సంపూర్ణ నీతిచంద్రిక/దమనకుడు పింగళకుని మనసు విఱుచుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దమనకుడు పింగళకుని మనసు విఱుచుట

"ప్రభూ! 'ఆపద గలిగినపుడును జెడుత్రోవ బట్టినపుడు, గార్యసమయము దాటిపోవునపుడును మేలుకోరు మంత్రి రా జడుగకున్నను హితము జెప్పవలయు' నని పెద్ద లందురు. రా జుపభోగమునకు దగినవాడు. కర్తవ్య మేమఱక మంత్రి కనిపెట్టుచుండవలయును. అట్లు చేయని మంత్రి ద్రోహియగును. సమయము వచ్చినపుడు స్వామి కార్య ముపేక్షించుటకంటె మరణము మేలు."

ఇట్లు పలుకుచుండ బింగళకుడు "దమనకా! నీకు సందియము వలదు. చెప్ప దలచినది నిశ్శంకముగా జెప్పుము. నీమనసునకు బాధ కలిగించిన విషయ మెయ్యది?" యని యడుగ దమనకు డిట్లనెను.

"దేవా! మీవిషయమై సంజీవకుని నడవడి యేమియు జక్కగాలేదు. తొలుత నాత డిట్టివాడని యెంత మాత్రము గనిపెట్టలేక పోయితిమి. అచట నచట మీమీద నేరము లెన్నుచు మీసామర్థ్యముం దూలనాడుచున్నాడు. ఆతని వైఖరిం జూచినచో గ్రమక్రమముగా గొలది కాలములో నీరాజ్యమే వశపరచుకొన నూహించు విధము గోచరించున్నది. ఈసంగతి కొంతకాలమునుండి వినుచుండియు నేసంగతి యైనను స్పష్టముగా గమనింపకయే వ్యవహరింపరాదని యూరకుంటిని, కాని యింక నూరకున్నయెడల గార్యము మించిపోవున ట్లుండుటచేత జెప్పక తప్పినదిగాదు. మంత్రులందఱిం బరిత్యజించి సర్వాధికారము లీతని కిచ్చుటవలన నీ యపాయము గలిగినది.

రాజ్యలక్ష్మి, సమర్థుడైన మంత్రియం దొకపాదమును, రాజునం దొకపాదమును మోపి నిలిచియుండి స్త్రీసహజమైన చాపల్యముచేత నొకరిని విడిచి మఱియొకరిం జేరుచుండును. ఒక్కనికే రాజు సర్వాధికారము లొసగినచో నాతడు గర్వించి స్వతంత్రింప నెంచును. స్వాతంత్ర్యమం దిచ్ఛగలిగిన మంత్రి రాజునకు బ్రాణాపాయము గలిగింప సాహసించుటలో వింత యేమి యున్నది?

విషము గలిసిన యన్నమును, గదలిన పంటిని, దుష్టుడగు మంత్రిని సంపూర్ణముగా విసర్జించుటే యుత్తమము. ఎవడు రాజ్యలక్ష్మిని సచివాయత్త నొనరించునో వాడు మంత్రి దుష్టుడైనపుడు గతిలేక దు:ఖ మనుభవించును. సంపద గోరని వాడును లోకమున నుండడు." అని దమనకుడు చెప్పిన మాటలన్నియు విని కొంచె మాలోచించి పింగళకు డిట్లనెను.

"ఓయీ! దమనకా! శరీరము సకలరోగములకు దావలమైనను దాని నెవ్వరును విడిచిపెట్టుటకు సిద్ధపడరు, అట్లే ప్రియమిత్రు డొకవేళ గొంత తప్పిద మొనరించినను విడిచి వేయవచ్చునా? నాకు సంజీవకునితోడి చెలిమి మేర లేనిది కదా! ఇండ్లు, సకల సామగ్రులు గాల్చివేయునదియే యైనను సకల జనులకు నగ్ని యాదరణీయముగాదా?" ఇట్లు ప్రశ్నించిన రాజునకు దమనకు డిట్లనియె.

"సుతునియందుగాని, యమాత్యుని యందుగాని తటస్థునియందుగాని మితిమీరిన ప్రీతి జూపు రాజును లక్ష్మి విడుచును. పథ్యపు బదార్థ మంతరుచిగా లేకున్నను దుద కారోగ్యసుఖము గలిగించును. హితము చెప్పువాడును, నది చక్కగా గ్రహించువాడును గలుగుచోట లక్ష్మీ నిలిచియుండును. నీవు చిరసేవకుల నీసడించి నూతనముగా వచ్చినవాని కాధిక్య మిచ్చితివి." దమనకుని యీమాట లాలకించి "ఇది కడు వింతగా నున్నది. నన్ను శరణు పొచ్చి; యభయ మొసగి పోషించుచున్న నన్నే యాత డెట్లు ద్రోహము సేయును?" అని పింగళకుడు ప్రశ్నింపగా మరల దమనకు డిట్లు పలికెను.

"ఎన్నివిధముల యత్నించినను గుక్కతోకకు వంకర పోజాలదు. దుర్జను డెన్ని యుపకారములు పొందినను వాని మనసు పరిశుద్ధము కానేరదు. విషవృక్షము లమృతము వోసి పెంచినను మంచి పండ్లీయ జాలవు. వర్ధనము, పోషణము దుష్టునకు మంచిగుణములు గలిగింప లేవు. హానినుండితప్పించు మిత్రుడును ననుసరించి వర్తించు స్త్రీయును, గర్వము గలి గింపని సంపదయు, నింద్రియములకు లోబడని పురుషుడును నుత్తములు. కాబట్టి యడుగకున్నను స్వామికి బరాభవము దటస్థించుట సహింపజాలక చెప్పుచుంటుని. సంజీవకుని తప్పు లన్నిటిని వినియు బ్రభు వూరకున్న యెడల నాదోషము లేదని తృప్తివడుదును."

ఇంతగా నొక్కిచెప్పుచున్న దమనకుని మాటలు విని "గుణదోషము లెఱుగక యేపనియు జేయరాదు. గర్వము చేత నెవడు సర్పమునోట జేయిదూర్చును? దోష మున్నచో దండింపక విడుచుటయు దప్పే. దోషము లేనిచో దండించుట యెంతమాత్రము దగదు." అని పింగళకుడు మనసున నాలోచించుకొని దమనకునితో "అతని నిరాకరించి వెడలగొట్టుట యుచితమా? హెచ్చరించి చూచుట మంచిదా?" యన దమనకు డిట్లనెను.

"వలదు, వలదు. ఇంతలోనే మంత్రభంగము గావింపరాదు. మంత్రబీజము భగ్నము గాకుండ బహుయత్నములచే గాపాడవలయును. ఒకసారియది భగ్నమైన నిక నది యంకురింప జాలదు. చేయదగినది యెవ్వరు నెఱుగకుండ వేగముగా జేయుట మంచిది. అధీరుడగు యోధుడు సర్వాంగములు గవచముచే గప్పుకొనియుండియు బరులు భేదింప గలరను భయమున జిరకాలము యుద్ధరంగమున నిలువ జాలడు. అట్లే మంత్ర మెన్నివిధముల గాపాడుచున్నను జిరకాలము నిలువజాలదు." ఈమాటలు విని పింగళకుడు "అతడు నిజముగా విరోధించినను నా కపాయము జేయగలుగు సామర్థ్య మాతని కేమిగలదు" అని మరల బ్రశ్నింపగా దమనకు డిటులయెను.

"అ ట్లెన్నడు దలపరాదు. క్షుద్రశత్రువు కూడ నొకపు డెంత యపకారమైన జేయగలడు. అతనికి బరంపరగా నెందఱి స్నేహ ముండునో యెవ్వరి కెఱుక? చూడుము. ఒకతీతువు మిత్రవర్గము దోడుగాగా సముద్రమును సాధించెను.