సంపూర్ణ నీతిచంద్రిక/పొలికలని యందలి నక్క కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పొలికలని యందలి నక్క కథ

పూర్వమొక నక్క యాకలిగొని వనమం దాహారమునకై తిరుగాడుచు విసువొంది యదృష్టమువలన దుద కొకయుద్ధ భూమిం గాంచెను. అందు గుప్పలుగా గూలినరధములు, నవయవములు, పలురకములుగా ఖండితములై పడియున్న యేనుగులు, గుఱ్ఱములు, సైనికసమూహములు నిండుగా నుండెను. ఆనక్క యవియన్నియు జూచి సంతసముతో వాని దినుటకై దగ్గఱికి బోవుచుండగా నేదో యొక పెద్దచప్పుడు వినబడెను. ఆధ్వనితో గుండె లదరి యది పాఱిపోవ దలచెను. కానియంతలో నేమి దోచినదో యాధ్వని విన వచ్చిన దెసకు బరికించి చూచెను. దూరమున నొకచోటబడియున్న దుందుభియను వాద్యముపై జెట్టుకొమ్మ గాలికి గదలి గట్టిగా దగులుచుండుటవలన నది బిగ్గఱగా ధ్వని చేయుచుండెను. అపు డా నక్క దాని దగ్గరికిబోయి యది కొఱికి చూచి యందు బ్రవేశించి బయటికి వచ్చెను. అట్లు భేరీముఖమందలి చర్మము గొఱికివేయగానే యాధ్వని నిలిచిపోయెను.

అపు డాజంబుకము "ఎంతపొరపడితిని. ఇంత యాహారము విడిచిపెట్టి యీశబ్దమునకు జడిసి పాఱిపోవుటకు సిద్ధపడితిని" అని యనుకొనుచు సంతసముతో గావలసినంత యాహారము దిని తనదారింబోయెను. కావున నాధ్వనికి గారణ మరసి ప్రతిక్రియ చేయుదు" నని పలికెను. పింగళకుడు "సరే" యని సెలవిచ్చి పంపెను.

దమనకు డట్లు బయలుదేఱి పోవుచుండ వానివెంట నరిగి కరటకు డిటు లనియెను. "భయమునకు గారణ మెఱుంగకుండ, నది తొలగింప శక్యమైనదో కాదో తెలియకుండ భయప్రతీకారమునకు శపథముచేసి రాజసత్కారము నొందితిమి. ఉపకారము జేసియేకాని యెవ్వరివలన గానుకలు గ్రహింపరాదు. అందునను రాజువలన నెంతమాత్రము స్వీకరింపరాదు. ఏలయన రా జనుగ్రహించెనేని సంపదలు, విక్రమించినయెడల విజయము, గోపించినయెడల మృత్యువును గలిగింపగల సమర్థుడై యుండును. ఎట్టివాడైనను రాజు నవమానింపరాదు. రా జన నరరూపమున నుండు దైవమే కాని యన్యుడుగాడు." అనుమాటలకు దమనకుడు నవ్వి యిటులనియెను.

"నఖుడా! నీ కేమియు నాందోళన మవసరము లేదు. భయకారణము దెలిసియేయున్నది. అది వర్థమానుడను వణిజునిచే నడవియందు విడువబడిన యెద్దు వైచిన ఱంకెయే గాని యన్యము గాదు. వృషభములు మనముకూడ సులభముగా భుజింపదగినవి. రాజువిషయమై సందియ మేల?" యను దమనకుని పలుకుల "కట్లైన ముందే స్వామికి దెలిపి యాతని భయము మానుపరాదా?" యని కరటకుడు ప్రశ్నించెను.

దానికి దమనకుడు "వెంటనే భయము మాన్పించిన మనకు జిరకాలగౌరవ మెటులు గలుగును? భృత్యులెన్నడును స్వామి నిక దమ యవసరములేని స్థితికి దేరాదు. ప్రభుని యవసరములన్నియు మిగులకుండ దీర్చువాడు దధి కర్ణునివలె జెడును. నీకా కథ యెఱింగించెదను వినుము.