Jump to content

సంపూర్ణ నీతిచంద్రిక/దమనకుడు పింగళకుం జేరుట

వికీసోర్స్ నుండి

దమనకుడు పింగళకుం జేరుట

అనంతరము దమనకుడు వచ్చుచుండుట దూరము నుండియే చూచి పింగళకుడు దగ్గఱకు బిలిపించుకొనెను. దమనకుడును సాష్టాంగనమస్కారముచేసి కూరుచుండెను. తరువాత రాజు"చాలకాలమునకు గనబడితివి. సేమమా?" యని యడిగెను.

"ప్రభువులకు నావంటి యల్ప సేవకునివలనఁ బ్రయోజన మేమియుండును? అందుచేతఁ దఱచుగా వచ్చుటలేదు. సర్వసమర్థులగు మీ సత్పరిపాలనమున మాసేమమునకు లోటేమి యుండును? ఎంతటి యల్పుడైనను సమయము వచ్చినప్పుడు భృత్యుడు ప్రభువునకు దగిన యాలోచనము సెప్పుట ధర్మమని మీ దర్శనమునకు వచ్చితిని. పల్లు కుట్టుకొనుటకును, చెవి గోకికొనుటకును నెంతవారికిని గడ్డిపుల్లకూడ నుపయోగపడు చుండఁ గాలుసేతులు గల జంతు వెపుడైన నుపయోగింప కుండునా?

ధైర్యము గలవాని కవమానము గలిగినను మతిసెడదు. దివిటీ తలక్రిందుగా బట్టుకొన్నను దాని మంటలు మీదికి బ్రసరించుచునే యుండునుగాని క్రిందికి బ్రసరింపవు గదా! ప్రభువు లెఱుగని దేముండును? మణి పాదములందు దొరలినను దాని ప్రభ చెడదుగదా! గాజుముక్కను శిరమున ధరించినను దానికి శోభగలుగఁ జాలదు. పరిజనులందఱియందు భేదములేక రాజొకే తీరున వర్తించినయెడలఁ గ్రియాదక్షులగు వారు నిరుత్సాహు లగుదురు. పురుషులలో నుత్తములు, మధ్యములు, నధములు నని మూడు విధములు. వారిని మూడు రకముల పనులయందును నేలిక నియోగింపవలయును. వారికి వారికిఁ దగిన పనులందు యోగింపక వ్యత్యస్తముగాఁ జేసినచో జూడామణి పాదములందును గాలియందె తలయందును దాల్చి నట్లగును. బంగరు నగలయందు దాపింపవలసిన మణి యిత్తడియందు బొదిగినయెడల నారత్నమున కేమియు లోటురాదు. భృత్యులకు దగిన గౌరవమొసగని దోసము రాజుదే యగునుగాని భృత్యులది గాదు.

అశ్వము, ఆయధము, శాస్త్రము, వీణ, విద్య, నరుడు, నారియు నుత్తములప్రాపుచే గణన కెక్కుటయు నధముల సాంగత్యమున జెడుటయు లోకప్రసిద్ధములు, అసమర్థున కెంతభక్తి యున్నను, శక్తిమంతు డపకారియైనను నుపయోగ మేమి? రాజావమానమొందిన పరిజనునకు మతిసెడును. వానిం జూచి బుద్ధిమంతు డెవ్వడు రాజసమీపమున కేగుటకు వెఱచును. పండితులు వీడినరాజ్యమున నీతి సెడును. నీతి చెడినపుడు సకలము జెడిపోవును. రాజుగౌరవ మొందిన వాని నందఱు గౌరవించెదరు. రా జనాదరించినట్లు తెలిసిన జనులందఱు నవమానింతురు. ఉచితమైన దానిని బాలుడు తెలిసినను గ్రహింపదగును. రవిలేని సమయమున జిఱుదీప ముపయోగింపకుండునా?" యని దమనకుడు పలుకుచుండ బింగళకు డిటు లనియెను.

"దమనకా! ఇంతగా జెప్పనేల? నీవు మాకు బరమాప్తుడవు. కడు యోగ్యుడవు. ఇంతకాల మేదో దుష్టుల బోధవలన రాకపోకలు తగ్గించితిని. ఇపుడు స్వేచ్ఛగా నీవు చెప్పదలచిన ముఖ్యాంశములు చెప్పుము." అను రాజు మాటలు విని దమనకుడు "మనవి చేసి కొనుచుంటిని. ప్రభువువారు నీరు ద్రావుటకై యమునకు బోవుచు నీరు ద్రావకయే వెఱ గొంది వెనుదిరిగివచ్చినట్లు కానబడుచున్నది. ఇందులకు గారణము దెలిసికొని యవసరమైన సేవ చేయదలచి దర్శనమునకు వచ్చితిని" అని వినయమున బలికెను.

అంతట బింగళకుడు "దమనకా! అడుగ దగిన యంశమే యడిగితివి. ఈరహస్యము దెలిపి యాలోచన మడుగుటకు నమ్మదగినవా డొక్కడును గానరాకున్నాడు.

ప్రస్తుత మీవనమున కేదో యొక పపూర్వ మృగ మేతెంచియున్నది. కాబట్టి మన కియ్యది విడువదగినదని తోచుచున్నది. ఆకారణమున వెఱగొంది యుంటిని. ఇంతకు ముందే యొక మహాధ్వని వినవచ్చినది. ఆశబ్దము బట్టి చూచిన నాజంతువు మహాబలముగలదై యుండవలయును" అని పల్కెను.

అది విని దమనకుడు "ఔను; ఆధ్వని మేమును విని యుంటిమి. అది భయము గలిగించునట్లుగనే యున్నది. అయినప్పటికి నాలోచన లేకుండ ముందుగానే దేశత్యాగము చేయుటకును, యుద్ధమునకు బూనుకొనుటకు మంత్రియైన వా డెట్లు ప్రోత్సహించును? ఇట్టి విషమ పరిస్థితులలోనే భృత్యుల సారము దెలియవలయును. బంధువులు, భృత్యులు, స్త్రీలు ననువారి బుద్ధియు, సామర్థ్యము నాపద లనెడి నొఱపురాళ్ళ యందే తేలిపోవును. నే జీవించియుండగా దమకు భయమక్కఱలేదు. కరటకుడు మున్నగువారి గూడ గొంచెము చేర దీయుడు. ఏలయన, నాపత్సమయములందు బురుష సాహాయ్య మెంతయు నవసరము." అని చెప్పెను.

పిమ్మట గరటకుని గూడ బిలిపించి పింగళకుడు వారిర్వురను సర్వవిధముల గౌరవించెను. అపుడు దమనకు డిట్లనెను. "ప్రభూ! ధ్వని విన్నంతమాత్రామున భయపడరాదు. ధైర్యము వహించి కారణము దెలిసికొని ప్రతిక్రియ యాలోచింపవలయును. ఈయర్థము దెలుపు కథ యొక్కటి గలదు. వివరించెదను; జిత్తగింపుడు.