Jump to content

సంపూర్ణ నీతిచంద్రిక/లఘుపతనక మనెడి వాయసము హిరణ్యకుని చెలిమి గోరుట

వికీసోర్స్ నుండి

లఘుపతనక మనెడి వాయసము హిరణ్యకుని చెలిమి గోరుట

వెంటనంటిపోయి పావురములు సంగతి యంతయు జూచి లఘుపతనక మనెడి బూరుగుచెట్టుమీది వాయసము హిరణ్యకుని కలుగు దగ్గర వ్రాలి "ఓహో! హిరణ్యకుడా! కొనియాడ దగినవాడవు. కాబట్టి నీచెలిమిగోరి వచ్చితిని. దయయుంచి నాకోరిక దీర్పుము" అని పలికెను.

హిరణ్యకు డది విని కలుగులోనుండియే "ఓయీ నీ వెవడవు?" అని ప్రశ్నించెను. ఆకాకి "నేను లఘుపతనక మనెడి వాయసమను" అని బదులు పలికెను. హిరణ్యకుడు విడ్డూరముగా నవ్వి "నీతోడనా మైత్రి? సరిపడువారు మైత్రి చేయుట మంచిది. నే నాహారమను నీవు భక్షకుడవు. కావున నీతో స్నేహము నాకు హానికరము. పూర్వ మొకలేడి యొక నక్క చెప్పిన కపటమాటలు నమ్మి యురులలో దగులు కొని యొక కాకముచేత గాపాడబడినది. నీ కా కథ చెప్పెదను, విను" మని యిట్లు చెప్పదొడగెను.