సకలనీతికథానిధానము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చతుర్థాశ్వాసము

శ్రీకుంటముక్ల రమణ
శ్రీకర? (మహా?)పాత్రవిభవ! చినభైరవని
త్యాకల్పరక్షణా! పృధి
వీకల్పకవృక్షయూధ! వేంకటనాథా!

1


వ.

అవధరింపు బలీంద్రునకు నారదుం డిట్లనియె.

2


చ.

వసుధకు నంచితాభరణవైభవమై బహుభోగసంపదన్
గుసుమపురంబు నాఁ గల దగోచరహట్టములందు నప్పురీ
వసుమతి రాజహంసుఁడను వల్లభుఁ డేలు తదీయమంత్రులు
ద్వసులు మురారి? సచివర్యులు పుత్రులఁ గాంచి రార్యులన్.

3


ఆ.

అక్కుమారవరులయందు నొక్కఁడు తీర్థ
వాసి యయ్యె నొకఁడు దో (?) యయ్యె
నొకఁడు బేరమాడుచుండుచో మాళవుం
డరుగుదెంచె రాజహంసు మీద.

4


వ.

అప్పుడు.

5


క.

మాళవభీరకరశ
స్త్రాలికి భయమంది రాజహంసుఁడు వసుధా
పాలన ముడించి గిరివన
పాలకుఁడై యరిగె రిపుఁడు పైకొని నడవన్.

6


ఆ.

అట్లు రాజహంసు నాహనముఖమున
గెలిచి మూర్ఛవుచ్చి బలము మెఱసి
తిరిగి పట్టణంబు దిక్కునకై శత్రుఁ
డరుగుదేర రాజహంసు దేవి.

7

క.

తనపతి రణమున బడెనని
మనమున దుఃఖించి యొండుమార్గము ననికే
తనతలము వెడలి యడవికిఁ
జని ప్రాణము విడువఁదలచి సంభ్రమ మొదవన్.

8


వ.

ఒక్కలతాపాశంబు సంధించి యున్నతవృక్షశాఖ నురివెట్టుకో నచ్చటికిం జేరు సమయంబున.

9


క.

అరిచేత మూర్ఛితుండై
యరదముపై నున్న రాజహంసునిఁ బ్రాణీ
శ్వరఁ జూచి మూర్ఛఁ దెలిసెను
సరసిజముఖి విభునిఁ గూడి సమ్మద మొదవన్.

10


ఆ.

మాళవేశ్వరుండు మరలి సేనయుఁ దాను
నరుగుటయును రాజహంసుఁ డెఱిఁగి
పొలఁతిఁ గూడి యాత్మపురి సొచ్చె నంత న
ద్ధరణివిభుని దేవి తనయుఁ గాంచె.


సీ.

అట ప్రధానులు నల్వురాత్మజన్ములఁ దెచ్చి
        రాజున కిచ్చి భూరమణ! వీరి
భవదీయపుత్రుని భంగినే పోషింపు
        మని యప్పగించిరి యంతలోన
యతులు నల్వురు నొక్కయాటవికుండును
        నొక్కొక్కసుతుఁ దెచ్చి యుర్విపతికి
నిచ్చినఁ దొల్లిటి యేవురు వీరును
        గూడ బదుండ్రైరి తోఁడుతోన


తే.

నట్టి పుత్రకు లీరెను నవని బెరిగి
బాల్యమును బాసి యౌవనప్రాప్తి నొంద
సచివులునుఁ దాను సుతులకు సకలనీతి
భావసంగతు లెఱుఁగంగఁ బల్కి రపుడు.

12

క.

హితవుగలవాఁడె చుట్టము
పతియానతి సేయునదియె భార్య ధనాది
స్థితి నడుపువాఁడె జనకుఁడు
మతినమ్మికగలుగునదియె మైత్రి దలంపన్.

13


క.

పతిభక్తి లేని భార్యయు
హితరహితుండైన సఖుఁడు...
కితవసచివుండు పన్నగ
యుతగృహమును మృత్యువునకు నున్నతపదముల్.

14


తే.

చెడకయుండంగ ధనము రక్షింపవలయు
ధనము విడిచైన రక్షింపఁదగును సతిని
ధనము భార్యను విడిచైనఁ దన్ను రక్ష
చేయునరునకు నభివృద్ధి చేరుచుండు.

15


ఆ.

కులము చెఱుచువానిఁ గొనసాగనీవల
దూరు చెఱుచుకుజనుఁ జేరదగదు
ఉర్వి చెఱుచునూర నుండంగవలవదు
తన్ను చెఱుచుపుడమిఁ దలఁగవలయు.

16


క.

ధనలోభి కర్థ మిచ్చియు
ధనగర్వికి దండ మిడియు తామసమూర్ఖుం
డని నట్లయాడియును బుధ
జనులకును యధార్థగతియుఁ దెలుపగవలయున్.

17


క.

ధననష్టియును విచారము
వనితాజారతయు ప్రాప్తవంచనమును కై
కొనమియును భంగపాటును
ఘనుఁ డెవ్వఁరు నెఱుఁగకుండఁ గప్పగవలయున్.

18

క.

విభున కనుకూలభార్యయు
విభపము సంతోషమునకు విడిపట్లు నిజ
ప్రభువును వశవర్తియునగు
శుభమూర్తికి నిదియ తలఁప సురలోకమగున్.

19


క.

ఆపద వచ్చిన కరవున
భూపతి యలిగినను రిపుఁడు వొడిచిన దుఃఖో
ద్దీపనమున పితృభూమినిఁ
బ్రాపొందినవాఁడె తనకు బంధువుఁ డరయన్.

20


క.

బహువిధభోజనశక్తియు
మహి(ళార)తిశక్తియును సమంచితవిభవో
ద్యహనమున దానశక్తియు
నహహ తపఃఫలము లనుచు నందురు పెద్దల్.

21


క.

వేదంబుఁ జదివి జపహో
మాదులు నడపుచును నృపుని ననవరతాశీ
ర్వాదములఁ గొలుచు విప్రునిఁ
గాదనక పురోహితుఁడుగఁ గైకొనవలయున్.

22


క.

ఏదేశంబున నిజవి
ద్యాదరణము మన్ననయుఁ బ్రియంబును విబుధా
హ్లాదము చుట్టములును లే
దాదెస నొకదివసమైన నర్హమె యుండన్.

23


క.

ధనమునకు ఫలము దానము
ననుభవమును వేదఫలము లనలాహుతులున్
వనితరతి పుత్రఫలమును
వినికికి నడవడియ ఫలము వివరింపఁదగున్.

24

క.

ఖలునందు మంచివిద్యయు
కులహీనుల నంటియున్న కొమ్మయు విషపం
కలితమగు నందు నమృతము
మలగతకాంచనము గొనుట మంచిగుణంబుల్.

25


క.

అరులిరువురు గలిగిననం
దొరుఁజుట్టముఁ జేసి యవలియొరు నణపదగున్
చరణంబు ముల్లు ముంటనె
వెరవున భేదించినట్టి విధము దలిర్పన్.

26


క.

వ్యవహారక్రయవిక్రయ
వివిధార్జనలందు ద్యూతవేళలయందున్
యువతీసంగమములయెడ
వివేకజనుల్ లజ్జ జాఱవిడువగవలయున్.

27


క.

లోకాపవాదభయమును
స్వీకృతదాక్షిణ్యధర్మశీలవ్రీడా
శ్లోకములు లేనినరుతో
నేకాలము జెలిమి సేయ నేలా శుభముల్.

28


క.

నరపతి భృత్యునిభావము
పరికింపగవలయు పనులు పంపెడిచోటన్
పరిశీలింపక పంపిన
విరసంబునుఁ గార్యహతియు వేగమవచ్చున్.

29


క.

మతి గలిగి ధైర్యవిద్యా
న్వితుఁడై తగుమాటలాడునే ర్పెఱిగి పరేం
గితములఁ గనుగొని మెలఁగెడు
నతఁడు మహీపతికి దూత యగు తలపోయన్.

30

క.

ఒకపరిఁ జెప్పినకార్యము
వికలము గాకుండ వ్రాసి విద్యాన్వితుఁడై
సకలజనంబులు వొగడఁగ
సకలజ్ఞుఁడు కరణ మనగఁ జను లోకమునన్.

31


క.

బలయుతుఁడై యింగితచే
ష్టలు దెలిసి కురూపిగాక శౌచాత్మకుఁడై
యల పెఱుఁగక నృపహితగతి
కలవడు ప్రతిహారి సుజనుఁడని పొగడువడున్.

32


క.

కులశీలసత్యధర్మము
లలపడి తను నెదిరి నెఱిఁగి యౌనౌననగన్
లలితప్రవీణగుణములు
గలవాఁ డధిపతికి రాచకార్యము నడుపున్.

33


క.

ఆయుర్వేదచికిత్సో
పాయంబులు దెలిసి చదివి యార్యత్వంబున్
గాయసుకుమారతయుఁ గల
ధీయుక్తుఁడు వైద్యమునకు దేవర గాఁడే.

34


క.

దుష్టవ్యసనుని మూర్ఖుని
గష్టుని దుర్వ్యయుని నప్రగల్భుని భీతున్
భ్రష్టుని నిష్ఠురభాషణు
నిష్టుండని యధిపతిత్వ మీయరు రాజుల్.

35


క.

కొంచెపువాఁ డాడినక్రియ
నంచితసుగుణాఢ్యుఁ డేల యాడును బెక్కుల్
కాంచనము మ్రోయనేర్చునె
కంచు వెసన్ మ్రోగినట్లు గణనకు మీఱన్.

36

క.

దుర్గుణులు మూర్ఖజను లప
వర్గవినాశకులు వారి వర్ణించి శుభా
నర్గళు పండితు నొకనిఁ ద్రి
వర్గప్రదు నేలవలయు వసుధీశునకున్.

37


క.

ఒరునర్థము దా నెఱుఁగుచు
నొరుఁ డాత్మార్థంబు నెఱుఁగకుండగ మెలఁగన్
బురుషుండు బ్రతుకు నవయవ
పరికరములు దాచుకచ్ఛపంబును బోలెన్.

38


క.

హీనజనుఁడైన నధికపు
మానవుఁ డగునేని బలసమగ్రత మెఱయున్
దా నిలువవలయు సింహం
బీనుఁగుపై శశముమీఁద నెత్తినభంగిన్.

39


వ.

మఱియు రాజహంసుం డిట్లనియె.

40


క.

అబ్బినదాఁకా(?)జ్ఞానము
ప్రబ్బినగతి నూరకుండు ప్రాప్తం బైనన్
గొబ్బున గైకొనుఁ గొక్కెర
యుబ్బున మనుజునకు నిదియ యుచితముగాదే.

41


క.

కాలమున మేలుకొనుటయు
నాలంబునఁ బారకునికి నాప్తులకెల్లన్
బాలిడుట బలిమిరతియును
నాలును కుక్కుటమునందు నరుఁ డెఱుఁగదగున్.

42


క.

రతిగూఢత్వము దూరే
క్షత(?)యునుఁ గాలమున గ్రాససంగ్రహము బ్రమా
దితలేమి యనాలస్యముఁ
బ్రతివచ్చును కాకియందుఁ బంచగుణంబుల్.

43

క.

వైళంబ మేలుకొనుట య
నాలస్యము స్వల్పభుక్తి యధిపతిహితమున్
మేలిమగునిద్ర శౌర్యము
కౌలేయగుణంబులార కని మనవలయున్.

44


క.

అలసియును మోపుమోయుట
చలికిని వేఁడిమికి నోర్చి చనుటయు తుష్టిన్
మెలఁగుటయు గార్దభమునకు
గలగుణములు నరులు మూడు గనికొనవలయున్.

45


క.

ముందటఁ బ్రియమును పిదపన్
నిందయుఁ బచరించు దుర్వినీతాత్ముని బా
యందగు గుత్తుక విషమును
బొందగ ముఖ దుగ్ధమున్న భుజగముకరణిన్.

46


క.

కులవిద్య మిగులనుత్తమ
మలవడ వాణిజ్యకృషులు నవి మధ్యమముల్
కొలుచుట యధమం బారయఁ
దలమోసెడి బ్రతుకు మృతివిధంబగు తలపన్.

47


క.

కొఱగాని బాంధవంబును
కొఱగాని మహీస్థలంబు కొరగాని నృపుల్
గొఱగాని పత్నియును దను
నెఱుఁగకమును విడువవలయు నీహితబుద్ధిన్.

48


క.

చదువని విద్య విషం బగు
ముదుకనికిని దరుణి విషము మునుదారిద్ర్యా
స్పదునకును గోష్ఠి విష మగు
తుదినం గని భుక్తి విషము దుష్టాత్ములకున్.

49

క.

ఉరగంబు మహాకీడ(?)
య్యురగముకంటెను ఖలాత్ముఁ డుగ్రుం డట్లా
యురగము మంత్రౌషధముల
విరియునుఁ గొండీనిమాట విరియక పెరుగున్.

50


క.

మునులకును రూపు తాలిమి
వనితలకుఁ పతి ప్రియంబు వరరూపుగళ
స్వనమె పికములకు రూపము
కొనఁటికి రూపంబు విద్యగుణమైయుండున్.

51


క.

తొడవులకుఁ జీరముఖ్యము
పడతికి ముఖ్యంబు గుబ్బపాలిండ్లు మహిన్
వడువునకు విద్య ముఖ్యము
కుడుపునకు ఘృతంబు ముఖ్యగుణమై యమరున్.

52


క.

బలరహితు బలము నరపతి
జలములె మీలకును బలము చదలు బలంబౌ
పులుఁగులకు రోదనంబే
బలమగు బాలురకు సర్వభాషలయందున్.

53


క.

కరటికిని వేయిచేతులు
హరికిఁ బదియు బండి కైదుహస్తంబులు దు
ష్పురుషుఁతన దూరముననే
పరిహరణీయుండు మిగులబాంధవుఁడైనన్.

54


క.

ఉపకారి కాఁగవలవదు
రిపునకుఁ దదమాత్యవరు వరించి యభీష్టా
ద్యుపకృతు లతనికిఁ జేయుచు
నృపు లాతనివలనఁ గార్యనిర్ణయము దగున్.

55

క.

హితుఁడైనవాఁడె చుట్టము
హితరహితుఁడు చుట్టమైన నెడరే కోరున్
దతరోగి కడవిమందులు
హితులై రక్షించుగాన నెఱుఁగఁగ వలయున్.

56


క.

గిరిగిరిని మణులు గలుగవు
కరికరికిని మౌక్తికములు గలుగవు ధరణిన్
నరులెల్ల సజ్జనులుగా
రరయఁగ మలయజము దొరక దడవులనెల్లన్.

57


క.

గుడికి నిరవైనచోటును
పడియుండెడిచోటు పత్రభాజనమును నుం
చెడుచోటు పీఠకంబు(?)జ
గడమాడెడుచోటు విరివి చాలగ వలయున్.[1]

58


క.

కులమును రూపము వయసునుఁ
గలిగియు విద్యావిశేషగతి లేకున్నన్
తలపరు మనుజులు గహన
స్థలమునఁ బూచున్న బ్రహ్మతరువును బోలెన్.

59


క.

ఉపకృతి ఖలునకుఁ చేసిన
నపకృతియే చేయుఁ గాక యాప్తుఁ డగునె దా
కృప గలిగి పాలు వోసిన
కపటంబున పాము విషము గ్రక్కకయున్నే.

60


క.

జలరుహనాళంబున జల
ములలోతును వినయశీలములచేఁ గులమున్
బలుకుల విద్యయు శాంతిన్
గల తపమును నెఱుఁగవచ్చు ఘనులకు నెల్లన్.

61

క.

తురగములచేత, నావులు
పరవనితలచేతఁ గులముభామలు కావ్యో
ద్ధరణములచేత శ్రుతు ల
ల్లురచేతను సుతులు హీనులుగ, గావలెసెన్.

62


క.

ధనికునకు నిచ్చుదానము
వననిధిపై గురియువాన వాంఛాతృప్తిన్
దనియని విఫ్రులకును భో
జన మిడుటయు మూడువృధలు చర్చింపంగన్.

63


క.

కులహీనునకును విద్యయు
లలనకుఁ గొరగాని రతియు లక్షణహీనుం
గలిమియుఁ బొందును నొకచో
గులశైలముమీఁద వాన గురిసినభంగిన్.

64


క.

భేరీశబ్దం బామట
ధారాధరగర్జితంబు దశకమున, మహో
దారుఁడు లోకత్రయమునఁ
బేరెన్నిక గాంచు జగము బ్రియమున బొగడన్.

65


క.

తనయింట మూర్ఖు పూజ్యుఁడు
తనయూరం బ్రభువు పూజ్యతరుఁడగు రాజున్
దనభూమిఁ బూజితుండగు
విను పూజ్యులు సకలమునకు విద్యావంతుల్.

66


క.

పులకండపు బాదునఁ దగ
మొలపించిన వేపవిత్తు మొలకకు జాలన్
జలువ ఘటించి(న మ)ధురము
గలుగని గతి ఖలున నేల కలుగును గుణముల్.

67

క.

నిత్యంబుగాదు విభవ, మ
నిత్యము దేహంబు నిత్యనిహితంబగుగా
మృత్యువు, గావున నిత్యమ
నిత్యంబును ధర్మవృత్తి నిలుపఁగ వలయున్.

68


క.

నీచునెడ నీచతయును స
దాచారునివలన సాధుతాపూజయు దు
ష్టాచరితువలన నతిదు
ష్టాచరణము చేసిరేని నఘ మే లబ్బున్.

69


క.

అలసునకు విద్య వొందదు
కలుగదు విత్తంబు విద్య కలుగ యేనిన్
కలిమిం బాసిన మిత్రులు
గలుగర మిత్రులకు నేల కలుగున్ ఫలముల్.

70


క.

అనిచిన పరిమళవృక్షము
వనమున నొకడుండి వనము వాసించుగతిన్
తనయుం డుత్తముఁ డన్వయ
మునఁ గలిగిన వంశమెల్ల ముదమును బొందున్.

71


క.

వట్టినమ్రాఁకున ననలము
పుట్టిన వనమెల్లఁ గాల్చు పోలిక ఖలుఁడై
పుట్టినసుతుఁ డన్వయులకు
దిట్టును ఱట్టును ఘటించి తేజము చెఱుచున్.

72


క.

మొదలను సమస్తవిద్యలు
చదువుట వయసునను ధనము సాధించుట సం
పదమీఁద ధర్మి కాదగు
దుది నేమియుఁ జేయ నరుఁడు దొరకమి కతనన్ (?)

73

క.

అక్షరమొక్కటి యైనను
శిక్షించిన గురువు సేవ సేయని మనుజుం
డక్షణమ శునకయోనుల
నక్షీణతఁ బుట్టి మాలఁడై జనియించున్.

74


వ.

మఱియు సునీతి వర్మ యిట్లనియె.

75


క.

ఏపాటిమేలు దొరకిన
నాపాటికి సంతసింతు రార్యజనంబుల్
కాపురుషలోభి మానవు
లాపోవక మఱియు మఱియు నాసింతు రిలన్.

76


క.

తేలునకు తోఁక విషమగు
వ్యాలమునకుఁ బండ్ల విషము వనమక్షికకున్
బోలంగ శిరము విషమగు
కాలినఖలునకును విషము కాయంబెల్లన్.

77


క.

వ్రణ మాశించును మక్షిక
రణ మాసించును ధరిత్రిరమణుఁడు కలి దు
ర్గుణ మాసించును నీచుఁడు
గుణిసంగతిఁ గోరు సాధుకులుఁ డేప్రొద్దున్.

78


ఆ.

సిగ్గు పడిన లంజ చెడు సిగ్గు లేనట్టి
కులవధూటి వోలె యిలకుఁ దనిసి
సంతసించు నృపుఁడ సంతుష్టవిప్రుని
పగిది చెడును సత్యభాషణంబు.

79


క.

మృగచండాలము గాడిద
ఖగచండాలంబు కాకి కడుఁ గోపమునన్
దగిలినముని చండాలుఁడు
జగతిన్ దూషకుఁడు సర్వచండాలుఁ డగున్.

80

క.

తల్లియు నిల్లాలును దన
యి ల్లరసిన నడవియై నిల్లగు నిది దాఁ
జెల్లకయుండిన నరునకు
నిల్లది దానడవి యగును నెఱుఁగఁగవలయున్.

81


క.

హలికునకుఁ గరువు జేరదు
కలుగదు మాటాడకున్న కలహము జపికిన్
గలుగదు పాపము జాగర
కలితునకును భయము లేదు కడు నూహింపగన్.

82


తే.

రాష్ట్ర మొనరించు పాపంబు రాజుఁ బొందు
క్షితువు పాపంబు తత్పురోహితునిఁ బొందు
భార్య చేసిన పాపంబు భర్తఁ బొందు
శిష్యు చేసిన పాపంబు చెందు గురుని.

83


ఆ.

హితులు దెలిసిరేని హితులకు హితులయిన
వారు దెలియ నట్టివారివలన
మంత్ర మవియుఁగాన మంత్రి యొక్కఁడుదక్క
నొరులు మంత్ర మెఱుఁగకుండవలయు.

84


క.

బలయుతుఁడు గాగ మంత్రిన్
మెలపంగా వలదు నృపతి మెలపెన యేనిన్
బులికిం బక్కెర యిడుకొని
కలహమునకు నెక్కిపోవు కరణియకాదే.

85


క.

సుతుకడకు గురువుకడకున్
సతికడకున్ వేల్పుకడకు జనపతికడకున్
బతికడకు ప్రియము గోరెడు
నతఁ డూరక రిత్తచేత నరుగుట తగునా.

86

క.

బలయుతుఁడు వైర మెత్తిన
బలహీనుఁడు ప్రియము చెప్పి బ్రతుకుట గాకా
నెలవు దిగవిడిచి పోవక
నిలుచుట హరిఁ జెనకి కరటి నిలుచుటగాదే.

87


క.

ధనికుఁడు గావలె గాదా
చనవరి గావలయ గాక జనపతి గొలువన్
మనుజులకు ముక్తికొఱకా
తను వలయఁగ సేవ చేయఁ దత్పరబుద్ధిన్.

88


క.

వల్లభున కలిగి తాఁ జెడు
వల్లభుఁ డలిగినను తా నవశ్యమును జెడున్
ముల్లుపయిఁ బడిన తానా
ముల్లుపయిం బడినరఁటి మొగచిఱుఁగుగతిన్.

89


క.

మహనీయభోగసంపద
మహినాథునికంటె రాజమాన్యులకంటెన్
బహులముగఁ జూపవలవదు
బహుమానము తప్పు సిరియు భంగము పొందున్.

90


క.

కలిమిగల దినములందునె
కల రాప్తులు బంధుజనులు కాంతలు భటులున్
కలి మణఁగినదోఁ బలుకరు
కలిమియె చుట్టంబు దలపఁగా మర్త్యులకున్.

91


ఆ.

అలవిగాని పనికి నాసించుదుర్మతి
వెతను బొందు తాపగతుల డిందు
నిడుము నొందు మాన మెఱుఁగక చేటొందుఁ
గాన వలవ దలవిగాని పనులు.

92

ఆ.

ఈఁగిలేనివాని నిమ్మనువాఁడును
వ్యసని వ్యసన ముడుగుమన్నవాఁడు
పందఁబోటునకునుఁ బనిచినవాఁడును
సరయ శత్రులగుట నిశ్చయంబు.

93


క.

ఆయవ్యయములలోపల
నాయమునకు వ్యయము మిగుల నల్పం బైనన్
శ్రీయగు సరియగు నేనది
పాయదు వ్యయ మధికమైనఁ బాయును సిరియున్.

94


క.

పలువురు మెచ్చఁగ సభలో
బలికిన పలుకొప్పుఁ జిలుక పలికిన కరణిన్
బలుకక యసహ్యము గదాఁ
బలుకుట యది గార్దభంబు పలుకుటగాదే.

95


క.

మునియును శకునజ్ఞుఁడు దనుఁ
బనిచిన పని కొకని దానె పనిచెడు వాఁడున్
జనిరాని వాఁడు కంబపు
వెనుకకుఁ జనువాఁడు భృత్యవృత్తికి నధముల్.

96


క.

చల్లనిమాటలచేతను
నెల్లపనులు దీర్పవచ్చును నిది యెట్లన్నన్
చల్లనియేరులు గావే
పెల్లగిలం గొట్టు పాఁతు పెకలం గిరులన్.

97


ఆ.

స్వామిపగిది పంచసంవత్సరంబులు
పదియువత్సరములు బంటువలెను
అంతఁబదియునారు హాయనమ్ములు నిండ
మిత్రువలెనుఁ బుత్రు మెలపవలయు.

98

క.

బాలస్త్రీరతి మాఁపటి
వేళల యెండయును వండువిడిచిననీరున్
వేలిమిపొగయును రాత్రిఁటి
పాలును నాయుష్యకరము పరిశీలింపన్.

99


క.

బాలార్కుఁడు శవధూమము
లోలస్త్రీరతియు పల్వలోదకము నిశా
వేళల దధిబోజనములు
హాలాహలగళునకై న నాయువు నణంచున్.

100


క.

పురుడునకు నిచ్చుత్యాగము
శరబడి(?) దలపోసియిచ్చు బాకము యాత్రాం
తరముల నొసగెఁడు నీఁగియు
సిరికిన్ మోసంబు గాఁగఁ జేయదె మనుజున్.

101


క.

ప్రాణంబు సకలజనులకు
వానయ యవ్వాన తఱచు వచ్చిన దిట్టం
బూనుదురు గాన పరిచయ మే
నరునకైన మానహీనతఁ జేయున్.

102


క.

తనసిరి లోకములకు సిరి
తనదారిద్ర్యమ్ము లోకదారిద్ర్య మగున్
తనబ్రతుకు జగము బ్రతుకుట
తనమృతి జనమునకు మృతియుఁ దథ్యం బరయన్.

103


క.

అలుక తనకుతయ మగుటయు
నలిగించినవాని నామ మణఁగద యేనిన్
పొలయలుకగాక యదియును
నలుకా! తలపోయ నెట్టియధమునకైనన్.

104

చతుర్విధవృత్తము

పనసరసాల పాటలుల పాటిగ నుత్తమ మధ్య మాధముల్
వినబడుచుంద్రు పూయక ఫలించియుఁ బూచి ఫలంబు నొందియున్
ననిచి ఫలంబు లూనక వినాశము బొందినయట్టి పోలికన్
మునుఫల మిచ్చి పూచి ఫలముల్ ఘటియించియుఁ బూచి పండకన్.

105


వ.

అంత వివేకసముద్రుం డిట్లనియె.

106


క.

వడ్డికిచ్చుటయును వాదంబుసేఁతయు
కరిశనంబు[2]పొత్తు కాంతవరుస
ద్యూతమాడుటయును యొకనింట నుంటయు
జగడమునకు మొదలి సంచకరువు.

107


క.

కలవాఁడె బుద్ధిమంతుఁడు
మలినుఁడె యవివేకి వ్యసనమనుజుఁడె భూతం
బిలు లేనివాఁడె వేఁదురు
కలహియె పెనుచిచ్చు తలపఁగా నెల్లెడలన్.

108


క.

ఉరగము కంటెనుఁ గొండీ
డరయగ నధికుండు దలస నహిగర మొకనిన్
బొరిగొను గొండీ డొరుచెవిఁ
గఱచిన మఱియొకని ప్రాణకాంతులు దరుగున్.

109


క.

కులజుండొక్కఁడు చొరకే
కులమును సాధింపరాదు గొడ్డలి యటవీ
కులజమగు కామకతమునఁ
బొలియింపదె బహుళవివిధభూరుహసమితిన్.

110

క.

దీపనభుక్తియె పథ్యము
రాపొమ్మన కిచ్చువాఁడె రసికుఁడు తలఁపన్
గోపింపనివాఁడే ముని
పాపమునకుఁ దలుగువాఁడె ప్రభువు ధరిత్రిన్.

111


క.

పగలేనివాఁడె మనుజుఁడు
తగవెఱిఁగెడునదియె వారతరుణీమణి నె
వ్వగలేనివాఁడె ధనికుఁడు
నగచాట్లంబడనివాఁడె యనుభోక్తవయిలన్.

112


ఆ.

యెదుర గురుల బంధుహితులను బిమ్మట
బంటుబానిసలను పనులవెనుకఁ
బొగడఁదగును బుత్రుఁ బొగడకు మెప్పుడు
పొలఁతి చావకున్నఁ బొగడవలదు.

118


క.

అలజడి చుట్టము మనసును
గలనన్ సేవకుని మనము గలిమణఁగినచో
నలివేణిమనసు నాపద
జెలిమనసునుఁ గానవచ్చు చేష్టలచేతన్.

114


ఆ.

అవగుణంబె వెదకు నల్పుఁ డమేధ్యంబె
వెదకు పందిగతి వివేకి మంచి
సాధుగుణమె తలఁచు జలమునందును పాలు
తెలిసికోలు హంసతెఱఁగు దోప.

115


క.

వెలయాలు జాతిపిల్లియుఁ
చిలుకయు బెస్తయును పూర్వసేవకులనితా
వలవదు నమ్మఁగ నొండొక
తల పెత్తిన వెళ్ళబారఁ దలపుదు రెపుడున్.

116

క.

అనల ఋణవైరి శేషము
లును పంగావలదొకింత యుండెనెయేనిన్
వనమెరియు నప్పు వెరుగును
తనువడఁగును గాన తీర్పఁదగు నివియెల్లన్.

117


క.

పరివారంబునుఁ బ్రజయును
నరిజయమును భూపతులకు నాభరణంబుల్
పరికింప గనకరత్నా
భరణంబులప్రియము మోపు పరికింపంగన్.

118


క.

బాలకుఁడు నాథుఁడైనను
బాలిక గృహకర్తయైనఁ బలువురు మనుజుల్
వాలాయకాండ్రు నైనను
పాలసు విభుఁడైన నింటి భాగ్యము దప్పున్.

119


క.

అలుకయు రక్షాగుణమును
గలుగక యలమటయ తనకు కార్యంబులుగా
మెలఁగెడు భూపతిఁ గొలుచుట
పులిసాధని(?) నమ్మి చేరఁబోవుటగాదే.

120


ఆ.

ఆత్మబుద్ధి లెస్స అంతకంటెను పర
బుద్ధిసంపదలకుఁ బ్రోఁది సేయ
ఖలునిబుద్ధి కీడు కామినీజనముల
బుద్ధి ప్రళయమునకుఁ బుట్టినిల్లు.

131


క.

తనయులకు మంత్రులకు హిత
జనులకు మిత్రులకు నాత్మసంపద పొ త్తీఁ
జనుగాని చనవుపొత్తీఁ
జన దవనీశులకు కార్యసరణుల దలఁపన్.

122

క.

వేళెఱింగి సస్య (మలికెడు)
హాలికుగతి కార్యగతుల నయ్యెడువేళ
న్నేలింపకున్న, దోషం
బాలస్యమునందు గరళమగు నమృతంబున్.

123


క.

మానంబె కోరు నుత్తమ
మానుఁడు, మధ్యముడు ధనము మానము గోరున్
మానంబు విడిచి, ధనమే
మానుషమని కోరు, నధమ మానుఁ డెందున్.

124


ఆ.

ఆత్మశక్తిఁ బడయు నర్థ ముత్తమము పి
త్రార్జితంబు మధ్యమాహ్వయంబు
మాతృవిత్త మధమమార్గంబు, స్త్రీవిత్త
మధమమునకు నధమ మనిరి మునులు.

125


ఆ.

అన్నమునకు నధిక మష్టగుణంబులు
పిష్ట మంతకంటె నష్టగుణము
పాలు దానికంటెఁ బలల మష్టగుణంబు
నాజ్య మష్టగుణము నంతకంటె.

126


క.

తనచేతఁ జాలనొచ్చిన
మనుజుని నాసన్నుఁ జేసి మనుపుట, సర్పం
బునుఁ దోఁక నఱికి క్రమ్మఱఁ
దనచేరువ నుంచుకొనఁగ దలఁచుటగాదే.

127


క.

దినకరుఁ డుష్ణము మఱి య
ద్దినకరునకు నుష్ణ మగ్ని దిననాథహుతా
శనులకు నత్యుష్ణము దు
ర్జనముల వాక్యములు సకలజగములయందున్.

128

క.

చందనము చలువ జగములఁ
జందనమునకంటెఁ జలువ చంద్రుఁడు మఱి య
చ్చందనచంద్రులకంటెను
పొందుగ శైత్యములు సుజనపురుషుల పలుకుల్.

129


క.

కులపత్ని యొక్కతియు, మఱి
హలయుగమును, నందనత్రయంబునుఁ బదియా
వులు మధ్యరాష్ట్రమునుఁ, దగ
ఫలియించెడునిలయు, నునికిపట్టుకు నమరున్.

130


ఆ.

కన్నె రూపు గోరు కనకంబుఁ గోరును
దల్లి చదువు గోరు తండ్రి బంధు
జనము కులముఁ గోరు సౌఖ్యభోజన మిల
జనము గోరు నిదియ జగతినురవు.

131


ఆ.

గుఱ్ఱమునకు మోపుగుణమును గన్నెకుఁ
దల్లిగుణము పుడమి పుట్టుగుణము
నవనినిర్జరులకు నాచారగుణమును
దెలిసికొనఁగవలయుఁ గలితబుద్ధి.

132


క.

తమవారి బాసినను, ను
త్తమమిత్రుండైన మిగులఁదాపము సేయున్
గమలంబు నీటఁ బాసిన
కమలాప్తునివేఁడిచేతఁ గమలినభంగిన్.

133


వ.

రాజవాహనుమంత్రి శ్రుతకీర్తి మఱియు నిట్లనియె.

134


క.

న్యాయమునఁ బెరుగు ప్రజ, నర
నాయకునకు సిరియుఁ బెరుగు నానాఁటికి న
న్యాయంబుఁ దలఁచు ధరణీ
నాయకునకు సిరియుఁ బ్రజయు నాశముఁ బొందున్.

135

క.

ఖలజనుల తోడఁ బుట్టినఁ
గలిసినఁ జిత్తంబు లెనసి కదియకయుండున్
జలములనె పుట్టి పెరిగిన,
నలతామర పాకునీట నంటని భంగిన్.(?)

136


క.

చులుకనివారలఁ గూడిన
చులుకదనంబగును స్థిరవిశుద్ధాత్ములకున్[3]
శిల లటు వరదల సంగతి
జలములలోఁ దేలినట్లు చర్చింపంగన్.

137


క.

విఱుగంగఁ దగదు భటునకు
విఱుగంగాఁ జెల్లు భూమివిభునకు నాజిన్
విఱిగినను బసిఁడికలశము
గొఱయగు మృద్ఘటము విఱిగి కొఱమాలదొకో.

138


ఆ.

చందురుండు మిగులచల్లనివాఁడన
విరహిజనుల కెట్టు వెట్టయయ్యె!
అట్లు గాన మనుజుఁ డందఱికిని నొక్క
చందమున నేభక్తి జరుపఁగలఁడె.

139


క.

సేయఁదగునట్టి పనికిని
జేయనుపాయంబు సఫలసిద్ధి వహించున్
వేయేల! కాకతాళ
న్యాయం బగుఫలము ప్రాప్తమగు నరుకరణిన్.

140


క.

పరికింపఁ బురుషునకుునా
భరణము ధైర్యంబు, యతికిఁ బదవియె యోగా
భరణంబు శాంతి, స్త్రీ కా
భరణము లజ్జాగుణంబు భావింపంగన్.

141

వ.

ఇట్లు సునీతివర్మయు, వివేకసముద్రుండును శ్రుతకీర్తియును, దండ్రి యగు రాజహంసుండును నానానీతివిశేషంబు లెఱింగించి సుతులను దిగ్విజయార్థం బనిపినం జని, వనంబున నొక్కచో నవధూతఁ గని వానితో సఖత్వంబు చేసి తదుపదిష్టమార్గంబున రాజవాహనుండు పాతాళబిలంబు ప్రవేశించుచు నాత్మామాత్యపుత్రుల నుపహారవర్మ పుప్పోద్భవా అర్ధపాల సోమదత్తులు మొదలయిన తొమ్మండ్రను వెలుపల నునిచి యొక్కరుండును వసుంధరారంధ్రంబు ప్రవేశించి.

142


ఆ.

పావకాదివిఘ్నపటలిని నిర్జించి
యురగలోక కనకపురముఁ గాంచి
యందు మయుని పుత్రియైన కాళిందిని
ననుభవించి వనిత దనకు నొసఁగ.

143


క.

ధరియింప క్షుత్పిపాసలు
వొరయని రత్నము ననర్ఘ్యమును గైకొని త
ద్ధర వెడలి, రాజవాహనుఁ
డరుగుట గని, నిలువుమనిన, నంగనకనియెన్.

144


క.

మిత్రుఁ డవన్యపుఁజుట్టము
మిత్రునిఁ బోషించుకంటె మేలునుఁ గలదే
మిత్రుల బాయుట మిక్కిలి
ధాత్రిం బాతకము గాఁగ దలఁపుదు రార్యుల్.

145


ఆ.

అరులుఁ జూచి దుఃఖ మందంగ, మిత్రులు
సిరు లఁదేల రాజ్యచిహ్నలందు
నాత్మదేశ మేలునది వైభవముగాఁక
యన్యదేశవాస మదియు మేలె.

145

వ.

అట్లు గావున నాత్మమిత్రపరిత్యాగంబును బరదేశభోగంబును నుచితంబు గాదని కాళింది నొడంబరచి, పాతాళంబు వెలువడి మిత్రులం గలసియుండు నప్పుడు పుప్పోద్భవుం డిట్లనియె.

146


ఉత్సాహం:

రాజవాహన మమ్ముఁ బాసి ధరాకరండ్రము నీవు వి
భ్రాజమానుఁడ వగుచుఁ జొచ్చినఁ బ్రాప్తదుఃఖము బొంది మే
మీజగంబున సంచరింపుచు నిమ్మహీస్థలి నున్నస్వా
రాజసన్నిభుఁ బట్టికొని యొకరాజధానికి వచ్చితిన్.

147


ఆ.

వాఁడు చెలిగాఁగ నప్పురవరముఁ జేరి
బంధుపాలుని సఖ్య సంప్రాప్తినొంది
వాఁడు నేనును శకునంపువాంఛ నరుగ
నొంటిఁదత్పుత్రి చింతింపుచున్నవేళ.

148


వ.

మత్సఖుండైన చంద్రపాలుని శకునంబునకుఁ బెట్టి నే నబ్బాలచంద్రికం గామించి తదనుమతంబునఁ దత్పూర్వపతిని వధియించి యక్కామినిం గైకొంటి మన మప్పురంబునకుఁ బోదమని రాజవాహనుం దోకొని యవంతికిం జని.

149


క.

కుసుమపుర మేలునీతం
డసదృశగుణశాలి యనుచు నాప్తులకెల్లన్
వెసఁ జెప్పుచుఁ దత్పురవర
వసుధేశ్వర పుత్రి నయ్యవంతీకన్యన్.

150


ఆ.

రాజవాహనునకు రమణిగాఁ జేయుదు
ననుచుఁ బాలచంద్ర సతివకడకుఁ
బనిచి ప్రియము దెలిసి పణఁతికై తాఁ దిరు
గాఁడుటయును దెలిసి వీడలేక.

151

వ.

రాకపోకలు చేయుచుండు నంత నొక్కనాఁడు.

152


క.

హితుఁడైన సోమదత్తుఁడు
సతియునుఁ దాఁ గూడివచ్చి సమ్ముఖమైనన్
క్షితిపతి సుతుఁడును స్నేహం
బతిశయముగ నెట్లు వచ్చి తని యడుగుటయున్.

153


వ.

అతం డిట్లనియె.

154


సీ.

పురవీథి నొక్కయద్భుతపురత్నము గని
        యది దరిద్రుండైన యవనిసురున
కిచ్చినఁ దలవరు లిది రాచసొమ్మని
        పట్టిన ననుఁ జూపె బ్రాహ్మణుండు
వారును నను బట్టి కారాగృహంబున
        సంకెలఁ బెట్టి రాజనుల గూడ
నంత లాటేశ్వరుం డమ్మానసారుని
        నరి గెల్చి కూఁతు నయ్యవనిపతిని


తే.

బట్టికొనిపోవ నేను దత్ప్రజల కూడి
సంకెలనుఁ బాసి యమ్మానసారునకును
రణసహాయంబుపడ మంత్రి రాజసుతను
నాకు నిప్పించ వచ్చితి నరవరేణ్య.

155


వ.

అనిన సంతసిల్లి యున్నంత.

156


ఆ.

ఇంద్రజాలి యొక్కఁ డేతెంచి, యీరాజు
కూఁతు నీకుఁ బెండ్లి సేతుఁ జూడు
మిపుడె యనుచు మాళవేశ్వరు ముందట
కరిగి విద్యఁ జూపు నవసరమున.

157

క.

ఏ నింద్రజాలికుండను,
భూనాయక! మూఁడులోకములు రప్పింపం
గా నేర్పు గలదు తగువరు
నీనందన తోడఁ గూర్తు నిజముగ ననుచున్.

158


ఆ.

అయ్యవంతిఁ బెండ్లియాడెడు గంధర్వుఁ
డిపుడె యనుచు నృపతి కెఱుక చేసి
యతనిసమ్మతమున సుతకు వైవాహికా
లంకృతులు ఘటించి లలితముగను.

159


వ.

రాజవాహనుం బురస్కరించుకొని గంధర్వసమూహంబునఁ బొడచూపునట్లుగ మాయవన్ని యవంతీకన్యకం దెచ్చి రాజవాహనునకు వహ్నిసాక్షిగ బెండ్లి చేసి యనిపిన, నయ్యింద్రజాలిబలంబు లదృశ్యంబైన రాజవాహనుం డవంతీసహితుండై యప్పురంబున రహస్యవృత్తిం జరియింవుచుండునంత.

160


తే.

మాయగంధర్వుఁ గల్పించి మత్తనూజ
నెత్తుకొనిపోయె నెవ్వఁడో యిప్పురమున
బట్టి తెండని తెప్పించి బందివెట్టె
పుత్రిపైఁ గూర్మిఁ జంపక, భూపసుతుని.

161


ఆ.

అంత చండపర్మయను రాజు తనకూఁతు
నడుగ నీకయున్న నాతఁ డలిఁగి
దండు గదలివచ్చి దారుపంజరమున
నున్న నయ్యవంతి నుత్పలాక్షి.

162


చ.

ప్రియమునఁజూచి సంకిలియఁ బెట్టినరాణువనెల్ల భీమని
ర్దయత(రవృత్తిఁ జంపి) భటరాజివెసం జని రాజువాహు ని
ర్దయతను దెచ్చి సామజము పాదమునన్ వెసగట్టఁబంచినన్
రయమునఁ జండవర్మ నొకఱట్టడి భృత్యుఁడు చంపె నాదటన్.

163

తే.

గజము చంపక దైవయోగమునఁ బాద
బంధనము ద్రెంచి మావంతు పట్టుకొలుప
నంత మావంతు తల గొట్టి హస్తిఁ బరపి
వీడు మట్టించె నాబాలవృద్ధముగను.

164


వ.

అంత.

165


క.

అపహారవర్మయను పూ
ర్వపుమిత్రుఁడు వచ్చి చండవర్మను, వెస నే
నపగతజీవునిఁ జేసితి
నృప! నిను సంకెళ్ళ నిడిననీచాత్మకునిన్.

166


వ.

అని యివ్విధంబునఁ దొల్లి రాజవాహనుతోఁగూడ దిగ్విజయార్థంబు వెళ్ళివచ్చిన కుమారనవకంబును నటుక్రితంబు వ్యవహారతీర్థయాత్రాభ్రాంతులై పోయిన మువ్వురును రాజ్యంబులు వడసినవారలు గావున చండవర్మకు సహాయు లౌట రాజవాహనుపైఁ గవిసి తెలిసి యప్పన్నిద్దఱు నతనిం బట్టబద్ధునిం జేసి సేవింపుచు నొక్కనాఁడు.

167


క.

అపహారవర్మ యిట్లను
నృపనందను రాజవాహునిం గనుంగొని యో
తపనప్రతాప! యవ్విం
ధ్యపుగిరి మము డించి నీవు దలఁగిన పిదపన్.

168


ఉ.

భూవర! మిమ్ము నే వెదుకఁబోవుచు జైనులపల్లె గాంచుచో
గ్రేవల నేడ్చుచున్న యొక కేవలిఁ[4] గాంచి యదేల యేడ్చెదో
పావనమూర్తి! యన్న ననుఁ బల్కెఁ గనుంగొని యేమి చెప్పుదున్
గావరమెత్తి నాఁకు గలకర్బుర[5]మెల్లను వేశ్య కిచ్చితిన్.

169

వ.

అదియునుం గాక.

170


క.

కోమటి కుబేరదత్తుఁడు
శ్రీమంతుఁడు తనదుకూఁతుఁ జెలువను నాపైఁ
బ్రేమ గలదాని, నా కీ
డేమో! నేఁ బేద ననుచు నింఱిదలోనన్.

171


ఆ.

అనుచు మఱియు నేడ్వ నావైశ్యతనయు నేఁ
బెండ్లి సేతు నీవు పెట్టినట్టి
వారవనితసొమ్ము నేరుపునను దెచ్చి
యిత్తు నీకు మఱుఁగ కింట నుండు.

172


వ.

అని యూరడం బలికి యప్పురము ప్రవేశించి కపటద్యూతక్రీడ సలుపుధూర్తులయొద్ద నిలిచి వారలకు నాట చెప్పిన వా రలిగి నీ వాడనేర్చిన రమ్మనిన నేనును నట్ల కాకయని కూర్చుండి పాసికలు కైకొని యప్పుడు.

173


క.

పాసికలఁ గపటవిద్యా
భ్యాసము భావించి చూచి పందెంబునకున్
జేసి తగిలించి ద్యూతో
ల్లాసంబున శతసహస్రలక్షకొలఁదుల్.

174


వ.

అంత.

175


క.

అపహారవర్మ యనియెడు
కపటికిఁబురి దిరుగ ననువుగా దనుచును స
త్కృప వెరవు చూపుకైవడిఁ
దపనుం డస్తాద్రి గ్రుం కేఁదమ్ములు మొగుడన్.

176

క.

వీటఁగల వీథి వీథుల
చోటెఱుఁగన్ రాక సర్వశూన్యంబగుచున్
గాటుక కరాటమునకున్
బాటై తిమిరమ్ము భూనభస్స్థలిఁ గప్పెన్.

177


వ.

అప్పుడు.

178


ఆ.

ద్యూత మాడి తనకు నోడినకితవుండు
విత్తమునకు వాని వెంటఁ గొనుచుఁ
బోవఁ బ్రొద్దుపోయి పురమునఁ జెఱుగంత
సొమ్ముతోడ మెలఁగు సుదతిఁ గాంచి.

179


సీ.

ఈదొంగప్రొద్దు నీ వెచ్చటి కరిగెదు
        తొడవులతో నన్నఁ దోయజాక్షి
యనియెఁ గుబేరదత్తుని తనూభవ నేనుఁ
        దమ్ము మాతండ్రియు దారుడనెడి
యూరవ్యసుతునకు నుద్వాహ మొనరింతు
        నని వాఁడు పేదైన నతని కీక
యొండువైశ్యుని కీయ, నున్నాఁడు మున్నీయఁ
        బలికినాతఁడె, నాకు భర్తయగుటఁ


ఆ.

బ్రియముగలదు, వాఁడు పేదైనఁ గానిమ్ము
వానియింటి కరుగవలసి యిప్పు
డరుగుచున్నదాన, ననుటయు నిను వానిఁ
గూర్తుననుచుఁ దోడుకొనుచు నరుగ.

180


ఉత్సాహం:

పారి దిరుగపురము వీరభటులు దివ్వె లెసఁగ న
చ్చేరువకును వచ్చుటయును జేడియకును బుద్ధి సం
చారమెల్ల చెప్పి యపుడు సర్పదష్టుకైవడిన్
నోర నురుగు దొరఁగఁ దెళ్ళనొచ్చి మూర్ఛవోయినన్.

181

వ.

యక్కన్యక తలవరులం జూచి యిట్లనియె.

182


క.

పరదేశుల మీరాతిరి
పురమున నిచ్చోట నిద్రపోయినతరి మ
ద్వరుఁ బాము గఱచె వీనికి
గరుణన్ విషవైద్య మిచ్చి కావరె యనుచున్.

183


క.

పలవింపఁ గొన్నిమందులు
తలవరు లాతనికి బెట్టఁ దత్ఫణి విషమున్
దొలఁగినవలె నుత్థితుఁడై
యలి కుంతలఁ గొనుచు నయ్యుదారునికడకున్.

184


వ.

చని యక్కన్యకం దెచ్చితి, మి మ్మిరువుర బాణిగ్రహణంబు వొనరించెద ననిన, నిరువురు సంతోషించుటయు నయ్యుదారుననుమతి నక్కాంత నింటి కనిపి వాఁడునుఁ దానునుం గూడుకొని.

185


చ.

బలపముఁ గావిచీరములబంతి కసీఁసపుగోక, చొక్కుమం
దుల ముడి సన్నిసంహతి చతుష్టము దీపవిరోధిపేటి కు
క్కలవదనంబు కట్ట సెలకట్టియ, మాఱుశిరంబు సన్నచె
ప్పులు దొనకోల వాలుకయు భూషణరాజిగఁ జోరమూర్తియై.

186


వ.

ఆవైశ్యు నింటికిం జని.

187


ఆ.

గోడవ్రాఁత వ్రాసి కూర్చుండి భూమికి
మ్రొక్కి గోడ నేల చెక్కి త్రవ్వి,
కనుమ చేసి లోనఁ గాళ్ళులను మునుసాచి,
యరసి చొచ్చి యర్థమంత దేవి.

187


చ.

అనుపమవస్తువుల్ గొనుచు నంగడికిన్ గొని తేర నారెకుల్
గని పరతేర నగ్రమున గంధగజేంద్రము నిద్రవోవ, నం
తను బడఁడ్రోచి యేనుఁగు నదల్చుచు వెక్కి భటాలిఁదోలి వై
శ్యుని శుభగేహముల్ చదిసి యున్నతభూజము కొమ్మవట్టుచున్.

188

ఆ.

అంతఁ దెల్లవార నవనీరుహము డిగ్గి
యయ్యుదారు నింటి కరిగి వాఁడుఁ
దానుఁ గూడి బుద్ధిం దలఁచి చర్మపుదెత్తి
భూరిరత్నభర్మములు ఘటించి.

189


వ.

తదీయమహత్వంబు గఱపి భూపాలు సమ్ముఖంబునకుఁ బొమ్మనిన నతండును నది గొని చని.

190


ఆ.

దానధర్మములకు ధనమెల్ల వెచ్చించి
పేదవడితినని, కుబేరదత్తుఁ
డాది నాకు నిత్తునన్న, తనూభవ
నీయననిన, రోసి యిల్లు వెళ్ళి.

191


తోటకము:

అడవికి నేగి రయంబునఁ దనువున్
విడువఁగఁజూచిన విశ్వేశ్వరుఁ డ
య్యెడ మత్కరశర మంటఁగఁ బట్టెన్
బడగగుచర్మపుభస్త్రిక నిచ్చెన్.

192


క.

వ్రతివై యివి పూజింపుము
ప్రతిదివసము లక్ష లెక్కబంగరు లిచ్చున్
జతురత గొని చనుమని యా
సితికంఠుం డనుప నిచట చేరితి నృపతీ.

193


వ.

ఈచర్మభస్త్రికవలన నిష్టార్థంబులు గురియు రత్నంబును గాంచితి ననిన విని నీయొద్దనే యుండనిమ్మని యాయుదారునింట చర్మభస్త్రి రత్నంబు లున్న వవి యపహరించినవారి దండింతుమని పురంబునఁ జాటించి యింటి కనిపిన, నపహారవర్మం గూడి సుఖం బుండె నంత.

194

క.

ఆరత్నచర్మభస్త్రుల
కారణమున నాకు ధనము గలిగెననుచు, న
య్యూరఁగలయిండ్లు ద్రవ్వి యు
దారుని నపహారవర్మ ధనికునిఁ జేసెన్.

195


ఆ.

అంతఁ దనకు మిత్రుఁడైన విమర్దు సా
ధకునిఁ జేసి యర్ధదత్తుఁ గొలువ
బెట్టి వాఁడు వానికట్టడ దినమునుఁ
దనకు వచ్చి చెప్ప, వినుచునుండె.

196


సీ.

పురిలోనఁ గామమంజిరి యనుకన్నియ
        సయిదోడురాగమంజరి యనంగ
నంగనామణి నాట్యమాడఁగ నేఁ జూడ
        బోయి, మోహింపంగఁ బొలఁతి నన్ను
జూచి కామించిన, సుందరి మఱి యన్యు
        బిలువక నామీఁది ప్రేమఁ బొరల
నవ్వారకామిని యన్నలు తమ్ములు
        దల్లియు నృపతికిఁ దద్విధంబు


తే.

సెప్పుటయు భూమినాయకుఁ డప్పురమున
పల్లవుం డెవ్వఁ డీ వేశవనితఁ గొరలు
వాని దండింతునని వాడవాడలందుఁ
గంచుఘంట సెలంగఁ జాటించుటయును.

197


ఆ.

అంత నర్ధపతికి నావుగాఁ జేసిన
హొంతగాని కొక్కయుపమ చెప్పి
హట్టమున నుదారుఁ డనుమని, పంపిన,
ననియె, బుధజనంబు వినఁగ నతఁడు.

198

సీ.

శంకరుఁ డిచ్చిన చర్మభస్త్రిక పైఁడి
        గురియంగ ధనినంచుఁ గ్రొవ్వి యోరి!
మాలికకును మారమలసెద వటు చూడు
        మనిన నుదారుండు సాక్షివెట్టి
వచ్చి నా కెఱిఁగింప వాఁ డెఱుంగకయుండ
        నడురేయి యిల్లు కన్నంబువెట్టి
చర్మభస్త్రిక రత్నసహితంబుగాఁ గొని
        చని యేను రాగమంజరికి నిచ్చి


తే.

బొంది వచ్చితి నంతట ప్రొద్దువో ను
దారకుని లేపి దొంగలు ద్రవ్వి రత్న
చర్మభస్త్రులు గైకొని చనిరటంచు
కూయు వెట్టించి, యాపొరుగులకుఁ జెప్పి.

199


వ.

అయ్యుదారుండును రాజుసముఖంబునకుఁ జని యథదత్తుండు మదీయరత్నచర్మభస్త్రికలు దివియించెనని విన్నవించిన, నతనిఁ బట్టి తెప్పించిన నేఁ దీయించుట లేదనిన, నుదారుం డిట్లనియె.

200


తే.

గతదినంబునఁ దన కూర్చు హితుఁడు నన్నుఁ
బౌరజనములు సాక్షిగాఁ బ్రల్లదంబు
లాడి బ్రతుకుదుగాకని యరిగి వాఁడు
సురగె రమ్మని పిలిపించు నరవరేణ్య!

201


ఆ.

అనినఁ బిలువఁబంపె నాయొంతగాఁడునుఁ
దనకుఁ గఱపినట్ల తలఁగిపోయె
వానిఁ దెమ్మటంచు వసుధేశ్వరుఁడు నర్థ
పతిని బట్టి కొట్టి బందిఁబెట్ట.

202


వ.

అంత.

క.

తిత్తియు రత్నముఁ గానక
సత్తుగఁ దన కొసఁగుననుచు జలజానన సం
పత్తి దినవ్యయము సేయుచు
హత్తి ననుం గలయుచుండు నంతట యేనున్.

204


వ.

ఈతిత్తికథ బయలుపడకుండంగొనువాఁడనై యుదారునికిం దిత్తియున్ననెల వెఱింగించి రాజున కెఱింగింపుమని పంపిన.

205


సీ.

రాజైన సింహవర్మక్షమాధిపుఁ గాంచి
        కంటి నాసొమ్ము కీఁగడ, నృపాల
రాగమంజరియింట రత్నంబుఁ దిత్తియు
        నున్నవి పిలిపించుఁ డువిద ననుడు
నటమున్న యేను దదంగనయింటను
        నున్నవాఁడను గాన నన్నతోడ
నజినరత్నంబు భస్త్రి?యు మీగృహమ్మున
        వసియించునని సింహవర్మ యెఱిఁగి


తే.

యడుగ మిముఁ బిలువఁ బంపిన నర్ధదత్తు,
వారు మారాగమంజరివంక వత్తు
రెవ్వఁ డిచ్చేనొ యనుచు భూమీశునొద్ద
ననకయుండిన నపరాధు లగుదు రీరు.

206


క.

అని యేను దలఁగుటయు న
మ్మనుజేశుని భటులు రాగమంజరిఁ గొంచున్
జనుటయు నరపతి యడిగిన
వనితయు నేఁ జెప్పినట్టి వచనమె పలుకున్.

207


వ.

ఆతిత్తియు రత్నంబును దెప్పించి యుదారున కిచ్చి యర్థపతిం దల ద్రెగవేయుమని పంపిన నుదారుండు సింహవర్మ పాదంబులం

బడి వైశ్యుండు వధ కర్హుండుగాఁడని, పురంబు వెడలఁగొట్టించి ప్రాణంబు రక్షించిన నయ్యర్థదత్తుండు సంతోషించి తనకూఁతు నతని కిచ్చి సుఖం బుండె.

208


ఉ.

అంతట రాజమంజరిగృహంబున సీధురసంబుఁ గ్రోలి యే
కాంతమ యప్పురంబు చిఱుఁగ్రంతల నేగఁ దలారిమానుసుల్
చెంతల డాసి పట్టుకొని చేతులఁగట్టిన నన్ను నేను నా
ప్రాంతమునందు వెళ్ళఁ గెళవారసి దూతిక గాంచి యాఁదటన్.

207


వ.

దానిరాగమంజరి దూతిక సృగాలికగా నెఱింగి డగ్గరంబిల్చి యిట్టంటి.

210


ఆ.

ఆత్మమిత్రుఁడగు నుదారుని సొమ్మును
రాగమంజరింట రవణములును
మఱియు నూరగలుగు తెరవల సొమ్ములు
దాహరించినట్టి తస్కరుఁడను.

211


ఆ.

ఇచటఁ గట్టు వడితి నిఁక వీరి కెఱిగింప
నెపుడు జావు దప్ప దిందువలన!
మిమ్ము జెఱుపనెల్లి మీసొమ్ము మీ కిత్తు
ననుచుఁ గొన్ని కఱపి యనుపుటయును.

212


క.

దూతికతో నేమనునో
యీతండని పొంచియుండి యెఱిఁగి తలారుల్
భూతలపతి యనుమతమున
రాతిరియే బందినిడిరి రాజవరేణ్యా.

213


సీ.

అపరదినంబున నాసృగాలికచ్చి
        తిట్టుచు మాసొమ్ము తెరువు చెప్పు
మెచట దాచితి నన్న నిందు రమ్మని చేరళ
        బిలిచి తన్మిషమున లలనకంటి,

నంబాలికనియెడు నధిపు పుత్రికమీఁదఁ
        గాంతకుఁడను బందికర్త తగులు
నటువంటి శృంగారనటనలు గల్పించి
        యబ్బాల యెఱుఁగనియట్లు జరుపు


ఆ.

కాంతకునకు మదనసంతాప ముదయింప
గంధపుష్పవీటికలు ఘటించి
కాంతుఁడని పెననుచుఁ గైకొని తగిలింపు
వనిత యనిపెననుచు వానిమ్ము(?)

214


వ.

అనిన కఱపిన నదియు నట్ల చేయుచు నంబాలికకు నర్మసఖియై వర్తింపుచుండె నంత నొక్కనాఁడు.

215


క.

ఆరాజవదన సౌధపు
చేరువ పొడవము దిరుగఁ జెంగలువను న
ప్పారువము వైవఁ గాంతకు
పైరాలిన, దూత యదియ ప్రకటముచేయున్.

216


గీ.

కాంతతమ్మ యనుచుఁ గాంతకునకు నిచ్చు
వానితమ్మ పారవైచివచ్చు
పుష్పగంధములును బొలుతుకముడిపూఁత
లనుచు నిచ్చువానివైన నణఁచు.

217


వ.

అంత నొక్కనాఁ డద్దూతికం జూచి కాంతకుం డిట్లనియె.

218


గీ.

ఇట్టిబాల నాకు నేగతిఁ బ్రాపింప
ననువు సెప్పుమనిన ననియె దూతి
సంకెలందునున్న చౌర్యవిధిజ్ఞుండు
కన్నపెట్టగలఁడు కన్నెకడకు.

219

వ.

ఆకన్నంబునం జని నీ వాకన్నియం బొందుమనిన నట్లకాకయని కారాగృహంబున కేతెంచి యచ్చటి కావలివారలం జూచి యిట్లనియె.

220


క.

ధన మడుగు నేనృపాలుఁడు
చనుడి తరపువారు ననుచు సరహస్యముగా
జనుల వెడలించి రాతిరి
నను సంకెల లూడ్చుటయు ఖనన మిడినంతన్.

221


ఉ.

కన్నము త్రోవ నేగ సమకట్టిననుంగ్గని నిండుప్రాణియై
యున్నను మోసమంచు నను నుక్కణంగింప నీ దలంప నేనుం నా
సన్న యెఱింగి కాంతకుని జంపి కరాంగుళిముద్ర గొంచు నా
కన్నమువెంట నేగి పొడగాంచితి నిద్దురపోవు కన్నియన్.

222


వ.

రాగమంజరి గృహంబు ప్రవేశించి విగళితశృంఖలుండనై సృగాలికాసాధకుండనై యస్మత్కృతంబైన కన్నంబునం జని రాచకన్నెను రాత్రియెల్ల ననుభవింపుచుండ నంత నొక్కనాఁడు.

223


సీ.

ఆముద్ర యంగనహస్తశాఖఁ దగిల్చి
        యంగనయంగుళీయకము గొనుచు
తనరూప మక్కుడ్యతలమున లిఖియించి
        తాంబూలకల్క మాస్థలిని వైచి
ధరణికి నేతెంచి తనమీది వరకాని?
        నాప్తుగాఁ జేసి నెయ్యంబు గదుర
నీ కేను మేలు సన్నిహితంబుఁ జేసెద .
        నా చెప్పినటువలె నడువుమనుచు


తే

జారుఁడైన నీదుశత్రుండు చనిపోయె
విప్రుఁ డనుచు రాజు కెఱుఁగఁజెప్పు
మనియు నతఁడు గఱప నగుగాకయని చండ
ఘాతకుండు చనియెఁ బ్రీతితోడ.

224

వ.

అంత నపహారవర్మయు సృగాలికతోడ రాగమంజరి గృహమ్మున కరుగునప్పుడు.

225


చ.

తలవరు లేగుదేరఁ గని దగ్గఱ వచ్చుసృగాలిఁ జూచి యో
నెలఁతుక ! వెఱ్ఱివానిగతి నేఁ దిరుగాడెద వారు చూచినన్
బలుకుము వీఁడు మద్విభుఁడు పట్టుడు కట్టు డటంచు వారి నేఁ
గలఁచెదఁ బట్టనీక వెడకారులు బల్కుచుఁ గొట్టబోవుచున్.

226


క.

అని చెప్పి యాతలారులు
తనుఁ జేరఁగవచ్చునట్టితరి భ్రాంతునిలా
గునఁ గఱవఁదిట్టగొట్టన్
జనుటయు నెడ గలసి వారు చనుటయు నేనున్.

227


వ.

రాజమంజరి గృహమ్ము ప్రవేశించి విగళితశృంఖలుండనై సృగాలికాసాధకుండనై యస్మత్కృతంబైన కన్నమ్మునఁ జని రాత్రులెల్ల రాజకన్య ననుభవింపుచుండ నంత నొక్కనాఁడు.

228


ఆ.

చండవర్మ యపుడ చండసింహునిఁ బట్టి
కూఁతుఁ బెండ్లయాడఁగోరు టెఱిఁగి
జలజముఖిని విడువఁజాలక యచ్చండ
వర్మఁ బంపి నిన్ను వచ్చి కంటి.

229


వ.

అనిన సంతసిల్లి రాజవాహనుం డుపహారవర్మం జూచి నన్నుఁ బాసి నీ వెచటనుండితివనిన నిట్లనియె.

230


గీ.

ఏ విదేహనగరి కేగి తపస్వినీ
మఠము చేరియుండ మౌనికాంత
నన్ను నాదరించి ననుఁ జూచి వగచిన
నేలవగచి తనిన నింతి పలికె.

231

సీ.

ఆరాజహంసుఁడ రాతిచేనొచ్చిన
        తరి జ్ఞాతినికటుఁడు దర్పవృత్తి
రాజసన్మంత్రి గారాగృహంబునఁ బెట్టి
        యభిషిక్తుఁడై రాజ్య మనుభవింప
మత్పుత్రియును నేను మహిపతిపుత్రుల
        దాదులమైన కతంబునంధు
నేడ్చెద నాకూఁతు రీవికటేశ్వరు
        సతి కల్పసుందరి సకియ గాన


గీ.

యనుదినంబును వచ్చునన్న రసిపోవ
ననఁగ నేతెంచె నదియును నంతలోన
వచ్చి యంతఃపురంబుల వార్తలెల్లఁ
జెప్పుచోఁ జెప్పె నొకసుద్ధి చిగురుబోణి.

232


చ.

కొనఁటి మగండు తానగుటకుం దగ, నంగవికారి మూర్ఖు నె
మ్మనము గరంపలేని యసమర్థుఁడు వీఁడు విభుండుగాఁగ, నే
మన నిఁకనొల్ల, సత్య మనుమానము దక్కి సురూపవంతు నొ
క్కని ననుఁ గూర్పు వేగమని గామిని నా కెఱిఁగించె నంబికా.

233


క.

ఇతఁడు సుకుమారమూర్తి వీఁ డెవ్వడొక్కొ
వీఁడు వచ్చినఁ గొనిపోయి వెలఁది గూర్తు
ననుచు నాయమ్మ యనుప నయ్యతివ నన్ను
దోడుకొనిపోయి యక్కాంతతోడఁ గూర్చె.

234


క.

ఆవేళ కల్పనుందరి
భావజహతి నన్నుఁ బట్ట పైఁబడుటయు నో
హో వలవ దేను జెప్పిన
యావిధ మీ వాచరించి యంటుము నన్నున్.

235

వ.

అవ్విధం బెట్టిదనిన నీ విభుతో ననుకూలవై నీ కురూపత్వంబు మానునట్లుగా హోమంబు చేసి యాదేశంబు నీవిచారం బగ్నిదేవునకు విన్నవించిన సురూపవంతుండ వగుదువని యొకతపస్వి నాకుం జెప్పె నేకాంతంబున నియ్యంతఃపురిం జేరు మనుమనినఁ గల్పనుందరి యియ్యకొని విభున కట్ల యెఱింగించుటయును.

236


క.

సుకుమారత్వము గలుగును
వికటాకృతి మాన హోమవిధి సేయింతున్
సకలము నెఱుఁగఁగనని, జన
నికరము వినఁ జాటఁ బంచి నృపవరుఁ డంతన్.

237


సీ.

విప్రవర్గము హోమవిధి సేయ నంతిపు
        రంబునఁ గేళిగేహంబునందు
పగ లెల్ల నాహుతుల్ సావకుపై వ్రేల్వ
        గను గానరానిచోటను వసించి
పూర్ణాహుతికి రాత్రి ప్రొద్దువోయిన విప్ర
        వర్గంబు పరిజనవరుల ననిపి
దేవియుఁ దానగ్నిదేవుని డగ్గఱి
        సచివులతోడి విచారకథలు


నాప్రహారవర్మ నణఁగించు తెఱఁగును
కాపుచేతి మానికంబు గొనెడు
వెరవు సెట్టిఁ బట్టి విత్తంబు గైకొను
తలఁపు నగ్ని వినఁగఁ బలుకునవుడు.

238


క.

కరవాలు పట్టుకొని నే
ధరణిపుకంఠంబు దునిమి తనువును శిరమున్
స్ఫురితాగ్నికుండమున స
త్వరమునఁ బూర్ణాహుతిగను వైచితి నృపతీ.

239

వ.

అవ్విధం బాచరించి హోమకుండంబుగప్పి కల్పసుందరికి భయంబు
దీర్చి సంభోగించి తద్విభుని యాభరణంబు లెల్లఁ దాల్చి యద్దే
వికైదండ యీయ నంతఃపురంబుఁ బ్రవేశించి సురూపవంతుండ
నైతినని, వనితాజనంబుల కెఱింగించునంత ప్రభాతం బగుటయు.

240


చ.

జనపతి హోమమార్గమునఁ జక్కనిరూపము దాల్చెనంచు భూ
జనములు (మంత్రులున్ హితులు) సజ్జనవర్గము వచ్చి కాంచుచో
మనుజవరుండు ప్రాప్తులగు మంత్రులఁ జేరఁగఁబిల్చి దండుగన్
గొనకుఁడు సెట్టికాఁపులనుఁ గోరి ప్రహారునిబంది మాన్పుఁడీ.

241


క.

అనుటయు వికటుం డీతం
డనుమానము లేదు నిన్న నాడినమాటల్
వినిపించె నంచు ముదమున
ననుఁ గొల్చిరి మంత్రివరులు నానాజనముల్.

242


వ.

ఏనును మజ్జనకుండైన ప్రపహారవర్మం బట్టంబుగట్టి యువరాజునై రాజ్యం బనుభవించుచుండి సఖుండైన చండసింహునికి సహాయుండనై చండవర్మం జంపి నిన్నుఁ బొడగంటిననిన సంతోషించి యర్థపాలునిం జూచి యిట్లనియె.

248


క.

ననుఁ బాసి యెందుఁబోయితి
వని యడిగినఁ గాశి కరిగి యచ్చట వసియిం
చిన పురుషవీరు నొక్కనిఁ
గని యిచ్చట నుండె నేమిగారణ మనినన్.

244


గీ.

నామ(మునఁ బూర్ణచంద్రుఁ డనంగ[6]) నుర్విఁ
బరగువాఁడను నే గామపాలుఁడను
నర్మభృత్యుండనై యొక్కనాఁడు స్వామి
నడిగితిని యెవ్వరవు చెప్పుమనిన నతఁడు.

245

గీ.

ఏను రాజహంసు హితముంత్రి యగుధర్మ
పాలుసుతుఁడఁ, గామపాలనామ,
మిలఁ బరిగ్రహించి యీవారణాశికి
నరుగుదెంచి యిచట నధిపుతనయ.

246


వ.

కామించి దూతిముఖంబునఁ దదీయవృత్తం బెఱింగి చోరమార్గంబున నక్కన్యం బొందుచుందునని చెప్పె నంత.

247


క.

నిర్భరముగాఁగఁ గన్యక
గర్భము ధరియించి బిడ్డఁ గనుటయు నేనా
యర్భకు నివతల వేయఁగ
సర్భకు నొకయక్షవనిత యందుకపోయెన్.

248


గీ.

పోయి యక్షకన్య పుత్రునిగాఁ బెంచి
చండవర్మమనుమ సంతతైన
ఘోషుమంత్రి జేసి ? కొలువంగఁ బెట్టినఁ
గొలిచె మద్విభుండు కలితబుద్ధి.

249


క.

ఆకామపాలుఁ డిటువలె
భూగంతునిఁ గొలువ నొక్కభూతదినమునన్
భీకరకోపోద్ధతి సు
శ్లోకుం డాకామపాలులోచనయుగమున్.

250


వ.

భేదింపుండని పంపిన శస్రపాణులు డగ్గఱునంతలోనఁ గాంతిమతి పుత్రుం డక్కామపాలుని తనయుండు గావున నొక్కనాగంబు గొనివచ్చి కామపాలు దగ్గఱ విడిచి కఱచెనని విష మెక్క మంత్రించి యప్పుడు.

251

గీ.

రాజు పుణ్యుఁ డగుట ప్రాశాన కలుఁగక
కండ్లు వుచ్చుమనియెఁగాక వీని
దైవ మేల కాచు ధరణిప ద్రోహిని
సర్ప మగుచుఁ గఱచి చంపుగాక.

252


క.

అని కామపాలుపత్నికి
ననుగమనము సేయ ముదలయడిగాత్మని కే?
తనమునకుఁ గొంచుజనియ
దినపతి గ్రుంకుటయు రాత్రి దెగరాదనుచున్.

253


సీ.

ఆరాత్రి పూర్ణచంద్రుఁడాఖ్యుఁడు నేనును
        కుఖననం బొనరించి ఘోషుకడకుఁ
జని భూమిపతి ధరాసదనంబునం దిడి
        కామపాలుని రాజుగా ఘటించి
యువరాజనై యేను నుర్వీతలం బేలి
        యాసింహవర్మ ససహాయుఁ డగుచు
చండవర్మునిమీఁద జనుదెంచి యిచ్చోట
        నిను గన వచ్చితి మనుజనాథ


యనిన సంతసించి యారాజవాహనుం
డెదురనున్న ప్రమతి నీక్షణంబు
చేసి నీవు నన్ను బా సెటు ? వోయితి
చెప్పుమనిన వాఁడు చెప్పదొడఁగె.

254


క.

నే నట వింధ్యాచల భయ
కాననమున కరిగి విప్రుఁ గాంచి తదీయ
ప్రాణహిత మాచరించిన
నానిర్మలగురుఁడు నాకు ననుకూలుండై.

255

గీ.

అరుగుదేర హస్తి యను పురంబున కేగి
యాఁడరూపు చేసి యవనిసురుఁడు
తనయ యనుచు నన్ను ధరణిపుకడఁ బెట్టి
యవనిపతికి విప్రుఁ డప్పగించి.

256


గీ.

ఎవ్వరును లేరు నాకు నియ్యిందువదన
నొంది యొకచోట నిలుపఁ గులోచితంబు
కాదు గావున దీని నీకడను బెట్టి
పోయి యరసెద దీనికి బురుషునొకని.

257


వ.

నేఁ దిరిగివచ్చునంతకు దీని బోషింపుఁడనుచు నప్పగించి చనిన నభ్భూపాలుండును నన్ను నంతఃపురంబున కనిచి దేవికి సమర్పించుటయును.

258


క.

దేవియుఁ దనయాత్మజకు మ
హీనాసవతనయఁ బ్రోవనిచ్చిన నే నా
భూవిభుని తనయనొయ్యన
భావజకేళికిని మరపి పతివలె నుంటిన్.

259


సీ.

అంతట సుతకు స్వయంవరోత్సవము భూ
        వరుఁడు సేయఁగఁబూని వసుధఁ గలుగు
రాజనందనులను రప్పింప, నే రాజ
        సుతపంవునను, నలంకృతి ధరించి
జనపాలపుత్రులసంగతిఁ గూర్చున్న
        బడఁతి మధూకపుష్పముల దండ
నామెడఁ దగిలించిననుఁ జెట్టవట్టిన
        నధికుసమ్మతిఁ బెండ్లియాడి నేను

నృపతి తనరాజ్య మిచ్చి నన్ను పచరింప
వసుధ యేలుచు నీసింహవర్మునకును
దగుసహాయత కేతెంచి ధరణినాథ
నిన్నుఁ బొడగంటి ననినను నృపవరుండు.

260


వ.

దైవబలంబునకును సంతసించినవాఁడై, మంత్రగుప్తునిం జూచి నన్నుఁ బాసి నీ వెచ్చట నేమి చేసితనిన నతం డిట్లనియె.

261


గీ.

దామలిప్త(ముగలపురిఁ)పురంబునఁ[7]
బువ్వుఁదోట కేను బోయి యచట
కందుకోత్సవమునఁ గడు నొప్పు నృపపుత్రి
కందుకావ తనెడుకన్నె గంటి.

262


క.

అక్కన్యక యవ్వని నే
నక్కాంతను దూతిఁ జేసి యనిపిన నది దా
నక్కన్య యగ్రజాతున
కక్కథ యెఱిఁగింప నన్ను నంబుధి వైచెన్.

263


తరల:

కలము వట్టుక యేను దైవముకతనఁ బ్రాణము గల్గి య
క్కలము చేరి హితుండనై రిపుగర్వముల్ విదళించి య
క్కలన నెప్పటి వార్ధిలోఁ బడి గట్టుచేరి తటాంతర
స్థలము కాననవీధి రాక్షసతన్విఁ జూచి భయంపడన్.

264


వ.

అద్దానవి యిట్లనియె.

265


క.

ఈలాగున నేటికి నీ
వేలా వనవీథి దిరుగ విప్రుఁడ! యనినన్
నాళీకవదనపై నా
మేలూలినకతన ననిన, మెలఁతుక పలికెన్.

266

క.

కామినులు పాపములకున్
సీమలు తత్ప్రియము నమ్మి చేరెనయేనిన్
గామితము లుడిగి యాపద
లామనుజుని కౌట నిక్క మది యెట్లనినన్.

267


సీ.

పుడమి నింద్రిక్తతాఖ్యపురమున విప్రులు
        గలరు మువ్వురు వారు కరవునందు
నాఁకటి కోర్వక యాండ్రను భక్షింపఁ
        గడగొట్టువాఁ డాత్మకాంతఁ దినక
యాభూమి నుండక యన్యభూమికి నేగ
        దనకాళ్లుచేతులుఁ దినియె నొకఁడు
నామొండిమోచుకయఁ యాతఁడు బోషించు
        పరిసరంబైన కూపంబునందు


నంబువర్ధిఁ ద్రావ నధిపతి నందులో
ముణుఁగద్రోచి మొండి మోచుకొనుచు
గోప్యమయిన పాడుగుడి చేరి యామొండి
బొందగోరుటయును బొంద కతఁడు.

268


క.

పాపము గట్టకు తల్లివి
యోపడఁతుక! యనెడు నంత నొక్కఁడు దివియన్
రూపంబు వెడలి విప్రుం
డాపురికిని రాఁగజరభి యవనీపతికిన్.

269


గీ.

మొఱ్ఱవెట్టి పతిని మొండిగాఁ జేసిన
పాపి వీఁడె యనుచు భర్తఁ జూప
విప్రు నఱుకుఁడనిన వెలఁదుకపతి మొండి
నడిగి నఱుకుఁడనిన నడిగి వారు.

270


వ.

అమ్మొండివానిచేత నావృత్తాంతం బెఱిఁగి రాజానుమతంబున నాజంత కర్ణనాసిచ్చేదనంబు చేసి వెళ్ళగొట్టిరని మఱియును.

271

సీ.

రమణీయమగు మధురాపురంబునఁ గాల
        కంటకుండనువాఁడు కాంతయందుఁ
బాయ(నిరతి) చిత్రపటమున రూపంబు
        వ్రాయించి చూచు నేవంకలందు
నంతట నొకసిద్ధుఁ డన్యదేశీయుండు
        చిత్రితకామిని చెలువుఁ జూచి
వ్యభిచారి యిది పిన్నవయసునాఁ డిప్పుడు
        గరితయై యున్న దెక్కడికిఁ జనక


యనిన నక్కాంతచెలి పోయి యంగనకునుఁ
జెప్పె సంతతి కొకమందు సిద్ధుఁ డెఱుఁగు
కాంత పాదంబు చూచి యేకనఁగనేర్చు
ననినఁ దోకొనిరమ్మన్న నతనిఁ గొనుచు.

272


వ.

లోనికిఁ జని తెరయవ్వలం గామిని నునిచి పాదంబు చాఁపుమనిన నది యట్లచేసిన.

273


గీ.

చేతి చిఱుగత్తి నూరువు చించి కాలి
యందె గొనిపోయి యక్కాంతయధిపుతోడ
బోయి నటువంటినిశిప్రేతభూమి చొచ్చి
శవములను దించునాస్థితస్థలికిఁ జేరఁ.

274


వ.

అదలించి శూలంబునం బొడిచి కాలియందియ వుచ్చికొంటిని యిదెయందియ తదూరుదేశంబు ఘాతయుం జూడుఁడనిన నక్కాలకంటకుం డది వీక్షించి దానినడవికిం గొని చని గళంబునఁ బాశంబు దగిలించి పోవుటయును.

275


గీ.

సిద్ధుఁ డచ్చటికినిఁ జేరి రజ్జువు ద్రెంచి
కాంతతో దగలన సంతసించెఁ
గాన కపటసతుల గపటంబుతోడన
బొందు సేయకున్నఁ బొందరాదు.

276

వ.

అని చెప్పిన కందుకావలిం బొందు మాయోపదేశంబు చేసి రాక్షసి చనియె నేనును నక్కందుకావతిని భోగించి దానితండ్రిం జంపి యతనిరాజ్యమున కభిషిక్తుండనై సింహవర్మకుఁ దోడు వచ్చి నిన్ను బొడగంటిననియె నంత.

277


సీ.

మాతృగుప్తుండను మంత్రివుత్రునిఁజూచి
        యెచటికిఁ బోయి నీ వేమి చేసి
తనిన నేనొకపురి యర్ధరాత్రం బొక
        సిద్ధుండు హేమంబు సేయ నాతఁ
డెఱుఁగనిచో డాఁగి యే నుండి మఱివాఁడు
        దైత్యుఁ బుట్టించి కర్దమునివనితఁ
దెమ్మన్న నటవోయి తెచ్చునంతకుఁ ద్రోవ
        కడ్డంబు చని యేను నబ్జముఖిని


నచ్చటనె పెట్టి నిన్ను రమ్మనియె సిద్ధు
డనిన న దియట్ల చేయ నయ్యతివ విభుఁడు
గదియవచ్చినఁ బఱచి రాక్షసుఁడె యనుచుఁ
బమ్మరింపుచు నేమేనిఁ బలుకుచుండ.

278


వ.

ఆభూపాలుం డాత్మకాంతకు భూతప్రవేశం బైనదని రక్షావిభూతు లరయుచో నేనొక యతినై రక్షోఘ్నమంత్రం బుపదేశించెదనని రాజునకు విన్నపంబు సేయించి యూరివెలుపలి పద్మాకరంబున మధ్యరాత్రి స్నానంబు సేయ వినియోగించి యప్పు డభ్భూపాలునిం జూచి యిట్లంటిని.

279


క.

నీమంత్రుల కెఱింగించి మ
హామంత్రము గొనుము దీననంగము నాత్మ
శ్రీమహిమ నొండు నని య
భ్భూమిపునకుఁ జెప్పి పనుపఁ బో యాసరసిన్.

280

గీ.

నీరు చొరని పెద్దనీరాటిలోఁ జొచ్చి
యబ్జషండ వీథి నడఁగి యుండి
నీటఁ గ్రుంకు వెట్టునృపుకంధరముఁ ద్రెంచి
కడువలోనఁ బెట్టి కదలి యేను.

281


క.

ఆరాజుపత్నిఁ బొంది య
వారణరా జగుచు సింహవర్మకుఁ దోడై
యోరాజహంసనందన!
నీరూపము గంటిననుచు నృపు నలరించెన్.

282


వ.

రాజవాహనుండు విశ్రతుం డనువానిం జూచి నీ వెందు వోయితనిన నతం డిట్లనియె.

283


క.

చూపట్టెడు వింధ్యాటవిఁ
గూపముదరి నేడ్చు బాలకునిఁ గని యేలా!
వాపోయెదనిన మత్పిత
కూపంబున బడిన నిట్లు గ్రోల్చెద ననినన్.

284


గీ.

ఆధరామరేంద్రు నంధువు వెడలించి
ప్రహిఁబడంగ నేల ప్రాప్తమయ్యె
ననిన విప్రుఁ డనియె నన్న నే నొకరాజు
సచివవరుఁడ నౌదు చరిత వినుము.

285


వ.

వసంతభానుండను రాజు అనంతవర్మయను రాజుం గెల్వ నిశ్చయించు సమయంబున వసంతభాను ననుంగుమంత్రి చంద్రపాలుండు కపటోపాయంబునఁ దండ్రితో నలిఁగివచ్చినవాఁడై యనంతవర్మ ప్రధానుండైన విహారభద్రుండు కార్యసహాయుండుగా ననంతవర్మం గొలిచియుండినంత.

286

చ.

వఱలు ననంతవర్మనృపు వశ్యునిఁగా నొనరించి దుష్టతల్
గఱపి ప్రజావిరుద్ధగతుగా నడిపింపుచుఁ జంద్రపాలుఁ డ
త్తెఱఁగు వసంతభానునకుఁ దెల్లముగా నెఱిఁగించి పంపె నీ
వఱిముఱి దండు రమ్ము వసుధాధిపు నీ కని నొప్పగించెదన్.

287


గీ.

అన వసంతభానుఁ డాజికి నరుదేరఁ
దా ననంతవర్మదండునకును
మొనకు ముందరకును నని సేయనొల్లక
చన ననంతవర్మఁ జంపి రపుడు.

288


వ.

ఇవ్విధంబున ననంతవర్మం జంపి వసంతభానుండు రాజ్యంబు గైకొని పాలింపుచున్న చంద్రపాలుం డప్పుడు.

289


ఉ.

ఆజి ననంతవర్మ తెగటారిన నీపరివార మెల్ల న
వ్వాజుల దంతులన్ యువతివర్గము రత్నవిభూషణంబులన్
రాజస మొప్పఁ గొల్లగొనిరారు భజింపగ నంచు నమ్మహీ
రాజున కింపుగా నొడివి రాష్ట్రవిభేదము చేసి యంతటన్.

290


క.

పరివారము వాఁడై తా
ధరణీశుని వెళ్ళగొట్టి తా రా జైనన్
బుర మేలు తొంటినరపతి
సరసిజముఖిసుతునిఁ గొంచుఁ జన నొకపురికిన్.

291


గీ.

ఇట్లు మాహిష్మతిపురి కేగి యందు
మంత్రి వసురక్షితుండున్న మందిరమున
కరుగుటయు వాఁడు విధవ నయ్యతివఁ బొందఁ
గోరుటయు సమ్మతంబునఁ జేరకున్న.

292

వ.

తత్పుత్రు వధియింపందలచిన నయ్యనంతవర్మదేవి తనపుత్రుండైన వీని నా కప్పగించి రక్షింపుమనిన వీనిం గొనివచ్చి యీనూఁతికడ జలపానార్థంబు డిగ్గి యీనూఁతం బడి నీచేత నుద్ధరింపంబడితినని యిట్లనియె.

293


క.

నీ వామాహిష్మతిపురి
కీవేళ యరిగి జనని కెఱింగింపు మహీ
దేవునికడ నున్నాడని
యావలికథ యొక రహస్య మది యెఱిగింతున్.

294


సీ.

మారణమంత్ర సమర్శకంబగు నొక్క
        పువ్వులదండ యప్పొలఁతి కిమ్ము
త న్నెవ్వఁ డాశించెఁ దద్భూమిపాలుని
        గళమున వైచినఁ బొలియు నతఁడు
వెలఁదుక తనపుత్రు వింధ్యవాసినిసింహ
        మై దాఁచినది తెచ్చు నాత్మ(భువికి)
నని పంప నే నేగి యాపుష్పమాలిక
        యిచ్చి నందనుకథ యెఱుగజెప్పు


నంత వసురక్షితుఁడు (కాంత) ననుభవింప
నరుగదేరఁ బతివ్రత నైతినేని
వీఁడు మృతిఁ బొందునని దండ వేయుటయును
వ్రాలె నిర్జీవియై వసురక్షితుండు.

295


వ.

అద్దివసంబుననే నాడీజంఘుండను విప్రుండు కుమారునిం గొనితెచ్చె; పరివారంబును నద్దేవి మహాపతివ్రతయని సంతోషించిరి; నేనును నారాజపత్ని మేనత్తయగుట తదీయపుత్రునిం బట్టంబు గట్టి రాజ్యంబు సేయుచుండునంత.

296

గీ.

ఆవసంతభానుఁ డామిత్రవర్ముని
పురి యరాజకమునఁ బొందె ననుచు
నెత్తివచ్చుటయును నే వాని వధియించి
బాలకునినె పట్టబద్ధుఁ జేసి.

297


వ.

మాహిష్మతీ విదర్భాపురంబు లేలింపుచు సింహవర్మకు సహాయుండనై వచ్చి యిట మిమ్ముఁ బొడగంటిననిన సంతోషించి యాత్మీయంబైన కుమారదశకంబునుఁ గూర్చుకొని తదీయరాజ్యసహితంబుగ రాజవాహనుండు స్వకీయంబైన కుసుమవతీపురం బేలుచుండి.

298


క.

అని నారదుండు మఱియును
జననాయక కథలు గొన్ని జరపెడువాఁడై
వినుపింపఁదొడఁగె నబ్బలి
దనుజేంద్రుఁడు ముదము నొంది తను గనుఁగొనగన్.

299


ఉ.

పుణ్యుఁ డశోకదత్తుఁడను భూసురవర్యుఁడు గాంచె భీకరా
రణ్యము భీమరాక్షసశరణ్యము నుద్ధృతశూలనేత్రకా (?)
రుణ్యము గంధదంతిమదరోపితసింహకరాళహుంకృతా
గణ్యము మాంసభుక్పటలకంఠగుహామిషరుద్ధపుణ్యమున్.

300


గీ.

కాంచి యందు నొక్కకనకపంకేరుహ
సరసిదరిని రాక్ష(సపరివృఢుని)
గదియ నరుగుటయును గని శాంతభాషలం
బలికె విప్రురాకఁ దెలియనడిగి.

301


క.

జడనిధి పాథఃపూరము
నడుమను నొకచిత్రకూట నామద్వీపం
బుడుపదము మోచియున్నది
తడయక చను మచటియక్షతనయలఁ జూడన్.

302

సీ.

అని చెప్పి నిజారాక్షసాకృతి నెడఁబాసి
        యరిగె శాపవిముక్తుఁ డగుచు నసుర
బ్రాహ్మణుండును తసభాగినేయుండగు
        శక్తిదేవునకు నాజాడ చెప్ప
ధరణీసురుం డబ్ధితటమునకును జని
        తాళేశ్వరునకు పుత్రత్వ మొంది
జలధిపై వేటకుఁ జని వానితోఁ గూడ
        ప్రవహణం బబ్ధిలో భగ్నమైన


విధివశంబున నొకవటవృక్ష మబ్ధి
జలముపైఁ దోఁప నత్తరుశాఖ వట్టి
వార్ధి మునుగకయుండ, నవ్వటముశాఖ
నున్నగృధ్రంబు పలికె నయ్యుర్విసురుని.

303


జలధరవృత్తము.

వెఱవకయుండుము విప్ర యటంచున్
గఱచుక యేఁగుచు ఖచరుండతన్ (?)
పఱచుచు నొప్పదిఁపంబున డించ్చన్[8]
గిఱికొని యందుల కిన్నరకాంతల్.

304


గీ.

విప్రుఁబొడ గాంచి యచటికి వేఁగ వచ్చి
రందు చంద్రప్రభయనెడి యతివయోర్తు
హస్తిమల్లోపమగు (?) మదహస్తి నెక్కి
వచ్చె నింద్రాణియునుఁ బోలె నచ్చటికిని.

305


వ.

అంత.


క.

సాంద్రతరస్మితనిర్జిత
చంద్రప్రభ కుచవిలిప్త చంద్రప్రభ నా
చంద్రప్రభఁ గనుగొని ద్విజు
చంద్రుఁడు స్మరరాహుగిళితచంద్రుం డయ్యెన్.

306

వ.

అప్పుడు.

307


గీ.

జగతిసురునిఁ జూచి చంద్రప్రభయు మది
మన్మథాస్త్రబాధ్యమాన యగుచు
పలుకులందు గమనభావంబు దెలిసి యి
ట్లనియెఁ దనదుభావ మాతఁ డడుగ.

308


క.

శశిఖండుండు మజ్జనకుఁడు
శశివదనలు ముగురు నాకు సహజాతలు త
చ్ఛశివదనలలోపలనను
శశిప్రభయటండ్రు ఖచరజాతుల మగుటన్.

309


వ.

అట్లు గావున మదీయగృహంబున కరుగుదెమ్మని తోఁకొనిచని పూజితుం జేసి యవ్విప్రున కిట్లనియె.

310


గీ.

శాపముక్తి మనుజసంగతి గల్గు మీ
కనుచు తొల్లి గిరిజ యాన తిచ్చె
నట్లుగాన మాకు నధిపతి వీ వని
ధరణిసురుని గలసి తరుణిమణులు (?)

311


వ.

అందు గర్భంబు దాల్చి చంద్రప్రభ యాశక్తిదేవున కిట్లనియె.

312


సీ.

విప్రదత్తుండను విప్రుండు జాబాలి
        శిష్యుఁడు తద్యోగసిద్ధికొఱకు
విధ్యాధరీగర్భవిదళనం బొనరించి
        గురువులకిడి భుక్తి గొన్న వెనుక
తచ్ఛేష మించుక తా భక్షణము చేసి
        బేతాళవాహుఁడై పృధ్వి బాసి
రమణీయవిద్యాధరత్వంబు
        బ్రాపించె గావున నీవు నాగర్భదళన

గీ.

మిప్పు డొనరింపు మనిన నయ్యిందువదన
భ్రూణహత్యకు నే నెట్లు పోదుననిన
నతివ నిజముష్టి తనగర్భ మలవరించి
శక్తిదేవున కీయ నాజగతిసురుఁడు.

313


చ.

కరకమలంబు చాఁప నది ఖడ్గగతిన్ నిజముష్టి నొందినన్
ధరణిసుతుండు విస్మయముఁ దాల్ప నభంబున వాణి వల్కె భూ
సురవర ఖడ్గ మందుకొనఁ జొప్పడు ఖేచరసిద్ధి నీకు నీ
పురమును యక్షరాజ్యమునుఁ బొల్తులు జేరుదురన్న విప్రుఁడున్.

314


క.

విద్యాధరుఁడై నలువురు
విధ్యాధరసతులు దనకు వెలఁదులుగా భ
వ్యద్యుమ్ననగర మేలుచుఁ
బ్రద్యుమ్నక్రీడ భోగభాగ్యుం డగుచున్.

315


ప్రగుణవృత్తము:

నృపతిన్ వత్సా
ధిపునిన్ భూదే
వపతిన్ ప్రీతిన్
సపదున్ గాంచెన్.

316


వ.

అంత.

317


చ.

హిమగిరి వజ్రనాథశిఖరేశుఁడు వజ్రశిఖాశరీరి వ
త్సమనుజనాథుఁ గాంచి తదుదారకథల్ వినుతించి పల్కె నీ
కొమురుఁడు సర్వవిద్యలు నకుంఠితశక్తి బరిగ్రహించి శం
భుమహితసత్యవాగ్గరియు బొంద్దు వియచ్చరచక్రవర్తితన్.

318

క.

ఆద్యుఁడు సూర్యప్రభుఁడను
విద్యాధరుమాడ్కి సర్వవిద్యలు గాంచున్
విద్యోతమూర్తిఁ గొనిచను
నుద్యోగితవచ్చినాఁడ నుర్వీరమణా!

319


వ.

ఆసూర్యప్రభుచరిత్రంబు వినుపించెద వినుమని యిట్లనియె.

320


క.

చంద్రప్రభుఁడను రిపునృప
(సాంద్రతమోవిధుఁడు) కీర్తిచంద్రికచేతన్
చంద్రవితానితసుదిశా
సాంద్రతలుం డగుచు సర్వజగములు నేలెన్.

321


వ.

అక్కాలంబున.

322


గీ.

మయుఁడు చంద్రప్రభుని సభామంటపమున
కరిగియుండంగ నావేళ నచ్చటికిని
నాకపురినుండి యేతెంచి నాకమౌని
యింద్రునానతి నెఱిఁగింప నిచ్చగించి.

323


క.

వచ్చి ధరణీవరుచే
నర్చితుఁడై మౌని వలికె నమరేంద్రుఁడు ని
న్నిచ్చట రుద్రాధ్వరమున
కుచ్చరితము చేసెఁ జేయు ముచితమయేనిన్.

324


చ.

అనిన మయుండు పల్కె సుగుణాకర రుద్రమఖంబు చేసి య
య్యనలలలాటుచేత విజయంబు వరంబుగ నందనేల ము
న్ననిమి యూధనాథుఁడు శతాధ్వరముల్ దగజేసి కాదొకో!
దనుజుల కోడి పారుట వృథామఘసంహతు లెన్ననేటికిన్.

325


క.

అని మయుఁడు పలుకు పలుకులు
విని నారదుఁ డరిగె జంద్రవిభుఁడునుఁ దననం
డను డగు సూర్యప్రభు న
ద్దనుజస్రష్టకు బ్రియంబు దలకొననిచ్చెన్.

326

క.

శుభమూర్తంబున సూర్య
ప్రభునకు భూతాసనంబు బంధురహేమ
ప్రభగ విమానమ్మును నతి
విభవముగా నొసగికొనుచు వెడలెన్ బురమున్.

327


సీ.

అట్లు సూర్యప్రభు నతలంబునకుఁ గొని
        యరిగి మయుండు ప్రహ్లాదముఖ్య
దైత్యాధిపతులనందనల కరగ్రహ
        ణం బొనరించి యన్నాకపతికి
బ్రతిగాగ విద్యాధరత్వదీప్తునిఁ చేసి
        మాయాదివిద్యాసమర్థుఁ జేయ
నింద్రుండు మనుజునికి కీవిద్య లేటికి
        నిచ్చెదరని దూతఁ బుచ్చుటయును


బలియుఁ బ్రహ్లాదుఁడును మయుఁ బలుకుమనినఁ
బలికె నింద్రుండు తగవేమి పట్టిచెప్పెఁ
దాను వృత్రాదిరాక్షసతతులయెడల
నెట్టి తగవున నడచె దానెఱుఁగడోటు?

328


క.

అని దూత వోయి చెప్పిన
విని శ్రుతవ ర్మనెడు మనుజువిభుమిత్రునిఁగా
నొనరించి సూర్యవిభుతో
ననికినిఁ గొనితెచ్చి నిర్ణరావలి గొలువన్.

329


చ.

మయుఁడు పురారిసత్కృప నమర్త్యవిభీషణమైన సాయకో
చ్చయమును జాపమున్ నృపతి చంద్రభపుత్రున కిచ్చి దానవ
ప్రియముగ నాజికిం బనిచి భీషణదానవసైన్యయుక్తుఁడై
రయమునఁ దత్సహాయత దురం బొనరించె సురేంద్రసేనతోన్.

330


వ.

అంత.

331

క.

దివసకరుఁ డస్తమించిన
గవిసెను తిమిరంబు దిఙ్నికాయము గప్పన్
దివమునుఁ బుడమియు సామజ
నివహావిలమైన కువలనిధియును (?) బోలెన్.

332


గీ.

ఆజిఁ జాలించి యంత సూర్యప్రభుఁడు
విబుధవైరులు దానును విశ్రమించి
యొక్కకథ చెప్పదొడఁగె తద్యోధులకును
శ్రవణపుటముల నమృతంవుజల్లుచినుక.

333


సీ.

విక్రమసేనభూవిభుఁ డవంతీశుఁ డా
        తనిమంత్రి గుణవంతుఁ డనెడువాఁడు
నృపతికి విషమ రిపుఁడు పెట్టించిన
        నెఱిఁగించి యెడపాలనే పడంచె
విభుఁ డేటిలో స్నానవిధిఁ దీర్ప నక్రంబు
        వట్టిన నసి దానిఁ గొట్టివైచె
మఱియు నుగ్రపుఫణి గఱచిన విష మెక్కి
        పడిన నిజేశ్వరు ప్రాణ మెత్తె


నట్టిసచివుఁడు విభుకృపాప్రాపుఁ డగుచు
నంతిపురినున్నవేళయు నధిపుఁ గొలుచు
నట్టిచో భూమిపతిభార్య యభిలషించి
పట్టుటయును నంటకున్ననుఁ బడఁతి యలిగి.

334


క.

మఱుపడ పతిముందటఁ గొ
న్నఱవులు వచరించి మంత్రియల్పుఁడు నన్నుం
బఱచెనని యాత్మనఖముల
తెరువు లతని వనుచుఁ జేరఁ దివిసటు చూపన్.

335

ఉ.

ద్రోహి ప్రధాని యంచు తలద్రుంచగ పంచిన వాఁడు మున్నె యా
యూహ యెఱింగి పాసి చని యొక్కమహీసురమంత్రవిద్యచే
బాహుబలంబు గాంచి నిజపార్ధివునిం దెగటార్చి తద్ధరా
వాహినులన్ వరించె గుణవంతులకున్ సిరి వొందకుండునే.

336


క.

అని చిత్రకథలు హితునకు
వినిపింపఁగనంత నిశకు వేఁకువ బొడమిన్
దనుజేంద్ర హృదయచింతా
ఘనతిమిరముతోడ నంధకారము విచ్చెన్.

337


క.

శౌర్యతరవిమతశిక్షా
వార్యక్రోధమున నరుణవర్ణం బగు నా
సూర్యప్రభువదనంబన
సూర్యప్రభ యంకురించె సురపతివంకన్.

338


దోదకవృత్తము:

వాసవుఁ డాశ్రుతవర్మనుఁ గొంచున్
గాసిలి వచ్చిన గార్ముకశక్తిన్
రాసులుగా సురరాజి శిరంబుల్
భూసతికిన్ మణిభూషలు చేసెన్.

339


వ.

మఱియును.

340


చ.

హరవరలబ్ధశక్తి నమరాధిపతిన్ శ్రుతవర్మతోడ సం
గరమునఁ దోలి దానవనికాయము ప్రస్తుతి సేయ శూలి ఖే
చరకులచక్రవర్తిపదసంస్థితుఁ చేయఁగ దివ్యకన్యకా
పరిణయవృత్తి జెంది నిజపట్టణ భూస్థలి కేగె నున్నతిన్.

341


వ.

అని యుపన్యసించి.

342

ఉ.

శ్రీసుదతీకపోలతలచిత్రలతాపరిణద్ధసద్యశో
భాసిత కుంటముక్ల పినభైరవపాత్ర హృదంతరాళసం
వాసవివేశపాదయుగవాసవముఖ్యసురేంద్రమానసా
ధ్యాసితకామితార్ధఫలదాయక! వేంకటశైలనాయకా!

343


క.

వరవిభవ కుంటముక్కుల
వరపిన భైరవసుధీరవత్సలలక్ష్మీ
గురుకుచకుంకుమపంకిల
నురభికళాకలితవక్ష! సురమునిరక్షా!

344


మత్తకోకిల:

కంటకప్రతిపక్షదానవఖండనస్ఫుటమండనా
కుంటముక్కుల పిన్నభైరవగోత్రరక్షణవీక్షణా!
మంటపాద్యుపహారమోహితమాసతీవరదేవతా!
ఘంటికాయుతవేదనూపురకల్పకాశ్రితకల్పకా!

345


గద్య.

ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకలనీతికథానిధానంబునందు చతుర్థాశ్వాసము.

  1. యతిభంగముగా కాన్పించున్నది.
  2. సేద్యము
  3. కదియక్రగుణిన్
  4. కేవలి = సన్యాసి
  5. కర్బురము = బంగారము
  6. “నామధేయము పూర్ణచంద్రుం డనంగ" మూలము
  7. “దామలిప్తమనెడు నామముగలపురిఁ” అనుట యుచితిము.
  8. వఱచచు నాద్వీపముననుడించన్