Jump to content

సమాచార హక్కు చట్టం, 2005/ఛాప్టర్ I

వికీసోర్స్ నుండి

ఛాప్టర్ I

ప్రాథమిక అంశాలు

1. (1) ఈ చట్టాన్ని సమాచార హక్కు చట్టం, 2005గా వ్యవహరించవచ్చు.

(2) జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశమంతటికీ ఈ చట్టం వర్తిస్తుంది.
(3) సెక్షన్ 4లోని సబ్ సెక్షన్ (1), సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1), (2), సెక్షన్ 12, 13, 15, 16, 24, 27, 28 తక్షణం అమలులోకి వస్తాయి. చట్టంలోని ఇతర నిబంధనలు దీనికి చట్టరూపం వచ్చిన 120వ రోజున అమలులోకి వస్తాయి.

2. ఈ చట్టంలో, సందర్భానుసారం ఏమయినా మార్పులు ఉంటే తప్ప,

(ఎ) "సముచిత ప్రభుత్వం" అనగా (i) కేంద్రప్రభుత్వం గానీ, కేంద్రపాలిత ప్రభుత్వాలు స్థాపించిన, నెలకొల్పిన లేక వాటి నియంత్రణలో ఉన్న, లేక ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో ఆ ప్రభుత్వాల నుండి గణనీయంగా నిధులు అందుతున్న అధికార యంత్రాంగాలు, కేంద్ర ప్రభుత్వం, (ii) పైన చెప్పిన విధంగా రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగాలు, రాష్ట్రప్రభుత్వం.
(బి) "కేంద్ర సమాచార కమిషన్" అనగా సెక్షన్ 12లోని సబ్ సెక్షన్ (1) కింద ఏర్పాటయ్యే కేంద్ర సమాచార కమిషన్.
(సి) "కేంద్ర పౌర సమాచార అధికారి" అనగా సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ (1) కింద నియమితులయ్యే కేంద్ర పౌర సమాచార అధికారి. అదే సెక్షన్ లోని సబ్ సెక్షన్ (2) కింద నియమితులయ్యే కేంద్ర సహాయ సమాచార అధికారి కూడా ఈ కోవకే చెందుతారు.

(డి) "ప్రధాన సమాచార కమీషనర్", "సమాచార కమీషనర్" అనగా సెక్షన్ 12లోని సబ్ సెక్షన్ (3) కింద నియమితులయ్యే ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్.
(ఇ) ‘సమర్ధాధికారి’ అనగా
(i) లోక్ సభ, రాష్ట్ర శాసనసభ, కేంద్ర పాలిత ప్రాంత శాసనసభలకు సంబంధించిన స్పీకర్, రాజ్యసభ, రాష్ట్ర విధాన మండలులకు సంబంధించి ఛైర్మన్.
(ii) సుప్రీంకోర్టుకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి
(iii) హైకోర్టు కు సంబంధించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి,
(iv) రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం కింద ఏర్పాటయిన ఇతర యంత్రాంగాలకు సంబంధించి రాష్ట్రపతి లేక గవర్నర్
(v) రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 కింద నియమితులైన అడ్మినిస్ట్రేటర్
(ఎఫ్) "సమాచారం" అనగా రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ-మెయిళ్ళు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్య్కులర్లు, ఉత్తర్వులు, లాగ్ బుక్స్,కాంట్రాక్టులు, నివేదికలు, పేపర్లు, శాంపిళ్లు, మోడళ్ళు, డేటా సహా ఎలక్ట్రానిక్ రూపంతో పాటు ఏ రూపంలో నయినా ఉన్న సమాచారం. అమలులో ఉన్న మరో చట్ట ప్రకార మయినా ప్రభుత్వ యంత్రాంగం సంపాదించదగిన ఏ ప్రైవేటు సంస్థకు సంబంధించిన సమాచారమయినా ఈ చట్టం ప్రకారం సమాచారమే.
(జి) "నిర్ణీత" అనగా ఈ చట్టం కింద రూపొందిన రూల్స్ ప్రకారం ప్రభుత్వం గానీ, సమర్దాధికారి గానీ నిర్ణయించిన విధంగా
(హెచ్) ‘అధికార యంత్రాంగం’ అనగా ఈ కింది పద్ధతులలో ఏర్పాటయిన ప్రభుత్వ, స్వపరిపాలనా సంస్థలు :
(ఎ) రాజ్యాంగం కింద లేదా రాజ్యాంగం ద్వారా
(బి) పార్లమెంట్ రూపొందించిన ఏ చట్టం ప్రకారమయినా
(సి) రాష్ట్రశాసన సభలు రూపొందించిన మరే చట్టం ప్రకారమయినా
(డి) సముచిత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లేదా ఉత్తర్వు ద్వారా
(i) సముచిత ప్రభుత్వ సొంతమయిన, నియంత్రణలోవున్న లేదా గణనీయంగా నిధులు పొందుతున్న సంస్థలు
(ii) ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సముచిత ప్రభుత్వంనుండి గణనీయంగా నిధులు అందుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలు కూడా అధికార యంత్రాంగం కిందకే వస్తాయి.
(ఐ) "రికార్డు" అనగా
(ఎ) ఏదైనా పత్రం, రాతప్రతి, ఫైలు (బి) ఏదైనా మైక్రో ఫిల్ము, మైక్రోఫిష్ (ఫైలు చేయడానికి వీలయిన మైక్రోఫిల్ము), పత్రం ఫాక్సిమిలి ప్రతి. (సి) అలాంటి మైక్రోఫిల్ముల నుంచి తీసిన చిత్రం లేక చిత్రాలు (అదే సైజులో గానీ, పెద్దవిగా చేసిగానీ) (డి) కంప్యూటర్ మరేదైనా పరికరం ద్వారా ఉత్పత్తి అయ్యే సమాచారం సంపత్తి.
(జె) "సమాచార హక్కు" అనగా ఏ అధికార యంత్రాంగం నియంత్రణ కింద ఉన్న సమాచారాన్నయినా ఈ చట్టం కింద పొందగలిగే హక్కు. (i) పనులనూ, పత్రాలనూ, రికార్డులను తనిఖీ చేసే హక్కు
(ii) రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవడం, వాటి నకలులు, సర్టిఫైడ్ కాపీలు తీసుకోవడం (iii) సమాచార సంపత్తి సర్టిఫైడ్ శాంపిళ్ళు తీసుకోవడం (iv) డిస్కెట్లు, ప్లాపీలు, టేపులు, వీడియో కాసెట్లు రూపంలో లేక మరే విధమైన ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని పొందడం, అలాంటి సమాచారం కంప్యూటర్లోగానీ, మరో పరికరంలో గానీ నిక్షిప్తమై ఉంటే ప్రింట్ అవుట్ల ద్వారా దానిని పొందడం ఈ హక్కులో భాగం.
(కె) "రాష్ట్ర సమాచార కమిషన్" అనగా సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (1) కింద ఏర్పాటయ్యే రాష్ట్ర సమాచార కమిషన్.
(ఎల్) "రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్", "రాష్ట్ర సమాచార కమిషనర్" అనగా సెక్షన్ 15 లోని సబ్ సెక్షన్ (3) కింద నియమితులయ్యే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్.
(ఎమ్) "రాష్ట్ర పౌర సమాచార అధికారి" అనగా సెక్షన్ 5 లోని సబ్ సెక్షన్ (1) కింద నియమితులయ్యే రాష్ట్ర పౌర సమాచార అధికారి, అదే సెక్షన్ లోని సబ్ సెక్షన్ (2) కింద నియమితులయ్యే రాష్ట్ర సహాయ సమాచార అధికారి కూడా ఈ కోవకే చెందుతారు.
(ఎన్) తృతీయ పక్షం అనగా అధికార యంత్రాంగం సహా, సమాచారం కోసం అభ్యర్థించే పౌరుడు కాక ఇతర వ్యక్తి ఎవరైనా.