సమర్థ రామదాసు/రెండవ ప్రకరణము
రెండవ ప్రకరణము
బాల్యము - ఉపదేశము
నారాయణుడు చిన్నవాఁడు. అల్లారుముద్దుగాఁబెరిగెను. అతని మొగమెప్పుడు చిఱునగవుతో వెలయుచుండెను. ఏడుపన్న దేమో యతడెఱుఁగఁడు. రెండేళ్ళు వెళ్లునప్పటికి మాటలు వచ్చెను. వయస్సు ముదిరిన కొలఁది బుద్ధికుశలతయు దానితో యుక్తాయుక్త వివేకమునలవడెను. భవిష్యత్కాలమున నతనిసాహసములు చిన్ననాఁటి యల్లరిపనులవల్లనే యూహింపఁదగియుండెను. అతనికి దయ్యములన్న భూతములన్న నమ్మకము లేదు. తన దుండగములు సహింపక తల్లిదండ్రులు బెదిరించినప్పుడు వారి బిభీషికలకు భయపడువాఁడు కాఁడు. పిల్లలల్లరిపనులు చేయునప్పుడు వారిని భయపెట్టుటకై చెప్పెడు భూతపిశాచముల కథలనతఁడు లెక్క చేయువాఁడు కాఁడు. ఆటలన్న నతనికి అత్యంత ప్రేమ. స్వేచ్చావిహార మతని ప్రకృతి. ఆ గ్రామమందలి బాలురంద ఱతని సహచరులైరి. అతఁడు వారి నాయకుఁడయ్యెను. ఈ పిల్లల కొంటెతనములు కోతి కొమ్మచ్చి మొదలయిన యాటలు పూర్వము రామాయణములోఁజెప్పఁబడిన బవానరుల చేష్టలవలెనుండెను. నారాయణుడు తనయనుచరుల హృదయములు రంజినంపఁజేసెను. అందుచేత నతఁడేమి చెప్పిననది వారు తప్పక చేయుచుండిరి. గోడల మీఁదనుండి దూకుట, నదులీఁదిదాఁటుట, యొకచెట్టుమీఁద నుండి మరియొక చెట్టుమీఁదకు దుముకుట మొదలైనవి జాంబు నగరమున నీ చిన్నియన్నల చేష్టలలోఁ గొన్ని, నారాయణుఁడింటివద్ద చేయునట్టి దుండగములనుండి తప్పించుకొనుటకు సూర్యాజీ తన కుమారుని యా గ్రామమున నొక పాఠశాలకుఁబంపెను. ఆ యుపాధ్యాయుఁడు విశేష విద్యావంతుఁడుకాడు. అతఁడు నేర్చుకొన్న విద్యనంతయు నారాయణుఁడు రెండు సంవత్సరములలోనే గ్రహించెను.
2 అందుచేత నతడు సూర్యాజీని బిలిచి తాను నేర్చిన విద్యనంతయు నారాయణుడు గ్రహించెననియు నెక్కుడు విద్య కావలసినపక్షమున వేరే యేర్పాటు చేసికొనవలసినదనియు జెప్పెను. నారాయణునకు నైదవయేడు రాగానే తండ్రి తన స్థితిగతులకు దగినంత వైభవముతో నందనునకు నుపనయనము జేసెను. కాని దైవ యోగమున 1615 సం||న సూర్యాజీ కుటుంబ పోషణమునకు మాతృసంరక్షణమునకు జిన్న పిల్లలైన శ్రేష్ఠుని, నారాయణుని విడచి కాలధర్మము వొందెను. ఏది వచ్చినను నారాయణుడు లెక్కచేయక దృడనిశ్చయము కలవాడై యుండెను. కానున్నది కాకమానదని యతని యభిప్రాయము. చిన్నతనమందు గూడ నితరుల దృష్టిలో నసాధ్యమని తోచిన విషయముకూడ నారాయణునకు సులభముగ సాధ్యమయ్యెడిది. ఇతరులు కార్యసాధనమున గలవారపాటు నొందినప్పుడు నారాయణుడు తొందర యేమియు లేక నిశ్చలమనస్సుతో గార్యసాధనము చేయువాడు. అతడు తలచుకొన్న పని ఎంత దుర్ఘటమైనను నెందరు వలదని వారించినను దాని నత డవలీలగా నిర్వహించువాడు. నారాయణునకు సమర్థరామదాసు డని పేరువచ్చుటకు భవిష్యత్కాలమున బహుసాహసకార్యములు చేయుటకు నిదియే బీజమని చెప్పవచ్చును. అతని దృడనిశ్చయము క్రమక్రమముగ నాత్మవిశ్వాసమును స్వతంత్రభావమును వృద్ధిపొందించెను. సూర్యాజీ మరణానంతరమున బాలకు లిద్దరు గృహకృత్యములను దేవతారాధన మొదలగు పవిత్రకృత్యములను నవవైధవ్య దు:ఖముచేత మూలబడియున్న తల్లికి సంతృప్తిగలుగునట్లు చేయదొడగిరి. శ్రేష్ఠుడు, తమ్ముడైన నారాయణునకు వేదము మంత్రశాస్త్రము మొదలగు విద్యలు శ్రద్ధతో నేర్పి యతనిని విద్యావంతుని జేసెను. నారాయణుడు విద్య నేర్చుటయే గాక యన్నగారి కంటె వైరాగ్యనిస్పృహత్వములయందు మిన్నయై యుండెను. సూర్యాజీ బ్రతికియుండగనే శ్రేష్ఠుడు వేదపాఠశాల యొకటిపెట్టి దానిని యధావిధిగ జరుపుచుండెను. అతడు విద్యార్థులను శోధించి తగిన వారికి మంత్రశాస్త్రము నుపదేశించి ప్రవీణుల జేయ దొడగెను. నారాయణు డెనిమిది సంవత్సరముల వయస్సు గలిగి యున్నప్పు డన్నగారు తోడి బాలున కొకనికి మంత్రోపదేశము జేయుచుండగ జూచి, తనకు గూడా నది యుపదేశించి గురువు కమ్మని ప్రార్థించెను. అప్పు డుపదేశమునకు సమయము కా దనియు, దానికి దగిన కాలము వచ్చుననియు, నంతవఱకు వేగిరపడ వద్దనియు శ్రేష్ఠుడు తమ్ముని బ్రతిమాలి తండ్రివలె బుజ్జగించి చెప్పెను. అన్నగారి యాలోచనము నారాయణుని మనస్సునకు నచ్చనందున నతడు తలచిన తలంపు మానుకొనుట కిష్టము లేకపోయెను. అన్నగారు చేయని యుపదేశమును స్వయముగ దేవుని చేతనే చేయించుకొనవలెనని తిన్నగ మారుతి దేవాలయమునకు బోయెను. కన్నులవెంట బాష్పములు గ్రమ్మ నారాయణుడు మిక్కిలి భక్తితో మారుతిని బద్యములతో స్తవము చేయనారంభించెను. ఆతడెక్కడకు వెళ్లెనో యింటిలో నెవరికిని దెలియదు. పగలెల్ల నతడు స్తవము చేసిన పిదప రాత్రి ప్రారంభమాయెను. భక్తిపరిపూర్ణదశ నొందెను. అతని మనోనిశ్చయము వయస్సును మించిన దయ్యెను. కన్నులు బాష్పములతో నిండెను. గొంతు బొంగురు వోయెను. చిట్ట చివర కతడు గర్భాలయములో నొక చీకటిమూల మూర్ఛ పోయెను. అర్ధరాత్రమున దివ్యతేజ స్పొకటి బయలుదేరి గుడియంతయు వెలిగించెను. అంత నారాయణుడు మేల్కొనెను. తెలివి వచ్చెను. అప్పు డతనికి దివ్య తేజస్సుతో మారుతి ప్రత్యక్ష మయ్యెను. నారాయణుడు వాని పాదములపై బడి భక్తితో స్తుతి చేసెను. నారాయణున కుత్సాహ మెక్కువ కాగా బాష్పపరంపరచేత నాదేవుని పాదముల నత డభిషేకించెను. ఆ బాలకుని యసమానభక్తికి సంతసించి మారుతి శ్రీరామదేవుని దర్శనము చేయించెను. శ్రీరాముడు స్వయముగ నారాయణున కుపదేశము చేసెను. ఆ యుపదేశమహిమ చేత నారాయణుని హృదయము భక్తిపరవశ మయ్యెను. అప్పుడు శ్రీరాము డిట్లాజ్ఞాపించెను. "ఈభూమియంతయు నపవిత్రులైన మ్లేచ్ఛులచేత పాడయినది; కాన, నారాయణా! నీవు స్వార్థత్యాగివై కృష్ణా నదీ తీరమున విరాగివై తపస్సుచేసి లోకముంస్ నవీనపద్ధతి నవలంబించి దివ్యజ్ఞానము వ్యాపింపజేయవలెను." నారాయణు డింటినుండి వెళ్లినది మొదలుకొని తల్లి వానికొఱకు జిత్తక్షోభనొందెను. ఇరుగుపొరుగువారును మిత్రులును వానికొఱకు వెదకి వెదకి విసిగి యుండగ శ్రేష్ఠుడు సరిగ మారుతి గుడికి వెళ్లి తమ్ముని దోడ్కొని వచ్చెను.
- _______