సత్యభామాసాంత్వనము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
సత్యభామాసాంత్వనము
ద్వితీయాశ్వాసము
శ్రీ పరిపూర్ణకలాపా
కోపవతీకుసుమచాప కుటిలతతమన
శ్చాపలదీపితవిమల
వ్యాపారదురాప ముద్దులళ్ఘరిభూపా!
తే. అవధరింపుము జనమేజయక్షితీశ్వ
రునకు [1]నలవ్యాసమునిశిష్యుఁ డనియె నిట్లు
సజ్జఁ గొలు వున్నపసిగాపుసామిసరస
తామరసపత్రనేత్ర లందఱు వినంగ.
క. వినవచ్చె వాద్యరవ మొక
టనితరసాధారణముగ నాకసమున నా
నినదంబు వెంబడినె క్రొ
న్ననతావులు గుబులుకొనియె నానాదిశలన్.
ఉ. తావులవెంబడిం దగిలి తార్కొనెఁ దేఁటులు తేఁటిఱెక్కలం
బోవక నాటఁ బుప్పొడియుఁ బుప్పొడితోఁ దగెఁ బూవుసోన యా
పూవులసోనతో మిగులఁబొల్చెను కల్పతరుప్రసూనమా
ధ్వీవిసరంబు నావెనుక వీచెను కమ్మనిచల్లఁదెమ్మెరల్.
ఉ. తెమ్మెర వీవఁగానె కడుతెల్లని సీవిరిగుంపు లంతటన్
గ్రమ్మెను పండువెన్నెలలు గాసినకైవడి వాడిజాళువా
కమ్మపసిండికాఁడలు చొకాటముగాఁ దమహస్తపంకజా
తమ్ములఁ బూనునచ్చరలతండము నిండె నఖండసంపదన్.
ఉ. నిండినయాసుపర్వతరుణీతతికంకణకింకిణీభవా
ఖండరవంబు కిన్నరులగానము దైవతలోకవంది వా
క్పండితసిద్ధసాధ్యపతంగప్రభురత్నకిరీటకోటికా
హిండితవేత్రివేత్రములు నెంతయుఁ దోఁచె మహాద్భుతంబుగన్.
క. అవి యటులఁ దోఁచ నిక్కిన
చెవితేజియుఁ దలఁపుటావు చెంతల మెలఁగన్
చవుదంతి వెండిమలసొం
పు వహింపుచు మందదగతులఁ బొల్పుగ రాఁగన్.
సీ. తొడనుండి తమి యుబ్బ దురుసుగా నునుగుబ్బ
పాలిండ్లపౌలోమి ప్రక్కఁ గుమ్మ
గుమ్మలు వేవేలు గులుకుచు నెఱమేలు
కస రెత్తువగ నూడిగములు పూనఁ
బూన రాచవజీరుపోడిమి గడిదేఱు
తనరునెమ్మెలు చక్కఁదనము మించ
మించలవడిమేని మంచిసొమ్ములమేను
బెళకిన నొకవింత సొలపుఁ జెందఁ
తే. జెందడరువన్నె కడవన్నె చేల వల్లె
వాటు లిరుగడ నొకనీటు చాట మణివి
మానమున శౌరిఁ గనఁగోరి మస్తుమీఱి
సరగునను వచ్చె నటు చేరి జంభవైరి.
ఉ. వచ్చి విమానమున్ డిగి తి, వాసులు దిండ్లు పరంగిపీఁటలున్
నిచ్చలు ముందుగా నడువ నీలపురాబిరడల్ పొసంగఁ గ్రొం
బచ్చలచిల్కకెంపురవపావలు మెట్టి పులోమకన్య చె
య్యిచ్చిన నాని యాబుధకులేంద్రుఁడు రాఁ గని విస్మితాత్ముఁడై.
సీ. చేరి రుక్మిణియిచ్చు చేలాగు రహిఁ బూని
సత్యమూ పొకయింత సందిటాని
మఱి జాంబవతి యిచ్చుమడుపు వాతెర నంది
పొంత రవిజగుబ్బపోటుఁ జెంది
భద్రతోఁ బౌలోమిబా గాగడము చేసి
యోరటిల్లి సుదంతఁ జేరణదీసి
విరులచే నలమిత్రవిందవేనలి రువ్వి
సరిగ లక్షణనీవి సడల నవ్వి
తే. యుదిరివీడెము వెడజాఱ హొయలు మీఱ
సిగను పింఛంబు నటియించ సొగసు మించ
హౌసు లొనగూడ హారంబు లల్లలాడ
లేచె బలుదేవ నాసవ్యసాచిబావ.
క. పడఁతి యొకతె కుచభరమున
జడియుచు మై వంచి పట్టి సమ్మాళిగలన్
దొడుగం బదములఁ గొని యె
క్కుడురాజస మొప్ప నెదురుకొనె నయ్యిండ్రున్.
ఉ. అత్తఱి సజ్జక్రింద నసురాంతకుకట్టికవారు జాళువా
బెత్తము లాని యంతటను బెట్టు బరాబరి సేయ బెట్టుపై
హత్తినరాజలోక మమరావళియున్ మకుటంబు లూడఁగాఁ
దత్తర మంది వీఁగ వనిత ల్బలవైరియుఁ దక్క దవ్వులన్.
మ. పురుషానీకము లట్లు పోవ వికచాంభోజేక్షణల్ ప్రేమతో
నిరువంకం గొలువ బలానుజుఁడు నయ్యింద్రుండు సంధించి యి
ర్వురకే ల్గేలను గీలుకొల్పి తమపువ్వుంబోడు లాలింగన
స్ఫురణన్ సేమము దెల్పఁగా నెనరుసొంపుల్ చూచి సోత్సాహుఁడై.
తే. సరగ నటు వచ్చి మేరుమందరములట్ల
భోజకన్యాశచీముకాంభోజముఖుల
తోడ నిరుగడ దిండ్లు వెన్నాడఁ జేరి
యొఱపుమీఱఁగ సరిగదె నుండుటయును.
సీ. శశిరేఖ మునుమున్న చలువలు సవరించెఁ
జేరువ హరిణి కస్తూరి నించెఁ
జెల్వుగా నలతార చేరుచుక్కను దెచ్చి
హేమకాంచనసుమదామ మిచ్చెఁ
జిత్రరే ఖొకవన్నెచీర లియ్యఁగడంగె
రంభ సిరముకప్పురం బొసంగె
మంజుఘోష కడిందిమణులపెండెముఁ జేర్చె
గొమ రొందు సుగుణహారములఁ దార్చెఁ
తే. బ్రౌఢితోఁ దక్కుకొమ్మలు పారిజాత
కుసుమఫలజాల మొసఁగె గోపబాలు
రందుకొన నాదరము మీఱి యన్నగారి
సన్న సేయంగ గోవిందుసముఖమందు.
ఉ. కానుక లట్లు వజ్రి సురకాంతలచే హవణింప నింపుగా
మానసమందుఁ గ్రందుకొను మక్కువ పిక్కటిలంగఁ గల్పవ
ల్లీనవమంజరీమధుఝ[2]రీలహరీతతిరీతి దాఁచ నౌ
దానన మించె శ్రీపతి యుఁదార ముదారచితోక్తవైఖరిన్.
ఉ. నీ కెన యెవ్వ రయ్య ధరణీధరశాసన నీదువాసనన్
లోకము లెల్ల ధన్యము లలోలత మించిన నీప్రభావ మ
ప్రాకృత మౌను నిన్నుఁ గనరాదు మునీంద్రులకైన నట్టిచోఁ
బ్రాకృతు లైనగోపకులపై దయ సేయుట వింత లయ్యెడిన్.
సీ. భోగమా సుతనూపయోగ మారసి చూడ
భాగ్యమా యజరోపభోగ్య మెన్న
ధామమా త్రిభువనభీమ మారసి చూడ
శాంతమా కరుణానిశాంత మెన్న
సుకృతమా యనుదినప్రకృత మారసి చూడ
ధైర్యమా యరిజయావార్య మెన్న
శీలమా గుణగణావాల మారసి చూడ
సారమా పటుజయోదార మెన్న
తే. నన్న నోయన్న పొగడ నన్నన్నయన్న
లువ కయిన శక్యమే నీదుహవణు లహహ
లలనలో నీవు వచ్చుటవలన నింద్ర
తనరికెలు నిండె నేఁ జేయుతపము పండె.
మ. అన నాపల్కుల కుబ్బి చాల మదిలో హర్షించి హర్షించి మై
ననువొందుంబదినూఱుకన్నులు ప్రఫుల్లాంభోజరేఖాక్రమం
బున రాణించగ బాకశాసనుఁడు సొంపు ల్నింపఁ బౌలోమి తా
నును కంసాంతకుతోడ నిట్లనియె నెంతో యోర్పు నేర్పుం దగన్.
క. గోపకులమీఁదిదయచేఁ
బ్రాపించితి నంటి వీవు బళి యిది [3]వింతా
గోపకుఁడ నేను గానా
గోపాధిప నిన్నుఁ జేరఁ గోరఁగఁ దగదే.
ఉ. వర్షము నించి గోపపశువత్సకులంబుల నిన్ను మున్ను దు
ర్ధర్షభయంబునం గలఁచఁ దత్సమయంబున లోకరక్షణో
త్కరము చాల వ్రేల గిరిఁ దాలిచి తప్పు సహించి నన్ కృపా
వర్షము నించి పంచుటలు వారిజలోచన యే నెఱుంగనే.
కఠ. [4]వత్సపశు గోపతతి నొక
వత్సర మెందెందు దాఁచి వంచితుఁడై నీ
వాత్సల్య మందె విధి శ్రీ
వత్సా నే నెంతదొడ్డవాఁడను చెపుమా.
మ. దివికిం బట్టపురాజుఁ జేసితివి యీదిక్పాలకశ్రేణిలో
నెవరిం బోలుదు నీకటాక్షవిభవం బెం తంచు వర్ణింతుఁ గో
రి వరం బిమ్మన నిత్తు వాశ్రితులకున్ సృష్టిస్థితిధ్వంసక
ర్తవు సర్వజ్ఞుఁడ వైనఁ దెల్పెదను నారాకల్ దయాంభోనిధీ.
సీ. చనవరు లైనట్టి సనకసనందనా
దులవెంటఁ దిరుగాడి యలయలేక
ప్రియముఁ జెప్పిన నుబ్బు జయవిజయులదండ
గోలల కగపడి క్రుంగలేక
గర్వించుసముఖపుఖరసానిదాసరి
బోడిగలిండ్లకుఁ బోవలేక
చూచిచూడనియట్లు చొలయువిష్వక్సేను
నొద దీనత గాచియుండ లేక
తే. జడిసి యేప్రొద్దు మముఁ బ్రోచుకడఁక మఱచి
యంతిపురి లచ్చికౌఁగిట నాని చొక్కు
నలవైకుంఠపతిఁ జేర నళికి కృష్ణ
చేరితిని నిన్ను శ్రీమంతుఁ జేయు నన్ను.
క. అంబురుహాక్షా తొలి కన
కాంబరుఁడవె నీవు జగతి నది యెఱుఁగనకో
యంబరచరచంద్రునకును
బింబితచంద్రునకుఁ దెలియ భేదము గలదే.
తే. భక్తసులభుండవై నీవు బాలురైనఁ
బ్రౌఢు లైనను గరుణింతు వనుదినంబు
నచటికొల్వున రాజస మధిక మచటఁ
జేరుదళవాయి మముబోంట్లఁ జేరనీఁడు.
మ. పెక్కులు గావు నాదయిన పెద్దతనంబున కేమి మాటికిన్
దిక్కని నిన్నె నమ్మితిని దీనులఁ బ్రోచుట నీదుసొమ్ము నే
దక్కితి నీకు దేవరవు తండ్రివి రుక్మిణి కన్నతల్లి యీ
తక్కిన కోమలుల్ సవతితల్లులు నిక్కము దానవాంతకా.
శా. శ్రీమంతుం డయి కానివానివలెనే చిత్రంబుగా దానవ
స్తోమోద్యన్నరకాసురాహవభవద్దుస్సాధ్యబాధావృత
స్థేమంబై యమరావతీనగర మార్తిం జెందఁ నే జూచుటల్
సామీ యే మని విన్నవింతు మదిలోఁ జాలా భయం బయ్యెడిన్.
సీ. పురవీథి వచ్చునచ్చరలపాలిండ్లపై
సొక్కి గోరులు నాట నొక్కి నొక్కి
యెక్కడెక్కడఁ గన్న జక్కులప్రోయాండ్ర
చిగురువాతెరగంటు చేసిచేసి
కడతొలంగినఁ బోక గంధర్వకాఁతల
నామున కౌఁగిట నానియాని
విడిమేనులుగ నిల్చి వినువాఁక నీనాడు
పన్నగాంగనలను బటిటీపట్టి
తే. కనినకడ డాఁగుకిన్నరకమలముఖులఁ
జెనకి యలయించి వెతఁ జేసిచేసి యళుకు
దీఱి గడిదేఱి నరకదైతేయరాజు
సేన పగఁ జాటి నావీటఁ జేసె లూటి.
సీ. పోతరమ్ముల దేవపూజాగృహమ్ముల
బెట్టుగా దేజిలం గట్టువారు
నడువీథిఁ దమకు సందడి యయ్యె నని ముది
జడదార్ల ముచ్చెల నడుచువారు
నలుగడ బ్రహ్మచారులఁ ద్రోసి పొలదిండి
తొత్తుల గలయించి దూఁకువారు
చలమున బ్రహ్మనిష్ఠులఁ బట్టుకొని యాగ
డించి బరువులు మోయించువారు
తే. నగుచు నందనవని చెట్టులఁ గలమెట్టి
సురవరుల నెల్లఁ గట్టి యక్షులను గొట్టి
మాలికలు వీడఁ దట్టి సంభ్రమము దొట్టి
తిరుగుఁ బురిలో నెల్లదైతేయసేన.
సీ. అల తిలోత్తమ చాల గులగులలై మిట్టెఁ
బ్రమ్లోచికిని నీటు బవిళి వుట్టెఁ
గడు ఘృతాచికి వీలునడుము చక్కఁగరాదు
మేనక కిఁక నయో మేను గాదు
చిక్కె మహారంగ ప్రక్కగోరులలావు
తారకు దగ మించి తీ రెఁదావు
ధ్రుతమంజరికి నంత దొడుగుదీయక హెచ్చె
బెనుగంటిచే హేమ పెదవి విచ్చె
తే. నెందు నిటువంటిలంజెర్క మెవరుఁ జూడ
మందు రవ్వీటి కేరిలో నసురభటులు
సుదతులను బట్టి కులుకు దీర్చుకొని విడుచు
నపుడు తల్లడమున నల యమరు లెల్ల.
చ. ఇటువలెఁ బౌరులుం బురము నేను భయంబున నెన్నియేఁడు లు
త్కటరిపుబాధలం బడి వకావక లౌదుము ధాత వెఱ్ఱిము
చ్చట నెఱవేఱు టాయెఁగద సామి పరా కొనరించ నాయమా?
గటకట యింకనైన దయఁ గావఁగదే జగదేకనాయకా.
తే. మొదలిరాకాసిసేఁతలు గదిసినపుడు
పిదప పొలదిండిజగజెట్లు పెరిఁగినపుడు
నెత్తిపోయినయట్టి మాయిల్లు నిలిపి
తీశ యిప్పటి నరకున కెంతచింత.
క. అన విని యతనిమహత్త్వము
వినయోక్తుల దీనదశయు వివరించి సదా
ఘనముగ నమ్మినవాడని
మనమున హరి యెంచి నిండుమక్కువఁ బలికెన్.
ఉ. ఇంతవిచార మేల విబుధేశ్వర యీపని యెంత ముజ్జగం
బంతయు నీదుకోపమున కాఁగునె తమ్మునిమీఁది కూర్మిచే
నింతయుఁ బల్కి తీ వసుర యెచ్చటి కేఁగిన నెందు డాఁగినన్
దుంతవయాళిరౌతుపురిఁ ద్రోచెదఁ గాచెద లోక మంతయున్.
క. నవముగ సమరాలంకృతి
హవణించుటకంటెఁ బ్రకృత మైనవసంతో
త్సవము నెఱవేర్చి మఱి దా
నవుపై దండెత్తవలయు నముచివిరోధీ.
క. ఈయుత్సవమున నచ్యుత
సాయకునకు శైలసుతకు సంతోష మగున్
శ్రేయంబు గలుగు మనల క
జేయతయుం గలుగు రిపులఁ జెనకెడివేళన్.
తే. ఇంద్ర! యింద్రాణియును నీవు నీజయంతుఁ
డచ్చరలతోడ నీడకు వచ్చినపుడె
తరుణచంద్రావతంసుజాతర ఘటిల్లె
నస్మదీయమనోభీష్ట మతిశయిల్లె.
వ. అనిన వినీతియు వేడుకయుం గ్రందుకొన నమ్మహేంద్రుం
డుపేంద్రుని కిట్లనియె.
మ. కరిసంరక్షక వైరిశిక్షక హరీ కంసారి యారాజశే
ఖరుఁ డీవే నినుఁ జూచినప్పుడె కదా కల్యాణము ల్గల్గె నేఁ
బురికిం బోవలెఁ బోకయున్న దితిభూపుంఖానుపుంఖాతిదు
ర్భరనారాచములన్ కపాల మయి స్వారాజ్యంబు భోజ్యం బగున్.
క. అనిచిన జయంతు నచ్చర
ననఁబోఁటుల నచట నిలిపి నగరికి హరిచం
దనసంతానసుమాదిక
ఘనసురభిద్రవ్య మంపఁగల నీ కెపుడున్.
ఉ. నావుడు సంతసించి యదునాథుఁడు కస్తురి కుంకుమంబు క్రొం
బూవులు బోంట్లు దేహళికిఁ బూసి యెసంగ నతండు నట్లు సం
భావన సేయ నియ్యకొని మక్కువతో సరిగంచు మంచిచెం
గావుల నిచ్చి లేచి దయఁ గౌఁగిటఁ జేర్పుచు నంపె వాసవున్.
క. అనిచిన జయంతు నచ్చర
వనితల నట నిల్పి కదలె వాసవుఁ డంతన్
వనజదళాక్షునిసదనం
బున కంచుకి యిట్టు లనియె మోదము మీఱన్.
ఉ. శ్రీరమణాయుమాపతికిఁ జేయుమహోత్సవ మెల్లఁ గన్గొనం
మేరు వనేకరూపముల మేలిమితో నట నిల్చెనో యనన్
దేరి నభంబు శృంగముల దీటుచుఁ బైఁడివసంత మాడుచున్
తేరులు తేజరిల్లెఁ బురిదేవత లందఱు నుల్లసిల్లఁగన్.
సీ. కలధౌతదళసౌధములయూథములె యెందుఁ
గుంకుమకొలకు లేవంకలందు
ఘనసారహిమపూరఘనకటాహము లెందు
విరితేనేదోను లేసరణులందు
మగరాలనిగరాల మలఁచుమార్గము లెందు
విధుశిలావేదు లేవీథులందుఁ
గలువరాచలువరాచలువ లేకడలందుఁ
బూవుచందువలె యేత్రోవలందు
తే. నిచ్చలును మెచ్చ నగుగచ్చు హెచ్చువీలు
రవలపచ్చతోరణము లే రచ్చలందుఁ
గ్రందుకొన నిందిరాదేవి చిందు లెనసె
ననఁ దగుపురంబుశృంగార [5]మద్భుతంబు.
వ. మఱియు నవ్వలివ్వల నివ్వటిల్లుపువ్వుపందిళ్లనీడలఁ బరిమళ
మంజిమను రంజిల్లుకుమంజిమను పన్నీరు చికిలించుజాడల నెడతెగక యడరు
నడపావడలును, పావడలమీఁదఁ గ్రమ్ము మొలకతెమ్మెరలకపురంపుదుమ్ము
గ్రమ్మరింప ఘమ్మను తావిముమ్మరంబునకుఁ దానె తలయూఁచువగ
మెదలి మెదలి నటించు నేడాకులయనఁటికంబంబుల నెడనెడం గూడిన రస
దాడిచెఱకుదడులును, చెఱకుదడికురుంజులఁ జులుకగానంటు నంటిమేరువు
లును నంటిమేరువులముంగిలిముంగిళ్ల రంగుమీఱు బంగారురేకుచెక్కడపు
చిక్కుపనినిక్కు తడికచిక్కొమ్మ లావరించు పువ్వటోవరిబవరిగొన్న సన్న
జాజిజల్లుల నుల్లసిల్లునల్లకలువచప్పరంబులును చప్పరంబులయెదుట నిద్దంపు
సుద్దదిద్ద జానొందునౌదుఖానా నిండి దండిగ నంబరంబున కుప్పలించు కొప్ప
ళించు గొప్పధారలుగల జలయంత్రంబులును, జలయంత్రధారాధోరణీ
కృతావలంబ జంబీరనారంగనాగపున్నాగమాతులుంగలవంగపచేళిమభిదేళి
మదాళిమఫలకేళిమనోహరకీరవీరవారమ్ములును, నచట నడ్డగించిన
కెందమ్మికప్పడగొప్పకప్పురపుపూఁతసెజ్జలును నాపట్టునఁ గనుపట్టు కెంబట్టు
సజ్జలును, వాటినికటంబున డంబు చూపు సవురుచివురు జంబుఖానాల
ముంచినమంచియావజమ్ములు, నావజమ్ములసరససీటుచాటిమీటు సురధా
నులు మెఱుంగుచెందొవరేకుసింగాణులు కుసుమశరశ్రేణులు కుంకుమవంకి
ణులు రాణించుమనంబున జంకులు దొలంక చేకానుకలానుక ధీమంతు
లగు మంతు లంతంత సందడింప నల్లకుమారలోకంబు నల్లుండ్రపైకంబు
తమతమహజారంబులసమీపప్రదేశమ్ముల సకలవస్తూపహారమ్ములు హవ
ణించుకొని నిలువఁ గలువకంటు లారతిపల్లెరంబులు చేఁబూనుకొని యున్న
వారు కన్నవా రందఱు వెఱఁగంద నయ్యవసరంబున.
చ. గొడుగులు నాలవట్టములు కుంకుమకస్తురినీటితిత్తులున్
సిడములు జాళువాపికిలిచెండులు నీఁటెలు పైఁడియందె లె
క్కుడువగ వేత్రముల్ మొరటకొమ్ములు చిమ్మనఁగ్రోవు లాని ని
ల్కడసొగ సూని బోగమువెలందులు వేవురు వెంట నంటఁగన్.
సీ. కంకణమణిఫణాంకణమణిగణధగ
ద్ధగలు కుంకుమవసంతములు చల్ల
గళసీమగళదనర్గళనీలధళధళల్
దనరుకస్తురివసంతములు చల్ల
నెలరాలజిగి గ్రమ్ము నెమ్మేని నిగనిగల్
తావిగందపువసంతములు చల్ల
రాణించుబంగారువీణెల మిసమిసల్
తళుకుపసపువసంతములు చల్ల
తే. గం డెనయఁ బొల్చి జాళువా యండి దాల్చి
హవణికలు మీఱి పైఁడిమేరువులదారి
పర్వతకుమారితో గూడి బయలుదేరి
చెలు వమరియుండెఁ దరుణేందుశేఖరుండు.
తే. అనిన విని యంతిపురిఁ జేరి యనువు మీఱి
చెలులు గై చేసికొని చెంత నిలిచినంతఁ
గొలువుసింగారములఁ జెందు కొంద ఱిందు
ముఖు లెదుటఁ జేర మదిని సమ్ముదము మీఱ.
సీ. అరజాఱుసిగమీఁద విరిమొగ్గసరి చుట్టి
జాళువాజంటరుమాల గట్టి
సొగసుకస్తురిపట్టెసోగనామము దీర్చి
మెసలెడుకుంకుమ మెఱుఁ గొనర్చి
డంబుముత్యపుచేసరం బొకచే నాని
చీనాగొలుసు లొక్కచేతఁ బూని
పాలకాయొంట్లును బావిలీ ధరియించి
ప్రోదిగాఁ జెవుల జవ్వాది నించి
తే. తళుకుజిగిమించు సరిగంచు తమ్మిపూల
వ్రాఁతపనిదుప్పటిని వల్లెవాటు వైచి
కడఁక తగ నెంచి కొల్వుసింగార మిటులు
చేసికొనె శౌరి యెన లేని చెలువుమీఱి.
తే. వెనుక నెదుటను నిలిచిన వెలఁదు లెల్ల
దనమొగముఁ జూడ సామియందంబుఁ జూచి
కొమలజడవ్రేటులును పచ్చిగోళ్లసోఁకు
లెన్ని చూచిన ననఁ డేమి వెన్నుఁ డపుడు.
వ. తదనంతరంబ నితంబినీనినంబవిలంబమానమణిమేఖలాకలకల
మ్ములును, కంజాననాచరణకంజసింజానమంజుమంజీరఝళంఝళంబులును,
పంకజముఖీపాణిపంకరుహచంకనత్కనకకంకణఝణఝణత్కారంబు
లును, విధుముఖీజనకబరీనిబిరీసమరువకకురువకఫుల్లమల్లికాగంధాను
బంధగంధోదయపుష్పంధయస్తనంధయఝంకారంబులును, విచిత్రతర
వేత్రిణీలోకవిజ్ఞాపితవిజయహోంకారంబులుసు, వివిధహృద్యవాద్యసన్నాహ
సమయచిరత్నావిరళనాదంబులుసు, గ్రమ్ముకొన నమ్మానవతులును కమ్మ
విలుకానిఁ గన్నసామియును ముందుముందుగా నానందంబు డెందంబునఁ
గ్రందుకొనఁ జెందిరపువన్నెగందపుప్పొళ్ల చెందమ్మిరేకులచల్లు లాడం దగి
నగరెల్ల ఘూర్ణిల్లె నంత.
ఉ. పౌజులు రాజులున్ నగరిబైల రయమ్ముగ నేఁగఁ దత్పురాం
భోజదళాక్షులున్ చిఱుతబోడికలు న్నికటోర్వి రాఁగ నా
నాజనులుం దొలంగురవణంబున కట్టికవారు గొల్లలున్
రాజపథంబునం గడుబరాబరి సేయ మహాద్భుతంబుగన్.
సీ. బలుగొల్సు లెనయించి బండ్లపై నుంచి కుం
కుమ నించుబంగారుకొప్పెరలును
కాపుగుబ్బెతగుంపుమూపులపై నుంపు
గందంపురతనాల బిందియలును
చిఱుతనీమందంపు చేఁ బూనుపవడంపు
గొనబుకస్తురిగాజుకుండకవలు
జతగూడి వెలిబొక్కసమువారిచేచక్కి
హవణించువన్నెగందవడితట్ట
తే. లావెనుక సూడిగమ్ములహస్తములను
గచ్చుతట్టల రాణించు కలువపూల
చెండ్లు పలువన్నెపన్నీటిగిండ్లు తావి
విరులు నేతేర నెనలేనివేడ్క మీఱి.
తే. తనియఁ గన్నాఁగి వెస వసంతమునఁ దోఁగి
సొరిదిగా జొత్తుపావలసొబగు హత్తు
వింతదగువీథి నిరుగడ వెడలె నంత
సొగసు వెలయింపుహరికొల్వు సూళెగుంపు.
ఉ. మన్ననయమ్మగారు లొగిమానికపుంజిగిపేరు లాని ము
న్మున్నుగఁ బోవ నావెనుక మూవరసాసులు సందడించఁగాఁ
గన్నెలు వేనవే ల్మరునికైదువలో కడవన్నెబొమ్మలో
వెన్నెలసోగలో యనఁగ వెంబడిగా నడతేర నిచ్చలున్.
సీ. భృంగఝంకారంబురీతి నుపాంగంబు
ఘు మ్మన ఢక్క ఢింఢి మ్మనంగ
నిల్చి నాదించుతంత్రీవాద్యములసుతి
ఘ మ్మనఁ జెంగుతజ్ఝ మ్మనంగఁ
జిఱుతమద్దెలతోడి చిఱువీరణపుసద్దు
ధిమ్మన దిమ్మెధింధి మ్మనంగ
జిలుగైనవరల హెచ్చిలు శేషనాదమ్ము
ఝమ్మన నిల్వుతోంథొ మ్మనంగఁ
తే. జంద్రవలయమ్ము సారంగ జవిలిబాజ
మురళి ముఖవీణె తిపిరి కిన్నెర కమాచి
తాళమును వేటుగజ్జెలు దవిలి రక్తి
గుల్కె గంధర్వమేళంపుఁ జెలులగుంపు.
తే. సరససాంబ్రాణిధూపముల్ చౌకళింప
గెలుపుపద్యంబులను వందినులు నుతింపఁ
గెలన నుడిగంపుజవరాండ్రు కెలసి చూడఁ
బసిఁడిపావడ లాడ రాజసముతోడ.
మ. ప్రపదం బానుక కుచ్చెలల్ మెఱయఁగాఁ బాలిండ్లపైపై నొయా
రపుపైఁట ల్వెడజాఱ లేనగవు మీఱ న్వచ్చి దేవేర్లు నె
య్యపుమాటల్ పలుకంగ రాధ యడపం బానంగ మ్రోలన్ బరా
కు పరా కంచును వేత్రిణుల్ పలుక వ్యాకోచస్మితాబ్జాస్యు డై .
సీ. మెఱపులఁ దళుకొత్త నెఱతనంబున హత్తి
వలగొన్న యల నీలజలధరంబొ
సొలపులసొం పెక్కి పలుచుక్కగమి నిక్కి
సరస దొరయనుండు చందురుండొ
మిసమిస ల్వెలయింపు పసిఁడితీవియగుంపు
పొడలియుండెడు కల్పభూరుహంబొ
మణిశలాకలు నిండ మలసి బెళ్కుచునుండ
నలువొందు నల రోహణాచలంబొ
తే. యనఁగ శృంగారసర్వస్వ మవని ముంచి
మించి కంటికి సాక్షాత్కరించి నటులు
పొగరుచిగురాకుఁబోండ్లతో నగరు వెడలె
మందరధరుండు మన్మథమన్మథుండు.
మధురగతిరగడ.
అప్పుడు శ్రీపతి నాత్మల మెచ్చుచుఁ
గప్పురగంధులు కడఁకల హెచ్చుచు
మునుకలు గను జనుముగుదలఁ గనుఁగొని
వెనుకొని యరసెడు వెలఁదులఁ గనికని
చెలిమియు బలిమియుఁ జెలఁగఁగ మఱిమఱి
యెలమిని నొండొరు లిట్లని పలికిరి
పైఁబడ నేటికె పంకరుహేక్షణ
ప్రాఁబడె నీ కీపదటము లక్షణ
చెనకుచు హరి ద్రోచిన నేఁ ద్రోచితి
నన వచ్చెదు నీ వదె సాత్రాజితి
చిత్రముగా హరి చెనకిన నేటికి
మిత్రవింద నీమెరమెర లేటికి
నాడెను రుక్మిణి హరితో ముచ్చట
యేడ దమ్మ మన కీలవ మిచ్చట
కందువతోఁ బతి గనె నంతంతకు
జిందురవారము చేరె సుదంతకు
కొతుకునడలు పెక్కులు జాంబవతికి
హితవులు గలయది హృదయమునఁ బతికి
నౌర చూపు మొగ మరసెను భద్రకు
నేర మయ్యెఁగదె నిన్నటినిద్రకు
చుట్టుక హరితో సూరకుమారిక
గుట్టుబయలుగా గొణిగెను శారిక
యీయెడ రాధిక యెంతటి చిన్నది
మాయురె హరిమెడ మలయుచునున్నది
కోమలవల్లికి గొసరుచుఁ జేరెను
సోముని బావకు జుమజుమ మీఱెను
కలహించుట నీ ఘనతకు మేలా
కలభాషిణి నీగాయక మేలా
మందరధరుపై మమతలు ద్రోయకు
చందనరేఖిక చనె నాచాయకు
సదమదముగ నిదె సందడిఁ గూడెను
కొదవే దానికిఁ గుబుసము వీడెను
పనుపడ హరిచేబంతులరువ్వులు
మొనసెను దానికి ముసిముసినవ్వులు
నెలఁతకు నూరక నీవిక జాటెను
పొలుపుగ హరితలఁపులు చేకూరెను
పడఁతికి గుబ్బల పైఁట తొలంగెను
కడుతమి హరి కగ్గలమై పొంగెను
మున్నుగ నది విరిమొగ్గలఁ జల్లెను
వెన్నునిమదిలో వేడుక చెల్లెను
నావుడుఁ దమి మన్ననయుం గాటము
గా వెలయఁగ హరి గనె సయ్యాటము.
తే. అటుల సయ్యాటములఁ దేలి యదుకులాబ్ధి
పూర్ణచంద్రుడు శృంగారపూర్ణుఁ డగుచు
నగరు వెలువడి నెఱనీటునడలతోడఁ
జెలులతోఁ గూడఁ బురవైరిచెంతఁ జేరి.
ఉ. నారులపాట యచ్చరలనాట్యము చంద్రవతంసుచందమున్
దేరులయందముం బురముతీరును వీథులసౌరు నెంచి లో
సారెకు మెచ్చి విస్మయము సమ్మదముం బొదలంగఁ దాను శృం
గారవతీజనంబులు జగద్విదితప్రతిభానుభావులై.
తే. శివునకును మ్రొక్కి యనుపమశ్రీలఁ జొక్కి
యిందుధరుసమ్ముఖమున నొక్కెడను నిల్చి
యాదిని జయంతుఁ బ్రద్యుమ్ను నర్జునాది
నృపతులను బిల్చి కుంకుమనీటఁ దేల్చి.
క. ఆవెనుక గవివరేణ్యుల
నావెనుకన్ బుధులు గాయకావళిఁ గరుణా
భావనచందనజలధా
రావితతిన్ ముంచి పనిచె రాజస మొప్పన్.
ఉ. ముందుగఁ బోవఁ బంచె నల ముగ్ధశశాంకకళావతంసు నా
సందడిఁ బోయె నచ్చరలసంఘము బోగపుటింతిగుంపు లా
మందగతుల్ తగ న్వెనుక మానవతు ల్గొలువన్ బ్రతోళికా
ళిందమునం జెలంగి మరులీల వసంతము లాడి వేడుకన్.
క. వీడక శౌరి వసంతము
లాడ కుంకుమరసంబు లపుడు రహించెన్
జూడంజాలక సవతుల
సూడున మహి క్రోధరసము చూపెడు మాడ్కిన్.
తే. ఉదయభాస్కరు మొరయించి యువిద యొకతె
శౌరిపైఁ గల్వపూబంతి సరగ వైచె
నెలఁతపై నొక్కతన్వి పన్నీరు నించె
నేసెఁ గల్లరిగొల్ల నాయిక్కు వెఱిఁగి.
తే. తీరుచిగురాకులందె పన్నీరు నించి
యచ్యుతుఁడు నొక్కకొమ్మఱొ మ్మప్పళించి
యింతి మర్మంబు విడు మని హెచ్చరించె
నిఱుకుచనుదోయి నడుచక్కి చఱచినట్లు.
ఉ. తమ్మిలకోరిఁ దాల్చుదొరతండ్రికి పైనెరయాళి జాళువా
చిమ్మనఁగ్రోవి నొక్కచెలి చేతులకొద్దిని చిమ్మఁ జిమ్ముతోఁ
గ్రమ్మి యురమ్మునం దొరగు [6]కప్పురపుందెలినీరు వొల్చెఁ జి
త్తమ్మున నున్నచంద్రునిసుధారసముల్ వెలిఁ దేరుకైవడిన్.
తే. మదనజనకునిపై వధూమణులు చూడ
నెదుటఁ గస్తూరినీ రొక్కయింతి చల్లెఁ
గంసశాసనుఁ డప్పు డాకందు వెఱిఁగి
గ్రక్కున మరల్చెను కళిందకన్యమీఁద.
సీ. బాహుమూలశ్రీల పసపువసంతంబు
దొళుక లేఁగౌను దోడ్తోన యళుక
కడకంటిచూపుల కలువవసంతంబు
చిందఁ దొడవునవ్వు చికిలి చెందఁ
బలుచని చెక్కిళ్ల పైఁడివసంతంబు
నెఱయఁ జిగురుకేలు నిగ్గు దొరయ
రహి నడుగుల లక్కరసపువసంతంబు
చిమ్మఁ గాంచీనినాదమ్ము గ్రమ్మ
తే. సమ్మదమ్మున నదరంటఁ జంటఁ గ్రుమ్మి
గుమ్మివిరిదమ్మి చిమ్మనఁగ్రోవి తేనెఁ
జిమ్మె హరిపైని మగుడించి చెల్వుఁ బూని
రాజవదనాతిమూర్ధన్య భోజకన్య.
ఉ. జగ్గు మనంగ జాంబవతి సత్యయుఁ జిమ్మనగ్రోవు లానఁగాఁ
దగ్గక సోగఁ బారుహిమధారలు ప్రక్కల సోఁక నుల్కుచున్
కగ్గక వెన్నుఁ డత్తలిరుఁగైదువదేవరసత్యజాతరల్
పగ్గము లాడుకైవడిని భాసిలె వ్రేతఁలు మేలు మే లనన్.
తే. గందవడి భద్రనెమ్మోమునందుఁ జల్లి
వెన్నుఁ డేతేరఁ జన్నులు వెన్ను నాని
యణఁచెను సుదంత మరునిగాయమ్ము లార
హత్తి గజనిమ్మపండ్లచే నొత్తుకరణి.
ఉ. హాళిగ వెన్కనుండి యొకయంగన సన్న మొనర్చి నవ్వ గో
పాలుఁడు మిత్రవిందచనుబంతుల కుంకుమనీట నేత్రముల్
వేళమె చిమ్మఁ జిమ్మ నది వీవనకేంజిగిజాలు వెల్లయుం
దేలెను మొల్లనైబుదొర తేజము టెక్కెము నిక్కు కైవడిన్.
క. పక్షీంద్రతురంగునిపై
వీక్షణరుచి కలువదోనివిధమున నిగుడన్
లక్షణ చల్లె వసంతము
నాక్షణమే కుచఘటంబు లతఁ డదుమంగన్.
సీ. ఒకసారి దనుజారి యుదుటుగుబ్బలపైఁట
హస్తకస్తూరిక నపనయింప
మఱియొక్కపరి హరి మాధవుళపుచీర
కుచ్చెలచేతికుంకుమము పూయ
వేఱొక్కసారి కంసారిచేనంటువై
గోవజవ్వాది చెక్కులను జెమర
మఱుసారి యల శౌరి, కరముగందపడిపో
నదరంటఁ బిఱుఁదుల నప్పళింపఁ
తే. జెలులనే సోఁకులను గ్రమ్ము చికిలిమీస
ములఁ బసపుపావడను వెన్నుఁ డలమి చిమ్మఁ
జాయయునుబోలెఁ దిరిగిన చాయఁ దిరిగి
రహి నతఁడు పంట మడు పాన రాధ వెంట.
సీ. పావడకట్టుతో భ్రమసి తొల్గెడివారు
నొగి నీవి జాఱఁ గూర్చుండువారు
రవిక వీడినఁ బైఁట రహీగఁ జెక్కెడువారు
నది వోఁ గుచము కేల నదుమువారు
తడికోకతొడనిగ్గు లడర వ్రాలెడువారు
నచ్చోఁ దళుక్కన నణఁగువారు
కుచ్చెలనెఱిక వోఁ గొతి కొదిగెడువారు
నాభి బైలైన వెన్మలయువారు
తే. నగుచు నగినగి వగనగ నిగుడుపొగరు
మిగుల సొగసుగ మగువలఁ జిగురువిల్తు
మాయలను జొక్కఁజేసిన మరునిఁ గన్న
సామి తమిఁ జెందుఁ జెందునాసమయమందు.
సీ. రసదాడివిలుఁ బూని బిసరుహాక్షులపైని
కుసుమాస్త్రముల నేయుఁ గొంతసేపు
కొలఁకుల జతగూడి కుంకుమనీ రాడి
కొమల నుద్దాడించుఁ గొంతసేపు
బోంట్ల నేఁచఁగఁజాలు భూపతిమలచాలు
వింత గన్గొని నవ్వుఁ గొంతసేపు
చెలులకు సందిళ్ల ఫలపరంపర లెల్లఁ
గొల్లగా నిప్పించుఁ గొంతసేపు
తే. ప్రొద్దు గడపుచు మకరాంకుపద్దు చెల్ల
నగు వసంతోత్సవం బటు లతిశయిల్ల
నెఱపి తా నెల్లపల్లవాధరుల కెల్లఁ
దనివి సంధిల్ల నామాయదారిగొల్ల.
వ. మఱియు నయ్యిందిరాజాని రమ్యవస్తూపహారమ్ములవలనను
విచిత్రతరనీహారమ్ములవలనను విధుముఖీకరారవిందనిక్షిప్తకుసుమకందుక
ప్రహారమ్ములవలనను హృదయమ్మున విస్మయవిహారమ్ములు రాణించఁ
జంచలనయనారుణారుణపటాంచలప్రపంచితపంచకరప్రతాపావలేపసూచన
విశంకటసకుంకుమపంకసంకలనచంకనదకలంకనిజశరీరకిరణజాలమ్ములును,
తరుణకరణికోటిధాళధళ్యంబును గ్రమ్మించు క్రొమ్మించు దుప్పటిచెఱంగులు
జాజిఁ గొమరుమీఱులావణ్యసారంబును లలితాకారంబును మందహాసం
బును మహనీయవిలాసంబును మానసోల్లాసంబును మన్మథవికాసంబును
గ్రందుకొన నరవిందముఖీబృందంబునుం దాను నమందానందంబున మంద
మందగతులఁ జెందలిరుపందిళ్లఁ దోఁప నించునించు దారువులును మేరువులును
గొజ్జంగినీటికొలంకులును గుజ్జుమామిళ్లవలంకులును కృతిమకేళీగృహవాటం
బులును కృతకాచలకూటంబులును జూచి శిర మూఁచి యవ్వలవ్వల దాఁటి
యలరులనెలజాతరలఁ జాటి నగరప్రదక్షిణంబు గావించి నగరాజకుమారికా
శంకరుల మగుడ సేవించి వారల నిజనివాసంబుల కనిచె నంత సాయంతన
సంధ్యారాగమ్ము వెన్నునియంగరాగమ్ములాగున జగమ్మున నిండెఁ జండకిర
ణుండు కుంకుమభరణికరణిఁ జరమగిరికడనుండె నంభోరుహంబులు వాడె
వియోగిజనధైర్యంబులు వీడె నిందీవరంబులు విరిసె నిందిందిరంబులు
మొర సెఁ గందర్పవీరాట్టహాసంబులు వెలసెఁ గటికిచీకటి హరిదంతంబులఁ
గలసెఁ దారలు మెఱసె ధవళిమ తూర్పుదెస నెఱసె జక్కవకవలు తల్ల
డించె జాబిల్లి యుదయించె నంతకుమున్న వెన్నెలలనిగనిగలు హత్తుపగలు
వత్తు లిరుగడల నడవ ముందుగాఁ గొందఱిందుముఖులు కరదీపికాదశసహ
స్రంబుల నాని పొలిచి సముఖంబున నిలిచి దిశల జాళువామొలామాలు
నివ్వటిల్ల దివ్వటీసల్లాములు చేసిడాసి మారువారువమ్ములలీలల విలసిల్లు
నిరుపగళ్ల బారుదేరి గ్రమ్మన నమ్మదనగోపాలుండును కలితకర్ణికారకలి
కానుషంగజంగమగాంగేయశైలంబు డంబున దంతపురేకుసంతనవింతపనిక
డానిగచ్చు పచ్చలపల్లకి నెక్కి యిరుపక్కియలఁ గ్రిక్కిఱిసి దచ్చిదేరులు
తచ్చనలాడ నటనాటకశాలకేలికతోడ నాపురవీథినుండి హజారంబుఁ బ్రవే
శించి యంతస్తుల మించి యపరంజియిటికెలాగడపుపటికెపుఁగంబంబుగుంపు
నెఱకెంపుజగతి నిగనిగదగు మగరాలకు మడికాసురేకుజోకయీడపు నీలపు
గోడసడలఁ దురంగలించు చెంగటిముంగిటి కిరీటిపచ్చహెచ్చుపసరుజిగి విచ్చ
లవిడి పుటం బెగయువగఁ జెలంగు బంగాళిపచ్చతానకపుటింగిలీకపు వ్రాఁతతా
మెరపొందుఁ జెందుముత్యపుచందువాలఁ గనుపట్టి తెరమానికిపురాకట్టు
తొట్టికట్టిన శిబికావరోహణంబు చేసి శచీవిలాసిని యనుపఁ గొందఱచ్చర
లచ్చటికి వచ్చి పారిజాతకుసుమబృందాదిదివ్యచందనమ్ములు దెచ్చియిచ్చిన
సంతసిల్లి యచ్చెలువ లేమరక నరకదైతేయబాధలవలన దాడి తడవు
చెల్లె నని విన్నవించిన నాలకించి నగి జయంతు రావించి కటాక్షించి యంత
నయ్యచ్చరలఁ దొలుతటియచ్చరల నగారి నివాసమున కనిచిన వేడ్క
నప్పుడు సత్యభామ సరసత నవరస యని హెచ్చరించినలీలఁ జేలాగియ్య
నడచి కనకకక్ష్యాంతరంబులు గడచి దైతేయుమీఁద దాడిచనవలయు నని
యందఱు వినునట్లుగా మందలించి కందలించినపొగరు నిగుడఁ బ్రద్యుమ్న
భీమవిజయసైనేయులం గాంచి వీట జయయాత్ర చాటించ విజయభేరి
వేయించ నియోగించి భోజతనయాముఖనిఖిలలలనాజనంబుల నంతిపురం
బున కనిచి తోరంబగు సాత్రాజితి మాణిక్యాగారంబు చేర నరిగి యందు.
ఉ. సారసనేత్ర లారతు లొసంగ వసంతము చెల్వు కొల్వుసిం
గారముల న్సడల్చి యట గ్రక్కునఁ దా జలకంబు లాడి క
న్గోరుల రావిరేకపని గోణము గట్టుచుఁ జల్వఁ దాల్చి యం
భోరుహనేత్రుఁ డందముగ మోమునఁ గప్రపుబొట్టుఁ బెట్టుచున్.
క. లోలాక్షియుఁ దోడనె హా
జీలై రా నారగించి చేఁ దొలఁచి రుమాల్
పూలును కలపము తగ బా
గాలాకుమ్మడపు లొసఁగఁ గైకొని యంతన్.
శా. శృంగారించుక శౌరి చంద్రముఖిమైసింగారముం జూచి యు
ప్పొంగున్ డెందముతోడఁ జూపులు నయంబుల్ చాలఁ జేకూర సా
రంగాక్షుల్ తన సైగ దెల్సి వెలిదేరన్ వేడ్క నాయంగనా
నంగాయోధనసాధనప్రమదధన్యస్నేహసన్నాహుఁడై.
సీ. పటికపుకీల్బొమ్మ చిటికయొద్దికఁ జిల్
గుటికలపల్లకీ గొనుచు నినుచు
సురటిరెక్కలగాలి సోఁకులనేమొస
గొడిగెడు సకినలగుంపు నింపు
[7]సద్దుసద్దన నారజంపు మంపులనింపు
జగజంపుజంత్రంపుజతలకూకి
కవలకుత్తుక హత్తు కవకవకివకివ
రవలతో మరుచివ్వ బవిరి దీర్చ
తే. నవులపుంజెందుచందువాతొవలపొంగు
తుమ్మెదయెలుంగుశ్రుతి గ్రమ్ము కమ్మపైఁడి
ఢక్క ఘుమకారముల మేలిగ్రుక్క లీను
హరువు మురువైన శయ్యాగృహమ్ములోన.
క. విరికుచ్చు హెచ్చుగచ్చుల
తఱిమెనపగడాలకోళ్ల దంతపుపనిచ
ప్పరమంచంబున ఘమ్మని
పరఁగెడు సేవంతిరేకుపానువుమీఁదన్.
చ. చికిలిమెఱుంగుకెంపురవ చెక్కడపున్ జిగిడంబకంబు మో
రకొణిగె నంటఁ గట్టినజిరాపనిమేలరవిప్పుదీర్సుకో
రకములనింపు సంపఁగికరాళము నోరతురాయిసోఁకని
య్యక వసియించు హారలత లాడఁ దలాడను చేయి యూఁదుచున్.
క. వసియించ శౌరిసరసన్
మిసమిసమనుగబ్బిగుబ్బ మెఱుఁగుపయఁటలో
మసలఁగ నెఱమోహపురా
జసపుం దరితీపుతోడ సత్య వసించెన్.
తే. కాంత యటువలె వసియించి కొంతసేపు
మంతనముతో వసంతపుమాట లాడఁ
బ్రొద్దు గడపుచు నున్న దీపూవుఁబోఁడి
యని యుతాళించి యెనలేనిహౌసు మించి.
క. పనిలేనిమాట లాడుచుఁ
దనమైచే మేని సోఁకఁ దప్ప బెణఁకుచున్
వనజదళాక్షుఁడు మాటలఁ
దనియక మదిఁ బొంచియుండెఁ దహతహ మీఱన్.
క. రమణుఁడు పొంచుట తనచి
త్తములో నెఱుఁగ కట మాటదారిగ నగుతా
గమకించి కురుజుతెలనా
కుమడపు మొనపంటఁ గఱచి కొమ్మని యొసఁగెన్.
చ. ఒసఁగినయంత వింతగను హుమ్మని కమ్మనిమోవి నోరఁగా
దుసికిలనీక యమ్మడుపుతోడఁ జుఱుక్కున నొక్కి శౌరి సం
తసమును సిగ్గు నెగ్గు మెయితగ్గును సీత్కృతిజగ్గు మొగ్గురా
జసమును మీఱ బోటిమెయి సంఘటిలం గటిలగ్నపాణియై.
క. పెదవిచుఱుకంట సతి పతి
కెదురెక్కుచు గోర నదిమి యెదను చనుమొనల్
గదియించి కాటు సోఁకినఁ
గదియంబడి నిల్చె వెల్చె కైవడి నంతన్.
చ. ఉరమున గుబ్బ లాని హరి యుల్కుచు మాటలఁ దేర్చి పల్కుచున్
తరుణిని నిండుకౌఁగిటను దార్చి నయంబు లొనర్చి హామికల్
బెరయ బిరాలునఁ బొటనవ్రేలునఁ గుచ్చెల రెమ్మి నీవి వోఁ
బొరలి చివుక్కునం గదిసె బోటియుఁ దా నెదురెత్తు లియ్యఁగన్.
క. అటువలెను శౌరి కదియుచుఁ
గుటిలాలక జొక్కమలుకుగ్రుక్కులు రహిఁ బి
క్కటిలన్ ఘుమకారము సం
ఘటిలన్ బకదారిరవలు గలిబిలి సేయన్.
క. కుతికంటుమెదలఁ గదురఁగ
గతిపెక్కుల నిలిచి నిలచి కమ్మలు గదలం
జతగొని ముంగర పొదలన్
కొతకక మణితంబు సలిపె గోమలి యంతన్.
సీ. అధికహస్తగ్రాహశిథిలకుంతలవాల
మాతతశ్రమకణోద్యత్కపోల
మామృష్టఘుసృణదివ్యచ్చిత్రనికటాల
మన్యోన్యరచితాట్టహాసలీల
మధిగతసుఖ మనంగామీలితనిపాల
మాప్రయోగక్షతోష్ఠప్రవాళ
మలఘువక్షోజకట్యామర్దనస్ఫాల
మాకీర్ణకుసుమశయ్యానిచోళ
తే. మవిరళావ్యక్తవాగ్జాల మతికరాళ
మాత్మపులకాంకురనిరాళ మమితఖేల
మగుచు మరుఁ డిచ్చఁ గొలువుండి నగుచు మెచ్చ
నమరి నిరతంబు మెఱసెఁ దత్సమరతంబు.
క. చిఱుమూల్గు లూరడింపులు
గరిసింపులు గాయకములు కసరులు కొసరుల్
మురిపెంబులు సరసంబులు
మెఱయఁగఁ దరుణియును హరియు మెలఁగుచునుండన్.
ఉ. చొక్కక చొక్కినట్లు మఱి చొక్కియుఁ జొక్కనియట్లు చొక్కి పైఁ
జొక్కినయట్లు మేలువగఁ జూపుచు వాతెఱకాటు మేపుచున్
మ్రొక్కుచుఁ దక్కుచు న్హొయల ముద్దులఁ బెట్టుచుఁ జెక్కుగొట్టుచున్
చక్కెరబొమ్మ యోరటిలఁ జక్రధరుం డతివిస్మితాత్ముఁడై.
క. ఔడుగడచి చనుపొత్తుల
జో డరచేతుల నడంచి సొగసి దురుసుగా
వీడక విడుచుచు మఱిమఱి
కూడక కూడుచు గరంచెఁ గోమలి నంతన్.
క. ఇందుముఖిసమరతం బా
చందంబున వెలయ విభునిచరణంబులపై
సందుకొని లాగి కుచని
ష్పందనను రమాంగి వీఁగి పైకొను వేడ్కన్.
క. పయికొనియును కంసాంతకు
పయి బరు వానకయ పొదలి భామామణి త
త్ప్రియలీల కలరి మఱిమఱి
నయముగఁ గొలిపించె శౌరి నానాగతులన్.
సీ. వీఁగి సన్నం బైనలేఁగౌను వణఁకంగ
నుదుటుగుబ్బలు మాటి కుబికి పొంగ
మొగిలిరేకులనూనెముడిచిందు లెనయంగం
దళుకుఁజెక్కిళ్ల కమ్మలు చెలంగ
మెఱపుహొంబాళెపుసర మల్ల లాడంగ
మెఱపులవలెఁ దొడ మిం చెసంగ
నిలువక రవలయందియలు ఘల్లు మనంగఁ
గవగూడి విడిగాజురవ చెలంగ
తే. నంగన చెలంగె నపుడు రథాంగపాణి
యంతరంగంబునకుఁ జాల వింత గొలిపి
జంతవగ చూపుపంతుమైసరులకోపు
మీసరం బైనమరుసాము పైసరంబు.
క. ప్రియుఁ డుబికి మోవి యొరయం
బయిపయి మో విచ్చి యిచ్చి పడఁతుక జడియన్
నయముగను చెమటఁ దడియన్
మయసుడియ న్మెఱసెఁ గాంత మగసొగ సంతన్.
మ. కొఱపల్కుల్ రవగుల్కుచిన్నెలును, టెక్కుల్ నిక్కుమేలన్నులున్,
తరమౌ వాతెరతేనెజున్నులును, నిద్దామేనిడాల్ హొన్నులున్,
చిఱుగోరింపులనింపుచన్నులు, హొయల్ చేకొన్న వాల్గన్నులున్,
హరి కెంతేఁ దమి రేఁచె బోటి మగసయ్యాటంబు వాటింపఁగన్.
సీ. చిఱుదొండపంటికిఁ జిలుక చేరినలీల
వరునివాతెర నొక్క వ్రాలివ్రాలి
కరికొమ్ము గుద్దినకరణి గుబ్బల బమ్మి
యెమ్మెకానియురమ్ము గుమ్మి కుమ్మి
వెడవిలు్తుచేడక్క నుడికారములపోల్కి
బకదారివగరవల్ పల్కిపల్కి
పలుమాఱ పొదలుచుఁ బైపాటుదురుసాఁగి
లకుముకివలె బయ లాఁగియాఁగి
తే. పులకమొలకలు నెలకొన లలితనఖర
కలితకటిగళసుఖజలస్ఖలనసమయ
విరళవిరోక్తి మై లోఁగి వీఁగి తనిసి
మగనిఁ దనియించె నొయ్యారి మమత మీఱి.
తే. అటులు విహరించి దంపతు లచటినుండి
బయలు దేరి వసించి చల్వలు ధరించి
మగుడఁ బాన్పునఁ బవళించి మమత మించి
యంచితోల్లాసముగ నిదురించి రంత.
చ. తిమిర మడంగెఁ గ్రుంగె నలుదిక్కులు జారకులంబు సాంధ్యనా
సమితి చెలంగెఁ బొంగె మది జక్కువకుం గుతుకంబు పక్షినా
దములు గడంగె నింగెనసెఁ దామరపుప్పొడిగుంపు సూర్యబిం
బ మట వెలింగెఁ జెంగె నతిమంజులగౌరవకైరవద్యుతుల్.
వ. అప్పు డప్పద్మలోచనుండు కప్పురగంధియుం దానును మేలుకాంచి
కాల్యకృత్యంబులు నిర్వర్తించి పౌలోమీప్రహితపారిజాతగుసుమజాత
కుంకువుపంకసంకుమదమృగమదజాంబూనదాంబరచంకనదలంకారుండై
పువ్వుఁబోఁడితోడ బువ్వంబు నారగించి తదీయముఖతామరసదత్తకర్పూర
వీటికాతిసురభిళవదనారవిందుండై వేదండగామినీకుచమండలోపధానంబు
నం జేరి వింతహొయలు మీఱియుండె నయ్యెడఁ బ్రద్యుమ్నుండు సద్యస్తన
విజయయాత్రాముహూర్తంబు సమీపంబయ్యె నని యేకాంతంబుగా విన్న
వించిన నన్నతోదరి యంతకుమున్ను వెన్నునిపయనంబు తనకు మన్నన
క్రొన్ననఁజోడులవలన విని నిశ్చితప్రయాణయు విభుప్రస్థానవార్తాజాయ
మానవిరహతరళీకృతప్రయాణయు నగుచుఁ గలితమధుకైటభనిరాస కంస
శాసనా నీవు నరకాసురవిజయంబు సేయుట యీదేవీసమాజంబునకు నేఁ
దెలుపఁదగినది గావున భూమివారు చూడ స్వామివారితోడనే నన్నుం
దోడుకొని విజయంబు సేయవలయు నని యెచ్చరించిన మచ్చెకంటినిం
జూచి మదనజనకుం డిట్లనియె:-
చ. వెఱవక పోరు చూచుటలు వెన్నెలకుప్పలొ కాక గవ్వలో
గురుగులొ బొమ్మరిండ్లొ మఱి గుజ్జనగూడులొ పెండ్లివీడులో
పొరిఁబొరి నిచ్చలున్ విసరుపువ్వులరువ్వులొ తేటనవ్వులో
యరయరు కార్యముల్ మృగము లట్ల వెలందులఁ దెల్ప శక్యమే?
సీ. పాటలాధర[8]యాటపాటలా యింక ని
శ్శంకశాత్రవవీరహుంకృతములు
బోటు లాడెడిపూలయేటులా రిపుకోటి
నాటితకరవాలపాటనములు
తేటలాగునఁ జిల్కమాటలా యక్షత
ప్రతిపక్షభటరూక్షభాషణములు
నీటు లానెడు వీణెమీటులా హుంకార
చంకనదరిచాపటంకృతములు
తే. బోటు లాసించుముత్యాలసేటులా ర
ణాంతదుర్దాంతకుంతప్రహారధార
లువిద యిది చండితన మని యుండియుండి
యకట యీవేళ సంగ్రామయాత్ర యేల.
చ. ఉవిదలతోడ మర్త్యుఁడు రణోర్వికిఁ బోవుట యెట్లు పోయెనా
బవరము చేయుదానవులపైఁ బడి చూపుట యెట్లు చూపెనా
యవిరళబాణజాతముల నంగనఁ గాచుట యెట్లు కాక నీ
సవతులు విన్న నెట్లు మఱి [9]శారదపూర్ణనిశాకరాననా.
క. మానవసమరమువలెనా
మానవతీమణి యివేటిమాటలు బళిరే
దానవరణభీషణదశఁ
దా నవలా చూతు వనుట తగునే యెందున్.
క. అన విని మిటారి వగజిగి
కొనగుబ్బల నతనివెన్ను గోరాడుచు మూ
పునఁ దనమో మిడి కులుకుచు
వనితామణి యిట్టు లనియె వల్లభుతోడన్.
చ. వలవనిచింత యేల యదువల్లభ కల్లభయంబు ప్రోదియుం
బొలుచుట స్వామివల్లఁ గద పుట్టు జగంబుల కెల్లఁ జెల్ల! నే
దెలియ నటంచుఁ బల్కితివి తీరుగ నేణకులంబు గబ్బిబె
బ్బులిఁ గనుకైవడి న్వడి రిఫుల్ నినుఁ గల్గొని నిల్వనేర్తురే.
క. సాధారణనరునికి నా
యోధనముల్ రిపులు ననెడు యోజన తగుఁగా
కీ ధాత్రి నీమహత్త్వ మ
సాధారణ మగుట నిట్టిశంకలు గలవే.
క. ఆఁటది రారా దనునీ
మాటవలన నేమి త్రిపురమర్దనుఁ డని మున్
బోటుల సిక నొకప్రక్కన్
గాటపుతమి నాని గెలుపుఁ గైకొనలేదే.
చ. అవునవు నెన్నిమాయలు సురాసురకోటి దృణీకరించునీ
కవుఁగిటిగూటిలోఁ జిలుక కైవడి నిచ్చ వసించుబోటికిన్
బవరము చూడరాదొ పెరబారులు ను గ్గొనరించరాదొ దా
నవు లన నెంత రాక్షసజనంబులు దైత్యులు నెంత శ్రీపతీ.
చ. సవతులు విన్న నె ట్లనుచు సంతస మొప్పఁగఁ బల్కి తీవు మా
సవతులవల్ల నౌవెఱపు సామికి నేఁడు నవంబె యైన యా
దవకులచంద్ర నన్ను దయదప్పక దోకొనిపోవఁగావలెన్
బవరము చూడ నాసతులపాదము లాన మరల్పరాకుమీ.
క. అనిన నగి మగుడఁ దనచె
క్కు నొక్కి ముద్దిడుచు వేఁడుకొనఁగా నెనగా
నని మురిపెపుమాటల నం
గన గట్టిగ మనవి దెల్ప గమకించంగన్.
మ. సకి యొక్కర్తు పరా కనన్ విజయుఁడు సైవేయమాద్రేయభో
జకుమారాదులు భీముఁడు న్వడిగ రా సద్యశ్శుభౌపాదనో
క్తికమౌహూర్తికలోకజీవజయవాగ్రీతిన్ ముహూర్తంబు చే
రిక యౌటన్ హరి లేచె లేచినయొయారిన్ మక్కువం జూచుచున్.
ఉ. చూచిన కాంతునిం గనలి చూచుచు నే మనలేక నవ్వుచున్
దా చతురాలు గావునఁ దదాత్యసమాగతబాంధవాళిపై
మోచినగుట్టుతోఁ దలుపుమూలకు నేఁగుచు మ్రొక్కి సామికిన్
ధీచతురన్ వయస్యఁ గొని దీవనవీడె మొసంగె సొంపుగన్.
వ. ఇవ్విధంబునఁ దన్వంగి దీవనవీడె మొసంగ నంగీకరించి హవుసు
మించి యంతకుమున్న దొరఁకొన్న విజయభేరీనినాదంబు విని యచ్చటికి
వచ్చిన వైదర్భీముఖనిఖిలవిధుముఖీజనంబుల నెల్ల సాదరవిలాససమందహాస
వీక్షాలీలాసవిశేషపోషణమ్ముల తమకమ్ము కెరలించి తన్నివాసమ్ములకు
మరలించి కరారవిందకలితవిజయకరావలంబం బంది విలంబమానజాంబూన
దాంబరవిభాకదంబంబు ప్రతాపంబువిధంబున భుజంబునఁ దొంగలింప దిగం
గనాతరంగితాశీర్వచనరచనానుభావభూదేవబలదేవవసుదేవనందాదిగురు
బృందానుమతిఁ గైకొని నగరు వెలువడంగ హెచ్చరించిన నగుచుఁ జంచల
హృదయకంచుకవ్యాహారసాహోనినాదంబు సంధిల్ల రాజీవాక్షుండు తేజీ
నెక్కి యిరుపక్కియల బవిరిగాఁ గ్రిక్కిఱిసి హాజీలై తేజీల నెక్కి కుమార
లోకమ్ము నల్లుండ్రు కమ్ముకొనిరాఁగ సమందమందగతుల ముందు వెనుకఁ
గొంద ఱెన్నఁదగుమన్నెవార లేనుంగుల నెక్కి రాఁగ సంవర్తసమయవర్తి
తావర్తనఘూర్ణమానార్ణోరాశి జంఘాలతరంగసంఘాతసంఘర్షణజనిత
నిహోషణపోషణనిపుణదుందుభిబృందకందళితనినాదమ్ముల సమదహృదయ
పుటభేదనమ్ములు చాటి యాపుటభేదనమ్ము దాఁటి తమకంబుబైట
గమకంబుగా హవణించినకలువకలువడంపుచలువనెత్తావి ఘమ్మన గొప్ప
కురువేరుచప్పరంబున డాసి తురంగావరోహణంబు చేసి యచట నగుశుభ
నిమిత్తంబులకు సంతసిల్లి మనంబున భవానీశంకరులకుఁ బ్రణమిల్లి చతురంగ
బలంబును వెన్నాడి వచ్చి గుమిగూడి యుండుటం జూచి యేచి కరువలి
దిండిచండి దొరతండంబుగుండెనంజుడు నంజుసంజకెంజాయకఱకుటెఱకలు
గలుగుపులుఁగుమన్నీనిఁ దనయెప్పటిపటానిం దలంచె తలంచిన నతండు వెండి
బిరడజిగి మెండుకొన వేఱొక్కనడ బ్రహ్మాండమధ్యంబునంబొలిచినవగ వచ్చి
నిలిచినం జూచి కటాక్షించి సకలబలసహితుండై తదీయస్కంధారోహ
ణంబుఁ జేసి యతివేగంబున సాగరాంతరాకాశపథంబునం జనియున్నిద్రశర
భసైరిభశార్దూలంబు నుదగ్రహరిణగజగవయకులంబు నురుతరసాలతమాల
మాలతీహింతాలతక్కోలంబును జృంభమాణనిర్ఝరిణీశతసముల్లోలకల్లో
లంబును మణిమయగుహావిహారిదానవదంపతీవిలసనోద్వేలంబు నున్మీలిత
కుముదకమలసముదయసముదంచితకాసారతీరోపవనపర్వానుపర్వామితసర్వ
ర్తుకుసుమమకరందతుందిలాలవాల మ్మగు కనకమహాకుత్కీలమ్ముఁ జేరి
యగ్గిరియందు నిచ్చలపుపచ్చికబయళ్ల గరుడుని డిగ్గి యందు నిష్యందమాన
సలిలబిందుపిండీకృతయజ్ఞభుగ్జలదకుంతలాదృగ్జలరుహప్రాగ్జోతిషపురకలిత
విహృతినరకదానవశుద్ధాంతకాంతాకుచకుంభగుంభితమసృణజరీజృంభమాణ
పరిమళఝరీసందానితమందపవనకందళమ్ముల సేదదేరి పరిజనమ్ముల నెల్ల
నియోగించి పాళెంబు విడియించె నంత.
తే. చిగురుఁబోఁడి ముకుందునినగర నుండి
తలఁపు వెనుకొనఁ గనకసౌధమ్ము నెక్కి '
కొమలతో మంచిశుభశకునములు గాంచి
సామినెమ్మోము మఱుఁగైన సంచలించి.
క. రతనంపుగవాక్షులలోఁ
బతిఁ గనుఁగొనునంచు వదనపద్మ మొదిగియున్
సతి యెఱుఁగక మై మఱచిన
గతి నుండఁగ నిలిపి చెలిమికత్తియ లంతన్.
క. ఇదిగో ముకుందుఁ డనినన్
మదిరేక్షణ తిరిగి చిత్రమధ్యతలమునన్
సదయునిఁ గనుఁగొని యావిభు
పదములపై వ్రాలి సోలి భగ్నాశయయై.
తే. మదిని నెలకొన్న రుక్మణిమాయఁ దగిలి
కలనఁ గై వచ్చుజయలక్ష్మివలనఁ జిక్కి
మఱియు వేవేలుచెలువలమరులఁ గెరలి
నన్ను రానిత్తువా నీవు నలిననాభ.
క. కాంతల నందఱ మును శు
ద్ధాంతమునకు ననిచి నాగృహమునకు నీ వే
కాంతమున వచ్చి కలియుట
యెంతయు బలవంత మనుచు నెఱుఁగఁగనైతిన్.
మ. అని ప్రాణేశ్వరునేర మెంచ నవలాలాడన్ జెలుల్ భోజనం
దన నీక్షింపుము ముంగట న్నగుచుఁ గాంత ల్గొల్వఁగా నున్న దం
చును చేఁ జూపినఁ జూచి నవ్వి సఖి యంచుం జేయి చేయూఁతగాఁ
జనుచున్ బంగరుమెట్లవెంబడిని రంజన్మంజుమంజీరయై.
సీ. చెలువునిపై బాళి సెలవుముట్టినజాలి
మొలక లెత్తువిరాళిమోహరించ
వెడనడలహొరంగు విడికమ్మలమెఱంగు
గ్రమ్ముగుబ్బలపొంగు ముమ్మరించ
కలకఁబాఱినయేపు తొలఁకఁబాఱినవైపు
తలిరువిల్తునితూపు తారసించ
చిగురువాతెరటెక్కు చికిలిచూపులచొక్కు
చిఱున వ్వొలయుచెక్కు జేవురించ
తే. చెలులు మునుమున్నుగా నేఁగి కలువరేకు
సెజ్జ హవణించ మెల్లనఁ జేరి శిశిర
మారుతోదారతుహినకాసారతీర
చంచదుద్యానసీమ నాసత్యభామ.
వ. తదనంతరకథావృత్తాంతం బెట్టి దనిన.
మ. మహిసంక్రందన, [10]క్రందనందనసుమన్మందార, మందారదు
స్సహసంస్పర్శన, స్పర్శనాతిగదయాసద్భావ, సద్భావన
న్మహిళాభావిత, భావితార్కభుజసీమాధామ, మాధామవి
ప్రహితాలోకన, లోకనవ్యనయనాభాచంద్రభూచంద్రమా.
క. కరుణావరుణాలయ నత
భరణా శరణాగతారిపార్థివ సుగుణా
భరణా వరణాంచితపుర
తరుణా యరుణాబ్జసద్రుతాయతభరణా.
క. ద్రాక్షాశిక్షానుక్షణ
రక్షాక్తీకృతవినోదరక్షితపక్షా
లక్షణలక్షితవీక్షా
దక్షిణసింహాసనేంద్ర దయితకవీంద్రా.
మత్తకోకిల.
ప్రాక్కుటీవిజటీనసాదరపద్మభూభుజగాదరా
ధిక్కృతార్యమహోభరాధరతీక్ష్ణఖడ్గరణోదరా
న్యక్కృతారిధరావరా దరహాసగమ్యసరాదరా
చొక్కనాథనృపాలసోదరస్ఫూర్తితామరసోదరా.
గద్యము
ఇది శ్రీకాళహస్తీశ్వరచరణారవిందమిళిందాయమానాంతరంగ జ్ఞానప్రసూ
నాంబికాకృపావలంబవిజృంభమాణసారసారస్వతసుధాతరంగ వెంగనా
మాత్యలింగనమఖివంశపావనవిరచితవిద్యాధిదేవతాసంభావన దక్షిణసింహా
సనాధ్యక్షతిరుమలక్షమాకాంతకరుణాకటాక్షలక్షితస్వచ్ఛముక్తాగుళుచ్ఛ
సితచ్ఛత్రచామరకళాచికాకనకాందోళికాదిరాజోపచార ధీరజనహృద
యరంజకవచోవిహారవల్లకీవాదనధురీణవర్ణగీతాదిగాం
ధర్వస్వరకల్పనాప్రవీణ కామాక్ష్యంబికానాగనకవి
రాజనందన కలితసకలబాంధవహృదయానందన
శ్రీకర కవితాకర సుకవిజనవిధేయ శ్రీకామే
శ్వరనామధేయప్రణితం బైనసత్యభామా
సాంత్వనం బనుమహాప్రబంధంబు
నందుఁ ద్వితీయాశ్వాసము.