సంపూర్ణ నీతిచంద్రిక/కంకణమున కాసించి పులిచే జంపబడిన బాటసారి కథ

వికీసోర్స్ నుండి

కంకణమున కాసించి పులిచే జంపబడిన బాటసారి కథ

పూర్వ మొకపుడు దక్షిణదేశపు టడివిలో దిరుగుచు జూచితిని. ఒక ముసలిపులి స్నానముచేసి దర్భలు చేత బట్టుకొని యొక చెఱువుగట్టున నుండి "ఓయి బాటసారీ! ఇదిగో బంగరు కంకణము. దీనిని దీసికొనుము" అని పలుకుచుండెను.

పేరాసకు లొంగిన యొక బాటసారి "నిస్సందేహముగా నిది నాయదృష్టము. అనుమానములు పెట్టుకొని కూరుచున్నచో ధనార్జనమే కష్టము. అయినను ద్వరపడరాదు. పరిశీలించెదను గాక" యని తలచి "కంకణ మేది? చూపుము" అని యాపులి నడిగెను.

"ఇదిగో బంగరు కంకణము. చూడుము." అని పులి చేయి చాచి చూపెను.

"నీవు క్రూరజంతువవు. నిన్నేలాగున నమ్మవచ్చును?" అని యాబాటసారి ప్రశ్నించెను. దాని కా పులి యిట్లు బదులు పలికెను. "నీ వన్నట్లు యౌవనమున నే నతిదుర్మార్గుడనై యుంటిని. అనేకములగు గోవులను, మనుజులను జంపితిని. ఆపాపముచేతనే యాలుబిడ్డలను గోలుపోయి వంశహీనుడనై యుంటిని. పిమ్మట నొక పుణ్యాత్ముడు "గోవులను, మనుజులను చంపుట మానివైచి దానధర్మములు చేయుము" అని నాకు బోధించెను. నాటి నుండియు స్నానదానాదులు చేయుచుంటిని.

గోళ్లు, దంతములులేని ముదుసలిని. నే నెవరి కేమి యపకారము చేయగలను? ధర్మమార్గమునకు లోభము లేకుండుట మొదటి సోపానము. చేతజిక్కిన కంకణమును దాన మిచ్చుచున్న నాకు లోభము లేదనుసంగతి తెల్లమే కదా!

అయినప్పటికి బులులు మనుజుల జంపునని లోక ప్రసిద్ధి. దాని నెవరు వారింపగలరు? గ్రుడ్డినమ్మకమే కాని ధర్మమును గనిపెట్టుట లోకమున నఱుదు. మరుస్థలమున గురియు వానవలెను, నాకలిగొన్నవాని కిడు భోజనమువలెను, పేదలకొసగు దానము ప్రశస్తము. నీవు దరిద్రుడవనియు, సర్వవిధముల బాత్రుడవనియు దీనిని నీకీయ దలచితిని. రోగముగలవాని కౌషధ మీయవలయునుగాని యారోగ్య వంతున కిచ్చిన నేమి యుపయోగము? కావున నీ చెఱువులో స్నానముచేసి వచ్చి దీనిని గ్రహింపుము. సంశయింపకుము."

ఇట్లు పలికిన పులిమాటలకు లోబడి యాబాటసారి స్నానమునకై చెఱువున దిగబోయి పెనుఱొంపిలో దిగబడి కదలజాల డయ్యెను. అపు డాపులి "అయ్యో! బురదలో బడిపోయితివి. నిన్ను లేవదీయుదు" నని నెమ్మదిగా సమీపమున కేగి యాతని బట్టుకొనియెను.

అట్లు పట్టువడి, "క్రూరజంతువును నమ్మి గొప్ప తప్పిద మొనరించితిని. నదులయందును, శస్త్రప్రాణులయందును, గోళ్లు కలిగిన జంతువులందును, కొమ్ములు కలిగిన జంతువులందును, స్త్రీలయందును, రాజకులములందును విశ్వాస ముంచరాదని పెద్దలు వచింతురు. గతించిన దానికి విచారించిన బ్రయోజనమేమి? విధి దప్పించుకొన నెవ్వరికి దరమగును? చంద్రు డున్నతమైన గగనమార్గమున జరించును; కల్మషమును హరించును. అనేకకిరణములను ధరించుచు జ్యోతిర్మధ్యమున సంచరించును. అంతటి ఘను డైనను రాహు కేతువులచే మ్రింగ బడుట తప్పలేదుగదా!" అని విచారించుచు బులిచే జంపబడెను.

బాగుగా జీర్ణమయిన యన్నమును, జక్కగా జదివిన కుమారుడును, సుశిక్షితురాలైన స్త్రీయును, బాగుగా సేవింప బడిన ప్రభువును, ఆలోచించి యాడిన మాటయు, నిదానించి యొనరించిన కృత్యమును నెన్నడు హాని కలిగింపవు. కాబట్టి బాగుగా నాలోచింపనిదే యేపనియు జేయరాదు.

చిత్రగ్రీవుడు పలికిన యీమాటలు విని యొక పావురము నవ్వి గర్వముతో నిట్లనెను. "ఎల్లపుడు నిట్టి యుపయోగములేని శంకలు పెట్టుకొన్నచో నాహారము సంపా దించుకొని జీవించుటయే కష్టమగును. అసూయగలవాడు, నిందగలవాడు, సంతోషము లేనివాడు, కోపస్వభావుడు, పరులపోషణపై నాధారపడువాడు, నెల్లపుడు సందేహముతో గూడియుండువాడు నను నీ యాఱుగురు దుఃఖభాగులని పెద్దల వచనము" ఈ మాటలు విని పావురములన్నియు నచట వ్రాలి బోయవాడు పన్నిన వలలో దగులుకొనెను.

"లోభము కడు దుష్టగుణము కదా! అన్నివిషయములు దెలిసియుండియు, బరుల సంశయములు దీర్ప నేర్పరు లయ్యు లోభమునకు లొంగి మిగుల గష్టపడుదురు. లోభమె సమస్తదోషములకు మూలము. బంగరులేడి జనించుట యసంభవమయినను శ్రీరామునంతటివాడు లోభపడి హానిజెందెను. ఆపద రానై యున్న కాలమున నెంతటివారి బుద్ధియు మలిన మగును."

వలలో జిక్కిన పావురము లన్నియు సంశయము పనికిరాదని తమ కాలోచనము చెప్పిన పావురమును నిందింప దొడగినవి.

"గుంపునకు ముందు మార్గదర్శకుడుగా నుండరాదు. కార్యము సఫల మయినయెడల ఫలిత మందఱకు సమానమే. కార్యము చెడిపోయినచో నిందమాత్రము మార్గదర్శకునకు వచ్చును."

పావురములు నిందించుట చూచి చిత్రగ్రీవుడు వానితో నిట్లనెను. "ఆపద రానైయున్నపుడు మేలు కూడ గీడుగా మాఱుచుండును. ఇదికేవల మీతని తప్పుగాదు. ఆపద కలిగినప్పుడు తప్పించుకొను నుపాయ మాలోచింపవలయునే కాని యొకరినొకరు నిందించుకొనుట కాపురుషుల లక్షణము. ఆపదనుండి తప్పింపగల సమర్థుడే బంధు వనదగును గాని వృథా నిందాపరుడు బంధువు కాజాలడు.

ఆపదయందు ధైర్యము, నభివృద్ధి గలిగినపు డోర్పు, సభలయందు మాటనేర్పు, యుద్ధములయందు శౌర్యము, కీర్తియం దభిరుచియు, శాస్త్రశ్రవణమునందు వ్యసనము నను నీ గుణములు మహాత్ములకు స్వభావసిద్ధములు. కాబట్టి ధైర్య మవలంబించి ప్రతిక్రియ యాలోచింపదగును.

మన మందఱము నేకీభవించి వలయెత్తుకొని యెగిరి పోవుదుము. "అల్పులమగు మన కీపని యెట్లు శక్య మగు" నని తలపకుడు. అల్పములగు గడ్డిపరకలు పెనవైచుకొని మదించిన యేనుగును సహితము బంధింప గలుగుచున్నవి. అల్పమైన యూక తొలగింపబడిన సారవంతమగు బియ్యపుగింజ మొలకెత్త జాలదు. మన మందఱము గలిసినచో నీపని కష్టము గాదు." అని తమ ఱేడు పలికిన మాటలు విని యా కపోతములన్నియు వల యెగ దన్నుకొని యాకసమున కెగిరిపోయెను.

అనంతర మాబోయవా డది చూచి "యీపక్షులు గుమిగూడి వల దన్నుకొని పోవుచుండెను. నేలపై వ్రాలగానే పట్టుకొందునుగాక" యని తలంచి వెంట బోవుచుండెను. అవి కనుచూపుమేర దాటిపోగా నాతడు నిరాశుడై మరలి తనతావునకు బోయెను.

ఆత డట్లు మరలిపోవుట చూచి "మన కిపుడు కర్తవ్యమేమి?" యని యాపక్షు లడుగగా జిత్రగ్రీవు డిటు లనియెను.

"లోకమున దల్లియు, దండ్రియు, మిత్రుడు నను నీ మువ్వురే నిజమైన హితులు. కడమవా రందఱు దమమేలు కోరిమాత్రమే హితు లగుచున్నారు. నాకు మూషిక రాజగు హిరణ్యకు డను నొక మిత్రుడు గలడు. గండకీ నదీతీరమున జిత్రవనమం దాతడు నివసించుచుండును. ఆతడీ వల గొఱికి మనలను విడిపింపగలడు" అని చెప్పగనే పావురములన్నియు బోయి హిరణ్యకుడు వాసము చేయుచున్న కలుగుదరిని వ్రాలెను.