సత్యభామాసాంత్వనము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
సత్యభామాసాంత్వనము
ప్రథమాశ్వాసము
శ్రీమహికన్య యాత్మకరచిన్మయముద్రికఁ జూచె దేమి నా
నీ మొనగుబ్బ లే నలము నీ టిది మానఁగలే నటంచుఁ దా
నామెయిఁ దెచ్చి కల్మి వినతాళి కొసంగుదు నంటఁ దెల్పు శ్రీ
రాముడు ముద్దులళ్ఘరిధరారమణుం గరుణించుఁగావుతన్.
మ. తనప్రాణేశ్వరునంకపీఠమున నుద్యల్లీలఁ గొల్వుండి భ
క్తనికాయమ్మున కే నుదారయశముల్ గల్గింతు నన్నట్లు దా
హనుమంతున్ దయఁ గూర్చి మౌక్తికమణీహారంబు పాలించు నా
జనకక్ష్మాపతికన్య ముద్దళఘరిక్ష్మాపాలునిం బ్రోవుతన్.
మ. ఎలమిం దాఁ జనుదోయిఁ జేరుకొనఁగా నీషద్గళజ్జూటశై
వలినీపూర మటంచు హారములఁ బోవం ద్రోయు రుద్రాణిగు
బ్బలు కేలం గబళించి యీర్ష్య చన భావించి సంతుష్టుఁడౌ
చలిగట్టల్లుఁ డొసంగు ముద్దళఘరిక్ష్మాజాని కైశ్వర్యముల్.
మ. తొగరాకందు కపోలమందు రతిఁ దోడ్తో జేర నీశానుగో
రు గదా యంచును దత్కపోలమున గోరు ల్వీడుకున్ వీడుగా
ద్విగుణం బౌతమి గోరుగె ల్పొదవు ఠీవిన్ మించు శ్రీగౌరి పొ
ల్పుగ ముద్దళ్ఘరిభూపచంద్రునికి గెల్పు ల్గూర్చి మన్నించుతన్.
చ. తనదుహిరణ్యగర్భత సదా జగతిన్ మెఱయించుకైవడిన్
దనరుసువర్ణలీల వదనంబున డంబులు గుల్కఁ బల్కుమం
తనమున వాణి రాణి గనుదక్కఁ బెనంగువిభుండు నిండుసొం
పున మన ముద్దులళ్ఘరివిభుం గరుణించి చిరాయు[1]వీయుతన్.
చ. పలుదొలుపల్కుపాలిఁ దగుబంగరుమేడను నాల్గువాకిళుల్
నిలిపినయట్టు లుండువిభునిద్దపుమోములఁ బచ్చవిల్తు కీ
ర్తులబలె నాల్గురూపులను [2]బ్రో డయి కొల్వొనరించువాణి ము
ద్దళఘరిశౌరి కీవుత దయన్ రసగుంభితవాగ్విజృంభణల్.
చ. ఒసపరి ముద్దుగుమ్మ తొడనుండగఁ దత్పురుషాయితంబునన్
ముసురుకొను న్మెఱుంగుచనుముత్యపుసోనలమాడ్కిఁ జూడ్కి కిం
పెసఁగెడియందపున్ వమధుబృందము చల్లుచు నుల్లసిల్లుమా
నిసిమదహత్తివీఁకదొర నిండుదయం గృతికర్తఁ బ్రోవుతన్.
సీ. ముక్తలక్ష్మీకుచంబు గ్రహించురీతి నే
బాలుఁ డర్కునిఁ బట్టి ప్రౌఢిఁ గాంచెఁ
దన కలంఘ్యం బేది యను భాతి నేమహా
బలశాలి పచరించి వనధి దాఁటె
విభునిప్రతాపంబు వెలయించుదారి నే
వీరుఁ డగ్గికి లంక విందుఁ జేసె
[3]నువిదరాగము చేతి కొసఁగిన[4]మాట్కి నే
ఘనుఁ డేలికకు మణి కాన్క చేసె
తే. నతని ధృతిమంతు మతిమంతు నధికశాంతు
సమరదుర్దాంతవృత్తాంతు సారశౌర్య
వంతు ముద్దళ్ఘరిక్షమాకాంతుఁ బ్రోవ
నెంతు నుతియింతు హనుమంతు నెలమిఁ గాంతు.
చ. పొలుపుగఁ బుట్టతేనెలు గుబుల్కొనుపల్కుల రామకీర్తనల్
సలిపినసత్కవి న్మధురసామధురోక్తుల ధర్మపుత్రుని
ర్మలచరితంబు పాణిబదరస్థితిగా నొనరించుసత్కవిం
దలఁచెద గౌరివీడియపుతావులఠీవులఁ బల్కు సత్కవిన్.
మ. మును గర్వంబున నాంధ్రభారతమహాంభోరాశి నన్యు ల్కవుల్
మునుఁగం దామస ముద్ధరించువగ నింపుల్ నింపుసందర్భముల్
దనరంగా నొకరెండుతేపల ప్రబంధశ్రేణి నిర్మించు న
న్నన నెఱ్ఱార్యునిఁ దిక్కనాధ్వరిని హృద్యస్ఫూర్తిఁ గీర్తించెదన్.
శా. సంఖ్యాతీతవిధావధీరితసుధాసాధారణస్వాదుతా
సంఖ్యాపాదిచమత్క్రియోర్మిళవచస్సందర్భణాహ్లాదికిన్
సంఖ్యావత్త్వము చెల్లుఁగాక దొర గాసం బియ్యఁ దద్వేదనా
సంఖ్యాపూరకు లైనవారలకుఁ దత్సామర్థ్యముల్ చెల్లునే?
చ. తెనుఁ గని సంస్కృతం బని మది న్వివరింపక నీచవాక్యపుం
దునియల నోటికుండలను దొంతి యిడున్వగ డబ్బికబ్బముల్
పెనఁచి నరాధముల్ భ్రమయఁ బేర్కొని ముష్కరు లైనదుష్కవుల్
ఘను లగుసత్కవీశ్వరులకైవడి రాజులపూజ కర్హులే?
మహాస్రగ్ధర.
సదసచ్ఛబ్దావబోధుల్ సరసవిరచనాసాధుమేధాసనాథుల్
విదళద్దుర్యుక్తియూథుల్ వివిధకృతిమహావీథికానిర్నిరోధుల్
సదయుల్ సాధుల్ విబాధుల్ సభలను సుకవుల్ సత్కృతుల్ సేయుచోఁ గ
త్పదవిద్యత్కోటికూటస్థపుటితకటుపద్యంబు హృద్యంబునౌనే?
సీ. ప్రౌఢులతోఁ బాముపగిదిని పగ చాటి
తెలియకుండను తేలువలెను మీటి
వెస ముక్కు దూసిన పసరంబువలెఁ ద్రుళ్ళి
బంతిక్రియను బెట్టుపడుచు మళ్లి
కాకికైవడి నింపుగానికూఁతలు పెట్టి
మేఁకవలెను గన్ను మెక్కఁబెట్టి
మాట దోఁచక కొంగమాడ్కి ధ్యానము చేసి
యడవిమెకముదారి నాకురాసి
తే. తికమకలు చెంది మది వకావకలు పొంది
వికలతను మూఁగయల్లిక వెగటు గాఁగ
ఱాఁగతనమునఁ గవి నంచు రాయిడించు
కుకవినుడిగుండ్లు మను గాఁత గోటియేండ్లు.
క. హృదయంబె పలక బలపము
చదు రగుమదియళుకు దీర్చ సామాజికుఁ డా
కొదమనెలతాల్పు నైనన్
విదితం బగు సుకవికవిత విద్వత్సభలన్.
చ, సకలము చల్లనౌ టెఱిఁగి జక్కవపిట్టలు స్రుక్కుకైవడిం
గుకవు లసూయచేఁ గుమిలి ఘూర్ణిలిరేని ప్రసన్ను లౌదు రౌ
సుకవులు మామకీనమృదుసూక్తికిఁ జెందొవవిందునిండుపొం
దిక నగుపండువెన్నెలల తేటకుఁ జొక్కు చకోరముల్వలెన్.
మ. కినియన్ వా రనుచీకటున్ ఏరియ వాగ్దేవీముఖేందూదయం
బున నుప్పొంగెడినాదుచిత్తకలశాంభోరాశిపైఁ దేరుపా
లను నున్వెల్లువతేటపల్కు లటు చాలన్ బొల్చురత్నంబు లు
ర్విని శృంగారకృతుల్ మహీపతులు కూర్మిన్వానిఁ జేకోరొకో!
సీ. సరసత భువనంబు చల్లనై విలసిసల్ల
సారస్వతస్ఫూర్తి సంపుటిల్ల
వనమయూరాధికవాఙ్నైపుణి పొసంగ
రయనటద్ధారాతిశయ మెసంగఁ
బటుతరోదితకదంబంబులు నవలొత్త
వెఱఁగుపడఁగనైన మెఱుఁగు హత్త
సౌహృదకవిరాజసంఘంబు హర్షింప
గూలంకషాభోగలీల మించ
తే. నమృతవర్షంబు గురిసిన యట్లు ఘనత
వెలయఁగా గీర్తికందళములు చెలంగఁ
బ్రకృతి యంతయుఁ దనియంగ వికృతి లేని
సుకృతి నొనరించువాఁ డౌర సుకృతి జగతి.
వ. అని యిష్టదేవతావందనంబును సుకవిజనాభినందనంబును గుకవి
నిందనంబునుం గావించి యే నభంగురశృంగారరసతరంగిత వచనరచనాను
బంధం బగు నొక్కప్రబంధంబు నిర్మించ నెంచి యున్న సమయంబున:
క. లక్షణలక్షితకమలా
వీక్షణపుంఖానుపుంఖవిభవోన్మేషా
నుక్షణతతివిశ్రుతి యై
దక్షిణమధురాపురంబు తనరు ధరిత్రిన్.
శా. అవీట న్విధుకాంతసంతతి సమ్ముద్యద్రుక్మసాలాంతరా
శావిర్భూతవిడూరజాతమయకుడ్యప్రాంగణాధ్యాతత
క్ష్మావజ్రోపలవేదికాగ్రరుచిమచ్ఛక్రాశ్మవేశ్మాంశురే
ఖావల్గద్రవిజాతరంగమణిరంగత్తుంగసౌధంబునన్.
మ. జనులం జల్లనిచూపులం దనుపుచున్ శంపాలతాంగుల్ నయం
బున వేవేల్ తనచెంతఁ జేరి యుడిగంబుల్ సేయ నంతంతకున్
ఘనతన్ దిక్కులరాజు లెల్లఁ బొగడం గర్ణాటరాజ్యేందిరం
గనుసన్నన్ వరియించె ముద్దళఘరిక్ష్మాజాని రంజిల్లుచున్.
ఉ. అంతిపురంబునం దగుసహస్రనిజాకృతిభావచిత్రలీ
లాంతరకైతవంబున మృగాక్షుల కందఱ కన్నిరూపు లై
యెంతయు ముద్దులర్ఘరినరేశ్వరుఁ డేలుఁ బదాఱువేలసీ
మంతనుల న్నిరంతరము మన్నన సేయు మురారికైవడిన్.
క. ఈలీల ముద్దుగుమ్మల
నేలుచు మదిఁ దమి చెలంగు శృంగారాబ్ధిం
దేలుచు మహిషీజనముల
లాలింపుచు స్మరకళావిలాసము మెఱయన్.
సీ. ననుపుగా నొకవేళఁ గనకాంగి యొక్కతె
శుభలీలఁ బదముల నభినయింప
పనుపుగా నొకవేళ ననఁబోడి యొక్కతె
వీణానినాదంబు వినికి సేయ
తనుపుగా నొకవేళఁ దరళేక్షణ యొకర్తు
పంతుమార్గపుపాటవింత చూప
నినుపుగా నొకవేళ నీలవేణి యొకర్తు
హితవైనశృంగారకృతులు చదువఁ
తే. బనుపుగా నొక్కపంకజ[5]పత్రనేత్ర
మదవతులరాయబారంపుమాట లాడ
జనులు కలియుగగోపాలుఁ డనఁగ వెలసె
సరసగుణహారి ముద్దులళ్ఘరిమురారి.
సీ. ఏవేళ నడిగిన హేరాళముగ నిచ్చు
నేపాటికవినైన నెలమి మెచ్చు
గుణ మింత గలిగిన గణుతించి జను నేలుఁ
దప్పు లన్ని యుఁ దాళి తలఁచు మేలు
నాయంబుఁ గూర్చుచో నాయంబు పచరించు
నాశ్రితావళిఁ జాల నాదరించు
విరసించు నెట్టిభూవరు నైన ననిఁ జెండు
సాధుగోష్ఠిని ప్రొద్దు జరపుచుండు
తే. నిలను గావునఁ జక్రవర్తులును రాజు
లార్గురు పదార్గురును గాని యన్యు లెనయె
యనఁగ సుగుణసమష్టిచే నతిశయిల్లు
సరససులభుండు ముద్దులళ్ఘరివిభుండు.
సీ. తనదానజలలీల తటవతీతమహాం
బుధులకు నెడలేని పొందు గాఁగ
తనరమ్యతరయశోధవళిమ యామినీ
వరునిబింబమునకు మెఱుఁగు గాఁగ
తనతేజ మిలఁ జుట్టుకొనుగట్టు పెన్నెఱుల్
మొగ్గరంబుల విచ్చుమొగ్గ గాఁగ
తనప్రతిభారూఢి వనజసంభవశేష
వాల్మీకులకు మేలుబంతి గాఁగ
తే. తనమనోవర్తనము నెన్నధరణికన్య
కామణీదాశరథిపాదకమలబంభ్ర
మద్భ్రమరలీల నలు వొంద మహిని వెలసె
సరిజనవిదారి ముద్దులళ్ఘరిమురారి.
వ. వెండియు నఖండపాండిత్యమండితఖండపరశుకుండలకుండలి
కులాఖండలదిఙ్మండలవేదండపాండురకిటికమఠవిభుశుభాపాదనప్రచండబల
సముద్దండదోర్దండకండుకితతాండవజయరమాకుచకరండహిండమాననవ
నవప్రవాళమణికాండసమరపరమండలాధిపతిమిరఖండనశౌండమహోచ్చండ
చండకిరణమండలుండును, పరమర్దనగతమార్దవహృదయదుర్దమమదకర్దమ
సమ్మర్దవిసృమరసమరహార్దవినర్దమానవిరోధిశిరోధికానిర్దళనదుర్దాంత
సార్థకపఫణోపమపరుషతరకరఘరట్టఘట్టనతృట్యమానధరణిచత్వర
తదాత్వవిసృత్వరచక్రికులఫణాక్రాంతనిర్వక్రమణిచూర్ణతాసవర్ణతా
లబ్ధవర్ణసామంతమహీకాంతగళపరిగళదనర్గళశోణితద్రోణికానిపానసావ
ధానసముత్తాలకరతాళభూత[6]వేతాలమండలుండును, సంవర్తసమయప్రవ
ర్తమాననర్తనపౌష్కల్యపుష్కలావర్తఘర్షరనిర్ఘోషానుసంధానసమింధాన
మంధాసశిఖరిసంధితకలశసింధుబంధుగగనజంఘాలతావిశృంఖలతరంగ
సంఘసంఘటితఘమఘుమారవగౌరవహృతిభైరవదుందుభిబృంద
కందళితనినాదమేదురితచక్రవాళాంతరాళుండును, కరాళకరతాళధార
ధారాధారాళనీరపూరకోరకితయశఃకుసుమజాలకరవాలుండును, హృద్యాన
వద్యతనగరంతకాంతశశికాంతసౌధాంతరహర్నిశవిహరమాణవిదేహ
కన్యకామణీనిస్తులస్తనకనకకలశకనదకలంకకుంకుమపంకసంకలనచంక
నన్మకరాంకసూచితమకరాంకవిజయాంకనోన్నిద్రరామభద్రపూజా
జాయమానవిశ్వవిశ్వంభరాభరణవిశ్రుతశాశ్వతైశ్వర్యధుర్యుండును,
తరంగవతీభుజంగశిఖరిపుంగవరంగదభంగసాంగత్యసంభావితగాంభీర్య
ధైర్యుండును, వినిద్రతరప్రభావప్రథమానప్రయత్నషడధికదశమహా
రాజప్రాదేశసాదేశనిస్తులతులాపురుషాదికదైనందినమహాదానమహిమా
పహసితకౌమారగురుకల్పతరుకామధేనుకమలవైరికర్ణకనకగిరికలశజలనిధా
నుండును, కరుణావిశేషషోడషాడ్గుణ్యమంత్రస్వతంత్రతానిధానమహా
ప్రధానుండును, పుష్కలజయావిష్కరణదుష్కరతరసమరముష్కర
తురుష్కధానుష్కధనంజయనిష్కాసనోద్దీపితప్రతాపనారాయణుండును,
ప్రతిదినకృతభారతభాగవతరామాయణపారాయణుండును, అక్షీణత[7]రక్షు
కులకోలాహలరూక్షభాషణభీషణవేషవిద్వేషణమహీపకూలంకషకోపరస
ప్రతికోటితదీయకోటీరకోటీచిరత్నరత్నవిసరనవకిసలయాస్తరణకలితసంచ
రణకోమలచరణుండును, పంచతిరువళిరాజసప్తాంగహరణుండును, ఖండేందు
ధరాచండకరణమండలశరపాండురకాండజకందర్పకాండకలశకాండాది
డిండీరగరుడతుండపులోమఖండిశుండాలశరత్కాండగౌడవదండమండల
ప్రకాండవేదండరిపుదండనాఖండస్ఫూర్తికీర్తిపరికర్పూరపూరితకనకకరం
డాయమానబ్రహ్మాండుండును, నారుహన్నిబ్బరగండుండుసు, మదవద
ఖిలభువనజంపతీధృతిలుంపనసంపద్యమానమానససంపదుదంచితవంచనా
ప్రపంచితపంచశరపంచశరీవికర్షణవర్షితమకరందవర్షబృందసందేహ
దోత్కర్షవేల్లితపల్లవాధరాకలితకనకవల్లకీవాచనుండును, మావిరి
మాణవీరాయమర్మభేదనుండును, కోపప్రసాదచటులకుటిలాలోకననటిత
కుశేశయవితానసంరంభకుంభస్తనీమోహనకుసుమసాయకుండును,
కుంతూరిదుర్గనాయకుండును, తత్తాదృశశృంగారకృతిచమత్కృతితరంగిత
సుకవిహృదయకంజరంజనాను[8]క్షణవీక్షితకటాక్షుండును, దక్షిణసింహాస
నాధ్యక్షుండును, తిరుమలనృపాలకలశాంభోధిపూర్ణిమాశశాంకుండును,
ధరణీవరాహాంకుండును, కల్యాణపరంపరోదారకుమారముద్దువీరనృప
కల్పతరుతపఃఫలంబును, కమనీయగుణతరంగలింగాంబికాగర్భశుక్తి
ముక్తాఫలంబును, మోహనతరవిలాసబాలికాజనలీలాలోలుండును నగు
ముద్దళఘరిభూపాలుండు నీరజబాంధవుం డుదయింప నొక్కనాఁడు నిత్య
కృత్యంబులు నిర్వర్తించి బలువగు మానికపుఁదొరవులు దొడిగి చెలువు
మీఱఁ గొల్వుసింగారంబు చేసికొని యనితరసాధాణరీతిం గ్రందుకొన
మందమందగతుల సౌధంబు డిగ్గి తనడగ్గఱం గ్రిక్కిరిసి యిరుపక్కియలం
డెక్కులం బిక్కటిల్లు చక్కెరవిల్తుచిక్కటార్లవలె నెక్కువ పొగరుమేని
టెక్కు లెక్కువ తక్కువ లేని చక్కని వయసునిక్కువగ జక్కవగుబ్బ
లాండ్లు కర్పూరకస్తూరికాసంకుమదకుంకుమపంకకమలకర్పూరపుల్ల
మల్లికాసముల్లసితసౌరభంబులు గమ్మునం గ్రమ్ముకొని కనకముకురకరండ
కళాచికాకనకాలుకాకౌక్షేయకోపశోభితకరారవిందలై వెంబడింపఁ
గొన్నియంతస్తులు దాటి [9]యట చన నంగనల నందఱ మగుడం గనుం
గొని తదనంతరంబునఁ జెంతఁ జేరి కొందఱుమన్నీలు మునుమున్నుగా
నూడిగంబులు ఘటియింప నెనలేనిరాజసంబు నటింప నిగనిగ నిగుడు
తొగరాజుగతి సొగసుడంబు లంబుజంపుదృషదున్మేషనితంబాడంబరంబు
విడంబింప నింపునింపుప్రాఁగెంపుగుంపుచెక్కడంపువగం దురంగలించు
కట్టాణిముత్తియపుగట్టిచప్పరపుముంగిటిరంగు లర్యమమణిపర్యంత
గిరిదర్యంతధరానటితకునటికాపటలోత్కటశోణిమగరిమ రాణింప గరగరిక
దొరయు కట్టుడాలు జాలుకొను నీలంపుకంబంబులం గ్రందుకొను చెందొవ
జిగిపొగరునిగుడఁ బగడపుబోదెలగుమిం బాదుకొను నునుపు తత్తత్ప్రదేశ
నిరూఢవిటపివిటపాఢౌకమానబాలప్రవాళజాలలీలం దెలుప వేడుకల
నీను వైడూర్యంపుపొడి జిగి బెడగగు నిడుదపొడి పనినడరుకొడిగె తుదిమొద
లుకడానిగంటలపలుకు నిగుడ నికటతటమృగయావిధానసావధానకిరాత
వరారోహకరాష్టధనుష్టంకారంబుల యలంకారంబు నెరప, నారాడ
నెసంగు నింగిలీకపుగచ్చు హెచ్చుగోడల నీడలరంగు మీఱు నేకరంగీపట్టు
మేల్ కట్టుబిగిలింత నిరంతరవిహరమాణైరావణకరవిధూతకటకతట
భాసమానకాసారసారసపరాగభరంబులు తిరంబు గొలుపఁ గదుపులు
గొని యుదుటవన్నెల ముంగిటనుండు వేదండమండలంబు లున్నతశృంగ
రంగత్తరంగితసంచారనీరదబృందంబులయందంబు జూప నొయ్యనొయ్యన
మవ్వంపు లాగడంపు సోరణగండ్లగొండ్లి సలుపు జాళువాకీలుబొమ్మల
యొరపు కుసుమశరసాంపరాయసంపద్యమానచాతుర్యధుర్యకిన్నరదంపతీ
విలాసంబులు మెలయింప నుదయధరాధరంబు విధంబున డంబు మీఱి
మెఱయు నమరావతి గతి నాకిలితసుమనస్సంతానసురభియు, రామవన
ప్రస్థానంబుగతి చిత్రకూటస్థిత్యభిరామంబును, చంద్రమండలంబు
బాగున సుధాధవళతంబును, రావణసైన్యంబు వడువున నతికాయమా
నాశ్రయంబును సుగ్రీవసమ్ముఖంబుడంబున నవారితసంచారమారుత
కిశోరనీలగవాక్షకుముదాభిరామంబును, సుధర్మాస్థానంబు చందంబున
రంభావిరాజమానంబును, శుక్రసదనంబు[10]ఠేవ నగురువాసనావాసితంబును,
నగుకొలువుకూటంబున బాలసూర్యునింబలెఁ జేరి తనకు మేలు గోరు
ధరణీసురుల మంగళాశీర్వాదంబులును, తవకుఁ బరాకు దెలిపి బరాబరి
సేయ సంభ్రమించు కంచుకివ్యూహంబుల సాహోనినాదంబును, తన
ముఖసందర్శనంబునకు సందడించు సామంతధరణీకాంతుల మిథస్సంఘృష్ట
మణిమకుటవిటంకటంకారంబులును, తన గెలుపుపద్యంబు లుగ్గడించు
వందిబృందంబుల విజయహోంకారంబులును, తన చరణారవిందవందనము
లకు ముందుముందుగా సాగలి దండంబిడు [11]గిరువులున్న చెండి మన్ని
కొమాళ్ళ కలకలంబులును, తన నవ్వుపువ్వుసోనలకు మవ్వంబు నివ్వటిల్లఁ
గొలువు మ్రొక్కులు ఘటించు వారవనితల కిలకిలల యలబలంబును, తన
సమ్ముఖమ్ముఁ జేరఁ గ్రమ్ము కలభమ్ముల కాంచనఘంటికాఘణఘణమ్ము
లును, తనయెదుట వేషధారులై వచ్చు శైలూషుల వినర్దమానమర్దల
తాళసముత్తాలధణంధణంబులును గ్రందుకొన నందు.
మ. హితులున్ రాజు లమాత్యు లూడిగములుం హేజీబు లార్యుల్ పురో
హితులున్ జ్యౌతిషికుల్ నటుల్ భటులు సాహిత్యప్రవీణుల్ కవుల్
మతిమంతుల్ జయకాళ్లు పాఠకజనుల్ మాష్టీలు వజ్రీలు నూ
ర్జితభక్తిం గొలువన్ మహావిభవముల్ చెల్వొంద నందంబుగాన్.
సీ. నునుసరిగెనకసీపని సూరెపుటపు మి
న్నలు గ్రమ్ముసమ్మాళిగలను జిమ్మి
చే నున్ననున్నని చికిలిపైఁడి మొలామ
చికటారి సుడిగమ్ము చేతి కొసఁగి
మ్రోలఁ జిత్తరుపటంబునఁ బొల్చు శ్రీరాము
చరణాబ్జములకు నంజలి ఘటించి
బాలీసుబటువులు క్కదిళ్లును మేలు
కట్టుపూజల్లులఁ గలయఁ జూచి
తే. స్తోమముగ పైఁడిపావడల్ చామరమ్ము
లాడ జిగినింపు రతనంపుటరిదికట్టు
గద్దెపై నంత ముద్దులళ్ఘరివిభుండు
నిండుకొలువుండెఁ గన్నులపండు వమర.
శా. ఆరీతిన్ సభ ముద్దులళ్ఘరిధరాధ్యక్షుండు కొల్వుండి తా
హేరాళంబుగ నయ్యెడన్ నడుచు సాహిత్యప్రసంగంబు గం
భీరప్రౌఢిమ మించ నన్ బిలిచి నెమ్మిం బల్కె వీణాకన
ద్గౌరీపాణి సువర్ణకంకణఝణత్కారానుబంధోక్తులన్.
చ. అనువుగ రుక్మిణీపరిణయంబును మున్ హవణించి యార్యు లౌ
ననఁ దనియించినావు మము నప్రతిమంబుగ నవ్యకావ్యమిం
పున రచియించుమీ సొగసు పోఁడిమి మీఱఁగ సత్యభామసాం
త్వన మనఁ గప్పురంపుచలువన్ గెలువన్ దిరుకామసత్కవీ.
క. కాకులవలె నింటింటను
కాకవు లున్నారు హంసకైవడి భువిలో
శ్రీకామ నీకె తగురా!
యేకడ నుడి పాలు నీరు నేర్పఱుపంగన్.
క. ఏభాష నైనఁ గృతిపతి
శోభనములఁ జెందు నీదుసూక్తులవలనన్
నీభాగ్య మసదృశము గౌ
రీభవకరుణానివేశ శ్రీ కామేశా.
వ. అనిన విని తదాజ్ఞానుమతి నే నంగీకరించిన నతండు సబహు
మానంబుగాఁ గర్పూరతాంబూలకనకచేలకమనీయరత్నాభరణస్తోమ
గ్రామప్రదానంబుల నానందంబు డెందంబునఁ గ్రందుకొన నొనరించిన:
తే. తనదు దక్షిణనాయకత్వమున కుచిత
ముగను ముద్దళఘరిశౌరి ముదము మీఱ
నాటి రుక్మిణిపరిణయం బందుకతనఁ
దా నిపుడు సత్యభామసాంత్వనముఁ గోరె.
క. అదితికబలె శ్రుతి షణ
మొదవింతు బుధాళి కనుచు నొగి శ్రీపతి నె
మ్మది ముద్దళఘరి యనఁ దగి
సదయత మణి సత్యభామసాంత్వన మెంచన్.
వ. అనుచు ననుచు వెనుక నతని యింగితం బెఱింగి సంగరాంగణా
భంగురనిజవిజయరమాసౌమాంగల్యసంధాయకు, నపారకృపారస
పోషితకవిగాయకు, నాశ్రితజనాభిమతార్థదాయకు, ముగ్ధవధూకుసుమ
సాయకు, ముద్దళఘరిభూనాయకుఁ, గృతినాయకుం జేసి నే నేర్చినవగ పడె
దీర్చి తీర్చినపన్నీటిసాటితేటమాటలు చేర్చి కుపితనాయిగాసాంత్వనపర
గోపాలకానల్పకల్పమంజరీసంజరీజృంభమాణసౌరభమ్మువిధమ్మున దిననిగమ
సమయ......[12]నిన.....[13]వీషుజులపటలలోలుఠ....[14]ద్విధ్వంకురపరిగళదమృత
బిందుబృందంబునందంబునఁ గంజభవహృదయరంజనపురుషాయితపరవశ
సరస్వతీకుచహస్తవిస్రస్తనిస్తులజాతిసుమరీతి శృంగారరసతరంగితాంతరంగ
కనదనంగకర్ణరసాయనరతికృతరతికూజితంబు నోజ నే రచియించు సత్య
భామాసాంత్వనం బనుకృతి నతిచమత్కృతిం బెరయ సరసవచోమాల్యంబు
సాఫల్యంబు నందఁ జిందు మకరందపూరం బగుతదీయవంశావతారం
బభివర్ణించెద.
సీ. వనజసంభవమఘవద్భవామరకోటి
కోటీరమణులతో బోటి మీఱి
జహ్నుకన్యామణీసలిలనిర్ఘరజాత
జాతకూషాంభోజసమితిఁ గేరి
నీలాభిధానవద్బాలామణీహారి
హారిద్రవరదీప్తి యనఁగఁ జీఱి
బ్రహ్మర్షిపూజనపరిమళపారమ్య
రమ్యసౌగంధికప్రభలఁ జేరి
తే. రహిఁ జెలఁగు సారరుచిపూరరత్నహార
సహితవక్షోజకాఠిన్యసహనగణ్య
నవనవారుణ్యనటినాబ్ధినందనార
సారసంబు ముకుందాంఘ్రిసారసంబు.
తే. దాన నొకజాతి జనియించి తనర నాత్మ
వాసనలు ఘమ్ముమన శుద్ధభావ మమర
నందుఁ దాఁ జెంది యుదయంబు నందె జగతి
ధీప్రభోగప్రభుండు నాగప్రభుండు.
క. ఆనాగవిభుఁడు గంగా
స్నానము గావించి విశ్వనాథునికృప యెం
తేని తగ విశ్వనాథ
క్ష్మానాథునిఁ గాంచె వేడుకలు నలు వొందన్.
ఉ. నాగవిభుండు పాదభజనంబుననే కడు ధన్యుఁ డంచునో
బాగుగ విశ్వనాథుఁడు కృపాపరిపూర్ణఫలం బొసంగె నౌ
రా గణియించుచుండె నుదరంబునఁ దోఁచెను తోఁచి క్రమ్మరన్
దాఁ గటకస్థితిం దనరె ధాత్రి శివోన్నతి చిత్ర మెన్నఁగన్.
క. ఆవిశ్వనాథుఁ డార్యో
ద్భావితచారిత్రుఁ డగుచు ధనదసుహృత్తా
సేవధియై హితసుధియై
జైవాతృకమౌళి యనఁగ జగతిన్ జెలఁగెన్.
మ. ప్రబలారాతి కుమారకోటి ప్రతిబింబంబుల్ నిజచ్ఛాయతో
నిబిడంబై కనుపట్ట సంగరమహిన్ శ్రీవిశ్వనాథేంద్రబా
హుబలప్రోద్ధత ఖడ్గపుత్రి తళుకై యొప్పారె బ్రాయంబునన్
సొబగౌ నచ్చరనిచ్చ పెండ్లికొడుకున్ జూలాలి చందంబునన్.
సీ. కామునిరూపు భంగముఁ జెందె నెవ్వాని
కడకంటిచూపునఁ గ్రందుకొనఁగ
వంశంబు దెరలెను వసుధలో నెవ్వాని
చండరసోన్నతి మెండుకొనఁగ
దండభృద్వృత్తంబు తరిద్రుంగె నెవ్వాని
పటుపదాతిస్ఫూర్తి పరిఢవిల్ల
అవనికుంతలము చిక్కు వడియె నెవ్వాని
చేకత్తి యొక యింత చిందు ద్రొక్క
తే. నతఁడు భువి రాజశేఖరుం డఖిలబుధజ
నాభిమతదాత యీశ్వరుం డమితభూతి
ఘనుఁడును నయజ్ఞరక్షకుఁ డనఁగ బళిరె
తనరు నాగయ విశ్వనాథప్రభుండు.
ఉ. సాగర మెంతయున్ బలరజంబున నింకు శిరంబు లూచుఁ బ్రా
గ్భోగివరుండు ఘోటఖురకోటివిఘట్టనదుందుభిధ్వనిన్
వేగ వియత్తలం బదరి విచ్చు నటన్న జగత్త్రయంబునన్
నాగయవిశ్వనాథ నరనాథుని శౌర్య మవార్య మెన్నఁగన్.
ఉ. డెబ్బదిరెండురాజులఁ గడిందితనంబునఁ గొట్టి పోరిలో
డెబ్బదిరెండుగెల్పులు వడిం గయికొంచు సమగ్రకీర్తిచే
నుబ్బుచు విశ్వనాథవసుధోత్పలబాంధవుఁ డొప్పు నారుహ
న్నిబ్బరగండఁ డంచుఁ దను నిద్ధర నందఱు సన్నుతింపఁగన్.
శా. విద్యారణ్యతపోవిపాకవిభవావిర్భూతసింహాసన
ప్రోద్యద్దుర్గను భార్గవిన్ విజయలీలోన్నిద్రభద్రార్చనా
హృద్యప్రక్రియ నింటఁ జేర్చుకరణిన్ శ్రీవిశ్వనాథుండు చం
చద్యోగంబునఁ జెందెఁ దత్కరుణ హెచ్చన్ శాశ్వతైశ్వర్యముల్.
క. ఆవిశ్వనాథనృపతికి
శ్రీ వీరాజమకుఁ బెదకృష్ణనృపాలుం
డావిర్భవించెఁ ద్రిభువన
కోవిదసంస్తూయమాన గుణమణిఖనియై.
మ. జగతిన్ నాగయ విశ్వనాథు పెదకృష్ణక్షోణి పాలాసిప
న్నగదష్టాహితదుష్టయోధు లమృతాంధఃప్రక్రియన్ మించి వా
సిగ నస్వప్నతఁ గాంచి యంత విగతక్ష్వేళాతిరేకాత్ములై
ఖగవాహప్రతిమాను లైరి యిల స్వర్గంబందుఁ జిత్రంబుగన్.
సీ. ధర భోజజాతోర్జితకళాస్థితి వహించి
లలితసత్యాలాపకలన గాంచి
ఋక్షభవోన్మేషఋజుకీర్తిఁ జెలు వొంది
భద్రాతిశయలీలఁ బ్రౌఢిఁ జెంది
యలరుసుదంతాలయవసతి రాణించి
సూర్యాత్మభూమోదచర్య నించి
మిత్రవిందాధికమృదుభావమునఁ బొంగి
లక్షణోదారలీలలఁ జెలంగి
తే. యరుదుమీఱఁగ నరిదియై యగదుఁ డగుచు
మఱియు నబలానురంజనమహిమఁ జెంది
యెంతయుఁ జెలంగె నభినవకృష్ణుఁ డనఁగ
విశ్వనాథేంద్రు పెదకృష్ణవిభువరుండు.
ఉ. ఆ పెదకృష్ణభూవర కులాగ్ణికిన్ జనియించె సంతత
ప్రాతితకీర్తిహారి సుకృతానుగతైకసతీవిహారి త
ద్భూపవతంసముక్తిపరిపోషణతోషితశేషభోగి వా
ణీపతి పెద్దవీరధరణీపతి కోపతిరస్కృతారియై.
సీ. ఆహవధరణియం దతిరౌద్రగతి మించి
దక్షారిశీర్షనిర్దళనఁ జేసి
వితతజడిమఁ దాల్చు విద్వేషరాజమం
డలము పదాతిఘట్టనలఁ జదిపి
పటుమహోదంతానుబంధంబు వీడంగ
నను హృదినాననాహతి యొనర్చి
చిత్రంబుగను వినాసికయౌవిధము దోఁప
[15]విమతవివాణిని విస్తరించి
తే. వితతవిశిఖాప్తకాలికావిలసనంబు
బహుకరావాప్తి యనఁ జాలఁ బరిఢవిల్లఁ
గీర్తి చేకొనె [16]నుద్దండమూర్తి కృష్ణ
విభునివీరుండు రెండవవీరుఁ డనఁగ.
మ. అదనన్ శ్రీపెదవీరశౌరి యరియాహాకారలో నుండ నిం
డుదయన్మోహపురాణి తా సవతి బోటుల్ చూడ నీకొంకు లా
పెదవీరాతనియించువా రని రతాప్తిన్ దృప్తి చేకూర్చె నా
నదరన్ గుండియ వాని కవ్విభుని పేరై యానుడే తోఁచెనో?
క. ఆవీరవిభుఁడు తిరుమల
దేవీరమణీయలీలఁ దేలుచు విశ్వో
ర్వీవిభుఁ గుమారకృష్ణ
క్ష్మావరుఁ గస్తూరిరంగ జనపతిఁ గాంచెన్.
ఉ. విస్సధరావరుండు పెదవీరనృపాలతనూభవుండు తే
జస్సమదత్వరాతిశయశాంతపయోజభవాండమండలాం
తస్సుదృడాంధకారత గనంబడ వేదపుగట్టి వెన్నుపై
నుస్సు రటంచు వైరినృపు లుండక మ్రొక్కిరి లుప్తగర్వులై.
శా. ఆవిస్సక్షితిపాలవంశమణిబాహాలక్ష్యకౌక్షయకా
గ్రావిర్భూతసమ్రగకంపమున నా హావేడిడాల్గుండె యెం
తేవేగంబునఁ జంచలించె మఱి దానిన్ సర్వగీర్వాణకాం
తావక్షోరుహహారముల్ కడుఁ దనంతన్ గంప మందెన్ రహిన్.
ఉ. ఆనరనాథుతమ్ముఁడు రంగాంగణతుంగతురంగధాటిగా
నూనఖురానవద్యదళనోద్యదళిద్యుపరాగయోగస
ద్యోనిబిడైకకర్దమమహోదధి యల్లకుమారకృష్ణభూ
జాని చెలంగె నా నిజభుజానిభృతప్రబలప్రతాపుఁడై.
మ. సమరప్రాంగణసీమ వీరవిభుకృష్ణక్ష్మాపబాహాగ్రదు
ర్గమకౌక్షేయకవిక్షతారిసృపవత్సస్ఫారరక్తావివి
క్తమహీకర్దమయుక్తి భిన్నకరిముక్తారేఖికల్ కీర్తిస
స్యము దోపన్ వెదఁబెట్టు కైవడిని నిచ్చల్ పొల్చె శుభ్రాకృతిన్.
సీ. దురుసుమన్నీల క్తురుల పేరిటివెడంద
గట్టుమీగడచట్లు గొట్టికొట్టి
పెరరాచపూపగుబ్బెతలపేరింటిప్రో
యాండ్రమానము కొల్ల లాడియాడి
వరమహీపతి జయేందిర చంటి పేరింటి
ధరణీధరము కేలఁ దాల్చి తాల్చి
దూబరిపెనుదాయనైబు పేరిటిగట్టు
చిల్వమో [17]మదుముక చీల్చిచీల్చి
తే. పంపులకు రానిదొర ప్రతాపంపుకెంపు
మెఱుఁగు పేరిట కార్చిచ్చు మ్రింగిమ్రింగి
వెలసె నీరీతిఁ గృష్ణలీలలఁ జెలంగి
యుద్ధజయహారి వీరయకృష్ణశౌరి.
చ. అలరుకుమారకృష్ణమహిపానుజుఁ డాహవసవ్యసాచి య
త్యలఘుయశోవిశోభిహరిదంతరసంతమసాచిమర్దలి
ర్దళనఘనప్రతాపుఁడు వదాన్యకులాగ్రణి సజ్జనావనా
కలితగుణాలవాలుఁ డగు కస్తురిరంగనృపాలుఁ డిమ్మహిన్.
క. ఆవిస్సభూపతివలన
నావిర్భావంబుఁ జెంది యఖిలప్రభుసం
భావితనిజవిజయప్ర
స్తావుఁడు శ్రీ ముద్దుకృష్ణ జనపతి వెలసెన్.
సీ. జన్యోర్వివిమతకుంజరతాడన మొనర్చి
యసమానబలసహాయతఁ దనర్చి
రిపువత్సకంఠనిర్భేదం బమర గిట్టి
పరభోగిశీర్షముల్ పగుల మెట్టి
యహితోగ్రసేనోద్భవారూఢిఁ గుదియించి
స్ఫుటయశోదానందఘటన గాంచి
తనర మందారాహృతిని చాలనుప్పొంగి
ప్రబలసత్యాలాపరవ [18]మెఱింగి
తే. చక్రధరశృంగపద్మాతిశయము మీఱ
శిష్టజనరక్షణము దుష్టశిక్షణంబు
నతిశయిల నవ్యగోపాలుఁ డనఁగ వెలసె
విస్సవిభు ముద్దుకృష్ణ భూవిభువరుండు.
చ. నలువుగ ముద్దుకృష్ణ నరనాథశిఖామణి గాంచె వేడ్కతో
నిలపయి చంద్రసూర్యు లుదయించిరొకో యని లోకు లెన్న ని
శ్చలగతి ముద్దువీరసృపచంద్రుని శాశ్వతకీర్తిసాంద్రు ని
ర్మలతరధీరతావిజితమందరు నిర్మలభూపురందరున్.
క. ఆ ముద్దువీరనరపతి
భూమండల మేలెఁ గమఠ భుజగవిభు కిరి
గ్రామణ్యష్టదిశాకరి
సామాజిక[19]సార్వభౌమసారోన్నతుఁడై.
సీ. జాతిమాలిన యవ్వసంతుండు వివరింప
సాటియే సౌందర్యసారమునను
రీతిమాలిన యల్లజాతరూపనగంబు
సాటియే యనుపమస్థైర్యమునను
నడకమాలిన యల్లనందనవనశాఖి
సాటియే నిర్ణిద్రచారుకీర్తి
దెలివిమాలినయట్టి [20]తొలుకరి క్రొమ్మొగుల్
సాటియే సతతవిశ్రాణమునను
తే. ననుచుఁ దను జను లందఱు నభినుతింపఁ
దనరె దుర్దాంతసామంతధరణికాంత
సంతమసశాంతి పటుధామ చండధామ
విదితజయహారి శ్రీ ముద్దువీరశౌరి.
చ. అనికయి వచ్చి క్రోధరస మానినడాలున నేలుశాత్రవా
ననములు పద్మముల్ దనరు నవ్యకిరీటమణుల్ పరాగముల్
గొనబుగ వెల్వడం దనదు కోటిమరందరసంబు ముద్దుకృ
ష్ణనృపతి ముద్దువీరనరనాథుని ఖడ్గమిళిందరేఖకున్.
చ. అలనరనాథుతమ్ముఁ డఖిలారిభయంకరచారుమూర్తి య
త్యలఘుశుభానువర్తి ధవళాంబుజకార్తికచంద్రచంద్రిగా
విలసనభవ్యకీర్తి గుణవిశ్రుతి నేడవచక్రవర్తి వ
ర్తిలె నిల నిర్మలప్రభువరేణ్యుఁడు సత్కవిలోకగణ్యుఁడై.
సీ. పాఱుచోఁ గంపలు పట్టి బెజ్జము లైన
చెవులఁ బూమొగ్గ లొంట్లవగ మెలఁగ
నెదుట మోటులు దాఁకి నుదుటఁ గ్రమ్మిననెత్రు
జిగి కుంకుమంపుబొట్లుగను నెగడఁ
దలపాగ వో బోడితలల నంటినపాప
కుబుసాల్ రుమాలచెంగులుగ మెఱయ
నొనరఁ గాళ్లను జుట్టుకొనినతీఁగలగుంపు
కొమరొందుబిరుదుపెండెముగ నమరఁ
తే. జెట్టులను కోటరములందు బుట్టలందుఁ
గుంజపుంజమ్ములను డాఁగి గంజిదిండి
లండివగచెండి వజ్రీలు బెండుపడిరి
వసుధఁ దిరుమలవిభుదాడివలన నోడి.
ఉ. పంపులచేత గెల్వఁ జలపట్టను కూటపుమూక గాటపున్
గుంపులచేత బెట్టు గడికోటలు లగ్గలుపట్టి చూపులో
మంపులచేతఁ గోమలులమానము కొల్లలుపట్టి కీర్తిమ్రో
యింపులచేత మాతిరుమలేంద్రుని కెవ్వరు సాటి యిమ్మహిన్.
సీ. పెలుచఁ దోమనిపళ్ళెములు చేర్చుటలు మాని
యిలఁ బైఁడిపచ్చంబు లియ్య నేర్చె
పలుమాఱు వడ్డికాసులు కూర్చుటలు మాని
యెలమితోన వరాల నియ్య నేర్చె
గోరుబేరుడుకూటికోరిక మాని హా
యిగను రాజాన్నంబు లిడఁగ నేర్చె
నిల మోచి తనకుఁ దెచ్చిమ్మనుటలు మాని
పలుమఱు నల్లిళ్ళు నిలుప నేర్చె
తే. గట్టుపైఁ గాఁపురం బున్నగొట్టు మాని
యొనర మధురాపురమునందు నుండ నేర్చె
ప్రబలుసుఖముల వేంకటభర్త నిండు
వేడ్కలు చెలంగఁ దిరుమలవిభుఁ డనంగ.
సీ. ఆర్యానుమోదనప్రౌఢరీతి వహించి
యమరుసంపద హెచ్చుకొమరుఁ బూని
పరమహీభృద్భేదపటుశక్తి భరియించి
ప్రథితసుబ్రహ్మణ్యభావ మంది
తతమహాసేనాభిధానసంగతిఁ గాంచి
బహుళాత్మజస్ఫూర్తిఁ బరిఢవిల్లి
తారకజయలీల ధారుణి వెలయించి
శూరపద్మనియతి జూరలాడి
తే. వాసవాపత్యవరణీయభాసురాంగ
పటిమవల్లీలసద్వృత్తిఁ బ్రబలుకతనఁ
దిరుమలేంద్రుండు కొమరునితీరుఁ జెంది
పరమశివమూర్తికరుణచేఁ బడసెఁ గీర్తి.
సీ. హరిణాక్షులను గూడ నతనులీలల మించె
క్షితి వసంతోత్సవం బతిశయిల్ల
నరిభేదనస్పూర్తి సురథుం డన రహించె
విజయదుర్గార్చనావిభవ మెసఁగ
నుడిరాజనారాయణుఁ డనుపేరు వహించె
లక్ష్మీవిలాసలీలలు చెలంగ
శరభాతిశయరీతిఁ జాలఁ గీర్తి వహించె
వితతసింహాసనస్థితి పొసంగ
తే. ననుచు జను లెల్ల బొగడఁ దా నతిశయిల్లెఁ
జారుతరనిత్యశోభనసమయమిళిత
కవిబుధవతంసవైణికగాయకోక్తి
తతనిజాస్థాని తిరుమలధరణిజాని.
సీ. పడియపట్ల నడంగు పగరాకుమారులఁ
జెలఁగి కొమ్మునఁ జీల్చి చిమ్ము ఘోణి
పనులఁ గ్రుమ్మరుగొంటుపగకందుమన్నీలఁ
దఱిమి వెన్నాడు వేదండసమితి
బిలమధ్యమున డాఁగు పెరవజీరుల గిట్టి
కమలించు నిట్టూర్పుకాఁకఁ జిల్వ
కెలనఁ జరించుమొక్కలిగడిరాజులఁ
జెఱ నుంచు గుహలలోశిఖరికులము
తే. [21] తెలుచు వెలుపడఁ గమఠంబు నెలవు సొచ్చి
వారి వెడలింపఁ బో నంత వసుధఁ దాల్చి
తమశ్రమము దీర్చు తిరుమలధరణినాథ
మణికిఁ బ్రత్యుపకృతి సేయ మనసుఁ బూని.
క. అల శ్రీ తిరుమలనాథుం
డలమేలమయందుఁ గాంచె ననఘ పవిత్రో
జ్జ్వలభవసాంద్రకీర్తులు
వెలయంగఁ గుమారముద్దువీరనరేంద్రున్.
చ. భువిఁ జినముద్దువీరనృపపుంగవుపాణికృపాణభిన్నశా
త్రవనృపదేహశోణితపరంపర యింపులు గుల్కె నూత్నవీ
రవరణవేళ నెంతయు సురప్రమదాతతి యామతింపును
త్సవము ఘటిల్లఁ బెల్లుగను చల్లిన చెంద్రిపుజల్లుకైవడిన్.
సీ. [22]వలిగట్టు వెలిపెట్టు కళలుట్టు నెలగుట్టు
[23]వేగంటిదొరచెట్టు వెండిగట్టు
వినుజూలునినురాలునును[24]చాలుగనుమేలు
నలువబాబాలు క్రొన్ననలచాలు
జిగిమీఱు తొగసౌరు మగరారుటపుపేరు
తళుకుముత్తెపుఁబేరు తమ్మిపేరు
విలసిల్లుననరెల్లు తెలివల్లుకొనుజల్లు
లరదిగంబురజల్లు నురుగు[25]విల్లు
తే. నెల్లపుడు నుల్లమునఁ జాలఁ దల్లడిల్ల
నల్లనల్లన మల్లాడి యుల్లసిల్లు
తిరుమల[26]ధరేంద్రు వీరధాత్రీపచంద్రు
కీర్తి జగతిని ననుపమస్ఫూర్తి మెఱయ.
క. క్షమ వీరేంద్రుఁడు మీనా
క్షమ నలలింగాంబ నాజమాంభోజాతా
క్షి మఱియును మధురనాయిక
నమలమతిం బెండ్లియాడె ననుపమలీలన్.
తే. అట్లు మీనాక్షమ యయారె యాస లెంచి
స్వామితో విగ్రహముఁ జేయఁజనక కఠిన
చాపలత డించి యశ్రాంతసమరసత్వ
పటిమ మధురాపురిని వీరపత్ని యయ్యె.
సీ. క్షితి యవిరతరజస్కతఁ గాంచి కోరనౌ
భర్త నెంతయుఁ గ్రిందుపడఁగఁజేసె
లచ్చి యం చనఁ జంచలయె ఘనత నెనంగు
నేలినవానిఱొ మ్మెక్కి నిలిచె
సతియె తాఁ బార్వతి శంకరుం డగువాని
నాత్మేశుఁ గదిసి మాఱాడఁదొడఁగె
పతిదేవతయె తాను బాష దా తగువాని
ప్రాణనాయకుని నో రదుముకొనియె
తే. నని కువృత్తియును భృగుకలనయుఁ జండి
తయును వ్యాహారరీతిఁ జెందకయ వసుమ
తియు జగన్మాత గౌరి వాగ్దేవి యనఁగ
రంగలరె సద్గుణాలంబ లింగమాంబ.
చ. నిరుపమభర్తృభక్తి ధరణిం బొగ డొందెడునాజమాంబకున్
సరి యనవచ్చు నెంతయును జాహ్నవి వెల్వెలఁబాఱ కోషధీ
వరకలనాంతజాద్యవిషవర్తను భర్తను ధూర్తమౌళి యం
చరయుచు సారెకున్ మొరసి యౌదల[27]మెట్టక యున్న నెన్నఁగన్.
క. లలితహరిభాషణ కుతూ
హలవిజయ[28]యశస్సమంచితాత్మయునై తాఁ
గలితసుభద్రాభిధయై
యలరారున్ మధురనాయికాంబ గణింపన్.
సీ. తిరుమలమేదినీవరుముద్దువీరిధ
రాధినాథుండు మీనాక్షమాంబ
యం దలచొక్కనాథవనీపాలు లిం
గాంబిక యందు ముద్గళఘరీంద్రు
నాజమాంబికయందు నచ్యుతేంద్రుని చిన్న
యచ్యుతు మధురనాయకమయందు
నారసింహక్షమానాథశిఖామణి
నెనలేని వేడుకల్ హెచ్చిలంగఁ
తే. గాంచె నెంతయఁ గల్పద్రుపంచకంబుఁ
బాలమున్నీటిచందానఁ ప్రథితదాన
[29]వర్తనంబును కీర్తివిస్ఫూర్తి మెఱయ
సరససుమనోమనోవిలాసంబు మెఱయ.
మ. వెలయున్ వారల కగ్రజుండు సుకృతావిర్భూతబోధుండు ని
ర్దళితానేకవిరోధియూథుఁ డహివర్యస్తుతమేధుండు సం
జ్వలితాబింధనగంధవాహసఖదివ్యద్భవ్యతేజోవితా
నలసద్గంధుడు చొక్కనాథధరణీనాథుండు భాగ్యోన్నతిన్.
సీ. అలవనీపకు లెల్ల నవనీపకుల యైరి
యెవ్వాని పటుదయాదృష్టివలన
వెస సుధాశులుసైత మసుధాశులే యైరి
యెవ్వాని ద్విజకోటియిజ్యవలన
క్షితిని తిలసమాను లతిలసమానులై
రెవ్వాని తొడవులయీగివలన
నౌరౌర చలధీరు లచలధీరులు నయి
రెవ్వాని పదవందనేచ్ఛవలన
తే. రాజమాత్రుండె యతఁడు దుర్వారచారి
వైరినాసీరభటవారఘోరవీర
వారినారాచచాపవిష్ఫరపూర
సాధుజయహారి శ్రీ చొక్కనాథశౌరి.
ఉ. చందనచంద్రకేతకులు సారెకుఁ బోరునకై యెదిర్చ నె
న్నం దగుచొక్కనాథనరనాథునికీర్తి యహీనతన్ రహిన్
జందనవాటిఁ జుట్టుకొనఁ జందురునిం గబళింపఁ గేతకీ
బృందము మెట్టఁగా నెలవుపెట్టును కొందఱు చిల్పజోదులన్.
సీ. చోళంబు పగల నాభీలకరామర్ద
గాఢగ్నిశిఖరీతి రూఢిపఱచి
మత్స్యంబు సుడివడ మండువేసవిపూట
గాటంపుపేరెండ కడఁగ నెరపి
సింధువు శోషింప సీమారవద్ఘోర
బాడబజ్వలదర్చిపటిమఁ జేర్చి
వంగంబు పైపైఁ గరంగ బంధురగంధ
వాహబాంధవకీలువైపు చూపి
తే. వంపులకు రాక దొరలు గర్వింపఁ గినుక
వివిధదేశంబులను దండు విడియునపుడు
తనరువీయరచొక్కనాథక్షితీంద్రు
చంద్రహాససటద్దామచండిమంబు.
మ. నెల నానాఁటఁ గృశించు హెచ్చి ఘనుఁ డెంతే విచ్చు ఘోషించి య
ప్పులఁ దేలున్ జలరాశి పూరి గ్రసియింపు న్వేల్పుటా వెమ్మెతోఁ
బెలుచన్ లోఁగె దధీచి తూఁగె శిబి యుర్వి న్వీఁగె హేమాద్రియున్
నలు వొందన్ రహిఁ జొక్కనాథవిభుదానస్ఫూర్తి వర్తింపఁగన్.
సీ. తళుకుఁగ్రొమ్మెఱుఁగులు తలచూపె నని చిల్వ
దొర శంభుచరణంబు శరణ మంద
జంభారి దంభోళి సంధించె నని గిరుల్
మున్నీటినీటిలో మునిఁగి యుండ
వనశిఖ గనిపించె నని వచ్చి గౌరులు
హరిదీశపురసీమ లాశ్రయింప
బలువేఁడి యిదె వచ్చెఁ బై నంచుఁ బ్రాఁబంది
యడవిటెంకిమఱుంగు వడి వసింపఁ
తే. గనఁబడు నిజప్రతాపంబుకతన నొంటి
డంభకమఠంబు మోవఁ గడంగ బహుళ
ఖండ మగుధాత్రిఁ దాల్చె నఖండలీల
నన్యగుణహరి శ్రీ చొక్కనాథశౌరి.
శా. ఆధాత్రీరమణానుజుం డఖిలవిద్యాకాంతుఁ డుద్యన్మహా
మేధావంతుఁ డహార్యధైర్యుఁ డతిగంభీర స్వభావుండు ది
గ్వీథీవర్తితచారుకీర్తి యతులోర్వీమండలాఖండలాం
భోధిక్షోభణరామచంద్రుఁడు తగున్ ముద్దళ్ఘరీంద్రుం డిలన్.
సీ. ఇనకాంతమయము లయ్యె విరోధిదుర్గంబు
లేమహోన్నతుమహోహేళి మెఱయ
మణు లయ్యెఁ బరవీరమహిళాకనీనిక
లేనయోజ్జ్వలుకీర్తి గాన మెసఁగ
సూదంటురా లయ్యె శూరారిమకుటంబు
లేమహీపతిలోహహేతియెదురఁ
గరక లయ్యె నరాతి కరికుంభరత్నంబు
లేనరేశ్వరుఁ డంపవాన గురియ
తే. ఘనుఁ డితం డని మొనసిన కాందిశీక
పారశీక శకాంగ బర్బర కళింగ
వంగ బంగాళ చోళ నేపాళభయద
ఘనవిజయధాటి ముద్దులళ్ఘరికిరీటి.
సీ. ఏమహీపతిచేతి యెకటారిచిల్వకు
బదనిక లరివీరవదనతృణము
లేధురంధరుబలాంభోధికిఁ జెలియలి
కట్ట దాయలు మెట్టుపుట్టమెట్ట
యేధన్యుకోపవహ్నికిని తాపస్తంభ
ముద్ర వైరులకేలుమోడ్పుసరవి
యేరాజుహయధూళినీరదాళికిఁ దొలు
గాలి ధావదరాతిపాళియూర్పు
తే. జగతిఁ దగు నాతఁ డురురణాంచద్భటప్ర
పంచసమధికవంచనోదంచితాత్మ
పంచతిరువడిరాజసప్తాంగహరణ
కదనపరిపాటి ముద్దులళ్ఘరికిరీటి.
సీ. నలుఁడు సారతరసౌందర్యవిభ్రమమున
ననలుఁడు తేజోమహత్త్వమునను
భవుఁడు నితాంశసంస్తవనీయకీర్తిని
నభవుఁడు దీర్ఘాయురతిశయమున
నిలుఁడు నిరుపమావనీభరణంబున
ననిలుఁడు పటుబలప్రౌఢిలీల
గదుఁడు బంధురతరగాంధర్వకళయందు
నగదుఁ డుదారభోగాప్తివలన
తే. నౌర ఘనుఁ డనఁ దగు జపాటీరశాటి
కాతటవటత్కరటిలోక కర్ణయుగళ
దళనపటుతరధణధణంధణనినాద
కటుపటహకోటి ముద్దులళ్ఘరికిరీటి.
శా. స్ఫారప్రాభవముద్దులళ్ఘరినృప ప్రౌఢస్ఫురద్బాహుగం
భీరాసిక్షతవైరివీరు లవనిన్ భీతిం గరివ్రాతశుం
డారేఖం దగఁ దూఱి పచ్చికలబైటం బాటి రాఁజూతురౌఁ
దూఱుం దుండముపాఱుపచ్చి కనితోడ్తోనవ్వ భిల్లాంగనల్.
సీ. వేరుచేసి యొసంగు విబుధోపవనశాఖి
తనవేలఁ గాచిన వనధి యొసఁగుఁ
గాసు గైకొని యిచ్చుఁ గమలినీపతిపట్టి
మేఘ ముద్ఘోషించి మెఱసి యొసఁగు
దరిఁ బాలు పొమ్మని సురసురభి యొసంగు
మాపు రే పని యిచ్చు మరునిమామ
యెమ్మె మీఱ నొసంగు నంతయును దధీచి
తులఁ దూఁచి యల శిబీంద్రుం డొసంగు
తే. ననుచుఁ దొలుతటిదాతల నపహసించి
నిత్యవిశ్రాణనస్ఫూర్తి నెగడ మిగుల
జగతిఁ దగుశాత్రవదురాపచాపరోప
కలితజయహారి ముద్దులళ్ఘరిమురారి.
ఉ. శ్రీపతి యల్లముద్దళఘరిప్రభుఁ [30]డయ్యె మహోన్నతుల్ దగన్
భూపతి యౌట యంత రహిఁ బొల్చుక్షమన్ భుజసీమఁ దాల్పఁగా
నాపగ నంతకన్నఁ బొడవై తగునట్టి తదక్షికోణమున్
ప్రాపుగ నెంచి నిల్చె వనరాశితనూజ యహంక్రియోన్నతిన్.
మ. జలవంశంబునఁ బుట్టి రట్టు నతిచాంచల్యాయశంబు న్జనన్
మెలఁగం గోరి విశుద్ధవంశమున లక్ష్మీదేవి లక్ష్మీసతీ
తిలకంబై జనియించి సుస్థిరగుణాధిక్యంబుఁ జెందం దదా
కలనన్ ముద్దళఘేంద్రుఁ డర్మిలిఁ గనున్ గార్హస్థ్యధర్మోన్నతుల్.
మ. సరసిజాక్షుఁడు చక్రధారి యయి నిచ్చల్ హెచ్చు శ్రీముద్దుల
ళ్ఘరిశౌరి న్మఱపించు నాత్మజునిలీలన్ శ్రీ యనం బొల్చు బం
గరుసొమ్మే యది రుక్మిణీత్వము తగంగా ధారుణిన్ రుక్మిణీ
హరిణీలోచన వన్నెఁ గాంచెను సముఖద్యల్లోకముఖ్యస్థితిన్.
మ. అనఘుం డైనకుమారుఁ గాంచి శుభవిద్యామూర్తి యౌ నన్నకీ
ర్తిని నల్వొంది రమావిలాస మమరున్ రీతిన్ విజృంభించి చ
ల్లనిలేఁజూపుల నందఱ న్మనుచు లీలం బొల్చె నాఢ్యత్వ మౌ
నన ముద్దళ్ఘరిరాజమౌళిసతి మీనాక్ష్యంబ భాగ్యోన్నతిన్.
ఉ. ఆనృపచందుతమ్ముఁ డనిశార్చితనీలగళుండు సర్వవి
ద్యానిపుణుండు ధన్యుఁడు వదాన్యశిఖామణి దివ్యకీర్తి కాం
తానవమన్మథుండు కవితాచతురుండు చెలంగు జన్యసీ
మానటితోరుశౌర్యఖని యచ్యుతశౌరి యశోవిహారియై.
సీ. ఉగ్గుఁ బెట్టకమున్న యుదయించె నాశ్రిత
జనులపై నాసక్తి శంభుభక్తి
మాట నేరకమున్న నే టందె సత్యంబు
గురు వైనధర్మానుకూలబుద్ధి
[31]మృదు వెఱుంగకమున్న పొదవెను సాహిత్య
ఖేలనంబు కవీంద్రలాలనంబు
పాదు కదుమురీతి పనుపడకయమున్న
వర్ణాశ్రమప్రేమవాసిఁ గనియె
తే. నెంతయును వింత యని ధరాకాంతుసమితి
సంతతము సంతసమ్మున సన్నుతింప
వెలయు నిలలోన నసమానవిభవ మమర
శుభగుణాస్థాని యచ్యుతక్షోణిజాని.
క. ఒకనాఁడు నాశ్రితులపై
వెకటింపఁడు భ్రాతృభక్తి వెలయించు ఘనుం
డకలుషహృదయుఁడు సదయుఁడు
సకలజ్ఞుం డచ్యుతుండు జగతిఁ దలంపన్.
క. తనరు నలయచ్యుతేంద్రున
కనుజుఁడు కవివచనజాలహర్షుండు దళ
ద్వనజదళాక్షుఁడు జనరం
జనమదనుఁడు నారసింహ జనపతి జగతిన్.
ఉ. సౌరనదీతరంగరుచిసంఘముల న్నిరసించి మారుతా
హారకులేంద్రసాంద్రకరుణాతిశయంబు హరించి మీఱఁగా
క్షీరపయోనిధిన్ ఖరుచుసేయుచు నెంతయుఁ దేజరిల్లె నౌ
వీరయనారసింహవిభువిశ్రుతకీర్తులు ముజ్జగంబునన్.
క. అనుజన్ముఁ డచ్యుతుని కిల
ఘనుఁ డగుముదచ్యుతిమహికాంతుఁడు వెలయున్
దినకర రజనీకరకాం
తినికరసమభూమకీర్తితేజోనిధియై.
ఉ. బుద్దులతావు, మేలములప్రోవు, గొనమ్ములరేవు, బోంట్లకున్
ముద్దులతావు, చండిదొరమూఁకలకున్ బలుగావు, నరు లౌ
పెద్దలవేల్పుటావు, చినవీరనృపాలుతపంబులావు, నౌ
ముద్దులయచ్యుతాధిపుఁడు, మోహన[32]లీలఁ జెలంగు నిమ్మహిన్.
ఉ. అన్నలుఁ దమ్ము లీకరణి నందఱు నొద్దికయై యశోరమన్
జెన్ను వహించి రాముకృపచే నుపచేళిమరాజ్యసంపద
భ్యున్నతభోగభాగ్యుఁ డయి యుర్విని సర్వనృపాలకోటిలో
నెన్నిక కెక్కె ముద్దళఘరీంద్రుఁడు దివ్యమహోమహోన్నతిన్.
సీ. ప్రతిమహారాజహర్మ్యతలేంద్రమణులకు
నహరహంబు తృణగ్రహంబు గలిగె
శత్రుపార్థివగేహచిత్రితఫణులకు
వల్మీకగర్భభూవసతి పొసఁగె
రిపుమహీమిహికాంశుగృహాచకోరికల కం
గారసత్రంబు లవ్వారి యయ్యెఁ
బరిపంథిమనుజేంద్రభవనకేకినులకు
ఘోరకాంతారసంచార మొదవె
తే. విదిత తిరుమలనృపవీరవిభుకుమార
వీరముద్దశ్ఘరిప్రభువిజయధాటి
కానిరాఘాటచతురంగఘనచమూస
మూహమోహాదిశల్ చుట్టుముట్టినపుడు.
సీ. చెంగల్వరాయఁడు చేరుచుక్క నొసంగ
వలిగట్టు వజ్రమేఖల ఘటింపఁ
గుండలిగ్రామణి కుబుసంబు నొనగూర్పఁ
గైలాసగిరి రూపకటక మిడఁగ
గాంగపూరము హంసకముల జేర్పఁగఁ బాల
మున్నీరు ముత్యపుమురువుఁ జూప
నంబరచరశాఖి యలరుదండలఁ బూన్ప
వంకరూపరి నెలవంక యనుప
తే. నందఱకు నన్నిరూపులై యష్టదిగ్వి
జృంభితానేకలీలయై చెలఁగి జగతి
నెంతయు నటించె ముద్దళ్ఘరీంద్రచక్ర
వర్తిమూర్ధన్యమంజులకీర్తికన్య.
సీ. కడగట్టువెన్ను చీఁకటిఁ గొట్టుఁ గాని శ
త్రుగృహాంధకారముల్ దునుమలేదు
కడలి శోషింపఁ జొప్పడుఁ గాని పగరాచ
చెలులకన్నీ రాఁకఁ జేయనేర
దనలత్రయోన్మేష మణఁచుఁ గాని విరోధి
పురు లేర్చుశిఖిఁ గొంచె[33]పఱచలేదు
రోదసి మెఱయింపురుచి నింపుఁ గాని భీ
తవిరోధిదిగ్ర్భాంతి తరపఁజనదు
తే. బళిరె యిది వింత యనఁ దగుబలసమిద్ధ
ఘనసమరబద్ధవీరకంకణసమగ్ర
ధీరముద్దళ్ఘరిక్షమాధిపకరాగ్ర
మండలాగ్రప్రతాపార్కమండలంబు.
శా. జాణై యింపుగఁ బల్కుకుల్కునునుపుల్ జగ్గుల్ తగ న్నిత్యక
ల్యాణస్ఫూర్తి నెసంగఁగా జతులు చాలా మించి రాణించఁగా
నేణాక్షీతతి ముద్లులళ్ఘరిధరిత్రీశుండు లాలించి తా
వీణావాద్యము నేర్పు మీటువగ నౌ వింతం దనంతన్ రహిన్.
సీ. చల్లనిమల్లెపూజల్లు లెత్తినభాతి
ననతేనెసోనలు నునుచురీతిఁ
గమ్మకప్రపుదుమారమ్ములచందాన
వింతకస్తురివీణ విప్పులీల
సంపఁగిపుప్పొడిగుంపు గుప్పినబాళి
బునుగుఠాలఠీవి పెనఁగుహాళిఁ
బన్నీటి చిట్టూట పరిఢవిల్లినజాతిఁ
బల్కునెచ్చెలివీణ పల్కురీతిఁ
తే. జల్లఁదన ముల్లసిల్లంగ నెల్లవారు
నౌర సేబాసు మేలు మజ్ఝారె యనఁగఁ
బ్రౌఢి మెఱయంగ సాహిత్యరచన సేయు
నెపుకు ముద్దళఘరిశౌరి రిపువిదారి.
సీ. తిరముగా నలపార్వతీలోచనము పర్వ
రాజచూడామణి ప్రౌఢి యెసఁగ
నతులవైఖరి మించు రతిలీల రాణించఁ
గందర్పమహిమలు గ్రందుకొనఁగ
మల్లికామోదంబు మలయంగ ననయంబు
నితవు మీఱ వసంతగతి పొసంగ
లలిత మౌలక్ష్మీవిలాసంబు దగుఠీవి
శ్రీరంగవిభవంబు చెలువుమీఱ
తే. భావరసములు తగ హృద్యభరతవిద్య
నలవఱచుఁ దాను బాలల నతనులీల
విదితరణకేళి శాత్రవవిపినకీలి
కవికమలహేళి ముద్దళ్ఘరీంద్రమౌళి.
సీ. తనవిజయాంకగాథలు వ్రాయుచోఁ జేతి
వజ్రరేఖిక చూచి వణఁక గిరులు
తనసింహనాదంబు దశదిశాధిపు పరా
క్రమవేళ నాలించి కదలఁ గరులు
తనపించెకుంచె లుద్భటఘోరఖురదళ
ద్ధరణిపద్ధతి గాంచి తలఁకఁ నిలువ
తనధాటి నా రసాతలబిలంబులు దూఱు
చెంచులరొద విని చెదర ఘోణి
తే. తనచమూధూళిజంబాలిత మగుకడలి
దంభకమఠం బడంగ నాధార మగుచు
ధరణితరుణిని దా భుజాసరణిఁ దాల్చుఁ
గదనజయహారి ముద్దులళ్ఘరిమురారి.
సీ. పరభోగపరిభూతవాసవుం డితఁ డౌట
నెడ లేనివానల కేమి హెచ్చు
చక్కఁదనంబునఁ జందురుం డితఁ డౌట
నిల నుండుపంటల కేమి హెచ్చు
దానలక్ష్మిని కామధేనువే యితఁ డౌట
నెన లేనిపాఁడికి నేమి హేచ్చు
సకలవిద్యాప్రౌఢి సర్వజ్ఞుఁ డితఁ డౌట
నెనిమిదికలుముల కేమి హెచ్చు
తే. బళిరె మజ్ఝారె యని జనుల్ ప్రస్తుతింప
ధనకనకధాన్యవస్తువాహనసమృద్ధి
వెలయు నానందముగ ధాత్రి వీరనృపతి
[34]కరటిశరభండు ముద్దులళ్ఘరివిభుండు.
షష్ఠ్యంతములు
క. ఏవంవిధ సద్గుణమణి
[35]కావలయాంచద్ధరావరాంగీహీర
గ్రైవేయకాభిశోభి య
[36]శోవిలసితధవళఘృణికి శూరాగ్రణికిన్.
క. సంధాభృగునందనున క
బంధనగంధవహబంధుహితతేజోని
ర్గంధితగంధాంధరిపు
స్కంధావారాంబునిధికిఁ గవిసేవధికిన్.
క. నాభాగసమున కంబుజ
నాభాగమబోధధుర్యునకును హరిన్నా
నాభాగినటితకీర్తిఘ
నాభాగరిమాతిశయున కధికజయునకున్.
క. ఆంధ్రవచోనాథునకుఁ బు
రంధ్రీపాంచాలునకుఁ గరధృతాసిలగ
త్కంద్రపరిపరిపంథిపార్థివ
రంధ్రితదినమణికి మతిధురంధరఫణికిన్.
క. ఘోరమహోదారమహో
దారమహోన్నతతరాబ్ధిహతచణునకు మం
దారవనీగౌరవనీ
హారవనితవంచి కీర్తిహారిగుణునకున్.
క. దీపితతేజఃస్థితికిన్
బ్రాపితవిజయేందిరానియతికిం గరుణా
శ్రీపతికి ముద్దువీర
క్ష్మాపతిముద్దళ్ఘరిక్షమాతలపతికిన్.
వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన సత్యభామా
సాంత్వనం బనుమహాప్రబంధమునకుఁ గథాక్రమం బెట్టి దనిన.
శా. శ్రీశుం డానరకాసురున్ గెలిచి రాచెల్వ ల్పదార్వేలు పే
రాశం గూడఁగ నల్గుసత్య నెటు లూరార్చేలె నాసత్కథన్
ధీశక్తిన్ జనమేజయుం డడుగఁ దా నెక్కొన్నమోదంబుతో
వైశంపాయనుఁ డి ట్లనెన్ మధుసుధావాదప్రవీణోక్తులన్.
క. శ్రీపురహరరథరమణీ
నూపురమై కల్మిపడఁతి నుడికొమ్మలకున్
కాఁపుర మై సొబగుల నల
[37]కాపుర మని యనఁగ ద్వారకాపుర మలరున్.
ఉ. ఆపురమందుఁ గెంపుజిగియందపుకోట పయోధికన్యకుం
బ్రాపగుతమ్మిపోలికను భాసిలెఁ గొమ్మలు రేకులట్లు చా
లా పరఁగున్ దదంతరగళన్నవమౌక్తికలీల నబ్ధివీ
చీపృథుశీకరమ్ము లెనసెన్ హరిసేసలు చల్లుకైవడిన్.
మ. పురసౌధాగ్రములందు రాసుతులతోఁ బూఁబోండ్లు కందర్పసం
గరముల్ సల్ప [38]నెసంగు లేసకినకూనల్ వైజయంతంబునన్
దిరుగుంగూకికవల్ రహి న్వినుచు వానిన్ నేర్చి వాక్రుచ్చు బ
ల్మఱు సేబా సని వేల్పుఱేఁడు నగి చాలా నచ్చరల్ మెచ్చఁగన్.
ఉ. అందలిమూలరాపనుల యందపుఁజిత్తరు లొప్పుసెజ్జలన్
కెందలిరాకుఁబోండ్లు మరు కేళి యొనర్పఁగ సేద దేర్చుఁ బో
కందళితోత్పలోద్వళితగౌరవకైరవసౌరవాహినీ
కందళితారవిందమధుగంధధురంధరగంధవాహముల్.
సీ. మాటికి నింపుతమ్మరసంపుజిగిపెంపు
తహతహఁ జరియింపు దాసిగుంపు
నిలమీఁద నొత్తునంఘ్రులలత్తుకలజొత్తు
సురతంపుముద్దత్తుసుళువుటెత్తు
లొగి డీలుపడి గాటముగ రాలుముడిపూలు
పరవంజికొనుమేలుపావురాలు
ననయంబుఁ జెదరి ఘమ్మనుడంబుకలపంబు
నికరంబు లైనపన్నీటిచెంబు
తే. లమర నిశ్శంకమీనాంకసమరసమయ
యువతికోలాహలమ్ముల దవిలితవిలి
మీఱ నింటింట విటులు మజ్ఝారె యనఁగ
వెలయు రహిఁ జాటి యవ్వీటివేశవాటి.
చ. పలువగమొగ్గలుం జిగురుపాళెలు దండలు బంతు లంబుజ
మ్ములు నెనయం [39]బెనంగువలపుల్ తగఁబూచినపూవుఁదేనె జొ
బ్బిలఁ గొన వచ్చినావొ కొనిపించెదవో యని జట్టికాండ్రకున్
విలుతురు పుష్పలావికలు వీట విరుల్ సరు లేర్పరింపఁగన్.
ఉ. పైఁటలు జాఱ గుందనపుబారి ఘలీ లన మన్తు మీఱి శృం
గాటక మందు మందగతిఁ గామునిపట్టపుదంతులో యనం
బోటికి నారెకట్టికలఁ బొంకముగా విటు లావరించి రా
మాటికిఁ గొల్వుబోగములమానవతుల్ చరియింతు రప్పురిన్.
క. కంటె నతోదరి సొగసులు
వింటె నయమ్ముగను విటులవిధము లటం చా
కం టెనయక నం టెనయక
కుంటెనకత్తియలగుంపు గ్రుమ్మరు వీటన్.
సీ. నె రేకఁ గొనుసంజనిగ్గు నానాభినా
మమునం జెంద్రపురేక కొమరుమీఱఁ
జిలుక నొక్కిన బింబఫల మనఁ గసికాటు
మోవిని గుల్కుచెంగావి మెఱయ
వలఁ జి క్కెగయుజక్కువ లన జాఱినపైఁట
నెనసి బల్ గుబ్బపాలిండ్లు నిక్క
కరటికుంభము లంటి మొరయుతుండములీలఁ
పిఱుఁదుల మడిచేఱు పొరలి యాడ
తే. మాపు తనియించుజందెపు మోపునీటు
కాండ్రు నగరను రాకపోకల నగించఁ
బూపప్రాయంపు బాఁపనబోనగత్తె
లెలమిఁ దిరుగుడు రెచ్చోటఁ గెలసి వీట.
ఉ. అత్యకలంకవృత్తి వెలయాండ్రును దామును హృద్యవాద్యవై
యాత్య మెసంగ నంగజవి హారమహారసికావతంసులై
నిత్యము క్రీడ సల్పుదురు నీటులు మీఱఁగ వేశవాటులన్
సాత్యకి చంద్రభానుశివసాంబజయాది కుమారవర్గముల్.
మ. కమలాకాంతవధూపభుక్తసుమనఃకస్తూరికాయుక్త లై
తమి నించుందెరరేకులుం జెవులక్రిందన్ వాలునున్గొప్పు లం
దము మీఱం దగుబోనకత్తియలచెంతం జేరి యల్లుండ్రపై
కము హాళిన్ రమియించు నాత్మగృహిణీకాలుష్యసంధాయియై.
సీ. మసలుచోఁ జీరపైఁ బసిఁడితళ్కులు గుల్కఁ
బసుపునున్దొడనిగ్గు బయలుదేఱ
నందంద రూపసి నరయుసొంపునను మో
మలఁచఁ గమ్మలజోడు తళుకుమీఱఁ
గుడినీరుచెం బంటి జడుదాని ముందుగాఁ
గసరుచూపు జగంబు గాఁడి పాఱ
నరితికాఁ డెదుట వాతెర నొక్కఁ గ్రొంజెక్కు
చెమటఁ జెంద్రెపుబొట్టు చెమ్మదేఱ
తే. వలుదబిగిపాలగుబ్బలవంక బ్రతుకు
సొగ సనుచు మాటిమాటికిఁ జూచుకొనుచు
వీథి నొగిఁ గొంటెబాఁపలు వెంట నంటఁ
గులుకుఁ దొలిజాతిచనుఁబాల కొమిరెచాలు.
ఉ. కాంతలు పవ్వళించి తొడ కౌను కవుంగిటఁ గూర్చి పొక్కిటన్
వింతగ మోము లుంచుకొని వే మణితమ్ముల నుగ్గడించు చొ
క్కింత నయం బొకింత ఘన మింపు ఘటింపఁగి నిద్రమబ్బుతోఁ
బంతము మీఱఁగా సరళిఁ బాడుదు రచ్చటిబోంట్లు వేకువన్.
చ. నిలుకడలేక పైకొనెడి నేర్పులు దెల్పఁగ నవ్వుమోముతోఁ
జెలిమిని దెల్పఁగాఁ దిరుపుచేయువగల్ భ్రమణంబు దెల్పుఠీ
వులఁ దగ నాట్యశాలనడు వు ల్గొనఁ బోదురు నాగవాసపున్
లలనలు వీటఁ దాళగిరిలాగున నెయ్యురు వెంట నంటఁగన్.
సీ. తతవేశవాటికాకృతకాద్రులను గూడి
నవఘర్మవారిఁ దానమ్ము లాడి
పసపువాటించుకప్రపుబూది మై నించి
లలనోపభుక్తశాటులు ధరించి
ననరేకునును సెజ్జ యను[40]బృసీస్థలిఁ దేరి
కొమ్మలకౌఁగిటిగుహలఁ జేరి
మానినీహారాక్షమాలికల్ రాఁదీసి
స్మరమంత్రగాయత్రి జపముఁ జేసి
తే. యెడనెడను నావులింతలఁ బొడముతప్పు
దీర మన్మథ మకరాంక మార మదన
మనసిజ మరుద్రథ రమాకుమార యనుచు
వెలయు విటతాపసులసేన వీటిలోన.
ఉ. వేఁకటిచింత యంత మది [41]వింతగ నెమ్మెయిఁ గప్పుగప్పుతో
నాఁకటి కానవా ల్ఫలము లన్నము చేటిక లాని రాఁగ నున్
గూఁకటిఁ గల్వపూ ల్దురిమి గుబ్బలఁ గస్తురిఁ బూసి జారులం
జీఁకటినేస్తపుంజెలులు చేరుదు రప్పురి దాదియిండ్లలోన్.
మ. ననుపున్ బాపులు చూడ నైదువలు శ్రీనాథాజ్ఞ నెంతే నెదు
ర్కొన బంగారపుపావలన్ దిగి, నునుగుబ్బల్ బయల్దేరఁ గా
ల్వనుసారింపుచుఁ దాళిగట్టు జనుచేలా కౌనునీటాని కొ
ల్వునకున్ వత్తురు రాయబారపుఁజెలుల్ కోటానగోటుల్ పురిన్.
సీ. పాకారిణిమకృతప్రాకారములమీఁద
రారాలబసువనిబారు చెలఁగ
గోపురాంతస్సీమ నూపురారావంబు
లమర బోగముకన్నెగము లెసంగ
గోపనామాదత్తధూపవాసనలచేఁ
దమ్మిపూమేల్కట్లు ఘమ్మనంగ
భద్రానువాదకరుద్రానువాకముల్
పఠియించుపారులప్రౌఢి వెలయ
తే. నందుఁ జెలు వొందు నందిహస్తారవింద
వేత్రవిత్రస్తగీర్వాణవితతి యగుచు
శైలరాజన్యకన్యకాశంకరులకు
దావళం బైనయొకపైఁడిదేవళంబు.
శా. ఉల్లాసం బొనగూడ జగ్గునడతో నొయ్యారపుంజూపు లు
ద్యల్లీలం దగఁ జేతు లెత్తి బసపుందళ్కొత్తు పాలిండ్లతో
మల్లాడం దగునిండుపైడికడవల్ మౌళిస్థలిం బూనుచున్
చల్లో చల్లని చల్ల యమ్ముదురు నిచ్చల్ గొల్లచాన ల్పురిన్.
ఉ. ఆపుర మేలు యాదవకులాగ్రణి దిగ్రణితోగ్రభూరిభే
రీపటలామరారినగ రీయుగరీణశరీరవీరని
ర్వాపణగర్వనిర్వహణరంగదభంగరథాంగవిక్రమో
ద్దీపనభూష్ణుఁ డాహవవధిష్ణుఁడు కృష్ణుఁడు సర్వజిష్ణుఁడై.
శా. ఆకంసాసురవైరి యష్టమహిషీవ్యాపారజాపారలీ
లా[42]కూపారనిమగ్నమాసససముద్యత్కామవిద్యాపరీ
పాకంబు ల్మెఱయంగ రం గయినమేల్బంగారపున్ సజ్జలో
లోకాతీతవిహారుఁడై మదవతు ల్గొల్వంగఁ గొల్వుండఁగన్.
వ. తదనంతరకథావిధానం బెట్టిదనిన.
మ. సరసాసంగర సంగరస్ఫుటమహాసంధాన సంధానతా
దిరమాభూషిత భూషితస్తుతిగతాదృకర్ణ దృక్కర్ణకుం
జరవాగానన గాననవ్యసుయశఃసామ్రాజ్య సామ్రాజ్యసి
క్తరసాస్యందన స్యందనర్ధరిపుభాక్కాంతారకాంతారసా.
క. రూక్షాలాపవిరక్షణ
కుక్షింభరఖలవిపక్షకుంజరసమ్రా
డ్వక్షశ్శీర్షక్షేపణ
దీక్షాహర్యక్ష పాండ్యదేశాధ్యక్షా!
క. అద్వైతమతాధారా
మృద్వంగీనుతవిహార మేదురసారా
సద్విజయకీర్తిధారా
విద్వన్మందార ముద్దువీరకుమారా!
మాలిని. ప్రథననవకిరీటీ పాలితప్రాజ్ఞకోటీ
ప్రథితవిజయధాటీ ప్రౌఢసౌజన్యపేటీ
రథగజభటఘోటీరాజనాసీరవాటీ
పృథుబలపరిపాటీ భిన్నదుర్హృత్కరోటీ.
గద్యము.
ఇది శ్రీకాళహస్తీశ్వరచరణారవిందమిళిందాయమానాంతరంగ జ్ఞానప్రసూ
నాంబికాకృపావలంబవిజృంభమాణసారసారస్వతసుధాతరంగ వెంగనా
మాత్యవంశపావన విరచితవిద్యాధిదేవతాసంభావన దక్షిణసింహాసనాధ్యక్ష
తిరుమలక్షమాకాంతకరుణాకటాక్షలక్షితస్వచ్ఛముక్తాగుళుచ్ఛళిత
చ్చత్ర చామరకళాచికాకనకాందోళికాదిరాజోపచార హృద
యరంజకవచోవిహారవల్లకీవాదనధురీణవర్ణగీతాదిగాం
ధర్వస్వరకల్పనాప్రవీణ కామాక్ష్యంబికానాగనకవి
రాజనందన కలితసకలబాంధవహృదయరంజన
శ్రీకర కవితాకర సుజనవిధేయ శ్రీకామే
శ్వరనామధేయప్రణీతం బైనసత్యభామా
సాంత్వనం బనుమహాప్రబంధంబు
నందుఁ బ్రథమాశ్వాసము.
- ↑ వీవుతన్
- ↑ ప్రోవయి
- ↑ నువిదరత్నము
- ↑ భాతి
- ↑ పత్రనయన
- ↑ భేతాళ
- ↑ రక్షక్ష్వేళాత్వ
- ↑ క్షణపక్షహితకటాక్షుండును
- ↑ యచట
- ↑ వగను
- ↑ గిరువులును
- ↑ గ్రంథపాతము
- ↑ గ్రంథపాతము
- ↑ గ్రంథపాతము
- ↑ విమతవాణిధృతి
- ↑ నసదృశస్ఫూర్తి
- ↑ మెముకల
- ↑ మెసంగి
- ↑ సారబాహు
- ↑ తొలుకారు
- ↑ తొలుదొలుత దంభకమఠంబు నెలవు సొచ్చి
- ↑ వలిమెట్టు తెలిబట్టు; నులిమెట్టు నెలిబట్టు
- ↑ వెలగట్టిదొరచెట్టు
- ↑ బాలుగల
- ↑ పెల్లు
- ↑ నరేంద్రు
- ↑ యొల్లక
- ↑ వచస్స
- ↑ వర్తనము వితతవిస్ఫూర్తి మెఱయ
- ↑ డై జనియించితాఁ దగన్
- ↑ మృదువు నేరక మున్న
- ↑ మూర్తి
- ↑ పఱపఁజనదు
- ↑ కరటికలభుండు
- ↑ కావలయాచలధరావరాంగీహీర
- ↑ శోవిహసితశీతఘృణికి శూరాగ్రణికిన్
- ↑ కాపుర మై తనరు ద్వారకాపుర మలరున్
- ↑ నెసంగ వేసరిలికూకల్
- ↑ బెనంగు తలపుల్
- ↑ బృశస్థలు
- ↑ వింతగ హెచ్చగుఁగప్పురంబుతో
- ↑ కూపారసమగ్న