Jump to content

సకలనీతిసమ్మతము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

సకలనీతిసమ్మతము

ద్వితీయాశ్వాసము

శ్రీమద్రామాచలనగ
రీమంటప హేమకుంభరిపుభయదగదా
తామరసశంఖచక్ర
క్షేమంకరకరచతుష్క కేశవనాథా. 290

వ. దేవా చిత్తంబున నవధరింపుము. 291

కరణీకపునీతులు

క. మంత్రికి నధికారమునకుఁ
దంత్రమునకు వలయుపనులు దప్పక కార్యా
మంత్రణము సేయఁ గరణము
మంత్రి యనంబరఁగు నతఁడు మనుజేశునకున్. 292

క. కరణము రాజగృహంబున
కరయంగా రత్నదీప మగు విజ్ఞాన
స్ఫురణమునఁ బరులతమములు
కర మరుదుగఁ బాప నొప్పు కరణం బగుటన్. 293

క. ఆయవ్యయముల చిక్కులు
పాయంగాఁ జేయఁ గవిలెపట్టున మాత్రన్
ధీయుక్తి నున్నురూపమ
చేయుచుఁ గరణంబు ప్రజలచేఁ బొగడందున్. 294

నీతిసారము



సీ. ఆయవ్యయంబులయాజాడ లూహించి
యాయాయివర్గవు లమర నిలిపి
పురుషవర్గువు లోలి పరికించి నెరుసులు
దప్పిపోవకయుండ నొప్పు దీర్చి
యవనీశువ్రాతాకుఠవిణలఁ గ్రితచొప్పు
కవిలెసంప్రతులను గలుగ నెఱిఁగి
వరుస నాయవ్యయవాచనంబులు వ్రాసి
వడినెత్తుటావర్గువులకుఁ బాటి
ఆ. గాఁగ నిర్ణయించి కలతరుగువుపొత్ర
తెలిసి ధాన్యరొక్కములకు విలువ
పేరుబడియుఁ దెలుపఁ బెద్దయు నేర్చుట
కరణికంబు ధాత్రిఁ గందమంత్రి. 295

గీ. వ్రాయఁడేని మఱచె వైళమై కవిలెలో
గీయడేనిఁ జెఱిచె గీసవలన
నిట్టి ధాన్యవివర మెల్లయు నెఱుఁగఁడేఁ
గరణ మనరు వానిఁ గందమంత్రి. 296

సీ. సరులు గుచ్చినయట్లు వెరసులు చక్కఁగా
విదిశ మయిన లెక్క వెసగవిడుచు
నెలమి నేకస్థానములు దశస్థానముల్
చెదరిపోవకయుండఁ జిరువపుచ్చి
తలఁపులో మఱవక తరవాయి దప్పక
కుఱుచలు ద్రొక్కక కుంటుపడక
యెదిరివారు వినఁగ నెన్నక బలపంబు
మోపక పెనువ్రేలు దాఁపుగొనక
గీ. తెలివిపడఁగూడి తలఁపులోపలను వెరసు
నిశ్చయము చేసి వ్రాయంగ నేర్చు నతని
గణితశాస్త్రజ్ఞు లిల మేటికరణ మండ్రు
మంత్రిమందార యబ్బయమంత్రి కంద. 297

సీ. పదియంకనంబును బడభుజ చేతప్పు
దెలిహంసపదముతోఁ గిలుము కత్తి
తుడుపు తద్ద్విగుణంబునెడల నిద్దఱివ్రాలు
నిరుఘంటలిఖితంబు విరసపత్రి
పత్రికతుడుపులోపలిసంజ్ఞ భుజలెక్క
తక్కువెక్కువగాక చక్కనిడుట
లలివర్గుజాడలోఁ గలిగి వెరసులలోఁ
దగులకుండుటయందు మిగులమంటఁ
గీ. గలుగులెక్కలుమాఱుగ వెలయు జాడ
వర్గవులు గూర్చి నెడలను వ్యయము డించి
నిలువ సేసినసందులు నెరయ నెఱుఁగు
కరణ మెంతయు నేర్పరి కందమంత్రి. 298

సీ. దొరలు ప్రజలు బంట్లు తొల్లిటిరీతిన
కడమజీతవహియు మడుసువడిన
మనవిఁ జెప్పఁగఁ జేరఁ చనుదెంచునప్పుడు
పరుసఁదనము లేక విరసపడక
మన్నన దప్పక మధురోక్తు లుడుఁగక
కవిలెలోపల వ్రాఁతకందు వెఱిఁగి
తరము దెలిసి వానిఁ దగిలెడుపని దీర్చి
వీఁకతోఁ దా నట్లు గాకయుండఁ
గీ. బొరసి గాదెయు ముడుపును బొరయఁబోక
యాయవంచన మొదలుగాఁ జేయ కుడిగి
యేలినాతనియందుల హితవు గలిగి
మనెడునాతఁడు కరణంబు మంత్రికంద. 299

మదీయము



క. ధరణీశుసొమ్ము ప్రజలన్
బొరయింపక ప్రజలసొమ్ము భూపతియందున్
జొరనీక రెంటనుం దాఁ
బొరయక యున్నట్టి కరణమునకున్ సరియే. 300

క. కరణంబుకొడుకు ముందఱ
కరణికధర్మంబునందుఁ గడుఁ గుశలుండై
ధరణిఁగల విద్య లన్నియుఁ
బరువిడి నెఱుఁగంగవలయుఁ బని లేకున్నన్. 301

మ. శకకాలంబును వత్సరంబు నెల పక్షంబున్ దిథిన్ వారము
న్నొకదేశంబును దాని నేలు విభు నయ్యూరుం నిజస్థానమున్

సకలార్థంబును నామనిశ్చయముగా సాక్షీసమేతంబు వ్రా
యక కాదంబరివ్రాల వ్రాయుకరణం బజ్ఞాని గాకుండునే. 302

నీతిసారము

రాయసము – కరణము

సీ. అలఘుచిత్తుఁడు లఘుహస్తుఁడునై పెక్కు
లిపు లభ్యసించి యేలికకు మిగుల
ననుకూలుఁడై చెప్పినన్ని కార్యంబులు
మఱవక వ్రాసి సమ్మతిగఁ జదివి
అవసరోచిత భాషలందుఁ బ్రవీణుఁడై
సమ్ముఖంబున నిల్చి సమయ మెఱిఁగి
కొలిచి గోప్యంబులు వెలికిఁ జిల్కఁగనీక
జాతియు నీతియు శౌచగుణము
గీ. తగవు వినయంబు హితము నుదారతయును
గలుగు గణికుని నానతాకులకునేలు
నృపతిరాజ్యంబు పూజ్యమై నిక్కి దెసఱఁ
గీర్తియును బెంపుఁజెందును గేశవేశ. 303

మదీయము



క. చేసేత నందియిచ్చిన
వ్రాసినయప్పుట త్రిబంతి వ్రాసిన నొంటన్
వ్రాసిన నీనెం జుట్టిన
నాశమగున్ గార్య మండ్రు నరనుత వినవే. 304

క. తగదు తుడు పిచటఁ ద ప్పని
తగదున్నది దలఁప నంబు తగ దిరువుటయున్
దగదు తగదెపుడుఁ జెప్పఁగ
దగదు తలన్ వ్రాల్చివ్రాయఁదగ దా లేఖల్. 305

చాటువు

వాచకలక్షణము

చ. వెనుకకుఁ బోక హాయనక వేసట నొందక బంతి బంతిలో
బెనఁపక కానమిం బ్రమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్
గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేకచిత్తుఁడై
యనుపమభక్తితోఁ జదువునాతని వాచకు లండ్రు సజ్జనుల్. 306

సీ. ఊరక మురియక యుబ్బసం బందక
వెఱవక దేహంబు విఱిచికొనక
నిడుసునఁ బెట్టత నిప్పోటమునఁ బోక
తరవాయి దప్పక తడవికొనక
యక్షరస్పష్టత యన గీత నష్టత
గాకుండ నర్థంబు గానఁబడఁగ
నయ్యైరసంబుల కనురూపముగఁ బెక్కు
రాగముల్ ఫణితులు బాగుపుట్ట

గీ. చెఱకు కొననుండి నమలినచెలువు దోఁప
నంతకంతకు వేడుక యతిశయిల్లఁ
జదువుచున్నారు వీరలచదువుఁ బోలఁ
జదువు లేదని పొగడిరి సభికవరులు. 307

చ. వడఁవక నిక్క కీయనక వ్రాలక తోలక తూలిపోక సం
దడిఁబడ కెన్నికోక గతి తప్పక తుమ్మక దగ్గులేక వెన్
బడ కటు వెక్క కుబ్బక నెపం బిడ కంజక వంజ గాక రం
గుడిగి పఠింపఁగావలయు నో పటువాచక మెట్టిమేటికిన్.308

పురుషార్థసారము

బ్రాహ్మణాచారము

క. అమరంగా శౌచము మూ
త్రములు ప్రవర్తించునపుడు తమతమశాఖో
క్తముఁ జేయవలయు భూసురు
లమలినమతి నల్పమైన నధికంబైనన్. 309

క. ఆచారం బెఱుఁగఁగ వి
ద్యాచితసంపత్తి వడయునది యాత్మహితం
బాచారవృత్తి ద్విజతతి
కాచారము లేనివిద్య యది యేమిటికిన్. 310

చ. తెలియుచు నిద్ర శౌచవిధిఁ దీర్చి యనుష్ఠితదంతకాష్ఠుఁడై
జలశుచిగాత్రుఁడై విహితసాంధ్యవిధాయకుఁడై హుతాగ్నియై
పొలు పగుభక్తినిష్ఠ సురపూజకుఁడై గృహమేధి సేయఁగా
వలయుఁ బ్రభాతకృత్య మిది వారిజగర్భకులప్రసూతికిన్. 311

క. స్నానవిధి తర్పణము సం
ధ్యానియమము పంచవిధమహాయజ్ఞాతి
ధ్యానంతరభోజన మిది
మానితధాత్రీసురులకు మాధ్యాహ్నికముల్. 312

క. అస్తమయవేళ సంధ్యో
పాస్తి యనంతరమ యగ్న్యుపాస్తియు దైవో
పాస్తియు నగు కర్మములు ప్ర
శస్తధరిత్రీసురులతు సాయంతనముల్. 313

క. ఓపి త్రిసంధ్యానియమ
వ్యాపారనిరోధి గాని యధ్యాపన మ
ధ్యాపనవిరోధిగాని ధ
నోపార్జన వలయు భూసురోత్తముల కిలన్. 314

చ. మునుకొని బ్రాహ్మణుండు మలమూత్రవిసర్జన శౌచదంత ధా
వనముఖమార్జనాచమనవారివిగాహనసాంధ్యకర్మజా
ప్యనియమహోమదేవయజనాతిథిపూజనపానయానభో
జనశయనాదు లొందఁదగు శాస్త్రవిధానముతోడ నెప్పుడున్. 315

క. అతికాంక్ష దుష్ప్రతిగ్రహ
రతికంటెను బహుకుటుంబరక్షార్థముగా
క్షితిసురులకుఁ గృషిసేయుట
హిత మనిరి పరాశరాదు లిక్కలివేళన్.

పురుషార్థసారము

వైద్యనీతులు

క. శ్రుతిమంతునిఁ బరహితుఁ దాఁ
బ్రతిభేషజవిషయు సరసపాకజ్ఞుఁ గ్రియా
చతురు సుచరితు దయాపరు
ధృతియుతుఁ బతి వైద్యుఁజేసి దీర్ఘాయువగున్. 317

అజ్ఞాతము



క. అనిశము సేవింతురె ని
న్ననఘా యష్టాంగ మైన యాయుర్వేదం
బున దక్షులైన వైద్యులు
ఘనముగ ననురక్తులై జగద్ధితబుద్ధిన్. 318

సభాపర్వము



ఆ. దేవమంత్రవిప్రతీర్థదైవజ్ఞస
ద్వైద్యగురులయందు వసుధమీఁద
నెంత విశ్వసించి రంతయు సిద్ధియౌ
నెంత విశ్వసింప రంత గాదు. 319
పంచతంత్రి

గీ. సకలలిపికారుఁ డఖిలభాషావిదుండు
రాజరంజనవిద్యాధురంధరుండు
మాంత్రికుఁడు వైద్యుఁ డతిగూఢమానసుండు
సరసధర్మార్థకామమోక్షప్రియుండు. 320

క. ఏదేశమందు నిల్చిన
నాదేశం బేలురాజు నచ్చటిప్రజలన్
ఐదాఱుదివసములలో
భేదించుఁ బరేంగితంబుఁ బెద్దయు నెఱుఁగున్. 321

గీ. వైద్యుఁ డెందును రోగి కవశ్యుఁ డరయఁ
గాన వైద్యమ జనవశీకరణ మంద
మాన మొల్లక సేవింపఁ బూనియున్నఁ
గార్యసంసిద్ధి సందేహకరము దలఁప. 322

ముద్రామాత్యము

పురోహితనీతి

చ. నృపతిపురోహితుండు నృపనీతివివేకదగ్ధుఁడై త్రయీ
నిపుణుఁడు నై తనర్చి ధరణీపతి కెప్డు హితాభిలాషి యై
రిపు నృపకర్మభేదనధురీణత శాంతికపౌష్టికక్రియా
విపులమనీషఁ జేయఁదగు వేడ్క దలిర్ప గృహప్రయోక్తయై. 323

కామందకము



క. ధీరుఁడు ధర్మాధర్మవి
శారదుఁడు బహుశ్రుతుండు సమచిత్తుఁడు వా
ణీరమణీకృతవదనస
రోరుహుఁ డనఁదగునె నీపురోహితుఁ డధిపా. 324

క. తనయింటిచేటు పరులకు
వినిపింపఁగఁదగదు కార్యవేళనె తక్కన్
వినఁగఁ బురోహితుఁ డర్హుఁడు
విని చక్కంజేయుఁ దనదువిద్యామహిమన్. 325

సభాపర్వము



క. పోఁడిమిఁ బౌరోహిత్యం
బేఁడును మాఠాధిపత్య మింపెసఁగంగా
మూఁడుదినంబులు చేసిన
వాఁడు సుమీ ఘోరనరకవాసుఁడు మీఁదన్. 326

పంచతంత్రి

యాజ్ఞికుఁడు

క. జననుత నీయజ్ఞమునం
దనవరతనియుక్తుఁ డైన యాజ్ఞికుఁడు ప్రయో
గనిపుణుఁడై యేమఱకుం
డునె నిజకృత్యముల నెప్పుడును సమబుద్ధిన్. 327

సభాపర్వము

జ్యౌతిషికుఁడు

క. క్షితినాథ శాస్త్రదృష్టి
ప్రతిభను దివ్యాంతరిక్షభౌమోత్పాత
ప్రతికారు లగుచు సన్మా
నితులై వర్తింతురయ్య నీదైవజ్ఞుల్. 328

సభాపర్వము



క. జాతకయాత్రాప్రశ్న
ఖ్యాతఫలగ్రంథగణితగణచతురధిక
స్ఫీతశతచక్రనిపుణ
జ్యౌతిషికులు గలుగవలయు నవనీశునకున్. 329

క. ప్రతికూలవేళ లెఱుఁగుచుఁ
బ్రతికృతరాశ్యాదు లెఱిఁగి పతిరాశిఫల
జ్ఞత యొరు లెరుంగకుండఁగ
సతతము రక్షింపవలయు సాంవత్సరికుల్. 330

సీ. వాన లెక్కువతక్కువలు గాఁగఁ గురియుట
చిలుకలు మిడుతలు నెలుకపిండు
నాదిగా సస్యోపహతికారణంబులు
గలుగుట తవులును గఱవు రాక
మనుజు లొండొరులతో మత్సరంబునఁ బోరు
టధికమై సర్పంబు లాదిగాఁగఁ
గ్రూరజంతువు లతిఘోషంబు వెట్టుట
గాలియుఁ జిచ్చు లగ్గములగుట
ఆ. భూతములు పిశాచములు రేఁగి పట్టుట
యల్పకారణముల నైనచావు
గలుగుటయును నాపదలు వీనిదైవజ్ఞుఁ
డగు పురోహితుండు నడఁపబోవు. 331

విద్వాంసుఁడు

క. సన్నుతి వడయఁగఁ దివిరి న
యోన్నతి నుచ్చాసనమున నునిచి ధనంబుల్
మన్నించి యిచ్చి నృపతులుఁ
విన్నపము పనేమి యండ్రు విద్వాంసునకున్. 332

ఆ. చటులసింహశరభశార్దూలగజముల
వశ్య మొందఁ జేయ వచ్చు ననిన
నరయ మిగులఁ దజ్ఞు లగువారకునెల్ల
నవనిపతులు వశ్యు లగుట యెంత. 333

పంచతంత్రి



క. ఎవ్వరు శూరులు సేవకు
లెవ్వరు విద్వత్ప్రసిద్ధు లెవ్వరు దగువా
రవ్వసుధాధిపుసంపద
కవ్విధమున నర్హు లగుదు రది నిజ మరయన్. 334

చ. పతి సుఖగోష్ఠి సేయునెడఁ బన్నుగ వారమునందుఁ బాఁడి స
మ్మతముగ రాజుపక్షము సమర్థముఁ జేయుచుఁ బల్కుటొప్పుఁ ద
త్పతిపనిపైనఁ దద్వచనభంగి యెఱింగి వినిశ్చితార్థసం
గతిఁ గడు సాధురీతిఁ బలుకందగు వాగ్మిత యుల్లసిల్లగన్. 335

రాయబారప్రకారము

క. దూరపుఁబనులకు మంత్రికిఁ
బోరా దటు గాన నతనిఁ బోలెడివిప్రుం
భూరిగుణాఢ్యుని దూతగఁ
గోరి నృపాలుండు పనులు గొనఁగావలయున్. 336

కామందకము

క. అవనీపతి నిల్పందగుఁ
బ్రవిమలమతిచతురు నిఖిలభాషాకుశలున్
సవినయశీఘ్రవిలేఖను
వివిధవిధిప్రౌఢు సంధివిగ్రహపదవిన్. 337

పురుషార్థసారము



క. కృతమంత్రుఁ డగుచు భూపతి
చతురుని నిజమంత్రి మంత్రసమ్మతు నెపుడున్
వ్రతసాభినాను గమ్య
క్షితిపతికడ కనుపవలయుఁ జెచ్చెఱ దూరన్. 338

కామందకము



శా. నానాశాస్త్రవిచక్షణుండు నయనానందాంగుఁడున్ సత్కుల
స్థానశ్రేష్ఠుఁడు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్సిద్ధుఁడున్
శ్రీనిత్యుండును లోకమాన్యుఁడగు నిశ్చింతుండు నై యుండినన్
వానిన్ మానుగ రాజదూత యని తల్పన్ వచ్చు నుర్వీస్థలిన్. 339

పంచతంత్రి



క. శ్రుతిమంతుండు ప్రగల్భుఁడు
కృతకర్మాభ్యాసి వాగ్మి కీర్తితశుభస
న్మతి శస్త్రశాస్త్రనిష్ఠుఁడు
పతికిన్ దగు దూత గాఁగ బహుకార్యములన్. 340

కామందకము



క. ప్రతిభయు నవ్యసనిత్వముఁ
బతిభక్తియుఁ బలుకువెరవుఁ బరనృపధర్మ
జ్ఞతయును వినయముఁ దేజము
నతిశుచితయు దూతగుణము లండ్రు నయజ్ఞుల్. 341

సీ. లిపులెల్లఁ జదువను లిఖియింప వలఁతియై
భాషలఁ బెక్కింటఁ బ్రౌఢి గల్గి
సమయవర్ణాశ్రమాచారవిధిజ్ఞుఁడై
యెదిరిని దన్నును నెఱుఁగనేర్చి
మధురగంభీరసమస్థిరవాణియై
సుముఖుఁడై కార్యభారమున కోర్చి
మఱి పదవాక్యప్రమాణవిజ్ఞానియై
ప్రజ్ఞ నూహాపోహపరుఁడు నగుచు
గీ. రాజహితుఁడయ్యుఁ బ్రజ కనురాగ మెసఁగఁ
జేయ నేర్చిన యాతనిచేతఁ గాక
యితరదూతలు చేసిన నేల పొసఁగు
విమతజయకారు లగు సంధివిగ్రహములు. 342

నీతిసారము

క. ధీయుతుఁ డభయుం డచలుఁ డు
పాయజ్ఞుఁడు సముచితప్రభాషుండు పతి
శ్రేయోర్థి పరేంగితవిదుఁ
డాయాససహుండు దూత యగు నధిపతికిన్. 343

పురుషార్థసారము



ఉ. మేధయు వాక్పటుత్వమును మిక్కిలిప్రజ్ఞయు నింగితక్రియా
బోధము ధైర్యముల బ్రియము భూపతిభక్తియుక్తి వైరిధర్మసం
శోధనవృత్తియున్ గల విశుద్ధచరిత్రుని రాయబారిగా
యూధము గూర్చి పంపు సుగుణోన్నత యబ్బయకందధీమణీ. 344

మదీయము



క. ఏలిక చెప్పిన మాటలె
పోలఁగఁ జెప్పచును నియుఁ బొందఁగఁజేయం
జాలుట యుత్తమదూత్యము
పాలింపఁగవలయు నిదియుఁ బతిహితతతికిన్. 345

ముద్రామాత్యము



ఉ. కొందఱు చెప్పినంతయును గూర్ప వచింతురు చిల్కపోలికన్
కొందఱు మూఁగుభంగి నొనగూడఁదలంచి వచింపనేర రిం
పొందఁ దలంచిన ట్లవల నొప్ప వచింతురు కొంద ఱుర్విలో
నెందును సత్కవీంద్రుగతి నీక్రియ మర్త్యులు మూఁడుచందముల్. 346

పంచతంత్రి


క. మునుము న్నిష్కృపణార్థుఁడు
వెనుక మితార్థుండు నతనివెనుకను మఱి శా
ససహారకుఁడు ననంగాఁ
దనరుచు రొగి దూతజనులు దమతమశక్తిన్. 347

సీ. పరులమాటకుఁ బొందుపడ మాట గల్పించు
నతఁడు నిష్కృపణార్థుఁ డనఁగఁ జెల్లుఁ
బతి చెప్పినంతయుఁ జతురతఁ బల్కు నా
తఁడు మితార్థుండు నాధరణిఁబరఁగు
నట లేఖఁ గొని యేఁగి నంతటనే యుండు
నాతండు శాసనహారకుఁడు
ఈమువ్వురును దూత లిందులో సచివుని
సామర్థ్యమునకంటె సరవి నొక్క
గీ. పాలు నర్థంబు ముప్పాలు పరఁగఁ గొఱఁత
యగుచు వర్తించువారు వీ రగుటఁ జేసి
నీతి మార్గంబుచే వీరి నెఱిఁగి యెఱిఁగి
పనుచు టెంతయు నొప్పు భూపతికి నెపుడు. 348

సీ. దూతజనుం డొగి భూతలాధిపునాజ్ఞఁ
దల మోచికొనుచుఁ బ్రత్యర్థికడకు
నిజనాయకునివాక్యనిర్ణయేతరముల
నిచ్చఁ జింతించుచు వేఁగవలయు
నటగట్టి రాజులు నాటవికులు దన
కాప్తమిత్రులు గాఁగ నలవరించి
తొడరి జలస్థానదుర్గసంస్థలములు
నిజబలార్థంబైన నెమ్మిఁ దెలిపి
గీ. రాక యెఱిగించి శత్రుపురంబునందు
నుండి సముచితవృత్తిమైనొయ్య నొయ్యఁ
గాల మీక్షింపవలయుఁ దత్కార్యమునకు
నంత నాతఁడు చను మన్న నరుగవలయు. 349

క. అడిదపుధారలు దనపై
జడియఁగ నేలిననృపాలుశాసనమార్గం
బెడపక పలుకుచుఁ జూపుల
వడువును మోమునను దెలియవలయు మనంబుల్. 350

సీ. చాల ననిష్టవాక్సంచారమున కోర్చి
క్రోధకామంబులఁ గుతిలపడక
పరులమనస్స్ధితి బయలుగాఁ బలుకక
యెల్లచిత్తంబుల నెఱిఁగికొనుచు
దననృపప్రకృతులతలఁపుల నన్యోన్య
రాగాపరాగనిర్ణయము నెఱిఁగి
యొనరంగఁ గృత్యపక్షోపజాపము నొగి
ననుపలక్షితుఁడు నై యలవరించి
ఆ. తననృపాలుప్రకృతిజనులవిచ్యుతి యెవ్వ
రడుగునప్పుడైన నొడవకుండి
నృపుఁడె యడిగెనేని నీవె యెఱుంగుదు
వనుచుఁ బలుకవలయు నవిదితముగ. 351

క. కులమును బేరును ధనమును
బలవత్కర్మములు నుభయపక్షములందున్
గలపతి యుత్కర్షంబుగఁ
దలకొని వినిపింపవలయుఁ దననరపాలున్. 352

గీ. ఉభయవేతనజనులతో నొయ్యఁ గూడి
సాల శిల్పోపదేశమిషంబువలనఁ
గృత్యపక్షం బెఱుంగుచు గేనమునను
నానృపాలునిచేష్టల నరయవలయు. 353

కామందకము



క. కౌటిల్యవృత్తి నెంతయుఁ
బాటించియె కాక సంధి బలహీనుల కె
ప్పాట నలవడునె యైనను
పాటించి యెరుంగవలయుఁ బరహృదయంబుల్. 354

ముద్రామాత్యము

గీ. తీర్థముల నాశ్రమంబుల దేవగృహము
లందుఁ దాపసవేషంబు లలవరించి
యున్న నిజచారజనులతో నుచితశాస్త్ర
పటువివేకమిషంబునఁ బలుకవలయు. 355

క. పానద్యూతము లుడుఁగుచు
నానాఁటికి నచటివార్తనరనాథునకున్
దా నమ్మిక గలనరుచే
మానుగ నెఱిఁగింపఁబంపుమత మది వలయున్. 356

క. తనపతికులముఁ బ్రతాపము
వినుతైశ్వర్యంబుఁ ద్యాగవిభవము దార్ఢ్యం
బును నుత్సాహము ఘనతయుఁ
బెఁనుపుగ నుపమింపవలయు భేద్యులయెదురన్. 357

క. కాలముతోడన తనపనిఁ
గీలింపుచు నొరులభేదకిల్బిషములచేఁ
దూలక కాలక్షేపము
లాలోకింపగవలయు నన్యకృత్యంబుల్. 358

సీ. ఇన్నిదినంబులు నితఁడు విలంబింప
నితనికిఁ గారణం బేమియొక్కొ
మన్మహీపతియందు మహితవ్యసన మొక్కఁ
డారసి పొడఁగను నాసనొక్కొ
స్వాంతప్రకోపము నడఁచుటకై యొక్కొ కడ
గి సస్యాదిసంగ్రహముకొఱకొ
ప్రత్యగ్రదుర్గనిర్మాణంబునకునొక్కొ
కృతపూర్వదుర్గసత్క్రియలకొఱకొ
గీ. పక్షవృత్తిని యాత్రకు బాగు గాఁగ
దేశకాలవిభేదనోద్వీక్షణంబొ
యాత్మయాత్రావసరసత్క్రియార్థమొక్కొ
యనుచుఁ గాలవిలంబన మరయ వలయు. 359

గీ. మఱియు వార్తావిశేషంబు నెఱుఁగుచుండి
తననృపాలున కెఱిఁగించి పనుపవలయుఁ
గాలయాపనహేతువు గానవచ్చి
వెరవుపడకున్న నప్పుడు వెడలవలయు. 360

క. జనపదసారము దుర్గం
బున గుప్తము శత్రురంధ్రమును ధనము బలం
బును మిత్రబలము నొయ్యన
మనమునఁ దెలియునది దూతమార్గం బరయన్. 361

చ. అరివరుశత్రుదుర్గమును నాతనిబంధుసుహృద్విభేదమున్
బురధనసైన్యసంపదలపోఁడి మెఱుంగుట కృత్యపక్షని
స్తరపరిసంగ్రహం బతనిజానపదాటవికంబు సాధ్యముల్
దిరమిడి యుద్ధసారము విధిజ్ఞత యన్నివి దూతకర్మముల్. 362

కామందకము

గీ. దూతముఖమునఁ బతి యభియాతిజనుని
యంతరంగము సర్వము నరయవలయు
నాత్మపక్షమునందును నరసి యరసి
నితరదూతవిచేష్టిత మెఱుఁగవలయు. 363

ఆ. నృపతి పరులదూతనిజ మెరుఁగఁగఁదగు
వారివలనఁ దిరుగువారివలన
నైనఁ గొలువఁ బనిచి యాత్మీయు లగువారి
వలననైనఁ బరులవలననైన. 364

ఆ. పరుసగాఁగ దూత పలికిననైనను
జేయఁదగని పనులు చేసెనేని
చంప నొంపఁదగదు సైరణ వాటించి
యనుపవలయు నుచితమైనభంగి. 365

క. నృపతిలకుఁ గులవిహీనుఁడు
గుపితుఁడు నలసుండు లంచగొండియు మూర్ఖున్
జపలుఁడు మిథ్యావాదియుఁ
గపటియు నగుదూతచేతఁ గా వేపనులున్. 366

కామందకము



క. చెప్పినమాటలలోపలఁ
జెప్పక యొకకొన్ని మఱచి చెప్పెడు నందున్
దప్పులు వెసఁ జెప్పెడివాఁ
డెప్పగిదిని రాయబారి యిలలో ననఘా. 367

క. తడఁబడక తప్పులాడక
జడిఁ బట్టక పరుస గాక సభ్యులు మెచ్చన్
గడు స్రుక్కక యెగవెక్కక
నడుకక మాటాడవలయు నాగరికుం డై. 368

నీతిసారము



క. ఎదిరికి హితమును బ్రియమును
మది కింపును గాఁగ నాడు మాటలు పెక్కై
యొదవినను లెస్స యటుగా
కిది యది యన కూరకునికి యెంతయు నొప్పున్. 369

క. మత్తుఁడు సుప్తుఁడు హృదయా
యత్తము విదితంబు గాఁగ నాడుదు రగుటన్
ఎత్తఱి నేకాంతమున న
మత్తత నిద్రింపవలయు మానోన్నతుఁడై. 370

విదురనీతి

చారులనీతులు

క. పరికింపుచు బాహ్యాభ్యం
తరములలోపల ననారతము నిజరక్షా
పరులైన పరిమహీశుల
చరితము వీక్షింతె నిపుణచరనేత్రములన్. 371

సభాపర్వము



గీ. సారమతు లైన సద్గూఢచరులచేత
నమరునిజపక్షశత్రుపక్షములలోను
గలుగుతీర్థంబు లన్నియుఁ గ్రమముతోడ
నెఱుఁగు నెవ్వఁడు వాఁడొందఁడెపుడుఁగీడు. 372

అజ్ఞాతము



సీ. మంత్రిపురోహితమంత్రిజనాధ్యక్ష
సైన్యాధినాయకసన్నిధాతృ
లాటవికప్రశాస్త్రాయోధనాయకవ్యావ
హారికసమాహర్తృదండ
పాలదుర్గప్రాంతపాలప్రదేష్టృకార్మాంతి
కాంతర్వంశికాధికార
యువరాజదౌవారికోపేతముగ నిట్లు
ముయ్యేడుతీర్థంబు లయ్యె జగతి
ఆ. నివి యెఱింగి రాజహితబుద్ధిపరపక్ష
ములను నతినిగూఢముగను జరులఁ
బెట్టవలయు నట్టిబెట్టిదముగ సంధు
లరయుచుండవలయు ననుదినంబు. 373

చ. జనపతి సంస్థలు న్మిగుల సచ్చరితంబులు గల్గువానిఁగా
నొనరఁగఁ గార్యసిద్ధికొఱ కున్కిగఁ జేయుట వోలు వానియం
దనువునఁ జారులుండి వెరవాడి విదేశములోని మర్మముల్
గనుఁగొనుచుండఁగావలయుఁ గావున శాత్రవరాజధానులన్. 374

కామందకము



వ. మఱియు దూతలకు నగోచరంబు లగు సూక్ష్మకార్యంబులు జనసంచారవిస్రంభాలాపంబుల నెఱుంగంబడుఁ గావున నయ్యైస్థలంబులఁ దనకు నాప్తులగు భృత్యులఁ జరులుగా నియోగింపవలయు వారు. 375

క. తమదేశమును బరదే
శమున నిగూఢాత్ము లగుచుఁ జరియించి విశే
షము లెన్నియును భూ
పమణున కెఱిఁగింపవలయుఁ బ్రతివాసరమున్. 376

ఆ. గతియు మతియు బైలు గాక పరేంగిత
చేష్టితాదు లూహచేతఁ దెలిసి
బొంకు చాపలంబు బొరయక నృపునెడ
సత్యవాది యగుట చరునిగుణము. 377

నీతిసారము



చ. తలఁపును రాకయుండుటయుఁ దాఁకుభయంబున నొవ్వఁబల్కు న
ప్పలు కొకరీతి పొందుపడఁ బల్కెడునేర్పును గాలివేగమున్
వెలయఁ బరేంగితజ్ఞతయు నిశ్చయబుద్ధియు దుఃఖ మోర్చుటల్
వలయుఁ దగంగఁ జారున కవశ్యము లిన్నియు నెన్నిభంగులన్. 378

గీ. తొడిరి తాపసవేషులు ధూర్తజనులు
చాల శిల్పోపజీవనశాలు లగుచుఁ
జరులు చరియింపవలయు విశ్వముననెల్ల
నెల్లజనులమతంబులు నెఱిఁగికొనుచు. 379

క. అనుదినము నిర్గమించుచు
నొనరఁ బ్రవేశించుచును సముద్ధతవార్తా
వినిరూపణంబు సేయుచు
జనపతి కతిదూరదృష్టి చారులు జగతిన్. 380

గీ. సూక్ష్మసూత్రప్రచరణముల్ సులభవృత్తిఁ
జొరఁవ కరివీరచేష్టలఁ జూచుచుండు
చారచక్షులు గలిగిన జనవరుండు
నిద్రపోవుచునైనను నెలమిఁ జూచు. 381

క. అరుణుఁడు కిరణంబుల సం
చరణంబుల వాయు వెపుడు చరియించుగతిన్
జరజనులూఁతగ నృపతియు
నొరుగతి జగమెల్ల నెఱిఁగియుండఁగవలయున్. 382

చ. కడుకొని యప్రకాశుఁడు ప్రకాశుఁడు నా నుభయప్రకార మై
యడరుచుఁ జారభేద మది యందుఁ బ్రకాశుఁడు దూత నాఁగఁజొ
ప్పడుఁ జరుఁడప్రకాశుఁడును బన్నుగ దూతవశంబు సంధి య
ప్పుడు చరునంద చర్యఁ గనఁబోలును నాత్మపరస్థలంబునన్. 383

కామందకము



క. వేషవిశేషవిదుల్ బహు
భాషాకోవిదు లచలులుఁ బరహితులును వి
ద్వేషనృపకృత్యరంధ్రా
న్వేషులు నగు గూఢచరులు నృపతికి వలయున్. 384

పురుషార్థసారము

సీ. అధ్యాపకుఁడు బిక్షుకాక్షుండు లింగియు
వణిజుండు మఱి కృషీవలుఁడు వరుసఁ
గాపట్యుదాసీనతాపసవైదేహ
గృహపతు లేవేళ నహితువీటఁ
జరులకుఁ దాసిగాఁ జరియించుకొఱకునై
ధన మిచ్చి తగుచోట్ల కనుపవలయు
రసదుండు సత్రి ప్రవ్రజితుండు దీక్షితుం
డనువారు గరదుండు దనరు తపసి
ఆ. వరుఁడు వేషధారి తిరిపెము సాధన
గురువు లనఁగ మాయ బెరసియుండ్రు
వీరు నలువు రరయ వేగులవారలొం
డొరుల నెఱుఁగకుండఁ దిరుగవలయు. 385

కామందకము


ఉ. ఒజ్జలు చాపశిక్షకులు యోగ్యులు భోగ్యులు రాజయోగ్యధీ
మజ్జను లైంద్రజాలికులు మల్లులు సూపకరుల్ విదూషకుల్
గుజ్జులు దేశికుల్ యతులు కోమటు లాడెడువారు గాయకుల్
వెజ్జులు లోనుగాఁ గలుగువీరి మహీపతి సేయుఁ జారులన్. 386

సీ. వ్రతులు సన్న్యాసులు వైద్యు లాచార్యులు
జపితలు జ్యోస్యులు శకునగాండ్రు
బట్లు శ్రీహరినామపాఠకు లాడెడు
వారు విద్యలవారు వాదవిదులుఁ
బంగులు మూఁగలు బధిరులుఁ జపలులు
జంగాలు జోగులు సావుతేలు
వగ్గులు గొరగులు వాహకు లడపాలు
సురయమ్మువారలు జూదగాండ్రు
ఆ. మావటీలును బరిహాసకులును బాగ (?)
వేగుజాము క్రోఁతి వేఁటకాండ్రు
నాదియైనవారి యాకారములు దాల్చి
తిరుగవలయుఁ జరులు దేశములను. 387

నీతిసారము



చ. జడబధిరాంధమూకమిషిషండకిరాతకకుబ్జవామనుల్
అడరఁగఁ గారుచారణజనావళి భిక్షుకి పుష్పలావియున్
గడుకొని దాసియున్ బహువికల్పకళావిదులై చరించున
ప్పడఁతుకలున్ వెసన్ దిరుగుపాఠకులుం దగుచారు లెల్లెడన్. 388

క. ఆరయ ఛత్రధారులు
వారక భృంగారు యానవాహనధారుల్
ఆరథశిక్షకు లాదిగ
నారసి యెఱుఁగుదురు బాహ్య మగు వార్త లిలన్. 389

గీ. మిగుల సంకేతసంజ్ఞత మ్లేచ్ఛవచన
గూఢమూర్తులఁ బ్రతికారగూఢరూప
చేష్టితంబుల నొందుచు నిష్ఠవృత్తిఁ
జెలఁగి చారులు తమలోన మెలఁగవలయు.390

చ. జనపతి చారరక్షుఁ డయి చాలఁగ రంధ్రము రోసి శత్రుపైఁ
జని గెలువంగఁబోలుఁ జరచక్షుఁడు గాని నృపాలుఁ డంధుఁ డౌ
ననిశము శత్రుసంప దుదయంబును సర్వదశావిచేష్టలుం
గనుఁగొను బొప్పు శత్రుజనకల్పితకృత్యము చారదృష్టియై. 391

కామందకము



క. పసదన మెఱింగి చారుఁడు
వెసతో నేతెంచుఁ గాన వేమాఱును నా
పసదనమును జీతంబును
బొసఁగిన క్రియ నిడఁగవలయు భూపతివృత్తిన్. 392

ఆ. చరులు లేనిరాజు పరులచే నాపదఁ
జెందు ననుట యేమిచిత్ర మరయ
భక్తి సేయునట్టి ప్రజలైన నెఱుగమి
సూచి మోసపుచ్చ జూతురనిన. 393

పంచతంత్రి



ఉ. కొందఱ నారయంగ విడి క్రుమ్మఱి వచ్చుచుఁ బోవుచుండగా
గొందఱఁబంచి వేడ్కయును గొందఱ నొండొరుపోక గానకుం
డం దగఁ బంచి చారులు బెడంగుగఁ జెప్పినచోట మువ్వురే
చందము సమ్మతించి రది చందముగాఁ గొనిపోవఁగాఁ దగున్. 394

నీతిసారము



ఆ. హృదయకమలమందు నెద్దారిపగయైనఁ
జారగూఢమంత్రశక్తిఁ జేసి
తమకుఁ బూని గెలువఁ దఱియైనయంతకు
నది సహించికొందు రమలమతులు. 395

క. నానాదేశంబులఁగల
భూనాథుల శత్రుమిత్రబంధువులందున్
గానంబడు బహువిధముల
మానుగ వైదేశికులఁ గ్రమంబున నడుగన్. 396

ఉ. చేరి తలంటువారలను జెచ్చెర నాపదగాత్రమర్దనుల్
నారయ భోజనాంబుకుసుమాంబరభూషణగంధదాయకుల్
వారక వీ డె మిచ్చి చనువారును నిత్యసమీపవర్తనుల్
దారుణచిత్తవృత్తి రసదాయకు లౌదురు చేయనేర్చినన్. 397

క. పరఁగ నణుమాత్రరంధ్రం
బరిపక్షమునందుఁ గన్న నది మార్గముగాఁ
బరిమార్పవలయు రాజ్యము
పరువడి సలిలంబు యానపాత్రముఁ బోలెన్. 398

క. ఈ రీతి నడువనేరని
భూరమణుఁడు శత్రువులు ప్రబోధత నుండన్
వారక నిద్రించినవాఁ
డారయ మేల్కొనఁగనేరఁ డాజన్మమునన్. 399

ముద్రామాత్యము

సేనాపతిలక్షణము

క. నానావితరణవిజయము
హానిపుణు లవార్యవీర్యు లనఁదగువారిన్
సేనాధ్యక్షులఁ జెసితె
నీనమ్మినవారి మాననీయుల హితులన్. 400

సభాపర్వము


సీ. సత్కులుఁ డౌదార్యసంపన్నుఁ డభిమాని
సత్యవంతుఁడు మేటి సత్యధనుఁడు
మంత్రజ్ఞుఁ డుత్సాహమంత్రసమ్మతుఁ డాగ
మజ్ఞుండు శుభమూర్తి మహితకీర్తి
బహుబంధుమిత్రసద్భటసమగ్రుఁడు
పతికార్యదక్షుఁడు యుద్ధకౌశలుండు
+ + + + + + + + + ++ + + +
+ + ++ + + + + + + + + + +
గీ. + + ++ + + + + + + + + +
+ + ++ + + + + + + + + +
నైన దళవాయి నేలిన యతఁడు రాజు
ఘనకళాభోజ యబ్బయకందరాజ. 401

చాటువు


మ. నయవిజ్ఞానముఁ దత్ప్రయోగములు నానావాహనారోహణ
క్రియతో నాయుధకౌశలంబు నుచితక్రీడారణామర్ష మెం
తయు నాయాససహత్వముం బరబలాంతస్సారవేదిత్వమున్
జయశీలత్వము గల్గు సైన్యపతి రాజప్రీతిపాత్రం బగున్. 402

సీ. మహిమ లేకుండిన మన్మథపరుఁడైనఁ
గ్రొవ్వినఁ బనిలేక కోపి యైన
నుచిత మెఱుంగకయున్న నిస్పృహుఁ డయ్యుఁ
బరుసగా భృత్యుల బలుకునేని
మృగయాదిసక్తుఁడై మెలఁగిన నాజన్మ
హీనుఁడై మాఱు సహింపకున్న
మొనలు దీర్పఁగ వాని ముంగలి నడిపింప
నేరఁడేఁ దనయిచ్చ నిగుడఁడేని
ఆ. నదను నెఱుఁగఁడేని నట్టి సేనాపతి
కొని జయంబుకలనఁ గొందు ననుచుఁ
గుక్కతోఁకఁ బట్టుకొని మహాంబుధి
దాఁటఁ దలఁచినట్ల కాదె ధరణిపతికి. 403

నీతిసారము

క. నీవల సద్బక్తిస్నే
హావేశము గలిగి శూరుఁ డై యలజడికిం
దా విసువనిసత్కులజున్
గావింపుము సైన్యవిభునిఁగాఁ గురుముఖ్యా. 404

ధృతరాష్ట్రనీతి



క. అతిమహిమోన్నతియును సం
పతియును జేయునది యర్థభారనియోగ
స్థితియును దంత్రము మంత్రిని
బతిఁజేయుట బుద్ధిగాదు బద్దెనరేంద్రా. 405

బద్దెననీతి

రాజభృత్యనీతులు

మ. ధరణీనాథులు లేని భృత్యులును భృత్యశ్రేణియున్ లేని భూ
వరులున్ (నేర్తురె లోకయాత్రఁ గడపన్ వా రొండొరుం గూడి య)
చ్చెరువై దేహముఁ బ్రాణమున్ రవియు రోచిఃశ్రేణులున్ శబ్దమున్
సరసార్థంబునుబోలె నొండొకటితో సంబంధమై యొప్పెడున్. 406

క. కులమును శక్తియు భక్తియుఁ
గల భృత్యుని మనసు దగదు కందింపం శుభం
బొలయఁగఁ దలఁచిన యాతని
బలుమఱు పోషింపవలయుఁ బతి సుతుఁబోలెన్. 407

క. మానవపతి మెచ్చిన స
న్మానము నొనరించుఁ గొంత మఱి భటుఁ డా స
న్మానమున బ్రాణ మిచ్చున్
గాన నృపాలునకు నీతి ఘనుల ఘటింపన్. 408

క. చెన్నెసలారఁగ భృత్యుని
మన్నించెడివాఁడె ఘనుఁడు మనుజేశులలో
నెన్నఁడుఁ దగ మన్నించెడు
నన్నరపతిఁ బాయ రీవి యల్పం బైనన్. 409

క. సర్వోపాయములను రిపు
గర్వ మడంపంగ భటులు గాల్గొనకుండన్
బర్వెడికడఁక మనిపెడు
నుర్వీశుఁడు వారిఁ బ్రోవకుండుట గలదే. 410

అజ్ఞాతము



క. తన్నని నమ్మినఁ బ్రోవక
పొన్నాకులమీఁదఁ దేనెఁ బూసిన భంగిన్
నున్ననిమాటలయన్నల
మన్నన లేమందు మబ్బమంత్రియకందా. 411

నీతితారావళి

క. తమతమ కనియెడుతరి జీ
తము గానక నవయుభటుల దౌర్గత్యవిషా
దము లేలినవాని కవ
శ్యము నెగ్గొనరించు నతఁడు శత్రుం డైనన్. 412

సభాపర్వము



చ. నవసినవారిఁ బ్రస్తవమున స్మృతిఁ బొందినవారివారి నా
హవముఖవీరులన్ బనులయందుఁ బ్రగల్భుల వేఱులేనిబాం
ధవుల నయజ్ఞులన్ బుధులఁ దప్పనికాపుల శక్తియుక్తులన్
ధ్రువముగఁ బ్రోవలేని నృపతుల్ కుపతుల్ పరపక్షవైభవా. 413

క. నుడివినజీతం బెప్పుడుఁ
గడపక తాఁ బెట్టునృపుఁడు గా నొకచక్కిన్
గడు వర్జించిననైనను
విడువరు సద్భృత్యు లెపుడు విసువరు కొలువన్. 414

క. భూపతి విరక్తుఁడైనను
నాపత్కాలమున విడుచు టవినీతి యగున్
ఆపద పైకొనునయ్యెడ
నోపి విడువకుండునాతఁ డుత్తముఁ డరయన్. 415

బద్దెననీతి



ఆ. ఉర్విపతులవలన నొకయుపద్రవ మైన
నపుడు పెట్టకున్న నైన భటులు
తగిలి తన్మహీశుఁ దమ జీవనంబుల
హానిఁ గోరి కెలుచు రనుదినంబు. 416

ఉ. ఏపునఁ గూడి పూర్వమున నేలినవానినయొండెఁ దక్కొరున్
భూపతిఁ జేయుటొండెఁ దలపోతురు రాజులనొండె నొండొరున్
బ్రాపుగఁ జేసి రాఁదలఁచి ప్రాణము లీ వడిఁ గారణంబుగా
రాపొనరింపఁగాఁ దగదు రాజు భటావళి నెల్లకాలమున్. 417

చ. అఱమి రణంబునం బడిన యాతని సంతతిఁ బ్రోవఁడేని చే
కుఱు నట జీవితంబు గొని ఘోరరణంబున నోడి వచ్చినన్
బఱవకయుండె నేని జనపాలుని దిక్కున నంత వేడ్కయున్
వెఱవును జెడ్డ బ్రాణములు వెఱ్ఱులె యీ ననిలోన సేవకుల్. 418

క. ఏలిక పనిచినఁ గీడౌ
మే లౌ నది భటుఁడు సేయ మెయికొనఁ డేనిన్
వాలాయము విడువనె తగు
నాలరి యగు భటునిఁ దలఁప నయ్యేలికకున్. 419

పంచతంత్రి

క. తన కెన్నఁ డుండియును ద
క్కనిభృత్యులఁ బెరుగ మనుపఁగాఁ జనదు ప్రయో
జనమునకుఁ దగినవెల యి
చ్చునది నరేశ్వరుఁడు నన్నిచోడనరేంద్రా 420

క. మనుపఁగొరయేని జీతము
దనియఁగ నిచ్చునది యెంతదయ గల్గిన నే
రనివాని నెఱతనమునకుఁ
జొనుపుట దుర్నయము నన్నిచోడనరేంద్రా. 421

బద్దెననీతి



క. ఎవ్వని ప్రసాదమున సుఖ
మెవ్వనికిం గలియుండు నెల్లప్పుడుఁ దా
నవ్విభునికొఱకు మృతుఁడగు
టెవ్విధమునఁ బుణ్యలోకహితము దలంపన్. 422

ముద్రామాత్యము



క. పుడమిపతిచేత జీతము
కుడిచిన ఋణమెల్ల నీఁగికొనఁ దనయంతన్
జెడనున్న ప్రాణ మనిలో
విడువక పోనాడు భటుఁడు వేదురు గాఁడే. 423

క. నుతులకుఁ దలప్రాపుగ భూ
పతి ఋణమునఁ బోయి తెవులఁ బడి చచ్చి యధో
గతి దొఱఁగుకంటె భటునకు
శతమఖుపురిఁ జూఱగొనుటఁ జావని నరుఁడే. 424

పురుషార్థసారము



ఆ. అఖిలసంపదలకు నావాసముగఁ జేసి
నట్టిదాత కొడరు పుట్టినపుడు
దరణి నేభటుండు తనప్రాణములు దాఁచు
నతఁడు నరకమునకు నరుగు వేగ. 425

పంచతంత్రి



క. కులభృత్యులైన సద్భృ
త్యులకును సత్కారమర్థితోఁ జేయుదె వా
రలు నీప్రస్తవమున ని
మ్ములఁ గృత్యము దలఁచి ప్రాణములు విడుతురనిన్. 426

క. అనఘా నీప్రస్తవమున
నని నీల్గిన వీరభటుల యనుఁగుజనుల నె
ల్లను బ్రోతె భోజనాచ్ఛా
దనముల వారలకు నెమ్మిఁ దఱుగకయుండన్. 427

క. జనపతి ప్రాణము లిచ్చినఁ
జనువారలఁ బ్రోవకున్న సత్యము పాపం
బునఁ బొరయు వారిఁ బ్రోచిన
తనవారిని బ్రోచు మీఁద దైవము గరుణన్. 428

గీ. ప్రాణ మిచ్చియు రణమున బ్రతికెనేని
నతని రక్షించుఁ దనకొఱకైన రాజు
శూరవృత్తిని మోక్షంబు సూఱగొన్న
వారివారలఁ బ్రోవంగవలయుఁ గాని. 429

సభాపర్వము


ఆ. యోగులకును లేదు యాగముల్ సేసిన
వారలకును లేదు వసుధమీఁదఁ
బతికి హితవు గాఁగఁ బ్రాణంబు విడనోపు
నలఘుసేవకులకుఁ గలుగు సుగతి. 430

క. దురమునఁ జచ్చినఁ జయ్యనఁ
బరమందుం బ్రతికెనేని బహుసుఖకీర్తుల్
దొరకును గావున రెండును
నరుదులు సిద్ధించు శూరు లగువారలకున్. 431

క. కడునభ్యంతరవర్తిం
బుడమీశుకుఁ గాఁగఁ ప్రాణములు విడిచిన నీ
క్కడ నురుతరకీర్తియు న
క్కడ మఱి సాయుజంయపదము గల్గు ధ్రువంబై. 432

ఆ. కోరి తనధనంబుకొఱకును విప్రుల
కొఱకు సతులకొఱకు గోగణంబు
కొఱకు నని యొనర్చి నెఱయు నెవ్వఁడు ప్రాణ
మిచ్చు నతఁడు ముక్తి కీశ్వరుండు. 433

క. తనయేలిక కగు చుట్టము
తనచుట్టను తననిజేశుదాయయ మిగులన్
దనదాయయు ననుతలఁపున
మను నెవ్వఁడు వాఁడు ప్రియుఁడు మనుజేశునకున్. 434

చ. చెలువుగ దుష్కరంపుఁబని చేసితి నొక్కెడ నాక క్రూరతన్
బలుమఱుఁ జేసిన న్గడవఁబల్కిన నుల్లములోన నొండుగాఁ
దలఁపక పల్కు టొప్పిదము తథ్యముగాఁ దగఁ బల్కి లోపలం
బిలువక వచ్చియున్నతఁడు భృత్యుఁడు రాజున కెన్నిభంగులన్. 435

క. మానవనాథున కగు భయ
హానులు మదిఁ దానె యెఱిఁగి యతిరభసమునన్
వానికి నెవ్వం డడ్డము
నై నిలిచినవాఁడు మాన్యుఁడగు రాజునకున్. 436

ఆ. అన్యదేశ మెల్ల నాత్మదేశంబ కాఁ
దలఁచువాఁడు నెపుడు దలఁకు లేక
రణము సేఁత యెల్లరాజ్యంబుసేఁతగాఁ
దలఁచువాఁడుఁ బ్రియుఁడు ధరణిపునకు. 437

క. మానుగఁ బతి వనిచినఁ దను
చే నిది గా దనక వేగఁ జేకొని యనలం
బైనఁ జొరవలయు నంబుధి
యైనను నీఁదంగవలయు నర్థిన భృత్యుల్. 438

పంచతంత్రి



క. దూరమున వెరవు గదిసిన
దారి నిలుచువారి నృపతి దగు మన్నింపన్
దూరమున బిఱుదు గదిసినఁ
దా రచ్చట లేనివారిఁ దగు వర్ణింపన్. 439

నీతిభూషణము



క. ఏయేలిక సేవింపఁగ
బాయక యేభృత్యులకును బహుదుఃఖము కా
నాయేలిక దూరమునన
నాయతమతి విడువవలయు నాభృత్యులకున్. 440

క. ధనవంతుఁడు సత్కులజుఁడు
ననుపమతరవిక్రముండు నైనను ధరలో
ననభిజ్ఞుఁడైన భూపతి
ననుమానము లేదు విడుతు రరయఁగ భృత్యుల్. 441

క. వలచేయును డాచేయును
బొలుపుగ రత్నంబు గాజుపూసయు సరిగాఁ
దలఁచు నృపు నొద్ద నుండినఁ
జులుకన యగుఁ దప్ప దెంతశూరుండైనన్. 442

పంచతంత్రి



క. పతి కీడైనను భృత్యుఁడు
పతిహితుఁడై యుండవలయు బ్రతుకఁగరా కా
పతిఁ బాసి చనిన వేఱొక
పతియైనను బ్రోచుఁ దొంటిపతిహితుఁడనుచున్. 443

పురుషార్థసారము

భృత్యులకుఁ గొఱగాని రాజుల లక్షణము

క. అకుటిలు లగు తనభృత్యుల
కొకయాపద ముట్టినప్పు డుడుపక యేయే
లిక యూరకుండు నాయే
లిక ముక్తికి మిగుల నెడ గలిగియుండుఁ దుదిన్. 444

క. పలికిన జీతముఁ గెడపిన
బలవంతునినైన విడుచుఁ బరివారము దాఁ
బొలు పెఱుఁగని యేలిక నిల
ఫలహీనకుజంబు విడుచు పక్షులఁబోలెన్. 445

పంచతంత్రి



క. దొర వడయవలయునొండెను
సిరి వడయఁగవలయు నృపతిచే భృత్యులకున్
దొరయును సిరియును వెలిగా
నరపతులను గొల్చు టేల నయతత్త్వనిధీ.446

క. కోపప్రసాదములలోఁ
గోపమె చూపుచుఁ బ్రసాదగుణ మెయ్యెడలన్
జూపని నరపతిఁ గొల్చిన
పాపమునకు మేర యెద్ది బద్దెనరేంద్రా. 447

ఉ. జీవిత మీఁడు ము న్గడవఁజేసినవృత్తి క్రమక్రమంబునన్
బోవఁగఁజూచుఁ దేజమునఁ బుట్టెడు లాభము దప్పఁజేయు స
ద్భావము బొంకుగా వగచుఁ బాయక నేరమె రోయుఁగావునన్
సేవకులన్ విరక్తనృపుసేవ విపజ్జలరాశి ముంపదే. 448

బద్దెననీతి



ఆ. వల్లకాట నిడినవానికిఁ జెప్పెడి
వారు గలరె యెంతవారికైన
నట్ల పెట్టలేని యవనిపాలకునొద్దఁ
బట్టియుండ రెపుడు పరిజనములు. 449

పంచతంత్రి

రాజులకుఁ గొఱగాని భృత్యులు

చ. ఒకరునిచేతఁ బ్రోపును దదున్నతిఁబ్రాపును గాంచి యెల్లవెం
టకును గొఱంత లేక పొగడందగు సంపద నొందునట్టి దా
తకు మదిఁ గీడుచేసినకృతఘ్నునిపీనుఁగునైన రోఁత వె
ట్టక కబళింపఁ గుక్కలు నొడంబడునే కురువంశవర్ధనా. 450

ఉ. ధీరత దక్కి భీతిఁబడి దీఱమి నిల్పక పాఱి పాఱి వీ
రారులచేతఁ జచ్చినభటాధము లేలినవానిదుష్కృతం
బారఁఘ నంతయున్ గుడుచునాతఁడు చేసినపుణ్యమంతయున్
జేరుఁ దదీయభర్తకని చెప్పుదు రుత్తమధర్మకోవిదుల్. 451

విదురనీతి



ఆ. ఆయుధముల నెపుడు నలజడిఁ బెట్టక
చిత్రకథలు కొన్ని చెప్పికొనుచు
నుండు భటులు గలుగు నుర్వీశ్వరులలక్ష్ము
లహితు లనుభవింతు రండ్రు బుధులు. 452

పంచతంత్రి



క. తను నమ్మి వైరిమీఁదం
జన వానికిఁ బ్రాణ మీక చనుటయు ద్రోహం
బని రిపునిఁ గూడెనేనియుఁ
జనునే యుద్దండ మైన జనపతి దానిన్. 453

నీతిసారము

క. కలిమియును భూరిబలమును
గలయంతకు భటుఁడు భటుఁడు గాఁడు దలంపన్
గలిమియును భూరిబలమును
గలిగిన మఱి భటుఁడు భటుఁడు గాఁ డేపతికిన్. 454

పంచతంత్రి

సేవకనీతులు

క. ధరణీసురవరులకు నృప
వరులకు వైశ్యులకు నాత్మవర్తనములకున్
బరిచరులు లేక నడవమి
సరసిజసంభవుఁడు శూద్రజాతి సృజించెన్. 455

క. అతులితవిద్వజ్జనులకు
వితరణశీలురకు విశ్వవిక్రమసేవా
గతులకు రాజులు దక్కఁగ
మతిఁ దలపఁగ నొరులు దిక్కు మఱి కలుగుదురే. 456

క. మనుజపతి దేవతామయుఁ
డని మనువాక్యంబు గాన యారీతిన కాఁ
గొనవలయు నతని నొండుగ
మనంబునం జూడవలదు మతిమంతులకున్. 457

క. దేవాంశోద్భవుఁ డగునర
దేవోత్తము మర్త్యుఁ డని మదిం దలఁపక స
ద్భావమున నీశ్వరుండని
భావింపఁగవలయు నరులు బాలుని నైనన్. 458

పురుషార్థసారము



క. అవనీశుల వేల్పులలో
నవనిపులు విశేష మతిశుభాశుభములు దా
నవనిపు లిప్పుడ సూపుదు
రవి వేల్పులు సూపఁజాల రాజన్మమునన్. 459

క. కడుహితులకు నహితులకును
వడిమేలును గీడుఁ జేయవలసినవారల్
పుడమిపులఁ గొలువవలయును
గడు పెవ్వడుఁ బ్రోచుకొనఁడె కరటక చెపుమా. 460

పంచతంత్రి



క. తక్కి నయాత్ముఁడు గలఁడే
యెక్కుడుగా నెత్తి పలికి హిత మెఱిఁగింపన్
జెక్కిలి మీటుట కూరిమి
తక్కుటయే పాలు పోయు తఱి బాలునకున్. 461

క. స్థిరమతి నెప్పుడు నిజమం
దిరమునఁ దద్ద్వారమునను దెల్లముగా సం
గరముననుం గ్రమ్మున నే
నరుఁడుండు నతండు ప్రియుఁడు నరనాథునకున్. 462

నీతిభూషణము



క. జూదమును బన్నిదంబును
వాదును బతితోడ నాడవలవదు కడుఁ బో
రాదయ్యెనేని భృత్యులు
భేదము గాకుండ గెలుపు పెం పీవలయున్. 463

నీతిసారము



క. మొగ మలరఁ జూచిరమ్మను
టగుఁబొమ్మని మాటవినుట యడిగిన కార్యం
బొగిఁ జేయుట పనిఁబంచుట
జగదీశ్వరుకూర్మికిని నిజం బగు చేష్టల్. 464

సీ. పొడగనునంత నప్పుడ ప్రసన్నుం డగుఁ
దనుఁ జేరఁ బిలుచు నాసనము నిచ్చు
క్షేమప్రసంగంబుఁ బ్రేమమై నడుగుఁ ద
ద్వాక్యంబు వినుచు ముదంబు బొందు
విజనస్థలంబున నిజరహస్యంబులు
గొంకఁ డొక్కింతయు శంకపడఁడు
ఆతఁడు సెప్పుచో నతనిఁ జెప్పినచోట
నాకర్ణనముఁ జేయు నాదరమున
గీ. వినుతిపాత్రులలోపల వినుతిఁ జేయు
నతని వినుతింప మెచ్చఁ గథాంతరముల
దలముగాఁ దద్గుణములు కీర్తనము సేయుఁ
జాల ననురక్తుఁ డైనట్టి జనవిభుండు. 465

పురుషార్థసారము



క. వచ్చినఁ జూడమి దగ్గఱ
వచ్చిన నొడఁబడమి తోడ వచ్చిన నొరుతో
జెచ్చెరఁ బలుకుట పతిఁ దా
మెచ్చమియును భృత్యునొల్లమికి లక్షణముల్. 466

చాటువు


క. దుర్వేషియు నకులీనుఁడు
గర్వియుఁ గడుదుర్జనాగ్రగణ్యుం డైనన్
సర్వత్ర వాఁడు పూజ్యుఁడె
యుర్వీశ్వరు మిగులఁ జేరి యుండినఁ జాలున్. 467

క. శ్రీయుతు లగు నరనాథులఁ
బాయక సేవింపకుండు పాపాత్ములకున్
వేయేల తిరియఁజేఁతయె
ప్రాయశ్చిత్తంబు సుమ్ము పరికింపంగన్. 468

క. వెలిగొడుగులు చామరములు
బలువాజులు నందలములు భద్రేభంబుల్
వెలసిన భూనాథుని కృప
గలవారికిఁ గాక యెందుఁ గలవే ధరణిన్. 469

క. బలుగొఱడువోలె నెండకుఁ
జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం
డలవడఁ గొలుచును వానికి
వలనొప్పఁగ సిరులు దాన వచ్చి వసించున్. 470

ఆ. మాన్యతయును గడు నమాన్యతయును మఱి
సరియె కాఁ దలంచు నరులు పిదప
నుగ్రమూర్తు లైన యుర్వీశ్వరులకును
మిగులఁ దారె మాన్యు లగుదు రెపుడు. 471

క. క్షితిపతికి మిగులఁ బ్రియులును
హితులును నగువారి నాశ్రయింపఁగవలయున్
సతతము వారల యాజ్ఞకు
నతిఁ గడవక యుండవలయు నతిమతిమంతుల్. 472

క. ఘనసేవకయుతులకు నఘ
మును పుణ్యములును విశేషములు గానివి దాఁ
గొనుఁగొన భూశయలఘుభో
జనముఁ గృశత్వంబు బ్రహ్మచర్యము సమముల్. 473

ఆ. సేవకుండు గోరి సిగ్గఱి వ్యాధిక
ష్టములు ధనముకొఱకు సంతతంబు
నధిపు నొద్దఁ బడిన యట్ల ధర్మమునకుఁ
బడియెనేని సుగతిఁ బడయరాదె. 474

క. సురచిరగుణవంతుం డగు
ధరణీశుఁడు పేదయైనఁ దగు సేవింపన్
నెరయఁగ నొకానొకప్పటి
కరుదుగ మేలొందుఁగాన నాయనవలనన్. 475

క. వలయుపను లెఱిఁగి చేయుచుఁ
బలికినఁ బని యేమి యనుచుఁ బాయక నీతిన్
గొలువఁగ నేర్చిన యాతఁడె
తలపోయఁగ మిగులఁ బ్రియుఁడు ధరణీశునకున్. 476

క. మన సెఱిఁగి నడవనేర్చిన
మనుజశను లైన మాటమాత్రములోనన్
దనవశ్యు లగుదు రనినను
మనుజేశ్వరుఁ డనఁగ నెంత మది నూహింపన్. 477

పంచతంత్రి

క. సకలగుణరత్నభాషా
ప్రకటితుఁడై యర్థశౌచపరుఁడై భూపా
లకు మనమున విశ్వాసము
వికసిల్లెడు నట్ల సేవ వెసఁ జేయఁ దగున్. 478

కామందకము



క. జనపతి కృపఁ బడసిన ధన
మనయము దగువ్యయము చేసి యంచితవస్త్రా
ద్యనుపమవస్తువు లొసఁగిన
మన మలర ధరించినతఁడు మాన్యతఁ బొందున్. 479

పంచతంత్రి



చ. ధరణిపుచక్కఁగట్టెదురఁ దక్కి పిఱుందును గానయట్లు గా
నిరుగెలనం దగం గొలిచి యే మనునో యెటు సూచునొక్కొ యె
వ్వరిదెస నెప్పు డేతలఁపు వచ్చునొ యీతని కంచుఁ జూడ్కి సు
స్ధిరముగఁ దన్ముఖంబునన సేర్చుచునుండుట నీతి కొల్వునన్. 480

క. నగళులలోపలిమాటలు
తగునే వెలి నుగ్గడింపఁ దమ కేర్పడ నొం
డుగడం బుట్టినపని విన
నగుపని సెప్పెడిదిగాక యాతనితోడన్. 481

క. తా నెంతయాప్తుఁడైన మ
హీనాయకుసొమ్ము పామునెమ్ములుగా లో
నూనినభయమునఁ బొరయక
మానినఁగా కేల గల్గు మానము సిరియున్. 482

ఆ. ఆవులింత తుమ్ము హాస్యంబు నిష్ఠీవ
నంబు గుప్తవర్తనములు గాఁగ
నిలుపవలయు నృపతి గొలువున్నయెడల బా
హిరములైనఁ గెలని కెగ్గు పుట్టు. 483

ధౌమ్యనీతి



ఆ. ద్యూతమెల్ల జముని దూతయుగా ధనం
బెల్ల హాలాహలము, నింతు లెల్ల
ఘోరతరములైన కారాగృహములుగఁ
దలచు నతఁడు ప్రియుఁడు ధరణిపునకు. 484

పంచతంత్రి



క. పతిచీర లట్టి చీరలు
పతితొడవులఁ బోలుతొడవు పతిగతివేష
స్థితియును సేవకులకుఁ దగ
దతిధనయుతు లైన ననుఁగు లైనను సభలోన్. 485

నీతిసారము



క. కలిమికి భోగములకుఁ దా
ఫల మని తను మెఱసి బట్టబయలుగఁ దా వి
చ్చలవిడి భోగింపగ వే
డ్కలు సలుపఁగవలయు భటుఁ డడంకువతోడన్. 486

ధౌమ్యనీతి

క. చనువాఁడు సేయుకార్యం
బున కడ్డము సొచ్చి నేరుపున మెలఁగుచుఁ దా
నును బైఁ బూసికొనుటదన
మును మెలఁగెడు మెలఁకువకును ము ప్పగుఁ బిదపన్. 487

ఆ. రాజు పెద్ద పలువురకు సంకటంబుగాఁ
దెఱఁగుపనుల కెంత తేజ మైన
వారు బుద్ధిగలుగవా రొల్లరని మీఁదఁ
జేటువచ్చు టెల్ల సిద్ధ మగుట. 488

ఆ. ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం
బులును దమకుఁ గరుణ భూమిపాలుఁ
డీక తార యెక్కు టెంతటి మంత్రియుఁ
గలుగువారికైనఁ గార్య మగునె. 489

ధృతరాష్ట్రనీతి



ఆ. కామధేను వనఁగఁ గల్పవృక్షం బన
నెసఁగు రాజు దనకు నొసఁగఁడేని
తనయదృష్ట మనుట దగుఁగాక యాతని
దూఱఁ గలదె సేవ మీఱి యైన. 490
నీతిసారము

సేవకుఁ గొఱగాని రాజులు

క. పొసఁగిన సేవకు నెఱుఁగని
వసుధేశ్వరుఁ డెంత దొడ్డవాఁ డైన నొగిన్
గుసుమఫలభరిత మైనను
వెస జిల్లెడు విడిచినట్ల విడువఁగ వలయున్. 491

క. సేవ యెఱుంగని రాజును
సేవింపరు బుధులు గాక సేవించినఁ ద
త్సేవ యది చౌటఁ బెట్టిన
యావిత్తునుబోలె వ్యర్థమై చెడిపోవున్. 492

క. ఇల నవివేకనృపాలునిఁ
జెలు వందగఁ గోరి సేవ సేయుట లెల్లన్
దలపోయఁ జౌటినేలను
విలసిల్లిన బీజ మిడిన విధము దలంపన్. 493

ఆ. భైక్షమైన మేలు భారోపజీవితం
బైన మేలు కానలోన నుండు
టైన మేలు గాని యవివేకనృపుఁ గొల్చి
పొరయులక్ష్ము లొప్ప వరసి చూడ. 494

పంచతంత్రి

చ. పలుకుల బెట్టిదంబులకుఁ బ్రాప్త మెఱుంగమి కెంత డస్సినన్
దలఁపమి కిచ్చి తప్పుట కుదారపువృత్తికి శౌర్యశక్తిభ
క్తులకు మనంబులోనఁ బరితోషముఁ బొందకయున్కి కాత్మలో
నలసి పరిత్యజింతు రెడ కా నెడ నేలినవాని సేవకుల్. 495

పురుషార్థసారము



క. కెలసము చేసియు నవసినఁ
గొలిచిన కొద వట్ల యీని కువలయపతులన్
గొలు వేటి కుత్తరోత్తర
ఫలసారమె రాజసేవ బద్దెనరేంద్రా. 496

బద్దెననీతి



చ. ఇల వ్యసనుండు క్షుద్రుఁడును నెంతయు మూర్ఖుఁడు నైనయట్టి భూ
తలపతిఁ జేరఁగూడ దది తప్పగుఁ దొల్లియు నిట్టిరాజు నిం
పలరఁగ సేవఁ జేసికొని న్యాయము నాసపడంగఁ బోవుచున్
బెలుచన నేరమిన్ శకడి భృత్యువులందఱుఁ జేటు నొందరే. 497

క. విను సర్వభక్షుఁడగు వి
ప్రుని ననుకూలతయుఁ గాని పొలఁతిని మిగులం
దన కెనయని సఖు లెల్లం
దును గరుణయె చేయు నృపునిఁ దొఱఁగఁగవలయున్. 498

పంచతంత్రి



క. నేరమి దొడరిన నలుగఁగ
నేరకయుండెడి విరక్తనృపతుల కొలువుల్
దూరస్థులు గాకుండెడి
వారలు దుర్మతు లుదారవైరోచనుఁడా. 499

బద్దెననీతి



ఆ. ఎట్టిభృత్యుఁడైన నేలిక కించుక
తప్పు సేసెనేని తలఁప మద్య
బిందుమాత్రమునన పెరుగు బ్రాహ్మణ్యంబు
సెడినయట్ల వాఁడు సెడుట నిజము. 500

పంచతంత్రి



ఉ. జీతము లూదికొండ్రు పతిచిత్తము గూడరు వారు స్వేచ్ఛులై
భూతలనాథు వీ డురిలిపోవఁగఁ డూతురు పోవకుండినన్

వేతురు విగ్రహవ్యసనవృత్తి భయస్థులు గారు గాన సం
ఘాతసమర్థులై మనుమగల్ ప్రతిపక్షులు గాక భృత్యులే. 501

బద్దెననీతి



క. ఏమ కరిఁ గుడిసి పెంచితి
మే మెఱిఁగింపంగ విద్య యెఱిఁగె నజస్రం
బే మక్కడ నుందుము మా
కేమని యేమఱినఁ జంపు నేనుఁగుఁ బతినేన్. 502

పురుషార్థసారము



క. ఏ నతనికి మాన్యుఁడ నని
భూనాథుని కరుణ నమ్మి పొంగి భటుఁడు సే
వానియతి వదలు టొప్పదు
నానాటికిఁ గ్రొత్తమన్ననలు నృపతులకున్. 503

నీతిభూషణము



క. నైజగుణం బగుతమమది
రాజస మప్పటికిఁ గప్పి ప్రజతో నయ్యై
యోదం బరికింపకయా
రాజులు సాధు లని నమ్మరా దెప్పటికిన్. 504

కేయూరబాహుచరిత్రము



క. జనపతికి నేను మాన్యుఁడ
నని యెవ్వఁ డహంకరించు నాతఁడు లోక
మ్మునఁ జరణంబులు రెండై
వినుము విషాణములు లేని వృషభముఁ బోలున్. 505

చ. ఇల గుణహీను లెంతయు మహీశుసమీపగు లైనవారు ని
ర్మలగుణయుక్తులం గని యమాన్యత సేయుదు రేల వారు వా
రలయెదుర న్వెలింగెడి తరంబులు గామిని గాన నేల రా
త్రులవలె మించు నే మిగులఁ దోయజబంధునిమ్రోల దీపముల్. 506

గీ. సేవకాళి యన్యసేవకులను రాజు
చాలఁ బెద్దసేఁత సైపఁజాల
రరయ నొక్కమగనియాండ్రు దా రయ్యును
సవఁతి జూచి సవతి సైపఁగలదె. 507

క. తనపదము ద్రోప నెవ్వఁడు
గొను నాతఁడు తనకు నిపుడు గొనకొని వారిం
దునుమాడుఁ దనకుఁ జయ్యన
నెనయనివాఁ డెంత దనకు హితుఁడై యున్నన్. 508

క. అరయఁగ జీవన్మృతు లే
గురు నిర్ధనికుండు నరసికుఁడు మూర్ఖుఁడు భూ
వరసేవకుఁడు ప్రవాసియుఁ
బరఁగుఁ బరాశరతనూజు పలు కిది ధరణిన్. 509

క. రాజాధికారపురుషుని
పై జయముండునటె మృత్యుపాశము లుండున్
నైజమునఁ బట్టి పలు కే
యోజమెయిం జెప్పమతియె యోగ్యుం డైనన్. 510

పంచతంత్రి



క. తమబ్రతుకు తమకుఁ గడువిర
సము చింతకుఁ బొత్తు మానసంబు పరాధీ
నము లైశ్వర్యంబులు స
ర్వము సేవకు లెవ్వ రరయ వారల కెల్లన్. 511

పంచతంత్రి

షోడశసంధిప్రకారము

సీ. ఒనరఁ గపాలంబు నుపహారసంధియు
సంతానసంధియు సంగతంబుఁ
జాల నుపన్యాససంధియుఁ బ్రతికార
సంధియు సంయోగసంధితంబు
బురుషాంతరాదృష్టనరనామకమ్ములు
నాదిష్టకంబు నాత్మామిషంబు
పరిక్రయవిగ్రహబంధురోపగ్రహ
సంధులు నుచ్ఛిన్నసంధికంబు
ఆ. ననుపమపరదూషణాంచితస్కంధోప
నేయసంధు లనఁగ నిశ్చితముగ
షోడషప్రకారసునిశితసంధివి
ధాన మెఱుఁగవలయు ధరణిపునకు. 512

గీ. బలిమి సమసంధియైనఁ గపాలసంధి
యర్థదానముచే నుపహారసంధి
దారికాదాన మీగి సంతానసంధి
చాలమైత్రిపూర్వక మది సంగడంబు. 513

పంచతంత్రి



గీ. అరయ నేకార్థముగ నుపన్యాసచతురు
లమరఁ గూర్చినయది యుపన్యాససంధి
కడఁగి యుపకర్తప్రత్యుపకారకాంక్షఁ
గలసి మెదలుట యది ప్రతీకారసంధి. 514

గీ. అతని కుపకార మొనరించి యతనిచేతఁ
గొరలి ప్రత్యుపకారంబు గొనఁగవలయు
ననుచు రాముఁడు సుగ్రీవు నాప్తుఁ జేయు
కరణిఁ గలయుట యది ప్రతీకారసంధి. 515

క. ఇరువురుఁ గూడి యొకనిపై
నరుగుట సంయోగసంధి యగుఁ బణపూర్వం
బిరువురు యోధులఁ బంపుట
బురుషాంతరసంధి యనఁగ బుధమతమయ్యెన్. 516

క. అరిమీఁదఁ బనుపుతలఁపునఁ
దిరముగ సంధి యగునది యదృష్టనరాఖ్యం
బరయఁగ నాదిష్టం బగుఁ
బరునకు భూమైక్యదేశపణ మిచ్చుటయున్. 517

సీ. ఆత్మసైన్యముచేత నరితోడ సంధాన
మాత్మామిషం బన నతిశయిల్లుఁ
బ్రాకారరక్షార్థమై యఖిలం బైన
విత్తంబు నిచ్చుట విగ్రహంబు
యఖిలప్రకృతిరక్షణార్థమై యర్థ
ప్రకృతి నిచ్చునది పరిక్రీణసంధి
సారభూములు గొన్ని వైరిభూపతి కిచ్చి
చేసిన నదియ యుచ్ఛిన్నసంధి
గీ. సర్వభూమిఫలంబును శత్రువునకుఁ
దోరముగ నిచ్చునది పరదూషణంబు
మితు లొనర్చి ధనం బిడ మతిఁ దలంచి
చేయునది పునఃస్కంధోపనేయసంధి. 518

క. ఇతరేతరోపకారము
సతతోదితమైత్రి సంధిసంబంధజముల్
చతురత నుపహారము నీ
చతుర్విధమునందు స్రవసంధులు నయ్యెన్. 519

క. ఖలుఁడును నిర్మర్యాదుఁడు
బలవంతులు నైన రిపునృపాలురతో ని
య్యిల సంధివిగ్రహము లని
యలవడ వేవేలునైన యానమతక్కన్. 520

క. ఘనబలుఁడు పాపకర్ముఁడు
ననఁబడు రిపుసంధివిగ్రహంబుల యెడలన్
గనద్వైతీభావము గై
కొని యుండఁగవలయుఁ బగఱకును నయ్యెడలన్. 521

గీ. తాపఖండనంబుల వికృతంబు గాక
నదృశ్యకార్యార్థ మదియ యసహ్యవేళ
కాంచనమపోలె నెన్నండు గలసియునికి
సంగతాఖ్యము కాంచనసంధియయ్యె. 522

ఉ. చాల బలాద్యయోగ మది సంధి యశంబొకొ పూర్వకక్రియన్
మేలగుఁ గాన సంగతము మిత్రము దా నవి శూన్య మైననుం
బోలగుసంధి నా వితరము లగు నాయుపహారసంధి భే
దాలియకారసంధి కుపహారము యెక్కటి సంగతం బగున్. 523

క. ఎత్తి చను నృపతి రిపుచే
విత్తముఁ గప్పంబు గొనక వెనుకకు మగుడం
డిత్తరి సంధికి దానం
బుత్తమ మట్లగుట సంధి యుపహార మగున్. 524

వ. అసంధిదేహస్వరూపం బెట్టి దనిన.

సీ. బాలుండు వృద్ధుండు పటుదీర్ఘరోగియు
నిల నిజజ్ఞాతిబహిష్కృతుండు
భీరుకుండును కడు భీరుజనుండును
లుబ్ధుండు మఱియును లుబ్ధజనుఁడు
సతతవిరక్తప్రకృతి యైన నృపతియు
విషయరసాసక్త విరళమతియు
మఱియును బహుచిత్తమంత్రుండు దేవతా
బ్రాహ్మణనిందాపరాయణుండు
గీ. దైవహతకుండు దైవచింతనపరుండు
వ్యసనదుర్భిక్షకుఁడు బలవ్యసనపరుఁడు
లలి నదేశస్థబహుశాత్రవులును గాల
యుక్తుఁడును సత్యధర్మవియుక్తమతియు. 526

క. ఈయిరుపదువురతోడన్
బాయక విగ్రహము సేసి పైకొనుటయు వా
రేయెడ మార్కొనక బల
శ్రీ యఱి వశవర్తులగుచు సిరి యిత్తు రిలన్. 527

వ. అది యెట్లనిన. 528

గీ. బాలుఁ డరయ నప్రభావుండు గావున
యుద్ధములకు బలము లోహటించి
తనకు శక్తి లేక తక్కిన నితనికై
పూని యితరుఁ డేల పోల నిచ్చు. 529

క. వృద్ధుఁడు దీర్ఘామయుఁడు స
మిద్ధోత్సాహంబు లేమి మేకొని యరితో
యుద్ధంబున కసమర్థులు
సిద్ధము నిజజనులతోడఁ జెడుదురు పెలుచన్. 530

క. మతిసకలజ్ఞాతిబహి
ష్కృతుని నిజజ్ఞాతులకు విశేషప్రణయాం
చితకృత్యము లొనరించినఁ
జతురతఁ దమరిపునిఁ బట్టి సమయింతు రొగిన్. 531

సీ. భీరుండు సంగ్రామభీతుండు గావున
విజిగీషు లెత్తిన వేగఁ జెడును
భీరుజనుం డెంత భీతుఁడై యనిమొనఁ
దనవారు వాఱంగఁ దాన చిక్కు
లుబ్ధుఁ డేమియు నీమి లులితచేతస్కులై
నిజభటు లాజిలో నిలువఁబడరు
లుబ్ధజనుఁడు మఱి లుబ్ధపరాధీన
మతు లగు జనులచే మడియుఁ దాన
గీ. సతతము విరక్తుఁ డైన భూపతియు నెల్ల
ప్రకృతివర్గంబు విడుచు సంగ్రామభూమి

విషయసంసక్తమతియగు వికలహృదయుఁ
డుఱక ప్రత్యర్థిక సుఖాభియోగ్యుఁ డగును. 532

ఆ. మఱియు విను మనేక మంత్రులచిత్తముల్
చంచలములు గన సచివు లెల్లఁ
గార్య మొదవినపుడు కడఁగి యుపేక్షించు
రతఁడు మును విరోధి యగుటఁ జేసి. 533

క. దేవబ్రాహ్మణనిందకుఁ
డేవెరవునఁ బొరయు ధర్మహీను డగుటన్
గేవలము దేవహతకుఁడు
భావింపఁగ నట్ల చెడు నభాగ్యుం డగుటన్. 534

ఆ. దైవ మఖిలమునకుఁ దానె కారణ మని
చేష్ట యతనిదైవచింత నుండు
క్షయము నొందుఁ దాన సమయు దుర్భిక్షవ్య
సని బలవ్యసనికి శక్తి లేదు. 535

క. వ్యాయామయోగ్యం బగు
నా యెడయ యదేశ మనుట నల్పుఁడు చెఱుచున్
వే యేల కచ్ఛపముచేఁ
దోయాంతరమున గజంబు తూలదె పెలుచన్. 536

క. బహుశత్రుఁ డెందు వచ్చిన
నహితులు వెనుదగిలి చెఱుతు రయ్యైచోట్లన్
బహుళమహావిపినాంతర
విహిత మగు కపోతమట్ల నిర్భరవృత్తిన్. 537

ఆ. సరి నకాలయుక్తసైన్యుఁ డాహవకాల
యుక్తసైన్యుచేత నుక్కడంగు
అర్ధరాత్రసమయమందుఁ గానఁగలేక
గూబచేతఁ గాకకులముఁబోలె. 538

గీ. సత్యధర్మవ్యపేతుతో సంధి యొప్ప
దతఁ డసాధుఁడ గావున నపుడ తిరుగు
నిట్ల సందేహనృపతుల నెఱిఁగి వారి
తోడి సంధానమున కొనఁగూడఁజనదు. 539

కామందకము



వ. మఱియు సందేహస్వరూపం బెట్టి దనిన. 540

గీ. అరయసత్యార్థధార్మికానార్యనృపులు
భ్రాతృసంఘాతవంతుండు బలఘనుండు
ననుపమానైకవిజయుండు ననఁగ నేడ్వు
రొప్పుదురు సంధి సేయంగ యోగ్యు లగుచు. 541

ఉ. సత్యుఁడు సత్యవాఙ్నియతసంహితుఁడై వికృతుండు గాఁడు ప్రా
ణాత్యయమైన నార్యుఁడు ననార్యతఁ బొందఁడు యుక్తకారియై
సత్యము ధార్మికప్రభుఁ డసాధ్యుఁడు ధర్మజనానురాగసాం
గత్యము యుద్ధసాధనము గావున సంధి యొనర్చు టొ ప్పగున్. 542

చ. తొడగి యసాధ్యుఁ డైన నృపుతోఁ దగు సంధి యొనర్పకుండినన్
గడఁగి తదీయశత్రువులఁ గైకొని వచ్చి యయుక్తకారయై
యడఁచు సమూలకందముల నారయ భ్రాతృసమేతుఁ డొప్పు బ
ల్విడిఁ బటుకంటకాకలితవేణునికుంజమున ట్లసాధ్యుఁ డై. 543

సీ. బలవంతుఁ డెంతయుఁ బైనెత్తి వచ్చిన
నే యత్నములు మఱి యేమి సేయు
హరివరాధిష్ఠతవారిణంబునకుఁ బోలె
నమ్మేటి దగు శరణమ్ము గలదె
మార్కొననోడిన మత్తగజేంద్రంబు
నొడియు సింహముఁ బోలె నొప్పుగొనఁడె
బలవంతుతోడ నెబ్భంగినైనను
బోరు మనుచుఁ జెప్పెడి నిదర్శనము గలదె
గీ. యుఱక పెనుగాలి కెదురుగాఁ దఱమవశమె
కాన శుభకాంక్షియైన భూకాంతుఁ డెపుడు
త్రివిధశక్తిసమగ్రుఁ డేతెంచెనేని
సంధి యగునది కార్య మసంశయంబు. 544

క. బల్లిదునకుఁ బ్రణమిల్లుచు
మెల్లన కాలముల విక్రమించెడి జనులం
దెల్లెడఁ బాయవు సంపద
లల్లన జలరాశిఁ బొందునాపగలక్రియన్. 545

చ. ఒనర ననేకయుద్ధవిజయుం డగురాజు ప్రతాపవహ్నిచే
నని రిపుకోటిఁ గ్రాఁచుజమదగ్నితనూభవునట్ల వారితో
ననువుగ సంధి చేసికొని యాతనిదోర్బలశక్తిప్రాపునన్
మనుమనుజేంద్రుని న్మొనసి మార్కొన నోడుదు రన్యభూపతుల్. 546

క. బలియుదెస సంధి యయ్యును
బొలుపుగ నమ్మంగవలదు పురుహూతుఁడు ము
న్నలవడ సమయము దలఁపక
పొలియింపఁడె వృత్రుఁ గుటిలబుద్ధిప్రౌఢిన్. 547

వ. మఱియు నధికసమానహీనాభియోక్తృసంధిస్వరూపంబు. 548

మ. బలవంతుం డరుదెంచి పై విడిసినన్ బాటించి దుర్గస్థుఁ డై
కలఁగంబాఱక యంతకంటె బలియుం గారామునం దెచ్చి యా
బలవంతు న్విడిపించుటొండె భుజదర్పం బొప్ప సింహోల్లస
ద్బలుఁడై పైఁబడుటొండె నొప్పగు భరద్వాజోక్తమార్గంబునన్. 549

క. తనయుండు తండ్రి నైనను
దనయుని మఱి తండ్రి యైనఁ దఱికొని త్రుంచున్
ఘనరాజ్యకాంక్షఁ గావున
జనచరితములట్ల గావు జనపాలునకున్. 550

మ. మదమాతంగసహస్రసంఘముల నున్మాదించి సింహం బొకం
డదరంటన్ వెసఁ దాఁకి త్రుంచునటు లుద్యద్బాహువిక్రాంతిసం
పద యూహించి కడంగి తాఁకి యధికున్ బ్రత్యర్థిఁ గుందించు న
మ్మదదర్పోన్నతుఁ జూడ నోడుదు రరుల్ మానంబు దోరంబుగాన్. 551

క. సముఁ డరుదెంచిన సంధియఁ
సముచితమగు శత్రుజయము సందియమగుటన్
గ్రమమున సంశయితక్రియ
లమరించుట యొప్ప దని బృహస్పతి చెప్పెన్. 552

చ. తగ నభివృద్ధికాముఁ డయి తా సమసత్త్వునితోడనేనియున్
మిగులఁగ సంధిసేయుట సమిద్ధవివేకము యుద్ధమాడిరేఁ
బగలుదు రిద్దఱున్ సరి నపక్వఘటంబులు దాఁకినట్లు మె
చ్చుగ నల సుందుఁ డొంట నుపసుందుఁడుఁ బోరి నశించుకైవడిన్. 553

చ. ఎడరున నెత్తివచ్చిన విహీనుఁడు పీడ యొనర్చుచోటులో
బెడఁగునఁ బడ్డ శీతజలబిందువు కైవడి సంధిగా నొడల
బడ కెటు లొప్పు సంధి యతఁ డొల్లనిచో నెడఁగాంచి పై వడిన్
బడి పొడిసేయఁగావలయు బాహుబలోన్నతగర్వమత్తుఁ డై. 554

వ. మఱియుఁ బ్రకారాంతంబు. 555

చ. బలియునితోడ సంధి బంధురయత్నము దప్ప నాతఁడున్
బొలుపుఁగఁ జూచి నెమ్మి గడుఁ బుట్టెడున ట్లనువృత్తి చేసి యే
కొలఁదిన నమ్మినట్ల యతిగూఢతరాకృతవేషుఁ డై ప్రియం
బులు వలుకంగఁ బొల్పగు సముద్భవ మొప్పఁగఁ గార్యకాంక్షుఁ డై. 556

క. నమ్మిక గలిగినఁ బ్రియుఁ డగు
నమ్మికమైఁ గార్యసిద్ధి నమ్మినయది యౌ
నమ్మించికాదె యింద్రుఁడు
నమ్మిక దితిగర్భవిదళనం బొనరించెన్. 557

క. స్థిరబుద్ధి సంధి యొల్లని
యరివరుయువరాజుతో మహాభృత్యునితో
వెరవార సంధి సేయుదు
నురుగతి నంతఃప్రకోప మొనరింపఁదగున్. 558

వ. అది యెట్లనిన. 559

చ. ధనములు లేఖలున్ బహువిధంబుల నడిపించి తాఁ బ్రధా
నునకుఁ బ్రదూషణంబు గడునూత్నముగా నొనరింప శత్రుభూ
జనపతికిన్ స్వపక్షజనసంఘముపై నపనమ్మి కెమ్మెయిన్
దనర నతండు దాన చెయిదంబు దొఱంగి కరంగు నాత్మలోన్. 560

మ. అహితారంభము మాన్చియొండెఁ దదమాత్యభ్రాతృసంధాత యై
విహితాచారత వానివైద్యజనునిన్ భేదించి దానంబునన్
సుహృదుం జేసి మహాసనం బతనిచేఁ జొప్పార భేదించి యొం
డె హితుం బంచి సురంధ్రి మైఁ బొడిచియొండెన్ దాఁకి త్రుంపందగున్. 561

ఉ. దేశముఁ బాపు తద్విమతదేశనివాసుల యై నిమిత్తని
ర్దేశము చేసి లోకులకుఁ దెల్లను గాఁ గడునిద్ధలక్షణో
ద్దేశముఁ జూపుచున్ నృపతి దీన వసించుట నిక్క మంచు నా
దేశము చెప్పి పంప నగు దీనిధి యై నిజగూఢచారులన్. 562

సీ. పెక్కుభంగుల మున్ను పేదయ కాఱించు
టెంతయుఁ దగు నిగ్రహింపఁదగదు
ఉఱక విగ్రహమున నుదయించు సంక్షయ
వ్యయము నాయాసంబు నాత్మపదము
నర్థమ్ముఁ బుత్రమిత్రాదులు వ్యర్థమై
మిన్నక పోవు నిమేషమాత్ర
దురవస్థ పలుమఱుఁ దోఁచు సందిగ్ధంబు
రాజ్యముఁ గీర్తియు రణమునందు

గీ. గాన విగ్రహింపక సామదానభేద
విధుల సీమాసమాగతవిమతనృపునిఁ
గలఁచి సంభ్రమ మడఁచి దవ్వులె నిలిపి
సమబలుండయి తోఁచిన సంధి యొప్పు. 563

గీ. ఆత్మబలగాఢసంరక్షితాత్ముఁ డగుచు
వీరసంచారములఁ దాపవివశుఁ జేసి
చాల నిలచినఁ దనుఁ దాన సంధి యగును
దప్తలోహద్వయానుసంధానమట్లు. 564

కామందకము



క. మును దన కపకారము సే
సినవానికిఁ దాను గీడు సేయక సామం
బున సంధి యగునె కాఁపని
యిను మినుమును గదియ నడువనేలా కూడున్. 565

సీ. మైత్రిహిరణ్యభూమండలంబులలోన
నలర నొక్కటిఁ గొన్న నుత్తరోత్త
రము మేలు మును సహాయము లేనివానికి
మిత్రు లన్యముకంటె మే లతండు
నాపదలకుఁ గూడి యరుదేని వాఁడైన
భూమిఁ దా విడువంగఁ బూనెనేని
ధనము మే లచలుఁడై తానుండు వానికి
సీమతోఁ జేరిన భూమి మేలు
ఆ. కపటమిత్రత మును నెపుడు సొనారని
పణము నెన్నఁడు ఫలపడని భూమి
యును నిరర్థకంబ యోపినయెవ్వానిఁ
దెలిసికొనుట భూపతికి గుణములు. 566

నీతిసారము



క. ఇప్పాట సంధికృత్యం
బొప్పారుం బూర్వము నిజనోక్తనయగతిన్
ఇప్పగిది లావు సంధియు
నొప్పగు నధికాల్పకార్య మూహించి తగన్. 567

సామము

గీ. సత్సహాయము ప్రజ్ఞయుఁ జాలఁగలిగి
సత్త్వదేవోపబృంహితచరితుఁ డగుచు
నాయతోద్యోగసద్వ్యవసాయములను
శత్రుమీఁద నుపాయముల్ సలుపవలయు. 568

క. తొలుతఁ జతురంగబలములఁ
దలపెట్టక సామమంత్రతత్త్వజ్ఞుం డై
లలి మాంత్రకోశబలమున
గెలువంగావలయు నృపతి గినిసి యరాతిన్. 569

క. లలి సామంబును దానముఁ
బొలుపుగ భేదంబు దండమును మాయోపే
క్షలు నింద్రజాలములు నాఁ
దలఁప నుపాయములు నెల్లఁ దనరుచునుండున్. 570

చ. తనరఁ బరస్పరోపకృతిదర్శనముం గుణకర్మకీర్తనం
బును నిజబంధుతాకథనమున్ దగ నాయతిసంప్రకాశనం
బును మృదువాక్ప్రచారములఁ బోల్పగు నాత్మసమర్పణంబు నా
జననుతిఁ బొందుఁ బంచవిధసామము సామవిధిజ్ఞ సమ్మతిన్. 571

కామందకము



చ. సదృశునియందు సామమును సంగరమూలబలప్రకారదు
ర్మదునెడ భేదమున్ బ్రకృతిరాగ మెలర్పఁగ నోర్వరాని సే
న దనరి నచ్చివానివలనం దగు దానము హీనుఁ జూచి బె
ట్టిదముగ దండమున్ బ్రతిఘటించి సమగ్రబలోజ్జ్వలుం డగున్. 572

అజ్ఞాతము



క. పైపై నమృతము చిలికెడు
రూపునఁ జిత్తముల నలరురూపునఁ జవులం
దాపోవకానువిధమున
తీపుగఁ గనుఁగొనుచుఁ బలుకుతెఱఁగొ ప్పలరున్. 573

చ. ఒరులకు బెగ్గలం బొదవకుండగఁ బల్కెడు సామ మ
చ్చెరువుగ నట్టిసామము ప్రసిద్ధముగా నిజమాడుచోఁ బ్రియం
బరుదుగఁ బల్కుచో మధుర మగ్గలమై యొదవంగ నాడుచోఁ
బరఁగ నుతించుచోట నెఱపందగు సజ్జనసమ్మతంబుగన్. 574

ఉ. సామమునందుఁ గార్యము నిజంబుగఁ బూనికొనంగఁబోలు నా
సామవిధానదండముఁ బ్రశస్తి యొనర్తురు నీతికోవిదుల్
సామమునందె కాదె సురసంఘము ద్రచ్చె మహాసముద్రమున్
సామవిరోధులై చెడరె సంగరభూమిని ధార్తరాష్ట్రులున్. 575

చ. అలసుని విక్రమశ్రము నుపాయఫలప్రనిదూరునిన్ క్షయా
కులితు నయప్రవాసపరిఘూర్ణితు నిద్రితు భీతు మూర్ఖుఁ గాం
తలఁ బసిబాలురన్ బలు నధార్మికు దుర్జనమైత్రిశీలు ని
శ్చలశుభబుద్ధియుక్తిఁ దగ సామమునంద జయించు టొప్పగున్. 576

కామందకము

ఉ. దండమునందకాని యహితక్షితినాథులు గారు సాధ్యు లం
చుండుదు రెందునుం గలదె యూరకె యాకులచప్పు డైనఁ బె
ట్టుండక పాఱునీచులను వొయ్యన సామముతోడఁ దెచ్చి యు
ద్దండతఁ బట్టి యుద్ధతుల దారుణవృత్తి వధించివైవరే. 577

క. సామంబుఁ బోల నౌషధ
మీమహి నెక్కడిది రిపుమహీశులఁ జంపన్
దామర వెస నశియింపదె
హేమంతసమయమునందు హిమపాతమునన్. 578

ఆ. వనము నేర్చుచోట వహ్నిమూలంబులు
దివ్వఁ గాల్పలేదు తీవ్ర మయ్యు
మృదువుఁదనువయైన యుదకప్రవాహంబు
వేళ్ళతోడఁ గూడఁ బెకలఁద్రోచు. 579

క. తనయర్థముఁ బ్రాణంబును
ఘనరిపుచేఁ బోవుచుండఁ గలిగినఁ దా నా
తనిశరణుఁ జొచ్చియైనను
గొనకొని యారెండు నిల్పుకొనవలయు వెసన్. 580

ఆ. అరయ పాయమునన యగుకార్యములకును
దండముల నొనర్ప దలఁప రరులు
జగతిఁ బైత్యశమము శర్కర నగుచుండఁ
జేతిపొళ్ళకాయచింత యేల. 581

ఆ. సామమునన మిగుల సకలకార్యంబులుఁ
బోలఁ జేయవలయు నేల యనిన
బేర్చి సామమున నొనర్చు కార్యము తుది
హానిఁ బొందనేర దండ్రుకాన. 582

క. సామమునను దక్కఁగ రు
గ్గమానలశత్రుఘనతగా దీప్తులయం
దేమిటను బాసి చన దరి
భూమీపతిసంతమసత బుద్ధిఁ దలంపన్. 583

క. ఈమహిశుమీఁద సుజన
స్తోమములఁ బోలె ...శుద్ధములై యా (?)
సామమునఁ జేయుకార్యము
లేమిట మఱి వికృతిఁ బొంద వెన్నఁడు నరయన్. 584

క. ఇన్నిటికంటెను దా మును
మున్ను నిగూఢప్రకారమున దండమునన్
బన్ని మఱి సామముఖమున
సన్నాహము సేయవలయు శౌర్యోన్నతుఁడై. 585

పంచతంత్రి

దానము

చ. పరనృపదత్తవస్తుపరిపాటున తోఁ బ్రతిదాన మీగియున్
బరుఁ డిడువస్తుసంస్థితియు భవ్యవినూతనవస్తుదానమున్
ఇర వగుసొమ్ముఁ బేర్కొనఁగ నిచ్చుట లిచ్చిన యప్పు మానుటల్
పరగఁగ నిట్లు పంచవిధలక్షితమై చము దాన మిమ్మహిన్. 586

గీ. ఆత్మవిక్రయ మొనరించుననుపు దోఁప
నీప్సితార్థము లీఁదగు నిచ్చుచోట
నీరు కొండల భేదిలచునేర్పుతోడ
రిపుల భేదించునదియు నిరీక్షితముగ. 587

సీ. మొదల సామోపాయమునఁ జక్కఁబడకున్న
విగ్రహ మని దారుణాగ్రహమున
దారుణవిగ్రహోదయ మైనతఱిని
దానంబున శాంతి యొనర్పవలయు
యాత్మజ చేసిన యపరాధమునకునై
భృగునందనుండు గోపించినపుడు
దానంబుచేతన దనుజేంద్రుఁ డగు వృష
పర్వుండు సుముఖియై పరఁగెఁగాదె
గీ. కాన నాతనిఁ బ్రార్థించియైన నాతఁ
డడిగినది యిచ్చి విగ్రహ మడఁపవలయు
దానవిముఖాత్ముఁడై సుయోధనుఁడు మున్ను
సకలబంధుసమేతుఁడై సమసెఁగాదె. 588

కామందకము



సీ. ఒకరుండు ముందట నొసగి వెండియుఁ
బెద్దయాసలఁ జూపుచు మోసబుచ్చి
జీవితం బిరువంకఁ జేకొని వారిచేఁ
గడఁగి భేద్యులకెల్లఁ గలఁపవలయు
వెలయ లుబ్ధుఁడు లబ్ధవేతనుండైనను
మాని యమానితుం డైనయెడలఁ
గ్రోధి యకారణకుపితుఁ డైనను భీరుఁ
డతిభీషణుం డైనయట్టిచోట

గీ. వీరికోర్కులు ప్రియముతో వెస నొనర్చి
పరఁగ భేదించునది శత్రుపక్షజనుల
నాత్మపక్షజనంబుల యాత్మ లెఱిఁగి
యత్తెఱంగున నెడము సేయంగవలయు. 589

ఉ. దానపురస్కరంబుగఁ బదంపడి చేసినసామభేదముల్
దానఫలంబుపెంపున నుదంచితకార్యఫలప్రదంబు లౌ
దానవిహీనమౌనను వృథావికృతం బగు సామమేని య
ద్దానము లేనిసామమునఁ దా భజియించునె పత్నియేనియున్. 590

క. దానంబుమహిమ యిట్టిది
యౌ నన నిల నెపుడు దృష్టి యారసిచూడన్
దానం బిడినను శత్రుం
డైనను నాక్షణమ మిత్రుఁ డగు వారలకున్. 591

క. తనయునికంటెను దానమె
ఘన మగుప్రియ మనఁగవచ్చుఁ గనుగొనఁ బశువ
య్యును గ్రేపు సనిననైనను
నినుమడిఁ గొలుచిడిన నీదె యెప్పటిభంగిన్. 592

క. తగుదానమహిమ యే మని
పొగడెడిది మనుష్యుఁ డరయ భూరిధనమునన్
జగమునఁ దండ్రిం జంపిన
పగయైనను మఱచి సాధుభావము దాల్చున్. 593

గీ. తనర నొక్కట సర్వస్వమును హరింపఁ
జాలు శత్రునియందుల స్వల్పదాన
మునన సంతోషపఱతురు ము న్నెఱింగి
బాడబము నబ్ధి సంతోషపఱచినట్లు. 594

చ. అమరఁగ దుర్బలుం డతిబలాహితు సంచితబుద్ధి నల్పదా
నమునను పొందు చేసికొని నాశముఁ బొందఁడు మూర్ఖువాఁడు సా
మమునెడఁ గల్గుపుట్టికెఁడు మానుగ వేఁడిన నీఁడు క్రూరదం
డముతఱి గంపెఁ డొక్కట నొడంబడ నిచ్చి నశించుఁ జయ్యనన్. 595

ఆ. అరిబలం బభేద్యమైనను భేద్యమౌఁ
జాలధనము లరువఁ జాలిరేనిఁ

దండియైన మిగులఁ దరిప్రువ్వు దొలిచిన
మ్రాను విఱువ సుసర మైనయట్లు. 596

ఆ. తనదుశాత్రవుండు తనకంటె ఘనుఁ డైన
నఖిరమైన ధనము నతిని కిచ్చి
తన్నుఁ గాచికొనఁగఁ దగు నీతిపరుఁడు దాఁ
గలిగెనేని ధనము గలదు గాన. 597

ఆ. జయము గోరు నృపతి శత్రునుద్ధతి వాంఛఁ
దివిరి దానమునన తీర్పవలయు
జడధినీరు పేర్మి బడబానలము వాంఛ
పొసఁగఁదీర్చి జయము పొందినట్లు. 598

ఆ. అడపఁబడు విరోధి యంచితదుర్గస్థుఁ
డైన నతులితంపుదానమహిమ
నవని నీటిలోన నల్పమత్స్యప్రదా
నమున నల్లఁబెద్దతిమియుఁ బోలె. 599

క. వెరవరి సర్వముఁ జెడుచో
నరి యొండు త్యజింతియైన నది రక్షించున్
ధర మూఢుఁడు గడునల్పమ
సరభసమున విడువ లేక సకలముఁ జెఱుచున్. 600

ఆ. అధికలోభ మూది యర్థంబె చూచుచు
నుండు నాతఁ డెవ్వఁ డుర్వి నెల్లఁ
బాల లోభమహిమఁ బడి పెం పెఱుంగక
పిల్లివోలె నతఁడు బెట్టు సచ్చు. 601

అజ్ఞాతము



క. పౌరులను జానపదులను
సారము గల ద్డనాథజనులను నృపుఁ డిం
పారఁగ సాధింపఁగఁదగు
చారుక్రియన్ సామదానసంస్కారములన్. 602

భేదోపాయము

క. అనురాగస్నేహవినా
శనమును సంకర్షణంబు నంతర్ఝనముల్
జనియింపఁజేయునది తాఁ
జను భేదం బనఁగఁ ద్రివిధసంచారములన్. 603

గీ. మంత్రమాత్యపురోహితమండలికిని
దివిరి యువరాజునకునైన తేటపడఁగ
భేద మొనరింపవలయు నభేద్యవృత్తి
నట్టి దగునేని మఱి యసాధ్యంబు గలదె. 604

క. యువరాజు నమాత్యుండును
నవనీపాలున కుదంచితాయతభజముల్
ప్రవిమలనేత్రము మంత్రియు
నవు నం దొకనూనమైన నట్లగుఁ బతియున్. 605

క. మతిమంతుం డగు నరపతి
ప్రతిపక్షజ్ఞాతిభేదపరుఁ డగునది త
త్కృతమున నక్కులజుఁడు వెస
హుతవహుక్రియఁ గాన నెల్ల నుగ్రతఁ గాల్చున్. 606

మ. తగ దాజ్ఞాతిసమానుఁ డైన యతఁ డ్తర్జ్ఞానియై యుండు నే
నగు భేదార్హుఁడు గాన శత్రువులయం దాయిద్దఱన్ భేదమ
ట్లొగిఁ జేయింపఁదగుం దనం దొదవినన్ యుద్ధస్థితిన్ వారిఁ బొ
ల్పుగ శాంతాత్ములఁ జేయఁగావలయుఁ దా భూపాలుఁ డెబ్భంగులన్. 607

ఉ. శిక్షణరక్షణార్థముగఁ జేరి విభేద మొనర్పఁబోలు నా
దక్షుఁడు సౌమ్యుఁడో శకుఁడొ తా నెఱుఁగందగు సూక్ష్మబుద్ధి యై
నక్షయసౌమ్యుఁ డైనఁ దనయాడినపల్కు ఫలింప జేయు ని
ర్పక్షములం గలంచు బలుభంగులమై శకుఁ డందు లోలతన్. 608

వ. మఱియు నరనాథుం డొక్కపని యిచ్చెదనని యాసఁజూపి కాలయాపనంబుఁ జేయం దివిరి తవిలిన యభిమానియును, దాఁజేయవలవ దనినపని యితండు గావించె నని మిథ్యాదూషణంబు సేయనోపి(ర్చి)న యతండును, వివాదంబున జయంబు గొనియెద నని యతనికి జయం బిచ్చెద నని రప్పించి నిర్ణయవేళ న ట్లొనరింపకున్న నపజయంబునఁ బొందినయతండును, తగవు చెప్పుచు...బంచితతన్ను నవమానించెనని యాఘోషంబులు సేయు జనులకు మనోమోదంబు గావించి నట్ల దండనంబునఁ బొందినయతండును, దండాధికారియు నన నియ్యేవురుఁ గ్రోధవర్గంబు; భీతిదోషంబున రాజువలన వెఱచుచుండు వాఁడును, నవనీశ్వరజ్ఞాతియు నాత్మదోషంబుననొండె, వైముఖ్యంబున నొండె నితరంబును భూవల్లభుచే దూషింపబడునతండును నీ మువ్వురును భీతవర్గంబు; నైసర్గికంబైన యభిమానంబు గలయతండును, మానాధికుం డగుట పరామర్శింపక మహాసాహసంబు సేయునతండును, విద్యాభిజనధనమదోద్వర్తుండై యాత్మశ్లాఘ చేసికొనునతండును, నీ మువ్వురు మానివర్గంబు; ధనహీనుం డగుట ధర్మకామార్థవిరహితుం డైనయతండును, జ్యేష్ఠుం డైనయతండును, బరిచరితుం డైనమానియు, నాత్మదుష్కార్యశంగాభీతుం డైనయతండును, బూర్వమున విరోధియై సమాధానంబునఁ బొందిన యతండును, నీచుతోఁగూడం బనిసేయం బంపువడ్డవాఁడును, దనసరివారిచే మాటఁబడ్డవాఁడును, దనదుఃస్వభావంబున నొక్కనెపంబున బంధనప్రాప్తుం డైనయతండును, నిమిత్తంబు లేక వెడలఁబాటుపడ్డయతండును, నపూజితపూజార్హుండును, హృతద్రవ్యకళత్రుం డైన భోగాభిలాషుండును, బరీక్షీణుండును, బహిష్కృతుండును నన నిట్లు సెప్పంబడిన యిన్ని దెఱంగులవారలును భేదార్హులుగా నెఱుంగవలయు. 609

గీ. సామమును నాసపెట్టుట చతురతయును
దారుణాత్యుగ్రరసభయదర్శనంబు
మహిమవస్తుప్రదానంబు మన్ననయును
ననఁగ భేదంబునకు నుపాయంబు లయ్యె. 610

క. బలియుండు నిగ్రహించిన
నలవడ భేదం బొనర్చునది బుద్ధిమెయిన్
బొలుపుగఁ జండామార్కుల
గెలుచుట భేదమునఁ గాదె గీర్వాణు లొగిన్. 611

కామందకము



క. అతులితబలనృపుఁ డైనను
నతిరయమున భేదసాధ్యుఁ డగుఁ గావున నీ
క్షితిజయముఁ గోరినను భూ
పతి భేదము సేయవలయుఁ బాయక యతనిన్. 612

గీ. ధరణి నవిరోధకృన్మంత్పతంత్రతతులు
గడు సువృత్తసుహృద్వ్యక్తికంబు లయ్యు
సరయ నించుక లోభేద మగుటఁ జేసి
బంధనప్రాప్తములు గావె పాయ కెపుడు. 613

ఆ. సామదానములఁ బ్రశాంతిఁ బొందని శత్రు
నందు వలయుభేద మొందఁజేయ
భేదమునన యెట్టి పృథుసత్త్వుఁ డైనను
బొల్లయై నశించిపోవుఁ గాన. 614

క. బలముల గిరులను గపటం
బులచెలుముల భిన్నమంత్రములఁ గార్యములన్
లలినొక్కశబ్దమాత్రన
పెలుచన కడుఁగాతరుండు భేదం బొందున్. 615

పంచతంత్రి

దండోపాయము

క. వధయు సకలార్థహరణము
నధికక్లేశంబు ననఁగ నట దండవిధా
విధినిరతులచే దండన
మధిగుణవినుతముగఁ ద్రివిధమై చెలువొందున్. 616

సీ. అరయఁ బ్రకాశంబు నప్రకాశం బన
వధ రెండు తెఱుఁగులై వఱలుచుండు
నుఱక ప్రకాశనం బొనరించునది లోక
విద్విషుం డైనట్టి వినుతుమీఁద
నప్రకాశనదండ మడరించునది రాజ
వల్లభలై మఱి యెల్లజనుల
కుద్వేజనము సేయుచుండెడివారి
పై నధికులై భావించునట్టివారి
ఆ. విషహుతాశనాది వివిధమార్గముల ను
ద్వర్తనముల నాయుధములచేత
నిట్లు పాంశుదండ మెవ్విధమున యథా
న్యాయమార్గమున నొనర్పవలయు. 617

గీ. తనర విప్రుండు జాతిమాత్రకుఁడె యైన
ధార్మికుం డగునాతఁ డంత్యజుఁడ యైన
వారిపై వధదండముల్ వల దొనర్ప
ధర్మసంగ్రహవిదుఁ డైన ధరణిపతికి. 618

ఆ. ధరణిలో నుపాంశుదండార్హు లెవ్వార
లందుఁ జంపదగినయట్టివారిఁ
బరఁగ బాధపెట్టఁ బరఁగ నుపేక్షింప
వలదు నెదురనైన వల దుపేక్ష. 619

చ. యముఁడునుబోలె నేరికి భయంకరమై కదియంగదార దం
డమునకుఁ బాత్రు లందుఁ బ్రకటం బగుదండనసేయు టొప్పు భూ
రమణుఁడు మ్రోలఁజంపు టెదురన్ విడిపించుట లిట్టిచందముల్
దమకము లే కెఱుంగని విధంబునఁ జేయు టయుక్త మారయన్. 620

గీ. తొలుత భేదంబు గావించి తొడరి పిదప
హనన మొనరింపవలయు దండన మొనర్చి
కమియఁ దఱిమినఁ జివికిన కాష్ఠ మరయ
నఱకఁ బూనినమాత్రన నుఱుముఁగాదె. 621

క. వెస దేశకాలబలమును
సుసహాయోత్సాహబలము శోభిల్లంగా
నెసఁగి యుధిష్ఠిరు పోలిక
ననమున శత్రువులఁ ద్రుంచునది దండమునన్. 622

క. భీకర మగు నాత్మభుజ
శ్రీకలిమిన యైన శత్రుఁ జెండాడఁదగున్
ఏకాకి యగుచు రాముఁడు
పోకార్పఁడె బాహుదర్పమున నృపకులమున్. 623

ఆ. సామభేదదానసంప్రయోగము గడు
విఫలమైన యెడ వివేకి యగుచు
దండమార్గ మెఱిఁగి దండ్యుల దండింప
వలయు నెపుడు భూమివల్లభుండు. 624

కామందకము



ఆ. అఖిల మైనవారి కది మనోహరలక్ష్మి
నలిగియుండుఁగాని తలఁచిచూడ
అతులదండనీతియుతులకు నెప్పుడు
ప్రథనలక్ష్మి వశ్యమై దనర్చు. 625

గీ. అరయ దండంబు దక్క సామద్యుపాయ
లబ్ధ మగు లక్ష్మి నృపతికి లక్ష్మి యెట్లు
దైవ మిచ్చినఁ బులి దించుఁ దరలలేక
యుండు ముదిగోద యదియును నొక్కటగునె. 626

గీ. సామదానభేదంబులఁ జక్కఁబడక
తక్కెనేనియు మఱికాక తగదుమున్న
దండ మదియేల యనవుడు దండనీతి
యుర్విపులకెల్ల దుర్గతి కూఁత యగుట. 627

ఆ. దండనీతి వదలి తక్కినయమ్మూఁటి
నమర నడపురాజు కహితులెల్ల
భీతుగాఁ దలంచి పెలుచన పైనెత్తి
వరువుఁబోలె నడపవత్తు రెపుడు. 628

అజ్ఞాతము



గీ. సామదానములందు నసాధ్యుఁడైన
మంత్రిజనబంధుభేదంబు మఱియొనర్చి
పిదప దండన మొప్పగు నదియు గూడ
రూఢచేష్టల రెండయి రూఢికెక్కు. 629

ఆ. దండనీతి లేక తక్కినవిద్యలు
గలిగెనేని లేనిగతిన పొందు
రాజు దండనీతిరతుఁడైనఁ దక్కిన
విద్యలెల్ల నతని వెదకిపొందు. 630

క. దానమును లుబ్ధభేదము
మానుగ నన్యోన్యశంకమానాత్ముల దు
ష్టానీకము నేర్పడఁగ న
నూతన దండమున వశము నొందింపఁదగున్. 631

ముద్రామాత్యము

మాయోపాయము

సీ. మఱి దేవతాప్రతిమాస్తంభసుషిర
సంపిహితులచేతఁ జంపించుటయును
స్త్రీవేషధారియై చేరి చంపుటయును
రాత్రిమై ఘోరదర్శనముసేఁత
ఉగ్రబేతాళమహోల్కాపిశాచశి
వారూపదారుణవర్తనంబు
ఇవ్విధములను ననేకవిచిత్రసం
పాదనము మనుజమాయ యయ్యె
గీ. కామరూపధరత్వంబు గడఁగి శస్త్ర
వహ్నిపాషాణశరజనవర్షణంబు
తగఁదమోమేఘశైలసందర్శనంబు
మార్తు రలక నమానుషమాయయయ్యె. 632

క. స్త్రీరూపంబున భీముఁ డ
వారితముగ సింహబలుని వధియింపఁడె ము
న్నారయ నలుఁడును గూఢా
కారుండై దివ్యమాయ గడగఁడె పెలుచన్. 633

క. తనకంటెఁ బ్రబలు నబలుఁడు
ఘన మగు నొక మాయయైనఁ గడతేర్పఁదగున్
వనితారూపము గైకొని
చని భీముఁడు సింహబలునిఁ జంపిన మాడ్కిన్. 634

ఉపేక్షోపాయము

క. వ్యసనము నన్యాయంబును
మసలక యుద్ధమును జెయ మాన్పమి యది దాఁ
బొసగుఁ ద్రివిధస్వరూపత
నెసఁగు నుపాయములయం దుపేక్ష యనంగన్. 635

క. ప్రకటముగఁ గీచకుం డొగి
నకార్య మొనరించువేళ నవినీతుండై
చకితుండపోలె విరటుం
డొకభంగి యుపేక్షచేసి యుండఁడె మదిలోన్. 636

సీ. మేఘాంధకారసమిద్ధవర్షాగ్నివి
దాహపర్వతఘోరదర్శనంబు
నున్నతధ్వజనియోజదగ్రసైన్యవి
తానభీకరదూరదర్శనంబు
ఛిన్నపాటితపటుభిన్నక్షరద్రక్త
ధావద్భటోద్భటదర్శనంబు
నివి యాదిగాఁ గల యింద్రజాలక్రియ
దగు నైంద్రజాలికదర్శనంబు
ఆ. ఇటులు పెద్దఁబడిన యీయుపాయంబులు
సాల బహువిధార్థసాధనములు
గా నెఱింగి యుచితకాలముతోడ ను
పేక్ష యోజ మీఁదఁ జేయవలయు. 637

ఉ. నేరమిమై నుపాయములు నెక్కొని యాత్మపరస్థలంబులన్
వారక చేయువారల కవశ్యము గల్గు జయంబు లక్ష్మియున్
ఆరయఁగా నుపాయరహితాత్మకులై కడు నంధులట్ల సం
చార మొనర్తురేని నొకసందునఁ గూలుదు రెట్టివారలున్. 638

కామందకము


శా. శ్రీమద్రామగిరీంద్రమందిరవసచ్ఛృంగ్రారదిక్పూరితో
ద్దామాలంకృతకీర్తిహార రిపురాడ్దర్పాపహారక్రియా
భీమోదగ్రకరాళచక్రవినమద్బృందారకస్తోమచూ
డామాణిక్యమరీచిపింజరితగాఢశ్రీపదాంభోరుహా. 639

క. బృందారకమునివందిత
బృందావనమధ్యగోపబృందవధూటీ
సుందరరాసక్రీడా
నందితహృదయారవింద నతముచుకుందా. 640

వసంతతిలకము. కంజాతజన్మజనికారణనాభిపద్మా
కంజాకుచస్థలిపికర్మఠపాణిపద్మా
మంజీరరత్నరుచిమండితపాదపద్మా
పుంజీకృతాసుపరిపూరితపూతనామా. 641

గద్యము: ఇది శ్రీనరసింహవరప్రసాదలబ్ధకవితావిలాసభారద్వాజగోత్రపవిత్రాయ్యలామాత్యపుత్రా సరసగుణధుర్య సింగనార్యప్రణీతం బయిన సకలనీతిసమ్మతంబను మహాప్రబంధంబునందు బ్రాహ్మణాచార నియమంబును గణక పురోహితవిద్వద్యాచక జ్యౌతిషిక వైద్య రాయబారదూత మార్గంబులును సేనాధిపతి లక్షణంబును భటసేవకోత్తమాధమ మార్గంబులును సామదానభేదదండమాయోపేక్షేంద్రజాల సప్తోపాయనిరూపణంబును నన్నది ద్వితీయాశ్వాసము.