Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆకృతి రచన-ఆధునిక నిర్మాణ ద్రవ్యములు

వికీసోర్స్ నుండి

ఆకృతి రచన-ఆధునిక నిర్మాణ ద్రవ్యములు :-వాస్తుశాస్త్రము ఎచ్చటనైనను, భౌగోళిక పరిస్థితులు, శీతోష్ణములు, భూగర్భ పరిస్థితి, మత సాంఘిక రాజకీయ వాతావరణము మొదలగు వాని ప్రభావమును, ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని కలిగియుండును. అయినప్పటికిని భవననిర్మాణమునకు సునాయాసముగా లభించు నిర్మాణద్రవ్యములే అతిముఖ్యమైన అంశములు. ఏలయన భవన నిర్మాణ పరికరములైన ఇటుకలు, రాళ్లు, కలప, కాంక్రీటు మొదలైనవాని ద్వారానే శిల్పి తన యొక్క కలలకు వాస్తవిక ఆకృతిని ఈయగలుగుచున్నాడు.

ప్రస్తుత విషయమును గురించిన చర్చకు దిగుటకు ముందు, వాస్తుశాస్త్రమునందలి వివిధరీతుల యొక్క పరిణతితో, నిర్మాణ ద్రవ్యము లెట్టి పాత్రను నిర్వహించినవో అవగాహము చేసికొనుట కొరకు, పూర్వ పరిస్థితులను అన్వేషించుట మిక్కిలి ప్రయోజనకారి కాగలదు. కలపయే మానవునికి తెలిసిన అత్యంత పురాతనమైన నిర్మాణద్రవ్యముగా కనబడు చున్నది. బౌద్ధుల శిలా వాస్తువు అస్తిత్వములోనికి వచ్చుటకు చాల కాలము క్రిందటనే మన దేశములో దారుమయ నిర్మాణములు ఉచ్ఛస్థితినందు కొన్నవి. బౌద్ధయుగమునకు చెందిన (చైత్యములు, కమానులు, సూర్యవాతాయనములు, వర్తులా కార మైన పైకప్పులు మొదలైన) కళాకృతులు, నిర్మాణము లన్నియు ఆకాలపు పని వారికి సుపరిచితములును, సర్వసాధారణములును ఐన కలప కట్టడములందలి వివిధ రీతులకు రాతిలో నేర్పరచి నటువంటి ప్రతిరూపములే. జనులకు మొట్టమొదట తెలిసిన నిర్మాణ పద్ధతిని 'దూలముల కట్టడము' (Trabeated mode) అందురు. దీనిలో నిలువు స్తంభములు, గొడుగురాయి (Lintel) ప్రధానాంగములు.

ఈ నిర్మాణ విధానము అటుతరువాతివారిచే కూడ అనుసరింపబడినది. కాని, వారు దీర్ఘ కాలము మనునట్టి రాతినే నిర్మాణ ద్రవ్యముగా నుపయోగించిరి. ఈజిప్టు దేశపు శిల్పులు బ్రహ్మాండములైన వారి దేవాలయములను నిర్మించుటకు రాతి స్తంభములను, రాతి దూలములను, రాతి పలకలను ఉపయోగించిరి. సమున్నతమైన రాతి స్తంభములు, గొడుగు రాళ్ళు ఏ పరిమాణముగలవి లభ్యమగునో వానిని బట్టి కట్టడములుండెడివి. కనుకనే బ్రహ్మాండమైన వారి భవనములు అనేక స్తంభములతో గూడియుండి, స్తంభాల వ్యూహమో అన్నట్లు తోచును. వారు వజ్ర కాఠిన్యము గల గ్రానైటు రాతినే తమ భవనముల కుపయోగించిరి. భవనముల యొక్క ఆధారస్తంభములను మిక్కిలి దగ్గర దగ్గరగా నిలుపవలసివచ్చెను. ఇంతే కాక, నల్లరాయి మిక్కిలి కఠినమైనదగుట వలన స్తంభముల మీద గాని, దూలముల మీద గాని ఎటువంటి చెక్కడములను చెక్కుటకు అవకాశము లేక పోయెను, అందుచేత ఈ కట్టడములు చూపులకు శిలాస్తూపములవలె కనుపించును.

గ్రీకుల యొక్క భవనములు కూడ ఇదే సిద్ధాంతము ప్రకారము కట్టబడినవి. కాని అవి ఈజిప్టు దేశపు కట్టడముల కంటె బాహ్య స్వరూపములో భిన్నములుగా నుండెడివి. నిర్మాణములకు గ్రీకులు ఉపయోగించిన శ్రేష్ఠమైననిర్మాణ ద్రవ్యమే ఈ భిన్నత్వమునకు కారణమైయున్నది. వారు ఉపయోగించిన తెల్లచలువరాయి చెక్కడమునకు మిక్కిలి అనుకూలమైన దగుటచే గ్రీకులు దానితో సున్నితమును అతి రమ్యమును ఐన శిల్పకళను అభివృద్ధిపరచగలిగిరి. చలువరాయియే లేకపోయినచో గ్రీకు శిల్పము మరొక విధముగా నుండియుండెడిది.

ఏ ప్రదేశములలో రాయి లభ్యమయ్యెడిది కాదో, అచ్చట పూర్తిగా భిన్నమైనటువంటి నిర్మాణ విధానము వలంబింప బడెడిది. సాధారణముగా నదులు విశేషముగా నుండు ఒండ్రుమట్టి భూములలో రాయి అరుదుగా దొరకును. అస్సీరియా, బాబిలోనియావంటి పశ్చిమాసియా దేశములలోను, యూఫ్రటీస్, టైగ్రిస్ నదితీరముల యందును నివసించు పూర్వజను లకు రాయి బొత్తిగా దొరకక పోవుటచే, వారు తమ భవన నిర్మాణమునకు ఇటుకలు నుపయోగించిరి. భవనముల పైకప్పునకును, గోడలకును ఇటుకలు మాత్రమే ఉపయోగింప వలసివచ్చెను. ఇంటి పైకప్పులు నిలువంపుగా కట్టినసరంబీలుగాను, గోపురాకారముగాను ఉండెడివి. ద్వారబంధములపై నుండు అడ్డరాయిస్థానములో కమానులు (arches) ఉపయోగించ బడుచుండెను. ఈ విధానము కమాను నిర్మాణ విధానము అర్క్యుయేటెడ్ (Arcuated) అని పిలువబడుచున్నది, రాయి దొరకకపోవుటచే మధ్యయుగమునందలి వంగ దేశపు వాస్తువు మిగిలిన భారతదేశ వాస్తువు కంటే పూర్తిగా భిన్నముగా నున్నది. మొగలాయీల కాలములొ తొలుదొల్త నుండిన వాస్తువునకును, వారి ఉత్తరోత్త వాస్తువునకును మిక్కిలి భేదమున్నది. ఇది ప్రధానముగ వారుపయోగించిన నిర్మాణ ద్రవ్యములపై నాధారపడినవి. ప్రథమ దశయందు అనగా బెంగాలు నందలి మొగలు వాస్తువునకు ఇటుకలు, ఎఱ్ఱ ఇసుకరాయి వాడిరి. వారి అనంతర శిల్పమునకు చలువరాతిని వాడిరి.

కాంక్రీటు కనిపెట్టబడుటచే, రోమనులు వాస్తువు విప్లవాత్మకముగ మారినది. వారు విలువంపుగానుండు పైకప్పులను, గోపురములను భారీయెత్తున తయారుచేసిరి. వారు నూతన వాస్తు విధానములను ఆచరణలోనికి తెచ్చిరి. చలువరాయి లోకూర్పు గలిగిన మిశ్రకుడ్యములు, సంకీర్ణ వస్తు చిత్రము (Mosaic) మొదలైనవి ఈ తరగతికి చెందినవి.

మధ్యయుగమున యూరపులో ఒక వినూతనమైన వాస్తువిధానము వృద్ధిపొందినది. ఉపయోగింపబడిన నిర్మాణ ద్రవ్యములు, ఇటుక, రాయి, కఱ్ఱ అయినప్పటికిని గోతిక (Gothic) వాస్తువులో నిర్మాణమునందు నూతన విధానములు పొడసూపినవి. పునరుజ్జీవనయుగ (Renaissance) ప్రారంభమునుండి, వాస్తుశాస్త్రము అభివృద్ధి చెందుట ఆగిపోయినది. సంప్రదాయ సిద్ధమైన కళలను పునరుద్ధరించుటయు, కేవలము సాంప్రదాయిక ఆకృతులనే అనుకరించుటయు పరిపాటి అయిపోయెను. కాని గతశతాబ్దాంతమునుండియు, వాస్తుకళ, పెద్ద పెద్ద అంగలతో పురోగమన మొనర్చుట మొదలు పెట్టినది. పునరుజ్జీవన యుగమునందలి శిల్పమున స్తంభముల యొక్క తారతమ్య పరిమాణమును గురించియు, నిర్మాణమునకు సంబంధించిన వివిధ ప్రత్యేకాంశములను గురించియు, మిక్కిలిశ్రద్ధ వహింపబడెను. భవనములను ఉపయోగించువారి అనుకూలతకుగాని, ప్రయోజనాత్మకమైన ప్రణాళిక కుగానీ తగిన ప్రాముఖ్యము ఈయబడలేదు. ఈవిధముగా శిల్పముయొక్క ఆకృతి రచనకు సంబంధించిన ముఖ్యసూత్రములే అతిక్రమింపబడు చుండెడివి. ప్రజల జీవితములలో గొప్ప మార్పులు కలిగినను, కాలానుగుణముకాని ఆకృతిరచన అనుసరింపబడుచుండెడిది. పారిశ్రామిక విప్లవఫలితముగా కలిగిన వివిధమైన, సాంఘిక, రాజకీయ, పరివర్తనములు ఈయుగము నందలి శిల్పము నెడ నూతన కళాదృష్టిని అహ్వానించునవిగా ఉన్నవి. నూతన యుగమునందలి పవనావసరములు బహుముఖములైనవి. పూర్వకాలము కర్మాగారములు, గిడ్డంగులు, సరకులకోట్లు సాధారణముగా నుండెడివి కావు. జనబాహుర్యము గల నగరములలో అనేక అంతస్తులుగల భవనములు ఆవశ్యకములైనవి. ఈ క్రొత్త రకమైన భవనములకు, ఆనాడు వాడుకలోనున్న వాస్తువిదానము బొత్తిగా అననుకూలముగా నుండెడిది. అందువలన భవన నిర్మాతలు, ప్రాత పద్ధతులను విడిచి కాలానుగుణమైన భవనములు తయారుచేయుటకై ఆలోచనలు సాగించిరి. ఈ విధముగా నిర్మింపబడిన భవనములు పురాతనమును, సంకుచితమును, కాలానుగుణము కానిదియు ఐన శిల్పవిధానము యొక్క సంకెలలనుండి విముక్తి చెందినవి. భౌతికశాస్త్ర రంగమున కలిగిన యభివృద్ధి ఇట్టి నూతన నిర్మాతలకు, వారు చేయు ప్రయోగకార్యములలో మిక్కిలి తోడ్పడినది. నూతన భవన నిర్మాణ రీతులు, నూతన నిర్మాణ ద్రవ్యములు, క్రమక్రమముగా లభ్యములు కాజొచ్చెను. ఈ విధముగా నూతన యుగమున కనుగుణమై వాస్తవికము, వివేకవంతము అయిన నూతన శిల్పవిధానము అవతరించినది.

మూలాధారమైన నిర్మాణ ద్రవ్యములు, ఎట్టిమార్పును చెందక ఆ విధముగనే నిలిచిపోయినవి. శాస్త్రానుగుణమైన నూతన విధానములు సృష్టింపబడి, క్రొత్త నిర్మాణ ద్రవ్యములు రంగములోనికి వచ్చినవి. నేడు ఆకృతి రచన చేయుటలోను, వాస్తవ్యులకు అనుకూలముగా నుండునట్టి భవనములను నిర్మించుటలోను, శిల్పులు ఎక్కువ స్వేచ్ఛను కలిగియున్నారు. సమకాలికమైన శిల్పదృక్పథమునకు ఈ ఆధునిక నిర్మాణ ద్రవ్యము మిక్కిలి తోడ్పడినది. వీనిలో అతిముఖ్యమైన నిర్మాణ ద్రవ్యములు దృఢీకృతమైన కాంక్రీటు, (Reinforced cement concrete) ఉక్కు. భవన నిర్మాతలు ఉక్కును, కాంక్రీటును చాలకాలమునుండి ఉపయోగించుచుండిరి. కాని ఈ పదార్థములకు గల 'దృఢీకృత (Reinforced)' మరియు 'నిర్మాణాత్మక (Structural)' అను విశేషణములవలన, ఇప్పుడుపయోగింపబడు కాంక్రీటు, ఉక్కు, ఇదివరలో ఉపయోగింపబడిన వాటికంటే, భిన్నమైనవను విషయమును తెలుపుచున్నవి. వీటిని నిర్మాణ ప్రయుక్తమైన ఉక్కు, దృఢీకృతమైన కాంక్రీటు అందురు. ఇదియే ఆర్. సి. సి. అనబడును. సిమెంటు-కాంక్రీటునందు నిర్దిష్టమైన కైవారముగల మెత్తని ఉక్కు ఊచలు నిర్దిష్ట సంఖ్యలో చేర్చుటచే దానికి పటుత్వము కల్పింపబడును. దృఢీకృతమైన సిమెంటు-కాంక్రీటు స్తంభములు, దూలములు మొదలగు నిర్మాణాంగములకు ఉపయోగపడు చున్నది. ఉక్కును తయారుచేయు బెస్సిమర్ విధానము 1855 లో కనిపెట్టబడినది. పోతపోసిన ఉక్కు చువ్వలు తయారుచేయబడి, ఆధార స్తంభములుగను, దూలములుగను, ద్వార బంధములపై తొడుగు రాళ్ళుగను ఉపయోగపడుచున్నవి. ఉక్కు ఆధార స్తంభముల యొక్కయు, దూలముల యొక్కయు సహాయముతో పెక్కు అంతస్తులు గల భవనములు కట్టబడుచున్నవి. ఇవి మిద్దెలు, గోడలు, ఇంటిపైకప్పులు మొదలైనవాని భారమును మోయు ఆధార పంజరములుగా నున్నవి. ఇట్టి కట్టడములు ఆధార పంజర నిర్మాణములు (Framed- Structure) అని పిలువబడుచున్నవి. అవి నిర్మాణ ప్రయుక్తమైన ఉక్కుతోగాని, దృఢీకృతమైన కాంక్రీటుతోగాని నిర్మింపబడును. ఈ క్రొత్త నిర్మాణ ద్రవ్యముల యొక్క సంభావ్యతను గురించిన, ప్రప్రథమ ప్రయోగములు ఫ్రాన్సు దేశమున పారిస్ లో 1878-79 సంవత్సరములలోజరిగిన వస్తుప్రదర్శనములోను, విమానముల కొరకై 1916 లో నిర్మింపబడిన హాంగరు (Hanger) లోను చేయబడినవి. ద్వారముల వెడల్పు, స్తంభముల మధ్య దూరము, రాతితోను, కఱ్ఱతోను చేయబడిన దూలముల యొక్కయు, గొడుగురాళ్ళ యొక్కయు, నిడివిని బట్టియు, ఇటుకతో గాని, రాతితో గాని కట్టబడిన కమానుల మధ్యదూరమును బట్టియు, ఎల్లప్పుడు సరిచేయబడు చుండుట మనము చూచియేయున్నాము. ద్వారముల పరిమాణమును, ఆధార స్తంభముల దూరమును, నిర్ణయించుటలో ఈ దృఢీకృతమైన కాంక్రీటు నిర్మాణ ప్రయుక్తమైన ఉక్కు, శిల్పులకు గొప్ప స్వేచ్ఛను కలిగించినవి. ఇదియే వాస్తుశాస్త్ర ప్రపంచములో గొప్ప మార్పును తెచ్చినది. విశాలములగు ద్వారములు, కిటికీలు సాధ్యమగుటవలన నిర్మాణాంగముల యొక్క ఆకృతి రచన అభివృద్ధి చెంది. విస్తరించుటకు అవకాశము కలిగినది. ద్వారములకు, కిటికీలకు జారుడు మడతతలుపులు ఉపయోగించుట వలన, పూర్తిగా గోడ అంతయు తెరచి యుంచుటకు వీలగుచున్నది. దృష్టినిరోధకములు గాని ఉక్కు తునుకలచేత నిర్మింపబడినవగుటచేత, ఈ కిటికిలు చక్కగా చూచుటకు అవకాశము కల్పించుచున్నవి.

గాజుపరిశ్రమ భవననిర్మాతలకు అనేక ఉపయుక్తము లయిన వస్తువులను ప్రసాదించినది. గోడలకు గాజుపలకలు. చపటాచేసిన నడప్రదేశములకు దీపములు, మున్నగు సుందరాలంకార నిర్మాణ ప్రయుక్తమైన గాజువస్తువులు వీనిలో కొన్నియని చెప్పవచ్చును. మిక్కిలి దృఢముగా చేయబడిన గాజుపలకలను కిటికీ తలుపులుగాను, ద్వార కవాటములు గను, ఇప్పుడుపయోగింపబడుచున్నవి. తెరచియున్నపుడు చూచుటకు చక్కని అవకాశమును కలిగించుచు, మూసి యున్నప్పుడు కన్ను చెదురు కాంతినుండి, అధికమైన రక్షణనిచ్చు పల్చని అల్యూమినియం తెరలు నేడు తయా రగుచున్నవి. ఎటువంటి కట్టె పై భాగపు గట్టితనమునకు తీసిపోనిపై, మన్నికగల తేలిక 'ప్లైవుడ్ ' బల్లలు నేడు లభ్యములగుచున్నవి. ఇవి చట్రములకు వెనుక అస్తరు పలకలుగా కూడ ఉపయోగపడును.

ఇదేవిధముగా తయారయిన దిమ్మపలకలు వేగముగా మూసి తెరచుకొను తలుపులవలె నుపయోగకరముగా నుండును. ఆరోగ్యపరికరములు, మురుగునీటి కాలువల ఏర్పాటు, మలవాహక విధానము, పరిశుభ్రమైన నీటిని పట్టణములో సరఫరాచేయు సౌకర్యములు మొదలైనవి భవననిర్మాణవిధానమునందు మార్పులు కలిగించి అతి ముఖ్యమైన అభివృద్ధిని గొని తెచ్చినవి. శబోష్ణములు ప్రసరింపకుండా చేయుటకు కావలసిన వివిధ నిర్మాణ ద్రవ్యములు, కట్టడములు కట్టువారికి ఇప్పుడు దొరకుచున్నవి. ఇవన్నియు, శిల్పులు తక్కువ ప్రతిబంధకములతో భవన నిర్మాణ విధానమును ఏర్పాటు చేయగలుగుటకు మిక్కిలి తోడ్పడుచున్నవి. కృత్రిమ పద్ధతులపై గాలిని. వెలుతురును ప్రసరింపజేయు నవకాశములు సాధ్యమగుటవలన, భవనముల ఆకృతిరచన చేయుటలో, శిల్పులకు మహ త్తరమైన స్వేచ్ఛయు, అవకాశమును లభించినవి. దుకాణములు, కర్మాగారములు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఆరోగ్య స్థానములు మొదలగువానికి, మునుపటికంటే ఉత్తమమైన ఆకృతిరచన చేయుటకును, మునుపటికంటే ఆరోగ్య వంతముగను, ప్రయోజనవంతముగను వాటిని ఉంచుటకును నేడు వీలగుచున్నది.

నూతన భవననిర్మాణవిధానమును, నిర్మాణద్రవ్యములును, పూర్వకాలపు వాస్తు పద్ధతులను పూర్తిగా మార్చి వేసినవి. చట్రనిర్మాణములు పూర్వకాలపు నిర్మాణ విధానముకంటే పూర్తిగా భిన్నములై యున్నవి. వాస్తు శాస్త్ర సత్యమునుగూర్చిన పూర్వభావములు నేడు మార్పు నొందవలసి వచ్చినది. పైనుండి చూచినంత మాత్రమున మోటరుబండి ఎట్లు పరుగెత్తునో, విమానము లెట్లు ఎగురునో నిర్ణయించుట అసాధ్యమైనట్లే, కేవలము కండ్లతో భవనములను చూచినంత మాత్రమున, ఆ భవనములకు ఉపయోగింపబడిన నిర్మాణద్రవ్యముల యొక్క బలిష్ఠతను నిర్ణయింపలేము. ఉదాహరణకు దృఢీకృతమైన కాంక్రీటు తీసికొందము. దీనిలో శక్తిమంతమైన అంశములు దానిలో లీనమై కన్నులకు గనుపించవు. భవనమునందలి ఒకానొక భాగము దుర్బలముగా నున్నట్లు కనుపించినప్పటికిని ఆ భాగము ఏ ఉద్దేశముతో నిర్మింప బడినదో అట్టి ఉద్దేశమునకు తగిన బలమును కలిగియుండవచ్చును. బరువు వహించుగోడలు రంగమునుండి పూర్తిగా అంతర్థానము చెందినవి. ఇప్పుడు భవనములందలి బరువు నంతటిని దృఢీకృతమైన కాంక్రీటుతో చేయబడిన ఆకృతి పంజరములుగాని, ఉక్కు స్తంభములు, దూలములుగాని భరించుచున్నవి. స్థలములకు ఆవరణము కల్పించుటకును, శబ్దమునుండియు, గాలినుండియు వానిని దూరముగా నుంచుటకొరకు మాత్రమే ఇపుడు గోడలు కట్టబడు చున్నవి. ఇప్పటి భవనములు, తమక్రిందినుండి - వీథి, తోట, చిన్న నీటిప్రవాహము మొదలైనవి పోవుచున్నను స్థిరముగా వానికాళ్ళపై అవి నిలుచుటకు సాధ్యమగు చున్నది. ఒక గోడపై జవాబుగా మరియొక గోడ ఉండవలసిన అగత్యమేమియు నేడు లేదు. ఎక్కడకు కావలసిన అక్కడకు జరుపుకొనుటకు వీలయిన తెరగోడల వలనను, అడ్డుగోడలవలనను భవననిర్మాణము చేయుట నేడు మిక్కిలి సుకరముగా నున్నది. అది యిప్పుడు నిర్మాణస్థలమునకును మానవుల అవసరమునకును, మిక్కిలి సన్నిహితముగా నున్నది. ప్రజల యొక్క ప్రస్తుతపు వసతి అలవాట్లు పూర్వములోవలె ఎప్పుడును ఒకే విధముగా మార్పులేక ఉండుటలేదు. అందువలన ఆకృతి రచనా విధానము కూడ పూర్తిగా మారవలసి యున్నది. చెరువుల, ఏరులమీదుగా వ్రేలాడు పెద్ద వితానములను ఏర్పాటు చేయుటగాని లేక భవనమునందలి ఏ అంతస్తు మీదనైనను తోటలను నాటుటగాని, ఇప్పుడు అసాధ్యమైన పనికాదు. ఇల్లు, తోట, ఇప్పుడు సులభముగా ఒకే చోట చేర్చవచ్చును. ఇండ్లలో మార్చుటకు వీలులేని నిర్బంధకరమైన పూర్వకాలపు విభాగవిధాన మంతరించినది. ఇప్పుడు ఇండ్లలోని అంతర్భాగములను అవసరమునుబట్టి శాశ్వతముగాగాని, తాత్కాలికముగాగాని ఏర్పాటు చేసికొన దగిన అవకాశము లభించినది. బల్లపరుపు మిద్దెలు ఇప్పుడు సర్వసాధారణమైనవి. ఇట్టి మిద్దెలను ఏర్పరచు విధానములు మంచుగాని, వర్షముగాని విశేషముగా కురియు దేశములందలి భవన నిర్మాతలకు తెలియనే తెలియవు. బల్లపరుపు మిద్దెలను నీరు చొరనట్టివిగాను, వాతావరణ స్పర్శితములు గాకుండునట్టివిగాను చేయవచ్చును. అందుచేతనే, తడి, పొడి, చల్లదనముగల ఏ వాతావరణమునైనను లెక్క చేయక, ఎట్టి ప్రదేశములలో నైనను, బల్లపరుపు మిద్దెలను ఉపయోగించుకొనవచ్చును. భవనముల ఆకృతి రచనయందు దృఢత్వముండవలెనను పాత ఉద్దేశముపోయి దానికి బదులు తేలికదనము సమసౌష్ఠవము ఉండవలెనను భావములు వచ్చినవి. పూర్వము భవనములను తరచుగా చెట్లతో పోల్చుచుండిరి. ఈ పోలిక యొక్క ఉద్దేశ మేమనగా, భవనములు చెట్లవలెనే భూమిలో పాతుకొనిపోయి సుస్థిరముగా మండవలెనని, కాని ఆధునిక భవనములు కేవలము ఇందుకు విరుద్ధముగా భూమిపై సమసౌష్ఠవముగా నున్నట్లు కనబడును. చట్రముల కూర్పుతో కట్టబడు భవననిర్మాణ విధానము అందమగునట్టి ఉపయోగకరమైన అనేక రూపములను ప్రసాదించినది. కాంక్రీటుతో చేయబడు ఆధునిక నిర్మాణపద్దతులు పెక్కురీతుల నూతన నిర్మాణములకు తావొసంగినవి. నిర్మాణప్రయుక్తమైన ఉక్కు కాంక్రీటులు గణిత సంబంధమైన సరియైన అంచనావేయుటకుకూడ అవకాశ మును కల్పించుచున్నవి. దీనివలన మిక్కిలి యథార్థము లును, ప్రయోజనకరములు నైన ఆకృతులు సిద్దించు చున్నవి.

దీని ప్రభావము వాస్తుసంబంధమైన సౌందర్యదృష్టిపై కూడ ఎక్కువగా పనిచేసినది. అందువలన ఆధునిక వాస్తు శాస్త్రము యొక్క ఆకృతిరచన, నూతనమైన నిర్మాణ ద్రవ్యములను, పురోగమించియున్న నిర్మాణవిధానమును చక్కగా ఉపయోగించుకొను చున్నది. ఈనాటి శిల్పకారులు అకార తారతమ్య రహస్యములను చక్కగా ఆకళించుకొని, ఆకృతి రచనలో నిక్కచ్చిగా అత్యవసరమైన నిర్మాణద్రవ్యములనుతప్ప మిగిలిన వానిని త్యజించుట నేర్చుకొనియున్నారు.

డి. డి. బి.

[[వర్గం:]]