం
బనుకృతియందు ద్వితీయాశ్వాసము
సంపూర్ణము.

  1. గరకంఠా యనుచో గరశబ్దమునకు గరళ మర్ధము జెప్పి సంస్కృతసమాసముగా నిర్వహించవచ్చును.
  2. పురంధ్రిభిశ్చక్రమశః ప్రయుక్తం అని కాళిదాసుగా రికారాంతముగాఁ బ్రయోగించినారు.
  3. చావరు, ఈకృష్ణుని ఈరెండుదాహరణములు వ్యర్థములు.
  4. చావరు, ఈకృష్ణుని ఈరెండుదాహరణములు వ్యర్థములు.
  5. కబ్బముల ననులక్షణము నుదాహరణమును సంగతములు గావు.
  6. స్నానశబ్దములో తకారము కలదనుట విచారణీయము.