Jump to content

సర్పపురమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

(గ్రంథపాతము)

ఉ.

పాయక తమ్మిగద్దె ననపాయసుఖోన్నతి నుండి దేవతా
నాయకముఖ్యులున్ మునిజనప్రవరుల్ గొలువన్ జగంబు ల
త్యాయతలీల నేలుచతురాననుఁ డాదరణైకబుద్ధి దీ
ర్ఘాయురభీప్సితార్థము లుదారత మాకు నొసంగుఁగావుతన్.

5


శా.

పాణిద్వంద్వము మోడ్చి మ్రొక్కిడుదు శుంభద్బంభరీవేణికిన్
మాణిక్యాంగదమేఖలావలయసమ్యగ్భూషణశ్రేణికిన్
వీణాపుస్తకపాణికిన్ సురుచిరోర్వీభృళన్నిభశ్రోణి క
క్షీణక్షేమకటాక్షరక్షితమహాగీర్వాణికిన్ వాణికిన్.

6


చ.

కరములఁ దోయిలించి కుతుకంబున నిచ్చలుఁ బ్రస్తుతింతు భా
స్వరగుణవంతునిన్ సకలసత్కవిజాలవనీవసంతునిం
జిరకరుణానిశాంతుని విశిష్టజనావనసుప్రశాంతునిన్
సుగతరుమంజరీనిభయశోహరిదంతుని నేకదంతునిన్.

7


చ.

ముదమునఁ గేలుఁదామరలు మోడ్చి నమస్కృతు లాచరింతు బ
ల్లిదుఁ డగు దెందులూరికులలింగయసద్గురునాథమౌళికిన్
సదమలశీలికిం ద్రిపురసంహరపాదసరోరుహాళి కు
న్మదపరవాదిమండలత మస్సముదాయమయూఖమాలికిన్.

8


సీ.

గురుతరకౌండిన్యగోత్రవిఖ్యాతుండు, బయ్యనామాత్యుఁ డేప్రభునితాత
నిరతాన్నదానవర్ణితయశస్సాంద్రుండు తిమ్మనసచివుఁ డేధీరుతండ్రి
ఘనులు జగ్గనయు సింగనమంత్రియును నరసన్నయు నేధన్యుననుజవరులు
తిమ్మయాఖ్యుఁడ నేఁ బ్రథితులు సింగనయు జగ్గనయు సూరనయు నేయనఘుసూను


తే.

లతులమతి రాజమాంబ యేయధిపుజనని, యతిపతివ్రత లక్ష్మీ యేచతురురాణి
యట్టిశ్రీకూచిమంచివంశాభిచంద్రు, మజ్జనకు గంగనామాత్యు మదిఁ దలంతు.

9


తే.

వ్యాస వల్మీకభవ కాళిదాస మాఘ, చోర భారవి బాణ మయూర భోజ
దండి భవభూతి ముఖ్యవిద్వత్కవీంద్ర, శేఖరుల నెంతుఁ గావ్యసంసిద్ధికొఱకు.

10


ఉ.

నామది నెప్పుడుం దలఁతు నన్నయఁ దిక్కన నెఱ్ఱపెగ్గడన్
భీమకవీంద్రు భాస్కరుని వీరకవీంద్రుని రంగనాథునిన్
సోమునిఁ బోతసత్కవిని సువ్రతు లై బహుళాంధ్రకావ్యముల్
నేమ మెలర్పఁ జెప్పి యవని న్నుతి గన్నమహానుభావులన్.

11

క.

కుకవు లనువారు గలుగఁగ, సుకవులకుఁ బ్రకర్ష గలిగె సులభంబుగ నూ
రకయ భువనోపకృతులఁ, గుకవుల నిరసింపవలదు గుణమాన్యులకున్.

12


వ.

అని నిఖిలదేవతాప్ర్రార్థనంబును గురుచరణస్మరణంబును మహాకవివర్ణనంబును గావించి
యే నొక్కపుణ్యచరిత్రంబు రచియింపంబూనియున్నసమయంబున నొక్కనాఁడు.

13

స్వప్నవృత్తాంతము

సీ.

తెలిదమ్మిరేకులఁ దెగడుకన్నులవాఁడు, తొగవిందు నగుముద్దుమొగమువాఁడు
పలమురియును జుట్టువాలుఁ బూనినవాఁడు, సిరియు మచ్చయు నెద బెరయువాఁడు
తొలుమొగుల్ తెగజిగి దొరయునెమ్మెయివాఁడు, జాళువాహొంబట్టు సాలువాఁడు
బలుదమ్మికెంపుఱాపతకంబు గలవాఁడు, వలఱేని గమకించుచెలువువాఁడు


తే.

చొక్కటపుఁబక్కిరాజక్కి నెక్కువాఁడు, సర్పపురినుండి జగములు సాఁకువాఁడు
భావనారాయణుఁడు మహాప్రభుఁడు నాకు, నెలమిఁ గలలోనఁ బొడగట్టి యిట్టు లనియె.

14


సీ.

ప్రౌఢిమై రుక్మిణీపరిణయంబును సింహ, శైలమాహాత్మ్యంబు నీలపెండ్లి
కథయును రాజశేఖరవిలాసంబును, నచ్చతెనుంగురామాయణంబు
సారంగధరనరేశ్వరచరిత్రంబు స, ప్తార్ణవసంగమాహాత్మ్యకంబు
రసికజనమనోభిరామంబు లక్షణ, సారసంగ్రహము నింపారఁ గూర్చి


తే.

కృతులు శంభున కిడినసత్కృతివి నీవు, ప్రతిభ మెఱయంగ నొక్కసత్కృతి యొనర్చి
మాకు నర్పణసేయు నెమ్మది దలిర్పఁ, దిమ్మకవిచంద్ర ముదితసుధీకులేంద్ర.

15


క.

శివునకు నాకును భేదము, యవమాత్రము లేదు నేనె యతఁ డాతఁడ నే
నవిరళమతి సర్పపుర, ప్రవిమలమాహాత్మ్య మాంధ్రభాషం జెపుమా.

16


వ.

అని యానతిచ్చి యప్పరమేశ్వరుం డంతర్హితుం డైన నేను నత్యంతసంతుష్టాంత
రంగుండనై.

17

షష్ఠ్యంతములు

క.

నారదమునిపూజితపద, నీరజునకు సకలభువననిర్మాణకళా
పారగునకు నతజనసుర, భూరుహునకు విమతభయదభుజసారునకున్.

18


క.

కలశాబ్ధికన్యకాకుచ, కలశాంకితగంధసారఘనసారవిని
ర్మలసౌరభసంవాసిత, కలితోన్నతవక్షునకుమ గమలాక్షునకున్.

19

క.

శారదనీరదనారద, పారదనీహారహారపాటీరసుధా
పూరదరాంచితయశున క, పారదయాస్వాంతునకును భగవంతునకున్.

20


క.

పతగాధిపకేతనునకు, శతధృతిముఖనిఖిలదివిజసంఘాతప్ర
స్తుతచరణసరోరుహునకు, శ్రితజనహితచరితునకును జితదురితునకున్.

21


క.

స్వర్పతినుతచరణునకున్, దర్పోద్ధతదనుజకులవిదారణునకుఁ గం
దర్పాయుతసుందరునకు, సర్పపురాధీశునకును జగదీశునకున్.

22


వ.

సమర్పణంబుగా నారచియింపం బూనిన సర్పపురక్షేత్రమాహాత్మ్యం బనుపుణ్య
చరిత్రంబునకుం గథావిధానం బెట్టి దనిన.

23

కథాప్రస్తావన

క.

శ్రీకమలాధిపపదనా, ళీకధ్యానానుమోదలీలానిరతా
స్తోకమహిమాతిశయదూ, రీకృతభవదోషుఁ డంబరీషుఁడు దనరున్.

24


తే.

ఆమహీపాలకులసార్వభౌముఁ డొక్క, నాఁడు వేడుకతో సభాంతరమునందు
సకలబుధబాంధవామాత్యసహితుఁ డగుచుఁ, దవిలి పేరోలగం బున్నయవసరమున.

25


క.

ఘనుఁడు వసిష్ఠమహాముని, చనుదెంచిన నతని కెదురు చని నతులిడి తో
డ్కొని తెచ్చి యర్ఘ్యపాద్యము, లొనరఁగ నిడి యుచితపీఠి నునిచి కడంకన్.

26


ఆ.

కొంతదడవు విహితగోష్ఠి సంభాషించి, యంత మౌనిఁ జూచి యవనివిభుఁడు
భువనవంద్య సర్పపురమహాక్షేత్రమా, హాత్మ్య మే వినంగ నభిలషింతు.

27


సీ.

అరయంగ సర్పపురాఖ్యాన మెట్టిది, భావనారాయణదేవుఁ డచట
నేమిటి కుదయించి యిల నున్నవాఁడు త, ద్దేవు నెవ్వాఁడు ప్రతిష్ఠ చేసి
నందులఁ గల్గుపుణ్యసరోవరము లెవ్వి, యత్తీర్థములఁ గ్రుంకులాడినట్టి
ఫల మది యెట్టిది ప్ర్రాచుర్యముగ నిది, విన డెందమునఁ జాల వేడ్క యొదవె


తే.

నీసమస్తంబు దెలియ నా కెఱుఁగఁ జెప్ప, వలయు నని వేఁడుకొనిన నవ్వసుమతీశుఁ
గాంచి మునిమౌళి నెయ్యంబు గడలుకొనఁగ, నలర విను మనియిట్లని దెలుపఁదొడఁగె.

28


సీ.

ఘనమౌనిమఘధూమకనదంబుదస్తోమ, శేముషీపరినటచ్ఛిఖివరంబు
పరమతత్త్వవిచారపాండిత్యనైపుణీ, విగతవైరసమస్తమృగకులంబు

గంధర్వగజరాజగామినీజనచిత్ర, సంగీతముదితభుజంగమంబు
విమలమేధోదితవేదశాస్త్రపురాణ, పఠనసముల్లసత్పతగచయము


తే.

లాలితోత్తాలదివ్యరసాలసాల, పల్లవలవానుభవమత్తపరభృతౌఘ
మాధురీధుర్యనినదసమాకులంబు, పుణ్యగణ్యంబు నైమిశారణ్య మలరు.

29


క.

గాలవ కౌశిక కలితో, ద్దాలక శాండిల్యముఖ్యతతపుణ్యతరుల్
లీలం గ్రాలఁగ శుభఫల, మూలంబై యవ్వనంబు మురువున నలరున్.

30


తే.

అవ్వనంబున వేదవేదాంతవిదుఁడు, భగవదంఘ్రిసరోరుహభక్తియుతుఁడు
ఘనుఁడు విజితేంద్రియుఁడు జితకాముఁ డనఘుఁ, డలరు శౌనకుఁ డనెడుమహర్షివరుఁడు.

31


సీ.

హరిపదధ్యానతత్పరులు గొందఱు గొంద, ఱవిరళాచ్యుతకథాశ్రవణనిరతు
లశ్రాంతజపపరాయణులు గొందఱు గొంద, ఱగ్నికార్యనిరంతరాభిరతులు
నిగమాగమాంతపారగులు గొందఱు గొంద, ఱబ్జాక్షపూజనాయత్తమతులు
సతతయోగాభ్యాసచరులు గొందఱు గొంద, ఱఖిలపురాణరహస్యవిదులు


తే.

నగుచు భగవద్గుణస్మృతి నహరహంబు, నగుచు నాడుచుఁ బాడుచు మిగులవేడ్క
నశ్రుకణముల నెరపుచు నమ్మహాత్ము, సభఁ జరింతురు పరమర్షిజనులు లీల.

32


తే.

వచ్చె నచ్చెరువార నవ్వనమునకును, సకలజనవంద్యుఁ డగుకుంభసంభవుండు
మాధవార్పితహృదయతామరసుఁ డైన, యమ్మహాముని దర్శించు నభిమతమున.

33


వ.

అట్లు వచ్చి.

34


తే.

గోమతీతీరమందారభూమిరుహస, మీపవిధుకాంతమణివేదిమీఁద మోద
మమర నాసీనుఁడై సహస్రాంశుఁ బోలి, యున్నయమ్మునిఁ గని ద్విజు లుత్సవమున.

35


క.

వందనము లిడి యమందా, నందంబున నపుడె క్రన్ననం బరువిడి తా
రందఱు శౌనకునకు నా, చందం బెఱిఁగింప నతఁడు సంతస మెసఁగన్.

36


క.

కడువడి నరిగి యగస్త్యునిఁ, బొడగని యర్ఘ్యాదివిధులఁ బూజించి నయం
బడర నతు లొసఁగి యాతనిఁ, దొడుకొని తనమనికి కెలమి తోడం జనియెన్.

37


క.

చని యర్హాసనమున న, య్యనఘుం గూర్చుండఁజేసి యతనియనుజ్ఞన్
వినయాసనతుండై తా, నును దగఁ గూర్చుండి పలికె నూల్కొనుభక్తిన్.

38

సీ.

మునినాథ విస్మయంబుగ మీర లిందు వేం, చేయుటకతన నేఁ జేసినట్టి
తపము సిద్ధించె నెంతయుఁ గృతార్థుఁడ నైతి, సరగ నాజన్మంబు సఫల మయ్యె
మీపదస్పర్శచే మేటిపుణ్యంబుల, కాకరం బయ్యె మదాశ్రమంబు
భవదీయదివ్యకృపానిరీక్షణమున, నిఁక నాకు దుర్లభం బెద్ది కలదు


తే.

నేను నీయాజ్ఞ దలమోచి నిచ్చ నిచ్చ, మెలఁగువాఁడ నటంచు నర్మిలి వచించు
శౌనకునిఁ జూచి యక్కుంభసంభవుండు, పలికె నిట్లని సాంత్వనభాషణముల.

39


క.

నినుఁ బొడగనుకోరికచే, మునివర నే వచ్చినాఁడ ముదమున నిటకున్
విను మింతటికన్నఁ బ్రయో, జన మేమియు లేదు నాకుఁ జర్చింపంగన్.

40


క.

హరిసందర్శనమును శ్రీ, హరిభక్తులదర్శనంబు నక్షులకు ఫలం
బరయఁగ శ్రవణంబులకుం, బరువడిఁ దత్కథలు వినుట ఫలము మునీంద్రా.

41


సీ.

మత్సరు లెల్ల నిర్మత్సరు లగుదురు, రాగాన్వితులు వీతరాగు లగుదు
రజ్ఞు లెల్లను జ్ఞాను లగుదురు నిస్స్పృహు, లగుదు రెంతయు స్పృహయాళు రెల్ల
మహనీయభవదాశ్రమస్థలసంపర్క, మున నని విశ్రుతంబుగ ధరిత్రి
నెన్నంగఁబడుటచే నే నిది గనుఁగొన, నరుగుదెంచితిఁ ధన్య మయ్యె నేఁడు


తే.

తాపసోత్తమ నీమహత్త్వంబు దలఁప, నరిది యని పల్కుటయు వేడ్క నలరి కుంభ
సంభవునిఁ జూచి వేఁడి యా శౌనకుండు, మృదుమధురవాక్ప్రవీణత మెఱయఁ బలికె.

42


తే.

యతికులోత్తంస వినుము తత్త్వావబోధ, శీలుఁడవు నీవు నేఁడు వేంచేసి యిందు
నడుగుపెట్టినకతన మీ రమర ననిన, యట్ల కాఁగల దిఁక సంశయంబు లేదు.

43


వ.

అనిన నగస్త్యుం డిట్లనియె.

44


తే.

సర్వలోకేశ్వరేశుఁడు సర్వకర్త, యఖిలకల్యాణసాగరుఁ డమలమూర్తి
యాదినారాయణుం డాత్మ నతనిఁ దలఁచు, జనుఁ డశేషమహాకిల్బిషములఁ బాయు.

45


సీ.

కన్నులు భవదంఘ్రికములదర్శనమున, మృదుకరస్పర్శఁ ద్వగింద్రియంబుఁ
ద్వత్పదాంబుజసుగంధమున ఘ్రాణేంద్రియం, బును గడుసంతుష్టిఁ బొందె నింకఁ
జెవులు విూవాక్యవైభవము వినంగను, రనన మీవాక్సుధారసముఁ గ్రోల
నభిలషించుచు నున్న వనఘాత్మ సర్వేంద్రి, యసుఖావహం బయ్యె నఖిలశుభఫ


తే.

లములు నొనగూడె భవదాగమమున మాకు, ననుచు నత్యంతవినయజ్ఞుఁ డగుచు నాడి
కలశభవుఁ దద్ద సంప్రీతుఁగా నొనర్చి, యెలమి దైవాఱఁ గ్రమ్మఱ నిట్టు లనియె.

46

వ.

మహాత్మా విశ్వేశ్వరుండును విశ్వయోనియు విశ్వస్రష్టయు జగత్ప్రభుండును ననాది
నిధనుండును శ్రీమంతుండును భగవంతుండును నగు పురుషోత్తముండు సర్వగతుం డై
యుండియుఁ బ్రణామార్చనాదివిధంబుల నచటనచ్చట గోచరుండై ప్రతిష్ఠాపనా
మాహాత్మ్యంబున క్షేత్రప్రభావంబున నరకప్రీతివశంబునఁ బూజాధికృత్యంబున
సాక్షాత్కరుం డగుచుండు నని పౌరాణికజనంబువలన వినంబడుచుండుఁ బుణ్యశ్లోకుం
డును మహాభాగుండు నగునజ్జనార్దనుండు విశేషించియు నెచటనెచ్చట నధివసించి
ప్రకాశించుచుండుఁ బురాణజ్ఞుండవు సమర్థుండ ననఁబరగునీవలన నేతత్ప్రకారంబు
వినవలయు నని మనంబునం గౌతుకంబు విస్తరిల్లుచున్న యది నీ విది నాకుం దేట
తెల్లంబుగా నెఱింగింపవలయునని పార్థించిన విని యగస్త్యమహామునీంద్రుఁ డతని
కిట్లని తెలుపందొడంగె.

47

కథారంభము

క.

ధాత్రి న్మునివర విష్ణు, క్షేత్రంబులు పెక్కుగలవు సిద్ధం బీష
న్మాత్రం బెక్కువ యగు నొక, క్షేత్రము గల దది యెఱుంగఁ జెప్పెద వినుమా.

48


తే.

పుడమి గోదావరికిఁ దూర్పుకడను దుల్య, భాగకు నుదక్తటంబునఁ బశ్చిమమున
వారిరాశికిఁ గోసెఁడుమేర సర్ప, పురమహాక్షేత్ర మభిరామ గరిమ నలరు.

49


తే.

పుణ్యకాసారసహితంబు పుణ్యశీల, సంసృతము పుణ్యకాంతాప్రశస్త మగుచు
సర్వకామార్థదాయియై సర్పపురము, ఖ్యాతి నెలకొందు మూఁడులోకములయందు.

50


క.

నరుఁ డాక్షేత్ర మొకప్పుడు, పరువడి స్మరియింప విడుచు భవబంధము లా
సరసీజలముల మునిఁగిన, దురితౌఘము లెట్టి వైనఁ దొలఁగు మునీంద్రా.

51


తే.

నారదసరోవరంబు ననంతసరసి, ముక్తికాసారమును నన మూఁడుతీర్థ
ములు తరింపఁగఁజేయుఁబో తలఁచినపుడె, సర్వదురితపూర్ణు లౌ జంతువులను.

52


తే.

వరదుఁడు కృపాంబునిధి భక్తవత్సలుఁడు, భావనారాయణుండును దేవుఁ డచటఁ
దనర నారదమునికులోత్తమునిచేత, నున్నతిఁ బ్రతిష్ఠితుం డయి యున్నవాఁడు.

53


క.

మందారశాఖతెఱఁగున, వందారుకజనుల నెల్ల వరఫలముల నా
నందింపఁగఁ జేయుచు హరి, యందంబుగ బుధులు పొగడ నం దుండుఁజుమీ.

54


చ.

అనుటయు శౌనకుండు వినయాన్వితుఁడై కలశోద్భవుం గనుం
గొని మునివాథ నారదుఁడు కోరిక నేమిటి కందు నజ్జనా

ర్దనునిఁ బ్రతిష్ఠ చేసె విదితంబుగ నచ్చటఁ గల్గియున్నపా
వననరసీత్రయంబుఘనవైభవ మెట్టి దెఱుంగఁ జెప్పవే.

55

శేషుఁడు తపం బొనర్చుట

క.

అన నాఘటభవుఁ డిట్లను, మును కశ్యపుఁ డనెడు పరమమునికిం గద్రూ
వనితకుఁ బుట్టినవేవురు, తనయులుఁ బటుసర్పరూపధరు లబ్రముగన్.

56


తే.

వారిపైఁ దల్లి కొండొకకారణమున, నలిగి శపియింప నందఱు నగ్నితప్తు
లై కృశించుచు నున్నచోట నం దనంతుఁ, డనెడుభుజగేంద్రుఁ డొకఁడు రయంబ వెడలి.

57


క.

ధరఁ గల పుణ్యస్థలములు, దిరిగి తిరిగి మరలి యుదధితీరంబున శ్రీ
హరి నచ్యుతు నభవు రమే, శ్వరు గూర్చి మహోగ్రతపము సలుపఁదొడంగెన్.

58


తే.

కుముదకహ్లారకువలయవిమలకమల, సారసౌరభసహితకాసారతీర
మున ననేకాబ్దములు నిష్ఠ పూని ఘోర, తపము గావించె దివిజబృందములు పొగడ.

59


శా.

అక్షీణోగ్రతపస్సమాధి నటు నిదాహారముల్ మాని య
బ్జాక్షశ్రీపదపంకజాతయుగళధ్యానావగాఢాత్ముఁ డై
దీక్షం గ్రాలుచు నున్నచో హరి రమాధీశుండు విష్ణుండు దా
సాక్షాత్కారముఁ బొందె నభ్రమున నాచక్షుశ్శ్రవస్స్వామికిన్.

60


సీ.

శంఖచక్రగదాసిశార్ఙ్గాయుధములతో, భవ్యజాంబూనదాంబరముతోడ
వనమాలికావృతవక్షస్థలంబుతోఁ, గౌస్తుభశ్రీవత్సకములతోడఁ
బద్మరాగాశ్మశుంభత్కిరీటంబుతో, నవరత్నమయభూషణములతోడ
సురుచిరహరినీలశోభితాంగంబుతో, నండజాధీశవాహనముతోడ


తే.

నెలమిఁ బ్రత్యక్షమై మ్రోల నిలిచియున్న, యాదినారాయణునిఁ బరమాత్ముఁ గాంచి
యలర దండప్రణామంబు లాచరించి, యురగకులభర్త దల వాంచి యూరకుండె.

61


తే.

అపుడు కరుణాపయోనిధి యైనశౌరి, వానిఁ గన్గొని యిట్లను వత్స యిచట
నిట్టిదుష్కరతరతపం బేల చేసె, దెవ్వఁడవు నీవు నీకోర్కి యెద్ది చెపుమ.

62


క.

ఉరగా నీతపమునకుం, బరితోషము నొంది యేను బరువడి నీకున్
వర మీ వచ్చితి నడుగుము, కర మరుదుగ నెద్దియైనఁ గడపక యిత్తున్.

63


.

వ.

అని పరమదయాళుండును భక్తవత్సలుండును నగుభగవంతుఁ డానతిచ్చిన హర్షోత్ఫుల్ల
నేత్రుండును బులకితగాత్రుండును సమాహితచిత్తుండును నగుచు ననంతుం డద్దేవు
నిట్లు వినుతింపఁదొడంగె.

64

తనకు సాక్షాత్కరించిన విష్ణువును శేషుఁడు పొగడుట

రగడ.

జయ ముకున్ద సమస్తతాపన జనమనోజ్ఞమిళిన్దనాయక
భయదరక్షోనాథవక్షః పాటనోద్ధతనఖరసాయక
సజలజలదపురన్దరోపల సదృశమఙ్గళదివ్యవిగ్రహ
అజసహస్రవిలోచనముఖామరావళీలసదనుగ్రహ
కలశనీరధికన్యకాముఖ కమలతరుణసరోజబాన్ధవ
బలవదణ్ణజమణ్డలాధిప భాసమానమనోజ్ఞసైన్ధవ
వారిజాతహితప్రభాపరివాదికౌస్తుభమణివిభూషణ
నారదాతివసిష్ఠసనకసనన్దనాదిమునిపోషణ
ఘోరనక్రనిరుద్ధసంశ్రిత కుఙ్జరేన్ద్రవిపన్నివారణ
సారకరుణాపాఙ్గవీక్షణ సమ్యగాదృతసిద్ధచారణ
సురమునీన్ద్రజనైక కారణ శుభకరాఞ్చితపదసరోరుహ
పరమభాగవతాలయాజిరభాసమాననిలిమ్పభూరుహ
బహుతరోద్భవసఞ్చితాఖిల పాతకామ్బుధరప్రభఞ్జన
మహితభక్తివిశేషభూషిత మౌనిమానసకఞ్జరఞ్జన
నిజపిచణ్ణవిమణ్డితామిత నీరజాతభవాణ్డమణ్డల
త్రిజగదభినుత దివ్యమణిగణ దీధితిస్ఫుటమకరకుణ్డల
శతసహస్రార్బుదమనోభవ సదృశనిర్మలరూపభానుర
ప్రతిపదాతికృపానిరీక్షణ పాలితాశ్రితహితమహీసుర
చటులకటితటరాజమానవిశాలచామీకరనిచోళక
కుటిలదైత్యవరూధినీపర ఘోరనిర్భరమదవిభాళక
శరశరద్ఘనహారహీరతుషారచారుయశోవిరాజిత
గరుడకిన్నరయక్షగుహ్యకఖచరవిద్యాధరసుపూజిత
దరసందర్శనశార్ఙ్గఖడ్గగదానమన్వితశయకుశేశయ
చరణసేవకరక్షణాధిక సమ్మదావృతనిర్మలాశయ

వరద నారాయణ చతుర్భుజ వాసుదేవ హరే జనార్దన
పరమపురుష పరేశ కేశవ పద్మనాభ రిపుప్రమర్దన
మధునిషూదన కృష్ణ కైటభమధన విష్ణో గరుడకేతన
విధిమనోభవజనక భవహర వేదవేద్య జగత్సవాతన
తరణిహిమకరనయన దోరన్తరనిరన్తరవిలసదిన్దిర
పరమపావన విశ్వమయ మాం పాహి శ్రీవైకుణ్ఠమన్దిర.

65


సీ.

దీనబాంధవ కృపాబ్ధీ భక్తవత్సల, రవికోటిధామ పురాణపురుష
క్షీరాబ్ధిశయన లక్ష్మీమనోవల్లభ, వైకుంఠనాయక వాసుదేవ
నిగమాంతసంవేద్య నిర్మలానంతక, ళ్యాణగుణార్ణవ యాదిదేవ
జగదుద్భవస్థితిసంహారకారణ, భూత భావన మహాద్భుతచరిత్ర


తే.

పుండరీకాక్ష నీగుణంబులు గణింప, నజసహస్రాక్షులకు నైన నలవి గాదు
బాలిశుఁడ నైన నేను నిన్ బ్రస్తుతింప, నెంతవాఁడను మునిజనస్వాంతభవన.

66


తే.

వారిజాతాక్ష యిపుడు భవత్కటాక్షవీక్షణంబున నఘములు వీడఁ బాఱె
క్షుత్పిపానలు దీఱ నీశుభదమృదుల, వాక్సుధారసపానంబు వలన నీశ.

67


క.

నిను స్మరియించినఁ దలఁచినఁ, గనుఁగొన్నను వందనములు గావించిన న
ర్చన లొసఁగిన సజ్జనులకు, ఘనదురితము లెల్లఁ బాయుఁ గద జగదీశా.

68


క.

వనజభవ భవ సురేంద్రులు, సనకాదినమస్తయోగిజనులును వేదాం
తనిగూఢార్ధజ్ఞానులుఁ, గనలేనిత్వాదంఘ్రియుగము గంటి నధీశా.

69


తే.

అహహ జగముల నాభాగ్యమహిమ యెన్న, నరిది యిఁక నింతకంటె నేమైనఁగోర్కి
గలదె భవదంఘ్రియుగభక్తి గలుగ నిమ్ము, చిరతరానంద గోవింద శ్రీముకుంద.

70

శేషుఁడు తనవృత్తాంతమును విష్ణువునకుఁ దెల్పుట

తే.

అయిన నెఱిఁగింతు నిపుడు మీయాజ్ఞవలన, నేఁదపము సేయు కార్యంబు నిక్కువముగ
ననఘ కశ్యపుఁ డనెడుమహర్షివరుని, తనయుఁడ ననంతుఁ డనుపేరఁ దనరువాఁడ.

71


క.

భ్రాతలు వేవురు నాకు, మాతృక కద్రూవధూటి మ మ్మొకపనికై
యాతతదహనజ్వాలల, చేతం బడుఁ డంచు నలిగి సెపియించుటయున్.

72

తే.

అందుఁ దక్షకుఁ డనియెడు నహివిభుండు, శాపభయవర్జితుం డయి జగతిఁ బ్రబలె
నేను నీపాదసరసిజధ్యానరూఢి, నిట్లు తప మాచరించెద నీశ్వరేశ.

73


తే.

భక్తవత్సల నే నినుఁ బాసి యింక, నొక్కతావున వసియింప నుత్సహింప
నీపదాంబుజయుగళసేవాపరత్వ, మూని యేప్రొద్దు నెమ్మది నుండువాఁడ.

74


మ.

నలినాక్షాయ నమో౽స్తుతే భగవతే నానాజగద్రూపిణే
ఖలహృద్దర్పతమస్సహస్రఘృణయే కైవల్యనాథాయ ని
ర్మలకారుణ్యగుణాయ ధాతృగురవే మన్దాకినీనామశై
వలినీప్రోద్భవకారణాయ యనుచున్ వాక్రుచ్చి కేల్మోడ్చినన్.

75

విష్ణువు శేషునియెడ నిజానుగ్రహము చూపుట

ఆ.

హరి యహీనకరుణ నయ్యహీనకులేంద్రు, గారవించి యింపు గదురఁ బలికె
వత్స నీకు భీతి వల దింక నాయొద్దఁ, దలఁగ కెపుడు నెలమిఁ దవిలియుండు.

76


క.

భక్తపరాధీనుఁడ నే, భక్తుల నెడఁబాసి యొక్కపట్టున క్షణమున్
శక్తుఁడఁ గాను వసింపఁగ, భక్తాధీనంబు నాదు బ్రదుకు కుమారా.

77


క.

భుజగకులనాథ నీకున్, నిజభక్తిపరుండ వీవు నేఁ డాదిగ నిన్
సుజనహితు విడుచుటకు న, క్కజముగ నెమ్మనమునందుఁ గాంక్షింపఁజుమీ.

78


క.

తలిమంబ వగుము నా క, గ్గలము సుఖావహము గాఁగ గణుతింపఁగ న
వ్వల నింతకన్న మఱి కాఁ, గలుగు ప్రయోజనము లేదు గద యురగేంద్రా.

79


ఆ.

శైత్యసౌకుమార్యసౌగంధ్యముల నాకు, శయ్య వగుచు నీవు నెయ్య మమర
నధివసింప మిగుల నర్హుఁడ వగుదువు, భువనవిదితతేజ భుజగరాజ.

80


తే.

అక్కజంబుగ నీపేర నిక్కొలంకు, భూతలంబున విఖ్యాతిఁబొందఁగల ద
నంతకాసారసంజ్ఞ ననారతంబు, సకలదోషాపహరణప్రశస్తిఁ గాంచి.

81


తే.

అఖిలకలుషప్రపూరితుఁ డైనమనుజుఁ, డీతటాకంబులో గ్రుంకెనేని యం ద
నంతఫలభాజనం బయి సంతసమున, దివ్యకైవల్యపట్టణస్థితిఁ జెలంగు.

82


క.

సర్పత్వము నీ కెపుడుఁ బ్ర, సర్పితమైయున్నకతన సమధికలీలన్
సర్సపురాహ్వయమునఁ దగ, నేర్పడఁగాఁగలదు సువ్వె యీక్షేత్ర మిలన్.

83

క.

పేరెన్నికగా నిం దొక, కారణమునఁ బొడమి నిలువఁగలవాఁడఁ జుమీ
నారదుఁ డనుమునివరున క, పారకృపారససమృద్ధిఁ బ్రత్యక్షం బై.

84


వ.

అని నిఖిలగుణాశ్రయుండును భక్తపరతంత్రుండును భగవంతుండును నగుశ్రీహరి మృదు
మధురగంభీరోదారవచనంబుల భుజంగపుంగవు నారాధించి యంతర్ధానంబు నొందెఁ
బ్రతిదినంబు నీయుపాఖ్యానం బాకర్ణించుజనుండు జన్మబంధంబులం బాయునని చెప్పిన
విని శౌనకుం డగస్త్యునకు వెండియు నిట్లనియె.

85

సర్పపురమందలివిష్ణుప్రతిష్ఠనుగుఱించి యగస్త్యుని శౌనకుం డడుగుట

ఆ.

యతికులేంద్రచంద్ర యద్భుతంబుగ నీక, థాప్రసంగ మిపుడు దవిలి వింటిఁ
గాని మదికిఁ దృప్తి గలుగకున్నది యింక, వినఁగవలయుఁ దెలుపు విస్తరముగ.

86


తే.

కలశజన్మ యొకానొకకారణమున, నిచట వసియింతు నని భుజగేంద్రుఁ బలికె
నాదిపూరుషుఁ డైనట్టి హరి యటంచు, నాడితిరిగద మీ రిపు డద్భుతముగ.

87


క.

ఆకారణ మెట్టిది భువ, నైకధురంధరుఁడు విష్ణు వీశుఁడు ధరణిన్
దాకొని నారదమునిచే, నేకరణిఁ బ్రతిష్ఠఁ బొందె నెఱిఁగింపు దయన్.

88

నారదుండు బ్రహ్మసభ కరుగుటనుగుఱించి యగస్త్యుండు దెల్పుట

సీ.

అనిన శౌనకున కి ట్లనియె నగస్త్యుండు, సంయమీశ్వర ఫణిస్వామితోడ
భగవంతుఁ డాడినపలుకు తథ్యంబుగ శోభనలీల నచ్చోటఁ బుడమి
నారదమునిచే జనార్దనుఁ డెలమిఁ బ్ర, తిష్ఠితుఁ డై యుండె దివిజు లెన్న
నత్తెఱఁ గెఱిఁగింతు నవధరింపుము సమా, హితమనస్కుఁడ వయి వితతభక్తి


తే.

సకలభువనంబులం దెల్ల సంతతంబు, సంచరించుచు నుండును జ్ఞాననిధియుఁ
బరమభాగవతాచారనిరతుఁ డైన, నారదర్షివరుం డొక్కనాఁడు వేడ్క.

89


సీ.

కాషాయవసనరంగత్కటీరముతోడ, రమ్యమృదూర్ధ్వపుండ్రంబుతోడఁ
బద్మాక్షమాలికాప్రతతవక్షముతోడ, నకుటిలదండకుండికలతోడఁ
గనకవిపంచికాకలితహస్తముతోడఁ, బటుతరారుణజటాపటలితోడ
శరదిందుచంద్రికాసదృశగాత్రముతోడ, డంబారుకృష్ణాజినంబుతోడ


తే.

మాధవానంత గోవింద మధునిషూద, నాచ్యుతజనార్దనోపేంద్ర హరిశయాన
యనెడుస్మృతివాక్యములతోడ నద్భుతముగఁ, దండ్రిదర్శించుకోరికఁ దరలి చనియె

90

వ.

అయ్యవసరంబున.

91


సీ.

బలరిపుప్రముఖదిక్పాలకు లొకవంక, నొకవంక సనకాదియోగివరులు
గరుడకిన్నరయక్షగంధర్వు లొకవంక, నొకవంక సిద్ధగుహ్యకకులేంద్రు
లర్కచంద్రాదిగ్రహాధీశు లొకవంక, నొకవంకఁ గద్రూభవోత్తములును
ఖచరవిద్యాధరగ్రామణు లొకవంక, నొకవంక వసురుద్రహుతవహులును


తే.

గొలువ శతకోటిమార్తాండవిలసదమల, మణిగణస్థాపితాస్థానమండపమున
రత్నపీఠాగ్రమున నురుప్రాభవమున, హాళిఁ గొలువుండె సరసీరుహాసనుండు.

92


వ.

అట్లు గొలువున్న యన్నిలింపజ్యేష్ఠుం బొడగాంచి నమస్కరించి నారదుండు తదాజ్ఞా
ప్రకారంబున నర్హాసనమునం గూర్చుండి యిట్లని వినుతించె.

93


సీ.

జయ పితామహ సర్వజగదుద్భవనిధాన, జయ చతుర్ముఖ యోగిజనశరణ్య
జయ వాగ్వధూవర సకలలోకేశ్వర, జయ హంసవాహన జలజగర్భ
జయ శతానంద నిశ్చలగుణాలంకార, జయ సురజ్యేష్ఠ సుజ్ఞానగమ్య
జయ విరించన వేదశాస్త్రప్ర్రపంచజ్ఞ, జయ సరోజాసన సాధువంద్య


తే.

జయ పురందరముఖసుధాశనవితాన, భర్మకోటీరనిఘటితపద్మరాగ
మణిమయూఖావళీరాజమాననూత్న, దివ్యతరపాదరాజీవ దేవదేవ.

94


వ.

అని నుతించుచున్నసమయంబునం జతుర్ముఖుండు చతుర్వక్త్రంబులఁ బరమాద్భుతంబు
లైనవృత్తాంతంబులు సభాజనంబు లానందింపం జెప్పుచుండి యంతఁ బ్రసంగవశంబున
లక్ష్మీమనోనాథుం డైనవిష్ణుననంతవైభవంబు సమధికగంభీరనాదంబున నిట్లని చెప్పఁ
దొడంగె.

95

నారాయణునియుత్కృష్టత్వమును బ్రహ్మ వర్ణించుట

తే.

స్రష్టయును సృజ్యుఁడును దానె జగములందు, రక్షకుఁడు రక్ష్యుఁడును దానె ప్రత్యహంబు
హర్తృసంహార్యులును దానె యతికృపాప, రాయణుం డైనయాదినారాయణుండు.

96


తే.

అజుఁ డతండె జనార్ధనుఁ డతఁడె శంభుఁ, డతఁడె పురుహూతుఁ డతఁడె చంద్రార్కు లతఁడె

వహ్ని యాతండె సకలదేవతలు నతఁడె, విశ్వ మంతయు నాతండె వేఱులేదు.

97


క.

నేనును బురుహూతుఁడు నీ, శానుఁడు నిఖిలామరులును సనకాదిమహా
మౌనులును విష్ణుమాయా, నూనావర్తమున మునుఁగుచుండుదుముగదా.

98


వ.

మఱియు దేహప్రాణంబులు భిన్నంబు లయ్యు నేకప్రకారంబునం గనుపట్టు దేహంబులు
జడంబులు ననిత్యంబులు నవిశుద్ధంబులు నతివికారంబులు నై పంచభూతంబులచేత
సంవర్ధితంబు లగుచు నంతంబున వానియందె విలయంబును జెందు విరుద్ధధర్మసంక్ర
మణంబునఁ దాదాత్మ్యవర్ణనంబునం దనర్హంబు లై యుండుఁ బ్రాణంబులు చిదానం
దాత్మకంబులు నిత్యంబులు శుద్ధంబులు నిర్వికారంబులుఁ బరమాత్మైకధారకంబులు నై
యుండు దేహప్రాణంబులకు సంసర్గంబు గావించి భగవంతుం డైన నారాయణుండు
తాదాత్మ్యబుద్ధిం బుట్టించుఁ దద్దేహుల కన్నాదులు ధారకంబులు స్రక్చందనాదులు
భోగ్యంబు లై యుండు.

99


తే.

అంబుజాతభవాండమధ్యస్థు లగుచ, తుర్విధప్రాణులును దెల్వి దొఱఁగి మదన
జనకమాయామహావర్తమున మునింగి, వెడల శక్తులు గాకుండ్రు వేయునేల.

100


వ.

ఆబ్రహ్మస్తంబపర్యంతంబు స్థావరజంగమాత్మకం బగుసకలజగంబుఁ బ్రకృతినిష్ఠితం బై
యుండుఁ బ్రకృతి లోకంబునకుం గారణంబు బలవత్తరంబుగ మాయాగుణత్రయాను
బద్ధులును గామమోహితులును నై సమస్తప్రాణులు నుత్కృష్టధర్మం బగుజ్ఞానవైరాగ్య
లక్షణం బెఱుఁగనేరక చెడుదురు జ్ఞానబుద్ధు లగుసమస్తయోగులు నణిమాదినిహతు
లగుదురు బ్రహ్మనైష్ఠికు లగుయతు లహంకారావృతు లై చెడుదురు వేదశాస్త్రాధికారు
లగుద్విజులు విద్యాగర్వప్రతిగ్రహదోషంబుల నశింతురు మఱియుం గరితురగాందోళి
కాంబరాభరణమణిరమణీప్రముఖమహైశ్వర్యగర్వంబున నుర్వీపతులును బరాహిత
క్రియావిధానంబుల మంత్రవాదులును శాపరూపకోపాటోపంబున బ్రహ్మర్షులును నకృ
త్యపరిగ్రహంబున సోమయాజులును లోభంబున ధనికులును యాచ్ఞాదికంబుల దరిద్రు
లును నీశ్వరార్సితబుద్ధిరహితయాగాదిదానంబులఁ గుదాతలును బరవధూప్రతిగ్రహాది
వివిధదోషంబుల సమస్తజనులును నధర్మాచారనిరతు లగుచు వర్తించి నశించి స్వర్గయ
..లయాదిలోకంబులం బ్రవేశించి తత్తత్పుణ్యపాపఫలంబు లనుభవించి క్రమ్మఱ
నవనిం బ్రవేశించి కృమికీటకమృగఖగాదికపాపయోనులం ప్రభవించి మరల నశించి

పునఃపునర్జననమరణాదిదుఃఖంబులఁ గృశించుచుండుదురు జననమరణంబులకు నంతంబు
లేకుండు నట్లుగాక.

101


ఆ.

శివునిమీఁదనైన క్షీరాబ్ధికన్యకా, ధవునిమీఁదనైనఁ దలఁపు నిలిపి
నతినుతిప్రపూజనముల సంతసిలంగఁ, జేయుఘనుఁడు ప్రకృతిఁ జెందకుండు.

102


క.

గోవిందకీర్తనము గౌ, రీవల్లభపూజనంబు దృఢతరభక్తిం
గావించుమనుజుఁ డొందుం, గేవలనిర్వాణపద మకిల్బిషుఁ డగుచున్.

103


వ.

అని యిట్లు సరోజాసనుండు పలుకుచున్న విని నారదుండు దండ్రి కిట్లనియె.

104

నారదుండు గర్వోక్తులాడి బ్రహ్మచే శపింపఁబడుట

సీ.

అభవ నీమాట తథ్యము ముజ్జగములఁ బా, యక వర్తమానచరాచరంబు
లగుప్ర్రాణు లఖిలంబు ననిశంబు విష్ణుమా, యామహావర్తంబునందు మునుఁగు
చుండు నే నప్పురుషోత్తముమాయను, దవులక యుండితి నవిరతంబు
నని నామదిని సంశయం బొకయింతయుఁ, గలుగక వర్తింతు నెలమి మీఱ


తే.

ననుచు గర్వసమన్వితం బైనమాట, నారదుం డాడుటయు శతానందుసభను
గలుగువా రందఱును నెమ్మొగములు వాంచి, యూరకుండిరి మాటాడ కోర్మి మెఱయ.

105


వ.

అప్పు డజుండు విహ్వలమానసుం డగుచు నారదున కిట్లనియె.

106


తే.

నారదమునీంద్ర నీవంటివార లిట్టి, మాట పలుకంగఁదగదు విస్మయము మీఱ
నన్య మేటికి భావమాలిన్య మిదియె, కాఁగలదుసుమ్మ నీకు నిక్కంబు గాఁగ.

107


వ.

అని పితామహుండు నారదుం బలికి నిజావాసమందిరంబునకుం జనియె సమస్తదేవర్షి
వరులును యథాస్థానంబులకుం జనిరి నారదుండును యథాపూర్వకంబుగా లోక
సంచారతత్పరుం డై తిరుగుచుండె నని శౌనకున కగస్త్యుం డెఱిఁగించిన నతం డతని
నవ్వలికథావిధానం బెట్లని యడుగుటయును.

108


చ.

సరసగుణాలయా ప్రణతసామజరాట్పరిపాలనప్రియా
చిరకరుణామయా పతగశేఖరదివ్యహయా లసన్నయా
పరిహృతఘోరకల్మషవిపత్ప్రచయా వినివారితామయా
హరిహయముఖ్యనిర్జరగుణార్చితపాదసరోరుహద్వయా.

109

క.

అంభోధికన్యకాకుచ,
కుంభద్వయగంధసారకుంకుమపంకా
దంభామోదామోదిత, శుంభద్దోరంతరాళ శుభగుణశీలా.

110


సుగంధివృత్తము.

కాశ హార కాశహార కౌముదీ పయ స్సుధా
కాశనిమ్న గేందు తారకా శతార తారనీ
కాశకీర్తిసంప్రకాశ కామితార్థదాయకా
కేశవాచ్యుతాప్రమేయ కృష్ణ లోకనాయకా.

111

గద్యము. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రాజ్య
ధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్య
పుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ
తిమ్మకవిసార్వభౌమప్రణీతం బైనసర్పపురక్షేత్ర
మాహాత్మ్యం బనుపుణ్యచరిత్రంబునందుఁ
బ్రథమాశ్వాసము.