Jump to content

సత్యశోధన/రెండవభాగం/10. ప్రిటోరియాలో మొదటిరోజు

వికీసోర్స్ నుండి

10. ప్రిటోరియాలో మొదటి రోజు

దాదా అబ్దుల్లా గారి వకీలు ప్రిటోరియా స్టేషనుకు ఎవరినైనా పంపి నన్ను తీసుకు వెళతారని భావించాను. నన్ను కలుసుకునేందుకు యితర భారతీయులెవ్వరూ రారని నాకు తెలుసు. ఎందుకనగా ప్రిటోరియాలో భారతీయుల యింట్లో బస చేయనని నేను అబ్దుల్లా గారికి వాగ్దానం చేసి వచ్చాను. ఆదివారం గనుక ఎవ్వరినీ స్టేషనుకు పంపడానికి వీలుపడలేదని వకీలు ఆ తరువాత చెప్పాడు. అప్పుడు మాత్రం నాకేమీ తోచలేదు. ఎక్కడికి వెళ్లడం? హోటళ్లలో నన్ను ఉండనీయరు.

1893 నాటి ప్రిటోరియా స్టేషను 1914 నాటి ప్రిటోరియా స్టేషను కాదు. దీపాలు మసక మసకగా వున్నాయి. ప్రయాణీకులు కూడా ఎక్కువమంది లేరు. అందరూ వెళ్లాక టిక్కెట్టు కలెక్టరు దగ్గరకు వెళ్లి టిక్కెట్టు యిచ్చి ఎక్కడ బసచేయవచ్చునో అడుగుదామని ఆగాను. ఎక్కడా కుదరకపోతే ఆ రాత్రి రైలు స్టేషనులోనే వుందామని భావించాను. యీ విషయం అడిగితే అవమానిస్తాడేమోనని భయం పట్టుకున్నది. స్టేషను శూన్యం అయింది. చివరికి నా టిక్కెట్టు యిచ్చి అదీ యిదీ మాట్లాడసాగాను. అతడు వినయంతో సమాధానం యిచ్చాడు, కాని ప్రయోజనం శూన్యం. యింతలో మా ప్రక్కనే నిలబడియున్న ఒక అమెరికా నీగ్రో మా మాటలు విని యిలా అన్నాడు . “మీరీ వూరికి క్రొత్తవారిలా వున్నారు. యిక్కడ మీకు మిత్రులెవ్వరూ లేనట్లుంది. నాతో రండి. మిమ్ము ఒక చిన్న హోటలుకు తీసుకువెళతాను. హోటలు యజమాని అమెరికావాడు. వారిని నేను బాగా ఎరుగుదును. అతడు మీకు వసతి కల్పిస్తాడు రండి.”

ఈ పిలవని పేరంటం చూచి మొదట నేను సందేహించాను. కాని తరువాత అతనికి ధన్యవాదాలు చెప్పి అంగీకరించాను. అతడు నన్ను జాన్సటన్ గారి హోటలుకు తీసుకువెళ్లాడు. అతణ్ణి చాటుకు తీసుకుపోయి నా సంగతి చెప్పాడు. జాన్‌స్టన్ అంగీకరించాడు. కాని ఒక్క నియమం పెట్టాడు. అందరితో గాక నా భోజనం నా గదిలోనే చేయాలన్నది అతడు పెట్టిన నియమం. “నలుపు తెలుపు భేదాలు నేను పాటించను. కాని మా హోటలుకు వచ్చే వాళ్లంతా తెల్లవాళ్లే. మిమ్మల్ని వాళ్లతోబాటు కూచోబెడితే వాళ్లు అవమానంగా భావిస్తారేమో. వాళ్లు లేచిపోతారేమో. అది ప్రమాదం. అందుకని యిలా అంటున్నాను.” అని జాన్‌స్టన్ స్పష్టం చేశాడు.

“ఈ రాత్రి ఉండనిచ్చినందుకు ధన్యవాదాలు. యీదేశ పరిస్థితులు కొద్ది కొద్దిగా తెలిశాయి. మీ కష్టం ఏమిటో బోధపడింది. నాగదిలో భోజనం చేసేందుకు నాకు యిబ్బంది లేదు, రేపు మరోచోట ఏర్పాటు చేసుకుంటాను” అని అన్నాను. గది చూపించాడు. లోపలికి వెళ్లాను. ఒక్కడినే వున్నాను. ఏదో ఆలోచిస్తున్నాను. భోజనం కోసం ఎదురు చూస్తుంటే జాన్‌స్టన్ స్వయంగా వచ్చి “మిమ్మల్ని గదిలోనే భోజనం చేయమని చెప్పినందుకు విచారిస్తున్నాను. భోజనశాలకు అంతా వచ్చారు. వారితో మీ విషయం చెప్పాను. మాకేమీ అభ్యంతరం లేదని వారంతా చెప్పారు. రండి భోజనశాలలో అందరి సరసన కూర్చొని భోజనం చేయండి. హోటల్లో మీరెన్నాళ్లున్నా ఎవ్వరికీ ఏమీ యిబ్బంది లేదు.” అని అన్నాడు. ఆయనకు మళ్లీ ధన్యవాదాలు చెప్పి భోజనశాలకు వెళ్లి తృప్తిగా కడుపు నిండా భోజనం చేశాను.

మరునాడు ప్రొద్దునే వెళ్లి వకీలు శ్రీ బేరుగారిని దర్శించాను. అబ్దుల్లా సేఠ్ ఆయనను గురించి అదివరకు కొద్దిగా చెప్పాడు. అందువల్ల ఆయన నాకు చేసిన ఆదరణ చూచి నేను ఆశ్చర్యపడలేదు. ఎన్నో కుశల ప్రశ్నలు వేశారు. అమితంగా ఆదరించారు. నా సంగతంతా ఆయనకు సవివరంగా చెప్పాను. అంతా విని ఆయన “బారిస్టరుగా మీరు చేయవలసింది యిక్కడ ఏమీలేదు. లోగడనే మేము మంచి వకీళ్లను నియమించి వుంచాము. యీ దావా చాలా కాలాన్నుంచి నడుస్తున్నది. యిది చిక్కుల మారి దావా. అందువల్ల అవసరమైనచోట్ల మీ సాయం తీసుకొంటాను. మా క్లయింటుకు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలలో జరుగుతున్న కష్టాలు మీరు తొలగించవచ్చు. వారి దగ్గరనుండి రావలసిన వివరాలు నేను మీనుండి పొందుతాను. యిది చాలా ప్రయోజనకరమైన విషయం. మీ బసను గురించి యింతవరకు నేను అడగలేదు. పరిచయం అయిన తరువాత అడుగుదామని అనుకున్నాను. యిక్కడ వర్ణ వైషమ్యం విపరీతంగా వుంది. అందువల్ల మీ బోటి వారికి తేలికగా బస దొరకదు. అయితే నేనొక పేదరాలిని ఎరుగుదును. ఆమె రొట్టెలు అమ్ముకొని జీవించు యిల్లాలు. ఆమె మీకు అవకాశం కల్పిస్తుంది. కొద్దిగా డబ్బు తీసుకుంటుంది. అక్కడికి పోదాం. దయచేయండి” అని అంటూ లేచి నిలబడ్డాడు.

ఇద్దరం ఆమె ఇంటికి వెళ్లాం, ఆమెతో చాటుగా ఏదో మాట్లాడాడు. వారానికి 35 షిల్లింగులు తీసుకొని భోజనం పెట్టడానికి ఆమె అంగీకరించింది.

బేకరు మంచి వకీలే గాక మతబోధకుడు కూడా. ఆయన యిప్పటికీ జీవించే యున్నాడు. ఆయన పని యిప్పుడు మత ప్రచారం చేయడమే. వకీలు వృత్తి మానివేశాడు. సిరిసంపదలు బాగా వున్నాయి. యిప్పటికీ మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ వున్నాయి. ఆయన విశ్వాసం, వాదన ఒకటే. క్రైస్తవ మతమే ప్రశస్తమైనది. జీససు ఈశ్వరుని ఏకైక పుత్రుడు. మనుష్యుల్ని తరింపచేసే తారకుడు. యిట్ట విశ్వాసం వల్ల పరమ ప్రశాంతి లభిస్తుంది. యిదే ఆయన బోధకు సారం.

ప్రథమ దర్శనమప్పుడే ఆయనకు తత్వబోధన గురించిన నా భావాలు చెప్పివేశాను. నేను చెప్పిన దానికి సారం - “నేను పుట్టుకచే హిందువును. అయినా నాకు హిందూ మతమంటే ఎక్కువగా తెలియదు. ఇతర మతాలను గురించి అసలే తెలియదు. నిజానికి నా స్థితి ఏమిటో నాకు తెలియడు. ఎలా వుండాలో కూడా తెలియదు. మా మతాన్ని గురించి చదవాలని అనుకుంటున్నాను. యథాశక్తి యితర మతాలను కూడా పఠిస్తాను.”

దాపరికం లేని నా మాటలు విని బేకరు చాలా సంతోషించాడు. “దక్షిణ - ఆఫ్రికాయందలి జనరల్ మిషనుకు నేనొక డైరెక్టరును. నేను స్వయంగా ఒక చర్చి కట్టించాను. అక్కడ నియమిత సమయాన మత విషయాలను గురించి ప్రస్తావిస్తూ వుంటాను. నాకు రంగు తెగులు లేదు. నాతోబాటు యింకా మత ప్రచారకులు వున్నారు. మేము ప్రతిరోజు ఒంటిగంటకు అక్కడ చేరి శాంతి మరియు జ్ఞానోదయం కోసం ప్రార్థన చేస్తూ వుంటాము. మీరు అక్కడికి వస్తే సంతోషిస్తాను. మా వారందరకీ మిమ్ము పరిచయం చేస్తాను. వాళ్లు మీ పరిచయం పొంది సంతోషిస్తారు. మీకు చదవడం కోసం కొన్ని పుస్తకాలు యిస్తాను. క్రైస్తవ మత గ్రంధాలలో కెల్లా గొప్పది బైబిలే, దాన్ని చదవమని సిఫారసు చేస్తున్నాను.” అని అన్నాడు.

బేకరు గారికి ధన్యవాధాలు చెప్పి ఒంటి గంట ప్రార్ధనకు తప్పక వస్తానని చెప్పాను. “అయితే రేపు మీకోసం యిక్కడనే వేచి వుంటాను. యిక్కడి నుండి మనిద్దరం ప్రార్ధనా మందిరానికి కలిసే వెళదాం.” అని అన్నాడు. నేను సెలవు తీసుకున్నాను.

ఆలోచించేందుకు యిప్పటి దాకా నాకు అవకాశం చిక్కలేదు. జాన్‌స్టన్ గారి దగ్గరకు వెళ్లాను. వారికి డబ్బు చెల్లించి క్రొత్త యింటికి వెళ్లాను. అక్కడే భోజనం చేశాను. ఆమె మంచి యిల్లాలు. ఆమె నాకోసం శాకాహారం సిద్ధం చేసింది. వారి కుటుంబంతో కలిసి పోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు.

తరువాత నేను అక్కడి నుండి అబ్దుల్లా గారి స్నేహితుణ్ణి చూచేందుకు వెళ్లాను. అబ్దుల్లా వారికి చీటీ వ్రాసి యిచ్చాడు. నేను వెళ్లి ఆ చీటీ యిచ్చాను. మాకు పరిచయం అయింది. ఆయన అక్కడ హిందూ దేశస్థులు పడుతున్న కష్టాలు చెప్పారు. తన యింట్లో వుండమని ఆయన నన్ను బలవంతం చేశారు. నేను ధన్యవాదాలు చెప్పి యిదివరకే బస ఏర్పాటు చేసుకున్నానని మనవి చేశాను. “మీకేమి కావాలన్నా అడగండి. సంకోచించకండి” అని ఆయన మరీ మరీ చెప్పారు.

సంధ్యాసమయం దాటింది. యింటికి చేరి భోజనం చేశాను. విశ్రమించి దీర్ఘాలోచనలో మునిగిపోయాను. ప్రస్తుతం చేయడానికి పనేమీ లేదు. ఈ విషయం అబ్దుల్లా గారికి తెలియజేశాను. బేకరుగారు నాతో యింత స్నేహం చేయడానికి కారణం ఏమిటి? వారి సహచరుల పరిచయం వల్ల ఒనగూడేదేమిటి? క్రైస్తవ మతాన్ని గురించి ఎంతని చదవగలను? హిందూమతానికి సంబంధించిన గ్రంధాలు ఎక్కడ దొరుకుతాయి! నా మతాన్ని గురించి తెలుసుకోలేకపోతే క్రైస్తవ మతాన్ని గురించి ఏం తెలుసుకోగలను? యోచించి యోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను,

“నా చదువంతా నిష్పాక్షికంగా వుండాలి. ఈశ్వరుడు చూపించిన త్రోవన బేకర్ మిత్రుల బృందంతో బాటు సంచరించాలి. నా మతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోనిదే యితర మతాన్ని అంగీకరించను. అట్టి ఆలోచనే పెట్టుకోను.” ఈ విధంగా ఆలోచిస్తూ వుండగా నిద్ర వచ్చేసింది.