సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రవిష్ణువు
ఆంధ్రవిష్ణువు :- బ్రహ్మాండాది పురాణములందు కీర్తింపబడి, సత్కవుల మన్ననలందుకొని, శ్రీకాకుళాధి నాథుడై, ఆంధ్రుల ఆరాధ్యదైవమై, ఆంధ్రభోజునికి ఆముక్తమాల్యద కావ్యరచనకు ప్రోత్సాహమొసగి, కాసుల పురుషోత్తమకవి నిందాస్తుతులకు పాల్పడిన ఆంధ్రవీరుడే ఆంధ్రవిష్ణువు. ఇతడే ప్రప్రథమమున ఆంధ్ర సామ్రాజ్యమును స్థాపించిన మహనీయుడు. పరాక్రమ సంపన్నుడు. ఆంధ్రులచరిత్రలో స్వర్ణాక్షరములతో లిఖింపదగిన దీయాంధ్రరాజ్య స్థాపనో దంతము. ఆంధ్రవిష్ణువు చరిత్రకు దీనికి అవినాభావసంబంధము కలదు.
సాధారణముగ శాతవాహన సామ్రాజ్యము మొదటి ఆంధ్ర సామ్రాజ్యమని, చరిత్రకారులు పేర్కొనుచున్నారు. పురాణము లందు ఈ రాజుల చరిత్ర వర్ణింపబడియున్నది. ఐనను వీరికిముందే ఆంధ్రసామ్రాజ్య సంస్థాపనము జరిగినదని వీరంగీకరించుచునే యున్నారు. చంద్రగుప్తునకు పూర్వమే ఆంధ్రులు సామ్రాజ్యమును నిర్మించుకొని రనియు, వా రధిక బలాఢ్యులై చతురంగ బలసముపేతులై శత్రుదుర్భేద్యములగు ముప్పది దుర్గముల కధిపతులై యుండిరనియు మెగస్తనీసు వ్రాతలవలన స్పష్టమగుచున్నది. క్రీ. శ. 4వ శతాబ్దికిముందే ఆంధ్రసామ్రాజ్యముండినదని వేరుగా చెప్పనవసరములేదు. ఒక్క ఆంధ్ర విష్ణువుతప్ప తదితరులనుగూర్చి విశేషాంశములు లభ్యములు కాకపోగా చారిత్రికాంశములతో సమన్వయపరచ నగు సంఘటనలు సైతము దొరకనప్పుడు, అటులూహించుటలో నాశ్చర్య మేమియు లేదు. ఇవి ఇటులున్నను కావ్యములందును, తదితర గ్రంథము లందును గల యితి వృత్తములం దచ్చటచ్చట ఆంధ్రవిష్ణువునకు, రాజ్యస్థాపనో దంతమునకు, ఆంధ్రులకు సంబంధించిన విషయము లుదాహరింపబడిన వాటిని గ్రహించి ప్రథమచారిత్రిక సంఘటనను గూర్చి వివరించుటకు చరిత్రకారులు ప్రయత్నించుచునే యున్నారు. ప్రథమాంధ్ర రాజ్యస్థాపన దంతమును గూర్చి బ్రహ్మాండపురాణమునందు సుచంద్రునిగాథ యొకటి గలము.
“ఆంధ్రనాథో మహావిష్ణు ర్నిశుంభుదనుజాపహా
పురా స్వాయంభువమనోః కాలే కలియుగే హరిః
కాకులే రాజవర్యస్య సుచంద్ర స్సతనూభవః
అభవత్సర్వదేవైశ్చ వేష్టితో లోక పూజితః."
శ్రీశైల భీమకా ళేళ మహేంద్రగిరి సంయుతం
ప్రాకారంతు మహత్కృత్వా త్రీణి ద్వారాణిచాకరోర్
త్రిలోచనో మహేశ స్స త్రికూలంచ కరే వహన్
త్రిలింగరూపి వ్యవసత్ త్రిద్వారేషు గణై ర్వృతః
ఆంధ్రవిష్ణు స్సురయుతో దనుజేన నిశుంభునా
యుఛ్వాత్ర యోదశయుగాన్ హత్వాతం రాక్షసో త్తమం
అవస త్తత్ర ఋషి భిర్యుతో గోదావరీతటే
తత్కాలప్రభృతి క్షేత్రం త్రిలింగ మితి విశ్రుతం.
పై గాథ ప్రకారము సుచంద్రునికుమారుడు ఆంధ్రవిష్ణువు నిశుంభుడను రాక్షసుని జయించి, కాకులమునందు రాజ్యమును స్థాపించి, తన రాజ్యమునందలి శ్రీశైలము, భీమేశ్వరము, కాళేశ్వరము అను మూడు క్షేత్రములను ద్వారములుగ నెంచి పరిపాలన సాగించిననియు, అప్పటి నుండియే ఆ దేశము త్రిలింగ క్షేత్ర మయ్యెననియు తెలియుచున్నది. ఆంధ్రవిష్ణువు అను వీరుడు నిశుంభుడు అను నాగాంధ్రుని జయించి కాకుళమున రాజ్యమును స్థాపించెనని చరిత్రకారులు సమన్వయపరచి యున్నారు. తరువాతివారు సామ్రాజ్యస్థాపకుడగు ఆంధ్రవిష్ణువును దైవసమానముగ భావించి పూజించుచుండిరి. మన దేశమున వీరపూజ సాధారణముగ జరుగుచుండెననుట కీ వృత్తాంతము ప్రబల తార్కాణముగ నున్నది.
ఈ కాకుళమే శ్రీకాకుళముగ మారినది. కృష్ణాతీరమునగల దివ్యక్షేత్ర మిది. కాకుళాంధ్రనాథుడే ఆంధ్ర విష్ణువు.
బ్రహ్మాండపురాణముకాక ఆంధ్రవిష్ణువునుగూర్చి తదితర గ్రంథము లుదాహరించు గాథల నీ సందర్భమున సమన్వయ పరచుట సమంజనము. చారిత్రికాంశముల సమకూర్చు కావ్యములు మన భాషలో కొద్దిగా నున్నవి. ఉన్న కావ్యములు పౌరాణిక పద్ధతిని రచింపబడియుండుట వలన చరిత్రకారునికి విషయ సమన్వయమున పెక్కు చిక్కులు ఏర్పడు చున్నవి. వే రాధారములు లేనప్పుడు వాటినే యాధారముగ గ్రహించకతప్పదు. ఆంధ్రవిష్ణువు చరితము గూర్చి ఇట్టిపరిస్థితి యేర్పడుచున్నది. ఏలన ఆంధ్ర విష్ణువునుగూర్చి ప్రత్యేకముగా ఒక్క కావ్యమే యున్నది. దానినుండియే చరిత్రను కూర్చవలసి యున్నది.
1. విష్ణుమూర్తి యనుజ్ఞ నొంది బ్రహ్మ గంగాతీరమ నుండి కృష్ణాతీరమునకు విచ్చేసి కన్నులపండువుగా నొప్పుచున్న పరిసరములకు ముగ్ధుడై, బహురూపములధరించి, యచటనే తపమొనర్చి, ఆ ప్రాంతమునకు కాకులమని పేరిడి భద్రకోట విమానమున శ్రీవతిని ప్రతిష్ఠించెను. కొన్నాళ్ళకు విశాల అను పేరుగల నగరము నేలు సుమతియను నరపాలుడు శ్రీకాకుళ క్షేత్ర సందర్శనాభిలాషియై చతురంగబల పరివారసమేతుడై యేతెంచ అచటి సన్ము నీశ్వరులు ఆ రాజన్యుని యుచితరీతి సత్కరించి, యచట గల యొక విగ్రహమునుజూపి, ఆలయ గోపురాదుల నిర్మించ ప్రభువును కోరిరి. ఆ విగ్రహము ఆంధ్రవిష్ణువు విగ్రహమని సుమతి యా సందర్భమున వెల్లడించెను.
“ఈదేవుండు మదీయసత్కులధనం బీయిందిరాధాముడే రేదీవ్యంబగు నాంధ్రనాథుడు......"అని నుడువుటయేగాక తాను ఆంధ్రనాయక దాసుడనని తెల్పెను. అప్పటినుండియే "కాకులాధిప శ్రీనాథున కాంధ్రనాథాభిధానంబు యథార్థంబయ్యె". సుమతి కళావేదుల నాహ్వానించి దేవతాగార ప్రాకారనిర్మాణంబు లొనరింపజేసెను. నిర్మల జలసమృద్ధిలేమి రాజన్యుడు చింతాకులస్వాంతుడై యుండ వారి ప్రత్యక్షమై సుదర్శన చక్రమున "భూతలమతి రయంబున భేదించి గంగాప్రవాహంబు మనో వేగమునం గొనివచ్చి సరోవరంబొనర్చె. అది కారణంబుగా నతీర్థరాజంబు చక్రతీర్థం బనఁబర గె".
సుమతి ఈ విధముగా ఏర్పాట్లు ఒనరింప జేసి తన నగరమునకు వెడలిపోయెను. అప్పటినుండి యాదేవుని “ఆంధ్ర నాథుడు”, “ఆంధ్రవల్లభుడు", "తెలుగువల్లభుడు" అను పేర్ల అచ్చటివారు పూజించుచుండిరి. చైత్రశుద్ధ దశమి నుండి పౌర్ణమివరకు అచ్చట మహోత్సవములు జరుగుచుండును. ఆ దివ్య వైష్ణవ క్షేత్రమును సందర్శించుటకు దూరదూరములనుండి ఎందరో వచ్చుచుందురు. 2. కటకపురిరాజు అనంగభీము డను గజపతి ఒక నాడు వేటకై వెడలి అరణ్యప్రాంతమున నాగరాజుపడగనీడను సురక్షితుడై యున్న యొక బాలుని గాంచెను. రాజును జూచి ఆ పాము అదృశ్యమయ్యెను. అనంగభీముడా శిశువును చేరదీసి, అనంతపాలుడని నామకరణ మొసంగి, ఆతనిపాదమున గట్టబడిన తాళపత్రమునందలి వ్రాతవలన అతని కులగోత్రములను గ్రహించి పోషించెను. అనంత పాలుడు పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చుకొని అనంగ భీమునకు విశ్వాసపాత్రుడయ్యెను. ఒక సందర్భమున అనంతపాలుడు రాజునానతిని కంచిపై దాడి వెడలవలసి వచ్చెను. మార్గమధ్యమున శ్రీకాకుళమును సందర్శించుచు అనంతభూపాలుడు తనతల్లిదండ్రుల జూడ సుత్సుకుడై యచటి భూసురులకు దానధర్మము లొసగుటకు సంకల్పించి తద్వృత్తాంతమును జూటెను. బ్రాహ్మణులు దానమును పరిగ్రహించుటకై వచ్చి తమ కులగోత్రములను చెప్పుచుండిరి. అనంతపాలుడు బాల్యమున తనపాదమునకు గట్టబడి యుండిన తాళపత్రమునం దుల్లేభింపబడిన కులగోత్రముల నుదహరించు వానిని తనతండ్రిగా నెరింగి, ఆతనికి నిజవృత్తాంతం బెరింగించి మాతా పితరులకు మహానందమును గూర్చెను. అచ్చటనే వారివలన వామనశర్మ యింటిలో కాకరపాదుక్రించ ఆంధ్ర వల్లభుని విగ్రహ మున్నటుల విని, దానిని మహావైభవముతో ప్రతిష్ఠ చేయించెను.
3. కళింగదేశస్థుడు యజ్ఞశర్మ తనయుడు సోమశర్మ యనువాడు యౌవనగర్వమున “కలుషేంద్రియుడై పితృవిరోధంబుగా నటించుచు, తగని సహవాసమున తలిదండ్రుల నిరంతర విషాదాకులచిత్తులం జేయుచు, విప్రాన్వయ సంజాతుండయ్యు వైదికకర్మల విడచి స్వేచ్ఛా విహారియై నిషాదవృత్తి జరించుచు ఒక్కనాడు వనమున సంచరించుచు, అధిక క్షుత్పిపాసాకులుడై యుండ, యచటి మును లాతనిం గని, కాకుళేశ్వరసమర్పిత సాద మొసగి, శ్రీకాకుళ క్షేత్రమహాత్మ్యం బెరింగించిరి. సోమశర్మ యత్యంత ప్రమోదంబున దివ్య క్షేత్రమును జేరి లోక పవిత్రంబగునట్టి కృష్ణాసరిజ్జలంబుల గ్రుంకి చక్రాహ్వయ సరోవర తీర్థంబుల దోగుచు కేశవదేవు సందర్శించి, పరిశుద్ధ మనస్కుండై కొన్ని వర్షంబు లుత్కర్షంబుగా నిలచి దేహావసాన సమయంబున యింద్రాదులు కందని నిరంతర సంపత్కరంబగునట్టి శ్రీవిష్ణుసాయుజ్యముం బ్రాపించె."
ఆంధ్ర విష్ణువునకు సంబంధించినంతవరకు వల్లభాభ్యుదయమున వర్ణితములయిన పైమూడు గాధలందలి చారిత్రి కాంశముల సమన్వయపరచుచు తత్కావ్య పీఠికలో శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు కొన్ని విశేషముల నిర్ధారించిరి. ఆంధ్రవిష్ణువు గంగాతీరమునందుండి శ్రీకాకుళ క్షేత్రమునకు వచ్చెను. ఆత డచ్చట దైవసమానముగా నెంచబడి ప్రతిష్ఠింపబడి పూజింపబడెను. మధ్య మధ్య ఆ క్షేత్రము కృష్ణ వెల్లువలకు నాశనమైపోవ ప్రభువు లుద్ధరించిరి. 'వేరొండు ప్రాంతమున నున్న ప్రభువులు, ఆంధ్రనాయక దాసులు ఈ క్షేత్రమును సందర్శించి అవసరమగునప్పు డెల్ల పునరుద్ధరించి సకలోపచారంబులకు సంసిద్ధులై యుండిరి.
ఆంధ్రుల చరిత్రయందలి యంశముల కివి ఏమాత్రము విరుద్ధములుగా లేవు. ఆంధ్రులు గంగాతీరమునుండి (అహిచ్ఛత్ర పురము నుండి) కృష్ణాతీరమునకు వచ్చుట— తిరిగి వెళ్ళుట – మరల రాజ్యమును స్థాపించుట— అను విషయము లన్నియు పౌరాణిక గాథల రూపమున వల్లభాభ్యుదయ కావ్యము నిరూపించుచున్నదని కోరాడవారు స్పష్టపరచియున్నారు.
నాటినుండి నేటివరకు ఆంధ్రవిష్ణువును సేవించి ధన్యులయిన మహానుభావు లెందరో కలరు. విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు కళింగదేశ విజిగీషా మనిషన్ దండెత్తిపోయి విజయవాటిం గొన్ని వాసరంబు లుండి శ్రీకాకుళని కేతనుం డగు మధుమధను సేవింపబోవ స్వప్నమున ఆంధ్రజలజాతుడు సతీసమేతుడై చిరునవ్వుతోడ ప్రత్యక్షమై "నేను తెలుగురాయడను, నాకు ప్రియముగా కృతినిర్మింపు" మని యావ తిచ్చెను.
కృష్ణరాయలకు పూర్వము అచ్చటచ్చట ఈ క్షేత్ర ప్రశంస కానవచ్చుచున్నది. కాకతీయుల శాసనము లందును, అనంతామాత్యుని భోజరాజీయమునందును శ్రీకాకుళ శ్రీహరిశతకమునందును, కాసుల పురుషోత్తముని ఆంధ్రనాయక శతకమునందును, ఆంధ్ర విష్ణువు కీర్తింపబడియున్నాడు. క్రీడాభి రామమున శ్రీకాకుళము నందు జరుగు తిరునాళ్ళ ప్రశంస కలదు. పురుషొత్తమ కవి ఆంధ్రనాయకాలయము పూజాపురస్కార శూన్యమై హీనదశయం దున్నప్పుడు మిగుల పరితపించి "సుప్రసిద్ధుడు ప్రత్యక్షరూపు డగు దేవున కిట్టి విపరీతస్థితి చేకూరుటకుఁ గినిసి నిత్యోత్సవము చేయించికొనక చేతగానివాని వలె నూరకుంట ప్రతిష్ఠ కాదనియు, పూర్వపుకిర్తి నిలుపు కొమ్మనియు నిందాస్తుతులతో ఆంధ్రనాయక శతకము రచించెను. చల్లపల్లి (దేవరకోట) ప్రభువు అంకినీడుగారు ఆలయ పునర్నిర్మాణము గావించిరి. ఈ క్షేత్ర మెన్ని మార్లు పునర్నిర్మాణ దశల ననుభవించినదో! ఆంధ్రవిష్ణువు మాత్రము నేటికిని పూజింపబడుచున్నాడు. ఆ క్షేత్ర మాహాత్మ్య మట్టిది. "శ్రీకాకుళము భక్తలోక చింతా మణి, సుకృతాకరము, మహాక్షేత్రావతంసంబు."
కె. గో.
[[వర్గం:]]