Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆటవిక నృత్య రీతులు

వికీసోర్స్ నుండి

ఆటవిక నృత్య రీతులు  :- ఆటవిక నృత్యములు రెండు విధములుగా నుండును. 1. ఆరాధన నృత్యము, 2. వినోద నృత్యము. ఆరాధననృత్యములో ఖర్మనృత్యము కొలువు నృత్యము, బైగా నృత్యము అను విభాగములు కలవు. వినోద నృత్యములో ఋతువుల నృత్యము అనుకరణ నృత్యము, ప్రకృతినృత్యము, వివాహ నృత్యము, యుద్ధ నృత్యము, వేట నృత్యము అను విభాగములు కలవు.

నాట్యము  : వీరి నృత్యములందు కథతో సంబంధము గల్గినట్టి ప్రదర్శనములు ఎక్కువగా కనుపించవు. అచ్చ టచ్చట చెంచుల కోనలోని చెంచువారు, శ్రీశైలమునకు ఆనుకొనియున్న అరణ్యములలోని ఆటవికులు ప్రదర్శించు

  • చెంచులక్ష్మి నాటకము', 'శివభిల్లి' వంటి నృత్త ప్రధానమైన నాటకములు తప్ప, మిగిలిన ప్రాంతములలోని వారు

ప్రదర్శించు నాటకములను కానము.

నృత్యము  : అనుకరణ నృత్యము, ఋతువుల నృత్యము లందు నృత్యము ప్రాధాన్యము వహించును. ఇది ఆంగికమున ప్రధానమైయుండును. అనుకరణమునందు వీరు నెమలి నృత్యము, లేడిపిల్ల వేటగాని నృత్యము మొదలయి నవి ప్రదర్శించెదరు. ఆహార్యము గూడ ఆయా పక్షులవలె, జంతులవలె ధరించి, అవి చేయు అంగవిన్యాసము ననుస రించి ప్రదర్శించెదరు. ఆరణ్యములలో నివసించు వీరికి ప్రకృతితోను, అందు నివసించు పశుపక్షాది జంతువులతోను సన్నిహిత సంబంధముండుటచే వీరు ఆ నాట్యము లందు ప్రదర్శించు అంగ విన్యాసము సహజముగా నుండును.

నృత్తము  : నృత్తము వీరి కళ యొక్క జీవము. వీరి నృత్యకళ యంతయు వృత్తప్రాధాన్యమైనట్టిది, చక్కని లయతో గూడిన సుందరమైన అంగ విన్యాసము, ఆటవికుల నృత్య కళయందు మాత్రమే చూడగలుగుదుము . పర్వదినములందు పొంగు, కడలియందలి తరంగములవలె 'లయ' వీరి శరీరములో ప్రతి అవయవములో నుండి పొంగి ప్రవహించును. ఈ లయ, లయవిన్యాసము, శాస్త్రీయ నృత్యము నెరిగిన ప్రఖ్యాత నర్తకులందును, ఒకానొకపుడు కానమనుట సాహసముగాదు. ఆటవికుల నృత్యములకు ప్రత్యేకతాళములుండవు. సాధారణముగా వీరు గతుల నాధారముగా నృత్యమాడుదురు. త్రిశ్ర (3 అక్షరముల గతి) చతురశ్రము (4 అక్షరముల గతి) లాధారముగ వీరు విరివిగా నృత్యమాడుదురు. వీరిమృదంగ వాద్యము 'లయ' ను దెల్పుచు భావ ప్రధానముగా వాయించబడును. అనుకరణ నృత్యములందు, యుద్ధ నృత్యములందు వీరు ఆహార్యమును ధరించెదరు. వీరి నృత్యములు రెండు విధములు :- స్త్రీలు పురుషులు కలిసి చేసెడి నృత్యములు. పురుషులు, స్త్రీలు వేరువేరుగా చేయు నృత్యములు. మరియు వీరి నృత్యములన్నియు బృందనృత్యములే. వేణువు యొక్క రాగాలాపము వీరి నృత్యమునందు ముఖ్య సంగీతము. పాడుచు నాట్యమాడుట తరుచుగా వీరి నృత్యములందు కనిపించదు.

భారత దేశములో——తోడా, ముండా, బైగా, కురవ, చెంచు, కోయ, సుగాలి, బంజారా, గదబ, సవర, గోండు, భిల్లు, నాగ, ఒరియను మొదలయిన ఆటవిక తెగలెన్ని యో యున్నవి. వారందరి నృత్యరీతుల గురించి ప్రత్యేకముగా ఈ గ్రంథమందు వ్రాయుట అసాధ్యము. కాన వారందరికిని చెందిన కొన్ని ముఖ్యనృత్యముల వివరము అందు తెల్పబడు చున్నవి.

వేట నృత్యము (హల్బా) : హల్బా అను తెగవారు మధ్యప్రదేశ నివాసులు. హల్బాలు వేటాడు విధానము కళాత్మకముగా నుండును. ఏడెనిమిదిమంది కలిసి రాత్రి చిమ్మచీకటిలో వేటకు బయలుదేరెదరు. ఒకడు చిన్న దీపము తీసికొని ముందు నడచుచుండును. దాని నీడలో వెనుక భాగమున మిగిలినవా రుందురు. వారు కాళ్ళకు గుంగునియాలు (గజ్జెలందెలు) ధరించి యాడుదురు. వారు దీపపు నీడలో నిలబడి నృత్యముచేయుచు, లయతో అడుగులు వేయు చుందురు. అప్పుడు గుంగునియాలు "చు౯ చు౯ చు౯ చు౯" అనియు "చం చం చం చం" అనియు మధురధ్వని చేయుచుండును. ఆ మధుర ధ్వనులచే ఆకర్షితములై పొడలలో నిద్రించుచున్న కుందేటికూనలు అటుప్రక్కకు పరుగెత్తు కొనివచ్చి, దీపపు వెనుకనున్న మనుష్యులను జూడక, మినుకుమినుకుమని వెలుగుచున్న దీపకాంతిని జూచి ఆనందించుచు నిలుచుండును. అవి దీపము ముందునకు వచ్చినంతనే వెనుకనున్న మనుష్యులు వాటిని పట్టు కొనెదరు. ఇది వేటనృత్యము.

ఖర్మనృత్యము : గోండులు మొదలైనవారు పాడిపంటల అభివృద్ధికిగాను జేయు ఆరాధన నృత్యము ఖర్మ నృత్యము.

వర్ష ఋతు ప్రారంభములో (భాద్రపదము) గోండులు చిగిర్చిన 'ఇప్ప' కొమ్మను తెచ్చి, ఒక క్రొత్త గుడ్డలో చుట్టి యిండ్లలో నుంచెదరు. అనాడు పెద్ద పండుగ చేయుదురు. విందారగించిన పిదప భజంత్రీలు మద్దెలలు మ్రోగించు చుండ స్త్రీ పురుషులు కలిసి ఆ కొమ్మచుట్టు తిరుగుచు ప్రకృతి గీతములనో, ప్రేమగీతములనో పొడుచు నాట్య మాడుదురు. ఇదియే ఖర్మ నృత్యము. ఇది గోండులకేగాక యితర ఆటవిక జాతుల వారికికూడా ముఖ్యమైనట్టిది. ఈ విధముగా నృత్యగీతములతో ఖర్మవృక్షము నారాధించి, (బుజ్జిదేవ) భగవంతుని, ధర్తీ మాతను సంతోష పెట్టిన పంటలు బాగుగా పండునని వారి దృఢ విశ్వాసము.

ఈ రీతిగా కార్తీకము లేక మార్గశిర మాసములలో "భుయ్యా" తెగవారు ఒక ఖర్మవృక్షము కొమ్మను ఆడవి నుండి తెచ్చి దానిని పల్లెలోనుంచి దానిముందు ఖర్మ నృత్యము చేయుదురు. ఇట్టి నృత్య గీతాదులతో గూడిన ఆరాధనవలన ఇప్ప, మామిడి, పనస మొదలైన చెట్లు చక్కగా ఫలించునని వారి నమ్మకము. సోమ, బుధ, శుక్రవారములందు వీరు ఈ పూజలు చేయుదురు. ఇట్లు ఆరాధన నృత్యములుగాక యీ తెగలవారికి వినోద నృత్యములు గూడ యెన్ని యో యున్నవి.

'గోటల్ ఘర్' : గోండులలో అవివాహిత యువతీ యువకులు నృత్త గీతములతో కాలము గడుపుటకుగాను ప్రతిపల్లెయందును, ఒక గృహ మేర్పరచబడును, అదియే 'గోటల్ ఘర్'. కొన్నిచోట్ల స్త్రీ పురుషులకు వేరువేరుగా రెండు గృహము లుండును. ఛత్తీస్ ఘర్ లో గోండుపల్లెలలోని పెండ్లిగాని యువతీయువకులు, రాత్రిపూట గోటల్ ఘర్ లో చేరి నృత్యగానములతో కాలము కడపుదురు, ప్రతి రాత్రి భోజనాదులు ముగించుకొని అవివాహితయువకులు ముందుగా నృత్యగృహము జేరుదురు. అటుపై యువతులు వెళ్ళుదురు. 'కొట్వారు' గురువు, బాలికల నాహ్వానించి, యువకులు నాయకునికి ముందుగా వందనము లర్పింపజేయును. అటుపై ఒక్కొక్క యువతి, తనకు ఇష్టమైన యువకుని ఏరుకొని, అతని తలను చక్కగా దువ్వి, కాళ్ళుచేతులను మర్దించి, అతనితో నృత్యము మొదలు పెట్టును. ఇరువురును అలసిపోవునంతవరకు, పాడుచు నృత్యముచేసి తర్వాత విశ్రాంతి తీసికొందురు. యువతులు ఇష్టమైనచో తమ ఇండ్ల కేగుదురు లేదా తమతో నృత్యముచేసిన యువకుల ఇండ్లలోనే రాత్రుల యందు వసింతురు. ఈ విధముగా ప్రతి రాత్రి నృత్యముచేయుటచే అనేక యువతీ యువకులలో పరస్పరానురాగ మేర్పడును. అటుపై వారు వివాహము చేసికొందురు.

గోండుల నృత్యప్రీతి  : గోండుజాతికి చెందిన పురుషులు తమ మోచేతులకు మోకాళ్ళకు, మణికట్లకు 'హోలీ' అగ్నిలో మండుచున్న మోదుగ కఱ్ఱలతో చురుకులు వేసికొందురు. అటుల చేయుటవలన నృత్యమునకు అనువైన విధముగా వారి అవయవములు లొంగుననియు ఆ కఱ్ఱలవలె తమ దేహములు గూడ తేలికగా తయారగుననియు, మండుచున్న మంటల యొక్క జ్వాలలవలె వారియొక్క దేహములు కదలుననియు, తొందరగా మండు మంటలవలె, తమ అంగ ప్రత్యంగములందు చురుకుదనము వచ్చుననియు వారి నమ్మకము. మరికొందరు కుందేటి పేడతో పిడుకలు చేసి, కాల్చి, దానితో మోచేతులు, మోకాళ్ళపై చురుకులు పెట్టుకొందురు. కుందేటి కాళ్ళవలె తమ అంగములు చక్కగా వంగుననియు, చలనము కుందేటివలె మిక్కిలి చురుకుగా నుండుననియు వారి నమ్మకము,

కోయవారి వృషభ నృత్యము (ప్రకృతి అనుకరణ నృత్యము) : ఈ నృత్యపు కథా విశేషము బాగుగా మదించి యౌవనములో నున్న ఆబోతులు ఒకటినొకటి 'ఢీ' కొని పోట్లాడుట. ఇది రౌద్రరస ప్రధాన మైనట్టిది.ఈ నర్తకులు గూడ నృత్యమాడునప్పుడు తమ ముఖములను గవ్వలతో తయారు చేసిన అలంకరణములతో కప్పి, తలకుజుట్టిన తలపాగాయందు రెండు కొమ్ములను ఇరువైపులనుండి తమ శిరస్సులతో ఒకరినొకరు ఢీకొనుటకు అనువగు విధమున, సిద్ధమగుదురు. నృత్యమాడునపుడు నర్తకులే మృదంగములను వాయింతురు.

నృత్య వర్ణన :- షుమారు ఇరువదిమంది పురుషులు తమ మెడలందు పొడుగుపాటి పెద్ద పెద్ద మృదంగము లను వ్రేలాడవేసికొని నిలుచుందురు. తలవెండ్రుకలను గోపురములవలె ఎగకట్టి దానిపై తలపాగ, తల కిరువైపుల ఎద్దుకొమ్ములు, అలంకార ప్రాయముగా ధరించెదరు. శరీరమున కటిభాగమునకు పైన ఎట్టి అలంకరణము లుండవు, మోకాళ్ళవరకు పంచెమాత్రము కట్టుకొందురు. పురుషులు మద్దెలలు వాయించుచు గుండ్రముగా తిరుగుచు నృత్యము చేయుదురు. స్త్రీలు వారికి కొంత దూరములో నిలబడి ఒకరి చేతుల నొకరు పట్టుకొని నృత్యమాడుచుందురు. ఈ రీతిగా కొంతతడవు నృత్య మాడిన పిదప పురుషులు రెండు భాగములుగా చీలి ఒకరి కెదురుగా ఒకరు నిలబడుదురు. నిమిషము నిశ్శబ్దము.

'ధంగ్' - ధంగ్ త - ధంగ్ -తకిట ధంగ్ ధంగ్'

ఇరువదిమంది వారి మెడలలో నున్న మద్దెలల నన్నింటిని ఒకేసారితుఫానులో మేఘగర్జనమువలె పలికింతురు. అందరి యందును ఏదో ఉత్సాహము, ఏదో ఉద్రేకము, ఏదో ఆవేశము పుట్టును. శరీరములను కదిలించుచు, మృదంగములను మ్రోగించుచు, నృత్యము జేయుచు వెనుకకు వెళ్ళి మిక్కిలి తొందరగా అడుగులు వేయుచు, చిన్న పరుగుతో ముందుకు వచ్చి, కొట్లాడు ఆ బోతులవలె ఢీకొనుచు, తలలను దగ్గరగా జేర్చి, కొమ్ములతో పొడుచు కొనునట్లు అభినయము చేయుదురు. ఆ విధముగా ఇద్దరిద్దరు తలలను జేర్చి, కొమ్ములతో పొడుచు కొన్నట్లభినయించుచు, గిరగిర గుండ్రముగా తిరుగుచు, తాళము తప్పక నృత్యమాడుదురు.

పరుగు పరుగున వెనుకకు అడుగులు వేయుచు మరల ముందుకు పళపళమని మృదంగముల వాయించువు పరుగెత్తుకొని వచ్చి 'ఢీ' కొందురు, ఈవిధముగా నృత్యము చేయుచు, అలసిపోయియున్న నర్తకులను, ప్రేక్షకులుగా నిలిచియున్న స్త్రీ పురుషులు ఏకకంఠముగా “హే, హే” అని కేకలు వేయుచు, చప్పట్లుకొట్టుచు ఉత్సాహపరచు చుందురు. ఇట్లు కొంతతడవు నృత్యమాడిన పిదప, స్త్రీలు పురుషులుగలిసి ప్రకృతి గీతములు పాడుచు నృత్యము సల్పుదురు. ఈ నృత్యము ఆంధ్ర దేశములోని అరణ్యములలో నివసించేడు కోయవారు చేయునట్టిది.

నాగవీరుల యుద్ధ నృత్యము : నాగజాతివారు అస్సాము అడవులందును, బర్మాసరిహద్దు ప్రాంతము లందును నివసించెడు ఆటవికులు. వీరి నృత్యములు భయానక, రౌద్ర, బీభత్సరస ప్రధానములై యుండును. పూర్వకాలమందు అడవి తెగలవారు తరుచు ఒక తెగతో ఇంకొక తెగవారు యుద్ధములు చేయుచుండెడివారు. ప్రస్తుతము అట్టి యుద్ధములు లేకపోయినను, ఆ యుద్ధమును దెల్ఫునట్టి క్రమమే వారి నృత్యమందు కాంచనగును. వీరెన్నియో ఇతర నృత్యములను జేసినను, వీరి, వీర నృత్యము, (యుద్ధ నృత్యము) మాత్రము ప్రఖ్యాతి గాంచినట్టిది. ఈ నృత్యమాడునప్పుడు వీరు యుద్ధమునకు బోవు నాగవీరులు ధరించెడు ఆహార్యమును ధరింతురు. డాలు, ఈటె రెండు చేతులందుండును.

నాగ నృత్యవర్ణన:

'డ్రంగ్ - టక్ టక్ టక్
డ్రంగ్ టక్ టక్ టక్
గిట గిట గిట - గిడ గిడ గిడ
గిట గిట గిట -గిడ గిడ గిడ
డ్రంగ్ తక్ టక్ డ్రంగ్
డ్రంగ్ - టక్ టక్ టక్

పెద్ద పెద్ద డప్పులు, మృదంగములు గంభీరముగా మ్రోగు చుండును. వారికి ప్రక్కగా నాగవీరులు బారులు దీర్చి ఒకరికెదురుగా ఒకరునిలుచుందురు. కొందరు విల్లమ్ముల దరింతురు. కొందరు డాలు కత్తులను పట్టుకొందురు. శరీర ములను ధగధగ మెరయు పలువిధములగు రంగులతో చిత్రించుకొందురు. మెడలండు గవ్వలు, నత్తగుల్లల మాలలు, రంగులలో ముంచిన చిన్న రెండు ముక్కల మాలలు ధరించెదరు.

మాదల్ యొక్క తాళగతి ననుసరించి, వారు యుద్ధ మందు సైనికులవలె ఒకరికి దగ్గరగా నొకరు ఒక గోడవలె నిలబడి, అడుగులు వేయుచు అతిజాగ్రత్తగా నడిచివత్తురు. ఇట్లు ఇరుప్రక్కల సైనికులు ఒక అడుగు దూరములో ఒకరి కెదురుగా నొకరు వచ్చినంతనే,

'త్రాంగ్ - గిడగిడ – త్రాంగ్ - గిటగిట
దిత్రాంగ్ - గిటగిట - గిటగిట - దడదడ
దిత్రాంగ్, త్రాంగ్ - త్రాంగ్ - త్రాంగ్ '

ద్రుత లయలో అన్ని వాయిద్యములు గర్జించును.

వెంటనే ఆ వీరులు ఒకరిపై నొకరు ఉరుకుదురు. కొంత తడవైన పిదప,

'త్రాంగ్ తక్ – త్రాంగ్ తక్ - దడతంగ్ '

అన్ని వాయిద్యములు ఆగి - మద్దెల మాత్రము పలుకును,

రెండు సైన్యములు విడిపోయి, వెనుకకు పోయి కొంత సమయము విశ్రాంతి దీసికొని, మరల 'తాళలయల ననుసరించి, అడుగులను వేయుచు ముందునకు వచ్చును.ఇది నాగవీరుల యుద్ధానుకరణ నృత్యము. రెండవసారి యుద్ధము చేసి స్వస్థలములకు బోవునప్పుడు, వీరస్వర్గమునలంకరించినట్లు లనుకరించు తమ సోదర సైనికులను తమ వీపులపై మోసికొనిపోవుదురు.

మరల మూడవసారి సైనికుల,

తద్దంగ్ .........ఆని

నగారా ధ్వనించును. మృదంగములు విశ్రాంతిగొనును.

'క్లక్-క్లక్ - క్లక్ - క్లంగ్
కడక్ - క్లక్ - క్లక్ - క్లంగ్' అని.

కొబ్బరి చిప్పలతో చేయబడిన వాద్యములు ధ్వనించును. వీరులు స్వస్థలముల జేరి, ప్రశాంతముగా నిలబడుదురు.

'లడక్' లడక్ తుం -లకడ లకడ దుం
లడక్ లడక్ తుం - లకడ లకడ దుం'

అను గతి ననుసరించి అవ్వ తాత తొడుగులను ముఖములకు ధరించిన యిద్దరు వ్యక్తులు, నృత్యమాడుచు యుద్ధ భూమిని ప్రవేశించి ఇరుబలములకు మధ్యన నిలబడుదురు.ఉభయ సైన్యాధిపతులు, ఆ పెద్దలను సమీపింతురు. ఆ పెద్దలు కొన్ని సంజ్ఞలు చేయగా, ఇరువురు సైన్యాధిపతులు మోకాళ్ళపై గూర్చుండి, వారి ఆజ్ఞ శిరసావహించినట్లు భావప్రకటనను గాంచిన తక్షణమే దూరముగా నిలబడి ఆ దృశ్యమును జూచుచున్న స్త్రీలు-'హే... హే' అని ఉత్సాహముతో కేకలు వేయుచు ఆ ప్రదేశమునకు పరుగెత్తుకొని వచ్చెదరు

'దిరత్రంగ్- త్రంగ్ త్రంగ్ త్రంగ్
.
దిరత్రంగ్ - త్రంగ్ త్రంగ్ త్రంగ్

. అను రీతిచే మృదంగము ఆనందమును వెలిబుచ్చును.

'ధంగ్ - తకిట, తకిట- తకిట
ధంగ్ - తకిట, తకిట -తకిట

అను గతులచే అవ్వ తాతలను మధ్య నిలువబెట్టి స్త్రీ పురుషు లందరును గూడి చుట్టూ తిరుగుచు నృత్య మాడుదురు.

'లక్ లక్ లక్ బం
లక్ లక్ లక్ బం' అనుచు

కొబ్బరికాయల వాద్యములు పలుకగా, అవ్వ తాతల తొడుగులు ధరించిన వ్యక్తులు తమ తలలను దగ్గరగా తెచ్చుచు, ముందుకు వెనుకకు ఆడించుచు నృత్యము చేయుదురు.

మరల మృదంగము ధంగ్ తకిట - తకిట తకిట అనుచు మ్రోగుటయ తడవుగా అందరు భూమి దద్దరిల్లునట్లు అడుగులు వేయుచు నృత్యమాడి ముగించెదరు. ఇదియే నాగవీరుల యుద్ధనృత్యము. యుద్ధము చేయుట, సంధి చేసికొనుట మరల స్త్రీపురుషులు యుద్ధము ముగిసినందుకు ఆనందముతో నృత్యమాడుట అనునవి వీరు ఇందు ప్రదర్శించు కథావిశేషములు.

చెంచుల నృత్యము  : చెంచుల కోనలోని చెంచువారు ప్రదర్శించేడు నృత్యములలో 'చెంచిత నాటకము' ప్రఖ్యాతి గాంచినది. చెంచిత, చెంచురాజు కుమార్తె. నృసింహ స్వామి వారి ఇలవేల్పు, చెంచులక్ష్మి నృసింహస్వామిని వివాహమాడుట ఈ కథ. ఈ కథ నృత్యవృత్తములతో వీరు ప్రదర్శింతురు. ఆదిలో ఈ నృత్యము. లయప్రధానమైన నృత్తముతో గూడియుండినను, కాలక్రమమున ఈ నర్తకులకు పట్టణములలో నివసించు ప్రజలతో పరిచయము గల్గుటచే నృత్యపద్ధతియందు అనేకమైన మార్పులు గల్గినట్లు తోచుచున్నది. ఈ ప్రదర్శనము నృత్య నాటక పద్ధతిలో నుండును. అట్టిదే 'కురవ' లు ప్రదర్శించెడు కురవంజి నృత్యము. ఈ నృత్యగాథ శివపార్వతికి సంబంధించియుండును. దీనికే 'శివభిల్లి' యనికూడ పేరు. కొన్ని సమయములందు 'కిరాతార్జునీయ' కథనుగూడ నృత్యమాడుదురు. ఈ నృత్యములు బృందనృత్యములు గావు. ఇతర ఆటవిక నృత్యములందువలె ఇందు తెగవారందరుపాల్గొనుటకు వీలుండదు గాన ప్రేక్షకులు, ప్రదర్శకులు వేరుగా నుందురు. చెంచులకు కురవలకు ఆరాధ్యదేవతలు వేరుగానున్నను వైష్ణవ, శైవమత ప్రభావముగల్గిన ఆలయములకు దాపున వారు నివసించుటచే ఆయా దేవతలకు సంబంధించిన కథలను నాటకము లాడుటకు అలవాటుపడిరి.

'సవర' ల నృత్యములు  : సవరలు ఒరిస్సా అరణ్యములలో నివసించెడు ఆటవికులు. వీరి నృత్యము లెక్కు వగా ప్రకృతిఆరాధనమునకు సంబంధించినట్టివి. ఈ నృత్యములు ముఖ్యముగా చతురశ్ర, తిశ్ర, ఖండగతులలో నుండును. ఇవియును లయ ప్రధానముగ చేయబడు బృంద నృత్యములు. ఋతువులు, ననుసరించి చేయబడు నృత్యములు వీరి కళయందు ముఖ్యమైనవి. ప్రతి ఋతువునకు తగిన అంగవిన్యాసములతో నృత్యములు వీరు ప్రద ర్శింతురు. ఆ నృత్యములను చూచినపుడు ఆయా ఋతువుల యందలి విశిష్టత వారి అంగవిన్యాసములో మనకు గోచరించును. వాద్యములందు గూడ ఆ భావము నొప్పించు ధ్వనులు పలికించబడును. ఋతునృత్యములు ఆయా కాలమందు తప్ప ఇతర కాలములందు ప్రదర్శింపబడవు.

'సుగాలీ' ల నృత్యములు  : సుగాలీలు, బంజారాలు, లంబాడీలు——— వీరందరు ఒకే తెగకు చెందినట్టివారు. పురుషుల నృత్యములకంటే, స్త్రీల నృత్యములు చాల చక్కగానుండును. అద్దములతో కుట్టిన రంగురంగుల కుచ్చుల లంగాలను ధరించి, చేతులకు దంతపు గాజులను, మెడలందు గవ్వల మాలలను, చెవులకు గజ్జెల వెండి జూకాలను ధరించి, లంబాడీభాషలో గీతములను పాడుచు చప్పట్లు తట్టుచు గుండ్రముగ తిరుగుచు, వీరు చేయు నృత్యము. మన దేశములో స్త్రీలు జేయు కుమ్మి, బతకమ్మలాట, గొబ్బి మొదలైన జానపద నృత్యములకు పోలియుండును. వీరి నృత్యమందు పెద్ద పెద్ద డప్పులు మాత్రము సుగాలీ పురుషులు వాయింతురు.

'వర్లీ' తెగవారి నృత్యరీతులు : వీరు మహారాష్ట్ర ప్రాంతములోని అరణ్యములలో నివసించువారు. వీరి నృత్యము లన్నింటిలో 'ఆత్మయాత్ర' నృత్యము ముఖ్యమైనట్టిది. చనిపోయిన మనుష్యుని భూమిలో పూడ్చిపెట్టి జీవాత్మ నదులను, అరణ్యములను దాటి అలసటలేకుండ ప్రయాణము సాగించి పరమాత్మను జేరుటకు, ఆ సమాధి చుట్టు స్త్రీపురుషులు చేరి, నృత్యగీతములతో సాగనంపుదురు వారి కంఠములలో విషాదము ప్రతిధ్వనించు చుండును. వారి అంగచలనము అతిసున్నితమై, విలంబిత లయగలిగి కరుణరస మొలుకుచుండును. ఇట్లు సంధ్యా సమయము వరకు నృత్యముసల్పి వారిండ్లకు బోవుదురు.

'కోలుల' నృత్యములు  : వీరి నృత్యము లన్నింటిలోను వరికోతల నృత్యము ముఖ్యముగ చూడదగినది. వీరు ముఖ్యముగా ఛోటానాగపూరునకు సింగభూమికి మధ్య భారతమునకు చెందిన అరణ్యములలో నివసించెదరు. వీరికి నృత్యమనిన అత్యంత ప్రీతి. ఈ తెగవారందరు ఒక చోట గూడినప్పుడుగాని, ఒక వల్లే వారింకొక పల్లెలోని తమ బంధువులు జూడపోయినప్పుడుగాని నృత్యగానములతో కాలము గడుపుదురు. వీరి నృత్యములు విలంబితముగా, స్వాభావికమై అతి సుకుమారముగా నుండును.లయ తాళములందు వీరికి మంచి ప్రావీణ్య మున్నది. వీరి వరికోతల నృత్యము హృదయరంజక మైనది,తాళ గతి ననుసరించిన వేణుగానముతో స్త్రీలు వరుసగా నిలిచెదరు. వారొక గీతము నాలపించుచు లయతాళముల ననుసరించి అడుగులు వేయుచు, అందరు ఒకేసారి వంగి చేతులతో కొన్ని ముద్రలు ప్రదర్శింతురు. ఆ ప్రదర్శనము అచ్చముగా పొలములలో వరినారు నాటినట్లుగా మనకండ్లకు తోచును. తరువాత కోయుట, కోసిన పైరు కట్టగట్టుట, కొట్టి దులిపి కుప్పలు వేయుట మున్నగునవి తాళ లయల ననుసరించి మధురముగా పాడుచు అభినయింతురు. ధాన్యమును వేర్పరచి, చేటలతో చెరుగుచు శుభ్రపరచి, కుప్పలుగా బోసి యేడాదిగా నొనర్చిన ఫలితమును కన్నులార జూచి, ఆనందముతో త్వరితగతిని, నాట్యమాడుదురు. ఇట్లు వారు వర్షఋతు ప్రారంభమున పొలము దున్నుట మొదలు ఆ ఏటి కృషిఫలిత మైన క్రొత్తవడ్ల విందారగించు వరకును జరిగెడు దృశ్యములను, వివిధ ఘట్టములుగా గైకొని నృత్యమాడుదురు.

కోరువాల నృత్యము  : మృదంగములు రణభేరీలవలె గర్జించుచుండగా పురుషులు చక్రాకారముగా నిలబడెదరు. స్త్రీలు, ఆ పురుషుల మధ్య మఱోక వలయముగా నిలువబడెదరు. వారొకరినొకరు అంటి పెట్టుకొని చుట్టుచుట్టుకొని నిద్రించుచున్న పాములవలె నిలబడెదరు.అందరిమధ్యన 'భోర్ గస్' కూర్చుండి తన తంత్రీవాద్యమును వాయించుచు, పాడుచు నర్తకులకు ఉత్సాహమును కలిగించును. పురుషులు తమ నిడుపైన వెండ్రుకలను ముడివేసి, అందు అమ్ముల నుంచుటచే వారు నృత్యమాడునప్పుడు వారి సిగలు, జడలు వానితో పాటు అమ్ములు లయానుగుణముగా కదలును. వారొకరి చేతుల నొకరు పట్టుకొని గుండ్రముగా తిరుగుచు నృత్య మాడుచుండ చుట్టలుగా పడుకొనియున్న పాములు తాళ లయకు కదులుచున్నట్లు భ్రమగొల్పును.

వీరు 'ఖర్మ' నృత్యము గ్రీష్మఋతువులో జేయుదురు. వర్షములు లేనిచో ఈ నృత్యమును వీరు ప్రతి రాత్రి చేయుదురు. 'ఖర్మ' ఆరాధన నృత్యమగుటచే భగవంతునికి ప్రీతి గల్గించవచ్చునని వారి యుద్దేశము.

'కవురు'లు కోలాటము వేయుదురు. ఏక తారలను చేతులతో పట్టుకొని గీతములను పాడుచు, నృత్యమాడుదురు. వీరి నృత్యములకును పంతాలుల యొక్కయు, కోలుల యొక్కయు నృత్యముల కెట్టి సంబంధము లేదు.

బైగాలు అనువారు'సేల', 'రేవా' అను రెండురకములైన ప్రత్యేక నృత్యములను జేయుదురు. 'సేల' అను నృత్యము బైగా పురుషులు చేయునట్టిది. "రేనా" అనునది బైగా స్త్రీలు చేయునట్టిది. స్త్రీలు ఒకరికిదగ్గరగా ఒకరు నిలబడి, చేతులను మాత్రము పట్టుకొనక ముందుకు వచ్చుచు, వెనుకకు వెళ్ళుచు, వంగుచు నృత్యమాడుదురు. బైగాలు' ఆటవిక జాతుల వారి పూజారులు.

ఆటవికుల నృత్యరీతు లన్నింటిలోను ముఖ్యమైనట్టివి 'ఒరియనుల' నృత్య జాతరలు. ఇట్టి నృత్యజాతరలు మన దేశమునందును, ప్రపంచములో మరెచ్చటను లేవేమో? కొన్ని వేల మంది ప్రజలు - స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యువకులు — అందరును ఒక చోట జేరి నృత్యజాతరయందు పాల్గొందురు. ప్రాతమామిడితోటలు వీరి జాతరస్థలములు తెల్ల వారు సమయమున నృత్యజాతర ప్రారంభమగును. సుమారు పదిమంది బాలురు మామిడితోటకు పోవుదారిలో నాటబడిన జండాలను జూచి, ఆనందముతో వెట్టిగా కేక లిడుచు పల్లెలోనికి పరుగెత్తుదురు. ఆ చుట్టుప్రక్కల నున్న అన్ని గ్రామముల వారికి తెలియుటకుగాను, పల్లెల జెండాలను దెచ్చి నృత్యము జరుగు ప్రదేశమునకు పోవు దారిలో నాటుదురు.

జాతర వార్తయు, నృత్యజాతర వార్తయు పల్లెలలోకి ప్రాకిపోవును. కొన్ని క్షణముల క్రింద నిశ్శబ్దముగానున్న పల్లె లన్నియును జాతర = జాతర - జాతర అను శబ్దములతో ప్రతిధ్వనించును.

అందు గుంపులు గుంపులుగా జనులు అన్ని పల్లెల నుండియు జాతరజరుగుతోటకు చేరెదరు. సుమారు మధ్యాహ్నము రెండు గంటలకు వారలంకరించుకొందురు.

'డాయిడె డడా -డా రెడడా - డా రెడడా -డా'

అనురీతి మద్దెలలు మ్రోగ మొదలిడునవి. కొమ్ము వాద్యములు ధ్వనించును.

ఒక్కొక్క పల్లెవారు ఊరేగింపుతో నృత్యస్థలమునకు తరలి వచ్చెదరు. ముందు యువకులు కత్తులు, డాలులు మున్నగు ఆయుధములను, తమ పల్లెలకు చెందిన పతాకములను పట్టుకొని నడుతురు. చిన్న చిన్న బాలురు వింజామరలను, పెద్ద పొడుగుపాటి కఱ్ఱలను పూలమాలలు మున్నగువానితో అలంకరించి, పూర్వము రాజులకు పట్టబడు గొడుగులవలె పట్టుకొందురు. ఒక పల్లెనుండి వచ్చినవారిలో ఒకడు రాజుగారి అలంకరణముతో కఱ్ఱ గుఱ్ఱమును స్వారిచేయును. మరికొందరు యువకులు ఆ గుఱ్ఱముతోచేర్చి అతనినిగూడ తమ భుజములపై మోయుదురు. వారిముందు కొందరు వేటజంతువులవలె అలంకరించుకొని నడుతురు. వారి వెనుక స్త్రీలు,పురుషులు బారులుదీరి నడతురు. మామిడితోటకు జేరి వారందరు కలిసి ముందుకు వంగుచు వెనుకకు వెళ్లుచు, సముద్ర తరంగములవలె అందరు ఒకేసారి కాళ్ళనెత్తి అడుగులు వేయుచు చక్రాకారముగా తిరుగుచు నృత్యము చేసి మరల నిలబడుదురు. (అతిరమణీయముగా శరీరములను కదిలించుచు కొంతతడవు నృత్యమాడిరి.) ఇదియే 'ఖరియా' నృత్యము. సుమారు రెండువేల జనులు - స్త్రీలు, పురుషులు, వృద్ధులు వరుసగా నిలువబడి అందరు ఒకేసారి మృదంగ తాళముల ననుసరించి కాళ్ళనెత్తి భూమిపై కొట్టెదరు. తరువాత నృత్యములో వారికి వాద్యములతో పనిలేదు. వేలకొలదిజనులు ఏకకంఠముతో పాడుచు, కాళ్ళతో తాళలయలను జూపుచు, ఒకరినొకరు అంటుకొని నిలువబడి, గుండ్రముగా తిరుగుచు నృత్య మాడెదరు. కొంతసేపు నృత్యమాడి అలసిపోయినంతనే అందరు 'హుర్ ర్.... అని నినాదము చేయుదురు. వెంటనే అందరు శిరస్సులను ముందుకువంచి, రెండు కాళ్ళనుచేర్చి, పై కెగిరి భూమి దద్దరిల్లునట్లు అడుగువేసి కూర్చుందురు. ఒక నిమిషకాలము విశ్రాంతి కలుగగా, ఒక మూలనుండి పురుషకంఠము ఉద్రేకపూరితముగా ఓ... అని పిలిచినట్లు పాడును. ఆ రాగము నందుకొని మరల అందరు నృత్యమున కుపక్రమింతురు. ఇట్లు వారు అలసిపోవునంతవరకు నృత్యమాడి, సంధ్యవేళకు అన్ని పల్లెల వారు విడిపోయి నృత్యమాడుచు, తమ ఇండ్లకు పోవుదురు. ఇదియే 'ఒరియనుల' నృత్యజాతర.

స. రా.

[[వర్గం:]]