సంపూర్ణ నీతిచంద్రిక/బుద్ధిబలమున సింహముం జంపిన కుందేటి కథ

వికీసోర్స్ నుండి

బుద్ధిబలమున సింహముం జంపిన కుందేటి కథ

మందర మనెడి కొండమీద దుర్గాంత మనెడి సింహము గలదు. అది యెల్లవేళల జంతువు లన్నిటిని వేటాడి చంపు చుండెను. ఆ యుపద్రవమునకు దాళలేక యొకనాడు జంతువు లన్నియు సభచేసి యాలోచించుకొని తమ ప్రతినిధిగా నొకజంతువు నాసింహము నొద్దకు బంపినవి. అది సింహమును సమీపించి వినయముతో "మృగరాజా! ఒకేపర్యాయ మనేక జంతువులను జంపినయెడల నీ కేమి లాభము. జంతు సంతతి యంతయు నశించినవెనుక రాజ్యాధిపత్య మెవరిపై వహింతువు. దయచూపితివేని మేమే నీయాహారమునకై దినమునకొక్క మృగమువంతున బంపగలము." అని విన్నవింపగా సింగము 'సరే' యని యంగీకరించెను. నాటినుండియు నాజంతువులు పంపిన యాహారమే తినుచుండెను.

ఇట్లు కొంతకాలము జరిగినవెనుక నొకనా డొక కుందేటికి వంతు వచ్చెను. అపు డది యిట్లు తలపోసెను. "భయ హేతువు గలిగినపుడు ప్రతిప్రాణియు జీవితాశచేత నుపాయము వెదకును. మరణ మెటులైన దప్పనియప్పుడు సింహమునకేల జడియవలయును?" ఇట్లాలోచించుచు నాకుందేలు నెమ్మదిగా వెడలుచుండెను.

సింగ మాకలికి దాళలేక యాకుందేలు కనబడగానే కోపముతో "నీవేల యింత యాలస్యము చేసితివి?" అని యడిగెను. "దానికి స్వామీ! కరుణింపుము. నేను బయలు దేఱి వేగముగా వచ్చుచుండ దారిలో నన్నొక సింహము పట్టుకొని తినబోయెను. 'తప్పక తిరిగి రాగల' నని శపథముచేసి యాసింహమును నమ్మించి వచ్చుసరి కింతయాలస్యమయినది." అని కుందేలు బదు లీయగా సింహము కనుల నిప్పులు రాలునట్లు చూచి మిక్కిలి కోపమున "రమ్ము శీఘ్రముగా నాసింహ మెచ్చటనున్నదో చూపుము. నారాజ్యమునం దింకొక సింహము ప్రవేశించి నాయాహారము నరికట్టుటయా?" యని గర్జించెను. కుందే లిట్లు సింహమును గొంతదూరము తీసికొని పోయి యచటనున్న యొక లోతైన పాడునూయి చూపి "స్వామీ! యిందున్నది; చూడు" మనెను. ఆసింహము బుద్ధిహీనతచే నూతియందు దన ప్రతిబింబము జూచి వేఱొక సింహ మనిభ్రమించి కోప మాపుకొన జాలక గట్టిగా గర్జించుచు నందుఱికి ప్రాణములు గోలుపోయెను.

కుందే లొనరించిన సాహసము విని యాయడవి యందలి జంతువులన్నియు దానిని మిక్కిలి మెచ్చుకొనెను."

ఈమాటలు విని "యిప్పుడేమి యుపాయ మాలోచించితివి?" అని భార్య యడుగగా వాయస మిటులనెను.

ఇచటికి సమీపమున నున్న సరోవరమునందు రాజ పుత్రుడు ప్రతిదినము వచ్చి జలక్రీడ సేయుచున్నాడు. స్నాన సమయమం దాతడు మణులు పొదిగిన తన చేతియుంగరముం దీసి గట్టుపై నిడును. అపుడు దానిని ముక్కున గఱచికొని వచ్చి యీచెట్టు తొఱ్ఱయం దుంచెదను." అనిపలికి యొక నా డావాయస మట్లే చేసెను.

రాజభటులు లాయుధములు చేతబట్టుకొని యుంగరము వెదకుచు నాచెట్టును సమీపించి తొఱ్ఱలో నుంగరముం జూచి యచట 'బుస్సు బుస్సు' మనుచున్న కృష్ణసర్పముం జంపి యాయుంగరము గొనిపోయిరి. కాబట్టి యుపాయముచేతనే పింగళక సంజీవకులకు విరోధము గలిగింపవచ్చును" అని పలికి కరటకుని వీడుకొని పింగళకునియొద్దకు బోయి వందన మాచరించి దమనకు డిట్లనెను.