Jump to content

సత్యభామాసాంత్వనము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సత్యభామాసాంత్వనము

తృతీయాశ్వాసము

     శ్రీశృతకరుణాశృంగా
     రాశ్రాంతసమగ్రగుణగణాలంకారా
     విశ్రుతకీర్తివిహారా
     యాశ్రితమందార ముద్దులళ్ఘరిధీరా.

తే. అవధరింపుము జనమేజయక్షితీశ్వ
     రునకు నావ్యాసమునిశిష్యుం డనియె నిట్లు
     పాళె మటువలె విడియించి ప్రౌఢి మించి
     పరిజనముతోడఁ బసిగాపు పాదుశాహు.

సీ. జాతిపచ్చలజోతి లాతిగాఁ జూచుమ
                    జ్జాతిపసరువన్నె రీతి సరిగె
     కుట్టునాశిపతిమె గుజ్జురాతివిళాతి
                    సకళాతిబిళ్లపొందికసరాతి
     యేకరంగిహొరంగు టింగిలీకపురంగు
                    లెనయుపగ్గపునిగ్గు లొనర లగ్గు

     నుగ్గడితపునిల్వుమగ్గపురుతకల్వు
                    పరఁగెడిపట్టుచాపలను బెట్టు
తే. చుట్టుఁ గనుపట్టు రతనాలకుట్టుపనుల
     టేకుకంబాలు పగడంపుమేకు లుదిరి
     కలశములపక్కిదొరడాలు కలికితావి
     మీఱి హొమ్మైన కుతినీగుడారులోన.

చ. మొదటిసరాతి దాఁటి యట ముంగలిగద్దియఁ గొంతసేపు స
     మ్మదమునఁ గొల్వుఁ జేసి మఱ మంత్రుల రాజులఁ బంచి యూడిగాల్
     యదుకులసార్వభౌమ జతనయ్య యనన్ వడి లేచి యావలన్
     గదియఁగ దూదిఁ బమ్మిన నకాసిగుడారునఁ జేరి యచ్చటన్.

చ. పరిపరిచాయలన్ సుళువుపట్టుతలాడయుఁ బక్కదిండ్లుఁ జే
     బెరయుతివాసులున్ బటువుబిళ్లలు సూరెపుటంపుపానుపుల్
     నెరజిగికుందనంబుహవణింపులయింపుల నింపుకెంపురా
     తరిమెనకోళ్ల నుల్లసిలు, దంతపుమంచముమీఁద వింతగన్.

మ. హవ ణొందం బవళించి యాయుధచయం బాచుట్టున బోడిగల్
     సవరించన్ గనుగీటి క్రొంజికిలిగా జాబాకుదా రొక్కప
     క్క వడిం బానుపుక్రింద నుంచి రహి నిక్కం జెంగటన్ నేస్తకాం
     డ్రు వసింపం బెదయూడిగా లెదుటఁ జుట్టుం గొల్వ నున్నమ్రుఁడై.

చ. పకపక నవ్వి సారెకొకపాటిగ మీసము దువ్వి యుస్సురం
     చొకపరి యూర్చి పక్క నగు నొంటిగఁ జెక్కిటఁ జెయ్యి చేర్చి యూ
     రక వెఱఁగంది చిత్తమున రాఁజినపూవిలుకానిబాణపున్
     సెకలకుఁ గుంది సత్యపయిఁ జెందిన మోహము మోహరింపఁగన్.

క. జిలజిల మనమున నొనరం
     జిలచిలకన్నీరు దొరఁగ సెక చిత్తముతో
     నిలుపోపక వల పాఁపక
     తలపోసెన్ సత్యరూపు తహతహ మీఱన్.

వ. ఇవ్విధంబున నవ్వివ్వచ్చుబావ జవ్వనిరూవు తలపోసి తలపోసి
     వాసి దొరంగి కరంగినమనసున నెవ్వగ నివ్వటిల్ల నివ్వెఱఁగు సంధిల్ల నవ్వ
     లివ్వలం బొఱలుచు నాఁపరానితాపరాశిం దెరలుచు నల్లనల్లన మెల్లమెల్లన
     నుల్లంబునఁ బల్లవించుతల్లడంబున నెల్లదెసలు నిరులుకొన మరులు కొనసాగ
     నీశ్వరాసాగరావారితంబగు [1]నీశిఖరిశిఖరభాగం బెక్కడ నాద్వారకాపురం
     బెక్కడ నే నెక్కడ నింతి యెక్కడ నీశైలంబునకుఁ బౌలోమిమగని
     జాలంబున నేల వచ్చె నీవలపుదండు నేలీల నెమ్మది నుండు నెపుడు నాతప
     ములు పండు నేవేళ లీలావతి నాప్రక్కలో మక్కువఁబండు నిండుపొగరున
     నున్నయన్ననఁబోఁడికి నెవ్వరు నాబన్నంబులు విన్నవించువారు వియోగం
     బేలాగునం గడతేరు నని తనుఁ దానె పలికిపలికి యులికియులికి తిగిచి కన్నుల
     మొగిచి యన్నువకలికిపై నెలకొన్న తనభావంబునకు దైవంబునకు వగచి
     వగచి యుడుగని వగ చిడిముడి గెడసి యెడనెడ యని నడగనియగు చిలుక
     నెడఁ గని పై నడరి పడంతిమగతుడుమువిడుములం బడ గడగడవడంకి వెడ
     వెడపడవందొడరుదురుసుతొగకరుసుదొరయరిమురిగరగరింగరువమున మురు
     వమరఁ బరిపరివిరిగొరక మరిమరి బరపి చిరచిర నెరపి దిరదిరం దిరుగ
     సరగున డిందినడెందంబునఁ గ్రందుకొనువెత చిందులసందులజబ్బువారమై
     యుబ్బుదీర వెఱచి మైమఱచి తోన [2]తెలిసి సొలసిసొలసి యలసియలసి
     మిసమిసనొసయ నొసపరి పసరుచెంగావిరంగున కుదురుకొన కట్టువన్నె
     జంటకుట్టునుదురుతెరపి రుమాలతోడ జాఱుసిగ వీడ బావిలీముత్తియం
     బించుకించుక తొలఁగియాడ మెెఱుంగుబంగారుదుప్పటి జాఱ మే నెల్లఁ
     జెమట లూర నంగాంగములబలిమియెడల ముంగామురము చేసరము సడల
     నురమునందుఁ దగుహురుమంజిముత్యాలతావళంబులు కగ్గ నుల్లాసంబు తగ్గ
     నుల్లంబునఁ దలంపులు నెగ్గ డగ్గఱి తివాసుల నున్నమన్ననచెలికాండ్రతో
     మందలించిన నంద ఱేమందురో యనుచింత నోహటిల్లి కొంతయూరడిల్లి
     యాత్మగతంబున.

మ. మెలతల్ నాజయయాత్రలోఁ దమకుఁ దామే యాడుకోఁ జూడఁగాఁ
     దెలి సాలోననె చిన్నవోయి తమి చింతి ల్లింత నంతంతఁ దాఁ

     బలుక న్వచ్చి భయంబు సిగ్గు జమిలింపన్ ఱెప్ప లల్లార్చి చూ
     పులపై దేర్చినముద్దరాలితరితీపు ల్దెల్ప శక్యంబులే.

చ. కులుకుమెఱుంగుగబ్బివలిగుబ్బ లురంబున నాని కిన్కచేఁ
     బలుకుట మాని పాదములపై బడి దిగ్గన లేచి బాష్పముల్
     దొలఁకఁగ వెంట జంట ననుఁ దోఁకొనిపోయినఁ గాని తాళ నం
     చెలమిని విన్నవించు చెలి, నేటికి నాటికిఁ గ్రమ్మఱించితిన్.

చ. ప్రమదలు లేనిచో మనసు రాయి గదా మగవాని కంచు నే
     రములు దలంచ కంచు నను గ్రక్కున నక్కునఁ జేర్పుచున్ గ్రమ
     క్రమమున వత్తు నన్నగమ్మకంబును లోఁ దమకంబు హెచ్చఁగాఁ
     గుములుచునున్న యాకొమెరకొంకు దలంకును నెన్న శక్యమే.

ఉ. వైరుల గెల్చి నే మరలివత్తు ననన్ బొటవ్రేల నేలపై
     గీఱుచుఁ దారుచుం దలుపుక్రేవల నావల నిల్చి పొ మ్మనన్
     నో రొకయింత రాక దయఁనూల్కొని దీవెనవీడె మిచ్చి క
     న్చూఱలుగొన్న యాముగుదసోయగ మేయుగమందుఁ గందునో.

సీ. గజకేతువాతసంగతిని సేనలదుమ్ము
                    లెరలంగ నెపుడు నేఁ దిరిగిచూతు
     వెన్నానికొనివచ్చు మన్నీ ల్పరా కనఁ
                    దిరుగుచో నెపుడు నేఁ దిరిగిచూతు
     మావంతు వెడలించు పూవుతోరణముల
                    సరణి నే నెప్పుడు తిరిగిచూతు
     గవను లడ్డము దేరి యవలఁ బో బయ లాని
                    తేఁకువ నెపుడు నేఁ దిరిగిచూతుఁ
తే. బయనమై తేజి నెక్కి నే బయలుదేఱి
     కనకసౌధాగ్రములకూకికవలగూళ్ల
     యిండ్లకడ నెక్కి సోరనగండ్లచక్కి
     శకునములఁ గోరుదయచూపు సకియచూపు.

క. చూచిన నన్నను మనసునఁ
     జూచుటయే కాక పోయి చూచుట యెపుడో
     యాచంపకాంగికైపులు
     నాచూపు మెఱుంగుకోపు లానగువైపుల్.

ఉ. దానిహొరంగు దానిజిగి దార్కొనుచెక్కులరంగు దానినె
     మ్మేనినలుంగు దానితొడమించుబెడంగును దానినవ్వుపు
     వ్వానమెఱుంగు దానిబిగివట్రువగుబ్బలపొంగు నెంచినన్
     మానస మయ్యయో మరునిమాయలఁ జొక్కెడి నేమి సేయుదున్.

సీ. పక్కవాటుగఁ గొంత పడ కిచ్చి తమి నెచ్చి
                    కసివోక లె మ్మని కొసరునేర్పు
     ఉబికి పెందొడ లెక్కి యుదుటు గన్పడ నిక్కి
                    యొడికట్టు గదియించు నుబ్బరంబు
     ముద్దిచ్చి లాలించి మొనగుబ్బ లానించి
                    [3]బిఱబిఱ గమకించు నెఱతనంబు
     పొగ రాని తెగఁబూని పొగడపూవిలుకాని
                    [4]జోడన ల్గొనియెడి కోడిగంబు
తే. కరఁగి కరఁగించి రతులయక్కఱలఁ గెరలి
     తనిసి తనియించి చెమటచిత్తడిని దడిసి
     సుడిసిపడి చల్లఁగా వ్రాలుసుదతిమేలు
     మఱచెద నటన్న నిఁక నేను మఱవలేను.

ఉ. కొప్పునఁ బూలు చెక్కి వెడకోపము దీరఁగ మ్రొక్కి తేనియల్
     చిప్పిల మోవి నొక్కి నునుచెక్కిలి ముద్దిడి తక్కి వేడుకల్
     చొప్పడ నొక్కి చక్కి తమిఁ జొక్కి కవుంగిటఁ జిక్కి చక్కి యా
     యొప్పులకుప్పచొ ప్పెఱిఁగి యూరటఁ దేరుట లింక నెన్నఁడో.

క. కాంత చిఱుప్రాయమున నే
     నంతిపురిం జేర నరుగునప్పుడు తా నా

     యింతులకన్నను ముందుగఁ
     బంతులు మెఱయంగ వచ్చి పైఁబడు వేడ్కన్.

చ. మొలకమెఱుంగుచన్ను లురముం గదియించి తొడ ల్గళంబు చే
     తులఁ గొని గ్రుచ్చి యెత్తి దయతో మరునిల్లు మొగంబు నాభియున్
     సొలయుచుఁ బ్రేమదొట్టి మయి జుమ్మన ఘమ్మన ముద్దు వెట్టి వే
     తలి మము నుంచునాసొగసు తన్వి తలంచునొకో తలంచదో.

సీ. మిన్నఁబాఱిననాఁడె మేలుమే లుదయించెఁ
                    దిన్నె లెత్తిననాఁడె వన్నె మించె
     మొగ్గ గట్టిననాఁడె మోహంబు పచరించె
                    మొనలు చూపిననాఁడె ముద్దు గాంచె
     బటువు మీఱిననాఁడె దిటముగా గమకించె
                    నునుపు గాంచిననాఁడె ననుపు మించె
     వ్రేఁకమై తగునాఁడె డాక మై సవరించె
                    జోడైననాఁడె మెచ్చులు ఘటించె
తే. మగువపాలిండ్లతోడ నామనసు చూడ
     నింతయై యంతయై మఱి యెంత యగుచుఁ
     గంతుసామ్రాజ్య మేలంగఁ బంతగించె
     నాకలికిపొందు నే నెట్లు లేక యుందు.

సీ. నునుసరాతిగవాక్షులన వచ్చుజాబిల్లి
                    యుడుకుచేతులకుఁ జే యొడ్డియొడ్డి
     సలిగటాకునఁ గ్రమ్మువలిగాలిమొలకల
                    యుద్దవళ్లకు మూల నొదిఁగి యొదిగి
     ప్రక్కనుంచుకయున్న బాకుదారిజవాది
                     కావలిమోముగా నళికియళికి
     దేరీజలో గుమ్మితీమేలుకట్టు పు
                    వ్వులకుమ్ముదుమ్ముల కులికియులికి

తే. కలికి తలపోసితలపోసి కడఁకఁ బాసి
     పలికి యళికరములహళాహళికి నళికి
     మేనిగాసికి వెత లూఁది దానిమీఁది
     దయ యెటుల దాఁతు నెటుల నే దండు సేతు.

సీ. అలవోక కువిదయందెలపల్కు వినవచ్చు
                    దడవుగా విన్న నిల్కడకు రాదు
     నిలిచిచూచిన బోటినెమ్మేనిజగి దోఁచుఁ
                    గనుఱెప్ప లల్లార్పఁ గానఁబడదు
     కోరినప్రోయాలిగుబ్బ లురము సోఁకుఁ
                    దాళి చే నంటినఁ దగుల వేమొ
     యాగుబ్బుగాఁ గొమ్మయంగవాసన వచ్చు
                    నాఁగి మూర్కొన్నచో నటమటించు
తే. నేపునను గ్రోల సఖమోవితీపు సోఁకు
     మరలికొన నాల్కఁ జెనకిన మాయ మగును
     మోహభారంబొ విరహంబొ ముమ్మరంబొ
     యే మని తలంతు మదిలోన నింతిరంతు.

ఉ. ఇంతకుఁ దెచ్చెఁ గంతుఁ డిఁక నెంతకుఁ దెచ్చునొకో వసంతుఁ డా
     వంతయుఁ దాళలే నిపుడు నంత తనంత దురంత మయ్యె లోఁ
     జింత నిరంతరం బటులు చింతిలిచింతిలి కాంతలీలఁ దా
     నెంత కృశించెనో మగువ యెంత తపించెనొ యేమి యెంచెనో!

చ. కల గనినట్టు లయ్యె నల కల్కివిలాసము దాని కళ్కి య
     చ్చెలిని దలంచ నట్టిదయ చిల్కినబల్కినఁ మెచ్చుకొందు లోఁ
     గలఁగితి బేలపోల్కి నల కామునిముల్కికి నుల్కియుల్కి యా
     చిలుకలకొల్కి యెన్నటికిఁ జిత్తము రంజిలఁజేసి యేలునో.

క. పడవకయి వచ్చి యిడుమలఁ
     బడవశమా తియ్యవిల్తుపడవాల్ వగచే

     జడిసె మది తడసెఁ గోరిక
     లెడసెన్ చంద్రునికి మాకు నే మందు నయో.

ఉ, చక్కిలిగింతజోకలకు సారెకుసారెకు నవ్వఁబోక యే
     మొక్కలివీఁకచే నపుడు ముద్దులు వెట్టిన లోనుగాక తా
     మక్కువఁ జూపరాక తొలుమాలిమిమేలిమి లేక గోరునన్
     పొక్కిలి నొక్కనీక చలపోరు నొయారిని జేరు టెన్నడో.

ఉ. ప్రాణుల కెల్ల లోకమునఁ బ్రాణమె హె చ్చగు నేణనేత్ర యా
     ప్రాణముకన్న హె చ్చిటులు ప్రౌఢి వహించినవన్నెలాఁడి నా
     ప్రాణము కావఁగోరి కద భావమున న్నెలకొన్న దైన నా
     ప్రాణము ప్రాణనాయికను బా సిట నిల్చుట పాడి యౌనొకో.

సీ. చక్కెర యన్నింట జాణ నిద్దాహోంత
                    కారి కురుజుతేనెగరిగె పచ్చి
     కస్తూరివీణె బంగారుతీఁగె యొయారి
                    జీవరత్నము రామచిలుక కన్నె
     లేడి కలికి వన్నెలాఁడి చిత్తరుబొమ్మ
                    కులుకులగని ముద్దుగుమ్మ కమ్మ
     జాజితేజీకూన చక్కఁదనమ్ముల
                    యిక్క తళుక్కనుచుక్క మరుని
తే. ఢక్క సురతపుసుల్తాని చొక్కు మందు
     బరణి లేగుజ్జుమామిడిపండు మెఱసి
     నిలుచుక్రొమ్మించుమురువు పన్నీటిచెఱువు
     దాని నెడఁబాసి యీవేళఁ దాళఁజాల.

క. అని చింత చేసి వింతగ
     దనుజాంతకుఁ డంత నమ్మి తనమానసమం
     దునఁ గొలుఁ వుండెడిచెలిఁ గని
     కనికరమునఁ బల్కె నేస్తకాండ్రు వినంగనన్.

ఉ. నమ్మితి నీపదమ్ములు మనమ్మునఁ గ్రుమ్ముదుఁ గమ్మతమ్మివిల్
     రెమ్ముచుఁ గమ్మవిల్తుఁడు మరీమరి గ్రుమ్మిన సొమ్మసిల్లితిన్
     ఘమ్మన వీడియం బొసఁగి గ్రక్కున నక్కునఁ జేర్పరాదటే
     కొమ్మ యదేమి నీకరుణఁ గోరక యూరక యుండనేర్తునే.

క. నేరక యీవిధమున నే
     నూరక యుండఁగ నయో వియోగంబున నే
     కోరక నీ వెటు లుండెదు
     వారకమా మనలవలపు వనజాతముఖీ.

చ. కెల సొకమాట దీసి గిలిగింతలు రంతుల నుబ్బఁజేసి మై
     యలఁతలు దీర డాసి బిగియారఁ గవుంగిటఁ దోసితోసి కన్
     గొలుకులు దేలవ్రేసి తమిగుబ్బతిలం జెయివేసి యుండుటల్
     తలఁచిన గుండె ఝల్లుమని తా నదరీ బెదరీ తలోదరీ.

సీ. ఊడిగంబులు చుట్టు నున్నారు గాని యో
                    యతివ నీచెలి యొక్కతైన లేదు
     సరిగెకుట్టునకాసుతెర యున్నదే కాని
                    రమణి నీసరియైన ప్రతిమ లేదు
     కలువపూవులమేలుకట్టు లున్నవి కాని
                    సుదతి నీయరచొక్కుచూపు లేదు
     రుటమైనహొంబట్టుబటువు లున్నవి కాని
                    వనిత నీచంటిగుంపెనలు లేవు
తే. ఏమి సేయుదు నే మందు నెచట నుందు
     నెవ్వరిని వేఁడుకొందుఁ బొం దెందుఁ జెందు
     వంత యెద మెండుకొనునట్టివట్టిదండు
     చేయఁగా వ్రాసెఁ దలవ్రాఁత చెనటిధాత.

చ. మరురణమందు నెగ్గి మును మంచము డిగ్గినఁ జేతివల్వ నే
     దురుసున రెమ్మినం గినుకతోఁ గని నాతొడ వ్రాలి దుప్పటీ

     చెఱఁగున మేను గప్పుకొని చింతిలి [5]నావదనంబుఁ జూచి క్ర
     మ్మఱ నగి యార్చునీసొగసు మానిని యింకొకనాఁడు గల్గునే.

సీ. పూపచన్నులు కేలఁ బుణికి పట్టెడువేళ
                    నదరంటఁ గొనగోట నదుమ వెఱతుఁ
     జక్కెరకెమ్మోవి చవిఁ జూచుతఱిఁ దావి
                    చొక్కుచు మొనపంట నొక్క వెఱతుఁ
     గులుకు పుట్టఁగఁ గొంత కొనగోర గిలిగింత
                    తనుపుచో మర్మముల్ చెనక వెఱతు
     నలమి పే రెద నుంచి యాదరింపుచు మించి
                    బిగియారఁ గవుఁగింటఁ బెనఁగ వెఱతుఁ
తే. బరువము లెఱింగి యీరీతి వెఱచివెఱచి
     సేవఁ జేసితి నింక నీచిత్త మెఱిఁగి
     కొలుతు దయఁ జూడు రసదాడివిలుతుచేతి
     తలిరు జముదాడి క్రొవ్వాఁడితలిరుఁబోఁడి.

మ. కుచము ల్చేతులు వియ్య మొందఁ బులక ల్గుల్కొంద నందంద చే
     రుచు మైఁ జీఱుచుఁ గన్యరో మనము నేర్పుల్ చెందఁ బూల్చింద నా
     న చెలంగన్ మది పొంగఁగా నెదురుమంచా లెక్కి. యుయ్యాల లూఁ
     గుచుఁ బై నాగుచుఁ బల్మొన ల్మడుపునొక్కుల్ టెక్కు లిం కెన్నఁడో!

చ. వికచపయోజనేత్ర యొకవేళల నెమ్మెయి జుమ్మనంగ నే
     రక తమి సందు జీర నడవ్రాలుచు సోలుచుఁ బ్రేమఁ దేలుచున్
     పకపక నవ్వి కే లొడసిపట్టుచుఁ దిట్టుచుఁ జెక్కు గొట్టుచున్
     చికిలికడానిపైసరము చేసిన దెం తని చింత చేసెదన్.

క. అది సొగ సౌ నది మన సౌ
     నది నయ మౌ నదియె తాళు మది నిలుకడ యం
     చెదురెత్తుచుఁ దమి హత్తుచు
     ముదితా నీ వెపుడు సురతమున మెచ్చెదవో.

సీ. కాపురం బాద్వారకాపురవర మయ్యు
                    నునికి నీరతనంపుమనికి యయ్యె
     గీము నీపడకింటిమోముమేడల నయ్యు
                    గావు నీచనుదోయితావు లయ్యె
     నిమ్ము నీమెయితావి గ్రమ్ముమాళిగ యయ్యుఁ
                    బజ్జ నీవు వసించుసెజ్జ యయ్యెఁ
     దావలం బెన్న నీకేవలాదృతి యయ్యు
                    నెళవు నీనునుఁజూపుసుళువు లయ్యె
తే. వెలఁది దైవంబు మాయ గావించి మించి
     పడవగొడవలు దలపెట్టి కడఁక పుట్టి
     యట్ల నను వీడఁజేసిన యందువల్ల
     గటకట బిడారుగా నయ్యెఁగా గుడారు.

సీ. అయ్య పళ్లెము వెట్టి రని పల్కు నొక్కర్తు
                    వనిత కాచుకయున్న దను నొకర్తు
     పాలును రసదాడిపం డ్లిడె నను నోర్తు
                    ననపాన్పు హవణించి రను నొకర్తు
     ముడిపూవులును గందవడి యుంచి రను నోర్తు
                    విను నడురే యాయె నను నొకర్తు
     విద్యల నెందాఁక వినుబాళి యను నోర్తు
                    మన సెక్కడను సామి కను నొకర్తు
తే. పరిజనుల నిండ్ల కనుపఁగాఁ బలుకు నోర్తు
     తనర వరుసలు దెప్పించు మను నొకర్తు
     నందు హెగ్గడికత్తె లి ట్లందు రిందుఁ
     జెలియ మగకాపురం బెంత చేసెఁ జింత.

సీ. తమలంబుమార్పులతమి యుబ్బు గెరలించి
                    చూపుమార్పులను గచ్చుల నటించి
     తొడుకుచేమార్పుల దుడుకులు పచరించి
                    తొడసందుమార్పులు గడిమి నించి

     మోవిమార్పులఁ గొన్ని ముద్దులు హవణించి
                    ప్రక్కమార్పులఁ గొంత టెక్కు మించి
     కౌఁగిటిమార్పుల గమకముల్ పుట్టించి
                    పడకమార్పుల నిండుకడఁక గాంచి
తే. చేరిమఱి కేరజమ్ములఁ గేరి తూరి
     తూరి యొకదారి బకదారిదారి మీఱి
     యులికి పల్కుచు మన మపు డున్నవితము
     మదిఁ దలఁచ గుండె యదరీని మరుపఠాణి.

ఉ. పుత్తడిబొమ్మ నీవు సురపొన్నలపొన్నలపూలు గోయఁ జే
     యెత్తిన గుబ్బ యుబ్బునపు డే నదుమన్ వడి నుల్కి కుల్కుతో
     నుత్తర మీక నెచ్చెలియ లున్నెడ కేఁగుచు వారితోన చే
     యెత్తఁగ నీదుతే టచట నేమొకొ యంటి వ దిప్పు డెన్నెదన్.

క. ఎంత నుతియింతుఁ గలలోఁ
     గాంతును గమకింతు వేడ్కఁ గాంతును మఱి మే
     ల్కాంతుఁ బలవింతుఁ గాఁగాఁ
     గంతునిచే రంతు తాళఁగలనా లలనా.

సీ. గబ్బినున్చనుదోయి గజనిమ్మపం డ్లొత్తి
                    తనుగతాశ్రమవారిధార లెత్తి
     కమ్మనివీడెంపుకవణంబు హత్తించి
                    యెలనవ్వుచలువపొత్తుల బిగించి
     పచ్చగాజులడాలు పసరారఁ బట్టించి
                    లలితసంకుమదతైలంబు నించి
     రహి మీఱఁ జూపుకప్రపువత్తు లెనయించి
                    పదము లత్తుకజోకపట్టు పూన్చి
తే. యెమ్మెతోఁ గ్రమ్మి వలరాచకమ్మతమ్మి
     గుమ్మితీగమ్ముఱొమ్ముగాయమ్ము మాన

     మానవతి! వెజ్జుతన మీవు పూన కున్న
     నిలువరింపదు ప్రాణమ్ము నిజముసుమ్ము.

తే. ఇంతి లోఁజూపు నిల్పి ని న్నెంచియెంచి
     యుసురు మని యాఁచి వెతఁ దల యూఁచియూఁచి
     కాంచి శృంగారదేవతగాఁ దలంచి
     నోమి నను లూటి చేసెద వేమి బోటి.

క. నిను నేఁ గలయం గోరఁగ
     నను నీ వెడబాఁసి యుంట నాయం బగునే
     తనువులు వేఱైనను మన
     మనసులు చెలి యేక మగుట మఱచితి వేమే.

ఉ. ఏమని హెచ్చరింతు నిఁక నెంతని కంతునిబాము లెంతు నా
     యామనిచేతిరంతు లహహా యెటు లాత్మ గణింతు నీదుపొం
     దేమఱినట్టు లయ్యె మది నెంతయు వింతలు సేయుచున్నవే
     తామరసాక్షి! యక్షులకుఁ దావకరూపవిలాససంపదల్.

సీ. వింతవింతగ నావులింతలు గ్రమ్ముచో
                    మొలనూలిగంటలు పలుకరించుఁ
     గోర్కులు తెరలెత్తి కొనసాగి క్రమ్ముచో
                    గుబ్బలహారముల్ గులుకరించు
     సెక దీర ఱెక్కలు ముకుళించి క్రమ్ముచో
                    తళుకుగాజులనాదు తొలకరించు
     నరగంట నంటి నిద్దురమబ్బు గ్రమ్ముచో
                    నులుకుపల్కుల మేను పులకరించు
తే. నించుతమి మించువెత యగ్గలించురుటము
     దిటము చలియించుఁ జెలికోర్కె పుటమరించు
     దేవురించును మది చూపు జేవురించు
     నెటులు వేగింతు నెటులు నీనటలు గాంతు.

క. వేసరి నీవిరహంబున
     వేసవికిం జిక్కుతరువువిధమున నిపు డ
     య్యో సోమరినై స్రుక్కితి
     నీసారదయారసంబు నించవె చెలియా.

సీ. ఉవిద నీకెమ్మోవిచవులెంచి చవు లెంచి
                    కండచక్కెరమీఁదఁ గసరు పుట్టె
     వెలఁది నీమాటలు వివరించి వివరించి
                    జుంటితేనియమీఁదఁ గంటు దోఁచెఁ
     బడఁతి నీపాలిండ్లు పరికించి పరికించి
                    దాలిమ్మపండ్లపై బాళి దొరఁగెఁ
     దరుణి నీచిఱునవ్వు తలపోసి తలపోసి
                    యారఁగాఁగినపాలు నరుచి మించి
తే. జలజలోచన నీమేను తలఁచి తలఁచి
     యపుడు చిలికినవెన్నపై హవుసు మానె
     నొక్కదిన మొక్కయుగముగా నున్న దైన
     నేల నామీద ననఁబోఁడి యింత మోడి.

సీ. మొక్కలిదొరలచే మ్రొక్కించుకొనువాఁడ
                    ముగుదరో నీకు నే మ్రొక్క నెంతు
     గడిమన్నవా రూడిగము సేయఁదగువాఁడ
                    నువిద నీపాదంబు లొత్త నెంతుఁ
     బరులచేఁ గాళాంజి పట్టించుకొనువాఁడ
                    భామ నీతమలంబుఁ బట్ట నెంతు
     నరులచేఁ బావడల్ హవణించుకొనువాఁడ
                    వెలఁది చేలను నీకు వీవ నెంతు
తే. నొడిసి మరునంపఱలచేత మిడిసిమిడిసి
     తడసి ధైర్యంబు నిలుపఁబో కెడసియెడసి

     యడసి యే నిన్నుఁ జేరమి జడిసిజడిసి
     పడఁతి యీతేవ మది లజ్జ విడుపుఁ జూప.

సీ. పసిఁడికుండలు గాంచి పాలిండ్లుగా నెంచి
                    పదరి చేతులకొద్ది నదుమఁబోదుఁ
     గెంపుబేసరి గాంచి కెమ్మోవిగా నెంచి
                    మొక్కంట మునిపంట నొక్కఁబోదుఁ
     జీనియద్దము గాంచి చెక్కిలిగా నెంచి
                    ప్రేమ మీఱఁగ ముద్దుఁ బెట్టఁబోదుఁ
     గమ్మతామరఁ గాంచి నెమ్మోముగా నెంచి
                    మనసారఁ దావి మూర్కొనఁగఁబోదు
తే. నిలిపి పలికెడుస్వరకూకిమెలుపు గాంచి
     వలచి మణితంబుగా నెంచి పలుకఁబోదు
     నింతి నీమాయొ మరుమాయొ యెఱుఁగలేక
     యకట యీరీతి బ్రమసి నే వెకలినైతి.

మ. వనితా ముత్తెపుపంటివింటిమొగలీవజ్రీఁడు హా యంచుఁ గ్రొ
     న్ననలేఁదేనియబేజుమాల్ చిగురుఖండా గుమ్మి యొక్కుమ్మడిన్
     కనుఱెప్ప ల్ముకుళింప డెంద మదరన్ కంపంబు పై నొప్పఁ బ
     ల్క నగన్ మేల్కనఁ జూడఁగూడక రసాలం బంటి కేల్ ముట్టితిన్.

మ. కడకంటన్ ననుఁ జూచి యేచి మది కాఁకల్ దీర్చి మన్నింపవే
     గడెసే పైనను తాళఁజాలఁ జెయి సోఁకన్ తగ్గు నీసిగ్గు నీ
     తొడనిగ్గుల్ నడజగ్గు నావలపు దంతుల్ వెట్టు నీగుట్టు నీ
     యొడికట్టున్ జనుకట్టు నెంచి మిగులానుప్పొంగెడి న్వేడుకల్.

క. [6]అటమీఁదటిదుర్దశ నే
     నెటువలె వివరింతు నీరజేక్షణ నీవే
     దిట మొనరింపక యుండినఁ
     గటకట నా కెవ్వ రింకఁ గాఁగలవారల్.

సీ. ప్రక్కలోఁ బవళించి పదము పై హవణించి
                    యచ్చోటు గదియించి హౌసు మించి
     జిగిగుబ్బ లానించి బిగియ సం దొనరించి
                    పెదవి కెంపులు నించి బెద రణంచి
     మో విచ్చి తేలించి ముద్దాడి లాలించి
                    ముందుగాఁ గదియించి మోహరించి
     యలసి నీ వలయించి చెలఁగి న న్నెలయించి
                    పుంభావ మొనరించి బుజ్జగించి
తే. వేగ నభిముఖివై తోన విముఖ మగుచు
     భ్రమణ మొనరించి రమణఁ బరా కటంచు
     మురువుతో వ్రాలి నీమేనియొరపు లెల్ల
     నింక నొకసారి దయసేయవే యొయారి.

క. ఉమ్మలిక మయ్యెఁ జామా
     కొమ్మా లతకూన ముద్దుగుమ్మా నారీ
     నమ్మితిఁ బల్కు మొయారీ
     యి మ్మగునామీఁదిప్రేమ యేమాయె నయో.

సీ. చల్లఁగా మనసు రంజిల్లఁగా నీచేత
                    వెలఁదిరో యెపుడు నే వీణె విందుఁ
     బొందుగా వీనులవిందుగా నీచేతఁ
                    గలికిరో యెపుడు నేఁ గథలు విందుఁ
     దేటగాఁ దేనెచిట్టూటగా నీచేత
                    నతివరో యెపుడు పద్యములు విందు
     హరువుగా బకదారిమురువుగా నీచేతఁ
                    గొమ్మరో యెపుడు పల్కులను విందు
తే. ననికి దళకర్త నంపక యకట నేనె
     యేల వచ్చితి వచ్చినయింతి నిన్నుఁ

     దోడితేనట్టి ఫలము దోడ్తోన కలిగె
     నెటులు నేఁ దాళి భరియింతు నీవిరాళి.

క. అన విని చెలికాం డ్రందఱు
     ననునయవచనముల నించి యలరించి భయం
     బు నయంబు దగన్ ఫణిశా
     యిని కలవింకుండు వినఁగ నిట్లని రంతన్.

సీ. మెరవడిగా నీతిసరళిఁ దెల్పెడుమంత్రి
                    జనులతోఁ గార్యయోజనలు లేక
     రాయసమ్ములవారు ప్రౌఢులై వినుతించు
                    దినసరివక్కణల్ వినుట లేక
     యెలమిని ముందుగా దళకర్తలను బిల్చి
                    యట నిటఁ బంపువెట్టుటలు లేక
     బలిమిగా నుండునుక్కళమువారికిఁ దెల్పు
                    టకు వేత్రులను పంపుటలును లేక
తే. వృష్టిభోజాధివిభునిబిరీస మైన
     శిబిర మొనగూడఁ జతురంగసేనతోడ
     నెంతయును హెచ్చి యసురపై నెత్తి వచ్చి
     కటకట మిటారిఁ దలఁతురా కంసవైరి.

క. వలచినవారలు లేరో!
     వలపించివారు లేరొ! వనితల నిట్లా
     తలంచుకొని సమరముఖమునఁ
     బలవించినవారు గలరె పద్మదళాక్షా?

ఉ. చూడక చూచినట్లు తమిసోలుచు సొక్కుచు మోహ ముంచి మా
     టాడక యాడినట్లు కలయన్ గమకించి మదిన్ గణించి యా
     చేడియతోడిలోక మయి చింతిలి కార్యము నెంచకుండుటల్
     పాడియె తెల్పుమా దయితపాండవ కాళియమౌళితాండవా.

సీ. అంగనామణి యైన యల్లరుక్మిణి యుండ
                    యువతి యైనట్టిజాంబవతి యుండ
     నసమానలక్షణ యల్లలక్షణ యుండ
                    గాంత యైనట్టిసుదంత యుండ
     [7]సువచోభినందన సూర్యనందన యుండ
                    నందగత్తియ మిత్రవింద యుండ
     ననిశసేవోన్నిద్ర యగుభగ్ర యుండంగ
                    నాధాశయజ్ఞ యౌ రాధ యుండ
తే. మఱియు వేవేలగరితలు మానవతులు
     స్వామినగరను గల రైన నారిలోన
     నెవ్వతెఁ దలంచ కయ్యయో గవ్వ యైన
     సత్యఁ దలపోసి చాలవాచార నేల.

మ. అప్పుడే సామివెంట నమరారియొనర్చురణంబుఁ జూడఁగాఁ
     గప్పురగంధి వత్తు నన గ్రక్కున రమ్మన కింకి నీడ కీ
     విప్పుడు రాఁదలంచితివి యేతయుఁ బూవిలుకాఁడు మాయచే
     గప్పుచు [8]గప్పుచి ప్పనుచుఁ గల్వలకోరులు కుప్పళించినన్.

సీ. వెలఁదివాతెర యానువితముగా నీమోవి
                    నీవె యానుచు గ్రుక్క నించుసొక్కు
     తరుణిఁగౌఁగిటఁ జేర్చు హరువున నీఱొమ్ము
                    నీవె కౌఁగిటఁ జేర్చు నిండుతక్కు
     అతివకాళ్లకు మ్రొక్కునట్లు నీపదముల
                    నీవె వ్రాలుచు నంటునీటు మ్రొక్కు
     పడఁతిచెక్కులు చీరువడువున నీచెక్కు
                    నీవె చెనక గోర నినుచునెక్కు
తే. నిందుముఖి సందుచేసిన యంద మొంద
     నీతొడలు నీవె కదియించు నేర్పుటెక్కు

     నిక్కువంబుగఁ గంటి మెందేనిఁ జూడ
     మవని నీ కేటిశంక యాదవశశాంక.

సీ. సుదతిగుబ్బలమీఁద సుఖయింపుచుండఁగాఁ
                    దెలిరైక తప మెంత సలిపెనొక్కొ
     తరుణితొడలమీఁద మెఱయుచునుండఁగాఁ
                    బావడ యేపూజఁ బ్రబలెనొక్కొ
     పొలఁతిమే నెల్లఁ గప్పుక యుండఁ జెంగావి
                    చీరె యేపుణ్యంబు చేసెనొక్కొ
     యువిదవాతెర నాని యుండంగ ముక్కఱ
                    నునుముత్య మేనోము నోమెనొక్కొ
తే. రమణఁ దనమీఁదఁ బొరలుకుంకుమపుఁబఱపు
     బళిర యెంతటిభాగ్యంబుఁ బడసెనొక్కొ
     యనుచు నేవేళ నో రెత్తి యఱచె దేల
     యకట చెలిపొందు గోరి మోశకటవైరి.

సీ. బలిమిచేఁ గే ల్తనపాలిండ్ల నుంచుక
                    లేమ కుల్కుచు నెడ లేక యున్న
     మఱి పంటఁ దెలనాకుమడు పందుకొ మ్మని
                    యుత్పలేక్షణతోడ నుండ కున్నఁ
     దెలిచల్లడముమీఁదిమొలకట్టు నిమురఁగా
                    నరచూపుతో నింతి మురియ కున్న
     జన్నులపై పైఁట జాఱఁగా నెడ వ్రాలి
                    హరిణాక్షి యపుడు మై నొరయ కున్న
తే. నునుసుళువుదండిసూరెపానుపునఁ బండి
     యూరకే మేలుకొని యుండి యుండలేక
     భామ యోరామ యోసత్యభామ యనుచు
     గలువరించెద వేమి యోకొలముసామి.

క. చెలువం దలంచ బవరము
     చెలు వంతయు నిలిచె గోపశేఖర తోడ్తో
     వలవంత నీదుమదిలో
     బలవంతం బయ్యెఁ గంతుబవరములేమిన్.

ఉ. తిన్ననిమోవి విం దొసఁగి తీరుగ గుబ్బలజోడు దార్చి యా
     యన్నులమిన్నఁ జేర్చి తన యంగబలంబునఁ గూర్చి యార్చి ని
     న్నన్నిట సేదదేర్చి నగి యందపుజంకెనచూపుకోపులన్
     మన్నన సేయకున్న వసమా యసమాయుధుబారి గెల్వఁగన్.

చ. వనజదళాక్ష నీమనసు వచ్చినయ ట్లవుఁగాక నిన్నుఁ గా
     దనియెడువారమా కలికి యందఱలోఁ దరితీపులాఁడి లోఁ
     జనవరి మాటకారి కనుసైగల ని న్వలపించుబాల యా
     వనితను బాసి తాళఁగలవా యలవా టటువంటిదే కదా.

ఉ. అజ్ఞత మున్ను నే మెఱుఁగకాడుట కోడుటగాఁ దలంచు స
     ర్వజ్ఞుఁడ వీవు లోకమున స్వామి యెఱుంగనికార్య మేమి నీ
     ప్రజ్ఞకు శేషుఁడైన సరిరాఁ డటు గావున మార్గమందు నీ
     యాజ్ఞలు హెచ్చ నిచ్చటికి నాసతిఁ బిల్వఁగఁబంపు మింపుగన్.

క. చెలిఁ బిలువఁబంపవలె నను
     చెలికాండ్రను చూచి సన్న సేయుచు వగగా
     నలపంకజనయనునితోఁ
     గలవింకుం డనియె హాస్యకలనం బెసఁగన్.

క. నలినాక్ష విరహ మనఁగా
     నలుపో తెలుపో యి దేటినటనలు బళిరా
     నలుపైన జీఁక టేదియొ
     తెలు పైన న్వెన్నె లేది తెలి సిటు చెపుమా.

క. మామగువ నెపుడు దలంచిన
     మామది నొకచింత లేదు మాకున్ మీకున్

     కాముఁడు వే ఱాయెనొకో
     భూమిని గంసారి యిన్నిబూమెలు గలవే.

క. మదిరాక్షి పేరు నుడువకు
     మొదటన్ రుక్మిణియు వినిన మోసం బగుఁగా
     యదె ప్రద్యుమ్నుఁడు వచ్చెను
     పదిలము పదిలంబు వికచపంకజనయనా.

సీ. చామ యంటివ దేమి సామి చేలను గాక
                    చామ యీశిబిరంబు చాయఁగలదె
     లతకూన యంటి శ్రీపతి తోఁటలోఁ గాక
                    లతకూన పటకుటీవితతిఁ గలదె
     కొమ్మ యంటివి హరి కుజములందునె కాక
                    కొమ్మ యాయోధనక్షోణిఁ గలదె
     [9]నారి యంటి వదేల శౌరి వింటను గాక
                    నారి నాసీరకోణమునఁ గలదె
తే. ముద్దుగు మ్మంటి వది యేమి ప్రొద్దు పోదె
     మొదవుచంటను గాక యిం దొదవ దరుదు
     చెంద మాటాడుదురె యిట్టిమందెమేల
     మందమా చందమా గొల్లచందమామ.

సీ. ఏసాధ్వికోసమై యిలను సత్రాజిత్తు
                    గుట్టు పోనాడినతిట్టు గలిగె
     నేపుణ్యవతి నెంచఁ బృథ్వీశ్వరులలోన
                    నెలుఁగురాయల పట్టి నేల వలసె
     నేభాగ్యవతిఁ గోర నినుఁ డిచ్చుమణికినై
                    తొలుత నీపై వట్టిదూఱు పుట్టె
     నేసతిఁ బెండ్లాడ నెనయ రుక్మిణిచేత
                    వడిసుళ్ల నేప్రొద్దు జడియవలసె

తే. నెవతె వరుమానసము జాలి నిడినదానిఁ
     దలఁచి యిల వ్రాలి సోలి చింలఁగవలసె
     నట్టిసాత్రాజితిఁ దలంచ నడుగుఁ గాంచ
     నేల యీవేళఁ జాల గోపాలబాల.

సీ. కేక వేయుచు సారె కెరలి నవ్వఁగవచ్చు
                    నునుమోవిఁ బలుగెంపు లునుపవచ్చు
     గోటికొద్దిని నొక్కి గుఱుతు లుంచఁగవచ్చు
                    నానమీఱినమాట లాడవచ్చు
     గుంకుమనిగ్గైనకోక గట్టఁగవచ్చు
                    దండుకుఁ దోతెంచి యుండవచ్చు
     బయటను కొల్వుండి పాడించుకోవచ్చు
                    దిరునాళ్ల జతగూడి తిరుగవచ్చుఁ
తే. గాన వెలయాలు గల్గ లోకమున మేలు
     గలుగు నెటువంటివాని కాకతలు మాని
     పడవకై వచ్చినట్టియీయెడల వట్టి
     గొడవ యిల్లాలిపై బాళి గోపమౌళి.

క. వెలచెలికి సామి వలచినఁ
     గలుగున్ చను వెల్లఁ దాపికాండ్రకుఁ దోడ్తో
     ఫలియించు హొంతకారుల
     తలఁపులు విటజనులశిక్ష తామరసాక్షా.

ఉ. సామరు లూడిగాల్ నృపతిచంద్రులు రౌతులు పెన్వజీర్లు పే
     రామున నిచ్చటం బటగృహమ్ముల నిమ్ముల నాగవాసపున్
     లేమల వేఱువేఱ తగిలించుక ముచ్చటఁ గూడి యుండుటల్
     సామి యదేమి దెల్పుదును సంతముం గనుపండు వయ్యెడిన్.

సీ. బాలుఁ డంచును నిన్ను లాలించురాధను
                    కాపుఁ జేసినయట్టి గాయకంబు

     నీరాటకై వచ్చు నీరజాక్షులగుట్టు
                    ఱట్టుచేసినయట్టి దిట్టతనము
     నన్నంబు దెచ్చిన జన్నంపుగరితల
                    గాటు మేపినయట్టి నీటుతనము
     గొల్లపల్లెల నున్న కొమిరెల వలపించి
                    దూఱు చేసినమాయదారితనము
తే. మఱచి ప్రాకృతజనులట్లు వెఱచి వెఱచి
     వసుధఁ బరకాంత నొల్లనివానివలెనె
     నిచ్చ నిల్లాలిపై బాళి యెంచ నేల
     యేల పసిగాపురాజ నీ కిట్టియోజ.

మత్తకోకిల. భండనంబున దైత్యుఁ గొట్టఁగఁ బాళెము ల్విడియింపుచున్
     దండు సేయుచు నుండఁగాఁ బ్రమదామణిన్ సతిఁ దెత్తురా
     నిండుజవ్వన ముబ్బుగుబ్బలు నీటుచూపులు మీఱ నీ
     యండ నుంచుక యుండఁగా వెలయాండ్రు కర్వయినారకో!

ఉ. గామిడిదైత్యునింటఁ జెఱగా వసియించుపదాఱువేలకాం
     తామణులన్ గ్రహించుటకుఁ దన్విని దీమము చేసి తెచ్చెదో
     కామునివేఁటలాడఁగ మెకంబుల కెల్లను వేఁట యిఱ్ఱి లే
     దీమపుపుల్గు పుల్గులకుఁ దే గమకించినబోయకైవడిన్.

సీ. సారంగి కనకాంగి చక్కనిరత్నాంగి
                    బాల యంబుజపాణి నీలవేణి
     దమయంతి యపరంజి కమలాక్షి యెలనాగ
                    కావేరి యింద్రాణి పూవుఁబోణి
     బంగారుతీఁగె రూపవతి కళావతి
                    చిత్రాంగి శశిరేఖ చిత్రరేఖ
     మదనమంజరి యిందువదన కోమలవల్లి
                    మదహత్తి కల్యాణి మధురవాణి

తే. యనఁగఁ బొగ డొందువెలయాండ్రయందు నొకతెఁ
     దళుకుగలదానిగాఁ జిన్నదానిగాను
     పొంకముగ నేర్పరించి యలంకరించి
     తోడితెచ్చెద నీదండఁ గూడియుండ.

వ. అనిన విని కోపంబు నెమ్మనంబునం గ్రమ్మఁ గ్రమ్మవిలుకానిఁ
     గన్నచక్కనిసామి యేమిరా పాపజాతి నీవు బాఁపనజాతి నెటువలెఁ బుట్టి
     తివో కాక, నీవును సరి కాకఘూకరుతమ్ములు నీభాషణమ్ములును సరి యనేక
     లోకుల దూషించి నవ్వునీకు నేలోకమ్ము మీఁదుగట్టియున్నది? కన్నదియు
     విన్నదియుంగాదు నీవగ యేవగ నేవగించిన వికృతవదనుండవై యెంత
     వారినైన సరకుసేయవు విగతలజ్జుండవై యేపనికిని రోయవు మేలుమేలని
     యపగతశంకుని నాకలవింకునిం గని యిట్లనియె.

క. రాజసభ నుచిత మెఱుఁగక
     వాఁ జెడి తోఁచినవి పిట్టవలెఁ బ్రేలెదుగా
     యేజాతినరులఁ గానము
     నీజన్మం బిటుల నిట్లనే వేగెఁగదా.

క. ఒకవేళఁ గూనిరాగము
     లొకవేళ వెకలినవ్వు లొకవేళను పొం
     దిక లేనిచాడిగొణఁగులు
     వికటపుమఱుగుజ్జు నీకు విధి దయచేసెన్.

క. తర మెఱిఁగి పలుకుటలు నీ
     తరతరమున లేని వౌట ధర నెఱుఁగరొకో
     దొరగరితలవిరహమ్ములు
     వెఱపులు నీ కేటి కింక విడు కలవింకా.

ఉ. ఒప్పులకుప్ప లౌ సతులు నొప్పుగఁ జేరుచుఁ బంతు మీఱుచున్
     ముప్పిరిగొన్న మోహమున ముచ్చట లాడుచు నిచ్చఁ గూడుచున్
     దెప్పలఁ దేలురాజులకుఁ దెల్విడి బల్విడిఁ గూడు నాజ్యమున్
     పప్పును మెక్కుపల్లఱపుబాపని కేమయినాను తెల్సునా.

చ. ఎఱుక గలట్టివానివలె నే పని కడ్డము వచ్చి తూఱి లో
     గరువము హెచ్చి నిచ్చలును గామిడివై మమువంటివారితోఁ
     బరుసపుమాట లాడెదవు బాఁపని కేనుఁగుబుద్ధి చాలదో
     గరితల నెన్నువేళ వెలకన్నెలవన్నెల నెన్నఁ బాడియే.

క. జాలము మందులపొందుల
     జాలిం బడఁజేసి తాళజాల మటంచున్
     తేలింతురు [10]వెలజంతలు
     గోలింతురు చేతి సొమ్ము గడెవడిలోనన్.

క. వల పొకచోఁ బిలు పొకచో
     బలుకులు వేఱొక్కచోట భావం బొకచో
     వెలయించువెలమిటారుల
     వల కగపడి [11]మోసపోవువారలు గలరే?

క. మే లెంతురు కులకాంతలు
     తేలింతురు రతులఁ గొంకు దీర్చినకొలఁదిన్
     పాలింతురు కులధర్మము
     తాలిమి పచరింతు రెంత తహతహ యైనన్.

చ. అహరహరేధమానశుభ మన్వయవృద్ధికి సాధుబుద్ధికిన్
     విహితము ప్రేమభావనకు విశ్రుతకీర్తికి నున్కిపట్టునై
     యిహపరసాధకం బగుకులేందుముఖీసుఖ మెంతవానికిన్
     బహుతరజన్మపుణ్యపరిపాకమునన్ ఫలియించు నెంచఁగన్.

సీ. దాక్షిణ్యములగీము లక్షణంబులదీము
                    వ్రతముల యొరగల్లు రహికి నిల్లు
     నెఱితనమ్ములతావు నిక్కువమ్ములప్రోవు
                    కలిమికి దాపు భాగ్యములకోపు

     వినుతికి విడిపట్టు వినయమ్ములకు గుట్టు
                    కలఁకకుఁ గెళవు కీర్తులకు నెళవు
     పతిభక్తికి బిడారు సుతరత్నపుఁగొటారు
                    ధర్మంబులకు మూట దయకుఁ గోట
తే. యనుచు నందఱుఁ గొనియాడ నతిశయించు
     కులసతిని జేరి యన్నింటఁ గొంకు దీరి
     యాత్మ సుఖయించు నేధన్యుఁ డట్టివాని
     కడఁక చెలువొందు నెందు నీపుడమియందు.

క. చెలివలపును నావలపున్
     తెలియక నీ విటులు వదరితే నే మగు నీ
     తలఁపులు నీ వెడపల్కులు
     కల వింకా కొన్ని విడువుగా కలవింకా.

వ. అనిన విని చకితభావుండై యసంగతవచనజనితకళంకుం డగుకల
     వింకుండు విచ్చలవిడి పెచ్చు ప్రేలక స్రుక్కి గచ్చులు దక్కి రిచ్చవడి
     ముచ్చువలెఁ బులుకుపులుకునం జూచుచుండె నంతం గంసాంతకుండు
     మఱియు వేదండగామినీవిరహవేదనాదోధూయమానమానసుండై తనయిం
     గితం బెఱింగి వినయంబునఁ బెనంగు ననుంగుచెలికాండ్రఁ గనుంకొని
     యిట్లనియె:-

చ. కనికర మెంత వింతనుడికారపుమాటలనీటు లెంత నె
     మ్మనమునఁ బ్రేమ యెంత జిగిమాయనిమేనివిలాస మెంత నా
     మనసున నున్నపంతమును మర్మ మెఱింగి కరంచు టెంత యే
     వనజదళాక్షు లాసమదవారణయానకు సాటి వత్తురే.

చ. దుసికిలినట్టిపోఁకముడితో వసివాడిననెమ్మొగంబుతో
     మసలెడిచూపుతో మెఱుఁగుమాసినగుబ్బలకుంకుమంబుతో
     ముసిముసినవ్వుతో రతులముచ్చట లాడుచుఁ బైఁటకొంగుచే
     విసరుచునున్న యన్నెలఁత వేడుక నేఁ డొకసారి కల్గునే.

.

చ. అలరులశయ్యమీఁద జలజానన తానును నేనుఁ గూటమిన్
     మలయుచు నుండుచోఁ జెఱఁగు మాసిన నుల్కుచు లేచి కుల్కుచున్
     వలువ ధరించి యి ల్వెడలి వాతికచూపుల నాదుదుప్పటిన్
     దొలఁకెడుచిన్నిచెయ్వులకుఁ దోఁచమిఁ జేసిన దెంచ శక్యమే.

చ. ఎనసినపిమ్మట న్నిలిచి యే కయిచేసికొనంగఁ జూచి తా
     వెనక రుమాల గట్టుటకు వెన్కకు వ చ్చరవ్రాలి వెన్నుపైఁ
     జనుమొన లాని యానినపసందమి రేఁచుమెఱుంగుఁబోఁడి నె
     మ్మనమున నెన్నుచో మరుఁడు మాటికి మాటికి లూటి సేయఁడే.

చ. మురువుగ నిల్చి యవ్వెలఁది ము న్నొకనాఁడు తలంటుచున్నచోఁ
     గరములు నూనెగా నడపకత్తియ యిచ్చువిడెంబు గైకొనన్
     దొరయక దానిఁ బొమ్మనుచుఁ దోడనె పుక్కిటివీడె మాని బి
     త్తరము తలంటుతాళగతిఁ దప్పనితత్తర మెన్న శక్యమే.

చ. సొగసుగ నేఁ దలంటి మెయిఁ జు మ్మన నూనె నలుంగు వెట్టి నా
     వగలను గుల్కుబోటివలువం జనుదోయి మఱుంగు సేయుచున్
     సగము తలంటు దోయి యని చానలు దెల్పిన నియ్యకొంచు నా
     మగువలఁ బొ మ్మటన్నకనుమైసరి నేసరిఁ బోల నేర్తునే.

మ. జడిగొన్కోర్కుల నింతి తాను మగవేషం బూని నున్పింపిణీ
     జడలన్ పాపిట రావిరేక జిగి హెచ్చన్ గొప్పు పొంకించి య
     య్యెడ నాయాఁటతనంబు చూచి నగి హాయి న్నన్ను లాలించి యె
     క్కుడువీఁకన్ మగపంతముల్ సలుపుటెక్కు ల్గల్గు టిం కెన్నడో.

సీ. చనుమొనల్ కనుఱెప్పలనె యప్పళించిన
                    దెర సేయుకన్నులు తేలవేయు
     గళము పల్మొనలచే గిలిగింత గొనఁజేయ
                    గరుచెక్కు మురియౌడు గఱచి చొక్కు
     నునుదొడ లదరంటఁ గొనగోరులను జీరఁ
                    బొఱలించు సందిట గుఱుతు లుంచు

     మునివ్రేళ్ల నునుపోఁకముడి నెమ్మి రెమ్మినఁ
                    జలపట్టు నెంతయు సెలయఁ గొట్టు
తే. నువిదతమి యెంతొ క్రియల నౌ నుచిత మెంతొ
     మనసువగ యెంతొ నామదిమమత యెంతొ
     యే మని నుతింతు నెం తని ప్రేమ గాంతు
     విధికి నేమందుఁ జెలి నెట్లు విడిచి యుందు.

సీ. మణితంబు సేయుచో మరుఢక్కఁ దలఁపించు
                    బలికిన మౌగ్ధ్యంబు నలవరించు
     గేక వేసినఁ గంచు గీచినవగ నించుఁ
                    బదము పాడిన సిగ్గునఁ దల వంచుఁ
     బైకొనుచో దొరపాడిజ గనుపించుఁ
                    బవ్వళించిన లంకెపాటు నించు
     రాకొట్టుచో వింతరక్తి నౌ ననిపించు
                    ర మ్మన్న వినయంబు గ్రుమ్మరించుఁ
తే. బ్రౌఢియును గోలతనమును బరఁగ నిట్లు
     నన్నుఁ జెలి మోహమున డాయు నయముఁ జేయు
     నట్టి ప్రాణేశ్వరిని బాసి యలఁత నిట్లు
     లలవరింతు నయో యెట్లు నిలువరింతు.

సీ. అతివచక్కెరమోవి యాన జిహ్వ దలంచు
                    సుదతిమోమున నుండఁ జూపు లెంచు
     నారిపొక్కిట వ్రేలు నడయాడఁగా నెంచు
                    గోరు లింతిపిఱుందుఁ జేర నెంచు
     మించుఁబోఁడిని కౌఁగిలించ బాహువు లెంచుఁ
                    జానపల్కులు విన వీను లెంచు
     వనజాక్షి మోము మూర్కొనఁగ నాసిక యెంచు
                    వనితచన్మొన లాన వక్ష మెంచుఁ

తే. గాన ని ట్లంగములు పరాధీనవృత్తి
     నానినటు లైన మరునైన నసురనైన
     నతనుసంగరమున నుల్ల మతిశయిల్ల
     నెటులు గెలిచెదనో కాక యింతి లేక.

మ. ప్రమదారత్నముఁ జూడకున్న నవలాపాదాబ్జపాంసుచ్ఛటన్
     క్షమ లేఁజెమ్మటజాలునన్ సలిలమున్ చారుస్మితజ్యోత్స్నఁ దే
     జము నిట్టూర్పున గాలి కౌనున బయల్ సంధిల్ల జీవంబు జీ
     వము నేకంబు ఘటింతుఁగాని సమరవ్యాపార మిం కెంతునే.

క. నావుడుఁ జెలికాం డ్రావసు
     దేవాత్మజుఁ జూచి యతనితీరును నవలా
     రావలె నటన్నతలఁపును
     భావంబున నెంచి మగుడఁ బల్కిరి వేడ్కన్.

క. దేవరయానతి మదిలో
     భావించిన యుక్త మగును పద్మదళాక్షా
     తావి నెడఁబాసియుండెడి
     పూ వెందుకు నట్ల కాదె భువి నీనడకల్.

క. చంద్రు నెడఁబాసి యుండునె
     చంద్రిక చంద్రికను బాసి చరియించునొకో
     చంద్రుం డిపు డాకైవడి
     జంద్రముఖియు నీవు నెనసి చరియించుగతుల్.

క. నీ మమత తెలిసెనేకద
     భామామణి యచట నెంత పలవించునొకో
     మీమనసులు మీవలపులు
     కాముఁ డెఱుఁగుఁగాక యొరులు కానంగలరే.

క. నావుడుఁ జిఱున వ్వొలయఁగ
     భావజజనకుండు వికచపద్మదళాక్షిన్

     రావింపఁగోరి యుండఁగ
     నావేళను జనుల కెల్ల నద్భుత మెసఁగన్.

సీ. బంగారుచెంగావిపావడలమెఱుంగు
                    బయ లానునట్టినెమ్మెయిబెడంగు
     పచ్చరాపలకడాల్ రచ్చఁ బెట్టెడిచిన్నె
                    పొసఁగెడిఱెక్కల పసరువన్నె
     కపురొందునింద్రనీలపుపొగరు లెసంగు
                    శిరసునఁ దగుకరజిగిహొరంగు
     నలుదెసలందు నందపుముత్తియపుమ్రుగ్గు
                    చల్లెడియుదరంబు తెల్లనిగ్గు
తే. నెఱపసపునీటిచాయలు నిక్కుముక్కు
     బెరయ నున్నట్టుమాటికి తిరుపు గట్టి
     చేరి యటమీఁద శౌరిముంజేతిమీఁద
     వ్రాలె రహిఁ జిల్క నొకపచ్చవన్నెచిల్క.

చ. అటువలె వ్రాలి యంతఁ జిగురాకుకటారివజీరుతేజి యు
     త్కట మగుసత్యభామచేయితావి నునుంబస పంటి ఘమ్మనన్
     చిటిపొటిఱెక్క తెమ్మెరలచే వడి దేరినదానవారితో
     నిటు లనె నీశమౌళిగళదిందుసుధామధురోక్తి వైఖరిన్.

ఉ. సామి జొహారు నీ కసురశాసన నీపదదర్శనంబుచే
     నీమెయి నాది న్మిగుల హెచ్చినధన్యత గల్గె నయ్య నే
     నామున సత్యభామకర మందు వసింతు మృగాక్షి నన్ను నెం
     తే మదిఁ బ్రోది సేయుటలు దేవరచిత్త మెఱుంగునేకదా.

క. అకలంకచరిత నీకున్
     శుకవచనం బింపు గనుక సుదతీమణి యా
     త్మకథలు దెలుపు మనన్ సే
     వకజనమందార చేర వచ్చితి నెలమిన్.

తే. నిన్ను వరియించగా నెంచి మున్ను సత్య
     భామ యుద్యానమున గౌరినోము నోమ
     నంబ ప్రత్యక్షమై కోర్కు లతివ కొసఁగి
     కృప వెలయ నన్ను నొసఁగి తా నిట్టు లనియె.

మ. చెలి యప్రాకృత మీశుకంబు వినుమా చేదోడువాదోడునై
     తలఁపుల్ నీకు ఘటించు నౌ సకలవిద్యాశాలి యస్మద్దయా
     కలనం బేర్పడు మేటి యీపులుఁగు నింక న్నీవు చేపట్టినన్
     కలుగు న్నీకును నిన్ను నేలుదొరకుం గల్యాణసాఫల్యముల్.

క. అని గౌరి తనుఁ గటాక్షిం
     చినది మొదలు సత్యభామ చేకొని నన్నున్
     తన సైదోడువలెం బ్రో
     చును మఱి ప్రాణంబుకన్న సొంపుగఁ జూచున్.

సీ. అమృతమధ్యమునఁ జెన్నార నుండెడుమాకు
                    నీచౌటికడలివీ డేమి యరుదు
     తనరురత్నద్వీపమునను ద్రిమ్మరెడుమా
                    కెన్న జంబూద్వీప మేమి యరుదు
     పైఁడికడిమితోటనీడఁ జేరినమాకు
                    నెలమావిక్రీనీడ లేమి యరుదు
     కనకపద్మంపువాసనలు గనెడుమాకు
                    నితరవర్ణసుగంధ మేమి యరుదు
తే. పరమశివసభఁ భార్వతీపాణిముఖర
     వేణువీణానినాడంబు విన్నమాకు
     నిచటిమనుజులసంగీత మేమి యరుదు
     గాన సాధారణశుకంబఁ గాను నేను.

చ. గడియ కనేకపద్యములు గ్రక్కున నే రచియించఁ జూచి యా
     వడి నుడువం దలంచి గొరవంక కడున్ బొమ నిక్కఁజేసి వా

     దడిపిన నవ్వి నీదుకవితల్ రచియించిన నట్టు లుండునే
     బుడిబుడి బట్టికాఁడు కునుబుద్ధులు గైకొను నంబవెంబడిన్.

చ. హరునకు నద్రికన్యకకు నప్పుడు మేలపుటల్క గల్గినన్
     వెఱపక చెంతఁ జేరి కడువేడుక నిద్దఱ నూరడించి క్ర
     మ్మఱ నలజోడు గూడి నెఱమక్కువ నుండ ఘటింతుఁ గాన న
     బ్బురములె లోకమందు ననుబోఁటికిఁ దక్కినరాయబారముల్.

తే. అవని నీసత్యభామయు నంబుజాక్ష
     నీవు మాపాల గిరిసుతానీలకంఠు
     లగుట మిముఁ గొల్వవలె ననునాస వొడమ
     సామి చేరితి నీమీఁద శరణ మనుచు.

వ. ఇది యిటు లౌఁగదా యదుకులేశ్వర తావకపాదసేవ న
     భ్యుదయము గల్లె మాకు నసితోత్పలనేత్రకుఁ గార్యసిద్ధియున్
     మొదటనె కల్గెఁ గావునను ముచ్చట హెచ్చఁగ నింతికోసమై
     వదలనివీఁక నేఁ దెలుప వచ్చినకార్య మొక్కింత దెల్పెదన్.

చ. శకునముఁ జూచి నీ వవలసాగినపిమ్మట మేడ డిగ్గి యా
     చకితకురంగనేత్ర మదిచాపలమున్ భ్రమయున్ శ్రమంబు లోఁ
     దుకతుక పై సెకల్ చెమటతుంపురులుం గెరలంగ నూర్పు లూ
     రక నిగుడంగ గుండె యదరంగఁ దరంగదపాంగబాష్పయై.

క. తడఁబడునడలున్ గడగడ
     వడఁకెడియొడలుం గడంకవడుచూపులు ని
     ల్కడలుం గడలుకొనం జెలు
     లొడికమ్మునఁ దోడితేఁగ నుపవనసీమన్.

తే. కాఁక సోకినపైఁడిశలాకవలెను
     కలఁకఁబాఱిన వెన్నెలమొలకవలెను
     జిగురుకండెను దగిలినచిలుకవలెను
     కోమలి విరాళికిని జిక్కి గుట్టు దక్కి.

క. బెగడుచుం దనమదిఁ దెగడుచు
     నగణితమోహమున నుపవనాంతరసీమన్
     చిగురుతివాసున జిగి దగి
     సొగ సగువిరిసెజ్జఁ బొఱలుచుం బలుమాఱున్.

క. నీరూపు నీవిలాసము
     నీరేకయు నీదురతులనేర్పును మదిలో
     నూరక తలపోయుచు మది
     దీరక చెలు లెల్ల సేద దేర్పుచునుండన్.

శా. ఇంకా మేలిమితోడ నుండదుసుమీ యేణాక్షి యేణాంకమీ
     నాంకాతంకవిశంకటప్రసవపర్యంకస్థలిన్ గంధవా
     హాంకూరాహతి సోలి వ్రాలి భవదీయధ్యానసంధానని
     శ్శంకప్రక్రియఁ దేలి తేలి విరహజ్వాలాకరాళాంగియై.

క. నగుచు న్మాటికి విధికిం
     దెగుచుం జెలి యుండియుండి తెఱవల కెల్లన్
     మొగుచుం జేతులు మనమునఁ
     దగుచుమ్మలుచుట్టు విరహతాపముకతనన్.

సీ. వనమాలి యిదె వచ్చెఁ దనమాలిమి నటంచు
                    ఘనమాలికను జూచి కలువరించుఁ
     గనఁజాలునిలఁదళు క్కనఁ జాలుజిగిమించుఁ
                    గని జాళువాచేల యని తలంచుఁ
     గరవీరములఁదేటిమొఱ వీరగలిపించు
                    మురళీరవం బని మోహ ముంచు
     ముద మాని తెలియ కంగద మాని చలమించు
                    నెదమానికం బని యిచ్చగించుఁ
తే. దెలిసి వెఱఁగంది యెదఁ గుంది పలువరించుఁ
     దలఁపునను డాసి కను మూసి కలువరించు

     మరునిచే నున్నపొన్నపూదురుసుకిరుసు
     చెనకులకు నోడి ధృతి వీడి చిగురుఁబోఁడి.

చ. వనజదళాక్షి గోల యదువల్లభ దుర్లభతావకాంఘ్రినే
     [12]వనజనితానురాగభరవల్గదనంగదశాకృశాంగియై
     వనరుచునున్న దింతులను వంతలఁ బెట్టుట పాడి యౌనె యే
     పని యెడఁ గల్గినా చెలులఁ బాయనివైపున నుండఁగాఁ దగున్.

తే. ఏమి తెల్పితినో యని యెంచవలదు
     బాల యిఁక నొక్కక్షణ మైనఁ దాళలేదు
     ద్వారకకు నంపఁదగునట్టివారి ననిపి
     చంచలాక్షిని వడిగ రప్పించవలయు.

చ. మన విటు లేను దెల్పి తనుమానము సేయక చిత్తగించు నా
     ఘనతయు నాప్రసిద్ధియు జగంబున నంద ఱెఱుంగఁగా మదిం
     దనియక చెందుచు న్నవసుధారస మొల్కెడునాదుపల్కులన్
     విని తల యూఁచనట్టిపృథివీవరు లెవ్వరు కంసశాసనా.

వ. అని యివ్విధంబున విన్నవించిన పంచవర్ణకీరంబునకు సంతసించి
     మఱియును వినుతించి మగుడ ననిచి యంతకుమున్న తనకు సమయోచితా
     లాపంబులఁ బ్రొద్దుగడపిన సమీర మయూర సారంగ కలహంస కలరవ
     సురభి శశాంక మకరాంకముఖనిఖలపరిజనంబులంగాంచి వీరు తమపేరు
     వాసికి వేఱు వాసి యుండక తమ యింగితం బెఱింగి పలికి రని విజయ
     మాద్రేయసైనేయులం జూచి మందలించి కందళించినయానందంబు గ్రందు
     కొనఁ దమచిత్తంబులు చల్లఁజేయువాఁడు వీఁడెయని చిత్తజావతారమహో
     దారుం డగు రుక్మిణీకుమారుం గాంచి సకలకళాభిరామయగు సత్యభామం
     దోడితె మ్మని నియోగించి యంభోధితరణంబు నతిత్వరితాభిగమనంబు
     నుద్దేశించి యుచితచిరత్నం బగునొక్క శిరోరత్నంబు నిచ్చి యచ్యుతుం
     డనిపె ననిపిన యప్పు డారత్నం బద్భుతంబుగా ననరఘ్యమణిఘృణిధోరణీదేదీ
     ప్యమానం బగునొక్కదివ్యవిమానంబై పొల్చె. పొల్చిన నందు నిలిచి

     ప్రద్యుమ్నుఁ డాకీరంబుబడి వాగెగా ముందటి రాఁగ వేవేగ నంభోనిధానంబు
     తరించి ద్వారకాపురంబు ప్రవేశించి యరదంబు హజారంబుచెంగట నునిచి
     నిరంతరసమేధమానకల్యాణంబగు దివాణంబునం దగుకక్ష్యాంతరంబులు
     గడచి యలవడనడఁచి కంసశాసనానురాగసాగరంబు గట్టుపొఱలినవగఁ
     దగుమానికంపుజిగిచెందిరంబుచేఁ దిరంబగు సత్యభామామందిరంబు దరిసి
     యచట నేమి యలబలంబు లేమి యరసి యనుకలశిశిరవస్తునికరాదాన
     సమున్నిద్రగజగామినీజనయాతాయాతగమనసూచితసరణిఁ దదీయోపవ
     నాతంబు చేరం జని యచ్చట వేచి యంతటఁ గలయంజూచి వాడినకువల
     యంబులును, వీడినమృణాలవలయంబులును, చిటిలినరత్నహారమ్ములును,
     పెటిలినగంధసారమ్ములును, కగ్గినకర్పూరమ్ములును, తగ్గినయుశీరమ్ములును,
     ఉడిగిన సమరసపూరమ్ములును, నుడుకెత్తినతుషారమ్ములును, దొరఁగిన
     వకుళమ్ములును, సొరగిన కమలముకుళమ్ములును, జడిసిన యాళిజనమ్ము
     లును, కెడసిన కుసుమవీజనమ్ములును, రిత్తలైనచలువకలువపూసింగాణు
     లును, గుత్తులువీడి పొడిపొడిగ రాలినసుపాణులును పరికించి యచ్చెరువుగా
     నెంచి యందు చవిజాతిరాతిచందపొందికల నందగించియున్న కడవన్నెతిన్నె
     కడల నెల్లెడలఁ బెల్లుగ మల్లడిగొని యుల్లసిల్లుపుప్పొళ్లఁజల్లనగు మల్లెపూ
     సెజ్జఁ బవ్వళించి దిటమ్ము ఝూళించి తనపజ్జ బుజ్జవమ్ముగ నుజ్జగించిన
     సజ్జగపుగొజ్జంగినీటితుంపరలు పెంపరలుగాఁ జిలుకునలుకుడుగులుకునిగనిగని
     పొగరుతొగరు తొగచిగురువగచిమ్మనఁగ్రోవులదీవుల నింపుజలసూత్రపు
     ప్రతిమలనుండి దండిగ నిండియుండి జాళువాడాలు జాలువాఱ నిచ్చలపు
     పచ్చలరవలనిగనిగలు గీలుకొనుకీలునెమ్మిపించంబులఁ గ్రమ్ము తెమ్మెరలనిక
     టమ్మున నాడాడ నాడునేడాకులయనంటికపురపుదుమారమ్ములు ఘమ్మనఁ
     దనపయిం గెరలం బొఱలుచు వియోగభగోపప్లవంబునం దెరలుచు నంబు
     జాక్షదిదృక్షాతరంగితాంతరంగయు నవరతగళదవిరళబాష్పధారాళధారా
     విరచితాపాంగయు ననుక్షణజాయమానసంతాపయు నాయల్లకదశాతిదీన
     విలాపయు నాళీజనకృతోపచారయు నలసభారవిలుప్తసంచారయు సంతత
     వియోగసంజనితసంభ్రమసముద్దామయు నగుసత్యభామను గాంచి నమస్క
     రించి కృష్ణాభిహితసందేశంబును దదీయవిరహావేశంబు నంతయు నెఱింగించి

     యంగనాజనసమేతంబుగా నాయుపమాత నాదివ్యవిమానారూఢం గావించి
     తోడితెచ్చె నప్పు డాయసమానవిమానవిలసమానకాంతిసంతతి దిగంతం
     బుల వింతవింతగా నకాలసంధ్యారాగంబుడంబున విడంబింప సొంపునం
     జూచి యవ్విధంబు కంచుకిజనంబు వచ్చి హెచ్చరించిన నచ్చెరువున నగ్గిరి
     ధరుండు దిగ్గన లేచివచ్చి మచ్చెకంటి యున్న విమానంబు చూచి యచ్చట
     నఖలజనంబులు తొలంగ బరాబరి సేయించి పరిజనంబుల నవల ననిచి
     యెదురుకొని మదిరలోచనకేలు కేలునం దాటించి యానావరోహంబు
     సేయించి వదనారవిందమ్మున మందహాసమ్ము గ్రమ్మ వశావశంవద విలాస
     బంధురం బగుగంధసింధురంబుచందంబున మందమందగమనంబున వచ్చి
     యనంగసంగరతరంగితాంతరంగంబులు హెచ్చి శశాంకముఖియుం దానును
     పర్యంకంబున వసియించె నంత.

తే. తల్లిదండ్రులమనసులు చల్లఁజేసి
     తన యునికి కేఁగె రుక్మిణీతనయుఁ డటులు
     మణియు హరివేడ్క చెల్లించి మమత మించి
     యతనిసిగబొందుపైఁ జెంది యంద మొందె.

ఉ. అంగనవెంట వచ్చినమృగాయతలోచన లందుఁ బొందుగా
     నంగజుతండ్రికిన్ జలరుహాక్షికి నూడిగముల్ ఘటింపుచున్
     చెంగట నిల్చి తత్కరుణ చేకొని సైగలు దెల్పి సొంపు మీ
     ఱంగఁ గ్రమాన వేఱొకసరాతిమఱుంగున కేఁగి రర్మిలిన్.

క. ఆనాతిఁ గలసి పలుమఱు
     నానావిధరతులఁ బ్రియము నయ మెనయంగా
     నానందనందనాగ్రణి
     యానందాంభోధి నోలలాడుచు నుండెన్.

వ. తదనంతరకథావిధానం బెట్టి దనిన.

మ. ప్రథితప్రాభవ ప్రాభవన్మృదుగుణప్రాగ్భార ప్రాగ్భారతీ
     ప్రథితాచారణ చారణస్తుతయశోభారా సభారాసహో

     త్పథసేనారవ నారవర్యపటలీపార్థక్య పార్థక్యయో
     ధధరాయావక యావకన్నిజమహోదారాంకదారాంకగా.

క. ఆంగజసదృశాకారా
     సంగరతలనిరుపమానశౌర్యవిహారా
     లింగాంబికాకుమారా
     శృంగారరసప్రధానశీలోదారా.

క. హాటకితస్మరగుణపద
     వీటంకకృతిగీతివిజయవేంకటదేవా
     వీటీరససౌరభపరి
     పాటీరమ్యగుణచంద్ర బలినిస్తంద్రా.

మాలినీవృత్తము.


     అధరితపరరాజా హారిచక్షుఃపయోజా
     ప్రథితభుజమహౌజా భవ్యసాహిత్యభోజా
     బుధజనసురభూజా భోగలీలాబిడౌజా
     విధుతరిపుసమాజా వీరసామ్రాట్తనూజా.

పంచచామరవృత్తము.


     చరాచరాధిరాజవీరజాలదానకేళికా
     దరా ధరాధరారిభోగ ధైర్యధూతమేరుమం
     దరా ధరాధరాచకీర్తి దారదస్యుమీసదీ
     వరావరావరాత్మగంధవారణాంచితాంగణా.

గద్యము.
     ఇది శ్రీకాళహస్తీశ్వరచరణారవిందమిళిందాయ మానాంతరంగ జ్ఞానప్రసూ
     నాంబికా కృపావలంబవిజృంభమాణసారసారస్వతసుధాతరంగ లింగనమఖి
     వెంగనామాత్యవంశపావన విరచితవిద్యాధిదేవతాసంభావన దక్షిణసింహా

సనాధ్యక్షతిరుమలక్షమాకాంతకరుణాకటాక్షలక్షితస్వచ్ఛముక్తాగుళుచ్ఛ
సితచ్ఛత్రచామరకళాచికాకనకాందోళికాదిరాజోపచార ధీరజనహృద
యరంజకవచోవిహారవల్లకీవాదనధురీణవర్ణగీతాదిగాం
ధర్వస్వరకల్పనాప్రవీణ కామాక్ష్యంబికానాగనకవి
రాజనందన కలితసకలబాంధవహృదయానందన
శ్రీకర కవితాకర సుకవిజనవిధేయ శ్రీ కామే
శ్వరనామధేయప్రణితం బైనసత్యభామా
సాంత్వనం బనుమహాప్రబంధంబు
నందుఁ దృతీయాశ్వాసము.


  1. నివ్వరాహశిఖరభాగం
  2. లేచి సొలసిసొలసి
  3. చిఱుసన్న లెడలించు
  4. జాడ నన్గొనియెడి
  5. నావదనంబుఁ బూని
  6. అటమీఁదటిదశ వశమే
  7. సువచనానందన
  8. గప్పు తెప్పనుచుఁ
  9. నారి యంటివి మేలు
  10. వెలయింతులు
  11. మోసపోవువారు గలరే
  12. వనజతాంతరాగ