Jump to content

సత్యశోధన/మూడవభాగం/6. సేవా ప్రవృత్తి

వికీసోర్స్ నుండి

6. సేవా ప్రవృత్తి

నా వృత్తి బాగా సాగుతున్నది. కాని దానివల్ల నాకు సంతోషం కలగలేదు. జీవితాన్ని యింకా రుజూ మార్గాన నడిపించాలనే మధన నాలో ఎక్కువగా సాగింది

ఆ సమయంలో మా యింటికి ఒక కుష్టురోగి వచ్చాడు. అన్నం పెట్టి పంపి వేయడానికి మనస్సు అంగీకరించలేదు. అతణ్ణి ఒక గదిలో వుంచి పుండ్లు కడిగి శుభ్రం చేసి కట్లు కట్టాను. సేవ చేశాను.

అయితే ఆ విధంగా ఎక్కువ రోజులు చేయలేకపోయాను. ఎల్లప్పుడు అతణ్ణి యింట్లో వుంచుకోవడానికి శక్తి చాలలేదు. ఇచ్ఛా బలం చాలలేదు. అందువల్ల గిరిమిటియాల కోసం ప్రభుత్వం వారు పెట్టిన ఆసుపత్రికి అతణ్ణి పంపించివేశాను. నాకు తృప్తి కలుగలేదు. ఎల్లప్పుడూ చేయతగిన శుశ్రూషాకార్యం ఏదైనా దొరికితే బాగుండునని ఆశపడ్డాను. డా. బూత్‌గారు సెయింట్ ఏయిడాన్స్ మిషన్‌కు అధికారులు. ఎవరు వచ్చినా వారు ఉచితంగా మందులిస్తూ వుంటారు. ఆయన ఎంతో మంచివాడు. వారి హృదయ స్నేహమయం. డా. బూత్ గారి ఆధిపత్యాన పారసీ రుస్తుంజీ ధర్మంతో ఒక ఆసుపత్రి పెట్టబడింది. అందు నర్సుపని చేద్దామని నాకు ప్రబలంగా కోరిక కలిగింది. అక్కడ రెండు గంటల సేపు మందులిచ్చే పని ఒకటి వున్నది. డబ్బు తీసుకోకుండా ఆ పని చేయగల స్వచ్ఛంద సేవకుడు కావలసి వచ్చింది. ఆ పని నేను చేయాలని, ఇతర పనుల నుండి ఏదో విధంగా రెండు గంటల సమయం మిగిల్చి, యీ పనికి వినియోగించాలని నిర్ణయించుకున్నాను. ఆఫీసులో కూర్చొని సలహాలివ్వడం, దస్తావేజులకు ముసాయిదా తయారుచేయడం, తగాదాలు పరిష్కరించడం నా పసులు. నాకు మేజిస్ట్రేటు కోర్టులో కూడా పనులు వుండేవి. కాని అవి అంత వివాదస్పదాలు కావు. యీ కేసుల్లో నాకు ఖానుగారు సాయం చేస్తున్నారు. వీరు నాతోబాటు దక్షిణ - ఆఫ్రికాకు వచ్చారు. మా యింట్లోనే వుండేవారు. వారి సాయంవల్ల ఆ చిన్న ఆసుపత్రిలో పనిచేసేందుకు నాకు అవకాశం ఆభించింది. అక్కడ ప్రతిరోజూ ఉదయం పూట పని. రాకపోకలకు, అక్కడ పని చేయడానికి రోజూ రెండు గంటలు పట్టేది. యీ పని వల్ల నా మనస్సుకు కొంచెం శాంతి లభించింది. రోగుల రోగాల్ని, బాధల్ని అడిగి తెలుసుకొని డాక్టరుకు చెప్పడం, డాక్టరు చెప్పిన మందు తయారుచేసి రోగులకు యివ్వడం యిదీ నా పని. దీనివల్ల రోగపీడితులైన హిందూదేశవాసులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వారిలో చాలామంది అరవవారు, తెలుగువారు, ఉత్తరాదివారు. అంతా గిరిమిటియాలు.

ఆ చికిత్సా జ్ఞానం తరువాత నాకు ఎంతో ఉపయోగపడింది. బోయరు యుద్ధ సమయంలో దెబ్బలు తిన్నవారికీ, రోగులకు సేవ చేయడానికి ఆ అనుభవం బాగా ఉపయోగపడింది.

పిల్లల పోషణను గురించిన సమస్య ఎప్పుడూ నన్ను వేధిస్తూ వుండేది. దక్షిణ ఆఫ్రికాలో నాకు యిద్దరు కుమారులు కలిగారు. వారి పోషణకు కూడా ఆసుపత్రిలో కలిగిన అనుభవం బాగా ఉపయోగపడింది. నా స్వతంత్ర ప్రవృత్తి నాకు ఎప్పడూ కష్టం కలిగిస్తూ వుండేది. యిప్పటికీ కలిగిస్తున్నది. ప్రసవం శాస్త్రీయంగా జరపాలని దంపతులు అనుకున్నాం. అయితే డాక్టరుగాని, మంత్రసానిగాని సమయానికి రాకపోతే ఏంచేయాలి? చదువుకున్న మంత్రసాని హిందూ దేశంలోనే దొరకనప్పుడు దక్షిణ - ఆఫ్రికాలో దొరకడం సాధ్యమా? అందుకని నేను సుఖ ప్రసవాన్ని గురించి పుస్తకం కొని చదివాను. డా|| త్రిభువన దాసు గారు రచించిన మానేశిఖావణ తల్లులకు ఉపదేశము అను పుస్తకం అది. ఆ పుస్తకం ప్రకారం మరియు యితరత్ర నాకు లభించిన అనుభవం ప్రకారం ఇద్దరు పిల్లలకి లాలన పాలన నేనే చేశాను. రెండుసార్లు మంత్రసానుల సాయం పొందాను. కాని రెండు రెండు మాసాల కంటే మించి వారి సాయం లభించలేదు. వారి సహాయం నా భార్య వరకే పరిమితమైంది. పిల్లలకు తలంటువంటి సమస్త పనులు నేనే చేశాను. మా చివరివాడి పుట్టుక నన్ను కఠిన పరీక్షకు లోను చేసింది. ప్రసవ వేదన హఠాత్తుగా ప్రారంభమై ఎక్కువైంది. డాక్టరు సమయానికి దొరకలేదు. మంత్రసానిని పిలవాలి. మంత్రసాని దగ్గరలో వుంటే ఆ సమయంలో పిలవవచ్చు. కాని అందుకు అవకాశం లేదు. నొప్పులు ఎక్కువైనాయి. దానితో నేనే పురుడు పోయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు త్రిభువనదాసు పుస్తకం చదివాను గనుక నాకు భయం కలుగలేదు. ఆ గ్రంధ పఠనం నాకు అమితంగా సహాయపడింది.

పిల్లల పోషణను గురించి జ్ఞానం సంపాదించి నేను మా పిల్లల్ని పెంచి యుండకపోతే వాళ్లు ఆరోగ్యం విషయంలో వెనుకబడి యుండేవారే. సామాన్యంగా మొదట అయిదేండ్ల వరకు పిల్లలు నేర్చుకునేది ఏమీ వుండదని జనం అనుకుంటూ వుంటారు కాని అది సరికాదు. అసలు మొదటి అయిదేండ్ల సమయంలో పిల్లలు గ్రహించినంతగా ఆ తరువాత గ్రహించరు. శిశువుకు విద్యారంభం తల్లి గర్భంలోనే ఆరంభం అవుతుంది. గర్భ ధారణ సమయంలో తల్లి దండ్రుల శారీరక మానసిక ప్రవృత్తుల ప్రభావం శిశువునందు ప్రసరిస్తుంది. తల్లి గర్భం మోస్తున్నప్పుడు ఆమె ప్రకృతిని, ఆహార విహారాల్ని, గుణ దోషాల్ని స్వీకరించి శిశువుకు జన్మనిస్తుంది. జన్మించిన తరువాత తల్లిదండ్రుల్ని అనుకరిస్తుంది. తరువాత కొన్ని సంవత్సరాల దాకా తన వికాసానికి పూర్తిగా తల్లి దండ్రులమీద ఆధారపడుతుంది.

ఈ సంగతులు తెలిసిన దంపతులు కేవలం కామ తృప్తి కోసం తంటాలు పడరు. సంతానం కోసం వాళ్లు కాపురం చేస్తారు. నిద్రవలె, ఆహారంవలె సంయోగం అవసరం అని అనుకోకుండా పూర్తిగా అజ్ఞానమని నా అభిప్రాయం. అసలు ఈ జగత్తు యొక్క అస్తిత్వం జనన క్రియపై ఆధారపడి వున్నది. ఈ లోకం భగవంతుని లీలాభూమి. అతని మహిమకు ప్రతిబింబం. స్త్రీ పురుష సంయోగ సంతానం యొక్క సక్రమాభివృద్ధికి నిర్మితమని తెలుసుకుంటే భగీరధ ప్రయత్నం చేసి అయినా మనిషి తన లాలసత్వాన్ని పోగొట్టుకొనగలడు. ఆ విధంగా జరగాలని నా అభిలాష. సంయోగం వల్ల తాము పొందే సంతతి యొక్క శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక రక్షణకు పూనుకొనడం అవసరమను జ్ఞానం తల్లిదండ్రులు పొందుదురుగాక. ఆ విధంగా తన సంతతికి లాభం చేకూర్చెదరుగాక.