Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆగమ శాస్త్రములు

వికీసోర్స్ నుండి

ఆగమ శాస్త్రములు :- భారతీయ తత్త్వశాస్త్రములలో ఆగమశాస్త్రములు మిక్కిలి ప్రధానములై, ఐహికాముష్మిక సుఖసంపాదకములై యల రారుచున్నవి.

లోకకల్యాణ సంపాదకములగు దేవాలయములయు, దేవతా విగ్రహములయు నిర్మాణప్రక్రియలను, వాని ప్రతిష్ఠలను, దేవతా సాన్నిధ్యము పెంపొందుటకై చేయవలసిన పూజా పురశ్చరణాది ప్రకారములను బోధించు శాస్త్రము - ఆగమ శాస్త్రము. భగవంతుని ఆగమమును గూర్చి తెలుపునదిగాన, దీనికి పేరు వచ్చియుండవచ్చును. ఈ శాస్త్రమునకు అనుబంధములు కానట్టి విద్యలుకాని, కళలుకాని, వీనిచే ప్రతిపాదింపబడని తత్త్వహిత- పురుషార్థములు కాని లేవనుట నిత్య సత్యమగు విషయము. వేదాంతాది శాస్త్రములు - ఆత్మ పరమాత్మలయు, ఇతర జగద్వస్తువులయు స్వరూపాదు లను, పురుషార్థ - తత్సాదనాదులను విశదీకరించుచున్నవి; ఆగమ శాస్త్రములన్ననో, అందరికిని స్వానుభవగోచరమగు నటుల వానిని ప్రదర్శించు చున్నవి. మొదటివి - తత్త్వబోధకములు, కడపటివి - తత్సాక్షాత్కార సంపాదకములు.

మరియు, జలమునం దంతర్ని గూఢమైన విద్యుచ్ఛక్తిని స్ఫుటముగ నావిర్భవింపజేసి, యంత్ర తంత్య్రాది పరికరములచే నిఖిల ప్రజానీకమునకును అందుబాటులొ నుండునటుల జేయుచున్న ఆధునిక విద్యుచ్ఛాస్త్రాదుల వలె పురాతనములగు నీయాగమ శాస్త్రములును పెక్కు సంవత్సరములకు పూర్వమే క్షీర సముద్రాదుల యందు నెలకొనియుండు వ్యూహ స్వరూపాదులనుండి దేవతాశ క్తిని ఆకర్షించి. పూర్ణకుంభమునను, తద్ద్వారమున యంత్రములయందును, దేవతా విగ్రహములయందును ప్రసరింపజేసి, ప్రతిష్ఠించి, పూజా పురశ్చరణాదులచే ఆశక్తిని దినదిన ప్రవర్ధమానముగ నొనరించి నిఖిల ప్రాణులకును, తత్తదభీష్టములను జేకూర్చునట్టి అద్భుత ప్రక్రియలను అనుభవ పురస్సరముగ ప్రసాదించు చున్నవి. విద్యుచ్ఛక్తి కేంద్రములవంటివే దేవతా శక్తి నికేతనములగు దేవాలయములును.

ఆగమ పదవ్యుత్పత్తి  : దేవతల ఆగమమును గూర్చి తెలుపుచున్నందున దీనికి ఆగమశాస్త్రమని ప్రసిద్ధి కలిగియుండవచ్చును. లేక, వేదమునకువలె "ఆ - సమన్తాత్ గమ్యంతే నిఖిలాఅపి అర్థా ఇతి ఆగమః" అను వ్యుత్పత్తిచే జ్ఞాతవ్యములగు సమస్త విషయములను సమగ్రముగ దెలుపుచు, అలౌకిక శ్రేయస్సాధనరూపములగు అనేక ధర్మములను బోధించుచు నిత్య నిర్దుష్టములుగ నుండుటచే నిట్టి వ్యవహారము కలిగియుండవచ్చును.

"భావ = రాగ - తాళ" శబ్దముల ఆద్యాక్షర సమ్మేళనమున "భరత" శబ్దము నిష్పన్నమైనటుల, "ఆగత-గత ….మత" శబ్దముల ఆధ్యాక్షర సమ్మేళనమువలన "ఆగమ" శబ్దము నిష్పన్నమైనదని ఆయా ఆగమముల యందే నిర్వచించబడి యున్నది. ఆగమముల విభాగములు : ఈ యాగమములు ప్రధానముగ శైవములు. వైష్ణవములు, శాక్తేయములు అని మూడు విధములుగ నున్నవి. శాక్తేయాగమములకు విశేషముగ తంత్రములని ప్రసిద్ధియున్నది. ఇంకను మరికొన్ని తంత్రము లున్నవి. వీనిలో శైవ వైష్ణవాగమములు దక్షిణదేశమునను, మిగిలినవి ఉత్తరదేశమునను బహుళ ప్రచారమున నున్నవి.

శైవ వైష్ణవాగమముల యందు, కేవలము మంత్ర యంత్ర-ఉపాసనాక్రమములు మాత్రమేగాక, దేవాలయ నిర్మాణము, విగ్రహనిర్మాణ ప్రతిష్ఠాది విధులును, వాస్తు-శిల్ప - గాన - పాకాది విశేషములును, పంచకాల పూజా పురశ్చరణాదులును నిరూపింపబడియున్నవి. శాక్తేయ- గాణాపత్య - భైరవాది తంత్రములయందు యంత్ర -తంత్ర - మంత్రోపాసనాదులే ప్రధానముగ నభివర్ణింపబడినవి.

శైవాగమములు - వాని ప్రభేదములు : శై వాగమములు సద్యోజాతము మొదలగు నీశ్వరుని యైదు ముఖముల నుండి ఇరువది యెనిమిది ఆగమములు ప్రాదుర్భూతములైనవి. ఆగమము అన్నిటికిని వక్త సాక్షాత్పరమ శివుడే - అని శైవుల సంప్రదాయము.

1. సద్యోజాతమునుండి - (1) కామికము (2) యోగజము. (3) చింత్యము (4) కారణము (5) అజితము -అని యైదును, 2. వామదేవమునుండి - (1) దీప్తము (2) సూక్ష్మము (3) సహస్రము (4) అంశుమాన్ (5) సుప్రభేదము అని యైదును. 3. ఆఘోరమునుండి - (1) విజయము (2) నిశ్వాసము (3) స్వాయంభువము (4) అనిలము (5) వీరము అని యైదును, 4. తత్పురుషమునుండి - (1) రౌరవము (2) మకుటము (3) విమలము (4) చంద్రజ్ఞానము (5) బింబము అని యైదును, 5. ఈశానమునుండి _ (1) ప్రోద్దీధము (2) అలితము (3) సిద్ధము (4) సంతానము (5) సర్వోత్తమము (6) పార మేశ్వరము (7) కిరణము (8) వాతుళము అని ఎనిమిదియును,

ఈ రీతిగ 28 ఆగమములు ఆవిర్భవించినవి.

వీనిలో, మొదటి పది ఆగమములు శివ భేదములనియు తరువాతి పదు నెనిమిదియు రుద్రభేదములనియు వ్యవహ రింపబడుచున్నవి. మరియు శివభేదములలో ఒక్కొక్క దానికి ప్రవర్తకులు ముగ్గురును, రుద్రభేదములలో ఒక్కొక్కదానికి ప్రవర్తకులు ఇద్దరును ప్రసిద్ధులై యున్నారు.

శైవుల సంప్రదాయము  : శివసృష్టి సమారంభమున శివభక్తి సమావేశముచే నిచ్ఛాశక్తివలన భువనోత్పత్తికై యోగమాయచే సృష్టి బీజము చిలుకరింపబడుచున్నది. అందుండి నాదము, దానిక్రింద శరత్కాల చంద్రునివంటి విత్తును ఆవిర్భవించుచున్నవి. దానిక్రింద “అంబిక" అను శక్తి తోచుచున్నది. దానిక్రింద వామశక్తికి అపర రూపముగ జయ, విజయ, అజిత, అపరాజిత, నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, ఇజంతిక, దీపిక, లేచిక, మోచిక,వ్యోమరూప, అనంతర, అనాథ, అనాశ్రుత- అను శక్తులు గలిగి వీనిచే లోకమంతయును వ్యాపింపబడినటుల స్ఫురించుచున్నది. వీనినుండి ఏబది అక్షరములు గలుగుచున్నవి. స్వరాక్షరమున శివుడును, వ్యంజనాక్షరమున శక్తియును అధిష్ఠించి యున్నారు. స్వర వ్యంజన సమ్మేళనముచే వర్ణములు, పదములు, వాక్యములు ఏర్పడి అర్థప్రతీతి గలుగుచున్నది. అని శైవుల సంప్రదాయము.

పాద విభాగము : దీని యందు (1) జ్ఞాన (2) క్రియా (3) యోగ (4) చర్యాపాదము అని నాలుగు పాదము లున్నవి.

అందు జ్ఞాన పాదమున: పశు, పతి, పాశమ్ - అను మూడు పదార్థముల స్వరూప లక్షణ ప్రమాణములును ;(1) శివుడు (2) శక్తి (3) సదాశివుడు (4) ఈశ్వరుడు (5) శుద్ధ విద్య (6) మాయ (7) కళ (8) విద్య (9) రాగము (10) కాలము (11) నియతి (12) పురుషుడు (13) ప్రకృతి (14) బుద్ధి (15) అహంకారము (16) మనస్సు (17) శ్రోత్రము (18) త్వక్కు (19) చతుస్సు (20) జిహ్వ (21) ప్రాణము (22) వాక్కు (23) పాణి (24) పాదము (25) వాయువు (26) ఉపస్థము (27) శబ్దము ' (28) స్పర్శము (29) రూపము (30) రసము (31) గంధము (32) ఆకాశము (33) వాయువు (34) అగ్ని (35): సలిలము (36) భూమి-అని ముప్పది యారు తత్వముల స్వరూపమును,

(1) త త్త్వరూపము (2) తత్త్వదర్శనము (3) తత్త్వ శుద్ధి (4) ఆత్మ రూపము (5) ఆత్మ దర్శనము (6) ఆత్మ శుద్ధి (7) శివరూపము (8) శివ దర్శనము (9) శివ యోగము (10) శివభోగము అను పది కార్యలక్షణములును నిరూపించబడి యున్నవి.

క్రియా పాదమున : మంత్ర విభాగమున ఆయా క్రియలకు కావలసిన మంత్రములను, క్రియా విభాగమున కొలతలు, గర్భన్యాసము, శిలాసంగ్రహణము, లింగ మూర్తుల ప్రతిష్ఠ, అనుజ్ఞ, విఘ్నేశ్వరపూజ, వాస్తుశాంతి, మత్సంగ్రహణము, అంకురార్పణము, రక్షాబంధము, కుంభస్థాపనము, కలాకర్షణము, యాగశాల, కుంభాభిషేకము, మహాభిషేకము, మండలాభిషేకము, ఉత్సవములు, ప్రాయశ్చిత్తములు, నిత్యనైమిత్తిక కామ్యపూజలు మొదలగునవి అభివర్ణింపబడినవి.

మరియు (1) మూలాధారము (2) స్వాధిష్ఠానము (3) మణిపూరకము (4) అనాహతము (5) విశుద్ధి (6) ఆజ్ఞ అను షట్చక్రముల స్వరూపము, బ్రహ్మ రంధ్రము, బ్రహ్మ గ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, సహస్రారము, కుండలిని, మొదలగువాని స్వరూపము, యమనియమాది స్వరూపములు, వర్ణాశ్రమ ధర్మాదులు నిరూపింపబడియున్నవి.

చర్యాపాదమున - పూజకు కావలసిన ఉపకరణములు, హవిష్పాకము, ఆరాధన విధులు, ఉపచారములు నిరూపింపబడి యున్నవి.

కాశ్మీరశైవ (అద్వైత) ఆగమములు:- అభినవ గుప్తుడు మొదలగు కాశ్మీర శైవ సంప్రదాయ ప్రవర్తకులు ప్రత్యభిజ్ఞా దర్శనము, స్కందదర్శనము అను శైవా ద్వైత సంప్రదాయములను ప్రవర్తింప జేసిరి. ఈ శైవ సంప్రదాయాగమములు 8 విభాగములుగ నున్నవి. ఒక్కొక్క విభాగమున 8 తంత్రము లున్నవి.

1. భైరవ ( సంప్రదాయాంతర్గత ) తంత్రములు  :- (1) స్వచ్ఛంద, (2) భైరవ, (8) ఛంద, (ఉ) క్రోడ, (5) ఉన్మత్త భైరవ, (6) ఆశిష్టాంగ, (7) మహోచ్చూష్మ (8) కపాలీశ.

2. యామళ తంత్రములు :- (1) బహ్మయామళ (2) విష్ణుయామళ, (3) స్వచ్ఛంద యామళ, (4)రుకు యామళ (5) (6) అథర్వణ యామళ, (7) రుద్ర యామళ. (8) వేతాళ యామళ.

3. మత తంత్రములు  :- (1) రక్త. (2) లంపట.(3) లక్ష్మీచుత, (4) మత, (5) శాలికా, (6) పింగళా, (7) ఉత్ఫుల్ల. (8) విశ్వాద్య.

4. మంగళ తంత్రములు  :- (1) పిచుభైరవీ, (2) తంత్ర భైరవి, (3) తత, (4) బ్రాహ్మీకలా. (5) విజయ, (6) చంద్ర, (7) మంగళా, (8) సర్వమంగళా.

5. చక్రాష్టక తంత్రములు :- (1) మంత్ర చక్ర (2) వర్ణ చక్ర, (3) శక్తిచక్ర, (4) కలాచక్ర, (5) బిందు చ క్ర (6) నాదచక్ర, (7) గుహ్య, చక్ర, (8) ఖ చక్ర.

6. బహురూప తంత్రములు  :- (1) అంధక, (2) రురు భేద (3) అజ (4) మూల (5) వర్ణబంధ (6) విడంగ (7) యాత్రోదన (8) జ్వాలిన్.

7. వాగీశతంత్రములు  : (1) భైరవీ (2) చిత్రికా (3) హంస (4) కదంబికా (5) హృల్లేఖా (6) చంద్రలేఖా (7) విద్యుల్లేఖా (8) విద్యుమత్.

8. శిష్టాష్టక  : (1) భైరవీ శిక్షా (2) వీణా (3) వీణా మణి (4) సమ్మోహ (5) దామర (8) అథర్వక (7) కబద్ధా (8) శిరశ్ఛేద.

వైష్ణవాగమములు - వాని ప్రభేదములు: వైష్ణవాగమములు  :- వైష్ణవ దేవతల యొక్క ఆరాధనాదికముల దెలుపుచున్నవి. ఇవి ప్రధానముగ వైఖానసాగమములు. పాంచరాత్రాగమములు నని రెండు విధములుగ నున్నవి.

“కథం త్వమర్చనీయో౽పి మూర్తయః దృశాస్తు తే |
వై ఖానసాఃకథంబ్రూయుఃకథంవాపాంచరాత్రికాఃః"

అని భారతమున నీ రెండు ఆగమములను సమానస్కంధముగ కీర్తించియున్నారు.

"శ్రీ మహావిష్ణువే పరదైవతమనియు, వారి యారాధనమే మోక్ష హేతు" వనియు నిరూపించుచు, నీ రెండు ఆగమములును పరమైకాంతికధర్మముల బోధించుచుండుటచే "భగవచ్ఛాస్త్రము భాగవతధర్మశాస్త్రము, పరమ సంహిత" అను నామధేయములతో వ్యవహరింపబడుచు సమాన ప్రతిపత్తితో నలరారుచున్నవి. శ్రీ వైష్ణవాచార్యులు ఈ రెండింటికిని సమాన గౌరవము నిచ్చు చున్నారు. శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రములలో, కొందరు వైఖానసాగమములను, మరికొందరు పాంచరాత్రాగమములను అనుసరించుచున్నారు.

వైఖానస గృహ్య సూత్రాద్యనుసారముగ చత్వారింశత్ సంస్కారములను పొందినవారే వైఖానసు లగుదురుగాన, వైఖానసత్వము వంశపరంపరగా రావలసి యున్నది ; ఏ సూత్రానుసారులై నను పాంచరాత్రదీక్షను స్వీకరించిన పాంచరాత్రులగుటకు నవకాశమున్నది. మంత్రతంత్రాదులయందు కొంత భేదమున్నను, భగవదా రాధ నౌపయికములై రెండును ఉపాధేయములై యున్నవి. పాంచరాత్ర సంహితలలోనే వైఖానససంహిత యొకటి గలదు.

వైఖానసాగమములు  : పరమాత్ముని మానసపుత్రుడు విఖనసమహర్షి. గూఢార్థముల ప్రకాశింప జేయుటచే, “విశేషేణ ఖననాత్ విఖనాః" అను వ్యుత్పత్తివలన "విఖనసు" లను పేరు వచ్చినటుల వ్యాసమహర్షి నిర్వచించి యున్నాడు. వేదములను ప్రవర్తింప జేయుటకై చతుర్ము ఖ బ్రహ్మను సృష్టించినటుల, ఆరాధన ప్రక్రియలను బోధించు నాగమ శాస్త్రముల ప్రవర్తింప జేయుటకై విఖనస మహర్షిని పరమాత్ముడు తన సంకల్పముచే సృష్టించెనని చెప్పబడి యున్నది. ఆవిఖనస మహర్షి భగవంతునిచే నుపదిష్టములగు భగవదారాధన క్రమముల నెల్ల తన శిష్యులగు (1) కశ్యప (2) అత్రి (3) మరీచి (4) భృగు (5) వసిష్ఠ (6) అంగిరస (7) పులస్త్య (8) పులహ (9) క్రతువు - అను తొమ్మిది మందికి నుపదేశించి, వారి ద్వారమున సంహితలను ప్రవర్తింప జేసెనని సనాతనులు చెప్పుచున్నారు.

ప్రస్తుతము అత్రి, మరీచి, భృగు, కశ్యపుల సంహితలు మాత్రము ప్రసిద్ధిలో నున్నవి.

సమూర్తార్చనాధికరణము అను సంహితయందు భగవంతుని సమూర్తార్చనము సాంగోపాంగముగ నిరూపింపబడియున్నది, అర్చనము సమూర్తము, అమూర్తము అని రెండువిధముల నున్నది. అమూర్తార్చన మనగా -జవహనీయ- అన్యాహార్య గార్హపత్య,ఆ వసథ్య -సభ్యములను పంచాగ్నులయందు ఆగమోక్త విధానము ననుసరించి హోమాదుల ననుష్ఠించుట; ఇక సమూర్తార్చన మనగా - ఆలయములయందు ప్రతిష్ఠింపబడిన పంచ బేరములగు భగవంతుని బింబములను (విగ్రహాదులను) ఆగమోక్త విధానముగ నర్చించుట కర్షణాది ప్రతిష్టాంత కర్మలు, ఆరాధన - ఉత్సవ క్రమములు, విగ్రహ, గోపుర,ప్రాకారాది నిర్మాణవిధులు విశదముగ నిరూపింపబడి యున్నవి. కాశ్యప మరీచి సంహితలు గద్యాత్మ కములు కాగా, అత్రిభృగు సంహితలు శ్లోకరూపములుగ నున్నవి. ఈ సంహితల కన్నిటికిని పరస్పర సంవాద మున్నది.

పాంచరాత్రాగమములు  : పాంచరాత్రాగమములు అసంఖ్యాకములుగ నున్నవి. అందు 108 సంహితలు ప్రధానములైనవి. ఇప్పటివరకును జరిగిన పరిశోధనల వలన 250 సంహితలవరకు బయటపడియున్నవి. పౌష్కర సంహితయందు 62 వేల శ్లోకపరిమితములయిన పాంచరాత్రసంహిత లున్నవనియు శ్రీ ప్రశ్న, విష్ణు తిలకములయందు అర్దకోటి శ్లోక పరిమితములైన సంహితము లున్నవనియు చెప్పబడి యున్నవి. - పాంచరాత్రాగమ నామధేయములు, వాని వ్యుత్పత్తి  :-(1) ఏకాయనశాఖ, (2) మహోపనిషత్తు, (3) పా త్త్వత శాస్త్రము, (4) భగవచ్ఛాస్త్రము, (5) భాగవతా గమము, (6) పాంచరాత్రము అని వివిధ నామములతో నీ యాగమములు కీర్తింపబడుచున్నవి.

“ఏక ఏవ (శ్రీమన్నారాయణః) అయన (ఆరాధ్యః) ఇతి శ్రుతిః ఏకాయన శ్రుతిః" అను వ్యుత్పత్తిచే “శ్రీమన్నారాయణు డొక్కడే ఆరాధ్యుడు, ప్రాప్యుడు, ప్రావకుడును" అని యువదేశించు వేద భాగమునకు ఏకాయనశ్రుతి యని పేరు. పరమరహస్యములగు. భగవత్తత్త్వములను, ఆత్మల తత్త్వ = హిత - పురుషార్థములను విశిష్టక్రమమున నిరూపించు చుండుట చేతను, నాలుగువేదములు సాంఖ్యయోగములు అన్నియు చేరి ఈ పాంచరాత్ర సంహితయగుటచే మహోపనిషత్తను నామము అన్వర్థ మగుచున్నది. సచ్ఛబ్దవాచ్యుడగు భగవంతుని యొక్కయు సాత్త్వతులగు భాగవతుల యొక్కయు వైభవానుష్ఠానాదుల బోధించు చుండుటచే సాత్త్వత శాస్త్రమను నామ ధేయము యుక్తమగుచున్నది. అందుచేతనే భగవ చ్చాస్త్రము, భాగవతాగమము అను నామధేయములు కలిగినవి. పాంచరాత్రమను నామధేయము మాత్రము - అనేక విధముల నిర్వచింపబడియున్నది. ఈశ్వర సంహిత యందు, భగవంతుని పంచాయుధాంశ సంభూతులగు నైదుగురు యోగులకు నైదు దివారాత్రములు ప్రత్యేకముగ నీశాస్త్రము నుపదేశించియుండుటచే “పాంచరాత్ర"మను వ్యవహారము గలిగినదని చెప్పబడియున్నది. పాద్మ సంహితలో, ఈ శాస్త్రమునకుముందు సాంఖ్యయోగాది పంచమహాశాస్త్రములు రాత్రివలె నిస్తేజ స్త్రములగుచున్న కారణమున పాంచరాత్ర మను వ్యవహారము దీనికి కలిగినది అని చెప్పబడియున్నది. విష్ణుసంహితయందు, రాత్రివలె అజ్ఞానాంధకార వర్థకములగు శబ్ద స్పర్శ రూప రస గంధము లను నైదు విషయము లును, లేక పృథి వ్యస్తేజో వాయ్వాకాశములను నై దుమహాభూతములును అనగా వానివలనగలుగు బంధము, పరమాత్మను సందర్శించినంతనే నశించి పోవును అని యుప దేశము నొసంగుచున్నందున దీనికి పాంచరాత్రమను వ్యవహారము గలిగినదని చెప్పబడి యున్నది. అహిర్భుధ్న్యసంహిత యందు, పర - వ్యూహ - విభవ - అన్తర్యామి - అర్చా స్వరూపములు అనుభగవంతుని పంచావస్థలనుగూర్చి తెల్పుచున్నందున, పాంచరాత్రమని దీనికి పేరు గలిగిన దని - నిరూపించబడి యున్నది.

పాంచరాత్రముల యందలి అవాంతర విభాగము :-(1) ఆగమసిద్ధాంతము, (2) మంత్రసిద్ధాంతము (3) తంత్ర సిద్ధాంతము (4) తంత్రాంతర సిద్ధాంతము అని నాలుగు విభాగములున్నవి. మరియు న్యూన . మధ్యమ - ఉత్తమ భేదముల చేతను, దివ్య- అదివ్య భేదములచేతను అవాంతర విభాగములుకూడ నున్నవి.

ఈ పాంచరాత్ర సంహితల గణన అగ్నిపురాణము నందును, కపిలోంజలసంహితయందును, పాద్మ సంహిత యందును, విష్ణుసంహితయందును, హయశీర్ష సంహిత మొదలగు సంహితలయందును కొంచెము కొంచెము భిన్న భిన్న క్రమము లతో నున్నది. డా. ఒట్టో స్క్రాడరు మహాశయుడు పాంచరాత్రోపోద్ఘాతమను ఆంగ్లవ్యాసమున ఈ ఆగమములను గూర్చి విపులముగ చర్చించి యున్నాడు. డా. ఆర్. జి. భండార్కరు ప్రముఖులు ఆధునిక విమర్శసాధనములను గొని వీని కాల నిర్ణయాదులను గూర్చి చర్చించియున్నారు.

ఈ సంహితలయందును జ్ఞాన- క్రియా- యోగ -చర్యాపాదములు అను విభాగము లున్నవి. ముద్రా విశేషములు, యంత్ర తంత్ర విశేషములు, జపహోమాది ప్రక్రియలు, దీక్షావిధి మొదలగు విషయములు విశిష్టక్రమమున నభివర్ణింపబడి యున్నవి.

శాక్తేయాగమములు  :. శాక్తేయాగమము లకు "తంత్రము" లను వ్యవహారము ప్రసిద్ధమై యున్నది. తంత్రమనగా - దేవతల యనుగ్రహమును సంపాదించుటకై ఫలార్థియగు పురుషుడుచేయు ప్రయత్నము. మంత్ర దేవతోపాసనాదులకు "తంత్ర” మను వ్యవహారము రూఢి అయినది.

ఈ తంత్రములయందు మంత్ర యంత్ర దేవతోపాసనాదులు ముఖ్యముగ నిరూపింపబడి యున్నవి.

శాక్తుల సంప్రదాయము  :- సనాతనుడగు శివుడు నిర్గుణుడు, సగుణుడునుగా నున్నాడు. నిర్గుణు డనగా ప్రకృతి కంటెను పరుడు. అనగా ప్రకృతి సంబంధములేనివాడు. సగుణుడనగా ప్రకృతి సంబంధముగలవాడు. ప్రకృతికే కళయని నామాంతరము, నకళుడై సచ్చిదానంద స్వరూపుడగు పరమేశ్వరునివలన శక్తియు, అందుండి నాదము, దానినుండి బిందువు కలుగుచున్నవి. పరమశక్తిమయ మనునది బిందువు, నాదము, బీజము అని మూడువిధము లగుచున్నది. అందు బిందువు శివాత్మకము, బీజము శక్త్యాత్మకము, నాదము రెండింటి సమవాయము. అటుపిమ్మట బిందువునుండి రౌద్రియు, నాదమునుండి జ్యేష్ఠయు, బీజమునుండి వామయు నను శక్తులు గలుగుచున్నవి. వానినుండి క్రమముగ రుద్ర - బ్రహ్మ - రమా ధిపులు గలుగుచున్నారు. వారలు ఇచ్ఛాశక్తి, క్రియా శక్తి, జ్ఞానశక్తి స్వరూపు లగుదురు. వీరలే వహ్ని- ఇందు.. అర్క స్వరూపులు, శక్త్యవస్థారూపమగు ప్రథమబిందువు నుండి అఖండమైన నాదము జనించుచున్నది. దీనినే శబ్ద బ్రహ్మమని యందురు. సర్వభూతముల యొక్క చైతన్యమే శబ్ద బ్రహ్మము. ఇదియే దేహమధ్యగతమగు కుండలినీ రూపమునొంది గద్యపద్యాది రూపమగు వర్ణాత్మకముగ నావిర్భవించుచున్నది. బింద్వాత్మకుడును, కాలబంధువును, కళాత్మకుడును అగు శంభువునుండి సర్వవ్యాపియగు సదా శివుడుద్భవించును. సదాశివునుండి ఈశుడు, అతనినుండి రుద్రుడు, అతనినుండి విష్ణువు, అతనినుండి బ్రహ్మయు నావిర్భవించుచున్నారు. అటుపై, మూలభూతమగు అవ్యక్తమునుండి మహత్తత్త్వము, దానినుండి త్రివిధమగు అహంకారము కలుగుచున్నవి. అందు వైకారికమగు సాత్త్వికాహంకారమునుండి పది ఇంద్రియములు, తన్మాత్రక్రమ యోగమువలన భూతాదికమగు నహంకారమునుండి పంచభూతములు కలుగుచున్నవి.

దేహమున దక్షిణభాగము సూర్యుడు  ; వామభాగము చంద్రుడు ; పది నాడులలో ఇడ, సుషుమ్న, పింగళ - అను మూడు నాడులు ప్రధానములు, వాయువులు పదియు, వహ్నులు పదియు నున్నవి. ప్రాణమునకు బుభుత్సాపిపాసలు, మనస్సునకు శోక మోహములు, శరీరమునకు జరామృత్యువులు అని షడూర్ములున్నవి. వీనికి వశ్యుడై జీవుడు దుఃఖించుచుండును. అట్టితరి చైతన్యస్వరూపిణియగు పరాశక్తి కుండలీభూత సర్పాకృతిని వహించుచున్నదై, శబ్దబ్రహ్మ స్వరూపిణియై పంచాశద్వర్ణ రూపిణియై మంత్రమయమగు జగత్తును సృష్టించుచున్నది. తదుపరి ఓం, శ్రీం, హ్రీం మొదలగు బీజాక్షరములను సకల మంత్ర యంత్రాదులను సృష్టించు చున్నది. ఇదియే పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి రూపములను బొంది ఆయా వర్ణాత్మకములగు కళలను సృజించుచున్నది.

ఇట్టి మంత్రములను, మంత్రాధిదేవతలను గుర్తెరిగి, యంత్రారాధన పురస్సరముగ జప హోమ తర్పణాదులద్వారా సిద్ధినిబొంది అష్టాంగయోగ నిష్ఠతో కుండలిని నిధ్యానించుచు, సహస్రారమును వికసింప జేసి, ఆకుండలినీ శక్తి ప్రసాదమున శివైక్యమును బొంది బ్రహ్మానందము ననుభవించుటయే పురుషార్థము. అని ఈమత సారాంశము.శారదా తిలకము మొదలగు తంత్రగ్రంథములయం దీ క్రమము అత్యాశ్చర్యకరముగ నిరూపింపబడియున్నది. శైవుల వలె వీరును సర్వతంత్రములకును కర్త మహేశ్వరుడే యని చెప్పుచున్నారు,

గురుశిష్యప దేస్థిత్వా స్వయమేన సదాశివః
ప్రశ్నోత్తర పరైర్వాక్యైః తంత్రం సమవతారయత్.

అని స్వచ్ఛంద తంత్రమున గీర్తింపబడి యున్నది. ఈ తంత్రములు అసంఖ్యాకములుగ నున్నవి. "మయాకృతాని తంత్రాణి సంఖ్యయాష్టోత్తరం శతమ్" అని ఈశ్వరుడు చెప్పినటుల మేరుతంత్రమున గలదు.

శ్రీ ఆర్థర్ ఎవేలన్ (Evelyn) మహాశయుని పర్యవేక్షణమున ఆగమానుసంధాన సమితిచే కలకత్తా నగరమున అనేకములగు శాక్తేయ తంత్రములు ప్రకటింపబడియున్నవి.

ఈ తంత్రములు వామములు, దక్షిణములు అని రెండు విధములుగ నున్నవి. అందు దక్షిణతంత్రములు బ్రాహ్మ ణాదులకును, వామతంత్రములు పాషండాదులకును అనుసరణీయములని "శక్తిజిజ్ఞాస" అను గ్రంథమున చెప్పబడి యున్నది. మేరు తంత్రాదులయం దీవిషయము బాగుగ విశదీకరింపబడినది.

టి. కె. వి. యస్. యస్.

[[వర్గం:]]