Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్ర విశ్వవిద్యాలయము

వికీసోర్స్ నుండి

ఆంధ్ర విశ్వవిద్యాలయము  :- భారత స్వాతంత్య్రొద్యమమునకు పూర్వము మద్రాసు రాష్ట్ర పాలన ములో నున్న ఆంధ్రులకు చిరవాంఛితములు మూడు. ఇవి వారి భాషా సంస్కృతి వికాసముల కొరకొక విశ్వవిద్యాలయము, ఆంధ్ర జాతీయ సైనికదళము (Andhra Regimental corps), వారి భాషాప్రాంతములతో కూడిన ఆంధ్రరాష్ట్రము. ఈ మూడింటిలో మొదటి వాంఛకు ఫలసిద్ధి 1926 నాటివరకు కలుగనేలేదు.

పూర్వ రంగము  : అధునాతన భారతీయ విద్యాచరిత్రములో మొట్టమొదటి విశ్వవిద్యాలయములు మూడు. మద్రాసు, బొంబాయి, కలకత్తా. వీటిని 1857 లో స్థాపించిరి. అర్ధ శతాబ్ది అనుభవముపైన విశ్వవిద్యాలయములు కేవల పరీక్షాధికార సంస్థలుగా మాత్రమే గాక బోధనా సంస్థలుగా కూడ పెంపొందవలయునన్న అభిప్రాయము ప్రబలమైనది. అది కారణముగా 1919 లో సర్ మైకేల్ శాడ్లర్ (Sir Michael Saddler) అధ్యక్షతను కలకత్తా విశ్వవిద్యాలయ పర్యవేక్షక సంఘము నియమింపబడినది. వారి సూచనల ప్రాతిపదికపై లక్నో, ఢక్కా, ఢిల్లీ, అలీఘర్ విశ్వవిద్యాలయములు వెలసినవి. మద్రాసు ప్రభుత్వము వారు కూడ తమ రాష్ట్రములోని ప్రతి భాషా ప్రాంతమునకు ఒక్కొక్క విశ్వవిద్యాలయ ముండవలయు ననియు, ముఖ్యముగా తెలుగు భాషా ప్రాంతమునకు ఆంధ్ర విశ్వ విద్యాలయము అత్యవసరమనియు నిర్ణయించిరి. శ్రీ ఎల్. ఏ. గోవింద రాఘవయ్యర్ గారి అధ్యక్షతను 20 మంది సభ్యులు గల ఒక సంఘమును నియమించిరి. అదే సమయమున ప్రాచ్య పాశ్చాత్య ఖండములందలి విశ్వవిద్యాలయముల నన్నిటిని సందర్శించి వచ్చి స్వదేశ రాజకీయములందు అడుగిడిన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారిని కూడ ఒక సభ్యునిగా పునరాలోచనా ఫలితముగ నియమించిరి. ఆ సంఘపు నివేదికను రచించు బాధ్యత సర్వము వారిపైననే బడినది. గోవింద రాఘవయ్యర్ సంఘము వారు తమ నివేదికను ప్రభుత్వమున కంద జేసిరి.

శాడ్లర్ నివేదిక నమసరించి మద్రాసు విశ్వవిద్యాలయ చట్టమును సవరించిరి గాని ఆంధ్రవిశ్వవిద్యాలయ నిర్మాణ విషయమును గూర్చి ప్రభుత్వమువారు ఉదాసీనత వహించిరి. 1923 సంవత్సరమున శ్రీ (తరువాత సర్) ఆర్. యం. స్టాధవ్ గారు తమ నివేదికను ప్రచురించుచు ఆంధ్ర విశ్వవిద్యాలయ నిర్మాణ ఆవశ్యకతను, ఏతత్పురోభివృద్ధికి వలయు మార్గములను స్పష్టముగా వివరించిరి. ఇప్పటికి విశ్వకళా పరిషత్తు స్థాపన నిర్ధారణమైనది. కాని దాని స్వరూప నిర్ణయమును గూర్చి ఎన్నియో తగవులు వచ్చినవి. ఇది ఏకైక బోధనా సంస్థగా నుండవలయునా లేక కేవల పరీక్షాధికార సంస్థగా నుండవలయునా లేక ఉభయ బాధ్యతలను నిర్వహింపవలయునా యన్నది ఇదమిత్థమని నిర్ణయము కాలేదు. చివరకు ఆనర్సు యమ్.ఏ., యమ్.యస్.సీ. మొదలగు పట్టములకు వలయు శిక్షణము కేంద్రమునందు మాత్రమే యొసంగి బి.ఏ. వరకు శిక్షణ నొసంగు కళాశాలలు ఎల్లెడల నెలకొల్పుటకు నిశ్చయించిరి, ఐనను కేంద్రమును గూర్చి పెక్కు తగవులుండుటచే విశాఖపట్టణము, రాజమహేంద్రవరము, అనంతపురము పట్టణములు మూడు కేంద్రములుగను, విశ్వవిద్యాలయ కార్యస్థానము బెజవాడలో నుంచుటకును నిర్ణయించిరి. ఇంతవరకు వచ్చిన తరువాత నామకరణ విషయములో “ఆంధ్ర" శబ్దమునకు బదులు "తెలుగు" నుపయోగింపవలె నను వాదము చెలరేగెను. ఈ సందర్భములో ప్రసంగించుచు శ్రీ రామలింగా రెడ్డిగారు ఇట్లు నుడివిరి. “ఆంధ్ర మహాభారతకర్తల నాటినుండియు ఆంధ్రశబ్దము తెలుగు మాట్లాడువారిని గూర్చియే ఉపయోగింపబడినది. ఇది సర్వజనాంగీకారము వడసినది. ద్రావిడాభి మానమును పురస్కరించుకొని భాష, సంస్కృతి ప్రాతిపదికగా గల సంకుచితాదర్శములు లేకయుండుటయే మేలు" అనిరి. దానితో తెలుగువారి విశ్వవిద్యాలయమునకు "ఆంధ్ర విశ్వవిద్యాలయము" అని పేరు స్థిరపడినది.

ప్రథమ ఘట్టము  : ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టము 1926 వ సం. ఏప్రిలు 26 వ తేదీన గంజాము, విశాఖ పట్టణము, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, బళ్లారి, అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో, అమలులోనికి వచ్చినది మొదటి ఛాన్సలర్ మద్రాసు గవర్నరైన లార్డ్ గోషన్ మొదటి ప్రోఛాన్సలర్ శ్రీ బొబ్బిలి రాజావారు, విశ్వ విద్యాలయ నిర్వహణకు గౌరవ ఉపాధ్యక్షులు కాక సర్వవిధముల సమర్థుడైన ఒక వైస్ ఛాన్సలర్ను ఉద్యోగిగా నియమించుట అవసరమని గుర్తెరింగి ప్రభుత్వమ వారు మేధావులు, అనుభవజ్ఞులు అగు శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డిగారిని ఆ పదవికి నియమించిరి. శ్రీ సి.డి. యన్. చెట్టిగారు మొదటి రెజిస్ట్రారు. 1926 సం. ఆగష్టు 30 వ తేదీన బెజవాడ మ్యూజియమ్ హాలుబో సెనేట్, అకాడమిక్ కౌన్సిలు మున్నగు కార్యవర్గములకు ప్రారంభోత్సవమైనది. సంస్కృతాంధ్ర భాషాపోషణమునకు గాను శ్రీ బొబ్బిలి మహారాజావారు ఒకలక్ష రూపాయల భూరివిరాళ మొసంగిరి, నాటికి విశ్వవిద్యాలయాధికారము క్రింద రాజమహేంద్రవరములోని టీచర్సు ట్రయినింగు కాలేజి, విశాఖపట్టణములోని మెడికల్ కాలేజి కాక 12 కంటే తక్కువ కళాశాలలు మాత్రమే ఉన్నవి. మొదటి సంవత్సరములోనే కొన్ని క్రొత్త కళాశాలలను స్థాపించుటకు, ప్రాత కళాశాలలను ఉన్నత స్థాయికి తీసికొనివచ్చుటకును ఆయా కార్యనిర్వాహక వర్గములు చేసిన విజ్ఞప్తులను విశ్వవిద్యాలయపు అధి కారులు సానుభూతితో పరిశీలించిరి. సుప్రసిద్ధ ఆంధ్ర చిత్రకారులగు శ్రీ కౌతా రామమోహన శాస్త్రిగారు శ్రీ రెడ్డిగారి సూచనల ప్రకారము విశ్వవిద్యాలయ ముద్రను చిత్రించిరి. ఈ ముద్ర ఆంధ్రజాతి ఔన్నత్యమును, ఆశయములను ప్రస్ఫుట మొనరించుచున్నది. 64 కోణములుగల చక్రమున్నది. దాని కిరు కెలంకుల రెండు సర్పరాజము లున్నవి. లోపల స్వస్తిక, "తేజస్వీ నావధీతమస్తు" అను సూక్తి తెలుగు లిపిలోను ఉన్నవి. చక్ర మధ్యమునందు సంద్రము, సప్తకిరణు డగు ఉదయ భానుడు, పద్మము కలవు. ఈ చక్రమున కడుగున రేఖా మాత్రముగా బాలచంద్రు డున్నాడు. బాలచంద్రునకు దిగువున, నాగుబాముల తోకలకు పైనగల చోటులో తెలుగు లిపిలో “ఆంధ్ర విశ్వకళా పరిషత్" అని లిఖింప బడియున్నది. ఈ ముద్ర అత్యంత సుందరము ప్రతిభా సమన్వితము అయి కన్పట్టుచున్నది.

విశ్వకళాపరిషత్తు స్థాపించునాటికి ఆర్ట్సు, సైన్సు, బోధనాభ్యసనము(Teaching), వైద్యము మొదలగు శాఖలు మాత్రమే గలవు. గణితము, భౌతిక శాస్త్రము, పదార్థ విజ్ఞాన శాస్త్రము, వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, భూగర్భ శాస్త్రము, మానవశరీర శాస్త్రము మున్నగు శాఖలలో బి.యస్.సి. డిగ్రీని నెలకొల్పుటకు వలయు ప్రయత్నములను చేసిరి. బెజవాడ పురపాలక సంఘము కృష్ణా, గుంటూరు జిల్లాబోర్డులు ఒసంగిన విరాళముల నుండి విద్యార్థులకు ఉపకార వేతనముల నెలకొల్పిరి ఆనర్సు డిగ్రీ కోర్సులను స్థాపించుటకు వలయు ప్రయత్నము లన్నిటిని చేయ నారంభించిరి. ఇంతలో మంత్రివర్గము మారినది. శ్రీ పానగల్లు రాజావారి స్థానే డాక్టర్ సుబ్బరాయన్ గారు మద్రాసునందు మంత్రిగా నాయకత్వము వహించిరి. 1927 వ సం. డిశంబరు 5వ తేదీన ఆచార్య శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణయ్యగారు ప్రథమ పట్ట ప్రదానోత్సవ సందర్భమున స్నాతకోపన్యాసము. నొసంగినారు. 1928 లో శ్రీ సి. ఆర్. రెడ్డిగారు ప్రథమ ఉపాధ్యక్షులుగా ఎన్నికయినారు. ఈ ప్రథమ దశ పెక్కు బాలారిష్టములతో గూడియుండెను. ఉన్నత విద్యయందు శిక్షణము నొసంగు సంస్థలు ఒకేచోట కేంద్రీకరించుటయా లేక, వివిధ శాఖలను వివిధ కేంద్రములయందు నెలకొల్పుటయా అను విషయముపై తర్జనభర్జనలు సాగెను. 1929 సం. జనవరి నెలలో మద్రాసు కౌన్సిల్ వారు ఉన్నత విద్య యావత్తు ఒకే కేంద్రమునందు గరపవలయునని తీర్మానించిరి.

ఇక విశ్వవిద్యాలయ కార్యస్థాన మెక్కడ అను విషయముపై ఎడతెగని చర్చలు జరిగినవి. తుదకు ఈ కార్యస్థానమును విశాఖపట్టణములో నెలకొల్పుటకు నిశ్చయించిరి, వైద్యకళాశాల యుండుటవలనను, హార్బర్ నిర్మాణము కొనసాగుట వలనను విశాఖపట్టణమునకు రానున్న ఆధిక్యమును గుర్తించి వాల్తేరు కొండలపై ఆదర్శ విద్యా సంస్థా నిర్మాణమునకు తగిన వాతావరణ ముండుటను గమనించి 1930 సంవత్సరము సెప్టెంబరు 5వ తేదీన "హోటల్ సెసిల్" భవనమును అద్దెకు గైకొని విశ్వకళా పరిషత్కార్యాలయమును వాల్తేరులో స్థాపించిరి. ప్రభుత్వము వారు ఇంతకుముందు కంటె ఈపైన ఏటేట ఎక్కువ ధన మొసంగుట కంగీకరించుటయే గాక భవన నిర్మాణమునకుగాను 7½ లక్షల రూప్యముల నొసంగిరి. 1928-29 నాటికి విశ్వవిద్యాలయ పుస్తకళాండాగారముగూడ ఒక విధముగ చెప్పుకోదగిన స్థితికి వచ్చినది. 'రావుబహద్దర్ శ్రీ డి. లక్ష్మీనారాయణగా రొసంగిన 5400 ప్రతులతో పుస్తక భాండాగా రము మరికొంత పెరిగినది. ధనాభావముచే ఇంతకంటె విస్తృతిచెందలేదు.

ద్వితీయ ఘట్టము  : బెజవాడ నుండి వాల్తేర్ నకు మారుటలోనే విశ్వవిద్యాలయ జాతకమునందే కొంత మార్పు కానిపించినది. రాయలసీమ కళాశాలలు ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి విడిపోయి మద్రాసులో చేరినవి. "హోటల్ సెసిల్" చుట్టుప్రక్కల నున్న 22½ ఎకరములను ప్రభుత్వమువారు సేకరించి, 3 లక్షల పై చిల్లర రూప్యములకు కొని విశ్వవిద్యాలయమున కొసంగినారు. ఇదే సమయమున గాంధీమహాత్ముని దండి సత్యాగ్రహము ప్రారంభమయినది స్వాతంత్రోద్యమము నణచుటకు ప్రభుత్వమువా రనుసరించిన విధానము పట్ల నిరసనము తెలుపుచు శ్రీ రామలింగా రెడ్డిగారు తమ పదవీ త్యాగము చేసినారు. విశ్వవిద్యాలయపు సెనేటు వారు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణయ్య గారిని శ్రీ రెడ్డిగారి స్థానే ఎన్నుకొనిరి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణపండితులు పదవీ స్వీకార మాదిగా తమ కార్యాచరణ దక్షతను, దూరదృష్టిని, దృఢ సంకల్పమును కార్యరూప మొందించిరి. విశ్వవిద్యాలయములో తెలుగునందు, చరిత్రయందు ఆనర్సు కోర్సులను స్థాపించిరి. 1939 సంవత్సరము జులై నెలలో 6 గుకు అధ్యాపకులతో విశాఖపట్టణము మహారాణీ పేటలోని బొబ్బిలి హాలులో ఆంధ్ర విశ్వకళా పరిషత్కళాశాల యవతరించినది. భౌతిక విజ్ఞాన శాఖలతో పాటు ఇటు ఆర్ట్సుకళాశాలలో వేదాంత శాఖ, గణిత శాఖ గూడ నెలకొల్పబడినవి. 1933 నాటికి ఉపాధ్యాయ వర్గము 17 వరకు పెరిగినది. 1934 లో "బ్రిటానియా బిల్డింగ్ అండ్ ఐరన్ కంపెనీ" వారు విశ్వవిద్యాలయ భవన నిర్మాణమును ప్రారంభించిరి. సమున్నతమైన వాల్తేరు కొండలపై ఇరుపార్శ్వములు బంగాళాఖాతము, ఎదుట ఋషి కొండ, డాలిఫిన్సోనోస్ పర్వతములు కన్పట్టుచు నున్న విశాల ప్రదేశములో భవన నిర్మాణము ప్రారంభమైనది. ఇదే వత్సరములో జయపురాధీశ్వరులగు శ్రీ శ్రీ విక్రమదేవ వర్మగారు 50 వేల రూప్యముల భూరి విరాళ మొసంగిరి, మరుసటి సంవత్సరము దానిని 75 వేలకు పెంచిరి. తదనంతరము ఏటేట ఒక లక్ష రూప్యముల నొసంగుటకు అనుమతించిరి. వారి అనంతరము వారి వారసులు ఏటేట ఒక లక్షగాని దానికి బదులుగా ఒకేమారు 15 లక్షల రూప్యముల నొసంగుటకు గాని ఏర్పాటు నొనర్చిరి. ఇట్టి మహాశయుని విద్యాపోషణాభిలాషకు గాని వారివారి ఔదార్యమునకు గాని ఆంధ్ర దేశములో సాటిలేదు. అప్పటినుండియు వారిపేర సైన్స్ కళాశాల 'జయపూర్ విక్రమదేవ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండు టెక్నాలజీ' అను పేర విలసిల్లుచున్నది. ఈ సుందర భవనమునకు పైన ముందు భాగమున 30 వేల రూప్యములు వ్యయమొనర్చి నిర్మించిన గడియార స్తంభమున్నది. శ్రీ విక్రమదేవ వర్మగారిపై గల భక్తి విశ్వాసములను ప్రకటించుటకు గాను ఆ కళాశాలావరణలో శ్రీవారికంచు విగ్రహమును ప్రతిష్టాపనము చేసిరి. కళాశాల పుస్తక భాండాగారము, పరిశోధనాలయములు నానాటికి అభివృద్ధి చెందినవి. తొలుదొల్త విస్తృతమగుచున్న కళాశాలలకు ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ (సర్) జె.సి.కొయాచే అను విఖ్యాత అర్థశాస్త్రవేత్తను నియమించిరి. డాక్టర్ లుడ్ విగ్ వుల్ఫ్ అనువారు సైన్సు కళాశాలాధ్యతులైరి. 1938 నాటికి శ్రీ సూరి భగవంతముగారు ఉభయ కళాశాలలకు ప్రిన్సిపాల్ అయినారు. అప్పటి కప్పుడే విశ్వవిద్యాలయము బహుముఖ వ్యాప్తిని బొంది పేరు ప్రతిష్ఠలు నందినది. చెప్పుకోదగిన పరిశోధనము భౌతిక విజ్ఞానశాఖలయందు సాగినది. అంతేగాక శ్రీ రవీంద్రులు “మానవుడు” అను శీర్షిక పైనను, శ్రీ సి. వై. చింతామణిగారు "సిపాయీల కలహానంతరము నుండి భారత రాజకీయములు" అను శీర్షిక పైనను ఘనమగు ఉపన్యాసముల నొసంగిరి. ఈ ఉపన్యాసావళి శ్రీ అల్లాడి కృష్ణ స్వామయ్య గారి భూరి విరాళ ఫలితముగ వ్యవస్థాపితమైనవి. విశ్వవిద్యాలయ ప్రచురణ శాఖవారు ఎన్నియో ఉద్గ్రంథములను ప్రచురించినారు. ఈ రచయితలలో రామలింగా రెడ్డిగారు, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్యగారు, బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రులుగారు, డాక్టర్ కె.ఆర్. సుబ్రహ్మణ్యం గారు మున్నగువారు ఎందరెందరో విద్యాధికులున్నారు. శ్రీ రాధాకృష్ణయ్యగారి పదవీకాలమున పసిబిడ్డయైన ఆంధ్ర విశ్వవిద్యాలయము సుందర స్వరూపమును దాల్చి నవ విలాసముతో ప్రత్యేకతనుగడించి విద్యా సేవ యొనర్చినది తృతీయ ఘట్టము  : స్థలనిర్దేశమైనది. భవననిర్మాణమైనది. కళాశాలలు వెలసినది. విఖాత ప్రచురణములు వెలువడినవి. విశ్వవిద్యాలయమునకు దేశములో ఒక స్థాయి, గౌరవము ఏర్పడినవి. డాక్టరు రాధాకృష్ణయ్య గారు ఉపాధ్యక్ష పదవినుండి విరమించిరి. తిరిగి శ్రీ రామలింగా రెడ్డిగారు ఉపాధ్యకులైనారు. వీరి ఉపాధ్యక్షత, శ్రీ జయపుర మహారాజావారి ప్రో ఛాన్సలర్ పదవి నిర్విరామముగా 12 ఏండ్లపాటు కొనసాగి విశ్వవిద్యాలయమునకు అమిత శుభముల నొనగూర్చినవి. శ్రీ రెడ్డి గారి ఆధ్వర్యమున విశ్వకళా పరిషత్తు బహుముఖ వ్యాప్తి నొందుటయేగాక దేశములోని విశ్వ విద్యా లయములలో తనకు గల ప్రత్యేకతను నిరూపించు కొన్నది. ఆధునిక శాస్త్ర విజ్ఞానములో పరిశోధనలు జరిపి శాస్త్ర విజ్ఞానమును పెంపొందించినగాని దేశమునకు ముక్తి లేదని దృఢముగా నమ్మినవారిలో శ్రీ రెడ్డిగారొకరు, దానికి తార్కాణముగ తమ విశ్వకళా పరిషత్తులో భౌతిక విజ్ఞానశాఖల అభివృద్ధికిగాను ప్రత్యేక శ్రద్ధ చూపి పెక్కుమందికి డాక్టర్ పట్టములు ప్రసాదించి, విశ్వవిద్యాలయమునకు కీర్తి దెచ్చిరి. విశ్వవిద్యాలయము లోని విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల సంఖ్య, అనుబంధ కళాశాలల సంఖ్య, నిరంతరము పెరుగుచునే వచ్చినవి. ఆంధ్రదేశమునందలి ప్రతిపట్టణమందును ఒక కళాశాల వెలసినది. వాల్తేరులో “ఎర్ స్కిన్ కాలేజి ఆఫ్ నేచురల్ సైన్సు" క్రొత్తగా స్థాపించిరి. ఇందు జంతుశాస్త్ర, వృక్షశాస్త్ర, భూగర్భ శాస్త్రాది ప్రకృతి శాస్త్రములలో శిక్షణము నొసంగుచున్నారు. ఇంకను శ్రీ రామలింగా రెడ్డి గారి అభీప్సితములలో కొన్ని నెరవేరకయే పోయినవి. స్త్రీలకు గృహనిర్వాహకశాస్త్ర కళాశాల స్థాపింపలేక పోయిరి. సంస్కృత భాషాశాఖ, ప్రాచ్య విద్యాబోధనా నిలయము రూపొందలేదు. ఆంగ్లభాషయందు ఆనర్సు తరగతులు నెలకొల్పలేదు. ఐనను నిజాంప్రభువుగారు లక్షరూపాయలు, తిరువాన్కూరు మహారాణియగు సేతు పార్వతీబాయిగారు లక్షరూపాయలు విరాళ మిచ్చిరి. శ్రీ తిక్కవరపు రామిరెడ్డి ప్రభృతులనుండి, ఇతర స్థానిక సంస్థలనుండి మరికొన్ని విరాళముల చేకూర్చి శ్రీ రామ లింగారెడ్డిగారు సకల విధముల విశ్వకళా పరిషదభివృద్ధికి కారకులైరి. 1942 లో అట్టివారి షష్టిపూర్తి ఉత్సవము జరిపి విశ్వవిద్యాలయము తన్ను దాను గౌరవించుకొన్నది.

యుద్ధకాలము - గుంటూరు  :- సర్వాంగ సుందరమైన విశ్వవిద్యాలయము తన పనిని సక్రమముగ కొనసాగించు కొను సమయమునకు రెండవ ప్రపంవ సంగ్రామము సంభవించినది. జపాను దేశస్థులు విశాఖపట్టణముపై బాంబులు వేయుటచే విశ్వవిద్యాలయము గుంటూరు నకు తరలింపవలసి వచ్చినది. 1946 వరకు రసాయనశాస్త్ర శాఖ మదరాసు ప్రెసిడెన్స్ కాలేజిలో ఉండవలసి వచ్చినది. గుంటూరులోనున్న కాలములో సహితము అనేక నూత్న శాఖలు నెలకొల్ప బడినవి. బందరులో లా కాలేజి స్థాపించిరి. ఇంగ్లీషులో ఆనర్సుకోర్సును నెలకొల్పిరి. ఇంకను ఎన్నియో నూతన శాఖలను స్థాపించుటకు, ఉన్న వానిని పెంపొందించుటకు ప్రణాళికలు తయారుచేసి, ప్రభుత్వమున కంద జీసిరి. ఈ కాలములో శ్రీ చెట్టి గారి అనంతరము శ్రీ వి. యస్. కృష్ణా గారు,వారి తర్వాత శ్రీ కె.వి. గోపాలస్వామి గార్లు రెజిస్ట్రారు లైరి. ఎందరో మహానుభావులకు గౌరవ పట్టముల నొసంగి విశ్వకళా పరిషత్తు తన గౌరవమును పెంపొందించు కొనినది. శ్రీ రామ లింగారెడ్డి పేరు స్థాపించిన జాతీయ బహుమానములను, సర్ సి. వి. రామన్, ప్రొఫెసర్ యస్. చంద్రశేఖర్ (గణితము) సర్ సాహెబ్ సింగ్ హాకీ, సర్ శాంతి స్వరూప్ భట్నాగర్. శ్రీ బీర్బల్ సహానీ, మహర్షి శ్రీ అరవిందయోగి మున్నగు ఘనులు కొసంగినారు. ఈ కాలములో ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు ఎన్ని యో దిక్కులనుండి ధనసహాయము లభించుటయు, బహుముఖ వ్యాప్తినొందుటయు సంభవించినది. కేంద్రప్రభుత్వము వారు భూ తత్త్వ పరిశోధన శాఖకు, టెక్నాలజీ మొదలగు వైజ్ఞానిక శాఖలకు మిక్కుటముగ ధనసహాయ మొనరించుచున్నారు. 1946లో తిరిగి 'వాల్తేరుకు వచ్చి, ఇల్లు చక్క పెట్టుకొని విశ్వవిద్యాలయము తన కార్యనిర్వహణమును అత్యంతోత్సాహముతో కొనసాగించినది. ఎన్ని యో నూతన శాఖలు వెలసినవి. అందు ముఖ్యముగ మీటియరాలజీ, ఫార్మస్యూటిప్పు మొదలగునవి చెప్పతగినవి. స్వాతంత్య్రొద్యమము, ఆంధ్ర రాష్ట్రావతరణము దేశమంతటితోపాటు విశ్వకళాపరిషత్తునకు అత్యంత శుభోధర్కము లైనవి. సంస్కృత శాఖను నెలకొల్పుటకు సుప్రసిద్ధులగు శ్రీ కున్హం రాజాగారిని నియమించిరి. అన్నిటికంటెను ప్రత్యేకమైన విషయము పరమాణు శాస్త్ర పరిశోధననిలయ స్థాపనప్రయత్నము. సుప్రసిద్ధ శాస్త్రవేత్త యగు శ్రీ స్వామి జ్ఞానానందుల వారిపై ఈ భారము నుంచిరి. శ్రీ రామలింగా రెడ్డిగారి అనంతరము విశ్వవిద్యాలయములో చిరకాలమునుండి పని చేసి సకలానుభవములను పొంది ఎల్లరిమన్ననలకు పాత్రులైన డాక్టర్ వి.యస్, కృష్ణాగారు ఉపాధ్యక్షులైరి. అట్లే అత్యంత ప్రజ్ఞావంతులు అనుభవజ్ఞులు అగు డాక్టర్ రంగ ధామరావుగారు కళాశాలాధ్యక్షులైరి. వీరిరువురి కృషి వలనను తిరుపతి విశ్వ విద్యాలయము రూపొందినది. ఈనాడు (1955 డిశంబరు నాటికి) ఆంధ్ర విశ్వవిద్యాలయమునందు 8 వృత్తి కళాశాలలు, 18 డిగ్రీ కళాశాలలు, 7 ఇంటర్మీడియేట్ కళాశాలలు, 10 పాచ్య విద్యా కళాశాలలు గలవు. ప్రాచ్యవిద్యా కళాశాలలలో గాక మిగిలిన కళాశాలలలో మొత్తము 21,500 విద్యార్థులున్నారు. అందు 1200 స్త్రీలు.

సర్, సి. వి. రామ౯ గారు భౌతికశాస్త్రమందు ఆనరరీ ప్రొఫెసరుగా నుండి ఆంధ్రుల యెడ తమకు గల అభిమాన మును చాటియున్నారు. డాక్టరు లక్కరాజు సుబ్బారావు గారు సెనేటు సభ్యులుగాను, ఆనరరీ లీగల్ అడ్వయిజరు గాను విశ్వవిద్యాలయ నిర్వహణమున గణనీయమగు కృషి సలిపిరి. డాక్టరు లక్కరాజు సుబ్బారావుగారు, డాక్టరు టి. యస్. తిరుమూర్తిగారు, శ్రీ ఓబుళంపల్లి పుల్లారెడ్డిగారు, తాత్కాలికోపాధ్యాయులుగా నుండి విశ్వవిద్యాలయ ప్రతిభకు దోహదము కలిగించినారు.

ఉపసంహారము  : ఏబది సంవత్సరముల పూర్వము నుండి ఆంధ్రులు కాంచిన కలలు వారి కృషి ఫలితముగ 1926 నాటికి ఫలసిద్ధిగాంచినవి. 1951 నాటికి 25 ఏండ్లు నిండగనే విశ్వవిద్యాలయము 52 డిసెంబరులో అమితోత్సాహముతో రజతోత్సవ మొనరించుకొనినది. విశ్వ విద్యాలయ చరిత్రలో 25 ఏండ్ల కాలము చాల తక్కువైనను ఎన్ని యో అడ్డంకులను, ధనాభావమును, నిరుత్సాహకరములగు పరిస్థితులను ఎదుర్కొని నేటికి విశ్వవిద్యాలయము బహుముఖ వ్యాప్తినొంది, అమితమగు కీర్తిని సంపాదించి, ఆంధ్రజాతికి గర్వకారణమై, భారతదేశమునందు తన ధర్మమును శక్తితో, ప్రాభవముతో, గౌరవముతో నిర్వహించుచున్నది.

పి. యల్. యన్. శర్మ.

[[వర్గం:]]