సంపూర్ణ నీతిచంద్రిక/పరుల యధికారము మీద బెట్టుకొని మరణించిన గాడిద కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పరుల యధికారము మీద బెట్టుకొని మరణించిన గాడిద కథ

వారణాసి యందు గర్పూరపటు డను నొక చాకలి గలడు. వాడొక నాటి రాత్రి, పగలంతయు బట్ట లుదికిన బడలికచేత నొడలెఱుంగక నిదురించుచుండెను. అర్థరాత్రమున వాని యింటియం దొక దొంగ ప్రవేశించెను. వాని యింటిముందు గాడిద యొకటి కట్టివేయబడి యుండెను. ఆయింటి కావలికుక్కయు నచటనే కూరుచుండి యంతయు జూచుచుండెను. అపు డచటి గాడిద కుక్కతో "సఖుడా! దొంగ యింట జొచ్చుట చూచి యుంటివి గదా! గట్టిగా మొఱిగి యజమానుని మేల్కొల్పుటకు బ్రయత్నింపవేల? ఇది నీపని కాదా?" యన శునక మిట్లనెను. "నావిధిని గుఱించి చర్చింప నీకేమి యవసరము? నీవేమి యెఱుగుదువు. రాత్రియు బవలు గష్టమనక యీయిల్లు గాచుకొని యుందును. యజమానుడు నాయుపయోగము గొంచెమైనను గ్రహింపకున్నాడు. నా కాహార మవసర మనెడి యూహయే యాతనికి లేదు. అవసరము లేనపు డధికారులకు సేవకులయం డాదరము తొలగి పోవుటలో నాశ్చర్య మేమున్నది?"

ఆ మాటలు వినుసరికి గార్దభమునకు గోపము వచ్చెను. "పని గలుగునపుడు లంచమడుగు భృత్యుడు, మిత్రుడు నీచులు" అని పలుకగా "గార్యకాలమున మాత్రమే భృత్యులయం దాదరము జూపు ప్రభువు యోగ్యు డెట్లగు"నని శునకము గార్దభమును బ్రశ్నించెను.

దానికా గాడిద మఱింతగా గోపించి "యాపత్కాలమున స్వామికార్యము విడనాడు నీవు పాపాత్ముడవు. పోనిమ్ము. నీతోడనే యున్నదా? ఏలికను లేపి నాఋణము దీర్చు కొందును." అని పలికి గట్టిగా నోండ్రపెట్టెను. ఆధ్వనికి గాడనిద్రలోనున్న రజకుడు మేలుకొని నిద్రాభంగమైనదని కోపించి యొకబడియ చేతబట్టుకొని తిన్నగా గాడిద యొద్దకు బోయి దానిం జావమోదెను. ఆదెబ్బ లాయువుపట్టున దాకి వెంటనే యది మరణించెను. కావున "బరుల యధికారము మనకేల?" యని పలికితిని. చచ్చిన పసరముల వెదకి కొనుటయే మనపని. మనకు గావలసినంత తిండి దొరకును. పోవుదము రమ్ము." అని కరటకుడు చెప్పినదంతయు విని దమనకు డిటు లనియెను.

"ఏమీ! తిండికొరకే కేవలము రాజును సేవింప వలయుననియా నీ యుద్దేశము? నీవు చెప్పినది మిక్కిలి యనుచితము. మిత్రులకు మేలును, విరోధులకు హానియు జేయదలచి బుద్ధిమంతులు రాజు నాశ్రయింప గోరుచుందురు. ఏదోవిధమున బొట్ట నింపుకొనలేకపోవుదుమా? విప్రులకు, బంధుమిత్రాదులకు నుపకారము చేయగల జీవితమే ధన్యమైనది. తనపొట్ట నిండించుకొనుటకు మాత్రమే యత్నించుచుండువాని జీవితము నొక జీవితమే యగునా? కాకి కడుపు నింపుకొనుచు నెంతకాలము జీవించిన నేమి ప్రయోజనము.

మాంసములేని వట్టి యెముక దొరకి నంతమాత్రము ననే కుక్క మిక్కిలి సంతుష్టినొదును. జంబుకములుమున్నగు జంతువులు వేలకొలదియు జెంత దిరుగులాడుచున్నను సింహము వానిదెస గన్నెత్తి చూడక యేనుగుల కుంభస్థలములు చీల్చి మెదడు భక్షించుటకై యత్నించుచుండును. ఎవ్వరైన దమ సామర్థ్యమునకు దగిన ఫలమునే కోరుదురు. కుక్క తనకు దిండిపెట్టువాని జేరి తోకాడించును. చరణములు చాచి నేలపై బడి కడుపు, నోరుజూపును. ఇన్నిపాట్లు పడినను దాని కొకటి రెండు ముద్దులకంటె నెవ్వరు నెక్కువ పెట్టరు. ఏనుగు గంభీరముగా జూచుచు మంచి మాటలచే బతిమాలించుకొనుచు నాహారము గైకొనును. పౌరుష జ్ఞానకీర్తులచే బ్రసిద్ధి నొందినవాని బ్రదుకే బ్రదుకు. ఎంగిలి మెదుకు లేఱికొని తిను కాకి కేమి గౌరవముండును? మంచి చెడ్డ లెఱుగక యందఱిచే నిందింపబడుచు నుదరపూరణమే ముఖ్యముగా దలచువాడు పశువుకన్న నధముడు."

ఈవిధముగా దమనకు డిచ్చిన యుపన్యాసము విని కరటకుడు "మనము ప్రధానులము గానపు డింతియాలోచనము మనకేల?" యన దమనకు డిట్లు జవాబిచ్చెను.

"ప్రధానులగుట కెంతకాలము గావలయును! తాము గావించు కృత్యములే జనులను గౌరవనీయులగు ప్రధానులుగాను, ఖలులుగాను జేయుచున్నవి. మానవులకు గౌరవగౌరవములు వారి ప్రవర్తనముం బట్టియే కలుగుచుండును. ఖ్యాతి గాంచుట కష్టము. నిందపడుట తేలిక. బండరాయి కొండ మీది కెక్కించుట మహాకష్టము. కొండమీదినుండి క్రిందికి ద్రోచివైచుట కడు సులభము. నూయి ద్రవ్వువాడు చుట్టు బ్రాకార మేర్పఱచుకొనుచు దన చర్యచేతనే క్రమముగా గ్రిందికి దిగిపోవునట్లు మానవుడు తన కృత్యములచేతనే యధస్థ్సితిం జెందును. దమనకుని పలుకులు విని తుదకు గరటకుడు "సరే నీమాటలు యుక్తముగనే యున్నవి. ఇపుడేమి చేయవలయు నని నీతలంపు?" అని యడిగెను.

"మహారాజు నీరుద్రావుటకై యమునకు బోయి యెద్దుఱంకె వినియే భయపడి యదియేమో గుర్తింపలేక మరలి యింటికి బోయి విషణ్ణుడై యున్నాడు. ఇందు దెలియని దేమున్నది? ఈసంగతి యెవ్వరును జెప్పనక్కఱ లేదు. నోట జెప్పిన విషయములు పశువులు, హయములు, గజములు, సర్పములు గూడ గ్రహింప గలవు. చెప్పకుండ నాకారాదులచే బరుల యూహలు గ్రహింప గలవాడే పండితుడు. నేనిపుడు మనరాజు దగ్గఱకుబోయి సందర్భము ననుసరించి యవసరములయిన మాటలు సెప్పి యాతనిభయము బోగొట్టి యాతని బ్రసన్నునిగా జేసికొందును.

"సందర్భమునకు దగిన మాటలు, మంచితనమునకు దగిన ప్రియవచనములు, శక్తికి మించని కోపము గలవాడే నినేకి" యని దమనకుడు చెప్పగా "నీవు సేవాధర్మము నెఱుగవు. చూడుము. పిలువని పనికి బోవువాడును, నడుగనిదే సమాధాన మిచ్చువాడును, దనవిషయమున బ్రభువు ప్రీతుడై యుండెనని నమ్మువాడును నవివేకులు" అని కరటకు డనెను.

దానికి దమనకుడిట్లు జవాబిచ్చెను. "నేనుసేవాధర్మమునెఱుంగ కుండుటేమి? సహజముగా సుందరమైనను గాకు న్నను నెవరికేది యిష్టమో యది సుందరముగనే కనబడును. ఎవనికేయది ప్రియమగునో తెలిసికొని బుద్ధిమంతుడు వానిని దనకు సముఖునిగా జేసికొనును. "అది నాపనిగాదు. సరిగా నాజ్ఞాపింపుము" అనిపలుకక యథాశక్తిరాజాజ్ఞను నెఱవేర్చు చుండవలయును. అధికమైన ప్రతిఫలము గోరనివాడై నీడవలె ననుసరించుచు నాజ్ఞకెదురాడక ప్రాజ్ఞుడు రాజసేవయందు బ్రవర్తింపవలయును.

ఏదైననొకవేళ రా జవమానము కలిగించునేమో యను నూహించి రాజసన్నిధి వీడరాదు. ఏదైన గీడుకలుగునని కర్తవ్యము విడుచుట యవివేకుల లక్షణము. అజీర్ణము కలుగునేమోయని భోజనము మానివైచు మూర్ఖుడెవ్వడైన నుండునా? అకులీనుడు, విద్యాహీనుడు, నయోగ్యుడునైనను సర్వదా కనిపెట్టుకొనియుండువానిని రాజు లాదరింతురు. రాజులు, లతలు, వనితలు తఱుచుగా దగ్గఱనున్న వానిపై నభిమానము చూపుట సహజము" అనిన విని గరటకు డంగీకరించి "సరే! నీవిపు డట కేగి యేమి పలుకుదువు?" అని ప్రశ్నింప దమనకు డిట్లు చెప్పెను.

"ముందుగా బ్రభువు నాకు సుముఖుడో, కాడో తెలిసి కొందును. దూరమునుండి చూచుట, మనవిచేయునపు డాదరము గలిగి వినుట, పరోక్షమున సుగుణముల నెన్నుట, ప్రియ విషయములు తటస్థించి నపుడు స్మరించుట, దానము, ప్రియ వచనము లాడుట, దోషములు గుణములుగా గ్రహించుట సుముఖుని చిహ్నములు. మఱియు గాలయాపనము, నాశలు రేకెత్తించుట, ఫల మొసగకుండుట, విముఖుని లక్షణములు. బుద్ధిమంతు డీసంగతులన్నియు గుర్తింపవలయు. ఇన్ని విధములు నెఱిగి పింగళకుని స్వాధీనుని జేసికొందును.

అన విని కరటకుడు "అయినను సమయోచితము గాని ప్రాస్తావము జేయకుము. బృహస్పతితో సమాను డైనను సమయోచితములు గాని పలుకులచేత నవమానము నొందును. అనిపలుకగా దమనకుడు "మిత్రుడా! కరటకకుడా! భయపడకుము. సమయ మెఱుగక మాటలాడను. ఆపదయందును నపమార్గముల బోవునపుడును నడుగకున్నను భృత్యుడు స్వామిహితమును గోరి సంభాషింపవలయును. అవసరమయినపుడు కూడ "మనకేల" యని యాలోచనము సెప్పకయూర కుండు నెడల సేవకుని యునికియే నిరుపయోగము. కాబట్టి సఖుడా! నాకు బోవుటకు సెలవిమ్ము" అని కోరెను. కరటకుడును "శుభమగుగాక. నీదారి సుగమ మగుగాక! నీకు యుక్తమని తోచిన విధమున జాగరూకుడవై ప్రవర్తింపుము. పోయిరమ్ము." అని దమనకుని బంపెను.