సత్యశోధన/రెండవభాగం/14. దావా వేయుటకు ఏర్పాట్లు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

14. దావా వేయుటకు ఏర్పాట్లు

ప్రిటోరియాలో నేను ఒక సంవత్సరం వున్నాను. నా జీవితంలో ఆ సమయం అమూల్యమైనది. ప్రజాసేవ చేయాలనే తలంపు నాకు కలిగింది. అందుకు అక్కడే శక్తి చేకూరింది. నాకు మతం విషయమై ఆసక్తి అక్కడే కలిగింది. ప్లీడరు పనిని గురించి సరియైన జ్ఞానం అక్కడే కలిగింది. క్రొత్త బారిస్టర్లు పాత బారిస్టర్ల దగ్గర నేర్చుకోగలిగినది నేను అక్కడే నేర్చుకున్నాను. ప్లీడరు పనికి కొంచెం పనికి వస్తానని నేను అక్కడే తెలుసుకున్నాను. ప్లీడరు పనికి తాళంచెవి అక్కడే నాకు దొరికింది.

దాదా అబ్దుల్లా గారి దావా చిన్నదికారు. నలభై వేల పౌండ్లకు, అంటే ఆరు లక్షల రూపాయలకు సంబంధించిన దావా అది. యిది వ్యాపారానికి సంబంధించిన దావా. అందువల్ల లెక్కల చిక్కులు అపరిమితంగా వున్నాయి. ప్రాంశరీ నోట్లకు, నోటు వ్రాసి యిస్తామన్న నోటి నూటలకు కూడా యీ దావాతో సంబంధం వుంది. యీ దావాకు యిదే ఆధారం. ప్రాంశరీ నోట్లు మోసం చేసి వ్రాయించుకోబడ్డాయనీ, వాటికి తగిన ఆధారాలు లేవని ప్రతివాదుల వాదన. మొత్తం మీద దావా పూర్తిగా చిక్కుల మయం. వాది ప్రతివాదులు సమర్ధులైన సొలిసిటర్లను, బారిస్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. వారి దగ్గర పని తెలుసుకొనేందుకు నాకు మంచి అవకాశం లభించింది. వాది యొక్క వాదమంతా సిద్ధం చేయడం, సొలిసిటరుకు పరిశీలన కోసం అందజేయడం దావాకు అనుకూలమైన విషయాల్ని వెతకడం నా పని. నేను తయారుచేసిన వివరాలలో సొలిసిటరు ఎంత స్వీకరిస్తున్నాడో, ఎంత త్రోసివేస్తున్నాడో, ఆ సొలిసిటరు తయారుచేసిన వివరాలలో బారిస్టరు ఎంత స్వీకరిస్తున్నాడో తెలుసుకోవడం వల్ల గొప్ప పాఠం నేను నేర్చుకున్నట్లయింది. దావా వేయడం కోసం అవసరమైన శక్తి పెరిగిందని చెప్పవచ్చు.

ఈ దావాలో నాకు అభిరుచి కలిగింది. నేను అందు నిమగ్నమైనాను. సంబంధించిన కాగితాలన్నీ చదివాను. నాక్లయింటు చాలా తెలివిగలవాడు. నామీద అతనికి అపరిమితమైన విశ్వాసం. అందువల్ల నా పని సులువైంది. నేను బుక్‌కీపింగు అంటే ఖాతా లెక్కలకు సంబంధించిన సూక్ష్మాంశాలు కూడా బాగా తెలుసుకున్నాను. అందు గుజరాతీ పత్రాలు ఎక్కువగా వున్నాయి. వాటికి అనువాదకుణ్ణి నేనే, అందువల్ల అనువాదం చేయగల శక్తి కూడా పెరిగింది.

ఈ దావా వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయాను. మత సంబంధమైన చర్చలన్నా, ధర్మకార్యాలన్నా నాకు యిష్టం. అయినా అప్పుడు అవి దావా వ్యవహారాల ముందు ప్రధానమైనవిగా తోచలేదు. దావా వ్యవహారమే నాకు ముఖ్యం. అవసరమైనప్పుడల్లా లా చదవడం, కేసును పఠించడం నా పని. వాది ప్రతివాదుల కాగితాలు నా దగ్గర వుండటం వల్ల వారికి కూడా తెలియని విషయాలు కొన్ని నాకు తెలుసునని చెప్పగలను.

కీ.శే. పిన్‌కట్‌గారు చెప్పిన ఒకమాట అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. దక్షిణ ఆఫ్రికాలో గొప్ప బారిస్టరు, కీర్తిశేషులు ఆయిన లియోనార్డ్ అనువారు దాన్ని సమర్ధించారు. “యదార్ధాలే, ముప్పాతిక భాగం” అని వారన్నారు. అప్పుడు నాదగ్గర ఒక కేసు వుంది. ఆ కేసులో యదార్ధాలననుసరించి న్యాయం మాకు అనుకూలంగా వుంది. కాని ‘లా’ మాకు వ్యతిరేకంగా వుంది. చివరికి నిరాశపడి నేను లియోనార్డ్ గారి సాయం కోరాను. వారికి కూడా దావా యందలి విషయాలన్నీ అనుకూలంగా వున్నాయని తోచింది. “గాంధీ! నాకు ఒక్క విషయం తోస్తున్నది. కేసులో గల యదార్ధ విషయాలను గురించి మనం జాగ్రత్తగా వుందాం. అప్పుడు న్యాయం దానంతట అదే జరుగవచ్చు. యీ కేసుకు సంబంధించిన విషయాలన్నీ తిరిగి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. అప్పుడు నా దగ్గరకి రండి” అని లియోనార్డ్ అన్నారు. వారి మాట ప్రకారం తిరిగి ఆ కేసంతా నేను నిశితంగా పరిశీలించాను. అది ఎంతో అపూర్వంగా వుంది. అటువంటిదే దక్షిణ ఆఫ్రికా కేసు మరొకటి నా మనస్సులో నాటుకుంది. ఆ విషయం లియోనార్డ్ గారికి తెలియజేశాను. ఇక మనం యీ కేసు గెలవగలం. అయితే బెంచీ మీదకు ఏ జడ్జీ వస్తాడో చూడాలి.” అని ఆయన అన్నాడు.

దాదా అబ్దుల్లా కేసులో పని చేస్తున్నప్పుడు యదార్ధ విషయాలకు యింత మహత్తు వుంటుందని తెలియదు. యదార్థ విషయం అంటే సత్యమన్నమాట. సత్యాన్ని మనం గ్రహించినప్పుడు న్యాయం దానంతట అదే మనకు అనుకూలిస్తుందన్నమాట. మా వాది దావాలో యదార్ధ విషయాలు బలవత్తరంగా వున్నాయి. అందువల్ల ‘లా’ మా వాది పక్షం అయి తీరుతుందని భావించాం.

ఈ కేసును యిలాగే సాగనిస్తే బంధువులు మరియు ఒకే పట్టణంలో నివశిస్తున్న వాది ప్రతివాదులు యిద్దరూ పూర్తిగా నష్టపడిపోతారను విషయం బోధపడింది. చివరికి దావా ఎవరి పక్షం అవుతుందో తెలియదు. కోర్టులో దీన్ని సాగనిస్తే ఎంతకాలం సాగుతుందో కూడా తెలియదు. అందువల్ల ఉభయ పార్టీలకు ప్రయోజనం కలుగదు. కనుక వీలైతే త్వరగా దీన్ని తేల్చి వేసుకోవడం మంచిదని అనిపించింది.

నేను తైయబ్ సేఠ్‌కు వివరమంతా చెప్పి రాజీ పడమనీ, అందుకు మీ వకీలును సంప్రతించమనీ, వాది ప్రతివాదులు ఒక నమ్మకస్తుడగు మధ్యవర్తి చెప్పినట్లు నడుచుకుంటే కేసు తేలికగా పరిష్కారం అవుతుందనీ చెప్పాను. యీ కేసులో నిజానికి వాది ప్రతివాదులిద్దరూ వర్తక ప్రముఖులే. కాని ప్లీడర్ల కోసం వారిరువురు పెడుతున్న ఖర్చును చూస్తే త్వరలోనే వారి ధనం విపరీతంగా ఖర్చయ్యే ప్రమాదం వున్నది. యీ కేసు గొడవలో పడినందున మరో పని చేసుకొనే అవకాశం కూడా వారికి దొరకడం లేదు. దీనితోనే సరిపోతున్నది. మరో వైపున ఒకరిమీద మరొకరికి వైమనస్యం విపరీతంగా పెరిగిపోతూ వుంది. వకీలు వృత్తిని గురించి యోచించిన కొద్దీ నాకు ఆ వృత్తి యెడ ఏవగింపు పెరిగిపోసాగింది. ఒకరి నొకరు ఓడించుకోవడం కోసం లా పాయింట్లు వెతుక్కోవడం లాయర్ల పని. పెట్టిన ఖర్చులన్నీ గెలిచిన వాడికి వస్తాయా అంటే అదీ లేదు. ఒకరు మరొకరికి ఖర్చు చెల్లించాలంటే దానికి “కోర్టు ఫీజు రెగ్యులేషన్” ప్రకారం ఒక పద్ధతి వుంది. అయితే లాయర్ల కిచ్చే ఫీజు ఆ ప్రకారం లభించే సొమ్ము కంటే ఎంతో అధికం. యీ విషయాలన్నీ మొట్ట మొదటి సారి తెలుసుకున్నాను.

ఇక సహించలేకపోయాను. ఈ దావాను పరిష్కరించడం నా కర్తవ్యమని భావించాను. రాజీ వ్యవహారం ముందుకు సాగిస్తున్నప్పుడు నా ప్రాణాలు పోయినంత పని అయింది. చివరికి తైయబ్ సేఠ్ రాజీకి అంగీకరించాడు. ఒక మధ్యవర్తి నియమించబడ్డాడు. దావా ఆ మధ్యవర్తి ముందు నడిచింది. దాదా అబ్దుల్లా గెలిచాడు.

అయినా నాకు తృప్తి కలుగలేదు. మధ్యవర్తి తీర్పును దాదా అబ్దుల్లా వెంటనే అమలుబరిస్తే తైయబ్ హాజీఖాన్ మహమ్మద్ అన్ని రూపాయలు ఒక్కసారిగా తెచ్చి కుమ్మురించలేడు. దక్షిణ - ఆఫ్రికాలో నివసిస్తున్న పోరుబందర్ వర్తకుల్లో వ్రాయబడని శాసనం ఒకటి వుంది. దివాళా కంటే చావు మేలు అనేదే ఆ శాసనం. తైయబ్ సేఠ్‌గారు ఒక్కసారిగా 37 వేల పౌండ్లు ఖర్చుల క్రింద చెల్లించలేడు. ఆయన పైసలతో సహా బాకీ తీర్చివేసేందుకు సిద్ధమే. కాని దివాళా తీశాడనే అపవాదు రాకూడదు. ఇందుకు ఒక్కటే ఉపాయం, వాయిదాల మీద సొమ్ము తీసుకొనేందుకు దాదా అబ్దుల్లా ఒప్పుకోవాలి. ఆ ప్రకారం దీర్ఘకాలపు వాయిదాల మీద సొమ్ము పుచ్చుకోవడానికి ఉదారబుద్ధితో దాదా అంగీకరించాడు. రాజీకి ఉభయుల్ని ఒప్పించడానికి పడ్డ శ్రమ కంటే వాయిదాల మీద సొమ్ము చెల్లింపుకు అంగీకరింపచేయడానికి నేను పడ్డ శ్రమ ఆ భగవంతుడికే ఎరుక. అయితే ఇదంతా జరిగాక ఇద్దరూ సతోషించారు. యిద్దరికీ గౌరవం పెరిగింది. నాకు అపరిమితంగా ఆనందం కలిగింది. వకీలు పని ఏమిటో, దాని సత్యస్వరూపం ఏమిటో అప్పుడు నాకు బోధపడింది. మనిషిలోని గుణాల్ని, వారి సత్పక్షాన్ని తెలుసుకోగలగటం ఎలాగో తెలుసుకోగలిగాను. విడిపోయిన వాది ప్రతివాదుల్ని కలవడమే వకీలు యొక్క పరమ ధర్మమని గ్రహించాను. ఈ సత్యం నాలో బాగా నాటుకు పోయింది. అందువల్ల తరువాత 20 ఏండ్ల బాటు నేను సాగించిన ప్లీడరు వృత్తిలో వందలాది కేసుల్ని కోర్టుకు ఎక్క కుండానే పరిష్కరించగలిగాను. అందువల్ల నాకు నష్టమేమీ కలగలేదు. రాబడిని కోల్పోలేదు. ఆత్మతృప్తి కలిగింది. అంతకంటే యింకేమి కావాలి?