Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆకృతి రచనా సూత్రములు

వికీసోర్స్ నుండి

ఆకృతి రచనా సూత్రములు  :- పూర్తిగా స్వతంత్రములు కాకపోయినను భిన్నములైన రెండు దృక్పథములతో వాస్తు సంబంధమయిన ఆకృతి రచనను (Architectural Design) విమర్శించవలసి యుండును. మొట్టమొదట కేవలము గుణముల నుదృష్టియందుంచుకొని దానిని పరిశీలింపవలసియుండును; అనగా దాని ప్రయోజనముతోగాని, నిర్మాణముతోగాని నిమిత్త మేమాత్రమును లేక దానిని సౌందర్య మీమాంసా దృష్టితో పరిశీలించుట; రెండవ దృక్పథము భవనముయొక్క అవసరానుగుణమగు ఆకృతి రచనను ((Functional design) అనగా భవనముయొక్క ప్రత్యక్షా వసరములు, నిర్మాణము మొదలగు వాటిని దృష్టియందుంచుకొనుట, కార్య నిర్వహణార్థకమైన ఆకృతి రచన యొక్క పరిశీలనమును వాస్తు సంబంధమైన సృష్టిగా మార్చుట - ఆకృతి రచన యొక్క నిబంధనముల యొక్కయు, ఆకృతి రచన యొక్క నిర్మాణక్రమమునకు సంబంధించిన సూత్రముల యొక్కయు పరిజ్ఞానము చేతనే సాధ్యపడును.

ఈ మాత్రములు ఆకృతిరచన చేయువానికి సరియగు మార్గదర్శకములుగా మాత్రమే సహాయపడును, ఆంతే కాని, వాటిని 'తయారుచేసి యుంచబడిన సౌందర్యమును వాస్తుకళలో కల్పించుటకై వివేచనా రహితముగా నుపయోగింపదగిన నిబంధనములనుగ అపార్థము చేసికొనరాదు. భవనములను ఏ విధముగ నైనను ఏ శైలిలో నైనను నిర్మింపవచ్చును; కేవల నిర్మాణ విశేషములుగా (pieces of abstract composition) మాత్రమే,వాటి మంచిచెడుగులు నిర్ణయింపబడును. గుణావగుణ నిర్ణయమునందలి ప్రమాణములు మారుచుండును. కాని నిర్మాణ నియమములు మాత్రము మారక ఒకే విధ ముగా నుండును. శిల్పి తన మనస్సులోని భావమును చక్కగా రూపొందించు విషయమున శిక్షణమును పొందును. నిర్మాణ విషయకము అయిన నియమములు యొక్క జ్ఞానము ఈ విషయమున ఆతనికి సహాయపడును. శిల్పి యొక్క సృష్టి ఒకకళా రచన. అందు సౌందర్య మీమాంసాగుణములుండును. అవి కేవల (ఆకృతి) రచన యొక్క జ్ఞానమును, సాంకేతికత ముఖ్యభావమును వ్యక్తీకరించు సాధనములు మాత్రమే యై యున్నవి. ఆ భావము ఎక్కువ ముఖ్యమైనది. ఒక భవనమునుగూర్చి విమర్శించునపుడు, మానవుని వ్యక్తిగతమగు ఆదర్శము యొక్క యీ ఆవిష్కరణమే విమర్శింపబడు చున్నది.

వాస్తువిద్య ముఖ్యముగా ఒక కళ. అందుచే ఉత్తమ మగు వాస్తు నిర్మాణము కళారచనకు అవసరమయిన ముఖ్య లక్షణముల నన్నిటిని కలిగియుండవలెను. విశిష్ట రచయితలగు టాల్ స్టాయి, రస్కిన్ వంటివారు కళ యొక్క లక్షణమునుగూర్చి విశేషముగా వ్రాసియున్నారు. కళారచనకు అన్వయించు ప్రధాన ధర్మము లన్నియు వాస్తుకళకుకూడ అన్వయించును.

నిష్ఠాపట్యము, సత్యము, కళారచనకు మున్ముందు అత్యవసరములు. వాస్తుశిల్పి తన భావములను వ్యక్తీకరించుట యందు కాపట్యమునకు తావీయకుండ నుండవలయును. వాస్తుశిల్పము నసత్యము వ్యక్తీకరింపబడవలయును. అనగా వాస్తుశిల్పి మోసముచేయరాదు. రస్త్రీ ను చెప్పినట్లు వాస్తుశిల్పమున మూడువిధములైన మోసము లున్నవి:

1. సత్యేతరమయిన నిర్మాణ విధానమును, లేక ఆధారమును సూచించుట.
2. పై భాగములపై రంగువేసి, ఒక వస్తువును అన్య వస్తువుగా ప్రదర్శించుట.
3. పోత, లేక యంత్ర నిర్మితాలంకారములను ఉపయోగించుట.

కళకు సంబంధించిన ఎట్టి రచనకైనను విశిష్ట లక్షణము అనునది రెండవ ముఖ్యావసరము, మొదటి ముఖ్యలక్షణము కళారచన. అది కళావేత్త యొక్క ప్రత్యేకతచే ముద్రితమైయుండవలెను. రెండవ ముఖ్య లక్షణము కట్టడము యొక్క ఉద్దేశమును స్పష్టముగా వెల్లడిచేయవలెను. కళావేత్త సంపూర్ణమైన నిష్కాపట్యముతో ప్రయత్నము చేసినప్పుడే చక్కని కళాసృష్టి ఘటిల్లును. అట్టి సృష్టి ఎల్లప్పుడును కళావేత్త యొక్క వ్యక్తిత్వ విశేషమును ప్రతిఫలించుచుండును. అది రచన యొక్క చైతన్యమును, శక్తిని పెంపొందించును. కళావేత్త ఇతర కళారచనలనుండి ఉత్తేజమును పొందినను, లేక వాటిని అనుకరించినను, సావధానుడయి తన కళా రచనమును స్వీయశక్తిత్వములో మేళవింపవలయును. కేవలము ఇతరులనుండి ఎరువు తెచ్చుకొనుటగాని, అన్యులను అనుకరించుట గాని కళారచనమును చైతన్యవిహీనము గావించును.

భవన నిర్మాణమువలన దాని ఉద్దేశము వ్యక్తము కావలయునన్నచో అన్ని విషయములయందును ఆ యుద్దేశము ప్రస్ఫుటమగునట్లు జాగరూకతతోను, విమర్శ పూర్వకముగాను తయారుచేయబడిన ప్రణాళిక ననుసరించి ఆ భవనమును నిర్మించవలయును.

అకుటిలత్వము, అసందిగ్ధత అనునవి మూడవ ముఖ్య లక్షణమునకు చెందును. వ్యక్తీకరణములో ఎట్టి సంశయాత్మ కతయు ఉండరాదు; అంతేగాక, వ్యక్తీకరణము స్పష్టతతో గూడియుండవలెను, డొంకతిరుగుడు పద్ధతిలో వెల్లడించుటకు ఎట్టి ప్రయత్నమును చేయరాదు.

నాల్గవ ముఖ్యలక్షణము సరళత: చూచువారికి గాని చదువువారికి గాని సులభముగా అర్థముకాని వివరములు ఏ కళా రచనయందును ఉండరాదు. అనవసరములైన వివరము లుండరాదు. వివరములను తగ్గించుటవలన సరళత చేకూరును.

టాల్ స్టాయి ఈ విషయమును చాల రమణీయముగా ఇట్లు చెప్పియున్నాడు: “ఏ కొందరకు మాత్రమో అందుబాటులో నుండు భావానుభవము యొక్క ప్రత్యేకత శ్రేష్ఠత్వము యొక్క ఆదర్శముకాదు, విశ్వజనీనత యే దాని లక్షణము. పరిమాణాధిక్యము, దుర్గాహ్యత, రూపజటిలత - ఇవి నేటి లెక్కప్రకారము శ్రేష్ఠతాదర్శమునకు లక్షణములు కావు. అట్లుకాక సంక్షిప్తత, స్పష్టత, సరళవ్య క్తీకరణము - ఇవి దానికి లక్షణములై యున్నవి.” అత్యుత్తమ రచనకు చేర్చబడునదిగాని దానినుMడి తొలగింపబడునదికాని ఉండజాలదు. అనువిషయము ఎల్లప్పుడును జ్ఞాపకముంచుకొన దగినది.

బాగరూకతతో కూడిన ఆలోచనాపూర్ణత ప్రతి కళారచనకు వలసిన ఐదవదియు, కడపటిదియునగు ఆవశ్యకాంకము,

కళారచనమును శోభావంతముగా చేసెడి అలంకారములు, లేక వివరములు ఏరుకొనుటయందును, వాటిని అవలంబించుట యందును జాగరూకతయు సంపూర్ణాలోచనయు కావలసియున్నవి. అలంకారములు చాల నిగ్రహముతో నుపయోగింపబడవలెను. అవి అలంకార్య వస్తువునకు తగియుండవలయును. భూష్య వస్తువునకును, దానిధర్మమునకును అవి సరిపడనివిగా నుండరాదు; పొసగని స్థానములో వాటిని ఉంచరాదు.

ఎట్టికళారచనకు అయినను పైలక్షణములు అత్యంతావశ్యకములైయున్నవి. ఇవికాక వాస్తుకళావేత్త తనకట్టడము యొక్క ప్రణాళికాకృతిని రచించుటకు సాయపడు కొన్ని ప్రధాన సూత్రములను పరిశీలింపవలసియున్నాడు.

ఒక కట్టడము సాధారణముగ అనేకములగు భాగములతో గూడి యుండును. అవి వేర్వేరు పరిమాణములను, ఆకృతులను కలిగియుండవచ్చును. రచన సుందరముగా కనబడునట్లును, ఉద్దిష్టమైన ప్రయోజనమును కూడ నెరవేర్చునట్లును, కళావేత్త వాటిని యోగ్యముగా కూర్పు చేయవలయును. రచనలోని అంశము లన్నియు అనురూపత, సమత కలవిగ ఉండవలయును. అనేక భిన్న భాగములు క్రమ రహితముగా కేవలము గుదిగుచ్చినట్లు కనబడరాదు. రచన మొత్తము మీద ఏకీకృతమయిన సమష్టి వస్తువు అను అభిప్రాయమును కలిగింపవలయును. రచనలో ఒక 'ప్రధాన భావము"ను సృష్టించుట వలన ఇది సాధ్యపడును.

ఒక అంశముతో గాని భిన్న పరిమాణములుగల ఆనేక అంశములతోగాని అది ఏర్పడియుండవచ్చును. మొత్తము రచనలో అది కీలక స్థానముగా నుండవలెను. ఒకటికంటే ఎక్కువ స్థానములట్టివి (focal points) ఉన్నచో రచన యొక్క ఐక్యమునకు భంగము వాటిల్లును. రచన యొక్క ఐక్యమునకు భంగము కలుగనివిధముగా రచనలోని అన్ని ముఖ్యాంశములును, విభాగములును విని వేశితములు కావలెను.

ఆలేఖకుడు (designer) జాగ్రత వహించి, విసుగు పుట్టని విధముగా తన రచనను మనోహరముగ చేయవలెను. నేర్పుతో తారతమ్యములను లేక వైవిధ్యములను ప్రవేశ పెట్టుటచే ఇది సాధ్యపడును. నిర్మాణము నందలి యుక్తమగు తారతమ్యములచే యుక్త ప్రమాణములు చేకూరును. దాని ఐక్యముకూడ భంగమునొందదు. చక్కని ప్రణాళిక గల గ్రీకు, రోమను భవన భిత్తిశృంగముల (Cornices) ఆకారములు వైవిధ్య ప్రయోగమునకు చక్కని ఉదాహరణములు.

భవన భిత్తిశృంగములో దగ్గరదగ్గరగా వివిధములైన బాహ్య రేఖల అకృతులు ఉపయోగింపబడును. గోడ యొక్క ఉపరి భాగమున ఘనపదార్థములను, "కాళీలను సక్రమముగా నుపయోగించుట దీనికి మరియొక ఉదాహరణము, వాస్తు రచనలోని వివిధ అంశముల యొక్క పరిమాణము లందును, రూపములందును వైవిధ్యము (లేక తారతమ్యము) చూపుట దానిని ఆకర్షణీయముగా చేయుటకు మిక్కిలి అవసరము. వాస్తు సంబంధములైన అలంకారములు వాస్తు నిర్మాణములను, సజీవములనుగా చేయుటకై ఏదోవిధమైన వైవిధ్యముతో నిండియుండును. మంచి అలంకారములు ఎల్లప్పుడును నిర్మాణాత్మక రూపమును పెంపుచేయునవిగా నుండవలెను. అవి కేవలము ఇచ్ఛుచొప్పున తగిలించుటకు గాని, తొలగించుటకు గాని వీలగునట్లు అనుబంధములుగా నుండరాదు. నిర్మాణమునందు ఐక్యమును పదిలపరచుటకు వైవిధ్యము విశేష ప్రకటనము అను రెండు విషయములు ఆవశ్యకములు. కేవలము (1) పదార్థ స్థూలత చేతను, (2) అలంకారసంపద యొక్క కేంద్రీకరణము చేతను, (3) రంగు యొక్కయు, చాయ (tone) యొక్కయు, సౌష్ఠవము చేతను, (4) రేఖ యొక్క అభిరుచి చేతగాని సూచనను లేక ఊహను స్ఫురింపజేయు సూక్ష్మతర విధానాంతరము చేతగాని అధికతర ప్రాముఖ్యమును సంపాదింపవచ్చును.

చక్కని పరిమాణములును, మాపశ్రేణి (scale) యును మంచి ఆలేఖ్యాకృతికి కావలసిన, మరి రెండు అత్యవసర విషయములు. కొన్ని పరిమాణములు మిక్కిలి తృప్తికరములుగా నున్నట్లు కనుగొనబడినవి. అందుచే ఈ పరిమాణములును, నిష్పత్తులును జ్యామితితోడను, మొత్తము మీద గణితశాస్త్రము తోడను కొంత సంబంధమును కలిగి యున్నవను విషయమును కొందరు సూచించిరి. కొన్ని సుప్రసిద్ధములైన కట్టడముల యొక్కయు, అలంకారముల యొక్కయు పరిమాణములను ఏర్పరుచుటలో త్రిభుజము, చతురస్రము లేక వృత్తముల వంటి కొన్ని రేఖాగణితవు ఆకృతులతో స్పష్టమైన సంబంధము కనబడు చున్నదని రూఢిచేయబడియున్నది. సంగీతములోని సంగీతపద రచన (Musical phrasing) యొక్క నిర్మాణమునకును, వాస్తువునకును గొప్ప పోలిక కలదని కొందరు భావించుచున్నారు. ఏమనగా, రెండును గూడ సమ్మేళనము (Harmony) యొక్కయు, విరామముల (Intervals)యొక్కయు, లయ (Rythm) యొక్కయు సూత్రములతో సంబంధము కలిగియున్నవి. సంగీతములో వేగమునకు సంబంధించిన ప్రమాణ మున్నట్లు గనే, వాస్తుకళా వేత్తకూడ పరిమాణమునకు సంబంధించిన ఒక ప్రమాణము నుపయోగించును. పరిమాణ సంబంధము (proportion) ఎప్పుడును "కొలత" (scale) కు సంబంధించియే యోచించవలసి యుండును. చక్కని కొలత వివిధ భాగములకును, ఒండొంటితోడను, మొత్తముతోడను పరిమాణ విషయములో క్రమమైన సంబంధము” అని నిర్వచింప బడియున్నది. ఈ నిర్వచనము పరిమాణ సంబంధమునకుగూడ ప్రత్యక్షముగా అన్వయించును. పరిమాణము (size) యొక్క ప్రమాణము పరిస్థితులపై నాధారపడి యుండును. కాని సామాన్యముగా అది పురుష ప్రమాణముచే క్రమబద్ధము గావింపబడునదిగా నుండును. అనగా సరాసరి మానవుని పరిమాణమును, పరిమాణము విషయములో దానితో సంబంధించియున్న వస్తువులును అని అర్థము. 'కొలత' ను పాటింపక కట్టడముల ప్రణాళికాకృతి రచన సాగించిన యెడల కొలత యొక్క అసత్యభావ మేర్పడు గొప్ప ప్రమాద మెప్పటికిని కలదు. అట్లుచేసినచో కట్టడములు అవి నిజముగా ఉన్న వానికంటె పెద్దవిగా కాని, చిన్నవిగాకాని కనబడును. ఇది కొన్ని సుప్రసిద్ధ భవనముల విషయములోకూడ తటస్థించినది. రోమ్ లోని సెంటుపీటరు యొక్క కేతిడ్రల్ (Cathedral) దీనికొక ఉదాహరణము. దాని నిజపరిమాణమును కనుగొనుటకు కావలసిన లక్షణములు కొరతవడియున్న విధముగా దాని లోపలిభాగము యొక్క ప్రణాళికాకృతి రచన గావింపబడి యున్నది.

వాస్తు రచన చిత్రరచన కంటెను, శిల్పరచన కంటెను న్భిన్నమైనదిగా నున్నది. చిత్రరచన రెండు పరిమాణములతో గూడినది మాత్రమేయై యున్నది. శిల్ప, వాస్తు రచనలు రెండును, మూడు పరిమాణములతో గూడి యున్నవై నను, కొన్ని విషయములలో తిరిగి పరస్పరము వేరుపడునవిగా నున్నవి. వాస్తు రచయిత కట్టడమును నిర్మించుటకు పూర్వము ప్రణాళికలు, తదితరములైన పటములును సిద్ధపరుపవలసియుండును. అట్లే అతడు కట్టడపు వివిధ భాగముల యొక్కయు అంతఃప్రదేశములను పరిశీలింపవలసి యుండును. రచన యొక్క ఈ అంశము వాస్తుకళకు మాత్రమే ప్రత్యేక లక్షణమైయున్నది. ప్రణాశికా రచనను గూర్చియు, ప్రణాళికకును, ఎత్తున(Elevation) కు గల సంబంధమును గూర్చియు ఇప్పుడు పరిశీలింతముగాక ! కేవల ఊహ్యావసరముల దృష్టి తోడను కార్యనిర్వహణార్థకములైన ప్రత్యక్షా వసరముల దృష్టితోడను, ప్రణాళిక యోచింపబడవలసినదై యుండును. నిజమునకు ప్రణాళిక అన్నది ఒక కావలసిన మట్టము లేక మట్టముల వద్ద ఒక కట్టడముగుండా తీసికొనబడిన క్షితిజ సమాంతరమైన (horizontal) భాగము. ఒకే సూత్రావళి ఎట్టి ఆకృతిరచనకై నను వర్తించుచున్నను. ఎత్తు, భూతలదృశ్యము, రంగువేయుట, లేక శిల్పము... వీనిననుసరించి 'ప్రణాళిక' యొక్క అంతర్గత స్వభావము వేరు వేరగుచున్నది. ప్రణాళిక విషయములో దానిని చూచు వానిదృక్పథము కేవలబాహ్యమునకు చెందినదిగా మాత్రమే యుండదు; ‘ప్రణాళిక' అనగా నిజముగా క్రింది అంతస్తు యొక్క ఆకృతి అని అర్ధము; 'వాస్తువేత్త భావన యొక్క సామాన్య ధోరణులను అది ఎల్లప్పుడును వెల్లడించును; అంతేకాక, పై అంతస్తులకు ఆధారముగా నుండగల ప్రయోజనాత్మక భాగములనుగూడ నది వ్యక్తీకరించును. కాని ప్రణాళిక ఒక్కటియే వాస్తువేత్త భావననుగూర్చి సంపూర్ణాభిప్రాయము నిచ్చుటకు సరిపోదు, ఆవరింపబడిన వివిధ భాగములు ఎట్లు కనబడునో అన్న విషయమును, చూచువానికి వివిధ అంతర్భాగములు ఎట్టి అభిప్రాయమును కలిగించునో అన్న విషయమును వాస్తు వేత్త మనస్సులో నుంచుకొనవలసి యుండును. ప్రణాళిక అనగా గోడలు, చెత్త గోతులు (Tooms), వసారాలు మొ॥ వాటిని కాగితముమీద రచింపగా నేర్పడు ఒకానొక మాదిరి రూపము. ఈమాదిరి రూపముకూడ ఆకృతుల విషయములో సమ్మేళనమును, సమత్వ భావమును, కలిగియుండవలయును. కాని ప్రణాళికలు స్వతంత్ర విషయములు కావు. ఎత్తులతోను, విభాగములతోను, (Elevations and Sections) అవి అనుబంధితములై యున్నవి. ప్రణాళికారచనలు కూడ పొందికను కలిగి యుండవలెను. సామాన్యములైన అవిభక్త భాగములను అవి కలిగియుండవచ్చును. అప్రధానములు లేక సహాయార్థకములు అగు ప్రత్యేకావయవములు వాటికి ఉండవచ్చును, లేకపోవచ్చును; లేదా, సామాన్య భాగములు తిరిగి తిరిగి వచ్చు క్రమము, ప్రధానములు మరియు సహాయక అనుబంధములు అను క్రమములో గూడిన పరినిష్ఠితత్వమును కల్గియుండవలెను (Climaxes). స్మారక చిహ్నములుగా నిర్మింపబడెడి కట్టడముల ప్రణాళికలు ఉన్నతస్థాయికి చెందిన విధముగను, మహనీయతా లక్షణముతోగూడిన శైలిలోను, యోచింప బడవలెను. కట్టడము యొక్క అవసరములు జాగరూకతతో పరిశీలింపబడవలెను. మరియు ఆ అవసరముల యొక్క ప్రధానభావమును కల్పించెడి ముఖ్యభాగములకు ప్రణాళికలో ప్రత్యేక ప్రాముఖ్యము నొసంగవలెను. తక్కిన భాగములు దానికి లోబడిన ప్రధానత గలవిగా జేయబడవలెను. సరియగు పరిమాణ సంబంధము నుపయోగించుట, భేదమును చూపుట, ప్రత్యేక ప్రధానతను చూపుట (Accentration) అను లక్షణములను ప్రణాళికను సిద్ధపరచుటలో ప్రణాళికా రచయిత గమనింపవలెను. ప్రత్యేక భాగముల సాధారణ రూపమును, ప్రణాళికలో వర్గీకరణమును, పైనుదహరింపబడిన సూత్రముల సహాయముతో నిర్ణయింపనగును.

కట్టడముల యొక్క బాహ్యభాగములు అంతర్గత రూపముల కొక ఆవరణము మాత్రమే. ప్రణాళికలోని ముఖ్యభాగములు ఎంత వరకు దృశ్యవ్యక్తీకరణమునుకలిగి యుండవలెనో ప్రణాళికా రచయిత నిర్ణయింపవలయును. కట్టడమునకు అవసరమైన వ్యక్తీకరణమును బట్టియు, ముఖ్యభాగముల (Elements) ఔచిత్యమును బట్టియు,ఈ యంశము నిర్ణయింపబడవలెను. ఎత్తులు ఉద్దేశ్యము యొక్క స్పష్టమైన వ్యక్తీకరణమును ద్యోతకము చేయునట్లుగా ప్రణాళికా రచన గావింపబడవలెను.

ఈ ఉద్దేశ్యము యొక్క వ్యక్తీకరణము రూప సౌందర్యమును రచించుకృషితో సమ్మేళన గావింపబడవలెను.ప్రయోజనము (function) ప్రధానముగా ప్రణాళిక ఎట్లు రచింపబడవలెనో నిర్దేశించును.

ఉదాహరణమునకు :- ఒకానొక ఎత్తులో కిటికీలు లేని యెడల దాని అంతర్భాగము, పైనుండి వెలుతురు వచ్చునట్లు చేయబడినది, లేదా మానవనిర్మిత సాధనములచే వెలిగింపబడినది, అని మనము సులభముగా నూహింపగలము; అందుచే ఆ కట్టడము ఈ విధమైన వెలుగు అవసరమైన జాతికి జెందియున్నదని మనము తెలిసికొనవచ్చును.

లభ్యమయ్యెడి నిర్మాణ ద్రవ్యములను బట్టియు, వ్యయము యొక్క పరిమితులను బట్టియు, వాస్తువేత్త యొక్క ప్రణాళిక సాధారణముగా మార్పుచెందు చుండును. కాని అతని ప్రణాళికల యొక్క సాఫల్యము ప్రణాళికాకృతి రచనకు సంబంధించిన ఈ మూలాధారక సూత్రముల ననుసరించుటపై చాలవరకు ఆధారపడి యుండును.

డి. డి. బి.

[[వర్గం:]]