సంపూర్ణ నీతిచంద్రిక/సన్న్యాసిని మోసగించిన యాషాడభూతి కథ
సన్న్యాసిని మోసగించిన యాషాడభూతి కథ
పూర్వము దేవశర్మయను నొక సన్న్యాసియుండెను. అతడు సన్న్యసించినను లోభగుణము విడువలేకుండెను. జనులకు నిత్యము వేదాంతవిషయము లుపన్యసించుచుండువాడు. వారు భక్తితో దెచ్చియిచ్చు కానుకలయెడ ననాదరము జూపువాడు. కాని వారిం జిన్నబుచ్చ నిష్టములేని వానివలె నటించి యవి స్వీకరించుచుండువాడు. ఇట్లు సంపాదించిన ధనమంతయు నొక బొంతలో నుంచి యెవ్వరికి దెలియకుండు నట్లు దానిం గుట్టి మీద గప్పుకొని దేశసంచారము చేయు చుండువాడు.
ఆషాడభూతి యను పేరుగల వంచకు డీవిషయము గుర్తించెను. అతడా సన్న్యాసింజేరి యధికమైన భయభక్తు లతో బరిచర్యలు సేయుచుండెను. మఱియు వేదాంతార్థము లెఱుగగోరిన వారివలె నటించుచు నాతని నమ్మించి యాతని వెంట దేశాటన మొనరించుచుండెను.
ఒకనాడు వారిరువురు దారి బయనము సేయు చుండగా నాషాడభూతి యొకచోట దటాలున నిలిచెను. తనబట్ట కంటుకొనియున్న యొక పూరిపుడక చేతబట్టుకొని దేవశర్మకు జూపి "స్వామీ! నిన్నరాత్రి మనము నిదురించిన వారియింట నీపూరిపుడక నావస్త్రమున కంటుకొన్నది. ఇది వారి సొమ్ము. పరులసొమ్ము తృణమైన నపహరించుట ధర్మముగాదు. కాబట్టి యిది వారి కిచ్చి వచ్చెదను" అని పలికి కొంతదూరము వెనుకకు బోయి దాని నచట బాఱవైచి పిమ్మట దేవశర్మను గలిసికొనెను.
ఈ చర్య కా సన్న్యాసిని కడు నచ్చెరువొందెను. ఆతని నిస్పృహకు మనసున మెచ్చుకొనెను. తాను ధరించుచున్న బొంత మోయుటకు బద్ధకించి దానిని శిష్యునకిచ్చి పదిలముగా దీసికొనిరమ్మని చెప్పెను. వాడు మిక్కిలి సంతసించి యాబొంత నెంతయో జాగరూకతో మోయుచుండెను. మునుపటికంటె గురువునకు విశ్వాస మధిక మగునట్లు మెలగు చుండెను.
వా రట్లు పయనించుచు నొక యరణ్యమార్గమున నుండగా సూర్యు డస్తమించెను. ఆచటనున్న యొక చెఱువుం జూచి యాచమనము చేయుటకై యా సన్న్యాసి యందు దిగెను. ఆసమయమున నా చెఱువుగట్టుమీద రెండు పొట్టేళ్లు భయంకరముగా డీకొని పోరాడుచుండెను. తలలు పగిలి కారిన రక్తము గాలికి గడ్డకట్టి వాని నడుమ మాంసఖండము వలె నేలమీద గనబడుచుండెను.
ఒకనక్క యదిచూచి మాంస ఖండమే యనుకొని జిహ్వాచాపల్యమున దానిం దినదలచి దగ్గఱి కేగెను. ఇంతలో నంతకుముందు డీకొని మరల డీకొనుటకై వెనుకకు దూరముగా బోయిన పొట్టేళ్ళు మహావేగముగా ముందునకు వచ్చి డీకొనగా నడుమనున్న యానక్క వాని తాకుడునకు నలిగి వెంటనే చచ్చిపోయెను.
చెఱువులలో నాచమనము చేసిన సన్న్యాసి యదిచూచి 'మాంసమందలి యాశయేకదా నక్కకు బ్రాణాంతకమయ్యె' నని తలచుచు గట్టెక్కి శిష్యుని గానక గట్టిగా బిలిచెను. అడవి యంతయు నిటునటు వెదకి చూచెను. ఎచటను వాని జాడ గానరాలేదు. తుద కాతడు తన్ను వంచించి ధనముతో నిండిన బొంత హరించినాడని నిశ్చయించుకొని మిగుల దు:ఖించెను.
కావున స్వయంకృతదోష మనుభవింపకతప్పదు" అని పలికి కొంతసే పాలోచించి "పింగళకసంజీవకులకు జెలిమి యెట్లు గావించితిమో యట్లే వా రిరువురకు మిత్రభేదము గల్పింపవలయును. కార్యభంగము వాటిల్లినపు డెవని బుద్ధి చలింపకయుండునో వాడే యాపద గడచి గట్టెక్కగలడు." అని దమనకుడు చెప్పెను.
"ఎట్టి బుద్ధిమంతున కైన నొక్కొక్కమాఱు పొరపాటు కలుగుచుండును. అందులకై విచారింప నక్కఱలేదు. కాని గాఢముగ హృదయములందు నాటుకొనియున్న పింగళక సంజీవకుల స్నేహమునకు విఘాతము గలిగించుట శక్యమా?" యని కరటకుడు సందేహముతో బ్రశ్నింపగా దమనకు డిట్లు చెప్పెను.
ఉపాయ మున్నచో సాధింపరాని కార్య మేదియు నుండదు. కాబట్టి చక్కని యుపాయ మాలోచింపవలసి యున్నది. పూర్వమొక వాయస ముపాయముచేత శత్రువయిన కృష్ణసర్పముం జంపెను. నీ కా కథ తెలుపుదును. వినుము.