సమాచార హక్కు చట్టం, 2005/ఛాప్టర్ II

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఛాప్టర్ II

సమాచార హక్కు, అధికార యంత్రాంగాల విధులు

3. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం పౌరులందరికీ సమాచారాన్ని పొందే హక్కు ఉంది.

4. (1) ప్రతి అధికార యంత్రాంగమూ

(ఎ) ఈ చట్టం ప్రకారం సమాచార హక్కు అమలయ్యేందుకు వీలైన రీతిలో తమ దగ్గరున్న అన్ని రికార్డులనూ పట్టికలు, పద సూచికలతో నిర్వహించాలి. కంప్యూటర్ లీకి ఎక్కించదగిన అన్ని రికార్డులలోని సమాచారం అందుబాటులీ ఉండేందుకు వీలుగా, వనరుల లభ్యతపై ఆదారపడి, సహేతుకమైన కాలపరిమితి లోపు ఆ రికార్డులలోని సమాచారాన్ని దేశవ్యాపిత నెట్వర్క్ లో ఎక్కించేందుకు చర్యలు తీసుకోవాలి.
(బి) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 120 రోజుల్లోగా కింది వాటిని ప్రచురించాలి.
(i) ఆ అధికార యంత్రాంగానికి సంబంధించిన వివరాలు, పనులు, విధులు
(ii) దాని అధికారులు, ఉద్యోగులకున్న అధికారాలు, విధులు
(iii) పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన మార్గాలతోపాటు, నిర్ణయ ప్రక్రియలో అనుసరించే విధానాలు,
(iv) కార్యనిర్వహణలో పాటించే పద్ధతులు
(v) దాని దగ్గర వున్న , లేక నియంత్రణలో ఉన్న, లేదా కార్యనిర్వహణలో దాని ఉద్యోగులు పాటించే నియమ నిబంధనలు, ఆదేశాలు, మాన్యువళ్లు, రికార్డులూ,
(vi) దాని దగ్గర ఉన్న, లేక నియంత్రణలో ఉన్న పత్రాల రకాలకు సంబంధించిన ప్రకటన.

(vii) దాని విధానాల రూపకల్పన కోసం, లేక వాటి అమలుకకోసం, పౌరులతో సంప్రదింపులు జరిపేందుకు, లేక వారి ప్రాతినిధ్యం స్వీకరించేందుకు ఏదైనా పద్దతి ఉన్నట్లయితే ఆ వివరాలు
(viii) దానిలో భాగంగా గానీ, సలహాలు ఇచ్చేందుకు గానీ ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువమంది సభ్యులతో బోర్డులు, కౌన్సిళ్లు, ఇతర సంస్థలు ఏర్పాటైఉంటే వాటి వివరాల ప్రకటన: వీటన్నింటి సమావేశాలకు ప్రజలను అనుమతిస్తున్నదీ లేనిదీ; ఆ సమావేశాల వివరాలు ప్రజలకుఅందుబాటులో ఉన్నదీ లేనిదీ,
(ix) దాని అధికారులు, ఉద్యోగుల సమాచార సంపుటం
(x) దాని అధికారులు, ఉద్యోగులు పొందే నెలవారీ వేతనం, నిబంధనల ప్రకారం ఉన్న పరిహారం చెల్లింపు వ్యవస్థ వివరాలు,
(xi) అన్ని ప్రణాళికలు, ప్రతిపాదిత వ్యయాలు, జరిపిన చెల్లింపుల వివరాలు, విడివిడిగా పేర్కొంటూ, దాని కింద ఉన్న అన్ని ఏజెన్సీలకూ కేటాయించిన బడ్జెట్ వివరాలు,
(xii) సబ్సిడీ పథకాల అమలు తీరు, వాటికి కేటాయించిన నిధులు, ఆ పథకాల లబ్దిదారుల వివరాలు
(xiii) అది మంజూరు చేసే రాయితీలు, పర్మిట్లు, అనుమతులు, పొందిన వారి వివరాలు.
(xiv) అందుబాటులో ఉన్న/నియంత్రణలో ఉన్న సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో కుదించిఉంటే...ఆ వివరాలు
(xv) ప్రజల కోసం ఏదైనా గ్రంథాలయ , లేక పఠనాలయం నిర్వహిస్తూ ఉండి ఉంటే వాటి పనివేళలలతో పాటు, సమాచారం పొందేందుకు ప్రజలకున్న సదుపాయాల వివరాలు.
(xvi) పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు.
(xvii) నిర్ణయించిన తీరుగా ఇతర సమాచారం ఏదైనా, ఆ తర్వాత ఏడాదికోసారి ఈ సమాచారం అంతటినీ సరిచేసి కొత్తగా ఇవ్వడం.
(సి) ముఖ్యమైన విధానాలను రూపొందించేటప్పుడు గానీ, ప్రజలపై ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు గానీ వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రచురించాలి.
(డి) పాలనాపరమైన లేక అర్థన్యాయ (క్వాసీ జ్యూడీషియల్) నిర్ణయాలకు గల కారణాలేమిటోఆ నిర్ణయాల ప్రభావాలకు లోనయ్యే వ్యక్తులకు వివరించాలి.
(2) సమాచారాన్ని పొందడం కోసం ప్రజలు వీలైనంత తక్కువగా ఈ చట్టాన్ని ఆశ్రయించేట్లు చూడడం కోసం సబ్ సెక్షన్ (1)లోని క్లాజ్ (బి) నిర్ధేశిస్తున్న రీతిగా, ఎవరూ కోరకుండానే వీలైనంత ఎక్కువసమాచారాన్ని ఇంటర్నెట్ తో సహా వివిధ ప్రసార సాధనాల ద్వారా క్రమానుగతంగా ప్రజలకు అందించేందుకు కృషి చేయాలి.
(3) సబ్ సెక్షన్ (1) నిర్ధేశిస్తున్న విధంగా వ్యవహరించేటప్పుడు, ప్రతి సమాచారాన్ని ప్రజలకు తేలికగా అందుబాటులో ఉండే రూపంలో, రీతిలో విస్తృతంగా వ్యాప్తి చేయాలి.
(4) అన్ని రకాల సమాచారాలను వ్యాప్తి చేసేటప్పుడు...ఉచితంగా లేదా ఎంత చౌకగా ఆ పని చేయగలం, స్థానికంగా వాడుకలో ఉన్న భాష సమాచార వ్యాప్తికి స్థానికంగా బాగా ఉపకరించే పద్ధతులు, సమాచారం తేలికగా, వీలైనంతవరకూ ఎలక్ట్రానిక్ రూపంలో కేంద్ర పౌర సమాచార అధికారికి/రాష్ట్ర పౌర సమాచారఅధికారికి అందుబాటులో ఉండటం, రుసుము, లేక /ప్రసార మాధ్యమాల వ్యయం, లేక ప్రచురణ వ్యయం అందుబాటులో ఉండటం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
వివరణ : సబ్ సెక్షన్లు (3), (4) కు సంబంధించి వ్యాప్తి చేయడం అంటే నోటీసు బోర్డులు, వార్తా పత్రికలు, బహిరంగ ప్రకటనలు, మీడియాప్రసారాలు, ఇంటర్నెట్ లేక అధికార యంత్రాంగం కార్యాలయాలను తనిఖీ చేయడం సహా ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం.

5. (1). ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోగా ప్రతి అధికార యంత్రాంగమూ, ఈ చట్టం కింద సమాచారాన్ని కోరేవారికి ఆ సమాచారాన్ని అందించడం కోసం అన్నిపాలనా యూనిట్లు లేక కార్యాలయాల్లో ఎంతమంది అవసరమో అంతమంది కేంద్ర పౌర సమాచార అధికారులను లేక రాష్ట్ర పౌర సమాచార అధికారులను నియమించాలి.

(2) సబ్ సెక్షన్ (1) లోని నిబంధనలకు విరుద్ధం కాని రీతిలోఈచట్టం అమలులోకి వచ్చిన తర్వాత వందరోజులలోగా ప్రతి అధికారయంత్రాంగమూ ప్రతి సబ్ డివిజన్ స్థాయిల లేక ఇతర జిల్లా విభాగాల స్థాయిలో సమాచారం కోరుతూ వచ్చే దరఖాస్తులను లేక అప్పీళ్లనుస్వీకరించడానికి ఒకరిని కేంద్ర పౌరసమాచార సహాయ అధికారిగా లేక రాష్ట్ర పౌర సమాచార సహాయ అధికారిగా నియమించాలి. అలా స్వీకరించిన దరఖాస్తులను లేక అప్పీళ్లను ఆ అధికారులు వెంటనే కేంద్రపౌరసమాచార సహాయ అధికారిగా లేక రాష్ట్ర పౌర సమాచార అధికారికి లేక సెక్షన్ 19లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దిష్టపరిచిన సీనియర్ అధికారికి లేక కేంద్రసమాచార కమిషన్ కు లేక రాష్ర్టసమాచార కమిషన్ కు పంపాలి. సమాచారం కోసం దరఖాస్తునూ లేక అప్పీలునూ కేంద్రపౌరసమాచార సహాయ అధికారికీ లేక రాష్ట్ర పౌరసమాచార సహాయ అధికారికీ అందించిన పక్షంలో దానికి జవాబు ఇచ్చేందుకు సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్ణయించిన కాలపరిమితికి అయిదు రోజులు కలపాల్సి ఉంటుంది.
(3) సమాచారం కోసం వచ్చిన ప్రతి అభ్యర్ధననూ ప్రతి కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి పరిశీలించాలి. సమాచారం కోరుతున్న వ్యక్తులకు సహేతుకమైన స్థాయివరకూ సహకారం అందించాలి.
(4) కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి తమ సక్రమ విధి నిర్వహణకు అవసరం అని భావించిన పక్షంలో మరే ఇతర అధికారి సహకారాన్నయినా కోరవచ్చు.
(5) సబ్ సెక్షన్ (4) కింద కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి ఇతర అధికారుల సహకారాన్ని కోరినపుడు ఆ అధికారులు ఆ కోరిన సహకారాన్ని అందించాలి. అటువంటి సందర్భాలలో ఈ చట్టంలోని నిబంధనల ఉల్లంఘన కిందకు రాకుండా ఉండేందుకు ఆసహకారం అందించే అధికారులను కేంద్ర పౌర సమాచార అధికారి, లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి గా పరిగణిస్తారు.

6) (1) ఈ చట్టం కింద సమాచారాన్ని కోరదల్చుకున్న వారు ఇంగ్లీషులో లేక హిందీలో లేక స్థానిక అధికార భాషలో రాతపూర్వకంగా లేక ఎలక్ట్రానిక్ రూపంలో నిర్ణీత రుసుంతోపాటు తమ అభ్యర్ధనను కింది వారికి పంపించాల్సి ఉంటుంది.

(ఎ) కేంద్ర పౌర సమాచార అధికారికి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారికి లేదా సంబంధిత అధికార యంత్రాంగానికీ.
(బి) తాము కోరుకున్న సమాచారం వివరాలను పేర్కొంటూ కేంద్ర పౌర సమాచార అధికారికీ లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారికీ సమాచారం కోరుతున్న వారు లిఖిత అభ్యర్ధన ఇవ్వలేనిపక్షంలో మౌఖికంగా వారు చేసిన అభ్యర్ధనను రాతలో పెట్టేందుకు కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి యుక్తమైన సహాయమంతా వారికి అందించాలి.
2. సమాచారం కోరుతున్న దరఖాస్తుదారులెవరైనా అందుకు గల కారణాలను వివరించాల్సిన అవసరం లేదు. తనకు కబురుచేసేందుకుఅవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు కూడా సమర్పించాల్సిన పనిలేదు.
3. ఒక సమాచారం కోసం అధికార యంత్రాంగానికి ఒక దరఖాస్తు అందినప్పుడు
(i) ఆ సమాచారం మరో అధికార యంత్రాంగం దగ్గర ఉన్నప్పుడు, లేక
(ii) ఆ సమాచారం మరో అధికార యంత్రాంగం పనులకు ఎక్కువగా సంబంధించినదైనప్పుడు, దరఖాస్తు అందుకున్న అధికారయంత్రాంగం ఆ దరఖాస్తును గానీ లేక రెండవ అధికార యంత్రాంగానికి సంబంధించిన భాగాన్ని గానీ వారికి పంపించి..అలా పంపినవిషయాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలి. ఆ దరఖాస్తును పంపడం వీలైనంత త్వరగా జరగాలి. అది దరఖాస్తు అందుకున్ననాటి నుంచి అయిదు రోజులు మించకూడదు.

7. (1) సెక్షన్ 6 కింద సమాచారం కోసం ఒక అభ్యర్ధన అందినప్పుడు కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (2) సెక్షన్ 6లోని సబ్ సెక్షన్ (3) నిబంధనలకు సంబంధించి వీలయినంత త్వరగా, అభ్యర్ధన అందిననాటినుంచి 30 రోజులలోపు నిర్ణయించిన రుసుము చెల్లించిన దరఖాస్తుదారునికి ఆ సమాచారం అందించాలి. లేదా సెక్షన్లు 8, 9 నిర్దేశిస్తున్న కారణాల ప్రకారం అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్లు తెలియజేయాలి. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఓ వ్యక్తి ప్రాణానికి లేక స్వేచ్ఛకు సంబంధించినదయితే దరఖాస్తు అందిన 48 గంటలలోపు ఆ సమాచారం అందించాలి.

(2) సబ్ సెక్షన్ (1)లో నిర్దేశించిన కాలపరిమితిలోపు కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారిసమాచారం కోసం అందించిన అభ్యర్ధనపై నిర్ణయం ప్రకటించకపోయినట్లయితే ఆ అభ్యర్ధనను కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి తిరస్కరించినట్లు లెక్క.
(3) సమాచారాన్ని అందించడానికి అయ్యే ఖర్చుకోసం మరికొంత రుసుము వసూలు చేసి ఆ సమాచారం అందించాలని కేంద్ర పౌర సమాచార అధికారి లేక ప్రతి రాష్ట్ర పౌర సమాచార అధికారి నిర్ణయించినట్లయితే , ఆ రుసుమును చెల్లించాల్సిందిగా కోరుతూ సంబంధిత దరఖాస్తుదారునికి కబురు పంపాలి ఆ కబురులో :
(ఎ) దరఖాస్తుదారు కోరిన సమాచారం అందించేందుకు చెల్లించాల్సిన మరికొంత రుసుము వివరాలు ఉండాలి. సబ్ సెక్షన్ (1) కింద నిర్ణయించిన రుసుము లెక్క ప్రకారం మొత్తం రుసుము ఏ విధంగా లెక్క వేసిందీ తెలియజెపుతూ ఆ రుసుము డిపాజిట్ చెయ్యాల్సిందిగా కోరాలి. కబురు పంపిన రోజు నుంచి రుసుము డిపాజిట్ అయ్యే రోజు వరకూ పట్టిన వ్యవధిని సబ్ సెక్షన్(1)లో పేర్కొన్న 30 రోజుల కాలపరిమితి నుంచి మినహాయించాలి.
(బి) రుసుముకు సంబంధించిన నిర్ణయం, సమాచారం అందించే పద్ధతి, పునఃపరిశీలనను కోరేందుకు దరఖాస్తుదారుకు ఉన్న హక్కును, అందుకు ఉన్న కాలపరిమితినీ, అనుసరించాల్సిన పద్ధతులనూ, అప్పీలు ఎవరిముందు దాఖలు చేయాలో ఆ వివరాలను కూడా తెలియజెప్పాలి.
(4) ఈ చట్టం కింద ఒక రికార్డును గానీ, అందులో భాగాన్ని కానీ దరఖాస్తుదారుకు చూపించాల్సి వచ్చినప్పుడు, ఆ దరఖాస్తుదారుకు అంగవైకల్యం ఉన్నపుడు, ఆ వ్యక్తి ఆ సమాచారాన్ని పొందేవిధంగా కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ర్ట పౌర సమాచార అధికారి ఆ వ్యక్తి ఆ సమాచారాన్ని పొందే విధంగా తనిఖీ చేసుకునేందుకు తగిన విధంగా సహాయం చేయాలి.
(5) సమాచారాన్ని అచ్చు రూపంలోనో, ఎలక్ట్రానిక్ రూపంలోనో అందించాల్సినప్పుడు దానికి నిర్ణయించిన రుసుమును సబ్ సెక్షను (6)కు లోబడి, దరఖాస్తుదారు చెల్లించాలి. సెక్షన్ 6లోని సబ్ సెక్షన్ (1), (7) లోని సబ్ సెక్షన్లు (1) (5) నిబంధనల ప్రకారం ఆనిర్ణయించిన రుసుము సహేతుకంగా ఉండాలి. సముచిత ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి నుంచి ఎలాంటిరుసుము వసూలు చేయరాదు.
(6) సబ్ సెక్షన్ (1)లో నిర్దేశించిన కాల పరిమితిలోపు సమాచారం ఇవ్వడంలో అధికార యంత్రాంగం విఫలమయిన సందర్భంలో సబ్ సెక్షన్ (5) లో ఉన్న ఏ మాటతోనూ నిమిత్తం లేకుండా దరఖాస్తుదారుకు ఆ సమాచారం ఉచితంగా అందించాలి.
(7) సబ్ సెక్షన్ (1) కింద కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ర్ట పౌర సమాచార అధికారి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెక్షన్ 11 కింద తృతీయ పక్షంసమర్పించిన వాదనను పరిగణనలోకి తీసుకోవాలి
(8) సబ్ సెక్షన్ (1) కింద ఒక దరఖాస్తును తిరస్కరించిన పక్షంలో కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ర్ట పౌర సమాచార అధికారి దరఖాస్తుదారునకు ఈ కింది విషయాలు తెలియజెప్పాలి.
(i) అభ్యర్ధనను తిరస్కరించడానికి గల కారణాలు
(ii) తిరస్కరణపై అప్పీలు చేసుకునేందుకు ఉన్న కాలపరిమితి.
(iii) అప్పీలు విచారించే అధికారి వివరాలు
(9) అధికార యంత్రాంగం వనరులు చాలా ఎక్కువ స్థాయిలో ఖర్చయ్యే సందర్భంలోనూ, ఆ రికార్డు భద్రత, రక్షణ ప్రమాదంలోపడుతుందన్న సందర్భంలో తప్ప దరఖాస్తుదారు అడిగిన రూపంలోనే సమాచారం ఇవ్వాలి.

8. (1) ఈ చట్టంతో సంబంధం లేకుండా ఈ కింది సమాచారాలను పౌరులకు అందించనక్కర్లేదు.

(ఎ) భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతలపై ప్రభావం చూపించే సమాచారం, దేశ భద్రత, వ్యూహాత్మక, వైజ్ఞానిక, ఆర్థికప్రయోజనాలపై, విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించే సమాచారం, ఏదైనా నేరాన్ని ప్రేరేపించే సమాచారం.
(బి) ఫలానా సమాచారాన్ని ప్రకటించకూడదని ఏదైనా న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ ఆదేశించే ఉన్న పక్షంలో అలాంటి సమాచారం. సమాచార ప్రకటన కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందనుకుంటే అలాంటి సమాచారం
(సి) సమాచారం వెల్లడి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ హక్కులను ఉల్లంఘించేదయితే అలాంటి సమాచారం.
(డి) వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేథోసంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీరంగంలోతృతీయ పక్షానికి హాని కలిగేట్లయితే అలాంటి సమాచారం. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాలను వెల్లడిచేయాల్సిందేనని సమర్థాధికారి భావించిన పక్షంలో మాత్రం వెల్లడి చేయవచ్చు.
(ఇ) విశ్వాసబద్ధమైన సంబంధం రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న సమాచారం, విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాన్ని వెల్లడి చేయాల్సిందేనని సమర్థాధికారి భావించిన పక్షంలో దానిని కూడా వెల్లడిచేయవచ్చు.
(ఎఫ్) ఏదైనా విదేశీ ప్రభుత్వం నుంచి విశ్వాసబద్ధంగా అందిన సమాచారం.
(జి) ఏదైనా సమాచారం వెల్లడివల్ల ఏ వ్యక్తి ప్రాణానికయినా లేక భౌతిక భద్రతకయినా హాని కలుగుతుందంటే అలాంటి సమాచారం, చట్టాల అమలుకోసం, భద్రతాప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించిన లేక సాయపడిన వారి గుర్తిపునకు దారితీసే సమాచారం.
(హెచ్) దర్యాప్తు ప్రక్రియనూ, నేరస్థులను పట్టుకునేందుకూ, ప్రాసిక్యూట్ చేసేందుకూ అవరోధాలు కల్పించే సమాచారం.
(ఐ) మంత్రిమండలి, కార్యదర్శులు, ఇతర అధికారుల సమాలోచనల సహా కేబినెట్ పత్రాలు, మంత్రిమండలి తీసుకున్ననిర్ణయాలను, అందుకు గల కారణాలను, ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని ఆ విషయం సంపూర్ణంగా ముగిసిన తర్వాతే వెల్లడి చేయాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ లో నిర్దేశించిన మినహాయింపుల కిందకు వచ్చే సమాచారాన్ని మాత్రం వెల్లడి చేయరాదు.
(జె) ప్రజా కార్యకలాపాలు, ప్రజా ప్రయోజనాలతో సంబంధం లేని వ్యక్తిగత సమాచారం. వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే అవాంఛనీయ అవకాశం కల్పించే సమాచారం. విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారాల వెల్లడి ఉచితమేనని కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ర్ట పౌర సమాచార అధికారి లేక అప్పిలేట్ అధికారి భావిస్తే ఈ సమాచారాలను కూడా వెల్లడి చేయవచ్చు. పార్లమెంటుకు లేక రాష్ట్ర శాసనసభకు అందించదగిన ఎలాంటి సమాచారాన్నయినా ఏ వ్యక్తికయినా అందించవచ్చు.
(2) అధికార రహస్యాల చట్టం, 1923తో లేక సబ్ సెక్షన్ (1) ప్రకారం ఇవ్వదగిన మినహాయింపులతో ఎలాంటి నిమిత్తం లేకుండా, రక్షిత ప్రయోజనాలకు కలిగే హాని కన్నా ప్రజా ప్రయోజనాలకు కలిగే మేలు ఎక్కువని అధికార యంత్రాంగం భావించిన పక్షంలో అలాంటి సమాచారాన్ని వెల్లడి చేయవచ్చు.
(3) సబ్ సెక్షన్ (1) లోని క్లాజులు (ఎ), (సి), (ఐ) లోని నిబంధనలకు సంబంధించి సెక్షన్ 6 కింద సమాచారం కోసం అభ్యర్ధన అందిన రోజుకు 20 సంవత్సరాల ముందు సంబంధించిన ఎలాంటి సంఘటన, విషయానికి సంబంధించిన సమాచారాన్ని అయినా కోరినవారికి అందించవచ్చు. ఆ 20 సంవత్సరాల గడువు ఏ రోజు నుంచి లెక్కించాలన్న ప్రశ్న తలెత్తనపుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. ఈ చట్టంలో నిర్దేశించిన అప్పీళ్ల అవకాశం దీనికి కూడా వర్తిస్తుంది.
(9) సమాచారం అందించడం వలన రాజ్యానికి చెందినది కాకుండా ఒక వ్యక్తికి చెందిన కాపీరైట్ ఉల్లంఘన జరిగే పక్షంలో అలాంటి సమాచారం కోసం వచ్చిన అభ్యర్ధనను ఏ రోజు నుంచి సెక్షన్-8లోని నిబంధనలకు భంగం కలగకుండానే తిరస్కరించవచ్చు.

10. (1) వెల్లడినుంచి మినహాయింపు ఉన్న సమాచారం అన్న కారణంతో ఒక అభ్యర్ధనను తిరస్కరించిన సందర్భంలో, ఈ చట్టంలోని నిబంధనలతో నిమిత్తం లేకుండా, మినహాయింపు పొందిన సమాచారం కాక ఆ రికార్డులో ఉన్న ఇతర సమాచారాన్ని విడదీసి చూపగలిగిన పక్షంలో అలాంటి సమాచారాన్ని అందించవచ్చు.

(2) సబ్ సెక్షన్ (1) కింద రికార్డులోని కొద్ది భాగాన్ని మాత్రమే వెల్లడి చేయాలని నిర్ణయించినపుడు కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి దరఖాస్తుదారుకు ఈ కింది విషయాలు తెలియజెపుతూ నోటీసు ఇ‌వ్వాలి.
(ఎ) కోరిన రికార్డల్లో వెల్లడి నుంచి మినహాయింపు పొందిన భాగాన్ని విడదీసి మిగతా భాగాన్ని మాత్రమే వెల్లడి చేస్తున్న విషయం.
(బి) ఆ నిర్ణయానికి గల కారణాలు, నిర్ణయానికి ముందు పరిశీలనలో వెల్లడి అయిన అంశాలు, వాటికి సంబంధించిన విషయాలు.
(సి) నిర్ణయం తీసుకున్న వ్యక్తి పేరు, హోదా
(డి) ఆ వ్యక్తి నిర్ణయించిన రుసుము వివరాలు, దరఖాస్తుదారు చెల్లించాల్సిన రుసుము వివరాలు.
(ఇ) నిర్ణయం పునఃపరిశీలించ కోరేందుకు దరఖాస్తుదారుకున్న హక్కులు. వసూలు చేసే రుసుము వివరాలు, పునఃపరిశీలన కోరేందుకు గల మార్గాలు. సెక్షన్ 19 లోని సబ్ సెక్షన్ (1) కింద నియమితులైన సీనియర్ అధికారి లేక కేంద్ర సమాచార కమీషన్ లేక రాష్ట్ర సమాచార కమీషన్ వివరాలు, పునఃపరిశీలన కోరేందుకు ఉన్న కాలపరిమితి , పద్ధతి ఇతర వివరాలు.

11. (1) తృతీయ పక్షానికి చెందిన సమాచారం లేక తృతీయ పక్షం అందించిన సమాచారం, దానిని గోప్యమనదిగా ఆ తృతీయ పక్షం భావిస్తున్నప్పుడు, అలాంటి సమాచారాన్ని చట్టం కింద వెల్లడి చేయాలని కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి భావించినపుడు, ఆ సమాచారం కోసం అభ్యర్ధన అందిన అయిదు రోజుల లోగా కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సదరుతృతీయ పక్షానికి ఆ ఆభ్యర్ధన గురించి రాతపూర్వకమైన నోటీసు ఇవ్వాలి. దరఖాస్తుదారు కోరిన రికార్డు లేక సమాచారం లేక అందులో కొంత భాగం వెల్లడిం చేయాలని భావిస్తున్నట్లు తెలుపుతూ, అలా వెల్లడి చేయవచ్చో లేదో మౌఖికంగా గానీ, లిఖితపూర్వకంగా గానీ దఖలు చేయాల్సిందిగా తృతీయ పక్షాన్ని ఆ నోటీసులో కోరాలి. సమాచారాన్ని వెల్లడి చేయాలన్న నిర్ణయం తీసుకునే ముందు తృతీయ పక్షం దఖలును పరిగణనలోకితీసుకోవాలి. చట్టం పరిరక్షిస్తున్న వాణిజ్య, వ్యాపార రహస్యాలను మినహాయించి ఏదైనా సమాచారం వెల్లడి తృతీయ పక్షానికి కలిగించే హానికన్నా ప్రజా ప్రయోజనాలకు చేకూర్చే మేలు ఎక్కువని భావించినపుడు ఆ సమాచారాన్ని వెల్లడి చేయవచ్చు.

(2) సబ్ సెక్షన్ (1) కింద ఒక తృతీయ పక్షానికి నోటీసు ఇచ్చినపుడు , ఆ నోటీసు అందిన నాటి నుంచి పదిరోజులలోగా సమాచార వెల్లడిప్రతిపాదనపై తమ వాదన దాఖలు చేసుకునేందుకు ఆ తృతీయ పక్షానికి అవకాశం ఇవ్వాలి.
(3) సెక్షన్ 6 కింద సమాచారం కోరిన అభ్యర్ధన అందినపుడు, సబ్ సెక్షన్ (2) కింద తమ వాదన వినిపించేందుకు తృతీయ పక్షానికి అవకాశం ఇచ్చినతర్వాత, అభ్యర్ధన అందిన నాటి నుంచి 40 రోజుల్లోపు సెక్షన్ (7) లోని నిబంధనలతో నిమిత్తం లేకుండా కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి ఆ సమాచారాన్ని లేక రికార్డులను లేక అందులోభాగాన్ని వెల్లడి చేయాలా వద్దో నిర్ణయించి, తమ నిర్ణయాన్ని నోటీసు ద్వారా తృతీయ పక్షానికి తెలియజేయాలి.
(4) సబ్ సెక్షన్ (3) కింద ఇచ్చిన నోటీసులో, ఆ నోటీసు అందుకున్న తృతీయ పక్షానికి అందులోని నిర్ణయంపై, సెక్షన్ 19 కింద అప్పీలుకు వెళ్లేందుకు హక్కు ఉందని కూడా తెలియపరచాలి.