సత్యభామాసాంత్వనము/భూమిక
భూమిక
దక్షిణాంధ్రవాఙ్మయమున నెన్నికఁ గన్న రసవత్ప్రబంధములలో సత్యభామాసాంత్వన మొకటి. ఈ కృతి మధురాపుర రాజ్యమున వెలసినవానిలోఁ బ్రాచీనము. ప్రశస్తము. విజయనగరసామ్రాజ్యవిచ్ఛిన్నానంతరము తంజావూరు, మధుర, పుదుక్కోట, సేలము, కార్వేటినగరము మున్నగు రాజ్యము లాంధ్రసాహిత్యసంపద కాస్పదము లైనవి. అందు మధురను క్రీ. శ. 1670 ప్రాంతములఁ బరిపాలన మొనర్చిన ముద్దళఘరి కంకితముగా నీ కృతిని రచియించినకవి.
లింగనమఖి శ్రీకామేశ్వరకవి
ఈతని పేరు శ్రీకామేశ్వరకవి యని తెలియుచున్నను నీ వఱకు ముద్రించినవా రెల్ల రీతని పేరు కామేశ్వరకవి యని ముద్రించినారు. కీర్తిశేషులు వీరేశలింగముపంతులవారి కవులచరిత్రము నం దేమి, ప్రాచ్యలిఖితపుస్తకాగారవివరణము లం దేమి, శృంగారగ్రంథమాలాముద్రణము నం దేమి గ్రంథకర్త కామేశ్వరకవి యనియే యున్నది. ఈతడు తనగద్యమున 'శ్రీకరకవితాకరసుజనవిధేయ శ్రీకామేశ్వరనామధేయప్రణీతం బైన' అనియే వ్రాసికొని యున్నాడు. నేను బరిశోధించి చూచిన తాళపత్రగ్రంథముల నిట్లే యున్నది. ఇంతియగాక శ్రీకామేశ్వరకవి తన్నుఁ గూర్చి చెప్పుకొను సందర్భమున,
"క. కాకులవలె నింటింటను
కాకవులున్నారు హంసకైవడి భువిలో
శ్రీకామ! నీకె తగురా
యేకడ నుడి పాలు నీరు నేర్పఱుపంగన్."