సంపూర్ణ నీతిచంద్రిక/సింహము పనియంతయు నెఱవేర్చి చెడిన పిల్లి కథ
సింహము పనియంతయు నెఱవేర్చి చెడిన పిల్లి కథ
ఉత్తరదేశమం దర్బుదశిఖర మనెడి యొక పర్వతము గలదు. అందు దుర్దాంతుడను మహాబలముగల సింహము వసించుచుండెను. అది కొండగుహలో సుఖముగా నిదురించు చుండునపు డొక యెలుక రోజును కేసరములు గొఱుకు చుండెను. ఆసింహము పట్టుకొన బోగా నది దొరకక కలుగులోనికి బాఱిపోవుచుండెను.
అపుడు దుర్దాంతుడు క్షుద్రశత్రువును బలముచే సాధించుట కష్టము. అట్టివానిం జంపుటకు వానికి దగినవాడే యుండవలయును." అని యాలోంచి యొక గ్రామమునకు బోయి కడుశ్రమతో దధికర్ణు డనెడి మార్జాలమును నమ్మించి తీసికొనివచ్చి గుహలో దనయొద్ద నుంచుకొని యాహారాదులచే దానిం బోషించుచుండెను. దాని భయము వలన మూషికము కలుగువెడలి వచ్చుటకే భయపడు చుండెను. అందువలన గేసరములు కొఱుకుబాధ తప్పి యా సింహము సుఖముగా నిదురించుచుండెను. ఎలుక చప్పుడు వినవచ్చి నపుడెల్ల బిల్లికి దుర్దాంతుడు మాంసాహార మొసగి ప్రోత్సహించుచుండెను.
పిమ్మట గొంతకాలమైన తరువాత నాకలికి దాళలేక యాయెలుక కలుగు వెడలివచ్చి పిల్లిచే భక్షింపబడెను. అనంతరము చాలకాలమువఱకు నెలుక చప్పుడుగాని యెలుక గాని దుర్దాంతునకు గనబడలేదు. ఆ కారణమున దుర్దాంతుడు దధికర్ణున కాహార మిడుటయం దశ్రద్ధవహించుచు గొంతకాలమునకు బూర్తిగా మానివైచెను. దధికర్ణుడును దిండిలేక క్రమముగా బలహీనుడై కృశించి మరణించెను. కాబట్టి యెన్నడును బ్రభువును నిరపేక్షునిగా జేయరాదు." అని పలికి కరటకుని నొక చెట్టుక్రింద గూరుచుండ నియమించి సంజీవకుని యొద్ద కేగి యిట్లు పలికెను.
"ఓ వృషభేంద్రా! ఈయడవిం గాపాడుటకై మృగ రా జగు పింగళకునిచే నియమింపబడిన సేనాధిపతి కరటకు డిట్లాజ్ఞాపించుచున్నాడు. "త్వరితముగ నాకడకు రమ్ము. లేదేని యీ యడవినుండి దూరముగ దొలంగి పొమ్ము. ప్రభువు కోపించిన యెడల గలుగు ఫలితము లెఱిగియే యుందువు. ప్రభువుల కాజ్ఞాభంగము, బ్రాహ్మణుల కనాదరము, స్త్రీలకు పృథజ్మందిర నివాసము శస్త్రమక్కఱ లేని చిత్రవధ వంటిది."
సంజీవకుడు మిగులభయపడి చప్పున గరటకుని కడకు బోయి సాష్టాంగనమస్కారముచేసి "సేనాపతీ! నే నెఱుగక చేసిన తప్పు లున్నచో క్షమింపుము. ఇక నీయాజ్ఞానుసారముగా మెలగుదును." అని విన్నవించుకొనెను.
అది విని కరటకుడు "ఓవృషభమా! నీవు మా యరణ్యమున నివసించుచున్నావు. కావున మాప్రభువుని కడకు వచ్చి నమస్కరించి విధేయుడవై యుండుము." అని యాజ్ఞా పూర్వకముగా బలికెను.
దానికి సంజీవకుడును "నా కభయ మొసగుము. నీయానతి చొప్పున వచ్చి స్వామిసేవ చేయగలను." అని వేడుకొనగా గరటకుడు "భయపడకుము. సింహము మేఘ గర్జనలకు తిరిగి గర్జించునుగాని నక్క కూతలు లెక్క సేయదు. వాయువు సమున్నతములైన వృక్షములనే పెల్లగించునుగాని వంగియుండు తృణముల జోలికి బోడు. నీవును వినయ విధేయతలతో మెలగిన మారాజు పింగళకుడు నీ కేహానియు జేయడు సరిగదా! నీకేదైన నుద్యోగము కూడ నొసగి గౌరవించును." అని పలికెను.
ఈవిధముగా సంజీవకుని లోబఱచుకొని కూడ దీసికొని పోయి యాతని గొంతదూరమున నుంచి కరటక దమనకులు పింగళకుని సమీపమునకు బోయిరి. రాజునకు వందన మొనరించి కూరుచున్న యనంతరము "దమనకా! నీవు పోయినపని యేమైనది? శబ్దకారణ మెఱిగి యావైరియెవ్వడో తెలిసికొంటివా?" యని పింగళకుడు ప్రశ్నించెను.
దమనకుడు "దేవా! అంతయు మనవిచేయు చున్నాను. మీ రూహించి నటు లాతడు మహాజంతువే కాని క్షుద్రజంతువుకాడు. అయినను దమకు విధేయుడై వర్తింప దలచినవాడు కాని విరోధమునకు బూనుకొను వాడుగాడు. స్వామి యనుగ్రహమున్నచో నుద్యోగిగా నుండి సేవచేయ గలడు. ఆజ్ఞ యైనచో రప్పించెదను." అని విన్నవించెను. పింగళకు డందుల కంగీకరించెను. దమనకుడు బయటికివచ్చి సంజీవకుని రాజు నెదుటికి గొనిపోయెను.