సత్యశోధన/నాల్గవభాగం/10. ఒకపావనస్మృతి - ప్రాయశ్చిత్తం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10. ఒక పావన స్మృతి - ప్రాయశ్చిత్తం

నా జీవితంలో ఎన్నో ఘట్టాలు జరిగాయి. వాటివల్ల అనేక మతాల వారితోను, జాతుల వారితోను నాకు గాఢ పరిచయం ఏర్పడింది. వీటన్నిటివల్ల కలిగిన అనుభవాల వల్ల స్వ-పరభేదాలు, దేశీయులు, విదేశీయులు, తెల్లవారు-నల్లవారు, హిందువులు - ముస్లిములు, క్రైస్తవులు పారశీకులు, యూదులు మొదలుగా గల వారి మధ్య వుండే భేదాలను అధిగమించగలిగాను. నా హృదయం అట్టి భేదాలను గుర్తించలేదని చెప్పగలను. నా విషయంలో ఇది గొప్ప సుగుణమేమీ కాదని నేను భావిస్తున్నాను. అహింస, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలుగాగల గుణాలను అలవరచుకొని, వాటి ఆధారంతో ఇప్పటివరకు నడుస్తున్నట్లే మతాల, జాతుల, రంగుల భేదాన్ని అలవరచుకోవడం కూడా సహజంగానే జరిగిందని నా భావన. డర్బనులో వకీలుగా పనిచేస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే గుమాస్తాలు నాతోబాటే వుండేవారు. వారిలో హిందువులు, క్రైస్తవులు వున్నారు. ప్రాంతాలవారీగా గుజరాతీలు, మద్రాసీలు వున్నారు. వారి విషయంలో నా మనస్సులో ఎన్నడూ వేరు భావం కలిగినట్లు గుర్తులేదు. వాళ్ళందరినీ నా కుటుంబీకులుగానే భావించేవాణ్ణి. నా భార్య ఎప్పుడైనా ఈ విషయం ఎత్తితే ఆమెతో తగాదాకు దిగేవాణ్ణి. ఒక గుమాస్తా క్రైస్తవుడు. అతని తల్లిదండ్రులు పంచమకులంవారు. నా గృహవ్యవస్థ పాశ్చాత్య విధానంతో కూడినది. అతని గదిలో పాయిఖానా లేదు. నా అభిప్రాయం ప్రకారం వుండకూడదు. అందువల్ల పాయిఖానాకు బదులు ప్రతిగదిలోను మూత్రం పోసుకునేందుకు ప్రత్యేక పాత్రలు వుంచాము. ఆ పాత్రలను తీసి బాగుచేసే కార్యక్రమం నౌకర్లది కాదు. ఇంటి యజమానిది, యజమానురాలిది. తాను కూడా మా కుటుంబంలో ఒకడినని భావించుకున్నవాడు తన పాత్రలు తానే కడిగి బాగుచేసుకునేవాడు. పంచమకులానికి చెందిన ఈ గుమాస్తా క్రొత్తవాడు. అతని పాత్ర మేమే తీసి బాగు చేయాలి. పాత్రలు కస్తూరిబాయి తీస్తూ ఉండేది. కాని అతని విషయం ఆమెకు మిక్కుటమై పోయింది. మా ఇద్దరికి జగడం జరిగింది. తాను ఎత్తదు. నేను ఎత్తుదామంటే అందుకు ఆమె ఇష్టపడదు. ఆమె కండ్ల నుండి కన్నీటి బిందువులు ముత్యాల్లా కారసాగాయి. చేతులో పాత్ర పట్టుకొని నావంక చురచుర చూస్తూ తిరస్కార భావం వ్యక్తం చేస్తూ మెట్లమీద నుండి గబగబ క్రిందకు దిగుతున్న కస్తూరిబాయి బొమ్మని చిత్రకారుడనైతే ఈనాడు కూడా చిత్రించియుండేవాణ్ణి.

కాని నేను ఎంతగా ప్రేమించేవాడినో అంతగా ప్రాణాలు తీసే భర్తను కూడా. ఆమెకు నేను శిక్షకుణ్ణని భావించేవాణ్ణి. అందువల్ల అంధప్రేమకులోనై ఆమెను బాగా సతాయిస్తూ ఉండేవాణ్ణి.

ఈ విధంగా ఆమె కోపంతో పాత్ర తీసుకొని వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఆమె పకపక నవ్వుతూ మూత్రపు పాత్ర తీసుకువెళ్ళాలి. అప్పుడే మనకు తృప్తి అన్నమాట. కంఠం పెద్దది చేసి “ఈ కలహం నా ఇంట్లో నడవదు” అని అరిచాను.

నా మాటలు కస్తూరిబాయి గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్నాయి. ఆమె రెచ్చిపోయి “అయితే నీ ఇల్లు నీ దగ్గరే ఉంచుకో నేను వెళ్లిపోతున్నా” అని అన్నది. అప్పుడు దేవుణ్ణి మరచిపోయాను. దయ అనేది నా హృదయంలో కొంచెం కూడా మిగలలేదు. నేను ఆమె చెయ్యి పట్టుకున్నాను. మెట్లు ఎదురుగా బయటికి వెళ్ళడానికి ద్వారం ఉన్నది. నేను ఆ నిస్సహాయురాలగు అబలను పట్టుకొని ద్వారం దాకా లాక్కెళ్ళాను. ద్వారం సగం తెరిచాను. కస్తూరిబాయి కండ్లనుండి గంగా, యమునలు ప్రవహిస్తున్నాయి. ఆమె ఇలా అన్నది “నీకు సిగ్గులేదు కాని నాకున్నది. కొంచెమైనా సిగ్గుపడు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళను? ఇక్కడ మా అమ్మ నాన్నలు లేరు. వుంటేవాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆడదాన్ని, అందువల్ల నీ దౌర్జన్యం సహించక తప్పదు. ఇకనైనా సిగ్గుతెచ్చుకో, ద్వారం మూసివేయి. ఎవరైనా చూస్తే ఇద్దరి ముఖాలకు మచ్చ అంటుకుంటుంది. ఆమె మాటలు విని పైకి ధుమ ధుమలాడుతూ వున్నాను. కాని లోలోన సిగ్గుపడిపోయాను. తలుపులు మూసివేశాను. భార్య నన్ను వదలలేనప్పుడు నేను మాత్రం ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళగలను? మా ఇద్దరికి చాలాసార్లు తగాదా జరిగింది. కాని ఫలితం చివరికి మంచిగానే ఉండేది. భార్య తన అత్యద్భుత సహనశక్తితో విజయం సాధించిందన్నమాట.

ఈ విషయం ఈనాడు తటస్థ భావంతో వర్ణించగలను. కారణం ఇది మా గడిచిన యుగపు జీవితానికి సంబంధించిన గాథ. ఇప్పుడు నేను మోహాంధుడనగు భర్తను కాను. శిక్షకుణ్ణి కాను. ఇప్పుడు కస్తూరిబాయి తలుచుకుంటే నన్ను బెదిరించగలదు. ఇప్పుడు మేము అనుభవం గడించిన మిత్రులం. నిర్వికార భావంతో కలిసి వుంటున్నాం. యీనాడు ఆమె నేను జబ్బుపడితే ప్రయోజనం పొందాలనే కోరిక లేకుండ చాకిరీ చేసే సేవిక అన్నమాట.

పైన తెలిపిన ఘట్టం 1898 నాటిది. అప్పుడు బ్రహ్మచర్యాన్ని గురించి నాకేమీ తెలియదు. ఆరోజులెలాంటివో తెలుసా? భార్య అంటే కేవలం సహధర్మిణి, సహచారిణి. సుఖదుఃఖాలలో సహభాగిని అను విషయం నాకు తెలియని రోజులవి. విషయవాంఛల తృప్తికి భార్య సాధనమని, భర్త ఆజ్ఞను నోరు మెదపకుండ శిరసావహించునట్టి స్త్రీయే భార్య అని నేను భర్తగా భావించిన రోజులవి.

1900 నుండి నా యోచనా సరళిలో అపరిమితమైన మార్పు వచ్చింది. 1906 లో ఫలితం కనబడింది. ఈ వివరం మరో సందర్భంలో మనవి చేస్తాను. ఇక్కడ ఒక్క విషయం మాత్రం పేర్కొంటున్నాను. నేను నిర్వకారుణ్ణి అయిన కొద్దీ నాగార్హ్యస్థ్య జీవితంలో సుఖ శాంతులు నిర్మలత్వం నెలకొన్నాయి.

ఈ పావన స్మృతిని గురించి చదువుతూ ఉన్నప్పుడు మేము ఆదర్శ దంపతులమని, నా ధర్మపత్ని యందు దోషాలేమీ లేవని లేక మా ఆదర్శాలు సమానంగా వున్నాయని భావించకుందురుగాక. కస్తూరిబాయికి ఆదర్శమంటూ ఒకటుందని పాపం ఆమెకే తెలిసియుండదు. నా ఆచరణలన్నీ ఈనాడు కూడా ఆమెకు రుచిస్తాయని అనుకోను. ఈ విషయమై మేము ఎన్నడూ చర్చించలేదు. చర్చించినా ప్రయోజనం వుండదు. ఆమెకు తల్లిదండ్రులు చదువు చెప్పించలేదు. నా దగ్గరకు వచ్చిన తరువాత సరియైన సమయంలో నేను చదువు నేర్పలేదు. ఇతర హిందూ స్త్రీలవలెనే ఆమెలో కూడా ఒక ప్రత్యేక గుణం ఉంది. ఇష్టం వున్నా లేకపోయినా, జ్ఞానంవల్ల గానీ, అజ్ఞానంవల్లగానీ నా వెంట నడచి నన్ను అనుసరించడమే తన జీవితానికి సార్థకత అని విశ్వసించింది. స్వచ్ఛజీవితం గడపవలెనని భావించి నా మార్గానికి ఎన్నడూ అడ్డు తగలలేదు. మా ఇద్దరి బౌద్ధిక శక్తులు వేరువేరుగా వున్నా మా జీవితం సంతోషంగా సుఖంగా ఊర్ధ్వపధాన ముందుకు సాగిందని చెప్పగలను.