Jump to content

సకలనీతికథానిధానము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పంచమాశ్వాసము

శ్రీదయితాకరుణాసం
పాదిత శ్రీకుంటముక్ల భైరవ హృదయా
హ్లాదనకారణధారణ
వేదాంభోరాశిపాథ! వేంకటనాథా!

1


వ.

అవధరింపుము. నారదమునీంద్రుండు బలీంద్రున కిట్లనియె. వత్సేశ్వరునకు వజ్రప్రభుండను విద్యాధరుం డిట్లనియె.

2


సీ.

ధర వితస్తాతటి తక్షశిలానామ
        పురవరం బేలెడి భూపసుతుఁడు
ధర్మాత్ముఁడు కళింగదత్తుఁ డప్పురి వణి
        క్తనయుండు ధనవంతుడనెడివాఁడు
జినమునికిని సేపసేయుచుండి తదాజ్ఞ
        కులవర్తనమునకుఁ దలఁగుటయునుఁ
దజ్జనకుఁడు భూమిధవునకు వినిపించెఁ
        దనయుని ధర్మసాధకునిఁ జేయు


మనుచు నృపతియు నవ్వణిక్తనయుఁ బట్టి
చంపుడని తండ్రి ప్రార్థింపఁ జంప కతని
నాఁక బెట్టించ్చె మాసద్వయంబునకును
బుద్ధి లేకున్నఁ జంపుదు సిద్ధ మనుచు.

3


వజ్రవృత్తము:

ధనదత్తుండును ధరణీపతిచేఁ
దనకుం బ్రాణవిదళనం బనుచున్
దినమున్ భుక్తివిధిక్రియ లుడుగన్
దనువెల్లన్ గృశతన్ వహియించెన్.

4

గీ.

నెలలు రెండు చనిన నృపతి వైశ్యతనూజు
గృశశరీరు జూచి ఖేద మొదవి
యేను చూపు మార్గ మీక్షింపుమన నట్ల
కాక యనిన రాజు కరుణతోడ.

5


ఉ.

తైలఘటంబు మోచికొని తత్కణమాత్రముఁ జిందకుండ నీ
సాలముచుట్టునం దిరిగి సయ్యన ర మ్మది చిందెనేని ని
ర్మూలము చేతునన్న నది మోచి చలింపగఁ జూచి యాత్మ నీ
లీలనె దృష్టి చేర్చిన ఫలించు విముక్తియు వంశధర్మమున్.

6


గీ.

అనుచు నుపదేశ మొనరించి యతని ననిపె
నాకురంగాఖ్యదత్తుఁ డుద్యద్విభూతి
నాత్మసతి తారకాదత్త యనెడునింతి
సౌహృదశ్రీలు విలసిల్ల మోహి యగుచు.

7


వనమంజరి:

నరపతిగర్భభరాలసభావపినద్ధపీనపయోధరన్
గరిగమనన్ విజనంబగు వేళలఁ గామితార్థము లిచ్చుచో
సరసిరుహానన పూర్వభవాంచితసారచిత్రకథావళుల్
పరమముదంబునఁ జిత్తము వొంగగఁ బ్రస్తవంబుల నెన్నగన్.

8


సీ.

గర్భంబుతోఁ గల గాంచి తారాదత్త
        పతితోడఁ దనపూర్వభవచరిత్ర
మిట్లనె సుభినా నెసఁగు విద్యాధరి
        శాపానఁ బుట్టినజలజముఖని
దైవతలక్ష్మిని ధర్మదత్తుండను
        జనపతి సతి నన్యజన్మమునను
కుంభదాసన వైశ్యకులమునఁ బుట్టితి
        దేవదాసుం డనుద్విజుని సతిని

గీ.

కరవుచే నొచ్చి యాకటఁ గ్రాఁగ విప్ర
భోజనము వెట్టుచును వారిభుక్తశేష
మస్మదధిపతి భుజియించి యల్పభుక్తి
శోషతనుఁ బొంది భర్త యసువులఁ బాసె.

9


క.

ఏనుఁ దదనుగమనంబున
భూనుత జాతిస్మరత్వమునఁ బుట్టితినాన్
మానవపతియుం దెలిసెను
ధ్యానంబున నాఁటి దేవదాసుఁడ ననుచున్.

10


గీ.

పొలఁతి! జాతిస్మరత్వవిభూతి మనకుఁ
బొడమె పుణ్యంబుచేనని భూవరుండు
తల్లిదండ్రులు, మామ, మాతామహుఁడును
సకలజనములు ధర్మంబు సాటిగలరె!

11


సీ.

మందాకినీతటమహిని విప్రుండు చం
        డాలుండు తనదు ప్రాణములు విడువ
నిరశనవ్రతపరనిష్ఠ నుండుచు మత్స్య
        ఘాతకు ల్మీనభక్షణము సేయ
విప్రుండు వారల విధివేడ్కఁ గనుగొనఁ
        జండాలునకు నదసహ్యమైన
ప్రాణికిం బ్రాణి నాహారంబు సేయు నీ
        ప్రాణ మేటి కీ నని యాత్మ దలఁచి


గీ.

యంత మృతి బొంది యిరువురు నమరపురికి
నరిగి క్రమ్మఱ జనియించి రవనియందు
జాలిసుతుఁ డయ్యె విప్రుండు శ్వపచుఁ డధిప
నందనుం డయ్యె హింసఁ గానంగఁ దగదు.

12

క.

హింసింపఁదలఁచువాడును
హింసింపఁగఁజూచువాఁడు హింసాపరుఁడున్
హింసాకర్ములచేతను
హింసింపఁగఁబడుచునుందు రేపుట్టువులన్.

13


వ.

అదియును వేదోక్తధర్మం బైన హింస నిర్దోషమనంబడు నది యెట్లనిన వినుమని యిట్లనియె.

14


సీ.

కుండినపురమున క్షోణీసురుని శిష్యు
        లావు దేఁబోయి క్షుధార్తి నొంది
యజ్ఞమంత్రముల నయ్యావును విశసించి
        భక్షించి గురుల కాభంగిఁ జెప్ప
సత్యంబ నొడివితి రత్యంతమోదంబుఁ
        బ్రాపింపుఁడని వారిఁ బలికె ద్విజుఁడు
కాన సత్యవిశుద్ధమానవోత్తములకు
        సకలసంపదలును సంభవించు


విగతసత్యుని సతియైన విడువఁజూచు
చిత్రకథ విను మొకటని చెప్పదొడఁగె
క్షితితలేశుండు విక్రమసింహుఁ డనఁగ
నతఁడు యుద్ధంబు గోరిన ననియె మంత్రి.

15


ఉత్సాహ:

బలితనూభవుండు మునుపు పార్వతీమనోహరున్
గలహ మడిగి విష్ణుచేతఁ గరములెల్లఁ బోవఁడా
వలదు పోరు గోర రాజవరుల కట్లయేని కా
నలకు వేఁట పోయి మృగవినాశనంబు సేయవే!

16

చ.

సచివుఁడు బుద్ధి చెప్పిన రసాతలనాథుఁడు వేఁట యేఁగి త
ద్విచికిలకుంజమధ్యవినివేశుల నిద్దఱఁ గాంచి యమ్మలీ
మ్లుచులను భీతి వారిఁ దనముందటిం బిలిపించి! యేల మీ
రిచట వసించినారనిన నిట్లని పల్కె నొకండు భూపతిన్.

17


క.

వినుము నృపాలక! జననీ
జనకులఁ బెడబాసి బాల్యసమయంబున బ్రా
హ్మణసుతుఁడ నయ్యు నాయుధ
జనసాహాయ్యమున భ్రష్టచర్యుఁడనైతిన్.

18


గీ.

అంత నొక్కవేళ నంగడి నొకబండి
యెక్కి పెండ్లికొమరుఁ డింతిఁ గొనుచు
వచ్చుచోట రాజువారణ మెగిచిన
పడుచు డించి వాఁడు పాఱుటయును.

19


మత్తకోకిల:

కన్నె భీతిఁ దలంక నే నాగంధదంతికి నడ్డమై
వన్నెఁ దప్పకయుండ డించిన వారిజానన కన్నులన్
సన్న సేయుచు నాథు నొల్లక స్వామి వీవని ప్రేమతో
నన్ను జూచిన దేవతాసదనంబునం బడియుండితిన్.

20


గీ.

మామ యెఱుఁగకుండ మధ్యమనిశయందు
భోజనంబు గొనుచు పొలఁతి వచ్చె
దానిఁ గొంచు వచ్చి డాఁచితి ననుచును
నిజము పలుకుటయును నృపతి మెచ్చి.

21


క.

ఆకన్యక నావిప్రుని
గైకొమ్మని ముదలపెట్టె కన్యయు వానిన్
గైకొనియె రహితసత్వ
వ్యాకులకాతరుల కేల వలతురు కాంతల్.

22

వ.

అని చెప్పె నంత కళింగదత్తునిభార్య తారాదత్త పుత్రిం గాంచిన సంతోషరహితుండై సచివులంజూచి కన్యకాజన్మదుఃఖోపశాంతిగా నిట్లనియె.

23


గీ.

ధర నహింసకంటె ధర్మంబు సన్యాస
పరతకంటె ధనము కరుణకంటె
పరమమైన మోక్షపదమును లేదని
దయయు క్షమయు మునులు దాల్తు రెపుడు.

24


తరల:

ధరణినాథుఁడు దొల్లి భార్యలు దాను వేఁటకు నేగి మ
ద్యరసముం గొని (చొక్కి) నిద్రితుఁడైనఁ గాంతలు తాపసే
శ్వరునిసన్నిధినున్న భూపతి సౌప్తికంబున బాసి దు
ష్కరతపోనిధి గాముకుండని ఖడ్గసంహతి చూపినన్.

25


క.

మునివరుఁడు క్షమయుఁ గరుణయుఁ
దనకుఁ దను త్రాణములుగఁ దాలిచి నృపనం
దనుమీఁద నలుగఁడయ్యెను
ముని తనువును ఖడ్గధార మోవకయుండెన్.

26


వ.

మఱియునొక్కకథ వినుమని కళింగదత్తుఁ డప్పుడు.

27


గీ.

భార్య వరుఁ బాసి వైరాగ్యపరత నరగ
ధవుఁడు ప్రార్థించి పట్టినఁ దరుణివ లికె
కాయకు మస్థిర మందు భోగంబు దలఁప
స్వప్నసౌఖ్యంబు వినుమని వనిత మఱియు.

28


క.

పలలాస్థి సిరామేదః
కలిలానిల చర్మపూతిగంధస్థితులన్
వలకాఁడు దనువు సరిగా
దలతురు పరమాత్మ విదులు తత్పరదృష్టిన్.

29

గీ.

అని విరక్తి వీడనాడినఁ దెలిసి వై
రాగ్యవృత్తిఁ బొంది రాజతనయుఁ
డన్యదృష్టు లుడిగి యాత్మయందునె దృష్టి
నిలిపి ముక్తినగర నెలవుకొనియె.

30


వ.

అని విరక్తభాషణంబు లుపన్యసించు కళింగదత్తునకుం బురోహితుం డిట్లనియె.

31


ఉ.

తొల్లి సుషేణభూపతి వధూరతిహాటళకూటవాటికా
ఫుల్లవనాంతవల్లరుల పొంతఁ జరింపుచుఁ గాంచె నిర్జరీ
హల్లకగంధి రంభ యనునంగ్గన నజ్జలజాతనేత్రయున్
సల్లలితానురక్తి నృపచంద్రునిఁ జూచె విలోలదృష్టులన్.

32


క.

ప్రేమాతిశయిత నిర్జర
కామినియు సుషేణనృపుఁడుగల సిరియంతన్
భామ సుతఁ గాంచి యపుడా
భూమీశ్వరునొద్ద నునిచి పోయెన్ దివికిన్.

33


ఉ.

కన్య సులోచనాఖ్య క్షితికాంతుఁడు పెంచఁగ వృద్ధిఁ బొందగాఁ
గన్యను కశ్యపాత్మజుఁడు గైకొనె మామయు రంభ కోర నా
సన్నుతగాత్రిఁ దెచ్చె నిజసంచితదివ్యతపోర్థదాతయై
కన్నెలు గారె తండ్రులకుఁ గామితమోక్షము లిచ్చుదేవతల్.

34


గీ.

అను పురోహితువాక్యంబు లాత్మ నిలిపి
కన్యఁ బోషింపఁ బెరిగె నక్కాలమునను
మహితసోమప్రభానామమదిరనేత్ర
మయుని సత్పుత్రి రాజకుమారి గూడి.

35


వ.

బద్ధసఖ్యయై సౌధాంతరంబున రహస్యంబున నిట్లనియె.

36

క.

అన్యు లెఱుంగకయుండన్
గన్యాసఖ్యంబు మనకుఁ గావలయుఁజుమీ!
అన్యాయం బంతఃపుర
విన్యాసము యోగికైన విమలేందుముఖీ!

37


సీ.

పుష్కరావతి యనుపురమున గూఢసే
        నాఖ్యుండు నృపసుతుం డందు నొక్క
యూరుజతనయుండు కూరిమిచెలి గాఁగ
        దాదితో రాఁగయాత్రలకు నరిగి
యొకచోటఁ బరిజనయుక్తుఁడై వసియించి
        దాది వీక్షించి మోదమున నొక్క
కథ చెప్పుమని నిద్ర గదిరినఁ గనుమూయ
        దాదియు నిద్రించెఁ తత్క్షణమున


విగతనిద్రుండు గోమటి వినుచునుండ
దివ్యకాంతలు పలికిరి దివి వసించి
కథలు వినవచ్చితిమి మనఃకౌతుకమున
నకట నిద్రించెదరు మూఢులట్ల వీరు.

38


వ.

ఒక్కహారంబునుపలంబు లుడుపదంబునం బొడగట్టెడు నవి గైకొన్నను క్షుతశతంబును విన్నను రాజపుత్రుండు మృతుండగునని యెరిగిన నిద్రారహితుఁడైన వైశ్యకుమారుండు విని ప్రభాతంబున రాజపుత్రు నవి యంటనీయక కొని చని శ్వశ్రూగృహంబున నునిచి శతక్షుతప్రతీకారార్థంబు చింతింపుచుం బ్రచ్ఛన్నుండై యారాత్రి యచట వసియించునంత.

39


క.

క్షుతశతములకును దీవన
లతిశయముగ నొసఁగి కల్యమగుటయు వెడలెన్
క్షితిపతిసుతుఁ డంతఃపుర
గతుఁడై వైశ్యుండు ద్రోహి ఖండింపుఁ డనన్.

40

గీ.

ఈతఁ డుపకారి గాని యహితుఁడు గాఁడు
వధ యొనర్పకుఁడని దివ్యవాణి పలుకఁ
గాచి రటుగాన వ్యాళసంగతము సింహ
కంఠవసతియు గాదె భూకాంతమైత్రి.

41


వ.

అనుటయు నక్కళింగదత్తతనూభవ యిట్లనియె.

42


సీ.

యజ్ఞస్థలంబను నగ్రహారమునందు
        ధనహీనుఁడగు విప్రతనయుఁ డొకఁడు
కట్టెలు మోపుగాఁ గట్టి యెత్తగలేక
        పడి వ్రణమైనఁ జేపట్టి యొక్క
యెడ బిశాచమువచ్చి యేమైన మందిచ్చి
        పుండు మాన్చిన విప్రపుత్రకుండు
హితబుద్ధి వాటింప నింటివారికి నెల్లఁ
        బుండ్లు గావించియు బూమె చేసి


కూఁతు గైకొని పైశాచకులముఁ గలసి
చనియె నటుగాన రాజపిశాచములకు
నంతరము లేదు నమ్మిన యట్టివాని
భంగపరతురు చెఱుతు రేపట్టులందు.

43


వనమయూరము:

ఈగతి మహీశసుత యిష్టసుఖగోష్ఠిన్
సాగతము చూప మయసంభవయు నంతన్
నాగధర కేగె నరనాథసుతయున్ వై
యోగము సహింపక సుఖోఝ్ఝితము నొందెన్.

44


ఉ.

అంతఁ గళింగదత్తుఁడు నిజాత్మజ దానవపుత్రికాసమా
క్రాంతమనస్క-యై రుచులు గానక మేను కృశించుచున్న భూ
కాంతుఁడు వైద్యులం బనుపఁ గామిని హస్తము చూచి మోహవి
భ్రాంతియకాన రోగమని పల్కిన గూఁతురు జెప్ప నంతయున్.

45

ఉ.

అంతఁ గళింగదత్తుఁడు నిజాత్మజ యమ్మయజాసఖీత్వని
క్లాంతిఁ గృశించునేయనఁగఁ గ్రమ్మఱ నమ్మయపుత్రి వచ్చినన్
సంతసమంది పూజలు ప్రశస్తముగా ఘటియించె నంత న
భ్యంతరవాసఁ జేసిన బ్రియంబున భూపతి సమ్మతించినన్.

46


క.

మయపుత్రి చెలియఁ దోడ్కొని
స్వయంప్రభయను దనభగినిసన్నిధికిఁ గడు
రయమున నరిగర్చితయై
వియదటయానమునఁ బురికి వేగమె మఱలెన్.

47


గీ.

మఱియు నొకనాఁడు మయజనమ్మగువ యనియె
సుదతి మాయత్తవారిల్లు చూడవలయు
ననుడు శ్వశ్రూగృహంబు దుఃఖాయతంబు
సర్పసంశ్రితచందనశాఖవోలె.

48


వ.

అది యెట్లనిన.

49


సీ.

ధనపాటలీపురధాముండు పాటల
        పుత్రకుండును వణిక్పుత్రుతనయ
కీర్తిసేనానామ కీరభాషిణి దేవ
        సేననామునిపత్ని చిగురుబోణి
పురుషుఁడు పరదేశమునకుఁ బోయెదనన్న
        నత్తమామలు దుష్టులని వచింప
...............................
        .........................


గీ.

వేశ్య వైతివి నాయిల్లు వెళ్ళుమనిన
దైవగతి నిల్లు నిశయందుఁ దస్కరుండు
త్రవ్వుటయు నింటిలోఁగల ధనము గొనుచుఁ
గన్నమున వెళ్ళి పురుషసంగతికిం బాసి
సార్థసంగతిఁ గాననస్థలికి నరిగె.

50

సీ.

తరుకోటరంబున దానవితనసుతు
        లాహార మడుగ నిట్లనియె నెల్లి
వరపతికినిఁ బుట్టు శిరమున నొకనొప్పి
        యది వైద్యులకు నసాధ్యంబు గాన
నేర్చిన దలనెల్ల నెయ్యంటి కాపుఁచు
        శ్రుతులందు నులివేఁడి ఘృతము వోయ
శమియించు వేకున్న జచ్చుఁ గావునఁ బ్రేత
        బలి చేతు రందులఁ గలుగు భుక్తి


యనుచుఁ జెప్ప నూరుజాంగన విని యంత
వేఁగుటయును వైద్యవేషమునను
బురము సొచ్చి నృపతిపరిజనాహూతయై
మెలఁత నొప్పి మాన్చి మేలు వడసి.

51


క.

ఆనగరికి నాత్మేశుఁడు
దీనారక్రయత నరుగుదెంచిన గని యా
మానినియుఁ గలసె నివివో
మానినులకు నత్తవారిమంచిగుణంబుల్.

52


వీరభద్రభూషణము:

ఆకళింగదత్తు పుత్రి యాదితేయ కాంతచే
నాకధాక్రమంబు వించు నబ్జనేత్ర నీపతిన్
నాకుఁ జూపుమన్న శ్రీదనందనుండు మత్ప్రియున్
నీకు నెట్లు చూపవచ్చు నీవు కన్యవో సఖీ!

53


క.

అని చెప్పి ప్రొద్దుగూఁకిన
జనియె మయపుత్రి యంత సౌధాగ్రమున
వనిత వసియించి యభ్రము
గనుఁగొనఁ బొడఁగట్టె నొక్కఖచరుఁడు మింటన్.

54

శా.

ఆవిద్యాధరనందనుండు గనియెన్ హర్మ్యాగ్రభాగంబునన్
శ్రీవర్థిష్ణుశరీరమూర్తి యగు రాజీవాక్షిం గందర్పద
ర్పావేశావృతదేహుఁడై యకట మర్త్యస్త్రీకి మోహించితిన్
నావిధ్యాధరభావ మేలయని స్వాంతప్రాప్తచింతాత్ముఁడై.

55


క.

హరుఁగూర్చి తపము చేయుచు
పురహరపరలబ్ధ గాఁగ పొలఁతుకఁ బడయన్
వరియించె వరము జన్మాం
తరమున నక్కాంతగూడఁ దత్పరదృష్టిన్.

56


సీ.

అంత కళింగదత్తాఖ్యుండు దనపుత్రి
        సేనజిత్తున కీయఁ జిత్తగింప
నాళిసోమప్రభ నడిగె సేన జిదాహ్వ
        యుఁడు ప్రియుండుగ జనకుఁడు వచించె
నెట్టివాఁ డతఁ డన్నఁగట్టఁబో! వాఁ డేల
        కొన టట్టివిభు నీవు గూడు టెట్లు
కౌశాంబియేలు వత్సేశుండు నీకునుఁ
        దగుఁగాని యన్యుండు దగఁడు సకియ!


తొల్లి వాసవదత్తయన్ దోయజాక్షి
యతనికులపత్ని గాంచినయాత్మభవుఁడు
భావివిద్యాధరత్వసంప్రాప్తి నొందె
గాన వత్సేశ్వరుఁడె పతి గాఁగవలయు.

57


గీ.

తన్వి నినుఁ జూచెనేని యద్ధరణివరుఁడు
తనదుతొల్లింటివాసవదత్త విడుచు
సిద్ధ మిది యిట్టికార్యంబు సేయుమనిన
దైవ మొనుగూర్చు సర్వంబు దైవికంబు.

58


వ.

అది యెట్లనిన.

59

సీ.

విక్రమసింహ పృధ్వీపతి నందన
        సుభగుని నొకరాజసుతునిఁ జూచి
సఖచేతఁ బిలిపించి సంకేతగృహమున
        నతనితో రతికేళి ననుభవించి
జనకుం డుషఃకాలమున వానిచే కూతుఁ
        బెండ్లి చేసెదనని పిలువఁబంపి
గాంధర్వమున మున్నెకలయుట ధాత్రిచే
        నెఱిఁగి మంత్రులకెల్ల నెఱుఁగజేసి


యర్హుఁడని వారు చెప్పిన హర్షమొంది
యాత్మనందన నిచ్చి రాజ్యార్ధ మిచ్చెఁ
గాన దైవికమునఁ బొందగలుగు సదృశ
పతులవిధివ్రాతఁ దప్పునే భామినులకు.

60


సీ.

మఱియు దరిద్రుండు మహిసురుఁ డొక్కఁడు
        ధనవద్ధరాసురుదాసుఁ డగుచు
నావిప్రసుత పెండ్లి కనుకూలదినమున
        సందడి యగుడు నాసందునందు
కన్యక గొనుచుఁ దస్కరమార్గమున రాజ
        గృహము బ్రవేశించి కుహకవృత్తి
నరపతిప్రశ్న కుత్తర మిచ్చి మెచ్చించి
        పృథ్వీసురునిసుతఁ బెండ్లియాడి


భూపకరుణను సంపద్విభూతిఁ దాల్చె
నట్లు గావున పూర్వభాగ్యమునఁ జేసి
తగినవరులను (కలియుట తరుణులకును)
నమ్మకుండినఁ జూతము రమ్ము నృపుల.

61

క.

అని చెప్పి మయతనూభవ
జనపతిసుత గొనుచు గగనచరయానమునన్
గొని చని సేనజితుండను
మనుజేశ్వరుఁ జూపి సకియ మదిఁగని యంతన్.

62


క.

వత్సేశ్వరుఁ జూతము నయ
నోత్సవమగు ననుచు నరిగి యుర్వీస్థలి శ్రీ
వత్సాంకుకరణి బుధజన
వత్సలుఁడగు రాజు కేళివనమునకు దిగెన్.

63


క.

ఆరాజు నంతలోపల
నారామము చూచు వేడ్క నరుదెంచిన యా
పేరెత్తి మయతనూభవ
యారాజతనూజ కతనియాకృతి జూపన్.

64


ఉ.

నివ్వెరపాటునం బొడము నేత్రజలంబులు ఱెప్పలాఁగజౌ
జవ్వనజారుదేహలత చంచల మందఁగ స్వేద ముబ్బ లే
నవ్వులు జక్కులం బొలయ నాన యొకించుక జారఁ జూచె నా
పువ్వులవింటివాని సరిపోలెడువత్సధరాధినాథునిన్.

65


గీ.

అట్లు వీక్షించి మయపుత్రి కనియె నింతి
యవనిపతి నన్ను వరియించు నంతదాఁక
నిచట వసియింపు మనిన నయ్యింతి పలికె
వేగిరింపకు నేఁ బోయి వేగవత్తు.

66


వ.

అది యెట్లనిన.

67


క.

ఈతఁడు మంత్రియుగంధరు
నీతినె చరియించు నెట్టినియమములందున్
గాతరభావము వలవదు
నాతి! యనుచుఁ బోయె మయుని వందన యంతన్.

68

ఉ.

అంత కళింగసేన ద్విజునాప్తుని వత్సనరేంద్రుపాలి కే
కాంతమునందుఁ బంపి తనయాగమనం బెఱిఁగింపుమన్న వా
డంతయు నేగి చెప్పుటయు నద్ధరణీవరుఁ డాత్మ నెంతయున్
గాంతి వహించి మంతిరి యుగంధరరాయనికి న్వచింపుచున్.

69


క.

కోరంగఁదగు పదార్థము
చేరిన వేగంబ నరుఁడు చేకొనకున్నన్
చేరినరత్నం బొల్లక
వీఱిఁడియై గాజుపూస వెదకుటగాదే.

70


గీ.

గృహము గట్టించు వైవాహకేళి కనిన
నట్ల సేయంగ నొక్కవిద్యాధరుండు
పురికి నేతెంచి వత్సభూభుజున కనియె
నీపురంబునఁ గొన్నాళ్లు నిలుతు ననుచు.

71


సీ.

అట్టివిద్యాధరుం డాది కళింగసేనా
        నురాగంబున హరుని గూర్చి
తప మాచరించి యత్తరుణిఁ బొందగఁ గోరి
        యక్షేశపుత్రుఁడై యవతరించ్చెఁ
గాన నాతడెఁ వత్సకాంతుని పురి నిల్చి
        మాయచే నక్కాంతమందిరంబుఁ
జెంది రాత్రి కళింగసేనను భోగించి
        కన్యకఁ గాంచి యక్కాంత కిచ్చి


చనియె నిది వత్సవిభునకు సచివవరుఁడు
తెలియఁజెప్పిన కాంతపైఁ దలఁపు విడిచె
మదనమంచుక నాఁగయమ్మగువపుత్రి
సకలవిద్యలు నేర్చె ఖేచరునివలన.

72

ఉ.

వాసవదత్త తజ్జననివార్తకు సంతసమంది యంతలో
నాసుదతీతనూభవ బ్రియంబున నంతిపురంబులోనికిన్
దే సఖిఁ బంపి యాత్మసుతు ధీరుని నన్నరవాహదత్తుని
వాసవభోగిఁ గూడ బహువైభవముల్ గృప చేసి పెంచుచున్.

73


వ.

అంత.

74


క.

నరవరుఁడు వత్సభూపతి
నరవాహనదత్తుఁ డనెడు నందనునకు ని
ధరణికి యవరాజుగ సు
స్థిరమతిఁ బట్టంబుఁ గట్టె శ్రీవిలసిల్లన్.

75


చ.

కులజులమంత్రి పుత్రకులగోముఖముఖ్యుల పుత్రు గొల్వ ని
శ్చలమతి నప్పగించి నిజసైన్యములన్ సమకొల్పనూను ను
జ్వలమతి బెండ్లి సేతునని వచ్చి మయాత్మజ దివ్యశిల్పికా
వలిరచితోరుగేహములు వత్సమహీపతి కిచ్చె బ్రీతయై.

76


గీ.

అంత నొకనాఁడు వత్సేశు నంతికమున
కంగనలువచ్చి మేము విద్యాధరాధి
విద్యలము నీకుమారుపై వేడ్క వొడమి
వచ్చితిమి పొందెదము నరవాహనునిన్.

77


క.

అని సకలవిద్య లాతని
తనువొందినపూర్ణతుహినధామునిరీతిం
దను వమరఁగ విద్యాధర
ఘనరాజ్యసుఖంబు గలిగెఁ గౌతుక మొదవన్.

78


వ.

అన్నరవాహదత్తుండు మదనమంచుకాపరిణయోత్సుకుండై గోముఖాదిమంత్రిపుత్రులతో నుచితకథాగోష్ఠినున్న సమయంబున.

79

ఉ.

అంత కళింగసేన తనయాత్మజ నన్నరవాహనాఖ్య శు
ద్ధాంతము సేయ వత్సవసుధాధిపుతో నెఱిఁగింపబంపి సు
స్వాంతత తత్కరగ్రహణచర్య ఘటించిన ఖేచరేంద్రుఁడై
యింతయు నేలె యక్షులు మహీజనులున్ వినుతింపఁ బూజ్యుఁడై.

80


సీ.

ఉద్యానవనమున నొకనాఁడు నరవాహ
        నుండు కేళీరతి నుండునంత
నిద్దఱు నృపసుతు లేతెంచి మ్రొక్కిన
        నెవ్వరు మీరన్న నిట్టు లనిరి
వైశాలికాపురవరుఁడు నందనభూమి
        పతిపుత్రులము వాదమతుల మగుచు
వచ్చినారము గజవాహాదికత్వరి
        తములకుఁ బణము పంతబు జేసి


దేవ మాలోని వాదంబు తీర్పవలయు
నచటి కేతెమ్ము నావుడు నరద మెక్కి
యరిగె వారును దాను నప్పురము సొచ్చి
యంతిపురివారు పూజింప నధివసించి.

81


గీ.

వారు దెచ్చినట్టి వారణఘోటక
జవము చూచి మెచ్చి సామజమునె
గెలువు చేసి వారిచెలియలిఁ గైకొని
యాత్మపురికి మగుడ నరుగుదెంచి.

82


క.

జనకునకు మ్రొక్కి భూపతి
యునుపగ కనకాసనమున నున్నట్టితఱిన్
జనుదెంచి యొక్కకోమటి
వినమితముఖుఁ డగుచు పతికి విజ్ఞాపించెన్.

83

సీ.

కుసుమసారుండను కోమటి లంబేశు
        పుత్రుండఁ గలమెక్కిపోవ నంత
నురువాయువశమున నొకదీవి చేరిన
        నది యేలుభూపతి నాశ్రయించి
యప్పురివైశ్యకన్యకఁ జూచి మోహించి
        యడిగిన నీయక యతివ దొలగ
నంబుధియానపాత్రంబున నిడిపంపఁ
        గలము భగ్నంబైనఁ గన్నె యొక్క


దీవి చేరిన నేను నత్తెరవ చనిన
త్రోవనే యొక్కకల మెక్కి పోవ నదియు
భంగమునుఁ బొంద నే నొకపలక యెక్క
సింహళద్వీప మొయ్యన చేరియుందు.

84


గీ.

తరుణి బొడగంటి నచట మతంగమౌని
పుత్రి పోషింపఁ బెరుగు నప్పువ్వుబోణి
పూర్వజన్మంబు ఖచరసంభూత యగుట
చంద్రసేనాభిధాన యచ్చంచలాక్షి.

85


క.

అదియును నేనును గలము న
ద్రిదశ మునీంద్రుండు వనుప దేశంబుకు నె
మ్మది యేగుబోట యక్షుఁడు
విదితము గావించె మున్ను విద్యాధరిగాన్.

86


క.

నరవాహున కెఱిగింపుము
సరసిజముఖ నీకు వలదు చను మనుటయు నే
నరుదెంచితి నను నాలోఁ
గరిగమనయు నరుగుదెంచె ఖగయానమునన్.

87

ఇంద్రవ్రజ్రవృత్తము.

ఆకాంత నయ్యూరుజుఁ డప్పగింపన్
క్ష్మాకాంతపుత్రుండును సంతసించెన్
నాకేశవిద్యాధరనాథులాజ్ఞన్
శ్రీకాంతరూపంబు చెన్ను మీరన్.

88


సీ.

అంతఃపురంబులో నారావ ముదయింప
        నది యేమి యని సఖు నడుగుటయును
మదనమంచుక నొకమాయావి గొనిచనె
        శయ్యపై లేదు భూజనవరేణ్య!
యనుటయు విరహదుఃఖాశ్రాంతుఁడై నిద్రఁ
        బొందంగఁ గల నొక్కపూవుబోణి
పానుపుపై నున్నభావంబు దోచిన
        మదనమంచుక యని కదియఁ జూచెఁ


గన్నుగవ విచ్చి చూచినఁ గానరామిఁ
గళవళం బొంది యెప్పటఁ గన్నుమూయ
వచ్చి విద్యాధరీచంద్రవదన యొకతె
యెత్తుకొనిపోయెఁ బ్రేమ వత్సేశుసుతుని.

89


ఉ.

ఆగతిఁ గొంచుబోయి మలయాచలకందరగంధపల్లవా
భోగితశయ్యఁ జేర్చుటయుఁ బొల్తుక నాత్మవధూటియంచు సం
భోగము చేసి వేఁగుటయు బుష్బసుగంధిని యన్యరూపయై
నాగరికత్వము న్నెరపి సన్ముదితాత్మకుఁ డైన యంతటన్.

90


వ.

ఒకకథఁ జెప్పందొడంగె.

91


సీ.

పిడియనికరి వెంటఁబడినను నొకవృద్ధ
        జంబుకి యొకముని శరణు చొరఁగ
కరుణించి ముని తన్నుఁ గరిణిగాఁ జేసినఁ
        గూడి పద్మియు దానికోర్కె దీర్ప

పద్మంబులకు సరః పఙ్కంబున మునుంగ
        జంబుకి మఱియొండు సామజంబు
గలసి తొల్లిటి కరిఁ గారింపఁనలఁచిన
        నది భద్రకులజాతహస్తి యగుట


మౌనిపంవున బఙ్కనిర్మగ్నమైన
పద్మి వదలించె సుజనుఁ డాపన్నుఁ గాచు
కరణి నట నక్కయునుఁ బోయె గప్పదూటి
కాన యీవట్టిమోహంబుఁ గడవు మదిని.

92


వ.

అని విద్యాధరి యిట్లనియె.

93


సీ.

వామదత్తుండను వసుధామరేంద్రుఁ డా
        హారార్థమై యొక్కయవనిసురుని
నర్థించి భుక్తిగృహంబునఁ గూర్చుండి
        యంతట లేచి గేహంబు వెడలి
క్రమ్మఱవచ్చి భుక్తగ్రాసియై ద్విజుం
        డడిగిన నవ్విధ మతఁడు వలికె
మద్భార్య నిరతము మహితసైరిభపాలు
        మరగిన దనుచు నామర్మమెల్ల


నాకుఁ బినతండ్రి చెప్పిన నమ్మి యేను
పోయిచూచిన వెఱవక పొలఁతి గొట్టె
నంత నెనుపోతనై వాని నడపఁగదియ
గట్టి రిద్దఱి సాలలో గంబమునను.

94


వ.

అప్పుడు.

95

గీ.

ఒక్కవ్యవహారి కొని నన్ను నెక్కి దూర
మరుగ ననుఁ జూచి యొకసతి కరుణ వొడమి
దివ్యదృష్టిని నాగతి తెలిసి గంగఁ
దానమాడించి మహిమత మానుపుచును.

96


క.

తనకూఁతు గాంతిమతియను
వనితను నా కిచ్చి యనుప స్వగృహంబునకున్
చనుదేర భార్య నన్నుం
గని గుఱ్ఱంబైన సాలఁ గట్టిరి దానిన్.

97


గీ.

కట్టి దినమును దరటునఁ గొట్టుచుండి
యట్లు సేయంగఁబోయితి ననుచుఁ జెప్ప
నంతఁ జనుదెంచె యోగసిద్ధాభిదాన
కాంతిమతితల్లి మంత్రసంగతునిఁ జేయ.

98


క.

ఆవిప్రుఁడు శ్రీపర్వత
దేవునికృప యక్షుఁడైన దివ్యాంగనయై
యావనిత నన్నుఁ గాంచె గు
ణావృత నే లలితలోచనాభిధ నైతిన్.

99


క.

అని లలితలోచనాసతి
తనవృత్తాంతంబు చెప్ప ధరణీపతీనం
దనుఁడును విహరింపుచు నట
చని కాంచెను జలజనిధిని శైత్యాంబునిధిన్.

100


కవిరాజవిరాజితము.

కనుగొని పంకజగంధి మనోహరకామిని మన్మథమంచిక నా
మ్మనమున దోఁచి సరోవర మంగనమాడ్కి వహించిన నాతురుఁడై
వనజిము లక్షులు తూడులు బాహులు వారి తరంగలు కౌనువళుల్
గనయము చక్రయుగం బిది తథ్యము కామినియే యని మోహితుఁడై.

101

సీ.

పడియున్న సన్మునిప్రవరుఁడొక్కఁడు వచ్చి
        శిశిరోపకృతులను సేదదీర్చి
మదనమంచుకయని మఱియును పలవింప
        మునియాశ్రమమునకుఁ గొనుచు నరిగి
యేటికి విరహాగ్ని నెగిచెదు నీకాంతఁ
        బొందెదు మోహంబు పోవవిడువు
తొల్లి యయోధ్యాధివల్లభుండగు మద
        మత్తజుండు మృగాంకదత్తునకును


నాప్తమంత్రులు పదురు గుణాకరాదు
లందు లోపల.......పరాక్రముండు
స్వప్నమునఁ గన్న యొక్కయాశ్చర్యమైన
కథ వచింపంగదొడఁగె సకౌతుకముగ.

102


సీ.

చీఁకటినిశ నొక్కసింహము ననుఁ బట్ట
        జెదరక యేను దజ్జిహ్వ నఱుక
నది భూతమైన నే నడిగితిని మృగాంక
        దత్తునకే కాంత తగినభార్య?
యనియెను జైనభూజనపతి కందర్ప
        సేనుని తనయ రాజీవనేత్ర
యతివ శశాంకవత్యభిధాన యనితిరో?
        ధాన బొందెనన చంద్రదత్తుఁ డనియె


నేను కలగంటి యడవికి నేగి డప్పి
నవసి జలమానఁ జనుచు శాత్రవులఁ గెలిచి
శివునినేత్రంబు జలధి సంసిక్తరక్త ?
కటుడనై హారకలితాత్మకంఠి నైతి?

103

క.

అనుటయు మంత్రికుమారులు
విని నీకు శశాంకవతియ వేగమె చేరున్
మనమున నూరడు మన సృప
తనయుం డిట్లనియె మంత్రితనయులతోడన్.

104


సీ.

కందర్పసేనుఁ డుత్కటబలుం డడిగిన
        నిచ్చునో యీఁడొ! నిజేచ్ఛుఁ డతఁడు
మగధాధిపతి కాశిమహిపతికూతురు
        నడిగిన నీకున్న నతనిమంత్రి
యతిరూపులై శిష్యు లరుదేరఁ గాశికి
        నరిగి రాత్రి చరింప హస్తిపాలు
పొలఁతి దొంగలు గొనిపోవఁ బల్కెను నన్ను
        విడువుండు వేగ మద్విభుఁడు వచ్చు


ననిన వారు విడక చనుటయు సిగ్గున
విషము ద్రాఁగి కరిణి విభుఁడు వడిన
కపటితపసివవిషము గ్రక్కున నడ
గించి చోరముషితపత్ని చొప్పు చెప్ప.

105


గీ.

వాఁడు చెప్పినఁ జని చోరవధ యొనర్చి
పత్ని గొనివచ్చి యతనికి భక్తి మ్రొక్కి
యతనిఁ దనయిల్లు చూడరమ్మనుచుఁ గొనుచు
నరిగి తనయింట నునిచిన నర్ధరాత్రి.

106


ఉ.

నాగమొకండు వచ్చి మదనాగము ముక్కునఁ బట్ట నేనుఁ గా
నాగవిషాగ్నిఁ గ్రాల నది గ్రక్కున డించి నృపాలపూజ్యుఁడై
యాగురుమూర్తి తత్తనయ నాత్మనృపాలునిసొమ్ము చేసె నీ
యోగి సముద్ధరించిన మహోన్నతసిద్ధులు చేరకుండునే.

107

సీ.

తక్షసిలాపురీధవుఁడు భద్రాక్షుండు
        పుత్రార్థియై యష్టపుష్కరమున
శ్రీగూర్చి హోమంబు సేయ నొక్కటి దక్కు
        వైన హృదబ్జంబునందు వ్రేల్వ
మెచ్చి కుమారుని నిచ్చినఁ బుష్కరా
        క్షుండని పెంపంగ సుతుఁడు పెరిగి
.............................
        ............................


గీ.

తామ్రలిప్తాఖ్యపురమున ధర్మసేనుఁ
డనెడు వైశ్యుఁడు చోరప్రహార్తుఁ డగుచు
హంసమిథునంబు జూచుచు నసువు విడిచె
నతనిభార్యయు పతితోన నగ్ని జొచ్చె.

108


క.

ప్రాణాంతంబున నరుఁ డే
ప్రాణిని వీక్షించు నవ్యభవమున వాఁ డా
ప్రాణి యగుఁగాన నూరుజ
సూనుండును హంస యయ్యెను సుదతీయుతుఁడై.

109


సీ.

ఆగతి హంసయై యభ్రపదంబున
        లలనయుఁ దా గమలంబు గఱచి
చనుచోట నొకభిల్లి శరమున నేసిన
        నలినంబు తద్వదనమున బాసి
సిద్ధుఁడు పూజించు శివుమీఁద పడుటయు
        నది పూజగా హరుఁ డవధరించి
భూవిభుఁ జేసె నప్పువ్వుబోణియు వేగ
        విద్యాధరత్వంబు వెలయఁ దాల్చె

ననిన మునిపతి యాపుష్కరాక్షునకునుఁ
బ్రియము రెట్టింపఁ గన్నియఁ బెండ్లి చేసి
యనుపుటయు వ్యోమగతిఁ బురి కరిగి రాజ్య
మనుభవింపుచు నుండె మహావిభూతి.

110


వ.

అని యిట్టిచిత్రకథావినోదంబులం బ్రొద్దు పరపుచు మృగాంకదత్తుం డొక్కనాఁడు మృగాంకవతీవిరహంబు సైరింపఁజాలక ప్రధానిపుత్రులలోఁగూడ మహాటవికిం జని యందు.

111


క.

శశశోణితలోహితుఁడై
దశశతకిరణుండు చరమదశ ప్రాపించెన్
దశదిశలు కృష్ణనాగవు
దశపొందిన రవియు భోగతలమణియయ్యెన్.

112


వ.

అంత.

113


క.

రాతిరనుభిల్లి కర్ణపు
కేతకిగతి చంద్రుఁ డుదయగిరి యెక్కిన కా
ళీతరుణి శ్రుతి కరోట
శ్వేతద్యుతి యగుచుఁ జంద్రబింబం బమరెన్.

114


వ.

అంత నట నొక్కబ్రాహ్మణుం గని యందు.

115


గీ.

ఆమృగాంకదత్తుఁ డాప్తులుఁ దా నొక్క
శుష్కతరువునీడ సుప్తిఁ బొంది
మేలుకనియు చూడ మెలకువ నాచెట్టు
పండుటయునుఁ దినిన బ్రాహ్మణుడయి.

116


ఉ.

తానును వచ్చి తత్ఫలవితానము భుక్తి గొనంగ వార లా
మ్రానితెఱం గదేటిదన బ్రాహ్మణుఁ డిట్లని పల్కె వీఁ డయో
ధ్యానిలయుండు విప్రుఁ డితనాత్మతనూజుఁడ నేను క్షామతన్
గాని వహింప మత్పిత ఫలంబులు నా కిడి స్నానమాడగన్.

117

క.

ఆపండ్లన్నియు మెసఁగితి
నాపిత కొకటైన నిడక స్నాతుండై క్షు
త్తాపంబున మజ్జనకుఁడు
కోపించి శపించె శుష్కకుజమై యుండన్.

118


వ.

మీ రీఫలంబు లుపయోగించుటం జేసి శాపముక్తుండనైతి మీ రిక్కడికి వచ్చుటం జేసి......యే నింద్రజాలశిల్పకళాచతురుండను నిన్నుఁ గొల్చెదననిన పరిగ్రహించి మృగాంకదత్తుం డతం డాప్తుండుగా దక్షిణదిశకుం జని.

119


సీ.

కరిమండితంబగు కాననంబున శక్తి
        రక్షనాముండు కిరాతవిభుఁడు
మున్నుగా నొకవృద్ధు మునిఁ గాంచి సేవింప
        ముని మెచ్చి పాదలేపన మొసంగ
నది పాదములఁ దాల్చి యభ్రయానంబున
        నరిగి వింధ్యాద్రికందరమునందు
ఖదిరకీలకబద్ధకాయుఁడై పొల్చెడు
        ముని గాంచి యందఱు మునికి మ్రొక్కి


యతికి పరిచర్య సేయ నవాంబుజాక్షి
యచటి కరుదెంచి చనుదోయి నతని మోప
చిత్త మగలిన హోమంబు సేయ మఱచి
యన్నియును నొక్కపరియ హోమాగ్ని వైచె.

120


వ.

అంత.

121


గీ.

ఒక్కభీకరఫణి మీఁద నుఱుకుటయునుఁ
దలఁగకట్లు మృగాంకదత్తప్రముఖులు
ఖడ్గములు దాల్చి కవిసినఁ గాంచి వారి
కలిగి పెడబాసిపొండు మీ రని శపించె.

122

క.

పారావతాఖ్యమునియునుఁ
బ్రారంభము విఘ్నమైన భ్రష్టైపోయెన్
వారును నొండొరువులకును
దూరంబై చనిన నృపతి దుఃఖాతురుఁడై.

123


క.

శ్రుతధియుఁడు తనకు మిక్కిలి
హితుఁ డెట వోయెనొ యనంగ నేతెంచనియెన్ (?)
క్షితివర నిను వెదకుచు నొక
యతివరుఁడగు బ్రహ్మదత్తుఁ డనుమునిఁ గంటిన్.

124


వ.

అతని కిట్లంటిని.

125


సీ.

పరమాత్మ నేవచ్చుతెరువున నొకకుంభ
        కారచక్రమును భృంగవ్రజంబు
వెలఁది గోఖురములు విషమునిర్గుండియుఁ
        తలమీఁది వేణుకాదండమునను
దేజంబు దశబాహుదీప్తసింహంబును
        గణనాయకుని బొడగంటిమనిన
భవము నక్రము భృంగపటలంబు బంధులు
        గొంతి మహామాయ గోఖురములు


గీ.

పాపపుణ్యంబులు విషంబు కూప నరక
మింద్రభూజంబు నాకమ హీనతేజ
మమృత మామృగవరుండు మృగాంకదత్తుఁ
డాభుజంబులు పదియు వయస్య సమితి.

126


వ.

గణపతిప్రసాదంబున మృగాంకదత్తుఁడు కామిని వరింపగలండని బోధించెననిన శ్రుతధి వాక్యంబుల గొంత దేరి తత్సహితుండై నర్మదకుం జని.

127

సీ.

అచట మాయావరుం డనుభిల్లపతితోడ
        మైత్రి వాటించి తన్మందిరమున
వసియించి యొకరాత్రి యశి పట్టుక మృగాంక
        దత్తుఁ డరుగుచు నొక్క తస్కరునిని
దాఁకి యెవ్వఁడవన్న తస్కరుండను నీకు
        మిత్రుఁడ నయ్యెద మెలపుమనిన
వాని మావటివాని వాకిటివానిఁగా
        నెఱిఁగి కాముకవృత్తి నేగువాని


తే.

వెంటనే యేగి యమ్మహీవిభునిభార్యఁ
జండకేతుఁడు భూఘనచ్ఛిద్రమునను
జారుఁడై పొందఁగనుగొని సరభసమునఁ
జండకేతుని యింటికి జని విభుండు.

128


క.

ద్వారమునఁ గట్టినట్టి మ
యూరము మెడత్రాడు విడువను జ్వలుఁడగుచున్
జేరెన్ భీమపరాక్రమ
ధీరుండను మంత్రిసుతుఁడు తేజోనిధియై.

129


ఉ.

భీమపరాక్రమున్ సచివభీముని గాంచి మృగాంగదత్తుఁ డీ
వేమిటి కిట్టు లైతివన నిట్లనియెన్ నృప నిన్ను బాసి యు
ద్దామమహాటవిం దిరిగి దాహమునం గడుడస్సి శాల్మలీ
భూమిజమూలదేశమున భూమిపయింబడి మూర్ఛపోయినన్.

130


గీ.

వృద్ధపధికుఁడొకఁడు వేగమ ననుఁ దేర్చి
మత్ప్రయాసమెల్ల మదిఁదలంచి
తగుల దుఃఖపడగ దైవికమునకని
కథ వచింపఁదొడఁగెఁ గరుణవొడమి.

131

క.

కోసలపతి విమలాకరుఁ
డాసుభగుతనూజుఁడు కమలాకరుఁ డంగ
శ్రీసాక్ష్మాన్మథుఁడు వి
భాసితుఁడని యొక్కయర్థి పద్యము చదివెన్.

182


వ.

అది యెయ్యది యనిన.

183


ఆర్య:

కువలయభూషణమతులం
గుణనిలయం కవిసహస్రసమృష్టమ్
హంసావళి ర్న రమతే
కాంతం కమలాకరం విముక్త్వాద్య.

134


క.

అని యార్య చదువుటయు న
జనపసతి యవ్వంది నడిగె చదివినపద్యం
బున కేది కారణంబన
విను కమలాకర! తదీయవృత్తాంతంబున్.

135


సీ.

విదిశావురక్షమాత్రిదశేశ్వరుఁడు మేఘ
        మాలినాఁగలఁడు శ్రీమండనుండు
హంసావళీనామ యతనితనూభవ
        పంచాస్త్రుమోహనబ్రహ్మవిద్య
యాకన్యకను నర్తనాచార్యగృహమున
        వసియించితినిఁ జూచువాంఛ జేసి
యంతట నొక్కనాఁ డబ్బాల జనకుని
        యాస్థానమున నాట్య మాచరింప


గీ.

అంగహారాదివిద్య లభ్యాససరణి
దేశనృత్యమ్మునకు సమాదేశముననుఁ
దండ్రియునుఁ జూచువారలు దన్నుఁ బొగడ
లాస్య మొనరించె దృష్టివిలాస మమర.

136

ఆర్య:

జయతిసనాభిసరోరుహ
మధుకర పటలైరివాహితాకారః
కోపి శ్రీముఖ చంద్రే
యత్కాంతిర్భవతి లాంఛనఛ్ఛాయా.

137


క.

అంత దినాంతంబున భూ
కాంతుఁడు చాలించి యనుపఁ గన్నియకును నిం
తింతఁ జని నిన్ను వ్రాసితి
నంతఃపురభిత్తివనిత అద్భుతమందన్.

138


గీ.

భ్రాంతుపగిది నీవిభావంబు గొనియాడ
చిత్రలిఖితబింబచిహ్న చూచి
కన్యయందు తగిలి కామాగ్ని పరి
తప్తమాన యగుచునున్న మతి నెఱింగి.

139


వ.

మేఘమాలి యాత్మతనయ హంసావళి విష్ణుపూజార్థం బనిపె నటమున్న తదాలయంబున నున్నవాఁడ నగుట నప్పుడు నేను విష్ణు నిట్లు స్తుతించితి.

140


దండకము.

జయజయ జగన్నాథ లోకైకనాథా రమానాథా లోకేశనాకేశముఖ్యా మరాధీశ కోటీరకోటి స్ఫురత్కోటి రత్న ప్రభాజాల సందీప్త పాదారవిందా చిదానంద! నందాదిగోపాల బృందప్రియాస్పంది బృందావనాంతోల్లస ద్రాసకేళీ నటద్వల్లవీచారు హల్లీసకప్రీత చిత్తాంతరంగా! కృపాపాంగ! అంగీకృతానంగలీలా పరిష్వంగ నీలాదితుంగస్తనీపీన వక్షోరుహన్యస్త కస్తూరికాస్థాసకాసక్తముక్తావళీరక్తి మాశోభికంఠా! సవైకుంఠ! కుంఠీకృత క్ష్వేళకంఠో గ్రహుంగార పూత్కార కాళింగ నాగోత్త

మాం గోల్ల సన్నృత్యభంగీ సమౌన్నత్య మాలావిహారాగుణాధార ధారాధరస్ఫార శోభాభిరామ ప్రభాభీరభామాను భోగానురాగా మహాభాగ భాగర్వరాధావధూమన్మథా! రాధమాసోద్భవారామభూ మాధవీయూధికా సాధుదామ త్రిభంగీనటద్వేష ధృద్వేణు సంధానమాధుర్య సంగీతగాథా సమాకృష్ణబింబాధరాసీధు మత్తానులాప ప్రమోదా! త్రయీనాథ నాథానుసంధాన సంసారకంధీశమంధాచలీభూత చిద్యోగ యోగేంద్రవిద్యా పరబ్రహ్మరూపా జగద్రూప రోపస్ఫురద్వర్తనోత్కర్తనీయ వ్రతాచార! కైవర్తయోషాభిలాష క్షమాదేవ సేవాప్రసాదావతారా! సముద్ధార (హృద్య) ప్రపంచాద్య! ఆద్యంతమధ్యాదిరాహిత్యసాహిత్య నిత్యత్వసత్యస్వభావా ! సుజద్భావ ! భావవబోధక్రియాజాల! దుర్మాననవ్రాత కర్మాధ్వరోద్భూత లోకాధిదూరా చిదాకారరంభ సృష్టి ప్రజారక్షణాక్షీణ దాక్షిణ్య దీక్షానుకంపా కటాక్షా! సురాధ్యక్ష! యక్షేశమిత్ర త్రినేత్రాంగనాస్తోత్రపాత్రాది నామస్ఫురద్రామసోమా పరంధామ ధామాధిపాబ్జాంబకోద్దామ దీప్తిఛటానిర్జలోత్ఫుల్లపద్మా! మహాపద్మపద్మోత్పల వ్యూహసంవాహి నీరోహిణీకుండికావారి వృత్తాంతరస్నాన శుద్ధాంగవైదేశిక ప్రాప్త కైవల్యభోగప్రదానప్రదాతా విదాఖ్యాత! ఆఖ్యాత కీర్తిప్రతాపోజ్జ్వల..............వాఙ్మాధవ క్ష్మాధవాధీశసంతర్పితాత్మాది నానావిధైశ్వర్య నైవేద్యసంతృప్త చిత్తాంతరంగా! త్రయీరంగ! రంగత్సముత్తంగ భంగఛ్ఛటాజృంభ జంభారిదిక్కుంభ! అంభోనిధి ధ్యాన సన్మానసానూన గుంజన్మృదంగార్భటీ పుంజరంజన్మహా భోగవృత్తాంగనా సంగ సంగీతవిద్యానురక్తా! గుణావ్యక్త అవ్యక్తరాగా భ్రవద్భర్మ శాటీకటిరా! తపస్సార సారామృతాసార ధారా పరిప్లావ సత్యాదిలోకావళీ లోకసంహరణేహా వటక్ష్మాజ శాఖాశిఖాకోటరస్థాన సంవేళపత్రి ప్రణాలబ్ధ సమ్మోక్షద శ్రీయశఃపూర్ణ దీవ్య

చ్చరిత్రా! మహాచిత్ర! చిత్తాయురూర్ణస్వలద్భా మృకండ్వాత్మజన్మార్చనా నిర్జితోష్ణాతనూ కృష్ణ కృష్ణా! ప్రలంబఘ్నసంజాత రాజత్సుభద్రాకృతి క్రీడిత శ్రీశ గౌరీశ వాణీశ మూర్తిత్రయోపాంగదారు స్థితోదార వైకుంఠవాసా శుభావాస వాసవ్యధిష్ఠానయానోచ్చలత్సారథిత్వాపదేశక్షమాధార కృద్వైరివిధ్వంసనోద్యత్ప్రతాపా! నమద్గోప! గోపద్మనేత్రా రతాసక్తసద్గణ్య మౌనీంద్ర పూర్వాచరద్భవ్య చంచత్తపోభంగ హృధ్భీతినిర్వాణ సర్వాభిధానా సమాధాన ఆదానఖేలా బృహత్కుక్షినిక్షిప్తపంకేజగర్భాండసంజాత పుంజీభవజ్జంతు సంతానవృత్తి ప్రవృద్ధాన (?) దాక్షిణ్యముద్రా! కృపాభద్ర! భద్రాసనాసీన భూపాల భూపాలనాసంతతప్రీత శాంతస్వరూపా! నమద్దేవ దేవేంద్ర ముఖ్యాదితేయారి సంహృత్సహస్రారి బాహాచతుర్వ్యూహితాశేషకైవల్య మాంగళ్యధామా! పటీహేమ! హేమక్షమాభృత్తుషారాచలాద్యద్రి వర్యాధిక శ్రీలసన్నీలధాశైలాగ్ర సౌధాంతరస్థాఢ్యరత్నోరు పీఠస్థలీ సన్నివేశా ధృవాద్రీశ అద్రీశమూలాలయాదిత్య మౌనీంద్ర యోగాంచితధ్యాన విజ్ఞాన విద్యాసనాథా! జగన్నాథ! నాథాదినాథా! నమస్తే నమస్తే నమః.

141


ఆర్య:

జయ కమలాకరలాలిత
చరణసమాక్రాంతభువన! విశ్వాత్మన్
ప్రకటసుదర్శనకాంత
...పురుషోత్తమ పుండరీకాక్ష (?)

142


క.

ఈకరణిని నుతియింపఁగ
నాకన్నియ మెచ్చి యొక్కయంశుక మీయన్
గైకొంటి నంత భూవరుఁ
డాకమలాకరుని కిత్తునని తలఁచుటయున్.

143

సీ.

కన్నియ నిజసఖి గనకమంజరిఁ దప
        స్వినిఁ జేసి కమలాకరునినిఁ జూడఁ
బనిచిన నది చూచి చనుదెంచి యిట్లనును
        నిను దండ్రి కమలాకరునికి నీఁడు
కటకట యొరున కీఁగాంచియున్నాఁడన
        సఖి నీవు నాదు వేషంబు దాల్చి
వరియింపుమని నిజాభరణంబు లిచ్చినఁ
        దద్విదితోపాయతం బురంబు


గీ.

వెలిని బూరుగుతొఱ్ఱలో నిలువుమనిన
వెఱచి కేసరలతలలో వెలఁది నిలచె
నంత కమలాకరుండు హంసావళనుచుఁ
గనకమంజరిఁ బెండ్లాడి కదలిచనుగ.

144


గీ.

కనకమంజరి విభుఁ జూచి యనియె నిందు
భూత మున్నది కాల్చు మీభూర్జతరువు
నన దహింపగ జూచి హంసావళియును
సఖి ప్రమోదించి యక్కట చంపఁజూచె.

145


క.

అని డెందంబున నచ్చెలి
ననయము దూరుచును నట దినాంతమునందున్
వనరుహలోచన యొండొక
వనము ప్రవేశించి మోహవశమున వ్రాలెన్.

146


ఉత్సాహ:

తనకుతాన తెలివిబొంది తన్వి పద్మసంహతిన్
వనరుహాక్షుఁ బూజచేసి వంతబొందుచుండ న
క్కనకమంజరీప్రియుండు కాతఁ గూడియుండగన్
దనువునందు జ్వరము వొడమి దాహశక్తి చూపగన్.

147

వ.

అక్కనకమంజరి కమాలకరజ్వరనివారణార్థంబు శక్తికి నరోపహారంబు సమర్పించ తనవృత్తాంతం బెఱింగిన యశోక కరియను సఖని బలివట్టందలంచి.

148


గీ.

పట్టి తెచ్చి విభుని పరకంకన్యిట భూ
స్థలిని ఖడ్గమెత్తి తానె నఱుకఁ
జేర మొఱ్ఱ యిడుచు ద్వారపాలకునిల్లు
చొచ్చి చెప్పెఁ దొంటి సుద్దు లెల్ల.

149


ఉ.

చెప్పిన నేమి చెప్ప నృపశేఖరుఁ డాసతి దుష్టశీలగా
నప్పు డెఱింగి హాప్రియ మృగాక్షి! లతాంతశరీర యెట్టుగా
నిప్పుల వ్రేలితే యనుచు నివ్వెరగొందంగ వందిమానవుం
డప్పుడు వచ్చి చింత వలదంచును బుద్ధులు చెప్పి యిట్లనున్.

150


సీ.

హరిపూజ చేత హంసావళి నాశంబు
        బొందదు వెదకించు పువ్వుబోణి
నా నట్ల కావింప నటవీస్థలంబున
        గనికొనియేగి తజ్జనకునింటఁ
బెట్టితిమని నిజభృత్యులు చెప్పిన
        జని మేఘమాలి తత్సదనమునను
హంసావళిని వివాహముఁ బొంది క్రమ్మఱ
        తనపురి కేతెంచె ధరణినాథుఁ


గీ.

డనుచుఁ జెప్ప వినుచు నప్పు డుజ్జయినికి
నరిగి యొక్కముసలియవ్వయింట
రెండురూక లిచ్చి నిండంగ భుజియించి
కుక్కి యిడిన నిద్రఁగూరియుండు.

151


వ.

అప్పుడు.

152

క.

ఆయింట వృద్ధకామిని
యాయతమతి యవలుపిడికె డలికిన నపుడే
కోయంగనైనఁ జిదుముచు
నాయవలును దంచి వండ యాపగ కరుగన్.

153


క.

రండ చనుదెంచు నంతకు
నుండక యా యవలనైన యోరెముదింటిన్
ముండయు కోపంబునను శి
ఖండింగాఁ జేసి త్రాడు గళమున గట్టెన్.

154


క.

నను వేటగాండ్రు కనుగొని
చని రాజున కిడిన ద్వారసంబంధుఁడనై
జననాథ నీకతమ్మున
మనుజుఁడనై నిన్నుఁ గంటి మంటిని యుంటిన్.

155


వ.

అని చెప్పినంత.

156


సీ.

ఆ మఱునాఁడు మృగాంగదత్తుఁడు కిరా
        తపతితో ద్యూతబాంధవము నడుపు
నపుడు మయూరచోరాదుల వాక్రుచ్చి
        రాత్రింటి చర్య కిరాతునకును
వినిపించ వాఁ డాత్మవనితను వధియింప
        దలచుటయు మృగాంకదత్తుఁ డతివ
వధియింపఁగాదని వారింప నది మాని
        శక్తియాగము జేయ జనుని నొకనిఁ


గీ.

దెండునావుడు శబరు లుద్దండవృత్తి
బట్టి తెచ్చిరి శతవీరభటవిదారు
నతనిఁ దనమంత్రిపుత్రు గుణాకరుఁడుగ
నెఱిఁగి యిది యేమి యన నతం డిట్టులనియె.

157

క.

వింధ్యాటవికిం జని త
ద్వింధ్యాచలవాస గుడికి వేగమ చనుచో
సంధ్యాశ్రయ రుధిరాసవ
గంధ్యాశ్రయమైన యచట కనుగొనునంతన్.

158


క.

భయమును బొందగ నాపై
దయలో నొకవృద్ధకాంత తగ నిట్లనియెన్
రయమున జను మిచ్చట సం
శ్రయమనినను నేను దప్పిచని యొకవంకన్.

159


సీ.

పాంచాలనృపుద్వారపాలుండు కమలాఖ్యుం
        డాదత్తచాపుఁడై యడవిలోన
తరుమూలమున నొక్కతరుణి దుఃఖంపగఁ
        గని హేతు వడిగినఁ గాంత పలికె
గంధమాలికయను కరటి మజ్జనకుండు
        కాలబాహుని పుష్పకాండవహుఁడు
తత్తటిజిహ్వు సోదరుఁడు కుబేరు శా
        పమున రధాంగంపుఁ బక్షి యైన


గీ.

గిరిజ నాసేవఁ గైకొని కరుణఁ బలికె
యక్షు మర్దించి యంగుళీయకము గొనిన
వాని వరియింపుమనినఁ దద్వధ యొనర్చి
ఇంతి గైకొని చనె తనయింటి కతఁడు.

160


ఆ.

దేవహూతియనెడు భూవాసవుని పత్ని
భోగదత్తయనెడి పువ్వుబోణి
విభుఁడు దీర్థ మరుగ వెలఁదియుఁ దోటకుఁ
బోయి గార్దభంబు మేయఁ జూచి.

161

క.

కోలఁ గొని దానిఁ గొట్టిన
గాలొక్కటి విఱిగె దానిఁ గని రజకుం డా
నీలాలకఁ దన్నుటయును
లోలాక్షికిఁ గడుపుదిగిన లోహిత మొలికెన్.

162


గీ.

ధరణిసురుఁడువచ్చి ధరణీపతికిఁ జెప్ప
ధావకునిని విప్రతరుణిఁ బిలిచి
వాదు తెఱఁగు దెలిసి వసుధేశుఁ డిట్లని
పలి సభికులెల్లఁ బ్రస్తుతింప.

163


ఉ.

న్యాయము దప్పఁజేసిరి ధరామరపత్నియు ధావకుండు ని
ట్టీయమ వానిగార్దభము హీనపదంబుగఁ జేసె వీఁ డుపా
ధ్యాయునిగర్భము న్విలయతం బొనరించెను గాన యిట్టి ద
న్యాయము గాకయుండ వినుం డందఱు నాదు వివేకవాక్యముల్.

164


క.

నిర్భయుఁడై భూసురసతి
గర్భిణియగుదాఁకఁ జాకి గైకొను ఖరసం
దర్భంబుదాఁక రజకా
విర్భవ వస్త్రములు మోచు విప్రుం డనియెన్.

165


వ.

అని దుర్వివేకనృపాలుండు దీర్చిన న్యాయంబునకు భూసురుండు దేశత్యాగంబు జేసె నేను గురుక్షేత్రంబున కరుగునప్పుడు.

166


సీ.

ఆకురుక్షేత్రేశుఁడగు మలయప్రభు
        తనయుఁ డిందుప్రభుఁడనెడివాఁడు
త్యాగి దుర్భిక్షవిదారితప్రజఁ జూచి
        వరతపంబున హరివరము గాంచి
కల్పవృక్షాకృతి గైకొని వాంఛిత
        ఫలదాతయై ధరాప్రజలఁ బ్రోచె
నతనిని దానరత్నాకరుఁడని జన
        వితతి వినుతింప వినుచు

గీ.

దానమే సర్వజనులకు ధర్మమనుచు
దానమే మోక్షములకెల్ల ధామమనుచు
దానమియ్యగ లేకున్నఁ దలఁపవలయు
దానశూరుల నేప్రొద్దు ధర్మవిదులు.

167


వ.

అనుచు నచ్చోటు గదలి దక్షిణాభిముఖుండనై యా శబరాలయంబున కేతెంచిన.

168


తోవకము:

భిల్లులు తాకిన భీతిల కేనున్
భిల్లపరంపర భగ్నము సేయన్
జిల్లలఁగోలలఁ జించి ధాత్రీ
వల్లభఘాతలు వచ్చిన...భున్.

169


ఉ.

చూఁప మృగాంకదత్తుఁడు విశుద్ధచరిత్రులు మంత్రిపుత్రకుల్
బ్రాపులు గా కిరాతవతి బంట్లును దానునుఁ దోడరా విశా
లాపురిఁ గూర్చి యేగ విపులాటవి నొక్కెడ నిద్రవోవు సం
తాపితుని నిద్రఁ చేర్చుటయుఁ దత్సతివాత్మజుఁ డప్పు డిట్లను.

170


క.

అన్నాగము శాపంబున
నిన్నుం బెడబాసి రత్ననిధియును పురి న
త్యున్నతమూర్తి శతద్వయ
సన్నిధిఁ బొడగాంచి యతఁడు సత్కృతి సేయన్.

171


ఆ.

యక్షనాథుఁ డనుచు నాతని భార్యలు
చెప్పుటయును నతనిచేతఁ దనదు
దుఃఖశాంతి యడుగ దురితానుభుక్తికి
దుఃఖ మేలరాక తొలఁగిపోవు.

172


క.

నిర్ధనుఁడగు నొకవిప్రుఁడు
దుర్ధరతరతపమునందు ధూర్జటి వలవన్
వర్ధనము గాంచి యౌవన
ధుర్ధరయగు యక్షిణీవధూమణిఁ గాంచెన్.

173

ఉ.

యక్షిణికిన్ మహీసురన కంగన యుద్భవమైన నప్పుడా
యక్షిణి భూమిదేవునకు నాత్మజ నిచ్చి పినాకపాణి ఫా
లాక్షుని గొల్వనేగిన దదాత్మమనఃస్థితి బాయలేక దే
హక్షయ మొందిపోవుటయు నంగన యక్షుని గూడె విప్రునిన్.

174


గీ.

అట్టహాసుఁ డనెడి నభ్రచరేంద్రుఁ డ
య్యక్షిణీతనూజ నబ్జవదన
బలిమిఁ బట్టుకొనుచు నలకాపురంబున
కరగుటయును గిన్నరాధివరుఁడు.

175


క.

ఆ యక్షిణీతనూభవ
ప్రాయము నీక్షించి యలిగిపట్టిన వాఁడా
కాయంబు విడిచి హరియై
పాయకఘోరాటవులను భ్రమతం బాఱున్.

176


గీ.

అని శపించిన నక్కన్య నచలపుత్రిఁ
గొలువగాఁ బెట్ట నదియునుఁ గొలుచుచుండ
శారదపీఠమైన కాశ్మీరధరణి
మండలం బేలు నందనమనుజవరుఁడు.

177


సీ.

ఒకనాఁడు ద్వాదశి నుపవాసమునఁ బొంది
        కలలోన నాయక్షకన్యఁ గాంచి
దర్పగానలశిఖాదందహ్యమానుఁడై
        ధరణిభారము మంత్రితతికి నిచ్చి
తప మాచరింపుచు తరణిపైఁ గూర్మి ద
        శావస్థలనుఁ బొంది సమయుతఱిని
శంకరరూపుఁడై చనుదెంచి యొకవిప్రుఁ
        డనియె భూవరుఁడు దన్నడుగుటయును


గీ.

శైవశాస్త్రోక్తమైన భస్మంబు దాల్చి
శ్రీగిరిస్థలిఁ దప మేను సేయుచుండ

శివుఁడు ప్రత్యక్షమై నాకుఁ జెప్పె నొకటి
యది విచిత్రంబు చెప్పెద విదితముగను.

178


గీ.

బాణసుతయైన యుష తొల్లి పంచబాణ
తనయు ననిరుద్ధుఁ గూడి యా ద్వారవతిని
మండితోద్యానహాటికామండలమున
క్రీడ సలుపుచు నొకనాడు వేడు కమర.

179


క.

బాణాత్మజ యిందీవర
బాణాత్మజు గొంచు నతలబంధురమయని (?)
ర్మాణోపవనము కుంజని
మాణిక్యగృహాంతరంబు మరగి చరింపన్.

180


చ.

తనయునిమీఁది మోహమున దర్పకుఁ డంబుజనాభుఁ డానతి
చ్చిన గతినేగి యచ్చటను శేషవిభూషణుదేవి గౌరికిం
బ్రణుతి యొనర్చి సూక్తముల బ్రస్తుతిఁ జేసిన గీరరూపయై
ఘను ననిరుద్ధుఁ జూపుటయుఁ గైకొని ద్వారక కేగెఁ బ్రీతుఁడై.

181


క.

అంతట మునిశాపంబున
నంతకపురి కఖిలయాదవావలి చనినన్
దంతిత్వగ్ధరుకృప నే
నంతయు బొడఁగంటి బొడమె నాభూపతియున్.

182


వ.

అమ్మునిసహాయుండుగాఁ గాశ్మీరమండలంబున కరిగి.

183


గీ.

శారికారూపయగు మహాశక్తి జూచి
దేవిగృప గాంచి కాశ్మీరదేశమునకు
నరిగి తద్గంగలో గ్రుంకి యలపుదేఱి
రత్నమయమైన యొక్కపురంబు గాంచి.

184


సీ.

అప్పురి శ్రీకంఠహాటకేశ్వరుఁ గొల్చి
        హేరంబు విఘ్నసమేతుఁ బొగడి
యటచని వజ్రమయంబగు నొకమంది
        రమ్మునుఁ గాంచి తద్రత్నభిత్తి.

చేరువ నిల్చి తద్ద్వారనిర్గతదైత్య
        కన్యల నూర్వురఁ గాంచి యందుఁ
గలలోన బొడఁగన్న కామిని యెదురైన
        భూనందనాఖ్యుఁ డద్భుతము నంద


కాంత యిట్లని మేదినీకాంతుఁ జూచి
నాకునై వచ్చితివిగదా నాకవసతి
కైన నేమగు రమ్మని యతని గొనుచు
రక్తపూరితసరసికారమణి యరిగి.

185


గీ.

తా తరసపాత్ర భూపతిచేతి కిచ్చి
పాన మొనరింపు మనిన నృపాలుఁ డొల్ల
కున్న శ్రేయస్సు చెడెనని యువిద వగచి
యతని తలమీఁద వైచె నయ్యస్రపాత్ర.

186


క.

ఒండొక సరసికిఁ గొనిచని
కాండంబుల నతనిమేనుఁ గడిగది(?) చనియెన్
మండలనాథుఁడు స్వప్నపు
మండనమని తలఁచి దుఃఖమానసుఁ డగుచున్.

187


వ.

అచ్చటం బరిభ్రమించుచు నొక్కచోటం బడియున్న సమయంబున.

188


క.

తుమ్మెదలు గుట్టఁబొరలెడు
నమ్మహిపతి గప్పెఁ దపసి యజినముచేతన్
తుమ్మెదలు గుంపుకూడిన
నమ్ముని భూనందుఁ జూచి యపు డిట్లనియెన్.

189


క.

జలజభవ జలజలోచన
జలజకిరీటుల నభేదసాకారులుగా
దలఁచి భజియించు నెవ్వఁడు
నెలమిన్ వానికి ఘటించు నిష్టసుఖంబుల్.

190

గీ.

అనుచు మౌని పలుక నద్ధరణీశుండు
బ్రహ్మవిష్ణుశివులఁ బ్రస్తుతించి
కరణ వడసి దైత్యకామిని గైకొని
యాత్మపురికి నరిగెనని వచించె.

191


వ.

అంత.

192


క.

శ్రీదర్శనాఖ్యుఁడను త
ద్భూదేవునియింట నన్నభుక్తుండగుచున్
వైదికగేహము వెలువడి
యాదట నొకసరసిఁ గాంచి యాతీరమునన్.

193


సీ.

ఒకకాంతఁ బొడగని యొయ్యన నడిగిన
        శ్రీదర్శనునకు నచ్చెలువ వలికెఁ
బద్మగర్భతనూజఁ బద్మిష్ఠ నేముఖ
        రాఖ్యుండు తోఁబుట్టెనన్న నాకు
మాతండ్రియును నేను నాతని వెదుకంగ
        ధర బరిభ్రమియింపఁ దస్కరుండు
మాతండ్రిఁ జంపి నెమ్మది తనసుతునకు
        నీయఁగాఁ దలఁచిన నల్గె నతఁడు


వాఁడు నను వెళ్ళఁగొట్టిన వచ్చి యిచట
తండ్రితోఁబుట్టు వని మదిఁ దలఁచితలఁచి
దుఃఖచింతావశమ్మునఁ దూలుచుండి
నిన్నుఁ బొడగంటి సంతోషనిధియుబోలె.

194


క.

అనునంత ముఖరకుండును
దనసోదరి వెదకి కాంచి తండ్రిమరణ మ
వ్వనరుహముఖి వినిపించిన
విని దుఃఖితుఁ డగుచు మాళవీయపురమునన్.

195


వ.

ప్రవేశించి యారాజునకుం దనమంత్రవిద్యను వాతరోగంబు నడంచిన నమ్మహీశ్వరుండు.

196

ఆ.

అర్ధరాజ్య మీయ నాశ్రీసుదర్శన
ద్విజుఁడు యౌవరాజ్య విభవ మొంది
యుండునంత వైశ్యుఁ డొకదూతఁ బుత్తెంచె
జలధి నోడ యెక్కి చనదలంచి.

197


క.

శంసాపూర్వంబుగ ద్విజ
హంసుఁడు కల మెక్కి విట్సహానుగుఁడై యా
హంసద్వీపమునకుఁ జని
హంసాశ్రయుఁడైన యొక్కయతివరుఁ గాంచెన్.

198


సీ.

అయ్యతివరుకృప హస్తివక్త్రునిఁ గాంచి
        నుతియించి తద్వరోన్నతవిభూతి
దండ్రి యీయంగ శ్రీదర్శనాఖ్యు డనంగ
        మంజరిఁ బెండ్లాడి మహితలీల
నభ్రగయానుఁడై యాత్మపురమున
        కేతెంచి పద్మేష్ఠ బ్రీతి కూడి
భార్యలును దానును బ్రహ్మయానతిచేత
        శ్రీదర్శనుఁడు యక్షసిద్ధి వడసె


ననుచుఁ గథ చెప్పి యేను నీయడవిలోన
వారిచరితంబు దలఁపుచు వచ్చివచ్చి
యలసిపడియుండి మిము గంటి ననుచు మ్రొక్క
...........మెచ్చి మృగాంకదత్తుఁ డపుడు (?)

199


సీ.

రాధాపురీవరరమణుఁ డుగ్రభటాఖ్యుఁ
        డతనిభార్య మనోరమాభిధాన
యమ్మహీపతియున్న యాస్థానమున కొక .
        నర్తకుం డరుదెంచి నాట్య మాడ

తత్సుత శ్రీవనితాకృతి ధరియించి
        నటియింప బతి భీమభటుఁడు గదిసి
క్రీడారణంబున గేడించి లాసికా
        సుతుఁ జంపుటయు భూమిపతిఁ దలంకి


కొడుకు బురము వెళ్లగొట్టి కనిష్ఠునిఁ
బ్రభువుఁ జేయ భీమభటుని హితుఁడు
శంఖదత్తుఁడనెడి సద్విజుఁ డరుదేర
నన్యదేశమున కరుగు నపుడు.

200


ఆ.

వణిజుఁడొకఁడు సింధువాహంబు దెచ్చిన
భీమభటుఁడు దానిఁ బ్రేమ గొనిన
ధరపుపిన్న(?) కొడుకు నావాడునర్తకి
తనయుఁ డనుచు బాహుదర్ప మమర.

201


క.

భీమభటుమీఁద నడిచిన
భూమిపునకు వెఱచి జ్యేష్ఠపుత్రుఁడు నగరీ
సీమంబు వెడలి తురగము
నామిత్రుఁడు తోడరాగ నరిగి యొకడవిన్ (?)

202


క.

హరికంఠ కహకహారవ
మురవడిమ్రోయుటయు దురగ మోర్వక పడినన్
దురగంబు విడిచి నిజపద
చరణం జని నీలకంఠసంయమి గాంచెన్.

203


వ.

తదనుమతంబున స్నానార్థంబు గంగాప్రవేశంబు చేసిన.

204


క.

మిత్రుని మీను మ్రింగిన
ధాత్రీవరసుతుఁడు శోకతప్తుం డగుచున్
దత్త్రిపథగాంబులం దన
గాత్రంబును విడువఁదలఁప గంగయుఁ బలికెన్.

205


వ.

ఈసాహసంబు వలవదు ప్రతిలోమానులోమోచ్చారణంబున స్వేచ్ఛాకృతిప్రధానమగు మంత్రం బిచ్చెదం గొనుమని యుపదేశించినం గైకొని యమ్మహానది వీడుకొని లాటదేశంబునకుం జని యందు.

206

ఆ.

ద్యూత మాడి వాసితోడుత దా ద్యూత
మాడి గెలిచినట్టియర్థమెల్ల
తనధనంబు చేసి ధనదత్తుఁడను విప్రుఁ
డాత్మసఖుఁడు గాఁగ నాచరింప.

207


సీ.

ఆవిప్రువరుఁ డిట్టు లనియెను శివదత్తు
        డనెడు విప్రునకు నే నాత్మజుఁడను
మాతల్లి కడుబాపమతి ఱిత్త కలహించి
        కోడలి నిలు వెళ్ళఁగొట్టి యేడ్చు
భయమును మాయా సపర్యయు నందక
        కపటంబు లధిపతిఁ గల్లలాడు
బంధువర్గము నెల్ల ప్రతిదినంబును దిట్టు
        నెప్పుడు లేదని యింతి సొలయు


భార్య మారుగాఁగ (చంద్రబ్రతిమ నా[1])
యదియు నీవు వెళ్లుఁడనుచును దూఱు
నందు బడగలేక యరుదెంచి యిచ్చట
నిన్ను గంటి ద్యూతనిధికతాన.

208


వ.

అని నుతించిన.

209


క.

ఆభీమభటుఁడు హితుఁడగు
నాభూసురుఁ గూడి తిఱుగునంతట నదిలో
శాభర్యధిపతి తెచ్చిన
లాభమునకు దాశభటులు లౌల్యము మెఱయన్.

210


గీ.

అట్టిమత్స్యంబు భేదింప నందులోన
శంఖదత్తుని బొడగాంచి సంతసమున
బ్రతికి తెటువలెనన భీమభటున కనియె
మంత్రిపుత్రుఁడు దైవికమహిమఁ జేసి.

211

క.

ఈమత్స్యగర్భమున నీ
యామిషమే భుక్తి గొనుచుఁ బ్రాణముతోడన్
భీమభట నిలిచినానని
యా మిత్రుఁడు దానుగూడి యాపగ కరుగన్.

212


ఉ.

భూవరుఁ డంత గాంచెఁ బరిపూర్ణశుధాంశుముఖాంతరాళశో
భావలమానలోచనవిభావళిఁ జారుసహస్రకన్యకా
భావవిలాసవిభ్రమసభావలి నంచితయాన మొప్పుహం
సావళి గోమలాంగపరిహాసితభాసికళాలతావళిన్.

213


క.

భామినియుఁ జూచె నుద్భట
భీమభటప్రకటకరవిభీతరకటునిన్
కోమలదేహోత్కటునిన్
భీమభటుని మదనశాస్త్రబృందార్భటునిన్.

214


వ.

అంత.

215


గీ.

దానిచెలికత్తె గొనిపోవ త్వరితగతిని
నంతపురిఁ జొచ్చి యక్కాంత ననుభవించె
వేఁగుటయుఁ బుత్రి వినుపింప వెలఁదితండ్రి
భీమభటునకుఁ తనకూతుఁ బెండ్లి జేసె.

216


ఉ.

పుత్రులు లేమి లాటపతి పుత్రిమనోహరు రాజు చేయ న
క్షత్రియుఁ డాత్మభూమికి నసంఖ్యబలంబులతోడ నేగి ని
క్షత్రముగాఁగ సోదరుల క్ష్మాతలికిన్ బెడబాపి తానె యా
ధాత్రియు నేలె భూజనులు తత్పరతం గొనియాడుచుండగన్.

217


వ.

అంత నాతనిమంత్రి నగునేను నుదంకఋషికి నపకారం జేసిన నతఁడు నన్ను గజంబ వగుమని శపించె.

218


ఆ.

యటనుదంక శాపహతి హస్తినైయున్న
యేను భీమభటుని యింతి వలన
శాపముక్తి వడసి చనుదెంచి నిను గంటి
చండశక్తియనెడు సచివవరుఁడ.

219

చ.

అనిన మృగాంకదత్తుఁడు ప్రియంబున బొందె ప్రధానిపుత్రకుల్
తను గొలువంగ శంకరుని దైవశిఖామణి గొల్చి సంస్మరిం
చిన జనుదెంతు నే ననుచుఁ జివ్వున ఖేచరుఁ డేగె దత్తుఁడున్
వనరుహనేత్ర గోరి సచివప్రభులం గొని యేగె వీఁటికిన్.

220


వ.

అంత నుజ్జయినీపురాధీశ్వరుండు తనకూఁతురగు శశిప్రభయనుదాని దెచ్చి మృగాంకదత్తునకు వివాహం బొనరించెనని ఋషీశ్వరుండు కథ చెప్పి యన్నరవాహనదత్తునకు తనమంత్రసామర్థ్యంబున ఖచ్చరుం డెత్తుకొనిపోయిన మదనమంచికం దెచ్చియిచ్చిన తనపురంబున కరిగి సుఖంబుండెనని వజ్రప్రభుండను విద్యాధరుండు వత్సేశ్వరునకుఁ జెప్పి సుఖంబుండెనని బలీంద్రునకు నారదుం డెఱింగించుటయును.

221


ఉ.

గంధకరీంద్రశిక్షణశిఖండమహోజ్వలపింఛమాలికా
బంధుర! కుంట్లముక్ల పినభైరవపాత్రమనోబ్జినీజగ
ద్బాంధవ! తొండమాభిధ నృపాలకసన్నుతిపాత్ర పాత్రసౌ
గంధిక వేంకటాద్రిమణికందర శాశ్వతనీలకంధరా.

222


క.

భిల్లస్త్రీమందస్మిత
గల్లస్థలరచితమకరికామృదువల్లీ
వేల్లితకపోల! మహితల
వల్లభ! పినభైరవేంద్ర వరహృదయేశా.

223


ఉద్ధురమాల:

కుంభీసంభవ శుంభద్వాచా
రంభోజృంభణగుంభద్విద్యా
సంభాసంభవ శంభరలక్ష్మీ
జంభృ(?)ద్భూషణ సంభృతవక్షా.

224


గద్య.

ఇది యష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసురత్రాణ కూచనామాత్యపుత్ర సుకవిమిత్ర వినయవిద్యావిధేయ యెఱ్ఱయనామధేయప్రణీతంబైన సకలనీతికథానిధానంబునందు సర్వంబును పంచమాశ్వాసము.

  1. ప్రతిమయు నా కిచ్చి