Jump to content

సంపూర్ణ నీతిచంద్రిక/హిరణ్యకుడు పావురములకు మేలుసేయుట

వికీసోర్స్ నుండి

హిరణ్యకుడు పావురములకు మేలుసేయుట

హిరణ్యకుడు పావురములు వ్రాలిన సవ్వడి గుర్తించి భయముచే దన కలుగులో గదలక మెదలక యుండెను. అపుడు చిత్రగ్రీవుడు "చెలికాడా! మాతో మాటాడవేల?" యని యెలుగెత్తి పిలిచెను. ఆమాట చిత్రగ్రీవునిదని గుర్తించి వెంటనే హిరణ్యకుడు కలుగు వెలుపలికి వచ్చెను. చిత్రగ్రీవుని జూచి "మిత్రునితో సంభాషణము, సహనివాసము, కలుగుట కన్న పుణ్యము మఱిలేదు. పుణ్యవశమున నాచెలికాడువచ్చి నా కానందము గలిగించినాడు." అని పలికి వలలో దగులుకొన్న పావురములను జూచి కొంచెము భయపడి "మిత్రుడా! ఇదియేమె" యని యడిగెను.

దానికి జిత్రగ్రీవుడు "మిత్రుడా! యిది మా పూర్వజన్మకర్మమునకు ఫలము, రోగము, పరితాపము, బంధనము, వ్యసనము నను నవి ప్రాణుల కాత్మాపరాధవృక్షఫలములు గదా!" యని బదులు పలికెను.

వెంటనే హిరణ్యకుడు చిత్రగ్రీవుని బంధనములు గొఱుకుటకై సిద్ధపడెను. చిత్రగ్రీవుడు "మిత్రమా! ఇదిసరికాదు. ముందు నాయాశ్రితుల బంధములు తెగ గొఱుకుము. తరువాత నావియు గొఱుకవచ్చును."అనెను.

ఇది విని యా మూషికరాజు "నాదంతములు కడుసున్నితములు. శక్తియు దక్కువగా నున్నది. కావున ముందుగా నీ బంధములు చేదించి తరువాత శక్తియున్నచో వారి బంధముల సంగతి చూచెదా ననెను.

ఆ పలుకులకు జిత్రగ్రీవుడు "సరే; శక్తికి మించి యేమి చేయగలవు? ముందు వీరి బంధములు శక్తియున్నంతవఱకు ద్రుంపుము. పిమ్మటనే నాపని చూడవచ్చును" అన,మూషికరాజు "తన్నువీడి యితరుల గాపాడ దలచుట నీతి గాదు. 'ఆపదవేళ నుపయోగపడుటకై ధనమును రక్షించుకొనవలయును. ధనమును, దారను వీడియైనను తన్ను దా నేమఱక కాపాడుకొనవలయును.' అని నీతివిదులు పలుకుదురు ప్రాణములు ధర్మార్థకామమోక్షముల సుస్థితికి మూలములు. అవిపోయినచో సర్వము బోయినట్లే." అని చెప్పెను.

ఆపలుకులు విని చిత్రగ్రీవుడు మరల నిట్లనెను. "మిత్రుడా! నీవు చెప్పినది నీతియే. అయినను నా యాశ్రితుల దుఃఖము నేను సహింపజాలను; కావున నిట్లు పలికితిని. 'పరుల నిమిత్తము ధనమునే కాక జీవితమును గూడ వదలుకొనవలయు ' నని పెద్దలు చెప్పుదురు. ఎప్పుడైనను నశింపక తప్పని ప్రాణములు మంచికారణమున ద్యజించుట శ్రేయస్కరముగదా! అన్నివిధముల వీరు నాకు సమానులు. వీరినిపుడు రక్షింపలేకున్నచో వీరికి నాప్రభుత్వమువలని యుపయోగమేమి? జీతబత్తెములు లేకున్నను వీరెల్లపుడు వీడక నను గొలుచుచున్నారు. నాజీవితము వదలుకొని యైనను వీరిని రక్షించుట మేలు. అనిత్యము, మలినము నగు దేహముచే శాశ్వతము, నిర్మలము నగు యశము లభించు నపుడిక గావలసినదేమె యుండును? శరీరము క్షణకాలములో నశించునది; గుణములు కల్పాంతమువఱకు నుండునవి. కావున మలినమైన నాదేహము విషయమున శ్రద్ధమాని నాకీర్తిశరీరమును గాపాడుము.'

చిత్రగ్రీవు డాడిన యీమాటలు విని హిరణ్యకుడు సంతోషముచేత బులకితుడయి యిట్లనియెను. "సఖుడా మేలుమేలు" ఆశ్రితుల యెడల వాత్సల్యమనెడి నీ యీ సుగు ణముచేత ముల్లోకముల నేలజాలి యున్నావు." ఇట్లు పలికి యన్నిటిబంధములు నవలీలగా గొఱికివైచి వానిని సాదరముగా బూజించి హిరణ్యకుడు కపోతరాజుతో మరలనిట్లనెను.

"మిత్రమా! చిత్రగ్రీవా! వలలో దగులుకొంటి నని విచారింపకుము. ఆమిషము నాకాశమున యోజనము దూరము నుండియైన జూడగలపక్షి యాపత్కాలము ప్రాప్తమై నప్పుడు తనసమీపమున బన్న బడిన వలను సైతము జూడజాలదు. కాలము ప్రాప్తించినపుడు సూర్యచంద్రులకు రాహుకేతుగ్రహపీడయు గజసర్పములకు బంధనమును, బుద్ధిమంతులకు దారిద్ర్యమును గలుగుచుండుట జూచినచో విధి బలవత్తర మని తేలును గదా! కావున గాలమతిక్రమింపరానిది" అని యూరడించి, యాలింగన మొనరించి, సపరివారముగా నాతిథ్యమొసగి హిరణ్యకుడు చిత్రగ్రీవుని బంపెను. ఆ కపోతరా జానందమున యథేచ్ఛముగా వెడలెను. హిరణ్యకుడు తనకలుగు జొచ్చెను.

కాబట్టి పెక్కుమంది సన్మిత్రులను సంపాదింపవలయును. ఒక్క మూషికమువలన బావురముల కెంతమేలు చేకూఱెనో చూడుడు!