Jump to content

సత్యభామాసాంత్వనము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సత్యభామాసాంత్వనము

చతుర్థాశ్వాసము

     శ్రీజృంభితాంబురుహరే
     ఖాజనకకటాక్ష యాదిగర్భేశ్వర నా
     నాజననుతవితరణ వి
     ద్యాజితరాధేయ ముద్దులళ్ఘరిరాయా.

తే. అవధరింపుము జనమేజయక్షితీశ్వ
     రునకు నావ్యాసమునిశిష్యుఁ డనియె నిట్లు
     శౌరి సాత్రాజితిని జేరి చనువుమీఱి
     యుబ్బరంబునఁ దనియకయుండువేళ.

ఉ. అయ్య పరాకు సామి నరకాసురుఁ డంపఁగ వచ్చినట్టి పెన్
     దయ్యపువేగరిం బెనఁచి త్రాటను గట్టి గుడారువాకిటన్
     గుయ్యకు మంచు నో రదిమి గుప్పుచు మీనగరింటిచారు లొ
     య్యొయ్యన వచ్చినా రని మృదూక్తులఁ బెంపుడుచిల్క పల్కినన్.

చ. తనిసినవేళఁ జూచి మఱి దవ్వులనే పొడకట్టి నిల్చి మీ
     కనుఁగొనసన్నమన్ననలు గన్గొని చిత్త మెఱింగి ఱెక్కలన్
     నినుచుక చిన్నిక్రొంబసిఁడినిద్దపుటందెలు గిల్కుగి ల్కనన్
     చనవునఁ జిల్క వచ్చుటలు సారసనాభ విచిత్ర మయ్యెడిన్.

చ. ఒడికముగాఁగ మై యణఁచి యోరగఁ జేరఁగ వచ్చివచ్చి యొ
     క్కెడ నెడ గల్గ నిల్చి క్రియయేర్పడఁ గార్యము ముక్తకంబుగా
     జడియక మేలు గల్గఁగను సంగతి తప్పక చౌల కింపుగాఁ
     గడఁక వహించి పల్కుచిలుకన్ జిలు కంచు గణింప శక్యమే.

తే. పలుకుపలు కెల్లఁ జల్లనై ప్రౌఢి మీఱ
     మీకు విజయంబు గోరెడిమేలువలన
     ననని నీచిల్క హరి యౌట యరుదె నీదు
     పేరువా సెందు లేదోకో బిసరుహాక్ష.

చ. మిము నెడఁబాసి యున్నతఱి మే లొనగూడఁగ డాసి నాదుహృ
     త్కమలము చల్లఁ జేసి నయగారపుమాటలఁ దేర్చి నన్ను నీ
     సముఖముఁ జేర్చి నీమదికి సంతసము ల్గలిగించినట్టి కీ
     రముఁ జెయివట్ట కేటికిఁ బరా కొనరించెదు కంసశాసనా.

మ. అని సాత్రాజితి పల్కిన నగి పయోజాక్షుండు మై దువ్వి చి
     ల్కను చేపట్టి నవాతు మేపుచును బాలారత్నముం దానుఁ గొ
     ల్వునకున్ వచ్చి కడానిరేకుపనిబెళ్కుల్ గుల్కుప్రాంగెపుత
     ళ్కునకాసీపనిపీఁటపైఁ జెలువుతోఁ గూర్చుండి పిల్పించఁగన్.

ఉ. వేగ సరాతి దాఁటి మఱి వింతశ్రమంబు తగన్ దివాణపు
     న్వేగరులుం జమూపతులు వీరులు గుంపులు గూడి దయ్యపు
     న్వేగరి ముందఱ న్నిలిపి వేమఱు మ్రొక్కుచు వీఁడు బాశెపున్
     బాగులు మాయఁ గన్గొనఁగఁ బట్టుక వచ్చితిమయ్య నావుడున్.

తే. శౌరి విస్మయమునఁ జూచె సారి కతని
     చూపు సోఁకిన దయ్యంపురూపు మాని

     చొప్పు మార్చినగతి వింతసొబగు మీఱ
     దాల్చె నెప్పటిబాఁపనతనువు వాఁడు.

క. అప్పుడు హరి వెఱఁగందుచుఁ
     గప్పురగంధియును దానుఁ గడుమోదముతో
     నప్పాఱుబ్రహ్మవర్చస
     మొప్పారుట యోర్చి మదిని నూహింపంగన్.

ఉ. చిత్త మెఱింగి యి ట్లనియె శ్రీపతితో వెడవింటిపాదుషా
     తత్తడి, సామి వీఁడు మును దయ్యపురూపున వచ్చి యిప్పు డీ
     యుత్తమవర్ణలీలఁ దగ నుంటకు హేతువు గాఁగఁ దత్పురా
     వృత్త మొకం డిలం గలదు వింతగ నే నది విన్నవించెదన్.

క. అతులకుతూహలఖని యై
     యతులకు గృహమేధిజనుల కావాసం బై
     తతసాధుతపో౽రణి యై
     శ్రుతసారణి యనెడియూరు శోభిలు జగతిన్.

క. ఆయూర నొక్కవిప్రుఁడు
     మాయూరగరున్నిభాంశుమంతుఁడు దాంతుం
     డాయతమతి యతిశాంతుఁడు
     హాయిగ మను నుచితవృత్తి నచలుం డనఁగఁన్.

ఉ. ఆయచలాహ్వయుం డెపుడు నంబురుహోదరపాదపూజనో
     పాయము సంఘటిల్ల ముదిప్రాయమునందు స్వకీయజాయ యౌ
     మాయయెడ న్రహి న్వికటమారుని శ్రీనలు నీలునిం గజున్
     గాయజతుల్యమూర్తుల వికల్మషకీర్తులఁ గాంచె నల్వురన్.

క. రయమున వా రండఱు న
     ధ్యయనాధ్యాపనవిధమ్ము లన్నియు నే ర్చ
     న్వయమునకు వన్నె దెచ్చిరి
     నయనానందం బెసంగునలువు చెలంగన్.

తే. అటుల పటుతరపాండిత్య మమరుసుతులఁ
     గాంచి మాయాసమేతుఁడై ఘనతఁ దండ్రి
     పరువము లెఱింగి తగినట్టి బంధుజనుల
     యిండ్లబాలామణులఁ దెచ్చి పెండ్లి చేసె.

మ. కృతపాణిగ్రహులై కుమారకులు కూర్మిం దల్లియుం దండ్రియున్
     సతతంబున్ దముఁ బ్రోది సేయఁ బ్రజ మెచ్చన్ సర్వకార్యస్వతం
     త్రత నిట్లన్ వహియించి కేశవసపర్యాస్నానదానమ్ములన్
     శ్రుతిఘోషం బతిథిప్రమోదమును నెంచున్వీఁక వర్తింపఁగన్.

తే. తరువు లన్నియు ననఁబారుమురువు దెచ్చు
     గచ్చు హెచ్చంగ నామని వచ్చినటులు
     ధరణిసురనందనులకు నందఱికి బాగు
     మెయిసొగసు దేరునూనూగువయసు వచ్చె.

క. జవ్వన మిటువలెఁ దమమై
     నివ్వటిలం కొన్నినాళ్లు నెలఁతలుఁ దాముం
     బువ్విలుతుకేళి నందఱు
     మవ్వంబునఁ దేలి రంత మరు విధివశతన్.

క. గార్హస్థ్య ముడిగి పురిలో
     నర్హాచారంబు మాని యంబాజనకుల్
     గర్హింప నన్వయోచిత
     బర్హిర్విధు లెల్ల మాని పాపాత్మకు లై.

మ. చరియింపంగఁ దొడంగి రందుఁ బరిహాసశ్రేష్ఠుఁడై జ్యేష్ఠుఁ డా
     పెరిమెం బట్టి కథ ల్వచింపుచుఁ దనుం బిల్పించుఁ బిల్వంగ ని
     ద్ధరఁ బెంపొందెఁ దృతీయుఁ డోహటపువింతల్ చూపుచుం గుక్కలన్
     మరఁగెం జేరెఁ జతుర్థుఁ డంత్యకులభామన్ పేరు సార్థంబుగన్.

క. అందు ద్వితీయుఁడు తా నతి
     సౌందర్యము కుశలబుద్ధి చతురత్వంబున్

     గ్రందుకొనువాఁడ నని సం
     క్రందనసుతు[1]నట్లు సవతు గానక జగతిన్.

మ. తిరుగం గోరి భయంబు దీరీ తటినీతీరంబునందున్ జలా
     హరణార్థంబుగ వచ్చియున్నయెడ సయ్యాటంబు గాటంబుగా
     బెరయం దా నెలయించె మన్మథశరోద్విగ్నాత్ముఁడై యొక్కతెన్
     గరియానం గలవాణిఁ గాంచననిభం గల్యాణిఁ గంజేక్షణన్.

క. శ్రీనలుఁ డటు వలయించ
     న్మానవతీమణి యడంకు మాని స్మరధను
     ర్జ్యానాదమేదురిత చే
     తోనాదితమోహ యగుచుఁ దొడరె న్వానిన్.

వ. తొడరినఁ జూచి పైమడమ ద్రొక్కఁగ నవ్వుచు గువ్వ చిక్కెరా
     విడువ నటంచు నెంచుకొని వేమఱు దానికి మేను జు మ్మనం
     దడవుచు వెన్కఁ జూచు చొకదారిని నారిని శీతమారుతం
     బెడనెడ వీవఁ బూవుపొదరింటికిఁ దెచ్చెఁ గరంబు పట్టుచున్.

క. శుభనాముఁ డైనతాపసు
     డిభగామినిచెయ్యి వట్టి యీడ్చిన జటివ
     ల్లభుగాఁ దలంచి నవసౌ
     రభవద్వీటిక గ్రహించె రసికత మీఱన్.

క. వీడెము గొను జడముడిదొర
     చేడియయధరామృతంబు చేకొని సురత
     క్రీడాపరవశుఁ డయ్యెన్
     వేడుక విధుముఖియు నెదురువింతలు చూపన్.

సీ. నునుగుబ్బచనుమొనల్ మునిపంట మొరయుచో
                    నుల్కు నెమ్మెయితళ్కు కుల్కు లీనఁ

     గొమరు మీఱఁగఁ గపోలము గ్రమ్మి కఱుచుచో
                    [2]ననువొందుకనుమోడ్పు తనువు లీన
     నుక్కుగోరను కొంత పొక్కిలి నొక్కుచో
                    మ్రొక్కుచేతులటెక్కు చొక్కు లీన
     నింపుగా విడియంపుగుంపెనల్ నింపుచో
                    గల్గులేఁజిఱుమూల్గు లెల్గు లీన
తే. వికచపద్మాక్షి నంతరాళికము గాఁగఁ
     జతురగతి నాని చేయూని చంద్రకాంత
     మణిమయశలాక నలచందమామకరణి
     వెడవిలుతుకేళిఁ గరఁగించె విప్రమౌళి.

తే. అటులు గరఁగించికరఁగించి యళుకు దీర్చి
     హత్తి తొల్లింటిమగనిపై బత్తి జార్చి
     చేర్చి కౌఁగింటఁ గడిదేర్చి చెలిమి గూర్చి
     యతివ తమిఁ దిట్ట నోర్చి తా నిత వొనర్చి.

చ. సకినెలబిళ్లరీతిఁ బలుచందపుటందపుపారువాలపో
     లిక వగ నిక్కు డక్కి జవలీల జతుల్ హవణించినట్టు కొం
     కు కొసరు మీఱఁగా ములుకుగ్రుక్కుల మిక్కిలిఁ జిక్కువాఱఁ జి
     మ్ముకసరు గుట్టు నెమ్మెవిడుపుల్ మెఱయించె ద్విజుండు తద్రతిన్.

క. ఇటువలె గలిబిలికళ హె
     చ్చుట నట నిర్వురికి మేను ఝుమ్మన విటునిన్
     కుటిలాలక పైకొనియెం
     బుట మెగయుకడానికీలుబొమ్మయుఁబోలెన్.

సీ. గుదులతోఁ దొడ లాన నెదురు నాతనిఱొమ్ము
                    దురుసుగుబ్బలఁ గ్రుమ్మి త్రోసిత్రోసి
     కౌను గొప్పును గేలఁ గమిచి వాఁ డద రంటఁ
                    గెళకి సందిలి నొక్క నులికియులికి

     తివిరి చెల్వుఁడు లోఁబెదవి కాటు తవిలింపఁ
                    గ్రుక్కి యు స్సని చెక్కు గొట్టికొట్టి
     యుబికి మో వాని వాఁ డూకొన కరఁచొక్కుఁ
                    గెరలి తిట్టుచు నౌడు గఱచికఱచి
తే. మేను వసియాడఁ దమిఁ గూడ మెలుపుతోడఁ
     గౌను జవ్వాడ నవహారకలిక లాడ
     మరుఁడు జళిపించు గేదఁగికిరుసుకరణి
     మురిపెమునఁ బొంగి నటియించె మోహనాంగి.

క. చెవిచెంత నోరసిగపైఁ
     దవిలినకడవన్నెమెఱుఁగుతాయెతు లొరయన్
     జవరాలిపాదముల కా
     యవనీసురుఁ డెఱఁగె మన్మథావేశమునన్.

వ. ఇవ్విధంబునఁ గృతప్రణాముండై భూదేవుండు కిలికించితవతి
     నొడంబఱచి యిల్లు మఱపించి యెలమినారజపువగలు గఱపించి యిల్లాలి
     పద్దుల కెడఁబాపి చల్లని చిగురుమెట్టసొక్కించి తనవగకుఁ జిక్కించి వేశ
     వాటంబున డాయించి వెలిపాళెంబు వేయించి వింతగా నొకవిడిది సంత
     రించి విడియైదువులచుట్టరికంబు పొంగించి వెలిదేరవల దని జంకించి యేమి
     యు నెఱుంగనియతనింబలె నిజగృహంబునకు వచ్చి వినీతుండునుంబలె నిత్య
     కృత్యంబులు హెచ్చి పితృసన్నిధానంబునకు వచ్చి సుగుణనిధానంబునుం
     బోలె నుండె నంత.

సీ. శ్రీమనోహరునభిషేకంబు సేయుచో
                    మగువ మజ్జనమార్చువగలు దలఁచుఁ
     బూతాత్ముఁడై దేవపూజ యొనర్చుచోఁ
                    బూఁబోఁడి గైసేయు పొలుపు దలఁచు
     వేడ్కతో హరికి నైవేద్య మర్పించుచోఁ
                    [3]జెలి కపోసన మిచ్చుచెలువు దలఁచుఁ

     దేటయౌ హరిపాదతీర్థంబు గ్రోలుచోఁ
                    దెరవవాతెర నానువెరవు దలఁచు
తే. దైత్యభేదిపదానుసంధానవేళ
     నంగనారతిపారవశ్యంబు దలఁచు
     ద్విజుఁ డటులు పాడి మీఱి క్రొవ్విరి లకోరి
     చెనఁటిభూతంబు సోఁకఁ దా సిగ్గులేక.

సీ. పారువాపలుకులతీరు వాటిల దంచుఁ
                    దొలుపల్కులు గణించుతలఁపు మానె
     దాళిగోణము గట్టు బాళి యేర్పడ దంచుఁ
                    గావిదోవతి గట్టుకడఁక మానె
     నేవళంబులు దాల్చు ఠేవ లలర వంచుఁ
                    దులసిపూసలు [4]దాల్చుతొడుసు మానె
     గందంబుఁ బూసిన యందంబు లే దంచు
                    బూది మేనునఁ బూయుపొల్పు మానె
తే. గుంటెనలు సేయువారితోఁ గూడి యుండు
     కులుకు చన దంచు సజ్జనగోష్ఠి దక్కి
     చెనఁటియై పాఱుఁ డీరీతిఁ దనువు మఱచి
     తరళలోచనపై మించుతలఁపు లెంచు.

సీ, మారుబీరముచేత బారుబీరము చిక్కు
                    లెడలించుపెట్టెలో ముడుపు లాగుఁ
     బూతసొమ్ములు కొన్ని పొసఁగించి పూసబొ
                    ట్టును నింటఁ గలయంతయును హరించు
     భరతంబు వీణె తంబుర నేర్వవలె నంచు
                    సానికూఁతులయిండ్లచాయఁ బోవు
     బొన్నూరికిఁ జదువఁబోదు నను నెపానఁ
                    దా నున్నపురవీథి దాఁటి పోవు

తే. వెడలి వెలయింతికడ కేఁగువేళ మేనఁ
     జెలువుగాఁ బూనుపికిలివన్నెలు సడల్చి
     యేమి యెఱఁగనియట్ల తా నింటఁ జేరుఁ
     గొన్ని నా ల్లిట్లు నెమ్మదిఁ గొంకికొంకి.

క. చక్కెరవిల్తుని చిక్కులఁ
     గక్కసిలం దనదుమనసుకాఁకలు దీర్పన్
     చక్కనిగుబ్బలమక్కువ
     యుక్కలపున్ మనసుతపసి యువిద కలిగియున్.

శా. ప్రాతస్స్నానముఁ జేతు నన్నెపము మీఱన్ వేగుజా మైనచో
     స్వాతంత్ర్యమ్ముగ నిద్రలేచి వెలిత్రోవల్గాచి యచ్చోట సం
     కేతంబు ల్వెలయంగ జారిణుల స్రుక్కించున్ తమిం గూడి యెం
     త్రేతృప్తుం డయి యంత యేటి కరుగున్ నిష్ఠాగరిష్ఠాకృతిన్.

సీ. కలశభవశ్రీలఁ దలఁచి ప్రసంగించుఁ
                    గువలయాక్షులచన్నుఁగవలు చూచి
     నదనదీయాఖ్యాననటనము ల్మెఱయించుఁ
                    బడఁతులనెఱికప్పుజడలు చూచి
     శంఖస్మృతిమహత్ప్రశంసలు గావించు
                    రమణులమేలికంఠములు చూచి
     శుకవాక్యమహిమవిస్ఫురణంబు మెఱయించుఁ
                    దరుణులరహిపల్కు తెఱఁగు చూచి
తే. తలిరుఁబోఁడులు నీరాట సలుపునెడల
     మందులను జేసి యచటిబ్రాహ్మణుల నెల్ల
     స్నానములు చేయుకైవడిఁ దాను నచటి
     విప్రులనుబోలె నాధూర్త విప్రమౌళి.

క. గాయత్రి నొడివి ద్విజవరు
     లాయెడ మౌనంబునన్ సహస్రావర్తుల్

     సేయునెడఁ దాను మన్మథ
     గాయత్రీజపము సేయుఁ గలుషాత్మకుఁడై.

చ. అల జవరాలిపెందొడల నంటినక్రొంబసపుంబిసాళిని
     గ్గులు తెలిచల్లడంబుతుదఁ గుట్టినబంగరునీలికండెతీ
     వెల కెనయై చెలంగుపదివేలవిధమ్ములకోడెగాండ్రతో
     గలిసి చరించె వాఁడు నడకాకి యనన్ నడువీథిలోపలన్.

మ. బురుసాకుచ్చులతాళిగోళము కళల్ పొల్చొందనెత్తావిక
     ప్పురవీడెంబును మోవికెంపుజిగిపెంపున్ జెంపగోరొత్తులున్
     మెఱుఁగుంగస్తురిగిరునామములయెమ్మెల్ మీఱఁగా మించె న
     ప్పురి లేఁబ్రాయపుఁగోడెకాండ్రు తను గుంపుల్గూడి వెన్నాఁడగన్.

చ. చెకుముకిరాయి దూదియును చిన్నపుపోగర కోవిచెంబు ల
     త్తుకజిగిపోఁకపాళె యొరఁదోపినగంటము సూరకత్తి మ
     ల్కుకొలికి వట్రువంబుపొరలోపలిసంబెళ సున్నమాకు లి
     చ్చకముగఁ బూని బోడిగలు సారకు మడ్పులు చుట్టి యియ్యఁగన్.

సీ. రదనాగ్రమున మించునుదిరిబంగారుమొలల్
                    కసిగాటుమోవిపైఁ బసిమి నించ
     నునుజిగిమించునూనూఁగుమీసపురేఖ
                    మోముపై నొకవింతగోము నెఱప
     సికమీఁదఁ జుట్టినచెంగల్వవిరిదండ
                    జిల్గురుమాలపై జీరువారఁ
     దోడెంపునవ్వుల తులకించువెన్నెలల్
                    ముత్యపుసరులపై ముద్దుగురియ
తే. మించుమించులమించుగ్రొమ్మించు నెఱయఁ
     బదములను గుల్కుబిరడలపావ లమరఁ
     బంత మెద హెచ్చ సేమంతిబంతి పూని
     ప్రోడయై క్రుమ్మరుచునుండు భూసురుండు.

సీ. వీథిలోఁ దిరుగాడువేడుకకాండ్రకు
                    స్త్రీలకుఁ గలహముల్ తీర్చితీర్చి
     యేకాంతమున నున్నయించుఁబోఁడుల కెల్లఁ
                    దీరుగా నామముల్ దిద్దిదిద్ది
     సూళెగేరులచాయ వాలాయముఁ జరించు
                    చెలులకుఁ బ్రియములు చెప్పిచెప్పి
     తరితీపుచేసి యెంతయు రూకఁ జెల్లించు
                    దూతికుటీరంబు దూఱిదూఱి
తే. చదువు లెగనాడె నీతులు పదటఁ బుచ్చె
     గురుజనము మాట నిరసించెఁ గులము ముంచెఁ
     బురజనము చూచి నవ్విన సరకుగొనక
     యెగ్గు విడనాఁడు బాపనయెక్కుటీఁడు.

సీ. పూబోదెకోలచేఁ బొదలబయల్ చిమ్ముఁ
                    జిమ్మి యంతనిలాకచేయి మార్చు
     మార్చి యెదుట వచ్చుమగువలపైఁ దూఱు
                    తూఱి వెన్కకు నచ్చి సారె నవ్వు
     నవ్వి రుమా ల్వీడ నవ్వలివ్వలఁ జూచుఁ
                    జూచి చొక్కునఁ దానె సొంపు మెఱయు
     మెఱసి చెంగట వచ్చు నరదికాండ్రను రేఁచు
                    రేఁచి వారిని కూకరించి పోవుఁ
తే. బోయి తమి హెచ్చి వస్తివుపొందుఁ గోరి
     యపుడె యడపంబు బుడుతచే నడగ నంపు
     నంపి యది యొప్పకుండిన నదరు పెట్టు
     మరలి యానీచుఁ డెప్పటి [5]తెరువు గాంచు.

ఉ. గాయకుఁ డమ్మహీసురుఁడు గ్రాంథికుఁడో యని లోకు లెంచ వా
     లాయము శాస్త్రముల్ చదువులాగున నొక్కయెడన్ గొణంగుచున్

     నాయికరీతియున్ కళలు నాయకజాతియు నిర్ణయించ వా
     త్స్యాయనసూత్రముల్ రతిరహస్యముఁ జూచు నపేతశంకుఁడై.

ఉ. నీటునఁ దాను వచ్చునెడ నిక్క ముచుట్టఱికంబు దెల్పి య
     ప్పాటలగంధితో సదరుపాటున నూరక యెవ్వఁడేనియున్
     మాటున మాటలాడఁ గని మాటికి మీసము దువ్వి యొంటిపో
     ట్లాటకుఁ బిల్చు వాఁడు ద్విజులందఱు నచ్చెరువంద నచ్చటన్.

క. ఆహిరియును మాహురియు బి
     లాహిరియును పాడికొని కిలార్చుచు గురుదా
     నోహరిసాహరి చిమ్ముచు
     లాహరి తగఁ దిరుగు నతఁడు లంజయుఁ దానున్.

తే. అటులు విడివడి తిరుగాడునవసరమున
     ధరణి శుభనాముఁ డగుజడదారిరాయఁ
     డాత్మగృహిణి గ్రహించినయందువలనఁ
     గనలి శపియించె రక్కసి గాఁగ నతని.

క. కడు శాప మొంది. వేఁడుచు
     గడగడవడఁకంగ నతని గరుణను మగుడన్
     జడదారి పల్కె రక్కసి
     వెడఁగ చనుము కృష్ణుఁ జూడు వెఱవకు మనుచున్.

తే. వెఱపు దీర్చినఁ దాపసివిభునియడుగుఁ
     దమ్ములకు మ్రొక్కి రక్కసితనముఁ దాల్చి
     ద్విజుఁడు [6]నరకాసురుని జేరి తిరుగు, నిప్పు
     డందె శాపవిమోక్షణం బతఁడె యితఁడు.

క. అని ముద్దుచిలుక వివరిం
     చినపుడు జోహారు చేసి శ్రీనలుఁ డంతన్
     మనమున సమ్ముద మొనరఁగ
     వినయమ్మున విన్నవించె విభుఁడు వినంగన్.

క. నీపాదదర్శనంబునఁ
     దాపముఁ బాపంబు నెడలె ధన్యుఁడ నైతిన్
     శాపవిమోక్షణ మయ్యెను
     గోపాలవతంస దైత్యకులవిధ్వంసా.

క. నెరసంజఁదొట్టి యొంటరి
     ధరణిం దమిఁ గూముకతన దైత్యుండై యా
     నరకాసురుండు పుట్టిన
     యెరపరికపుగాథ యెఱుక నెఱుఁగుదువెకదా.

క. స్థల జల వన గిరిదుర్గం
     బులఁ జనుప్రాగ్జోతీషాఖ్యఃపురమున సురకాం
     తల నరకాంతలఁ జెఱఁగొని
     వెలయున్ నరకాసురుండు విభవోన్నతుఁడై.

మ. జగముల్ బెగ్గడిలన్ నభంబు పగులన్ శైలంబు లూటాడ మెం
     డుగ బ్రహ్మాండము నిండ నుద్భటభటాటోపంబు మీఱన్ సురో
     రగ విద్యాధర సిద్ధ సాధ్యబలదుర్వారప్రతాపోన్నతిన్
     తగు నెంతే నరకాసురుండు రణవిద్యాచండపాండిత్యుఁడై.

సీ. పరిచారకులు గానిసురనాయకులు లేరు
                    చెఱఁ బడకున్నయచ్చరలు లేరు
     హుజురుపాటకు రాకయున్నజక్కులు లేరు
                    మణుల నియ్యనియేటిమగలు లేరు
     వేళఁ గావకయున్నవిద్యాధరులు లేరు
                    వరుసలు గొననికిన్నరులు లేరు
     యుద్దాలు చే నెత్తకుండుసాధ్యులు లేరు
                    మోపులు మోయనిమునులు లేరు
తే. అక్షయపరీకృతాఘూర్ణతాక్షియుగళ
     గండమండలుఁ డగు నరకాసురుండు

     హాలహలలీలఁ జెండుబెండాడువేళఁ
     దరళగతిఁ జెందు నీచరాచరమునందు.

క. అకృతకరగ్రహలు తటి
     త్ప్రకరోపమవిగ్రహలు చెఱంబడి యున్నా
     రలంకచరిత రాజ
     న్యకసుతలు పదాఱువేవు రసురపురమునన్.

ఉ. ఆరమణీలలామము లహర్నిశమున్ నినుఁ గోరుకోర్కు లీ
     డేరఁగ దానవేశ్వరు వడిన్ బవరమ్మునఁ గొట్టి వారలన్
     ద్వారకయందుఁ జేర్చుకొని వైభవ మెచ్చఁగ నిచ్చ గెల్పురా
     బీరము తోరమై పొసఁగఁ బెండ్లి యొసంగఁ దలంచు శ్రీపతీ.

తే. నిశిచరుఁడు గాన తద్భటనివహ మెల్ల
     గొలువ రే యెల్లఁ గొలువుండి కొంకు దీర
     నసుర వేగిన నిదురించు నందువలనఁ
     గలుగుఁ బగలింటిపోరున గెలుపు నీకు.

తే. అనిన శ్రీనలుఁ గరుణించి యాదరించి
     నవ్యకాంచనపటభూషణము లొసంగి
     ముందుగా వాని నుక్కళంబున వసింప
     ననిచె విజయంబు గోరి యయ్యసురవైరి.

శా. భాసిల్లెన్ నిజసోదరేందుసుభగంభావక్రియావీక్షణో
     ల్లాసోదారముకుందదారకృతలీలాలాస్యసారస్యభృం
     గీసంగీతతరంగితాబ్జరుచిభంగీజాతరంగోల్లస
     త్కాసారాబ్ధితరంగజాలము శరత్కాలం బవేలంబుగన్.

సీ. జలదయాతాయాతసరణు లన్ని యడంగెఁ
                    గలహంసకులమందంగతు లెసంగెఁ
     గెరలి జోడునెమిళ్లు కేకలు చాలించె
                    రాచిల్కపల్కులరాణ మించె

     బెడబెడ మను గొప్పవడగండ్లజడి నిల్చె
                    రసదాడిముత్యపుముసురు పొల్చె
     గూడకొంగలబారుకూఁతరాయిడి విచ్చె
                    క్షితి శాలిపాలికాగీతి హెచ్చెఁ
తే. కడఁగి సడలుచు మొగిలిపుప్పొడులు వీఁగెఁ
     గమ్మనెత్తమ్మికలువపూదుమ్ము రేఁగె
     వింత యిది యెంచ ననెడినివ్వెర నటించ
     మొనసి నానాఁట వెలుతురు మొగులుపూట.

క. మీసరములు సమలలితాం
     గీసరములు సురభికుందకేసరములు స
     త్కాసరములు తతజలదని
     రాసరములు భాసిలెన్ శరద్వాసరముల్.

క. మెఱుఁగులపేరిటిప్రాయపు
     దరుణుల నెడఁబాసి విరహధవళిమ గొని త
     త్తరమున నడరెడివడువున
     బెరయుచు నీరదకులంబు వెల్వెలఁబాఱెన్.

సీ. హృద్యతరోద్యానపద్యలఁ జెలు వొందు
                    కుందబృందంబులఁ గొంతసేపు
     హరువుగా నొండొంటి నంటి ఘుమ్మన జంట
                    గోరంటగుత్తులఁ గొంతసేపు
     నవనీయకాసారనవసౌరభోదార
                    కువలయవనసీమఁ గొంతసేపు
     పొంగారుమస్టేనుంగుకస్తురిగబ్బు
                    గుబ్బతిల్లెడిచెంతఁ గొంతసేపు
తే. కొలువు సేయుచు విహరించు కోడెతేఁటి
     గుమురు కొమెరలతో వేడ్కఁ గూడి యాడె

     సమ్మదమ్మునఁ గమ్మనెత్తమ్మితేనె
     గ్రోలి యవ్వేళఁ జొక్కున వ్రాలివ్రాలి.

ఉ. కన్నులడాలు కుంతములకైవడి వింతలు చూపుకాపులే
     యన్నులమోవి బింబఫల మంచును చేరఁ దలంచి మించి పై
     రెన్నుల ముక్కులం గమిచి యింపుగఁ బెంటుల నంటి చూడికన్
     గన్నన నేఁగురామచిలుకల్ రహి నఱ్ఱులు సాఁచుఁ జెంగటన్.

ఉ. ఆతఱి మందయందుఁ బడునట్టుగఁ గొమ్ముల గట్లఁ గ్రుమ్మి లో
     బోతర మొప్పఁగా మరునిపోరునకై గమకించి పైపయిన్
     మ్రోఁతకు హుంకరించి మెయిమూర్కొని మూతుల నెత్తిహత్తి యాఁ
     బోతులు ఱంకె వేయుచును బోరనఁ జేర నమాంసమీనలన్.

క. కమలములు పాకవినతం
     బులు నగుకల్హారచయము మూర్కొని క్రిందన్
     వలపునకుఁ జొక్కుకైవడిఁ
     దల లూఁచుఁన్ పైఁడి నుక్కు తళతళ మీఱన్.

సీ. కలువలసంగాతి చెలువులమజ్జాతి
                    యివముపుట్టువిళాతి యింపుజోతి
     [7]తొలిజోగిముడిపూవు బలుజక్కవలగావు
                    నెలరేవలపుప్రోవు నింగితావు
     ఒజ్జనెచ్చెలిమేలు యొరవువెన్నె లచాలు
                    కడలిరాయలచూలు కళలప్రోలు
     మరునివజ్రపుతాళి మలయురిక్కలబాళి
                    యెడయుజోడువిరాళి యిరులజాలి
తే. చురుకుడాల్ జంట తపసిరా చూపుపంట
     సోయగపుఠేవ కనుబాటు చోటియావ
     తామరలబంది కఱిమేను రామఱంది
     తేటఁ బాటిల్లె జాబిల్లి తేజరిల్లి.

ఉ. నీరధరాళిపేరఁ దగు నీలపుబిందెల వ్యోమలక్ష్మి య
     వ్వారిజనేత్రునెయ్యమున పంచినముత్తెపుతేటనీటఁ బ
     ల్మాఱును రాజురాకకకయి మజ్జనమాడి దిగంగనామణుల్
     వారకతాల్చుచల్వవలువల్వలె నిండెను పండువెన్నెలల్.

క. కేవలమై మదిఁ బొగ రట
     తావలమై నిలువఁ జలువ దనువుననువురా
     క్రేవలమై సొలయుచెలుల్
     కేవలమైరేయపానకృతనిశ్చయలై.

రగడ. అటువలె వెన్నెల లంతట నిండఁగ
                    విటులును దామును వేడుక నుండఁగ
     వితమరులై యావెన్నెలలోపల
                    రతులకు నితవగు రతనపుఁదావుల
     కొమరుగఁ బండినకుంకుమబైళ్లను
                    ప్రమద మెసఁగ మర్వపుఁబందిళ్లను
     పలకలఁ దగునడబంగరుసజ్జల
                    దళమగుఁ కువలయదళములసజ్జల
     నెఱసరిగెంపుల నెలవుందాపల
                    చిఱుపనిమిసమిసజీనపుఁజాపల
     నలరులఁ గడు ఘమ్మనునెలఁదోఁటల
                    తళతళమనియెడి దంతపుపీఁటల
     నొండొరు లుండఁగ నొరపులు మీఱుచు
                    నండజయానలహళహళిఁ గేరుచుఁ
     బలికిససురవలువలు ధరియింపుచుఁ
                    బులుపులు తగఁ దొడవులు మెఱయింపుచుఁ
     గలకలఘమ్మనుకలపముఁ బూయుచు
                    మలఁగక మఱిమఱి మైఁ గై సేయుచు
     దళసంచునుతవతంబుర ఘమ్మన
                    దళవుగ ఢక్కలు దగ ధింధి మ్మన

     సొగసుగఁ గామునిజోలలఁ బాడుచు
                    మొగమోటపురతముల నోలాడుచు
     నిగరపుజిగిచిఱునగవులఁ దక్కుచు
                    సగము గొఱకి ఫలచయముల మెక్కుచు
     మెఱుఁగులు దేరఁగ మిరియపుగాలికి
                    బురబురమని నిలఁ బొగచినయాలికి
     పొలుపులఁ దగ మెకములమూలుగులును
                    తలకొని జగదొంతులవాలుగలును
     కొలఁది యెఱుంగనికోర్కుల నంజుచు
                    నలువగు రుచులకు నాలుక గుంజుచు
     రహి మీఱిన నునురజతపుదొన్నెల
                    మిహిపైఁడిజగామేలిమిగిన్నెల
     జిగిదగుముత్తెపుఁజిప్పలచెంబుల
                    పొగరు నింపు కెంపులకలశంబుల
     పలువగపగడపుపాణిద్రోణుల
                    నెలరాతెలివెన్నెలసింగాణుల
     నెఱకఱిజిగిఁ దగునీలపుజారుల
                    పరిగొనువిడిజిగిపచ్చలకోరల
     వినుత మైనతావిని దగి యుత్తమ
                    యనఁ దగుకెంజాయలగంధోత్తమ
     తగియనివెడజిగిధిగధిగ నిండుగ
                    పొగరున నగుజగభుగభుగపండుగ
     నించినించి నెఱనీటులఁ దేలుచు
                    ముంచిముంచి కడుముదమునఁ గ్రోలుచు
     మానమతంగజమదపూరమె యిది
                    సూనాశుగనృపసుఖసారమె యిది
     గానాంభోనిధికల్లోలమె యిది
                    తానామృతకందళజాలమె యిది

     యనుచు ననుచుతమి నతిశయిలంగను
                    కొనుచుఁగొనుచు మది కోరిక పొంగను
     తనిసితనిసి మది తహతహ మించను
                    కినిసికినిసి ప్రియుకిలకిల పెంచను
     గునిసిగునిసి మది గుజగుజ హెచ్చఁగ
                    నెనసియెనసి మరుహిజుగులు విచ్చఁగ
     పదరిపదరి విటువైపులు నవ్వుచు
                    పదరిపదరి విరిబంతులు రువ్వుచు
     నదరియదరి భువి నలయక వ్రాలుచు
                    నుదరియుదరి తమమూరట దేలుచు
     కొదిగికొదిగి పలుకులు వచియింపుచు
                    పొదలిపొదలి వెఱబూమె నటింపుచు
     పెదవికెంపు చనఁ బ్రియులను దిట్టుచు
                    నొదిఁగినవారల నుదుటనఁ గొట్టుచు
     నిందింపుచు మరి నేరము లెన్నుచు
                    నందెలు ఘల్లన నడుగులఁ దన్నుచు
     మోహపువగలో మునుఁగుచుఁ దేలుచు
                    నూహ లెఱుంగనియువిదలఁ బోలుచు
     మీటగుముదమున మేలిమిఁ జెందిరి
                    నీటుగ వెంబడి నిదురను బొందిరి
     తేఁకువ నందఱు తెల్వి యెసంగను
                    వేకువ మేల్కని విలసిల్లంగను
     కుక్కుటకులములకూఁతలు మీఱెను
                    దిక్కు లన్నియును దెలతెలవాఱెను
     కొలకొలమని పులుఁగులు నెలుఁగించెను
                    వలపులఁ దగి కలువలు ముకుళించెను
     సారసములు నిచ్చలు వికసించెను
                    వారిజినీపతి వడి నుదయించెను.

మ. అపు డావేగరి వేళఁ దెల్ప నెలగోలంటంగ గీర్వాణరా
     డ్రిపుసేనావిసరమ్ము గ్రమ్ముకొని పేర్మి నుల్లసిల్లంగ గో
     రపుపేరమ్మునఁ దూలి తా మని యొనర్చం బేర్చి రాశానట
     ద్వ్యపదేశుల్ యదువృష్ణిభోజకుకురావంతీశ్వరుల్ వింతగన్.

క. వారలసేనలపై దుము
     దారుగను మురాసురుండు తనయులుఁ దానున్
     బోరన పో రొనరించెను
     ఘోరనరాశనకులంబు కో యని యార్చెన్.

క. పురు డింత లేక యురువడి
     మురుఁ డంభోవరణమధ్యముననుండి యనిం
     జిరజిరలు నెఱయ దరిసిన
     వెఱపున నలరాచసేన విఱిగెన్ విఱుగన్.

క. భూదేవమంగళాశీ
     ర్వాదంబులు నిండఁ బైఁడిపావడలరుచుల్
     సౌదామినులవలెను నా
     నాదిశల న్మెఱయఁ దా ఘనస్థితి బెరయన్.

సీ. కోదండటంకృతుల్ వేదండఘీకృతుల్
                    హేషితంబులు నాటభాషితములు
     స్యందనారవములు వందిసంస్తవములు
                    కుంతఘంటలయులి గొరకరవలి
     పటహనినాదముల్ భటసింహనాదము
                    లొంటరినుడిపద్దు లొంటెసద్దు
     విజిగీషుహుంకృతుల్ వేత్రులహోంకృతుల్
                    దళములకూత వాద్యములమ్రోత
తే. యేకమయి లోక మగలించుఢాక మించ
     మేచకౌపాంగతోఁ బాపమేఁతపక్కి

     జక్కిపై నెక్కి గోపాలచక్రవర్తి
     వెడలె నరిపైని నెడలేని కడఁక పూని.

వ. ఇవ్విధంబున గుడారు వెడలి కడలిపొంగినవగ నడచు నిజబలం
     బులఁ బురికొల్పి పరబలంబుల నరికట్ట నిల్పి శైలశస్త్రజలజ్వలనపరిథిసం
     సర్గంబున దుర్గమంబై నిసర్గక్రూరతాధారదనుజవీరపరివారవేష్టితాశావ
     కాశంబగుమురపాశంబు గదాకుంతసౌరవారణనాగాస్త్రంబుల విదళించి
     గరుడని కదలించి మించినతత్పక్షవిక్షేపణక్షమాంతరిక్షానుక్షణలక్షితరూక్ష
     రూక్షాశుశుక్షణిసఖరయవ్యతికరజనితనినదాభిఘాతంబుల విశీర్యమాణనిశిత
     విశిఖసంఘాతంబుల మెరమెర బెరయ బిరబిర దొరయ నరిమురి గెరలి బిర
     బిర దరలి కఠినతరగదావిదారితఫణిపతగసురధరాసురుండగు మురాసురుండు
     వచ్చి హెచ్చినకినుక నపు డవుడు గఱిచి నిద్దురమబ్బున మెయి మఱచి
     భుజమ్ములఁ జఱచి కరచిరత్నరత్నరుచులు నెఱయ నఱచి యెఱచిదిండితం
     డంబుల నెచ్చరించి మిగుల మచ్చరించి యిరుగడల నెక్కిరింతలు నెలయఁ
     జిడిముడిగొరంతలు యిడుముల నడరునావులింతలు సూప నలంత యొకిం
     తయు లేక యయ్యసురాంతకుండు సూ డెనయ వేఁడిదశనవేటుపాటిల్ల
     నిరాఘాటపాటవమ్మున శిఖరిశిఖరపంచకంబగు తదీయశీర్షపంచకంబు
     ద్రుంచె త్రుంచిన నుదంచితసోత్సేకాయత్తచిత్తులై తత్తనూజాతు లేడ్గురు
     రుడ్గరిమ హెచ్చి విచ్చలవిడి పెచ్చు పెరిఁగి పంతంబులు మెఱయఁ గుంతంబు
     లొరయఁ గంఖాణమ్ముల నదలించి బాణమ్మురొదాలించి శరాసనంబులు
     మెఱయఁ బ్రాసమ్ములు ధళధళ దొరయ శూలమ్ము లెనయ భిండి
     వాలమ్ములు మొనయ వాలంబు లొండొంటి నగ్నులంటి మండ శైలశిలా
     జాలమ్ములు నిండ సంస్ఫోటచటులభటపటలవిస్ఫోటితంబులు విలయసమయ
     విజృంభమాణకుంభీనసకులజంభరిపుపదకటకసముత్తంభితకరతటరటితపటు
     తరడమరుఢిమఢిమద్రఢిమవిడంబంబునఁ గృతాడంబరంబులు చూపఁ గినిసి
     వినిశితవిశిఖపరంపరలాడు విజయసైనేయమాద్రేయులం బొగడి బీరమ్మున
     నెగడి యరికుమారవీరపరివారమ్ము సమరప్రకారమ్ము దెగడితెగడి కబ్బిత
     గడబ్బిరవగల గెబ్బునల్లనల్లత్రావుడుచెలులపెడబొబ్బలు గుబ్బతిల్ల నబ్బు

     రంబున పైనొరఁగి పోరుచు బిబ్బోకవతిగబ్బిగుబ్బమొనలసోఁకులతబ్బిబ్బు
     లేనితమి యుబ్బరంబున మబ్బు దేరి యని నిబ్బరంబున తొలిగిబ్బరౌతుగబ్బి
     తనము మీఱి యబ్బలిబంధనుండు చిందనశిఖిశిఖాసహస్రంబులు నహర్మధ్య
     నయనదురారాద్యతమందితమందేహరపుసహస్రంబు లనువొందుచందంబున
     దళితామిత్రతనుత్రశిరస్త్రంబులగు నస్రంబు లేసి రేసి డొక్కలుచించి
     ముక్కులు భంజించి కాళ్లు గోరించి వ్రేళ్ళు గారించి తొడలు తుండించి
     మెడలు ఖండించి శిరంబులు డించి కరంబులు ద్రుంచి యురమ్ములు వ్రక్క
     లించి యుదుటున నగ్గలించి కుమ్ములు పరఁగ నెమ్ములు విఱుగ నాయమ్ములు
     సొరఁగ రక్త ధారానికాయమ్ములు దొరఁగ కన్నులు దిరుగఁ గబంధంబు
     లవనిం దొరుగ నొక్కమొగి నక్కుటిలారిమురకుమారుల నుక్కుమిగులం
     జక్కాడి ప్రశాంతపరరాజన్యంబును ప్రక్షిప్తనిఖిలరక్షోదనుజదౌర్జన్యం
     బును ప్రశమితదైతేయజన్యంబును ప్రపంచితవందారుబృందారకసౌజన్యం
     బును నగుపాంచజన్యంబు నొత్తిన యుగెత్తుగ నత్తమిల్లుతత్తరంబునఁ గులా
     చలంబులు కూలె, కుంజరంబులు వీలె, ధరణి చీలె, తరణి తూలె, నభంబు
     వ్రాలె, నక్షత్రంబులు రాలె, సాగరంబులు శోషిల్, సకలదిక్కుంజరంబులు
     ఘోషిల్లె, భువనంబు లన్నియు నోహటిల్, బోరునను రోదసి నివ్వటిల్లె నంత
     నావృత్తాంతం బంతయు నాకర్ణించి మురాపదానము లభివర్ణించి కల్పాంత
     దుర్దాంతచండిమ మెండుకొనం దగుదండధరుండునుంబోలె మండిపడి మచ్చ
     రంబున నుండి యుండి నానావయవనటితనవమణి భూషణకిరీటవరకుండలుం
     డైన నరకుండు కోదండంబు కేలఁ గొని వేదండంబుపై నెక్కి తనయిరు
     చక్కిఁ గ్రిక్కిఱిసి యనేకవేదండంబులపై నుండి చెండివేనెలవరితండంబులు
     నిండి రా నెదుట నరదంబునందుండి తనతనయుండైన భగదత్తుండు ముందు
     నడువఁ బడవకై వచ్చె నంత.

క. అయ్యసురేంద్రతనూజుఁడు
     దయ్యపుమూకలను గూడి దళములఁ గవియన్
     కయ్యంబునకు న్వడముడి
     యయ్యెడ నెదిరించెఁ బంకజాక్షుఁడు చూడన్.

క. ఎదిరించిన భీమునికై
     బెదరించుక లే కెదిర్చి పెళపెళ నార్చున్
     ముదమున నలభగదత్తుఁడు
     గుదిగొనునునుగన్నెరాకుకోలల నేసెన్.

ఉ. ఏసిన బాణపాతముల కెంతయు రేసి రణంబుఁ జేసి హా
     వాసికి వచ్చినావొ యదువల్లభు డాసి తలంపు మాసి రా
     కాసిపిసాచిగా యనితిగాశిరుధాత్తి హిడింబికారతా
     భ్యాసి నకాసిచాయలకరాసిని దూసి కిలార్చి పేర్చినన్.

క. గద చేకొని యరదము డిగి
     మదమున భగవత్తుఁ డపుడు మార్కొనెఁ దానున్
     గుదియ గొని రథము డిగ్గుచు
     నదలించె బకారి భృత్యుఁ డసి నొర వేయన్.

క. అప్పు డని దెప్పరమ్మున
     ముప్పిరిగొనుకినుక నిగుడ మొనసి గుదియపెం
     జిప్పళ్లగుప్పుగుప్పున
     నిప్పుక లొగి నుప్పతిల్ల నిలిచెం బెలుచన్.

ఉ. బాహువు లప్పళించి బహుభంగుల మించి గ్రహంబు వెన్కగా
     నూహ లొనర్చి నిల్చి విజయోన్నతిఁ గోరుచుఁ బొల్చి జన్యస
     న్నాహము దేహచేష్టలఁ గనంబడఁగాఁ బరవళ్లు చుట్టుచున్
     శ్రీహరిసేనలున్ దనుజసేనలు చూడఁ గడంగ వీడఁగన్.

మ. మొనసోఁకుల్ మెరయింపుగుండ్లు మొరయింపున్ రేక దోకింపుచు
     ట్టునపుట్టున్ బెడఁగొట్టుగుట్టుపరివట్టుం గొట్టి నవ్వీటిగొ
     ట్టును ముక్కాళయు గొక్కెసాపెణకపోటున్ మీటు పాటిల్ల ను
     క్కున నొక్కుమ్మడి పోరసాగి రిరువు ర్గొట్టాని బిట్టార్చుచున్.

సీ. పూససోఁకులఁబెట్టుపుట్టుమిణ్గురులందుఁ
                    బొరిపొరి భూనభోంతరము నిండ

     ఘనదండమున మ్రోయుకంచుటందియ లెంచ
                    స్థిరదిక్కరిశ్రుతుల్ చెవుడు నింప
     గరిదిగుండునఁ జుట్టుగజ్జనాదు దెమల్ప
                    గల్పాంతనిర్ఘాతగరిమ దెల్ప
     లగుడవిభ్రమణంబు జగతిఁ దేపకుఁ దేఁప
                    స్ఫుటకాలదండవిస్ఫూర్తిఁ జూప
తే. నదను దాపల పలపల నెదుట వెనుకఁ
     గదిసి యిదె యిదె పొడు పొడు విదె యదంచుఁ
     బవనజపలాశసంభవుల్ బలిమిమీఱ
     వెనుకఁ దియ్యక పెనఁగి రాకినుక దొనుక.

సీ. కాలసర్పమ్ములగతి మింట వ్రేయుచో
                    స్వర్గాదిలోకముల్ జలదరించు
     నురువడి చేకొద్ది దిరబిరఁ ద్రిప్పుచో
                    మొగి నవాంతరలోకములు చలించు
     చే దట్టి బెట్టుగా క్షితిచేతఁ బెట్టుచోఁ
                    బాతాళలోకంబు బబ్బరించు
     ఢాక మీఱంగ నడ్డము చేసి చిమ్ముచో
                    ధరణిలోకం బెల్ల దల్లడించు
తే. ననుచు నందఱు వెఱగంద నణఁగి యడఁగి
     నిలవరంబుగ వెగటాని నిగిడి నిగిడి
     బెట్టు గుదియల నొండొంటం జుట్టుముట్టి
     భీమభగదత్తులు తమంతఁ బెనఁగి రంత.

సీ. పాండవేయవతంసపదనిపారణమేలు
                    యమరారితనయభారముభళీర
     సరిబిత్తరము చూపుచంద్రవంశలలామ
                    క్షణదాచరసెబాసుకళహళంబు

     భీమసేన కడింది పెట్లాడు మఝారె
                    మమ్మారె దనుజేంద్ర కుమ్మరింపు
     ఉత్త రుం డొక్కరుం డోహోహొ బకవైరి
                    వింతదైత్యాధీశ కొంతమాఱు
తే. లనుచు నిరుగడఁ దమవార లభినుతింప
     హెచ్చరిచ్చంగఁబడి లేచి వచ్చి హెచ్చి
     పోరి రిరువురు గద లనిభూమి కదల
     ననిలతనయుండు నరకదైత్యాత్మజుండు.

చ. అటువలె గంధసింధురము లట్లు గదారణ మిర్వురున్ సము
     త్కటగతి సల్ప దానవుఁడు తగ్గి ధరాస్థలి మ్రొగ్గి లేచి సం
     కటమున నాచి చేగుదియ గ్రక్కున నొక్కెడఁ బాఱవైచి మైఁ
     గటమున రక్తధార దొరుగన్ నరుగన్ పరుగెత్తె వీటికిన్.

శా. అలా గాత్మజుఁ డేఁగ జిత్తమున గోపావేశ మేపార ను
     ద్వేలద్వేషము మీఱఁగా నరకదైతేయుండు మత్తేభముం
     గా లాడింపుచు నొత్తిమిత్తి బలుఢాళన్ హత్తి చేయెత్తి యా
     భీలస్ఫూర్తిని దైత్యసేనఁ బురికొల్పెం గృష్ణు నీక్షింపుచున్.

వ. అంత.

శా. శాణోత్తేజితనీలజాలముల రచ్చం బెట్టునేత్రద్యుతుల్
     రాణించన్ దరహాసచంద్రికలు మీఱన్ గండభాగంబులన్
     మాణిక్యోజ్జ్వలకుండలప్రభలు గ్రమ్మం బైఁట సారించి సు
     శ్రోరోణీరత్నము లేచి నిల్చె సమరక్షోణిం బ్రియాగ్రమ్మునన్.

క. హరిణాయతాక్షి లేచిన
     దరహాసము చిగురుమోవి దళతళ మనఁగా
     హరి వలికె విస్మయంబున
     స్మరపుండ్రధనుర్విముక్తమౌక్తికలీలన్.

క. ఆలంబునకై యిటువలె
     మేలంబున లేవఁ దగవె మెలఁతలు చేసే
     జాలమ్ము లేమి చెప్పుదు
     వాలమ్ములయేట్లు విరులె వనజదళాక్షీ.

సీ. కేళీగృహకపోతకివకీవారవములా
                    యమరారిఘోరకాహళరవంబు
     సహచరీసాకూతసల్లాపసరణులా
                    నాసీరదరిసింహనాదసరణి
     బాలికాపరిచితడోలికావిహృతులా
                    సమరయాతాయాతగమనవిహృతి
     భర్మపాంచాలికాపరిణయరీతులా
                    రిపుసౌరకాంతాపరిణయరీతి
తే. యకట యే మందు నిందీవరాక్షి వికట
     సురవిమతసేనలను దేఱి చూడవశమె
     తెలిసినను కన్నకార్యంబు తెలియకున్న
     జానలకు నెందు సహజంబు సాహసంబు.

కం. [8]రామా మే మానిక కిట
     [9]రామా రా మాటవాసి రా మానవుఁడా
     [10]రా మానునె రణమున గా
     రామాయని చెలికి రామరామా తగునే.

క. అనిన విని మత్తకాశిని
     తననాయకుచేతిధనువు దాఁ జేకొనెఁ గా
     మునియంపఁ బూనురతిరే
     కను మృడుచే నొడియునల్లగౌరియుఁబోలెన్.

క. వి ల్లందుక శరధారలు
     మల్లడిగొనఁ బల్లవోష్ఠి మార్తురసేనల్
     చెల్లాచెదరుగఁ జేసెను
     భల్లా [11]బడెసాయ బనుచుఁ బతి నుతియింపన్.

సీ. కంకణక్రేంక్రియల్ కటుచాపటంక్రియల్
                    చిఱునవ్వుమెఱయింపు జేవురింపు
     కలవాగ్విరావముల్ కహకహారావముల్
                    గొల్లన నగుముద్దు గొరకసద్దు
     సరససల్లాపంబు సంగ్రామకోపంబు
                    వింతసొగసుఢాక వెగటు కేక
     సొంపుమీఱినవైపు చుఱచుఱ మనుచూపు
                    బులుపులు తగునంగు పొగరుపొంగు
తే. సరసశృంగారవీరరసంబు లమరు
     కొమరు తగి యుండ మెయిఁ జిఱుచెమట నిండఁ
     బోరు గావించె రిపుసేన బో రనంగఁ
     గల్లవగగొల్లదేవేరి కడఁక మీఱి.

వ. అపుడు.

క. గొనయమ్ము దివిచి కోమలి
     గనయముఁ జిమ్మఁగ నురోజుకలశమ్ములత
     గ్గును హెచ్చుఁ జూచి కుతుక
     మ్మున హరిహృదయమ్ము వెనుకముందై యుండెన్.

సీ. సంవర్తకీలియై చంద్రికాపాళియై
                    కనుగెంపు నగుపెంపు గ్రక్కతిల్లఁ
     బటుకాలదూతియై పంచాస్త్రుహేతియై
                    చాపంబు రూపంబు సంఘటిల్ల

     నశనిదుర్ధర్షమై యతిసుధావర్షమై
                    విడిసద్దు నుడిముద్దు విస్తరిల్ల
     నుల్లాసనాభియై యురుమోహశోభియై
                    శరవృష్టి కచఘృష్టి పరిఢవిల్ల
తే. దితిజదితిజాంతకులకు నుద్వేగరాగ
     సంగతులు పొంగ నంగనాజనమతల్లి
     కినిసి యనిఁ జేసె ధీచమత్కృతి వినిద్ర
     రౌద్రశృంగారరసము లౌరా యనంగ.

మ. స్ఫురితాంగద్యుతి చంచలాలతికగా భ్రూవల్లరీవేల్లనల్
     పరుషేంద్రాయుధలీలఁ జూపఁ గచశోభ ల్కందబృందంబుగాఁ
     గరజశ్రీల్ కరకాళిగా దితిజసంఘాతాబ్ధదుర్ధర్ష మౌ
     శరవర్షంబులు నించెఁ జంద్రముఖి వర్షాలక్ష్మిచందంబునన్.

క. ఎడనెడ వెన్నుం డొసఁగెడు
     మడుపులు గొని యనికి మగుడ మదవతి ముఖమ
     య్యెడఁ దగెఁ గచఘనకలనల
     బెడసిబెడసి తిరుగుచంద్రబింబమువోలెన్.

సీ. ప్రియునిపై బొమముడి పెట్టనేరనిగోల
                    గడుసుసింగిణి నెట్లు గుడుసుచేసె?
     చెలులతో ముద్దుగాఁ బలుకనేరనిబాల
                    గద్దించి రిపు నెట్లు ఘాతచేసె?
     స్వీయసైరంధ్రి కైసేయ నొదుఁగుతన్వి
                    శితబాణతతి కెట్లు చెంగలించె?
     అలరుపొద ల్దూఱఁ దలఁకెడితరళాక్షి
                    దళములపై నెట్లు తారసిల్లె?
తే. కుంకుమవసంతముల నాడఁ గొంకుకాంత
     యరులమెయి రక్తధార లేకరణి నించె?

     ననుచుఁ జెలు లందఱును చూచి హర్ష మొంది
     పొదల దైత్యులఁ జెండాడెఁ బువ్వుబోఁడి.
సీ. వెన్నెలమూకయో విడియెండకాఁకయో
                    యన నయ్యెఁ జంద్రాస్యమినుకుచూపు
     మరుకీర్తి లెక్కయో నెలతోఁకచుక్కయో
                    యన నయ్యెఁ దెరవముత్యపుఁదురాయి
     పూఁదేనెసోనయో పొడిరాతివానయో
                    యన నయ్యె మగువ[12]గాయకపుమాట
     జంత్రవిశేషమో శతధారఘోషమో
                    యన నయ్యెఁ జెలివింటిగొనముసద్దు
తే. మొనయుశౌరికి వైరికి మోదఖేద
     ములను శృంగారరసము నద్భుతరసంబుఁ
     దోఁచ నారాచముల నేసి దురముఁ జేసెఁ
     గుతుకకోపంబుల నెసంగి కోమలాంగి.

క. తెలిచూపుమెఱుఁగుపొత్తుల
     వలెఁ దగస్తనకలశహారవల్లరి స్తన్యా
     కలనఁ దగఁ దల్లి గావున
     నలచెలి తాఁ బెంచ నెంచె నసురకులేంద్రున్.

క. ఆవగ యెఱింగి కృష్ణుడు
     భావము రంజిల్ల నిట్లు పలికెం జెలియా
     నీ వెంతయు బడలితివి గ
     దా విను నేఁ బోరు చేసెదం జలమేలే?

తే. కినుక దగ వీరపత్నివి గనుక నీకు
     నని యొనర్చుట యుచితంబె యైన నేమి
     యేను నీదాసుఁడను గాన యిపుడు లలన
     కలన నాచేత గెలిపించఁదలఁచవలయు.

క. అని నగి నగించి తా గ్ర
     క్కున హరి యని యుక్కు మిగులఁ గొమచేబాణా
     సనము గొని యెక్కు దీర్చెన్
     గొనకొనుగుణరవభరంబు ఘుమఘుమ మనఁగన్.

మ. ధను వక్కైవడి నెక్కు దీర్చి గుణసంధానంబు గావించి రో
     షనటద్ర్భూకుటియై ఛటచ్ఛటలు హెచ్చన్ గుంపు విచ్చంగ దై
     త్యనికాయంబులపై రమాపతి స్ఫులింగాటోప ముప్పొంగ నిం
     గి నెసంగన్ శరధార నించె సమరక్రీడామహోదారుఁడై.

క. జగదీశుఁ డవ్విధంబున
     మగఁటిమిఁ జూపంగ మాఱుమలయుచుఁ గిన్కన్
     దిగదిగ మనుచూపులతో
     నిగు రెత్తెడివగను దైత్యుఁ డి ట్లని పలికెన్.

క. ఉవిదలమఱుఁగున నుండియు
     బవరం బొనరించునట్టి పౌఢుఁడ వీవే
     భువిలోన నిట్టిశౌర్యం
     బవురా నే నెందుఁ గాన నాభీరమణీ.

సీ. నావీట బందిఖానాఁ బడి యున్నట్టి
                    యఖలభూపాలకన్యకలకన్న
     నాదివాణంబులో నను బత్తిఁ బని సేయు
                    గంధర్వరాట్కులాంగనలకన్న
     నెక్కు డౌప్రేముడి నింపుటారతు లెత్తు
                    జగపాఁపరాణివాసములకన్న
     నాచెంతఁ జేరి మన్నన నూడిగము సేయు
                    తెఱగంటికోడెబిత్తరులకన్న
తే. మిన్నగా నున్న దేమి యీయన్ను మిగుల
     నిటుల నియ్యాఁటదానిఁ దెచ్చుట గొఱంత

     మగువశౌర్యంబు నమ్ముట మగతనంబె
     వర్తమానవృథాటోప ధూర్తగోప.

చ. అని నరకాసురుండు సముదగ్రదురాగ్రహుఁడై యవగ్రహం
     బున మఱి చేకొలంది మునుమున్నుగఁ గుంభము లప్పళించి హ
     స్తిని గదియించి శౌరికడఁ జేరి శరాసననిర్గళన్నిన
     ర్గనిశితఘోరమార్గణపరంపరఁ బెంపరలాడె నయ్యెడన్.

సీ. కరి ఘీంకృతులు చేసి కవిసి కొమ్ములఁ గ్రుమ్మఁ
                    గో యని శితనఖకోటిఁ గొట్టి
     గజము కర్ణములచే గజిబిజి సేయంగఁ
                    గక్కతిలంగ ఱెక్కలను గొట్టి
     కినుక మత్తేభంబు పెనుబారి వేయంగఁ
                    జిల్వతావళమునఁ జెదరగొట్టి
     వారణం బతిఘోరప్రమధువుల్ చిమ్మిన
                    నగుఁజూపుమంటచే నిగురఁగొట్టి
తే. తాను నాగారి గావునఁ దార్ఢ్యుఁ డధిక
     రోషభీషణతరమహావేష మమర
     వెనుక గదియించె ననుపమవిజయ మెసఁగ
     వైరినాగంబు నవ్వేళ శౌరిమ్రోల.

చ. గరుడనిఢాకకున్ వదనకంజ మొకించుక చెంగలించఁగా
     శరముల నించుదైత్యబలశాసనువీఁకకుఁ గిన్క హెచ్చఁగా
     సరసత వెన్కనుండి కొమ చన్మొనగుబ్బల నెచ్చరించఁగా
     దుర మొనరించె బిరమునఁ దోయరుహాక్షుఁడు యోజితాస్త్రుఁడై.

తే. అటులు సత్యాధిపతి యేయునస్త్రములకు
     నసుర ప్రత్యస్త్రముల నేసి యఱచి శక్తి
     వైనతేయునిపై వైచె వైవ నతఁడు
     దానిఁ దాల్చెను కలువలదండరీతి.

చ. అమరవిరోధి శక్తి యటు లైన విరించినుడిన్ గుణించి మిం
     చి మఱియు నాగ్రహించి యని సేయుచు డాయుచుఁ దోమరంబు కుం
     తము ముసలంబు పాశ మసిదండ మఖండపరశ్వథంబు టం
     కము గద ముద్గరంబు పరిఘంబు నగెత్తుగఁ బేర్చి యేసినం.

ఉ. ఏసిన నస్త్రశస్త్రముల నెంతవడిన్ బరిగోల వ్రేసి పోఁ
     ద్రోసి మహాద్భుతం బపుడు తోఁపఁగ బెట్టుగఁ గేకవేసి యు
     ల్లాసము మీఱ సంగరవిలాసము నెయ్యురు మేలుమే లనన్
     వాసిగఁ బైఁడిచేల వలెవాటులు మీఱఁగ నేపు మీఱఁగన్.

క. చక్రి సమరక్రమంబును
     విక్రమమును బాహుబలము విజయం బెసఁగన్
     శక్రాదిసురలు పొగడఁగఁ
     జక్రంబున నసురశిరము చక్కఁగఁ ద్రుంచెన్.

క. ఒకయరిఁ జేపట్టుక యరిఁ
     దెకటార్చెను శౌరి యనుచు దితిజునితల త
     ల్లికిఁ జెప్ప యెచ్చటికిఁ బో
     వక పుడమిని కడుపుచొచ్చువగ ధరఁ గ్రుంగెన్.

లయ. అమ్మురహరుండు బవరమ్మున నయారె విజ
                    య మ్మటులు కై కొనఁగఁ గొమ్మ కడు సంతో
     షమ్మునను కౌఁగిటను బమ్మి హరిమేనఁ జిఱు
                    చెమ్మటల నొత్తె జిలుఁగుమ్మెఱుఁగుపైఁటన్
     గ్రమ్ముమృదుమందపవనమ్ములను గంధమున
                    నిమ్ముకొనె నెంతయును కమ్మవిరిసోనల్
     ధి మ్మనియె సారె పటఃహమ్ము లమరీసునట
                    నమ్ములవిధమ్ములను ముమ్మడిలె నంతన్.

వ. అటువలె విజయమ్ము గైకొని యమ్మదనజనకుండును సురనిచ
     యమ్ములం జూచి యచ్చెరువునం దల యూఁచి యవనీసతి వచ్చి మ్రొక్కి

     కన్నుల నీరు గ్రుక్కి వైజయంతియు వనమాలికయు వరుణచ్ఛత్రంబును
     వాసవజననీకుండలంబులు నొసంగినం గైకొని యామెమనవి చేగొని జనక
     వియోగజనితఖేదాయత్తుం డైనభగదత్తునిం బట్టాభిషిక్తునిం జేసి యేటి
     యెలనాగల నెదుర్కొనుమేటిమున్నీటినీటునఁ బదాఱువేలరాచకన్నియల
     నెదుర్కొని వేఱువేఱ పేర్కొని యన్యోన్యవీక్షాతరంగితహావభావుండును
     ననుపమవిభావుండు నగుచు నవ్వధూమణులం దోడ్కొని యప్పురంబు
     వీడ్కొని యఖిలబలంబులుఁ దాను నండజకులాఖండలస్కంధారోహణంబు
     చేసి యక్కనకమహాశైలంబు నెడఁ బాసి యతిరయంబున ద్వారకానగరంబుఁ
     బ్రవేశించి గరుడావరోహణమ్ము గావించి యాత్మవిజయంబు నభివర్ణింప
     వచ్చినయమరేంద్రునకు నదితికుండలంబులును నవరత్నకనకధారావిచిత్రం
     బగువరుణచ్ఛత్రంబును సమర్పించి యతని నమరావతికిం బంచి వైనతేయుని
     నగ్గించి విజయసైనేయమాద్రేయుల విడిదలకుఁ బోవ నియోగించి సత్య
     భామయుఁ దానును సరససల్లాపంబు లాడుచు నగరు సొత్తెంచి యలసిన
     యలంత దీర్చుక రమ్మని యమ్మగువను నిజగృహంబునకుఁ బుత్తెంచి తమ్ము
     నెదుర్కొనుభోజకన్యాముఖాంభోజముఖుల నాదరించి యయ్యిరుదచ్చివేయి
     మచ్చెకంటులయందుఁ దమి పుట్టిన యందఱిని శుభముహూర్తంబునఁ జేపట్టి
     వారలకు వేఱువేఱ లీలాగృహంబులు హవణించి శృంగారవనంబున రంగారు
     చిన్నిలతకూనలం బొదవుసోమరిగాలిచందంబునఁ జక్కదనంబున కిక్క
     లగుచుక్కవెలఁదులఁ జొక్కించుచక్కెరవిల్తుమామయందంబున నిఖిలతరు
     శాఖ లిగురొత్త హత్తి సంతసిల్లు వసంతునిభాతిఁ బ్రకృతుల నన్నింటి నలంచు
     పరమాత్మరీతి నానందసంధానితహృదయారవిందుండై యిందుముఖుల
     నందఱిం గందర్పసామ్రాజ్య మేలింపుచుండె నయ్యుదంత మంతయు నెయ్యం
     పుటింతులవలన వినంబడ నయ్యవసరంబున.

చ. కొఱకొఱ మించె రుక్మిణికి ఘూర్ణిలె లక్షణ యెంతయేని చు
     క్కురమనె భద్ర జాంబవతి కుందెఁ గళిందజ గందెఁ జాల వే
     సరుకొనె మిత్రవింద పగెఁజాలఁ దపించె సుదంత వారిలో
     నరయగ సత్య తా సరసురా లగుటన్ మదనకిన్క మాటుచున్.

ఉ. వారల నూరడించి యదువల్లభుని న్వినుతించి ముందుగా
     నేరికి డెందముం దెలియనియ్యక కయ్యపుగెల్పుసుద్దులున్
     సారెకు నుగ్గడించి యల చానల వీడ్కొని పాదకంజమం
     జీరఝళంఝుళం బెసఁగఁ జిత్తము కగ్గఁగ వచ్చె నింటికిన్.

క. వచ్చినరాక గనుంగొని
     యచ్చెలినెచ్చెలులు కోప మగ్గల మని తా
     మిచ్చట నచ్చట నొదుఁగుచు
     నచ్చికముగ నడుగరాఁగ నంతఁ దనంతన్.

చ. కనుగలవింటిదంట కడకంట నునుంజిగిమంట లంట నె
     మ్మనమున నిచ్చరచ్చ గొనుమచ్చర మెచ్చఁ బటానిచిల్కతే
     జిని వడి నూకి కేక లిడి చేకొలఁది న్మొల నున్ననున్నక్రొ
     న్ననపిడియమ్ము రెమ్మి జతనమ్ముగఁ గొమ్మయురమ్ము గ్రుమ్మినన్.

క. మోహము భయసన్నాహము
     నోహరిసాహరిఁ బెనంగ నులికి యులికి లో
     నూహించి నెచ్చెలులతో
     నాహిమకరవదన కోప మాఁపక పలికెన్.

శా. మోమోటమ్మునఁ జేరఁగా నరిగి మిమ్ముం జౌక గావింతునా
     యేమీ గొంకెద రమ్మలార దయతో నిన్నాళ్లు మన్నించునా
     సామిన్ రచ్చలఁ బెట్టఁగావలసె నాచందంబు మీతో నయో
     యే మంచున్ వచియింతు నూరకె వితా యీవేళ సి గ్గయ్యెడిన్.

క. మగఁడే దైవ మటంచును
     మగువలు మతి నమ్మి యుండుమమత కలదుగా
     మగఁ డెడసి చౌక చేసిన
     మగువకుఁ గా దనఁ దరంబె మదవతులారా.

క. సురవైరివీట నొక్కెడఁ
     జెఱఁబడి విడఁబడిన మిణుకుచెలువలతో నా

     హరివంటిరసికుఁ డెనయుట
     మరునిప్రతాపంబొ కాక మాభాగ్యంబో.

క. దిటమునఁ బదాఱువేవురు
     కుటిలాక్షులమాయఁ దగిలె గోపాలుఁడు నే
     నెటువలె సైరింతు నయో
     కటకట యెడ లేనిసవతికాపుర మయ్యెన్.

సీ. తేరకుఁ దేరగా జేరినరాధతో
                    గూడి యాడి సుఖంచుఁ గొన్నినాళ్లు
     నేటుగాఁ దనచేతితాటికి లోనైన
                    కోమలులకుఁ దక్కుఁ గొన్నినాళ్లు
     చెల్లఁగా మును గొల్లపల్లెల నగపడు
                    కొమెరలనుడిఁ జిక్కుఁ గొన్నినాళ్లు
     యోగంబు దెచ్చుమేయాగంబు పచరించు
                    గుబ్బెతలకు నబ్బుఁ గొన్నినాళ్లు
తే. వాని నొకనోట మగఁ డన వశమె యట్టి
     బ్రదుకునకు నెల్లఁ జాలనికొదవ యేడ
     వానికిఁ బదాఱువేలపై వలపు పాఱి
     ముమ్మరం బయ్యె నీవేళ నమ్మలార.

క. మును దనకు మేను దాఁచక
     పెనఁగినపౌరుషము జనులు పృథివి నెఱుఁగరా
     వనజాక్షులార యెవ్వరి
     నెన రెవ్వరికిన్ సతంబు నిజ మిటు లయ్యెన్.

క. వగ దప్పి నలంగిననా
     దగడప్పులఁ దీర్చి నన్నుఁ దనియించక యా
     మగువల హరి సేరెఁ గదా
     తగ వేడది పతికి గుబ్బెతలు తఱ చైనన్.

క. మొదల నొకరాధ చాలును
     పిదపన్ జతచెలులె చాలుఁ బ్రియునాసను నేఁ
     గదిసి సుఖించఁగ సవతులు
     పదియార్వేలైన నెట్లు బ్రదుకఁగవచ్చున్.

క. ఎల్లరు లోకంబున మగఁ
     డొల్లనిప్రోయాలి జముఁడు నొల్లఁ డనంగా
     నుల్లాస మేది యిటువలె
     దెల్లముగాఁ బరువు దప్పితిం జెలులారా.

క. అని యీకైవడి నారీ
     జనములతోఁ బలికి కోపఝర్ఝరితమన
     స్సుస ససమాయుధబాణా
     సనఝుంకృతు లనఁగ నూర్చి చపలాశయ యై.

సీ. మోవితావికి డాయ మొనయఁగా నెదురందు
                    మొకరితేఁటులనాదు మోహరింప
     వెడఁదచన్నులయందు వెలయు కెంజిగిలీల
                    నంగజశరకీల లంకురింప
     జంత్రంబుల రతంబు సలుపుకూకిరుతంబు
                    దిటము నైనవిధంబు ధిక్కరింప
     ప్రేమ గూడుగయాళిరామతమ్ములయాళి
                    యదరుగుండియజాలి యాదరింపఁ
తే. జెలులచేమంతి సవలరేకులబవంతిఁ
     బరఁగుమెఱుఁగారుచిగురాకుపాస్సుమీఁదఁ
     బదనుకత్తులబోనుపైఁ బడినరీతి
     వ్రాలె నెలనాగ యలరుచు వలపు రేగ.

క. అటువలెఁ బాన్పునఁ బడి తా
     నటు నిటుఁ బొరలుచును గుండె యదరిపడంగాఁ

     జిటచిట యంతట నెఱయఁగఁ
     గుటిలాక్షి ముహుర్దురాపకోపాకుల యై.

చ. వికవిక నవ్వు నుస్సు రను వ్రీలిపడున్ విధి దూఱుఁ జింత నూ
     రక తలపోయు బోంట్ల నడరన్ గమకించుఁ దపించుఁ దాళఁజా
     లక విలపించు నౌనవు బళా యను హా యను దూఱి పోరి యి
     చ్చకములు సేతునా యనును జంకును గొంకుఁ దలంకు నెంతయున్.

క. ఈరీతి వగలఁ బొగిలెడి
     నారీతిలకంబుఖబురు నర్మసఖు ల్వే
     ర్వేఱ వివరించ విని శృం
     గారభయాద్భుతదయావగాఢహృదయుఁ డై.

ఆ. కట్టుకొన్నచెలులఁ గా దనవచ్చునో
     మహిని గా దటన్న మాట రాదొ
     యిట్టిపట్ల సత్య కేల కోపము వచ్చె
     నేమి సేతు నంచు నెంచియెంచి.

సీ. మెలిగొన్నహారముల్ మెల్లమెల్లనఁ జేరి
                    యింతి యొక్కతె దిద్ద నియ్యకొనక
     సరగున వచ్చుచో జాఱినవలెపాటు
                    చాన యొక్కతె యాన సరకుగొనక
     యెడఁబాయలేనురా యే వత్తునా యని
                    మగువ యొక్కతె దెల్పుమనవి వినక
     సైగగా నొకకడ సవతునూతనరాక
                    బాల యొక్కతె నిల్వ నేల యనక
తే. పచ్చవిల్తునిబవరంబు రచ్చ నిచ్చ
     వేలుకల హెచ్చుదుగదచ్చివేలసతుల
     విడిదలబవంతి దగ కేరి వెడలి వచ్చెఁ
     గామినీసాంత్వనము గోరి కంసవైరి.

ఉ. వచ్చి మురారి రచ్చఁ బడి వారిజలోచన యుండుచందమున్
     నెచ్చెలు లుండునందమును నెమ్మిఁ గనుంగొని సారె పైపయిన్
     వెచ్చఁగ నూర్చియూర్చి యిది విం తవు నంచుఁ దలంచు నెమ్మదిన్
     హెచ్చినమోహసాగరము నెంచుచుఁ జెక్కిటఁ జెయ్యి చేర్చుచున్.

సీ. అంతటింతటఁ జేరి యారతిపళ్లెంబు
                    లెత్తరారైరిగా యిందుముఖులు
     అయ్యవారా సత్య యదిగొ యున్న దటంచు
                    రాకొట్టదాయెఁగా రామచిలుక
     మెచ్చుగా నిటకు నేఁ దెచ్చినచేకాన్క
                    లందుకోరైరిగా యనుఁగుఁజెలులు
     కంకణా లందెలు ఘ ల్లనఁగా వచ్చి
                    చెయ్యియ్యదాయెఁగా చిగురుబోడి
తే. యిటువలెనె మేర దప్పి యీయింతి సేయు
     చలము దెలిసియు నాపాపజాతిమనను
     దీనిపదములఁ జుట్టుక రా నటన్న
     దాళఁగూడునె యని యెంచి తల్లడించి.

సీ. పంచదారయు నించి పండ్లు మేపితిఁ గాని
                    చిలుకకు నే నేమి చేసినానొ
     యాటలు దిద్దించి హవణించితిని గాని
                    శిఖిడింభముల కేమి చేసినానొ
     పేర్పేర మన్నించి ప్రియము చేసితిఁ గాని
                    చెలులకు నే నేమి చేసినానొ
     కని పెంచి ఘనునిగా గారవించితిఁ గాని
                    చెఱకువిల్తుని కేమి చేసినానొ
తే. కటకటా ప్రాణనాయకికరుణలేమి
     నెవరికంటికి దెసనుండ కిట్టు లైతి

     నెనరు కన రైన నిం కెట్లు కనరువాఁడ
     ననుచు వివరించి వివరించి యాత్మ నెంచి.

సీ. గరితయే యిట్టులు కలహించ నొడికట్టఁ
                    గా దనఁ జూచునే కలువకంటి
     సతియె యీకైవడిఁ జలపదంబున నుండఁ
                    గినిసి వాదించునే కీరవాణి
     దేవేరియే యిట్లు భావంబు దాఁచిన
                    నటు పోవ నెంచునే హంసగమన
     యిల్లాలె యీరీతి నెనసి కోపించినఁ
                    జల్లార్చి తేర్చునే చంద్రవదన
తే. వనిత తనుఁ దానె తెలిసికోవలెను గాని
     పరులు నా కౌదురా యయో మరులు కెరలి
     యిరులుకొన్నట్టు లున్నది యీజగంబు
     పాపు విధి యంచుఁ జింతించి బాళి మించి.

మ. ఎదుటన్ లేఁజిగురాకుపానుపుపయిన్ హేరాళ మౌవంతచేఁ
     గుది నంతంతకు వింత లీనుహొయలుం గోపంబు తాపంబు లోఁ
     బొదలం గన్నులు మోడ్చి మై మఱచి పూబోం డ్లూరడించంగ ను
     న్మదయై పొర్లుచు నుండుసత్యఁ గనె శుంభద్దాస్యసంరంభుఁడై.

క. కని తాఁ జేరంబోయిన
     వనితలు తొలఁగంగ వలదు వల దను యాక్రొ
     న్ననబోఁడులమఱుఁగున నొక
     ననసురటిని విసరె శౌరి నారీమణికిన్.

చ. విసరఁగఁ గమ్మఁదెమ్మెరలు వీచుదువాళికిఁ బైఁట జాఱఁ గ
     క్కసపుమెఱుంగుగట్టువగగబ్బిచనుంగవ బైలుదేఱఁగా
     దుసుకిలి నీవి పోవ నల తోయరుహానన యుల్కి యుల్కి లో
     మసలి చెఱుంగు గప్పుకొని మంపును కోపముఁ బెంపుమీఱఁగన్.

క. ఉదరిపడి చూచి యధరం
     బదరఁగఁ గన్గొనలఁ గ్రమ్మునశ్రుకణంబుల్
     పొదలంగ నేడ్చుచును గ
     ద్గదవాగ్వైఖరిని హరిని కసరుచుఁ బల్కెన్.

ఉ. ముచ్చుతనమ్ము లేల కనుమూసుక నేను కలంగియుండఁగా
     నెచ్చెలిమాటునన్ నిలిచి నిక్కముగా దయగల్గినట్లుగా
     నిచ్చట వీవన న్విసర నేటికి నేఁటికిఁ జాలుఁజాలు నీ
     గచ్చు లదే మురారి కలకాలము నీవగ లే నెఱుంగనా.

క. వగవగగ నీవు విసరే
     వగ చేతోజప్రతాపవహ్నిజ్వాలల్
     తగిలించుటొ యటునిటు నను
     నొగిలించుటొ తెల్పు నీదునుడి వినవలెరా.

క. నీ వేమి సేతు వింతులు
     కావరమునఁ బిల్చిరేమొ కా నాప్రాణం
     బీవగ నుండఁగ సామీ
     రావలెనా నీతి గాదురా నళినాక్షా.

క. హంసీగమనలు చాలా
     శంసింపఁగా మారవంబు చాలించి కడున్
     సంసారి వైతి వెప్పుడు
     కంసారీ మేలు మంచికాపుర మయ్యెన్.

క. కలకాల మిట్టిచెలువల
     కలహములకె కాలుద్రవ్వుఘనుఁడవు గావా
     తెలియకను మోసపోయిన
     నెలఁతలతో గొడవ యింక నీ కేటికిరా.

ఉ. గుట్టున నున్న కోమలుల కోపము రేచి యెఱుంగనట్టుగాఁ
     జుట్టుక కల్లచూపులను జూచుచు వారలు సేవ చేయుచో

     నిట్టటు గుక్కుమిక్కు మననియ్యక తక్కుచు మొక్కళంబుగా
     దిట్టతనంబు చూపునిను దేవరగాఁ దలపోయఁగావలెన్.

క. మన సీవు పరుల; కందఱి
     మనసులు నీ వైతె తెలిసి మాట్లాడెద వౌ
     వనిత లిటువంటినీతో
     ఘనతలు పచరించదగునె కంజదళాక్షా.

ఉ. పూవును తావి యింపెసఁగు పొంకముగాఁగ సతీపతుల మనో
     భావన నిద్ద ఱేక మయి పంతును రంతును మీఱ నుండుచో
     నేవగ నైన ముచ్చటలు హెచ్చునుగాని మగండు చూడఁగా
     నీవగఁ బూనె నేని తనువేటికి సిగ్గరి యైనబోటికిన్.

సీ. పోరు చేసినదానిపోరామి నాయమా
                    చెఱ నున్నచెలులమచ్చికలకన్న
     నీచేతఁ బడుబోంట్ల నెన రెన్న మంచిదా
                    వైరిచేఁ బడుబోంట్లవలపుకన్న
     నెనమండ్రతో నున్న యింతిమేలు ఘనంబె
                    వేవేలు గలబోంట్లవింతకన్న
     వేర్వేఱ పెండ్లాడువెలఁదిచిన్నె సతంబె
                    గుంపుపెండ్లిసతులకులుకుకన్న
తే. రసికుఁడవు నీవు నీవంటిప్రౌఢుఁ డిందుఁ
     జేర నుచితంబె యిటువంటిచెలిమి గలుగఁ
     దెలిసి విహరించునీకు నేఁ దెలుపగలనె
     వల్లవీదాస యిఁక నేల వట్టియాస.

వ. అని పలికినసత్యభామకుఁ జెలికత్తియ లిట్లనిరి.

క. ఎఱిఁ గెఱుగనివగ నీసరి
     గరితలు నీవలెనె పతిని గరిసింతురటే
     వెఱవక జగదీశ్వరుతోఁ
     బరుసపుమా టాడఁదగవె పద్మదళాక్షీ.

క. సొగ సౌతావికిఁ దుమ్మెద
     జగతిని వేవేల లతలఁ జరియించదొకో
     మగవాఁడు నటులె కాదా
     మగువలయెడ నీకు నకట మచ్చర మేలే.

క. ఒకసతి యైనను నరునకు
     వెకటున్ గరగరిక పుట్టు వింత గలిగినన్
     శుకవాణు లెంద ఱైనను
     ప్రకటంబుగ నేలుదొరకు భయ మేలె చెలీ.

ఉ. వట్టివళావళుల్ సలుపువారలె కాని ముకుందునిన్ మిటా
     ర్లిట్టటు నీవలెన్ బెళుకనియ్యనివారలు లేరు వాఁడు తా
     నెట్టివెలంది నైన మది నెంచఁడు నీదయవాఁడు గావునన్
     రట్టున కిట్టిపట్టునను రామ యయో మన సెట్టు లొగ్గెనో.

సీ. వగలచేఁ బొగులుచు బిగిసియుంటివి గాని
                    హరిని నెదుర్కొనవైతి వేల
     కుములుచు వట్టినేరము లెంచితివి గాని
                    యబ్జాక్షు నలరించవైతి వేల
     కాఁక దెచ్చుకొని హా గద్దించితివి గాని
                    ప్రాణేశు రమ్మనవైతి వేల
     చీద రెత్తినయట్లు సెలసి కొట్టితి గాని
                    యసురారి మన్నించవైతి వేల
తే. అన్నియును కిన్క దీఱిన వైనఁగాని
     యతఁడు దెచ్చినరత్నభూషాంబరాదు
     లందుకొన హెగ్గడీలతో నానతిమ్ము
     వలదు వల దమ్మ యీజోలి వట్టిజాలి.

క. అనిన విని కసరి యురగాం
     గనవలెఁ దల యెత్తి బెట్టుగానూర్చి రయం

     బున నో రగపడఁ బెట్టుచుఁ
     గనకాంగుల నుబికి చూచి కామిని యనియెన్.

క. ఎంచక మాటాడెద రీ
     మంచితనమ్ములకు నేమి మంచిది చాలా
     వంచకుఁడు మీ కొసంగెడు
     లంచంబులు కొంచెగత్తెలా చెలులారా.

క. అనువుగఁ గనుగీటుచు నే
     విన మి మ్మెనరేచి తాను వెఱచినయట్లున్
     ఘనుఁ డితఁ డావలిమొగమై
     వినివినమిగ నుండు నిట్టివితము లెఱుంగన్.

ఉ. వీనియుపేక్షయు న్మఱియు వీనిపరాఙ్ముఖభావమున్ బళా
     మానినులార మీఁద నిట మ మ్మిఁక నేమి యొనర్చు వీనికిన్
     వీనియనుంగుఁగొమ్మలకు వీనివితామొగమాటమాటకున్
     వీనిపిసాళిచేఁతలకు విస్మయ మయ్యెను నేఁ జలింతునే.

శా. సొమ్ముల్ చేలలు క్రొవ్విరుల్ మణులు కాసు ల్మాకు నిం కేల వే
     కొమ్మ ల్లేరె పదాఱువేవు రవి చేకోఁ గావున న్వారికిన్
     సొ మ్మౌ నెన్న నితండు వీనికి నిలన్ సొ మ్మౌదు రాబోటు లీ
     నెమ్మి న్మీరలు దెల్ప నేమిటికి నేణీనేత్రలారా యనన్.

క. స త్యటువలె ననఁ జెలువలు
     ప్రత్యుత్తర మిచ్చి రపుడు పతికిన్ సతికిన్
     నిత్యంబు నలుక గలుగుచొ
     వ్యత్యాసము పుట్టకున్నె యదియు నెఱుఁగవా.

క. ఎఱుఁగక నీ వొల్లనియీ
     వరవస్తువు లొరుల కొసఁగ వారికి నళుకో
     హరికృప గలవా రందఱు
     దొరసానులు గారొ కొనిన దోసం బగునో.

క. ఎపు డెపుడని మోహంబున
     విపులాక్షులు వానిపొందు వేళలు గాచే
     కపు రంత నీ వెఱుంగవొ
     యిపు డెఱిఁగియు నీదుబుద్ధి యిటు లాయెఁగదా.

మ. నెన రౌవారల వీడనాడి తతివా నీతోడ నేస్తంబు చే
     సినపాపంబున కేము తెల్పితిమి నీ చిత్తంబునం దోఁచిన
     ట్లు నతాంగి నడిపించుకొమ్ము మముబోటుల్ నీకు నీ కేల వాఁ
     డును నీవున్ చలపోరఁగా నవల నెట్లో కార్య మట్లయ్యెడిన్.

మ. చిగురాకుంజముదాడిపైని బడవేచెంగల్వపూఁదేనె గ్రా
     లంగ నిద్దా తెలివెన్నెల ల్చొరఁగఁ జాలా యోర్చియు న్నీవెకా
     తెగువ ల్చేసిన నీకె తప్పిదము తెందెప్ప ల్చెలుల్ వానికిం
     జిగురున్ విల్తునికేళిఁ దేలి సొగసుల్ చెల్లించుకో నిమ్మహిన్.

మ. అనినం గాంతలచేత వీఁడు గద యిట్లాడించె నంచు న్మనం
     బునఁ గోపం బుబుకంగ నీదువినయమ్ముం గంటిఁగా నంచుఁ బైఁ
     టను లేఁగౌనునఁ జేర్చిచుట్టి చెలి యొడ్డారమ్మునన్ లేచి చ
     క్కనిశౌరిన్ జడఁ గొట్టెఁ గంకణఝణత్కారంబు తోరంబుగన్.

చ. అటులు కృతప్రహారుఁ డయి యవ్వసుదేవకుమారుఁ డోరుపున్
     దిటమును నేరుపు న్మెఱయఁ దీఱియుఁ దీఱనిచింతతోడ నం
     తటఁ జిఱునవ్వుఁబువ్వుజడిదార్కొనఁ బేర్కొన వచ్చి గ్రుచ్చి య
     క్కటికము నాసయున్ దొరయఁగా నయగారితనాన ని ట్లనున్.

క. జడఁ గొట్టి తీసితివిగా
     జడయల్లిక నైన మెఱుఁగు చనదో తోడ్తోఁ
     బడఁతీ చే నొవ్వదొకో
     యిడుముల కే నుండ నీకు నీఁగా నౌనే.

క. ఏమే బంగరుబొమ్మా
     నామీదను కరుణలేమి నాయం బగునే

     నీమాటవాసి యెంతయుఁ
     గామాకారంబు దెల్పెఁ గడపట మాకున్.

సీ. గొల్లచానలగుట్టు కొల్లలాడెడివేళ
                    నూరక యుండినయోర్పునేర్పు
     ఇల్లాండ్రఁ బెల్లుగా మల్లాడునప్పుడు
                    దారిగా నుండినతాల్మిపేర్మి
     రాధ స్వాధీనగా సాధించునప్పుడు
                    గెలుపుగా నున్నట్టియళువుసులువు
     తక్కినచెలు లొక్కచక్కి నెక్కినతఱి
                    నిచ్చగా నగుచున్న యింపుసొంపు
తే. మఱచి పదియాఱువేలక్రొమ్మగువ లనఁగ
     నెంత మఱి వారివద్ద నే నెంత వింత
     వింతగా నింత కసరుట కొంత తగునె
     మఱియు ననుఁ బాసిపోవు టేమాటవాసి.

ఉ. కంటికి ఱెప్ప గాచినవగన్ నను బాములఁ బొందనీక యె
     ప్పంటికి నీవు ప్రోవఁ దగుభావము లన్నియు మాని నేను నీ
     యింటికి వచ్చినా యెదుట నీవగ నిల్చిన సేవఁ జేసినా
     బంటుగ నెంచ వేమి పగపంతములా కమలాయతేక్షణా.

శా. ఏలా గోపము లేల తాపము వితాయేలా విలాపంబు నా
     పాలా జాలము లేల లోకమున నీపాదంబుల న్నమ్మితిన్
     చాలా చిన్నెలు వన్నె లందఱుఁ గనన్ జాలా కటాక్షించి యో
     బాలా చక్కెర లొల్కుపల్కుల ననున్ బాలించి లాలించవే.

సీ. తరుణి ని న్నిన్నాళ్లు మరునిచేచిగురాకు
                    గడిబాకుగా నెంచి నడుచుకొననొ
     కలికి నీమెయిడాలు కామునిపడవాలు
                    మేగోలుగా నెంచి మెచ్చుకొననొ

     భామ నీనుడికోపు భావజుననివైపు
                    దరిదాపుగా నెంచి దాఁచుకొననొ
     మగువ నీనెమ్మోము [13]మదనునిసముగోము
                    సొలయక దీముగాఁ జూచుకొననొ
తే. కాక యొకసారి యైన నే గడుసుపొఱి
     బిగిసినది లేదు కలనైనఁ దెగువరాదు
     విన్నవించితి నేఁ డింక వినుట పాడి
     వలదు నామీఁద నీమోడి వన్నెలాఁడి.

ఆ. ఇమ్ము గ్రమ్మఁ గౌఁగి లిమ్ము నెమ్మది వింత
     చాలు వీలు మేలు [14]మేలు మేలు
     నమ్మికొమ్ము బాస నమ్మి కొ మ్మిఁక నన్ను
     బాల తాళఁజాల మేల మేల.

క. అని కొంతకొంత కోమలి
     మనమునఁ గళ్లకము దోఁచి మగుడ నిగుడున
     ల్క నగుచుఁ జూపుంజుఱచుఱ
     పెనగొన హృజ్జాతభీతిభీతాశయయై.

సీ. తళు కెత్తుచిఱునవ్వుమొలకలు జడిగొను
                    పన్నీటివలెను పై పైని నిండఁ
     దడి యొత్తుచెంగావినిడుద పావడవలెఁ
                    గెంపుపోఁగులచాయ గుంపుకొనఁగ
     నొసటికస్తురిబొట్టుమిసమిస ల్చెమరిన
                    గోవజవ్వాది చెక్కుల నటింప
     మెఱుఁగారువలెవాటుసరిగకుచ్చులగచ్చు
                    బంగారుపూవులరంగు నెఱప
తే. మరునివిరిగోలయేటున నొరగినట్లు
     నెలకుఁ దామరలకుఁ జెల్మి నెఱపునట్లు

     మోము ప్రోయాలిపదయుగమునను జేర్చి
     సాగిలెను గౌరి వలపులబాగు మీఱి.

క. చిఱుమీసఁపుఁదుమ్మెదకవ
     తరుణీపదశౌరివదనతామరసము ల
     త్తఱి సంధించుట గనుఁగొని
     హరువున నిరుగడలఁ జేరె ననఁ జెలు వొందెన్.

క. అప్పుడు హరిజాఱుసికం
     దెప్పునఁ జెలి మనసుకినుక దీరఁగఁ దన్నెన్
     నె ప్పెఱిఁగి గిల్కు తాయెత
     యప్పులరవ లాని యందియలు ఘల్లనఁగన్.

క. ఘల్లని యందెలు మొరసిన
     కొల్లో కొ ల్లనుచుఁ జనిరి కోమలు లపుడే
     యల్లలనబొటనవ్రేలును
     మెల్లన హరి పంట నంటి మెఱుముచు నొక్కెన్.

క. కాముకుఁ డటువలెఁ బంటన్
     వేమాఱున్ వ్రేలు నొక్క వెలసినకళచే
     మై మిగుల ఝమ్ము ఝు మ్మనఁ
     గామిని కోపంబు మఱచి కలకల నవ్వెన్.

క. నవ్వులకుఁ బువ్వుఁబోఁడిని
     చివ్వున లాగించి గోపశేఖరుఁ డంతన్
     మవ్వమున మోవితేనియ
     బువ్వంబునఁ దనిసె మొదటఁ బొలఁతుక తనియన్.

క. తనిసిన దాని న్మగుడం
     దనియించఁగ శౌరి మబ్బు దట్టుచుఁ గనగాఁ
     బెనఁగి తమి నూరడింపుచు
     ననవిల్తునియనికిఁ దార్చె నయ మెనయంగన్.

తే. రాజబింబాస్య మగఁ డట్లు రతికిఁ దార్చ
     మదిని నెలకొన్నమరుచివ్వ మరులు కెరల
     వరవువలె నాని తప్పించునెరవు మాని
     తీఁగవలె నంటె వాఁ డెందుఁ దిరిగె నందు.

క. చెందలిరుసెజ్జ నిటువలె
     ముందుగ సమసురతమునకు మొనయించి రహిన్
     కందర్పజనకుఁ డనువున
     నిందీవరనయన నానె నెంతయు నంతన్.

సీ. మగఁ డౌడు కఱచిన వగపుచిన్నె నటించు
                    నూరటిల్లఁగ లేచి హుంకరించుఁ
     జెలువుఁ డగ్గలికతో నిల వేరము నటించు
                    నాయన యదలించ నాదరించు
     హరి తాఁ గిలార్చిన నదరి చిన్నె నటించు
                    నులికినఁ బ్రేమించి యోహటించుఁ
     బతి కేక వేసిన బవిళిచిన్నె నటించు
                    నుబుసాన నుడి మించి యుగ్గడించు
తే. వలపుపొలుపును కలకలవలపుసొలుపు
     సలుపుమెలపును కళలచే గెలుపుతలఁపు
     వెలయఁ గలయిక కలకల మొలయఁ గొంత
     సమరతంబున నగువింత నమరె నంత.

క. ముందఱ దోచియుఁ దోఁచని
     తందరమీటులును మఱియుఁ దహతహనీటుట్
     కుందరదన గన హరి కులు
     కుం దరహాసంబు మీఱఁ గొమ నెలయించెన్.

క. అంతర మెఱుఁగనివళుకులు
     దొంతరవీడెములు కులుకుదొంతరపలుకుల్

     వింతరహిఁ బూను మఱిమఱి
     కొంతరవళి నానెఁ గొమిరె కొమరుతిమురునన్.

క. వగలాడి యిట్లు వగవగ
     తగువాటమ్ముల నెసంగి తక్కుల్ సొక్కుల్
     సొగయఁ జెలినడుము సందిటఁ
     దగ నొగిఁ గూర్చుండెఁ దొడలఁ దరుణియు నుండెన్.

చ. ఒఱపులు నిండఁ గాఁదొడలనుండెడుగుబ్బెతగుబ్బదోయి పే
     రురమున నప్పళించుకొని యూఁకొనుబాగులు పల్కులాగునన్
     మొరయికజోగులుం గదియుముద్దులపోగులుఁ గుల్క నుల్కుచున్
     హరి తమిబల్మిఁ బల్మొనలనంచులు మోపఁగ మోవి యానఁగన్.

క. మానిని ముకుళించినకను
     గోనల నరచొక్కునిక్కుకొసరులు కసరుల్
     పూసుకొని మత్స్యపుటముగఁ
     బైనిఁ బడి విలాసిఁ దోసి పైకొని వేడ్కన్.

వ. అంత.

సీ. అనుపమరతికూజితానుమేయకపోత
                    మలఘురయోదయత్పులకజాత
     మమితబంధోద్యమశ్రమజలసంపాత
                    మతినృత్తకుచనాట్యగతిసమేత
     మకలంకరుచికిణచికురయాతాయాత
                    మాభుగ్నపటునితం బాభిఘాత
     మత్యపాయరసాశయత్యంతకాకూత
                    మసమసౌరభలసత్కుసుమపాత
తే. మలకజాతాన్వితాంగచాపలవిభాత
     మోదనస్యూత మధికప్రసాదచేత
     ముగ నపుడు శౌరి మదికిని సొగసు నించె
     మగువమరుసాదనఘనంబు మగతనంబు.

క. అప్పుడు వగలాడి మెయిన్
     గుప్పున విరిదమ్మితావి గుబులుకొనంగా
     నప్పురుషోత్తముఁ డంతన్
     ముప్పిరిగొనుమోహవార్ధి మునుఁగుచు నుండెన్.

సీ. కవసరిపిణియుగ్గు కౌనుదీవియద్రుగ్గు
                    తెగచినిల్వులు దిగ్గుదిగ్గుకొసరు
     పలుకులలగ్గుకు పఱచునూకులజగ్గు
                    నుబికినపతిసేఁత కొగ్గుసిగ్గు
     తెగఁ గ్రుక్కుచో డగ్గు తెగఁబడునుడిసగ్గు
                    స్తనభారమున వగ్గు తగ్గుమొగ్గు
     నడయాడుచో నగ్గు వడిహారములమ్రగ్గు
                    గళరవములనగ్గుగగ్గుగగ్గు
తే. నలఁతనగు కగ్గు వడియుగ్గు లాటయెగ్గు
     బడలుమైనెగ్గు తళు కెత్తుతొడలనిగ్గు
     కేళితమిఁ జిల్కి పుంభావకేళి నుల్కి
     మెఱసె రహి గుల్కి కల్కి తా మెఱుఁగుపోల్కి.

క. పురుషాయితమున నటువలె
     మెఱయుచు సరిగెలుపు లెనయ మెలఁతుక తనియన్
     హరి చెలి నణఁచుక తనిసెన్
     విరిగొరకలపాదుశాయివిజయము మీఱన్.

తే. ధరణి నందఱు నుతియించ సరసు లెంచ
     నెనరునన్ సత్యభామసాంత్వనముఁ జేసి
     యాయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
     నలరె నలశౌరి యెనలేనిహవణు మీఱి.

క. ఈకథ వినినం జదివినఁ
     జేకొని వ్రాయంగఁ బ్రోది చేసిన మిగులన్

     లోకంబున ననవరతము
     శ్రీకాంతునికరుణవలనఁ జేకుఱు శుభముల్.

క. అని భక్తిని వైశంపా
     యనముని వినిపింప వినుచు హర్ష మెసంగన్
     జనమేజయధరణీంద్రుఁడు
     ఘన మొప్పఁగ వెలసె నిత్యకల్యాణములన్.

మ. వసుధాఖండల ఖండలగ్నమధురత్వత్రాణపారీణసూ
     క్తిసుధాకందళ కందలక్షనయభాగ్విశ్రాణసంపద్విమా
     నసభాసద్బుధ సద్బుధప్రవరగంధర్వస్వరోదారమా
     నసమంజూత్పలసత్వరస్థగితమాద్యద్రాజచూడామణీ.

క. చందయవనాళికాక్షర
     కుండలనోద్భవ్యదండకోదండభుజా
     దండధృతమండలాగ్రవి
     ఖండితరిపుగళవిఖండ గండరగండా.

క. దాక్షాయణీదయారస
     వీక్షార్జితరాజలోకవిశ్రుతశీలా
     పక్షాంతచంద్రవదనా
     లాక్షాంకితఫాలభాగ లక్ష్మీశీలా.

[15]కవి. వినుతకృపావన రమ్యకృపావన
                    విభ్రమపావనదృక్కమలా
     తనురుచిమానససంభవ మానస
                    దాసామానసమగ్రయశా
     వననిధిసారసనాధిపసారస
                    వక్రమసారసఘనవిభవా
     వనజభవాసనవారిజగడ్యుతి
                    వారిజనారజయాభ్యుదయా.

గద్యము.
ఇది శ్రీ కాళహస్తీశ్వరచరణారవిందమిళిందాయ మానాంతరంగ జ్ఞానప్రసూ
నాంబికాకృపావలంబవిజృంభమాణసారసారస్వతసుధాతరంగ లింగనమఖి
వెంగనామాత్యవంశపావన విరచితవిద్యాధిదేవతాసంభావన దక్షిణసింహా
సనాధ్యక్షతిరుమలక్షమాకాంతకరుణాకటాక్షలక్షితస్వచ్ఛముక్తాగుళుచ్ఛ
సితచ్ఛత్రచామరకళాచికాకనకాందోళికాదిరాజోపచార ధీరజనహృద
యరంజకవచోవిహారవల్లకీవాదనధురీణవర్ణగీతాదిగాం
ధర్వస్వరకల్పనాప్రవీణ కామాక్ష్యంబికానాగనకవి
రాజనందన కలితసకలబాంధవహృదయానందన
శ్రీకర కవితాకర సుకవిజనధేయ శ్రీ కామే
శ్వరనామధేయప్రణీతం బైనసత్యభామా
సాంత్వనం బనుమహాప్రబంధంబు
నందు సర్వంబును
జతుర్థాశ్వాసము.


సంపూర్ణము.

  1. నటు కన్ను గానక జగతిన్
  2. నునుపొందుకనుమోడ్పు
  3. సతికి కొసరనిచ్చు చవులఁ దలఁచుఁ
  4. దాల్చుతొడుకు మానె
  5. తెరువు వట్టు
  6. నరకాసురుని గూడి తిరుగు
  7. తొలిజోగిముడుపు రావలజక్క
  8. రామా వేమారక కిట
  9. రామా నా మాటవాసి
  10. రా మానునె రణ మన గా
  11. బడెసాహె బనుచు
  12. గాయనపుపలుకు
  13. మరునినామముగోము
  14. జాలమేల
  15. ఈకవిరాజవిరజితము లక్షణవిరుద్ధముగా నున్ననూ ప్రత్యంతరములేమి యథామాతృకగాఁ బ్రకటించితిమి.