సకలనీతిసమ్మతము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీరస్తు

సకలనీతిసమ్మతము


ప్రథమాశ్వాసము

ఉ. శ్రీమహిళాకటాక్షతులసీదళకౌస్తుభరత్నకాంతు లు
ద్ధామగతి న్వెలుంగ విదితం బగు శక్రధనుస్సమేతమే
ఘామలభాతిఁ బొల్చు సుగుణాఢ్యుఁడు రామగిరీంద్రకేశవ
స్వామి త్రి[లోకనాథుఁడు] ధ్రువంబుగ మత్కృతినాథుఁ డయ్యెడున్. 1

వ. అని యాశీర్వచనపూర్వకంబుగా నప్పరమేశ్వరుచరణారవిందంబులు డెందంబునఁ గుదురుపఱచి నమస్కరించి. 2

క. సరసకవితావిలాసుఁడ
గురుభారద్వాజరమ్యగోత్రాబ్ధిసుధా
కిరణాయ్యలార్యతనయుఁడ
హరిదాసుఁడ మడికి సింగయాఖ్యుఁడ ధాత్రిన్. 3

వ. సకలవిద్వజ్జనానుగ్రహంబున నొక్కప్రబంధంబు విరచింపం గోరి మనంబున నిట్లని విత్కరించితి. 4

చ. కరిహయశిక్షలందు నృపకార్యములందును సంధియానసం
గరములయందు వర్తకముఖంబునఁ గర్షకలీల మోక్షత
త్పరుఁ డగుచోట నీతి యనుదర్పణముం బరికించి చూడ కే
వెరవునఁ గార్యనిశ్చయవివేకము దోచునె బ్రహ్మకేనియున్. 5

క. నీతి యెఱింగినమర్త్యుఁ డ
రాతుల భంజింపనోపు రాజుచేతన్
ఖ్యాతియు లాభముఁ బొందు స
మాతతముగ ముక్తికాతఁ డధికారి యగున్. 6

వ. అట్లు గావున సకలశాస్త్రంబులందును నయశాస్త్రంబు ముఖ్యం బని తలంచి చెప్పం బూనితి. నారద వసిష్ఠ పరాశర బాదరాయణ భృగ్వాంగిరస గురు శుక్ర

మతానుసారంబై దేవమానవరాక్షసంబులైన సాత్త్వికరాజసకామనప్రకారంబు లగు నయశాస్త్రంబులు పరీక్షించి యంధ్రభాషాకోవిదులగు సుకవీంద్రవిరచితంబైన ముద్రామాత్య పంచతంత్రీ బద్దెభూపాల చాణక్య ధౌమ్య విదుర ధృతరాష్ట్ర బలభద్ర కామందక గజాంకుశ నీతిసార నీతిభూషణ క్షేమేంద్ర భోజరాజవిభూషణ పురుషార్థసార భారత రామాయణాది మహాకావ్యంబులు పురాణేతిహసంబులు కందనామాత్యు నీతితారావళి లోకోక్తి చాటుప్రబంధంబులయందునుగల నీతివిశేషంబు లూహించి తత్తత్సారాంశంబు లయ్యైవిధంబుల వర్గసంగతంబుగా సకలనీతిసమ్మతం బనుపేర నొక్కప్రబంధంబు రచియింపుదు నని ప్రబంధసారంబునకు ననుగుణంబుగా నేపురుషునిం బ్రార్థింతునో యని వితర్కించితి. 7

సీ. ఘనకళాఘాతకర్కశకిణచేటికా
స్తనముల నలఁదిన చందనంబు
నిశితకంటకశీలానికటమర్కటకటిఁ
జెలువారఁ గట్టిన జేలుచేల
ప్రకటితాసవమత్తభల్లూక మౌదలఁ
బొలుపారఁ జెరివిన పుష్పమాల
సతతపల్వలపంకసంగిలులాయంబు
నఱుతఁ బెట్టిన తారహారపంక్తి
గీ. కరణి గాకున్నె సాహిత్యసరణి యెఱుఁగ
కజ్జుసంగతిఁ బొదలు దురాత్మకులకుఁ
గవులు తర మెఱుఁగక యిచ్చు కావ్యకన్య
క్లేశసంసారభవనాశ కేశవేశ. 8

వ. అని విచారించి మత్కవితాకన్యకకుఁ దగిన పురుషుండు పురాణపురుషుండె కా నిశ్చయించి సకలజగదుత్పత్తిస్థితిలయకరుండును నిఖిలవేదాంతవేద్యుండును బరమయోగిహృదయవాసుండును వాసవవంశాంబురాశిసుధాకరకాశ్యపసగోత్రపవిత్రబ్బనా(మాత్యపుత్ర) కందనామాత్యాగ్రజన్మ కేసనమంత్రిప్రతిష్ఠిత మహాప్రసాదనిజజగన్నివాసుండును సకలలోకస్వామియు నభీష్టఫలప్రదాయకుఁడును నగు రామగిరి శ్రీకేశవేశ్వరునకు సమర్పించుట యదియుఁ బరమపూజావిశేషంబ కావుత మని మనంబున నుపక్రమించి. 9

షష్ఠ్యంతములు


క. అంభోరుహదళనయనున
కంభోనిధికన్యకాకుచాశ్రితశుంభ
జ్జృంభితవక్షఃస్థలునకు
నంభోధరవర్ణునకు దయాంభోనిధికిన్. 10

క. కైటభరిపునకు సురవర
కోటీరతటాగ్రరత్నకుట్టిమకురువిం
దాటోపకిరణరంజిత
పాటలితశ్రీవిరాజపదపద్మునకున్. 11

క. కేశవనాథున కఖిలది
గీశారాధ్యునకు జగదదీశున కాశా
పాశక్లేశారణ్యహు
తాశనునకు నిత్యసంవిదాకాశునకున్. 12

వ. ఏను విన్నపంబు సేయంబూనిన సకలనీతిసమ్మతకథాప్రారంభం బెట్టిదనిన. 13

సీ. ఆలోలకల్లోల మగుదుగ్ధనిధిఁ ద్రచ్చి
దేవామృతము తేట దేర్చుపగిది
గంథకారుఁడు మున్ను గలవస్తువులు జోకఁ
గూర్చి సుగంధంబు గూడినట్లు
అడవి పువ్వులతేనె లన్నియు మధుపాళి
యిట్టలంబుగ జున్ను వెట్టుభంగిఁ
దననేర్పుమెఱసి వర్తకుఁడు ముత్తెము లీడు
గూర్చి హారంబు తాఁ గ్రుచ్చుకరణిఁ
గీ. గృతులు మును చెప్పినట్టి సత్కృతులు ద్రవ్వి
కాంచుకంటెను నొకచోటఁ గానఁబడఁగ
సకలనయశాస్త్రమతములు సంగ్రహించి
గ్రంథ మొనరింతు లోకోపకారముగను. 14

గీ. అక్రమం బని తలఁపకుఁ డఖిలములును
వర్గువులు చేసి చెప్పిన వరుసతోడఁ
జూచి సకలంబుఁ దెలియుఁడు సుకవులార
చేరకుఁడు మదీయకావ్యమని వ్రాయింతున్. 15

క. కడవెఁడు దుగ్ధములోపల
దొడిఁబడఁ గొణిదెండుసల్ల తోఁడంబడిన
టంలెడనెడ నొక్కొకపద్యం
బడరించి మదీయకావ్యమని వ్రాయింతున్. 16

వ. అది యెట్లనినఁ గవిత్వగుణవిశేషంబును, నీతిశాస్త్రప్రశంసయు, రాజ్యాంగప్రధానంబైన దుర్గసంరక్షణంబును, రాజునవశ్యకర్తవ్యంబగు నాజ్ఞాపాలనంబును, బ్రజాపాలనంబును, బ్రాహ్మణాచారనీతియు, దుష్టశిష్టమంత్రపరిశీలనంబును, గణక పురాహిత విద్వద్యాచక జ్యోతిషిక వైద్య దూత చార సేనాపతి భట సేవకోత్తమాధమ లక్షణంబును, సామభేదదానదండమాయోపేక్షేంద్రజాలికక్రమంబులును, సంధివిగ్రహ యానాసనద్వైదీభావంబులును, సప్తవ్యసననిరూపణంబును, మిత్రానసూయావిధానంబులును, దండయాత్రాసామర్థ్యంబును, జతురంగబలసన్నాహంబును, బ్రయాణప్రయత్నంబును, దత్తచ్ఛకుననిశ్చయంబును, యుద్ధవిధానంబును, నిజస్కంధావారనివేశ ప్రకారంబును, బ్రత్యర్థిరాజ బలాబల చింతలును, నుభయబలవ్యూహరచిత చాతుర్యంబును, గరి ఘోటక చతురంగ యోధనిశ్చయంబును, గార్యసత్వరంబును, అధికాధమ

విరోదభేదంబులును, రాజపుత్రజ్ఞాతిబంధుజనపరిపాలనంబును, బౌరాంగనా విట విటీజనలక్షణంబును, సజ్జన దుర్జన వర్తనంబులును, లుబ్ధత్యాగి యాచక గుణవిశేషంబులును, పంచగుప్త ప్రశంసయు, సకలలోకోక్తివిశేషంబులును, నింగితాకారచేష్టలును, సంగీతనాట్యప్రకారంబులును, నన్యాపదేశంబులును, ధనాధనవాణిజ్య కృషీవల పశుపాలన లక్షణంబులును, దేవాలయోద్యాన తులసీవన తటాకాది ప్రతిష్ఠాఫలంబులును, హరిహరభక్తివిశేషంబులును, సాలగ్రామ పూజాఫలంబులును, గాయత్రీమంత్ర గురు పితృభక్తివిధంబులును, నానాతీర్థవిశేషంబులును, మాఘస్నానఫలంబు, ను నివి యాదిగాఁగలిగి బహుకవీంద్రవాక్యామృతపూరంబై, ధర్మార్థకామమోక్షప్రదం బగు నీతిప్రపంచంబు వివరించెద. 17

చ. మును కవులెల్లఁ జెప్పినవి మున్కొని చర్వితచర్వణంబుగాఁ
బనివడి వ్రాయనేల కవిప్రాజ్ఞూలు చిత్తములందుఁ జూడుఁ డా
ఘనుఁడగు ప్రౌఢమూలకరి కమ్మని పువ్వులు గూర్చి దండ గ
ట్టినక్రియ నీతిదామము ఘటింపుదు మీరలు మెచ్చునట్లుగన్. 18

క. సురతాణిముద్రఁ బోలెను
ధర నెల్లెడఁ జెల్లు పెక్కుతార్కాణలతో
సరివచ్చి సర్వసమ్మ
త్త్యరహము గావలయుఁ దజ్ఞుఁ డాడినమాటల్. 19

మదీయముక. జను లిది యల్పగ్రంథం
బనవలదు దీనఁ దోఁచు నన్నియుఁ బెక్కుల్
గనుపట్టఁ జేయు వాతా
యనవివరము పిన్నగాదె యారసి చూడన్. 20

క. భువి నధికుఁడు దెలుపని యు
క్తివిశేషము చిఱుతవాఁడు దెలుపెడు నొకచో
రవికి మఱుఁగైనగొందిని
దివియ ప్రకాశింపఁ జేయదే యొక్కొక్కచోన్. 21

ఉ. ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందుఁ దృణాగ్నలగ్న నీ
రాకృతి వార్థి యింకుట దశాస్యునిఁ జంపుట మిథ్య గాదె వా
ల్మీకులు సెప్పకున్న కృతిలేని నరేశ్వరు వర్తనంబు ర
త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్. 22

నీతిభూషణముక. అమల మగు సప్తసంతా
నములం దనిశంబు యశమునకుఁ గుదురై నా
శము లేక నెగడు సత్కా
వ్యము ధారుణిలోన నౌభళార్యుని కందా. 23

క. అమరఁగ వేల్పులచేఁ గ
బ్బము చెప్పియ కాదె వరము పడసిరి మును బా
ణమయూరాదులు సత్కా
వ్యముఁ జెప్పినఁ బడయరాని వస్తువు గలదే. 24

శా. బహ్వర్థప్రతిపాదకంబు లయి శబ్దంబుల్ నిరాయాసభా
వాహ్వానం బొనరింపఁగా రసనవీనాపాదనంబుల్ చతు
ర్బాహ్వంఘ్రిప్రభవాపగామహిమ దోపం జూప లేకుండినన్
జిహ్వాకండువుపొంటె మేలె కవిరాట్ఛిల్పంబు లల్పంబులే. 25

సీ. గ్రామ్యంబు దుస్సంధి కాకు విరోధోక్తి
పొల్ల సంక్లిష్టంబు జల్లిపొదవు
వ్యర్థబంధంబు నిరర్ధంబు పునరుక్తి
దోషం బలంకారదూషణంబు
రసవిరుద్ధము క్రియరాహిత్య మస్పష్ట
భావంబు గణయతిభంగ శబ్ద
భంగంబు లెఱుఁగక సంగతంబుగ వట్టి
మాటలు పురికొల్పి మచ్చరమునఁ
గీ. బెనచి వడ్లును బెరువును బిసికినట్లు
కెలను నవ్వంగ బిలిబిలికృతులు సెప్పి
వాదు లడువంగఁ బఱతెంచువారు కవులె
గోపికాజాలసుఖలోల గోపబాల. 26

చ. తెలుఁగని చెప్పి సంస్కృతము తీపును నాఱడిఁబుచ్చి శబ్దముల్
తెలుఁగును గాక యేసభలఁ దెల్పఁగరాని యపప్రయోగముల్
పలుమఱు గ్రుచ్చి వా దడువఁ బాడుచుఁ గబ్బపు దబ్బముండ్లచేఁ
బెలుచన కర్ణముల్ పొడుచు బేలుఁగవిం గవిగాఁ దలంతురే. 27

చ. పలుకులు గొన్ని పేర్చి వడిఁబ్రాసము నందుల దోఁప నేర్చు భం
గుల నెటువంటి పద్యములు గూర్చినఁ గూర్పఁగ వచ్చుఁగాక తద్
జ్ఞులు వొగడం బ్రబంధములు చోద్యము పుట్ట రచింపవచ్చునే
చెలమలు ద్రవ్వినట్లగునె చెర్వులు గట్టుట భూతలంబునన్. 28

నీతితారావళిసీ. సుందరీనఖముఖసుఖదవీణాతంత్రి
ముసలంబు గొని పెట్టు మోఁదినట్టు
మృదుతంతుబంధనాస్పదనప్రసూనంబు
కఠినంపురజ్జునఁ గట్టునట్లు
అర్భకనఖదారణారహకదళికా
ఫలము గొడ్డఁటఁ గొని పాపినట్లు
చంద్రికారసబిందుసదృశముక్తామణి
బలితంపుఁ గరసానఁ బట్టునట్లు
గీ. చతురకవిసూక్తరసభావజనితమధుర
సకలకావ్యంబు కేవలశాస్త్రతర్క
కర్కశోపలసదృశవాక్పరుషతలను
గుతిలపడ కేలసైరించు గోపబాల. 29

మదీయము

క. పలుకుల తీపును సరసము
చెలువము నడబెడఁగు బంధచిత్రము సొబగున్
గలకలనఁ జూపవలదే
కలకంఠియుఁ బోలెఁ గవిత కందనమంత్రీ. 30

నీతితారావళిక. సరసకవితరుచి యెఱుఁగని
పురుషులఁ బశువులని నిక్కముగ నెఱుఁగుఁడు వా
రురుపడిఁ దృణంబు మేయమి
పరికింపఁగ ధరణిఁ బసుల భాగ్యం బెందున్. 31

ఉ. సుందరసర్వలక్షణవిశుద్ధకవిత్వము గన్నచో రస
స్యంది నిజస్వభావుఁ డనఁ జాలినయట్ల నిజస్వభావుఁ డా
నందముఁ బొందునట్లు కుజనప్రకరంబు లెఱుంగ నేర్చు నే
చందురుఁజూచి మోదమున సాగర ముబ్బిన నూతు లుబ్బునే. 32

నీతిభూషణము

నీతిశాస్త్రప్రశంస

మ. నయమార్గంబున లక్ష్మి లక్ష్మిగలచో నారాయణుం డుండు ని
శ్చయ మచ్చో పరధర్మవృత్తికి నిజస్థానంబు తన్మూలమై
జయ మెల్లప్పుడు నుల్లసిల్లుఁ ద్రిజగత్సంసేవ్యమై కావునన్
నయశాస్త్రంబె వివేకధన్యునకుఁ జింతారత్న మెల్లప్పుడున్. 33

గీ. వ్యసనములు మాని రాజు విత్వత్ప్రసంగ
సంగియై పురాణేతిహాసములు వినుచు
నీతి వినునేని నృపతికి నేర్పు మిగులు
వసుధఁ బామున కెఱకలు వచ్చినట్లు. 34

ఆ. నీతి యెఱుగువాఁడు నిఖిలంబులందును
ఖ్యాతిలాభపూజలందు నొప్పు
గాక యొరుఁడు పొందఁగలఁడె నేర్పునకు
వివేకమునకు నూఁత వెరవకాదె. 35

నీతిసారముచ. అనుచుఁ దలంచి రాజసచివాధిపు లెంతయుఁ బ్రేమతోడఁ బ్రా
ర్థన మొనరింప సర్వజనతాహితబుద్ధి వహించి యంధ్రవా
గవనధివిలాసవీచికల వారక తెప్పలఁ దేల్చియింపు సొం
పినుమడిగా నయామృతము నిచ్చెద మెచ్చులు పల్లవింపగన్. 36

సీ. నిత్యనైమిత్తికనియమమతాదుల
విపులధర్మంబు గావించునపుడు
కర్శనగోత్రజక్రయవిక్రయాదుల
చేత నర్థంబు లార్జించునెడల
స్మరకూచిమారపాంచాలాదిమతములఁ
గామసౌఖ్యము లందు కాలములను
యమనియమాదివిఖ్యాతకారణములఁ
గైవల్యమార్గంబు గాంచునెడల
ఆ. మఱియు సూక్ష్మవాక్యమార్గంబులందును
నధిక మగుచు నున్న యట్టి పనుల
వెరవు లేనియట్టి పురుషుండు నేర్చునే
ఫలము నొంద నీతిపరుఁడు గాక. 37

ముద్రామాత్యముచ. అరయఁగ శబ్దశాస్త్రము లనంతము లాయువు కొంచె మందులోఁ
గరము ఘనంబు విఘ్నములు గావున సారము పట్టు టొప్పగున్
బరఁగ నసారము ల్విడిచి పాలును నీరును నేర్పరించి నే
ర్పరుదుగఁ బాలు పుచ్చుకొను నంచతెఱంగున భూవరాగ్రణీ. 38

పంచతంత్రిక. ధర్మార్థశాస్త్రతత్త్వవి
నిర్మలమతి గాక యెట్టి నీతికథాస
ద్ధర్మము దెలియసమర్థుఁడు
దుర్మతి యే మెఱుఁగు శాస్త్రదూషణఁదక్కన్. 39

క. మతిమంత్రులయంత్రంబులు
ప్రతియంత్రక్రియనెగాని పాయవు దృఢకీ
లితఘనఘటితకవాటము
ధృతిఁ దాలముచేతఁ గాక తెఱవగ నగునే. 40

ముద్రామాత్యముక. ధరనొప్పు నీతిమార్గము
పరికింపఁగఁ దిరుగు మంత్రిపని మంత్రము లే
కురువిషభుజగము పట్టిన
కరణి సుమీ యౌభళార్యు కందనమంత్రీ. 41

నీతితారావళిక. రాజు లమాత్యులు మొదలగు
భూజనులకు నీతిపథము పొత్తగు నందే
యోజఁ బరికింప నెవ్వరు
తేజము గం డ్రావిధమ్ముఁ దెలిపెద వరుసన్. 42

ముద్రామాత్యముక. పెక్కేల నీతిశాస్త్రముఁ
దక్కక నెవ్వండు సదువు ధర నెవ్వఁడు పెం
పెక్కఁగ నిము నాతఁడు దాఁ
జిక్కఁడు సురపతికి నైన సిద్ధం బెందున్. 43

పంచతంత్రి

దుర్గసంరక్షణము

ఉ. శ్రీపతిఁ బోలు భూపతియుఁ జెల్వగుమంత్రియు రాష్ట్రదుర్గము
ద్దీపితకోశసైన్యము లుదీర్ణసుహృజ్జనులుం బరస్పర
వ్యాపిమహోపకారు లగు నట్లుగ రాజ్యనిజాంగబుద్ధిమై
నోపి పరీక్షసేయవలయు న్నిజశిక్షణలక్షణంబులన్. 44

ఉ. అరసి రాజకంబుల ప్రజావలి కెల్ల నివాస మయ్యు భం
డారములున్ బలంబుఁ బ్రకటంబుగఁ దాఁపఁగఁ బోలు దుర్గ మే
భూరమణీశుఁ డేలుఁ బరిపూర్తిగ వానికి వశ్యులై ప్రజల్
భూరిధనంబు గూర్తు రది వోలునె కాదె నిజాభిరక్షకున్. 45

క. విమతుల కగమ్య మగు దు
ర్గము లేకుండినను బ్రజకు రాజుకుఁ దమదే
శము లిడుమం బడు ధనధా
న్యము లుండినఁ బిదపఁ బ్రాణహానియుఁ గల్గున్. 46

కామందకముక. తనప్రజకుఁ బిదప నిర్భయ
మని యూఱడి తొలఁగిపోయి యహితుల గెలువన్
(జనియైనఁ జుట్టుముట్టినఁ)
దునుము నృపుం డశ్రమంబు దుర్గబలమునన్. 47

క. పులు లుండుఁ బొదల నేనుఁగు
లలఘుగిరీంద్రముల నుండు ననిశము సింహం
బుల గుహల నుండుఁ గావున
బలవంతుల కైన దుర్గబల మది వలయున్. 48

ఆ. అలహిరణ్యకశిపు నలజడికై యోడి
విశ్వకర్మచేత విశ్రుతముగ
గురునియనుమతమునఁ గోటఁ బెట్టింపఁడే
యమర నమరనాథుఁ డమరపురికి. 49

ఆ. ధరణి మదము లేని కరులునుబోలె దం
ష్ట్రములు లేని పన్నగములుఁ బోలె
నరయ దుర్గరహితులైన రాత్రీశ్వరు
లవని కెల్ల నసదు లగుదు రెపుడు. 50

క. పరులకు దుర్గము వలదే
హరువరమున భువనవిజయుఁ డగు రావణుఁడున్
శరధగిరిప్రాకారో
త్కరపరివృతమైన లంక ఘన మని యుండున్. 51

పురుషార్థసారముగీ. చుట్టువాఱ వెలుగు గట్టిగా నిడికొని
యున్వారిఁ గడిఁది యోర్పు టనిన
నురుతరంపు దుర్గ మొకటి ప్రవేశించి
బలసికొనినపిదప గెలువ వశమె. 52

పంచతంత్రి

వ. కావున దుర్గంబ రాజ్యంబునకు చిరకాలనిర్వాహకం బదియును భూస్థలంబున నిర్మింపంబడిన ప్రాకారంబు స్థలదుర్గంబు, జలవనపర్వతంబులు స్వభావదుర్గంబు లయ్యును బ్రాకారంబు లేకయున్నఁ బరులకు గోచరంబు లగు నీ చతుర్విధదుర్గంబులందును విచిత్ర గోపురాట్టాలకంబులును, ననేక దారుమయ యంత్ర నియంత్రితంబులును, నానాస్త్రశస్త్ర శిక్షాదక్ష వీరభటప్రాయంబులును, బహు ధనధాన్య సంగ్రహంబులును, ననేకజనసంచారక్షమాంతరాళంబులును, దృణ కాష్ఠ జల సమృద్ధంబులును, బ్రవేశ నిర్గమ మార్గ నిరోధ రహితంబులుగా నొనర్పవలయు. నట్లు గాని దుర్గంబు పందిగృహంబు మఱియును. 53

నీతిసారముఉ. శైలసరిన్మరుస్థలవిశాలవనాశ్రయణంబు నున్నతా
ట్టాలకమాత్ర గోపురదృఢస్థలవప్రశిరఃప్రఘాతముం
గాలసహంబు ధాన్యధనకాష్ఠజలాదికమున్ మహాభటో
త్తాలభుజార్గళంబును బ్రధానకవాటము దుర్గ మెమ్మెయిన్. 54

క. గిరులును దరులును జలములు
మరుభూములు మిగుల నైన మనుజేశునకున్
దిరముగ దుర్గము సేయుట
వెర వగు వైరులకుఁ జేర విషమం బగుటన్. 55

కామందకముచ. బహుధనధాన్యసంగ్రహము బాణశరాసన యోధవీర సం
గ్రహము నిరంతరాంతరుదకంబునుఁ జాలఁగ నింధనంబు సం
గ్రహము ననేకయంత్రములు గల్గి యసాధ్యములై ద్విషద్భయా
వహము లనంగ నొప్పునె భవత్పరిరక్ష్యములైన దుర్గముల్. 56

సభాపర్వముచ. సముచితవస్తుసంగ్రహము సాలినదుర్గము లిచ్చు నందు ధా
న్యము మిగులంగఁ గూర్పఁదగుఁ బ్రాణము నిల్వఁగ ముఖ్యహేతువై
కొమరగు గానయందు నిడు కోద్రవముల్ సెడకుండఁ బెట్ట ధా
న్యము పెఱధాన్యమైన నవిలంబగతిం జనుఁ గ్రొత్త సేయఁగన్. 57

నీతిసారము

చ. ధరఁ దృణకాష్ఠతైలఘృతధాన్యబలాదికవస్తుపూర్ణమై
గురుతరమై మహాటవులఁ గోటల భూరిగభీరవాపులన్
బరివృతమై ప్రవీరసులభం బగు దుర్గము గల్గు ధారుణీ
శ్వరుఁడు దలంప నెవ్వరి కసాధ్యుఁడు వారికి సాధ్యులే యొరుల్. 58

పురుషార్థసారముక. రసరాజ మైన లవణం
బెసగఁగ దుర్గముల సంగ్రహింపగవలయున్
బొసఁగునె యన్నము మఱి యే
రసములు గలిగినను లవణరసవర్ణితమై. 59

సీ. బలుగాఁపు వాకిళ్ళఁ బగలు రేయును నిడి
కోటపాళెము తగుచోటఁ బెట్టి
కనుమపట్లను నెల్లఁ గావలి నియమించి
నడిమిచావిడిఁ దగునరుల నునిచి
నగరిచుట్టును బారి నడిపించి క్రంతలఁ
దిరుగుచుండగఁ దలవరులఁ బనిచి
దినచర్యఁ బాలెముల్ దృష్టివెట్టుచు రేలు
దివియలు విడువక తిరుగఁజేసి
ఆ. దొరల రాజులందు నరయుచు భటులందు
భేద మొదవకుండ నాదరించి
యుచితవృత్తి గావకుండిన దుర్గంబు
నేలఁగలఁడె భూమి నింద్రుఁ డైన. 60

క. బలు వగు దుర్గము గలిగియు
బలములు లేకున్న నిలుప బలవంతునకున్
దలమే నృపులకు నాలుగు
బలములు గలుగుటయె కాదె బలిమి యనంగన్. 61

క. కరులును హరులును రథములు
వరభటులు ననంగ నాల్గు వర్గంబులు నొం
డొరులకుఁ బ్రాపై నిలువక
పరసేనం గెలువగలఁడె పార్థుం డైనన్. 62

నీతిసారముక. ఈ నాలుగుదుర్గములకు
మానుగఁ జొర వెడల గూఢమార్గము వలయున్
ఆనూపజాంగలంబులఁ
బూనిన భూములును వలయు భూనాథునకున్. 63

క. భూగుణముచేత రాష్ట్రము
భోగాస్పదవృద్ధినొందుఁ బొదవినరాష్ట్ర
శ్రీగరిమం బది పొదలు స
రాగము లామంచిభూమి రాజున కెందున్. 64

సీ. సస్యాకరవిశేషసలిలసమృద్ధియుఁ
బణ్యఖనిద్రవ్యబంధురంబుఁ
బుణ్యదేశాన్వితంబును గోహితంబును
గుంజరోద్భవవనపుంజములును
వారిస్థలపథాన్వితారూఢమును నదీ
మాతృకంబును సేవ్యమానతలము
నై పొలుపొందుట యవనీస్థలంబున
కంచితగుణములై యతిశయిల్లు

గీ. నూషపాషాణశర్కరాత్యుగ్రరూక్ష
భుజగ కంటక తస్కరభూరివిపిన
సంకులం బగుభూమి యసంఖ్యమైన
నేఫలం బగు భూమి నరేశ్వరునకు. 65

సీ. భూరిభూమీగుణంబుల నుల్లసిల్లుచు
నానూపము బర్వతాశ్రయంబు
నానావిదేశజనస్తోమధామము
దనుపక బహులము ధర్మయుతము
శూద్రకారుణవణిక్ప్రచురపురాంతరము
నుచితమహారంభకృషీవలంబు
రాజానురాగ మరాతివిద్వేషియుఁ
బీడాకరసహంబుఁ బృథుతరంబు
ఆ. నైన మండలంబునందు నృపాలుండు
వ్యసనమౌర్ఖ్యహీనుఁ డగుచు నెపుడు
న్యాయమార్గవృత్తిఁ బాయక పోషింప
వలయు నదియు సర్వవర్ధనంబు. 66

కామందకముక. ధరణీనాథ భవద్భుజ
పరిపాలిత మైన వసుధ పరిపూర్ణములై
కర మొప్పుచున్నె చెఱువులు
ధరణి కవగ్రహభయంబు దగులకయుండన్. 67

సభాపర్వముచ. వెస నతివృష్టియున్ మఱి యవృష్టియు మూషకముల్ పతంగముల్
మసఁగు టశోభనంబు కృపమాలిన దండువు శత్రుసైన్యముల్
ఎసగిఁ యరాతితస్కరు లధీశచమూప్రియు లేచి నొంపుటల్
పసులును మానవుల్ రుజలఁబంచత నొందుట రాష్ట్రదోషముల్. 68

శా. ఆదానాధికమున్ మితవ్యయము ప్రఖ్యాతేప్సితద్రవ్యమున్
మోదారాధితదైవతోర్జితము సన్ముక్తాదిరత్నాఢ్యమా
హ్లాదశ్రీకర మాత్మరక్షణవిధాయత్తంబు పైతామహా
నాదిప్రౌఢమునైన పెన్నిధి ధనంబై యొప్పు నక్షీణమై. 69

గీ. ధర్మకామార్థలాభవిధానమునకు
సకలభృత్యాదిలోకరక్షణముకొఱకు
నాపదర్థము నర్థరక్షాపరుండు
గా నవశ్యము వలయు భూకాంతుఁ డెపుడు. 70

గీ. ఇట్టిసంపద నెంతయు నేర్పు మిగులు
దుర్గములు భూములునుఁ గడు దోరముగను
లేని భూపతి వాత్యావిలూనవికట
వికలకాదంబినీసమవిభవుఁ డగును. 71

ఆ. పరఁగ నాత్మరక్షఁ బరపక్షపూజ్యుఁ డౌఁ
బూని దుర్గసంస్థుడైన విభుఁడు
ఇట్టి దుర్గమునకు నెంతయు వ్యసనంబు
పొడమెనేని చేటు గడమలేదు. 72


ఆ. యంత్రవప్రరిఖ లతివిశీర్ణంబులై
ధాన్యతృణజలాదిశూన్య మగుచు
నమితహీనమగుట యదియు దుర్గవ్యస
నంబు నాఁగ నిది గరంబు కీడు. 73

క. ఎఱుఁగనివానికి దుర్గం
బెఱిఁగింపఁగఁ గోరి యెవ్వ డేఁగు నతఁడు దా
నొఱపుగ నాదుర్గములో
నఱిముఱిఁ బగవారి దఱియ నడుగుట దలఁపన్. 74

ఆ. వెరవు లావును మదమును బొరసెనేని
చేటు పొందకయుండ రక్షించుఁ గోట
వెరవు లావును మదమును బొరయనేని
కోట ప్రాణాభిమానముల్ గోలు పుచ్చు. 75

కామందకముక. ఈరీతి దుర్గభాండా
గారగృహద్వారవప్రకరిహయగోష్ఠా
గారభటభూము లెప్పుడు
సారక్ష యెనర్పవలయు జననాథునకున్. 76

మదీయము

ఆజ్ఞాపాలనము

క. ఏ జనుల కాజ్ఞ సాలని
రాజును రాజేంద్రునాజ్ఞ ప్రకటింపని యా
రాజునకు గోడ వ్రాసిన
రాజునకున్ భేద మేమి ప్రాజ్ఞున కరయన్. 77

నీతిభూషణముక. అనుజులు తనుజులు గురుజను
లనుఁగులు బంధుల ప్రధానులకు సిరిపొత్తీఁ
జనుగాని యాజ్ఞపొత్తీఁ
జన దధిపతికిన్ వివేకచతురాననుఁడా. 78

బద్దెననీతిక. పుత్రులు పౌత్రులు భ్రాతలు
మిత్రులనరు రాజు లాజ్ఞ మీఱినచోటన్
శత్రులుగాఁ దమయలుకకుఁ
బాత్రము సేయుదురు నీజశుభస్థితిపొంటెన్. 79

ధౌమ్యనీతిక. భూతలపతివితతాజ్ఞా
జ్యోతి ప్రవర్తింపకున్న సూర్యాగ్నిశశి
జ్యోతులు వెలుఁగవు గాన వి
చేతనముం బొంది సృష్టి చీకటి గాదే? 80

క. సతతసుఖానుభవంబులు
నతిశయవిభవములు నృపతియాశ్రితజనసం
తతికైనలేవె ధరణీ
పతి కాజ్ఞయ గాదె రాజ్యఫలము దలంపన్. 81

ఆ. వెలుగుఁబెట్టి చేను గలయంగఁ బండిన
నుఱిపిఫలము గొన్న తెఱఁగుదోప
నాజ్ఞ వెట్టి ప్రజల నరియప్పనంబులు
గొనఁగవలయు రాజకుంజరుండు. 82

క. పసరముఁ బసరము పులిఁబులి
బిసరుహసంభవునిదృష్టి పెంపెంతమహిన్
బసరముఁ బులిఁజేయుఁబులిం
బసరముగాఁ జేయు నృపతి బలమదిగాదే. 83

క. అజమైన సింహమగు భూ
భుజుమన్నన గలుగునట్టి పురుషుం డరయన్
అజమగు సింహంబును భూ
భుజుమన్ననలేనియట్టి పురుషుఁడు దలఁపన్. 84

పురుషార్థసారముక. బలవంతుఁడు మన్నించిన
బలహీనుఁడు బలియుఁ డనఁగఁబడు ధారుణిలో
వలరాయఁడు చేపట్టిన
యలరులు బాణములు గావె యౌభళకందా. 85

నీతితారావళిఆ. ఆజ్ఞలేని నృపుఁడు నరయఁ జిత్తరువులో
నున్న రాజుఁ జూడ నొక్క రూప
ఆన ద్రోయు సుతుని నైనను దండింప
కున్న రాజ్యమేల యుండుఁ జెడక. 86

క. పనిలేనియాన గర్వం
బునబొడిచిన మగుడ నాన పొడిచినవారిన్
జనపాలుఁడు దండింపం
జనుఁదగుక్రియ నానఁ ద్రోయుజనులనవోలెన్. 87

క. దండము లేకున్నను బ్రజ
లొండొరువుల నాక్రమింతు రుచిరస్థితిమై
నుండవు వర్ణాశ్రమములు
దండింపని భూమిపతికి ధర యేర్పడునే. 88

ఉ. జూదము వాదుఁబన్నిదము జోకయు మందటకూటసాక్షి మ
ర్యాదలులేమి గబ్బుమెయి నానకు నిల్వక రాజసంబునం
బేదల నొంచు దప్పుగొని పెట్టమినాదిగ వంచనక్రియన్
గా దడఁకించుదుర్జనులఁ గావనిరా జిల యేలనేర్చునే. 89

నీతిసారముఉ. మండలనాథునాజ్ఞకు సమస్తజనంబులు నోడిపాడిమై
నుండక మేర దప్పి బలియుం డబలున్ మననీక పెద్దమీ
న్కొండికమీను ద్రావుక్రియఁ గ్రొవ్వునఁ జంపుచు నుండిరేని య
మ్మండల మేల యుండు మతిమంతులకుం బరపక్షభైరవా. 90

బద్దెననీతి

ఆ. తారతప్పుసేయఁ దగుశిక్ష చేసిన
నుర్విపతులఁ గొంద ఱొప్పదండ్రు
అది వివేకమగునె వదన మొప్పకయున్న
దర్పణంబుమీఁదఁ దప్పుగలదె. 91

పంచతంత్రి

ప్రజాపాలనము

క. నరపాలుఁ డాత్మసంప
ద్వరయుతుఁ డగుచుండి లోకవర్తనవిదుఁడై
చరియింప నఖిలలోకము
కరము సుఖంబుండు తండ్రి గల ప్రజల క్రియన్. 92

క. నృపజనచోరాయత్తము
నృపవల్లభ రాజలోభనిజహేతువులున్
విపుల కగు నైదుభయములు
నపద్రవము సేయుఁ బ్రజలకొగి భూపతికిన్. 93

క. న్యాయప్రయుక్తుఁ డగుపతి
పాయక తనుఁదనదు ప్రజలఁ బరఁగఁ ద్రివర్గ
శ్రీయుతులఁ జేయు మరియ
న్యాయతమతి యయ్యెనేని యఖిలముఁ జెఱుచున్. 94

ఆ. ప్రజల వర్తనంబు పరికింపనోపని
రాజు కేల గలుగు రాజ్యసుఖము
వారి మేలు గీడు వరుసన తనకును
గీర్తికరమగు నపకీర్తికరము. 95

గీ. వాగ్మితాదులు ధారుణీవల్లభునకు
నాత్మ సంపద యాసంపదాత్ముఁడైన
రాజు గలిగిన ప్రజ వివర్థనము నొందు
వాసవునిఁ జేరి బ్రతుకు గీర్వాణులట్లు. 96

అజ్ఞాతముక. వినికి గలిగి రక్షించుచు
ననువున దయతోడిపాడి నాయతు లెల్లన్
గొనుచుఁదగ నెఱిఁగి పొగడొం
దినరాజున కుర్వి కామధేనువు గాదే. 97

భీష్మపర్వముఉ. రాజు నిజప్రజాసమభిరక్షణ మెప్పుడు సేయ భూజనుల్
రాజున కర్థవృద్ధియు ధరన్ బహుభంగులఁ గూర్తు రిందులో
రా జభవృద్ధికంటె జనరక్షయె యుత్తమ మెందు భూజనుల్
రాజసురక్ష లేక చెడి రా జభవృద్ధి యొనర్పనేర్తురే. 98

పురుషార్థసారముచ. గనులు కృషిప్రపంచ మరి కప్పము సుంకము గోకులంబు నం
దనవనముం జలస్థలపథస్థవణిక్క్రయ దుర్గరక్షణం

బనఁ గలయన్నిమార్గముల నర్థము గూర్పకకేవలంబ కాఁ
పున పొలియించురాజు సిరి పొందులె రాజమనోజభూభుజా. 99

బద్దెననీతిక. జనపతి పర్జన్యునిగతిఁ
దనభూప్రజఁ బ్రోవవలయుఁ దగఁ బ్రోవడయేఁ
దనుఁ బాసిపోవు నాప్రజ
ఘననీరససరసిఁ బాయు ఖగములభంగిన్. 100

నీతిసారముక. ఉత్తమయానములును ఘన
విత్తములును రత్నధాన్యవితతులు నయసం
పత్తినిఁ బ్రజఁ బాలింపక
యెత్తెఱఁగునఁ గలుగు ధారుణీశుల కరయన్. 101

ఆ. ఫలము కాససేయు పతిగాక నీతితో
భూమిప్రజల నరసి ప్రోవవలయు
నీరు ప్రోదిపెట్టు నెఱిమాలకరివాఁడు
పువ్వుఁదీగ లరసి ప్రోచినట్లు. 102

పంచతంత్రిక. తననగరిలోన నించుక
యును భాండాగార మనుచు నునికి దగదు రా
జునకుఁ బ్రజలె భండారం
బని యేమఱ కరయవలయు ననిశము వారిన్. 103

నీతిభూషణముక. ప్రజఁ దల్లి పెంచుతెఱఁగున
ప్రజఁ బతి బెంచునది పెరిఁగి పదపడి తల్లిన్
బ్రజప్రోపు సందియము పతి
బ్రజప్రో పది నిక్కువంబు బద్దెనరేంద్రా. 104

క. క్రూరుఁ బ్రజ విడుచు నోడఁగ
నేరదు సౌమ్యునకుఁ గాన నృపతి ప్రజను సా
ధారణరూపంబున నయ
పారగుఁడై యేలవలయు బద్దెనరేంద్రా 105

బద్దెననీతిక. ఆపదలఁ జెందు ప్రజలను
భూపతి మొద లిచ్చి మగుడఁ బ్రోవఁగఁ దాఁ
జేపట్టి విడువవలవదు
భూపతికిఁ గుటుంబ మనఁగ భూమియ కాదే. 106

నీతిసారముక. చాలఁ బ్రజఁ బ్రోవకయ తాఁ
గోలాసన్ బాఁడి దప్పి కొనుచుండెడి భూ
పాలకుఁడు కుప్పఁ జిచ్చిడి
పేలా ల్వెదకికొని తినెడిబేల తలంపన్. 107

పురుషార్థసారముక. మండలము సెడినఁ బతి సెడు
మండలమును బతియుఁ జెడ్డమాత్రనె చెడు న
మ్మండలముఁ బతియుఁ గావడి
కుండలవలె నుండవలయుఁ గొమరుర భీమా. 108

ఆ. తడవుఁ బెంప నేర్చి తమకాలముల వృక్ష
ములును బశువులు ఫలములును బాలు
నొసఁగునట్ల రాజు పొసగంగఁ బ్రోవఁ
బ్రజయుఁ బిదపఁ బతికి ఫలము లిచ్చు. 109

క. జనపతికిఁ బ్రజాపాలన
మున సద్గతి గలుగు నర్థమును నగుఁ దత్పీ
డనమున ధర్మక్షయమును
ధనహానియు నపజయంబుఁ దగ సిద్ధించున్. 110

బద్దెననీతి


ఉ. కావునఁ గాపులొక్కటికిఁ గాఁ గలహించిన వక్రశీలురై
చేవిరులం గృషిక్రియలు సేయక తక్కిన నెన్ను పన్నుకున్
గా వడిఁ బోరిన న్మనవికాల మెఱుంగక చెప్పిరేనియున్
భూవరు లెగ్గుగాఁ గొనక బుద్ధివిధిం జను విత్తు రాత్ములై. 111

నీతిసారముఆ. బంధుహీనతకును బరమబాంధవమును
నేత్రహీనులకును నేత్రములును
గన్న తల్లిదండ్రు లన్నను రాజులె
కాక ప్రజల కొరులు గలరె యుర్వి. 112

పంచతంత్రిక. సాధింపఁ గడిఁది శత్రుల
సాధించిన బలిమి వృథ నిజక్షితిజనులన్
బాధించకంటకులఁ బతి
శోధింపనినాఁడు నన్నెచోడనరేంద్రా. 113

క. జనపతి తనప్రజభారము
తనముఖమున నడపికొనక తక్కినఁ బొలియున్
దిని చెఱుతు రతనిసొమ్మున్
జనువారును బ్రజ నరేంద్ర చతురాననుఁడా. 114

బద్దెననీతిగీ. చాలఁ దస్కరాదిసాహసకర్ముల
బాధఁ బొరయకుండఁ బ్రజల నెల్లఁ
గావఁ బ్రోవ నృపుల కాక వారలకును
దలఁచిచూడ నొరులు గలరె యుర్వి. 115

క. లోకంబులకును మే లగు
భూకాంతుఁడు మిగులవృద్ధిఁ బొందుచునుండన్
లోకంబునకు గీ డగు
భూకాంతుఁడు మిగులఁగీడు పొందుచునుండన్. 116

ఆ. ఉర్విప్రజలఁ బీడలొనరించెనేనియు
వారిభూరిశోకవహ్నిఁ దగిలి
రాజు సిరియుఁ గులముఁ బ్రాణంబు నొక్కట
నీఱుచేసి కాని నేర దధిప. 117

ఆ. పరులవలన గాసి పడకుండఁ దనప్రజఁ
బూని యరసి ప్రోవలేని రాజు
రాజు గాఁడు వాఁడు రాజరూపంబున
జగతిఁ బుట్టినట్టి జముఁడు గాని. 118

ఆ. పగఱవలనిబాధ పడకుండ రక్షించు
రాజు లేని చోట మనుజు లోజ లేక
పొలసిపోదు రబ్ధిపూరంబులోపల
నావికుండు లేని నావపగిది. 119

చ. బలియుఁడు నీతిమార్గపరిపాలుఁడు భూపతి గాకయుండినన్
దలపఁగఁ గర్ణధారరహితం బగునావయుఁ బోలె నుండు ని
య్యిలఁ బ్రజ గాన నట్టి ధరణీశుఁడు పెన్నిధి భిన్నమై నయ
క్కలమునుబోలె వేగమె తెగన్ విడువందగు నెన్నిభంగులన్. 120

క. పాడి గలపతి వసుంధర
వేడుకఁ బరభూమిప్రజయు వెలయఁగనెక్కున్
బాడి చెడ నడుచుపతి ధర
పాడుగఁ జెడిపోవుఁ బ్రాఁతప్రజయైన వడిన్. 121

పంచతంత్రిఆ. పచ్చ లాయకట్లఁ బఱిబోవు నారంభ
మడవిగలయు సుత్తె కడగఁబొలము
పంటమీఁద నరులపైడెత్త గఱవగుఁ
బ్రజలచేటు భూమి పాడుసేయు. 122

నీతిసారముక. ప్రజఁ జెఱచి కూడఁబెట్టిన
నిజధన మది వలయు వ్యయము నిచ్చలుఁజేయన్
బ్రజయును ధనమును బొలిసిన
భుజబలమున నిలువఁదలమె భూపతికెందున్. 123

పురుషార్థసారముక. న్యాయపుటరి తలపూవులు
గోయుట నట లెస్స తగదు కువలయపతి క
న్యాయ మరి మ్రాను వొడిచినఁ
గాయలు వెసఁ గోయునట్టి కరణి దలంపన్. 124

నీతిభూషణముఆ. ప్రజ నజంబుఁబోలెఁ బట్టి విత్తమునకై
తగిలి చంపెనేని దానఁదృప్తి
యణఁగ దొక్క మాటి కగుఁగాని ధారుణీ
శునకు మఱియు వలయుననిన లేదు. 125

క. విను గోపాలనిక్రియఁ గాఁ
పనుధేనువుచేత విత్త మనుదుగ్ధంబుల్
గొనవలయు నిత్య మొయ్యొ
య్యన ఫలరోషాధికముల నవనీశునకున్. 126

పంచతంత్రిక. రాజులకు బలము విద్యయు
నాజులరిపు గెల్వఁగాక యపరాధుల న
వ్యాజమునఁ బ్రజలఁ జంపఁగ
యోజించెనె బ్రహ్మరాజు నొండనఁ దలమే. 127

నీతిసారము

రాజాదాయవ్యయప్రకారము

క. ఇది దేశంబిది కాలం
బిది యాయం బిది వ్యయంబు నిదియు సుహృత్సం
పదశక్తి యని విచారము
వదలదు మతి పతి కుఠారవైరోచనుఁడా. 128

క. ఆయంబు వ్యము నొడిచు
శ్రీయగు సమమైన దళము సెడకుండు వ్యయం
బాయమున కధికమైనను
బాయదు పేదఱిమి సార్వభౌమున కైనన్. 129

క. వ్యవసాయముకొలఁదియు దే
శవిధిముఁ గాలంబుఁ బూర్వసంచిత మగు సొ
మ్ము విచారింపక యుబ్బునఁ
దివిరి వ్యయము సేయు నరుఁడు దీనతఁ బొందున్. 130

ఆ. తనకు నాయమైన ధనములో నాలవ
భాగ మొండె మూఁడుపాళ్ల పాల
నొండె నర్థమైన నుచితంబు గాన మి
క్కిలివ్యయంబు సేయవలవ దధిప. 131

బద్దెననీతిక. గోష్ఠాగారసురక్షా
నిష్ఠితుఁడై చూడవలయు నృపతి కది మహా
శ్రేష్ఠం బగునాయము నగ
రిష్ఠం బగువ్యయము నాచరింపగవలయున్. 132

క. మండలమున నియతాయతి
భండారము సేయవలయుఁ బతిప్రియమునకున్
దండాయము మొదలుగఁగల
యొండాయము లోలి వెదకుచుండఁగవలయున్. 133

కామందకముక. పోరానిచోట భాండా
గారము దెఱచునది గాని కలవ్యయమునకున్
ధారుణిలోఁ గుశలుండై
యారఁగ వెలివెలిన వలయు నాయతి సేయన్. 134

క. తగనివ్యయం బొకకానియుఁ
దగ దెప్పుడుఁ జేయఁ బతికిఁ దగినవ్యయంబున్
దగ దాయమునకు నగ్గల
ముగఁ జేయమి యదియ రక్ష ముఖ్యంబునకున్. 135

పురుషార్థసారముఆ. అనుదినంబు గలుగు నర్థంబునం దొక
నియతిఁ గొంత గూర్చి నేర్పు దనర
చీమ ధనము వ్యయము సేయక యంతయుఁ
బాఱుఁ జల్లు నృపతి బ్రతుకునోటు. 136

నీతిసారముక. తనభూమి నొయ్యనొయ్యన
జనపతి యొకకొలఁదితో రసాయనభాతిన్
జను నుభవింప ననిశము
విను మది కడు మీఱెనేని విషమగుఁ బిదపన్. 137

క. మండలమున నాలుకచవు
లొండొకభోగంబు లెఱుఁగ కొగిఁ జట్మరులై
యుండెడి కలుభృత్యులఁ బతి
భండాగారంబు గాఁపు పంపఁగవలయున్. 138

క. భాతిగ నిస్పృహులైన కి
రాతులు గొల్లలును భోగరతి లేక ధృతిం
గాతురు పెఱవారలు దా
వేతురు విత్తాపహరము వెలయఁగ మదిలోన్. 139

పంచతంత్రిక. భూరమణుఁడు పే దైనను
ధారుణి నెచ్చోటఁ దగదు ద్రవ్యము వెదకన్
వారాశి వట్టిపోయిన
నీ రొండొక దెస ఘటింప నేరఁగనగునే. 140

నీతిభూషణము

రాజనీతి

క. ద్రోహుల దండించి బృహ
గ్బాహార్గళశక్తి రిపుల భంజించియు ను
త్సాహముతోఁ బ్రజఁ గావఁగ
దోహలమతి నజుఁడు భూపతిల నిర్మించెన్. 141

క. వనజజుఁ డింద్రానిలయమ
ధనదార్క శశాంకవరుణదహనాంశంబుల్
గొని నిర్మించుట భూపతి
జనపతి శాసించు దివ్యసామర్థ్యమునన్. 142

చ. జనపతి వేగుజామున లసన్మతి మేల్కని శుద్ధగాత్రుఁడై
యొనరఁగ సంధ్యయున్ జపము హోమము బ్రాహ్మణపూజయుం గ్రమం
బున నొనరించి భూప్రజలఁ బొల్పుగ నారసి వీడుకొల్పి నె
మ్నమునఁ జేయఁగావలయు మంత్రివిచార మమాత్యయుక్తుఁ డై. 143

చ. సకలజనానురంజనము సత్యము శౌచము మంత్రగోపనం
బకృపణవృత్తి దక్షత ధనార్జితశీలత భోగ మీగి నా
స్తికఖలసంగవర్ణనము శిష్టవిధేయత దుష్టనిగ్రహం
బకుటిలభావ మింద్రియజయంబు గుణంబులు భూమిభర్తకున్. 144

మ. అతినాస్తిక్య మతిప్రసాద మనృతం బాలస్యమున్ దీర్ఘసూ
త్రత హృత్క్రోధము దీర్ఘచింత విషయాక్రాంతం బమంత్రం బని
శ్చితకార్యార్థ మనర్థచింత హతదాక్షిణ్యం బనల్పక్రియా
వ్రత మస్థైర్యము నాఁ జతుర్దశకముల్ వాగ్దోషముల్ వర్జ్యముల్. 145

పురుషార్థసారము

క. జనపతి యాత్మాయత్తుఁడు
నొనరఁ బరాయత్తపతియు నుభయాయత్తుం
డును గలరు వీరిలోపలఁ
దనరఁ బరాయత్తుఁ డధమతామసుఁ డరయన్. 146

ముద్రామాత్యముక. మనుజాధిపతియు మంత్రియుఁ
దనరఁగ రాష్ట్రంబు దుర్గధనబలమిత్రుల్
మునుకొను రాజ్యాంగంబులు
నొనరఁగఁ బటుసత్వబుద్ధియుక్తంబగుచున్. 147

కామందకముక. మతిశస్త్రము ప్రకృతులు మే
నతిశయధర్మంబు ప్రాణ మతిదృఢతరసం
కృతి జోడు చరులు కన్నులు
చతురుండగు దూత మోము జననాథునకున్. 148

క. స్వామియు మంత్రియు దుర్గ
స్తోమము రాష్ట్రంబు ధనము సుహృదులు బలమున్
గా మహి సప్తాంగంబులు
నేమఱక యొనర్పవలయు నిందుల రక్షల్. 149

శా. ఉత్సాహప్రభుమంత్రశక్తుల నజేయుండై పరిక్షీణసం
ధత్సావ్యగ్రుఁడు గాక విగ్రహముచో దేశంబు గాలంబు సం
పత్సామగ్ర్యముఁ జూచి కార్యము దెసన్ బ్రారంభియై భూప్రజన్
వాత్సుల్యార్ద్రమనస్కుఁ డైన పతి శశ్వచ్ఛ్రీసమేతుం డగున్. 150

నీతిభూషణముక. గతదోషుఁడు గుణవంతుఁడు
కృతవిద్యుఁడు శక్తియుతుఁడు గీర్వాణసమో
న్తచరితుఁ డాత్మరక్షా
రతుఁడగు పతి యనుభవించు రాజ్యసుఖంబుల్. 151

పురుషార్థసారముసీ. శస్త్రాదిగతియుద్ధసముదితప్రజ్ఞయు
ఘనధృతిదాక్ష్యప్రగల్భతలును
దారుణయుక్తి యుత్సాహంబు నూర్జిత
దార్ఢ్యమానక్లేశధైర్యమహిమ
సుభగప్రభావంబు శుచితయు మైత్రియుఁ
ద్యాగసత్యములుఁ గృతజ్ఞతయును
నున్నతవంశంబు నుచితశీలతయును
దమమును శమమును ధర్మరతియు
గీ. దయయు సత్యార్జవములు మార్దవము ననఁగ
నాదిగాఁ గల పరమకల్యాణగుణము

లొప్ప నొప్పగు భూనాథుకొప్పితంబు
లక్ష్యమైయుండు లక్ష్మీకటాక్షములకు. 153

చ. పరిగతసర్వశాస్త్రుఁడయి భాసురశాస్త్రపథానుసారియై
యరయ వినీతిసమ్మతనిజాత్మకుఁడై గతదండనీతిమైఁ
బరఁగు నిజప్రజానియమబంధురుఁ డైన మహీశుసంపదల్
శరనిధిఁ బొందు పెన్నదులచాడ్పునఁ గ్రమ్మఱనేర వెన్నఁడున్. 154

సీ. వాగ్మి ప్రగల్భుఁ డవంచితస్మృతియు
నుదగ్రుండు నుగ్రబలాధికుండు
దండనయక్రియాదక్షుండు కృతవిద్యుఁ
డధికనృవర్గుండు నమితబుద్ధి
ఆహితాభియోగప్రహసనుండు
సర్వదుష్టప్రతీకారవిచక్షణుండు
శత్రురంధ్రానువీక్షణకళానిపుణుండు
సంధివిగ్రహతత్త్వసారవేది
గీ. గూఢమంత్రప్రచారుండు రూఢదేశ
కాలభేదకుఁ డర్థసంగ్రహవిదుండు
నుచితపాత్రజ్ఞుఁడును వినియోగరతుఁడు
నైన భూపతి యాత్మగుణాకరుండు. 155

మ. భయలోభానృతమత్సరత్వములు కోపం బీర్ష్యయుం ద్రోహమ
ప్రియమున్ జాపలమున్ బరాపకృతి యుద్రేకంబున్ జాడ్య మా
స్థయుఁ బైశున్యములున్ దొఱంగి ప్రియవాక్సంపన్నుఁడై వృద్ధసే
వయునుం గల్గినవాఁడు దాను నరదేవప్రాప్తి కర్హుం డగున్. 156

సీ. విన నిచ్చగించుట వేడ్కతో వినుటయుఁ
బన్ను గా విన్నవి పట్టుటయును
దగఁ బట్టునని ధ్రువంబుగ నిల్చుటయు
నర్థసమితిసాధ్యాసాధనముల యెఱుక
అర్థవిజ్ఞానసమర్థమహాద్యోగ
రతియు నయుక్తవిరక్తియునుఁ
గార్యస్వరూపంబు కడఁకతోఁ గైకొంట
యివి బుద్ధిగుణములై యెందుఁ దనరు
ఆ. విహితకోపశౌర్యవీతజాడ్యము శీఘ్ర
కారితలు దలంపఁగా ధరిత్రి
నొప్పుగలిగినట్టి యుత్సాహ మీగుణా
యత్తుఁ డైనవాఁడె యవనివిభుఁడు. 157

సీ. గురువులఁ బ్రణమితవరభక్తియుక్తుల
సద్భావచేష్టల సజ్జనులను
సుకృతకర్మంబుల సురల భూసురులను
మృదులమనోవృత్తి మిత్రజనుల

బాంధవజనుల సంభ్రమచేష్టితంబులఁ
గామినీజనములఁ బ్రేమములను
దాసజనంబులఁ దగుప్రసాదంబుల
నితరుల దాక్షిణ్యచతురవృత్తి
గీ. నాత్మవశ్యులఁ గావించి యన్యకర్మ
నిందసేయక సత్కర్మనిష్ఠుఁ డగుచుఁ
జారుకారుణికత్వము సర్వలోక
మధురవాక్యము గలవాఁడు మనుజవిభుఁడు. 158

కామందకముక. గురులను గులవృద్ధుల భూ
సురుల ననాథులను బుధులఁ జుట్టంబుల నా
తురులను దీనులఁ గరుణా
పరుఁడై రక్షింపవలయుఁ బార్థివుఁ డర్థిన్. 159

పురుషార్థసారముక. కలిమియె చూపుచు నొరులకు
ఫలియింపని రాజసంబు పని యేమిటి కీ
యిల కేలబూచిరాజన
మలవడఁ గొఱమాలినట్ల యౌభళకందా. 160

మదీయముక. పుడమిపతు లర్థు లర్థం
బడిగిన నది నృపులు కయ్య మడిగినఁ గడుఁ గీ
డ్వడి భయభీతులు శరణం
బడిగిన నిచ్చుటయె ధర్మ మనిరి మునీంద్రుల్. 161

పురుషార్థసారముక. ఎంతెంత గలుగురాష్ట్రం
బంతంతియ రాడు పెద్ద యగుఁ గావున దే
శాంతరము లొత్తికొనుట ని
తాంతము ధర్మంబు గాదె ధరణీశులకున్. 162

నీతిసారముక. దురమున మలరక యునికియుఁ
బరఁగఁగ ధర్మమున బ్రజలఁ బాలించుటయున్
ధరణీసురశుశ్రూషయుఁ
బరమశ్రేయస్కరములు పార్థివుల కిలన్. 163

క. క్షితిపతిగేహ మభేద్యో
న్నతిమత్ప్రాకారయుతము నానాశస్త్రా
ద్యతకలశౌర్యోత్కరభట
తతియుతసతతాభిరక్షితము గావలయున్. 164

క. ఆకారేంగితవిదులును
లోకజ్ఞులును నవరసజ్ఞులును నవగతతం
త్రాకులు లగు ఫణిహారులు
వాకిట నుండంగవలయు వసుధేశునకున్. 165

క. పిలువక నగరు సొరంగను
వలవదు నిచ్చలును వచ్చువారి సదాభ్య
స్తులనైన బిట్టు సొరనీ
వలవ దనవసరమునందు వాఁకిటికాఁపుల్. 166

పురుషార్థసారముక. కొలు వీఁదగువేళయె లో
నిలువందగు నవసరంబు నియమింపక రా
జిలు వెడలమి ప్రజ విన్నప
ములు లేకున్నను నశించిపోవును దానున్. 167

నీతిసారముక. వలయునమాత్యులు చుట్టం
బులు మూలబలంబు రాజపుత్త్రులు విద్వాం
సులు బలసియుండ నిచ్చలు
కొలువుండుదె లోకమెల్లఁ గొలువఁగ నిన్నున్. 168

సభాపర్వముక. కొలు విమ్ము మాపకడ యో
ధుల కెల్లను సంధ్యయొద్ద దూతలనుం జా
రుల సంభావింపుము రా
త్రులఁ గాంతాభోగతత్పరుఁడ వగుము నృపా. 169

ధృతరాష్ట్రనీతిగీ. వెనుకదెస నిల్చి కామినీవితతి గొల్వ
దక్షిణంబున సుకవివితాన మమర
వామదిశయందుఁ బొగడెడి వందిజనులు
నెదురు గాయకగేయంబు లింపుఁబెంప. 170

ముద్రామాత్యముక. పరిజనులు సుమతులైనను
ధరణీశుఁడు కుమతి యయ్యుఁ దాప యయిచనున్
బరిజనులు కుమతులైనను
ధరణీశుఁడు సుమతియైనఁ దా వెలయఁ డిలన్. 171

పంచతంత్రిక. క్షితిజనులకుఁ బరిజనులకు
సతతము ప్రెగ్గడనె చూపఁ జనదు ధరిత్రీ
పతి ప్రెగ్గడయై ప్రెగ్గడఁ
బ్రతిహస్తునిఁ జేయవలయు బద్దెనరేంద్రా. 172

క. ధనధాన్యవాహనములెడఁ
జన వీఁదగుఁగాని యెట్టిచనవరికైనన్
వనితలయెడ భూప్రజయెడఁ
జనవిచ్చుట బుద్ధిగాదు జనపాలునకున్. 173

క. నృపరాజ్యాంగములం దొక
విపరీతాంగంబ రాజ్యవిభవముఁ జెఱుచున్
నృపమంత్రులకును భేదము
చపలస్థితినొదవ సకలజగముం బొలియున్. 174

బద్దెననీతి

క. సమబలుఁడును మర్మజ్ఞుఁడు
సమరాజ్యసమన్వితుండు సదృశోద్యముఁడున్
సమధనుఁ డైనభటుం బతి
సమయింపండేని తాన సమయు నతనిచేన్. 175

పంచతంత్రిక. తలవర్గము సామంతుల
బలముల కగ్గలము గల నృపాలున కొప్పున్
బలిమి పెఱకుమతి కాజ్ఞా
బలసంపద కెంతదవ్వు బద్దెనరేంద్రా. 176

బద్దెననీతిక. ఏమిపనిఁ బంచునొకొ న
న్నేమిట నలుగునొకొ యంచు నెప్పుడుఁ దనయా
జ్ఞామహిమ కులుకుచును మది
సామంతులు గలిగిరేని జనపాలుఁ డగున్. 177

ఉ. రాజులసమ్మతిం దరతరంబులప్రాఁతల భక్తియుక్తులన్
రాజితశస్త్రధారులఁ బరాక్రమవంతుల నప్రమత్తులన్
భోజనహేమవస్త్రపరిపుష్టుల హృష్టుల నైనవారిఁగా
నోజ నొనర్పఁగా వలయు నొద్దను బాయక యుండ భృత్యులన్. 178

ఉ. చేరఁగనీరు మున్ను దమచే మృతిఁ బొందివారివారి ము
న్నీరస మెత్తి మన్కికొఱ కిష్టతఁ దాల్చినవారి బన్నముల్
కూరగఁబడ్డవారిఁ దమకుం గడుభక్తులు గానివారి ఘో
రారులదిక్కువారి ననయజ్ఞు లనందగువారిఁ బార్థివుల్. 179

క. అడఁపగలంతియ బానసి
యొడలంటుల వైద్య మొద్ద నుండుట తనకుం
గుడువఁగఁ బెట్టుట యనుపను
లడరఁగ నాప్తు లనె పంచు నధిపతి సుమతీ. 180

పురుషార్థసారముగీ. ఎవ్వఁడభ్యంతరస్థుల నెడులచేసి
మిగుల లాతుఁ జేరంగఁ దిగుచుఁదగిలి
వాఁడు వారలచేఁ జెడు వలను దప్పి
యలుక గృధ్రముఁ డను రాజునట్ల పొలియు. 181

ఆ. దీనికొఱకుఁ గాదె తివిరవంశజులైన
నేలికొంద్రు రాజు లేల యనిన
మానుగాఁగ నాదిమధ్యావసానముల్
వార లొక్కరీతివారు గాన. 182

ఆ. ఎవ్వఁడొద్ద నుండ నేపార సితపక్ష
చంద్రకళయుఁబోలె సంతతంబు
వెలయ రాజ్యలక్ష్మి వృద్ధిఁ బొందుచునుండు
నతఁడ [మంత్రివర్యుఁ]డవనిపునకు. 183

పంచతంత్రి

క. ఆయతమతి నుతసప్తో
పాయంబులు దెలియవలయుఁ బతి సామము భే
దాయతి దానము దండము
మాయోపేక్షేంద్రజాలమార్గము లెల్లన్. 184

కుమారసంభవముక. భువి నాన్వీక్షకి మిళితా
ర్థవిదుండై దండనీతిఁ ద్రయి యనువిద్యం
బ్రవణుఁడయి వార్త లోక
వ్యవహారము సూచి యెఱుఁగవలయుం బతికిన్. 185

పురుషార్థసారముగీ. రాజు వార్త సకలపరిరక్షణంబు
సేయకుండిన లోకము జీవశవము
అట్టిజగదేకరక్షణ మాచరించు
మానవేంద్రుఁ డనన్యసామాన్యుఁ డరయ. 186

కామందకముక. విద్యాచతుష్టయం బన
పద్యచతుర్వర్గఫలము వసుధేశునకున్
హృద్యచతుష్షష్టికళా
విద్యలు రాజ్యాపభోగవిహితఫలంబుల్. 187

పురుషార్థసారముక. వరనాయకుండు మధుకర
పరభృతకలహంసబర్హిపన్నగబకసూ
కరకంకసముత్కరముల
చరితంబులఁ దెలియవలయు జననుతచరితా. 188

మార్కండేయముగీ. వ్యయము నార్జవంబు దయయు హింసయు బొంకు
నిజముఁ దియ్యఁదనము నిష్ఠురంబుఁ
బలువు రిష్టజనులు గలిగి యారయఁ బణ్య
రమణివోలె నుండు రాజనీతి. 189

పంచతంత్రిక. ఎందును నాయాసమునకుఁ
బంద యయినవాఁడు సిరికి బాత్రుం డగునే
మందరగిరి మోవఁడె గో
విందుఁడు మును లచ్చికొఱకు విబుధు లెఱుంగన్. 190

నీతిభూషణముక. బలిమియుఁ గలిమియుఁ గలిగిన
నలఘుమతీ తెగువవలయు నవనీశునకున్
దలపోసి చూడవలదా
బలవాచాపృథివి భూమిపాలుర కెల్లన్. 191

క. వసుధాధీశుఁడు దుర్దయ
గసమస చెడు ఖడ్గ ముడుగఁ గార్యము సెడుఁ దా
విసుగు సిరి వీరభోజ్యా
వసుంధరా యను పురాణవచనము వినవే. 192

చాటువు

క. అపరాధుల యందును శాం
తిపరత్వము మఱియు వలయుతెఱఁ గది యేలా
నృపులకు నలవడఁ దగ దను
కృప కృపయో దానఁ దొంటికీర్తియుఁ జెడదే. 193

ఆ. కీడు సేయువానికిని మేలు సేయుట
మునులగుణము గాక జనుల నెల్లఁ
బ్రోచువాఁడు కల్లరుల నాజ్ఞవెట్టుట
యాగపశువిశసనమట్లు గాదె. 194

గీ. రాజ్యకంటకతతిలోన రాజవిభుఁడు
చాలముఖ్యుని వధియించి శాంతిపఱచి
సామదానంబు లొనరించి సత్వరముగ
ఛిద్ర మంతయుఁ బరిపూర్తి సేయవలయు. 195

నీతిసారముసీ. కన్నగాండ్రును జూదగాండ్రు తెక్కలికాండ్రు
నాటవికులు [పొలవరులు] తగవు
సెప్పెడి పురుషులు నప్పిచ్చుచో వడ్డి
యదరునఁ గొని నొంచు నొడితరులును
జనటాయగాండ్రునుఁ జనవరి లెంకలు
రాష్ట్రకంటకులు వీరల నృపాలుఁ
డెపుడు మాన్పక సాగనిచ్చినఁ గన్నంబు
వెట్టియుఁ గల్లలఁ బెనిచి తెరువు
గీ. లడచియును బక్షమాడియు నప్పువోర
ద్రుంచి చనియు నల్పుల నదలించి తినియు
లంచములు గొన్న ధర యెల్లఁ బాడు గాదె
క్లేశసంసారభవనాశ కేశవేశ. 196

మదీయముక. వీ డని నిం దని దా గని
యోడక లంచంబు లనియు నుచితం బని చెం
డాడిన చనవరిచే నిల
పా డగుఁ బ్రజవిన్నపంబు పతి వినకున్నన్. 197

పురుషార్థసారముక. న్యాయంబు దొడరి వివిధో
పాయంబుల నర్థముల నుపార్జింపుము భూ
నాయక రాజ్యవిఘాతము
సేయునరుల నెఱిఁగి చంపఁ జెఱుపఁగవలయున్. 198

ధృతరాష్ట్రనీతి

గీ. మాలకరి పుష్పములు గోయుమాడ్కి తేఁటి
పువ్వుఁదేనియఁ గ్రోలెడుపోల్కి నెదురు
గందకుండఁ గైకొనునది కార్యఫలము
బొగ్గులకుఁ బోలె మెదలంటఁ బొడువఁజనదు. 199

విదురనీతి


క. పెక్కండ్రు జనులు నేరమి
యొక్కటఁ జేసినను వారి నొకమణిఁ గినియం
జిక్కరు గావున నేర్పున
నొక్కొకరిన పాపి శిక్ష యొనరింపఁదగున్ 200

నీతిసారముగీ. పతి యథావిధి దండసంపన్నుఁడైన
వెసఁ ద్రివర్గఫలంబును వృద్ధిఁ బొందుఁ
గాక యున్మార్గదండనకర్కశమున
మునులకైనను గోపంబు మొలవకున్నె 201

కామందకముమ. స్థవిరుం డైనను బాలిశాత్ముఁ డయినన్ స్వర్గస్థుఁడైన న్మహీ
ధవుఁ డాత్మోద్భవహీనుఁ డయిన మతిమాంద్యం బొందినన్ భూమికిన్
ధవుఁ డై యుండి తనర్చినం జెడు సముద్యద్రాజ్యసంపత్తివై
భవ మేకక్షణమాత్రమంద సచివప్రాధాన్యశూన్యస్థితిన్. 202

ముద్రామాత్యముక. జనపదములెల్ల మంత్రికిఁ
జనరామింజేసి నృపతి సచివులఁ బోలెన్
వినుతగుణాఢ్యుల దేశం
బున కధికారులుగఁ జేసి పుచ్చఁగవలయున్ 203

నీతిసారముసీ. ఎవ్వఎ డేపనివెంట నేరీతి నేర్పరి
వాని నియోగింప వలయు నంద
హితుఁడు విశ్వాసియు మతిమంతుఁడును నగు
విప్రు నమాత్యుఁ గావింపవలయు
శక్తియుక్తులు గల్గుసద్భటావళిచేత
నంగసంరక్ష సేయంగవలయుఁ
బ్రజఁ దల్లి పాటించుపగిది భూజనముల
ననుదినంబును దాన యరయవలయు
గీ. నర్థ మార్జింప నోపిన యట్టివారి
నాజిశూరుల నీతిజ్ఞు లైనవారిఁ
బాపరహితుల హాలికబంధుజనుల
నరసి ప్రోవంగవలయుఁ దా నవనివిభుఁడు. 204

పద్మపురాణము

క. ధనలుబ్ధుల మ్రుచ్చులఁ గూ
ర్పనివారిని బగఱవలనివారిని దృతి సా
లనివారిని దుర్జనులను
బనుపవు గా రాజకార్యభారము దాల్పన్. 205

క. ఉపధాశుద్ధులఁ బాప
వ్యపగతబుద్ధుల వినీతివర్తుల సములన్
సుపరీక్ష నియోగించితె
నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్. 206

క. చోరభయవర్జితంబుగ
ధారుణి రక్షింతె యధికధనలోభమునన్
జోరుల రక్షింపరు గా
వారలచే ధనము గొని భవద్భృత్యవరుల్. 207

సభాపర్వముక. అధిపతి యెవ్వని దోరపు
టధికారము మీఁదఁ బొట్టు నతఁ డుర్వరలో
నధమకులజాతుఁ డైనను
నధికుం డగు నుతుల కెల్ల నాకర మగుచున్. 208

క. దుష్టైన నృపతి పరిజన
శిష్టతచే సేవ్యుఁ డవును శిష్టుం డయ్యున్
దుష్టపరిజనము గూడినఁ
గష్టుం డగు సర్పకలితఘనశాఖగతిన్. 209

ఆ. అధికుఁ డైనవాని నతినీచతరమైన
యట్టిపదవిఁ దెచ్చిపెట్టు టెల్ల
వర్ణనీయమైన వరశిరోరత్నంబు
కాలఁ గట్టినట్లు కాదె తలఁప. 210

చ. తగనిపదంబునం దిడునదక్షత రాజున కుండుఁ గాక యా
జగమున నీతిమంతుఁ డనఁ జాలినసేవకుఁ డుండకుండునే
తగరముమీఁదఁ దెచ్చి నిరతం బగురత్నముఁ గీలుకొల్పఁగా
వగచునె రత్న మట్టిపనివానిది దోషము గాక యారయన్. 211

ఆ. ఎచటనుండి లేఖ యేతెంచెనేని య
నాదరంబు సేయు టనుచితంబు
సంధివిగ్రహాదిసకలకార్యంబులు
తెలియుటెల్ల లేఖవలనఁ గాదె. 212

క. ద్వారములను నాయుధహయ
వారణనిలయములయందు వసుతంత్రవ్యా
పారములందును హితులను
భారకులను నిపుణమతులఁ బనిగొనవలయున్. 213

పంచతంత్రిక. మండలమె యుర్విపతులకు
భండారం బందుఁ దప్పి పాతిక గొనినన్
భండాగారద్రోహుని
దండించినయట్ల పఱపఁదగు నధికారిన్. 214

పురుషార్థసారము

సీ. పరదేశి ధన మబ్బఁ బాఱిపోవఁగఁజూచు
విప్రుండు ధన మీఁడు వెరవు లేమి
క్షత్రియుఁ గోపింప ఖడ్గముఁ జూపుఁ జు
ట్టముఁ జనవరియునోడరు భజింప
చెలి రా జనఁగ నాజ్ఞ నిలువఁడు కడుఁజిర
సేవకుండును దప్పు సేయుఁ దఱచు
పిసిఁడియర్థము రాతిపెడనార యుపకారి
పూర్వోపకృతియ చూపుచు నటించు
ఆ. మూర్ఖు నరకపాత్రముగ ననర్థముఁ జేయు
దుష్టు సేయు నెల్ల దురితములను
గాన నిట్టివిధము మానవులకు నధి
కార మీగి వెరవికలిమి గాదు. 215

చ. వెలువడు గ్రేడిబట్టగను వేగమె తోడనె పుట్టు వైరమున్
జలమును లోభమున్ వడియు జాడ్యము దంటలు రెంటమాటలున్
బొలుచరిగొంటుచందములు బొంకులు ఱంకెలు వట్టిఱిచ్చలున్
మలకలు వృష్టితోపులును మర్మము లెన్నుచుఁ దప్పులాడుటల్. 216

నీతిసారముక. ధారుణిపతి దనప్రజఁ దా
నారయ కొరుఁ బంచెనేని యర్థము దనకున్
జేరదు ప్రజరిత్తయ చెడు
నారయ నధికారి తనకు నగ్గలికుఁ డగున్. 217

పురుషార్థసారముసీ. సొమ్ము రాజులు గొన్న సుంక మెక్కించినఁ
బరదేశిసరకులు సొరకు మనుట
వణిజులు దమయంత వలసిన ధారణ
సేయఁ జూచుట ప్రజఁ జెఱిచికొనుట
తులలు తూములు పాటి నిలువక సాగంగ
నిచ్చుట మ్రుచ్చిమి కియ్యకొనుట
కల్ల దులాయించి మొల్లంబు వెడసూఱ
గొనఁగ మాన్పమి దాన కొనక చెడుట
ఆ. కాన నృపతిలోభి గాక పేదలఁబ్రోదు
తలఁపు గలిగి బేలుఁదనము విడిచి
తగనివారియందు దాక్షిణ్య మొల్లక
యరయవలయు గూఢచరులవలన.218

ఆ. ఒకఁడు గొన్న సరుకు లొకచాయ నెక్కిన
నెక్కుటెల్ల రాజు లెఱిఁగికొనిన
కొంచెమైనవెలకుఁ గొన్నవస్తువులను
గొన్నవెలయె యిచ్చి కొనఁగఁదగును. 219

క. చనవరులు నాయగాండ్రును
బెనచినఁ జెడకున్నయట్టి బేహారంబుల్
వినికిఁ గలరాజు వారలఁ
బెనుపక యుండంగ నాజ్ఞ పెట్టఁగవలయున్. 220

క. చాయల బంట్లం జోరుల
రోయుచుఁ దృష్టేంగితము లెఱుంగుచు ఘనులై
రేయును బగలుఁ దలారులు
పాయక తిరుగంగవలయుఁ బట్టణమెల్లన్. 221

ఆ. ఎంత వొదిలియున్న నేరండములు జీలుఁ
గులును దారుకృత్యములకు నగునె
యితరు లెందరైన నేలిక కధికులై
చేయుపనులు పూని చేయఁగలనె. 222

ఉ. చాల నభీష్టముల్ దనవశంబుగఁ జేయు నయోగ్యులైన నె
మ్మేలు దలంచి వారియెడ మిక్కిలియర్మిలి సేఁత నేర్పుగన్
గాలపువేఁటకాఁడు ఝషకాంక్షఁ గదా యుదకంబుమీఁదటన్
దేలుచు బెండుపై నిలుపు దృష్టియుఁ జిత్తము నాదరంబునన్. 223

నీతిసారముక. హలికులఁ బరివారము నె
గ్గులుపఱపక తగినవడిగొని నడిపికొనం
గల వణిజుఁడు తన భూమిం
గలుగుట యది పసిఁడిచేర్పుకలిమి నృపతికిన్. 224

క. హీనులకుం గర్షకులకు
భూసుత ధాన్యంబు బీజమును వణిజులకున్
మానుగ శతైకవృద్ధి న
నూనముగా ఋణములిత్తె యుత్తమబుద్ధిన్. 225

గీ. నలిగి పరపంక్తిఁ బొందిన నరుల నోలి
భీతచిత్తుల నవమానపీడితులను
అభయ మిచ్చియు నీఁదగునర్థ మిడియుఁ
బ్రియముఁ బల్కియుఁ దగ నాదరింపవలయు. 226

సభాపర్వముక. సమయముల రంతు పరివా
రము మత్తు నియోగిజనుల రాయిడి యరిమ్రు
చ్చిమి గ్రేణికారయన్యా
యము లేకుండంగఁ బ్రజల నరయఁగ వలయున్. 227

నీతిభూషణముక. పరికింప నీతిమార్గము
నరపతులకు నిదియె బహుజనద్వేషముగా
దొరకొనియెడు లాభంబులు
పరహరణీయంబు లండ్రు బద్దెనరేంద్రా. 228

బద్దెననీతిక. ఈ విధమున నీతికళా
కోవిదుఁ డగుచున్న రాజకుంజరుఁ డాయుః
శ్రీ విజయకీర్తిలక్ష్ముల
చే వెలయును రిపులచేతఁ జెడఁ డెన్నఁటికిన్. 229

మదీయము

రాజునకుఁ గొఱగాని గుణములు

క. కొండియములు విన్నపములు
దండువ యర్థార్జనంబు తరుణులె భృత్యుల్
మండుచు నునికియె లావుగ
నుండెడి భూవిభుఁడు ప్రజకు నుత్పాత మిలన్. 230

క. పరదోషకథ వినోదము
పరపీడనోత్పాదనంబు బలిమి పరస్త్రీ
హరణమె సుఖముగ మనుపతి
పరమోత్పాతంబు ప్రజకు బద్దెనరేంద్రా. 231

బద్దెననీతిఆ. ఎవ్వరైన దోష మేమి చేసిన నొప్ప
భూవరునకుఁ జెప్పఁ బోలుఁగాక
యోజఁ దక్కిపోయి రా జట్ల చేసిన
కోరి చెప్పఁగలదె యేరికైన. 232

క. ఇలఁ గఠినంబులు విషమం
బులు గంటకమార్గసహితములు నై యోగి ని
మ్ములఁ జెందరాక పర్వత
ములపోలిక నుండుఁ గష్టభూపతుల సుతుల్. 233

పంచతంత్రి


సీ. అద్భుతాచరణంబు నమితోపకారము
బొందియు నితరునిపోల్కి నుండు
నతఁ డొనరించిన యతులితకృత్యంబు
పరులకృత్యం బని పలుకుచుండు
నరులపైఁ బెట్టు లయంబు నొందఁగఁ గోరుఁ
బరఁగ నాసలు చూపి పనులఁ బంపు
సిద్ధికి విఘ్నంబు సేయును బిమ్మట
విఘ్నంబు లగుటను వెరవు దెగడు
గీ. నమితమధురోక్తి యైన నర్థాంతరమున
నిష్ఠురంబుగ రూపించి నిర్వహింపఁ
గపటకోపముఁ జూపుఁ దత్కార్యవశత
నెఱిఁ బ్రసన్నత నొందని నృపవరుండు. 234

ఉ. జీతము గోరి విన్నపముఁ జేసిన లేచి తొలంగిపోవు న
త్యాతతవృత్తి నొండువల నడ్డము సేయుచు నిల్లువెళ్ళఁ ద
ద్భీతి దొఱంగనీఁడు ననుదెంచిన దోషము లెన్ను నెన్ని య
జ్జీతము మాన్చు మాన్చి మఱి చేరుట చెట్టఁగఁ జేయు నెమ్మెయిన్. 235

క. సరసప్రసంగవేళను
విరసారోపణము సేయు విరసాత్మకుఁడై
పరఁగ సభామధ్యమునను
నిరసించు నడంచు దుర్వినీతుం డగుచున్. 236

క. కులమును శీలము వృత్తము
గలవారల వీడఁ బల్కఁగా నాతనివా
రలుకమెయి విడుతు రొండెన్
బొలియింతురు మానధనము పొలియుట కతనన్. 237

క. కడుబెట్టిదమున నెప్పుడు
వడిపెట్టుచు వెట్టిగొనుచు వధియింపంగాఁ
బుడమిజను లతని విడుతురు
విడువఁగ రాకున్న జనులు విడుతురు సూడన్. 238

గీ. తల్లి ప్రజలఁ దిన్న దైవము దొంగైన
వార్థి మేర దప్పి వచ్చెనైనఁ
దప్పిదారి బ్రతుకఁ దలమగుఁ గ్రూరుఁడై
రాజి సెఱుప బ్రతుకరాదు గాని. 239

కామందకము

సీ. కొనుచోట నిచ్చుచో గుజగుజ సేయుచుఁ
బ్రజల నెల్లను లేమిపాలు చేసి
తమ కంచు వాదించి ధారలైనను బోసి
ధనము లిడక యర్థిరతులఁ గుదిచి
యొడఁబాటు సగమైన నిడుక కుత్తుక కూరి
చంపుచు నాశ్రితజనుల నడఁచి
తేనెలోపలి గూడ తెఱఁగునఁ బథ్యంబు
పలికి లోనైనవారల నడంచి
ఆ. ధర్మ ముడిఁగి కీర్తిపేర్మియు నొల్లక
పొసఁగఁ బనులు విడిచి బొంకు పలికి
తాన బ్రతుకఁ గోరు ధరణీశు కంటె ను
త్పాత మొకటి వేఱె ధరకు గలదె. 240

సీ. జీతంబు గిలిబిలిచిలుకలు దూరంబు
మహిఁ జూడ నది పొల్ల వ్రాత కల్ల
అపరాధములు కోటి నృపుఁ జంపఁ డనుపాటి
మాన్యత వెడవెడ మాట బొంకు
కోపంబు ముమ్మడి కోలాస నలుమడి
సత్య మారజ మీగి జమిలితొట్టు
ఆచార మెడఁదప్పు నాశ్రమ మట్టట్టు
దొరతనం బది పూఁత దురము లేఁత
ఆ. చరిత మెల్ల నింద్రజాలంబు తలఁ పెల్ల
నెల్లిదంబుమాట లెల్ల దంబ
మిట్టి కుమతిఁ గొలిచి యెవ్వాఁడు మననోపుఁ
జిరతరప్రకాశ శ్రీగిరీశ. 241

శ్రీగిరిశతకముసీ. ఎట్టకేలకుఁగాని యెదిరికి రానీఁడు
వచ్చినఁ జూడఁ డావంకయేనిఁ
జూచినముఖమునఁ జూపు వైరస్యంబు
నేమేనిపనిఁ జెప్ప నెడన మాన్చు
ఊరకైనను నుండు దూరఫలం బైన
నుత్తర మేనిచ్చు నూరకియ్య
కొను నొంటుగాదేనిఁ జను లేచు దిగ్గన
చెప్పఁడు నేలమి చిన్న మైన
ఆ. మేలు చేసెనేని మెచ్చక దోషంబు
లందుఁ గొన్న గలుగ నావటించుఁ
గృతముకీడు లెన్నుఁ గృపలేని భూవరుఁ
డది యెఱింగి తొరఁగు టైన లెస్స. 242

నీతిసారముసీ. పగలేచిపెట్టు నాపదల నుపేక్షించు
మేలు చేసిన లేఁతగాలిఁ బుచ్చు
మిన్నక కోపించు మెచ్చెనేనియు నీయఁ
డడుగుచో విన్నప మాలి సేయుఁ
బని నానగొల్పుఁ దత్ఫలసిద్ధిఁ దప్పించు
నిష్ఠురంబులుపల్కు నేర్పు దెగడు
మర్మంబులాడుఁ బ్రమాదంబు దొడరినఁ
బోనీడు నిక్కంబు బొంకుసేయు
ఆ. మాట లాడనాడ మాన్పించు నడుమన
సెజ్జఁబట్టుఁ గొలువఁ జేరినపుడు
వెడఁదనిద్రపోవు విరసచిత్తుం డైన
మానవేశ్వరుండు మంత్రి సోమ. 243

చాటువు

క. భూపతికి మిత్రవర్గము
ప్రా పైనం గాక భూమిభరణము దలమే
యోపునె ఫణిపతియును ధర
మోపునకుం గూర్మకుధరములు లేకున్నన్. 244

ఉ. ఆపద కడ్డమై నిలుచు నర్థసతీజనులందు శుద్ధ మౌఁ
గోపమునం బ్రసాదమునఁ గుందక యుబ్బక నిల్వనేర్చుఁ దా
నేపను లైన రాజునకు నీ డయి తీర్పఁగ నోపుఁ గావునన్
దేవ సుహృజ్జనంబు జలధిక్రమరాజ్యమునందు రాజుకున్. 245

ఉ. భూపతి కెల్లసంపదలఁ బొందెడుచోట నసహ్యభావమున్
జూపక కార్యభారమున స్రుక్కక విశ్రమవేళ యైన సే
వాపరుఁ డై మహాఘములు వచ్చుపనుల్ దొలగించి చెప్పిన
ట్లేపని యైనఁ జేయునతఁ డీప్సితదైవము గాక బంధుఁడే. 246

ఉ. వడ్డికి నీఁగొనంగదగదు వాదము సేయఁగలేదు వంచనన్
వె డ్డుచితంబు గాదు పరు వేఁడినయట్ల ధనంబు నెప్పుడున్
దొడ్డుగ నిమ్మనందగదు దోషము లెన్నుట నీతి గాదు వె
ల్లిడ్డనఁ గొండెముల్ వినుట లె గ్గగు మైత్రియ కోరెనేనియున్. 247

వ. అట్టియెడ. 248

క. సామంతుల కల్పాల్ప
గ్రామంబుల నిచ్చి పెద్దగ్రామంబులచే
భూమీశుఁడు చతురంగ
స్తోమము బండరువుఁ బ్రోవ దొరకొను శుభముల్. 249

నీతిసారము

అంగీకరించి విడుచుట

క. ఎట్టివిషవృక్షమును దాఁ
బెట్టినయది యగునే పిదపఁ బెఱుకఁ దలంపం
గట్టిఁడినరు నైనను చే
పట్టిన మఱి చెఱుపరాదు ప్రభువున కెందున్. 250

ఆ. ఒకనిఁ దొలుత మిగుల నున్నతి కెక్కించి
యతనిఁ బిదపఁ జెఱుచు టనుచితంబు
వీఁక నెట్టిపాటి విషవృక్ష మైనను
దానె పెట్టి తానె తగునె చెఱుప. 251

క. మును నొక్కొరునిం గుణయుతుఁ
డని వానిన పిదప నొప్పఁడని దూషింపన్
జనదు ప్రతిజ్ఞాభంగం
బునకు న్మదిలోన వెఱచుఁ బుణ్యాత్మునకున్. 252

ఆ. ఇచ్చ మెచ్చి మొదల నెంతయుఁ గొనయాడి
తివిరి పిదప వానిఁ దెగడఁగూడ
దట్టిచంద మైన నాతని విడనాడి
నను గృతఘ్నుఁ డందు రతఁడు గాఁడు. 253

నీతిసారమువ. ఇంక విషప్రయోగపరీక్షణంబునుఁ దన్మూలం బయిన యాత్మరక్షణ శయ్యాసనవిహార పరీక్షావిధానంబును నెట్టి దనిన. 254

క. పానాశనశయ్యాసన
యానాంబరభూషణాదు లగు వస్తువులం
దూనిన విషప్రయోగము
భూనాథుఁడు దెలియవలయు బుద్ధిప్రౌఢిన్. 255

గీ. విషహరోదకమజ్జనవిమలమూర్తి
యఖిలవిషహరమణిభూషితాంగుఁ డగుచు
హితభిషగ్వ్రతుఁడై సుపరీక్షితాన్న
పానములు గొనవలయు భూపాలకుండు. 256

కామందకము

విషపరీక్షాలక్షణము

క. పంచవిధాహారంబులు
వంచన లే కాప్తులయినవారికి మునుఁ బె
ట్టించి యది వారలకు జీ
ర్ణించినఁ గుడుచునది ధారుణీపతి పిదపన్. 257

పురుషార్థసారము


సీ. భుజగము విషమును బొడగాంచి గూయును
శుకభృంగరాజశారికలు వెఱచి
లలిణ జకోరముల కన్నులు విరాగము లగుఁ
గ్రౌంచంబు చాల మదించి తిరుగు
విషదర్శనంబుగా వెసఁ జచ్చుఁ గోకిల
గ్లాని జీవంజీవకమున కొదవు
వీనిముఖంబున వెసఁ బరీక్షితములై
తనరిన యన్నము ల్గొనఁగవలయు
ఆ. జనవిభుండు గడుఁ బృషన్మయూరావళి
తద్గృహంబునం దుదారలీల
విడువవలయుఁ బెంచి వెస దానిఁ బొడ
గన్నపాముఁ దనకుఁ దాన పఱచుఁ గాన. 258

కామందకము

చ. కొనగొని కొండమ్రుచ్చులఁ జకోరములన్ శుకశారికావళిన్
బెనుతురు భూపతుల్ విషము వెట్టినయన్నముఁ జూచి యోలిఁ జ
య్యననవి పెంటిక ల్విడువ నక్షులు మూయఁగఁ గూయుచుండఁగాఁ
గని కుటిలప్రయోగములు గాంచుటకై నృపమంత్రిశేఖరా. 259

చారుచర్యక. అనుభావ్య మైనయన్నం
బనలమునకుఁ బక్షులకు సమంచితబుద్ధిన్
మునుము న్నిడి తచ్చిహ్నము
లొనరఁ బరీక్షింపవలయు నుచితక్రియలన్. 260

వ. అది యెట్లనిన 261

క. నల్లనిపొగలును మంటలుఁ
బెల్లగుఁ జిటజిటలుఁ బుట్టుఁ బెద్దగు నగ్నిన్
ద్రెళ్ళిపడి చచ్చుఁ బక్షులు
మొల్లంబగు నవ్విషాన్నమునఁ జిత్రముగన్. 262

సీ. నీరు గ్రమ్ముటయును నీరు దివుచుటయు
వడిఁ జల్లనవుట వివర్ణమగుట
విపులచిహ్నంబులు విషవిదగ్ధంబగు
నన్నమునకు నీలి యరయవలయు
కడుఁగాఁకతోడఁ బైఁ గ్రమ్మునల్లని నురు
గూరక శుష్కమౌఁ గూరగాయ
సంస్పర్శగంధరసంబులఁ జెడుచాయ
మిక్కిలి యగునొండెఁ దక్కువగుచు
ఆ. మండలంబుగాఁగఁ నొండొండబుగ్గలు
పొడమి ఫేనపటల మడరుచుండు
నూర్ధ్వగతము లగుచు నొనర రేఖలు వాఱు
సకలవస్తువులు విషప్రయుక్తి. 263

గీ. రసముమీఁదట నీలవర్ణములు పాలఁ
దామ్రవర్ణము తోయమద్యములమీదఁ
బికనిభంబులు శ్యామముల్ పెరుగుమీఁది
బొడముఁ బొడవగు రేఖలు నడుమనుండి. 263

క. కడుమాడు చిముడు నుడుకుచు
నడగొను శ్యామాయమాన మగు నార్ద్రంబున్
గడుకొని శుష్కము లెల్లను
వడిఁ బ్రవిశీర్ణంబు లై వివర్ణము నొందున్. 264

కామందకముక. పరుస నగు మృదులవస్తువులు
పరుసనివస్తువులు మృదులభావము చెందున్
ఉరువిడి విషదగ్ధకమున
కర మరుదుగ నల్పజంతుఘాతం బొదవున్. 265

ఆ. ఆస్తరణములందు నరయఁ బైచీరల
ధూమమండలములు దోచుచుండు
తంతుపక్షరోమతాపరిభ్రంశన
మగు విషప్రదిగ్ధ మైనయపుడు.266

క. లోహముల మణులయందును
వాహములం గజగురుత్వవర్ణస్పర్శ
వ్యాహతియును మఱి పంకవి
దేహము నుదయించు విషదేహం బైనన్. 267

ఉ. ఊరకయుండి యల్లనగుచుండెడి నోరును నావలింతలున్
నేరనిమాటలున్ నడవనేరక తాఁ గడు మైఁ జెమర్చుటల్
వారక దిగ్విలోకన మవారితకంపము వేగిరింపు దు
ర్వారనిజస్థలోద్యదనవస్ధితియున్ విషదాయిచిహ్నముల్. 268

క. జనపతి యన్నముఁ బానము
గొనుచోట్లను నౌషధములు గొనియెడుచోటన్
అనుదినము దత్పరీక్షక
జనములతోఁ గూడికొనుట సద్బుద్ధియగున్. 269

క. విపులప్రసాధనంబులు
సుపరీక్షకు లైన హితులు శోధించుటయున్
నృపపరిచారికు లెల్లన్
నృపతికి నీవలయుఁ గడు వినిర్మలబుద్ధిన్. 270

క. హితజనులు సేరి యల్లన
యితరులు పుత్తెంచినవి పరీక్షింపఁదగున్
ఇతరస్వజనపరీక్షిత
పతిఁ గడు రక్షింపవలయుఁ బరమాప్తులకున్. 271

కామందకముక. పరనృపతులు పుత్తెంచిన
పరవస్తుచయంబు ముట్ట వలవదు విషదు
స్తరమంత్రయంత్రమాయా
పరిశుష్కాస్పదము లగుటఁ బార్థివుఁ డర్థిన్. 272

పురుషార్థసారముక. తనయెఱుగువాఁ డొనర్చిన
తనయెఱిఁగెడి వాహనములు తగు నెక్కంగాఁ
దనయెఱుఁగని మార్గంబుల
ఘనసంకటమార్గములను గా దరుగంగన్. 273

గీ. ఇతఁడు వంశక్రమాగతుఁ డితఁడు హితుఁడు
ఇతఁడు దుర్జనుఁ డనుమతి నెఱుకపఱచి
సుజను లగువారి సత్కృపఁ జూడవలయు
నెపుడు నాసన్నవర్తుల నృపవరుండు. 274

క. క్రూరులను దుష్టదోషుల
భూరినిరాకృతుల నకృతపుణ్యులఁ బతి దా
దూరమున విడువవలయును
వైరిసమీపముననుండి వచ్చినవారిన్. 275

క. కేవలవాత్యాహతమును
భూవిభుఁ డన్యప్రభేదమును నాతురమున్
నావికపరీక్ష లేకయె
నావఁ గరం బెక్కఁజనదు నయమార్గమునన్. 276

క. జనపతికి గ్రీష్మదినముల
జనశోధితనక్రమీనజాతాంతర మై
ఘనతటలేఖాస్థితహిత
జనచంక్రమణ మగుజలము నను విహరింపన్. 277

క. గహనములు విడిచి శోభిత
బహిరుద్యానములలో నృపాలకుఁడు వయో
విహితసుఖభోగలీలను
విహరింపఁగవలయు సమదవిమలాత్మకుఁడై. 278

క. మృగయోచితవనభూమిని
మృగయాగతి లక్ష్యసిద్ధి మెయికొనుకొఱకై
జగతీపతి సువినీతము
లగు హయములు జాడలాఁగ నరుగఁగవలయున్. 279

సీ. తల్లిఁ జేరఁగఁబోవుతఱినైన భూపతి
భవనశోధన మొనర్పంగవలయు
నెక్కడి కేఁగిన హితు లైన యాయుధ
హస్తులు చుట్టురా నరుగవలయు
సంకటగహనభూస్థలి నిల్వఁ బోలదు
ధూళి సల్లెడు పెనుగాలి నయిన
విపులధారాసారవృష్టి సత్యాతప
ఘోరాహమున నంధకారరాత్రి
గీ. స్వస్థుఁడై యుండి యెఱుగంగఁ జనదు మఱియు
నిర్గమంబుఁ బ్రవేశంబు నియతమేని
రాజపథమున జనులఁ జేరంగనీక
యధిపుఁ డావిష్కృతోన్నతి నరుగవలయు. 280

కామందకముక. జనలక్ష్మికి ధనలక్ష్మికి
ననుపమ మగు ధర్మలక్ష్మి కాత్మయ మూలం
బని యాత్మరక్ష మఱువక
జననాథుఁడు సేయవలయు సతతము ప్రీతిన్. 281

క. ఏపున యాత్రోత్సవములఁ
బైపడి భూజనులు దట్టపడి యేవేళం
భూపాలుఁ డందు సరగున
నోపియుఁ బైఁబడఁగవల దయుక్తంబైనన్. 282

సీ. కంచుకోష్ణీషముల్ గలవర్ష ధరకుబ్జ
కైరాతవామనుల్ చేరి కొలువ
సముచితమ్ముగను రాజన్యుఁ డంతఃపురో
ర్వీతలంబున విహరింపవలయు
విత్తజ్ఞులును శుద్ధచిత్తులు నగునట్టి
సచివు లింపుగ నరేశ్వరునిఁ జేరి
శస్త్రాగ్నివిషవివర్జనముగ నొయ్యన
నర్మవాక్యమ్ము లొనర్పవలయు

ఆ. నంతిపురములోన నధిరతి యున్నప్పు
డచటఁ బాయకుండు నాత్మసైన్య
మతనిఁ జేరి మిగుల నాయితమై నిల్చి
చెలఁగి రక్షణంబు సేయవలయు. 283

క. ఎనుబదియేండ్లపురుషులున్
దనరఁగ నేఁబదులసతుల తనగృహజనులం
దనిశము నవరోధవధూ
జనచిత్తము లరయవలయు జనపతి నగరన్. 284

గీ. లలితమంజులవిమలాంగలతలు వెలుఁగ
సూక్ష్మవస్త్రాభరణమాల్యసుభగ మూర్తు
లగుచు వారాంగనలు మన్మథాస్త్రలీల
బలసి కొలువంగవలయు భూపాలమదను. 285

సీ. జటిలకుత్సితముండజనులసంసర్గము
బాహ్యదాసీజనబాంధవంబుఁ
జేర నంతఃపరిచారజనంబుల
కొదపక యుండంగఁ బదిలపఱచి
వెడలుడునప్పుడు వెసఁ జొచ్చునప్పుడుఁ
దనర నాభ్యంతరజనము లెపుడు
ద్రవ్యముం బనియుఁ దద్ద్వారపాలకులతో
నెమ్మి నెఱింగింప నియతి సేసి
గీ. యంత్యకాలమయాతురుఁ డైనయతనిఁ
దక్క ననుజీవి శుభమ కాఁ దలఁప వలయు
సర్వజనులకు నాతురజనుఁడ గురుఁడు
దప్ప దనుపల్కు భూపతి దలఁపవలయు. 286

ఉ. స్నానవిలేపనాభరణచారుసముజ్జ్వలగాత్రుఁడై శుభ
స్నానము నాత్మదత్తవసనస్ఫుటమూర్తియు నైన దేవులన్
స్థానము చేర్చి వారి సదనంబుల కేగక చేయుచు న్నిజా
ధీనమనస్కుఁడై సతుల తీపులు నమ్మక యున్కి యొప్పగున్. 287

సీ. భద్రసేనుఁడు నిజపత్ని యింటికిఁ జన
నతనితోఁబుట్టువ యతనిఁ దునిమె
దల్లిమంచముక్రింద నల్లన యడఁగి తాఁ
బుత్త్రుండ కారూషుఁ బొడవడంచె
లాజలు విషమున నోజించి తేనియఁ
యని కాశిరాజుఁ దద్వనిత యడఁచె
గరళాక్తమేఖలాఘనమణి సౌవీర
భూపు వైరంత్యు నూపురముచేత
జాతుషీశస్త్రంబు జడయందు నిడుకొని
రమణియొక్కత విదూరథునిఁ జంపు

గీ. టెఱిఁగి నమ్మక సతియింటి కేగఁజనదు
కెరలి శత్రులపయిఁ బ్రయోగింపవలయు
.................................
.................................. 288

కామందకముక. కైటభరిపునకు సురవర
కోటీరతటాగ్రరత్నకుట్టిమకురువిం
దాటోపకిరణరంజిత
పాటలితవిరాజమానపదపద్మునకున్. 289

గద్యము. ఇది శ్రీనరసింహప్రసాదలబ్ధకవితావిలాసభారద్వాజసగోత్రాయ్యలార్యపుత్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతం బైన సకలనీతిసమ్మతం బను ప్రబంధంబునందుఁ గవిత్వగుణవిశేషంబును, నీతిశాస్త్రప్రశంసయు, రాజ్యాంగప్రధానంబైన దుర్గరక్షణంబును, రాజునకవశ్యకర్తవ్యం బగు నాజ్ఞాపాలనంబును, బ్రజాపాలన నియమంబును, రాజగుణావగుణవిశేషంబును, దద్బంధువివరణంబును, నంగీకృతపరిత్యాగంబును, విషప్రయోగపరీక్షణంబును, దన్మూలం బైన యాత్మరక్షాశయ్యావిహారాది పరీక్షావిధంబును నన్నది ప్రథమాశ్వాసము.