సర్పపురమాహాత్మ్యము/పీఠిక
పీఠిక
పూర్వకథారచనాయోగంబునం బ్రసిద్ధి గాంచిన సర్పపురమాహాత్మ్యంబును నచ్చతెనుఁగుంగబ్బములలో నొక్కఁ డై వన్నెకెక్కిననీలాసుందరీపరిణయంబును శ్రీమత్కూచిమంచితిమ్మకవిప్రణీతములు, ఈతిమ్మయ లోకంబున నభినవవాగనుశాసనుఁ డనియుఁ గవిసార్వభౌముఁ డనియు బిరుదులఁ గాంచినమహాకవి.
ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు; కౌండిన్యసగోత్రుఁడు. బయ్యనామాత్యుని మునిమనుమఁడు. ఇతనిపితామహుఁడు తిమ్మయ, తండ్రి గంగనామాత్యుఁడు. తల్లి లక్ష్మమ. జగ్గన సింగన నరసనయు నితని పెదతండ్రులు, వీరమ పాపమయును మేనత్తలు. రాజనయు జగ్గనయు సూరనయు సహోదరులు. తిమ్మనయు సింగనయుఁ బెదతండ్రికొడుకులు. భార్య బుచ్చమ. ఈతనినివాసస్థలము గోదావరీమండలమందలి [1]పీఠికాపురసంస్థానములోని కందరాడ యనుగ్రామ మనియు నితఁ డాయూరికరణ మనియుఁ దెలియవచ్చెడిని. ఇతఁడు పుట్టి పెరిఁగినతావు చంద్రమపాలెము.
ఇతఁడు దెందులూరిలింగనారాధ్యదేశికేంద్రదత్తమాహేశ్వరాచార్యవృత్తిరతుఁ డైనను గేవలశైవుఁడు గాక యద్వైతమతమే యవలంబించినట్టు లితనిగ్రంథములవలనఁ దెలియ వచ్చుచున్నది. కావుననే భావనారాయణస్వామి తిమ్మకవికి స్వప్నమునందు సాక్షాత్కరించి.
| "శివునకు నాకును భేదము యవమాత్రము లేదు. ...... .... .... | |
మని కోరఁగా గ్రంథమును రచించి యాదేవునకు సమర్పించినట్టు లీసర్పపురమాహాత్మ్యములోఁ దెల్పఁబడియున్నది.
ఈకవి పీఠికాపురసంస్థానమునకుఁ బ్రభువైన రావుమాధవునికాలములో నుండి కృతులు వ్రాసి కవిసార్వభౌముఁడు లోనుగా బిరుదులం బడసియున్నట్లు తెలియుచున్నది. ఈతని రెండవకృతి యగురుక్మిణీపరిణయము హూణశకము 1715 వ సంవత్సరమున రచియింపఁ బడియుండుటచేతను నీతనికడపటికృతి యగు శివలీలావిలాసము హూణశకము 1758వ సంవత్సరమందుఁ జేయఁబడియుండుటచేతను నీతిమ్మకవి హూణశకము పదునెనిమిదవశతాబ్దారంభమునకుఁ గొంచెము పూర్వము జనించి తచ్ఛతాబ్దమధ్యముదాఁక జీవించియుండినట్టు గనఁబడుచున్నది.
శ్రీసర్పపురక్షేత్రమాహాత్మ్యము.
పద్యప్రబంధము కూచిమంచి తిమ్మకవి కృతము.
ఇది 'అభినవవాగనుశాసనుఁడు' 'కవిసార్వభౌముఁడు' అను బిరుదము లంది క్రీ. శ. 17, 1 శతాబ్దముల మధ్యకాలమున విలసిల్లిన కూచిమంచి తిమ్మకవి క్రీ. శ. 1754 సంవత్సరము రచించినప్రబంధము. ఇందలి కథాభాగము బ్రహ్మకైవర్తపురాణోక్త మైనసర్పనగరక్షేత్రమాహాత్మ్యమునకు ఆంధ్రీకృతి. అంబరీషచక్రవర్తియాస్థానమునకు వసిష్ఠమహర్షి విచ్చేసినపుడు అంబరీషుఁ డాతనిం బూజించి కుశలసంభాషణానంతరము 'సర్పపురాఖ్యాన మెట్టిది? భావనారాయణ వుఁ డట నేల యుదయించె? ఆదేవు నచట నెవ్వరు ప్రతిష్టించిరి? అందలిపుణ్యసరోవరము లెవ్వి? ఆతీర్థములఁ గ్రుంకులిడిపఫల మెట్టిది?' అని యడుగఁగా వసిష్ఠుఁ డీమాహత్మ్యము నుగ్గడించెను.
ఈసత్ప్రబంధమును దొలుత నీలాసుందరీపరిణయముతోఁ గలిపి వావిళ్ళవా రెపుడో ముద్రించిరి. ఆ తరువాత నిదియే ద్వితీయముద్రణమై యుండును. కూచిమంచి తిమ్మకవి మహాకవిసార్వభౌముఁడు. ఈతని కవిత్వము ఏనుఁగు లక్ష్మణకవిమాటలలో:
| "హాటక గర్భవధూలీ | |
కవిత్వమా మృదుమధుర మైనది. కావ్యవస్తువా పరమపవిత్రమైనది. కాకినాడకు రెండుమైళ్ళలోఁ గలయీపవిత్రక్షేత్రమాహాత్మ్య మెల్లరకుఁ బారాయణయోగ్యము. ఈయుత్కృష్టప్రబంధమును జక్కనికాకితములపైఁ జక్కఁగా ముద్రించి ప్రకటించిన శ్రీ సర్పవరదేవస్థాన ట్రస్టీ లభినందనీయులు.
ఇట్టి గ్రంథమున కొకసమగ్ర మగుపీఠిక, తేటతెల్ల మగుకథాసంగ్రహము సమర్థుఁ డగుపండితునిచే వ్రాయించి చేర్చి యుండినచో గ్రంథగౌరవ మినుమడించి యుండెడిది. ప్రాచీనప్రబంధముల నచ్చువేయించి ప్రకటించువా రిట్టిపీఠికాదుల విలువ గ్రహింపక పోవుట పెద్దలోపము.
- ↑ పీఠికాపురమునకె పీఠీపురమనియుఁ బీఠపుర మనియు నామాంతరములు. ఇప్పుడు పిఠాపుర మని ప్రసిద్ధి.