సత్యశోధన/నాల్గవభాగం/12. ఇంగ్లీషువారితో పరిచయం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

12. ఇంగ్లీషువారితో పరిచయం

ఒక పర్యాయం జోహన్సుబర్గులో నా దగ్గర నలుగురు హిందూ దేశపు గుమాస్తాలు ఉండేవారు. వారిని గుమాస్తాలు అనాలో లేక బిడ్డలు అని అనాలో చెప్పలేను. వారితో నా పనిసాగలేదు. టైపు లేనిదే నా పని సాగదు. టైపింగు జ్ఞానం కొద్దో గొప్పో నా ఒక్కడికే ఉంది. ఈ నలుగురు యువకుల్లో యిద్దరికి టైపింగు చేయడం నేర్పాను. కాని వాళ్ళకు ఇంగ్లీషు బాగా రాకపోవడం వల్ల వారిటైపు బాగుండలేదు. వారిలో లెక్కలు వ్రాయగలవారిని కూడా తయారు చేసుకోవాలి. నేటాలు నుండి నా ఇష్టమైన వాళ్ళను పిలిపించుకునేందుకు వీలులేదు. పర్మిట్ లేకుండా ఏ హిందూ దేశస్థుడూ ప్రవేశించడానికి వీలులేదు. నా సౌకర్యం కోసం అధికారుల మెహర్బానీ కోసం బిచ్చం అడిగేందుకు నేను సిద్ధపడలేదు. నేను ఇబ్బందుల్లో పడ్డాను. ఎంత శ్రమపడ్డా, వకీలువృత్తి, సార్వజనిక సేవాకార్యం రెండూ సాగించడం కష్టమైపోయింది. గుమస్తా పనికి ఇంగ్లీషు వాళ్ళు దొరికితే వారిని నియమించకుండా ఎలా వుండగలను? నల్లవారి దగ్గర తెల్లవాళ్ళు ఉద్యోగం చేస్తారా అని నాకు అనుమానంగా వుండేది. ప్రయత్నం చేసి చూద్దామని నిర్ణయించుకున్నాను. టైపు రైటింగు ఏజెంట్లతో నాకు పరిచయం ఉంది. ఒక ఏజెంటు దగ్గరకు వెళ్లాను. టైపు చేయగల తెల్లవారు స్త్రీ అయినా పురుషుడైనా నల్లవారి దగ్గర నౌకరీ చేయడానికి అంగీకరిస్తే పంపండి అని ఆయనకు చెప్పాను. దక్షిణ ఆఫ్రికాలో షార్టుహాండు, టైపురైటింగు పని సామాన్యంగా స్త్రీలే చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని వెతికి పంపిస్తానని ఆయన మాట ఇచ్చాడు. ఆయనకు మిస్‌డిక్ అను పేరుగల ఒక స్కాచ్‌కుమారి తటస్థపడింది. ఆ మహిళ ఈ మధ్యనే స్కాట్లండు నుండి వచ్చింది. ప్రామాణికమైన నౌకరీ ఎవరి దగ్గరనైనా సరే చేయడానికి ఆమెకు అభ్యంతరం లేదు. ఆమె వెంటనే పనిలో చేరాలని అనుకున్నది. ఆ ఏజంటు ఆమెను నా దగ్గరకు పంపించాడు. చూడగానే ఆమె మీద నా దృష్టి నిలబడిపోయింది.

‘హిందూ దేశవాసి దగ్గర పనిచేయడానికి మీకు అభ్యంతరం ఏమీ లేదు కదా!’ అని అడిగాను. “ఏమాత్రం లేదు” దృఢమైన స్వరంతో ఆమె అన్నది.

“జీతం ఎంత కావాలి?”

“పదిహేడున్నర పౌండ్లు. మీరు ఎక్కువ అనుకుంటున్నారా?” అని ఆమె అడిగింది

“నేను ఆశించినంత పని మీరు చేసిన యెడల ఆ సొమ్ము నాకు అధికం కాదు. మీరు ఎప్పటి నుండి పనిలో చేరతారు?”

“మీరు సరేనంటే ఈ క్షణం నుంచే పని ప్రారంభిస్తాను.”

నేను ఎంతో సంతోషించాను. ఆ సోదరిని వెంటనే ఎదుట కూర్చోబెట్టుకుని జాబులు వ్రాయించడం ప్రారంభించాను.

ఆమె ఒక గుమాస్తాగా గాక, ఒక బిడ్డగా, ఒక సోదరిగా బాధ్యత వహించి పనిచేయడం ప్రారంభించింది. ఆమెకు ఎన్నడూ బిగ్గరగా చెప్పవలసిన అవసరం కలుగలేదు. ఆమె చేసిన పనిలో తప్పులెన్నవలసిన అవసరం ఎన్నడూ కలుగలేడు. వేలాది పౌండ్ల సొమ్ము ఆమె చేతిలో వున్న రోజులు కూడా వున్నాయి. ఆమె డబ్బు లెక్క కూడా సంబాళించసాగింది. సంపూర్తిగా ఆమె నా విశ్వాసాన్ని చూరగొన్నది. ఆమె వ్యక్తిగత రహస్యాలు కూడా నాకు చెప్పే స్థితికి రావడం ఎంతో గౌరవంగా భావించాను. తనకు తోడుగా వుండే వ్యక్తిని గురించిన సలహా అడగడమే గాక నా సాయం కూడా కోరింది. కన్యాదానం చేసే గౌరవం కూడా నాకే లభించింది. మిస్‌డిక్ మిస్ మెకడనల్డ్ అయింది. అప్పుడు ఆమెకు మేము దూరం కావలసి వచ్చింది. వివాహం అయిన తరువాత కూడా పని ఎక్కువైనప్పుడు కబురు చేస్తే ఆమె వచ్చి సహకరిస్తూ ఉండేది.

ఆఫీసులో షార్టుహాండు తెలిసినవారు కావలసి వచ్చింది. ఒక మహిళ దొరికింది. ఆమె పేరు శ్లేశిన్. ఆమెను నాదగ్గరకు మి.కేలన్‌బక్ తీసుకువచ్చారు. శ్రీ కేలన్‌బక్ గారిని గురించి పాఠకులు ఇక ముందు తెలుసుకుంటారు. ఆ మహిళ ఒక హైస్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు 17 సంవత్సరాల వయస్సు. ఆమె ప్రత్యేకతలు కొన్ని చూచి నేను, మి.కేలన్‌బక్ ఆశ్చర్యపడేవాళ్ళం. ఆమె నౌకరీ చేయాలనే ఉద్దేశ్యంతో మా దగ్గరకు రాలేదు. ఆమె అనుభవం కోసం వచ్చిందన్నమాట. ఆమెకు వర్ణద్వేషం లేదు. ఆమె ఎవ్వరినీ లక్ష్యపెట్టేది కాదు. ఎవరినైనా సరే అవమానించడానికి సంకోచించేదికాదు. ఒకరిని గురించి ఆమెకు కలిగిన భావాన్ని స్పష్టంగా ప్రకటించేది. తన భావాన్ని వెల్లడించడానికి వెనుకాడేదికాదు. ఇట్టి స్వభావం వల్ల అప్పుడప్పుడు అందరికీ బరువు దిగినట్లుండేది. ఆమెకు ఇంగ్లీషు భాషమీదగల అధికారం నాకంటే అధికం. ఈ కారణాలన్నిటివల్ల ఆమె తయారు చేసిన జాబులను తిరిగి చదవకుండా సంతకం పెడుతూ వుండేవాణ్ణి.

ఆమెకు గల త్యాగ ప్రవృత్తి ఎంతో గొప్పది. ఆమె చాలా కాలం వరకు నా దగ్గర కేవలం ఆరు పౌండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండేది. అంతకంటే జీతం తీసుకునేందుకు చివరి వరకు ఆమె అంగీకరించలేదు. జీతం ఎక్కువ తీసుకోమని నేను అంటే ఆమె నన్ను బెదిరిస్తూ “జీతం తీసుకునేందుకు నేను ఇక్కడ వుండటం లేదు. మీ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం. మీ ఆదర్శాలంటే నాకు ఇష్టం. అందుకే మీ దగ్గర పనిచేస్తున్నాను” అని స్పష్టంగా అంటూ ఉండేది.

ఒకసారి అవసరంపడి నా దగ్గర ఆమె 40 పౌండ్లు తీసుకున్నది. అది కూడా అప్పుగానే. గత సంవత్సరం ఆమె ఆ డబ్బంతా తిరిగి ఇచ్చివేసింది. ఆమె త్యాగభావం ఎంత తీవ్రంగా వుండేదో ధైర్యం కూడా అంత ఎక్కువగా ఉండేది. స్పటికమణి వంటి పవిత్రత, క్షత్రియుల్ని కూడా నివ్వెరపడేలా చేయగల ప్రతాపం కలిగిన కొందరు మహిళామణులు నాకు తెలుసు. అట్టివారిలో ఈమె ఒకరని నా అభిప్రాయం. ఆమె వయస్సులో ఉన్న ప్రౌఢ అవివాహిత. ఇప్పుడు ఆమె మానసికస్థితి ఎలా ఉన్నదో నాకు తెలియదు. అయినా నాకు కలిగిన అనుభవం వల్ల ఆమెను ఈనాటికి పవిత్రంగా స్మరిస్తాను. తెలిసిన సత్యాన్ని వ్రాయకపోతే సత్యానికి ద్రోహం చేసినవాణ్ణి అవుతానుకదా! పని వున్నప్పుడు రాత్రనక పగలనక అమితంగా శ్రమపడేది. అర్థరాత్రి సమయంలో కూడా పనిబడితే ఒంటరిగా వెళుతూ వుండేది. ఎవరినైనా వెంట పంపాలని ప్రయత్నిస్తే నన్ను కోపంగా చూచేది. వేలాదిమంది హిందూదేశస్తులు ఆమెను గౌరవభావంతో చూచేవారు. అంతా ఆమె మాట వినేవారు. మేమంతా జైల్లో వున్నప్పుడు, బాధ్యత గలవారెవ్వరూ బయటలేనప్పుడు ఆమె ఒక్కతే సత్యాగ్రహ సంగ్రామం నడిపించింది. లక్షలాది రూపాయల లెక్కలు ఆమెవ్రాసింది. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆమె జరిపింది. ఇండియన్ ఒపీనియన్ పత్రికను కూడా ఆమె నడిపింది. అలసట అంటే ఏమిటో ఆమె ఎరుగదు.

మిస్ శ్లేశిన్ గురించి ఎంత వ్రాసినా తనివి తీరదు. గోఖ్లేగారి సర్టిఫికెట్టు గురించి చెప్పి ఈ ప్రకరణం ముగిస్తాను. గోఖ్లేగారు నా అనుచరులందరిని పరిచయం చేసుకున్నారు. పరిచయం అయిన తరువాత చాలామంది విషయంలో వారు సంతోషించారు. ప్రతి ఒక్కరి చరిత్రను వారి విలువలను అంచనా వేశారు. హిందూ దేశానికి చెందిన నా అనుచరులు, యూరోపుకు చెందిన నా అనుచరులు అందరిలో వారు మిస్ శ్లేశిన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. “ఇంతటి త్యాగం, ఇంతటి పవిత్రత, ఇంత నిర్భీకత, ఇంతటి కార్యకుశలత బహు కొద్దిమంది లోనే నేను చూచాను. మిస్ శ్లేశిన్ మీ అనుచరులందరిలోను ప్రథమ స్థానం పొందుటకు అర్హురాలు” అని వారు ప్రకటించారు.