Jump to content

సత్యశోధన/నాల్గవభాగం/47. అపరాధి జైలు శిక్షపడకుండా తప్పించుకున్న విధానం

వికీసోర్స్ నుండి

47. అపరాధి జైలుశిక్ష పడకుండా తప్పించుకున్న విధానం

పారశీ రుస్తుంగారి పేరుతో ఈ ప్రకరణాల పాఠకులు సుపరిచితులే. ఆయన ఒకే సమయంలో నాకు కక్షిదారు, ప్రజాకార్యరంగంలో అనుచరుడు ఆయ్యాడు. మరో విధంగా చెప్పాలంటే ముందు అనుచరుడు తరువాత కక్షిదారు అయ్యాడన్నమాట. ఆయన విశ్వాసాన్ని నేను అపరిమితంగా చూరగొన్నాను. తన స్వంతవిషయాలేగాక తన ఇంటి విషయాల్లో సహితంగా నా సలహాలు తీసుకొని ఆ ప్రకారం నడుచుకునేవాడు. ఆయనకు జబ్బు చేసినా నా సలహా అవసరమని భావించేవాడు. మా ప్రవర్తనా తీరులో ఎంతో వ్యత్యాసం వుండేది. ఆయన తన జబ్బులకు నా చికిత్సను వాడి చూచేవాడు. ఒక పర్యాయం పెద్ద ఆపద విరుచుకుపడింది. తన వ్యాపార రహస్యాలు నాకు చెపుతూ వుండేవాడు. అయినా ఒక రహస్యాన్ని దాచివుంచాడు. పారసీ రుస్తుంజీ చెల్లించవలసిన పన్ను చెల్లించేవాడు కాదు. దొంగ వ్యాపారం సాగించేవాడన్నమాట. బొంబాయి కలకత్తా నుండి వస్తువులు తెప్పించేవాడు. ఇక్కడే దొంగ వ్యాపారం జరుగుతూ వుండేది. అధికారులందరితో ఆయనకు మంచి సంబంధాలు పుండటం వల్ల ఆయనను ఎవ్వరూ సందేహించేవారు కాదు. ఆయన చూపించిన రశీదుల్ని, పట్టీలను బట్టి పన్ను వసూలు చేస్తూవుండేవారు. అప్పుడప్పుడు కొద్దిగా అనుమానం కలిగినా ఆఫీసర్లు చాలామంది కళ్ళు మూసుకునేవారన్నమాట. కాచో పారో ఖవో ఆన్, తేవుం ఛే చోరీ సుందన్ (పాదరసం తినడం, దొంగసొత్తు తినడం రెండూ సమానం సుమా) అని ఆ భగవంతుని సూక్తికదా! ఒకసారి పారసీ రుస్తుంగారి దొంగసొత్తు పట్టుబడింది. నా దగ్గరకు పరుగులు తీసాడు. ఆయన కండ్ల నుండి కన్నీరు కారుతున్నది. ‘అన్నా! నేను మోసం చేశాను. నా పాపం ఈనాడు బ్రద్దలయింది. నేను పన్ను ఎగ్గొట్టాను. నాకు జైలుశిక్ష తప్పదు. నాశనం తప్పదు. ఈ ఆపదనుండి నీవే రక్షించాలి. నేను నీదగ్గర ఏమీ దాచలేదు. కాని వ్యాపారంలో చేసే దొంగతనాన్ని గురించి చెప్పడం ఎందుకులే అని భావించి చెప్పలేదు. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.’ అని ఘోష పెట్టాడు. ధైర్యం చెబుతూ “నా పద్ధతి మీకు తెలుసు కదా! విడిపించగలగడం, విడిపించలేకపోవడం భగవంతునిమీద ఆధారపడ్డ విషయం. చేసిన అపరాధాన్ని అంగీకరించే షరతులమీద అయితే నేను ప్రయత్నిస్తాను” అని అన్నాను.

పాపం ఆ పెద్ద మనిషి ముఖం పాలిపోయింది. “మీదగ్గర ఒప్పుకున్నాను కదా! సరిపోదా!” అని అన్నాడు. “చేసిన అపరాధం ప్రభుత్వానికి సంబంధించినది. నా యెదుట అంగీకరిస్తే ప్రయోజనం ఏముంటుంది” అని మెల్లగా అన్నాను. “మీరు చెప్పిన ప్రకారం చేయక తప్పదు. నాకు ఒక పాత వకీలు వున్నాడు. ఆయన సలహా తీసుకోండి. ఆయన నాకు మంచి మిత్రుడు. అని అన్నాడు. రుస్తుంజీ వ్యవహారమంతా పరిశీలించి చూశాను. ఈ దొంగ వ్యాపారం చాలా కాలం నుండి సాగుతున్నదని స్పష్టంగా తెలిసిపోయింది. పట్టుబడ్డ సామగ్రి స్వల్పమే. వకీలును కలిశాం. ఆయన కేసును పరిశీలించాడు. “ఈ వ్యవహారమంతా జ్యూరీ ఎదుటకు వెళుతుంది. ఇక్కడి జ్యూరీ హిందూ దేశస్థుల్ని తేలికగా వదిలే రకం కాదు. అయినా వదలను” అని అన్నాడు. ఆయనతో నాకు పరిచయం తక్కువ. పారసీ రుస్తుంజీ ఆయన మాటను విని “మీకు ధన్యవాదాలు. అయితే ఈ వ్యవహారంలో నేను గాంధీగారి సలహా ప్రకారం నడుచుకుంటాను. ఆయన నన్ను బాగా ఎరుగును. మీరు వీరికి అవసరమైన సలహాలు యిస్తూవుండండి” అని అన్నాడు. ఈ వ్యవహారం అక్కడ ముగించి మేము రుస్తుంజీ కొట్టు దగ్గరకు వచ్చాం. “అసలు ఈ విషయాన్ని కోర్టుదాక పోనీయకూడదని అలా పోవడం మనకు మంచి పని కాదని అభిప్రాయపడ్డాను. కోర్టుకు వెళ్లడమా లేదా అని నిర్ణయించేవాడు టాక్సు వసూలు చేసే అధికారి. అతడు కూడా ప్రభుత్వ వకీలు సలహా ప్రకారం నడుచుకోవలసి వుంటుంది. నేను ఆ యిద్దరినీ కలుస్తాను. అయితే ఒక్క విషయం వాళ్లకు తెలియని అనగా వాళ్లకు పట్టుబడని దొంగతనాలు కూడా నేను వారికి చెప్పవలసి వుంటుంది. వారు విధించే శిక్షను అనుభవించేందుకు సిద్ధపడదాం. జైలుకు వెళ్లడం కంటే చేసిన దొంగ పని సిగ్గు చేటు అని నా అభిప్రాయం. సిగ్గుచేటు అయిన పని జరిగిపోయింది. జైలుకు వెళ్ళవలసి వస్తే ప్రాయశ్చిత్తమని భావిద్దాం. అయితే నిజమైన ప్రాయశ్చిత్తం ఒకటి వున్నది. ఇక భవిష్యత్తులో యిటువంటి దొంగపని చేయనని ప్రతిజ్ఞ గైకొనడమే ఆ ప్రాయశ్చిత్తం” అని స్పష్టంగా చెప్పివేశాను.

నా మాటను సరిగా రుస్తుంజీ అర్ధం చేసుకోగలిగాడని చెప్పలేను. ఆయన మంచి వీరుడు. అయితే అప్పుడు నీరు కారి పోయాడు. ఆయన పరువు పోయే ప్రమాదం సంభవించింది. ఎంతో కష్టపడి చెమటోడ్చి కట్టిన భవనం కుప్ప కూలిపోతుందేమోనన్న భయం ఆయన్ను పట్టుకున్నది. “నా మెడ మీ చేతుల్లో వుంచాను. ఇక మీఇష్టం” అని ఆయన అన్నాడు. వ్యవహారాలలో నాకుగల వినమ్రతా శక్తినంతటినీ వినియోగించాను. అధికారిని కలిశాను. దొంగ వ్యవహారమంతా నిర్భయంగా చెప్పి వేశాను. కాగితాలన్నీ చూపిస్తానని మాట యిచ్చాను. పారసీ రుస్తుంజీ పడుతన్న బాధను, ఆయన వెల్లడించిన పశ్చాత్తాపాన్ని వివరించాను. “ఈ వృద్ధ పారశీకుడు మంచివాడని తోస్తున్నది. ఆయన మూర్ఖపు పని చేశాడు. నా కర్తవ్యం ఏమిటో మీకు తెలుసా పెద్ద వకీలు ఎలా చెబితే అలా నేను చేయాలి. అందువల్ల మీరు పెద్ద వకీలుకు మీ శక్తినంతా వుపయోగించి నచ్చచెప్పండి.” అని ఆఫీసరు చెప్పాడు. “పారసీ రుస్తుంజీని కోర్టుకు యీడ్వకుండా వుంటే సంతోషిస్తాను” అని అన్నాను. ఆ అధికారి దగ్గర అభయదానం పొంది ప్రభుత్వ వకీలుతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. ఆయనను కలిశాను. నా సత్యనిష్ట ఆయన గ్రహించాడని తెలుసుకున్నాను. నేను ఏమీ దాచడం లేదని ఆయన ఎదుట ఋజువు చేశాను. ఈ వ్యవహారంలోనో మరో వ్యవహారంలోనో ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన “మీరు లేదు కాదు చూద్దాం అను సమాధానం పొందే వ్యక్తి కాదు” అని నాకు సర్టిఫికెట్ యిచ్చాడు. పారసీ రుస్తుంజీ మీద కేసు మోపబడలేదు. ఆయన అంగీకరించిన టాక్సు సొమ్ము రెట్టింపు వసూలు చేసి కేసును ఉపహరించవలెనని ఆర్డరు వెలువడింది. రుస్తుంజీ తాను చేసిన పన్నుల ఎగవేతకు సంబంధించిన ఈ దొంగతనం గురించిన కథ వ్రాసి అద్దాల బీరువాలో భద్రపరిచాడు. ఆ కాగితాలు తన ఆఫీసులో తన వారసులకు, తోటి వ్యాపారస్తులకు హెచ్చరికగా వుంచాడు. రుస్తుంజీ సేఠ్ గారి మిత్రులు వ్యాపారస్తులు “ఇది నిజమైన వైరాగ్యం కాదు. స్మశాన వైరాగ్యం సుమా” అని నాకు చెప్పారు. వారి మాటల్లో సత్యం ఎంత వుందో నాకు తెలియదు. ఆ మాట కూడా రుస్తుంజీ సేఠ్‌కు నేను చెప్పాను. “మిమ్మల్ని మోసం చేసి నేను ఎక్కడికి వెళ్ళగలను?” అని ఆయన సమాధానం యిచ్చాడు.


* * *