సంపూర్ణ నీతిచంద్రిక/స్తబ్ధకర్ణుని రాక - సంజీవకుడు కోశాధికారి యగుట

వికీసోర్స్ నుండి

స్తబ్ధకర్ణుని రాక - సంజీవకుడు కోశాధికారి యగుట

అనంతర మొకనాడు పింగళకుని సోదరుడయిన స్తబ్ధకర్ణు డచటికి వచ్చెను. పింగళకు డాతని సగౌరవముగా నాహ్వానించి గౌరవించి యాతని కాహార మొసగుటకై మృగములను జంప స్వయముగా బయలు దేఱుచుండెను. ఆసమయమున సంజీవకుడు "ప్రభూ! చంపబడిన జంతువుల మాంసము నిలువలేదా?" యని యడిగెను.

"కరటక దమనకులకు దెలియవలె" నని సింహము చెప్పెను. "ఉన్నదో లేదో తెలిసికొనుట మంచిది" అని సంజీవకు డనెను. పింగళకుడు వర్తమానించి తెలిసికొని "మాంసము నిలువ లే" దని చెప్పెను. "మాంసమంతయు గరటక దమనకులే తినివైచుచుండిరా?" యని సంజీవకుడడిగెను. "ఔను ప్రతిదిన మట్లే జరుగుచుండెను" అని పింగళకు డనగా సంజీవకుడు "ఈపని ప్రభువుల యెఱుకలోనే జరుగుచుండెనా?" యని యడిగి "నాకు, దెలిసియు దెలియకయు జరుగుచుండె" నని పింగళకుడు చెప్పగా సంజీవకు డిట్లు విన్నవించెను.

ప్రభూ! ఇది యెంతమాత్రము దగదు. ఆపదకు బ్రతిక్రియ యొనరించుట దక్క మఱేపనియు బ్రభువునకు నివేదింపకుండ భృత్యుడు తనంతదాను స్వతంత్రించి చేయరాదు. కమండలువు తనలోని సారమంతయు ద్యజించి యజమానుని మేలునకై మిక్కిలి జలమును గ్రహించునట్లు మంత్రియైనవాడు ప్రభువునెడల వర్తింపవలయును. కోశము బెంపు సేయువాడే నిజమైన మంత్రి. ఏలయన; రాజునకు గోశమే ప్రాణములు గాని, ప్రాణములు గావు. పురుషున కేయితరగుణములచేతను గోశసమృద్ధివలన వచ్చినంత గౌరవము రాజాలదు. ధనహీను నాలుబిడ్డలే నిరాదరింతు రన నితరుల మాట సెప్పనేల? అతివ్యయము, సపరిశీలనము, సధర్మార్జనము, గోశవ్యసనమునకు లక్షణములు. ఆదాయము గుఱుతింపక స్వేచ్ఛగా వ్యయము చేయువాడు కుబేరతుల్యుడయినను ననతికాలమున జేటు నొందును."

సంజీవకుని పలుకులు విని స్తబ్ధకర్ణు డిట్లు పలికెను. "సోదరా! వినుము. సంధి విగ్రహాది కార్యములందు సమర్థు లును జిరకాలమునుండి యాశ్రయించి యున్నవారు నగు కరటకదమనకు లెన్నడు గోశాధికారమున నియోగింప దగినవారు గారు. ఉద్యోగప్రసక్తిలో నేను వినియున్న ధర్మములు తెలుపుదును. వినుము.

బ్రాహ్మణుడు క్షత్రియుడు, బంధువు గోశాధికారమున నియోగింపదగరు. బ్రాహ్మణుడు సంపాదింపబడిన ధనము కష్టకాలమున నైన వినియోగింపడు. క్షత్రియు డన్నిటికి ఖడ్గము జూపును. బంధువు జ్ఞాతిభావముచేత సమస్తము నాక్రమించి హరించును. చిరసేవ యొనరించు నియోగి దోషమునకైనను వెఱవక స్వామిని లెక్కగొనక నిరంకుశుడై చరించును. ఉపకారినెన్నడు గోశాధికారమున నియమింపరాదు. తానొనరించిన యుపకారము నిమిత్తముగా జేసికొని నిత్యము రాజసన్నిధానమున జరించుచు దానే రా జన్న ట్లాతడు చరించును. సమృద్ధిగలవానిని మంత్రిగా నియమించిన నసాధ్యుడగును. సమృద్ధి చిత్తవికారము గలిగించును.

పిండినకొలదియు ద్రవించు దుష్టవ్రణమువలె నుద్యోగులు ప్రభుని యంతస్సారము బీల్చివేయుదురు. ఎంతపిండినను దడివస్త్రము పయోధారల నొసగ జాలనట్లెంత యొత్తుడు గలిగినను నుద్యోగులు హరించిన ధనము దెచ్చి యీయరు. ఈ విషయము లన్నియు బాగుగా నాలోచించి సందర్భానుసారముగా మెలంగవలయును." సోదరుని యీ మాటలు విని పింగళకుడు "అది నిజమేయగును. కరటకదమనకు లీమధ్య నన్నివిధముల నాయాజ్ఞలకు బద్ధులై యుండుచున్నట్లు గానరాదు." అని చెప్పగా మరల స్తబ్ధకర్ణుడిట్లనెను.

"ఆజ్ఞ మీఱెడి వారిని క్షమించెనేని నాతనికిని జిత్రప్రతిమకు భేధమేమి? సోమరియైన వానికి గీర్తియు, సరళతలేనివానికి స్నేహమును, నింద్రియ నిగ్రహము లేని వానికి గులమును, ధనాశాపరునకు ధర్మమును, లుబ్ధునకు సౌఖ్యమును, వ్యసనములు గలిగియుండు వానికి విద్యాఫలమును, మంత్రుల విషయమై యేమఱియుండు నరపతికి రాజ్యమును నచిరకాలమున జెడిపోవును. కావున సోదరా! తప్పక నామాట పాటింపుము. సస్యము మాత్రమే తిని జీవించు సంజీవకునిం గోశాధిపతిగా నియమించుట యుక్తమని నాయూహ."

ఇట్లు పలికిన సోదరుని మాటల కంగీకరించి యప్పటి నుండియు బింగళకుడు సంజీవకుని గోశాధికారమున నియోగించెను. ఈ విధముగా బింగళక సంజీవకుల స్నేహము మఱింత ప్రబలెను. అంతేకాక యితరబంధువులందును, మంత్రులందును బింగళకుని కాదరము తగ్గిపోయెను.