సంపూర్ణ నీతిచంద్రిక/ఉపాయముచే ద్రాచుబామును జంపిన కాకి కథ

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఉపాయముచే ద్రాచుబామును జంపిన కాకి కథ

పూర్వకాలమున నొక మఱ్ఱిచెట్టు మీద గూడు కట్టుకొని వాయసదంపతులు నివసించుచుండెను. ఆ చెట్టు తొఱ్ఱలో నొక కృష్ణసర్పముండి యా కాకి పిల్లలను దినివేయు చుండెను. అందులకు గాకము మిక్కిలి దు:ఖించెను. మరల బ్రసవసమయము రాగా నాడుకాకి ప్రియుని జూచి "నాథా ఈ వృక్షమును విడిచి మఱియొక చోటి కేగుదుము. ఇందలి సర్పము మన సంతతి నెల్లప్పుడు దినివేయుచుండెను గదా! అవినీతురాలగు భార్య, దుష్టుడగు మిత్రుడు, నెదురాడు సేవకులు, సర్పముగల యింటిలో నివాసము నిక్కముగా మహాపాయకరము" అని పలుకగా భర్త యిట్లనెను.

"ప్రియురాలా! భీతిల్లకుము. ఇంతవఱ కీ సర్ప మొనరించిన యపరాధములు సహించితిమి. ఇక నోర్వదగదు. తప్పక ప్రతీకార మొనరించెదను."

ఆమాటలకు "బలవంతునితో విరోధము మేల?" యని భార్య పలుకగా భర్త "నీకు సందేహము వలదు. బుద్ధిబలముగలవానికి దేహబలముతో నిమిత్తము లేదు. బుద్ధిబలములేకున్న శరీరబల మెందులకు గొఱగాదు. మదించిన సింగమును బుద్ధిబలముచేతనే కదా కుందేలు చంపినది నీకా కథ యెఱింగించెదను; వినుము.