Jump to content

సకలనీతికథానిధానము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

శ్రీనిత్య కుంటముక్కుల
ప్రాణేశ్వరమంత్రి పిన్నభైరవ పాత్రో
ద్యానశుకరాజ! కమలో
ర్వీనిర్మలహృదయనాథ! వేంకటనాథా!

1


వ.

అవధరింపుము నారదుండు బలీంద్రున కిట్లనియె నివ్విధంబున కేయూరబాహుండును మృగాంకవతిని వివాహంబై రాజ్యంబు సేయుచుండ భాగురాయణుం డొక్కనాఁడు కథాప్రసంగవశంబున నిట్లనియె.

2


క.

ములు ముంటఁ బుచ్చుగతిఁ దా
నలయక భూజనములెల్ల నౌనౌ ననఁగా
ఖలునకు ఖలగుణములనే
బలిమి యడంగింపవలయుఁ బ్రాభవశక్తిన్.

3


వ.

అది యెట్లనిన.

4


సీ.

శార్దూల మొకటి మాంసము భుక్తిగొనుచోట
        దవడ యెముకనాటఁ దివియలేక
కూపెట్ట నొకతరు కోటరంబున నున్న
        మ్రానుపోటను పక్షి దానిఁ జూచి
యేటికి వాపోయు దెమ్ముకి వుచ్చెదఁ
        దెఱుము నోరనవుండు దెఱచియున్న
వదనంబు జొచ్చి దవడనున్న యెమ్ముక
        పుచ్చి యప్పులిఁ బాసి భూజ మెక్కె

ఆ.

పులియు నొప్పి బాసి పులుఁగుతోఁ జెలికార
మాచరించి పక్షి యామిషంబు
నడుగుటయునుఁ బెట్టకనియె నప్పులుఁగుతో
జెలిమిదలఁచి నోరఁ జిక్కినపుడు.

5


వ.

తినక, నిన్ను వెళ్ళవిడుచుట ప్రత్యుపకారంబుగా దలంచుకొను మనిన నట్లకాక యని, యప్పులిఁ గాచుకొనియుండ నొక్కనాఁడు.

6


క.

పలలము దిని మత్తా[1]గొని
పులి, నిద్రింపంగ మ్రానుపోటు రయమునన్
దలఁద్రొక్కి యొక్కనేత్రము
గెలఁకి దివంబునకు నెగసెఁ గృతమతి యగుచున్.

7


క.

పులి జూచి పలికె నాకుం
జెలివని యొకకన్ను వొడిచి చిక్కినకన్నున్
గెలఁగక విడిచితి నృపకృతి
కిల నుపకారంబు సేయ కెట్లుండదగున్.

8


వ.

అని యపహసించి యథేచ్చ నరిగెనని నారదుండు బలీంద్రుని నింక నొక్కకథ వినుమని యిట్లనియె.

9


క.

శరలిఖతంబులు చదువను
పరిమళముల దండగట్టఁ బవనము ముడువన్
సురపథముఁ గొలువవచ్చునుఁ
దరణులచిత్తంబు తెలియఁదరమె తలంపన్.

10


వ.

అవి యెట్లనిన.

11

సీ.

అసమాస్త్రపురి మనోహారిణి యనులేమ
        సౌందర్యవిభ్రమచారుమూర్తి
కర్ణారుఁడను నొక్కకష్టరూపునకు మో
        హించి తా నింటివా రెఱుఁగకుండ
నాతనివెంట దాక్షారామపురమున
        కరిగి యందొకచోట నిరవుగాఁగ
నున్నచో కర్ణారుఁ డన్నగరంబున
        దాంబూలపుష్పపదార్థచయము


తే.

దెత్తునని పోవ యొంటి నత్తెరవ యుండ
పురములోపలి పల్లవుల్ తరుణి వినఁగ
నిట్టిలావణ్యవతియైన యిందువదన
యకట వీనికిఁ బ్రాప్త మె ట్లయ్యె ననుచు.

12


వ.

తమలో నిట్లనిరి.

13


చ.

ధనికుఁడొ చెప్పఁజూపగ వదాన్యుఁడొ శూరుఁడొ! రూపవంతుఁడో!
మన మలరింపనేర్చు రతిమర్మవిధిజ్ఞుఁడొ! వీనివెంట నీ
వనరుహనేత్ర తా వలచి వచ్చుట యేమని యెన్నవచ్చు నా
చెనఁటి విధాత మర్కటముచేతికి మౌక్తికహార మిచ్చునే.

14


వ.

అనిన మఱియొక్కరుం డిట్టులనియె.

15


ఉ.

అంగన జాతిహీను వికలాంగుఁ గురూపుని నైన నెప్పుడున్
సంగతి వాయకున్న తనజవ్వన మాతని సొమ్ము సేయు న
య్యంగజుఁడైన దూరగతుఁడైనఁ దలంపదు, పుష్పవల్లి దా
చెంగటి బూరుగున్ విడిచి చేరునె దూరపుచూతపోతమున్.

16

క.

అనుమాటలు విని యంగన
మనమున కర్ణారుమీఁది మచ్చిక వదలెన్
వనిత పరపురుషబోధలు
వినినను మరుమీదనైన విరసము పుట్టున్.

17


వ.

ఇంక శూద్రకుని చరిత్రంబు వినుమని యిట్లనియె.

18


ఉ.

అంగజమూర్తి శూద్రకధరాధిపుఁ జూడగఁగోరి యొక్కమా
తంగలతాంగి యాత్మకరతామరసంబున నొక్కకీరమున్
సంగతిగా (ధరించి) జనసంఘము విస్మయ మంద ఱేనికిన్
ముంగలనిల్చి కీరకులముఖ్యునిఁ గానుగ యిచ్చి యిట్లనున్.

19


క.

చదువంగ నేర్చుఁ గావ్యము
(ల)దుకంగా నేర్చు మాటలాడఁగ నేర్చున్
ద్రిదశేంద్రవిభవఁ యీ శుక
మదియిది యననేల విద్యలన్నియుఁ నేర్చున్.

20


క.

అని విన్నవించి శూద్రక
జనపతి మన్నించి యనుపఁ జనియెను నృపుఁడున్
మన మలర జిలుకపలుకులు
(వినువే)డుక దానిజన్మవిధ మడుగుటయున్.

21


వ.

అక్కీరం బాశీర్వాదంబు జేసి యిట్లనియె.

22


సీ.

వింధ్యాద్రి దక్షిణోర్వీతలంబు(నఁ బంప
        యనఁ గల దొక్క)పద్మాకరంబు
తత్తటంబున భూర్జతరు వుండు (శాఖల
        నఖల)బ్రహ్మాండంబు నావరించి

యందు మాతలిదండ్రు లభివసింపగ నొక్క
        శబరుండు వారలఁ జంపుటయును
బోదనై యొకకంపపొద దూరి (హారీతుఁ
        డనుమునిఁ) జేరిన నతఁడు నన్ను


తే.

నుపచరించుచు జాబాలియొద్ద నిడిన
జ్ఞానమున మౌని నాదుజన్మంబు నెఱిఁగి
పెనిచి వృత్తాం(తమెల్లఁ జె)ప్పినను వింటి
నంతయును నీకు వినుపింతు నవధరింపు.

23


క.

తారాపీడుండను ధా
త్రీరమణుఁడు సుతులుకేమి ధృతిదరుగుచు నా
భూరమణుఁడు కలగనె సహ
చారిణివదనంబుఁ జొచ్చెఁ జంద్రుం డనుచున్.

24


అంత:


ఆ.

(మంత్రివరుఁడు) తనదుమగువకు నతనాభిఁ
గమల ముద్భవింపఁ గాంచె స్వప్న
మమ్మహీశ్వరుండు నమ్మంత్రివరుఁడును
సుతులు గలిగిరంచు మతులఁ దలఁచి.

25


వ.

ఉండి రంత నయ్యిరువురిభార్యలు పుత్రునిం గాంచిన......... (కొన్ని పత్రములు జారిపోయినవి)

26


క.

ఆపుండరీకుఁ డంతట
నాపై మోహంబు నిలిపి నను బిలిపింపగా
వాపోవునంత విరహ
వ్యాపారమునందు నలసి ప్రాణము విడువన్.

27


వ.

ప్రియమిత్రుండైన కపిలుండు దుఃఖింపుచున్న నేనును నతిదుఁఖితనై యున్నసమయంబున.

28

తే.

ఇందుబింబమ్ము వెడలొక సుందరుండు
పలికె నిట్లని రెండవభవమునందు
నీకు బతియగు వీఁడు నో నీలవేణి
యనిన నూరడి యేఁ దపమాచరింతు.

29


సీ.

అని వినిపించి నాయనుఁగు నెచ్చెలి మది
        రా చిత్రరథుల గారాపుదనయ
కాదంబరీ నామకన్యక గలదు నీ
        కిప్పింతు రమ్మని యిందుపీడుఁ
గొనిచని యాకాంతకును వివాహము సేయ
        నీపత్రలేఖ నయ్యెడను నిల్పి
జనకువ్రాలాకు వచ్చినసైన్యములఁ గూడి
        యాత్మపురంబున కరుదెంచి


తే.

జనకునకు మ్రొక్కి తగినదీవెనల బొంది
మంత్రికశునాసుఁ డాత్మకుమారు నడుగ
నతఁడు ననుఁగూడి రాడయ్యె నడన జిక్కి
నన బలాహకుఁ డిట్లనె నవనిపతికి.

30


క.

భూతావేశంబున శుక
రీతుల బల్కుచును నెవ్వరికిఁ దీర్పఁగ రా
కాతరువులలో దిరుగుచు
నేతరియైయున్నవాని నెటు (దేనొప్పన్).

31


వ.

అని బలాహకుండు వినిపించిన దారాపీడుండు కుమారునిఁ జూచి నీ వేమి చేసితివో (యని) కోపించిన నేఁ బోయి తోడ్కొని వచ్చెద నని బలాహకసహితుండై పురంబు వెలువడి యమ్మహా.....యాశ్రమంబున కరిగి యప్పుడు.

32

సీ.

వినమితుండగుచు దీవెన బొంది మత్సఖు
        (విధము నెఱుంగుదే) విమలనయన!
యెచ్చటనున్న వాడెఱుఁగు దే నెఱిగింపు
        మనిన మహాశ్వేత యనియె నప్పు
డొక్కసుకుమారకుఁ డొంటి నావెనువెంటఁ
        దిరుగుచు ననుఁ బట్ట కరము చాపం
గోపించి శుకమవై కూలుము నీ వని
        శపియింప విప్రుఁడు వచ్చె ననిన


తే.

అవనిపతి పుత్రుఁడును కవితాసుఁడైన
పత్రరేఖాదు లరిగి యప్పాటు చెప్ప
నంత కాదంబరీకాంత యరుగుదెంచి
దుఃఖమున పత్రరేఖయుఁ డురుగమణిని

33


వ.

వాగె పట్టుకొని శోకావేశంబున మరణంబు బొందెదనని యక్కొలన మునిఁగిన నయ్యశ్వంబు కపింజులుండను ముని యయ్యె నంతట శ్వేతకేతుం డచ్చటికిం జనుదెంచి దుఃఖంపుచున్న కాదంబరీ మహాశ్వేతా పత్రరేఖల నూరార్చె నప్పు డది విని తారాపీడశుకనాసులు నచ్చోటి కేతెంచి రంత.

34


క.

చిలుకై వైశంపాయనుఁ
డెలమి న్వహియించె నంత నిందుఁడుఁ జొచ్చెన్
లలిఁజంద్రపీడు దేహం
బలవైశంపాయానాఖ్యుఁ డబ్జుం డయ్యెన్.

35


వ.

అని జాబాలి మునీంద్రుండు ఋషులకు వినిపించుట విని యే నచ్చోటు వాసి యొక్కశ్యపచనివాసంబుపై త్రోవగా నరుగుదేర నొకమాతంగకన్యక నన్ను బట్టికొని తోలుఁబంజరంబున నిడియె నంత.

36

క.

రవి యస్తమించె బడమట
రవిపాషాణముల తీవ్ర రశ్ము లడంగెన్
భువనములు మూటికిమ్ముగ
గవిసెన యిడిరనఁగ నంధకారముఁ దోఁచెన్.

37


వ.

ఏనునుఁ బథశ్రమంబున నిద్రించి ప్రభాతరం బగుటయు మేలుకొని కనుగొనునప్పుడు.

38


ఆ.

పంజరంబు మంచిపసిఁడియైయుండిన
కన్య దెచ్చి మీకుఁ గాను కిచ్చె
యేమిగారణంబొ! ............
..............................

39


శా.

మాతంగాంగనఁ బిల్వబంచి తగుసన్మానంబునం బల్కెనో
ధౌతాంబోరుహ నే..............................మున్
చేతఃప్రీతిగ జెప్పుమన్న ననియెన్ శ్రీదేవి నేనీశుకీ
పోతంబే చెలికాడుమ...............డ్డవి..........

40


ఆ.

అట్టిశూద్రకుఁడు ప్రాణంబుతో బాసి
వోయి చంద్రపీడు బొందిచొచ్చె
..............................
తనువుచొచ్చి దేవధారి యయ్యె.

41


సీ.

ప్రాణంబు లీగతి బడసి చంద్రాపీడ
        పుండరీకులుగ.................
........బంధుజనులు సంతోషింపం
        జతురంగబలములు నతిఁడలిర్ప
కాదంబరీకాంత...............
        .......డు హృదయసంప్రీతి వెలయ
పుండరీకునకు నప్పొలంతి మహాశ్వేత
        భార్యయై....................

తే.

యిట్టిభవము మెఱయ మహీశసుతుఁడు
......సకలసైన్యంబు గొలువనుజ్వ......
....................నీపురి నధివసించి
చెలువుమీరంగ రాజ్యాభిషిక్తుఁ డయ్యె.

42


వ.

ఇంక నొక్కకథ చెప్పెద వినుమనిన.


సీ.

ఇలనిలా వర్షంబు నేలువజ్రుండును
        జనపతి నలువురు సచివవర్తుల
వరగృహాసన వస్రవాహనస్త్రీలను
        రినక్రొత్తగాఁబెట్టుఁడనినవారు
నట్ల చేయుచునుండ నందులో నొకమంత్రి
        వరుసకుఁ గన్నియ దొరకకయున్న
చింతింప నిమ్మంత్రి చెలికాఁడు వరరుని
        తంత్రినాఁదగు కన్య తనతనూజ


మంత్రివరునకు నిచ్చి యమ్మగువ వజ్ర
హనునిముందట నిడు మిది యఖిలకళలు
నెఱుఁగుఁ గథఁ జెప్పనేర్పు భూమీశ్వరునకు
నన్యచిత్తంబు లేకుండ నాదరించు.

43


(ననిన నమ్మంత్రివరుఁడును నట్ల సేయ)


తే.

దాదియనుచరగాఁగ నత్తంత్రికన్య
యుర్విపతిఁ గూడి సుఖగోష్ఠి నున్నవేళ
మక్కు వలరంగ నుపమాతదిక్కు చూచి
యొక్కకథ జెప్పె నమ్మాత యోకొనంగ.

44


వ.

కుంజరపురంబున నొక్కసార్ధవాహుండు బేరమువోవుచున్న నతనియెద్దు నడవిలో జిక్కిన విడిచిపోయిన నెద్దు లావుకొని ఱంకె వేసిన.

45

ఉత్సాహ:

బండియెద్దు ఱంకె చెవులఁ బడిన నుగ్రకోపియై
చండపింగకాభిదాన సత్యనాథుఁ డుధ్ధతిన్
చండసంహృతాహ్వుఁడైన జంబుకప్రధానునిన్
శౌండసత్త్వరాశి నరసిఁజూడచెప్ప రమ్మనెన్.

46


వ.

ఆసృగాలంబు మృగరాజున కిట్లనియె.

47


క.

బోయలతో నొకభూపతి
యాయోధన మాచరింప నడచేరివడన్
బోయి యొకనక్క దానిని
వాయింపుచుఁ బలలబుద్ధి వ్రచ్చుచునందున్.

48


వ.

ప్రవేశించి మాంసంబు గానక కడమదిక్కును వ్రచ్చి వెడలెఁ గావున రవంబుకుందలంక నేటి కనిన నక్కంఠీరవంబు తాఁబోయి యరిసి వచ్చెదనని చని యానందకునిఁ గాంచి యిట్లనియె.

49


ఉ.

ఎందులనుండి వచ్చితి మృగేశ్వర! యన్నను దేవనైచికే
నందనుఁ డాభినందకుఁడ నందకనాముఁడ నాకభూమి నా
మందిర మిద్ధరామృగసమాజముఁ జూడగ వచ్చినాఁడ
చంద మిదన్న పంచముఖి సఖ్యముఁ జేసెను నంచు తోఁడినాతన్.

50


వ.

అది యెఱింగి సంహృతనామజంబుకం బాత్మకులంబు గూర్చుకొని యిట్లనియె.

51


క.

సహవాసదోషముననే
మహితాత్మునకై న నదియ మార్గంబగు స
త్సహవాసంబున ఖలుఁడును
మహితాత్మకుఁ డగుచు జనులమన్నన గాచున్.

52


వ.

అది యెట్లనిన.

53

సీ.

వేఁట వో యొకభూమివిభుఁడు బోయలపల్లెఁ
        జేరంగ వాకిట చిలుక చూచి
జనపతి చనుదెంచె జంపి సొమ్మెల్లను
        బుచ్చుకొండనుటయుఁ బోకమగిడి
యొకమునీశ్వరుల పల్లెకుఁ జేర వాకిట
        కీరంబు వలికెను క్షితివిభునకు
నర్ఘ్యపాద్యాదు లిమ్మనిన సంతోషించి
        మునుపటి చిలుక త న్ననినమాటఁ


తే.

జెప్పుటయు భూమిపతికి నచ్చిలుక పలికె
నట్టికీరంబు నాతోఁడ బుట్టె దుష్ట
సంగతంబున నిన్ను నబ్భంగి ననియె
శిష్టసంగతి నేఁ బూజ సేయుచుంటి.

54


వ.

అట్లు గావున.

55


క.

నందకసంగతి మనలను
నిందఱ దిగవిడిచె నీమృగేంద్రుఁడు భేదం
బిందు ఘంటింపకయున్నను
ముందటికార్యంబు మనకు మోసముగాదే!

56


వ.

అట్లు గావున నేఁజెప్పినబుద్ధిక్రమంబున నడచుట లెస్స నడవకయున్న నపాయంబు వుట్టు నది యెట్లనిన.

57


క.

సత్పురుషు లేవి చెప్పినఁ
దాత్పర్యముతోఁడ నదియ తగఁ జేయదగున్
హృత్పురుషు లేది చెప్పిన
తత్పరతం దిరుగఁ గార్యతత్వము దప్పున్.

58


వ.

అది యెట్లనిన.

ఆ.

కచ్ఛపంబుతోఁడఁ గలహంస లొకరెండు
మైత్రి చేసి యొక్కమడుగునందు
మెలఁగ నాహ్రదంబు జల మింకఁబారిన
నంబుచరము చూచి హంస లనియె.

60


వ.

మానససరోవరంబున కరిగెదము నీవు వచ్చెదేని యీకాష్ఠంబుఁ గఱచిపట్టుకొని మాటాడకయుండు మనిన నది యట్ల చేసిన.

61


తే.

రెండుహంసలు నక్కఱ్ఱ రెండుగడలు
కఱచుకొని యెగసివోవ సృగాల మొకటి
యంబుచారంబు భక్షింతునని తలంచి
గగనమున నున్న హంసలఁ గాంచి యనియె.

62


క.

కటకట! యీకమఠము మీ
రటుగొని చను టెల్ల మెసఁగనా! యన ముఖసం
పుట ముడిగి హంస లేలా!
యటు చేసెద రనుచుఁ గూర్మ మవనిం బడియెన్.

63


క.

కొక్కెరలు వాసిపోయిన
నక్కయుఁ దాబేటిఁ జేరి నమలఁగఁ బోవన్
జక్కగ నవయవములు దన
యక్కటిలో నణఁచియున్న నాజంబుకమున్.

64


ఆ.

తినఁగ నలవిగాక త్రిమ్మలుఁ గుడువంగ
కమఠ మనియె జంబుకమును జూచి
నేర్పు లేదు నీకు నీటిలో నానంగ
బెట్టి తినుము వేఱె పెట్టవలదు.

65

క.

ఇది యవునని కమఠంబును
వదనంబునఁ గఱచికొని శివాప్రభుఁ డరిగా(?)
నదినీట ముంచి మీఁదం
బదమిడి యొకకొంతప్రొద్దు పదిలము జేసెన్.

66


వ.

అక్కచ్ఛపంబుఁ బిలిచి నానితివోటని యడిగినం గొంతకొంత నానుచున్నదాన క్షణమ్ము నిలువుమనిన నదియును నట్ల చేసి కొంతప్రొద్దునను నెప్పటియట్ల పిలిచి యడిగిన.

67


క.

పేరవనాయకఁ దేహము
నీరునఁ దగనానె నడుగునిలిపినచోటన్
వారిం దడియని కతమున
దారువువలె నున్న దడుగుఁ దలఁగింపవయా.

68


క.

నీపద మించుక నివియుము
కోపింపక యనిన (దివియఁ కూర్మపతియుఁ దా)
నాపద దప్పిన జలముల
లోపలికిని (బోయె నాత్మలోకంబునకున్.)

69


క.

అది గావున వచనస్థితి
హృదయంబున నిలుపరేని నిందఱు హింసా
చ్యుదితములు మఱచి త్రెళ్ళిన
యుదకచరం బట్లు నాశ మొందుదు రనుచున్.

70


తే.

నందకుం డున్నయడకు నానక్క యరిగి
క్రూరజంతువు సింహంబుఁ జేరి యెట్లు
బ్రతుకఁదలచితి వది యేల బ్రతుకనిచ్చు
మిగులనాఁకలి పుట్టిన మెసఁగుగాక!

71

క.

క్రూరుల సహవాసంబును
వైరుల యాశ్రయము చెనఁటి వనితల పొందున్
గోరిక లుడుగ మనుజులం
జేరిన వేల్పులకు జేటు సిద్ధముగాదే.

72


వ.

అని నందకుఁ జూచి మఱియు నిట్లనియె.

73


ఆ.

యొక్కరాజుశయ్య నొందిన యంశుక
యూక మొక్కనల్లి రాక చూచి
యనియె నీవు గుట్టి చనుదువు నే నని
పట్టి చంపుదురు స్వభావ మదియు.

74


వ.

అనుసమయంబున వారిద్దఱు వాదడువ నమ్మహీపతి శయనించిన నల్లి గుట్టి చనిన వెదకి చీరపేల నెల్లఁ జంపి రట్లు గావున మఱియును నొకథ వినుమని జంబుకంబు నందకున కిట్లనియె.

75


క.

శాంతుఁడని నమ్మి దుర్జను
చెంతన్ వసియించి పలుకు చేసిర యేనిన్
గాంతురు సుజనులు భయదకృ
తాంతగ్రైవేయభూషణాంచితమహిమల్.

76


వ.

అది యెట్లనిన.

77


క.

ఒక్కయగాధపుమడువున
గొక్కెరయును మత్స్యములునుఁ గూడుండినచో
నక్కుటిలబకము ఝషముల
దిక్కుగనుంగొనుచు నేడ్చె ధృతి దరుగంగన్.

78


సీ.

కొక్కెర యీరీతి గోలుగోలున నేడ్వ
        మీనంబులెల్ల సన్మానమునను
జేరి యేడ్చుటకునుఁ గారణం బెట్టిది
        యనిన ననావృష్టి యరుగుదెంచె

నీమడు గింకు మిమ్మిందఱి డించిపో
        వగజాల కేడ్చెద ననుఁగులార!
మన మిందఱము గూడి మానసంబున నవ
        గ్రహదోషకాలంబు గడపి మగుడ


తే.

వత్త మనవుండు మేమెట్లు వత్తు మనిన
చంచుపుటమున గొనిపోదునంచు బట్టి
యుడుపథంబున కేఁగి యొండొక్కచోట
భక్షణముచేయు దినమున బకవిభుండు.

79


వ.

అంత.

80


క.

ఒక యెండ్రిక, ననుఁ గొనిపో
బకవల్లభ! యనిన దాన్ని బట్టుకపోనే
రక, దానిడెక్క దనకు
త్తుక యిఱుకగఁ జేసి యరుగదొడిరిన నదియున్.

81


వ.

అవ్విధంబున నరిగి యబ్బిసకంఠిక వ్రాలు శిలాతటంబున గనుపట్టు మత్స్యశల్యంబులు చూచి యిప్పాపాత్ముం డిందఱి భక్షింపంబోలునని తనడెక్కల కంఠంబిఱికి చంపెం గావున.

82


క.

నందక! నీవక్కేసరి
యందున్ విశ్వాస ముడుగు మని జంబుక మా
నందుని వీడ్కొని సింహము
ముందరికి బోయి మొగము ముణుచుచు బలికెన్.

83


తే.

ఉష్ట్రమొక్కటి వనమున నొంటిచిక్కి
తెలఁగి సింహంబుతో మైత్రిఁ జేయుచుండ
శివయు కాకియుఁ దాని భక్షింపఁదలఁచి
కాకితోడుత నజ్జంబుకంబు పలికె.

84

సీ.

తీతువపిట్ట లబ్ధిప్రదేశంబున
        గ్రుడ్డుల బెట్ట నాగ్రుడ్డు లవసి
పిల్లలౌటయు వానిఁ బెట్టి మేతకుఁ బోవ
        నవి సముద్రుఁడు గొంచు నరుగుటయును
పెంటి దుఃఖింపంగ పెట్టఱేఁ డూరార్చి
        కథ చెప్పఁదొడఁగె దుర్గంపుటడవి
పులి వెంటఁబట్టిన బోయండు పారియుఁ
        దరు వెక్కుటయును నాతరువునందుఁ


తే.

దొల్లి యున్నట్టిప్లవగ మాభిల్లుఁ దిగిచి
యిరవు గానంక తలమున నీఁగికొనిన
పులియు నొవృక్షతలమున నిలిచి కపినిఁ
బలికె నిట్లని సాంత్వనభాషణముల.

85


తే.

ఒక్కవనమున మనము గూడున్న నీవు
నన్ను విడువంగఁదగునె వానరకులేంద్ర
నమ్మి నినుఁ జెరుచు నరుఁడు నిక్కమ్ముగాఁగ
వినుము జెప్పెద దొ ల్లొక్కవిప్రవరుఁడు.

86


క.

అడవికి సమిధల కరుగుచు
వడగొని యుదకంబు గ్రోలవల సొకనుయ్యొ
క్కెడ గాంచి చేర నందులఁ
బడి భయపడు వ్యాఘ్రమనుజఫణికపివరులన్.

87


ఆ.

వెడలఁదీయఁదలఁచి నిడుదవల్లులు వైచి
ద్వీపినాగకపులఁ దిగిచివైవ
నీవు గలుగఁబట్టి యీవేళ బ్రతికితి
మవనిసురవరేణ్య యనుచు బలికి.

88

వ.

ఈనూతం జిక్కినస్వర్ణకారుండు పాపిష్ఠి వీని వెడలం దివియకుమని బుద్ధి చెప్పి యొకవేళ మమ్ముం జూడ విచ్చేయుఁడని యధేచ్ఛం జనిన నమ్మహీసురుం డప్పుడు.

89


క.

పాపము మర్త్యుం డకటా
కూపము వెడలంగ లేక కూపెట్టడు నీ
కూపము వెడలించెదనని
యాపారుఁడు వెళ్ళదిగిచె నయ్యగసాలిన్.

90


సీ.

అంతట నొక్కనాఁ డవనీసురేంద్రుండు
        వనమున కరుగ నవ్వనచరంబు
తనపూర్వ మెఱిఁగించి దండమర్పణ చేసి
        పుష్పఫలాదుల పూజసేయ
నవి యందికొని విశ్రుడట వోవ నొకపెద్ద
        పులిఁ జూచి భయమునఁ బొందుటయును
వెఱవకుమని తనవృత్తాంత మెఱిఁగించి
        తానొక్క రాజనందనునిఁ జంపి


తే.

దాచినటువంటి సొమ్ము లద్ధరణిసురున
కిచ్చుటయును నొక్కపురమున కేఁగి ద్విజుఁడు
నాఁటియగసాలి చేతికి నమ్మి యియ్య
నృపతిపుత్రకు తొడవుగా నిశ్చయించి.

91


క.

భూపాలపుత్రుఁ జంపిన
పాపాత్ముం డనుచు విప్రుఁ బట్టింపించెన్
క్ష్మాపతియు విప్రవధ కా
జ్ఞాపించెన్ దలవరులునుఁ జనిరట వారున్.

92

ఆ.

అంత దొంటియురగ మారాజకూఁతును
గరచి విషము దిగక కస్తిబెట్టె
మంత్రతంత్రవిధుల మగుడక యవ్విప్రు
దిక్కు చూచినపుడె తిరిగె విషము.

93


క.

క్ష్మాకాంతుఁడునా విప్రున
కాకన్నియ నిచ్చి యతనికారాజ్యం బీఁ
గైకొనియేలుచు నాభూ
షాకారునిఁ జిత్రవధగఁ జంపించె వెసన్.

94


క.

విపరీతజాతులైనను
నుపకారం బెఱిఁగి సేయ నుపకృతిఁ జేయున్
గపటియగు మర్త్యుఁ డుపకృతి
కపకారమె తలంచువాని నణఁపగ వలయున్.

95


వ.

అనిన నవ్వానరం బిట్లనియె.

96


క.

హరిచే మృతిఁ బొందివపులి
నరుఁ డౌషధ మిడిన వైద్యు నదియే మ్రింగున్
బరికించి దుష్టజనులకు
బురుషార్థము సేయునతఁడె పొలియుం బిదపన్.

97


వ.

అని యవ్వానరంబు కిరాతు నుత్సగంబు తలయంపిగా నిద్రించుసమయంబున నప్పులి యాశబరున కిట్లనియె.

98


సీ.

వృక్షాగ్రమునఁ గలవింకము లొకరెండు
        నీడము ఘటియించి నిలిచియుండ
వర్షంబు గురియంగ వడఁకెడుకపిఁ జూచి
        కలవింకములు వల్కెఁ గరుణవొడమి

గుడిలోననైనను గుడిసె కట్టుకనైన
        వెచ్చనిచో నుండ నిచ్చఁగాదె
యనినఁ బక్షులు నన్ను నపహాస మొనరించె
        బ్రదుకుదురో! యని ప్లవగ మపుడు


ఆ.

గూడువెట్టియున్నకుజశాఖ ఖండించి
యేటిలోన వైచె నిది వనచర
గుణముగాన దీనిఁ గూలంగ వడిఁద్రోయు
మనినఁ ద్రోసె భిల్లుఁ డగచరమును.

99


వ.

ఇవ్విధంబున వనచరంబు పడి మగుడం జె ట్టెక్కుసమయంబునఁ బులి దానితోఁక పట్టుకొనిన వనచరం బిట్లనియె.

100


క.

కడుమోస పోయి తక్కట
మెడఁబట్టక యనిన పులియు మెయికొని తోకన్
విడిచి మెడఁ బట్టఁబోయిన
యెడగని యబ్భూరుహంబు నెక్కెం గపియున్.

101


వ.

శార్దూలంబును యధేచ్చ నరిగె, వనచరంబును భయపడు కిరాతు వెఱ వుడిపి ఫలంబులు దెచ్చెదనని యరుగుటయును.

102


ఆ.

భిల్లుఁ డగచరంబు పిల్లల భక్షించి
యంతఁ గ్రోఁతి వచ్చి యడుగుటయును
పిల్లలున్న వసతి యల్లదె యనిచూప
బోయి వానరంబుఁ బొదివి చంపె.

103


వ.

పులియునుం గృతఘ్నుండని కిరాతుని భక్షింపుట దోషం బని విడిచెనని కథ చెప్పిన టిట్టిభం బిట్లనియె.

104


క.

ధరణి కృతఘ్నుండగున
ప్పురుషుని భక్షింప మాంసభుక్కులు రోయున్
బరికింపఁ గృతఘ్నతకును
సరియగు పాపంబు లేదు శాస్త్రనిరూఢిన్.

105

వ.

అట్లు గావున పిల్లలఁ దేకుండితినేని నక్కిరాతుండు బోయినగతిం బోదునని శపధంబు పలికి యప్పుడు.

106


ఆ.

కులము నెల్లఁ గూర్చుకొని గరుడికిఁ జెప్ప
గరుఁడు డవ్విధంబు హరికిఁ జెప్ప
హరియుఁ జక్ర మేయ హరికి నంబుధి మ్రొక్కి
నెమ్మి నిచ్చె టిట్టిభమ్ము సుతుల.

107


వ.

అట్లు గావున.

108


క.

ఏజాతి నుద్భవించిన
నాజాతిం బ్రోచువాని నఖిలజగమ్ముల్
పూజించు నట్లు గాదే
దేజం బణగించు మేనితెవులును బోలెన్.

109


వ.

మఱియును.

110


క.

కీ డాచరించు మనుజులు
కూడి మెలఁగువారువలెనె కుత్సితవృత్తిన్
గీడే సేతురు నమ్మిక
గూడిన కీఁ డగును సాధుగుణులకునైనన్.

111


వ.

అని శివావాయసంబు లొట్టేనుఁగుతోఁ గపటస్నేహంబు చేసి మృగపక్షికులంబు గూర్చుకొని యుష్ట్రసహితంబుగా సింహంబు ముందటికిం జని యిట్లనిరి.

112


క.

ఆకొన్నాఁడవు మృగవర
నీకేటికి నవయ మమ్ము నిలువరుసగ నీ
యాఁకలి దీరుచుకొమ్మని
చేకొని యుష్ట్రంబు నిడిరి సింహంబునకున్.

113

వ.

అని చెప్పి సంహృతజంబుకంబు నందునియొద్దకు వచ్చిన విశేషంబులు గలవే యని యడిగిన నిట్లనియె.

114


తే.

కుంజరశ్రేష్ఠుఁ డొకలతాకుంజమునను
పత్రకాండచయంబునుఁ బగులఁద్రొక్క
ఖగము లెల్లను గజము నిష్కారణముగ
గ్రుడ్లు ద్రొక్కెనే యని గమిగూడి యపుడు.

115


వ.

తమసఖులైన నీలమక్షిక మండూక ద్రుమకుట్టన వాయసంబుల కెఱింగించిన నవ్వాయసం బిట్లనియె.

116


సీ.

మును కృష్ణవల్కలుండను చిల్క సేవించి
        బలవైరికడ కంపఁ జిలుక మ్రొక్కి
యంతకు దర్శించి యతనిపీఠముక్రిందు
        చొచ్చిన నింద్రుఁడా శుకముఁ జూపి
జరయుఁ జావును లేని సంసార మీచిలు
        కకు బెట్టుఁ డనిన నక్కాలుఁ డపుడు
మృత్యువు రప్పించె మృత్యువు చిత్రగు
        ప్తునిఁ బిల్వ చిత్రగుప్తుఁడును వచ్చె


ఆ.

శక్ర చిత్రగుప్త శమన మృత్యువు లిట్లు
గూడినపుడె చిలుక గూలు ననుచు
బ్రహ్మవ్రాతగాన బడియె నక్కీరంబు
ఫాలలిఖితఫలము లేల తప్పు.

117


వ.

అనిన మండూకం బిట్లనియె.

118


క.

ఉద్యోగాన్వితుఁ డగునే
సద్యఫల మిష్టభోగ సంపద లబ్బున్
వేద్యము లగుహృద్యములు ని
రుద్యోగికి కార్యజాత మూరక పొలియున్.

119

వ.

అదియెట్లనిన.

120


సీ.

 గరుడుండు[2] తాఁబేళ్ళఁ బొరిగొని భక్షింప
        మతిమంతుఁ డనెడు కూర్మంబు ఖగవుఁ
గనుగొని పలికె నోఖగకులవల్లభ
        జలమున నీకంటి జవము కలిగి
పరచెద నీ వభ్రపథమున బరవు మే
        నోడకుండినఁ దినకుండు మమ్ము
నోడినఁ దినుమన్న నొడబడో ఖగపతి
        కూర్మంబు చని తనకులమువారి


ఆ.

కెఱుఁగ జెప్పి వార్ధి నిందఱమును జేరి
సాగి పక్షి యాకసమునఁ బరిచి
పిలచినపుడె మనము తలచూపి గెలుతుము
రమ్మటన్నఁ గచ్ఛపమ్ము లలరి.

121


వ.

అవ్విధం బాచరించి కచ్ఛపంబులు గరుడునిచేతిఘాతలకు బాసి చనియెఁ గావున.

122


క.

పలువు రొకమూఁక గూడిన
బలవంతుని నైన చిక్కు పరుతురు తార్క్ష్యున్
గెలువవె కచ్ఛపములు మును
జలనిధిలోఁ దలలు చూపి సాహసవృత్తిన్.

123


వ.

అనిన నీలమక్షికం బిట్లనియె.

124


క.

మనుజుఁ డుపాయంబున నే
పనియైననుఁ జేయనోపు బలియుండువలెన్
మనుజుం డుపాయహీనుఁడు
ఘనభుజబలుఁ డయ్యుఁ గార్యగతులకుఁ దప్పున్.

125

వ.

అది యెట్లనిన.

126


సీ.

తొల్లి యనావృష్టి దోఁచుటయును నొక్క
        పారుఁడు బోయలపల్లె చేరి
యయ్యవగ్రహకాల మరిగినఁ దమభూమి
        కరుగంగఁ దలఁచి బోయలకు నెల్ల
దధిదుగ్ధఘృతముఖోత్తమ[3]పదార్థములతో
        విందు వెట్టిన భిల్లవిభుఁడు మెచ్చి
యీబహులద్రవ్య మెక్కడి దన్నను
        ధేనువుఁ బితికి సాధింతు ననిన


ఆ.

గోవు మూల్య మిచ్చి కొనిపోయి పిదుకంగ
నెఱుఁగు కవనిసురున కిచ్చినట్ల
యిమ్ము మాకు ననిన నీకున్న దూడతో
విడిచి దాని నూరు వెడలగొట్టె.

127


వ.

అని చెప్పిన యందఱు గూడుకొని మత్తగజంబుసకు గవిసి.

128


ఆ.

మ్రానుపోటుఁబులుఁగు మర్దించె కన్నులు
కాకి వానిఁ దిగిచి కస్తిచేసె
నందు నిప్పు పెట్టె నానీలమక్షిక
యంత పాడునూఁత నఱచెఁ గప్ప.

129


వ.

ఆరావంబు విని యమ్మత్తేభంబు దప్పికొన్నది గావున నచ్చట నీ రున్నదని వోయి యానూతం బడి మృతంబయ్యెఁ గావున.

130


క.

బలవంతుఁడ నగవలవదు
పలువురతో నిగ్రహించి భంగము పొందున్
బలవంతమైన యేనుఁగు
పులుఁగులచే భంగమంది పొలియెదె పిదపన్.

131

వ.

అని మఱియు నిట్లనియె.

132


సీ.

..........................
        ............................
పితృభూమి బడియున్న పీనుగు నడుగు మీ
        వనవుడు బోయి వాఁ డడుగుటయును
నుజ్జినిపురవర మొద్ద నుండిన మఱ్ఱి
        క్రిందని చెప్పం బుళిందు డపుడు?
దానభోగక్రియాధర్మాత్ముఁడై యుండ
        మృత్యువు చక్కనిమెలఁత యగుచు


తే.

నాతనికిఁ బత్నియై యొక్కయవసరమున
నతఁడుఁ దానును బండెక్కి యరుగుచుండ
గొఱ్ఱె పోయినదని పుఱి గొల్లవారు
చూడ మృత్యువు గొఱ్ఱెయై సొగయుటయును.

133


క.

ఇదిగో మాగొఱ్ఱియ యని
యది రాజున కెఱుఁగ జెప్ప నాతస్కరునిన్
పదిలముగ మఱ్ఱిక్రిందను
వధియింపగఁ బంపె వాని వసుధేశ్వరుడున్.

134


వ.

అట్లు గావున.

135


క.

ఏవలన వచ్చి పొందునొ
దైవికమునుఁ దప్పఁ ద్రోవ ధాతకు వశమా
దైవికమె ప్రధానమ్ముగ
భావింపగ మానుషంబుపని యేమిటికిన్.

136


వ.

అని నందకు వీడ్కొని యజ్జంబుకంబు చండపింగళుండను సింహంబుముందటికిం జని యిట్లనియె.

137

క.

కొమ్ములుగలవానిని నఖ
రమ్ములుగలవాని శస్త్రరతుఁడగువానిన్
నమ్మిక దీయఁగ వలవదు
చిమ్మును నాటించు జంపు చేరగ నేలా.

138


వ.

అట్లు గావున.

139


క.

నమ్మంగవలదు నందకుఁ
గొమ్ములు చూపెడిని, వాని గుణ మెట్టిదియో
నెమ్మి గలదేని నొకవ
ర్షమ్మున నాజాడ చూడు సత్యకులేంద్రా.

140


వ.

అనునంత నొకయకాలవర్షమ్ము గురిసిన నందకు రమ్మని పిలువ బంపుటయును.

141


క.

వానకు తలవంపుచు న
ద్ధేనునుతుం డరుగదేర దృష్టించి శివా
జ్ఞానంబు మెచ్చి కేసరి
యానందకు కంఠ మలమ నది చిమ్ముటయున్.

142


క.

సింగంబు పండ్లు నాటిన
నంగము దొరగుచును నందుఁ డాయతరేఖా
శృంగములఁ జిమ్మ హరియు న
ణంగెను విధి చేయుపనికి నాగగ వశమా!

143


వ.

అని కథ చెప్పి దాదిం చూచి మఱియు నిట్లనియె.

144


ఆ.

సహజరిపుఁడు తానె జావంగఁ జూడక
చేరఁదిగిచి రక్ష చేసిరేని
వానిచేత దా రవశ్యము జత్తురు
సర్పహతిని హరులు చచ్చినట్లు.

145

వ.

ఎట్లనిన.

146


క.

ఒకవేసవికాలంబున
సకలజలంబులును నింక సర్పం బుదకం
బొకచోటను గానక నూఁ
తికి జని భేకములు గాంచి దీనాననయై.

147


వ.

ఆకప్పలఁ బ్రార్థించి క్షుధాపరవశుఁడ నైతి నీరు గ్రోలఁ దిగివచ్చెద నని యిట్లనియె.

148


క.

పరిపంధి శరణు చొచ్చిన
విరసముగాఁ జూడ కాప్తువిధమున నయ్యా
తురునిఁ గని రక్షచేయుట
పరమంబగు ధర్మ మనుచుఁ బలుకుదు రార్యుల్.

149


వ.

అని కరుణంబుగాఁ బలికినఁ గొన్నికప్పలు సమ్మతించిన కృష్ణుం డనుదర్దురం బక్కప్పల కిట్లనియె.

150


సీ.

ఒక్కవిద్యాధరు నుగ్మలిగర్భిణి
        యొకయుత్సవము చూడ నుత్సహించి
నడువ లేననిన నన్నాతుకగర్భంబు
        తాఁ దాల్చి యనిపినఁ దరుణివోయి
యయ్యుత్సవముఁ జూచి యంతట నొకజార
        పురుషునితోడుత పొందుచేసి
పదఁపడి యింకగర్భము దాల్చ నేనోప
        నని జారువెంటనే యరుగుటయును


తే.

అతివ గర్భంబు దాల్చిన యభ్రచరుఁడు
మాసములు తొమ్మిదియు నిండి మడసెఁగాన
ఫణులఁ గాంతల నమ్మి చేపట్టిరేని
ప్రాణగొడ్డంబులగు నట్టిపనులు పుట్టి.

151

వ.

అనిన నురగం బిట్లనియె.

152


క.

ఆశావశుఁడై మానవుఁ
డాశయ పూనంగ వాని నాశయ చెఱుచున్
డాసి(?)యొకనక్క మిక్కిలి
యాశన్ గొనయంబు గొఱికి హతుఁడగు పగిదిన్.

153


వ.

అది యెట్లనిన.

154


ఆ.

శబరుఁ డొక్కభద్రసామజంబును జంప
నొక్కపుట్ట యెక్కి యుగ్రశరము
వరపఁ బాము వెళ్ళి కఱచిన ఫణిఁ జంపి
చచ్చె సామజంబు చచ్చె నంత.

155


ఆ.

నక్క యొకటి చేరి నాగంబు నాగంబు
శబరుఁ జూచి మదిని సంతసిల్లి
దినము నెలయు నైదుదినములు భక్షింప
నబ్బెననుచు మిగుల నాశవొడమి.

156


ఆ.

భుజగకరటినరుల భుజియింప నేటికి
గొనయముననె భుక్తిఁ గొందు ననుచు
వింటికొప్పు గళము నంటించి గొనయంబు
నరముఁ గొఱుక మిడిసి శిరము దునిమె.

157


వ.

అట్లు గావున నిక్కూపం బెల్ల మీసొమ్మను నత్యాశ విడువుండని మఱియు నొక్కకథ చెప్పం దొడంగె.

158


క.

లోభంబు నరకహేతువు
లోభం బపకీర్తి కరము లోభంబు జగ
త్రాభవదూరము గావున
లోభం బుడుగంగవలయు లోకోత్తరుఁడై.

159

వ.

ఇది యెట్లనిన.

160


సీ.

వ్యవహారు లిద్ద ఱాయసము నోడనునిచి
        వనధి జనద్వీపమునకు నరుగ
నంత నొక్కఁడు రోగియై పోవలేకున్న
        నొకఁ డేగి బంగారునకును మార్చి
కొని తెచ్చి యేకాంతమున నమ్మికొనఁ దోడి
        వ్యవహారి పాలు ద న్నడుగుటయును
యెలుకలు దినిపోయె నినుమంతయును నీకుఁ
        బాలు వెట్టగలేదు పసిఁడి యనిన


ఆ.

నతని తనయుఁ డింటి గాడంగ వచ్చిన
డాఁచి యతఁడు వచ్చి తనయు నడుగ
గ్రద్దయొకటి గొంచు గగనంబునకు నేఁగె
ననుచుఁ గపటవృత్తి నడలుటయును.

161


క.

జనపతికి విన్నవించిన
మనుజేంద్రుం డనియె గ్రద్ద మానిసి నెటుగాఁ
దినె ననిన లోహ మెలుకలు
దినినట్టుల గ్రద్ద శిశువుఁ దినెనని పలికెన్.

162


ఆ.

జనవరుండు పసిఁడి సమభాగ మిప్పింప
నతనికొడుకుఁ దెచ్చి యప్పగించె
నమ్మిపెట్టినట్టి సొ మ్మీని విశ్వాస
పాపి యనుచు వైశ్యుఁ దాపెఁ బురికి.

163


వ.

మఱియు నొక్కకథ వినుమని యిట్లనియె.

164


సీ.

సింధుమతీపుర క్షితిపతి చచ్చిన
        గొడుకు లిద్దఱు తండ్రి పుడమి పంచి
కొని రాజ్య మేలుచుఁ గూడి వేఁటకు నేగి
        సేన గూడఁగలేక చిక్కుటయును

రాజ్యలోభంబున రాకొమరుండు సో
        దరుఁ జంపుచో నొక్కతరువు గదల
శంకించి నగరికిఁ జని రాత్రి యొక్కట
        పురవార్త లరయుచుఁ దిరుగువేళ


తే.

నొక్కవడ్లంగి[4] తనప్రియ నుపచరించి
తరువుచలనంబు రాజనందనుని మదినిఁ
బాయకున్నట్లు నామది బాయవనిన
విని మనుష్యులు తనుఁ గని రనుచు జచ్చె.

165


వ.

అట్లు గావున లోభంబు విడువ..........బు ప్రవేశించి యుదకంబు గ్రోలి దినదినక్రమంబున నొక్కొక్కమండూక.............గజనామప్లవంబున కిట్లనియె.

166


క.

బుద్ధిగలవారువలె ని
నిర్బుద్ధులు పెక్కండ్రు సిద్ధబుద్ధుని నైనన్
బుద్ధికిని బాపి యమకృత
బద్ధంబునఁ దాము నతఁడు బడుదురు పెలుచన్.

167


వ.

అట్లు గావున నొక్క కథ వినుమని యిట్లనియె.

168


ఆ.

తొల్లి యొక్కచోట దొంగలు మేకల
మంద గొంచుపోవ నందులోనఁ
జేరి నడవలేని చింబోతు దిగవిడి
పోవ వ్యాఘ్రభీతి గ్రావ మెక్కి.

169


వ.

యొక్కగంటి మీదబడియున్న సమయంబున.

170


క.

హరి గనుగొని నీ వెవ్వఁడ
వరుదెంచితి కిట్టిచోటి కనుటకు నక్కే
సరి కనియె నింద్రయజ్ఞపుఁ
బురుషుఁ డనగ గడ్డమేల పొందెను నీకున్.

171

వ.

అనిన నిట్లనియె.

172


క.

కరటుల నేబదియునుఁ గే
సరులను నైదింటి వ్యాఘ్రశతమును దింటిన్
హరియొకటి గొఱఁత నిన్నున్
బొరిగొని గడ్డంబు వపనముగ నొనరింతున్.

173


క.

అని పలుక వెఱచి సింహము
చనియెన్ మతిగ లుగునట్టి జనులకు బీడల్
తనికినను వేగ యణగు
దినపతి యుదయింప నణఁగుతిమిరము పగిదిన్.

174


వ.

అని మఱియు......... నుండి............యెండ్రిక యొక్కచో నెండుచున్నఁ జనుదెంచి జలకలశంబున నిడికొని చనియెడిచోఁ బథశ్రాంతి బొంది వృక్షమూలమున నిద్రింపంగ నొకకాకి ద్విజుని గ్రుడ్లను నాకుఁ దెచ్చిపెట్టుమని పోతుఁగాకితో ననుటయు నీసఖు ఫణి బంపు నిద్రించు పారుఁగఱవ.

175


ఆ.

నని నట్ల చేయ నహివిప్రుఁ గఱచిన
వాయసంబు విప్రవరునిగ్రుడ్లు
కెలఁకవచ్చి కుండిజలములు గొనఁబోవ
నెండ్రి కంఠ మిఱికి పట్టె.

176


క.

విప్రు బ్రతికింపకుండిన
నీప్రాణము గొందుననిన నీచఖగంబున్
క్షిప్రమె బోయం బనిచిన
సప్రాణుం జేయ లేచె జగతీసురుఁడున్.

177


క.

కాకి కడుబాపి యంతకు
కాకోదర మధికపాపి కాకోదర త
క్కాకముల కంటె మిక్కిలి
భూకాంతుఁడు పాపి యండ్రు బుధజను లెపుడున్.

178

ఆ.

ఇతరజాతులైన హితుఁ బ్రోచు నొక్కొక
యెడరుపుట్టి నప్పుడెఱుక వొడమి
యెండ్రి విప్రుప్రాణ మెత్తెను కాకంబు
గళము బిగియఁబట్టి కాననమున.

179


వ.

ఆబ్రాహ్మణుండు గంగయందు నక్కర్కటకంబు బెట్టి స్నానంబు చేసి చనియెఁ గావున.

180


క.

అని హరులు బుద్ధి చెప్పఁగ
వినియును విననట్ల హరుల వెదకుఁచు నన్నిం
టిని మెసఁగి చనియె బామున
కును పాలిడి పెంప విషము గురియక చనునే.

181


వ.

అని తంత్రి దాదిం జూచి యిట్లనియె.

182


క.

పలువురు పగతులలోనికిఁ
బలవంతుఁడ ననుచు నరిగి ప్రహరుషలీలన్
బలుమారు జెప్పుకొనెనే
బ్రళయంబగుఁగాక యెట్లు ప్రాణము నిలుచున్.

183


వ.

అది యెట్లనిన.

184


సీ.

జలనిధిదరిఁ బక్షిసంఘము తమ కొక్క
        యధిపతి వలెనని యాత్మఁ దలఁచి
పరశురామునిచేత భంగముబొందిన
        క్రౌంచపర్వతము రంధ్రమునఁ బుట్టి
నట్టియంచను ఖగపట్టబద్ధునిఁ జేయఁ
        దగబరద్వేషిణి ధ్వాంక్ష మనియె
కలహంస నిర్బుద్ధి గద్దఁ గట్టుదమన్న
        నర్హంబుగాదు వింధ్యాద్రియందు

ఆ.

రక్తనేత్రుఁ డనెడు గ్రద్ద పక్షుల కెల్ల
భర్త యగుచునుండఁ బ్రథమమంత్రు
లైనరక్తకేతుఁడను నక్కయు నుదా
త్తుండు నాఁగఁబులియు దుర్మదమున.

185


వ.

ఖగబలంబునకును గ్రద్దకు నెడసేయఁదలఁచి పక్షికులము దండ కరిగి.

186


చ.

అధిపతినంచు గ్రద్ద మిమునందఱి నీనగ వింధ్యవాసకున్
వధ యొనరించి మాంసముల వారణగా బలివెట్టఁజూచె మీ
రధముల పోలెనుండ దగదన్న జగంబులువల్కె మమ్ము నీ
విధమునఁ బాపఁగాఁదలఁచి వీడఁగనాడుట మాకు ధర్మమే.

187


క.

నృపతులు పరిజనములపైఁ
గృపఁ జేసిన దుష్టజనులు కృత్రిమవృత్తిన్
నెపమునిచి పాపఁదలఁతురు
కపటుల వాక్యములు నమ్మఁగా దెవ్వరికిన్.

188


వ.

అనిన సిగ్గుపడి గ్రద్దనాయకునికడకు నరుగుదెంచి యిట్లనిరి.

189


క.

అధిపతికంటెను సేవకు
లధికులమని గర్వులైన యాయాకొలఁదిన్
మధురముల వలెనె పలుకుచు
వధసేయు నృపాలకుండు వర్ధన మొందున్.

190


క.

పక్షులు తమపై మిక్కిలి
పక్షముగలరనుచు నమ్మి పాలించిన నా
పక్షులెగుడిచెడఁ బుట్టిన
వృక్షంబులపగిది నృపుని విఱుతురు పిదపన్.

191


వ.

అట్లు గావున పక్షులం బ్రతిపక్షులంగాఁ దలంచి నీపక్షంబు వదలి వారికపటంబు వీక్షించి శిక్షించుమను నవసరంబున.

192

తే.

కొలువు సేయంగ నాఖగకులము వచ్చి
యున్న గృధ్రమ్ము దమకును సన్న సేయఁ
బులియు నక్కయు నప్పక్షికులముఁ జంపి
పిదప గృధ్రంబుఁ జంపి నిర్భీతులయిరి.

193


వ.

అట్లు గావున గృధ్రంబు బుద్ధివిహీనంబు ఖగపతిత్వంబునకునర్హంబు గాదనిన వాయసంబు కపింజలంబు బట్టంబు గట్టుదమనిన మయూరం బది యర్హంబుగాదని యిట్లనియె.

194


క.

నిలయమునకు శశము గపిం
జలమును బోరాడి యొక్కశార్దూలయతిన్
వలగొనిఁ జెప్పినవిని నే
దెలిపెదనని చెప్పుచును వధించెను వానిన్.

195


క.

హీనులు తమలోఁ గలహం
బైనను నృపు డెఱుంగకుండ నడఁపక క్రూర
క్ష్మానాథున కెఱింగించిన
ప్రాణము లిరువు(రకు నొ)క్కభంగిన పోవున్.

196


వ.

అట్లు గావున కపింజలం బవివేకియని జీవంజీవకంబు బట్టంబుగట్టుదమనిన నదిగాదని శారిక యిట్లనియె.

197


సీ.

వినుడు కేరళదేశమునఁ బ్రసేనుండను
        క్ష్మాపతి కుష్ఠరోగమునఁ బొంద
వైద్యుడొక్కరుఁడు జీవంజీవకము దేక
        మాన దీరోగ మేమందులందు
ననిన శాకునికుల ననిపిన వారును
        నరిగొక్క[5]సరసిని నురులుదీర్ప
కొక్కెర యురిఁబడ్డ నక్కటా యని యొక్క
        పొన్నంగి యురిఁ ద్రెంపవోయి తాను

తే.

నురిని బడుటయు జూచి వాగురికవరులు
పట్టుకొని తేరనిధి యున్నపట్టు మీకు
జూపెదను నన్ను విడు డనవుఁడు జూచి విడక
పిట్టఁ గొనిచని నృపుమ్రొలఁ బెట్టుటయును.

198


క.

ఆవైద్యు లట్టె జీవం
జీవకమునుఁ దెచ్చి రాజు శిరమున నిడి గం
గావారి జలకమార్చిన
క్ష్మావిభుదేహంబు దివ్యకాంతి వహించెన్.

199


వ.

రోగవిముక్తుండై యప్పక్షిని విడిచిపెట్టిన నాకసంబున కెగసి భూవరున కిట్లనియె.

200


ఆ.

మొదల నేను వెఱ్ఱిఁ బిదపఁ గిరాతులు
వెఱ్ఱివారు నీవు వెఱ్ఱి వనిన
నెట్లు చెప్పుమనిన నేబక కంఠంబు
తగులు గొఱకు కతనఁ దగులుపడితి.

201


వ.

అట్లు గావున మొదలివెఱ్ఱి నే నైతి నిక్షేపంబుఁ జూపెదననిన నొల్లక నన్నుఁ దెచ్చిన కిరాతులు వెఱ్ఱులు మఱి నీ వెఱ్ఱితనంబుఁ దెలిపెదనిన యిట్లనియె.

202


క.

నను ముట్టినమాత్రన నీ
తను వుజ్జ్వలకాంతిమహిమఁ దాల్చెను నన్నుఁ
దినినను జిరకాలము నీ
తను వుండుటఁ దెలియ కిట్లు తగునే విడువన్.

203


వ.

అనిన కిరాతులం జూచి దీని నేయుండనినఁ బడనేసిరి గావున యీయవివేకి యర్హంబు గాదనినఁ గపోతంబు శుకంబు పతిం చేతమనిన సారసం బది వివేకి యవునని యిట్లనియె.

204

సీ.

జగతీశురాష్ట్రదేశంబున రవిగుప్తుఁ
        డనువైశ్యుఁ డప్పురియంగణమునఁ
దనతోడిచెలులునుఁ దాను నోములు నోమ
        వచ్చినభవగుప్త వరతనూజు
రత్నమాలికయను రమణిఁ గటాక్షించి
        విరహవేదన బొంది వివశుఁడైన
నతఁడు పెంచిన శుకమలయ నేమిటి కింత
        యని శివాలయమున కపుడె యరిగి


తే.

పూజ చేసిన పత్రిలో బొంచియుండి
శివునకును మ్రొక్క భవగుప్తుజిలుక పలికె
నీతనూభవ రవిగుప్తునికినిఁ బెండ్లి
సేయుమనవుఁడు హరుఁడు వచించె నన్ను.

205


వ.

అని వివాహంబు చేసిన రవిగుప్తరత్నమాలికలు సుఖం బుండునంత నొక్కనాఁడు.

206


క.

రవిగుప్తుఁడు వేఱొకతెను
వివాహమును గాదలంప వెలఁదుక యనియెన్
శివునానతి మజ్జనకుఁడు
వివాహమునుఁ జేసె నొండువిధ మింకేలా.

207


ఆ.

అనిన నతఁడు నవ్వి యస్మచ్ఛుకము డాఁగి
పలికెఁగాని హరుని పలుకుగల్ల
యనిన నరిగి తండ్రి కావార్త నెఱిగింపఁ
గోరి యల్లుచిలుకఁ గొంచుబోయి.

208


వ.

ఈక లూడ్చి వండింప సమకట్టిన నది దైవికంబున నొక్కచోట డాఁగి యీకలు వచ్చి యెగసి యుపవనంబున వ్రాలి యొక్కరాజు జ్యేష్ఠపుత్రుని చేపడి యతనికి హితుండై యుండె నంత.

209

ఆ.

పిన్నపత్నిమీఁది ప్రేమను భూపతి
తత్తనూజు రాజ్యతంత్రమునకు
భర్తఁ జేయ పెద్దభార్యకుమారుండు
చిలుక గూడి కార్యచింత సేయ.

210


వ.

ఆశుకం బిట్లనియె.

211


మత్తకోకిల:

ఇంతయేటికి జింత యీపని యేన తీర్చెద నింక నీ
వంత మాన్చెదనంచు దచ్ఛుకవంశ్యు లారవకింకిణీ
వంతులై తను చేర నప్పుర వప్రవీధుల నిల్వ భూ
కాంతుఁ డెవ్వరటన్న నింద్రుని భావ్యదూతల మేమనన్.

212


క.

ఏమిపని వచ్చినారన
భూమీశ్వరయగ్రమహిషిపుత్రుని రాజ్య
శ్రీమహితు జేయుమని సు
త్రాముఁడు నీ కెఱుక చేసి రమ్మని పంపె.

213


తే.

అనిన నట్ల సేతునని కీరముల నంపి[6]
పెద్దవుత్రుని యువరాజ్యభృతునిఁ జేసి
చనిన సంతోషచిత్తుఁడై యనియె చిలుక
కతఁడు నీకిష్ట మెయ్యది యది యొనర్తు.

214


వ.

అనిన భవగుప్తు సొమ్మెల్ల పుచ్చుకొని తల గొరిగించి వెళ్ళగొట్టించు మనిన నట్ల చేసె గావున కీరం బుపాయకర్త యనిన భరద్వాజం బిట్లనియె.

215


సీ.

ఒకచెట్టుతొఱ్ఱలో శుకము పిల్లలఁ బెట్ట
        బోయయొక్కఁడు శుకపోతములనుఁ
గొనిపోవఁ జిలుక మ్లేచ్ఛునిఁ జూచి పలికెను
        శిశుఘాత మేటికిఁ జేసె దనిన

నమ్ముదుగాని నేనటు సేయనన నీకు
        విత్త మిచ్చెద వీని విడువు మనుచు
దుష్టసర్పం బున్నతొఱ్ఱ చూ పందుల
        ధన మున్న దది పుచ్చికొనుమటన్న


తే.

నెఱుకు చని యాత్మహస్తంబు తొఱనుఁ జొనుప
పాము గఱచిన జచ్చె నబ్బర్బరుండు
వానిమొల నున్నయురిఁ జూచి దీన మమ్ముఁ
బట్టునే యని కొఱక నప్పక్షి యరిగి.

216


వ.

ఉరి దగిలి తానును మృతం బయ్యె గావున చిలుక నిర్భుద్ధి యర్హంబు గాదనిన జలవాయుసంబు బకంబు గట్టుదమనిన చాతకం బిట్లనియె.

217


సీ.

బక మొక్క డడవిలో పద్మాకరముపొంత
        నారికేళము భవనంబు గాఁగ
వసియింప నొకనాఁడు వంశపక్షులు దివి
        నరుగ నాయింటికి నరుగుదెంచి
యీరాత్రి వసియించి వారిచరంబుల
        భక్షింపుడని ప్రేమ బల్కుటయును
నవి యెల్ల నిలిచి మత్స్యావలి నెల్లను
        భక్షించిపోవ నబ్బకము చిక్కి


తే.

రొంపిబడుటయు నొకనక్క చంపె దానిఁ
గాన నిర్బుద్ధియది యనఁ గాకి తమకు
వరుని జేయంగఁ గారండవంబు పలికె
...............................

218


వ.

అమ్మాటకు గలకంఠం బిట్లనియె.

219

తే.

కుంటిపులిఁ జూచి యొకనక్క కూర్మిఁ బలికె
సకలమృగములఁ జంపి మాంస మిడు దెచ్చి
నీకు నిచ్చెద మృగముల నాకుఁ బాలు
పెట్టు మన వ్యాఘ్రమును నట్ల పెట్టదొడఁగె.

220


వ.

ఇవ్విధంబున దిరిగి మృగంబుల నెల్ల జంపించి మాంసంబు గానక యిట్లని తలంచు.

221


సీ.

భాగీరథీతీరభాగంబునను నొక్క
        నేరేడు గల దందు నిలిచి యొక్క
మర్కటం బుండి యమ్మడుగు నక్రంబుతోఁ
        జెలిమి యొనర్చి తత్ఫలములెల్ల
మొసలి పైఁబడ రాల్వ మొసలి పత్నికి నీయ
        నెక్కడి వన గ్రోఁతి యిచ్చెననిన
గుండెలు దినవలె గ్రోఁతిఁ దెమ్మనవుఁడు
        మముఁ జూడ రమ్మని మర్కటమును


తే.

వీఁపునం దిడి వోవుచు విపినచరము
పలికె నీగుండె లడిగె నాభార్య యనిన
నవుడె చెప్పంగవలదె యయ్యగచరముల
గుండెలన్నియు మ్రాననే యుండు కతన
నాదుగుండెలు నున్న వన్నగమునందు.

222


వ.

అట్లు గావున నన్ను దిరుగగొనిపోయిన నాగుండెలన్నియు నిచ్చెద ననిన నది యట్ల చేసిన.

223


క.

చె ట్టెక్కి కొమ్మ విరి చా
చిట్టిగమెక ముంబుచరము శిరమున వైవన్
గుట్టు చెడిపోయెఁ గావున
నట్టే నే గార్ధభమున కాప్తుఁడ నగుదున్.

224

వ.

అని నిశ్చయించి జంబుకంబు చాకలివాని చీరెలు మోచుగార్దభంబుతో చెలిమి చేసి యిట్లనియె.

225


క.

పులికిని నాప్తుఁడ నే నా
పులికి నమాత్యుండు చచ్చిపోవుట ని న్నా
పులికిం బ్రథానిఁ జేసెద
చెలికాడా రమ్మటంచు శివగొని చనియెన్.

226


వ.

అట్లు చని పులికి నొప్పించె గావున జంబుకంబు విశ్వాసఘాతకి, కాకి ఖగాధముండు గావున నర్హంబు గా దది యెట్లనిన.

227


సీ.

కాకులు దుర్భిక్షకాలము పండిన
        వసుధకు బో జలవాయసంబు
కులముసాములఁ జూచి సలువ నిచ్చటనుండు
        డభివాంఛితములు మీ కర్థి నిత్తు
ననుచు నందఱి నిల్పి యనుదినంబును దృప్తి
        సేయంగఁ గరువంతఁ బాయుటయును
తమభూమి కరుగు నత్తఱి మేలునకు మేలు
        సేయంగలేక యచ్చెనఁటిపులుఁగు


తే.

లనియె నీ యెంగిలిలు మాకుఁ దినగఁబెట్టి
మావ్రతంబులు చెరిచి యిమ్మాడ్కి నీవు
వుచ్ఛమును చూప మా కెట్లు భుక్తు లరుగు
ననుచు నెప మిడి తమభూమి కరిగినవియు.

228


క.

చుట్టలమని కలకొలదిని
బెట్టిన ద్రవ్యములు మెసఁగి ప్రియ ముడిఁగి తుదిన్
ఱట్టొకటి ప్రభువుమీదఁనుఁ
కట్టక మఱిచనరు గ్రామకాకు(?)లభంగిన్.

229

వ.

అట్లు గావున కాకం బర్హంబు గాదని పశు లెల్ల విచారించి గరుడనిం బట్టంబు గట్టి సుఖంబున నుండిరని చెప్పి మఱియు నొక్కకథ వినుమని తంత్రియు నిట్లనియె.

230


క.

ప్రమదమునఁ బిశాచంబులు
తమ కొక్కని రాజుఁ జేయఁదలఁచినవేళన్
గ్రమ మలర స్థూలకుక్షుం
డమరఁగ దుర్బలపిశాచ మర్హుం డనినన్.

231


క.

తను భవభీతిపిశాచం
బనియెన్ దుర్బలపిశాచ మది పతి యగునే
యనినన్ విధి దోడ్పడెనేన్
ఘనుఁడైనను హీనుఁడైన గాంతి వహించున్.

232


సీ.

గంగాఖ్యపురమునఁ గలఁడు దరిద్రుండు
        దేవదత్తుండను ద్విజవరుండు
బలహీనుఁ డతనికి భార్య లిద్దఱు గల
        రందుఁ చిన్నది తన యధిపతికిని
విధియుక్తమైనట్టి వివిధలడ్డుకములు
        మూటగట్టా[7]త్మేశు మ్రోలఁబెట్ట(?)
నతఁడు తమ్మునిఁ జూడ నరుగంగ దొంగలు
        ముసరి యాతనిచేతి మూట మెసఁగి


తే.

విషముచేఁ జచ్చుటయును నా విప్రవరుఁడు
తస్కరులజేతి శస్త్రముల్ తా ధరించి
తలలు ఖండించుకొనిపోయి ధాత్రిపతికిఁ
జూపుటయు మెచ్చి ధనము భూసురున కిచ్చి.

233


వ.

గృహంబున కనిచి సుఖం బుండు నంత.

234

క.

శృంగారవనమునను నొక
సింగము చనుదెంచె ననుచుఁ జెప్పిన భూభృ
త్పుంగవుఁడు విప్రు ననిపిన
సింగమునకు వెఱచి ద్విజుఁడు చెట్టెక్కంగన్.

235


క.

పంచాస్యము డగ్గరుతరి
చంచలమున చేతనున్నశస్త్రము వదలన్
పంచముఖి శిరము తెగిపడ
సంచలమున నురికి చేత నాతల గొనుచున్.

236


తే.

రాజుముందట నిడిన నారాజవరుఁడు
విప్రునకుఁ జాలనిష్టార్థవితతి యొసఁగె
నంత వచ్చి సహస్రసాలాఖ్య నృపతి
పురముచుట్టును విడిసె నద్భుతము గాఁగ.

237


దోదకం:

వచ్చి నృపాలుఁడ వారణబలుఁడై
యచ్చట విడియుడు సభ్బూవిభుఁడున్
నచ్చినవిప్రుని నమ్మి విభూతిన్
గ్రచ్చరవైరికి గర్వము చూపెన్.

238


వ.

అంత సహస్రపాలుండు దేవదత్తుప్రతాపంబు విన్నవాఁడు గావున రహస్యంబున వానిం బట్టి తెచ్చిన పిదప గంగాధరుబలం బణంతునని తలంచి.

239


ఉ.

క్ష్మాపతి గూఢభావమున గంగపురం బవలీల జొచ్చి య
భ్భూపతి యాప్తుఁడై మెలగుభూసురసద్మముఁ జొచ్చి వచ్చుచో
నాపృథివీసురుండు నృపుఁ డౌట మనంబున నిశ్చయించి త
చ్చాపలచిత్తు బట్టుకొన తత్సుతవర్గముతోఁడు పాటుగన్.

240

క.

ఈగతి సహస్రపాలుని
వేగంబున బట్టి భూమివిభునకు నీయన్
చేగచెడి వానిబలములు
ప్రోగులు వడి పరచె నాత్మభూమార్గమునన్.

241


క.

బలహీనుఁడైనఁ గానీ
బలయుతుఁడగు ధాత తోడుపడినను మఱిదో
ర్పలయుక్తుఁడైన గానీ
బలహీనుం డగును దైవబల మెడలుటయున్.

242


వ.

అనిన గజవక్త్రుండను బేతాళుం డిట్లనియె.

243


సీ.

నెమ్మి విటాగ్రహారమ్మున గార్దభ
        సేనుఁడు నావిప్రశేఖరుండు
సంతానకాముఁడై జలజజుఁ బ్రార్థించి
        వ్యభిచారియగు కూఁతు వరము వడసి
క్షిప్రకోపికిఁ బెండ్లి చేసిన నప్పెండ్లి
        కొడుకు తద్వ్యభిచారగుణము మాన్ప
భైరవమంత్రజపంబును చేయుచు సిద్ధ
        భైరవసంసిద్ధి పడసెననుచు


తే.

జగతి మ్రోయించి తన కాంత జవ్వనైన
వికృతరూపంబు శూలంబు వెలఁది కిచ్చి
పాన్పునకు వచ్చునప్పు డాభావమునను
శూల మొగిఁ ద్రిప్పి మంచముచుట్టు దిరిగి.

244


క.

శూలము ఱొమ్మున నిడి(వగ)
పాలైతివి పొడుతుననుడుఁ బలుకుదు మఱి నీ
వాలీల యుడిగి మంచము
పై లాలితభంగి మెలగు భామా యనుచున్.

245

వ.

ఉపదేశించిన నదియ చేయుచుండు నంత నొక్కనాఁడు.

246


క.

పరదేశి విప్రుఁ డొక్కఁడు
సురుచిరతరవిభవరూపశోభితుఁ డగుచున్
బురవీధి దిరుగ జారిణి
పురుషుం డిలు వెళ్ళి నదికి బోయినవేళన్.

247


క.

పరదేశి విప్రు నిజమం
దిరమునకుం దెచ్చి దొంటితెరఁగున కడుభీ
కరమైన రూపు గైకొని
యరుదెంచిన భయము బొంది యత డిలు వెడలెన్.

248


వ.

అట్లిల్లు వెడలి బమ్మరించుచు నెదురుపడిన యవ్విఫ్రునకుఁ జెప్పిన నందఱికిం జెప్పకున్న ప్రమాదం బనిన నచ్ల చెప్పిన నెవ్వరు నాపైఁదలి జూడ భయపడుచుండి రంత.

249


ఆ.

క్షిప్రకోపుఁ డాత్మగృహమున కేతెంచి
భార్య కనియె నాకు భైరవుండు
చెప్పె నన్యపురుషుఁ జేపట్టినది యని
యన్న నీదువేల్పు నడిగిచూడు.

250


వ.

అనియెం గావున.

251


క.

దైవముకంటెను మానుష
మీవిధమున నెక్కుడయ్యె నిదిగో విప్రుం
డావెలఁది మానుషంబున
దైవీ(?)కపు జారతనము దగిలినకతనన్[8].

252


వ.

అనిన లంబోష్ఠుండను పిశాచంబు మానుషంబుకంటె దైవికం బెక్కుడని యొక్కకథ చెప్పందొణంగె.

253

సీ.

మాహిష్మతీపురి మహిపతి జలశాయి
        పద్మజుగురిచి తపంబు సేయ
నురగంబు పుత్రుగా నొసఁగి యాపుత్రున
        కశనంబుగాఁ గన్యకలను నొసంగు
మనిన నారాజన్యుఁ డటువలె నహిఁ గాంచి
        పురకన్యకలనెల్ల భుక్తి యొసఁగ
నొకనాఁడు పురినిఁ గన్యకలు లేకుండిన
        భైరవివరమున బ్రాహ్మణునకు


తే.

జననమొందిన కమలలోచనను మాఱుఁ
దల్లి వెలవుచ్చికొని యీయ దందశూక
భుక్తి కరుగుచు భైరవిపూజచేతఁ
గాంచినటువంటి పద్మయుగంబు గొనుచు.

254


క.

అరిగి, ఫణి, భుక్తి కొఱకై
యరుదేరఁగ ఱొమ్ము వేయ నప్పద్మహతిన్
నరుఁడై వరియించెను నజు
వరమును నిటువలెనె కాన వైభవ మొప్పన్.

255


తే.

అతఁడు పద్మాంకుఁ డనుపేర నతిశయిల్లె
పద్మలోచన యంత గర్భంబు దాల్ప
సవతి జనయిత్రి తనవ్యభిచారి కూఁతు
గర్భిణికి బుద్ధు లెల్లనుఁ గఱపి యంత.

256


వ.

కమలలోచనకు నోముమీఁద నభిలాష పుట్టించి కుసుమావతిం బద్మాంకునొద్ద నిలిపి యక్కమలలోచనం గొని యర్థరాత్రంబున గంగమడువునం ద్రోచుటయును.

257

క.

దైవవశంబునఁ గామిని
చావక యొకకొయ్య వట్టి చనఁగ ప్రభాతం
బావిర్భవింప గౌతమ
దేవమునీంద్రుండు దరికిఁ దెచ్చెను దానిన్.

258


తరల:

కమలలోచన యంతఁ బుత్రకు గాంచె నుజ్జ్వలమూర్తి శ్రీ
రమణతుల్యుని సార్వభౌముని రాజలక్షణు నిక్కడన్
రమణి యక్కుసుమావతియు బధిరాంధమూకవికారునిన్
శమవిహీనుని బుత్రు గాంచెను సమ్మదప్రతిపక్షునిన్.

259


వ.

అంత నప్పద్మాంకుండు దిగ్విజయార్ధం బరిగి గౌతమాశ్రమంబునం గుమారునిం జూచి వీఁ డెవ్వనిపుత్రుండని యమ్మునీశ్వరు నడిగిన నతం డిట్లనియె.

260


స్వాగతము:

సారసలోచన క్ష్మావర నీకున్
గారవ మొప్పగ గాంచిన పుత్రుం
డీరమణీయుఁ డహీనబలుండై
ధారుణియెల్ల నుదారత నేలున్.

261


వ.

అని వినిపించి తదీయాగమనక్రమం బెల్ల నెఱింగించినఁ గమలలోచనా సుతసహితుండై మునియనుజ్ఞ నాత్మపురంబున కేతెంచి యందుఁ గుసుమావతి వర్జించెనని తంత్రి దాదికి మఱియొక్కకథ వినుమని యిట్లనియె.

262


క.

సాహసునకు దైవంబును
సాహాయ్యము సేయు హీనసాహుసుఁ డైనం
ద్రోహియని దైవమును ద
త్సాహాయ్యము విడిచి వానిఁ జంపఁగ జూచున్.

263

వ.

అది యెట్లనిన.

264


సీ.

రత్నావతీపురీరమణుండు నరదత్తుఁ
        డనురాజు సుతుని జయంతు నొక్క
శూలనాసాపిశాచుఁడు సోకి యెటువంటి
        మంత్రతంత్రాదులు మానకున్న
భూపతి చింతించి భూతము నెవ్వండు
        విడిపించుఁ జాలంగ విత్త మిత్తు
నని పురి సాటింప నందు సాగరి యను
        వారకామిని ధనవాంఛఁ జేసి


తే.

మాన్పఁగా నేర్తుననుచుఁ గుమారి దెచ్చి
శూలనాసాశ్రయుని రాజసుతునియొద్ద
నునిచి పరిచర్య చేసెడియుక్తి గరపె
నదియు బరిచర్య సేయంగ నాపిశాచి.

265


క.

అక్కామిని కిట్లనియెన్
జిక్కితి నీమీఁది కూర్మిఁ జెలువా నాపై
మక్కువ సేయుము నావుఁడు
నక్కామిని యాత్మజనని కది యెఱగింపన్.

266


ఆ.

దానితల్లి వచ్చి తరుణి మాయింటికి
ననుపుమనిన భూత మనియె నీవు
చెప్పినట్టిపనులు చేసెద నిక్కాంత
నునుపుమనిన వారవనిత బలికె.

267


ఆ.

ఎఱ్ఱరాజనంబు లిరువదిపుట్లును
బియ్య మనుదినంబు బెట్టు తూము
దెత్తుననియు నీవుదెచ్చినతూమునఁ
గొలుతుననుచు నియ్యకోలు చేసి.

268

వ.

ప్రతిరాత్రియు నటువలెఁ బెట్టుచు నట్లు గూడి సుఖియింపుచు నొక్కనాఁడు.

269


క.

ఎయ్యెడ నెఱ రాజనపున్
బియ్యంబులు దొరకకున్న భీతుం డగుచున్
సయ్యన నానృపసుతుపై
నెయ్యముఁ దిగవిడిచి యంధ్రనృపసుతుఁ బట్టెన్.

270


ఉ.

పట్టినఁ నంధ్రభూమి జనపాలుఁడు సాగుళిగొంచుబోవు(?)నా
పట్టియుఁ దాను దానవుఁడు పట్టినరాసుతుఁ జూడ భూతమున్
బట్టొకభంగి గావదలి భామిని కిట్లను తూముఁ దెచ్చితో
పెట్టిట వచ్చితోఁ యనిన పెట్టక తెచ్చితి నన్న భీతుఁడై.

271


క.

ఇది మొదలు గాఁగ మనుజుల
గదియను నీతూము నానకామినియని భూ
విదితముగఁ బలికె నృపసుతు
వదలడివికి(?) జనియె బురమువారలు నవ్వన్.

272


వ.

సాగుళికయు నభ్భూపాలునిచేత నధికధనంబులు వడసి సుఖం బుండెనని చెప్పిన నాజానుబాహుండను పిశాచం బిట్లనియె.

273


క.

మాటాడనేర్పు కలిగినఁ
బాటింతురు నృపులు దైవబాధ లడంగున్
బోటులు మనసిత్తురు దగ
మాటాడగ నేరవలయు మానవు లెపుడున్.

274


వ.

అది యెట్లనిన.

275


సీ.

పిప్పలుండను సెట్టి పృధివిపై సైంధవ
        వ్యవహారికంబున నరుగుచుండి
ప్రొద్దుఁ గ్రుంకుటయునుఁ బోలేక యడవిలో
        విడిసి చోరమృగాదు లడవి విడిచి

చనుడు వేలాఖ్య రాక్షసుఁ డిందునున్నవాఁ
        డతఁడు చూచిన నెపమార్పుననుచు
జాటించె నవియెల్లఁ జనుచోట దొంగయు
        బులియును నొక్కచోఁ బొంచియుండి


తే.

హరులలో దాగి బులియును నంతలోనఁ
జోరుడును గుఱ్ఱమును దియ్యఁజేరి పులిని
సాగెఁ దగిలించి యెక్క నవ్యాఘ్ర మాత్మ
రాక్షసుండని మోచి యరణ్యమునను.

276


క.

తిరుగుచునుండగ దొంగలు
సురరిపుఁడని చేరవెఱచి చూచుచునుండన్
హరి యుదయ మొందె నొకశివ
నరుమోచినద్వీపిఁ జూచి నగుచుం బలికెన్.

277


ఆ.

మనుజుఁ దినక యేల మరు లెట్లు గొంటివి
దిగువవ్రేయు మనగఁ దెలిసి చోరు
డడవి నొక్కపాడుగుడిఁ గాంచి పులి డిగ్గ
నురికిచొచ్చి తలుపు లిఱియఁబెట్టి.

278


వ.

అంత నక్కయుఁ దలుపులు వుత్తునని కుంచెకోల వరవుతొలిని తోఁక జొనిపి నా.

279


క.

చోరుం డాశివవాలము
ధీరుండై బిగియఁబట్టి తివియఁగ శివయున్
నోరెండి చచ్చెఁ బులియున్
ఘోరాటవి కరిగెఁ జోరకుండును వెడలెన్.

280

క.

మానవుఁ డుపాయబలమునఁ
బ్రాణము రక్షించి సకలభాగ్యము గాంచున్
గాన నుపాయుజ్ఞుండే
మానవవరుఁ డనిరి బుద్ధిమంతులు జగతిన్[9].

281


వ.

అది యెట్లనిన.

282


సీ.

ద్వైతాటవిని సముద్ధతుఁడను సింహంబు
        మృగములనెల్లను మెసవుచుండ
మృగములు హరిఁ బల్కె దగునె మమ్మిందఱి
        భక్షింప నిలువర్స భక్షణంబు
సేయుము నీవన్న సింహంబు వది యియ్య
        కొని వర్సతో భుక్తిఁ గొనుచునుండ
నిఱ్ఱికి నొక్కనాఁ డిలువర్స వచ్చిన
        మృగమృగీపోతంబు లేడ్చుచున్న


తే.

శశము పొడగని సింహంబు జంపి వత్తు
ననుచు నూరడఁ బల్కి తా నరిగి హరినిఁ
గాంచుటయు వేళ దప్పె నాఁకలియుఁ బెరిగె
నేల నిలిచితి వనిన కుందేలు వలికె.

283


క.

కేసరిమ యొక్కటి మముఁ
గాసిం బెట్టంగ వానికథ దీర్పగ సే
నోసరివి చెప్పవచ్చితిఁ
దోసము గలదనిన హరియు దుర్మదవృత్తిన్.

284


ఉ.

కోపితచిత్తుఁడై యెచటఁ గుత్సితజంతువు నుండునన్న నే
జూపెద రమ్మటంచు మృగశూరునిఁ దోకొనియేఁగి వాఁడు నీ
కూపములోన నుండునన గూలము ద్రొక్కటు చూడ నాత్మస
ద్రూపవునీడ దోఁచుటయు రోషముతో నురికె న్విమూఢుడై.

285

క.

బుద్దిగలవాఁడె బలియుఁడు
బుద్ధివిహీనుండు బలముఁ బొందియు నణఁగున్
సిద్ధము శశకముచే ని
ర్బుద్ధి మృగేంద్రుండు మృతము? బొందిన భంగిన్.

286


వ.

అనిన ప్రబలుండను పిశాచం బింద్రశర్మ పిశాచంబుఁ బట్టంబు గట్టుదమనిన దూషకపిశాచం బిట్లనియె.


క.

భూసురుఁడు కుక్క బెంచుచు
కేసరిగా జేయ నదియు కిల్బిషమతి నా
భూసురు నేతినఁ జూచిన
నాసంయమి మగుడఁ గుర్కురాకృతి చేసెన్.

287


వ.

అని మఱియు నిట్లనియె.

288


క.

వాదడచు చోట నిలువం
గా దెవ్వరికైన వాదుగలిగిన మనుజుం
డాదిక్కు విడువకుండిన
నాదాసికి మేష(?)యుద్ధ మగుగతి వచ్చున్.

288


చ.

జగతివరుండు వాజియుతశాలకు గావలిగాఁ బొందిలిన్
తగరుల నిడ్డ నం దొకటి దాసికి నెగ్గొనరింపఁ బొయ్యిలో
భగభగమండుకట్టెఁ గొనిపారఁగఁ గొట్టిన మండుకొంచు వె
న్తగులగ శాల దూరుటయు దగ్ధము లయ్యె హయాదివాహముల్.

289


ఆ.

దానఁ జేసి హరుల తనుదాహమగుటయు
నశ్వభేషజముల గచరముల
వండి పూయుడనుచు వైద్యులు చెప్పిన
కవులకెల్ల నంత్యకాల మయ్యె.

290


వ.

మఱియును.

291

క.

ఏవిధము నరుఁడు దలఁచిన
దైవము తావేఱయొకటి తలఁచుచు నుండున్
భూవర సుత మోహించిన
కావరుసన్యాసి నెలుఁగు గఱఁచిన భంగిన్.

292


వ.

అదియెట్లనిన.

293


క.

సన్యాసి రాజునకు గడుఁ
మాన్యత వర్తింపుచుండి మహిపతితనయం
గన్యారత్నముఁ గనుఁగొని
ధన్యకు మోహించి భూమిధవుతో ననియెన్.

293


క.

నక్షత్రగ్రహరాసులు
లక్షణములు జాల నట్టిలలనాసుతలన్
వీక్షించు నరునకును వం
శక్షయ మగుననిరి (జోస్యశాస్త్ర?)విధిజ్ఞుల్.

294


ఆ.

అట్లుగాన నీవరాత్మజ లక్షణ
హీనగాన దీనినింట నుంప
వలదు పెట్టి బెట్టి వఱ్ఱేట విడిపించు
మనిన నట్ల సేసె నంత నదియు.

296


వ.

ఏటిగాలివశంబునం జనుదేర నొక్కభూమీశుండు పెట్టి పుచ్చికొని పెట్టిలోనికన్యం గైకొని యందు నెలుంగు బెట్టి విడిచిన.

297


ఉ.

పెట్టియ పట్టుకో ననుచు భిషకు డేటికీ వచ్చి యందుఁ జూ
పట్టెడు పెట్టి పట్టుకొని ప్రాప్తమఠంబున కేఁగుదెంచి యా
పెట్టియకట్టు విప్ప భటుభీకరఋక్షము బిక్షుకాధముం
బట్టి భుజించె నిష్టములు భాగ్యవిహీనులు కేల కల్గెడిన్.

298


వ.

అని మఱియు నిట్లనియె.

299

క.

నరుఁ డొకటిఁ దలఁప దైవము
మఱియొక్కటి దలఁచు వేశ్యమాతృక యల్లుం
బొరిఁగొన విషచూర్ణము త
త్పరత బ్రయోగించి తానె ప్రాణము విడిచెన్.

300


క.

వారాంగనయునుఁ బురుషుఁడు
నారయ జవ్వనము నంద యార్జింపని బం
గారము ముదిసిన పిమ్మట
చేరదు పలువెతలబడ్డ సిద్ధము గాదే.

301


వ.

అది యెట్లనిన.

302


నందన:

నందనవిటునకు ననిచి ప్రియమునన్
బొందుచు మఱియొకపురుషుని నెచటన్
చెందక ధనమును చినుకక యుండన్
సుందరి విటునియసువ్వులు గొనగన్.

303


వ.

ఒక్కనాఁడు కాంతాసమేతుండై నిద్రించునల్లుని యాననంబున విషచూర్ణయుక్తంబైన కోలు జొనిపి యీవలికడ వదనంబున ధరియించి యూఁదుసమయంబున.

304


తే.

అల్లుఁ డుత్సర్గ విడువం దదాస్యపవన
గతుల నణగించి మగుడి తద్గళము చొరఁగ
వేళ్యమాతకు విష మెక్కి విధివశమున
కుంభినీస్థలి బడి తన్నికొనుచుఁ జచ్చె.

305


వ.

మఱియు నిట్లనియె.

306


క.

ఒరుసొమ్మున కాసించిన
పురుషుఁడు తనుదాన పొలియు పొలతుఁక సొమ్ముల్
హరియింప మద్దెలీ డొక
యురి కంఠము బిగిసి యనువు లుడిగినభంగిన్.

307

వ.

అది యెట్లనిన.

308


క.

సామరుని కోడలొక్కతె
గ్రామము వెలి ననువువిడువఁ గాననవీధిన్
వేమార బోవ మర్దలి
యామానినిఁ జూచి యేమి యని పలుకుటయున్.

309


ఆ.

ఇంటివారు వోరయేనందు బడలేక
చత్తుననుచు వచ్చి చచ్చువెరవు
తెలయననిన వాఁడు తెలిపెదనని యొక
మఱ్ఱియూడ నురి యమర్చి పలికె.

310


వ.

ఈమద్దెలమీఁ దెక్కి (?) యురి దగిల్చుకొమ్మనిన వెరవు నీవే చూపుమనిన యమ్మద్దెల యెక్కి వురి దగిల్చుకొని మృతు డయ్యెనని మఱియు నిట్లనియె.

311


క.

హీనాశ్రమంబు కంటెను
దీనున కధికాశ్రమంబు తేజము చూపున్
మానుషముఁ గలుగువానికి
హీనునిఁ గొలువంగ వలవదే దుర్గతులన్.

312


వ.

అది యెట్లనిన.

313


సీ.

మేకపిల్లలు రెండు మేతకై యెవ్వని
        గొలుతుమొకో యని తలఁపు చేసి
యొకటి సింహంబును నొకటి నక్కనుఁ గొలువ
        నందులో నక్క ప్రియంబు గల్గి
మేకపిల్లకు జాలమేత పెట్టుచునుండ
        హరి యొక్కవేళ దా నరయ దెపుడు
అంతట వర్షమే కార్ణంబు చేసిన
        క్రోష్ఠు వామేకను గుంటమీఁద

తే.

బెట్టికొనియుండె సింహంబు భీతి కుడుచు
మేకపిల్లను నేనుఁగుమీఁద నునిచి
ఆకఁటను జిక్కి నక్క యమ్మేకతోఁక
దినగ నిమ్మన్నదియు నందిచ్చుటయును.

314


వ.

తోక భక్షించి యందునుఁ దనివోవక చెవులును గళస్తనంబులును భక్షించి యమ్మేకను భక్షించనున్న సమయంబున.

315


క.

ఏనుఁగుకుంభస్థలమునఁ
దా నిలిచిన మేక సఖుని దప్పక కని త
త్ప్రాణము రక్షంచుటకై
యేనుఁగు బురిగొల్ప నక్క నీడ్చెను కరియున్.

316


క.

హీనుల సేవించిన య
మ్మానవులకు నర్థమానమహిమలు చెడు త
త్ప్రాణమునుఁ బోవు గావున
హీనుల గొలుచుటయు మోస మెవ్వరికైనన్.

317


క.

ఘనులం గొలిచిన మనుజులు
ఘనులై హీనులకు నధికకార్యార్థులకున్
ఘనములగు పదము లొసఁగుచు
మనుచుదు రుపకార మహితమానసు లగుచున్.

318


క.

చెడుగునకు హితవు చేసిన
చెడు మానము బ్రాణములును సిద్ధము హితముం
జెడిపీకును(?) జేసి యొరుచే
పడఁతుక తనముక్కు గోతఁబడిన విధమునన్.

319


వ.

అది యెట్లనిన.

320

సీ.

ఒకపరదారకు నువిద యొక్కతె దూత
        చర్య వర్తింప నజ్జారమగఁడు
తనకాంతఁ బట్టి మ్రాకునకు బంధించిన
        నిశియందు గుంటెన నెలఁత వచ్చి
యుపపతి వచ్చినాఁ డువిద రమ్మని పిల్వ
        కట్టినాఁ డెటువలెఁ గదలి వత్తు
ననిన నీకట్లును ననుగట్టి యందాక
        బోయిరమ్మ నట్ల పోవ నతఁడు


తే.

కట్ల నున్నది యాత్మీయకాంత యనుచు
మఱియు నెగ్గులు వలుక నత్తెరవమూల
దట్టమగు చీకటిని దాని దగులబట్టి
కోపమున ముక్కు మొదలంటఁ గోసి విడిచె.

321


ఆ.

అంత నక్కాంత యది దీర్చి యరుగుదెంచి
కట్లు దాసికి విడిచి త న్గట్టినట్ల
యుండె సత్తైనసతి నైతినేని దెగిన[10]
ముక్కు గ్రమ్మర నాకును మొలుచుగాత.

322


వ.

అనిన వాఁడు దీపికాహస్తుండై నాసిక గనుంగొని పరమపతివ్రతవు తప్పులో గొనుమని దండంబు వెట్టి కలసియుండి రంత నక్కడ.

323


క.

హితవరియై నిజనాసా
చ్యుతు బొందినుగండు గోసె శుద్ధాత్మ ననుం
గత మేమి లేకయని భూ
పతికిన్ మొరపెట్ట జంప బంపెన్ దానిన్.

324


వ.

అంత.

325

ఆ.

దొంగయొకడు చేరి యంగనాదూతలు
చేష్ట లెల్ల నెఱఁగి చెప్పుటయును
కడమచెవులు గోసి కామిని వెడలించి
భటుని కొక్కసతిని బత్ని చేసె.

326


వ.

అని తంత్రిదాదికి మఱియు నిట్లనియె.

327


క.

గురువుల ధనమైనను చే
దొరకిన యెందాక హితవుతో జరియించున్
దొరకిన మరి తలచూపక
విరబారను పూరివుడక విశ్వాసమునన్.

328


వ.

అది యెట్లనిన.

329


ఆ.

విబుధయోగి యొకఁడు వేణుదండములోన
పొన్నుచయము నిడ్డబోసి కడల
రాగికుప్పె లిడి కరంబున విడువక
పట్టుకొనుచు దిరగ పొర డొకఁడు.

330


క.

అమ్మాడ లెత్తుకొని పో
నిమ్మగు నందాక యతికి హితశిష్యుండై
నెమ్మిని మెలఁగుచు నొకచో
నమ్మునికిని భిక్ష సేయు నాసద్మమునన్.

331


క.

కడుజివికి నొకకసవుం
బుడక శిరం బంటుకొని బోవుచు నార్తిన్
వడకుచు గురువుల యడుగుల
బడి పలికెను నాకు దగిలె పాపం బనుచున్.

332


వ.

అది యెయ్యది యనిన మనకు భిక్ష చేసిన వారింటి పూరిపుడక నాతలఁ దగిలి వచ్చెను నాపుడుక.

333

(గ్రంధ పాతము)

..............................
..............................
సాదుసురభి దుష్టసహవాసమున రాత్రి
పొలము మేయబోయి పోయి జేను
జొచ్చి మేయ గాపు వచి...........
దాటుకొనుచు బోవ...............

334


క.

వెనుకకు నిటువలె జొరవె
ళ్ళను నెరుగని గోవు బందెలకు నొప్పింపన్
గనుగొని.................
ఘనమగు నొకగుదియ మెడను గట్టెను జిక్కన్.

335


క.

అని తంత్రి కథలు చెప్పగ
మనుజేంద్రు....మంత్రులు దెచ్చీఁ
దినక్రొత్త లడుగ మఱచెను
వనితలతమి మఱపు పొడము వరబుద్ధులకున్.

336


వ.

నారదుండు కథావిశేషంబులు వినుపించిన బలిచక్రవర్తి యుత్తరకథావినోదంబులు వినుపించుమనిన.

337


మ.

కరుణాపూర్ణకటాక్ష భక్తజనహృత్కామప్రదానక్రియా
సురధాత్రీరుహ! (హృష్ట)దేవమునిసంస్తోత్రస్ఫురద్గోత్ర
...త్రకపిన్నబై రవమహాపాత్రాత్మవాక్పాత్ర శ్రీ
ధరణీముఖ్యకళత్ర వేంకటనగోత్సంగాలయాధీశ్వరా!

338


క.

మిత్రశశినయన భైరవ
పాత్రస్తుత చరణలోక బహుజీవననటీ
సూత్రభవజలధి తారణ
పా(త్రాయితచరణకమల) భవ్యచరిత్రా!

339

దోదకము:

కంధరపటలనికాశశరీరా!
బంధురభైరవపాత్ర!.......
..............బారునిహారా!
సింధుసముద్భవచిరమణిహారా!

340


గద్య:

ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకలనీతికథానిధానంబునందు తృతీయాశ్వాసము.

  1. "మత్తాశబ్దోదేశ్యః" అని అహోబలపండితుడు.
  2. గరుడఁడు
  3. యుతోత్తమ
  4. వడ్రంగికి రూపాంతరము
  5. దుస్సంధి
  6. ఈపాదము ఛంధోభంగముగా కాన్పించుకున్నది.
  7. దుస్సంధి
  8. దైవికదోషంబునుండి దగిలినకతనన్
  9. "మానవవరు డనిరి బుద్ధిమానసజనముల్” అని గ్రంథపాఠము
  10. యుండి సత్సతినైతినే నొర దెగిన